క్రైస్తవ ఆరాధనకు పరిచయం
క్రైస్తవ ఆరాధనకు పరిచయం
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 3: పాత నిబంధనలో ఆరాధన

1 min read

by Randall McElwain


పాఠ్య ఉద్దేశ్యములు

ఈ పాఠం ముగిసే నాటికి, విద్యార్థి:

(1) ఆరాధనను సాధ్యపరచు దేవుని కృపను మెచ్చుకోండి.

(2) విధేయతగల హృదయములో ఆరాధించుటకు రండి.

(3) ఆరాధనలో ఆచారము యొక్క భూమికను గూర్చి తెలుసుకోండి.

(4) ఆరాధనలో కేంద్ర భాగముగా స్తుతిని ఆచరించండి.

(5) ఆరాధనలో దేవుని వాక్య ప్రకటన యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి.

(6) ఆరాధనలో అసమతుల్యత అను అపాయమును నివారించండి.

ఈ పాఠము కొరకు సిద్ధపాటు

మీకా 6:6-8ను కంటస్థం చేయండి.

పరిచయం

వారి సంఘములోని సమస్యలను గూర్చి చర్చించుటకు ఒక సేవకుల సమూహము ప్రతి నెల కలుసుకుంటుంది. ఈ మధ్యనే వారు ఆరాధనను చర్చించారు. ఆరాధన అను అంశమును గూర్చి ఈ సేవకుల మధ్య కొన్ని ప్రాముఖ్యమైన భిన్నత్వములు తలెత్తాయి. వారి సిద్ధాంతిక నమ్మకములు ఒకటే అయినప్పటికీ, ఆరాధనా శైలుల విషయములో వారు చాలా భిన్నాభిప్రాయములను కలిగియున్నారు.

సమీర్ సాంప్రదాయిక పద్ధతిలో ఆరాధనను చేయు సంఘమునకు కాపరి. ఆకాశ్ ఆరాధనలో అనేక సమకాలీన ఆలోచనలను ఉపయోగించు ఎదుగుచున్న సంఘమునకు కాపరి. రాహుల్ తన సంఘము కొరకు అత్యంత అనువైన ఆరాధనా శైలిని కనుగొనుటకు ప్రయత్నించుచున్నాడు. ఈ సేవకులు ఆరాధనను గూర్చి అనేక చర్చలను చేశారు, కాని ఆరాధన యొక్క మౌలిక నియమములను సమ్మతించు విషయములో వారు కొంత విసుగుకు గురైయ్యారు.

ఈ రోజు మనోజ్ ఇలా అన్నాడు, “బహుశా మనము ఈ అంశమును తప్పుగా చూస్తున్నట్లున్నాము. ‘మనము ఎలాంటి ఆరాధనను ఆస్వాదిస్తాము? మనము ఎలా అరాధించగోరుతున్నాము?’ అని అడుగుతున్నాము. బహుశా మనము ఇలా అడగవలసియున్నది, ‘మనము ఎలా ఆరాధన చేయాలని దేవుడు కోరుచున్నాడు? ఆయన ఎలాంటి ఆరాధనను ఆస్వాదిస్తాడు? దేవుడు ఆరాధనను రూపొందించవలసియుంటే, అది ఎలా ఉంటుంది?’ బైబిలానుసారమైన ఆరాధన ఎలా ఉంటుందో మనము నేర్చుకోగలిగితే, అది నేడు మనకు ఆరాధనకు ఒక మాదిరిని ఇవ్వవచ్చు.”

► దేవుడు ఆరాధనను రూపొందించవలసియుంటే, అది ఎలా ఉంటుంది? బైబిలు ఆరాధనను గూర్చి మీకు ఇప్పటికే తెలిసిన విషయముల సారాంశం తెలుపండి.

పరిచయం: దేవుడు సరియైన ఆరాధనను కోరుచున్నాడు

పాఠం 2లో, నిజమైన ఆరాధన పరిశుద్ధ దేవుని యొక్క ఆరాధన అని ప్రకటన గ్రంథములో మనము చూశాము. తనను ఆరాధించువారు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడని 15వ కీర్తనలో మనము చూశాము. పాఠం 3లో, “ఒక ఆరాధకుడు పరిశుద్ధ దేవుని ఎలా ఆశ్రయించాలి?” అను ప్రశ్నను అడుగుతాము.

మనము ఎలా ఆరాధన చేస్తామో దేవుడు పట్టించుకోడు అని కొందరు ప్రజలు అంటారు; హృదయము సరిగా ఉండాలని మాత్రమే ఆయన కోరుచున్నాడు. ఆరాధనకు హృదయము మూలముగా ఉన్నదను మాట వాస్తవమే. అయితే, ఆయన ఆరాధించు విధానము మీద దేవుడు ఎంతో శ్రద్ధ వహించుచున్నాడని లేఖనములో చాలా ఆధారములున్నాయి.

ఆరాధించు విధానము ప్రాముఖ్యమైయున్నది ఎందుకంటే మన ఆరాధన దేవునిని గూర్చి మనకున్న అవగాహన మీద ప్రభావము చూపుతుంది. మునుపటి పాఠములో, దేవుని గూర్చి సరికాని అవగాహన సరికాని ఆరాధనలోనికి నడిపిస్తుంది అని మనము చూశాము. సరికాని ఆరాధన దేవుని గూర్చి మనకున్న అవగాహన మీద కూడా ప్రభావము చూపుతుంది. కనానీయులు తమ దేవతలను ఆరాధించిన విధముగా ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించినప్పుడు, దేవుని స్వభావము కనానీయుల దేవతల స్వభావమును పోలియున్నది అని వారు నమ్మారు. దేవుడు కనానీయుల దేవతల వలె ప్రతికార స్వభావము గలవాడని మరియు నమ్మదగని వాడని వారు నమ్ముట ఆరంభించారు.[1]

ఆరాధనా రకము ప్రాముఖ్యమైనది ఎందుకంటే, మనము ఎలా ఆరాధించుచున్నాము అనునది చాలాసార్లు మనము ఎందుకు ఆరాధించుచున్నాము అనుదానిని ప్రతిబింబిస్తుంది. ప్రేమతో నిండియున్న హృదయము దేవుని ఘనపరచు ఆరాధనను చేస్తుంది; అయిష్టతతో చూపు విధేయతగల హృదయము దేవునికి నచ్చిన విధముగా గాక నాకు నచ్చిన విధముగా ఆరాధన చేయాలని కోరుతుంది.

అనేక కళాశాలలు రీసెర్చ్ పేపర్ల కొరకు కొన్ని అర్హతలను కలిగియుంటాయి. కవర్ పేజి, ఫుట్నోట్స్, మరియు ఒక విధమైన మార్జిన్లను అవి కోరతాయి. ఈ వివరములు ఆ పేపర్ లో అత్యంత ప్రాముఖ్యమైన భాగము కాదు; దానిలో ఉన్న విషయములు అత్యంత ప్రాముఖ్యమైనవి. అయితే, వివరముల విషయములో జాగ్రత్తపడు విద్యార్థి విషయములలో కూడా జాగ్రత్తవహిస్తాడు అని అనేకమంది బోధకులు కనుగొన్నారు; వారు ఉత్తమమైన పయత్నము చేస్తారు. మరొక వైపున, ఈ వివరములను నిర్లక్ష్యము చేయు విద్యార్థి విషయములలో కూడా నిర్లక్ష్యము చూపుతాడు. పేపర్ యొక్క రూపము పేపర్లోని విషయములను ప్రతిబింబిస్తుంది. మనము ఆరాధించు విధానము చాలాసార్లు మన హృదయము యొక్క వైఖరిని ప్రతిబింబిస్తుంది. మనము ఆరాధించు విధానము చాలాసార్లు మన ఆరాధనకు కారణముతో ముడిపడియుంటుంది. ఇందువలన, మనము ఆరాధించు విధానమును దేవుడు పట్టించుకొనుచున్నాడు.

  • కయీను యెహోవా కొరకు ఒక అర్పణను తెచ్చాడు. కయీను భూమిని సాగుచేయువాడు. అతడు భూమిలోని పంటను తెచ్చాడు, కాని దేవుడు కయీనునుగాని, అతని అర్పణనుగాని లక్ష్యము చేయలేదు. కయీను సరియైన రీతిలో ఆరాధన చేయుటలో విఫలమగుట అతని హృదయ వైఖరిని బయలుపరచింది. కయీను అర్పణ అతనికి సౌక్యరవంతముగా ఉండినదిగాని, దేవుడు ఆ ఆరాధనను అంగీకరించలేదు (ఆదికాండము 4:1-5).

  • [2]యెహోవాను ఆరాధించుట కొరకు అహరోను బంగారు దూడను నిర్మిన్చాదూ. అతడు ఇలా అన్నాడు, “రేపు యెహోవాకు పండుగ జరుగును” (నిర్గమకాండము 32:1-5). ప్రజలకు నచ్చిన విధముగా దేవుని ఆరాధించవచ్చని అహరోను నిర్థారించుకున్నట్లు కనిపిస్తుంది, కాని దేవుడు అతని ఆరాధనను అంగీకరించలేదు.

  • నాదాబు మరియు అబీహు సీనాయి పర్వతము మీద ఇశ్రాయేలు దేవుని చూశారు (నిర్గమకాండము 24:1-11). మోషే మినహా ఇతరులందరి కంటే వారు దేవుని దగ్గరగా చూశారు, కాని మందిరములో యాజక సేవ చేసిన మొదటి దినమున, యెహోవా ఎదుట వారు అనర్హమైన అగ్నిని అర్పించారు. దానికి స్పందనగా, యెహోవా యొద్ద నుండి వచ్చిన అగ్ని వారిని దహించింది. మోషే దేవుని తీర్పును దుఖముతో ఉఉన్న వారి తండ్రికి వివరించాడు: “ఇది యెహోవా చెప్పిన మాట–నాయొద్దనుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును.” (లేవీయకాండము 10:1-7) ఈ యాజకులు దేవుని ఆజ్ఞలను అనుసరించుటకు బదులుగా, తమకు నచ్చిన విధముగా ధూపమును వేసిరి. దేవుడు వారి ఆరాధనను స్వీకరించలేదు.

  • ఉజ్జియా ఒక గొప్ప రాజు. అతడు యెహోవా దృష్టికి సరియైన కార్యములను చేశాడు. 2 దినవృత్తాంతములు అతని పరిపాలనను ఈ విధముగా సంగ్రహిస్తుంది: “అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను” (2 దినవృత్తాంతములు 26:15). విచారకరంగా, ఇది ఉజ్జియా యొక్క కథకు ముగింపు కాదు. “అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహముచేయగా...” (2 దినవృత్తాంతములు 26:16). అతడు తనకు నచ్చిన విధముగా దేవుని ఆరాధించుటకు ప్రయత్నించి కుష్టువ్యాధిని తెచ్చుకున్నాడు (2 దినవృత్తాంతములు 26:1-21). దేవుడు అతని ఆరాధనను అంగీకరించలేదు.

  • చెర తరువాత కాలములోని యూదులు దేవాలయమునకు కలుషితమైన బలులను తెచ్చారు. సరియైన బలులను తీసుకొనివచ్చుటలో వారి వైఫల్యము వారి హృదయముల యొక్క నిర్లక్ష్య వైఖరిని చూపుతుంది. వారు నిజముగా దేవుని ప్రేమించలేదు, కాబట్టి దేవుడు వారి ఆరాధనను అంగీకరించలేదు (మలాకీ 1:6-14).

ఆయన ఆరాధించు విధానమును గూర్చి దేవుడు పట్టించుకొనుచున్నాడు. మనకు నచ్చిన విధముగా మనం నడిస్తే, ఆయనను ఘనపరచు విధముగా మనము దేవుని ఆశ్రయించము అని ఈ ఉదాహరణలు సూచించుచున్నాయి. మనకు సరియైనది అనిపించునది దేవుని అంగీకారయోగ్యమైనది కాకపోవచ్చు. మన ఆరాధనలో మనకు ఆయన నడిపింపు అవసరమైయున్నది.

ఆరాధన అంటే దేవుని ఘనపరచుట కాబట్టి, మన ఆరాధన మన ఆశల ద్వారాగాక దేవుని స్వభావము ద్వారా నిర్థారించబడాలి. దేవుని సంతోషపరచునది ఏదో మననంతట మనమే నిర్థారించుకొనకూడదు; దేవుని సంతోషపరచు విధముగా ఆరాధించుటను నేర్చుకొనుటకు మనము దేవుని వాక్యము తట్టు చూడాలి.


[1]మీకా 6:6-7లో, మత నాయకులు యెహోవాకు లంచం ఇచ్చి, పిల్లలను బలిగా అర్పించేవారు. మోలేకు ఆశించిన విధముగా యెహోవా కూడా పిల్లల బలులను ఆశిస్తున్నాడు అని వారు భావిస్తారు.
[2]

“మీరు ఒకవేళ పాత నిబంధన యాజకులైతే, మరియు ఇప్పుడు మీరు ఆయనను సేవించుచున్న విధముగా సేవించియుంటే, దేవుడు మిమ్మును హతము చేయుటకు ఎంత సమయము పట్టేది?”

- వారెన్ వియర్స్బి

(ఆరాధన యొక్క తీవ్రతను గూర్చి మాట్లాడుతూ)

దేవునితో నడుచుట: కృపా సంబంధముగా ఆరాధన

ఆరాధనకు మొదటి బైబిలు చిత్రము ఏదెన్ తోట. “చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని...” (ఆదికాండము 3:8). ఇది ఆరాధన కొరకు దేవుడు కోరు ఆదర్శవంతమైన విషయమును చూపుతుంది: మనుష్యుడు మరియు వాని సృష్టికర్త మధ్య విడదీయలేని సహవాసం. పతనమునకు ముందు, మనుష్యుడు మరియు దేవుని మధ్య సహవాసము పాపము ద్వారా ప్రభావితము కాలేదు. ఏదెన్ తోటలో ఆరాధన సులభముగాను, చిక్కులులేనిదిగాను ఉండెను.

తోటలో, దేవుడు తన సృష్టములతో సహవాసమును కోరినట్లు మనము చూస్తాము. పతనము వరకు, మనుష్యుడు దేవునితో సంపూర్ణ సహవాసమును అనుభవించాడు; పాపము మనుష్యుని స్వభావమును భ్రష్టము చేసిన తరువాతనే మనుష్యుడు దేవుని నుండి దాగుకున్నాడు.

పాత నిబంధన అంతటిలో, దేవునితో నడుచుట అను పదము ఆరాధనలో దేవునితో సంబంధము భాగమైయున్నది అని చూపుటకు ఉపయోగించబడింది. హనోకు దేవునితో నడిచాడు; నోవహు దేవునితో నడిచాడు; దేవునితో నడవమని అబ్రాహామునకు ఆజ్ఞ ఇవ్వబడినది (ఆదికాండము 5:24, ఆదికాండము 6:9, ఆదికాండము 17:1). దేవునితో సమయము గడుపుట ద్వారా సంబంధమును నిర్మించుకొనిన వ్యక్తిని ఈ ఉదాహరణలు చూపుతాయి. సరియైన ఆరాధన దేవునితో సరియైన సంబంధము కలిగియుండుట మీద ఆధారపడి ఉంటుంది.

ఆరాధన సంబంధము మీద ఆధారపడి ఉంటుంది అని ఆదికాండము 3:8 చూపుతుంది. దేవుని కృప మూలముగానే ఆరాధన సాధ్యమని కూడా ఇది చూపుతుంది. దేవతలను సంతోషపరచుటకు మనుష్యుడు వాటిని సరియైన రీతిలో ఆరాధించు విధానమును కనుగొనాలని అన్య దేవతలు కోరతాయి. భిన్నముగా, సరియైన ఆరాధనా మాధ్యమాలను యెహోవా కృపతో అనుగ్రహించాడు. మూడు ఉదాహరణలు దీనిని తెలియజేస్తాయి.

ఆదాము హవ్వల కొరకు దేవుడు ఆరాధనను సాధ్యపరచాడు

పతనము తరువాత, ఆదాము హవ్వల నుండి ఆరాధనను ఆశించు లేక అంగీకరించుటకు దేవుడు బద్ధునిగా ఉండలేదు. వారు దేవుని నియమమును ఉల్లంఘించారు; వారు ఆయన సృష్టిని భ్రష్టము చేశారు; వారు కేవలం తీర్పుకు మాత్రమే అర్హులు.

వారు పాపము చేసిన తరువాత, ఆదాము హవ్వలు యెహోవా సన్నిధి నుండి దాగుకున్నారు (ఆదికాండము 3:8). ఆదాము హవ్వల కొరకు మరొక కార్యము లేదు; వారు మరణము తప్ప దేనికీ అర్హులు కారు. ధర్మశాస్త్రమును ఇచ్చినవాని నుండి దాగుకొనుట తప్ప వారి యొద్ద వేరొక ప్రతిస్పందన మిగిలియుండలేదు, కాని దేవుడైన యెహోవా కృపతో ఆదామును పిలచాడు. దేవుని కృప ద్వారా ఆరాధన సాధ్యమైయ్యింది. మనంతట మనము, పరిశుద్ధమైన దేవుని చేరుటకు ఎలాంటి అవకాశములు లేవు. ఆయన కృప ద్వారా మాత్రమే మనము ఆరాధించుటకు పిలువబడితిమి.

అబ్రాహాము కొరకు దేవుడు ఆరాధనను సాధ్యపరచాడు

► ఆదికాండము 18:1-8ని చదవండి.

పాఠం 1లో, ఆరాధన కొరకు ఒక హెబ్రీ పదమైన శఖహ్ యొక్క అర్థము “సాష్టాంగపడుట” లేక “ఆరాధించుట” అయ్యున్నది. ఆదికాండము 18:2లో ఈ పదము మొదటిగా ఉపయోగించబడినది. అబ్రాహాము తన గుడారము యొక్క ద్వారము యొద్ద కూర్చొనియున్నప్పుడు యెహోవా మరియు ఇద్దరు దూతలు ప్రత్యక్షమయ్యారు. అబ్రాహాము గుడారపు ద్వారము నుండి పరిగెత్తి, వారిని కలుసుకొని, వారి ఎదుట నేల మీద సాష్టాంగపడ్డాడు. అబ్రాహాము సాష్టాంగపడ్డాడు – అతడు ఆరాధించాడు.

ఈ కథలో దేవుడు మొదటి అడుగు వేశాడు అను విషయమును గమనించండి; ఆయన అబ్రాహామును కలుసుకొనుటకు వచ్చాడు. దేవుడు ఆరాధనను సాధ్యపరచాడు. క్రొత్త నిబంధనలో వలె పాత నిబంధనలో కూడా, ఆరాధన కేవలం కృప ద్వారా మాత్రమే సాధ్యపరచబడింది. పాత నిబంధన బలులు సంబంధమును ఆశించని కోపముతో ఉన్న దేవుని శాంతింపజేయుటకు ఇవ్వబడలేదు; దేవునికి మరియు పాపియైన మనుష్యునికి మధ్య సమాధానమును కలిగించుటకు స్వయంగా దేవుడే వాటిని నియమించాడు. మనంతట మనకు, సరియైన రీతిలో ఆరాధించు సామర్థ్యత లేదు.

యాకోబు కొరకు దేవుడు ఆరాధనను సాధ్యపరచాడు

► ఆదికాండము 28:10-22ను చదవండి. ఆరాధనలో దేవుని భూమికను గూర్చి ఈ కథ ఏమి బయలుపరుస్తుంది?

ఆరాధన కొరకు అత్యంత ఆశ్చర్యకరమైన బైబిలు చిత్రములను ఆదికాండము 28:10-22లో చూస్తాము. యాకోబు యొక్క గత జీవితములో ఏదియు ఒక ఆరాధకుని గుణములను సూచించదు. అతనిలో 15వ కీర్తనలోని గుణములు లేవు. అతడు దేవుని వెదకుటలేదు; వాస్తవానికి, తన సొంత మోసపూరితమైన క్రియల ద్వారా కొనితెచ్చుకున్న సమస్యల నుండి అతడు పారిపోతున్నాడు. “వారి పాపములకు ఫలితముగా పారిపోవుచున్న మోసగాళ్లు అంగీకారయోగ్యమైన ఆరాధనను చేయగలరు” అని యే ఆరాధనను గూర్చిన పుస్తకము కూడా చెప్పదు.

అయితే, యాకోబు యొక్క అయోగ్యత మధ్య కూడా దేవుడు యాకోబుకు తనను తాను బయలుపరచుకున్నాడు. దేవుని కృప అయోగ్యుడైన యాకోబు వంటివానికి కూడా ఆరాధనను సాధ్యపరచింది. వారెన్ వియర్స్బి ఇలా వ్రాశాడు, “దానిని మనము అస్సలు ఆశించని సమయములో – లేక మనము అనర్హులమైన సమయములో – దేవుడు కృపతో మనలను దర్శిస్తాడు. ఆరాధన కృపా అనుభవముగా ఉండుట మానినప్పుడు, అది మహిమ అనుభవముగా కూడా ఉండుట మానుతుంది.”[1]

కేవలం కృప ద్వారా మాత్రమే దేవుడు మనలను తన సన్నిధిలోనికి ఆహ్వానిస్తాడు. మన ఆరాధన ఆయన కృపకు ప్రతిస్పందన అయ్యుంటుంది. మనము ఆరాధనలో చేయు ఏదియు ఆయనకు యోగ్యమైనది కాదు; కేవలం ఆయన కృప మాత్రమే మనకు ఆరాధించుటకు శక్తినిస్తుంది.

[2]యాకోబును గూర్చిన కథ యెహోవా ఆరాధన మరియు అన్య దేవతల ఆరాధన మధ్య ఉన్న గొప్ప తేడాను కనుపరుస్తుంది. వారి దేవత యొక్క కటాక్షమును పొందుటకు అబద్ధ దేవతల యొక్క ఆరాధకులు బలిపీఠములను కడతారు. కర్మేలు పర్వతము మీద, బయలు ప్రవక్తలు “ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు–బయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరిగాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి” (1 రాజులు 18:26).

► నిజమైన ఆరాధన మరియు అబద్ధ ఆరాధనకు మధ్య వ్యత్యాసమును చూచుటకు 1 రాజులు 18:20-39ని చదవండి.

బయలు ప్రవక్తలు బయలు వారికి ప్రత్యక్షముకావాలని ఒప్పించుటకు ప్రయత్నములు చేశారు. ఈ పద్ధతి విగ్రహారాధనలో తరచుగా కనబడుతుంది. బలిపీఠములు మరియు బలులు విగ్రహము నుండి కటాక్షమును పొందుటకు ప్రయత్నములు.

దీనికి భిన్నముగా, దేవుడు ఆరాధనలో తన ప్రజలకు కృపతో ప్రత్యక్షమవుతాడు. ఏలీయా తాను సేవించు దేవుడు తన ప్రార్థనకు జావాబిస్తాడు అను పూర్తి నిశ్చయతహో బలిపీఠమును కట్టాడు.

“యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయులమధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము” (1 రాజులు 18:36).

ఆదికాండములో, దేవుని దృష్టిని ఆకర్షించుటకు పితరులు బలిపీఠములను కట్టలేదుగాని, దేవుడు తనను తాను బయలుపరచుకొనిన స్థలములకు జ్ఞాపికగా బలిపీఠములను కట్టారు. బలిపీఠము దేవుని కటాక్షమును సంపాదించలేదు; అది ఆయన కృపను జరుపుకుంది. కేవలం కృప ద్వారా మాత్రమే ఆరాధన సాధ్యమవుతుందని యాకోబు చూపాడు. మన ఆరాధన దేవుని కటాక్షమును పొందుటకు మనలను యోగ్యులుగా చేస్తుంది అని మనము ఎన్నడును ఆశించకూడదు; కృప వలన మనము ఆరాధిస్తాము.

దేవుడు ఆరాధనను సాధ్యపరచినప్పుడు ఏమి జరుగుతుంది? యాకోబు మార్పుచెందాడు. ఈ మార్పు కలుగుటకు 30 సంవత్సారాలు పట్టింది, కాని బేతేలు యొద్ద మార్పు ఆరంభమైయ్యింది. ఆరాధన (యాకోబు వంటి అపరిపుర్ణమైన వ్యక్తి చేయు అపరిపుర్ణమైన ఆరాధన కూడా) మనలను మార్చి, మన కొరకు మనము ఎన్నడును చేయలేని కార్యములను చేస్తుంది.

చెకప్

“నేను ఆరాధన ద్వారా మార్పు చెందుతున్నానా, లేక కేవలం ఖాళీ భావనలను మాత్రమే అనుభవించుచున్నానా? ఆరాధనలో దేవునిని ఎదుర్కొనుటకు ఫలితముగా నా క్రియలు, నమ్మకములు, లేక వైఖరులు ఎన్నడు మారాయి?” అని మిమ్మును మీరు ప్రశ్నించుకోండి.


[1]Warren W. Wiersbe, Real Worship, (Grand Rapids: Baker Books, 2000), 72
[2]

అబద్ధ ఆరాధనలో, విగ్రహము యొక్క కటాక్షమును పొందుటకు ఒక వ్యక్తి బలిపీఠమును కడతాడు (క్రియలు).

నిజమైన ఆరాధనలో, దేవుని యొక్క కటాక్షమును బట్టి ఆనందించుటకు ఒక వ్యక్తి బలిపీఠమును కడతాడు (కృప).

అబ్రాహాము: ఆరాధనకు విధేయత అవసరము

► ఆదికాండము 22:1-19ని చదవండి. ఈ కథలో ఆరాధన కొరకు అర్హతలు ఏమిటి?

అబ్రాహాము తన కుమారుని అర్పించుట ఉన్నతమైన ఆరాధన కార్యమైయున్నది. ఈ కథలో, అబ్రాహాము విధేయతకు ఇవ్వబడిన ఉద్ఘాటనను గమనించండి. దేవుడు ఇలా అన్నాడు, “నీ కుమారుని తీసుకొని... వెళ్లి ... అతనిని అర్పించుము...” మూడు ఆజ్ఞలు. అబ్రాహాము “తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని... లేచి వెళ్లి... తన కుమారుని అర్పించుటకు ఖడ్గము చేతపట్టుకున్నాడు.” అబ్రాహాము ప్రతి ఆజ్ఞను పాటించాడు.

నిజమైన ఆరాధన సంపూర్ణ విధేయతను కోరుతుంది అని అబ్రాహాము ఇస్సాకును అర్పించుట చూపుతుంది. ఆరాధన కేవలం ఒక భావన లేక భావోద్వేగము మాత్రమే కాదు; ఆరాధన ఒక గాయని లేక ప్రసంగీకుని వినుట మాత్రమే కాదు; ఆరాధన దేవునికి ఇచ్చు క్రియాత్మక ప్రతిస్పందన అయ్యున్నది.

ఆదికాండము 18వ అధ్యాయములో ఉన్న అబ్రాహాము కథను మరలా చూడండి. కథ యొక్క ఆరంభములో, మనము ఆరాధనను విధేయతతో కూడిన పరిచర్యగా చూస్తాము. పరదేశులు తన గుడారము తట్టు వచ్చుటను అబ్రాహాము చూశాడు. అతడు నేల మీద సాష్టాంగపడ్డాడు. అతడు ఆరాధించాడు.

తరువాత అబ్రాహాము సేవ చేయుటను మనముచూస్తాము. వారి పాదములూ కడుగుకొనుటకు నీళ్లిచాడు; గుడారములోనికి పరిగెత్తుకొని వెళ్లి శారాను రొట్టెలు చేయమని చెప్పాడు; ఆహారమును సిద్ధపరచి, వారి ముందుంచాడు. ఎదురుచూచు సేవకుని స్థానమును తీసుకొని, వారు తినుచుండగా చెట్టు క్రింద అతడు వేచియున్నాడు. ఇదంతా ఒక దాసుడు తన యజమానునికి ఉత్తమమైన పరిచర్యను చేయుటకు ఉదాహరణ అయ్యున్నది. నిజమైన ఆరాధకునికి ఆశగల సేవ చేయు వైఖరి ఉంటుంది.

ఆరాధనలో విధేయత యొక్క అవసరతను పాత నిబంధన అంతట చూడవచ్చు. అర్పణల కొరకు దేవుని అర్హతలను హేబెలు నెరవేర్చాడు కాబట్టి హేబెలు అర్పణ స్వీకరించబడింది. హేబెలు తన మందలోని తోలుచూలులను మరియు కొవ్విన పథార్థములను తీసుకొనివచ్చాడు (ఆదికాండము 4:4). హేబెలు విధేయతతో ఉత్తమమైన దానిని తీసుకొనివచ్చాడు. భిన్నముగా, కయీను వీలైనంత సులభమైన రీతిలో తన బాధ్యతను నెరవేర్చగోరాడు.

ఆరాధనలో విధేయత యొక్క అవసరతను సౌలు జీవితములో చూడవచ్చు. సౌలు అమాలేకీయుల జంతువులను నాశనము చేయమని దేవుడిచ్చిన ఆజ్ఞకు అవిధేయత చూపినప్పుడు, ఉత్తమమైన జంతువులను బలులు అర్పించుట కొరకు వదిలిపెట్టుట జరిగింది అని చెబుతూ అతడు తనను తాను సమర్థించుకొనుటకు ప్రయత్నించాడు. సమూయేలు ఇలా స్పందించాడు, “తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము” (1 సమూయేలు 15:22).

► 1 సమూయేలు 15:1-23ను చదవండి.

తిరుగుబాటు చేయు హృదయములో నుండి పుట్టి ఆరాధనను దేవుడు అంగీకరించడు.

నిజమైన ఆరాధన దేవునితో ఒక లోతైన సంబంధమునకు దారితీస్తుంది. అబ్రాహాము కథను మరొకసారి చూడండి. ఆదికాండము 18 అబ్రాహాము దేవునికి చేసిన సేవతో ఆరంభమవుతుంది; అధ్యాయము సంబంధముతో ముగుస్తుంది. యెహోవా ఇలా ప్రశ్నించాడు, “నేను చేయుదానిని అబ్రాహాముకు మరుగుచేయుదునా...?” దేవుని ఉద్దేశ్యమును గూర్చి వినిన ఆతరువాత, అబ్రాహాము సొదొమ కొరకు దేవునితో భేరమాడాడు. ఏమి జరిగింది? దేవుని సేవకుడు దేవుని స్నేహితుడు కూడా.

ఆరాధనలో మనము నిజముగా దేవుని తెలుసుకుంటాము. ఆరాధనలోనే మనము ధైర్యముగా అడుగు విధముగా దేవుని హృదయమును గూర్చి మనము నేర్చుకోగలము. విధేయతగల ఆరాధనలో దేవునితో మన సంబంధము లోతుగా బలపడుతుంది. ఆమోదయోగ్యమైన ఆరాధనలో, విధేయతతో కూడిన (సేవ) మరియు సంబంధము రెండు భాగమైయున్నవి. ఆరాధకుడైన అబ్రాహాము దేవుని సేవకుడు మరియు దేవుని స్నేహితుడు కూడా అయ్యున్నాడు.

నేటి బైబిలానుసారమైన ఆరాధన

కొందరు కూడికకు హాజరై దేవుని సన్నిధిని అనుభవించుచుండగా, మరికొందరు అదే కూడికలో దేవునిని అసలు ఎందుకు చూడలేరు ఎని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? కొందరు అర్పణను అర్పించిదీవించబడతారు; ఇతరులు ఇచ్చి కూడా దుఖముగా ఉంటారు. దీనిలో తేడా విధేయతగల హృదయం.

మన ఆరాధన ఎంత అందముగా ఉన్నను, సంగీతకారులు ఎంత నిపుణులైనప్పటికీ, ప్రసంగం ఎంత బలముగా ఉన్నను, ఆరాధన విధేయతగల హృదయములో నుండి కలుగకపోతే, అది కయీను ఆరాధన అవుతుంది. కయీను ఆరాధన ఇలా చెబుతుంది, “నాకు నచ్చిన విధముగా నా అర్పణను నేను తీసుకొనిరాగలను. అది సరిపోతుంది.” నిజమైన ఆరాధన విధేయతగల హృదయములో నుండి కలుగుతుంది.

చెకప్

“నేను విధేయతగల ఆరాధికునేనా? నా ఆరాధన హేబెలు హృదయములో నుండి కలుగుతుందా లేక కయీను హృదయములో నుండి పుడుతుందా?” అని మిమ్మును మీరు ప్రశ్నించుకోండి.

బలులు: ఆచారముగా ఆరాధన

పతనమునకు ముందు, దేవునికి, మనుష్యునికి మధ్య ఉన్న సులువైన సంబంధములో ఆరాధన జరిగింది. పాపము మనుష్యుని స్వభావమును భ్రష్టము చేసిన తరువాత, దేవుని సన్నిధిలోనికి తిరిగివచ్చుటకు మనుష్యునికి ఒక ప్రక్రియ అవసరమైయుండెను. దేవుడు తోటలో ఒక జంతువును చంపి, ఆదాము హవ్వల కొరకు వస్త్రములను చేయుటకు దాని తోలును ఉపయోగించినప్పుడు బలులు ఆరంభమైయ్యాయి. లేవీయకాండము ఇశ్రాయేలు ఆరాధన కొరకు బలుల వ్యవస్థను క్రమపరచింది (లేవీయకాండము 1-7 మరియు 16).

మనము నిర్గమకాండము మరియు లేవీయకాండమును చదువుచుండగా, ఆరాధనలోని వివరములు దేవునికి ప్రాముఖ్యమైయున్నవని స్పష్టమవుతుంది. మనము ఆరాధన చేసినంత వరకు, మనము ఎలా ఆరాధన చేయుచున్నాము అను విషయమును దేవుడు పట్టించుకోడు అని వాదించువారికి, మనము ఆరాధించు విధానం దేవునికి ప్రాముఖ్యమైయున్నదని నిర్గమకాండము మరియు లేవీయకాండము చూపుతుంది! దేవుడు ఆరాధన కొరకు స్పష్టమైన సూచనలను ఇచ్చియున్నాడు. ఇది, పతనమునకు తరువాత ఆదాము, హవ్వలకు దేవుడు తెలియజేసిన ప్రకటన వలె, దేవుని కృప యొక్క గుర్తు. యెహోవా స్పష్టమైన సూచనలను ఇచ్చియున్నాడు, “మీరు నా యొద్దకు ఈ విధముగా రావాలి.” ఇది కృపా కార్యము.

ఇశ్రాయేలుకు, వారు దేవుని గృహములో ప్రవేశించుటకు ముందే ఆరాధన ఆరంభమైయ్యేది. ఆరాధన కొరకు సిద్ధపడు ప్రక్రియ, దేవుని యెడల మరియు ఆయన గృహము యెడల వారికున్న భక్తిని బయలుపరచింది. యాత్రా కీర్తనలు యెరూషలేమునకు చేసిన ప్రయాణమే ఆరాధన అని చూపించెను (కీర్తనలు 120-134). ఆరాధన ఆచారములు ఖాళీవి కావు; బలిలోని ప్రతి విషయము నిజమైన ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ఆరాధకునికి జ్ఞాపకము చేసింది.

బలులు దేవునికి సంపూర్ణ సమర్పణను సూచించాయి

కొందరు క్రైస్తవులు పాత నిబంధనలోని బలుల వ్యవస్థను అపార్థం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు ఉద్దేశ్యపూర్వకముగా దేవుని ధర్మశాస్త్రమును ఉల్లంఘించిన, అర్థరహితమైన బలిని తెచ్చిన, వెంటనే హృదయములో మార్పులేకుండా అవే పాపములలోనికి తిరిగి వెళ్లిన ఒక వ్యవస్థను వారు ఊహించుకుంటారు.

కొన్ని సందర్భములలో ఇలా జరిగిన మాట వాస్తవమే. దీనికి ప్రతిస్పందనగా, దేవుడు ఇలా సెలవిచ్చాడు, “మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధానబలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను” (ఆమోసు 5:21-22).

ఏదిఏమైనా, ఇది మనుష్యుని వైఫల్యమేగాని, దేవుని వైఫల్యం కాదు. దేవుడు ఆజ్ఞాపించినదానిని చేయుటలో మనుష్యుడు విఫలమైనప్పుడు బలుల వ్యవస్థ విఫలమైయ్యింది. నిజమైన హృదయ పరివర్తనను ప్రతిబింబించిన అర్పణలు దేవుని ప్రణాళిక అయ్యున్నవి.

పండుగలకు అనుసంధానముగా ఉన్న ఆచారములు ఆరాధనలో క్రియల యొక్క ప్రాముఖ్యతను చూపాయి. ప్రతి వివరము యెహోవా పట్ల ఇశ్రాయేలు యొక్క గౌరవమును తెలియపరచేది. ఇశ్రాయేలు యొక్క ఆరాధన ఒక ఖాళీ ఆచారము మాత్రమే కాదు; ఈ ఆచారములు వారి సమర్పణ మరియు విధేయత యొక్క వాస్తవికతను ఎత్తి చూపాయి. జంతువు యొక్క తల మీద తన చేతులను ఉంచుట ద్వారా, ఆరాధకుడు తనను తాను మరణించిన బలిపశువుతో గుర్తించుకున్నాడు. అలా చేయుట ద్వారా, అతడు ఈ విధముగా ఒప్పుకొనుచున్నాడు, “నేను దీని స్థానములో ఉండవలసినది. నేను మరణపాత్రుడను” (లేవీయకాండము 1:4ను చూడండి).

దేవుడు తన సన్నిధినిచ్చుట ద్వారా నిజమైన ఆరాధనను గౌరవించాడు

దేవాలయ నిర్మాణము ద్వారా ఇశ్రాయేలు యొక్క ఆరాధన మరి ఎక్కువగా క్రమపరచబడింది. మందిరములో వలెనె, దేవాలయములోని ప్రతి వివరము ఇశ్రాయేలు గౌరవముతో దేవునికి చూపిన విధేయతను సూచిస్తుంది (2 దినవృత్తాంతములు 1-7). అర్పణలలోని పవిత్రత మరియు దేవాలయ ఆరాధనలోని క్రమము ఇశ్రాయేలుకు యెహోవా యొక్క ఔన్నత్యమును మరియు వారు ఆయనను ఆశ్రయించవలసిన తగ్గింపు స్వభావమును తెలియపరచాయి.

దేవాలయ ఆరాధన కొరకు ఆరాధన ఆచారములను జాగ్రత్తగా నిర్ణయించుట దేవుని సన్నిధికి ఆటంకము కలిగించలేదు. చరిత్రలో అత్యంత క్రమమైన కూడికలలో ఒకటి బహుశా దేవాలయ ప్రతిష్ట కావచ్చు. దావీదు అనేక సంవత్సరముల క్రితం దేవాలయము కొరకు ప్రణాళిక రూపించాడు. దేవాలయం పూర్తియైన తరువాత, 2 దినవృత్తాంతములు 5వ అధ్యాయములో వర్ణించబడిన అందమైన కూడికలో సొలొమోను ప్రతిష్టను నడిపించాడు. సంగీతకారులు వాయిద్యములు, వీణలు, మరియు సితారాలు వాయించారు. 120 మంది యాజకులు బూరలు ఊదారు. గాయకులు స్తుతి పాటలు పాడారు. వారు పాడుచుండగా, “మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువలేకపోయిరి” (2 దినవృత్తాంతములు 5:14).

నేటి బైబిలానుసారమైన ఆరాధన

కొందరు ప్రతి విధమైన ఆరాధన క్రమము మరియు రూపమునకు విరోధముగా స్పందిస్తారు. ప్రణాళిక చేయబడిన ప్రతి సాహిత్యము హృదయపూర్వక ఆరాధనకు ఆటంకము కలిగిస్తుందని వారు నమ్ముతారు. అయితే, బైబిలానుసారమైన ఆరాధన క్రమమును కలిగియున్నది.

మనము దేవునికి ఉత్తమమైన దానిని ఇచ్చుటకు నిర్ణయించుకుంటే, ఆయన ఆరాధన జాగ్రత్తగా చేయబడిన ప్రణాళికను కోరుతుంది. మన కూడికలోని సౌందర్యము ద్వారా ఇతరులను మెప్పించుటకు మనము ఒక కూడిక ప్రణాళికను సిద్ధపరచముగాని, ఆరాధన అను ఉత్తమమైన అర్పణను దేవునికి ఇచ్చుటకు అలా చేస్తాము.

బైబిలులో, జాగ్రత్తగా క్రమపరచబడిన ఆరాధన (దేవాలయ ప్రతిష్ట వంటివి) మరియు తక్కువ క్రమముగల ఆరాధన (మొదటి శతాబ్దములో గృహ సంఘములు కూడుకొనుట వంటివి) రెండు దేవుని సన్నిధి ద్వారా దీవించబడినవి. మరియు, జాగ్రత్తగా క్రమపరచబడిన ఆరాధన (యిర్మీయా దినములలో దేవాలయ ఆరాధన) మరియు తక్కువ క్రమముగల ఆరాధన (కొరింథులోని గలిబిలితో కూడిన ఆరాధన) రెండు దేవుని సన్నిధి లేకుండా ఉండినవి. ఎంతో క్రమపరచబడినది అనునది సమస్య కాదు; దేవునికి విధేయత చూపుట మరియు దేవుని సన్నిధి కొరకు ఆకలి అనునవి ప్రాముఖ్యమైయున్నవి.

చెకప్

“నా బహిరంగ ఆరాధన (అది క్రమబద్ధమైనది అయినా, కాకపోయినా) విధేయతగల హృదయములో నుండి పుడుతుందా?” అని మిమ్మును మీరు ప్రశ్నించుకోండి.

కీర్తనలు: స్తుతి చెల్లించుటగా ఆరాధన

కీర్తనలు గ్రంథము ఇశ్రాయేలు యొక్క ఆరాధన గ్రంథమైయుండినది. అది వారి పాటల పుస్తకము; అది వారి ప్రార్థనల పుస్తకము; అది నిజమైన ఆరాధన కొరకు మార్గదర్శి; నీతిగల జీవితము కొరకు అది ఒక మార్గదర్శకము అయ్యున్నది. కీర్తనలు గ్రంథము ఇశ్రాయేలు ఆరాధనకు కేంద్రమైయున్నది.

[1]ఆరాధనలో స్తుతి

నిజమైన ఆరాధన స్తుతులు చెల్లించుట మీద ఎక్కువ ఉద్ఘాటన పెడుతుంది అని కీర్తనలు గ్రంథము చూపుతుంది. 88వ కీర్తన నిమహా, ప్రతి కీర్తనలోను ఏదో ఒక స్తుతి వ్యాఖ్య ఉంటుంది. లేవీయకాండములోని ఆచారములు బైబిలానుసారమైన ఆరాధన యొక్క పవిత్రతను గూర్చి మనకు జ్ఞాపకము చేస్తాయి; కీర్తనలు మనకు బైబిలానుసారమైన ఆరాధనలోని ఆనందమును గుర్తుచేస్తాయి. 120-134 కీర్తనలు ఆరాధన కొరకు యెరూషలేమునకు వెళ్లుచుండిన యూదా యాత్రికుల యొక్క ఆనందమును చూపుతాయి. స్తుతులు చెల్లించుట ఆరాధనలో భాగమైయున్నది.

కీర్తనలు గ్రంథములో కనిపించు స్తుతులు నిజమైన ఆరాధనలోని ఆనందమును ప్రతిబింబిస్తాయి. స్తుతులు మనము దేవునియందు ఆనందించుటను చూపుతాయి. నిజమైన ఆరాధనలో దేవునియందు మరియు ఆయన కార్యముల యందు ఆనందించుట భాగమైయున్నది.

ఆరాధనలో విలాపము

విలాప కీర్తనలు బైబిలు ఆరాధనలోని మరొక కోణమును చూపుతాయి; ఆరాధన ఆరాధకుడు మరియు దేవుని మధ్య సంపూర్ణ నిజాయితీని అనుమతిస్తుంది. విలాప కీర్తనలలో, లోకములో జరుగుతున్న అవినీతిని బట్టి కీర్తనకారుడు అసంతృప్తిని వ్యక్తపరుస్తాడు. కీర్తనలు 10:1లో, కీర్తనకారుడు ఇలా ప్రశ్నిస్తాడు, “యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచు చున్నావు? ఆపత్కాలములలో నీ వెందుకు దాగి యున్నావు?” దుష్టులు తిరుగుబాటు చేయుటకు మరియు గర్వముతో వ్యవహరించుటకు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు. ఆరాధన దేవునితో సంబంధము మీద ఆధారపడియున్నది కాబట్టి, ఆరాధకుడు నిజాయితీగాను, బాహాటముగాను మాట్లాడగలడు.

10వ కీర్తన దేవునియందు నమ్మికను గూర్చి ప్రకటించుటతో ముగుస్తుంది.

యెహోవా నిరంతరము రాజై యున్నాడు ఆయన దేశములోనుండి అన్యజనులు నశించి పోయిరి. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లు బాధపడువారి కోరికను నీవు విని యున్నావు తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి (కీర్తనలు 10:16-18).

ఈ ప్రకటన దేవునియందు నమ్మకముపై ఆధారపడియున్నది. దుష్టులు అన్యాయము చేయుటను కొనసాగించినప్పటికీ, దేవుడు సరియైన కార్యమును చేస్తాడని కీర్తనకారుడు నిశ్చయతను వ్యక్తపరచాడు.

యోబు గ్రంథములో మనము నిజాయితీని చూస్తాము. అట్టి నిజాయితీ దేవునితో దగ్గర మరియు సన్నిహిత సంబంధము మీద ఆధారపడియున్నది. ఇది నిజమైన ఆరాధన, ఇది దేవుడు అంగీకరించు ఆరాధన.


[1]

“దేవునియందు స్థిరమైన ఆనందమును కలిగియుండునట్లు చూచుకొనుడి.”

- రిచర్డ్ బక్స్టర్

నేటి బైబిలానుసారమైన ఆరాధన

కీర్తనలలో రెండు రకముల స్తుతులు ఉంటాయి. కొన్ని కీర్తనలు స్తుతులు చెల్లించుటకు కారణమును చెబుతాయి; ఇతర కీర్తనలు ఎలాంటి కారణము లేకుండా స్తుతులు చెల్లించమని ఆజ్ఞాపిస్తాయి. దేవుని స్వభావము మరియు ఆయన చేసిన గొప్ప కార్యముల కొరకు చేయు స్తుతులను “వివరణాత్మక స్తుతి” అంటారు; ప్రత్యేకముముగా దేనిని తెలియజేయని స్తుతిని “ప్రకటనాత్మక స్తుతి” అని పిలుస్తారు. వివరణాత్మక స్తుతికి ఉదాహరణలు ఏవనగా, కీర్తనలు 19, 105, మరియు 136. ప్రకటనాత్మక స్తుతికి ఉదాహరణలు ఏవనగా, కీర్తనలు 148-150.

నేటి ఆరాధనలో, ఈ రెండు రకముల స్తుతులు స్తుతి పాటలలలో (ప్రకటనాత్మక స్తుతి) మరియు కీర్తనలలో (వివరణాత్మక స్తుతి) కనిపిస్తాయి. ఈరెండు ఆరాధనలో భాగమైయుండాలి. ఒక స్తుతి పాట యొక్క సరళత ఆరాధకుడు దేవుని కొనియాడునట్లు చేస్తుంది, కీర్తనలోని లోతు దేవుని స్వభావమును గూర్చి లోతైన సత్యములను బోధిస్తుంది.

ప్రకటనాత్మక స్తుతి

పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతును
మహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతును
ప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడా
యెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా[1]

వివరణాత్మక స్తుతి

ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు ||దేవుని||

చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు
సత్యమగు – జీవమగు – మార్గమేసే ||దేవుని||

నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే
ఆధారము – ఆదరణ – ఆయనలో ||దేవుని||[2]

చెకప్

కీర్తనకారుని యొక్క స్తుతులు దేవునియందు అతని ఆనందమును చూపుతాయి. “నేను నిజముగా దేవునియందు ఆనందించుచున్నానా?” అని మిమ్మును మీరు ప్రశ్నించుకోండి.


[1]పాట రచయిత: ఫిలిప్ గరికి & లిల్లియన్ క్రిస్టోఫర్, “పరిశుద్ధుడా నా యేసయ్యా” జనవరి 2, 2025 న యాక్సెస్ చేయబడింది. https://christianlyricz.com/2016/12/31/parishuddhudaa-naa-yesayyaa/
[2]“దేవునియందు నిరీక్షణ నుంచి.” జనవరి 2, 2025 న యాక్సెస్ చేయబడింది. https://christianlyricz.com/2016/09/27/devuniyandu-nireekshana-nunchi/

ప్రవక్తలు: ప్రకటనగా ఆరాధన

బలుల నియమములు, మందిరము, దేవాలయము ఆరాధనలో ఆచారము యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. అయితే, హృదయపూర్వక ఆరాధనతో చేయబడని ఆచారము నిరర్థకమైనది అని ప్రవక్తలు చూపారు. విధేయతగల హృదయములు లేకుండా ఇశ్రాయేలు ప్రజలు కేవలం ఆచారములను మాత్రమే అనుసరించుటను ఆరంభించినప్పుడు, ప్రవక్తలు దేవుని తీర్పు సందేశమును అందించారు. ఒక మతభ్రష్టమైన దేశము యొక్క బలులను దేవుడు అంగీకరించడు అని వారు ప్రకటించారు.

దేవుని సందేశము యొక్క ప్రకటనయే ఆరాధన అని ప్రవక్తలు చూపారు. మన కూడికలలో, మనము ఆరాధనను ప్రసంగము నుండి వేరుచేయకూడదు. వాక్యము యొక్క ప్రకటన సత్యముతో ఆరాధన అయ్యున్నది. ప్రసంగము మన మీద దేవుని అధికారమును మరియు మన జీవితముల కొరకు ఆయన జ్ఞానమును తెలియజేస్తుంది. ఇది ఆరాధన; ఇది దేవుని ఘనపరుస్తుంది.

ప్రవక్తల యొక్క సందేశం

వాస్తవికతలేని ఆచారము ఆరాధన కాదు.

దేవుడు ఇశ్రాయేలు యొక్క బలులను తిరస్కరించాడు అని ఆమోసు ప్రకటించాడు. ఎందుకని? ఎందుకంటే ఆరాధకుల యొక్క జీవనశైలి పాపముతో నిండియుండినది (ఆమోసు 5:21-22). ఇశ్రాయేలు యొక్క పండుగలు దేవునికి విసుగుకలిగించు భారములుగా ఉండెను అని యెషయా ప్రకటించాడు. ఎందుకని? ఎందుకంటే దాని చేతులు రక్తముతో నుండుకొనినవి.

ఆరాధించుటకు ముందు, ఆరాధకులు ఇలా ఆజ్ఞాపించారు: “మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి” (యెషయా 1:13-17).

హృదయము యొక్క వాస్తవికతను ప్రతిబింబించని ఆచారములతో దేవుడు సంతోషపడడు.

నిజమైన ఆరాధన మన ఉత్తమమైన ప్రయత్నమును కోరుతుంది.

అబ్రాహాము దేవునికి తన కుమారుని అర్పించాడు; అతడు ఉత్తమమైన దానిని ఇచ్చాడు. హేబెలు తన మందలో తొలి పుట్టిన వాటిలో అర్పించాడు; అతడు ఉత్తమమైన దానిని ఇచ్చాడు. లేవీయకాండము బలుల కొరకు సర్వోత్తమమైన జంతువులను కోరింది. తనకు ఎంత మూల్యము చేయని అర్పణను అర్పించుటకు దావీదు నిరాకరించాడు (2 సమూయేలు 24:24). ప్రతి సందర్భములోను, ఆరాధన మన నుండి సర్వోత్తమమైనదానిని కోరుతుంది.

ఈ సందేశము ప్రవక్తలలో కూడా కొనసాగుతుంది. బలుల కొరకు బలహీనమైన జంతువులను తెచ్చుటకు విరోధముగా మలాకీ హెచ్చరించాడు (మలాకీ. 1:6-8). హగ్గయి తీర్పును గూర్చి హెచ్చరించాడు, ఎందుకంటే ప్రజలు దేవుని గృహము కంటే తమ సొంత ఇండ్ల యొక్క పరిస్థితిని గూర్చి ఎక్కువ ఆలోచించారు (హగ్గయి 1:8-11). నిజమైన ఆరాధన మన నుండి ఉత్తమమైనదానిని కోరుతుంది.

నిజమైన ఆరాధనలో సమస్త జీవితము భాగమైయున్నది.

ఆమోసు ఇశ్రాయేలు యొక్క మతభ్రష్టతకు ఆచరణాత్మక ప్రతిస్పందనను ఇచ్చాడు. పరిష్కారం ఎక్కువ బలులు కాదు; నీతిగల జీవితము పరిష్కారం. “నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింప నియ్యుడి.” (ఆమోసు 5:24) ప్రవక్తలు దేవాలయ ఆరాధన మరియు బలులకు వ్యతిరేకము కాదు.[1] నీతిగల జీవితములేని ఆరాధనను వారు వ్యతిరేకించారు.

బైబిలు అంతటిలో, నిజమైన ఆరాధనలో జీవితమంతా భాగమైయుంటుంది అని మనము చూశాము. పంచకాండములో, ఆరాధనను గూర్చిన నియమాలు నైతిక ప్రవర్తనను గూర్చిన నియమముల తరువాత ఇవ్వబడినవి; వాటి మధ్య ఎలాంటి విభజన లేదు. చారిత్రిక గ్రంథములలో, అనుదిన జీవితములో ఇశ్రాయేలు యొక్క అవిధేయత ఇశ్రాయేలు యొక్క ఆరాధన స్థలమైన దేవాలయము యొక్క నాశనమునకు దారితీసింది. అది చూపిన అవిధేయత వలన దేవుడు ఇశ్రాయేలు యొక్క ఆరాధనను తిరస్కరించాడు అని ప్రవక్తలు ప్రకటించారు. క్రొత్త నిబంధనలో, కనికర జీవితము లేకుండా విశ్రాంతి దినమును ఆచరించుట వంటి ఆరాధన ఆచారములు ఎందుకు పనికి రావని యేసు పరిసయ్యులకు జ్ఞాపకము చేశాడు (మత్తయి 12:7).

ప్రవక్తల ఉదాహరణ: ప్రసంగము మరియు ప్రకటననే ఆరాధన

దేవుని వాక్య ప్రకటనయే ఆరాధన అని ప్రవక్తలు చూపారు. యిర్మీయా దేవాలయము ఎదుట నిలువబడి “మీరు కీర్తనలు పాడుటకు మరియు బలులు అర్పించుటకు దేవాలయముకు వెళ్లుడి. అదియే ఆరాధన. మీరు దానిని పూర్తిచేసిన తరువాత, మీకు దేవుని వాక్యమును ప్రకటిస్తాను” అని చెబితే ఎంత వింతగా ఉండేదో. కాదు! యిర్మీయా ప్రకటనయే ఆరాధన అయ్యున్నది. వారి పాపపు జీవితముల కారణంగా దేవుడు వారి ఆరాధనను తిరస్కరించాడని యిర్మీయా ఇశ్రాయేలుకు ప్రకటించాడు. ఇది ఆరాధన. అది పరిశుద్ధుడైన దేవుని యొక్క పవిత్రతను గుర్తించింది; అది దేవుడు యోగ్యతను గుర్తించింది.


[1]ప్రవక్తలు దేవాలయ వ్యవస్థను తిరస్కరించారని కొందరు పండితులు చెబుతారు. అయితే, అనేకమంది ప్రవక్తలు దేవాలయముతో దగ్గర సంబంధము కలిగియున్నారు. యెషయా దేవాలయములో దేవుని చూశాడు. యెహేజ్కేలు దేవుని మహిమతో నిండియుండు పునరుద్ధరించబడిన దేవాలయమును గూర్చి ప్రవచించాడు. హగ్గయి దేవాలయమును నిర్మించమని జెరుబ్బాబెలును ప్రోత్సహించాడు. ప్రవక్తలు బలులను తిరస్కరించలేదు; బలులను దుర్విన్యోగం చేయుటను వారు తిరస్కరించారు.

నేటి బైబిలానుసారమైన ఆరాధన

కొన్ని సంఘములు ఆరాధన మరియు ప్రసంగమును వేరుచేస్తాయి. అవి ఇలా ప్రకటిస్తాయి, “మనము ఆరాధన సమయములో ఆరంభిద్దాము.” ఆరాధన అయిపోయిన తరువాత, ప్రసంగములోనికి వెళ్దాము. దీనిలో రెండు అపాయములు ఉన్నాయి.

1. దీనికి ఆరాధన కేవలం సంగీతమునకు మాత్రమే పరిమితమైనది అని అర్థం. ఆరాధన పట్ల ఈ ధోరణి కేవలం భావనల మీద మాత్రమే దృష్టిపెడుతుంది. నిజనమైన ఆరాధన కేవలం సంగీతము మరియు పాటలు మాత్రమే కాకూడదు.

2. అది ఆరాధనను ప్రసంగము నుండి వేరుచేస్తుంది. మనము సంఘ కూడికలో చేయు సమస్తము ఆరాధన అయ్యుండాలి. సంగీతం, ప్రార్థన, లేఖనము, ప్రసంగం, మరియు కానుకలు కూడా ఆరాధనలో భాగమైయుండాలి.

చెకప్

“నా ప్రసంగము ఆరాధన కార్యమేనా? నేను ప్రసంగించునప్పుడు, దేవుని యోగ్యతను ఘనపరచు దేవుని సందేశకునిగా నేను మాట్లాడుతున్నానా” అని మిమ్మును మీరు ప్రశ్నించుకోండి.

ఆరాధన అపాయములు: ఆరాధనలో అసమతుల్యత

(1) అతిగా సామాన్యమైన ఆరాధనలోని అపాయము

బైబిలానుసారమైన ఆరాధన సమర్పణను కోరుతుంది అని మనము మరచిపోయినప్పుడు, మనము దేవుని ఒక సామాన్యమైన స్నేహితునిగా భావిస్తూ, ఆయనను గౌరవించకుండా ఉండు అపాయం ఉంది. ఆరాధన పట్ల అతిగా సాధారణమైన పద్ధతి ఈ వైఖరిని ప్రోత్సహించవచ్చు. దేవుడు సంపూర్ణ విధేయతను కోరు భయంకరుడైన దేవుడు అను విషయం మనము మరచిపోకూడదు. ఆయన “సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవు [డు]” (1 తిమోతికి 1:17). కొన్ని సంఘములు దేవుని ఔన్నత్యమును మరచిపోతాయి; ఆరాధన ఒక పాత స్నేహితునితో కలిసి ఒక కప్పు కాఫీ త్రాగడం వలె అయిపోతుంది.

(2) అతిగా అధికారికమైన ఆరాధనలోని అపాయము

బైబిలానుసారమైన ఆరాధన మనతో సహవాసమును కలిగియుండుటకు ఆశపడు దేవుని ఆరాధన అను విషయమును మనము మరచిపోయినప్పుడు, మనము దేవుని దూరమునున్న ఒక దైవముగా పరిగణించుట ఆరంభిస్తాము. ఆరాధనను అతిగా అధికారికముగా పరిగణించుట ఈ వైఖరిని ప్రోత్సహిస్తుంది. విశ్వాసి దేవునితో తన యొక్క సాన్నిహిత్యమును వ్యక్తపరచుటకు కొన్ని సంఘములు అవకాశం ఇవ్వవు; ఆయన మహత్వము మరియు గొప్పతనము మీదనే సంపూర్ణ ఉద్ఘాటన ఉంచబడుతుంది.

ఆరాధనలో, మనము సృష్టిపై దేవుడు కలిగియున్న మహా అధికారమును మరియు తన పిల్లలతో ఆయన కలిగియున్న సాన్నిహిత్యమును రెంటిని అనుభవించాలి.

చెకప్

మీరు చివరిసారిగా పలుపొందిన ఆరాధన కూడికను గూర్చి ఆలోచించండి. “కూడికలోని యే భాగము ఆరాధకులు దేవుని మహత్వమును గౌరవించునట్లు ప్రోత్సహించాయి? వారు మన గొప్ప దేవుని గూర్చి అవగాహన కలిగి కూడిక నుండి వెళ్లారా?” తరువాత మిమ్మును మీరు ఇలా ప్రశ్నించుకోండి, “కూడికలోని యే భాగములు అరాధకులు దేవునితో సన్నిహిత స్నేహమును అనుభవించుటకు వారిని ప్రోత్సహించాయి? దేవుడు వారిని ఎంతో ప్రేమించుచున్నాడని తెలుసుకొని వారు వెళ్లారా?”

ముగింపు: దేవాలయ ప్రతిష్టను ప్రత్యక్షసాక్షులు ఇచ్చిన సాక్ష్యం

దేవాలయ ప్రతిష్టలో పాలుపంచుకొంటే ఎలా ఉండేది? దానిని బహుశ ఈ విధముగా వ్యక్తపరచవచ్చు:

“దేవాలయ ప్రతిష్టకు నేను హాజరైయ్యాను. అ రోజును నేను అస్సలు మరచిపోలేను. ఆ కూడిక కొరకు మేము ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశాం.

“సంవత్సరాలా? అవును, సంవత్సరాలే! దావీదు రాజు దేవాలయమును కట్టుటకు ప్రణాళికను సిద్ధపరచాడు మరియు ఆ ప్రణాళికలను మరణించుటకు ముందు సొలొమోనుకు ఇచ్చాడు. ఇప్పుడు దేవాలయము పూర్తి అయ్యింది, మరియు ఎంతో కాలముగా ఎదురుచూచుచున్న ప్రతిష్ట కూడిక జరిగింది.

“అది ఒక అందమైన సందర్భము మరియు ఒక నాటకీయమైన కూడిక. ఊహించండి...

  • ఇరవైరెండు వేల ఎద్దులు మరియు లక్ష ఇరవైవేల గొర్రెలను అర్పించుట జరిగింది

  • కొన్ని వందలమంది గాయకులు దావీదు కీర్తనలను పాడారు

  • వీణలు, సితారాలు, తంబురలు, మరియు 120 బూరల ధ్వనులు వినిపించాయి.

  • యాజకులు మరియు లేవీయులు ఉత్తమమైన తెల్లటి అంగీలను ధరించారు

  • చరిత్రలోనే అత్యంత అందమైన భవనములలో ఒకటి అది

  • ప్రతి ఆరాధనా కార్యము కొరకు బంగారము మరియు వెండితో చేయబడిన పాత్రలు

“అది ఒక అందమైన కూడిక, కానీ కూడిక యొక్క అందము నా జ్ఞాపకములో అత్యంత ప్రాముఖ్యమైనది కాదు. సంగీతకారులు పాడుటను మరియు వాయించుటను ఆరంభించినప్పుడు, ‘యెహోవా మహిమ దేవుని గృహములో నిండినది.’ యాజకులు తమ బాధ్యతలను నెరవేర్చినంత వరకు దేవుని సన్నిధి దేవాలయములో నిండియున్నది. దేవునికి చేయబడు సేవపై దేవుడు స్వయంగా ఆవరించాడు.

“ఆ గుర్తుండిపోయే కూడిక జరిగి అనేక సంవత్సరాలు అవుతుంది. నేను అప్పటి నుండి పాలుపంచుకొనిన కూడికలన్నిటిలో దేవుని సన్నిధి అదే విధముగా కనిపించింది అని నేను అనుటలేదు; అది ఒక ప్రత్యేకమైన రోజు. అయితే, నేను హజరైన ప్రతి కూడికలోను దేవుని సన్నిధి కొరకు నేను ఎదురుచూశాను.

“కొన్నిసార్లు, ఆయన సన్నిధి అద్భుతముగా కనిపించింది; కొన్నిసార్లు, మౌనముగ కనిపించింది. కొన్నిసార్లు, ఆయన సన్నిధి పాటలలో కనిపించింది; కొన్నిసార్లు, ఆయన ప్రసంగముల ద్వారా మాట్లాడాడు. కొన్నిసార్లు, నా భావనలు తాకబడ్డాయి; కొన్నిసార్లు, ఆయన సత్యము నా మనస్సు మరియు చిత్తముతో మాట్లాడింది; కొన్నిసార్లు, నేను ప్రోత్సహించబడి వెళ్ళాను; కొన్నిసార్లు, నేను ఒప్పించబడ్డాను.

“దేవుడు యే విధముగా ప్రత్యక్షమైనప్పటికే, నేను అయన సన్నిధిని గౌరవించుచున్నాను. దేవుని దృశ్య సన్నిధిని అంత అద్భుతముగా నేను మరలా చూడకపోవచ్చు, కాని నేను ఆరాధన చేసిన ప్రతిసారి ఆయన సన్నిధిలోనికి ప్రవేశించగలను.”

సమూహ సంభాషణ

► ఈ పాఠము యొక్క అభ్యాసిక అనువర్తన కొరకు, ఈ క్రింది విషయమును చర్చించండి:

కవిత ఒక నిజాయితీగల క్రైస్తవురాలు మరియు తన గ్రామములోని ఆరాధనా కూడికలకు హాజరగుట ఆమెకు చాలా ఇష్టం. శక్తివంతమైన సంగీతము మరియు సహవాసము ఆమె అనుదిన జీవిత సమస్యలను మరచిపోవుటకు మంచి అవకాశమునిస్తాయి. ఆమె తన పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించుచుండగా అనుభవించు భావనలు మరియు భావోద్వేగములు ఆమెకు చాలా ఇష్టం. అయితే, కవిత అదివార ఉదయకాల ఆరాధనలో పెట్టు కృషిని తన వైవాహిక జీవితము మరియు అనుదిన జీవిత బాధ్యతలలో పెట్టలేకపోతుంది. మీరు కవిత కు ఏమని సలహా ఇస్తారు?

పాఠం 3 సమీక్ష

(1) మనము ఆరాధించు విధానమును దేవుడు పట్టించుకుంటాడు ఎందుకంటే:

  • మనము ఆరాధించు విధానము దేవుని గూర్చి మనకున్న అవగాహనను ప్రభావితము చేస్తుంది.

  • మనము ఆరాధించు విధానము మనము ఎందుకు ఆరాధించుచున్నమో చూపుతుంది.

(2) ఆరాధన అనగా సంబంధము – దేవునితో నడచుట.

  • ఆదాము హవ్వల కొరకు ఆరాధన మాధ్యమములను దేవుడు ఇచ్చాడు.

  • అబ్రాహాము కొరకు ఆరాధనను సాధ్యపరచుటకు దేవుడు మొదటి అడుగు వేశాడు.

  • దేవుని కృప యాకోబు ఆరాధనను సాధ్యపరచింది.

  • మనము దేవునితో నడచినప్పుడు, మన జీవితములు మార్చబడతాయి.

(3) ఆరాధన విధేయతతో ఆరంభమవుతుంది.

  • ఆరాధన కేవలం ఒక భావన లేక భావోద్వేగము మాత్రమే కాదు.

  • ఆరాధన దేవుని ఆజ్ఞలకు క్రియాత్మక స్పందన అయ్యున్నది.

  • దేవునికి విధేయత చూపుట ఆయనతో మన సంబంధమును బలపరుస్తుంది.

(4) ఆరాధనలో ఆచారము కూడా ఉంటుంది (పాత నిబంధన బలులు).

  • బలులు దేవునికి సంపూర్ణ సమర్పణను సూచించాయి (రోమా 12:1).

  • దేవుడు తన సన్నిధినిచ్చి నిజమైన ఆరాధనను గౌరవించాడు (2 దినవృత్తాంతములు 5)

  • బహిరంగ ఆచారము అనునది విధేయతగల హృదయములో నుండి పుట్టాలి.

(5) ఆరాధనలో స్తుతి (కీర్తనలు) భాగమైయున్నది.

  • ఆరాధనలో స్తుతి భాగమైయున్నదని కీర్తనల గ్రంథము చూపుతుంది.

  • ఆరాధనలో విలాపము భాగమైయున్నదని కీర్తనల గ్రంథము చూపుతుంది.

(6) ఆరాధనలో ప్రకటన (ప్రవక్తలు) భాగమైయున్నది.

  • ఆరాధన అంటే కేవలం స్తుతి మాత్రమే కాదు; అది సత్యమును ప్రకటించుట కూడా అయ్యున్నది. ప్రసంగము ఆరాధన అయ్యున్నది.

  • వాస్తవికతలేని ఆచారము ఆరాధన కాదని ప్రవక్తలు బోధించారు.

  • నిజమైన ఆరాధన మన నుండి ఉత్తమమైనదానిని కోరుతుందని ప్రవక్తలు బోధించారు.

  • నిజమైన ఆరాధనలో జీవితమంతా భాగమైయున్నదని ప్రవక్తలు బోధించారు.

ముద్రించగల PDF ఇక్కడ అందుబాటులో ఉంది.

పాఠం 3 అభ్యాసములు

(1) పాత నిబంధన ఆరాధనను గూర్చి ఈ పాఠములో మీరు నేర్చుకున్న మూడు నియమములను తెలుపండి. మీ సంఘము యొక్క ఆరాధనలో మీరు ప్రతి నియమమును అనువర్తించగల ఆచరణాత్మక విధానములను గూర్చి ఒక పేజీ వ్రాయండి.

(2) తదుపరి పాఠము యొక్క ఆరంభములో, ఈ పాఠం ఆధారముగా మీరు ఒక పరీక్ష వ్రాస్తారు. సిద్ధపడుటకు పరీక్ష ప్రశ్నలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి.

పాఠం 3 పరీక్ష

(1) ఈ పాఠము నుండి, దేవుడు ఆరాధనను తిరస్కరించిన రెండు బైబిలు ఉదాహరణలను తెలుపండి.

(2) దేవునితో నడుచుట అను పదము ఆరాధనలో దేవునితో ________ భాగమైయున్నది అని చూపుతుంది.

(3) ఈ పాఠములో నుండి, దేవుడు కృపతో ఆయనను ఆరాధించుటకు అనుమతించిన ముగ్గురు అయోగ్యమైన ప్రజల పేర్లను వ్రాయండి.

(4) నిజమైన ఆరాధన ____________ను కోరుతుంది అని అబ్రాహాము ఇస్సాకును అర్పించుట చూపుతుంది.

(5) హేబెలు ఆరాధన మరియు కయీను ఆరాధన మధ్య ఉన్న వ్యత్యాసము ఏమిటి?

(6) బలి అర్పించబోయే జంతువు తల మీద ఆరాధకుడు తన చేతులు ఉంచుట యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

(7) కీర్తనల గ్రంథములో, రెండు రకముల స్తుతులు ఉన్నాయి. దేవుని స్వభావము మరియు ఆయన చేసిన గొప్ప కార్యముల కొరకు చేయు స్తుతులను _______ స్తుతి అంటారు; ప్రత్యేకముముగా దేనిని తెలియజేయని స్తుతిని _______ స్తుతి అని పిలుస్తారు.

(8) దేవుని సందేశము యొక్క __________ ఆరాధన అని ప్రవక్తలు చూపారు.

(9) ఆరాధనను గూర్చి ప్రవక్తలు ఇచ్చిన సందేశములోని మూడు విషయములను తెలుపండి.

(10) ఆరాధనలోని రెండు అపాయకరమైన అసమతుల్యతలను తెలుపండి.

(11) మీరు కంటస్థం చేసిన మీకా 6:6-8ని వ్రాయండి.

Next Lesson