క్రైస్తవ ఆరాధనకు పరిచయం
క్రైస్తవ ఆరాధనకు పరిచయం
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 1: ఆరాధనను నిర్వచించుట

2 min read

by Randall McElwain


పాఠ్య ఉద్దేశ్యములు

ఈ పాఠం ముగిసే నాటికి, విద్యార్థి:

(1) ఆరాధనకు బైబిలు నిర్వచనమును కలిగియుండుట.

(2) నిజమైన ఆరాధన మన జీవితములోని అన్ని కోణముల మీద ప్రభావము చూపుతుంది అని అర్థము చేసుకొనుట.

(3) దేవునికి ఆమోదయోగ్యమైన ఆరాధనా విధానమును అర్థము చేసుకొనుట.

(4) క్రైస్తవ జీవితములో ఆరాధన యొక్క ప్రాముఖ్యతను మెచ్చుకొనుట.

ఈ పాఠము కొరకు సిద్ధపాటు

యోహాను 4:23-24ను కంటస్థం చేయండి.

పరిచయం

అది అమెరికాలో ఆదివార ఉదయము. చక్కగా వస్త్రములు ధరించిన క్రైస్తవులు అందమైన ఆలయములో ఆరాధన కొరకు కూడుకుంటారు. కీబోర్డు మరియు క్వయర్ తో కలిసి, వారు ఘనమైన కీర్తనలను పాడతారు. కానుకలు పట్టునప్పుడు ఆర్కెస్ట్రావారు మంచి వాయిద్యములు వాయిస్తారు. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపించునప్పుడు ఆరాధకులు మౌనముగా ప్రార్థిస్తారు. అతను ప్రసంగము చేయునప్పుడు, పాస్టర్ గారు తన ఇంటిలో ఉన్న పెద్ద గ్రంథాలయములోని రచయితలను రచనలను ఉల్లేఖిస్తాడు. ప్రసంగము తరువాత, సంఘము వెండి బలారాధన పళ్ళెమును, వ్యక్తిగత వాఫెర్స్, మరియు వ్యక్తిగత కప్పులను ఉపయోగించి సంస్కారమును జరుపుకుంటుంది. ఇది ఆరాధన.

అది చైనాలో ఆదివార ఉదయము. మామూలు వస్త్రములు ధరించుకొనిన 30 మంది విశ్వాసులు ఒక అపార్ట్ మెంట్ లో కూడుకుంటారు. ఎలాంటి వాయిద్యములు లేకుండా వారు స్తుతి కీర్తనలు మరియు పాటలు పడతారు. నాయకురాలు ఈ మధ్యనే తన లేఖన అధ్యయనములో నేర్చుకున్న ఒక సత్యమును పంచుకుంటుంది. విస్తరించబడిన ప్రార్థనా సమయములో, గృహ సంఘములోని సభ్యులు ఒకరి అవసరతల కొరకు ఒకరు ఒకొక్కరిగా ప్రార్థిస్తారు. ప్రార్థన తరువాత, ప్లాస్టిక్ కప్పులలో ఇవ్వబడు రొట్టె మరియు ద్రాక్షరసమును తీసుకొని సంస్కారమును జరుపుకుంటారు. ప్రజలు విడిచివెళ్లుచుండగా, ద్వారము యొద్ద ఉన్న బుట్టలో తమ కానుకను వేసివెళ్తారు. ఆ కానుకను ప్రత్యేక అవసరతలు ఉన్నవారితో పంచుకోవడం జరుగుతుంది. ఇది ఆరాధన.

అది నైజీరియాలో ఆదివార ఉదయము. రంగురంగుల వస్త్రములు ధరించుకున్న క్రైస్తవులు ఉత్సాహకరమైన ఆరాధన కూడిక కొరకు సమావేశమవుతారు. గిటారులు, కీబోర్డులు, మరియు డ్రమ్ములతో స్తుతిఆరాధన బృందం స్క్రీన్ మీద ఉన్న పాటలలో సంఘమును నడిపిస్తుంది. ఆలయములో ముందు ఉన్న చందా పెట్టెలో సభ్యులు తమ కానుకలను వేయుచుండగా ఆ బృందం వ్వాయిధ్యములు వాయిస్తారు. ప్రసంగము చాలా ఆచరణాత్మకముగా ఉండి, సమకాలీన నైజీరియా సమాజము యొక్క అవసరతలను గూర్చి మాట్లాడునదిగా ఉంటుంది. కరచాలనం, హత్తుకొనుట, మరియు వేడుకతో కూడిక ముగుస్తుంది. ఇది ఆరాధన.

ఆరాధన అనేక రూపములను ధరిస్తుంది. ప్రతి దేశము మరియు ప్రతి సంస్కృతిలో, ఆరాధనా విధానములు భిన్నముగా ఉంటాయి. ఆరాధన ఒక ఆచరణాత్మక కూడిక మాత్రమే కాదు. వాస్తవానికి, ఆరాధన కూడిక కంటే గొప్పది; ఆరాధనలో క్రైస్తవ జీవితములోని అన్ని కోణములు భాగమైయున్నవి. ఈ పాఠములో, మనము ఆరాధనకు బైబిలు నిర్వచనమును చూద్దాము.

► యోహాను 4:1-29ని చదవండి. ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయుట అంటే ఏమిటో చర్చించండి.

బైబిలానుసారమైన ఆరాధనలోఅంశములు

ఆరాధన దేవుని యొక్క యోగ్యతను గుర్తించుట మరియు ఘనపరచుట అయ్యున్నది. అనగా దేవునికి చెందవలసిన ఘనతను ఆయనకు ఇచ్చుట అని అర్థం.

► ఆరాధనకు మూడు నిర్వచనములు క్రింద ఇవ్వబడినవి. మీకు అత్యంత అర్థవంతమైన నిర్వచనమును కంటస్థం చేయండి.

  • “ ఆరాధన నిత్య దేవునికి మానవుడు వ్యక్తిగతంగా ఇచ్చు ప్రేమమయమైన స్పందన అయ్యున్నది.” – ఎవెలిన్ అండర్హిల్

  • “ఆరాధన దేవునికి చిత్తపూర్వకముగా స్పందిస్తూ మన హృదయములను పైకెత్తుట అయ్యున్నది.” – ఫ్రాంక్లిన్ సెగ్లర్

  • “ఆరాధన దేవుని సమస్తమునకు మన సమస్తముతో ఇచ్చు స్పందన అయ్యున్నది.” – వారెన్ వియర్స్బి

ఆరాధన అనగా గౌరవముతో అప్పగించుకొనుట

బైబిలులో “ఆరాధన” అని అనువదించబడిన ప్రాధమిక హెబ్రీ మరియు గ్రీకు పదములు దేవుని ఎదుట సాష్టాంగపడుట అను ఆలోచనను కలిగియున్నవి.[1] ఇది ఆరాధనలో వినయముతో సమర్పించుకొనుటను సూచిస్తుంది. సాష్టాంగపడు శారీరిక కార్యము హృదయములోని గౌరవమును ప్రతిబింబిస్తుంది. కనీసం రెండవ శతాబ్దము నుండి అయినా, ప్రార్థించునప్పుడు క్రైస్తవులు గౌరవముతో మొకాళ్ళూనారు.

ప్రకటన గ్రంధం 4:10-11లో అపొస్తలుడైన యోహాను పరలోకములో జరిగిన ఆరాధనను చూశాడు:

ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు–ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానినిబట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.

జయించబడిన రాజును కైసరు ఎదుటికి తీసుకొనివచ్చినప్పుడు, అతడు తన కిరీటమును కైసరు పాదముల యొద్ద పడవేసి, తగ్గింపుతో సాష్టాంగపడవలసియుండేది. కైసరు కంటే ఎక్కువ బలవంతుడు మరియు యోగ్యుడైన దేవుడు ఆరాధకుల యొక్క వినయముతో కూడిన సమర్పణకు అర్హుడు అని యోహాను చూపుతున్నాడు.

పాత నిబంధనలో, తిరుగుబాటుదారుల బలులను దేవుడు తిరస్కరించాడు. “ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారువారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి” (యెషయా 29:13). బాహ్యముగా, వారు ఆరాధకుల వలె కనిపించారు; వారు సరియైన మాటలను పలికారు మరియు సరియైన ఆచారములను పాటించారు. అంతరంగములో, వారి హృదయములు దేవునికి దూరముగా ఉన్నవి. నిజమైన ఆరాధన హృదయపూర్వకముగా గౌరవముతో సమర్పించుకొనుట అయ్యున్నది.

ఇదే సత్యమును క్రొత్త నిబంధనలో కూడా చూడవచ్చు. సమరయ స్త్రీ భౌతిక ఆరాధనా స్థానమును గూర్చి వాదించింది, యెరూషలేము వెర్సెస్ గెరిజీము పర్వతము. యేసు ఆరాధనకు ఆత్మీయ స్థలమైన హృదయమును గూర్చి మాట్లాడాడు. “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను” (యోహాను 4:24). నిజమైన ఆరాధనలో దేవునికి సమర్పణ అవసరమైయున్నది.

నిజమైన ఆరాధన ఆరాధించబడుతున్నవానిని గౌరవిస్తుంది. కొన్ని సంఘాలలో, దేవునికి చెందవలసిన గౌరవమును గుర్తించుటలో ఆరాధన విఫలమవుతుంది. తదుపరి నిర్వచనములో మనము చూడబోవుచున్నట్లు, ఆరాధనలో వేడుక భాగమైయున్నది, కాని ఆరాధన దేవుని గౌరవిస్తుంది కూడా. అంటే ఒకే ఆరాధనా విధానము సరియైనది అని కాదు. అయినప్పటికీ, మన ఆరాధనా విధానములను నిర్ణయించుకొనుచుండగా, “నేను ఆరాధించు దేవునికి నేను గౌరవమును చూపుచున్నానా?” అని మనము ప్రశ్నించాలి.

ఆరాధన అనగా సేవ

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది (రోమా 12:1).

ఈ వచనము మన గౌరవముతో అప్పగించుకొనుటను అనుదిన జీవితముతో అనుసంధానము చేస్తుంది. మనలను మనము సజీవయాగములుగా సమర్పించుకొనుచుండగానే, మన కూడిక, లేక ఆరాధన దేవునికి అంగీకార యోగ్యమవుతుంది. సంఘము తరచుగా కలుసుకొనుట ప్రాముఖ్యమైయున్నది; ఆదిమ సంఘము సామూహిక ఆరాధనకు విలువనిచ్చింది.[2] అయితే, ప్రజల కూడిక ముగిసిన తరువాత ఆరాధన అయిపోదు. నిజమైన ఆరాధన జీవితములోని ప్రతి భాగము మీద ప్రభావము చూపుతుంది.

ఆరాధన అనగా స్తోత్రము

స్తుతి అను పదము కీర్తనలు గ్రంథములో 130 కంటే ఎక్కువసార్లు ఉపయోగించబడింది. మూడు హెబ్రీ పదములు “స్తుతి” అని అనువదించబడతాయి. మొదటి పదము, హలాల్, వేడుక చేసుకొనుట లేక అతిశయపడుట అను అర్థమునిస్తుంది. రెండవ పదము, యాదా అనగా స్తుతించుట, కృతజ్ఞతలు తెలుపుట, లేక ఒప్పుకొనుట. మూడవ పదము, జమర అనగా “పాడుట” లేక “స్తోత్రములు పాడుట” అని అర్థము.

ఈ పదములు, ముఖ్యముగా హలాల్ అను పదము ఆరాధనలోని ఆనందమును సూచిస్తాయి. ఒక వ్యక్తి ఎదుట అతిశయపడుట కొరకు ఒక యూదుడు హలాల్ అను పదమును ఉపయోగిస్తాడు. ఆరాధనలో, మనము దేవుని గూర్చి అతిశయములు పలుకుతాము; ఆరాధనలో, ఆయన మంచితనమును మనము వేడుకచేసుకుంటాము; ఆరాధనలో, మనము దేవుని మంచితనములో ఆనందిస్తాము.

నిజమైన ఆరాధకులు దేవుని గౌరవిస్తారు; అయితే, నిజమైన ఆరాధన దేవుని వేడుకగా జరుపుకుంటుంది కూడ! ఆరాధనలో, మనము దేవుని మంచితనమునందు ఆనందిస్తాము. 6వ పాఠములో, ఆరాధనలో సంగీతము యొక్క భూమికను గూర్చి మనము అధ్యయనం చేస్తాము. ఆరాధనలో సంగీతం ప్రాముఖ్యమైయున్నది, ఎందుకంటే వేడుకలో మరియు దేవుని స్తుతించుటలో సంఘము పాలుపంచుకొనుటకు అది ఒక మార్గమును అందిస్తుంది.

ఆరాధన అనగా సహవాసము

ఆరాధన అంటే దేవునికి మానవునికి మధ్య సహవాసము. ఆరాధనలో అరాధకుల మధ్య సహవాసము కూడా భాగమైయుంటుంది. సహవాసము లేక పంచుకొనుట అను అర్థముగల గ్రీకు పదమైన కోయినోనియా ఆరాధనా నేపథ్యములో తరచుగా ఉపయోగించబడుతుంది. క్రైస్తవులు అపొస్తలుల బోధ మరియు సహవాసమునకు కోయినోనియా, రొట్టె విరచుట మరియు ప్రార్థనలకు (అపొస్తలుల కార్యములు 2:42) తమను తాము అంకితం చేసుకున్నారు. విశ్వాసులముగా మనము దేవుని కుమారుడైన, మన ప్రభువైన యేసు క్రీస్తుతో సహవాసములోనికి (కోయినోనియా) పిలువబడ్డాము (1 కొరింథీయులకు 1:9).

సహవాసముగా ఆరాధనను అర్థము చేసుకొనుటకు మాదిరి త్రిత్వము. త్రిత్వములోని సభ్యులు ఒకరితో ఒకరు సహవాసములో ఉన్న విధముగానే, మనము కూడా ఆరాధనలో దేవునితో మరియు ఒకరితో ఒకరము సంబంధము కలిగియున్నాము. భూలోక ఆరాధనను నిత్య త్రిత్వముతో అనుసంధానము చేయు ఆశీర్వచనములో, పౌలు ఇలా వ్రాశాడు, “ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక” (2 కొరింథీయులకు 13:14). మనము క్రీస్తుతో ఐక్యముగా ఉన్న విధముగానే, ఆత్మ ద్వారా మనము తండ్రితో కుమారుని యొక్క సహవాసములో పాలుపంచుకుంటాము. [3] ఆరాధనలో, మనము త్రిత్వములోని ఘనమైన సహవాసమును అనుభవిస్తాము. మన భూలోక ఆరాధన త్రిత్వములోగల పరిపూర్ణమైన సహవాసము యొక్క మాదిరిని అనుసరిస్తుంది.

త్రిత్వ ఆరాధన క్రియలుగాక కృప యొక్క అనుభవము అయ్యున్నది. మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆరాధన సాధ్యము చేయబడింది. ఆయన మన అయోగ్యమైన ఆరాధనను తీసుకొని, దానిని శుద్ధిచేసి, తండ్రి ఎదుట మచ్చయైనను, ముడత అయినను లేకుండా అందిస్తాడు. యేసు కొరకు మన ఆరాధనను తండ్రి స్వీకరిస్తాడు, మరియు ఆత్మయందు ఆయన జీవితములో మనము యేసుతో ఐక్యమైయున్నాము.

మన ఆరాధన దేవుని కటాక్షమును సంపాదిస్తుంది కాబట్టి మనము ఆరాధించుట లేదుగాని, దేవునితో సహవాసములో పాలుపంచుకొనుటకు కృప ద్వారా మనకు ధన్యత ఇవ్వబడినది.

నేడు మన పరిమిత కోయినోనియా (ఆరాధనలో దేవునితో సహవాసము మరియు ఇతర విశ్వాసులతో సహవాసము) పరలోకములో ఆరాధనకు ముందురుచిగా ఉన్నది. ఆరాధకులముగా, భూమి మీద ఆరాధన నిత్య ఆరాధనకు అభ్యాసముగా ఉన్నది కాబట్టి మనము మన తోటి విశ్వాసులతో సహవాసమును కోరతాము.

ఆరాధనలో జీవితమంతా భాగమైయున్నది

క్రొత్త నిబంధనలో ఆరాధన కొరకు ఉపయోగించబడిన మరియొక పదము కొన్నిసార్లు “భక్తి” అని అనువదించబడుతుంది: [4]

ఎవ డైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనినయెడల వాని భక్తి వ్యర్థమే. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా–దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే (యాకోబు 1:26-27).

ఆరాధన కేవలం ఆదివారము ఉదయముణ జరుగునది మాత్రమే కాదు అని ఈ మాట చూపుతుంది. బైబిలు ఆరాధనలో జీవితము అంతా భాగమైయున్నది. ఆరాధన కూడిక ఆరాధన యొక్క గురిగల వ్యక్తీకరణ అయ్యున్నది, కానీ ఆరాధనా కూడిక దానంతట అదే చాలాదు. మనము ఆరాధనా జీవనశైలిని కలిగియుండాలి. మన వారపు సామూహిక ఆరాధన మన అనుదిన జీవితములో కనిపించాలి.

నిజమైన ఆరాధన దేవునికి అనుదిన సమర్పణలో కనిపిస్తుంది. నేను ఆదివారము నాడు స్తుతి పాటలు పడుతూ, సోమవారము నా నాలుకను కాయుటలో విఫలమైతే, నా ఆరాధన అసంపూర్ణమైనది. పవిత్రమైన మరియు నిష్కళంకమైన ఆరాధనలో ఆచరణాత్మక సేవ (అనాధలు మరియు విధవరాండ్రను పరామర్శించుట) మరియు అనుదిన విధేయత (లోకములోని మలినము తాకకుండా ఒక వ్యక్తి తనను తాను భద్రపరచుకొనుట) భాగమైయున్నవి.

యెషయా 6వ అధ్యాయములో, దేవుడు తన సింహాసనము మీద కూర్చొనియున్న దర్శనమును ప్రవక్త చూశాడు. ఒక ప్రవక్తగా యెషయా యొక్క సేవ ఈ అనుభవము ద్వారా మార్పుచెందింది. దేవుడు ఇలా అడుగుటను యెషయా విన్నాడు, “ నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను–చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా” (యెషయా 6:8). నిజమైన ఆరాధన మన జీవితమును మార్చుతుంది మరియు మనలను ఆశగల ప్రభావవంతమైన దేవుని సేవకులనుగా చేస్తుంది.

► మలాకీ 1:6-9, 1 సమూయేలు 13:8-14, లేవీయకాండము 10:1-3, మరియు అపొస్తలుల కార్యములు 5:1-11లను చదవండి. ఆరాధనను గూర్చి ఈ లేఖనములు ఏమి బోధిస్తాయి?


[1]హెబ్రీ పదము షఖః, ఇది “ఆరాధన,” “సాష్టాంగపడుట,” “క్రిందపడుట,” లేక “గౌరవము” అని అనువదించబడుతుంది. గ్రీకు పదము ప్రోస్కునియో¸ ఇది క్రొత్త నిబంధనలో “ఆరాధన” లేక “సాష్టాంగపడుట” అని అనువదించబడింది.
[2]హెబ్రీయులకు 10:25 వంటి వాక్యభాగములలో సామూహిక ఆరాధన ఆజ్ఞాపించబడింది. అపొస్తలుల కార్యములు 2:46-47 వంటి వాక్యభాగములలో సామూహిక ఆరాధన ఊహించబడింది.
[3]James B. Torrance, Worship, Community, and the Triune God of Grace (Downers Grove: InterVarsity Press, 1996), 20-21
[4]గ్రీకు పదము సాధారణంగా ఆరాధనలోని బాహ్య విషయములను సూచిస్తుంది: అపొస్తలుల కార్యములు 26:5, కొలొస్సయులకు 2:18; మరియు యాకోబు 1:26-27.

ఆరాధన ఎందుకు ప్రాముఖ్యమైయున్నది?

ఏ. డబ్ల్యు టోజర్ ఆరాధనను ఆధునిక సంఘములో “కనిపించని వజ్రం” అని పిలచాడు. మనకు ప్రసంగం ఎలా చేయాలో తెలుసు, సువార్త ప్రకటించుట తెలుసు, సహవాసము చేయుట తెలుసు అని అతడు అన్నాడు. అయితే, మన బలములన్నిటి మధ్య, మనము చాలాసార్లు ఆరాధన చేయుటలో విఫలమవుతాము. మనము ప్రసంగీకుడు ప్రసంగించుటను చూస్తాము; మనము క్వయర్ స్తుతి ఆరాధన బృందం, లేక సోలో పాటలను వింటాం; కానుకల సమయములో ధనమును ఇస్తాం. కాని నిజమైన ఆరాధన చేయు విషయములో మనము చాలాసార్లు విఫలమవుతాము; నిజమైన ఆరాధనకు ప్రత్యామ్నాయముగా కార్యకలాపాలకు అనుమతినిస్తాం.

ఆరాధన దేవునికి ప్రాముఖ్యమైయున్నది కాబట్టి మనకు ప్రాముఖ్యమైయుండాలి.

► దేవుడు ఆరాధనకు ఇచ్చు ప్రాముఖ్యతను చూచుటకు నిర్గమకాండము 20:1-5ను చదవండి.

మొదటి రెండు ఆజ్ఞలు ఆరాధనకు సంబంధించినవి. మొదటి ఆజ్ఞ మనము ఆరాధించువానిని గూర్చి చెబుతుంది. “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” (నిర్గమకాండము 20:3). రెండవ ఆజ్ఞ ఎలా ఆరాధన చేయాలో చెబుతుంది. “పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు” (నిర్గమకాండము 20:4). తరువాత నిర్గమకాండము 20వ అధ్యాయము యొక్క చివరి వచనములలో, దేవుడు ఆరాధనకు ఆధారమైనవానిని గూర్చి మాట్లాడుతున్నాడు. వారు బలిపీఠములు ఎలా కట్టాలో, గౌరవనీయమైన రీతిలో బలిపీఠమును ఎలా ఆశ్రయించాలో ఈ వచనములు ఇశ్రాయేలుకు బోధిస్తాయి.

► నిర్గమకాండము 20:23-26ను చదవండి. ఆరాధన దేవునికి ప్రాముఖ్యమైయున్నది!

ఆరాధన లేఖనములో కీలకమైన పాత్రను పోషిస్తుంది. నిర్గమకాండము మరియు లేవీయకాండము ఇశ్రాయేలు యొక్క ఆరాధనకు విశేషమైన సూచనలను ఇస్తాయి. కీర్తనలు ఆరాధన కొరకు ఒక పాటల పుస్తకమును అందిస్తాయి. సువార్తలలో, యేసును ఆరాధించుటకు ప్రజలు పడివచ్చుటను మనము చూస్తాము.

► మత్తయి 2:11, మత్తయి 8:2, మత్తయి 9:18, మత్తయి 14:33, మత్తయి 15:25, మత్తయి 28:17ను చదవండి.

అపొస్తలుల కార్యములలో, సంఘము ఆరాధన కొరకు కూడుకుంటుంది. [1] తన పత్రికలలో, సంఘములోని ఆరాధనా ఆచారములను గూర్చి పౌలు మాట్లాడుతున్నాడు (1 కొరింథీయులకు 11 మరియు 1 తిమోతికి 2). దేవుని సింహాసనమందు ఇప్పటికే జరుగుతున్న ఆరాధనను గూర్చి అవగాహనను పొందునట్లు పరలోకములోనికి చూచుటకు ప్రకటన గ్రంథము మనకు అవకాశమునిస్తుంది (ప్రకటన గ్రంధం 4-5). ఆరాధన దేవునికి ప్రాముఖ్యమైయున్నది.

ఆరాధనలో మనము దేవుని చూస్తాము కాబట్టి ఆరాధన ప్రాముఖ్యమైయున్నది

► యెషయా 6:1-8ని చదవండి. దేవాలయములో యెషయా యొక్క అనుభవమును చర్చించండి.

యెషయా 6వ అధ్యాయము ఆరాధనకు ఒక ప్రాముఖ్యమైన బైబిలు చిత్రమును అందిస్తుంది. ఆరాధనలో మనము దేవుని చూస్తాము అని అది చెబుతుంది. దేవాలయములో, ప్రభువు హెచ్చించబడియుండుటను యెషయా చూశాడు.

ఈ సత్యము లేఖనము అంతటిలో పునరావృతం చేయబడింది. ప్రభువు దినమున అతడు ఆరాధించుచుండగా, యోహాను తన పరలోక దర్శనములను చూశాడు (ప్రకటన గ్రంధం 1:10). పౌలు సీలలు ప్రార్థన మరియు పాటలతో ఆరాధించినప్పుడు, దేవుడు తన శక్తిని బయలుపరచాడు (అపొస్తలుల కార్యములు 16:25-26). దావీదు శ్రమలను అనుభవించాడు కాబట్టి ఇలా కేకలు వేశాడు, “నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి?” (కీర్తనలు 22:1). తన శ్రమల మధ్యలో, ఆరాధన మరియు స్తుతుల ద్వారా దావీదు దేవుని చూశాడు; “నీవు ఇశ్రాయేలుచేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు” (కీర్తనలు 22:3). ఆరాధనలో, మనము దేవుని చూస్తాము.

ఆరాధనలో మనలను మనము చూచుకొని మార్పుచెందుతాము కాబట్టి ఆరాధన ప్రాముఖ్యమైయున్నది

దేవాలయములో, యెషయా ఆసీనుడైయున్న ప్రభువును మాత్రమే చూడలేదుగాని, తనను తాను చూచుకున్నాడు. యెషయా ఆయన సింహాసనము మీద కూర్చొనియున్న దేవుని చూచినప్పుడు, ఇలా అరచాడు, “అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను...” (యెషయా 6:5). నిజమైన ఆరాధన దేవుడు చూచునట్లు మనలను మనము చూచుకొనుటకు అవకాశం ఇస్తుంది.

ఇందువలనే సాంప్రదాయికముగా సాహిత్యములలో ఒప్పుకోలు ప్రార్థనలు చేర్చబడినవి. ఒప్పుకోలు ప్రార్థన ఇలా చెప్పదు, “మేము దేవుని ధర్మశాస్త్రమునకు విరోధముగా తిరుగుబాటు చేసి, మనఃపూర్వకముగా పాపము చేసితిమి.” ఒప్పుకోలు ప్రార్థన దీనిని గుర్తిస్తుంది, “పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిపూర్ణ పవిత్రతను పరిగణించినప్పుడు అత్యంత శుద్ధమైన మానవ హృదయము కూడా అపవిత్రమైనదే. మనము తరచుగా దేవుని కృప యొక్క అవసరతలో నిలిచియుంటాము.”

ఆరాధనలో, పరిశుద్ధుడైన దేవుని కన్నుల ద్వారా మనలను మనము చూచుకుంటాము. ఆరాధనను ప్రక్కన పెడితే, ఈ దృశ్యం భయానకమైన అనుభవముగా ఉంటుంది. అయితే, మనము ఇప్పటికే దేవుని చూశాము కాబట్టి, శుద్ధిపొందాను కాబట్టి, ఖండించబడము. మనము దేవుని మరియు ఆయన కృపను చూచియున్నాము కాబట్టి, మనలను మనము నిజాయితీగా చూచుకుంటాము, ఆయన మనకు అవసరమని ఒప్పుకుంటాము, మన జీవితములలో ఆయన కృపను కోరతాము.

ఆరాధన మనలను బయలుపరుస్తుంది, కాని అది మనలను కనుగొనిన విధముగానే విడిచిపెట్టదు. దేవుని పవిత్రత వెలుగులో, యెషయా తాను అపవిత్రుడను అని చూడగలిగాడు. అయితే, నిస్సహాయతను కలిగించుటకు బదులుగా, ఆరాధన మార్పును కలిగించింది.

అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి –ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను (యెషయా 6:6-7).

పరిశుద్ధుడైన దేవుని ఎదుర్కొనుట ద్వారా యెషయా మార్పుచెందాడు.

నిజమైన ఆరాధన ఆరాధికులను మార్చుతుంది – దేవాలయములో యెషయా, బావి యొద్ద సమరయ స్త్రీ, రూపాంతర కొండ మీద శిష్యులు. దేవుని కలుసుకొనుట ఆరాధకులను మార్చివేస్తుంది.

ఆరాధనలో మనము మన లోకమును చూస్తాము కాబట్టి అది ప్రాముఖ్యమైయున్నది

[2]ఆరాధనలో, యెషయా దేవుని చూశాడు; తనను తాను చూచుకున్నాడు; లోకము యొక్క అవసరతలను చూశాడు. “అపవిత్రమైన పెదవులుగల జనులమధ్యను నివసించువాడను” (యెషయా 6:5). దీనికి స్పందనగా, అతడు ఇలా అన్నాడు, “నేనున్నాను, నన్ను పంపుము” (యెషయా 6:8). ఆరాధనలో మనము అవసరతలో ఉన్న లోకమునకు ప్రభావవంతమైన సేవ చేయుటకు సిద్ధపరచబడతాము.

ఇంతకుముందు, నిజమైన ఆరాధన జీవితమంతటి మీద ప్రభావము చూపుతుంది అని మనము చూశాము. కొన్ని సంఘములు ఆరాధన మరియు సువార్త ప్రకటనను వేరుచేస్తాయి. వారు ఇలా అంటారు, “మా సంఘము యొక్క దృష్టి సువార్త ప్రకటన మీద ఉన్నది. ఇతర సంఘములు ఆఆరాధన మీద దృష్టిపెట్టవచ్చు.” లేక ఇలా అంటారు, “ఆరాధన మా లక్ష్యం. సువార్త ప్రకటన మరియు మిషన్ ను ఇతరులు చేయండి.” ఇది ఆరాధనను అపార్థము చేసుకున్నట్లు చూపుతుంది. ఆరాధనలో, మన లోకము యొక్క అవసరతలను మనకు చూపుటకు దేవునికి అనుమతినిస్తాము. నిజమైన ఆరాధన సువార్త ప్రకటనకు దారితీస్తుంది.

నిజమైన ఆరాధన యెషయా యొక్క అవసరతను బయలుపరచింది – మరియు అతడు ఆరాధన ద్వారా మార్పుచెందాడు. నిజమైన ఆరాధన యెషయా నివసించుచున్న లోకములోని అవసరతను బయలుపరచింది – మరియు అతడు లోకమును మార్చుటకు తనను తాను అప్పగించుకున్నాడు. ఆరాధనలో, మన లోకమును సేవించుటకు ఒక ఆసక్తిని మనము పొందుకుంటాము. నిజమైన ఆరాధనకు అవసరమైన జవాబు, “నేనున్నాను! నన్ను పంపుము.”

మిషనరీలు కావాలని కోరువారిని ఆస్వాల్డ్ ఛాంబర్స్ హెచ్చరించాడు, “మీరు అనుదిన సందర్భములలో ఆరాధించకపోతే, దేవుని కార్యములో పాలుపంచుకొనునప్పుడు, మీకు మీరు నిరుపయోగముగా మారుట మాత్రమేగాక, మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఆటంకముగా మారిపోతారు.”[3]

ప్రభావవంతమైన పరిచర్యకు సిద్ధపాటుగా ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ఛాంబర్స్ గుర్తించాడు. ఆరాధనలో, దేవుడు మన చుట్టూ ఉన్న లోకము యొక్క అవసరతలను బయలుపరచి, ఆ అవసరతలను తీర్చుటకు మనలను సిద్ధపరుస్తాడు.

ఆరాధన ప్రాముఖ్యమైయున్నది, ఎందుకంటే ఆరాధించుటకు విఫలమగుట మనలను దేవుని నుండి దూరము చేస్తుంది

► రోమా 1:18-25ను చదవండి. అబద్ధ ఆరాధన మరియు పాపము మధ్య ఉన్న సంబంధము ఏమిటి?

రోమా పత్రిక యొక్క ఆరంభములో, దేవుని ఎదుట మానవుడు ఖండించబడినవానిగా ఎందుకు నిలువబడియున్నాడో పౌలు చూపుతాడు. మానవుని యొక్క పతనమైన స్థితి నిజమైన దేవుని ఆరాధించుటకు నిరాకరించుటకు ఫలితమని అతడు చూపుతాడు. రోమా 1:21-25లో పౌలు ఇలా వర్ణిస్తాడు:

1. వారు దేవుని ఆరాధించలేదు. “మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు…” (రోమా 1:21). “అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి” (రోమా 1:25).

2. ఫలితంగా, “...తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి” (రోమా 1:21-23).

3. దీనికి తీర్పుగా, “ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను” (రోమా 1:24)

మానవాళి మూర్ఖత్వము, భ్రష్టత్వము, మరియు వ్యామోహములోనికి పడిపోవుట, దేవుని ఆరాధించుటకు ప్రజలు నిరాకరించుటకు ఫలితమైయున్నదని పౌలు చూపాడు. వారు దేవుని ఆరాధించలేదు; వారు సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించారు మరియు పూజించారు.

ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు. క్రైస్తవులు దేవుని ఆరాధిస్తారు. ముస్లింలు అల్లాహ్ ను ఆరాధిస్తారు. నాస్తికులు తమ జ్ఞానమును ఆరాధిస్తారు. మనము సృష్టికర్తను ఆరాధించుటకు నిరాకరిస్తే, సృష్టిని ఆరాధిస్తాము.

ఆరాధన ప్రాముఖ్యమైయున్నది. నిజమైన దేవుని యొక్క నిజమైన ఆరాధన మనలను ఆయన స్వరూపములోనికి మార్చుతుంది. అబద్ధ దేవతను ఆరాధించుట మనలను ఆ దేవత రూపములోనికి మార్చుతుంది. మనము ఎవరిని ఆరాదిస్తామో వారి వలె మారిపోతాము.


[1]ఆరంభ క్రైస్తవులు దేవాలయము మరియు సమాజ మందిరములో ఆరాధన చేయుటను కొనసాగించారు (అపొస్తలుల కార్యములు 2:46-47, అపొ.3:1-11, అపొ.5:12, 21, 42). అంతేగాక, ప్రార్థన, బోధనా, మరియు సహవాసము కొరకు క్రైస్తవులు గృహములలో కూడుకునేవారు. ఇవన్నీ ఆరాధనలోని అంశములైయున్నవి (అపొస్తలుల కార్యములు 2:46-47, అపొస్తలుల కార్యములు 4:31, అపొస్తలుల కార్యములు 5:42).
[2]

“ఆరాధించుటకు రండి – సేవించుటకు వెళ్లండి”

- సంఘ ద్వారము పైభాగములో వ్రాయబడిన మాటలు

[3]Oswald Chambers, My Utmost for His Highest, (సెప్టెంబర్ 10 ప్రవేశం). https://utmost.org/missionary-weapons-1/ నుండి జూలై 21, 2020 న తిరిగి పొందబడింది.

ఆరాధన యొక్క మూడు లక్ష్యములు

మర్వ డాన్ నిజమైన ఆరాధన యొక్క మూడు లక్ష్యములను గుర్తించాడు. [1] ఆరాధనలో, మనము:

(1) ఆరాధనలో, మనము దేవుని కలుసుకుంటాము.

మనలను దేవుని యొద్దకు నడిపించని ఏ ఆరాధన అయినా, నిజమైన ఆరాధన కాదు. అనగా ప్రతి ఆరాధనా కూడిక భావనాత్మకముగా లేక నాటకీయముగా ఉండాలని కాదు. అలాగే ప్రతి కూడికకు ఆరాధన అనునది ఆరంభ అంశముగా ఉండాలని కూడా కాదు. అయితే ప్రతి కూడికలో, మనలను మనము దేవుని సన్నిధిలో కనుగొనాలి. అది ప్రసంగములో నేర్చుకున్న సత్యము ద్వారా కావచ్చుల దేవుని వాక్యమును అధ్యయనము చేయుట ద్వారా కావచ్చు; దేవుని మహిమపరచు పాట ద్వారా కావచ్చు; దేవునితో మన నడకలో నూతన శక్తిని పొందుకొను ప్రార్థనా సమయలో కావచ్చు. ఏదో ఒక విధముగా, ప్రతి కూడిక మనము దేవుని కలుసుకొనునట్లు చేయాలి.

(2) ఆరాధనలో, మనము క్రైస్తవ ప్రవర్తనను అలవరచుకుంటాము.

ఆరాధనలో, మనలను మనము చూచుకొని, మార్పుచెందుతాము. ఆరాధనలో, మన క్రైస్తవ ప్రవర్తనను రూపుదిద్దు సత్యములను నేర్చుకుంటాము. మనము దేవుని ఆరాధించుచుండగా, మన స్వభావము మరి ఎక్కువగా ఆయన స్వరూపములోనికి మార్చబడుతుంది. మనము ఆరాధించు విధముగా మనము మార్పుచెందుతాము.

(3) ఆరాధనలో, మనము క్రైస్తవ సమాజమును నిర్మిస్తాము.

ఆరాధనలో, మన చుట్టూ ఉన్న లోకమును మనము చూసి, లోకములోని అవసరతలను తీర్చుటకు మనలను మనము సమర్పించుకుంటాము. మనం ఇలా చేయుచుండగా, సంఘము కట్టబడుతుంది, శిరస్సుయైన క్రీస్తు వలె ప్రతి విధముగా విశ్వాసులు ఎదుగుతారు (ఎఫెసీయులకు 4:15). నిజమైన ఆరాధన నిజమైన క్రైస్తవ సమాజమును కట్టుటకు సాధనమైయున్నది.


[1]Marva Dawn, Reaching Out Without Dumbing Down (Grand Rapids: Eerdmans, 1995)

దేవునికి ఏ విధమైన ఆరాధన అంగీకారయోగ్యమైనది?

► ఏ విధమైన ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడని మీరు భావించుచున్నారు?

నిజమైన ఆరాధకులు ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారని యేసు సమరయ స్త్రీకి చెప్పాడు (యోహాను 4:23-24). దేవునికి అంగీకారమైన నిజమైన ఆరాధన ఉన్నది; దేవునికి అంగీకారము కాని అబద్ధ ఆరాధన కూడా ఉన్నదని ఇది సూచిస్తుంది.[1]

ఆరాధనను నడిపించువారు చాలాసార్లు ఇలా అడుగుతారు, “మా ఆరాధన సంఘమును కదిలించిందా? ప్రజలు ఆస్వాదించు విధానములో మా శైలి ఉన్నదా?” దీనికంటే ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఇవి అని లేఖనములు చూపుతాయి, “మా ఆరాధన దేవుని మహిమపరచిందా? ఆయన కోరు విధముగా మేము దేవుని ఆరాధించామా? మా ఆరాధనను ఆయన అంగీకరిస్తాడా?”

దేవుడు తిరస్కరించు ఆరాధన

అవివేకముతో చేయు ఆరాధనను దేవుడు స్వీకరించడు.

ఆమె ఎవరిని ఆరాధించినదో సమరయ స్త్రీకి తెలియదు (యోహాను 4:22). ఏథెన్సులో, తెలియబడని దేవుని ఆరాధించిన ప్రజలను పౌలు చూశాడు (అపొస్తలుల కార్యములు 17:23).

2వ పాఠములో, మనము ఆరాధించు దేవుని యొక్క స్వభావమును గూర్చి మనము అధ్యయనం చేస్తాము. మనకు దేవుడు నిజముగా తెలియనప్పుడు, మనము అవివేకముగా ఆరాధిస్తాము; అది తెలియబడని దేవుని ఆరాధన అవుతుంది. మనము సాహిత్యములో ఉన్న విషయములను పాటిస్తాము,[2] కాని మన ఆరాధన తెలియబడని దేవుని ఆరాధన అవుతుంది. ఆరాధన దేవుని యొక్క స్వభావమును ఆరాధకునికి బయలుపరచాలి. దేవుని గుణములను గూర్చి మాట్లాడు పాటలను మనము పాడాలి; దేవుని సత్యమును మాట్లాడు లేఖనములను మనము చదవాలి; దేవుని స్వభావమును బయలుపరచు ప్రసంగములను మనము చేయాలి. తెలియబడని దేవుని ఆరాధనను మనము అంగీకరించకూడదు.

విగ్రహ్రాధిక ఆరాధనను దేవుడు అంగీకరించడు.

జీవితములోని ఏ అంశములోనైనా ఉన్నతమైన అధికారముగా దేవుకి చెందిన సరియైన స్థానమును తీసుకొను ప్రతిది విగ్రహము అవుతుంది. లోకములోని కొన్ని చోట్ల, విగ్రహములు అన్య దేవతల యొక్క బొమ్మలు. లోకములోని మరికొన్ని చోట్ల, ఉద్యోగములు, బ్యాంకు ఖాతాలు, ఇండ్లు, మరియు వినోదం విగ్రహములు. మన జీవితములో దేవునికి చెందవలసిన స్థానము తీసుకొను ప్రతిది విగ్రహమే. ఆదివారము మనము సంఘమునకు వెళ్తూ, మన అనుదిన జీవితములలో అంతిమ అధికారముగా ఉండుటకు మరొకదానికి అనుమతి ఇస్తే అది విగ్రహమవుతుంది.

దోషపూరితమైన ఆరాధనను దేవుడు స్వీకరించడు.

► దోషపూరితమైన ఆరాధనకు కొన్ని ఉదాహరణలు ఇవి.

ఇశ్రాయేలు యొక్క ఆరాధన దేవునికి కోపము పుట్టిస్తుంది అని ప్రవక్తయైన మలాకీ హెచ్చరించాడు. “మేము దేవునికి ఎలా కోపము పుట్టించితిమి” అని వారు అడుగగా, మలాకీ ఇలా స్పందించాడు,

“గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించినయెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చినయెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు” (మలాకీ 1:8).

వారి రాష్ట్ర గవర్నర్ కు బహుమతిగా వారు ఎన్నడును ఒక కుంటి జంతువును తీసుకొనివెళ్లరు, కాని సర్వసృష్టికి సర్వాధికారియైన దేవుని యొద్ద అర్పించుటకు మాత్రం కుంటి జంతువులను తీసుకొనివచ్చారు.

దెవుదూ హృదయమును చూచువాడు కాబట్టి ఆరాధన యొక్క బాహ్య విషయములు ప్రాముఖ్యమైనవి కావని కొందరు నమ్ముతారు. దేవుడు హృదయమును చూచువాడు అను మాట నిజమే. అయితే, ఆరాధన యొక్క బాహ్య విషయములు దేవునికి ప్రాముఖ్యమైయున్నవి అని లేఖనము అంతా స్పష్టము చేస్తుంది. ఆరాధన కొరకు దేవుడిచ్చిన అర్హతలు నిర్గమకాండము మరియు లేవీయకాండములో వివరించబడియున్నవి. మందిరమును గూర్చి ఖచ్చితమైన హెచ్చరికలు ఇవ్వబడినవి. యాజకులు ధరించవలసిన వస్త్రములను గూర్చి దేవుడు వివరముగా హెచ్చరించాడు. నిర్గమకాండము 39-40లో, “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు” అను మాట ఇశ్రాయేలు యొక్క విధేయతను చూపుటకు 13 సార్లు పునరావృతమవుతుంది. ఆరాధనలోని విశేషతల మీద దేవుడు దృష్టిపెట్టాడు. ఇశ్రాయేలు ఉత్తమమైన దానిని ఇవ్వాలని దేవుడు కోరాడు.

ఉత్తమమైనదాని కంటే తక్కువ మనము అర్పించినప్పుడు దేవునికి దోషపూరితమైన ఆరాధనను అర్పిస్తాము. ఇప్పుడు మనము దేవునికి జంతువుల బలులను తీసుకొనిరానప్పటికీ, ఈ నియమములు ఇప్పటికీ ప్రాముఖ్యమైయున్నవి. మలాకీలో అడుగబడిన ప్రశ్నలు నేడు మన ఆరాధనను గూర్చి మనము అడగవలసిన ప్రశ్నలను సూచిస్తాయి.

  • పాస్టర్లు: “ఒకవేళ ప్రజలలో గవర్నర్ గారు ఉంటే నేను ప్రసంగమును ఇంకా భిన్నముగా సిద్ధపరుస్తానా? నేను దేవునికి కుంటి అర్పణను అర్పించుచున్నానా?”

  • సంగీతకారులు: “ఒక ప్రసిద్ధిగాంచిన సంగీతకారుని ఎదుట నేను భిన్నముగా అభ్యసిస్తానా? నేను దేవునికి కుంటి అర్పణను అర్పించుచున్నానా?”

  • సామాన్య విశ్వాసులు: “ఒకవేళ దేశ అధ్యక్షుడు మాట్లాడుతుంటే నేను ప్రసంగమును ఇంకా జాగ్రత్తగా వింటానా? నేను దేవునికి కుంటి అర్పణను అర్పించుచున్నానా?”

దేవుడు అహంకారముతో కూడిన ఆరాధనను అంగీకరించడు.

మన ఉత్తమ అర్పణల కంటే తక్కువైన అర్పణలను దేవుడు స్వీకరించడు. అయితే, మనము నివారించవలసిన ఒక వ్యతిరేక అపాయము ఉన్నది. గర్వము మరియు అహంకార హృదయము అర్పించు అర్పణలను కూడా దేవుడు అంగీకరించడు. మనము ఉత్తమమైన దానిని దేవుని యొద్దకు అర్పించినప్పటికీ, మనము అర్పించు ఏదియు నిజముగా దేవునికి యోగ్యమైనది కాదు అని మనము గుర్తించాలి. మనము అర్పించు ఉత్తమమైన అర్పణ దేవుని యోగ్యతకు చిన్న గుర్తుంపు మాత్రమే. మనము దేవుని సన్నిధికి వినయముతో రావాలిగాని, గర్వము మరియు స్వాభిమాన వైఖరితో రాకూడదు.

దేవుడు అంగీకరించు ఆరాధన

దేవుడు ఆరాధనలోని ఈ గుణములను అంగీకరించకపోతే, ఆయన ఆరాధనలో దేనిని అంగీకరిస్తాడు?

యుక్తమైన ఆరాధన దేవుని మీద దృష్టిపెడుతుంది.

యెషయా 6 వలె, ప్రకటన 4వ అధ్యాయము కూడా పరలోక ద్వారమును తెరుస్తుంది. ప్రకటన గ్రంధం 4లో, ఆరాధకుల యొక్క దృష్టి సింహాసనము మీద కూర్చొనియున్నవాని మీద ఉన్నది. నిజమైన ఆరాధన దేవుని మీద దృష్టిపెడుతుంది. నిజమైన ఆరాధన ఆరాధనకు యోగ్యునిగా దేవుని మీద దృష్టిపెడుతుంది.

యుక్తమైన ఆరాధన దేవునికి చెందవలసిన మహిమను చెల్లిస్తుంది

కీర్తనలు 96:7-8 ఆరాధన యొక్క ఉద్దేశ్యమును తెలియజేస్తుంది:

జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమబలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసికొని ఆయన ఆవరణములలోనికి రండి.

ఆరాధన దేవునికి చెందవలసిన మహిమను ఇస్తుంది. మనము పాడు పాటలు, రేపు భావనలు, లేక వీక్షకుల నుండి మనము పొందు ప్రతిస్పందనతో నిమిత్తం లేకుండా, దేవునికి మహిమను చెల్లించని ఆరాధన దాని యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చుటలో విఫలమవుతుంది.

ఆరాధన యొక్క ఉద్దేశ్యము నా కొరకు ఆశీర్వాదముఉ సంపాదించుకొనుట కాదు; దేవునికి మహిమను మరియు ఘనతను చెల్లించుట ఆరాధన యొక్క ఉద్దేశ్యమైయున్నది. మనము ఆరాధించుచుండగా, మనము తరచుగా దీవించబడతాము – కాని మన ఆశీర్వాదము ఆరాధనకు హేతువుగా ఉండకూడదు. ఆరాధనకు హేతువు దేవుని ఘనపరచుట.

ఆరాధన యొక్క ఉద్దేశ్యమును అర్థము చేసుకొనుట ఆరాధనను గూర్చి మనము తరచుగా అడుగు ప్రశ్నను మార్చుతుంది. “నేటి ఆరాధనను నేను ఆనందించానా?” అని అడుగుటకు బదులుగా, “నేటి ఆరాధన దేవుని మహిమపరచిందా?” అని అడుగుతాము. ఆరాధన యొక్క ఉద్దేశ్యమును మనము మరింత ఉత్తమముగా అర్థము చేసుకొనుచుండగా, మనము మన గురిని స్వయము మీద నుండి దేవుని మీదికి మార్చుతాము.

యుక్తమైన ఆరాధన అనగా ఆత్మతోను సత్యముతోను ఆరాధన.

యోహాను 4లో సమరయ స్త్రీతో యేసు చేసిన సంభాషణలో, దేవుని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను అని ఆయన ఆమెకు చెప్పాడు (యోహాను 4:24). ఇది ఆరాధనకు సరియైన క్రమము.

సాధారణంగా మనము ఆరాధనా పద్ధతులను చర్చించునప్పుడు, మనము సంగీత శైలులను, సాహిత్య క్రమమును, మరియు ఇతర విధానములను చర్చిస్తాము. క్రొత్త నిబంధన సంఘములో ఆరాధనా అలవాట్లను గూర్చి విస్తారమైన వివరములు లేకపోవుట వలన కొందరు విసుగుచెందుతారు. క్రొత్త నిబంధన

  • వారు కీర్తనలు పాడారని మనకు తెలుసు. వారు ఏ ఆలాపనలు ఉపయోగించారో మనకు తెలియదు; వారు ఉపయోగించిన వాయిద్యములు మనకు తెలియదు; వారు ఏ క్రొత్త పాటలు పాడారో మనకు తెలియదు.

  • వారు ప్రార్థించారని మనకు తెలుసు. వారు బిగ్గరగా ప్రార్థించారో, చిన్న సమూహములలో ప్రార్థించారో, లేక ఒక వ్యక్తి ప్రార్థనలో నడిపించాడో మనకు తెలియదు. వారు వ్రాయబడిన ప్రార్థనలను (కీర్తనలు) ఉపయోగించారో లేక అప్పటికప్పుడే మాటల ద్వారా ప్రార్థించారో మనకు తెలియదు.

  • వారు ప్రసంగించారని మనకు తెలుసు. వారు ఎంత సేపు ప్రసంగించారో మనకు తెలియదు, వారు ఏ ప్రసంగ శైలిని ఉపయోగించారో, లేక ప్రతి కూడికలో ప్రసంగములు ఉండినవో లేదో మనకు తెలియదు.

క్రొత్త నిబంధన మరియు కొన్ని దశాబ్దముల తరువాత వ్రాయబడిన ఒక రచన మినహా, ఆదిమ సంఘ ఆరాధనా విధానమును గూర్చి మనకు పెద్ద సమాచారము లేదు.[3]

పండితులకు, ఈ సమాచార లేమి విసుగుపుట్టిస్తుంది. అయితే, మనము అత్యంత ప్రాముఖ్యమైనవి అని పరిగణించు విషయములను దేవుడు ప్రాముఖ్యమైనవిగా ఎంచడు అని ఇది మనకు చూపుతుంది! యేసు ఒక ఆరాధనా విధానమును చర్చించినప్పుడు, ఆయన రెండు విషయముల మీద దృష్టిపెట్టాడు: ఆత్మ మరియు సత్యము. నిజమైన ఆరాధనకు ఈ రెండు ప్రాముఖ్యమైన విషయములు.

ఆత్మతో ఆరాధన బహుశా మానవ ఆత్మను సూచిస్తుంది. ఆరాధన ఒక ఆలోచనలేని ఆచారముగా ఉండకూడదు; దానిలో ఆత్మ భాగమైయుండాలి. ఇదే నిజమైన ఆరాధన; అది మనస్సులో నుండి పుడుతుంది.

ఆత్మతో ఆరాధన?

1994లో, టొరంటోలోని విన్యార్డ్ సంఘములో ఒక ఉజ్జీవము వచ్చినప్పుడు ప్రజలు నవ్వారు, సింహముల వలె అరచారు, మరియు “కక్కుకున్నట్లు” శబ్దాలు చేశారు (భావనలను శుద్ధిచేసుకొనుటకు వాంతి చేసుకొను శబ్దాలు). “పవిత్రమైన నవ్వు” సమయములో, ప్రజలు మైకంలోనికి వెళ్లేవారు. అన్వేషకుల మనస్సులలో దేవుని వాక్యము లోతుగా పనిచేయుటకు అవకాశము ఇచ్చుట మీద దృష్టిపెట్టుటకు బదులు, “ది టొరంటో బ్లెస్సింగ్” కేవలం భావనాత్మక ప్రతిస్పందనను ఆశించింది. ఇది ఆత్మతో ఆరాధనా? ఇది నిజమైన ఆరాధనా?

సత్యముతో ఆరాధన బైబిలు బోధనకు అనుగుణంగా ఉంది. ఇది కేవలం మంచి భావన లేక భావనాత్మక ప్రతిస్పందన మాత్రమే కాదు. ఆరాధనా పాస్టర్లుగా మరియు నాయకులుగా, మన ఆరాధనలోని ప్రతి విషయమును, “ఇది నిజమైనదేనా?” అని ప్రశ్నిస్తూ విశ్లేషిస్తాము. మనము మాట్లాడు మాటలు, మనము పాడు మాటలు, మరియు మనము ప్రార్థించు మాటలు లేఖనమునకు అనుగుణంగా ఉండాలి. ఉట్టి మాటలతో దేవుడు మెప్పింపబడడు; ఆత్మతోను సత్యముతోను ఆరాధన కొరకు ఆయన వెదకుచున్నాడు (యోహాను 4:24).

సత్యముతో ఆరాధన?

ఆరాధనలో సంగీతము యొక్క ప్రాముఖ్యత ఏమిటో పాస్టర్ బిల్ కు తెలుసు. ఆయనకు పాత కీర్తనలంటే ఇష్టం, కాని ఆయన క్రొత్త పాటలను కూడా ఆహ్వానిస్తాడు. అనేక సంఘములలో ప్రఖ్యాతిగాంచిన ఒక పాట, విశ్వాసులు ఉద్దేశ్యపూర్వక పాపములో పడిపోయి తరువాత పునరుద్ధరణను కోరతారు అని బోధిస్తుంది. ఆ పాట విజయవంతమైన క్రైస్తవ జీవితమును వాగ్దానము చేయదు. ఆ పాటను వినిన తరువాత, బిల్ ఇలా అన్నాడు, “ఈ పాట లేఖనముల మీద ఆధారపడిలేదుగాని కేవలం పాట మాత్రమే. ప్రజలకు సంగీతం ఇష్టం; మాటలు అంత ప్రాముఖ్యమైనవి కావు.” ఇది సత్యముతో ఆరాధనా?


[1]ఈ భాగాములోని కొంత భాగము ఈ పుస్తకము నుండి సేకరించబడింది, David Jeremiah. Worship. (CA: Turning Point Outreach, 1995), 20-24.
[2]సాహిత్యము లేక లిటర్జి అనునది బహిరంగ ఆరాధనలో అనుసరించు ప్రణాళిక అయ్యున్నది. సాహిత్యము వ్రాయబడిణ సూచనలతో చాలా క్రమముగా ఉండవచ్చు. ఆరాధకుల కొరకు ఏ విధమైన వ్రాతపూర్వక సూచనలు లేకుండా అది అనధికారికముగా కూడా ఉండవచ్చు. ఈ కోర్సులో, “సాహిత్యము” లేక “లిటర్జి” అను పదము ప్రతి విధమైన ఆరాధనా ప్రణాళికను సూచిస్తుంది. కొందరు ప్రతి విధమైన సాహిత్యమును విమర్శిస్తారు, మరియు ప్రణాళికగల ఆరాధన నిజమైన ఆరాధన కాదు అని చెబుతారు. “సాహిత్యము” అను పదమును మనము చాలా సాధారణ భావనలో ఉపయోగిద్దాము. ప్రణాళిక గల ఆరాధన ఖాళీగా కూడా ఉండవచ్చు, లేక దేవుని సన్నిధితో నింపబడి కూడా ఉండవచ్చు.
[3]డిడాకే అనునది మొదటి శతాబ్దము చివరిలో లేక రెండవ శతాబ్దము ఆరంభములో వ్రాయబడినది. డిడాకే లో క్రైస్తవ నీతిశాస్త్రం, సంఘ ఆచారములు, మరియు సంఘ వ్యవస్థను గూర్చిన బోధనలు ఉన్నాయి.

ఆరాధన అపాయములు: నిజమైన ఆరాధనకు ప్రత్యామ్నాయాలు

యేసు నిజమైన ఆరాధనను గూర్చి మాట్లాడాడు. ఇది నిజమైన ఆరాధన అయితే, అబద్ధ ఆరాధన కూడా ఉంది. మార్టిన్ లూథర్ చాలా సార్లు ఒక జర్మన్ సామెతను చెప్పేవాడు, “దేవుడు సంఘమును కట్టిన ప్రతిచోట, ప్రక్కనే సాతాను ఒక చాపెల్ ను కడతాడు.” నిజమైన ఆరాధనకు అబద్ధ ఆలోచనలను ప్రత్యామ్నాయముగా కలిగియుండాలని మనలను ప్రోత్సహించుట సాతానుకు ఇష్టం. ఆరాధన మనము ఆరాధించు దేవుని కోరికలను అనుసరించుటకు బదులుగా సంస్కృతి యొక్క కోరికలను అనుసరించుటకు మనము చాలాసార్లు అనుమతిస్తాము. నిజమైన ఆరాధనకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఏవి?

మెక్ ఆరాధన

మెక్ ఆరాధన అనునది దేవుని సంతోషపరచుటకు బదులుగా వ్యక్తిగత సౌకర్యము మీద దృష్టిపెట్టునది. లోకములో ముప్పై ఐదు వెల మెక్ డొనాల్డ్స్ ఉన్నాయి. ప్రతి రోజు ఆరు లక్షల ఎనభై వేలమంది వినియోగదారులు మక్ డోనాల్డ్స్ లో తింటారు. దీనికి కారణం మక్ డోనాల్డ్స్ ఉత్తమమైన ఆహారమును ఇస్తుంది అని కాదు. దీనికి కారణం మక్ డోనాల్డ్స్ సౌకర్యవంతముగా, సులువుగా ఉంటుంది మరియు ఆహ్లాదకరమైన వాతావరణమును ఇస్తుంది. మెక్ ఆరాధనలో మన ముఖ్య దృష్టి సౌకర్యం, సులభం, మరియు వినోదం మీద ఉంటుంది.

మక్ డోనాల్డ్స్ మరియు మెక్ ఆరాధన రెండు సాఫల్యతను సంఖ్యల ద్వారా లెక్కిస్తాయి. “మూడు వేల కోట్ల కంటే ఎక్కువ మందికి సేవలు అందించాం” అని మక్ డోనాల్డ్స్ పొగడ్తలు పోతుంది. “గత సంవత్సరం 17 శాతం పెరిగాము.” దైవికతకు బదులుగా సంఖ్యలు సాఫల్యతకు కొలతగా నిర్థారించబడతాయి.

మెక్ ఆరాధకులకు కొన్ని కోరాల్సిన అవసరాలు ఉండవు. మెక్ ఆరాధన మంచి సంగీతమును, వినోదవంతమైన బోధకులను, మరియు ఆసక్తికరమైన ప్యాకేజ్ ను అందిస్తుంది – అంతా చాలా తక్కువ ఖర్చుతోనే. మెక్ ఆరాధన ప్రజలను ఆకర్షిస్తుంది, కాని ఆత్మీయ ఆహారము చాలాసార్లు ఖాళీగా ఉండి, ఆత్మీయ ఆరోగ్యమును పెంపొందించదు. ప్రజలను సువార్త వైపుకు ఆకర్షించుటకు ప్రయత్నించుట మంచిదే, కాని మెక్ ఆరాధన నిజమైన ఆరాధన కాదు.

మ్యూజియం ఆరాధన

మ్యూజియంలోని వాతావరణం మక్ డోనాల్డ్స్ కంటే భిన్నముగా ఉంటుంది. మ్యూజియంలో, సంప్రదాయమును భద్రపరచుట మీద ఎక్కువ ఉద్ఘాటన ఉంటుంది. అక్కడ ఉన్న వస్తువులను చూస్తూ ప్రజలు చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. ఎక్కువశాతం మ్యూజియంలు వ్యక్తిగత పాలుపంపులు మరియు సమర్పణను ఉద్ఘాటించవు. లౌవ్రే ఆర్ట్ మ్యూజియంలో మీరు వేసిన పెయింటింగ్ ను గోడ మీద పెట్టుటకు అనుమతి ఉండదు!

మ్యూజియం ఆరాధనలో, సంప్రదాయము మరియు పరంపర మీద ప్రాధమిక దృష్టి ఉంటుంది. సంఘము ఎల్లప్పుడూ పాడిన పాటలను మనము పడతాము. సంప్రదాయము పట్ల మనకున్న నిబద్ధతను బట్టి అతిశయపడతాము. అయితే దేవుడు ఆశించు వ్యక్తిగత సమర్పణను అస్సలు ఎదుర్కొనకుండానే ప్రజలు అనేక వారముల పాటు వచ్చుట సాధ్యమే. ప్రతి ఆదివారము సంఘమునకు వస్తూనే, ఎలాంటి జీవిత మార్పు లేకుండా ప్రదర్శించు వస్తువులను (ప్రసంగం, పాటలు, ప్రార్థనలు) చూచుట సాధ్యమే. మన స్వాస్థ్యముకు విలువనిచ్చుట మంచిదే, కాని మ్యూజియం ఆరాధన నిజమైన ఆరాధన కాదు.

తరగతిగది ఆరాధన

ఒక తరగతి గదిలో, బోధకుడు నియంత్రణ కలిగియుంటాడు. తరగతి ఏమి నేర్చుకోవాలో బోధకుడు నిర్ణయిస్తాడు. బోధకుడు బోధనలు చేస్తాడు; విద్యార్థులు విని, నోట్స్ తీసుకుంటారు. పాలుపంపులను బోధకుడు నియంత్రిస్తాడు.

తరగతి గది ఆరాధనలో, పాస్టర్ కేంద్ర స్థానమును కలిగియుంటాడు. కూడికలో ప్రసంగము కేంద్ర దృష్టిని కలిగియుంటుంది; మిగిలినదంతా తరువాత. సంఘము విని, నోట్స్ తీసుకొనుటకు మాత్రమే ఉన్నది. ఆరాధన ఒక జ్ఞానపూర్వక కార్యముగా చేయబడుతుంది. మన ఆరాధనలో సత్యమును తెలియజేయుటకు ప్రయత్నించుట మందిదే; మనము ఆరాధకులకు సత్యమును వివరించాలి, కాని తరగతి గది ఆరాధన నిజమైన ఆరాధన కాదు.

నిజమైన ఆరాధన

నిజమైన ఆరాధన దేవుని మీద దృష్టిపెడుతుంది. నిజమైన ఆరాధన ఇలా ప్రశ్నిస్తుంది, “దేవుడు ఏమి కోరుతున్నాడు?” నిజమైన ఆరాధన దేవుని కన్నుల నుండి నన్ను నేను చూచుకొనుటకు సహాయపడుతుంది – మరియు అది దేవుని ద్వారా మార్పుచెందుటకు ఇష్టపడని వ్యక్తికి అసౌకర్యమును కలిగిస్తుంది. నిజమైన ఆరాధన ఆయనను గూర్చినది. నిజమైన ఆరాధనలో సిలువ, త్యాగం, సమర్పణ ఉంటాయి. నిజమైన ఆరాధన ఆరాధకుని మార్చివేస్తుంది.

ముగింపు: మార్త యొక్క సాక్ష్యం

ఆరాధన ఎంత ప్రాముఖ్యమైయున్నది? మార్త యొక్క సాక్ష్యమును వినండి.

“నేను చాలా ఆచరణాత్మక వ్యక్తిని. ఒకరు ఇల్లు శుభ్రం చేయాలి, వంట చేయాలి, మరియు ఇంటి విషయములను పట్టించుకోవాలి. అది నా బలం; నాకు సేవ చేయు వరము ఉంది.

“బెతనియలో ఉన్న మా చిన్న గృహమును యేసు దర్శించిన రోజు నాకు జ్ఞాపకముంది. మా ఇంటికి అంత గొప్ప బోధకుడు వస్తున్నాడు అని నేను చాలా ఆందోళన చెందాను. అంతా చక్కగా ఉండాలని నేను కోరాను. లూకా తరువాత ఇలా వ్రాశాడు, ‘మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి...” (లూకా 10:40) అంతా చక్కగా ఉండాలని చూచుటలో నేను నిమగ్నమైపోయాను.

“నేను ఇంటిని గూర్చి పట్టించుకొనుచు నిమగ్నమైయున్న సమయములో, మరియ ప్రక్క గదిలో యేసు మాటలు వింటుంది. నాకు నచ్చలేదు; నాకు సహాయము కావాలి! అంతేగాక, ఆమె ఒక స్త్రీ; ఆమె బోధకుని దగ్గర నేర్చుకోనవసరము లేదు.

“నాకు ఎంత కోపం వచ్చింది అంటే నేను వెళ్లి ఇలా అన్నాను, ‘ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను.’ (లూకా 10:40) ఆయన జవాబును నేను ఎన్నడును మరచిపోలేను. యేసు నా వైపుకు చూసి తల ఊపాడు. ‘మార్తా, మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను...” (లూకా 10:41-42)

“యజమానుడు నాకేమి చెప్పుచున్నాడు? సేవ అవసరములేదని ఆయన చెప్పుటలేదు. మమ్మును దర్శించుటకు ముందే, యేసు మంచి సమరయుని ఉపమానము చెప్పాడు – సేవను గూర్చిన కథ (లూకా 10:25-37). సేవ అవసరము లేదని యేసు చెప్పుటలేదు; నన్ను ఆరాధించుటలో నుండి నన్ను సేవించుట ఉప్పొంగాలి అని ఆయన నాకు చెప్పాడు. ముఖ్యమైన విషయము ఆరాధన. నేను ఆరాధిస్తే, సేవ దానంతట అదే ప్రవహిస్తుంది; నేను ‘విచారము కలిగి తొందరపడను.’ (లూకా 10:41)

“ఆ రోజున, నేను ఒక జీవిత పాఠమును నేర్చుకున్నాను. అప్పటి నుండి నేను చేయు సేవ నా ఆరాధన కంటే ఎక్కువ ప్రాముఖ్యము కాలేదు. ఆ దినము నుండి, యేసు పాదముల యొద్ద మరియతో కలిసి సమయము గడిపాను; నేను ఆరాధించుటకు సమయము కేటాయించాను.”

చెకప్

“నేను ఉత్తమమైన ఆరాధకునిగా ఎలా కాగలను?” అని మిమ్మును మీరు పరీక్షించుకోండి. ఆరాధనకు బైబిలు ఇచ్చు నిర్వచనమునకు దగ్గరగా మీ ఆరాధనను మార్చుకోగల కొన్ని విషయములను గుర్తించండి.

పాఠం 1 సమీక్ష

(1) ఆరాధన అంటే ఏమిటి?

  • ఆరాధన అనగా గౌరవముతో అప్పగించుకొనుట (ప్రకటన గ్రంధం 4:10-11).

  • ఆరాధన అనగా సేవ (రోమా 12:1).

  • ఆరాధన అనగా స్తోత్రము (కీర్తనలు).

  • ఆరాధన అనగా సహవాసము (అపొస్తలుల కార్యములు 2:42).

  • ఆరాధనలో జీవితమంతా భాగమైయున్నది (యాకోబు 1:26-27).

(2) ఆరాధన ఎందుకు ప్రాముఖ్యమైయున్నది?

  • ఆరాధనలో మనము దేవుని చూస్తాము (యెషయా 6:1-8).

  • ఆరాధనలో మనలను మనము చూచుకొని మార్పుచెందుతాము (యెషయా 6:1-8).

  • ఆరాధనలో మనము మన లోకమును చూస్తాము (యెషయా 6:1-8).

  • ఆరాధించుటకు విఫలమగుట మనలను దేవుని నుండి దూరము చేస్తుంది (రోమా 1:18-25).

(3) ఆరాధనకు లక్ష్యములు:

  • ఆరాధనలో, మనము దేవుని కలుసుకుంటాము.

  • ఆరాధనలో, మనము క్రైస్తవ ప్రవర్తనను అలవరచుకుంటాము.

  • ఆరాధనలో, మనము క్రైస్తవ సమాజమును నిర్మిస్తాము.

(4) ఏ ఆరాధన దేవునికి యుక్తమైనది?

  • యుక్తమైన ఆరాధన దేవుని మీద దృష్టిపెడుతుంది (ప్రకటన గ్రంధం 4).

  • యుక్తమైన ఆరాధన దేవునికి చెందవలసిన మహిమను చెల్లిస్తుంది (కీర్తనలు 96:7-8).

  • యుక్తమైన ఆరాధన అనగా ఆత్మతోను సత్యముతోను ఆరాధన (యోహాను 4:23-24).

ముద్రించగల PDF ఇక్కడ అందుబాటులో ఉంది.

పాఠం 1 అభ్యాసములు

(1) బైబిలు ఆరాధనను ఎలా వర్ణిస్తుంది? క్రింది లేఖనముల ఆధారముగా ఒక పేజీ జవాబును వ్రాయండి:

  • కీర్తనలు 111:1-2

  • కీర్తనలు 147:1

  • కీర్తనలు 150

  • యెషయా 6:1-8

  • ప్రకటన గ్రంధం 4

మీరు ఒక సమూహముతో కలిసి చదువుతుంటే, మీ తదుపరి తరగతి సమయములో జవాబును చర్చించండి.

(2) తదుపరి పాఠము యొక్క ఆరంభములో, ఈ పాఠం ఆధారముగా మీరు ఒక పరీక్ష వ్రాస్తారు. సిద్ధపడుటకు పరీక్ష ప్రశ్నలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి.

కోర్సు ప్రాజెక్టు

ముప్పై దినముల ఆరాధన యాత్ర[1]

ఈ ప్రాజెక్టు మీద ఈ కోర్సు అంతటిలో మీరు పని చేస్తారు. కోర్సు ముగింపులో, ఈ ప్రాజెక్టును మీరు పూర్తి చేశారని నివేదిక ఇస్తారు. మీరు మీ దినచర్యను క్లాస్ లీడర్ కు అప్పగించవద్దు.

30 రోజుల పాటు ప్రతి రోజు, దేవుని గుణములలో ఒకదానిని ధ్యానిస్తూ మీరు కొన్ని నిమిషాలు గడుపుతారు. ఆ గుణమును రోజంతా ధ్యానించుట కొరకు మీరు ప్రాజెక్టును ఉదయమున చేస్తే బాగుంటుంది. ధ్యానించుట అంటే ఒక విషయమును గూర్చి లోతుగా ఆలోచించుట.

ఒక దినచర్యగా ఉపయోగించుటకు ఒక ఖాళీ నోట్ బుక్ తీసుకోండి. తననుతాను మీకు బయలుపరచుకోమని దేవునికి ప్రార్థిస్తూ ప్రతి రోజును ఆరంభించండి. తరువాత, కీర్తనలు గ్రంథమును తెరచి, చదువుట ఆరంభించండి. ఈ ప్రాజెక్టు కొరకు లక్ష్యము ధ్యానమేగాని, సుదీర్ఘముగా చదువుట కాదు. మీరు కేవలం ఒక వచనము లేక కీర్తన అంతటిని చదవవచ్చు.

మీరు చదువుచుండగా, దేవుని ఒక గుణము లేక దేవుని ఒక రూపకము కొరకు వెదకండి. గుణము దేవుని స్వభావములో ఒక కోణమైయుంటుంది – ఆయన కనికరము, ఆయన పరిశుద్ధత, ఆయన కాపుదల. దేవుని రూపకము దేవునిని మరొకరితో పోల్చుతుంది – ఆయన ఒక కాపరి, ఒక బండ, ఒక ఆశ్రయము.

మీతో మాట్లాడు ఒక గుణము లేక రూపకమును మీరు కనుగొనినప్పుడు, ఆ గుణమును మీ దినచర్య పేజీలో పైభాగములో వ్రాయండి. దాని క్రింద, ఆ గుణమును గూర్చి మాట్లాడు వచనమును వ్రాయండి.

ఆ గుణమును గూర్చి మరియు అది దేవుని గూర్చి చెప్పు విషయములను గూర్చి ఆలోచించండి. మీరు ప్రార్థించిన తరువాత, దేవుడు మరియు ఆయన గుణములను గూర్చి మీ ఆలోచనలను వ్రాయండి. ఇది ఒక అధ్యయన వ్యాసము కాదు; ఇది వ్యక్తిగత ఆరాధన దినచర్య. రోజంతా, దేవుని గూర్చి మరియు స్వభావమును గూర్చి ఆలోచించండి. ఆయన ఏమైయున్నాడో అందును బట్టి ఆయనను స్తుతించండి. దీనిని మీరు 30 రోజుల పాటు చేసిన తరువాత, దేవుని గూర్చి లోతైన జ్ఞానమును మీరు పొందుకుంటారు.


[1]ఈ ప్రాజెక్ట్ Louie Giglio, The Air I Breathe: Worship as a Way of Life (Sisters, OR: Multnomah Publishers, 2003) నుండి అనుకూలించబడింది.

పాఠం 1 పరీక్ష

(1) ఈ పాఠం యొక్క ఆరంభములో మీరు ఆరాధన యొక్క మూడు నిర్వచనములు ఇవ్వబడినవి. మీరు కంటస్థం చేసిన నిర్వచనమును వ్రాయండి.

(2) బైబిలానుసారమైన ఆరాధనలోని నాలుగు అంశములను వ్రాయండి.

(3) సమరయ స్త్రీ ఆరాధన యొక్క భౌతిక స్థానమును ఉపయోగిస్తే, యేసు _________ ఆరాధన స్థలమును చూపాడు.

(4) కీర్తనలలో, ఆరాధనలోని ఆనందమును సూచించుటకు _________ అను పదము తరచుగా ఉపయోగించబడింది.

(5) యాకోబు మాటల ప్రకారం, పవిత్రమైన మరియు నిష్కళంకమైన ఆరాధనలో ఏర్ రెండు విషయములు ఉంటాయి?

(6) ఆరాధన ప్రాముఖ్యమైనది అనుటకు నాలుగు కారణములను తెలుపండి.

(7) ఈ పాఠం ప్రకారం, దేవుడు అంగీకరించు ఆరాధనలోని మూడు లక్షణములు ఏమిటి?

(8) మీరు కంటస్థం చేసిన యోహాను 4:23-24ను వ్రాయండి.

Next Lesson