ఆరాధనను అర్థము చేసుకొనుటలో విఫలమైన సంఘముతో తన అనుభవమును గూర్చి వారెన్ వియర్స్బి వ్రాశాడు:
టెలివిషన్ ఆట అయిన మీలో ఎవరు కోటీశ్వరులు స్వరం మరియు నవ్వుతో, “సాయంత్రం కూడికకు తప్పక హాజరుకండి” అని ఆరాధన నాయకుడు చెప్పాడు. “మనము సాయంత్రం చాలా వినోదమును అనుభవించబోతున్నాము” అన్నాడు.
ఆదివారము మధ్యాహ్న సమయములో ఆ వ్యాఖ్య యొక్క అర్థము ఏమిటా అని నేను ఆలోచన చేస్తూ కూర్చున్నాను. “మనము వినోదమును అనుభవించబోతున్నాము” అను మాట బర్త్ డే పార్టీ ఆహ్వానములో సరిపోతుందిగాని, మహిమగల ప్రభువును ఆరాధించుటకు కూడుకొను క్రైస్తవ విశ్వాసుల సమూహమునకు ఈ వ్యాఖ్య ఏ విధముగా సరిపోతుంది? సీనాయి పర్వతము యొద్ద సమకూడినప్పుడు మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలు వినోద సమయమును గడపలేదు.
యోహాను పత్మోసు ద్వీపములో నాటకీయమైన అనుభవమును ఎదుర్కొన్నాడు, కాని అతడు వినోదవంతమైన సమయమును గడిపాడని నేననుకొనుటలేదు.[1]
ఈ పాఠములలో, ఆరాధన కేవలం వినోద సమయము మాత్రమే కాదు, కేవలం ఒక నిర్దిష్ట ఆచారము కంటే గొప్పది, మరియు కేవలం ఆదివారం ఉదయకాల కార్యము మాత్రమే కాదు అని మనము చూశాము. ఆరాధన అనగా దేవునికి చెందవలసిన మహిమను ఆయనకు ఇచ్చుట అయ్యున్నది. కాగితం మీద ఇది చాలా సులభముగా కనిపిస్తుంది; కాని వాస్తవిక జీవితములో, ఇది ఒక సవాలు కావచ్చు. ఈ పాఠములో, మనము ఆరాధనకు సంబంధించిన ప్రశ్నలను పరిశీలించబోతున్నాము. ఈ ప్రశ్నలను అధ్యయనం చేయునప్పుడు, అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న “నాకు ఏమి ఇష్టం?” అనునది కాదు. ఆరాధనలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న “దేవుడు ఏమి ఇష్టపడతాడు? ఆయనకు మహిమ ఘనతను ఏమి తీసుకొని వస్తుంది?”
[1]Warren Wiersbe, Real Worship (Grand Rapids: Baker Books, 2000), 169-170
ఆరాధన మరియు సంస్కృతి
► మీ సంఘము యొక్క ఆరాధన శైలిని చర్చించండి. లేఖనములో మీ ఆరాధనలోని ఏ అంశమును ఆజ్ఞాపించబడినవి మరియు ఏవి సంస్కృతి ద్వారా నిర్థారించబడినవి?
“మ దేశములో ఆరాధన ఎదుర్కొను అతి పెద్ద సమస్య సాంస్కృతిక ఔచిత్యము. చాలా సంఘములు ఆరాధన శైలిని ఇతర దేశముల నుండి తెచ్చుకొనుచున్నారు-అది సమకాలీన ఆరాధన కావచ్చు లేక సాంప్రదాయిక ఆరాధన కావచ్చు. వారు సమకాలీన స్థాయిలో ఉండాలి కాబట్టి పాశ్చాత్య శైలిని మన ప్రజలు అలవరచుకుంటారు, కాని “‘సాంప్రదాయిక’ మరియు ‘సమకాలీన’ రెండు ఆరాధనలు అన్య దేశమునకు చెందినవి కాబట్టి అవి మన ప్రజలను ఆకర్షించలేవు. దేవుని మహిమపరచు విధముగా మరియు మనము సేవ చేయు లోకముతో మాట్లాడు విధముగా మనము దేవుని ఎలా ఆరాధించగలము?”
సంస్కృతి లేక బైబిల్?
వధువు మరియు వరుడు రెండు విభిన్నమైన సంస్కృతులకు చెందినవారు. వివాహ విందులో, వధువు సంస్కృతికి చెందిన ఆహారము పంచిపెట్టబడినది. ఒక వంటకము అతనికి వడ్డించబడినప్పుడు, “ఇది ఏమిటి?” అని వరుడు అడిగాడు. “ఇది మా ఊరులో శ్రేష్టమైన ఆహారం” అని వధువు జవాబిచ్చింది. “మా దేశములో, ఇది చాలా రోత పథార్థము” అని అతడు విసుగుగా జవాబిచ్చాడు. సాంస్కృతిక భిన్నత్వములు కష్టమైనవి.
మనమంతా మన సంస్కృతి ద్వారా ప్రభావితము చేయబడతాము. కొందరు క్రైస్తవులు చోప్స్టిక్స్ కాకుండా ఫోర్క్స్ ఉపయోగించుటకు కారణం ఫోర్క్స్ ఎక్కువ బైబిలానుసారమైనవి లేక ఎక్కువ ప్రభావంతమైనవి అని కాదు. వారు ఫోర్క్స్ ఉపయోగించు సంస్కృతిలో పెరిగారు కాబట్టి, వారు ఫోర్క్స్ తో తింటారు. లోకములోని ఇతర ప్రాంతములలో ఉన్న వారి క్రైస్తవ స్నేహితులు ఫోర్క్స్ కంటే చోప్స్టిక్స్ ను ఎక్కువ ఉపయోగకరముగా భావిస్తారు.
మన ఆరాధన మన సంస్కృతి ద్వారా ప్రభావితము చేయబడుతుంది. మన ఆరాధనలోని చాలా విషయములు సంస్కృతికి సంబంధించినవి. సాంప్రదాయిక అమెరికన్ సంఘములో ఎదిగిన ఒక వ్యక్తికి సంఘములో వాయించు ఆర్గాన్ యొక్క శబ్దము నచ్చవచ్చు. సంఘ ఆర్గాన్ గిటార్ కంటే ఎక్కువ బైబిలానుసారమైనది కాదు; ఇది ఒక సాంస్కృతిక అంశమైయున్నది.
లెసోతోలో, సంఘము నాయకుడు మరియు సంఘ ప్రజల మధ్య ఉత్తర ప్రత్యుత్తరముగా పాడుతుంది. ఈ శైలిలో, నాయకుడు ఒక వరుసను పాడితే, సంఘ ప్రజలు తరువాత వరుసను పాడతారు. ఇట్టి అందమైన పాటల శైలి అమెరికా సంఘములలో అస్సలు వినిపించకపోవచ్చు. అమెరికా సంఘములోని సంగీత దర్శకుడు ఈ సంగీతమును ప్రయత్నిస్తే, సంఘ ప్రజలు సందిగ్ధతలో పడిపోతారు. కలిసి పాడుట మరియు ఉత్తర ప్రత్యుత్తరముగా పడుట సాంస్కృతిక విషయమేగాని, బైబిలు నియమము కాదు.
ఆరాధన శైలిని మనము పరీక్షించునప్పుడు మనము మూడు ప్రశ్నలను అడగాలి:
1. మనము సంస్కృతి మరియు లేఖనమును గందరగోళపరుస్తున్నామా?
2. మన సంస్కృతి లేఖనమునకు భిన్నముగా ఉన్నదా?
3. దేవుడు మనలను ఉంచిన సంస్కృతిలోని ప్రజలతో మన ఆరాధన అత్యంత ప్రభావవంతముగా ఎలా మాట్లాడగలదు?
మనము సంస్కృతి మరియు లేఖనమును గందరగోళపరుస్తున్నామా?
మన కంటే భిన్నమైన ఒక ఆరాధన ఆచారమును సమీక్షించునప్పుడు ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైయున్నది. ఆ పరిస్థితిలో, మనము సంస్కృతి మరియు లేఖనము మధ్య అయోమయాన్నికలిగించకుండా చూచుకోవాలి. మన సాంస్కృతిక విలువలను లేఖనములోనికి చదువి, అందరు బైబిలును అదే విధముగా చదవాలి అని కోరుట చాలా సులభమే. మన విధానము బైబిలు విధానము అని ఊహించునట్లు మనము శోధింపబడతాము.
కొందరు ఇలా అనవచ్చు, “సంఘ సంగీతము కొరకు ఆర్గాన్ సరియైన వాయిద్యం. ఆరాధనలో గిటార్లకు స్థానము లేదు.” అయితే, లోకములోని అనేక స్థలములలో, ఆర్గాన్ ఉపయోగించుట సాధ్యము కాదుగాని, ఒక సులువుగా మోయగల గిటార్ ను పాటల కొరకు ఉపయోగించవచ్చు. రెండవ శతాబ్దములోని గృహ సంఘములు పైప్ ఆర్గాన్ లను ఉపయోగించినట్లు ఎవరు వాదించలేరు! ఒకనికి పైప్ ఆర్గాన్ అంటే ఇష్టం కావచ్చు, కాని వారు తమ సాంస్కృతిక ఇష్టతలను బైబిలు నియమములుగా ఊహించుకోకూడదు.
సంఘము యొక్క మొదటి రెండు శతాబ్దములలో కూడా, విభిన్న రకములైన ఆరాధన విధానములు ఉండినవి అని ఆరాధన చరిత్రకారుడైన పాల్ బ్రాడ్షా చూపాడు. సంఘము వ్యాపించుచుండగా, ప్రతి నేపథ్యములోను ఆరాధన ఒకే విధముగా ఉండుట సాధ్యము కాదు.[1]
ఈ ప్రశ్న యొక్క ఆచరణాత్మక ప్రభావము ఏమిటి? ఇతరుల యొక్క ఆరాధన శైలులను సమీక్షించునప్పుడు లేక మన సొంత సంస్కృతులలో క్రొత్త ఆలోచనలకు స్పందించునప్పుడు, మనము సంస్కృతిని లేఖనముగా భావించకూడదు. ఒక ఆలోచన మన సాంస్కృతిక ఇష్టతలకు భంగము కలిగిస్తుంది కాబట్టి మనము దానిని తిరస్కరించకూడదు. ఒక ఆరాధన ఆచారము బైబిలు నియమములను ఉల్లంఘించకపోతే, వారికి నచ్చిన విధముగా ఆరాధించుటకు మనము ఇతరులకు అనుమతి ఇవ్వాలి.
అనగా ప్రతి ఆరాధన శైలి ప్రతి సంఘమునకు సరిపోతుంది అని అర్థము కాదు. జ్ఞానియైన ఆరాధన నాయకుడు తాను నాయకత్వము వహించుచున్న ప్రజలకు అనుగుణముగా ఉన్న విధానములో నడిపిస్తాడు.
చెకప్
బైబిలు నియమములు గాక, మీ సాంస్కృతిక ఇష్టతలు వలన మీరు తిరస్కరించిన ఆరాధన ఆచారములు ఏవైనా ఉన్నాయా? అలా అయిన యెడల, లేఖనమును ఉల్లంఘించనంత వరకు వారికి నచ్చిన విధానములో ఆరాధించుటకు మీరు ఇతర విశ్వాసులకు స్వాతంత్ర్యమును ఇవ్వగోరుచున్నారా?
మన సంస్కృతి లేఖనమునకు భిన్నముగా ఉన్నదా?
మన సంస్కృతిలో అది సాధారణమైనది కాబట్టి మనము ఒక ఆరాధన ఆచారమును సమర్థించుటకు ప్రయత్నించినప్పుడు ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. మన సంస్కృతిలో సామాన్యమైన విషయము లేఖనమును వ్యతిరేకిస్తుంది అని మనము కనుగొనినప్పుడు, మన సంస్కృతి యొక్క ఆకాంక్షల కంటే ఎక్కువగా మనము లేఖనమునకు విధేయత చూపాలి.
ఆరాధనలో నాటకీయమైన మార్పులను చేసినప్పుడు సంస్కర్తలు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. మధ్యకాల సంస్కృతి ఇలా అన్నది, “సామాన్య విశ్వాసులు బైబిలు చదవకూడదు; వారు దానిని అర్థము చేసుకోలేరు.” విక్లిఫ్, హస్స్, లూథర్, మరియు ఇతర సంస్కర్తలు లేఖనము ప్రజలందరి కొరకు ఇవ్వబడినది అని గుర్తించారు. వారి మధ్యకాల సంస్కృతి లేఖన బోధనకు వ్యతిరేకంగా నిలిచింది. లేఖన సత్యముతో వారి సంస్కృతిని ఎదుర్కొనుటకు సంస్కర్తలు తమ జీవితములను పణంగా పెట్టారు.
ఒకవేళ సంస్కృతి లేఖనమునకు వ్యతిరేకముగా ఉంటే, మనము మన సంస్కృతిని తిరస్కరించాలి! దేవుని వాక్యము మన అంతిమ అధికారమైయున్నది; మన చుట్టూ ఉన్న లోకములో మనము స్థానమును పొందుటకు లేఖనము పట్ల నమ్మకత్వము విషయములో మనము రాజీపడలేము. రోమా 12:2 యొక్క సారాంశం ఇలా ఉన్నది, “ఆలోచన లేకుండా ఈ లోక సంస్కృతిలో కలిసిపోవునట్లు లోక మర్యాదను అనుసరించకుము.”[2] లోకము మనలను దాని యొక్క దారిలోనికి తెచ్చునట్లు మనము దానికి అవకాశం ఇవ్వకూడదు.
చెకప్
మీ ఆరాధన లేఖన నియమములకు విరుద్ధముగా ఉన్న విషయములు ఏవైనా ఉన్నాయా?
దేవుడు మనలను ఉంచిన సంస్కృతిలోని ప్రజలతో మన ఆరాధన అత్యంత ప్రభావవంతముగా ఎలా మాట్లాడగలదు?
మన లోకమునకు సువార్తను ప్రకటించుటకు ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైయున్నది. మనము మన చుట్టూ ఉన్న లోకమునకు సువార్తను ప్రకటించాలి అంటే, మన ఆరాధన వారికి అర్థమైయ్యే భాషలో మాట్లాడాలి.
చేలలో ప్రకటించుట ఆరంభించినప్పుడు జాన్ వెస్లీ ఇదే ప్రశ్నను ఎదుర్కొన్నాడు. తన ఆంగ్లికన్ సహచరుల వలెనె, ప్రసంగించుటకు సంఘము మాత్రమే ఏకైక సరియైన స్థలము అని వెస్లీ కూడా ఆరంభములో నమ్మాడు. జార్జ్ వైట్ఫీల్డ్ ద్వారా ప్రభావితమై, సంఘము వెలుపల తాను ప్రకటించాలని గొప్ప ఆజ్ఞ కోరుతున్న విషయమును వెస్లీ అర్థము చేసుకున్నాడు.[3] వెస్లీ దీనిని పరిగణించునట్లు బలవంతము చేయబడ్డాడు, “వివాహములు మరియు సమాధి కార్యక్రమాలకు గాక ఇతర సందర్భములలో సంఘములోనికి ప్రవేశించని బొగ్గుగనులలోని ప్రజలకు నేను ప్రభావవంతముగా సువార్తను ఎలా ప్రకటించగలను?” దీనికి జవాబు చేలలోనికి వెళ్లి సువార్త ప్రకటించుట.
ఏప్రిల్ 2, 1739లో, వెస్లీ పట్టణము వెలుపలకు వెళ్లి, చేలలో కూడుకొనిన మూడువేల మందికి సువార్త ప్రకటించాడు. పద్దెనిమిదవ శతాబ్దములో ఆంగ్లము-మాట్లాడు లోకమును మార్చిన పరిచర్యను అతడు ఆరంభించాడు.
వెస్లీ చేలలో ప్రకటించుటను ఎంతగా తిరస్కరించాడు అంటే, “సంఘము వెలుపల ఆత్మల రక్షణ పాపము అని నేను భావించేవాడిని.” అతని సాంస్కృతిక పక్షపాతములు సువార్తకు ఆటంకములుగా ఉన్నాయని అతడు గుర్తించినప్పుడు, వెస్లీ తన ఆచారములను మార్చుకొనుటకు ఇష్టపడ్డాడు. తన ఆంగ్లికన్ సహచరులు అనేకమంది ఈ మార్పును తిరస్కరించారు. బయట ప్రకటించుట ఆరంభించిన ఒక నెలకే, ఆంగ్లికన్ సంఘములలో ప్రసంగించుటకు అతనికి అనుమతి లేదని బిషప్ వెస్లీతో చెప్పాడు. మీ సంస్కృతితో మాట్లాడుటను ఆరంభించుటకు మూల్యం చెల్లించవలసిరావచ్చు; వెస్లీని అనేకమంది తోటి ఆంగ్లికన్లు వ్యతిరేకించుట ఆరంభించారు. వెలుగు మరియు ఉప్పుగా ఉండుటకు యేసు ఇచ్చిన పిలుపు వ్యక్తిగత సౌకర్యము కంటే ప్రధానమైన ప్రాముఖ్యత అయ్యున్నది.
మన ఆరాధన మరియు చుట్టూ ఉన్న సంస్కృతి మధ్య ఉన్న సంబంధమును అర్థము చేసుకొనుటకు మైఖేల్ కోస్పర్ మూడు ప్రశ్నలను సూచించాడు.[4]
(1) ఇక్కడ ఎవరు ఉన్నారు?
ఈ ప్రశ్న మన సంఘము వైపుకు చూస్తుంది; “మన ఆరాధన కూడికలకు ఎవరు హాజరవుతారు?” కొన్నిసార్లు మనము లోకమునకు బోధించుటలో ఎంతగా నిమగ్నమైపోతాము అంటే, సంఘమునకు సేవ చేయుటలో విఫలమవుతాము. మనము కానివారముగా అగుటకు ప్రయత్నించినప్పుడు మన ఆరాధన నిజాయితేలేని ఆరాధనగా మారిపోతుంది. ఆరాధన సంఘముతో మాట్లాడాలి కాబట్టి, మనము ఇలా ప్రశ్నించాలి, “ఇక్కడ ఎవరు ఉన్నారు? మన సంఘములోనికి దేవుడు ఎవరిని పంపాడు?”
(2) ఇక్కడ ఎవరు ఉండేవారు?
ఇది మన స్వాస్థ్యమును చూస్తుంది. విశ్వాసులముగా, మన స్వాస్థ్యం ఆదిమ సంఘములో ఆరంభమై, విశ్వమంతా వ్యాపించింది.
అనగా గత కాలములోని గొప్ప పాటలను మన తరమువారికి పరిచయం చేయుటకు మనము ప్రయత్నిస్తాము. అనగా, నేటి ప్రజలను మనము సంఘ చరిత్రతో జతపరుస్తాము. మనము పుట్టకమునుపే ఆరంభమైన మరియు మనము మరణించిన తరువాత కొనసాగు ఒక స్వాస్థ్యములో మనము భాగమైయున్నాము అని యౌవ్వన క్రైస్తవులు తెలుసుకోవాలి. మనము సర్వ తరముల విశ్వాసులతో చేయబడిన సార్వత్రిక సంఘములో భాగమైయున్నాము.
మన ఆరాధన స్వాస్థ్యం పెంతెకొస్తు దినము నుండి, సీనాయి పర్వతము యొద్ద దేవుడు మోషేకు ఇచ్చిన ప్రత్యక్షత నుండి, మరియు ఏదెను తోటలో దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చిన ప్రత్యక్షత నుండి కలుగుతుంది. మన ఆరాధన ఈ చరిత్రను బట్టి సంతోషించాలి. మనము అపొస్తలుల విశ్వాస ప్రమాణమును పలికినప్పుడు, రెండవ శతాబ్దపు ఆరాధనలో మనము చేరుతున్నాము. ఆరాధనలో మనము ఇలా ప్రశ్నిస్తాము, “మన కంటే ముందు ఇక్కడ ఎవరు ఉండేవారు?”
(3) ఇక్కడ ఎవరు ఉండాలి?
ఈ ప్రశ్న మన సమాజమును గూర్చి మాట్లాడుతుంది, “మన సంఘములో ఎవరు సభ్యులుగా ఉండాలి” అని మనము అడిగినప్పుడు, మనము ఇలాంటి ప్రశ్నలను అడుగుతాము:
మనము ఎవరికి సువార్తను ప్రకటించుటకు ప్రయత్నిస్తున్నాము?
మన సమాజము సంఘములోనికి వస్తే, మన ఆరాధన కూడిక ఎలా కనిపిస్తుంది?[5]
మనము సువార్త ప్రకటించుటకు ప్రయత్నించుచున్న ప్రజలతో మాట్లాడు విధముగా ఆరాధన చేస్తూ మన సందేశము పట్ల నిబద్ధత కలిగి మనము ఎలా ఉండగలము?
ఈ ప్రశ్నలు పుస్తకాలలో కంటే నిజ జీవితములో కఠినమైనవిగా ఉంటాయి! నాలుగు సందర్భములను చూడండి. ప్రతి సంఘము సమాజముతో మాట్లాడు విషయములో కష్టములను ఎదుర్కొన్నది.
సంఘము A: “ఇక్కడ ఎవరు ఉన్నారు?” అను అడుగుటలో విఫలమైన సంఘము
సంఘము A రిటైర్ అయిన ప్రజలు నివసించు సమాజములో ఉన్నది. ఆ సమాజము యొక్క సగటు వయస్సు 70 సంవత్సరములు, మరియు సంఘములోని సగటు వయస్సు కూడా 70 యేండ్లు. రెండు సంవత్సరముల క్రితం, వారి సంఘ కాపరి యౌవ్వనుల కుటుంబములకు సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. రెండు-నెలల వ్యవధిలో, అతడు ఆర్గాన్, క్వయర్, మరియు భజనల స్థానములో, గిటార్లు, స్తుతి ఆరాధన బృందం, మరియు ఒక పెద్ద స్క్రీన్లను తీసుకొనివచ్చాడు.
విచారకరముగా, “ఇక్కడ ఎవరు ఉన్నారు?” అను ప్రశ్నను అడుగుటలో సంఘ కాపరి విఫలమయ్యాడు. ఫలితంగా, వందమంది వృద్ధులు ఉండిన సంఘము, వారికి నచ్చని పాటలు పాడు, వారికి నచ్చని స్క్రీన్ ను చూచు, మరియు ఎక్కువ శబ్దము చేయు గిటార్లను గూర్చి సణుగు 35 మంది సంఘముగా తగ్గిపోయింది.
సంఘము A బహిరంగంగా ఇతరులను చేరవేయాలని ప్రయత్నించాలా? ఖచ్చితముగా! కానీ వారు సువార్తతో ప్రభావవంతముగా చేరగల ఉత్తమమైన ప్రజలు ఆ సమాజములో ఉన్న రిటైర్ అయిన వృద్ధులు. సంఘములో అప్పటికే ఉన్న ప్రజలను నిర్లక్ష్యము చేయుట ద్వారా, స్వయంగా సంఘముతో లేక చుట్టూ ఉన్న సమాజముతో మాట్లాడు విధముగా ఆరాధించుటలో వారు విఫలమయ్యారు. సంఘము A ఈ ప్రశ్నను అడుగుటలో విఫలమైయ్యింది, “ఇక్కడ ఎవరు ఉన్నారు?”
సంఘము B: “ఇక్కడ ఎవరు ఉండేవారు?” అని అడుగుటలో విఫలమైన సంఘము
సంఘము B వేగంగా ఎదుగుతున్న పట్టణములో యౌవ్వన కుటుంబములతో నిండినదిగా ఉన్నది. సంఘము ఆ సమాజము యొక్క భాష మాట్లాడుతుంది; వారి ఆరాధన ఉత్సాహముగాను, ఆనందబరితముగాను ఉంటుంది.
సంఘము Bకి సువార్త ప్రకటించాలని ఆశ. విచారకరముగా, “ఇక్కడ ఎవరు ఉండేవారు?” అని ప్రశ్నను అడగలేదు. సంఘముగా దాని యొక్క స్వాస్థ్యమును సంఘము B మరచిపోయింది, అది మునుపు శుద్ధ మనస్సు మరియు జయవంతమైన క్రైస్తవ జీవితమును గూర్చి బోధించేది. “ప్రజలు సిద్ధాంతమును వినదలచుకొనుట లేదు; వారికి ఆచరణాత్మక ప్రసంగములు కావాలి” అని ఆలోచన చేస్తూ సంఘ కాపరి సిద్ధాంతమును బోధించుట మానివేశాడు. “కఠినమైన పదములు ఉన్న పాటలు ప్రజలకు ఇష్టం ఉండదు; వారికి సులువైన పాటలు ఇష్టం” అని సంగీత దర్శకుడు నమ్మాడు కాబట్టి బైబిలు లోతు ఉన్న పాటలను అతడు నివారించాడు. ఫలితంగా, సంఘములో “బాప్తిస్మము పొందిన అన్యుల” తరము ఎదిగింది.[6]
సంఘము B సంఖ్యలో పెరుగుతుంది, కాని ఆ సంఘములో చాలా తక్కువమంది దైవత్వములో పెరుగుతున్నారు. అది తక్కువ నిబద్ధతను కోరు వినోదవంతమైన సంఘము కాబట్టి చాలామంది దానికి హాజరవుతున్నారు. సంఘము Bకి దాని స్వాస్థ్యమును గూర్చి ఎలాంటి ఆలోచన లేదు కాబట్టి, చాలామంది మారుమనస్సుపొందినవారు చాలా వేగముగా ఇతర సంఘములకు మరి ఉత్తమమైన వినోదము కొరకు వెళ్లిపోతారు. “ఇక్కడ ఎవరు ఉండేవారు?” అని ప్రశ్నించుటలో సంఘము B విఫలమైయ్యింది.
సంఘము C: “ఇక్కడ ఎవరు ఉండాలి?” అని ప్రశ్నించుటలో విఫలమైన సంఘము
సంఘము C సుమారుగా 100 సంవత్సరముల క్రితం ఒక చిన్న గ్రామీణ సమాజములో ఆరంభమైయ్యింది. ఆరాధన, ప్రసంగము, మరియు సంగీతము ఆ గ్రామములో నివసించుచున్న ప్రజలతో మాట్లాడేది. తరువాత కొన్ని సంవత్సరములలో, సమాజము పూర్తిగా మారిపోయింది. సంఘము C ఉన్న స్థలము ఇప్పుడు ఒక ఆధునిక, వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా, అధిక నేరస్థాయితో మారిపోయింది. కాని దాని ఆరాధన మాత్రం గ్రామీణ మధ్య తరగతి కుటుంబములను ఆకర్షించునదిగా ఉన్నది.
విచారకరముగా, సంఘము Cకి దగ్గరలో నివసించు చాలామంది ప్రజలు, సంఘములో వారి యొక్క లోతైన ఆకలికి జవాబు ఉన్నదని తెలుసుకోకుండా వారములను గడుపుతున్నారు. సంఘము Cలో సమాజమునకు అవసరమైన సందేశము ఉన్నది, కాని అది సమాజమునకు ఆ సందేశమును స్పష్టముగా తెలియపరచదు. దేవునితో మరియు అవసరతలో ఉన్న లోకముతో మాట్లాడు విధముగా సంఘము C ఆరాధన చేస్తే, అది సమాజమును మార్చగలదు. బదులుగా, సంఘము C “ఇక్కడ ఎవరు ఉండాలి?” అని అడుగుటలో విఫలమైయ్యింది కాబట్టి నిధానముగా మరణిస్తుంది.
సంఘము D: సమాజముతో మాట్లాడు సంఘము
సంఘము D మునుపటి మూడు సంఘములకు ఉన్న అనేక లక్షణములను కలిగియున్నది. 40 సంవత్సరముల క్రితం సంఘము స్థాపించినప్పటి నుండి సమాజము చలా మార్పు చెందింది. ఈ సర్వేలోని ఇతర సంఘములకు భిన్నముగా, సంఘము D దాని సమాజముతో చక్కగా సంభాషించుటను నేర్చుకుంది.
ఆదివారము బోధించు సిద్ధాంతమును అనేకమంది యౌవ్వన విశ్వాసులు అర్థము చేసుకోలేకపోతున్నారని సంఘ నాయకులకు అర్థమైనప్పుడు, క్రొత్త విశ్వాసులను పరిపక్వతలోనికి తెచ్చుటకు వారు శిష్యరిక సమూహములను అభివృద్ధి చేశారు. సంగీతము వారి సమాజములోని చాలామందికి అర్థము కాలేదు అని సంగీత దర్శకుడు గ్రహించినప్పుడు, సిద్ధాంతపరముగా నిజమైన మరియు సంగీతపరముగా ఆకర్షించు పాటలను అతడు చేర్చాడు.
సంఘము ఎదుగుచుండగా, చుట్టుప్రక్కల ఉన్న గ్రామములలో వారు బ్రాంచి సంఘములను స్థాపించారు మరియు ఆ సంఘములు వాటి సమాజములోని అవసరతలతో మాట్లాడుటకు వారు అనుమతి ఇచ్చారు. ఈ సంఘములను సంఘము Dలో భాగమైయున్న యౌవ్వన పురుషులు నడిపించారు. ప్రతి బ్రాంచి సంఘము భిన్నమైనది, కాని ప్రతి సంఘము సువార్తకు నమ్మకముగా ఉండినది. సంఘము D “ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ ఎవరు ఉండేవారు, మరియు ఇక్కడ ఎవరు ఉండాలి?” అను ప్రశ్నలను అడుగుట నేర్చుకున్నది కాబట్టి, దేవుడు దానిని ఉంచిన సమాజములో బైబిలు సత్యమును పలుకుటను అది నేర్చుకుంది.
చెకప్
మీ ఆరాధన మీ సంఘమునకు హాజరగు ప్రజలతో మాట్లాడుతుందా? మీ ఆరాధన క్రైస్తవ సంఘము యొక్క స్వాస్థ్యమును ప్రతిబింబిస్తుందా? మీ సంఘము ద్వారా దేవుడు చేరాలని ప్రయత్నించుచున్న ప్రజలతో మీ ఆరాధన మాట్లాడుతుందా?
సంగీతము విషయం ఏమిటి?
ప్రపంచములోని అనేక చోట్ల సంఘ సంగీతకారులు బైబిలానుసారమైన మరియు సంస్కృతికి అనుగుణంగా ఉండు పాటలను కనుగొను సవాలును ఎదుర్కొంటారు. మనము సువార్త ప్రకటించుటకు ప్రయత్నించుచున్న సమాజము యొక్క హృదయ భాషలో మాట్లాడుటకు ప్రయత్నించు సంగీతమును మనము వెదకుచున్నాము. ఇతర దేశముల సంగీతము సాంస్కృతికముగా ఔచిత్యము కాకపోవచ్చు, మరియు కొన్ని స్థానిక సాంస్కృతిక పాటలు బైబిలానుసారమైనవి కాకపోవచ్చు. లేఖనమునకు నమ్మకముగా ఉండు మరియు సంస్కృతి పట్ల సున్నితము ఉండు సంగీతమును మనము ఎలా ఎన్నుకోగలము? ఈ సమస్యను ఎదుర్కొనుచున్న సంఘ కాపరులు ఇచ్చిన జవాబులు చూడండి:
సంఘము కొరకు పాటలను ఎన్నుకొను విషయానికొస్తే, ఒకరు బైబిలానుసారముగా ఉండుట మరియు సంస్కృతికముగా సున్నితముగా ఉండుట మధ్య ఎన్నుకోనవసరము లేదు. “బైబిలానుసారముగా ఉండుట” అనగా నిజముగా మరియు స్పష్టముగా ఉండు పాటలు అని నా అభిప్రాయము. “సాంస్కృతికముగా సున్నితముగా” ఉండుట అంటే, సంఘ ప్రజలు పాడగల మరియు పాలుపంచుకోగల పాటలు అయ్యున్నవి.
బైబిలానుసారముగా ఉండుట ప్రాధాన్యతను తీసుకుంటుంది, కాని మనము ఆ రెంటి మధ్య ఎన్నుకోవలసిన పని లేదు. పాడుట యొక్క ఉద్దేశ్యములోని ఒక భాగము సంభాషించుట అయితే, మన సంఘము యొక్క సంస్కృతి / [వాతావరణం] కు అనుగుణంగా ఉండు సంగీత భాషను మనము ఎన్నుకోకూడదా? సాంస్కృతిక సున్నితత్వము అవసరము లేదు అని ఆలోచన చేస్తే మనము / [మూర్ఖులము] మరియు మన పాటలు అసత్యములుగా లేక స్పష్టతలేనివిగా ఉంటె మనము ఔచిత్యములేనివారము అవుతాము.
(ముర్రే కాంప్బెల్, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో సంఘ కాపరి)
ఆఫ్రికన్ సేవకులను తర్ఫీదు చేయుటలో, అత్యధికముగా లేఖన-ఆధారితమైన, దైవ-కేంద్రీకృతమైన, సువార్త ద్వారా నడిపించబడు, క్షేమాభివృద్ధి కలుగజేయు, పాడదగిన పాటలను, పాత మరియు క్రొత్త పాటలను కనుగొను ముందుకు సాగమని మేము కోరతాము! ప్రతి సంస్కృతిలోను, క్రీస్తు కొరకు మరణించుటను మరియు జీవించుటను వారికీ బోధించు పాటలు దేవుని ప్రజలకు కావాలి.
(టిం కాంట్రెల్, సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్ బర్గ్ లో బోధకుడు)
వేదాంతపరముగా స్థిరమైన, సాంస్కృతికముగా ఔచిత్యమైన పాటల సంపుటి హిందీ భాషలో చాలా చిన్నది. మంచి వేదాంతశాస్త్రము ఉన్న చాలా పాటలు పురాతన పాశ్చాత్య కీర్తనలు లేక సమకాలీన ఆరాధన పాటల నుండి అనువదించబడినవి. పదములు నమ్మకమైనవి అయినప్పటికీ, సంగీతము సాంస్కృతికమైనది కాదు, మరియు స్థానిక ప్రజలు వాటిని పాడుటను కష్టముగా భావిస్తారు. అలాగే, క్రైస్తవ్యము పాశ్చాత్య మతము అని ప్రజలు కలిగియున్న అనుమానమును ఇట్టి పాటలు నిర్ధారిస్తాయి.
మరొక వైపున, సంగీతపరముగా సంస్కృతీకరణ చేయబడిన హిందీ పాటలు వేదాంతశాస్త్ర పరముగా బలహీనముగా, పునరావృతమగునవిగా, మరియు లేఖనములు లేకుండా ఉంటాయి. కొందరు హైందవ మందిరములలో ఉపయోగించు ఆలాపనలను ఉపయోగిస్తారు. మేము ఈ రెండు రకముల పాటలను నివారిస్తారు.
పాటలను ఎన్నుకొనునప్పుడు నేను చూచు మొట్టమొదటి విషయం వాటి యొక్క సిద్ధాంతపరమైన బలం. ఒక పాట వేదాంతపరముగా బలహీనముగా ఉంటే, అది ఎంత సంస్కృతీకరణ చేయబడినప్పటికీ, మేము వాటిని పాడము. మాటలు మంచివేగాని, ఆలాపన భారత దేశమునకు చెందినది కాకపోతే, మేము దానిని పాడము. మేము భారతీయ ఆలాపలలు మరియు నమ్మకమైన మాటలుగల పాటలను ఎన్నుకుంటాము. చూడండి, ఇలాంటి పాటల సంఖ్య చాలా తక్కువ, కానీ మేము నిదానముగా వాటి సంఖ్యను పెంచుతున్నాము.
(హర్షిత్ సింగ్, భారతదేశములోని లుక్నౌలో సంఘ కాపరి)
ఒక వ్యక్తి తన హృదయ భాషలో అత్యంత స్వాభావికముగా మాట్లాడు మరియు అత్యంత లోతుగా భావనలను వ్యక్తపరచగల మౌఖిక భాష వలెనె, ఒక వ్యక్తితో లోతుగా మాట్లాడు సంగీత హృదయ భాష కూడా ఉంది.
తాను పరిచర్య చేయు స్థలములోని ప్రజల యొక్క భాషను నేర్చుకొనుటలో విఫలమైన ఒక మిషనరీని గూర్చి ఊహించండి. అతడు (తన సొంత భాషలో) ఇలా అనవచ్చు, “నేను మీ యొద్దకు సువార్తను తీసుకొనివచ్చాను. నేను చెప్పు మాటలు మీకు అర్థము కావు, కానీ నేను మాట్లాడే విషయములను వినండి. తుదకు, నేను ఏమి చెబుతున్నానో మీకు అర్థమవుతుంది, అప్పుడు మీరు శుభవార్తను తెలుసుకుంటారు.” ఇది సాధ్యము కాదు! అదే విధముగా, సంస్కృతి యొక్క సంగీత భాషను ఉపయోగించుటలో మనము విఫలమైనప్పుడు, మనము సువార్తను అర్థము చేసుకొనుటకు మరింత కఠినతరము చేస్తున్నాము.[7]
విచారకరముగా, పాస్టర్ సింగ్ వ్రాసినట్లు, కొన్ని సంస్కృతులలో పాశ్చాత్యేతర సంగీత భాషను ఉపయోగించు బైబిలానుసారమైన పాటలు చాలా తక్కువ ఉంటాయి. దీని వలన సంఘముల ఎదుట రెండు వికల్పములు మిగిలిపోతాయి: అన్య ఆలాపనలుగల బైబిలానుసారమైన పాటలు లేక సాంస్కృతిక సంగీతములు గల బైబిలుపరముగా బలహీనమైన పాటలు. ప్రపంచవ్యాప్తముగా సంఘమును కట్టుటకు మీరు సంగీతమును ఉపయోగించాలని ఆశ కలిగియుంటే, లేఖనానుసారమైన సంగీతమును మరియు ప్రజల యొక్క సంగీత హృదయ భాష ద్వారా మాట్లాడు సంగీతమును అన్వేషించాలి. ప్రతి సంస్కృతిలోను దైవికమైన పాటల రచయితలను దేవుడు కోరుచున్నాడు అని నేను నమ్ముచున్నాను.
మీరు నాణ్యమైన ఆరాధన సంగీతము చాలా తక్కువగా అందుబాటులో ఉండు సంస్కృతిలో సేవిస్తుంటే, మీరు క్రొత్త సంగీతమును ప్రోత్సహించవచ్చు. ఇది ఇద్దరు ప్రజల మధ్య సహకారమును కోరుతుంది; అద్భుతమైన మాటలను వ్రాయు లేక అనువదించు వ్యక్తి మరియు సంగీతమును వ్రాయు వ్యక్తి. కొద్ది మంది గొప్ప కీర్తన రచయితలు తమ స్వంత స్వరాలను వ్రాసారు. ఒక అంకితమైన క్రైస్తవ సంగీతకారుని కనుగొని, బైబిలు సత్యాన్ని వెల్లడించే కీర్తనలకు స్వరాలను వ్రాయమని చెప్పండి. దీని ద్వారా, మీ ప్రపంచానికి అర్థమయ్యే సంగీత భాషలో బైబిలీయ సందేశాన్ని పాడగలుగుతారు.
పైన ఇవ్వడిన 2వ ప్రశ్నను మనము ఎల్లప్పుడూ పరిగణించాలి: “మన సంస్కృతి లేఖనమునకు విరుద్ధముగా ఉందా?” సంగీత సంస్కృతి లేఖనమునకు విరుద్ధముగా ఉంటే, దానిని మనము ఉపయోగించకూడదు. అయితే, యే విధమైన బైబిలు నియమము దానిని గూర్చి లేనప్పుడు, ఆరాధకుల యొక్క సంగీత భాషలో ఆరాధనను నడిపించుటకు మనము ప్రయత్నించాలి.
తన తండ్రి సంఘములో ఆరాధన చేయుచున్నప్పుడు, పరిచర్య కొరకు సిద్ధపడుతున్న ఒక యౌవ్వనుడు, వారు పాడుచున్న పాటలను చాలా తక్కువమంది అర్థము చేసుకొనుచున్నారు అను విషయమును గ్రహించాడు. ఆరాధించుటకు బదులుగా, వారు పాడుచున్న సత్యములను గూర్చి వారు చాలా తక్కువ అవగాహనను చూపారు. యౌవ్వనుడు దీనిని గూర్చి ఫిర్యాదు చేసినప్పుడు, అతని తండ్రి ఇలా జవాబిచ్చాడు, “నీవు ఇంకా మంచిగా చేయగలవేమో చూడు.” యౌవ్వనుడైన ఐసేక్ వాట్స్ తండ్రి చేసిన సవాల్ ను స్వీకరించాడు.
ఆంగ్లము మాట్లాడు ప్రజలు నేడు ఐసేక్ వాట్స్ యొక్క పాటలను పాడతారు, ఎందుకంటే ప్రజలకు అర్థమైయ్యే భాషలో బైబిలు సందేశమును తెలుపు పాటలను వ్రాయుటకు యౌవ్వన సేవకుడు నిర్ధారించుకున్నాడు.[8] మన తరములో, ఆంగ్లము మాట్లాడని లోకములోని ప్రజల హృదయములను తాకు భాషలలో బైబిలు సహ్యములను గూర్చి వ్రాయు పాటల రచయితలు కావాలి.
[1]Paul Bradshaw, “The Search for the Origins of Christian Worship” in Robert Webber, Twenty Centuries of Christian Worship (Nashville: Star Song Publishing, 1994), 4
[2]E. H. Peterson, The Message (Colorado Springs: NavPress, 2002)
[3]ఇది రెండవ ప్రశ్నకు దారితీస్తుంది – “మన సంస్కృతి లేఖనమును వ్యతిరేకిస్తుందా?”
[4]Michael Cosper, Rhythms of Grace: How the Church’s Worship Tells the Story of the Gospel (Wheaton: Crossway Books, 2013), 176-179
[5]జాన్ వెస్లీ ఈ సమస్యను ఎదుర్కున్నాడు. బొగ్గుగనుల కార్మికులు హాజరగు ఆరాధన కూడికలో, మారుమనస్సు పొందిన వేశ్యలు మరియు నిరక్షరాసులైన వ్యాపారులు ఉన్నత-శ్రేణి ఆంగ్లికన్ల కంటే చాలా భిన్నముగా ఉంటారని ఆంగ్లికన్లు గుర్తించారు. తక్కువజాతి ప్రజల ద్వారా వారి ఆరాధనకు ఆటంకము కలుగుటకు అనుమతి ఇవ్వము అని అక్కడ మత గురువులు నిర్ణయించుకున్నారు. ఇది మెథడిస్ట్ సమాజముల స్థాపనకు దారితీసింది.
[6]బైబిలు పునాదులు లేకుండా క్రైస్తవులమని ఒప్పుకొను ప్రజల కొరకు మార్క్ డేవేర్ ఉపయోగించు పదము.
[7]ఈ ఉదాహరణ Ronald Allen మరియు Gordon Borror, Worship: Rediscovering the Missing Jewel (Colorado Springs: Multnomah Publishers, 1982), 168 నుండి అనుకూలించబడింది.
[8]“జాయ్ టు ది వరల్డ్,” “వెన్ ఐ సర్వే ది వండ్రస్ క్రాస్,” మరియు “ఓ గాడ్, అవర్ హెల్ప్ ఇన్ ఎజెస్ పాస్ట్”ఐసేక్ వాట్స్ వ్రాసిన 750 పాటలలోని మూడు పాటలు
సంగీత శైలిని గూర్చి కొన్ని చివరి ఆలోచనలు
సంగీతము జీవితములో చాలా ప్రాముఖ్యమైన భాగమైయున్నది కాబట్టి, మనలో చాలామందిమి సంగీతమును గూర్చి బలమైన నమ్మకములను కలిగియుంటాము. ఆరాధనలో సంగీత శైలులను గూర్చిన ప్రతి సంభాషణ వివాదమును కలిగించుచున్నట్లు అనిపిస్తుంది.
కొన్ని సంగీత శైలులు చెడ్డవి అని నమ్మువారు ఇలా అంటారు, “ఆరాధనలో కొన్ని రకముల ఆరాధన శైలులను మాత్రమే ఉపయోగించాలి.” అయితే, సంగీత శైలుల కొరకు లేఖనము విశేషమైన మార్గదర్శకములను ఇవ్వదు.
సంగీత శైలులు నైతికముగా తటస్థమైనవి అని చెప్పువారు ఇలా అంటారు, “ప్రజలు నచ్చు సంగీతమును కనుగొనిదానిని పాడండి. శైలితో నిమిత్తము ఉండదు; మీకు నచ్చినది పాడండి.” అయితే, కాముకత్వ ప్రవర్తనలోనికి నడిపించువాటిని మనము నివారించాలని లేఖనము స్పష్టముగా చెబుతుంది. సాంస్కృతిక మరియు భావనాత్మక ప్రాముఖ్యత వలన, కొన్ని రకముల సంగీతము ఆరాధనకు తగినది కాదు.
సంగీత ఎంపికలను గూర్చి వ్రాస్తూ, స్కాట్ అనియోల్ తన సంభాషణను రెండు భాగములుగా విభాగించాడు:[1]
1. మాటలు: తప్పు మరియు ఒప్పు సమస్య. సంగీత శైలితో నిమిత్తము లేకుండా, దానిలోని మాటలు స్పష్టముగా మాట్లాడని యెడల అది ఆరాధనకు అర్హమైనది కాదు. ఇది తప్పు మరియు ఒప్పుకు సంబంధించిన విషయం. సాంప్రదాయిక సంగీత శైలిని ఉపయోగించు అనేక పాటలు బైబిలు సత్యమును బోధించవు; అవి ఆరాధనలో తగినవి కావు. అనేక సమకాలీన సంగీత శైలులను ఉపయోగించు పాటలు బైబిలు సత్యమును బోధించని మాటలను కలిగియున్నవి; అవి ఆరాధన కొరకు తగినవి కావు.
2. సంగీత శైలి: అస్పష్టత సమస్య. సంగీత శైలి అను అంశమును గూర్చి లేఖనము స్పష్టముగా మాట్లాడదు కాబట్టి, మనము రోమా 14లోని నియమమును అనుసరించాలి. దాని సాంస్కృతిక విషయముల కారణంగా ప్రశ్నార్థకముగా ఉన్న సంగీతమును మనము నివారించాలి. అయితే, భిన్నమైన సంగీత దిశలోనికి వారి మనస్సాక్షి నడిపించు ఇతులకు మనము న్యాయముతీర్చకూడదు.
చెకప్
మీ లోకమునకు సువార్త ప్రకటించకుండా మిమ్మును పరిమితము చేయు సాంస్కృతిక విషయములు మీ ఆరాధనలో ఏవైనా ఉన్నాయా? మీ లోకమునకు సువార్తను ప్రకటించుట కొరకు మీరు మీ ఇష్టతలను విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉన్నారా?
చప్పట్లు కొట్టుట విషయం ఏమిటి?
ఆరాధనలో చప్పట్లు కొట్టుట విషయం ఏమిటి? అలా చేయవచ్చా, చేయకూడదా? చప్పట్లు కొట్టుట రెండు నేపథ్యములలో జరుగుతుంది, మరియు రెండు విభిన్నమైన అర్థములను కలిగియున్నది.
ఆరాధనలో భాగముగా చప్పట్లు కొట్టుట
అనేక సంఘములు పాటలలో భాగముగా చప్పట్లు కొడతాయి; చప్పట్లు కొట్టుట వారి సంఘ ఆరాధనలో భాగమైయున్నది. ఇది లేఖనములో వ్యక్తపరచబడిన భౌతిక విషయములో భాగమైయున్నది. “సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.” (కీర్తనలు 47:1) యూదా ఆరాధికులు ఉత్సాహముగా ఉండేవారు. యూదుల ఆరాధనలో విభిన్నమైన సంగీత వాయిద్యములు, చేతులు ఎత్తుట, మరియు చప్పట్లు కొట్టుట ఉండేది.
చప్పట్లు కొట్టుట మీ ఆరాధనలో భాగమైయుంటే, వారు పాడుచున్న పాటకు అది తగినది అగునట్లు ఆరాధన నాయకుడు చూడాలి. ప్రార్థన పాట సమయములో చప్పట్లు కొట్టుట దాని సందేశమునకు తగినది కాదు. సంతోషముగా స్తుతించు సమయములో చప్పట్లు కొట్టుట తగినదే. నాయకుని కొరకు ప్రశ్న ఎల్లప్పుడూ “చప్పట్లు కొట్టుట సరియైనదేనా లేక సరికాదా?” అనునది కాదుగాని, “ఈ పాటకు చప్పట్లు కొట్టవచ్చా, ఆరాధనలోని ఈ సమయములో చప్పట్లు కొట్టవచ్చా?” అనునది మరి ఉత్తమమైన ప్రశ్న.
ఆరాధనలో చప్పట్లు ఒక
ఒక ప్రత్యేకమైన పాట పాడిన తరువాత దానికి ప్రతిస్పందనగా చప్పట్లు కొట్టుట మరింత కఠినమైన సమస్యగా ఉన్నది. ఆరాధనకు ప్రతిస్పందనగా యూదులు లేక క్రైస్తవ ఆరాధకులు చప్పట్లు కొట్టారని అనుటకు లేఖనములో ఎలాంటి ఆధారము లేదు.
నేడు అనేక సంస్కృతులు చప్పట్లు కొట్టుటకు త్వరపడతాయి. ఈ సంస్కృతులలో, చప్పట్లు కొట్టుట ద్వారా దేవుని స్తుతించుట సాధారణ విషయం. ఇతర సంస్కృతులలో, చప్పట్లు అనునది మంచి ప్రదర్శనకు గుర్తింపుగా మాత్రమే ఇవ్వబడుతుంది. ఈ సంస్కృతులలో, చప్పట్లు క్వయర్ లేక సంగీతకారుడు ఆరాధనకు బదులుగా ఒక కన్సర్ట్ వాతావరణాన్ని సృష్టించినప్పుడు జరుగుతాయి.
లేఖనము సూటిగా ఈ విషయమును గూర్చి మాట్లాడదు కాబట్టి, మనము ఖచ్చితమైన వ్యాఖ్యలను నివారించాలి. చప్పట్లు అనునది దేవుని స్తుతించుటకు స్వాభావిక ఆనందకరమైన ప్రతిస్పందన అయితే, అది ఆరాధన కార్యము కావచ్చు. ఒకవేళ చప్పట్లు “మన వినోదము కొరకు ఈ వ్యక్తి బాగా ప్రదర్శించాడు” అని చెబితే, అది మన ఆరాధనకు ఆటంకం కలిగించవచ్చు.
చప్పట్లు కొట్టుట వెనుక ఉన్న హేతువును సంఘ ప్రజలు మరియు సంగీతకారులు ఇరువురు గుర్తించాలి. సంఘములో ఉన్న ప్రజలు తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి: “నేను ఎందుకు చప్పట్లు కొడుతున్నాను? నా చప్పట్లు దేవుని స్తుతించుట ద్వారా పురికొల్పబడినవా, లేక ప్రదర్శించిన వ్యక్తిని ప్రశంసించుటకు పురికొల్పబడినవా?”
సంగీతకారుడు ఇలా ప్రశ్నించాలి: “సంఘ ప్రజలు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? నా పాట **దేవుని స్తుతించుట అను ఆనందకరమైన కార్యమును ప్రేరేపించిందా, లేక నా పాట నా నైపుణ్యతల వైపుకు దృష్టిని ఆకర్షించిందా? నేను ఆరాధనను నడిపించానా?” ఆరాధన నాయకులముగా మన ఆరాధన మన సామర్థ్యతల తట్టుగాక దేవుని తట్టు చూపునట్లు మనము జాగ్రత్తవహించాలి.
చెకప్
ఆరాధన సమయములో మీ సంఘము చప్పట్లు కొడితే, అది నిజముగా దేవుని స్తుతించుట అయ్యున్నదా లేక ప్రదర్శించిన వ్యక్తిని కొనియాడు వ్యక్తీకరణ అయ్యున్నదా?
రోమా 14 మరియు ఆరాధన శైలులు
► రోమా 14:1-23ను చదవండి.
లేఖనము స్పష్టముగా మాట్లాడని ప్రశ్నార్థకమైన విషయములకు రోమా 14 కొన్ని ప్రాముఖ్యమైన మార్గదర్శకములను ఇస్తుంది. మాంసము తినుట లేక ప్రత్యేకమైన దినములను ఆచరించుటలో అసమ్మతి తెలుపు ప్రజలను ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్నాడు. అతడు ఈ క్రింది నియమములను ఇచ్చుచున్నాడు.
(1) ప్రశ్నార్థకమైన విషయములను గూర్చి ఇతరులకు తీర్పుతీర్చవద్దు (రోమా 14:1-13).
లేఖనము స్పష్టముగా మాట్లాడని విషయములలో, మనము మనతో అసమ్మతి తెలుపువారి విషయములో మనస్సాక్షి యొక్క స్వాతంత్ర్యమును అనుమతించాలి. మనము లేఖనము కంటే ఎక్కువ నిశ్చయముగ మాట్లాడకూడదు!
ఎక్కువ పరిపక్వతగల విశ్వాసి యొక్క ఎంపికల ద్వారా తక్కువ పరిపక్వతగల విశ్వాసికి హాని కలిగే అవకాశం ఉందని పౌలు గుర్తించాడు. ఇట్టి సందర్భములో, ప్రేమ నియమము ప్రకారం బలహీనుల కొరకు మనము మన స్వాతంత్ర్యమును పరిమితము చేసుకోవాలి. మన స్వాతంత్ర్యముల కొరకు క్రీస్తు మరణించిన వ్యక్తిని నాశనము చేయవద్దు.
పౌలు చేసిన వ్యాఖ్య క్రైస్తవ స్వభావములోని అన్ని విభాగముల కొరకు బలమైన మాదిరిగా ఉన్నది; “కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.” (1 కొరింథీయులకు 8:13)
(3) విశ్వాసము ద్వారా కార్యములు చేయండి, సందేహముతో కాదు (రోమా 14:23).
ఇది యౌవ్వన క్రైస్తవుల కొరకు ఒక కీలకమైన నిర్ణయము అయ్యున్నది. “విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.” మరొక వ్యక్తిని సంతోషపరచుటకు మనము ఎన్నడును మన మనస్సాక్షిని ఉల్లంఘించకూడదు. “అనుమానించువాడు తినినయెడల విశ్వాసములేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును.”
ఆరాధన శైలులకు ఈ నియమములను అనువర్తించినప్పుడు, వి మనలను హెచ్చరిస్తాయి:
1. మీరు అసౌకర్యముగా భావించు శైలిని ఉపయోగించు ప్రజలకు తీర్పుతీర్చవద్దు. లేఖనము స్పష్టముగా మాట్లాడని పక్షమున మీరు తీర్పు తీర్చుటకు నిదానించాలి.
2. క్రొత్త విశ్వాసికి ఆటంకమును కలిగించు సంగీతమును ఉపయోగించవద్దు. కొన్ని సంగీత శైలులు అనైతికతతో ముడిపడియున్న సంస్కృతి నుండి ఒక విశ్వాసి వచ్చుచున్న యెడల, అట్టి శైలి ఆ విశ్వాసికి ఎన్నడును సహాయకరముగా ఉండదు. క్రైస్తవ విశ్వాసి యెడల మీరు కలిగియున్న ప్రేమ అతని ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకము కలిగించు ప్రతి విషయమును మీరు నివారించునట్లు మిమ్మును ప్రేరేపించాలి.
3. మీ మనస్సాక్షిలో సందేహములు ఉంటె, మీ స్వాతంత్ర్యమును ఉపయోగించవద్దు. మీరు పరిమితులను పరీక్షించకూడదు. దేవుని యెడల ప్రేమ, మీ మనస్సాక్షిలో సందేహములను రేపు ప్రతి విషయమును నివారించునట్లు మిమ్మును ప్రేరేపించాలి.
[1]Scott Aniol, Worship in Song (Winona Lake, IN: BMH Books, 2009), 135-140
ఆరాధనలో పిల్లలు మరియు యౌవ్వనులను పాలుపంచుకొనునట్లు చేయుట
“ఆరాధనలో పిల్లలను మరియు యౌవ్వనులను మనము ఎలా పాలుపంచుకొనునట్లు చేయగలము? పెద్దల సభను వారు అర్థము చేసుకునే వరకు వారి కొరకు వేరొక కూడికను నిర్వహించాలా? నిజముగా ఆరాధించునట్లు మనము పిల్లలను మరియు యౌవ్వనులను ఎలా ప్రేరేపించగలము?”
అనేక సంఘములు ఆరాధనలో పిల్లలు, యౌవ్వనులు మరియు పెద్దలను వేరు చేస్తారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి: చిన్న పిల్లలు పెద్ధలకు ఆరాధనలో ఆటంకము కలిగిస్తారు అని, ఆరాధన కూడికలో జరుగుతున్న విషయములను పిల్లలు మరియు యౌవ్వనులు అర్థము చేసుకోలేరు అను విషయం.
యౌవ్వనులు లేక పిల్లలకు వేరుగా కూడికలను జరిగించుటను నిషేధించునట్లు లేఖనములో ఏమియు లేదు. అయితే, కనీసం మూడు విషయములను పరిగణించాలి.
1. లేఖనములో, ఆరాధన పలుతరములకు చెందినది. ఆరాధనలో పిల్లలు మరియు యౌవ్వనులతో భిన్నముగా వ్యవహరించాలని లేఖనము సూచించుటలేదు. దేవాలయ ఆరాధనలో, బలి అను ఆచారమును కుటుంబము కలిసి ఆచరించేది. ఆరాధన సమయములో ఆదిమ సంఘము పిల్లలు లేక యౌవ్వనులను వేరు చేసింది అని సూచించు విషయము క్రొత్త నిబంధనలో ఏదియు లేదు.
2. పలు తరముల ఆరాధన క్రీస్తు శరీరమును ఐక్యపరుస్తుంది. సమకాలీన ఆరాధన మరియు సాంప్రదాయిక ఆరాధన కొరకు భిన్నమైన కూడికలను ఏర్పాటు చేయుట శరీరము యొక్క ఐక్యతను తగ్గించు విధముగానే, పిల్లలు మరియు యౌవ్వనుల కొరకు భిన్నమైన కూడికలను నిర్వహించుట సంఘ కుటుంబములో భాగమైయున్నామను అవగాహనను వారిలో తగ్గించుతలు చేసే అవకాశం కలిగిస్తుంది. మరొక వైపున, సంఘ కుటుంబము యొక్క ఆరాధనలో పిల్లలు మరియు యౌవ్వనులను చేర్చినప్పుడు, వారు క్రీస్తు శరీరములో విలువైన భాగమైయున్నారని ప్రతి ఒక్కరు అర్థము చేసుకుంటారు (1 తిమోతికి 4:12).
3. పలుతరముల ఆరాధన ద్వారా, విశ్వాసము తరువాతి తరమువారికి అందించబడుతుంది. ఆరాధించుట ద్వారా మనము ఆరాధనను నేర్చుకుంటాము. అది జాగ్రత్తగా ప్రణాళిక చేయబడితే తప్ప, పిల్లల కూడిక పిల్లలు పెద్దల కూడికలో జోక్యం చేసుకోకుండా చేయుటకు పిల్లలను ఆహ్లాదపరచే సమయముగా మారిపోతుంది. ఇలా మనము చేసినప్పుడు, మన పిల్లలు ఆరాధనను గూర్చి ఎలా నేర్చుకుంటారు?
ఐక్య ఆరాధన కూడికలో భాగముగా యౌవ్వనులు మరియు పిల్లలు
యౌవ్వనులు మరియు పిల్లలు అన్ని వయస్సుల వారితో మాట్లాడు ఐక్య ఆరాధన కూడికలో తరచుగా పాలుపంచుకొనవచ్చు. దీనిలో ముఖ్య సందేశ అంశము మీదనే పిల్లల కొరకు చిన్న సందేశము ఇచ్చుట భాగమైయుండవచ్చు.
పిల్లలు లోతైన సత్యమును అర్థము చేసుకోలేరు అని మనము ఊహించినప్పుడు, ఆత్మీయ వివేకము కొరకు వారికి తగినంత విలువను ఇచ్చు విషయములో మనము విఫలమవుతాము. ప్రతి వ్యక్తిని వెలిగించువాడు పరిశుద్ధాత్మ, వారు పెద్దలైనా సరే లేక పిల్లలైనా సరే (1 కొరింథీయులకు 2:10). పెద్దల కూడికలో కూడా, ఆ చిన్న మనస్సులతో పరిశుద్ధాత్మ సత్యమును మాట్లాడగలడు. పెద్దల ఆరాధనలో పిల్లలను చేర్చుట కొరకు మనము వారికి ఆరాధనను గూర్చి బోధించవలసియుంటుంది. మనము పిల్లలకు ఆరాధనను వివరించవచ్చు. లేఖన పఠనము మరియు పాటలలోని కఠినమైన పదములను మనము నిర్వచించవచ్చు. పెద్దల కొరకు కూడా కొన్నిసార్లు ఆ పదములను నిర్వచించవలసియుంటుంది! ఆరాధనలో పిల్లల కొరకు సమయమును కేతాయించుట ద్వారా, మిగిలిన శరీరముతో కలిసి ఆరాధకులుగ ఎదుగుటకు మనము వారికీ అవకాశం ఇస్తాము.
అనేక సంఘములు పిల్లలు మరియు యౌవ్వనుల కొరకు వేర్వేరు కూడికలను నిర్వహిస్తాయి. ఈ కూడికలు ఆరాధనగా ఉండాలిగాని, వినోదముగా కాదు. పిల్లలు మరియు యౌవ్వనులు ఆరాధించుటను నేర్చుకొనకపోతే, వారు ఆత్మీయ పరిపక్వతలోనికి ఎదగలేరు. చాక్లెట్ల ద్వారా ఒక చిన్న బిడ్డ మంచి శారీరిక ఆరోగ్యమును ఎలా పొందుకోలేడో, ఆత్మీయ చిరు తిండి ద్వారా ఒక చిన్న బిడ్డ ఆత్మీయ ఆరోగ్యమును అభివృద్ధి చేసుకోలేడు.
ఒక సంఘము వేరే యౌవ్వనుల / పిల్లల కూడికను నిర్వహిస్తుంటే, అది నిజముగా ఆరాధన కూడికగా ఉండునట్లు మనము చూచుకోవాలి. యౌవ్వనులు మరియు పిల్లల ఆరాధనలో లేఖన అధ్యయనం ఉండాలి. పిల్లలకు, లేఖన సత్యమును పునరుద్ఘాటించుటకు ఆకర్షణీయమైన దృశ్యములను చూపాలి.
కూడికలో ప్రసంగము లేక బైబిలు పాఠము ఉండాలి మరియు అది దేవుని వాక్యమును యౌవ్వనులు మరియు పిల్లల యొక్క అవసరతలకు అనువర్తించాలి. బైబిలును బోధకుడు ప్రేమతో పట్టుకోవాలి. పిల్లలు మరియు యౌవ్వనులు వారు గౌరవించు పెద్దలు దేవుని వాక్యమును ఉపయోగించుటను చూచుట ద్వారా దానిని గౌరవించుటను నేర్చుకుంటారు.
బైబిలు సత్యమును మాట్లాడు పాటలు కూడికలో చేర్చబడాలి. దానిలో ప్రార్థనా సమయము, అనగా స్తుతులు మరియు విన్నపములు ఉండాలి. పిల్లలు తమ బహుమానములను దేవుని యొద్దకు తెచ్చు అర్పణలు దానిలో ఉండాలి. పిల్లలు లేక యౌవ్వనుల కూడికలో ఒక సాధారణ ఆరాధన కూడికలో ఉండు అన్ని విషయములు ఉండాలి.
పిల్లలకు ప్రార్థనను నేర్పుట: “ప్రార్థనా చేయి”
బొటనవేలు మనకు సన్నిహితుల (కుటుంబము) కొరకు ప్రార్థించుటను మనకు జ్ఞాపకము చేస్తుంది.
చూపుడువేలు ప్రజలను యేసు వైపుకు చూపువారి కొరకు (సంఘ కాపరులు, బోధకులు, మరియు మిషనరీలు) ప్రార్థించాలని మనకు జ్ఞాపకము చేస్తుంది.
మధ్యవేలు అన్నిటి కంటే పొడవాటిది. మన దేశము, స్కూల్, సంఘము, మరియు ఇంటి నాయకుల కొరకు ప్రర్తించాలని ఇది మనకు జ్ఞాపకము చేస్తుంది.
నాల్గవవేలు అన్నిటి కంటే బలహీనమైనది. కేవలం నాల్గవ వేలును మాత్రమే ఎత్తుటకు ప్రయత్నించుట ద్వారా దీనిని చూపండి. ఇది బలహీనులు మరియు యేసు యొక్క అవసరతలో ఉన్నవారికి కొరకు ప్రార్థించమని జ్ఞాపకము చేస్తుంది.
ఐదవవేలు అన్నిటి కంటే చిన్నది. ఇది మిమ్మును గూర్చి మీరు ప్రార్థించుకోవాలని జ్ఞాపకము చేస్తుంది.
మొత్తం చేతిని ఎత్తుట దేవుని స్తుతించమని మనకు జ్ఞాపకము చేస్తుంది.
ప్రార్థన చేయి యౌవ్వన అరాధికుల యొక్క ప్రార్థనా స్థాయిని లేవనెత్తగల ప్రార్థనా విధానము అవుతుంది.
సారాంశం
మన పిల్లలు పరిపక్వతగల విశ్వాసులుగా ఎదగాలని మనము చూడగోరితే, మనము వారికి ఆత్మీయ పోషణ ఇవ్వాలి. ఐక్య కూడికలో లేక వేరే కూడికలో, మనము మన పిల్లలను ఆరాధనలో నడిపించాలి.
చెకప్
పిల్లు మరియు యౌవ్వనుల కొరకు మీరు ప్రత్యేకమైన కూడికలు కలిగియున్నా లేకపోయినా, మీ పిల్లలు మరియు యౌవ్వనులకు మీరు ఆరాధించుటను నేర్పుతున్నారా?
[1]ఈ భాగము హోబే సౌండ్ బైబిల్ కాలేజీలో ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ గా ఉన్న శ్రీమతి క్రిస్టిన బ్లాక్ యొక్క రచనలను ఉపయోగిస్తుంది.
ఆరాధనలో భావనలు
“మా దేశములోని ప్రజలు చాలా భావనాత్మకమైనవారు, మరియు మా ఆరాధన చాలా తరచుగా భావనాత్మక జీవన విధానమును ప్రతిబింబిస్తుంది. మా ఆరాధన సంగీతము సాధారణంగా వేగముగా, బిగ్గరగా, మరియు లయలో ఉంటుంది. అది మేము పాలుపంచుకొనుటకు మరియు భావనలను వ్యక్తపరచుటకు అవకాశం ఇస్తుంది. అయితే, సంగీతము కేవలం ఒక భావన మాత్రమే అని నేను భయపడుతున్నాను. మా సంగీతము నిజమైన ఆరాధనగా గుర్తించబడుతుందో లేదో నాకు తెలియదు.”
నిజమైన ఆరాధన ఆత్మతోను సత్యముతోను ఆరాధన అయ్యున్నది. నిజమైన ఆరాధనలో భావనలు ఉంటాయిగాని, అది కేవలం భావన మాత్రమే కాదు. ఆరాధనలో భావనలకు సంబంధించిన రెండు తప్పిదములు మనలను దారిమళ్ళించవచ్చు.
కొందరు ఆరాధకులు ఆరాధనలో భావనలను తిరస్కరిస్తారు. వారు ఆరాధనను దేవునితో జ్ఞానయుక్తమైన సంభాషణ అని చెబుతారు; దేవుని కలుసుకొనుటలోని భావనాత్మక కోణమును గుర్తించుటలో వారు విఫలమవుతారు. నిజమైన ఆరాధన భావనలతో మాట్లాడుతుంది. మన ఆరాధన కూడిక దేవుడు తనను తాను బయలుపరచుకొనినదానికి భావనాత్మక స్పందనను వ్యక్తపరచుటకు ఆరాధకులకు అవకాశముగా ఉండాలి.
(2) ఆరాధనలో భావనలను అతిగా-ఉద్ఘాటించు తప్పిదము.
దీనికి వ్యతిరేకమైన అపాయము ఆరాధనలో కేవలం భావనలతో మాట్లాడు తప్పిదము. జ్ఞానమును నిర్లక్ష్యము చేసి, కేవలం భావనలతో మాట్లాడు ఆరాధన 1 కొరింథీ 14:15ను ఉల్లంఘిస్తుంది, “కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.” ఆరాధనలోని యే విషయమైనా ఈ శోధనలో పడే అవకాశం ఉంది; లేఖనభాగమునకు నమ్మకముగాలేని ఒక నాటకీయమైన ప్రసంగము; బైబిలు సత్యమును మాట్లాడుటలో విఫలమైయ్యే భావనాత్మక సంగీతము; ఆరాధకుల భావనలను వంచించు ఆరాధన అలవాట్లు. కేవలం భావనలతో మాత్రమే మాట్లాడు ఆరాధన నిజమైన ఆరాధన కాదు.
నిజమైన ఆరాధన: ఆత్మతోను సత్యముతోను ఆరాధన
ఆరాధన కొరకు బైబిలు మాదిరి భావనలను గౌరవిస్తూనే, మనము బోధించు మరియు పాడువాటి యొక్క సత్యమును జాగ్రత్తగా సమీక్షిస్తుంది. సంగీతము ఒక భావనల మాధ్యమం కాబట్టి, మనము పాడు విషయముల యొక్క సత్యమును సమీక్షించుటకు మనము విశేషముగా జాగ్రత్తవహించాలి. అయితే, సరిగా ఉపయోగించిన యెడల, మనస్సు మరియు భావనలు రెంటితో మాట్లాడు సత్యమును తెలుపుటకు సంగీతము విశేషముగా ప్రభావవంతముగా ఉంటుంది.
జాన్ వెస్లీ ఆరాధనలో భావనకు విలువనిచ్చాడు. అతడు ఒక సంఘమును “రాళ్లవలె చచ్చినవారు – చాలా నిశ్శబ్దముగా, మరియు చాలా పట్టింపులేకుండా ఉన్నారు” అని వర్ణించాడు. సత్యమును ఎదుర్కొనుట భావనాత్మక స్పందనను పురికొల్పాలని అతడు నమ్మాడు. అదే సమయములో, నిజమైన ఆరాధన నుండి దారిమళ్ళిన భావనాత్మక వ్యక్తీకరణలను విమర్శించుటకు అతడు వెనుకాడలేదు.
తీవ్రతలను గూర్చి వెస్లీ హెచ్చరించాడు; భావనలను తిరస్కరించుట లేక మనలను నియంత్రించుటకు వాటికి అవకాశం ఇచ్చుట. “మనము ఒకటి లేక మరొక తీవ్రతలోనికి వెళ్లవలసిన అవసరత ఏమైనా ఉందా?[2] మనము మధ్యలో ఉంటూ, తప్పిదము మరియు ఉత్సాహము అను ఆత్మకు తగినంత దూరముగ ఉంటూ, దేవుని వరము మరియు ఆయన పిల్లలతో సహవాసము అను గొప్ప ధన్యతను విడిచిపెట్టకుండా ఉండలేమా?” ఇది నేడు మన కొరకు మంచి మాదిరి అయ్యున్నది; ఆరాధనలో భావనల యొక్క ప్రాముఖ్యతను గౌరవించుచు, దేవుడు మరియు ఆయన సత్యము మీద నుండి మన దృష్టిని తప్పించు తీవ్రతలను నివారించుట.
భావోద్వేగము మరియు సత్యము: ఒక క్రైస్తవుని అనుభవము [3]
“స్వాభావికముగా, నేను భావనాత్మకముగా సున్నితమైన వ్యక్తిని. సంగేతము నా భావనల మీద గొప్ప ప్రభావమును చూపగలదు. నా భావనాత్మక స్పందనల మీద ఎక్కువ విశ్వాసము ఉంచుట ద్వారా కొన్ని సంవత్సరముల క్రితం నేను ఒక పాఠం నేర్చుకున్నాను.
“ఒక అందమైన ఆలాపనగల ఒక పాటను నేను వినినప్పుడు, నేను బహుగా కదల్చబడ్డాను. ఆ పాట ముందుకు కొనసాగుచుండగా, నేను ఏడ్చుట ఆరంభించాను. పాట ముగిసే సరికి, నేను ఒక లోతైన ఆత్మీయ అనుభవమును ఎదుర్కొన్నాను అని భావించాను.
“అయితే, నేను రెండవసారి వినినప్పుడు, నేను ఒక నిర్ఘాంతపోయే విషయమును కనుగొన్నాను: ఈ పాట బైబిలులోని దేవుని ఆరాధించు పాట కాదు. అది ఒక అబద్ధ మత దేవతను స్తుతించు పాట. ఆ పాటలోని మాటలు అబద్ధ బోధలు.
“నా భావనలు చాలా సులువుగా వంచించబడవచ్చు, ముఖ్యముగా సంగీతము ద్వారా, అని ఆ రోజు నేను నేర్చుకున్నాను. అనగా సంగీతమునకు ఇవ్వబడు ప్రతి భావనాత్మక ప్రతిస్పందనలు అనర్హమైనవి అని కాదు, కాని నేను పాటల యొక్క మాటలను విశ్లేషించాలని అర్థం. అవి దేవుని యొద్ద నుండి వచ్చినవి అను నిశ్చయతను కలిగియుండుటకు నేను ‘ఆత్మలను పరీక్షించాలి’.”
చెకప్
మీ ఆరాధన మనస్సు మరియు భావనలు రెంటితో మాట్లాడుతుందా? అది లేఖనమునకు నమ్మకముగా ఉన్నదో లేదో చూచుటకు మీరు పాడు మరియు బోధించు విషయములను మీరు జాగ్రత్తగా సమీక్షించుచున్నారా?
ఆరాధనను ఒక వినోదముగా చూచుటను గూర్చి వారెన్ వియర్స్బి ఇచ్చిన హెచ్చరికతో ఈ పాఠం ఆరంభమైయ్యింది.[1] మన కూడికలలో దేవునికొరకుగాక వినోదము కొరకు చూసినప్పుడు మనము ఆరాధనను అల్పమైనదిగా చేస్తాము అని అతడు హెచ్చరించాడు. “సంఘములు నేటికి ఆరాధన అను పదమును ఉపయోగించుచున్నారు గాని దాని అర్థము మారిపోయింది. కూడికలో దేవుడు లక్ష్యముగా ఉన్నను లేకపోయినను, వారు సంఘ ప్రజల కొరకు సిద్ధపరచిన విషయములకు మతపరమైన గౌరవమును ఇచ్చుటకు ప్రజలు ఆరాధన అను పదమును ఉపయోగిస్తారు.” ఇది ఎలా జరుగుతుంది?
మనము పరిశుద్ధమైన స్థలము నుండి ఒక ధియేటర్ లోనికి మారతాము
ఆరాధన ఎక్కడైనా జరగవచ్చు. క్రైస్తవులు హింసకుల నుండి దాగుకొనుచు గుహలలో లేక సంఘ రిట్రీట్ లలో క్యాంపు ఫైర్ యొద్ద ఆరాధించారు. క్రైస్తవులు వ్యక్తిగత గృహములలో లేక గొప్ప భావనములలో ఆరాధించారు. క్రైస్తవులు ఆసుపత్రి పడక మీద, విమాన ప్రయాణములో, లేక పని చేయుచు ఆరాధించారు. ఆరాధన ఎక్కడైనా జరగవచ్చు, అయితే చాలా వరకు సామజిక ఆరాధనలు ఒక విధమైన భవనములో జరుగుతాయి. “సంఘ ప్రజలు ఎక్కడో ఒక చోట సమకూడలి, మరియు ఆ ‘స్థలము’ అయితే పరిశుద్ధ స్థలము అవుతుంది లేకపోతే ధియేటర్ అవుతుంది.”
వీటి మధ్య తేడా ఏమిటి? పరిశుద్ధ స్థలము “వారి దేవుని మహిమపరచుట కొరకు మరియు ఆరాధించుట కొరకు ప్రజలు సమకూడు స్థలము.” ధియేటర్ అనగా, ప్రజలు ప్రదర్శనను చూచుటకు సమకూడు స్థలము. మీ సంఘ భవనము ఒక ధియేటరా లేక పరిశుద్ధ స్థలమా?
మనము సంఘ ప్రజల నుండి వీక్షకులలోనికి మరతాము
“క్రైస్తవ సంఘము యేసు క్రీస్తును ఆరాధించుటకు మరియు ఆయనను మహిమపరచుటకు సమకూడుతుంది. వీక్షకులు ప్రదర్శనను చూచుటకు మరియు వినుటకు సమకూడతారు.” సంఘము దేవుని మీద దృష్టిపెడుతుంది. వీక్షకులు ప్రదర్శకుల మీద దృష్టిపెడతారు. సంఘములో పాలుపంచుకొనువారు ఉంటారు; వీక్షకులలో చూచువారు ఉంటారు. మీరు సంఘమును నడిపించుచున్నారా లేక వీక్షకులనా?
మనము పరిచర్య నుండి ప్రదర్శనలోనికి వెళ్తాము
“మనము ప్రధానముగా దేవుని సత్యమును వ్యక్తపరచుటకు పరిచర్య చేస్తాము; మన సామర్థ్యతలను చూపుకొనుటకు ప్రదర్శిస్తాము. దేవుడు చూస్తున్నాడు మరియు ఆయన ఆమోదమే సమస్తము అని సేవకునికి తెలుసు; ప్రదర్శకుడు వీక్షకుల యొక్క ప్రశంసను కోరతాడు.” పరిచర్య అనేక విధములుగా ఒక ప్రదర్శన కావచ్చు: వినువారి వినోదము కొరకు ప్రదర్శించు సంగీతకారుడు, ఒక విధమైన భావనాత్మక ప్రతిస్పందనను కోరు స్తుతి బృందము, లేక ప్రజల యొక్క ప్రతిస్పందన ద్వారా తన ప్రసంగమును కొలచుకొను ఒక ప్రసంగీకుడు. మీరు పరిచర్య చేయుచున్నారా లేక ప్రదర్శించుచున్నారా?
[1]ఈ విభాగంలోని ఉల్లేఖనలు Warren Wiersbe, Real Worship (Grand Rapids: Baker Books, 2000), 169-174 నుండి అనుకూలించబడినవి.
ముగింపు: ఒక మిషనరీ యొక్క సాక్ష్యం – ఆచరణలో రోమా 14
“ఒక మిషనరీ స్నేహితుడు మరియు ఎనిమిదిమంది ఫిలిప్పీన్స్ పాస్టర్లతో కలిసి ఒక నాయకత్వ సెమినార్‌కు హాజరైనప్పుడు, వారి ఆరాధన శైలి కారణంగా ఇతరులను తీర్పు తీర్చుట గురించి నేను ఒక విలువైన పాఠాన్ని నేర్చుకున్నాను.[1]
“మేము ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లాము మరియు మా సీట్లు చాలా పైన ఉన్నాయి. కప్పులో నుండి పెద్ద స్క్రీన్లు మరియు లౌడ్ స్పీకర్ లు వ్రేలాడుతున్నాయి. ఆరాధనలో నడిపించు వ్యక్తి ఒక ఫిలిప్పియన్స్ దేశ స్త్రీ మరియు ఆమె వెనుక స్తుతి బృందము ఉన్నది. వారు చప్పట్లు కొట్టుచు ఉత్సాహముగా ఉన్న ప్రజలను ‘ఎస్ లార్డ్, ఎస్!” అను పాటలో నడిపిస్తున్నారు. అది నాకు చాలా ఎక్కువ ఉత్సాహముగా అనిపించింది.
“సంగీతమును పునరావృతం చేయుట, బిగ్గరగా పాడుట, శరీర కదలికలు నాకు చాలా ఆందోళన కలిగించాయి. పరిశుద్ధమైన నాయకులుగా ఉండాలని మేము మాతో ఉన్న ఫిలిప్పియన్స్ దేశ సంఘ కాపరులను ప్రేరేపించాము, మరియు ఇప్పుడు మేము వారిని ఇలాంటి ఆరాధనలోనికి తీసుకొని వచ్చాము! ఆ సంఘ కాపరులలో ఆత్మీయులైన ఒకరు తల క్రిందికి దించుకొను నిలబడియున్నాడు. అతడు మౌనముగా ప్రార్థించుచున్నాడు మరియు కూడికలో పాలుపంచుకొనుట లేదు.
“ఇప్పుడు ఏమి చేయాలి?’ అని నేను ఇబ్బందిపడుతున్నాను. తరువాత అదే సంఘ కాపరి చప్పట్లు కొట్టుచు బిగ్గరగా హృదయపూర్వకముగా పాడుటను నేను చూశాను. అతని ముఖము ప్రకాశించుచున్నది, మరియు అతడు ఆరాధనలో లీనమైపోయాడు.
“ఆ రోజు సాయంత్రం, కాన్ఫరెన్స్ లో నాయకత్వమును గూర్చి మేము ఏమి నేర్చుకున్నామో పంచుకున్నాము. సంభాషణ మధ్యలో, అతడు ఆ విధముగా మార్పు చెందుటకు కారణం ఏమిటో నేను ఆ నాయకుని అడిగాను. ‘నీవు మౌనముగా పాలుపంచుకోకుండా ఉండి, ఒక్కసారిగా పాటలను ఎలా ఆస్వాదించగలిగావు?’
“‘అతడిచ్చిన జవాబు చాలా బలమైనది. ‘నాకు సంగీతము ఇబ్బందిని కలిగించింది. కాని నేను ప్రార్థించినప్పుడు, ఆ కూడికలోని ఆరాధన నాయకుడు మరియు ప్రజలు వారి పూర్ణ హృదయములతో దేవుని ఆరాధించుచున్నారని దేవుడు నాకు చూపాడు. వారికి తెలిసినదానిలో నుండి వారు దేవునికి ఉత్తమమైన దానిని ఇచ్చుచున్నారు. “నీవు వారిని నాకు విడిచిపెట్టగలవా? ఇతరులకు తీర్పుతీర్చకుండా నీవు నన్ను అరాధించగలవా?” అని ప్రభువు అన్నాడు.”’
“తన చుట్టు ఉన్నవారికి తీర్పుతీర్చకుండా తాను ఎల్లప్పుడూ చేయు విధముగా ఆ సంఘ కాపరి దేవుని ఆరాధించుట ఆరంభించాడు. ఇది ఆరాధన పట్ల ఆ సంఘ కాపరి యొక్క ధోరణిని మార్చిందా? లేదు; అతడు తన సంఘమునకు తిరిగివెళ్లిన తరువాత, ఆ రోజు అతడు చూసిన ఆరాధన శైలిని అనుకరించలేదు.
“మా సంఘములలో నాయకునిగా, సంఘ ప్రజలను వంచించకుండా ఆరాధనలో స్వాతంత్ర్యమును ఇవ్వాలని ఈ వ్యక్తి తరచుగా తన తోటి సేవకులను ప్రోత్సహించాడు. రెండు నియమములను సమతుల్యము చేయమని ఇతడు తన తోటి సేవకులను ప్రోత్సహించాడు:
1. మీ సంఘములో ఆరాధన కొరకు బైబిలు నియమములను జాగ్రతగా అనుసరించండి.
2. ఇతర సంఘముల యొక్క ఆరాధన శైలులను విమర్శించుట మానండి.”
[1]ఫిలిప్పీన్స్ దేశమునకు మిషనరీగా ఉండిన రెవ. డేవిడ్ బ్లాక్ యొక్క సాక్ష్యం
పాఠం 9 సమీక్ష
(1) ఆరాధన మరియు సంస్కృతి
ఆరాధన శైలులను సమీక్షించునప్పుడు, మనము సంస్కృతిని మరియు లేఖనమును సందిగ్ధతలో పెట్టకూడదు.
మన సంస్కృతి లేఖనమునకు విరుద్ధముగా ఉన్నప్పుడు, మనము మన సంస్కృతి యొక్క ఆకాంక్షలకు బదులుగా లేఖనములోని ఆజ్ఞలకు లోబడాలి.
లోకమునకు సువార్త ప్రకటించుటకుగాను, మన ఆరాధన మన సంస్కృతితో ప్రభావవంతమైన రీతిలో ఎలా మాట్లాడగలదు అని మనము ప్రశ్నించాలి.
(2) స్థానిక సంఘ ఆరాధన మరియు చుట్టు ఉన్న సంస్కృతి మధ్య ఉన్న సంబంధమును అర్థము చేసుకొనుటలో మూడు ప్రశ్నలు మనకు సహాయపడతాయి:
ఇక్కడ ఎవరు ఉన్నారు? సంఘములో భాగమైన సంఘ ప్రజల వైపుకు చూస్తుంది.
ఇక్కడ ఎవరు ఉండేవారు? సంఘ స్వాస్థ్యమును చూస్తుంది.
ఇక్కడ ఎవరు ఉండాలి? మనము చేరుటకు పిలువబడిన సమాజమును చూస్తుంది.
(3) మన సాంస్కృతిక గుర్తింపుకు సంగీతము కేంద్రమైయున్నది కాబట్టి, సంఘములు బైబిలానుసారమైన నమ్మకమైన మరియు సాంస్కృతికముగా సున్నితమైన సంగీతమును ఎన్నుకోవాలి.
(4) చప్పట్లు కొట్టుట ఆరాధనలో భాగము అయితే, మనము ఇలా ప్రశ్నించాలి, “నా చప్పట్లు దేవుని స్తుతించుట ద్వారా పురికొల్పబడినవా, లేక ప్రదర్శించిన వ్యక్తిని ప్రశంసించుటకు పురికొల్పబడినవా?”
(5) మనము చప్పట్లు కొట్టుట ప్రత్యేకమైన పాటకు ప్రతిస్పందనగా అయితే, మనము ఇలా ప్రశ్నించాలి, “నా ప్రశంస దేవుని స్తుతించుట ద్వారా పురికొల్పబడిందా, లేక ప్రదర్శించిన వ్యక్తిని ప్రశంసించుటకు పురికొల్పబదిందా?”
(6) మనము పిల్లలను మరియు యౌవ్వనులను పెద్దల కూడికలో ఉంచితే, అన్ని వయస్సులతో మాట్లాడు ఆరాధనను మనము సిద్ధపరచాలి.
(7) పిల్లలు మరియు యౌవ్వనుల కొరకు వేర్వేరు కూడికలు ఉంటే, కూడికలు వినోదముగాగాక ఆరాధనగా ఉండునట్లు మనము చూడాలి.
(8) మనము ఆరాధనలో భావనను అతిగా-ఉద్ఘాటించకూడదు మరియు తిరస్కరించకూడదు.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.