క్రైస్తవ ఆరాధనకు పరిచయం
క్రైస్తవ ఆరాధనకు పరిచయం
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 10: ఆరాధన జీవనశైలి

1 min read

by Randall McElwain


పాఠ్య ఉద్దేశ్యములు

ఈ పాఠం ముగిసే నాటికి, విద్యార్థి:

(1) సామూహిక ఆరాధన మరియు ఆరాధన జీవనశైలి మధ్య ఉన్న సంబంధమును గుర్తించుట.

(2) ఆరాధన జీవనశైలి ఒక వ్యక్తి యొక్క విలువలను మార్చుతుంది అని అర్థము చేసుకొనుట.

(3) దేవుని మహిమ కొరకు జీవించుట కొరకు అన్వేషించుట.

(4) రోమా 12:2లో బోధించబడిన ఆరాధన జీవనశైలి పట్ల సమర్పణ కలిగియుండుట.

(5) బైబిలు ఆధారిత ఆరాధన వేదాంతశాస్త్రమును తెలియజేయుట.

ఈ పాఠము కొరకు సిద్ధపాటు.

1 కొరింథీయులకు 10:31ని కంటస్థం చేయండి.

పరిచయం

ఒక సంవత్సరములో ఒక ఆఫ్రికా దేశము రెండు జాబితాలలో స్థానము సాధించింది: “ఆఫ్రికాలో అతి పెద్ద క్రైస్తవ దేశం” మరియు “ఆఫ్రికాలోనే అత్యంత అవినీతిపరమైన దేశము.”

ఆసియాలోని అతి పెద్ద సంఘములలో ఒకదానికి సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి కొన్ని కోట్ల డాలర్ల కుంభకోణంలో నేరస్తుడైయ్యాడు.

వివాహేతర సంబంధమును ఒప్పుకొని అమెరికాలోని ఒక పెద్ద సంఘ నాయకుడు రాజీనామా చేశాడు.

ఏంటి ఇలా జరుగుతుంది? ఇట్టి పరిస్థితులలో అనేక కారణాలు ఉంటాయి, కాని వీటన్నిటిలో ఒక విషయం మాత్రం సాధారణముగా ఉన్నది: ఆదివార ఆరాధన సోమవార జీవితము మీద ప్రభావము చూపదు. ఆదివారము “ఆరాధన”గా పరిగణించబడుతుంది – భావనలు మరియు ఉత్సాహం. సోమవారం నిజజీవితముగా పరిగణించబడుతుంది – అవినీతిపరమైన వ్యాపార అలవాట్లు మరియు స్వార్థపు ఆశలను నెరవేర్చుకొనుట. చాలామంది ప్రజల జీవితములో, ఆరాధన కార్యకలాపములు జీవితములో మార్పును కలిగించవు.

► ఆరాధన మీ అనుదిన జీవితమును ప్రభావితము చేయు విధానమును చర్చించండి. మీ ఆరాధన కారణంగా మీ వ్యాపారం యే విధముగా భిన్నముగా పని చేస్తుంది? మీ ఆరాధన కారణంగా మీ కుటుంబ సంబంధములు యే విధముగా భిన్నముగా ఉన్నాయి? మీ నైతిక విషయములు? మీ రాజకీయ విషయములు? మీ ఆర్ధిక అలవాట్లు? మీరు ఆరాధన జీవనశైలిని జీవించుచున్నారా?

ఆరాధన: కేవలం ఆదివారము మాత్రమే కాదు

ఈ పాఠము యొక్క పరిచయములో ప్రస్తావించబడిన సమస్య క్రొత్తదేమి కాదు. బలులను తెచ్చి, దేవాలయ ఆచారములను పాటిస్తూ, దైవికమైన జీవితములను జీవించుటలో విఫలమైన ప్రజలతో ఆమోసు మాట్లాడాడు (ఆమోసు 5:21-24). “మందిరము, మందిరము” అని కేకలు వేస్తూ, దేవుని సన్నిధి యొక్క వాస్తవికతను ఎరిగియుండని ప్రజలతో యిర్మీయా మాట్లాడాడు (యిర్మీయా 7:4). ధర్మశాస్త్రములోని ప్రతి వివరమును పాటిస్తూ, చిన్న చిన్న వస్తువులలో కూడా దశమభాగములు ఇస్తూ, ప్రార్థనలో నమ్మకముగా ఉంటూ, విశ్రాంతి దినమును మరియు ఇతర ఆరాధన ఆచారములను పాటిస్తూ, హృదయములు అపవిత్రముగా ఉండిన ప్రజలను యేసు వర్ణించాడు (మత్తయి 23:23). వీరు ఆరాధికులమని ఒప్పుకున్నారుగాని, వారి ఆరాధన అబద్ధపు ఆరాధనగా ఉండెను. నిజమైన ఆరాధన జీవితములోని అన్ని విషయముల మీద ప్రభావము చూపుతుంది.

[1]విగ్రహములకు అర్పించిన మాంసమును గూర్చిన సమస్యను ఎదుర్కొనిన విశ్వాసులకు పౌలు వ్రాశాడు. ఈ సమస్యను గూర్చి మాట్లాడిన తరువాత, పౌలు ఇలా నిర్థారించాడు, “కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” (1 కొరింథీయులకు 10:31). పౌలు విగ్రహములకు అర్పించబడిన మాంసమును గూర్చి మాట్లాడుచున్నప్పటికీ, ఈ నియమము జీవితములోని ప్రతి విషయమునకు అనువర్తించబడుతుంది. మనము నిజముగా ఆరాధిస్తే, మన అనుదిన జీవితములు దేవుని మహిమ కొరకు జీవించబడతాయి.

ఆరాధనకు ఒక నిర్వచనము ఏమనగా “…దేవుని సమస్తమునకు మన సమస్తము ఇచ్చు ప్రతిస్పందన.”[2] ఆరాధనలో మన జీవితములోని ప్రతి విషయము భాగమైయుంటుంది అని ఈ నిర్వచనము చూపుతుంది. ఆరాధనను నిర్వచించునప్పుడు రెండు నియమములను సమతుల్యము చేయాలి.

సామూహిక ఆరాధన: ఆదివారము ఆరాధన

సామూహిక ఆరాధన సంఘ శరీరము కూడుకొనుటను సూచిస్తుంది. ఈ కూడిక సంఘ భవనములో జరగవచ్చు, లేక గృహములో, లేక ఇతర చోట్ల జరగవచ్చు. నేపథ్యము ప్రాముఖ్యము కాదుగాని, సామూహిక ఆరాధన కొరకు వేరుచేయబడిన సమయము ప్రాముఖ్యమైయున్నది. సామూహిక ఆరాధన కొరకు సమకూడు ధన్యత మరియు బాధ్యత క్రైస్తవులకు ఇవ్వబడింది (హెబ్రీయులకు 10:25).

జీవనశైలిగా ఆరాధన: జీవితమంతటిలో ఆరాధన

ఏదెను తోటలో, “మీరు ఎప్పుడు ఆరాధిస్తారు?” అని ఆదాము హవ్వలను మీరు అడిగియుంటే, “మేము ఎల్లప్పుడూ ఆరాధిస్తాము. మా జీవితమంతా ఆరాధనే” అని వారు జవాబిచ్చియుంటారు. ఇది జీవనశైలిగా ఆరాధన అయ్యున్నది.

ఆరాధన విశ్వాసుల యొక్క సామూహిక కూడిక మరియు దేవుని మహిమ కొరకు జీవించు జీవితము అయ్యున్నది. రెండవ శతాబ్దపు బిషప్ అయిన లయన్స్ కు చెందిన ఐరేనియస్ ఇలా అన్నాడు, “దేవుని మహిమ పరిపూర్ణముగా జీవించు మానవుడు అయ్యున్నాడు.” ఇది మనవ-కేంద్రిత మానవవాదం అయ్యున్నది; దేవుని మహిమ కొరకు జీవించుట మానవుని యొక్క అత్యున్నతమైన ఉద్దేశ్యము అని గుర్తించు దేవుని కేంద్రిత గుర్తింపు ఇది. ఇది నిజమైన ఆరాధన అయ్యున్నది.

[3]క్రైస్తవులముగా మన జీవితములోని ప్రతి విషయమును, సాధారణ వివరములను కూడా, దేవునికి ఇస్తాము. ఆరాధన కేవలం ఆదివారమునకు మాత్రమే పరిమితము కాదు. మన పని, ఆటలు, మరియు సాధారణ పనులన్నీ దేవుని మహిమ కొరకు జరుగుతాయి. ఆరాధనలో మన శరీరమును సజీవ యాగముగా సమర్పించుట భాగమైయున్నదని రోమా 12:1 చూపుతుంది; ఇది మన ఆత్మీయ సేవ అయ్యున్నది. ఆరాధన కొరకు బైబిలు అభిప్రాయము కేవలం వారపు కూడికలకు మాత్రమే పరిమితము కాదు; అది మన జీవితము అంతటిని దేవునికి ఇచ్చుట అయ్యున్నది.

ఆరాధన యొక్క బైబిలు అభిప్రాయములో సామూహిక మరియు అనుదిన జీవితము రెండు భాగమైయున్నవి. ఈ రెండు విషయములు ప్రాముఖ్యమైనవే. ఆరాధనలో అనుదిన జీవితము భాగమైయున్నది అని, మన మిగిలిన జీవితమంతటి మీద ఎలాంటి ప్రభావమును చూడకుండానే మనము ఆరాధన కూడికలలో పాలుపంచుకొను అవకాశం ఉందని మనము మరచిపోకూడదు. దేవునికి అనుదిన విధేయత చూపుతూ జీవించుటలో విఫలమవుతునే సామూహిక ఆరాధనలో పాలుపంచుకొనుటకు ఇది మనలను నడిపిస్తుంది.

అయితే, “ఆరాధనలో జీవితమంతా భాగమైయున్నది” అను విషయమును మాత్రమే మనము ఉద్ఘాటించిన యెడల, గురిగల ఆరాధన కొరకు మనము కేటాయించు అనుదిన సమయము యొక్క ప్రాముఖ్యతను మనము మరచిపోతాము. సామూహిక ఆరాధనలో పాలుపంపులు జీవితములో దేవుని ఉగ్రాణాధిపత్యమును మనకు జ్ఞాపకము చేస్తుంది.

ఉగ్రాణాధిపత్య నియమము దశమభాగములను ఇచ్చుట మరియు విశ్రాంతి దినమును ఆచరించుటలో కనబడుతుంది. క్రైస్తవ ఉగ్రాణాధిపత్యము అనగా మన ధనమంతా దేవునికి చెందినదిగా ఉన్నదని చెప్పుట; ఈ నియమము మీద మనకున్న నమ్మకము మనమిచ్చు దశమభాగములలో కనిపిస్తుంది. సమయమును గూర్చి క్రైస్తవ అభిప్రాయము అనగా, జీవితమంతా దేవునికి చెందినదిగా ఉన్నదని అర్థం; ఆరాధించుటకు మరియు విశ్రాంతి తీసుకొనుటకు వారములో ఒక దినమును కేటాయించుట ద్వారా దీనిని మనము వ్యక్తపరుస్తాము. అదే విధముగా, మన జీవితములోని ప్రతి విషయము ఆరాధనలో భాగమైయున్నది; సామూహిక ఆరాధన కొరకు మన తోటి విశ్వాసులతో సమకూడుట ద్వారా దీనిని మనము కనుపరుస్తాము.

బాబ్ కౌఫ్లిన్ సామూహిక ఆరాధన మరియు జీవనశైలిగా ఆరాధన మధ్య సంబంధమును చూపుతాడు:

ఆదివారము మన వారములో ఉన్నతమైన సమయము కావచ్చు, కాని ఏకైక సమయము మాత్రం కాదు. వారమంతటిలో, మనము మన కుటుంబములను ప్రేమించినప్పుడు, శోధనను జయించినప్పుడు, అణగద్రొక్కబడిన ప్రజల కొరకు ధైర్యముతో మాట్లాడినప్పుడు, చెడుకు విరోధముగా నిలబడినప్పుడు, మరియు సువార్త ప్రకటించినప్పుడు మనము ఆరాధనతో నిండియున్న జీవితమును జీవిస్తాము. ఈ విషయములన్నిటిలో మనము చెదరియున్న సంఘమును ఆరాధిస్తాము.

అయితే లోకము, మన శరీరము, మరియు అపవాదికి విరోధముగా మనము చేయు యుద్ధములో మనము అలసిపోతాము, మరియు దేవుని వాక్యము ద్వారా మరియు ఆయన పరిశుద్ధుల సంరక్షణలో మనము బలపరచబడాలి మరియు ప్రోత్సహించబడాలి. కుమారుని రక్తము ద్వారా దేవుడు మనలను జతపరచిన ప్రజలతో మనము సహవాసము చేయగోరతాము. కాబట్టి మనము కూడివచ్చిన ఆరాధించు సంఘముగా అగుటకు సమకూడతాము.[4]


[1]

“ఆరాధన నాయకుడు జీవితములోని అన్ని విషయములలో ఆరాధననుచేయు వ్యక్తిగా ఉండాలి; సమస్తముతో దేవుని వెదకువాడైయుండాలి; ఆరాధన జీవనశైలిలో సంఘమును నడుపువానిగా ఉండాలి.”

స్టీఫెన్ మిల్లర్ నుండి సేకరించబడినది

[2]Warren Wiersbe, Real Worship. (Grand Rapids: Baker Books, 2000), 21
[3]

“అనుదినము దేవుని సేవలో మన జీవితములను అర్పించుట మన జీవితకాల పిలుపైయున్నది. అదివార ఉదయ ఆరాధన ఆ పిలుపు యొక్క కొనసాగింపు అయ్యున్నది.”

బ్యారి లిష్

[4]Bob Kauflin, Worship Matters (Wheaton: Crossway Books, 2008), 210

ఆరాధన: దేవుని మహిమలో జీవించుట

[1]ఆరాధన మన విలువలను చూపుతుంది

మనము ఆరాధన కొరకు సృజింపబడితిమి, మనమంతా ఏదో ఒక దానిని లేక ఏదో ఒక వ్యక్తిని ఆరాధిస్తాము. మనము ఎక్కువ విలువనిచ్చుదానిని ఆరాధిస్తాము. ఆరాధన ఇలా అంటుంది, “నా జీవితములో దీనికే ప్రధమ స్థానం ఇవ్వబడియున్నది.”

చాలామంది ధనములు, ఉద్యోగములను, సంబంధములను, లేక వినోదమును ఆరాధిస్తారు. ఇవి వారి జీవితములో ప్రధమ స్థానమును తీసుకుంటాయి. మీరు దేనిని ఆరాధించుచున్నారో మీకు ఎలా తెలుస్తుంది? మీ జీవితమును చూడండి. దేనికి మీరు ఎక్కువ శక్తిని, సమయమును, మరియు ధనమును ఇచ్చుచున్నారు? దానినే మీ జీవితములో మీరు అత్యంత విలువైనదిగా మీరు ఎంచుకున్నారు; ఇదే మీ ఆరాధన అయ్యున్నది.[2]

మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు; మిగిలినవన్నీ తరువాత. ఆరాధన జీవనశైలి ప్రతి విషయములో దేవునికి ప్రధమ స్థానం ఇస్తుంది. నిజమైన ఆరాధకులు వారి జీవితములలో దేవుని సింహాసనము మీద ఉంచుతారు; ఆయన ఉన్నతమైన విలువను కలిగియుంటాడు. అనగా నిజమైన ఆరాధకులు, జీవితములోని ప్రతి భాగమును దేవుని మహిమ కొరకు జీవిస్తారు.

నిజమైన ఆరాధన మన విలువలను మార్చుతుంది

యెషయా 6లో, నిజమైన ఆరాధన మార్పు కలిగించునది అని మనము చూస్తాము. ఆరాధన మన విలువలను మాత్రమే చూపించదు, అది మన విలువలను కూడా మార్చును.

దేవుని ఆరాధన లేక విగ్రహముల ఆరాధన మనలను మార్చుతుంది. విగ్రహములను ఆరాధించుట మనలో దుష్ట మార్పులు కలిగిస్తుంది అని కీర్తనలు 115:8 చూపుతుంది. “వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.” విగ్రములను ఆరాధించువారు ఆ విగ్రముల వలె మారిపోతారు. ధనమును ఆరాధించువారు ఎక్కువ లోభముతో నిండిపోతారు. వినోదమును ఆరాధించువారు, వినోదమునకు అధికముగా బానిసలవుతారు; ఖ్యాతిని ఆరాధించువారు, అధికముగా స్వార్థపరులు అవుతారు. మనము దేనిని ఆరాధిస్తామో, ఆ విధముగానే మారిపోతాము. 

[3]అదే విధముగా, దేవుని ఆరాధించువారు ఎక్కువగా ఆయన పోలికలోనికి మార్చబడతారు, “మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము” (2 కొరింథీయులకు 3:18).

మనము ఆరాధించునప్పుడు, మన విలువలు మారిపోతాయి. ఆరాధకులముగా, మనము ఇలా ప్రశ్నించాలి, “ఆరాధన న జీవితమును మార్చుతుందా?”

దేవుని మహిమ కొరకు జీవించుటలో సమస్త జీవితము భాగమైయుంటుంది

జీవనశైలిగా ఆరాధన అంటే సమస్త జీవితమును దేవుని మహిమ కొరకు జీవించుట అని అర్థం. అనేకమంది క్రైస్తవులు వారి జీవితములను రెండు సంబంధములేని భాగములుగా విభాగిస్తారు: పవిత్రమైన (ఆదివారము) మరియు లౌకికమైన (ఆదివారము-శనివారము). వారు “ఆదివారపు క్రైస్తవుల” వలె జీవిస్తారు. వారు సంఘమునకు హాజరై, క్రైస్తవ విశ్వాసమును ఒప్పుకుంటారు, అయితే అదివార ఆరాధన వారి సోమవార వ్యాపార విలువలు, బుధవార కుటుంబ సమయము, లేక శనివార వినోదము మీద ఎలాంటి ప్రభావము చూపదు.

లౌకిక అను పదము ఈ లోక జీవితమును సూచిస్తుంది. ఒక క్రైస్తవుడు ఈ లోక జీవితమును కూడా దేవుని మహిమ కొరకు జీవించాలి. ఆదివార ఆరాధన యొక్క ప్రభావమును చూపు విధముగా క్రైస్తవుడు సోమవారమున జీవించాలి. ఒక ఆరాధన కూడిక యొక్క ముగింపులో, మనము ఇలా ప్రశ్నించాలి, “నేటి ఆరాధనను ఆచరణలో పెట్టుటకు నేను రేపు ఏమి చేస్తాను?” ఇది దేవుని మహిమ కొరకు జీవించు జీవితము అయ్యున్నది.

దేవుని మహిమ కొరకు జీవించుట ఎలా కనిపిస్తుంది?

దేవుని మహిమ కొరకు జీవించుట అనగా, జీవితమంతా దేవుని కొరకు ఆసక్తితో నియంత్రించబడుతుంది. ఆయనను సంతోషించు విషయములయందు మనము ఆనందించు స్థాయికి చేరు విధముగా మనము దేవుని ప్రేమించాలని దీని అర్థం. ఒక వ్యక్తిని ప్రేమించిట అంటే ఆ వ్యక్తి తలంపులలో లీనమైపోవుట అని ఎవరో చెప్పారు. “మీరి మిగిలిన యే విషయమును గూర్చి కూడా ఆలోచించనప్పుడు ఒక వ్యక్తి (లేక వస్తువును) గూర్చి ఆలోచిస్తుంటే, మీరు ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నారని అర్థము.”

అదే విధముగా, లూయి గిగ్లియో ఇలా సూచిస్తాడు, “మన నోటి మాటల ద్వారా మన ప్రాణములలో ఉన్నత స్థానమును దేనికి ఇచ్చుచున్నామో మనము తెలుసుకుంటాము.”[4] మనకు అత్యంత విలువైనదానిని గూర్చి మనము మాట్లాడతాము.

ఇది చాలా సులువైన విషయముగా అనిపించవచ్చు, కాని పరిగణించండి. ధనమును ప్రేమించు వ్యక్తి దేనిని గూర్చి మాట్లాడతాడు? ధనము. వారు ధనమును మహిమపరుస్తారు. ఆటల పిచ్చగలావాడు దేనిని గూర్చి మాట్లాడతాడు? ఆటలను గూర్చి. వారు వారికి నచ్చిన ఆటల జట్టును మహీంపరుస్తారు.

అనగా క్రైస్తవుడు ప్రతి పరిస్థితిలో బైబిలును గూర్చి మాట్లాడాలని అర్థమా? కాదు; అనగా మనము మాట్లాడు ప్రతి విషయము దేవుని మహిమపరుస్తుంది అని అర్థం. మనము ఒక వ్యాపార నిర్ణయమును తీసుకొనునప్పుడు, మనము మన సహచరులతో ఇలా చెప్పకపోవచ్చు, “ఈ నిర్ణయము దేవుని మహిమపరచాలి,” కాని దేవుని మహిమ మన నిర్ణయమును ప్రభావితము చేస్తుంది. మన బిడ్డను క్రమశిక్షణలో పెట్టవలసివచ్చినప్పుడు, మనము సంభాషణను ఇలా ప్రారంభించకపోవచ్చు, “బాబు, నేను నిన్ను కొట్టు దెబ్బలు దేవుని మహిమపరచాలి,” కాని మనలను మనము ఇలా ప్రశ్నించుకోవాలి, “ఈ క్రమశిక్షణ దేవుని మహిమపరుస్తుందా లేక నేను కేవలం నా కోపమును వెళ్ళబుచ్చుకొనుచున్నానా? నా పరలోకపు తండ్రి నన్ను ఈ విధముగానే క్రమశిక్షణలో పెడతాడా?”

క్రైస్తవులముగా, దేవుని మహిమ వెలుగులో మనము ప్రతి నిర్ణయమును తీసుకుంటాము. జీవనశైలిగా ఆరాధన అంటే మనము చేయు ప్రతి పనిలో దేవుడు మరియు ఆయన మహిమ కేంద్రముగా ఉన్నదని అర్థం.

మునుపటి పాఠములో, కృపకు వేరుగా, సామూహిక ఆరాధన ధర్మశాస్త్రవాదమవుతుంది అని చెబుతూ, “దేవుని కటాక్షమును పొందు విధముగా మనము ఎలా ఆరాధించగలము?” అని ప్రశ్నించాము. అదే విధముగా, కృప లేకుండా, ఆరాధన జీవనశైలి ఒక ధర్మశాస్త్రవాద భారము అవుతుంది, మరియు “ఈ నిర్ణయము దేవుని మహిమపరచుటకు ఉత్తమమైన మార్గము కాని యెడల ఏమిటి? నేను తప్పు చేస్తే, దేవుడు కోపపడతాడా?” అని ప్రశ్నిస్తాము.

ధర్మశాస్త్రవాద ఆరాధనకు భిన్నముగా, దేవుని కృప వెలుగులో ఆరాధించుట అద్భుతమైన ధన్యత అవుతుంది. దేవుని కృప వెలుగులో సామూహిక ఆరాధన దేవుడు ఎవరు మరియు ఆయన ఏమైయున్నాడు అను విషయములను వేడుకగా జరుపుకొనుటకు ఒక అవకాశం అయ్యున్నది. అదే విధముగా, ఆరాధన జీవనశైలి (దేవుని కృప యొక్క వెలుగులో జీవించినప్పుడు) అనుదిన జీవితములో దేవుని మహిమపరచుటకు ఒక అవకాశం అయ్యున్నది. 

సోమవార వ్యాపార నిర్ణయము దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత చూపు ఆనందములేని ప్రయత్నము కాదు; ఆయన స్వభావమునకు అనుగుణమైన నైతికతతో దేవుని మహిమపరచుటకు అది ఒక ఆనందకరమైన అవకాశం. బిడ్డను క్రమశిక్షణలో పెట్టుట దేవుని అసంతృప్తిని నివారించుటకు ఆనందములేని ప్రయత్నము కాదు; మీ బిడ్డకు దేవుని ప్రేమగల స్వభావమును ప్రతిబింబించుటకు అది ఒక ఆనందకరమైన అవకాశం. కృప ఆరాధన జీవనశైలిని మార్చుతుంది.


[1]

“ప్రతి ఒక్కరికి ఒక బలిపీఠం ఉంది. మరియు ప్రతి బలిపీఠము మీద సింహాసనము ఉంది. కాబట్టి మీరు దేనిని ఆరాధించుచున్నారో మీకు ఎలా తెలుస్తుంది? చాలా సులభం: మీ సమయము, మే ఆప్యాయత, మీ శక్తి, మీ ధనము, మరియు మీ కట్టుబాట్లను గమనించండి. వాటిని గమనించినప్పుడు మీరు సింహాసనమును, ఆ సింహాసనము మీద ఉన్నవానిని, లేక ఉన్నదానిని కనుగొంటారు, మరియు ఆ వ్యక్తి లేక అది మీ జీవితములో ఉన్నతమైన విలువను కలిగియుంటారు. ఆ సింహాసనము మీద మీ ఆరాధన ఉన్నది.”

లూయి గిగ్లియో

[2]Louie Giglio, The Air I Breathe: Worship as a Way of Life (Sisters, OR: Multnomah Publishers, 2003) నుండి అనుకూలించబడింది.
[3]

ఆరాధన మనము చేయునది కాదు;
ఆరాధన మనలో ఏదో చేస్తుంది.

[4]Louie Giglio, “Psalm 16” in Matt Redman and Friends, Inside, Out Worship (Ventura: Regal Books, 2005), 78

ఆరాధన జీవనశైలి: బైబిలు మాదిరి

రోమ 12:1లో, క్రైస్తవుడు తనను తాను సజీవయాగముగా, ప్రేమతో మరియు దేవునికి అంగీకరయోగ్యముగా సమర్పించుకోవాలని పిలువబడియున్నాడు. ఇది మన ఆత్మీయ ఆరాధన. ఈ అర్పణ యే విధముగా అర్పించబడాలో రోమా 12:2 చూపుతుంది. జీవనశైలిగా ఆరాధనను అర్థము చేసుకొనుటకు ఈ వాక్యభాగము విశేషముగా ప్రాముఖ్యమైయున్నది.

11 అధ్యాయముల పాటు, క్రైస్తవ జీవితము కొరకు ఒక వేదాంతశాస్త్ర పునాదిని వేసిన తరువాత, పౌలు అనువర్తన భాగములోనికి వెళ్తాడు. మనము కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడితిమి కాబట్టి (రోమా 1-11), మనము ఒక విధముగా జీవించవలసియున్నది (రోమా 12-16). ఆరాధన జీవనశైలికి ఈ అధ్యాయములు మంచి మాదిరిని ఇస్తాయి.

ఆరాధన జీవనశైలిలోని ప్రతికూల విషయములు

పౌలు ఒక ప్రతికూల ఆజ్ఞతో ఆరంభించుచున్నాడు. “ఈ లోక మర్యాదను అనుసరింపక.” మనము ఈ లోక మర్యాదను అనుసరించి జీవించకూడదు. మనము ఈ లోకము మరియు పరలోక రాజ్యము రెంటికి సమర్పించుకొనలేము; మనము దేవుని మరియు ఈ యుగసంబంధమైన దేవతను ఇరువురిని ఆరాధించలేము.

జె.బి. ఫిలిప్స్ పౌలు ఇచ్చిన హెచ్చరికను ఇలా అనువదిస్తాడు, “మీ చుట్టు ఉన్న లోకము మిమ్మును దాని అచ్చులోనికి లాగుటకు అవకాశం ఇవ్వకండి.” మట్టిని అచ్చులో పెట్టినప్పుడు, అది ఆ అచ్చు ఆకారములోనికి మారిపోతుంది. లోకము క్రైస్తవులను దాని ఆకారములోనికి మార్చాలని ప్రయత్నిస్తుంది. మనము దాని యొక్క కోరికలకు అనుగుణంగా మార్పుచెందాలని లోకము కోరుతుంది. బదులుగా, మనము ఆరాధన జీవనశైలిని జీవించి, ఈ లోక ప్రభావమును తిరస్కరించాలి.

మనము అచ్చును గూర్చి అసలు అవగాహన లేకుండానే దానిలోనికి అమర్చబడతాము కాబట్టి ఈ శోధన మరింత అపాయకరముగా ఉన్నది. నీటిలో నివసించుచున్న చేప “ఇది నీరు” అని ఆలోచించదు. ఆ నీరు అది జీవించుచున్న లోకమైయున్నది. మట్టిలో పాకు పురుగు “ఇది మట్టి” అని ఆలోచించదు. అది ఆ పురుగు జీవించు లోకమైయున్నది. మనము జాగ్రత్తగా ఉండని యెడల, పతనమైన లోకములో నివసించు క్రైస్తవుడు “ఇది పతనమైన లోకము” అని ఆలోచన చేయడు. అది అతడు జీవించు లోకమవుతుంది.

ఇందువలనే సామూహిక ఆరాధన ప్రాముఖ్యమైయున్నది. మనము సమాజముగా కూడుకొనుటకు నిర్లక్ష్యము చేయకూడదు అని హెబ్రీయులకు పత్రిక రచయిత చెబుతున్నాడు. ఎందుకని? ఎందుకంటే దాని ద్వారానే మనము ఈ ఇతర ఆజ్ఞలను నెరవేర్చగలము:

  • “మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములుగలవారమును…” (హెబ్రీయులకు 10:22)

  • “…మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము” (హెబ్రీయులకు 10:23)

  • “…ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులకు 10:24)

ఆరాధనలో, మనము ఈ లోకమునకు చెందనవారము కాము అని మనకు జ్ఞాపకము చేయబడుతుంది. బబులోనులో, మందిరమునకు దూరముగా, ప్రజల యొక్క సామూహిక ఆరాధనలో పాలుపంచుకోలేక, దానియేలు యెరూషలేము తట్టు తన కిటికీని తెరచి రోజుకు ముమ్మారు ప్రార్థించాడు (దాని 6:10). బబులోనులోని లోక మర్యాదను అనుసరించకుండా ఆరాధన దానియేలును బలపరచింది. అతడు యెరూషలేము దిశగా తిరిగి చూచినప్పుడు, “నేను బబులోను పౌరుని కాను; నేను యెరూషలేము పౌరుని. నేను మొర్డుక్‌ను ఆరాధించను; నేను యెహోవాను సేవిస్తాను” అని దానియేలు జ్ఞాపకము చేసుకున్నాడు."[1]

ఆరాధన జీవనశైలి అనగా, మనము ఈ లోక అచ్చులోనికి పోయబడుటకు మనము నిరాకరించుట అయ్యున్నది. ఇది కేవలం కొన్ని శోధనలను ఎదురించుట మాత్రమే కాదు. ఇది కొన్ని నియమములను పాటించుట మాత్రమే కాదు. ఇది కేవలం ఒక విధమైన వస్త్రములను ధరించుట, ఒక విధమైన ప్రవర్తన, లేక మత సంస్కృతి మాత్రమే కలిగియుండుట కాదు. అది ఆలోచించుటకు మరియు జీవించుటకు పరిపూర్ణమైన మార్గము అయ్యున్నది. దేవుని రాజ్యము విషయములో సమస్తమును సమీక్షించుట అయ్యున్నది.

క్రైస్తవులముగా, మనము ఎన్నడును మన చుట్టు ఉన్న సంస్కృతిలోనికి అమర్చబడలేము. కొండ మీద ప్రసంగము మీద చైనాలో ఒక ఉపదేశము చేసిన తరువాత, ఒక విద్యార్థి ఇలా అడిగాడు, “చైనాలో, యేసు బోధించిన విధముగా జీవించుట కష్టమైన పని.” బోధకుడు ఇలా స్పందించాడు, “ఆశ్చర్యపోవద్దు. అమెరికాలో కూడా యేసు బోధించిన విధముగా జీవించుట కష్టమే.” సంస్కృతి ఏదైనా, ఆరాధన జీవనశైలి ఈ లోక నియమముతో వివాదములోనే ఉంటుంది.

ఆరాధన జీవనశైలిలోని అనుకూలమైన విషయము

ప్రతికూల ఆజ్ఞ తరువాత, రోమా 12 అనుకూల ఉపదేశముతో కొనసాగుతుంది: “మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”

ఈ లోక మర్యాదను అనుసరించుటకు వ్యతిరేకము భిన్నముగా ఉండుట లేక మీ వ్యక్తిత్వమును ఉద్ఘాటించుట మాత్రమే కాదు. ఈ లోక మర్యాదను అనుసరించుటకు వ్యతిరేకము, మీరు దేవుని చిత్తమును తెలుసుకొను వరకు రూపాంతరము చెందుట అయ్యున్నది. కొందరు క్రైస్తవులు వారి సంస్కృతికి భిన్నమైన జీవనశైలిని అనుసరించుచున్నారు, కాని వారు దేవుని చిత్తానుసారముగా రూపాంతరము పొందలేదు. బదులుగా, వారు ఒక రాజకీయ అభిప్రాయము, సామాజిక అభిప్రాయము, లేక వస్త్రధారణను ఈ లోక సంస్కృతితో ప్రత్యామ్నయపరచారు. వారి మనస్సు మారి నూతనమగుటవలన వారు రూపాంతరము పొందలేదు.

జె.బి. ఫిలిప్స్ ఇలా అనువదించాడు, “మీ చుట్టు ఉన్న లోకము మిమ్మును దాని అచ్చులోనికి లాగుటకు అనుమతి ఇవ్వకండి” (ప్రతికూల), “కాని మీ మనస్సు వైఖరి అంతా మార్చబడునట్లు దేవుడు మిమ్మును పునర్నిర్మించుటకు అవకాశం ఇవ్వండి” (అనుకూల). రూపాంతరముపొందిన మనస్సు ఎలా కనిపిస్తుందో రోమా పత్రికలోని మిగిలిన భాగమంతా చూపుతుంది.

  • రోమా 12: రూపాంతరము పొందిన విశ్వాసి ఇతరులను సేవించుటకు తన ఆత్మీయ వరములను ఉపయోగిస్తాడు.

  • రోమా 13: రూపాంతరము పొందిన విశ్వాసి పౌర అధికారమును గౌరవిస్తాడు.

  • రోమా 14: రూపాంతరము పొందిన విశ్వాసి ఇతర విశ్వాసుల నిశ్చయతలను గౌరవిస్తాడు.

ఆరాధన జీవనశైలి కేవలం ప్రవర్తన మాత్రమే కాదు; ఆరాధన మన ఆలోచన విధానము అంతటిని మార్చివేస్తుంది. ఆరాధన జీవనశైలి యొక్క ప్రభావమును పరిగణించండి:

  • క్రైస్తవ వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకులు ధనం మరియు అధికారము పట్ల వారికున్న వైఖరి విషయములో మార్పుచెందితే ఆఫ్రికా కాండము ఎలా కనిపిస్తుంది?

  • నాయకులు తమను తాము దేవుని ధనమునకు ఉగ్రాణాధిపతులుగా చూసుకుంటే ఆసియాలోని సంఘములు ఎలా ఉంటాయి?

  • వివాహేతర సంబంధములను హాలీవుడ్ కన్నుల ద్వారా గాక, దేవుని దృష్టి నుండి చూస్తే అమెరికాలోని వివాహ వ్యవస్థ ఎలా కనబడుతుంది?

ఆరాధన జీవనశైలి విశ్వాసి యొక్క మనస్సును మార్చుతుంది; రూపాంతరము పొందిన మనస్సు రూపాంతరము పొందిన జీవితములో కనిపిస్తుంది; రూపాంతరము పొందిన జీవితములు సమాజమును మార్చుతాయి. ఆరాధన జీవనశైలి తుదకు మన లోకమును మార్చివేస్తుంది.


[1]Tim Keep, Bible Methodist Missions. చాపెల్ ప్రసంగం Hobe Sound Bible College, నవంబర్ 2013 నుండి పారాఫ్రేజ్ చేయబడింది.

ఆరాధన అపాయములు: విధేయతలేని ఆరాధన

విధేయతలేని ఆరాధన విషయములో ప్రవక్తలు హెచ్చరించారు. దేవుని మందిరము వారిని బబులోను నుండి కాపాడుతుంది అని యిర్మీయా దినములోని ప్రజలు తలంచారు. యిర్మీయా ఇలా స్పందించాడు, “ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి” (యిర్మీయా 7:4).

మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని

ప్రతివాడు తన పొరుగువానియెడల తప్పక న్యాయము జరిగించి.

పరదేశులను తండ్రిలేనివారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల

ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీపితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును (యిర్మీయా 7:5-7).

వారు విధేయతకు ప్రతిగా ఆచారములను చేయవచ్చని ఇశ్రాయేలు ప్రజలు భావించారు. విధేయత లేని ఆచారములు అర్థరహితములు అని ప్రవక్తలు ప్రకటించారు.

కొన్ని సంప్రదాయములలో, విధేయత స్థానములో సాహిత్య ఆచారములకు స్థానము ఇవ్వబడుతుంది. ఆరాధనలోని మూలకములు ఉంటాయి. పాటలు సత్యము మాట్లాడతాయి. లేఖనము చదవబడి, ప్రకటించబడుతుంది. ప్రార్థనలు చేయబడతాయి. అయితే, దేవుని వాక్యమునకు విధేయత ఉండదు. జీవితములు మారవు. ఇది ఆరాధన కాదు, ఆచారము.

కొన్ని సంప్రదాయములలో, విధేయతకు బదులుగా భావనాత్మక ప్రతిస్పందనలకు స్థానము కల్పించబడుతుంది. కూడిక యొక్క లక్ష్యము కొన్ని భావనలను రేపుట అయ్యుంటుంది. సంగీతము భావనలను రేపుతుంది. ప్రసంగము సమర్పణ చేసుకొనుటకు ఆహ్వానమునిస్తుంది. అయితే, కూడిక మాత్రం దేవుని యెడల విధేయత మరియు సమర్పణను అనుసరించదు. ఇది ఆరాధన కాదు భావన.

మందిరములోని ఆరాధన దేవునితో ఇశ్రాయేలు యొక్క నిబంధనను వేడుక చేసుకున్నది మరియు ఇశ్రాయేలుకు నిబంధన బాధ్యతలను జ్ఞాపకము చేసింది. ఆదిమ సంఘములో, ఆరాధన యేసు మరణము ద్వారా అందించబడిన నూతన నిబంధనను జరుపుకొనుచు, పరిశుద్ధమైన జీవితములను జీవించుటకు క్రైస్తవులకు ఉన్న బాధ్యతను జ్ఞాపకము చేసింది. విధేయతలోనికి నడిపించని ఆరాధన అబద్ధ ఆరాధన.

నిజమైన ఆరాధన ఆరాధకుని మార్చివేస్తుంది. ఎ కోర్సు అంతటిలో, నిజముగా ఆరాధించు ప్రజలు మార్పుచెందారని మనము చూశాము. ఈ కోర్సు యొక్క లక్ష్యము మీరు ఆరాధన కూడికలకు ప్రణాళికను సిద్ధపరచుటలో మరియు నడిపించుటలో వృద్ధి చెందుట మాత్రమే కాదుగాని, ఆరాధన ద్వారా మార్చబడిన ఆరాధకునిగా మీరు మారాలని అయ్యున్నది. అప్పుడు మీరు సంఘములోని ప్రతి సభ్యుని మార్చు ఆరాధనలో మే సంఘమును నడిపిస్తారు.

ముగింపు: ఒక సంఘ కాపరి యొక్క సాక్ష్యం

నిజమైన ఆరాధన యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఒక స్పానిష్ సంఘము యొక్క సంఘ కాపరి మాటలు వినండి.

“1991లో, మా సంఘము యొక్క ఆత్మీయ వాతావరణం చాలా బలహీనముగా ఉండినది. మా సభ్యులలో కొందరిని అనైతిక జీవితము పట్టుకున్నది. పడిపోయిన సభ్యులను మేము క్రమశిక్షణలో పెట్టినప్పుడు, సంఘము విడిపోయింది. చివరికి, ఆత్మీయముగా మరియు మానసికముగా పతనమైన స్థితిలో, ఆదివారమున రోజంతా మేమి ఉపవాసముండి ప్రార్థన చేయాలని ఒక క్రొత్త విశ్వాసి సలహా ఇచ్చుట జరిగింది. మేము అలా చేశాము మరియు దేవుడు మా మధ్య కార్యము చేయుట ఆరంభించాడు.

“కొన్ని వారముల తరువాత, మేము మా వార్షిక క్యాంపును ఆరంభించాము. సంఘములో కొన్ని విభజనలు అప్పటికీ ఉండినవి. బుధవారం ఉదయమున సువార్తికుడు ప్రసంగమును ఆరంభించినప్పుడు, ‘హౌ గ్రేట్ థౌ ఆర్ట్’ అను పాటను పాడమని దేవుడు ప్రేరేపించినట్లు అతడు భావించాడు.

“ఈ గొప్ప పాటను అతడు పాడుచుండగా, ఆకలితో ఉన్న జనము మీద దేవుని మహిమ దిగివచ్చింది. కొందరు స్తుతులతో స్పందించారు; ఇతరులు బలిపీఠము వద్ద దేవుని వెదకుట ఆరంభించారు. సంఘములో వివాదమునకు మూలమైయుండిన స్త్రీ కనీరు కార్చుట ఆరంభించింది. 400 మంది ప్రజల ఎదుట నిలబడి, ‘హృదయములో క్షమాపణలేమిని పెంచుకొనుచు నేను దేవునికి మరియు ఆయన సంఘమునకు విరోధముగా పాపము చేశాను కాబట్టి నేను అత్యంత దుఖముతో నిండియున్న స్త్రీని. నన్ను క్షమించమని నేను ప్రభువును కోరుచున్నాను, మరియు సంఘముగా మీరు కూడా నన్ను క్షమించాలని ప్రాధేయపడుతున్నాను.’

“ఆమె నోటి నుండి ఆ మాటలు వచ్చిన వెంటనే, ఇతరులు కూడా సమాధానపడ్డారు. ఆ సాయంకాలమున, మా సంఘములో దేవుడు ఐక్యతను మరలా తీసుకొనివచ్చాడు. దేవుని ప్రజలు ప్రార్థన మరియు ఉపవాసములో తమను తాము దీనులను చేసుకున్నప్పుడు, మరియు పరిశుద్ధాత్మ నడిపింపుకు స్పందించిన దేవుని సేవకుడు విధేయత చూపినప్పుడు, మేము దేవుని సన్నిధిలోనికి తేబడ్డాము. పాపము ఒప్పింపబడింది; ఐక్యత మరలా వచ్చింది. ఇది నిజమైన ఆరాధనకు ఫలితమైయున్నది.”[1]


[1]రెవరెండ్ సిడ్నీ గ్రాంట్ యొక్క సాక్ష్యం, హోప్ ఇంటర్నేషనల్ మిషన్స్

పాఠం 10 సమీక్ష

(1) సమూహిక ఆరాధన ఆదివారమున జరుగుతుంది; ఆరాధన జీవనశైలి అనుదినము కనబడుతుంది. ఆరాధన యొక్క బైబిలు అభిప్రాయములో ఈ రెండు ప్రాముఖ్యమైనవే.

(2) నిజమైన ఆరాధన మనము దేనికి నిజముగా విలువనిస్తామో చూపుతుంది.

(3) నిజమైన ఆరాధన మనము విలువనిచ్చుదానిని మార్చుతుంది.

(4) ఆరాధన జీవనశైలి అనగా దేవుని మహిమ కొరకు జీవించుట. అనగా మన జీవితమంతటికి దేవుడు కేంద్రముగా ఉంటాడు అని అర్థం.

(5) ఆరాధన జీవనశైలి కొరకు బైబిలు మాదిరిని రోమా 12:2లో చూడవచ్చు, దానిలో ఇవి భాగమైయున్నవి

  • ప్రతికూల విషయము: “ఈ లోక మర్యాదను అనుసరింపక.”

  • అనుకూల విషయము: “మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”

ముద్రించగల PDF ఇక్కడ అందుబాటులో ఉంది.

పాఠం 10 అభ్యాసములు

(1) “నా ఆరాధన వేదాంతశాస్త్రము” అను శీర్షికగల ౩-4 పేజీల వ్యాసమును వ్రాయండి. ఆరాధన లేఖన నియమముల మీద ఆధారపడియున్న విధానమును ఈ వ్యాసం చూపాలి. వ్యాసము బైబిలానుసారముగాను, ఆచరణాత్మకముగాను ఉండాలి.

(2) యోహాను 4:23-24 ఆధారముగా నిజమైన ఆరాధనను గూర్చి ఒక ప్రసంగమును చేయండి.

(3) మీ కోర్సు ప్రాజెక్టును పూర్తి చేయుట: “ముప్పై-రోజు ఆరాధన ప్రయాణము”లో మీరు నేర్చుకున్న విషయముల సారాంశమును వివరిస్తూ, మీ తరగతి నాయకుని కొరకు ఒక-పేజీ రిపోర్టును వ్రాయండి. మీరు మీ దినచర్యను అప్పగించవలసిన అవసరం లేదు.

(4) మీ చివరి పరీక్ష కొరకు, మీరు కంటస్థం చేసిన 1 కొరింథీయులకు 10:31ని వ్రాయండి.