క్రైస్తవ ఆరాధనకు పరిచయం
క్రైస్తవ ఆరాధనకు పరిచయం
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 8: ఆరాధన ప్రణాళికను సిద్ధపరచుట మరియు నడిపించుట

2 min read

by Randall McElwain


పాఠ్య ఉద్దేశ్యములు

ఈ పాఠం ముగిసే నాటికి, విద్యార్థి:

(1) ఆరాధనను నడిపించుటకు అత్మీయముగ సిద్ధపడుట యొక్క ప్రాముఖ్యతను గుర్తించుట.

(2) ఆరాధన కూడికలలో క్రమము మరియు అంశము యొక్క భూమికను అర్థము చేసుకొనుట.

(3) క్రీస్తు శరీరము అంతటితో మాట్లాడు సమతుల్యమైన ఆరాధన కూడికల కొరకు ప్రణాళికను సిద్ధపరచుట.

(4) ఆరాధన నాయకునిలో ఉండవలసిన లక్షణములను మెచ్చుకొనుట.

(5) ఆరాధనను నడిపించుట మరియు నియంత్రించుట మధ్య ఉన్న తేడాను కనుగొనుట.

(6) ప్రభావవంతమైన ఆరాధన నాయకత్వమునకు ఆచరణాత్మక అడుగులను అనువర్తించుట.

ఈ పాఠము కొరకు సిద్ధపాటు

2 దినవృత్తాంతములు 5:13-14ను కంటస్థం చేయండి.

పరిచయం

► ప్రతి వారపు ఆరాధన కూడిక కొరకు ప్రణాళికను సిద్ధపరచుటకు మీరు ఎంత సమయమును గడుపుతారు? మీరు పాటలు మరియు ప్రసంగము మధ్య సంబంధము కనుగొంటారా? ఇట్టి విధముగా ప్రణాళికను సిద్ధపరచుట అవసరమా లేక ఈ విధముగా ముందుగానే ప్రణాళికను సిద్ధపరచుట ఆరాధనలో పరిశుద్ధాత్మ యొక్క స్వాతంత్ర్యమునకు ఆటంకము కలిగిస్తుందా?

విశేష అతిధుల కొరకు భోజనమును సిద్ధపరచుచున్న ఒక స్త్రీని గూర్చి ఊహించండి. అతిధులు భోజనానికి వచ్చినప్పుడు, ఆమె ఇలా చెప్పినది అనుకోండి, “భోజనమును సిద్ధపరచుటకు ఎక్కువ సమయమును గడుపుట నాకు ఇష్టం ఉండదు. ఇవిగో మిగిలిపోయిన రొట్టె, మాంసం, మరియు కూరలు ఇక్కడ ఉన్నాయి. వాటిని మీకు నచ్చిన విధముగా తినండి.” విశేష అతిధులతో మీరు ఇలా చేస్తారా? ఖచ్చితముగా చేయరు! మీ అతిధులకు మీరు మీ ఉత్తమమైన దానిని ఇవ్వాలని కోరతారు.

ఒక సంఘ కాపరి ఆరాధనను దేవునికి కొరకు బహుమానముగ అర్పించగోరుచున్నాడు అని భావించండి. అతడు ఇలా అంటాడు, “ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచుటకు ఎక్కువ సమయము గడుపుట నాకు ఇష్టం ఉండదు. నా ద్వారా మాట్లాడుటకు పరిశుద్ధాత్మకు నేను స్వాతంత్ర్యమును ఇవ్వగోరుచున్నాను, కాబట్టి నేను ఏ విధమైన ప్రణాళికనూ సిద్ధపరచను. ఆత్మ నన్ను నడిపించుటకు నేను అవకాశం ఇస్తాను.”

చాలా-బాగా సిద్ధపరచిన ప్రసంగము లేక చక్కగా ప్రణాళిక సిద్ధపరచబడిన కూడిక ద్వారా పరిశుద్ధాత్మ కార్యము చేయలేడు అని కొందరు నాయకులు నమ్ముతారు. అయితే, ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచుట యొక్క విలువను బైబిలు మనకు చూపుతుంది. దేవాలయములో ఆరాధించుటకు సంగీతకారులను జాగ్రత్తగా సిద్ధపరచుట నుండి, కొరింథు సంఘమునకు ఆరాధనను గూర్చి పౌలు ఇచ్చిన నిర్దేశముల వరకు, పరిచర్యలో నడిపించుట కొరకు ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను లేఖనము చూపుతుంది. ఎలాంటి వెల చెల్లించవలసిన అవసరతలేని కానుకను మనము అర్పించకూడదు. ఆరాధన దేవునికి మనము అర్పించు అర్పణ కాబట్టి, దేవుడు మన ఉత్తమమైన కానుకకు అర్హుడు.

ఈ పాఠములో మనము ఆరాధనను నడిపించుటలోని రెండు విషయములను చూద్దాము. మొదటిగా, ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచుట యొక్క ప్రాముఖ్యతను మనము చదువుదాము. తరువాత, ఆరాధన కూడికలో ప్రభావవంతమైన నాయకత్వమును మనము చూద్దాము.

ఆరాధన కూడిక కొరకు సిద్ధపరచుట

► నిర్గమకాండము 28-29 అధ్యాయములను చదవండి. ఇశ్రాయేలును ఆరాధనలో నడిపించువారు జాగ్రత్తగా సిద్ధపడిన విధానమును గమనించండి. ఆరాధనను నడిపించుటకు మీరు ఆత్మీయముగా, మానసికముగా, మరియు భావనాత్మకముగా ఎలా సిద్ధపడతారు?

ఆరాధన నాయకుని సిద్ధపరచుట

ఆరాధన కూడిక కొరకు ప్రణాళికను సిద్ధపరచుట ప్రాముఖ్యమైయున్నది; ఆరాధన నాయకుని సిద్ధపరచుట ఇంకా ప్రాముఖ్యమైయున్నది. మనకు అనుభవము లేని చోట మనము ప్రజలను నడిపించలేము. ఇందువలన, ఇతరులను ఆరాధనలో నడిపించుటకు ముందు మనము మన హృదయములను సిద్ధపరచుకోవాలి.

పాఠం 2లో , ఆరాధకుల కొరకు దేవుడు కోరిన అర్హతలను గూర్చి మనము చూశాము. శుద్ధమైన చేతులు మరియు పవిత్రమైన హృదయమును కలిగియుండమని దేవుడు తన ఆరాధకులను పిలచుచున్నాడు. ఆరాధన కూడిక కొరకు సిద్ధపడుటను ఆరంభించుటకు ముందు, ఆరాధన నాయకులముగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఆరాధనను నడిపించుటకు మనము ఆత్మీయముగా సిద్ధపడాలి.

[1]ప్రార్థన మరియు లేఖన అధ్యయనముతో ఆరాధన ప్రణాళికను సిద్ధపరచండి. మీ వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుని వాక్యములో సమయము గడపండి. ఆరాధన నాయకులు తరచుగా ఎదుర్కొనే ఒక ఆపాయము ఏమిటంటే, వారు వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధిని పణంగా పెట్టి పరిచర్య కొరకు సిద్ధపడుతుంటారు. ఇతరుల కొరకు ప్రసంగములను సిద్దపరచుటకు బైబిలు చదువుతూనే, మన వ్యక్తిగత ఆత్మీయ అవసరతలతో మాట్లాడుటకు దేవుని వాక్యమునకు అనుమతినిచ్చుటలో విఫలమవుతుంటాము.

సంఘమునకు దేవుని వాక్యమును గూర్చి మాట్లాడు లేఖనములు మరియు పాటలను ఎన్నుకొనుటకు ముందు, దేవుని వాక్యము మరియు దేవుని ఆత్మ వ్యక్తిగతముగా మీతో మాట్లాడునట్లు అనుమతించుటకు సమయము కేటాయించండి. తరువాత ఆదివార ఆరాధన కొరకు మీరు ప్రణాళికను సిద్ధపరచుటను ఆరంభించినప్పుడు, ప్రజల యొక్క అవసరతలతో మాట్లాడు లేఖనములు, ప్రసంగ అంశము, మరియు సంగీతములోనికి మిమ్మును నడిపించమని దేవుని కోరండి.

చెకప్

మీ జీవితములో ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిగత ఆరాధనను మీరు ఎలా అభివృద్ధిచేసుకోగలరు? మీరు ఎలాంటి ఆటంకములను ఎదుర్కొంటారు? ఆ ఆటంకములకు మీరు ఎలా స్పందిస్తారు?

ఆరాధన కూడిక కొరకు ప్రణాళికను సిద్దపరచుట[2]

తాను పరిచర్యను నేర్చుకొనిన సేవకుడైన లోయిడ్ జాన్ ఒగిల్వి యొక్క సిద్ధపాటును ఫ్రెడ్ బాక్ వర్ణించాడు. డా. ఒగిల్వి సంవత్సరమంతటి కొరకు తన ప్రసంగములను సిద్ధపరచేవాడు. చాలాసార్లు, జనవరిలో ఎన్నుకొనబడిన ప్రసంగ అంశము, జూలైలో ప్రకటించబడినప్పుడు సంఘములోని ప్రజల యొక్క అవసరతలకు చక్కగా సరిపోయేది. ఎందుకని? “మన దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకు మన అవసరతలు ముందు నుండే తెలుసు, మన కంటే చాలా ముందే తెలుసు....మరియు మనము సిద్ధపడినప్పుడు మరియు క్రమమును అనుసరించినప్పుడు, అది మనలను పరిశుద్ధాత్మ కొరకు ఉపయోగకరమైన, అర్హమైన పాత్రగా చేస్తుంది.”[3] మీ కూడికలో ఎవరు హాజరవుతారో పరిశుద్ధాత్మకు తెలుసు; వారి అవసరతలతో మాట్లాడు పాటలు మరియు లేఖనముల వైపుకు ఆయన మిమ్మును నడిపించగలడు.

బహుశా మీరు ఒకేసారి సంవత్సరము అంతటి కొరకు ప్రణాళిక రూపించవలసిన అవసరత లేకపోవచ్చు, కాని ఆరాధన కొరకు ప్రణాళికను కలిగియుండుట ప్రాముఖ్యమైయున్నది. జాగ్రత్తగా ప్రణాళికను సిద్ధపరచుట కూడిక సమయములో “తరువాత ఏమి జరుగుతుంది?” అని చింతించకుండా ఆరాధన మీద దృష్టి పెట్టుటకు మనకు అవకాశం ఇస్తుంది. మనము ప్రణాళికను సిద్ధపరచనప్పుడు, మనము గత వారము చేసినదాని మీద ఆధారపడునట్లు శోధింపబడతాము. ప్రణాళికను కలిగియుండుట మనము సృజనాత్మకముగా ఉండుటకు అవకాశమునిస్తుంది.

ఒక క్రమముతో ఆరంభించండి.

మనలో చాలామందిమి జీవితములో క్రమమును ఇష్టపడతాము. ఉదయకాలమున బ్రేక్ఫాస్ట్, సాయంకాలమున మనము డిన్నర్ చేయగోరతాము. మనము సాధారణంగా పుస్తకములను అక్కడక్కడ చదవకుండా, మొదటి అధ్యాయము నుండి చివరి వరకు చదువుతాము. ఏ ప్రయాణికుడు కూడా ఒక అంతర్జాతీయ విమానం ఎక్కి, పైలెట్ ఈ మాటలు చెప్పుటను వినుట ఇష్టపడడు, “ఈ రోజు ఎటు వెళ్లాలో మేము ఇంకా నిర్ణయించలేదు. ముందు టేక్ ఆఫ్ చేద్దాము, తరువాత ఎటు వెళ్లాలో చూద్దాము.” మనకు క్రమము ఇష్టము.

[4]పరిశుద్ధాత్మ మన ప్రణాళికలను మార్చినప్పుడు ఆరాధనలో క్రమము దానిని అనుసరించు మన స్వాతంత్ర్యమును పరిమితము చేయదు! క్రమము మీ ఆరాధనకు ఒక దిశను చూపుతుంది, కాని అదే సమయములో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అ క్రమమును మార్చినప్పుడు మేరు మారుటకు కూడా అవకాశమునిస్తుంది. దేవాలయము ప్రతిష్టించబడినప్పుడు, ఒక నిర్ణిత క్రమము ఉండినది, కానీ దేవుని సన్నిధి కూడిక యొక్క క్రమమును మార్చివేసింది (2 దినవృత్తాంతములు 5:13-14).

ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచునప్పుడు కొందరు నాయకులు ఉపయోగించు ఆకారములు అనుబంధము Aలో ఇవ్వబడినవి. మీ కూడికల కొరకు వాటిలో ఒకదానిని మీరు అనువర్తించుకోవచ్చు. ఇవి ఖచ్చితముగా అనుసరించవలసిన క్రమములు కాదుగాని, మీ అవసరతలకు తగినట్టుగా వాటిని మీరు క్రమపరచుకోవచ్చు.

ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచుటలో కొన్ని సాధారణ క్రమములు ఏవనగా:[5]

(1) ప్రసంగము మీద కేంద్రీకృతమైన క్రమము

  • సత్యమును ప్రకటించుట: పాటలు, లేఖనము, ప్రసంగం

  • సత్యమునకు ప్రతిస్పందన: ఆహ్వానము, కానుక, చివరి పాట

(2) ఆరాధనలో దేవుని ప్రజల క్రియాకలాపాల మీద ఆధారితమైన నిర్మాణము

  • దేవుని ప్రజలు కూడుకొనుట: ఆరాధన కొరకు పిలుపు, స్తుతి పాటలు, ప్రార్థన

  • దేవుని ప్రజలు వాక్యమును వినుట: లేఖన పఠనము మరియు ప్రసంగము

  • దేవుని ప్రజలు వాక్యమునకు స్పందించుట: ఆహ్వాన పాట, కానుక

  • దేవుని ప్రజలు పంపబడుట: చివరి పాట, ఆశీర్వాదము

(3) దేవుడు మరియు ఆయన ప్రజల మధ్య సంభాషణను చూపు నిర్మాణము (యెషయా 6వ అధ్యాయము మీద ఆధారితము)

  • దేవుడు తనను తాను బయలుపరచుకొనుట (1వ వచనము): ఆరాధన కొరకు పిలుపు

  • స్తుతి మరియు ఒప్పుకోలుతో దేవుని ప్రజలు స్పందించుట (3-5 వచనములు): పాటలు మరియు ప్రార్థన

  • దేవుడు తన ప్రజలతో మాట్లాడుట (6-8 వచనములు): లేఖనము మరియు ప్రసంగము

  • దేవుని ప్రజలు సమర్పణతో స్పందించుట (8వ వచనము): పాట మరియు కానుక

  • దేవుడు తన ప్రజలను పంపుట (9వ వచనము): ఆశీర్వాదము

(4) 95వ కీర్తన మీద ఆధారితమైన క్రమము

  • ఆనందముతో కృతజ్ఞతలు చెల్లించుచు ప్రవేశించుట (1-5 వచనములు): ఆరాధన కొరకు పిలుపు, స్తుతి పాటలు

  • గౌరవనీయమైన ఆరాధనలో కొనసాగుట (6-7 వచనములు): పవిత్రపరచు కీర్తనలు, ప్రార్థన

  • దేవుని స్వరమును వినుట (7-11 వచనములు): లేఖనము మరియు ప్రసంగము

ఐక్య సందేశమును ప్రకటించుట

ఆరాధన దేవునితో మాట్లాడుతుంది, కాని అది సంఘ ప్రజలతో కూడా మాట్లాడుతుంది. ఆరాధనలో, మనము దేవుని వాక్యమును ఆరాధకుల యొద్దకు తీసుకొని వస్తాము. ఒక కూడిక కొరకు ప్రణాళికను సిద్ధపరచునప్పుడు, మనము ఈ విధముగా అడుగుట సహాయకరముగా ఉంటుంది, “ఈ కూడికలో దేవుడు తన ప్రజలకు ఏ సందేశమును అందించగోరుచున్నాడు?”

ఇలాంటి ఆరాధనకు మీరు ఎప్పుడైనా హాజరైయ్యారా?

పాటలు
  • ప్రార్థన కలిగిన జీవితం (ప్రార్థన యొక్క ప్రయోజనములు)

  • దేవా నీకే నా స్తుతి పాడెదన్ (ఆరాధన కొరకు పిలుపు)

  • సీయోను సుందర నగరము (పరలోకమునందు మన నిరీక్షణ)

ప్రత్యేకమైన పాట పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా (పరిశుద్ధాత్మను మన జీవితములలోనికి ఆహ్వానించుట)
ప్రసంగము నీనెవెకు వెళ్లుటకు యోనాకు ఇవ్వబడిన పిలుపు-సువార్త ప్రకటన కొరకు సవాలు
చివరి పాట సంతోషింపరె ప్రియులారా (మనకు యేసులో శాంతి)

ఆరాధకులతో ఏ సందేశము మిగిలియుంటుంది? నాకు తెలియదు. 90 నిమిషాలలో, మనము సమస్యల మధ్య ఆదరణ, పరలోకం, పరిశుద్ధాత్మ, మరియు ఆరాధన కొరకు పిలుపును గూర్చి పాడాము – ఇవన్నీ సువార్త ప్రకటనను గూర్చిన ప్రసంగము చుట్టూ ఉన్నాయి. తరువాత వారములో, ప్రజలు సువార్త ప్రకటన కొరకు ఇవ్వబడిన సవాలును జ్ఞాపకము చేసుకుంటారా? బహుశా; కానీ కూడిక యొక్క క్రమము ఈ అంశమును ఉద్ఘాటించలేదు.

“నీనెవెకు వెళ్లుటకు యోనాకు ఇవ్వబడిన పిలుపు” అను అంశము మీద ఆధారపడియున్న ఈ కూడికను పరిగణించండి

పాటలు
  • రండి సువార్త సునాదముతో (ఆరాధనకు పిలుపు)

  • చెప్పుదాం సువార్త (మన స్తుతిని సువార్త ప్రకటనతో అనుసంధానం చేస్తుంది)

  • రారాజు వస్తున్నాడో (మన సువార్త ప్రకటన సందేశములోని విషయములను సంగ్రహిస్తుంది)

  • పరవాసిని నే జగమున ప్రభువా (సువార్త ప్రకటన యొక్క అవసరతను చూపుతుంది)

ప్రసంగము నీనెవెకు వెళ్లుటకు యోనాకు ఇవ్వబడిన పిలుపు – సువార్త ప్రకటన కొరకు సవాలు
ప్రత్యేకమైన పాట నన్ను పంపుము ప్రభువా (సువార్త ప్రకటించమని ఆజ్ఞ)
చివరి పాట నీ చిత్తమునే చేసెద (ఆ ఆజ్ఞకు ప్రతిస్పందన)

ఒక అంశమును తెలియపరచుటకు నాయకులు కూడికను క్రమపరచారు కాబట్టి, ప్రజలు వారమంతా దేవుని స్వరమును విను అవకాశం ఉంది, మరియు అది సువార్త ప్రకటన కొరకు పిలుపును వారికి జ్ఞాపకము చేస్తుంది. నిష్ఫలంగా ఉన్న ప్రజల జీవితములను వారు చూసినప్పుడు, “చెప్పుదాం సువార్త” అను విషయమును వారు జ్ఞాపకము చేసుకోవచ్చు. వారు మంగళవారమున పని చేయునప్పుడు, “నన్ను పంపుము ప్రభువా ” అను విషయమును జ్ఞాపకము చేసుకొని వారు ఆనందించవచ్చు, మరియు యేసు మనలను రక్షించాడు కాబట్టి, ఈ ఆనందమును మనము ఇతరులకు పంచాలని గుర్తుచేసుకోవచ్చు.

ఎలాంటి కేంద్ర అంశములేని కూడికలో దేవుడు పని చేయగలడా? చేయగలడు! అయితే, మనము జాగ్రత్తగా ప్రణాళికను సిద్ధపరచుటకు సమయము కేటాయించినప్పుడు, మన సంఘ ప్రజలు సందేశము మీద దృష్టిపెట్టుటకు మనము సహాయము చేస్తాము. ఇది ఎల్లప్పుడూ అవసరమేనా? కాదు. ఒక కూడికలో కొన్నిసార్లు విభిన్నమైన అంశములు ఉంటాయి, అవి సంఘములోని విభిన్నమైన అవసరతలను గూర్చి మాట్లాడతాయి. దేవుడు ఒక ఒక్క క్రమము ద్వారా మాట్లాడతాడు అని ఆలోచించు ఉచ్చులో మనము ఎన్నడును పడిపోకూడదు. అయితే, ఒక ఐక్య అంశము ఆరాధకులు కూడిక యొక్క సందేశము మీద దృష్టిపెట్టుటలో సహాయము చేస్తుంది.

ఆరాధనలో సమతుల్యతను కలిగియుండండి.

మనందరికీ నచ్చిన విషయములు ఉంటాయి: నచ్చిన ఆహారము, నచ్చిన సంగీతం, నచ్చిన పుస్తకములు, నచ్చిన ఆటలు, మరియు నచ్చిన బైబిలు పుస్తకములు. ఆరాధన ప్రణాళికను సిద్ధపరచునప్పుడు, నాయకుడు కేవలం తనకు నచ్చిన పాటలు, లేఖనములు, మరియు ప్రసంగ అంశములను మాత్రమే ఉపయోగించకుండా జాగ్రత్తపడాలి. సమతుల్యమైన ఆరాధన సంపూర్ణ సువార్తను సంపూర్ణ సంఘ ప్రజలతో మాట్లాడుతుంది.

(1) సమతుల్యమైన ఆరాధన మన మధ్య దేవుని ఔన్నత్యమును మరియు దేవుని సన్నిధిని రెంటిని చూపుతుంది.

దేవుడు సర్వభూమిని పాలించు హెచ్చించబడియున్న దేవుడు; దేవుడు తన ప్రజల మధ్య నివసించు దేవుడు కూడా అయ్యున్నాడు. ఈ సమతుల్యతను మనము లేఖనమంతటిలో చూస్తాము.

యెర్ర సముద్రమును దాటిన తరువాత, ఇశ్రాయేలు ప్రజలు దేవుని శక్తిని గూర్చి పాడారు; “యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు?” వారు దేవుని పోషణను గూర్చి పాడారు; “నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడి పించితివి.” (నిర్గమకాండము 15:11-13)

పరమందు తన సింహాసనమందు ఆసీనుడైయున్న ప్రభువును యెషయా చూశాడు. ఆయన భూమి కంటే ఉన్నతముగా అద్భుతముగా ఉన్నాడు. యెహోవా ఘనపరచబడియున్నాడు, కాని యెషయాను పంపుటకు ఆయన అతనితో వ్యక్తిగతముగా మాట్లాడాడు, “వెళ్లి, నా ప్రజలకు ఇలాగు సెలవిమ్ము...” (యెషయా 6:1-13).

కీర్తనకారుడు ఘనుడైన దేవుని స్తుతించాడు: “యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహి మను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది.” ఈ మహోన్నతమైన దేవుడు క్రిందికి దిగివచ్చి నరులతో సహవాసము చేశాడు; “నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?” (కీర్తనలు 8)

ఆరాధనలో, దేవుని మహత్వము మరియు మనతో ఉన్న దేవుని సన్నిధికి రెంటి మీద మనము దృష్టిపెడతాము. మన ఆరాధన దేవుని మహత్వమును మరచిపోయినప్పుడు, ఆయన ఇక విధేయతను మరియు సేవను కోరని ఒక సాధారణ మిత్రుడవుతాడు. మన ఆరాధన మనతో దేవుని యొక్క ప్రస్తుత పాలుపంపులను మరచిపోయినప్పుడు, మన విషయములను గూర్చి అస్సలు పట్టించుకొని దూరమునున్న దేవునిగా మనము ఆయనను ఆరాధిస్తాము. ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచుటలో, మానవాళితో దేవునికున్న సంబంధములోని రెండు విషయముల మీద మనము దృష్టిపెట్టాలి. మనము దేవునికి భయపడతాము అని మనము ఆరాధకులకు జ్ఞాపకము చేయాలి; మనము దేవుని యందు ఆనందిస్తాము అని కూడా జ్ఞాపకముంచుకోవాలి.


దీనిని ఆచరణలో పెట్టండి

మహోన్నతమైన మరియు మన మధ్యన ఉన్న దేవుని ఆరాధించుట అనగా ఆయన మహత్వమును గుర్తించు పాటలను (“ఆరాధింతు నిన్ను దేవా”) మరియు మానవాళితో ఆయనకున్న సంబంధమును గుర్తించు పాటలను (“స్నేహితుడా నా స్నేహితుడా”) పాడుట అయ్యున్నది. ప్రార్థనలో, ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి మనము ఆయనను స్తుతిస్తాము, మరియు మన వ్యక్తిగత సన్నిహిత అవసరతలను ఆయన యొద్దకు తీసుకొనివస్తాము.


(2) సమతుల్యమైన ఆరాధన సమోహికమైనది మరియు వ్యక్తిగతమైనది.

కీర్తనల గ్రంథములో సామూహిక స్తుతులు మరియు వ్యక్తిగత స్తుతులు రెండు భాగమైయున్నవి. కొన్ని కీర్తనలు “మన” స్తుతులను గూర్చి మాట్లాడతాయి; కొన్ని కీర్తనలు “నా” స్తుతులను గూర్చి మాట్లాడతాయి. దేవాలయములో, హెబ్రీ ఆరాధకులు కలిసి ఆరాధించారు; ఇంటి యొద్ద, వారు వ్యక్తిగతముగా ప్రార్థించారు. యేసు తరచుగా సామూహిక ఆరాధన కొరకు సమాజమందిరమునకు వెళ్లేవాడు; తన తండ్రితో ఒంటరిగా సమయమును గడుపుటకు అయన ఏకాంత స్థలమునకు కూడా వెళ్లేవాడు (లూకా 4:16 మరియు మార్కు 1:35). బైబిలు ఆరాధన సామూహికమైన మరియు వ్యక్తిగతమైనది. ఆరాధనలో, ఒక శరీరముగా ఆరాధించుటకు మరియు దేవుని పట్ల వ్యక్తిగత భక్తిని వ్యక్తపరచు విధముగా వ్యక్తిగతముగా ఆరాధించుటకు మనము సంఘ ప్రజలకు అవకాశములను ఇవ్వాలి.


దీనిని ఆచరణలో పెట్టండి

సామూహికమైన మరియు వ్యక్తిగత ఆరాధాన కూడికలోని ప్రతి భాగమును ప్రభావితము చేస్తుంది. మనము శరీరమంతటి కొరకు పాటలు పడతాము (“ఆనందము ప్రభు నాకొసగెను”); మనము వ్యక్తిగత ఆరాధన పాటలు పాడతాము (“నా తండ్రి నీవే”). మనము మన “పరలోకమందున్న తండ్రికి” ప్రార్థిస్తాము; శరీరములో ప్రతి వ్యక్తి వ్యక్తిగతముగా ప్రార్థించు సమయములను మనము కలిగియుంటాము.

చరిత్రలో మునుపెన్నడూ లేని విధముగా, సామూహిక ఆరాధన నేడు ఒక సవాలుగా మారింది. సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, మెసేజ్లు, మరియు ఎల్లప్పుడూ ఉండు ఇంటర్నెట్ సదుపాయం యుగములో, మానసికముగా మరియు అత్మీయముగా దూరముగ ఉంటూనే మనము ఆరాధనలో కూర్చోనవచ్చు. సామూహిక ఆరాధన కొరకు సమర్పణ కలిగియుండుటకు మనము అవరోధములను నివారించాలి మరియు శరీరముతో కలిసి ఆరాధించాలి.


(3) సమతుల్యమైన ఆరాధనలో సుపరిచితమైన మరియు నూతనమైన విషయములు భాగమైయున్నవి.

ఈ సమతుల్యత వేదాంతపరమైనది కాదుగాని ఆచరణాత్మకమైనది, కాని ఆరాధనలో సంఘ ప్రజలు పాలుపంచుకొనునట్లు చేయాలి అంటే ఇది చాలా ప్రాముఖ్యమైయున్నది. ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచుటలో, మనము సుపరిచిత మరియు నూతన విషయముల మధ్య సమతుల్యతను కలిగియుండాలి.

క్రొత్త విషయములను ఎక్కువగా ఉపయోగించుట సంఘ ప్రజలు ఆరాధకులు కాకుండా, కేవలం గమనించువారిగా మారునట్లు చేస్తుందిల; వారికి పాటలు రావు కాబట్టి వారు పాలుపంచుకోలేరు. “యేసు పేతురుకు ‘న మందను మేపుము’ అని చెప్పాడుగాని ‘నా విన్యాసములు చేయు కుక్కలకు క్రొత్త ట్రిక్కులు’ నేర్పమని చెప్పలేదని” చాలామంది సేవకులు మరచిపోతారని సి.ఎస్. లూయిస్ ఒకసారి ఫిర్యాదు చేశాడు. ఎక్కువగా క్రొత్త విషయములను చేర్చుట ఆరాధన మీద దృష్టిపెట్టుటను కష్టతరము చేస్తుంది.

అధికముగా పరిచితమైన విషయములుఅర్థములేని విధముగా పునరావృతము చేయుటకు నడిపిస్తుంది. పూర్తిగా ముందుగా ఊహించిన విధముగా ఉండు ఆరాధన సంఘ ప్రజలు ధ్యాసను కోల్పోయి, ఆరాధన నుండి దూరమగుటకు దారితీస్తుంది.

ఆరాధన ప్రణాళికలో సుపరిచితమైన మరియు క్రొత్త విషయములు రెండు భాగమైయుండాలి. ఉదాహరణకు, “యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ” అనునది తాజాగా రాసిన పాట. పాట ఇలా ముగుస్తుంది, “పాపమునుండి నన్ను రక్షించిన ప్రేమ పునీతుని చేసిన ప్రేమ నా యేసుని ప్రేమ.” ఈ క్రొత్త పాట తరువాత, “ప్రభు ప్రేమ అపారం” అనే పాత కీర్తనను పాడి, యేసు చేసిన త్యాగమునకు స్పందించమని పిలుపునివ్వవచ్చు. సుపరిచితమైన మరియు క్రొత్త పాటల మధ్య సమతుల్యత క్రియాత్మకముగా ఆరాధించుటకు సంఘమును ప్రోత్సహిస్తుంది.


దీనిని ఆచరణలో పెట్టండి

సుపరిచితమైన మరియు నూతన విషయములను సమతుల్యము చేయు ఆరాధనలో పాత మరియు క్రొత్త పాటలు రెండు ఉంటాయి. దానిలో సుపరిచితమైన మరియు అంతగా పరిచితముకాని లేఖన భాగములు రెండు భాగమైయుంటాయి. నూతన జన్మను గూర్చి యేసు బోధించిన యోహాను 3:1-21 వంటి సుపరిచితమైన వాక్యభాగమును చదువుటకు ముందు, యెహెజ్కేలు 36:16-38 వంటి తక్కువ సుపరిచితమైన ఒక వాక్యభాగమును మనము చదవవచ్చు, దానిలో అయన ఇశ్రాయేలును నీటితో శుద్ధిచేసి, తన ప్రజలకు నూతన హృదయమును ఇచ్చుదును అని వాగ్దానము చేశాడు. ఈ రెండు వాక్యభాగములు అంశము విషయములో దగ్గర సంబంధమును కలిగియున్నవి. వాటిని కలిపి చదువుట యోహాను 3వ అధ్యాయములో యేసు చేసిన బోధనను గూర్చి సంఘమునకు ఉన్న అవగాహనను బలపరుస్తుంది.

మీరు ఒక క్రొత్త పాటను పరిచయం చేస్తుంటే, క్రొత్త పాటను సుపరిచితమైన పాటలతో కలపండి. మనము ఆరాధనను ఒక క్రొత్త పాటతో ఆరంభించినప్పుడు, కూడిక ఒక అనిశ్చితితో ఆరంభమవుతుంది. ఒక సుపరిచితమైన పాటతో ఆరంభించి, తరువాత క్రొత్త పాటను పరిచయం చేయుట జ్ఞానయుక్తమైన పని.

పాటలను పరిచయం చేయు విషయములో తైవాన్ లోని ఒక సంఘము సృజనాత్మకమైన విధానమును ఉపయోగిస్తుంది. వారి సంఘములో ఎక్కువమంది క్రొత్త విశ్వాసులు మరియు వారు పాడు చాలా పాటలు వారికి తెలియదు. ప్రతి కూడికకు ముందు ఈ సంఘము రిహార్సల్ చేస్తుంది. ఆరాధనకు ఇరవై నిమిషములు ముందు, ఆరాధన కూడికలో భాగమైయుండు పాటలను ప్రజలు పడేవారు. ప్రతి ఒక్కరు రాగమును నేర్చుకొనుటకు సంగీతకారుడు కీబోర్డు మీద రాగమును వాయించేవాడు. ఇది రిహార్సల్ కాబట్టి, సంఘము దానిని నేర్చుకొను వరకు నాయకుడు కొన్ని చోట్ల ఆపి ఒక వాక్యమును మరలా పాడేవాడు. పది గంటలు అయ్యే సరికి, ప్రజలు క్రొత్త పాటలను కూడా నిశ్చయత కలిగి పడేవారు.


ఒక బృందముగా ప్రణాళిక సిద్ధపరచండి

ప్రసంగి గ్రంథము ఒక ఆచరణాత్మక సలహాను ఇస్తుంది: “ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడైయుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు” (ప్రసంగి 4:9). ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచుట ఒక బృందముగా చేయు కార్యమైయుండాలి. ఆరాధన కూడిక యొక్క నాయకత్వములో భాగమైయున్న ప్రతి ఒక్కరు ప్రణాళికను సిద్ధపరచుటలో పాత్రను కలిగియుండాలి.

ఒక సంఘ కాపరి, పాటల నాయకుని, మరియు ఇతర సంఘ నాయకులు కూడిక కొరకు దేవుని చిత్తమును కనుగొనుటకు కలుసుకొనుచుండగా, ప్రతి వ్యక్తి యొక్క వరములు కలపబడతాయి. ఒక బృందముగా పని చేయుట వలన, సంఘ నాయకత్వములోని ప్రతి సభ్యుని యొక్క బలములు ఆరాధనకు తోడ్పడతాయి.

సుదీర్ఘ సమయము కొరకు ప్రణాళికను సిద్ధపరచండి.

ఏ ఒక్క కూడికలో కూడా బైబిలులోని సందేశమంతా భాగమైయుండదు, కానీ కాలక్రమములో, సువార్తలోని అన్ని విషయములను మనము మన ఆరాధకులకు తెలియపరచాలి. మనలో ప్రతి ఒక్కరికి నచ్చిన అంశములు ఉంటాయి; మనకు అంతగా నచ్చని అంశములను గూర్చి ప్రసంగించుటకు మరియు పాడుటకు మనలో ప్రతి ఒక్కరు సిద్ధపడాలి.

కొందరు కాపరులు మరియు ఆరాధన నాయకులు మూడు సంవత్సరములలో బైబిలు అంతటిని బోధించుటకు క్యాలెండర్ ను మరియు నిర్ణిత అంశములను కలిగియుంటారు.[6] ఇతరులు ప్రతి వారము ప్రణాళికను సిద్ధపరుస్తారు, కాని కొంత కాల వ్యవధిలో లేఖనము యొక్క సందేశము అంతటిని బోధించునట్లు జాగ్రత్తపడతారు.

మీరు ఒక బోధించు క్యాలెండర్ ను ఖచ్చితముగా అనుసరించకపోయినప్పటికీ, క్రైస్తవ సంవత్సరములోని ప్రధానమైన కాలములను గూర్చి అవగాహన కలిగియుండుట సువార్తలోని ప్రాముఖ్యమైన అంశములను బోధించుటలో మీకు సహాయము చేస్తుంది. క్రైస్తవ సంవత్సరములో ప్రాముఖ్యమైన కాలములు ఏవనగా:

  • రాకడ (క్రిస్మస్ కు ముందు నాలుగు ఆదివారములు): క్రీస్తు యొక్క మొదరి మరియు రెండవ రాకడల మీద దృష్టి.

  • క్రిస్మస్: క్రీస్తు నరావతారము మరియు జననము మీద దృష్టి.

  • శ్రమదినాలు (ఈస్టర్ కు ముందు ఆరు ఆదివారములు): క్రీస్తు శ్రమలు మరియు మరణము, అలాగే ప్రతి విశ్వాసి కొరకు శిష్యరిక అర్హతల మీద దృష్టి.

  • ఈస్టర్: క్రీస్తు పునరుత్థానము మరియు ఆరోహణము మీద దృష్టి.

  • పెంతెకొస్తు: పరిశుద్ధాత్మ మరియు సంఘము మీద దృష్టి.

మీరు ఒక అధికారిక క్రమమును అనుసరించినా లేక ప్రతి వారము ప్రణాళికను సిద్ధపరచినా, ఆరాధనలో భాగముగా మీ సంఘ ప్రజలు సువార్త అంతటిని వినునట్లు చూడండి.

సమాధానకరముగా ప్రణాళికను సిద్ధపరచండి

ఆరాధన మనలను గూర్చినది కాదు; ఆరాధన మనము దేవునికి అర్పించు బలి అయ్యున్నది మన ఆరాధన ఆ అర్పణలో భాగమైయున్నది. దోషభావనతో నిండియున్న“ఇది సరిపోతుంద?” అను ఆలోచనతో మనము ఆరాధన ప్రణాళికను సిద్ధపరచము. మనము కృపగల దేవుని ఆరాధిస్తాము. కానుక అనునది సరిపోతుంది కాబట్టి స్వీకరించబడదుగాని, తన పిల్లల ఇష్టపూర్వకముగా ఇచ్చు కానుకను దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి స్వీకరించబడుతుంది.

“మనము ఫలానా సంఘముతో పోటిపడి ఉండాలి” అను ఒత్తిడిని నివారించుట ప్రాముఖ్యమైయున్నది. నేడు టెక్నాలజీ మరియు మల్టీ-మీడియా లోకములో, అనేకమంది సంఘ నాయకులు ఇతర సంఘముల వలె అందరికంటే ముందు ఉండాలి అనే స్థిరమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. సంఘ కాపరులు అత్యాధునిక టెక్నాలజీ కొరకు ప్రయాసపడుతుంటారు. సరిక్రొత్త పాటలు పాడుటకు సంగీత దర్శకులు పోటీపడుతుంటారు. అరాధకులు క్రొత్త ఆకర్షణల కొరకు సంఘముల చుట్టూ తిరుగు షాపర్స్ వలె ఉంటారు.

మీ కానుకలతో దేవుని మెప్పించుటకు ప్రయత్నించు శోధనకు తలొగ్గవద్దు. సంగీతము మరియు టెక్నాలజీ వంటి ఆరాధన పరికరములు వాస్తవిక ఆరాధన యొక్క స్థానమును తీసుకొనుటకు అనుమతి ఇవ్వవద్దు. మీ కానుక యొక్క సువాసనను బట్టి కృపగల దేవుడు ఆనందిస్తాడు అని తెలుసుకొని ఉత్తమమైన దానిని ఆయన యొద్దకు తీసుకొని రండి. ఉత్తమమైన దానిని ఆయనకు ఇవ్వండి, మరియు ఆయన మీ కానుకను అంగీకరిస్తాడు అని నమ్మండి. ఆరాధన అనునది ఇతర సంఘములతో పోటీపడుట కాదు; అది దేవునికి అర్పణగాను ఉండును.


[1]

“ఇతరులను రాజు యొక్క సన్నిధిలోనికి నడిపించు వ్యక్తి రాజు యొక్క దేశములోనికి దూరము వరకు ప్రయాణించి, తరచుగా ఆయన ముఖమును చూసినవానిగా ఉండాలి.”

- చార్లెస్ స్పర్జెన్

[2]పూజా ప్రణాళికను రూపొందించడం గురించి ఉన్న ఎక్కువ భాగపు విషయము “The Nuts and Bolts of Worship Planning” నుండి తీసుకోబడింది, http://worship.calvin.edu/resources/resource-library/the-nuts-and-bolts-of-worship-planning వద్ద జూలై 22, 2020 న యాక్సెస్ చేయబడింది.
[3]Lois and Fred Bock, Creating Four-Part Harmony, (Carol Stream: Hope Publishing, 1989), 43
[4]

“సహజత్వములేని క్రమము నిర్జీవముగా మారవచ్చు, అలాగే క్రమములేని సహజత్వం గలిబిలిని కలిగించవచ్చు.”

- ఫ్రాన్క్లిన్ సెగ్లర్ మరియు రండాల్ బ్రాడ్లీ

[5]ఇక్కడ నేను ఇచ్చుచున్న క్రమములు కూడిక అంతటి కొరకు ఉద్దేశించబడినవి. కొందరు ఆరాధన నాయకులు క్రమములను కూడికలోని సంగీత భాగము కొరకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇవి ఆరాధనను మిగిలిన కూడిక అంతటితో వేరుచేయునట్లు ఉన్నాయి కాబట్టి వీటిని నేను ఇక్కడ చేర్చలేదు. బైబిలులో, ఆరాధనలో కూడిక అంతా భాగమైయుంటుంది, విశేష సంగీత ఆరాధన ప్రసంగమును వేరుచేయదు.
[6]ఆన్‌లైన్‌లో http://lectionary.library.vanderbilt.edu/calendar.php వద్ద జూలై 22, 2020న అందుబాటులో ఉంది.

ఆరాధన కూడికను నడిపించుట

అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న: వీక్షకులు ఎవరు?

► ఆరాధనలో సంఘ ప్రజల యొక్క భూమిక ఏమిటి? ఆరాధన నాయకుల యొక్క భూమిక ఏమిటి? దేవుని భూమిక ఏమిటి?

చాలామంది ఆరాధనను ఒక పాటకచేరి వలె చూస్తుంటారు. సంఘ కాపరి మరియు సంగీతకారులు ప్రదర్శించుచుండగా సంఘ ప్రజలు వింటుంటారు. మందిరము పాటకచేరి హాల్ అవుతుంది.

బ్యారీ లిష్ ఆరాధనను గూర్చిన ఈ అభిప్రాయమును ఒక ఫుట్బాల్ ఆటతో పోల్చాడు:[1]

  • ఆరాధన నాయకులు ఆరాధన చేయుచున్న ఆటగాళ్లు అయ్యున్నారు.

  • సంఘ ప్రజలు కుర్చీలలో కూర్చొని ఆటను వీక్షించుచున్న వీక్షకులు.

  • ఆరాధన నాయకులకు ఏమి చేయాలో చెప్పు కోచ్ దేవుడు.

ఆరాధన కొరకు బైబిలు చిత్రము చాలా భిన్నముగా ఉన్నది. బైబిలు ఆరాధనలో, ఆరాధన నాయకులు కోచ్ ల వలె పని చేయుచు ఆరాధనను నడిపించుచుండగా సంఘ ప్రజలు ఆరాధిస్తారు.

  • ఆరాధన నాయకుడు సంఘ ప్రజలను నడిపించుచున్న కోచ్.

  • ఆరాధకులు ఆరాధన చేయుచున్న ఆటగాళ్లు.

  • దేవుడు మన ఆరాధనను స్వీకరించు వీక్షకుడు.

ఒక నాటికను ప్రదర్శించునప్పుడు, దర్శకుని మనము ఎన్నడును చూడము. దర్శకునికి నాటికలోని ప్రతి వాక్యము మరియు ప్రతి నటుడు ఎప్పుడు ప్రవేశించాలో తెలుసు. ఆమె తన పనిని సరిగా చేస్తే, వీక్షకులు ఆమెను ఎన్నడును గుర్తించరు. ఆరాధన నాయకుల యొక్క భూమిక ఇదే. ప్రజల కొరకు ఆరాధించుట మన పని కాదు; సంఘ ప్రజలను ఆరాధనలో నడిపించుట మన పని అయ్యున్నది. సంఘ ప్రజలు దేవుని సన్నిధిలో సంఘ కాపరి మరియు సంగీత నాయకునితో కలిసి ఆరాధిస్తారు. ఆరాధనలో మన లక్ష్యము దేవుని సంతోషపరచుట అయ్యున్నది. ఆరాధన కొరకు బైబిలు మాదిరిలో, మన ఆరాధనను వీక్షించువాడు దేవుడే.

అయితే, దేవుడు కేవలం వీక్షకుడు మాత్రమే కాదు; ఆరాధనలో మనము చేయు సమస్తమును దేవుడు బలపరుస్తాడు. మరియు, ఆరాధన నాయకుడు ఒక కోచ్ లేక దర్శకుడు మాత్రమే కాదు. ఆరాధన నాయకుడు దర్శకుడు మరియు ఆరాధకుడు అయ్యున్నాడు. ఆరాధనలో విభిన్నమైన సంబంధములు భాగమైయున్నాయి:

  • దేవుడు ఆరాధకులను ఆహ్వానిస్తాడు, ఆరాధనను అందుకుంటాడు, మరియు సంఘ ప్రజలకు పరిచర్య చేయుచుండగా ఆరాధన నాయకులను నడిపిస్తాడు.

  • ఆరాధన నాయకులు సంఘ ప్రజలను ఆరాధనలో నడిపిస్తారు, దేవుని స్వరమును వింటారు, మరియు ఆరాధకులుగా అభ్యసిస్తారు.

  • సంఘ ప్రజలు దేవుని ఆరాధిస్తారు, దేవుని మాటను వింటారు, మరియు ఆరాధనలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు.

​​​​​​​

ఒక ప్రదర్శనగా[2] ఆరాధనను నివారించుట ఎలా

1. ప్రజలు తెలిసిన లేక సులువుగా నేర్చుకోగల పాటలను పాడండి. వాటిని సంఘమంతా పాడే లయలో పాడండి. క్రొత్త పాటలను అప్పుడప్పుడు వాడండి.

2. దేవుని శక్తి, మహిమ, మరియు రక్షణను గూర్చి సంతోషముగా పాడండి. మీ సంఘ ప్రజలకు సేవ చేయండి. వారిని దేవుని వాక్యముతో నింపండి. చెడ్డ మాటలు లేక బలహీనమైన వేదాంతశాస్త్రము ఉన్న పాటలను పాడవద్దు.

3. గదిలో వెలుగు సరిగా ఉండునట్లు చూడండి. తక్కువ మాట్లాడండి. సువార్త యొక్క కేంద్ర స్థానమునకు బదులుగా లైట్లు/ఆకర్షణలు/రంగురంగుల వెలుగులు మీ సృజనాత్మకతకు నిదర్శనములుగా ఉండకుండా చూడండి.

4. మీ ఆరాధన నాయకత్వము మరియు మీరు ఎంచుకొను పాటలు మీ సంఘములోని ఎక్కువమందికి అనువర్తించబడే విధముగా చూడండి. ఒక కాపరిగా నడిపించండి.

5. యేసు వైపుకు చూపండి. మీ వైపుకు ఆకర్షించుకోవద్దు.

ఆరాధన నాయకుని యొక్క అర్హతలు

మీ బిరుదుతో నిమిత్తము లేకుండా, ఒక ఆరాధన నాయకునిగా మీరు ఒక కాపరి భూమికను పోషిస్తారు. మీరు ఒక కాపరి అయితే, దీనిని మీరు ఇప్పటికే అర్థము చేసుకుంటారు. మీరు ఒక సంఘ పెద్ద అయితే, మీ భూమిక మిమ్మును ఆత్మీయ నాయకత్వ స్థానములో ఉంచుతుంది అని అర్థము చేసుకోండి.

ఒక ఆరాధన నాయకుని ఎన్నుకొనుటలో, మనము ఆత్మీయ అర్హతలను పరిగణించాలిగాని, సంగీత లేక వ్యక్తిగత అర్హతలను మాత్రమే చూడకూడదు. గ్రీకు విధావరాండ్రను సేవించుటకు అపొస్తలులు పరిచారకులను ఎన్నుకొనినప్పుడు, వారు మంచి పేరు, ఆత్మ మరియు జ్ఞానముతో నింపబడియున్న పురుషుల కొరకు వెతికారు (అపొస్తలుల కార్యములు 6:3). నైతిక, అత్మీయ, మరియు న్యాయ అర్హతలు ప్రాముఖ్యతను కలిగియుండినవి.

కొన్ని సంఘములలో, పాటల నాయకులు, సంగీతకారులు మరియు ఇతర నాయకత్వ భూమికలను ఎంచుకొనుట ఖ్యాతి మీద ఆధారపడియుంటుంది. బల్లల యొద్ద సేవ చేయు పరిచారకులు వారి ఆత్మీయ అర్హతల అనుగుణంగా ఎన్నుకొనబడితే, నిశ్చయముగా ఆరాధన నాయకులను వారి ఆత్మీయ అర్హతల ఆధారముగా ఎన్నుకోవాలి.

మీరు మీ సంఘములో ఆరాధనను నడిపించుచుంటే (ఒక కాపరి, సంగీతకారుడు, లేక ఆరాధనలో ఇతర నాయకుని వలె), ఒక ప్రభావవంతమైన ఆరాధన నాయకునికి ఉండవలసిన అర్హతలను అభివృద్ధి చేయుటకు మీరు ప్రయత్నించాలి.

  • ఆత్మీయ వివేచన. “పరిశుద్ధాత్మ నడిపింపుకు నేను లోబడుతున్నానా?”

  • సున్నితత్వము. “సంఘ ప్రజల యొక్క అవసరతలను గూర్చి నేను పట్టించుకొనుచున్నానా? ఆ అవసరతలతో మాట్లాడు పాటలను మరియు లేఖనములను నేను ఎన్నుకొనుచున్నానా?”

  • సహకారము. “నేను బృందములో ప్రభావవంతమైన సేవ చేయుచున్నానా? చివరి పాటను మార్చమని కాపరి అడిగినప్పుడు నేను సహకరిస్తున్నానా? బృందమంతటి యొక్క అవసరతలకు నేను స్పందించుచున్నానా?”

  • జ్ఞానము. “దేవుని వాక్యమును గూర్చి నాకున్న జ్ఞానములో నేను ఎదుగుచున్నానా? నేను దేవుని వాక్యమును ఆరాధనలో కేంద్రముగా చేస్తున్నానా?”

  • వివేకము. “ఆరాధన విషయములో ఎదురైయ్యే వివాదములను అర్థము చేసుకొని స్పందించు విధముగా నేను వివేకములో ఎదుగుచున్నానా? విను విషయములో త్వరపడి, మాట్లాడు విషయములో నిదానించు విధముగా నేను క్రమశిక్షణ కలిగియున్నానా?” (యాకోబు 1:19)

  • సహనం. “కూడిక కొరకు నేను కలిగియున్న ప్రణాళికకు సంఘము నిదానముగా స్పందించినప్పుడు నేను సహనము కలిగియుంటున్నానా?”

  • వినయము. “నా సంఘములో తక్కువ తర్ఫీదు ఉన్న సభ్యుల అవసరతలను తీర్చు పాటలను పాడుటకు నేను సిద్ధముగా ఉన్నానా? నా సంఘములో విద్యలేని సభ్యుల అవసరతలను తీర్చు విధముగా సులువైన రీతిలో బోధించుటకు నేను సిద్ధముగా ఉన్నానా? నేను తగ్గింపుతో నడిపిస్తున్నానా, లేక దేవుడు నన్నుంచిన సంఘము కంటే నన్ను నేను ఉన్నతమైన వ్యక్తిగా భావించుకొనుచున్నానా?” ఆరాధన నాయకునిగా, మీ సృజనాత్మకత మీ కాపరి బాధ్యతకు స్పందించాలి. ప్రజలకు సేవ చేయుట మీ మొదటి బాధ్యత అయ్యున్నది.

  • సృజనాత్మకత. “ఆరాధనను అర్థవంతముగా చేయుటకు విధానముల కొరకు నేను అన్వేషిస్తానా? ప్రతి కూడిక ఒకే విధముగా ఉండు పునరావృత పద్ధతిలో పడకుండా నేను నివారించుచున్నానా?”

  • క్రమశిక్షణ. “ఆరాధన నుండి దారిమళ్ళకుండా నా సృజనాత్మకతను నేను క్రమశిక్షణలో పెడుతున్నానా? ప్రజలు తమ ధ్యాసను దేవుని మీద పెట్టలేని విధముగా నేను ప్రతి కూడికను చాలా క్రొత్తగా చేయుచున్నానా?”

  • నైపుణ్యత. “నేను ప్రతి వారము ఉత్తమమైన కానుకను తెచ్చుచున్నానా? ఒక ఆరాధన నాయకునిగా నేను తరచుగా ఎదుగుచున్నానా?”[3]

ఆరాధనను నడిపించుటలో ఆచరణాత్మక అడుగులు

ఒక నాయకుడు ఆరాధించుటకు ప్రజలను బలవంతం చేయలేడు; అయితే, ఆరాధన మీద ధ్యాస పెట్టుటను ఒక నాయకుడు సంఘ ప్రజల కొరకు సులభతరము చేయగలడు.

మాదిరికరముగా నడిపించుట

ఆరాధనలో నడిపించుటలో ఒక ధన్యత ఏమిటంటే, సంఘము తో కలిసి ఆరాధించు అవకాశం. సంఘమును ఆరాధనలో నడిపించునప్పుడు నాయకుడు ఆరాధించాలి.

విచారకరముగా, ఆరాధన ఆరాధన నాయకునికి కఠినముగా మారవచ్చు. మనము ఆరాధనను నడిపించు విషయములో పూర్తిగా నిమగ్నమై, ఆరాధించు విషయములో విఫలము కావచ్చు! మీరు సంగీత దర్శకుడు అయితే, ఈ ఆలోచనలను చేయుచు మీరు ఆరాధన చేయుటకు ప్రయత్నించుచుండవచ్చు:

  • “సొలో పాట పాడు వ్యక్తి ఆలస్యము చేస్తున్నది. ప్రత్యేకమైన పాటకు ముందు ఆమె వస్తుంది అని ఆశించుచున్నాను!”

  • “మొదటి పాటను ప్రజలు సరిగా పడలేదు. అ పాట మన సంఘము కొరకు చాలా కష్టమైన పాటా?”

  • “మనము చాలా నిదానముగా పాడుతున్నట్లున్నాము. తరువాత చరణమును నేను కొంచెం వేగముగా పాడాలా?”

మీరు కాపరి అయితే, మీరు ఇలా ఆలోచన చేస్తూ పాడే అవకాశం ఉంది:

  • “ఈ వారం పది మంది తక్కువ వచ్చారు. వారెక్కడ ఉన్నారు?”

  • “నేను ప్రసంగమును ఒక ఆహ్వానముతో ముగించాలా?”

  • “ఆ పాట నా ప్రసంగమునకు సరిపోదు! పరలోక పాట నుండి తీర్పును గూర్చిన ప్రసంగములోనికి నేను ఎలా వెళ్లగలను?”

కూడికను నడిపించుటలోని విధానములు మన జీవితములలో ఆరాధన యొక్క స్థానమును తీసుకొనుటకు మనము అనుమతి ఇవ్వకూడదు. మనము ఆరాధనను నడిపించుచుండగా, మనము ఆరాధించాలి. ఇది సంఘ ప్రజల ఆరాధనను ప్రేరేపిస్తుంది. ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, “ఆరాధన నాయకులముగా మనము మనకు నచ్చిన విధానములో సంఘమును బలవంతముగా నడిపించుటకు వారి మడిమెలను మొత్తు గొర్రెలను కాయు కుక్కలము కాము. మనతో కలిసి దేవుని సన్నిధిలోనికి వెళ్లుటకు సంఘ ప్రజలను ఆహ్వానించు ఆరాధకులము మనము.” నాయకుడు చెప్పినప్పుడు సంఘము ఆరాధించదు; నాయకుడు ఆరాధించునప్పుడు వారు ఆరాధిస్తారు. ఆరాధన నాయకుడు మాదిరికరముగా నడిపిస్తాడు.

ప్రోత్సహించుచు నడిపించుట

చందన అనారోగ్యముగా ఉన్న తన బిడ్డకు పరిచారము చేస్తూ ఉదయము మూడు గంటల వరకు మెలకువగా ఉంది. మూడు గంటలు పడుకున్న తరువాత, ఆమె లేచి భోజనము సిద్ధపరచి, సంఘమునకు వెళ్లుటకు సిద్ధపడింది. నిద్రలేమి వలన అలసి, తన కుమారుడు బొమ్మను విడిచిపెట్టకపోవుట వలన అతనిని గద్దించుట వలన నిరుత్సాహముతో, మరియు గత వారములో దేవునితో ఒంటరిగా గడుపుటకు సమయము దొరకకపోవుట వలన ఆత్మీయముగా ఆవిరైపోయి సంఘమునకు వచ్చింది.

పాస్టర్ సురేష్ సంఘ ఆరాధనలో ఎక్కువ పాలుపంపులను కోరుచున్నాడు. మొదటి పాట తరువాత, అతడు బలిపీఠం ఎక్కి, “ఈ రోజు ప్రజలకు ఏమైయ్యింది? మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. మనము రాజును ఆరాధించుచున్నాము, మరియు మీలో కొంతమంది ఇక్కడికి రాకుండా ఇంటి వద్దే ఉండి పడుకుంటే బాగుండేది! మీకు సిగ్గు ఉండాలి. ఆరాధనలో పాలుపంచుకోండి!”

పాస్టర్ సురేష్ యొక్క ఉద్దేశ్యములు మంచివే. తన సంఘము క్రియాత్మకముగా ఆరాధనలో పాలుపంచుకోవాలని అతడు కోరాడు, కానీ చందన ఏమి విన్నది? “నేను ఒక తల్లిగా విఫలమయ్యాను; నేను నా కుమారుని ఎక్కువ మందలించాను. ఒక క్రైస్తవునిగా నేను విఫలమయ్యాను; నిన్న నేను నా వ్యక్తిగత ధ్యానమును చేయలేకపోయాను. నేను సంఘములో హాజరగు విషయములో కూడా విఫలమయ్యాను. నేను పాడలేదు కాబట్టి దేవుడు కోపముతో ఉన్నాడు.” దోష భావనను పురికొల్పుగ ఉపయోగించి, పాస్టర్ సురేష్ చందన కొరకు ఆరాధనను మరింత కఠినముగా మార్చాడు.

ఆరాధన నాయకులముగా, మనము ఆరాధనను ప్రోత్సహించాలి; మన వ్యక్తిగత జీవితములో మనము ఆరాధన మాదిరిని కలిగియుండాలి; తరువాత మనము ఫలితములను దేవుని చేతికి అప్పగించవచ్చు. దేవుని కృప ఆరాధనను సాధ్యపరుస్తుంది; దేవుని కృప నిజమైన ఆరాధనను బలపుస్తుంది; దేవుని కృప ఆరాధకుని యొక్క హృదయమును ఆకర్షిస్తుంది.

అనుకూలమైన మాటలతో మనము ఆరాధనను ప్రోత్సహించాలిగాని, దోష భావనతో లేక భావనలను రేపుటకు ప్రయత్నించుట ద్వారా మనము ఆరాధకులను నియంత్రించకూడదు. ఆరాధకులను దేవుని వైపుకు త్రిప్పుట మన లక్ష్యమైయున్నది. ఆయన ఆరాధనను ప్రేరేపిస్తాడు; ఆరాధన అనగా మన పురికొల్పే విధానములు లేక భావనాత్మక వంచన మీద ఆధారపడుట కాదు. ఆరాధన నాయకులముగా మనము దేవుని పనిని చేయనవసరము లేదు!

ఈ భాగము చందన యొక్క కథతో ఆరంభమైయ్యింది. ఒక వినయముగల ప్రోత్సహించు ఆరాధన నాయకుని గూర్చిన నిజమైన కథతో ఈ భాగమును ముగిద్దాము. మధు ఆరాధనలో యౌవ్వనులు పాలుపొందునట్లు చేయు విషయములో ఇబ్బందిపడుతున్నాడు. వారు ఆరాధన కంటే ఫోన్ మెసేజ్ల మీద ఎక్కువ ఆసక్తి కలిగియున్నారు అని అతడు కనుగొన్నాడు. కొందరు నాయకులు కూడికను ఈ విధముగా ఆరంభించియుంటారు: “పిల్లలు, మనము ఇక్కడ ఆరాధన చేయుటకు వచ్చియున్నాము. ఆ ఫోన్లను ప్రక్కనపెట్టి, ఆరాధన మీద దృష్టిపెట్టండి. మీరు దేవునికి అమర్యాదను తెస్తున్నారు!”

మధు చాలా భిన్నమైన ఒక పనిని చేశాడు. గిటార్ వాయించు వ్యక్తి ఒక మౌన ఆరాధన పాటను వాయించుచుండగా, మధు నెమ్మదిగా ఇలా అన్నాడు, “మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుచుండగా, మీ ప్రక్కన ఉన్న వ్యక్తి ఆరాధనకు మీరు ఆటంకము కలిగించుటకు ఇష్టపడరని నేను నమ్ముచున్నాను. మనమంతా మన ఫోన్లను ప్రక్కనపెట్టి, ఈ ఉదయకాల సమయములో దేవుని స్వరమును విందాము.” గదిలో ఒక్క ప్రతి వ్యక్తి తన ఫోన్ ను ప్రక్కన పెట్టాడు. మధు తగ్గింపుతో తన సంఘ యౌవ్వనులకు ఆరాధనను నేర్పాడు.

నడిపించుటా లేక నియంత్రించుటా?

సమకాలీన ఆరాధన నాయకుని యొక్క సాక్ష్యమును వినండి:

“మొదటి సంవత్సర విద్యార్థిగా నేను మా యూనివర్సిటీలో ఉన్న సంఘమునకు వెళ్లాను; అక్కడ మెరుస్తున్న లైట్లు మరియు ఎక్కువ శబ్దముగల సంగీతము ఆసక్తిని కలిగించాయి. ఆరాధన నాయకుని జుట్టు చాలా స్టైల్ గా ఉంది, అతడు జీన్స్ వేసుకొని, వెలగల గిటార్ ను ఉపయోగించుచున్నాడు. కూడిక యొక్క ఆరంభములో, అతని నడుము ఎత్తున ఒక ఉపయోగములో లేని మైక్రోఫోన్ నేను గమనించాను. ‘అది అక్కడ ఎందుకు ఉంది?’ అని నేను ఆలోచించాను, తరువాత న చేతులు పైకెత్తి ఆ ఆలాపనలలో మైమరచిపోయాను.

“శబ్దము అద్భుతముగా ఉన్నది, స్తుతి బృందము చాలా అమోఘముగా ఉన్నది, మరియు సంగీతము చివరి పాటను దిశగా ప్రణాళికబద్ధంగా సిద్ధమైంది. నాయకుడు చివరి మాటలను పాడుచుండగా (‘మొకాళ్ళూని, నా సమస్తమును అర్పించుచున్నాను’), అతడు మొకాళ్ళూనాడు. అప్పుడు నేను అక్కడ ఉపయోగములో లేని మైక్రోఫోన్ యొక్క ఉద్దేశ్యమును గుర్తించాను. నాయకుడు మోకాళ్ళ మీద పాడుటకు మరియు గిటార్ వాయించుటకు అనువుగా అది అక్కడ సరియైన ఎత్తులో పెట్టబడింది. ఈ సంఘము యొక్క ఉద్దేశ్యములను నేను విమర్శించగోరుట లేదుగాని, ఈ భావనాత్మక సమయమునకు స్పందించునట్లు నన్ను నియంత్రించుచున్నారు అని నేను భావించుట ఆరంభించాను, ఎందుకంటే ఇది చాలా ముందుగానే స్పష్టముగా నిర్ణయించబడింది.”[4]

ఈ ఉదాహరణ సమకాలీన ఆరాధనలో నుండి వస్తుంది, కాని మనము సాంప్రదాయిక ఆరాధనలో నుండి కూడా ఉదాహరణలను చూడవచ్చు. నియంత్రించు సమస్య కేవలం ఒకే ఆరాధన శైలికి పరిమితము కాదు. మన సంగీత శైలి లేక నిజాయితీగల ఉద్దేశ్యములతో నిమిత్తము లేకుండా, మనము సంఘ ప్రజలను మనకు నచ్చిన భావనాత్మక స్పందనలోనికి నడిపించునట్లు వారిని తోలుబొమ్మలగా భావించవచ్చు.

ఆరాధనలో భావనలు తప్పా? కాదు; ఆరాధనలో భావనాత్మక ప్రభావమునకు అనేక బైబిలు ఉదాహరణలను మనము చూడవచ్చు. భావనాత్మక ప్రతిస్పందనను ప్రేరేపించునట్లు ప్రయత్నించుట తప్పా? కాదు; మంచి సంభాషణ మనస్సు మరియు భావనలు రెంటి మీద ప్రభావము చూపుతుంది. అయితే, మనము జాగ్రత్తపడని యెడల, పరిశుద్ధాత్మ కార్యమునకు భిన్నముగా మనము ఒక విధమైన మానసిక ప్రభావమును సృష్టించుటకు ప్రయత్నించవచ్చు.

ఆరాధన నాయకత్వము మరియు నియంత్రణ మధ్య తేడాను మనము ఎలా కనుగొనగలము? సంఘ ప్రజల యొక్క ప్రతిస్పందన పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీదగాల నాయాకుల క్రియల యొక్క ప్రభావము మీద ఆధారపడినప్పుడు నియంత్రణ జరుగుతుంది. వాస్తవానికి నడిపించుట మరియు నియంత్రణ మధ్య సంపూర్ణముగా వ్యత్యాసమును మనము చూపలేము, కాని మనము నియంత్రణలోనికి గీత దాటుతున్నాము అని సూచించు కొన్ని గురుతులు ఉన్నాయి.

1. భావనలను ఆరాధనగా పరిగణించినప్పుడు మనము ఆరాధనను నియంత్రించు అపాయమును ఎదుర్కొంటాము. భావనాత్మక ప్రతిస్పందనను సృష్టించు బాధ్యత మనది అని భావించుట అరంభిస్తాము. కొందరు ఆరాధన నాయకులు ఇలా కూడా చెప్పారు, “అది వాస్తవమగువరకు నటించుడి. ప్రజలు దానిని వాస్తవమని భావించు వరకు భావనలను నటించుడి.” ఆరాధనను సృష్టించుటకు భావనలను ఉపయోగించుట మన పని అని ఇది భావిస్తుంది. ఆరాధన నాయకులు ఆరాధనను నడిపిస్తారు; వారు ఆరాధనను సృష్టించరు.

2. హృదయములో మార్పు కలుగుటకు ఉన్నతమైన భావనలు అవసరమని మనము ఊహించినప్పుడు ఆరాధనను నియంత్రించు అపాయములో మనము పడిపోతాము. భావనలతో నిండియున్న సంఘ కూడికలో దేవుడు కార్యము చేస్తాడు, కాని అయన ఇంటి యొద్ద మౌనముగ గడుపు సమయములలో కూడా కార్యములు చేయగలడు. మన ప్రయత్నముల ద్వారా మాత్రమే దేవుడు మనము సేవించు ప్రజల గుండెలలో మార్పు తీసుకొని రాగలడు అని మనము భావించినప్పుడు మనము సంఘ ప్రజలను నియంత్రించు అపాయములో పడిపోతాము.

3. ఒక శారీరిక కార్యమును ఆరాధనతో సమానము చేసినప్పుడు ఆరాధనను నియంత్రించు అపాయములో మనము పడిపోతాము. కొన్నిసార్లు ప్రజలు స్పందించాలని నాయకుడు కోరతాడు, కాబట్టి అతడు ఇలా అంటాడు, “మీరు నిజముగా యేసును ప్రేమిస్తే, చేతులు పైకెత్తండి.” స్పష్టముగా, యేసును నిజముగా ప్రేమించని సంఘములో ఒక వ్యక్తి కూడా చేతులు పైకెత్తే అవకాశం ఉంది! లేక, స సంఘములో యేసును ప్రేమించు ఒక వ్యక్తి తన చేతులను పైకెత్తకుండా ఉండు అవకాశం కూడా ఉంది. ఆరాధన అనునది ఒక శారీరిక క్రియతో పోల్చబడదు. ప్రార్థన సమయములో మౌనముగా కూర్చొనియుంటే ప్రార్థించుటను ఏ విధముగా నిరూపించదో పాడు సమయములో చప్పట్లు కొట్టుట మనము ఆరాధించుచున్నామని నిరూపించదు. ఆరాధకుని యొక్క హృదయమును కేవలం దేవుడు మాత్రమే చూస్తున్నాడు. “ఆరాధన నాయకుడు అంతరంగ వైఖరులకు బాహ్య క్రియలను ముఖ్య పరీక్షగా చేసినప్పుడు, మనము అపాయకరమైన స్థలములోనికి వెళ్లుచున్నాము అని అర్థం.[5]

4. వేరొక స్థలము లేక సమయములో దేవుడు చేసినదానిని అనుకరించుటకు ప్రయత్నించినప్పుడు ఆరాధనను నియంత్రించు అపాయములో మనము పడిపోతాము. గత వారములో దేవుడు ఒక పాటను దీవించాడు కాబట్టి, ఈ వారము కూడా దేవుడు అదే పాటను దీవిస్తాడు అని మనము ఊహించకూడదు. దేవుడు కార్యములు చేయునప్పుడు, ఆయనకు నచ్చినట్లు ఆయన కార్యములు చేస్తాడు. ఆయనకు నచ్చిన విధముగా కార్యములు చేయుటకు ఆరాధన నాయకులు దేవునికి అవకాశం ఇవ్వాలి. ప్రతి పరిస్థితిలోను అదే ఆత్మీయ స్పందనను కలిగించు ఒక మాయా విధానము లేదు.

5. ప్రజల యొద్ద నుండి మనము పొందు స్పందన ఆధారముగా మన పరిచర్యను మనము కొలచుటకు ప్రయత్నించినప్పుడు ఆరాధనను నియంత్రించు అపాయములో మనము పడిపోతాము. ప్రతి బహిరంగ ప్రసంగీకుడు లేక సంగీతకారుడు ప్రజల స్పందనను పొందాలని కోరతాడు; ఇది సాధారణ విషయమే. అయితే ఈ ప్రతిస్పందనల ఆధారముగా మనము మన పరిచర్య యొక్క ప్రభావమును కొలచుటకు ప్రయత్నించినప్పుడు, మనము పరిశుద్ధాత్మ మీదగాక మన నైపుణ్యత మీద ఆధారపడు అపాయములో పడిపోతాము.

ఈ అంశము కఠినమైనది. చాలాసార్లు రెండు భిన్నమైన పరిస్థితులలో మాట్లాడిన అవే మాటలు చాలా భిన్నమైన ప్రేరణలను సూచిస్తాయి. ఒక వైపున, మనము నిర్లక్ష్యముగా ఉంటే, మనము ఆరాధనలో ఇతరులను నియంత్రించుట ఆరంభిస్తాము. మరొక వైపున, మనము భావనలను గూర్చి ఎక్కువ భయపడితే, మనము ఏ విధమైన నాయకత్వమును కూడా అందించలేము!

ఈ కారణము చేత, మరొక వ్యక్తి యొక్క ఆరాధన నాయకత్వమునకు తీర్పు తీర్చు విషయములో మనము నిదానించాలి మరియు మన వ్యక్తిగత నాయకత్వమును విశ్లేషించుటలో త్వరపడాలి. మనము ఆరాధనను నడిపించు విషయములో మన ఉద్దేశములను మనకు చూపునట్లు దేవునిని అడగాలి. మనకు నచ్చిన ఒక ప్రతిస్పందనను ఇచ్చునట్లు ఆరాధకులను నియంత్రించకుండా ఆరాధనను నడిపించు విషయములో మనము జాగ్రత్త వహించాలి.

ఆచరణాత్మక ప్రశ్నలు

మనము కూడికను ఎలా ఆరంభించాలి?

చెడ్డ ఉదాహరణ:

10 గంటలకు, కూడికను ప్రారంభించు సమయం. సంఘ కాపరి పాటలలో నడిపించు వ్యక్తి కొరకు వెదకుచున్నాడు. ముగ్గురు స్త్రీలు ఒక వంటకమును గూర్చి మాట్లాడుకొనుచున్నారు. నలుగురు పురుషులు పంటల కొరకు వర్షములు లేకపోవుటను గూర్చి మాట్లాడుతున్నారు. ఈ విషయములన్నిటి నుండి మనము ఆరాధనలోనికి ఎలా కొనసాగుతాము?

ఆరాధన నాయకుని యొక్క ప్రాముఖ్యమైన బాధ్యతలలో ఒకటి ఆరాధనను ఆరంభించుట. దేవుని ప్రజలను మనము దేవుని సన్నిధిలోనికి ఎలా ఆహ్వానించగలము?

  • కొన్ని సంఘములు కొంతసేపు మౌనముగా ఉండుటతో ఆరంభిస్తాయి. నాయకుడు సులువైన మాటలతో ఇలా ఆరంభిస్తాడు, “మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుచుండగా మౌనముగా ప్రార్థనలో మాతో ఏకీభవించండి.”

  • కొన్ని సంఘములు సంగీతపరముగా “ఆరాధనకు పిలుపునిచ్చుట”తో ఆరంభమవుతాయి. దీనిని క్వయర్ పాడవచ్చు, లేక వ్యక్తులు పాడవచ్చు, లేక సంఘ ప్రజలు అందరు కలిసి పాడే కోరస్ కావచ్చు. కొన్ని సంఘములలో, సంఘ కాపరి స్వయంగా ముందుకు వెళ్లి “ హల్లెలూయా స్తోత్రం...” వంటి కోరస్ పడుతూ ఆరంభిస్తాడు.

  • కొన్ని సంఘములు లేఖనములోని ఒక వచనముతో ఆరంభిస్తాయి, ఇవి చాలాసార్లు కీర్తనలు కావచ్చు.

రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయు దము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. (కీర్తనలు 95:1-2)

ఆరాధకులను దేవుని సన్నిధిలోనికి ఆహ్వానించు కీర్తనలు ఏవనగా, కీర్తనలు 15, కీర్తనలు 66:1-4, కీర్తనలు 96:1-4, కీర్తనలు 100, కీర్తనలు 105:1-3, కీర్తనలు 107:1-3, కీర్తనలు 149:1-2, మరియు కీర్తనలు 150.

ప్రకటనలు ఆరాధనా?

ఒక స్పానిష్ సంఘ కాపరి ఇలా ప్రశ్నించాడు, “ఆరాధనలో ప్రకటనలు ఎక్కడ ఉండాలి? మా సంఘములో మేము ఆరాధన మీద మరియు దేవుని సన్నిధి మీద దృష్టిపెట్టుటకు ప్రయత్నిస్తాము. మేము అద్భుతమైన కూడికను జరిగించిన తరువాత, విసుగుపుట్టించు ప్రకటనల జాబితాతో ముగుస్తుంది. ఇది కూడిక యొక్క ముఖ్య ఉద్దేశ్యమును ప్రభావితము చేస్తుంది. మనము ప్రకటనలను ఆరాధనలో ఏ విధముగా భాగము చేయగలము?”

మనము మన ప్రకటనలను ఎక్కడ ఉంచినను, అవి కూడికకు ఆటంకము కలిగించగలవు. ప్రకటనలు ఆరాధన కానేరవు; బదులుగా, అవి ఆరాధనకు ఆటంకమును కలిగిస్తాయి. మనము ఏమి చేయగలము? దీనికి ఖచ్చితమైన జవాబు లేదు, కాని కొన్ని సలహాలు సహాయకరముగా ఉండగలవు:

  • అవకాశం ఉన్నప్పుడు, ప్రకటనలను బిగ్గరగా చదువుట కంటే వాటిని ప్రింట్ చేసి పెట్టండి. మీరు బహిరంగ ప్రకటనలను చేయవలసివచ్చినప్పుడు, వాటిని క్లుప్తముగా తెలుపండి.

  • ఆరాధన కూడిక ఆరంభించబడుటకు ముందు ప్రకటనలను చేయుటకు పోజేక్టర్ ను ఉపయోగించండి.

  • కొన్ని సంఘములు ప్రకటనలు చేసి, ప్రార్థనా సమయము తరువాత కూడికను ఆరంభిస్తారు. ఒక సంఘము పది గంటలకు కూడికను ఆరంభిస్తుంది. ఈ సంఘము 9:50కి ప్రకటనలను చేస్తుంది. సంఘ కాపరి ఇలా అన్నాడు, “ఇది రెండు పనులను చేస్తుంది. మొదటిగా, ఇది ప్రజలను ముందుగా వచ్చునట్లు ప్రోత్సహిస్తుంది ఎందుకంటే వారు 9:50కి ముందు సంఘములో లేకపోతే ప్రకటనలను వినలేరు. రెండవదిగా, కూడిక యొక్క మొదటి మాటల నుండి ఆరాధన మీద దృష్టిపెట్టుటకు అది అవకాశం ఇస్తుంది.”

  • ప్రకటనలు ఆరాధన యొక్క ఉద్దేశ్యమునకు ఆటంకము కలిగించుటకు అనుమతి ఇవ్వవద్దు. బదులుగా, సంఘము యొక్క పరిచర్యను సాధించుటలో భాగముగా ప్రకటనలను పరిగణించి, ప్రకటనలను చేసి, ముందుకు కొనసాగండి. సంఘ కార్యక్రమములు (ప్రార్థనా సహవాసములు, సమాజమునకు సేవ, సువార్త ప్రకటన కార్యక్రమములు, మరియు సంఘ ప్రాజెక్టులు) ఆరాధనలో భాగమని మనము గుర్తించినప్పుడు, ఈ కార్యముల యొక్క ప్రకటనలు కూడా సంఘ ఆరాధనలో భాగమైయున్నవి. వారపు ప్రణాళికలను గూర్చి కుటుంబమునకు జ్ఞాపకము చేస్తూ తండ్రి కుటుంబ ధ్యానములను ముగించు విధముగానే, సంఘ కుటుంబమునకు వారపు కార్యక్రమములను గూర్చి జ్ఞాపకము చేస్తూ కాపరి ఆరాధన కూడికను ముగించవచ్చు. సంఘ కార్యముల యొక్క ప్రకటన మనము కుటుంబము అని జ్ఞాపకము చేస్తుంది; కుటుంబము యొక్క సహవాసము ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన భాగమైయున్నది.


[1]Barry Liesch, The New Worship, 2nd edition (Grand Rapids: Baker Books, 2001), 123
[2]Jamie Brown, "Are We Headed For A Crash? Reflections on the Current State of Evangelical Worship." నుండి స్వీకరించబడింది. జూలై 22, 2020న https://worthilymagnify.com/2014/05/19/crash/ వద్ద అందుబాటులో ఉంది.
[3]నైపుణ్యత అను లక్షణము అనగా, అధికారికముగా తర్ఫీదు పొందినవారు మాత్రమే ఆరాధనను నడిపించగలరు అని కాదు. హెరాల్డ్ నైపుణ్యతను ఈ విధముగా ఉత్తమమైన రీతిలో నిర్వచిస్తున్నాడు, అది “నేను మునుపటి కంటే ఉత్తమమైన రీతిలో మార్పు చెందు ప్రక్రియ.” ఆరాధన మనకు దేవునికి అర్పించు అర్పణ అయ్యున్నది కాబట్టి, మనము మునుపటి కంటే ఉత్తమముగా మారుటకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాము. Harold Best, Music through the Eyes of Faith (San Francisco: Harper Books, 1993), 108
[4]Joel Wentz, “Confessions of a Former Worship Leader.” https://relevantmagazine.com/life5/1301-confessions-of-a-former-worship-leader/ వద్ద జూలై 22, 2020 న అందుబాటులో ఉంది.
[5]Warren Wiersbe, Real Worship (Grand Rapids: Baker Books, 2000), 215

ఆరాధన అపాయములు: “మేము ఇలా ఎందుకు చేస్తాము అంటే...”

ఆదివారము సాయింత్ర భోజనము కొరకు ఒక యౌవ్వన పెండ్లికుమార్తె మాంసమును ఒండుతుంది. ఆ పెద్ద మాంసపు ముక్కను ఓవెన్ లో పెట్టుటకు ముందు, ఆమె ఆ ముక్కలోని ఒక వైపును కోసి, దానిని చిన్న పాత్రలో పెట్టింది. “నీవు ఎందుకు ఇలా చేశావు?” అని భర్త ప్రశ్నించాడు.

“ఈ మాంసమును ఇలానే ఒండాలి. మా అమ్మ కూడా దీనిని ఒండుటకు ముందు ఇలానే చేసేది. దీని వలన రుచి పెరుగుతుంది.” తరువాత ఆ స్త్రీ ఇలా ఆలోచన చేసింది, “ఒక ప్రక్కన కోయుట మాంసము యొక్క రుచి మీద ఎలా ప్రభావము చూపుతుంది?” ఆమె తన తల్లికి కాల్ చేసి ఇలా అడిగింది, “నీవు మాంసములో ఒక వైపున ఎందుకు కోస్తావు?”

“నా తల్లి, నీ అమ్మమ్మ కూడా ఈ మాంసము వండునప్పుడు ఎల్లప్పుడూ ఇలానే చేసేది. దీని వలన రుచి పెరగవచ్చు. ఆమెను అడుగు” అని తల్లి జవాబిచ్చింది.

ఈ యౌవ్వన స్త్రీ తన అమ్మమ్మకు కాల్ చేసింది, అమ్మమ్మ ఇప్పుడు వంట చేయుట లేదుగాని, ప్రశ్నకు జవాబిచ్చింది. “అవును, నేను ఆ మాంసములో ఒక వైపును ఎందుకు కోస్తానో నాకు గుర్తుంది. మీ తాతకు నాకు పెళ్లైనప్పుడు, మేము పెద్ద వంట పాత్రలను కొనుకున్నే స్థితిలో లేము. మ వద్ద మాంసము వేయించుటకు చిన్న పాత్ర మాత్రమే ఉండేది. ఈ మాంసము ముక్క దానిలో పట్టేది కాదు కాబట్టి, ఒక ప్రక్కన దానిని నేను కోసేదానిని!”

యాభై సంవత్సరముల పాటు ఆమె కుమార్తె మరియు మనమరాలు అర్థంపర్థం లేని “ఆచారమును” అనుసరించారు. వారు ఎన్నడును కూడా “ఎందుకు?” అని ప్రశ్నించలేదు.

ఆరాధన నాయకులముగా, కొన్నిసార్లు మనము “ఎందుకు” అని ప్రశ్నించాలి.

సంఘములు కొన్ని విధములుగా పనులను చేయుటకు కారణములు.

1. గతములో సంఘములు ఇలా చేశాయి. పారంపర్యాచారమునకు విలువ ఉంది. గతములో సంఘములు ఒక పనిని చేసియుంటే, “వారు అలా ఎందుకు చేశారు?” అని ప్రశ్నించకుండా దానిని మనము విడిచిపెట్టకూడదు. పరంపరను భద్రపరచుటకు మనము మంచి కారణమును కనుగొనవచ్చు; కాని, “గతములో సంఘములు ఇలా చేశాయి” అనునది ఏకైక కారణమైతే, అది సరిపోదు.

2. పెద్ద సంఘములు ఇలా చేస్తాయి. ఇతరుల నుండి నేర్చుకొనుటలో విలువ ఉంది. ఒక ఆచారము ఇతర సంఘములలో పని చేస్తే, మనము ఇలా ప్రశ్నించాలి, “ఈ ఆచారము మనకు ప్రయోజనకరముగా ఉంటుందా? వారు ఇలా ఎందుకు చేస్తున్నారు?” ఒక ఆరాధన ఆచారమును అనుకరించుటకు మంచి కారణము ఉన్నదని మనము కనుగొనవచ్చు; కాని “పెద్ద సంఘములు ఇలా చేస్తున్నాయి” అనునది ఏకైక కారణమైతే, అది మన పరిస్థితికి సహాయకరముగా ఉండకపోవచ్చు.

3. ప్రజలకు అది ఇష్టం. ప్రజల పాలుపంపును ప్రోత్సహించే ఆరాధనకు విలువ ఉంది. “మీ ఆరాధన విసుగుపుట్టించునదిగా ఉండాలి!” అని చెప్పునది లేఖనములో ఏదియు లేదు. మన ప్రజలకు నచ్చిన పాట నిజమైనది మరియు ఆరాధనలో అర్హమైనది అని మనము కనుగొనవచ్చు. అలాగైతే, అది అద్భుతమైన విషయం; అయితే అబద్ధ సిద్ధాంతమును బోధించు ఒక పాటను ప్రజలు ఇష్టపడితే, ఆ పాటను మనము పాడకూడదు.

4. దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటలో అది మనకు సహాయపడుతుంది. మనము చేయు సమస్తమునకు ఇది ముఖ్య కారణమైయున్నది. ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచుటలో మరియు ఆరాధనను నడిపించుటలో, మనము ఇలా ప్రశ్నించాలి, “దేవుని ఉత్తమమైన రీతిలో ఆరాధించుటకు ఈ పాట మనకు సహాయము చేస్తుందా? ఈ ఆరాధన క్రమము మనలను దేవుని సన్నిధిలోనికి నడిపిస్తుందా? ఈ ప్రసంగమునకు స్పందనను కోరుటకు ఆహ్వానము ఉత్తమమైన విధానమా, లేక మనము స్తుతి పాటతో ముగించాలా? ఈ వారము మనము దేవుని ఆత్మతోను సత్యముతోను ఎలా ఆరాధించగలము?”

ముగింపు: మనము ఆరాధించుటలో విఫలమైనప్పుడు

సంఘ ప్రజలు అసంపూర్ణ హృదయముతో ఆరంభ పాట పాడారు. క్వయర్ వారు ప్రాక్టీసు చేశారుగని, ఈ ఉదయము సరిగా పాడలేదు. సొలో పాట పాడిన వ్యక్తి మధ్యలో పదములను మరచిపోయింది. కీబోర్డు వాయించు వ్యక్తి తప్పు నోట్స్ వాయించాడు. సంఘ కాపరి యొక్క ప్రసంగము ప్రజలకు అర్థము కాలేదు. ఈ కూడిక పూర్తిగా విఫలమైయ్యింది. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? ఆరాధనను నడిపించుటలో మీరు విఫలమైనప్పుడు ఏమి చేస్తారు?

(1) గుర్తుంచుకోండి, ఆరాధన అంతా రిహార్సల్ యే.

మన ఆరాధన పరలోక ఆరాధనకు రిహార్సల్ గా ఉంది. మనము అసంపూర్ణమైన ప్రజలము, మరియు మన ఆరాధన ఎల్లప్పుడూ అసంపూర్ణముగా ఉంటుంది. “ఆరాధనలో ఉత్తమమైనదానిని అర్పించుటకు మనము పిలువబడితిమిగాని, పూర్ణతను ఇచ్చుటకు కాదు.”[1]

(2) వచ్చే వారము వస్తుంది.

సోమవారము రాజీనామా చేయవద్దు. కూడికను విశ్లేషించుటకు మంగళవారం వరకు ఆగండి. వైఫల్యము నుండి నేర్చుకొని, ముందుకు కొనసాగండి. ఇంతకుముందే వర్ణించబడిన కూడికలో, ఆరంభ పాట సంఘమునకు తెలియదు. వారికి ఆ పాట వచ్చు అని దర్శకుడు భావించాడు; వారికి అది తెలియదు. తన పుస్తకములో అతడు “సంఘ ప్రజలు పాడుటకు ముందు ఈ పాటను క్వయర్ కు నేర్పండి” అని వ్రాశాడు. మీ పొరపాట్ల నుండి నేర్చుకోండి, దేవుని సహాయమును కోరండి, మరియు వచ్చే ఆదివారము మీ ద్వారా కార్యము చేయుటకు దేవునికి అనుమతినివ్వండి.

(3) గుర్తుంచుకోండి, ఆరాధన కృపను గూర్చినదైయున్నది.

చాలామంది ఆరాధన నాయకులు సంపూర్ణవాదులు; మనము ఎన్నడును సంతృప్తిచెందలేము. ఆరాధన సంపూర్ణతను గూర్చినది కాదు; ఆరాధన కృపను గూర్చినది. మనము ఆయన లక్ష్యములను సాధించు విషయములో విఫలమైనప్పుడు కూడా దేవుడు కార్యములు చేస్తాడు. సమస్తము ఈ విధముగానే పని చేయాలి! దేవుడు ఆరాధనను బలపరుస్తాడు అని మనము గుర్తించినప్పుడు, మనము తగ్గింపు మరియు లోబడు స్థానములోనికి తేబడతాము.

(4) మనము ఉత్తమమైనదానిని ఇచ్చియుంటే, మనము విఫలము కాలేదు.

ఆ ఆదివారమున, సంఘ నాయకుడు నిరుత్సాహముతో సంఘమును విడిచివెళ్లాడు. అతడు భవనమును విడిచివెళ్లుచుండగా, వేణు అతని కొరకు ఎదురుచూస్తున్నాడు. వేణు చాలా సిగ్గుగా, తక్కువ మాటలాడు వ్యక్తి, కాని ఆ ఉదయమున అతడు ఇలా అన్నాడు, “కానుకల కొరకు ‘యేసయ్యా, నీ ప్రేమ గొప్పది’ అను పాటను మీరు పాడారు.” (అవును, అతడు ఏమి పాడాడో ఆరాధన నాయకునికి తెలుసు – అతడు సరిగా పాడలేదు!) కాని వేణు ఇలా కొనసాగించాడు, “నాకు ఆ పాట చాలా అవసరమైయుండినది. నాకు కాన్సర్ వ్యాధి సోకింది అని ఈ వారము వైద్యుడు చెప్పాడు; యేసు నన్ను ప్రేమించుచున్నాడు అని నేను జ్ఞాపకము చేసుకోవలసిన అవసరత ఉండినది.”

మనము ఉత్తమమైన దానిని ఇచ్చియుంటే, మనము విఫలము కాలేదు. మనము సేవించు ప్రజలతో ఆయన వాక్యమును మాట్లాడుటకు మనము చేయు బలహీనమైన ప్రయత్నముల ద్వారా దేవుడు కార్యము చేస్తాడు.

► సమూహ సంభాషణ. “పాఠం 8 సమీక్ష” ను చూడండి. మీరు అసమ్మతి తెలుపు విషయములు ఏవైనా ఉన్నాయా? మీరు వెంటనే ఉపయోగించుటకు ఏ బిందువులు అత్యంత ప్రాముఖ్యమైయున్నవని మీరు భావించుచున్నారు?


[1]ఈ ఉల్లేఖనం మరియు ఈ విభాగంలోని సూచనలు Franklin Segler మరియు Randall Bradley, Christian Worship (Nashville: B&H Publishing, 2006), 274-275 నుండి తీసుకోబడినవి.

పాఠం 8 సమీక్ష

(1) ఒక ఆరాధన కూడిక కొరకు మనము ఎలా సిద్ధపడతాము?

  • దేవునితో సమయము గడుపుతూ ఆరాధన నాయకుడు సిధపడుటతో ఆరాధన కూడిక కొరకు సిద్ధపాటు ఆరంభమవుతుంది.

  • ప్రణాళికను సిద్ధపరచుటకు ఒక పద్ధతి ఆరాధన కూడిక కొరకు క్రమమును అందించుటలో సహాయపడుతుంది.

  • ఆరాధన కూడిక కొరకు అంశము ఒక ముఖ్య సందేశమును అందించుటలో సహాయపడుతుంది.

  • సంపూర్ణ సంఘమునకు సంపూర్ణ సువార్తను మన ఆరాధన ప్రకటించునట్లు సమతుల్యత చూస్తుంది.

    • సమతుల్యమైన ఆరాధన మన మధ్య దేవుని ఔన్నత్యమును మరియు దేవుని సన్నిధిని రెంటిని చూపుతుంది.

    • సమతుల్యమైన ఆరాధన సమోహికమైనది మరియు వ్యక్తిగతమైనది.

    • సమతుల్యమైన ఆరాధనలో సుపరిచితమైన మరియు నూతనమైన విషయములు భాగమైయున్నవి.

  • ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచుటలో సంఘ నాయకత్వ బృందం అంతా భాగమైయుండాలి.

  • ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచుట సుదూర భవిష్యత్తు మీద దృష్టిపెట్టాలి.

  • ఆరాధన మనలను గూర్చినది కాదు కాబట్టి ఒత్తిడి లేకుండా మనము ప్రణాళికను సిద్ధపరచవచ్చు; ఆరాధన దేవుని గూర్చినది.

(2) ఆరాధన కూడికను నడిపించుటలో ప్రాముఖ్యమైన విషయము ఏమిటి?

  • ఆరాధనలో అత్యంత ప్రాముఖ్యమైన వీక్షకుడు దేవుడు.

  • సంఘ ప్రజలు, ఆరాధన నాయకులు, మరియు దేవుడు అందరు ఆరాధన కూడికలో పాలుపంచుకుంటారు. నాయకులు వీక్షకుల కొరకు ఆరాధనను ప్రదర్శించరు.

  • ఆరాధన నాయకుడు ఆరాధించాలి. అతడు మాదిరికరముగా నడిపించాలి.

  • ఆరాధన నాయకుడు ప్రోత్సహించువానిగా ఉండాలిగాని, ఖండించువానిగా కాదు.

  • ఆరాధన నాయకుడు నడిపించాలిగాని, నియంత్రించకూడదు.

  • ప్రకటనలను వీలైనంత తక్కువ ఆటంకము కలిగించు విధముగా చేయాలి.

  • ఆరాధన కొరకు ప్రణాళికను సిద్ధపరచిన తరువాత, ఆయనకు నచ్చిన విధముగా మన కూడికలలోనికి ప్రవేశించుటకు మనము దేవునికి అవకాశం ఇవ్వాలి.

ముద్రించగల PDF ఇక్కడ అందుబాటులో ఉంది.

పాఠం 8 అభ్యాసములు

(1) 6 మరియు 7 పాఠములలో, మీరు ఐదు విభిన్నమైన అంశముల మీద మీరు పాటలు మరియు లేఖనములను ఎన్నుకున్నారు. ఈ ఐదు అంశములలో ప్రతిదాని కొరకు ఒక కూడికను సిద్ధపరచండి. ఒక ఐక్య కూడిక కొరకు ప్రణాళికను సిద్ధపరచు విషయములోవీలైనన్ని వివరములను ఇవ్వండి, దానిలో సంఘముగా కలిసి పాడు పాటలు, లేఖనములు, ప్రసంగ అంశము మరియు వాక్యభాగము, మరియు మీ కూడికకు తగిన ఇతర విషయములను కూడా చేర్చండి. ఈ ప్రాజెక్ట్ కొరకు అనుబంధము Aలో ఇవ్వబడిన ఆకారములను ఉపయోగించండి.

(2) తదుపరి పాఠము యొక్క ఆరంభములో, ఈ పాఠం ఆధారముగా మీరు ఒక పరీక్ష వ్రాస్తారు. సిద్ధపడుటకు పరీక్ష ప్రశ్నలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి.

పాఠం 8 పరీక్ష

(1) ప్రసంగము మీద కేంద్రీకృతమైన ఆరాధన క్రమములోని రెండు ముఖ్య భాగములను తెలుపండి.

(2) ఆరాధనలో దేవుని ప్రజలు చేయు కార్యములు మీద కేంద్రీకృతమైన ఆరాధన క్రమములోని నాలుగు ముఖ్య భాగములను తెలుపండి.

(3) 95వ కీర్తన మీద కేంద్రీకృతమైన ఆరాధన క్రమములోని మూడు ముఖ్య భాగములను తెలుపండి.

(4) సమతుల్యమైన ఆరాధనను గూర్చి ఏ మూడు విషయములను మనము గుర్తుంచుకోవాలి?

(5) ఆరాధన కొరకు ఒక బైబిలు పద్ధతిలో, మన ఆరాధనకు శ్రోతలు ఎవరు?

(6) ప్రభావవంతమైన ఆరాధన నాయకుని యొక్క మూడు లక్షణములను వ్రాయండి.

(7) మనము ఆరాధనను నియంత్రించుచున్నాము అనుటకు మూడు గురుతులు ఏవి?

(8) మీరు కంటస్థం చేసిన 2 దినవృత్తాంతములు 5:13-14ను వ్రాయండి.

Next Lesson