క్రైస్తవ ఆరాధనకు పరిచయం
క్రైస్తవ ఆరాధనకు పరిచయం
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 5: సంఘ చరిత్రలో ఆరాధన

1 min read

by Randall McElwain


పాఠ్య ఉద్దేశ్యములు

ఈ పాఠం ముగిసే నాటికి, విద్యార్థి:

(1) పలు ఆరాధన సంప్రదాయముల మధ్య ఉన్న భిన్నత్వములను గౌరవించుట.

(2) ఆరాధన కొరకు మారని నియమములు మరియు మార్పుచెందు ఆరాధన ఆచారముల మధ్య ఉన్న భిన్నత్వమును అర్థము చేసుకొనుట.

(3) ఆరాధన మన వేదాంతశాస్త్ర నమ్మకములను ప్రతిబింబిస్తుంది మరియు ఆ నమ్మకముల మీద ప్రభావము చూపుతుంది అని గుర్తించుట.

(4) పలు సంఘ సంప్రదాయముల ఆరాధన నుండి నేర్చుకొనిన పాఠములను నేటి ఆరాధనకు అనువర్తించుట.

ఈ పాఠము కొరకు సిద్ధపాటు

కీర్తనలు 100:1-5ను కంటస్థం చేయండి.

పరిచయం

సమీర్ సాంప్రదాయిక ఆరాధనకు విలువనిస్తాడు. సమకాలీన ఆరాధన కూడికలను నడిపించు ఆకాశ్ వారి నెలవారీ కూడికలో ఇలా అడిగాడు, “మీ కూడికలో మీరు ఏదైనా క్రొత్త విషయమును ఎందుకు ప్రయత్నించరు?”

“మేము బైబిలానుసారమైనవారము” అని సమీర్ జవాబిచ్చాడు. “బైబిలు ఒక ఆరాధన ఆచారమును ఆజ్ఞాపించని యెడల, ఆదిమ సంఘము యొక్క ఆరాధన ఆచారములకు అధనములో ఇతర విషయములను చేర్చు స్వాతంత్ర్యము మనకు లేదు. బైబిలు ఆరాధనను మార్చుటకు మనమెవరము? మా సంఘములో, మేము కేవలం కీర్తనలను మాత్రమే పడతాము. ఈ పాటలు ఆదిమ సంఘము యొక్క పాటలు; మాకు అవి చాలు!” [1]

ఆకాశ్ ఇలా స్పందించాడు, “చరిత్ర ప్రకటన గ్రంథం యొక్క ముగింపులో ఆగిపోయిందని నీవు ఆలోచించుచున్నట్లు నాకనిపిస్తుంది. రెండువేల సంవత్సరముల ప్రాచీనమైన ఆరాధన శైలితో మనము ఎలా సరిపెట్టుకోగలము? బైబిలు ఒక ఆచారమును నిషేధించనంత వరకు, మరియు ఒక ఆచారము సంఘమును విభజించనంత వరకు, మనము ఆరాధనను మన తరము యొక్క అవసరతలకు అనుసంధానము చేయాలి. మా సంఘములో, మేము అనేక పాటలు పడతాము. దేవుడు క్రొత్త పాటలను నిషేధించాలని కోరియుంటే, బైబిలు వాటిని ఖచ్చితముగా నిషేధిస్తుంది.” [2]

మనోజ్ యొక్క ప్రత్యుత్తరము ఆచరణాత్మకముగా ఉంది, “ఆరాధనను గూర్చి బైబిలు ఏమి చెబుతుందో మనము అధ్యయనం చేశాము. లేఖనము నుండి ఆరాధన నియమములు మనకు తెలుసు. ప్రతి తరములో ఇతర క్రైస్తవులు ఈ నియమాలను ఎలా అనువర్తించారో మనము చూడవలెను. సంఘ చరిత్రలో ఆరాధన ఎలా ఉండినది?”

ఆరాధనన గూర్చి చర్చించునప్పుడు మనోజ్ ఒక ప్రాముఖ్యమైన నియమమును అర్థము చేసుకున్నాడు. ఆరాధన కొరకు బైబిలు నియమములు మారనివిగా ఉన్నప్పటికీ, బైబిలులో ప్రతి ఆరాధన అనుభవము భిన్నముగా ఉన్నది. వివరములు భిన్నముగా ఉన్నాయి; ఆరాధనలోని ప్రాముఖ్యమైన విషయములు మాత్రం ఒకే విధముగా ఉన్నాయి. గత రెండు పాఠములలో మనము ఆరాధన యొక్క ప్రాముఖ్యమైన నియమాలను చూశాము, కానీ వివరములు మారుతాయి. వీటిని పరిగణించండి:

  • అబ్రాహాము ఆరాధించినప్పుడు తన గుడారము యొక్క ద్వారము యొద్ద ఉన్నాడు. ఎవరైనా దీనిని చదివి ఇలా అంటారు, “మీరు ఇంటి యొద్ద ఉన్నప్పుడు నిజమైన ఆరాధాన జరుగుతుంది.” కాని...

  • హెచ్చించబడియున్న ప్రభువును చూసినప్పుడు యెషయా దేవాలయములో ఉన్నాడు. ఎవరైనా దీనిని చదివి ఇలా అనవచ్చు, “మీరు సంఘ భవనములో ఉన్నప్పుడు నిజమైన ఆరాధన జరుగుతుంది.” కాని...

  • యోబు తల నుండి పాదముల వరకు కురుపులతో నిండుకొని ఇలా అన్నాడు, “వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను” (యోబు 42:5). ఎవరైనా దీనిని చదివి ఇలా అనవచ్చు, “ఆహా! మీరు దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు నిజమైన ఆరాధన జరుగుతుంది.”

ఇక్కడ విషయము మీకు అర్థమవుతుందా? ఆరాధనను అనేక విభిన్నమైన పరిస్థితులలో, విభిన్నమైన విధానములలో, విభిన్నమైన పద్ధతులను అనుసరించి చేయవచ్చు. చాలాసార్లు మనము ఆరాధన యొక్క మారుతున్న పరిస్థితులు, మారని నియమముల మధ్య సందిగ్ధత ఎదుర్కొంటాము.

ఈ పాఠములో, చరిత్ర అంతటిలో సంఘము ఆరాధన నియమములను అనువర్తించిన విధానమును చూద్దాము. ఇది దేవుని ప్రజలు ఆరాధించిన విభిన్నమైన విధానములను గూర్చి ఒక భావననిస్తుంది. అన్ని సందర్భములలో ప్రజలందరు ఒకే పద్ధతిలో ఆరాధించవలసిన అవసరత లేదని అర్థము చేసుకొనుటలో ఇది సహాయము చేస్తుంది అని ఆశించుచున్నాము. బదులుగా, మన పరిస్థితికి ఆరాధన యొక్క బైబిలు నియమములను ఎలా అనువర్తించాలో నిర్థారించుటలో దేవుని ఆత్మ యొక్క నడిపింపును మనము కోరవలసియున్నది.

ఈ పాఠములో, మనము ఆరాధించు విధానము మన నమ్మకములను ప్రతిబింబిస్తుంది అను విషయమును మనము చూద్దాము. మన ఆరాధన ఆచారములు, దేవుని గూర్చి మనకున్న నమ్మకములు మరియు మనము ఆయనను మనము ఆశ్రయించు విధానము ద్వారా ప్రభావితము చేయబడతాయి.

ఆరాధనను గూర్చి మీరు నిర్ణయములను తీసుకొనుచుండగా ఈ అవగాహన కీలకమైయున్నది. మీ నమ్మకములను తెలుపు విధముగా మీరు ఆరాధన కూడికను నడిపిస్తారా, లేక మరొక సంఘము యొక్క పద్ధతిని మీరు అనుకరించుటకు ప్రయత్నిస్తారా? మీరు మరొక సంఘమును అనుకరిస్తుంటే, దేవుని గూర్చి మరియు మీరు ఆయనను ఆశ్రయించు విధానమును గూర్చి ఆ సంఘ నమ్మకములను మీరు పంచుకొను విధముగా ఉండాలి. ఆరాధన మనము ఏమి నమ్ముతున్నామో చూపిస్తుంది.

► ఈ పాఠమును కొనసాగించుటకు ముందు, మీ ప్రస్తుత ఆరాధన కూడికలను చర్చించండి. మీ సిద్ధాంతమును గూర్చి ఒక వ్యక్తికి తెలియని యెడల, మీ ఆరాధన శైలి వారికి ఏమి చెబుతుంది? దేవుని గూర్చి మీకున్న అభిప్రాయము, దేవునితో మనకున్న సంబంధమును గూర్చి మీ అభిప్రాయము, మీ ఆరాధన కూడికకు ఫలితముగా సువార్త ప్రకటనను గూర్చి మీకున్న అభిప్రాయము నుండి వారు ఏమి నేర్చుకుంటారు?


[1]దీనిని ఆరాధన యొక్క “నియంత్రణ నియమము” అని పిలుస్తారు. జాన్ కెల్విన్ బోధించిన ఇది, లేఖనములో లేని ప్రతి ఆరాధన ఆచారములను నిషేధిస్తుంది. వాస్తవానికి, ఇది ప్రతి విధమైన వాయిద్య సంగీతమును (వాయిద్యములు క్రొత్త నిబంధన ఆరాధనలో ప్రస్తావించబడలేదు కాబట్టి) లేక కీర్తనలు మినహా ఇతర పాటల ఉపయోగమును నిషేధించింది. ఈ నియమమును అనుసరించు కొన్ని సంఘములు నేడు వాయిద్యములను మరియు పాటలను చేర్చారు; అయినను వారు ఆరాధన కొరకు నూతన పద్ధతులను నివారించుట కొనసాగించారు.
[2]దీనిని ఆరాధన యొక్క “నిర్ణాయక నియమము” అని పిలుస్తారు. సంఘము యొక్క సమాధానము మరియు ఐక్యతకు అవి ఆటంకము కలిగించనంత వరకు, లేఖనములో నిషేధించబడని ప్రతి ఆరాధాన ఆచారము అనుమతించబడినదే అని ఈ పద్ధతి బోధిస్తుంది.

రెండవ శతాబ్దములో ఆరాధన యొక్క చిత్రము

క్రొత్త నిబంధన తరువాత ఆరాధన యొక్క అత్యంత పురాతన చిత్రమును మనము క్రీ.శ. 113లో వ్రాయబడిన ఒక పత్రికలో చూస్తాము. బితినియ గవర్నర్ అయిన ప్లినీ, తాను ట్రాజన్ చక్రవర్తికి వ్రాసిన లేఖలో క్రైస్తవ ఆరాధనను వర్ణించాడు.[1] క్రైస్తవులు, “నిర్ణిత దినమున ఉదయము కాకమునుపే సమకూడి, దేవునిగా క్రీస్తుకు ఒక పాట వంతులవారిగా పాడి, ఒక ప్రమాణము చేసేవారు... దొంగతనము చేయము, మోసము చేయము, వ్యభిచారము చేయము అని... తరువాత వారు వెళ్లిపోయి, కొంత సేపటికి వచ్చి కలిసి భోజనము చేయుట ఆనవాయితీ.”

ప్లినీ మాటల ప్రకారం, బహుశా లేఖన పఠనమునకు స్పందనగా, పాటలు పాడుటకు మరియు నైతిక ప్రవర్తనను గూర్చి ప్రమాణము చేయుటకు ఆదివారమున ఉదయము కాక మునుపే క్రైస్తవులు కూడుకునేవారు. తరువాత రోజులో ఏదో ఒక సమయములో, వారు కలిసి భోజనము చేసేవారు, దానిలో బహుశా ప్రభువు బల్ల కూడా భాగమైయుండినది.

నాలుగు సంవత్సరములు తరువాత, జస్టిన్ మార్టిర్ ఆరాధనను గూర్చి మరింత వివరణాత్మకమైన వర్ణననిచ్చాడు.[2] క్రైస్తవులు అనైతికమైనవారు మరియు సామ్రాజ్యము పట్ల అపనమ్మకస్తులు అని సందేహించిన రోమా చక్రవర్తి ఎదుట క్రైస్తవ ఆరాధనను సమర్థించుటకు జస్టిన్ వ్రాశాడు. క్రైస్తవ ఆరాధన రోమా సామ్రాజ్యమునాకు ఎలాంటి ముప్పు కలిగించదు అని జస్టిన్ నిశ్చయతనిచ్చాడు. జస్టిన్ మాటల ప్రకారం, క్రైస్తవ ఆరాధనలో ఈ కింది విషయములు ఉన్నాయి:

1. లేఖన పఠనము.

2. సంఘ నాయకుని ప్రసంగము.

3. ప్రార్థన. వ్యక్తులు మౌనముగా ప్రార్థించేవారు; తరువాత నాయకుడు అధికారిక ప్రార్థనను చేసేవాడు, మరియు ప్రజలు దానికి “ఆమెన్” అని స్పందించేవారు. ప్రార్థన యొక్క ముగింపులో, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని చూపు పవిత్రమైన ముద్దుతో వారు ఒకరికొకరు అభివాదము చెప్పుకునేవారు.

4. ప్రభువు బల్లలో పాలుపంచుకొనుటతో కూడిక ముగించబడేది. కూడిక తరువాత, ఇద్దరు పరిచారకులు మిగిలిన రొట్టెను మరియు ద్రాక్ష రసమును రోగులుగా ఉన్న మరియు చెరసాలలో ఉరితీయబడుటకు సిద్ధముగా ఉన్న క్రైస్తవుల యొద్దకు తీసుకొనివెళ్లేవారు.

5. కూడిక ముగింపులో, ధనము లేక ఆహారము ఉన్నవారు వారి బహుమతులను నాయకుని యొద్దకు తీసుకొనివచ్చేవారు. అర్పణలను “అనాధలు మరియు విధవరాండ్రు యొద్దకు, రోగము లేక ఇతర కారణముల వలన అవసరతలో ఉన్నవారికి, మరియు మన మధ్యలో ఉన్న బంధకములలో ఉన్నవారి యొద్దకు మరియు పరదేశుల యొద్దకు” తీసుకొని వెళ్లేవారు.

రెండవ-శతాబ్దపు ఆరాధానలోని బలములలో ఒకటి సంఘ పాలుపంపులు. ప్లినీ మరియు జస్టిన్ మార్టిర్ ఇరువురు ఒక సాధారణ కూడికను వర్ణించారు, మరియు రోమా అన్య మర్మాత్మక మతములలో సామాన్యముగా ఉన్న దీర్ఘమైన ఆచారములు ఏవి కూడా దీనిలో లేవు. ఆరాధన సన్నిహితమైనది, మరియు చిన్న సమూహములు తమ ఇండ్లలో కూడుకొని చేసేవారు.

ఆరాధన మరియు జీవితము మధ్య ఉన్న సంబంధము మరొక బలమైయున్నది. ప్లినీ వ్రాసిన లేఖ నైతిక ప్రవర్తన పట్ల క్రైస్తవుడు కలిగియున్న సమర్పణను ప్రస్తావిస్తుంది. జస్టిన్ మార్టిర్ అవసరతలో ఉన్నవారికి సహాయము చేయుటకు బహుమతులను గూర్చి మాట్లాడాడు. ఆరాధనలో జీవితమంతా భాగమైయుంటుంది.

► రెండవ శతాబ్దపు ఆరాధనలోని ఏ విషయములు మీ ఆరాధనకు లాభమును చేకూర్చుతాయి? రెండవ శతాబ్దపు ఆరాధనలో మీరు ఏవైనా అపాయములను చూస్తున్నారా?


[1]Pliny, Letters 10.96-97, https://faculty.georgetown.edu/jod/texts/pliny.html నుండి జనవరి 26, 2023 న తిరిగి పొందబడింది.
[2]Justin Martyr, (Marcus Dods అనువదించిన) The First Apology of Justin (Chapter 67), https://en.wikisource.org/wiki/Ante-Nicene_Christian_Library/The_First_Apology_of_Justin_Martyr#Chapter_67 నుండి జనవరి 26, 2023 న తిరిగి పొందబడింది.

మధ్య యుగములలో ఆరాధన యొక్క చిత్రము

ఆరాధన యొక్క రెండవ చిత్రము కొరకు, 12వ శతాబ్దమును చూద్దాము. ఈ మధ్య సంవత్సరములలో, క్రైస్తవ్యము పవిత్రమైన రోమా సామ్రాజ్యమునకు అధికారిక మతమైపోయింది. క్రీ.శ. 313లో కాన్స్టంటైన్ ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ జారీచేసిన తరువాత, సంఘములు చాలా పెద్ద సంఘ భవనములను కట్టుట ఆరంభించాయి. ఐరోపాలో ఉన్న గొప్ప కేథడ్రాల్స్ అన్ని ఈ వెయ్యి సంవత్సరముల కాలములో కట్టబడినవి.

మధ్య యుగములలో, ఆరాధన మరింత వైభవమానముగా మారింది. అనుకూలమైన విధానములో, కేథడ్రాల్ ఆరాధన దేవుని వైభవమును చూపింది. మరకలు గల గాజు కిటికీలు చదువుట రానివారికి బైబిలు సన్నివేశములను తెలియపరచాయి. క్వయరువారు చక్కటి పాటలు పాడారు. ఆరాధన నాయకీయముగాను, అందముగాను ఉండేది.

మధ్య యుగములలో ఆరాధన యొక్క బలహీనతలు

ఆత్మీయత కంటే సౌందర్యము ప్రాముఖ్యమైయున్నది.

ఆరాధన కొరకు అందమైన వస్తువులను ఉపయోగించుట ఉద్ఘాటించబడింది: ధూపము, తర్ఫీదుపొందిన గాయకులు పాడిన సుదీర్ఘమైన సంగీతము, గంటలు, మరియు యాజకుల కొరకు ప్రత్యేకమైన వస్త్రములు. ఆత్మీయ విషయముల కంటే కళ ఎక్కువ ప్రాముఖ్యతను పొందింది.

ప్రజలు కూడికలను అర్థము చేసుకోలేకపోయారు.

కూడిక ల్యాటిన్ భాషలో, అనగా చాలా తక్కువ మందికి అర్థమైయ్యే భాషలో జరిగేది. చాలామంది స్థానిక యాజకులు తర్ఫీదు లేకుండా ప్రసంగించేవారు. ప్రార్థనలు అనేక వాక్యభాగముల కలయికగా ఉండేవి, మరియు చాలాసార్లు పొంతనలేకుండా ఉండేవి.

ప్రజలు కేవలం వీక్షకులుగా ఉండేవారుగాని, క్రియాత్మకముగా ఆరాధించేవారు కారు.

ప్రజలు చాలా తక్కువగా పాలుపంచుకునేవారు. సంఘమువారు కొనసాగుతున్న నాటికను, అనగా మాస్ నూ, చూసిన సమూహముగా ఉండేవారు. శ్రోతలు చూచుచుండగా యాజకులు ఆరాధనలోని సన్నివేశములను చేసేవారు. కూడిక యొక్క దృష్టి లేఖనము మీద గాక సంస్కారము మీద ఎక్కువగా ఉండేది.

రొట్టె, ద్రాక్ష రసము వాస్తవముగా క్రీస్తు శరీరము మరియు రక్తముగా మారిపోతుంది అని రోమన్ కాథలిక్ సంఘము బోధించింది (ఈ సిద్ధాంతమును ట్రాన్సబ్స్టాన్షియేషన్ అని పిలుస్తారు). చాలా మంది సాధారణ విశ్వాసులు ఈస్టర్ దినమున మాత్రమే ప్రభువు బల్లలో పాలుపంచుకోగలిగేవారు. యాజకుడు ద్రాక్షరసమును త్రాగి, రొట్టెను మాత్రమే సంఘమునకు ఇచ్చేవాడు.

సువార్త స్థానమును ఆచారములు తీసుకున్నాయి.

మన ఆరాధాన మన నమ్మకములను రూపుదిద్దుతుంది. మధ్య యుగములలో ఈ నియమము పనిచేయుట మనము చుస్థామూ; రోమన్ కాథలిక్ ఆరాధన వారి వేదాంతశాస్త్రమునకు ఆకారమునిచ్చింది. దేవుడు మానవ విషయములకు దూరముగా ఉన్నట్లు కనిపించింది. సామాన్య విశ్వాసులు దేవుని యొద్దకు తాము వెళ్లలేము అని భావించేవారు; బదులుగా, వారు యాజకుని ద్వారా మాత్రమే దేవునితో మాట్లాడగలము అని భావించుకునేవారు. యాజకుడు దేవునికి మరియు మనుష్యునికి మధ్య మధ్యవర్తి అయ్యాడు.

మధ్య యుగములలో ఆరాధన యొక్క బలము దాని వైభవము మరియు దేవుని ఎదుట భయము. శిల్పకళ, సంగీతము, నాటిక, మరియు అందమైన కళల ద్వారా, ఆరాధన దేవుని మహిమను కనిపరచింది.

అయితే, మధ్య యుగములలో ఆరాధనలోని బలహీనతలు వాటి బలముల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆరాధన కూడిక ఒక సాధారణ క్రైస్తవుడు కేవలం ఒక వీక్షకునిగా ఉండేవాడు. అనేక విధాలుగా, విషాదకరముగా మధ్య యుగముల ఆరాధన క్రొత్త నిబంధన ఆరాధన కంటే చాలా వేరుగా ఉన్నది.

ఆరాధన అపాయములు: అర్థరహితమైన ఆరాధన

మనము ఆరాధించు విధముగా ఎందుకు ఆరాధించుచున్నామో మన సంఘములకు బోధించుటకు మనము సమయము కేటాయించాలి, లేకపోతే అర్థవంతమైన సంప్రదాయములు ఆరాధకులకు అర్థరహితముగా కనిపిస్తాయి.

ఒక క్రొత్త విశ్వాసి తన పాస్టర్ ను ఇలా ప్రశ్నించాడు, “ప్రార్థనలు చేసిన తరువాత మనము ‘ఆమెన్’ అని ఎందుకు చెబుతాము? ‘ఆమెన్’ మనము అడిగినది దేవుడు చేయునట్లు చేయు ఒక విశేష శక్తిగల పదమా?” అతనికి ఆరాధన యొక్క వివరములను తెలుపవలసిన అవసరత ఉన్నదని పాస్టర్ గ్రహించాడు. మన సంఘమునకు ఆరాధనను గూర్చి మనము బోధించని యెడల “ఆమెన్” వంటి చాలా సులువైన పదము కూడా అర్థరహితమవుతుంది.

ఆరాధనలో నుండి చిహ్నాత్మకతను మరియు మర్మమును తొలగించవలసిన అవసరత లేదు. మన ఆరాధన ఆచారముల యొక్క అర్థమును మన సంఘమునకు బోధించుట ఇక్కడ పరిష్కారం అయ్యున్నది. మనము ఉపయోగించు భాషను ఎందుకు ఉపయోగించుచున్నామో వారికి తెలియవలసియున్నది; సంఘముగా పాడు పాటలు సంఘమునకు ఎందుకు ప్రాముఖ్యమైయున్నవో వారు తెలుసుకోవలసియున్నది; లేఖనముల యొక్క అర్థము వారికి తెలియవలసియున్నది.

► మధ్య యుగముల ఆరాధనలోని ఏ విషయములు మీ ఆరాధనకు సహాయము చేయవచ్చు? మధ్య యుగముల ఆరాధనలో ఏవైనా అపాయములను మీరు చూస్తున్నారా?

సంస్కరణ కాలములో ఆరాధన యొక్క చిత్రము

మన ఆరాధన మన వేదాంతశాస్త్రమును రూపుదిద్దుతుంది అని సంస్కర్తలు గ్రహించారు. ఈ కారణము చేత, ఆరాధాన సంస్కరణ వేదాంతశాస్త్రమును ప్రతిబింబించని యెడల, సంస్కరణలోని వేదాంతశాస్త్ర సత్యములు మరుగున పడిపోయే ప్రమాదం ఉందని వారు గ్రహించారు.

సంస్కరణలోని ప్రధానమైన వేదాంతశాస్త్ర ఆందోళన విశ్వాసి యొక్క యాజకత్వము అయ్యున్నది. అనగా విశ్వాసులు దేవుని సూటిగా ఆరాధిస్తారు; మనము యాజకుని ద్వారా వెళ్లవలసిన పని లేదు. దేవుని వాక్యము ప్రతి విశ్వాసికి అందుబాటులో ఉండాలని సంస్కర్తలు కూడా బలముగా నమ్మారు.

సంస్కరణ కాలములోని ఆరాధన ప్రతి ఆరాధకుని పాలుపంచుకొనునట్లు చేయుటకు ప్రయత్నించేది. ఆరాధన ప్రజల భాషలో ఉండేదిగాని, ల్యాటిన్ భాషలో కాదు. ఆరాధకులందరు దేవుని వాక్యమును వారి సొంత భాషలో అర్థము చేసుకొనులాగు లేఖనము చదవబడేది మరియు బోధించబడేది. ప్రతి ఆరాధకుడు ఆరాధనలో పాలుపంచుకొనుటకు సంఘ సంగీతము అవకాశమునిచ్చింది. మార్టిన్ లూథర్ ఒక పాటల రచయిత, మరియు అతని పాటలు సంస్కరణను వ్యాపింపజేయుటలో సహాయము చేశాయి.

ఈ సామన్య విషయములను మించి, ఆరాధానను గూర్చి సంస్కర్తల మధ్య ఎంతో అసమ్మతి ఉండినది. లూథరన్లు మరియు ఆంగ్లికన్లు రోమన్ కాథలిక్ సంఘము యొక్క ఆచారములలో చాలా వరకు అన్వయించుకున్నారు. అవి లేఖనములో నిషేధించబడితే లేక సంఘములో వివాదమును కలిగిస్తే తప్ప, క్రొత్త ఆరాధన ఆచారములకు అనుమతి ఇవ్వాలని లూథర్ నమ్మాడు.

కెల్విన్ మరియు అతని అనుచరులు కొన్ని ఆచారములను కొనసాగించగా, లేఖనములో ప్రత్యేకముగా చర్చించబడని ఏ ఆరాధన ఆచారమునైనా వారు తిరస్కరించారు. కెల్విన్ సంఘముగా కలిసి పాడుటను ప్రోత్సహించాడు, అయితే కేవలం కీర్తనలను మాత్రమే పాడాలని ఆయన నమ్మాడు. “దేవుని స్తుతిలో పాడుటకు దేవుని వాక్యమే యోగ్యమైనది” అని అతడు విశ్వసించాడు. అతడు ప్రభువు బల్లలో సంఘము పాలుపంచుకొనుటకు తిరిగి వచ్చి, కనీసం నెలకు ఒకసారి, మరీ మంచిదైతే ప్రతి ప్రభువు దినమునా, ప్రభువు భోజనము అందించవలసినదని సూచించాడు.

అనబాప్టిస్టులు మరియు ప్యూరిటన్లు అధికశాతం ఆచారములను విడచిపెట్టి, సులువైన ఆరాధన శైలిలోనికి తిరిగివెళ్లారు. వీరు కొన్నిసార్లు తమ తమ ఇండ్లలోనే ఆరాధించేవారు మరియు వారు మాత్రమే మొదటి-శతాబ్దపు ఆరాధనను పాటించుకున్నామని భావించుకునేవారు.

సంస్కరణ ఆరాధన యొక్క బలము సంఘ పాలుపంపులలోనికి తిరిగివెళ్లుటలో కనబడుతుంది. సంస్కరణ కాల సంఘముల మధ్య భిన్నత్వములు ఉన్నప్పటికీ, సంస్కర్తలందరు ఆరాధనలో విశ్వాసి యొక్క యాజకత్వమును అనుకరించుటకు ప్రయత్నించారు.

► సంస్కరణ కాలములోని ఆరాధనలో ఏ విషయములు మీ ఆరాధనకు ప్రయోజనమును చేకూర్చగలవు? మీరు సంస్కరణ కాలములోని ఆరాధనలో ఏమైనా ప్రమాదములను చూస్తున్నారా?

స్వతంత్ర సంఘములలో ఆరాధన యొక్క చిత్రము

సంస్కరణ తరువాత, కొన్ని సంఘములు ప్రభుత్వ నియంత్రణను తిరస్కరించాయి. ఈ సంఘములను “స్వతంత్ర సంఘములు” అని పిలుస్తారు, వీరిలో అనబాప్టిస్టులు, ప్యూరిటన్లు, నాన్-కన్ఫార్మిస్ట్లు, సపరేటిస్ట్లు, మరియు డిసెంటర్స్ ఉన్నారు. వీరిలో చాలామంది నిర్ణిత సాహిత్యములు మరియు ఆచారములను తిరస్కరించారు.

స్వతంత్ర సంఘ ఆరాధనలోని లక్షణములు:

(1) ప్రసంగము కేంద్రముగా ఉండినది.

(2) సంఘముగా పాలుపంచుకొనుట ప్రాముఖ్యముగా ఉండేను.

సంఘ పాలుపంపులు వేర్వేరు సంఘములలో వేర్వేరుగా ఉండేవి.

  • కొన్ని సంఘములలో, ప్రజలు పాటలు పాడేవారు. ఇతర సంఘములలో, బహిరంగ ఆరాధనలో సంగీతము ఉండేది కాదు.

  • కొన్ని సంఘములలో సంఘములోని సభ్యులు బిగ్గరగా ప్రార్థించేవారు. ఇతర సంఘములలో, కాపరి ప్రజల కొరకు ప్రార్థించేవాడు.

సేవకులు మరియు సామాన్య విశ్వాసుల మధ్య పెద్ద తేడా ఉండేది కాదు. అనేక స్వతంత్ర సంఘములలో సేవకుల కొరకు ప్రత్యేకమైన వస్త్రములు ఉండేవి కాదు.

(3) ఆరాధన అంతా ప్రజల భాషలో ఉండేది.

1608లో జరిగిన ఒక ఆరాధన కూడికలోని ఆకారము ఇలా ఉండేది (కూడిక నాలుగు గంటల పాటు కొనసాగేది):

  • ప్రార్థన

  • లేఖన పఠనం (వివరణతో సహా 1-2 అధ్యాయములు)

  • ప్రార్థన

  • ప్రసంగం (ఒక గంట లేక అంతకంటే ఎక్కువ)

  • సామాన్య విశ్వాసుల సాక్ష్యములు

  • ప్రార్థన

  • కానుకలు

ఆరాధనలో ఇక సంస్కారము మరియు యాజకుడు ఆధిపత్యము చెలాయించలేదు. స్వతంత్ర సంఘములలోని ఆరాధన చాలా వరకు క్రొత్త నిబంధన సంఘ ఆరాధనను పోలియుండినది.

ఆరాధన పట్ల ఇట్టి ధోరణిలో అపాయములు ఉన్నాయి. స్వతంత్ర సంఘములు విశ్వాసి యొక్క యాజకత్వమును బోధించినప్పటికీ, ఆచరణలో మాత్రం ప్రసంగీకుడు కొన్నిసార్లు ఆరాధనకు కేంద్రముగా యాజకుని స్థానమును తీసుకున్నాడు. కొన్ని సంఘములలో, సంఘ సభ్యులు చాలా తక్కువగా పాలుపంచుకునేవారు.

స్వతంత్ర ఆరాధనలో ఉన్న అతి పెద్ద అపాయములలో ఒకటి, తీవ్రమైన వ్యక్తివాదమైయున్నది. విశ్వాసి యొక్క యాజకత్వము అనూ సిద్ధాంతము సంఘ ఐక్యత అను సిద్ధాంతముతో కలిసి ఉండని యెడల, సంఘము ఆరాధనలో ఐక్యమైన క్రీస్తు శరీరముగా గాక వ్యక్తుల సేకరణగా మిగిల్పోతుంది. శరీరముగా సంఘమును గూర్చిన భావన లేకుండా ఆరాధనలో “యేసు మరియు నేను” అను భావన కలిగినప్పుడు ఇది కనబడుతుంది.

► స్వతంత్ర సంఘముల ఆరాధనలోని ఏ విషయములు మీ ఆరాధనకు సహాయకరముగా ఉంటాయి? స్వతంత్ర సంఘముల ఆరాధనలో మీరేమైనా అపాయములను చూస్తారా?

వెస్లీ ఉజ్జీవములో ఆరాధన యొక్క చిత్రము

[1]జాన్ వెస్లీ అతడు ఆంగ్లికన్ సంఘము నుండి పొందిన సామూహిక ఆరాధన సంప్రదాయము మరియు అనబాప్టిస్టుల నుండి అతడు పొందిన వ్యక్తిగత ఆత్మీయ అనుభవము ద్వారా ప్రభావితమయ్యాడు. ఆంగ్లికన్ ఆరాధన మధ్య కాల రోమన్ కాథలిక్ సంఘము అనుసరించి పసలేని ఆచారములోనికి ప్రవేశించుచున్న సమయములో, వెస్లీ సహోదరులు మరియు వారి అనుచరులు (వీరిని మెథడిస్ట్లు అని పిలుస్తారు) ఆరాధకులను దేవుని సన్నిధిలోనికి తెచ్చు విధముగా ఆరాధన యొక్క వాస్తవమును పునరుజ్జీవపరచారు.

ఆదిమ మెథడిస్ట్ ఆరాధనలోని ఉద్ఘాటనలు:

1. ప్రసంగము. జాన్ వెస్లీ యొక్క ప్రసంగములు ప్రచురించబడి, మెథడిస్ట్ ఆరాధకులకు సిద్ధాంతిక పునాదిగా మారాయి.

2. తరచుగా బల్లలో పాలుపంచుకొనుట. జాన్ వెస్లీ వారానికి ఐదుసార్లు బల్లలో పాలుపంచుకునేవాడు. తన అనుచరులు వారానికి కనీసం ఒకసారైనా బల్లలో పాలుపంచుకోవాలని అతడు ప్రోత్సహించాడు.

3. పాట్లు పాడుట. చార్లెస్ వెస్లీ యొక్క పాటలు బ్రిటిష్ ఐల్స్ మరియు క్రొత్త లోకములోనికి మెథడిస్ట్ సిద్ధాంతమును వ్యాపింపజేశాయి.

4. చిన్న సమూహములు. తరగతి కూడికలు మెథడిస్ట్ శిష్యరికములో కేంద్రములుగా ఉండినవి.

5. సామూహిక ఆరాధన. మెథడిస్ట్లు తరచుగా కలుసుకునేవారు, మరియు అనేక ఆంగ్లికన్ యాజకులు మెథడిస్ట్లను తిరస్కరించిన తరువాత కూడా, తన అనుచరులు ఆంగ్లికన్ ఆరాధనలో పాలుపంచుకోవాలని వెస్లీ ప్రోత్సహించాడు.

6. సువార్త ప్రకటన. మెథడిస్ట్ ఉజ్జీవము ఇంగ్లాండ్ మరియు ఇతర ప్రాంతములకు వ్యాపించుచుండగా కొన్ని వేలమంది నూతన విశ్వాసులు క్రీస్తును అంగీకరించారు.

మెథడిస్ట్ ఆరాధనలో దేవుని మహిమపరచిన పాటలు, పరిపక్వతగల విశ్వాసులను కట్టిన శిష్యరికము, సంఘమునకు మరియు అవసరతలో ఉన్న లోకమునకు సత్యమును ప్రకటించిన ప్రసంగము భాగమైయుండినవి.

► వెస్లీ ఉజ్జీవములోని ఆరాధనలో ఏ విషయములు మీ ఆరాధనకు సహాయపడగలవు? వెస్లీ ఉజ్జీవములోని ఆరాధనలో అపాయములు ఏవైనా మీరు చూడగలరా?


[1]

మెథడిజం మరియు పద్దెనిమిదవ శతాబ్దపు ఆరాధన

పద్దెనిమిదవ శతాబ్దపు ఆరాధనలో ఎదురైన వైఫల్యములకు ఫలితంగా మెథడిజం వృద్ధిలోనికి వచ్చింది.

“సంస్కారములు సంఘ జీవితములో అంచున ఉన్నప్పుడు, ఆదిమ మెథడిజం వాటిని కేంద్రముగా ఉంచుతుంది; మత ఆసక్తి అపకీర్తిని ఎదుర్కొనుచున్నప్పుడు, మెథడిజం ఉత్సాహమునకు ప్రాముఖ్యతనిచ్చింది; మతము సంఘములకు మాత్రమే పరిమితమైనప్పుడు, మెథడిజం దానిని వీధులలోనికి, ప్రజల మధ్యకు తీసుకొనివెళ్లింది.”

- రాబర్ట్ వెబర్ లో జేమ్స్ వైట్
ట్వంటీ సెంచరీస్ ఆఫ్ క్రిస్టియన్ వర్షిప్

ఆదిమ అమెరికాలో ఆరాధన యొక్క చిత్రము

ఇంగ్లీష్ ప్రజలు మొదటిగా భూమిలోని తూర్పు తీరమున స్థిరపడ్డారు, అది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పిలువబడుతుంది. 1700 చివరిలో మరియు అటు తరువాత, భూమిని కనుగొని ఇండ్లను కట్టుకొనుటకు ప్రజలు ఎవరు స్థిరపడని పశ్చిమ ప్రాంతములకు వెళ్లారు. ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు, కాని సంఘములు, విద్యాలయములు, మరియు చట్టములు నిదానముగా అభివృద్ధి చెందాయి. నిదానము స్థిరపడిన ఈ స్థలమును చరిత్రలో అమెరికన్ ఫ్రాంటియర్ అంటారు.

ఆదిమ అమెరికా చరిత్రలోని ఆరాధనను అధ్యయనము చేయుట వెనుక ఉన్న ఉద్దేశ్యము ఆరాధన అంతటి కొరకు అమెరికా మాదిరిని ప్రతిపాదించుట కాదుగాని, ఇతర స్థలములలో యౌవ్వన సంఘములలో అభివృద్ధి చెందు ఆరాధనతో దానిని పోల్చుట అయ్యున్నది. అనేక దేశములలో క్రొత్తగా స్థాపించబడితున్న సంఘములలో కూడా ఇవే సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఆదిమ అమెరికాలోని ఆరాధన యొక్క లక్షణములు:

1. డినామినేషన్లు నుండి అధికారిక ఆరాధన రకముల నుండి స్వాతంత్ర్యము. అమెరికన్ ఫ్రాంటియర్ సంఘములు డినామినేషన్ నియంత్రణ నుండి స్వాతంత్ర్యమును పొందాయి. అవి ఆచారములకు మరియు నిర్ణిత ఆరాధన క్రమములకు తక్కువ ఆసక్తిని చూపాయి (అయితే జాన్ వెస్లీ ఇతర దేశములలో ఆరాధన కొరకు తన ఆరాధన పద్ధతిని అనువర్తించుకున్నాడు). సంఘ భవనములు మరియు ఆరాధన కూడికలు సులువుగా మరియు స్పష్టముగా ఉండేవి.

2. బల్లలో పాలుపంచుకొనుటకు అరుదైన అవకాశములు. ఇంగ్లాండ్ లో, వెస్లీ సహోదరులు తరచుగా బల్లలో పాలుపంచుకొనుటను ఉద్ఘాటించారు. అమెరికన్ ఫ్రాంటియర్ లో, అభిషేకము చేయబడిన సేవకులు లేకపోవుట వలన విశ్వాసులు తరచుగా ప్రభువు బల్లలో పాలుపంచుకొనుటకు అవకాశం ఉండేది కాదు.

3. వాక్యమును ప్రకటించుట. ఆరాధన కూడికలలో ప్రసంగమునకు ప్రాధాన్యతనిచ్చుట కొనసాగింది. తర్ఫీదులేని ప్రసంగీకులు కూడా వెస్లీ సహోదరులు మరియు ఇతరసేవకుల ప్రసంగములను చదివేవారు. సంఘము యొక్క కేంద్రము సహవాసపు బల్ల కాదుగాని, బలిపీఠము అయ్యున్నది. వాక్య ప్రకటన మీద ప్రాధమిక ఉద్ఘాటన ఉంచబడినది.

4. ఉజ్జీవముగా పాడుట. పాటలు ఉజ్జీవముగా ఉండేవి. అమెరికన్ సంఘములు చార్లెస్ వెస్లీ యొక్క పాటలను పాడి, విద్యలేని సంఘ సభ్యులు కూడా సులభంగా అర్థము చేసుకొను విధముగా సాక్ష్యపు పాటలను కూడా పాడేవారు.

5. ప్రార్థన, సువార్త ప్రకటన, మరియు ఉజ్జీవము. ప్రార్థన అనధికారికముగా ఉండేది మరియు చాలాసార్లు దీనిని సామాన్య విశ్వాసులు నడిపించేవారు. సువార్త ప్రకటన ప్రాముఖ్యమైనది, మరియు అమెరికా ఉజ్జీవ కాలములో కొన్ని వేలమంది మారుమనస్సు పొందారు. ప్రసంగము తరువాత సాధారణంగా, మారుమనస్సుపొందనివారు ముందుకు వచ్చి, పశ్చాత్తాప ప్రార్థన చేయుటకు ఆహ్వానము ఇవ్వబడేది.అమెరికా అంతటిలో క్రైస్తవ పరిశుద్ధత మీద ఉద్ఘాటన వ్యాపించగా, ఆ ఆహ్వానము అవిశ్వాసులను మారుమనస్సులోనికి మరియు విశ్వాసులను సంపూర్ణ సమర్పణలోనికి ఆహ్వానించేది.

ఇతర సంప్రదాయముల వలెనె, ఈ ఆరాధనలో బలములు మరియు అపాయములు కూడా ఉన్నాయి. బలములలో, వ్యక్తిగత భాగస్వామ్యము మరియు ఉత్సాహము ఉన్నాయి. అపాయములలో, సిద్ధాంతమునకు తక్కువ ప్రాముఖ్యతనిచ్చి, వ్యక్తిగత అనుభవమును ఎక్కువగా ఉద్ఘాటించుట. చాలా తక్కువ బాధ్యత ఉండినది కాబట్టి ఫ్రాంటియర్ ప్రాంతములలో అబద్ద బోధ వ్యాపించుట చాలా సులభము.

► అమెరికన్ ఫ్రాంటియర్ ప్రాంతములోని ఆరాధనలో ఏ విషయములు మీ ఆరాధనకు ప్రయోజనము చేకూర్చగలవు? అమెరికన్ ఫ్రాంటియర్ సంఘ ఆరాధనలో మీరు ఏవైనా అపాయములను చూడగలరా?

ఆరాధన అపాయములు: మారుతున్న అలవాట్లు మరియు మారని నియమముల మధ్య సందిగ్ధత

మనము చాలాసార్లు మారుతున్న ఆరాధన ఆచారములు మరియు బైబిలు ఆరాధన యొక్క మారని నియమముల మధ్య సందిగ్ధతను ఎదుర్కొనునట్లు శోధింపబడతాము.

  • కొన్ని సంఘములలో, ఆరాధకులు తగ్గింపును చూపుటకు ప్రార్థనలో మొకాళ్ళూనుతారు. ఇతర సంఘములలో, ప్రార్థించునప్పుడు ఆరాధకులు చేతులెత్తుతారు.

  • కొన్ని సంఘములలో, స్తుతించు సమయములో కీబోర్డు నిధానముగా మోగుతుంది. ఇతర సంఘములలో, కాపరి ప్రార్థనలో నడిపించుచుండగా అక్కడ నిశ్శబ్దము ఏర్పడుతుంది. కొన్ని సంఘములలో, అందరు బిగ్గరగా ప్రార్థిస్తారు.

  • కొన్ని సంఘములలో, పాటలు స్క్రీనుల మీద చూపబడతాయి, ఇతర సంఘములలో, ప్రజలు పాటల పుస్తకములను చూసి పడతారు.

  • కొన్ని సంఘములలో, తన ప్రసంగము యొక్క ఆరంభములో కాపరి లేఖనమును చదువుతాడు. ఇతర సంఘములలో, కాపరి ప్రసంగించుటకు ముందు ఒక విశ్వాసి లేఖనమును చదువుతాడు. ఇంకొన్ని సంఘములలో, రెండు లేక మూడు లేఖన పఠనమును ఉంటాయి.

వీటిలో ఏవి కూడా తప్పు కాదు; ఇవి ఆచారములు లేక అలవాట్లేగాని, నియమములు కావు. మన మార్గము మాత్రమే ఏకైక బైబిలానుసారమైన మార్గమని మనము భావించకూడదు. నిజమైన ఆరాధన శైలిని గూర్చినది కాదు; అది దేవుని సన్నిధిని గూర్చినది.

మారని కొన్ని నియమములు ఉన్నాయి. బైబిలులో ఆరాధనను గూర్చిన పాఠములలో మనము ఈ నియమములను చూశాము. ఈ నియమములు వికల్పములు కావు. క్రైస్తవులముగా, మనము దేవుని ఆశ్రయించు విధానములో ఈ నియమములు మనలను నడిపిస్తాయి.

తదుపరి కొన్ని పాఠములలో, మనము ఆరాధన ఆచారములను చూద్దాము. నియమములు మారవు; ఆచారములు విభిన్నమైన స్థలములు మరియు సమయములలో భిన్నముగా ఉంటాయి. దీని వలన, మనము ఆరాధించుదాని కంటే భిన్నముగా ఆరాధించువారిని మనము సహించు విధముగా ఉండాలి. అంటే ఆచారము ప్రాముఖ్యమైనది కాదని కాదు; కాని ఆచారము కంటే నియమముల విషయములో ఎక్కువ వశ్యత ఉంటుంది అని దీని అర్థము.

మన జీవితములలో దేవుని కొరకు స్థలమును ఇచ్చుటను గూర్చి ఆస్వాల్డ్ చాంబర్స్ వ్రాశాడు. ఇది ఆరాధనకు కూడా అనువర్తించబడుతుంది:

దేవుని సేవకులముగా, మనము ఆయన వచ్చుటకు అవకాశం ఇవ్వాలి... మనము ప్రణాళికను రూపిస్తాము గాని, ఆయనకు నచ్చిన విధముగా దేవుడు వచ్చుటకు అవకాశం ఇవ్వము. ఆయన వస్తాడని మనము ఎన్నడును ఊహించని విధముగా మన కూడికను లేక మన ప్రసంగమును దేవుడు దర్శిస్తే, మనము ఆశ్చర్యపోతామా? దేవుడు ఒక విధముగా వస్తాడని చూడవద్దుగాని, ఆయన కొరకు చూడండి. ఆయనకు అవకాశము ఇచ్చుటకు మార్గము ఆయన వస్తాడని చూచుటయేగాని, ఒక విధముగా వస్తాడని చూచుట కాదు....

మీ జీవితమును దేవునితో ఎంత స్థిరమైన సంబంధములో ఉంచాలి అంటే, ఆయన ఆశ్చర్యము కలిగించు శక్తి ఏ సమయములోనైనా మీరున్న స్థలములో ప్రవేశించాలి. ఎల్లప్పుడూ ఆశతో జీవించండి, మరియు ఆయన కోరు విధముగా ఆయన మిమ్మును దర్శించుటకు దేవునికి అవకాశం ఇవ్వండి.[1]


[1]Oswald Chambers, My Utmost for His Highest (జనవరి 25 ప్రవేశం), https://utmost.org/leave-room-for-god/ నుండి జూలై 22, 2020 న తిరిగి పొందబడింది.

ముగింపు: నేటి ఆరాధన యొక్క చిత్రము

21వ శతాబ్దములో ఆరాధన ఎలా కనబడుతుంది? దీనికి మనము తేలిగగా జవాబు ఇవ్వలేము. 21వ శతాబ్దములోని ఆరాధన విభిన్నమైన రూపములను దాల్చుతుంది. కొన్ని సంఘములు ఆచారము మరియు సంప్రదాయమునకు ఎక్కువ విలువనిస్తాయి; ఇతర సంఘములు ఆరాధనలో వ్యక్తిగత స్వాతంత్ర్యము కొరకు ఆచారమును తిరస్కరిస్తాయి.

నేడు ఆరాధన యొక్క వర్ణనను ఇచ్చుటకు ప్రయత్నించుటకు బదులుగా, మీ సొంత వర్ణనను చేయుటకు సమయము కేటాయించండి. మీ సంఘములో ఆరాధన ఎలా కనిపిస్తుంది? మీరు ఒక సమూహములో చదువుతుంటే, మీ సమూహములో ఉన్న ప్రజలు హాజరగు సంఘములలోని ఆరాధన మధ్య ఉన్న భిన్నత్వములు మరియు పోలికలను చర్చించండి.

కోర్సులో ఈ సమయమున, ఈ వర్ణన యొక్క ఉద్దేశ్యము విశ్లేషణ కాదు. “మనది సరియైనదా కదా?” అనునది ప్రశ్న కాదు. “మన ఆరాధనలో మనము ఏమి చేస్తాము?” అనునది ఇక్కడ సులువైన ప్రశ్న.

ఈ వర్ణనకు కారణము క్రింద ఇవ్వబడిన పాఠములకు పునాదిని వేయుట. మీరు ప్రస్తుతము ఆరాధనలో చేయు విషయముల వర్ణన మీ యొద్ద ఉన్న తరువాత, మీరు ఇలా అడుగుట కొనసాగించవచ్చు, “మనము చేయు పనిని ఎందుకు చేస్తాము?” మరియు “మనము దానిని ఉత్తమమైన రీతిలో ఎలా చేయగలము?”

ఆరాధనను గూర్చిన నిర్ణయాలు వేదాంతశాస్త్ర నమ్మకములను ప్రతిబింబిస్తాయి. మన ఆరాధనలోని మూలకములు మనము దేవుని గూర్చి ఏమి నమ్ముతాము మరియు మనము ఆయనతో ఎలాంటి సంబంధమును కలిగియున్నాము అను విషయములను చూపుతాయి; మన ఆరాధనలోని మూలకములు మనము సంఘమును గూర్చి ఏమి నమ్ముతాము మరియు మనము ఒకరితో ఒకరము ఎలాంటి సంబంధమును కలిగియున్నాము అను విషయములను చూపుతాయి; మన ఆరాధనలోని మూలకములు మనము నశించినవారిని గూర్చి ఏమి నమ్ముతాము మరియు ఆరాధన వారిని ఎలా చేరగలదు అను విషయములను చూపుతాయి.

ఒక ఉదాహరణను చూద్దాము – సంఘముగా పాడుట.

  • రోమన్ కాథలిక్ సంఘములో సంఘముగా కలిసి పాడుట లేకపోవుట, సామాన్య విశ్వాసులు లేఖనములను అర్థము చేసుకోలేరు అను విషయమును ప్రతిబింబించినది (లేఖనమును పాడుటతో సహా). ఒక సామాన్య విశ్వాసి వ్యక్తిగతముగా లేఖనమును చదువుటకు అనుమతి లేని విధముగానే, ఒక సామాన్య విశ్వాసి ఆరాధన పాటలను పాడుటకు అనుమతి ఉండేది కాదు. యాజకుడు ఆరాధన చేసేవాడు.

  • సంస్కరణ కాలములో సంఘముగా కలిసి పాడుట మీద ఉంచబడిన ఉద్ఘాటన, క్రీస్తు శరీరములో భాగముగా ప్రతి క్రైస్తవుడు ఆరాధించగలడు అను లూథర్ నమ్మకమును ప్రతిబింబించినది.

  • కీర్తనలు గాక ఇతర పాటలను పాడుటకు కెల్విన్ నిరాకరించుట, ఆరాధనలో దేవుని వాక్యమును మాత్రమే అనుమతించాలి అను అతని నమ్మకమును ప్రతిబింబించినది.

  • సంఘముగా కలిసి పాడుట మరియు పాటల ద్వారా సిద్ధాంతమును బోధించుట మీద మెథడిస్ట్లు పెట్టిన ఉద్ఘాటన, ప్రతి విశ్వాసి పాడాలి మరియు మనము పాడునది మన నమ్మకమును ప్రభావితము చేస్తుంది అని వెస్లీ సహోదరులు కలిగియుండిన నమ్మకమును ప్రతిబింబించినది.

  • ఫ్రాంటియర్ పాటలలోని సరళత రక్షణ ప్రజలందరికీ వర్తిస్తుంది అను మెథడిస్ట్ నమ్మకమును చూపింది. ఆ నమ్మకము వలన, వారు ప్రతి చోట ఉత్సాహముగా పాడేవారు.

ఈ కోర్సును మనము కొనసాగించుచుండగా, మనము ఆరాధనలోని అనేక మూలకములను చూడబోతున్నాము. ఆరాధనను గూర్చి మీకు తలెత్తే మొట్టమొదటి ప్రశ్న ఇలా ఉండవచ్చు, “నాకు అది నచ్చిందా?” ఇది ప్రాముఖ్యమైన పశ్న కాదు. ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమనగా, “నేను నమ్ము విషయములను గూర్చి నా ఆరాధన ఏమి చెబుతుంది? దేవుని గూర్చి మరియు మానవునికి ఆయనతో ఉన్న సంబంధమును గూర్చి అది సరియైన అవగాహనను ఇస్తుందా?”

మన ఆరాధన మనము నమ్ము విషయములను రూపుదిద్దుతుంది, కాని దీనికి వ్యతిరేకత కూడా వాస్తవమైయున్నది: మన నమ్మకములు మనము ఆరాధించు విధానమును రూపుదిద్దుతాయి.

పాఠం 5 సమీక్ష

(1) ఆదిమ సంఘములో:

  • ఆరాధన అనాధికారికముగా మరియు సన్నిహితముగా ఉండేది.

  • ఆరాధన సామన్యుల పాలుపంపులను ఉద్ఘాటించింది.

  • ఆరాధనలో జీవితమంతా భాగమైయుంటుంది.

(2) మధ్య యుగముల ఆరాధనలో:

  • ఆత్మీయత కంటే సౌందర్యము ప్రాముఖ్యమైయున్నది.

  • ప్రజలు కూడికలను అర్థము చేసుకోలేకపోయారు.

  • ప్రజలు కేవలం వీక్షకులుగా ఉండేవారుగాని, క్రియాత్మకముగా ఆరాధించేవారు కారు.

  • సువార్త స్థానమును ఆచారములు తీసుకున్నాయి.

(3) సంస్కరణ కాలములో:

  • ఆరాధన విశ్వాసి యొక్క యాజకత్వమును వ్యక్తపరచింది.

  • ఆరాధన ప్రజల భాషగా ఉండినది.

  • లూథర్, కెల్విన్, మరియు ప్యూరిటన్లు ఆరాధనలో ఆచారము యొక్క పాత్రకు అసమ్మతి తెలిపారు.

(4) సంస్కరణ కాలము తరువాత స్వతంత్ర సంఘములలో:

  • ప్రసంగము కేంద్రముగా ఉండినది.

  • సంఘముగా పాలుపంచుకొనుట ప్రాముఖ్యముగా ఉండేను.

  • విశ్వాసి యొక్క యాజకత్వము అను సిద్ధాంతము ప్రాముఖ్యమైయున్నది.

  • ఆరాధన అంతా ప్రజల భాషలో ఉండేది.

  • తీవ్రమైన వ్యక్తివాదము అపాయమైయున్నది.

(5) ఆదిమ మెథడిస్ట్ ఆరాధన ఇవి ఉండేవి:

  • ప్రసంగము మీద ఉద్ఘాటన

  • తరచుగా ప్రభువు బల్లలో పాలుపంచుకొనుట మీద ఉద్ఘాటన

  • పాటలు పాడుట మీద ఉద్ఘాటన

  • చిన్న సమూహముల మీద ఉద్ఘాటన

  • సామూహిక ఆరాధన మీద ఉద్ఘాటన

  • సువార్త ప్రకటన మీద ఉద్ఘాటన

(6) ఆదిమ అమెరికాలో ఆరాధన:

  • సువార్త ప్రకటనలో వ్యక్తిగత పాలుపంపులు మరియు ఆసక్తి పెంపొందింపజేయబడింది

  • కొన్నిసార్లు సిద్ధాంతిక నిజాయితీని పణంగా పెట్టు వ్యక్తిగత అనుభవము ఉద్ఘాటించబడింది

(7) నేడు మన ఆరాధన దేవుని గూర్చి మన నమ్మకములను మరియు మనము ఆయనతో అనుబంధపరచుకొను విధానమును ప్రతిబింబిస్తుంది.

ముద్రించగల PDF ఇక్కడ అందుబాటులో ఉంది.

పాఠం 5 అభ్యాసములు

(1) రెండవ శతాబ్దపు సంఘ ఆరాధనను జస్టిన్ మార్టిర్ కొన్ని పేరాలలో వర్ణించాడు. ఎన్నడును క్రైస్తవ ఆరాధన కూడికను చూడని ఒక వ్యక్తికి అతడు వ్రాయుచున్నాడు. ఎన్నడును ఒక క్రైస్తవ సంఘమునకు హాజరుకాని ఒక వ్యక్తికి మీ ఆరాధన కూడికను వర్ణించుటకు 2-3 పేరాలను వ్రాయండి. మీ ఆరాధనలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటో జాగ్రత్తగా పరిగణించండి. క్రైస్తవ ఆరాధనకు కేంద్రమైయున్న విషయములను తెలుపు విధముగా మీ కూడికలను మీరు ఎలా వివరిస్తారు?

మీరు ఒక సమూహములో చదువుతుంటే, సమూహములోని ప్రతి సభ్యుడు ఇచ్చు జవాబులను మీ తదుపరి తరగతి కూడికలో చర్చించండి.

(2) తదుపరి పాఠము యొక్క ఆరంభములో, ఈ పాఠం ఆధారముగా మీరు ఒక పరీక్ష వ్రాస్తారు. సిద్ధపడుటకు పరీక్ష ప్రశ్నలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి.

పాఠం 5 పరీక్ష

(1) జస్టిన్ మార్టిర్ వర్ణించిన, రెండవ శతాబ్దపు ఆరాధనలోని మూడు మూలకములను తెలుపండి.

(2) మధ్య యుగములలో ఆరాధనలోని మూడు బలహీనతలను వ్రాయండి.

(3) విశ్వాసుల యొక్క యాజకత్వమునకు సంబంధించి సంస్కరణ కాలములోని రెండు ప్రధానమైన ఆందోళనలు ఏమిటి?

(4) ప్రతి వర్ణనతో సరిగా సరిపోవు సంస్కరణ కాలములోని సమూహము(ల)ను గుర్తించండి.

  • లేఖనములో నిషేధించబడని ప్రతి ఆరాధన ఆచారమును అనుమతించింది: ___________

  • లేఖనములో చర్చించబడని ఆరాధన ఆచారములను అనుమతించలేదు: ___________

  • చాలా వరకు అచారమును తిరస్కరించారు. కొన్నిసార్లు వ్యక్తిగత కుటుంబములలో ఆరాధించారు:
    ___________

(5) స్వతంత్ర సంఘ ఆరాధనలోని మూడు లక్షణములను వ్రాయండి.

(6) ఆదిమ మెథడిస్ట్ ఆరాధనలోని మూడు ఉద్ఘాటనలను తెలుపండి.

(7) ఆదిమ అమెరికాలోని ఆరాధనలోని మూడు గుణములను తెలుపండి.

(8) మీరు కంటస్థం చేసిన కీర్తనలు 100:1-5ను వ్రాయండి.

Next Lesson