క్రైస్తవ ఆరాధనకు పరిచయం
క్రైస్తవ ఆరాధనకు పరిచయం
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 6: ఆరాధనలో సంగీతం

2 min read

by Randall McElwain


పాఠ్య ఉద్దేశ్యములు

ఈ పాఠం ముగిసే నాటికి, విద్యార్థి:

(1) ఆరాధనలో సంగీతము కొరకు బైబిలానుసారమైన, వేదాంతపరమైన, మరియు ఆచరణాత్మక కారణములను గుర్తించుట.

(2) సంగీతము మనస్సు, హృదయము, శరీరము, మరియు చిత్తముతో మాట్లాడుతుంది అని అర్థము చేసుకొనుట.

(3) ఆరాధనలో సంగీతము యొక్క ఎంపికను నిర్దేశించు బైబిలు నియమాలకు కట్టుబడి ఉండుట.

(4) ఆరాధనలో సంగీతముతో ముడిపడియున్న ఆచరణాత్మక ప్రశ్నలకు బైబిలానుసారమైన నియమాలను అనువర్తించుట.

ఈ పాఠము కొరకు సిద్ధపాటు

కొలొస్సయులకు 3:15-17ను కంటస్థం చేయండి.

పరిచయం

తన సంఘములో కాపరి స్థానము నుండి అనీష్ రాజీనామా చేయాలని కోరుతున్నాడు. అతడు హైదరాబాద్ ఆశా క్రైస్తవ సంఘము కు చాలా ఉత్సాహముగా, ఆశతో వెళ్లాడు. అతనికి అధ్యయనం చేయుట, ప్రసంగములు తయరు చేయుట అంటే ఇష్టం. ప్రజలను సందర్శించి, దుఖములో ఉన్నవారికి ఆదరణ కలిగించుటను అతడు ఇష్టపడతాడు. అవిశ్వాసులకు సువార్తను ప్రకటించు అవకాశములను బట్టి అతడు సంతోషిస్తాడు. అతని సంఘ సభ్యులు అతని ప్రసంగములను చాలా ఇష్టపడతారు. క్రొత్త ప్రజలు వచ్చుచున్నారు. అనీష్ ఒక కాపరిగా నిజముగా ఉత్సాహముగా ఉండాలి. కాని ఏదో సమస్య ఉన్నది. అదంతా సంగీతము విషయములో వివాదమునకు సంబంధించినది.

ప్రతి సోమవారం ఉదయమున విజయ్ సంఘ ఆఫీసుకు ఫోన్ చేస్తాడు. “పాస్టర్ గారు, నిన్నటి సంగీతం భయంకరంగా ఉండింది! చివరి పాట నాకు తెలియదు. కీబోర్డ్ చాలా గట్టిగా వాయించారు. నేను దీన్ని తట్టుకోలేను. ఈ సంఘములో సంగీతము విషయములో మీరు ఏదో ఒకటి చేయాలి!”

తరువాత మంగళవారం, అనీష్ తన మ్యూజిక్ డైరెక్టర్ అయిన నితిన్ తో కలిసేవాడు. నితిన్ యొద్ద మరొక ఫిర్యాదు ఉంది. “పాస్టర్ గారు, మనము ఇప్పటికీ అన్ని పాత పాటలు ఎందుకు పాడుతున్నాము? ఈ పాటలు పాడి పాడి క్వయర్ కు విసుగుపుట్టింది. ఆదివారమున, మనం రెండు పాత పాటలు పాడాము మరియు ఒకే క్రొత్త పాట పాడాము. మనము ఈ పాత కీర్తనలను ఎందుకు విడిచిపెట్టకూడదు? పెద్ద సంఘములన్నీ మార్పు చెందుతున్నాయి. సంగీతమును మార్చుటకు నాకు అనుమతి ఇవ్వండి!”

మంగళవారం రాత్రి నాటికి, అనీష్ రాజీనామా చేయాలని భావించాడు. హైదరాబాద్ ఆశా క్రైస్తవ సంఘము లోని ఒక భాగమునకు పాత పాటలంటే ఇష్టం; క్రొత్త పాట పాడిన ప్రతిసారి వారు ఫిర్యాదు చేస్తారు. హైదరాబాద్ ఆశా క్రైస్తవ సంఘము లోని ఒక భాగమునకు పాత పాటలంటే ఇష్టం ఉండదు; వారు కేవలం స్తుతి ఆరాధన పాటలు మాత్రమే పాడాలని కోరతారు. అనీష్ దీనికి పరిష్కారమును కనుగొనలేకపోయాడు.

► పాస్టర్ అనీష్ కు మీరు ఏమని సలహా ఇస్తారు? తన సంఘములోని సంగీతము సభ్యులలో ప్రతి సమూహమును ఎలా సేవించగలదు?

ఆరాధనలో సంగీతము ప్రాముఖ్యమైయుండుటకు కారణములు

సంఘములో సంగీతమును గూర్చి చేయబడిన ఒక ఇంటర్వ్యూలో, ఒక పాస్టర్ ఒకసారి ఇలా అన్నాడు, “మాకు ఆరాధనలో సంగీతము అవసరం లేదు. నేను దేవుని వాక్యమును ప్రభావవంతముగా బోధించగలిగితే, పాడుట అవసరము లేదు.” ఆరాధనలో సంగీతము యొక్క విలువను ఈ పాస్టర్ చూడలేకపోయాడు.

► ఈ పాస్టర్ కు మీరు ఎలా సమాధానమివ్వగలరు? మన ఆరాధనలో సంగీతము ఎందుకు ప్రాముఖ్యమైయున్నది?

క్రైస్తవులు పాడు ప్రజలు. ముస్లింలు పాడుటకు సమకూడరు. భౌద్ధ మతస్తులు పాడుటకు సమకూడరు. హైందవులు పాడుటకు సమకూడరు. ప్రతి క్రైస్తవుడు ప్రసంగించడు, ప్రార్థనలో నడిపించడు, లేక బహిరంగముగా లేఖనమును చదవడు. క్రైస్తవులందరు పాడగలరు మరియు పాడాలి. క్రైస్తవ ఆరాధనలో సంగీతము ప్రాముఖ్యమైయున్నది అనుటకు కొన్ని కారణములు ఇక్కడ ఇవ్వబడినవి.

ఆరాధనలో సంగీతమునకు బైబిలానుసారమైన కారణము

సంగీతం బైబిలులో ప్రాముఖ్యమైయున్నది కాబట్టి, ఆరాధనలో సంగీతం ప్రాముఖ్యమైయున్నది. లేఖనములో పాటలు మరియు సంగీతమును గూర్చి 600 సంభోధనలు ఉన్నాయి. బైబిలులోని నలబై-నాలుగు పుస్తకములు సంగీతమును గూర్చి మాట్లాడతాయి.

బైబిలులోని పాటలు అనేక సందర్భములను గూర్చినవిగా ఉన్నాయి:

  • ఫరో సైన్యము మీద కలిగిన జయమును బట్టి ఇశ్రాయేలు దేవుని స్తుతించింది (నిర్గమకాండము 15).

  • యాబీను రాజు మీద దెబోరా విజయము సాధించిన తరువాత ఇశ్రాయేలు దేవుని స్తుతించింది
    (న్యాయాధిపతులు 5).

  • దేవాలయము ప్రతిష్టించబడినప్పుడు గాయకులు ఆరాధించారు (2 దినవృత్తాంతములు 5:11-14).

  • దేవాలయము పునర్నిర్మించబడినప్పుడు గాయకులు ఆరాధనలో నడిపించారు (ఎజ్రా 3:10-12).

  • కీర్తనలు గ్రంథము యూదా మరియు క్రైస్తవ ఆరాధన పాటల యొక్క సంపుటి అయ్యున్నది.

  • యేసు మరియు ఆయన శిష్యులు ఆఖరు భోజనము నాడు కీర్తన పాడారు (మత్తయి 26:30).

  • పౌలు సీలలు చెరసాలలో స్తుతి పాటలు పాడారు (అపొస్తలుల కార్యములు 16:22-25).

  • పాటలు పాడుట పరలోక ఆరాధనలో భాగమైయున్నట్లు యోహాను గుర్తించాడు (ప్రకటన గ్రంధం 4 మరియు 5).

ఆరాధనలో సంగీతము కొరకు వేదాంతశాస్త్ర కారణములు

యూదా ఆరాధకులు ఆరాధించుచు పాటలు పాడారు. ఆదిమ క్రైస్తవులు తమ హృదయములలో కృతజ్ఞతతో ప్రభువు కొరకు పాడారు (కొలొస్సయులకు 3:16). సంగీతము క్రైస్తవ ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన భాగమైయుండినది.

విచారకరముగా, క్రీ.శ. 367లో, లవొదికయ సభ సంఘముగా పాడుటను నిషేధించింది. రోమన్ కాథలిక్ సంఘము సామన్య విశ్వాసులు బైబిలు చదవకుండా నిషేధించింది; తర్ఫీదు పొందిన యాజకులు మాత్రమే దేవుని వాక్యమును సరియైన రీతిలో అనువదించుటకు సమర్థులు అని సంఘము నమ్మింది. ఇదే తర్కము ద్వారా సభ సంఘముగా పాడుటను నిషేధించింది. “ఒక వ్యక్తిగత విశ్వాసికి లేఖనములను వ్యక్తిగతముగా వ్యాఖ్యానించు సామర్థ్యత లేక ధన్యత లేకపోతే, వారికి సంఘములోని పాటలు పాడుటకు కూడా అనుమతి ఇవ్వబడకూడదు.”[1] మధ్య యుగములలో, ఆరాధనలో తర్ఫీదు పొందిన సంఘ క్వయర్ వారు మాత్రమే పాడేవారు; సామాన్య విశ్వాసులు కేవలం వీక్షకులుగా ఉండేవారు.

సంస్కరణ కాలములో ఒక ప్రాముఖ్యమైన వేదాంతశాస్త్ర ఉద్ఘాటన, విశ్వాసి యొక్క యాజకత్వము మీద ఉంచబడింది. ప్రార్థనలో సూటిగా దేవుని యొద్దకు వచ్చుటకు ప్రతి విశ్వాసికి ఒక ధన్యత మరియు బాధ్యత ఉన్నది; ఏ క్రైస్తవునికి కూడా ఒక యాజకుడు మధ్యవర్తిగా ఉండనవసరము లేదు. తన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడు మాటలను విను ధన్యత మరియు బాధ్యత ప్రతి విశ్వాసికి ఉన్నది, మరియు ప్రతి విశ్వాసికి ఆరాధనలో పాడు ధన్యత మరియు బాధ్యత ఉన్నది.

లేఖనమును చదువుట మరియు పాడుట మధ్య సంబంధమును మార్టిన్ లూథర్ చూశాడు. అతడు ఇలా అన్నాడు, “లేఖనముల ద్వారా దేవుడు తన ప్రజలతో సూటిగా మాట్లాడనీయుడి, మరియు ఆయన ప్రజలు కృతజ్ఞత స్తుతులతో స్పందించనీయుడి.”[2] సంఘ సంగీతము విశ్వాసి యొక్క యాజకత్వము అను వేదాంతశాస్త్ర సంఘ నియమమును వ్యక్తపరుస్తుంది.

సంగీతము ద్వారా వ్యక్తపరచబడిన రెండవ వేదాంతశాస్త్ర నియమము సంఘము యొక్క ఐక్యత. పాడుటకు ఎక్కువ బైబిలు ప్రస్తావనలు సంఘముగా పాడుటనుమ అందరి ప్రజలు కలిసి పాడుటను గూర్చినవి, పాటలతో ఒకరికొకరు బోధించుకొనుచు, హెచ్చరించుకొనుడి అని పౌలు ఆజ్ఞాపించాడు (కొలొస్సయులకు 3:16). సంఘము కలిసి పాడుతుండగా, మనము సంఘము యొక్క ఐక్యతను వ్యక్తపరుస్తాము.


[1]David Jeremiah. Worship (CA: Turning Point Outreach, 1995), 52
[2]David Jeremiah, Worship (CA: Turning Point Outreach, 1995), 52 లో ఉదహరించబడింది.

ఆరాధన అపాయములు: సంఘముగా పాడుట అంతరించిపోవుట

ఐసేక్ వాట్స్ గొప్ప కీర్తన వ్రాశాడు,

“మన దేవుని ఎన్నడును ఎరుగనివారు పాడుటకు నిరాకరించుదురుగాక.
కాని పరలోక రాజు పిల్లలు వారి ఆనందములను ప్రకటించునుగాక!”[1]

మార్టిన్ లూథర్ ఇలా అన్నాడు, “క్రీస్తు మన కొరకు చేసిన విషయములను గూర్చి మనము పాడకపోతే, మాట్లాడకపోతే, అతడు నిజముగా నమ్ముటలేదు అని చూపుచున్నాడు.”[2] మధ్య యుగములలో దారితప్పిపోయిన సంఘముగా పాడు ధన్యత, సంస్కరణ కాలములో మరలా దారిలో పడింది. పాటల ద్వారా ఆరాధన ప్రజలకు చెందినది అని వారు నమ్మారు. విచారకరముగా, అనేక సంఘములలో ఈ ధన్యత మరొకసారి అంతరించిపోతుంది.

విశ్వాసి యాజకత్వమును గూర్చిన సంగీత వ్యక్తీకరణము సాధారణముగా పాడుటకు సాధ్యపడని సంగీతము ద్వారా అపాయములోనికి నెట్టబడింది. ఎక్కువమంది ప్రజలకు కఠినమైన సంగీతమును తర్ఫీదుపొందిన బృందములు పాడునప్పుడు ఇలా జరుగుతుంది. ఎక్కువమంది నేర్చుకోలేని క్రొత్త పాటలను క్వయర్ పాడినప్పుడు ఇలా జరుగుతుంది. సంఘముగా పాడుట స్థానమును చిన్న సమూహములు తీసుకొనుటకు మనము ఎన్నడును అనుమతించకూడదు.

సంఘ ఐక్యత యొక్క సంగీత వ్యక్తీకరణ, విభిన్నమైన ఆరాధన శైలులు లేక తరముల భిన్నత్వముల ఆధారముగా పలు ఆరాధనా కూడికలుగా విశ్వాసులను విభాగించు సంఘము ద్వారా అపాయములోనికి నెట్టబడుతుంది. సంఘములో వృద్ధ సభ్యులు యౌవ్వనులను పట్టించుకోనప్పుడు సంఘమును ఒక శరీరముగా చూచుట కష్టమవుతుంది.

కొన్ని ఆధునిక సంఘముల కొరకు మరలా అనువదించబడిన ఎఫెసీ సంఘమునకు పౌలు ఇచ్చిన నిర్దేశనములను గూర్చి ఊహించండి:

  • కీర్తనలు పాడువారు ఆదివారము ఉదయములు 8:30కి కూడుకుంటారు.

  • పాటలు పాడువారు ఆదివారము ఉదయములు 11:00కి కూడుకుంటారు.

  • ఆత్మీయ పాటలు పాడువారు శనివారం సాయంత్రములు 7:00కి కూడుకుంటారు.

కాదు! వారిని ఆత్మతో నింపబడియుండమని చెప్పినప్పుడు పౌలు సంఘ సభ్యులందరితో మాట్లాడుతున్నాడు, ఒకరితో ఒకరు కీర్తనలుమ సంగీతములు మరియు ఆత్మ సంబంధమైన పాటలతో మాట్లాడుకొనుచు, ప్రభువు నామమున పాడుతూ గానము చేయమని చెప్పాడు (ఎఫెసీయులకు 5:18-19).

ఆచరణాత్మకముగా, క్రీస్తు శరీరములోని ప్రతి భాగము శరీరము యొక్క ఐక్యత కొరకు దానిలోని కొన్ని ఇష్టతలను విడిచిపెట్టాలని దీని అర్థము. ఒక యౌవ్వనుడు అంత ఉత్సాహమును కలిగించని ఒక పాటను పడతాడు. ఎందుకని? ఎందుకంటే అతడు శరీరములో ఒక భాగమైయున్నాడు, మరియు శరీరము ఒక పాత పాటను పాడుతుంది. వృద్ధుడైన విశ్వాసి తనకు అంతగా నచ్చని ఒక క్రొత్త స్తుతి పాటలో పాలుపంచుకుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఆమె శరీరములో భాగమైయున్నది, మరియు శరీరము ఒక క్రొత్త పాట పాడుచున్నది.

ఒక చిన్న గ్రామములోని సంఘములో తర్ఫీదు పొందిన ఒక సంగీతకారుడు సంగీతపరముగా సులువైన పాటలను పడతాడు. ఎందుకని? ఎందుకంటే అతడు శరీరములో భాగమైయున్నాడు, మరియు శరీరములో గొప్ప సంగీతమును ఆనందించని కొందరు సభ్యులు కూడా ఉన్నారు. తాను పూర్తిగా మెచ్చుకొనని శైలిలో పాడిన ఒక పాట చివరిలో తర్ఫీదులేని సంఘ సభ్యురాలు “ఆమెన్” అని చెప్పవచ్చు. ఎందుకని? ఎందుకంటే ఆమె శరీరములో భాగమైయున్నది, మరియు శరీరము ఆమె అభిమానం దాటి ఉన్న సంగీతాన్ని పాడే సభ్యులను కూడా కలిగియున్నది.

ఈ నియమము కేవలం సంగీతమునకు మాత్రమే వర్తించదు.పిల్లలకు మరియు క్రొత్త విశ్వాసులకు అర్థమైయ్యే విధముగా ఒక సేవకుడు తన ప్రసంగమును సులభము చేస్తాడు. బైబిలును గూర్చి వారికి ఉన్న పరిమిత జ్ఞానమును మించిన ఒక ప్రసంగ వాక్యభాగమును అర్థము చేసుకొనుటకు క్రొత్త విశ్వాసులు అధ్యయనం చేస్తారు.

చాలా సుదీర్ఘముగా ఉన్న ఒక కూడికలో యౌవ్వనులు కూర్చుంటారు. ఎందుకని? ఎందుకంటే వారు శరీరములో సభ్యులైయున్నారు మరియు కూడికలోని కొన్ని విషయములు వారి అవగాహనకు మించినవి అని వారికి తెలుసు. వృద్ధ విశ్వాసులు కూడికలో బిగ్గరగా ఏడ్చు ఒక చిన్న బిడ్డను ఆహ్వానిస్తారు. ఎందుకని? ఎందుకంటే వారు శరీరములో భాగమైయున్నారు, మరియు శరీరములో చిన్న పిల్లలు, గోల చేయు పిల్లలు కూడా ఉన్నారను విషయమును బట్టి వారు సంతోషిస్తారు.

ఇది ఆరాధనలో భాగమైయున్నదా? ఖచ్చితముగా! ఆరాధనను గూర్చిన బైబిలు వేదాంతశాస్త్రములో, సంఘ ఐక్యతను మెచ్చుకొనుట భాగమైయున్నది. అనగా శరీరము కొరకు వ్యక్తిగత ఇష్టములను విడిచిపెట్టుట అయ్యున్నది. అనగా మీకు అంతగా నచ్చని ఒక పాటను పాడుట అయ్యున్నది. నాయకుల విషయములో, కేవలం నచ్చిన పాటలు మాత్రమేగాక, శరీరములోని సభ్యులందరికి పరిచర్య చేయు పాటలను ఎన్నుకొనుట అయ్యున్నది. సంఘముగా పాడు పాటలు కేవలం పరిమిత సమూహములకు గాక సంఘమంతటికి పరిచర్య చేయాలి.

► గత నాలుగు వారములుగా ఆరాధనలో మీరు ఉపయోగించిన సంగీతమును గూర్చి ఆలోచించండి. మీ సంఘములో ప్రతి భాగముతో మాట్లాడు పాటలను మీరు పాడారా? ఒక నాయకునిగా, మీకు అంతగా నచ్చని పాటలు, కాని సంఘముతో మాట్లాడిన పాటలను ఉద్దేశ్యపూర్వకముగా మీరు ఎంపిక చేసుకున్నారా? మీ సంగీతము సంఘములోని ప్రతి సభ్యుని పాలుపంపులను ప్రోత్సహించుట ద్వారా విశ్వాసుల యొక్క యాజకత్వమును, సంఘ ఐక్యతను కనుపరుస్తుందా?


[1]Isaac Watts, “We’re Marching to Zion.” జనవరి 12, 2023 న యాక్సెస్ చేయబడింది. https://library.timelesstruths.org/music/Were_Marching_to_Zion/
[2]Ronald Allen మరియు Gordon Borror, Worship: Rediscovering the Missing Jewel (Colorado Springs: Multnomah Publishers, 1982), 165 లో ఉదహరించబడింది.

ఆరాధనలో సంగీతము ప్రాముఖ్యమైయుండుటకు కారణములు (కొనసాగింపు)

ఆరాధనలో సంగీతము కొరకు ఆచరణాత్మక కారణములు

బైబిలు మరియు వేదాంతశాస్త్ర కారణములతో పాటుగా, ఆరాధనలో సంగీతమునకు విలువనిచ్చుటకు అనేక ఆచరణాత్మక కారణములు ఉన్నాయి. సంగీతము యొక్క శక్తి మన ఉనికిలోని అన్ని కోణములతో మాట్లాడు సామర్థ్యతలో ఉన్నది.

సంగీతము మనస్సుతో మాట్లాడుతుంది.

వ్యాకరణ నియమమును ఒక చిన్న సులువైన పాట రూపములో చెబితే పిల్లలు సులువుగా కంటస్థం చేయగలరు అని ఉపాధ్యాయులకు తెలుసు. లేఖనమును పాడుట, దానిని నేర్చుకొనుటకు సులువైన మార్గముగా ఉన్నది. “నేను బైబిలును కంటస్థం చేయలేను” అని చెప్పు అనేకమంది ప్రజలు ఇప్పటికే అనేక లేఖన వచనములు తెలిసినవారిగా ఉన్నారు; వారు వాటిని స్తుతి కీర్తనలలో పాడతారు. ఉత్తమమైన స్తుతి పాటలలో కొన్ని మంచి లయలో పెట్టబడిన లేఖన వచనములైయున్నవి.

సంగీతము మరియు మనస్సుకు సంబంధించిన రెండు నియమములు ప్రాముఖ్యమైయున్నవి.

(1) సంగీతము మనస్సుతో మాట్లాడాలి, కేవలం భావనలతో మాత్రమే కాదు.

సంగీతము భావనాత్మకమైనది; ఇది దాని శక్తిలో భాగమైయున్నది. సంగీతము యొక్క భావనాత్మక శక్తిలో ఎలాంటి తప్పులేదు, కాని సంగీతము మన మనస్సుతో కూడా మాట్లాడాలి.

వారు పాడునప్పుడు తమ మనస్సును ఆఫ్ చేసుకోవచ్చని కొందరు ఆరాధకులు భావిస్తారు. గిటార్ శబ్దం ఎక్కువగా ఉంది, బీటు బలముగా ఉంది, సంగీతము భావనాత్మకముగా ఉంది, కాబట్టి వారు ఆరాధించుచున్నాము అనుకుంటారు. పౌలు చెప్పిన ఈ మాటను మనము ఎన్నడును మరచిపోకూడదు, “కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును” (1 కొరింథీయులకు 14:15).

[1]మన సంగీతము మనస్సుతో మాట్లాడకుండా భావనలతో మాట్లాడినప్పుడు, మనము అబద్ధ ఆరాధన చేయు అపాయములో పడిపోతాము. భావనలతో మాట్లాడు సంగీతముతో మాట్లాడుటలో తప్పులేదు; అపాయము ఏమిటంటే మనస్సుతో మాట్లాడకుండా భావనలతో మాట్లాడు సంగీతము. ఆరాధాన సంగీతము మనస్సును ప్రక్కనపెట్టకుండునట్లు జ్ఞానులైన కాపరులు చూచుకుంటారు.

(2) మనము పాడు సందేశము వాస్తవమైనదిగా ఉండాలి.

సంగీతము మనస్సుతో మాట్లాడుతుంది, కాబట్టి సిద్ధాంతమును బోధించుటకు పాటలు శక్తివంతమైనవి. రక్షణ నిశ్చయత మరియు కృపను గూర్చిన సందేశము అంత ఎక్కువగా వ్యాపించుటకు ఒక కారణం చార్లెస్ వెస్లీ యొక్క పాటలు అయ్యున్నవి. దేవుని రక్షించు కృప నరులందరికి ఉచితముగా లభిస్తుంది అని జాన్ వెస్లీ ప్రకటించాడు; చార్లెస్ వ్రాసిన పాటయైన “అండ్ కెన్ ఇట్ బి” వేదాంతశాస్త్ర భాగములను చదవని ఒక రౌతు యొద్దకు ఈ సందేశమును తీసుకొనివచ్చింది:

“అద్భుతమైన, ఉచితమైన కరుణ,

ఓ ప్రభువా, అది నన్ను కనుగొన్నది.”[2]

కాపరులారా, మీరు బైబిలు విరుద్ధమైన పాటలను అనుమతిస్తే, మీరు మీ పరిచర్య యొక్క ప్రభావమును బలహీనపరుస్తారు. ప్రజలు మీ ప్రసంగ సారాంశమును మరచిపోయిన తరువాత కూడా పాటను గుర్తుపెట్టుకుంటారు. కూడికల కొరకు సంగీతమును రూపొందించుటకు సమయము గడపండి. పాటలు ప్రసంగము యోక్క్ సత్యమునకు మద్దతునిచ్చునట్లు చూడండి.

చెకప్

మీ ఆరాధన పాటలు బైబిలు సిద్ధాంతమునకు అనుగుణంగా ఉన్నాయా? అనేక సంఘములు తప్పిదమును బోధించు లేక ఏమియు బోధించని (మాటలు ఖాళీగా ఉంటాయి) పాటలను పడతాయి. మీ పాటలు పాపము మీద కలుగు విజయము యొక్క వాస్తవికతను నేర్పుతాయా? మీ పాటలు రక్షణ అందరికి అందుబాటులో ఉన్నదని నేర్పుతాయా? మీ పాటలు పవిత్రమైన హృదయమును వాగ్దానము చేస్తాయా?

సంగీతము హృదయముతో మాట్లాడుతుంది.

పాడుట “మన భావనలను కదిలిస్తుంది” కాబట్టి మనము పాటలు పాడుటకు ఆజ్ఞాపించబడితిమి అని జోనాథన్ ఎడ్వర్డ్స్ చెప్పాడు.[3] భావనలను పొందాలని మాత్రమే భావనల మీద దృష్టిపెట్టుట అపాయకరమైనప్పటికీ, భావన అనునది సంగీతమునకు సాధరణమైన మరియు యోగ్యమైన ప్రతిస్పందనగా ఉన్నది. పాడుట అనునది సత్యమునకు భావనాత్మక ప్రతిస్పందనను కలిగిస్తుంది. సంగీతము మనస్సుతోను, హృదయముతోను మాట్లాడుతుంది.

భావనలతో లోతుగా మాట్లాడు సంగీతము అంటే కొందరు పాశ్చాత్య క్రైస్తవులు భయపడతారు, కాని బైబిలులో దేవుని సన్నిధిలోనికి ప్రవేశించిన ప్రజలు ఎల్లప్పుడూ భావనాత్మక స్పందనను అనుభవించారు. ఉత్తమమైన సంగీత ఆరాధన మనస్సును తాకుతుంది మరియు హృదయము నుండి ప్రతిస్పందనను కోరుతుంది:

యేసు స్వామీ నీకు నేను

నా సమస్త మిత్తును

నీ సన్నిధి-లో వసించి

ఆశతో సేవింతును

నా సమస్తము – నా సమస్తము

నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము

యేసు స్వామీ నీకు నేను

ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్

తీసివేతు లోక యాశల్

యేసు చేర్చుమిప్పుడే.[4]

సంగీతము శరీరముతో మాట్లాడుతుంది.

ఒక సంగీత మహోత్సవములో పిల్లలను చూడండి; సంగీతములో బీటు ఉంటే, వారు కదులుతారు. సంగీతము శరీరమును కదిలిస్తుంది.

కేవలం శరీరముతో మాత్రమే మాట్లాడు సంగీతము ఇంద్రియప్రేరితమైనది, అయితే, బైబిలు ఆరాధనను గూర్చి మాట్లాడునప్పుడు, అది చాలాసార్లు ఆరాధకుల యొక్క భౌతిక స్థితిని గూర్చి మాట్లాడుతుంది: చేతులెత్తుట, మొకాళ్ళూనుట, సాష్టాంగపడుట, మరియు శారీరిక కదలిక. మన స్థితి మరియు శారీరిక కవళికలు కొన్నిసార్లు మన మాటల కంటే బలముగా మాట్లాడతాయి.

కీర్తనలు 149:3లో, “నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక” ఇశ్రాయేలు పిలువబడింది. కొన్ని ఆధునిక సంస్కృతులు ఇంద్రియప్రేరిత కదలికల విషయములో మాత్రమే నాట్యము చేయుచున్నప్పటికీ, బైబిలు నాట్యము అను పదము ఆరాధనలో ప్రతి విధమైన శారీరిక కదలికను వర్ణించుటకు ఉపయోగిస్తుంది. భౌతిక శరీరము కూడా స్తుతించుటలో పాలుపంచుకుంటుంది అని కీర్తనకారుడు గుర్తించాడు.

ఇది నైట్ క్లబ్ లో చేయు శృంగార నృత్యము కాదు, అలాగే ఇది ఒక అధికారిక సంఘ బల్లల మీద మౌనముగా కూర్చొనుట కూడా కాదు. బైబిలు నాట్యములో ఆరాధన పాటల సమయములో కొంత కదలిక భాగమైయుంటుంది. మనము స్తుతులు చెల్లించుచు మన చేతులు ఎత్తినప్పుడు లేక సంగీతమునకు స్పందించి ఒక విధముగా కదిలినప్పుడు, అది బైబిలు పదమైన నాట్యమునకు చక్కగా సరిపోతుంది.

శారీరిక కదలికల అర్థము ఒక సంస్కృతికి, మరొక సంస్కృతికి, ఒక తరానికి మరొక తరానికి భిన్నముగా ఉన్నప్పటికీ, దేవుని యొక్క పరిశుద్ధమైన ఆరాధన మన చుట్టు ఉన్న సంస్కృతిలోని కలుషితమైన ఆచారములకు అనుగుణంగా రూపొందించబడుటకు మనము అనుమతి ఇవ్వకూడదు.

► పవిత్రమైన అని పిలువబడు “యెహోవా కొరకు పండుగ” ను (32:5) ఐగుప్తీయుల ఆరాధనలోని హేయమైన చిత్రములతో (32:4) మరియు అన్య సంస్కృతిలోని అవమానకరమైన ఆచారములతో (32:25) మిళితము చేసిన నిర్గమకాండము 32లోని ఆరాధనను సమీక్షించండి. మన ఆరాధన సువార్త ప్రకటన ద్వారా మన చుట్టూ ఉన్న సంస్కృతిని ప్రభావితము చేయాలి. మన చుట్టూ ఉన్న సంస్కృతి మన ఆరాధన ఆచారములను నిర్థారించకూడదు.

జ్ఞానులైన కాపరులు మరియు నాయకులు హేయమైన ఆరాధనను నివారించు, మరియు పాటలతో నిజమైన ఆరాధన చేయుటకు సంఘమునకు అవకాశం ఇచ్చు సంపూర్ణమైన వ్యక్తితో మాట్లాడు సంగీతమును కనుగొంటారు.

చెకప్

మీ ఆరాధనలోని సంగీతము ఆరాధనకు తగిన విధముగా సంఘ శరీరముతో మాట్లాడుతుందా? శృంగార ఆచారములతో ఆరాధనను కలుషితము చేయకుండా మీ ఆరాధకులు వారి స్తుతి ఆరాధనను భౌతికముగా వ్యక్తపరుస్తారా?

సంగీతము చిత్తముతో మాట్లాడుతుంది.

సంగీతము చాలాసార్లు చిత్తము యొక్క స్పందనను కోరుతుంది. కీర్తనలు, పాటలు, మరియు ఆత్మీయ గీతముల ద్వారా ఒకరినొకరు హెచ్చరించుకోమని పౌలు కొలస్సయులకు ఆజ్ఞాపించాడు (కొలొస్సయులకు 3:16). హెచ్చరించుకొనుట అంటే తప్పిదమును సరిచేయుట. గద్దింపు స్పందనను కోరుతుంది; దిద్దుబాటు ఒక వ్యక్తి ప్రవర్తనను మార్చుకోమని కోరుతుంది. సంగీతము మార్పుకు కారణంగా ఉండాలని పౌలు ఆశించాడు.

సంఘము వెలుపల, సంగీతము చిత్తముతో ఎలా మాట్లాడుతుందో మనము చూస్తాము. ఆఫ్రికన్ అమెరికన్లు (1960లలో పౌర హక్కుల కొరకు పోరాడినవారు) “మేము జయించగలము” అని పాడినప్పుడు, ఆ పాట హృదయములు మరియు చిత్తము రెంటితో మాట్లాడింది. ఆ పాట ఈ ఆహ్వానముగా మారింది, “స్వాతంత్ర్యము కొరకు ఈ పోరాటములో మీరు మాతో చేరతారా?”

సంగీతము చిత్తమును స్పందింపజేస్తుంది. మనము ఇలా పాడుటకు కావలసిన సమర్పణను గూర్చి ఆలోచించండి:

“జీవితంలో నీలా ఉండాలని

యేసు నాలో ఎంతో ఆశున్నది

తీరునా నా కోరిక

చేరితి ప్రభు పాదాల చెంత ||జీవితంలో||

కూర్చుండుటలో నిలుచుండుటలో

మాట్లాడుటలో ప్రేమించుటలో

నీలాగే నడవాలని

నీ చిత్తం నెరవేర్చని

నీలాగే నడవాలని.. యేసయ్యా

నీ చిత్తం నెరవేర్చని

నీలాగే నడిచి

నీ చిత్తం నెరవేర్చి

నీ దరికి చేరాలని ||తీరునా||”[5]

ఆరాధనలో సంగీతము ప్రాముఖ్యమైయున్నది ఎందుకంటే, అది సంపూర్ణ వ్యక్తితో మాట్లాడుతుంది. ఇందువలన, సంగీతము విలువైనది మరియు భయానకమైనది. అది సత్యమును బలమైన రీతిలో తెలియజేయగలదు గనుక అది విలువైనది. అది అబద్ధ బోధను ఆసక్తికరముగా చేయగలదు గనుక అది భయానకమైనది. వారెన్ వియర్స్బి ఇలా హెచ్చరించాడు, “సంఘములు వారు విను ప్రసంగముల కంటే ఎక్కువగా వారు పాడు పాటల ద్వారా వేదాంతశాస్త్రమును నేర్చుకుంటారు (మంచి మరియు చెడ్డ)… /[సంగీతము] ఆత్మ చేతులో అద్భుతమైన సాధనము కాగలదు లేక విరోధి చేతులలో ఘోరమైన ఆయుధము కాగలదు. ఏమి జరుగుతుందో తెలియకముందే అమాయకపు సంఘములు అబద్ధ బోధలను పాడు అవకాశం ఉంది.[6]

సంగీతము బలమైనది, దానిని జ్ఞానయుక్తముగా ఉపయోగించుడి.

చెకప్

గత నాలుగు వారములలో మీరు పాడిన పాటలను గూర్చి ఆలోచించుడి. సంపూర్ణ వ్యక్తిత్వముతో మాట్లాడు పాటలను మీరు పాడారా?

  • మీ సంఘమునకు సిద్ధాంతమును నేర్పిన ఒక పాట పేరు చెప్పండి.

  • మీ సంఘము యొక్క భావనలతో లోతుగా మాట్లాడిన ఒక పాట పేరు చెప్పండి.

  • దేవుని యెడల లోతైన సమర్పణ చేసుకొనుటకు మీ సంఘమును సవాలు చేసిన ఒక పాట పేరు చెప్పండి.


[1]

ఒక మెథడిస్ట్ “భక్తి భావనను పెంపొందించుటకు, తన విశ్వాసమును నిర్థారించుకొనుటకు, తన నిరీక్షణను జీవించుటకు, మరియు దేవుని యెడల, మనుష్యుని యెడల ప్రేమను పెంచుకొనుటకు పాడాలి.”

- జాన్ వెస్లీ

[2]Charles Wesley, “And Can It Be?” జనవరి 12, 2023 న యాక్సెస్ చేయబడింది. https://library.timelesstruths.org/music/And_Can_It_Be/
[3]Bob Kauflin, Worship Matters (Wheaton: Crossway Books, 2008), 98 నుండి పారాఫ్రేజ్ చేయబడింది.
[4]పాట రచయిత: రాబిన్ మార్క్. అనువదించినది: ఎం జి రామాంజులు, “నా సమస్తము” జనవరి 29, 2025 న యాక్సెస్ చేయబడింది. https://christianlyricz.com/2015/11/29/naa-samasthamu/
[5]పాట రచయిత: తెలియని రచయిత, “జీవితంలో నీలా ఉండాలని.” జనవరి 2, 2025 న యాక్సెస్ చేయబడింది. https://christianlyricz.com/2016/04/14/jeevithamlo-neelaa-undaalani/?utm
[6]Warren Wiersbe, Real Worship (Grand Rapids: Baker Books, 2000), 136. జోడించిన ప్రభావం.

ఆరాధన కొరకు సంగీతమును ఎంపిక చేసుకొనుటకు నియమములు

ఆరాధన సంగీతములో తలెత్తిన వివాదమును గూర్చిన ఒక సన్నివేశముతో ఈ పాఠమును మనము ఆరంభించాము. మీరు ఇట్టి వివాదమును ఎదుర్కొను ఒక సేవకులైతే, ఇది క్రొత్త సమస్య కాదని గుర్తించండి! ప్రతి తరములో, ఆరాధన కొరకు తగిన సంగీత రకమును నిర్థారించుటకు సంఘము సంఘర్షించింది. అనేక సంఘములలో, సంగీతము నిజమైన ఆరాధనకు మాధ్యమముగాక వివాదమునకు మూలము అయ్యింది.

ఆరాధన కూడికలలో సంగీతము కేంద్రమైయున్నది. అనేక సంఘములలో, సగం కూడిక సంగీతముతోనే నిండియుంటుంది: ఆరంభ సంగీతం, సంఘము కలిసి పాడుట, ప్రత్యేకమైన పాటలు, ముగింపు సంగీతం, మరియు ప్రార్థనల సమయములో మృదువైన సంగీతం. ఆరాధనలో సంగీతం ప్రాముఖ్యమైయున్నది కాబట్టి, సంగీతమును గూర్చిన వివాదము తీవ్రమైనది అవుతుంది.

సంగీత శైలుల విషయములో ప్రజలు బలమైన ఎంపికలను కలిగియున్నారు. అనేకమంది వారికి నచ్చని సంగీత శైలులను సహించలేరు.

సంగీత శైలుల యొక్క నైతికత విషయములో భిన్నాభిప్రాయం కలిగినప్పుడు వివాదము తలెత్తుతుంది. ఇక్కడ మూడు సాధారణ దృష్టికోణములు ఇవ్వబడినవి:

1. కొన్ని రకముల సంగీత శైలులు దుష్టమైనవి అని కొందరు ప్రజలు భావిస్తారు. వారు పవిత్రమైనవి అని నమ్ము సంగీత శైలులను వారు ఉపయోగిస్తారు.

2. సంగీత శైలులు మంచివి లేక చెడ్డవిగా ఉండవు అని కొందరు నమ్ముతారు, కాబట్టి ప్రతి శైలిని అంగీకరించవచ్చు. ఈ ప్రజలు సాధారణంగా సంస్కృతిలోని సంగీత శైలులను ఆరాధన కొరకు ఉపయోగించగోరతారు.

3. సంగీతశైలులు నైతికముగా తటస్థమైనవి మరియు ఆరాధన కొరకు వాటి యొక్క ఉపయోగమును ప్రభావితము చేయు భావానత్మక మరియు సాంస్కృతిక సంబంధములు కలిగియున్నవి అని కొందరు నమ్ముతారు. దేవుని ఘనపరచు విధముగా ఆరాధించునట్లు అది సంఘమునకు సహాయపడుతుందో లేదో పరిగణించుటకు వీరు ప్రతి శైలిని విశ్లేషిస్తారు.

ఈ భాగములో, మన ఆరాధనలో సంగీతమును గూర్చి మాట్లాడు బైబిలు నియమములను మనము చూద్దాము.

ఆరాధన సంగీతములోని మాటలు సత్యమును స్పష్టముగా తెలియపరచాలి

లేఖనము యొక్క ప్రధానమైన దృష్టి పాటలోని మాటల మీద ఉన్నదిగాని, సంగీత శైలి మీద కాదు.

[1]సంగీతము యొక్క శైలితో నిమిత్తము లేకుండా, అబద్ధ సందేశముతో నిండిన (లేక సందేశము లేని) పాటలు ఆరాధనకు తగినవి కావు. అనేక పాటల మాటలు “వేదాంతశాస్త్రముతో నిండినవిగాక, భావనలతో నిండినవిగా అస్పష్టమైనవిగా ఉంటాయి” అని వారెన్ వియర్స్బి హెచ్చరించాడు.[2] మన సంగీత సందేశమునకు ఒక పరీక్ష ఏమనగా, “ఒక ఆస్తికుడు, హైందవుడు, లేక ముస్లిం పదములు మార్చకుండా పాటను పాడగలడా?” పాట యొక్క సందేశమును మార్చకుండా మీరు బుద్ధ అను పేరు పెట్టగలిగితే, అది ఆరాధనకు సరిపడునది కాదు. ఒక పాట సత్యమును స్పష్టముగా మాట్లాడని యెడల, ఆరాధనలో దాని యొక్క విలువను మనము ప్రశ్నించాలి. మన పాటలు మన విశ్వాసమును వ్యక్తపరచాలి, అవి వ్యక్తపరచని యెడల, మన పాటలు ఆరాధకులను దేవుని తట్టు త్రిప్పవు.

లేఖనములో నుండి ఒక పాటను వినండి:

యెహోవాను స్తుతించుడి.

ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి

ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి

ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి

ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి

సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి

కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.

పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా,

ఆయనను స్తుతించుడి.

యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను

అవి యెహోవా నామమును స్తుతించును గాక

ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు… (కీర్తనలు 148)

దీనిని ఈ మధ్య కాలములోని ఒక ప్రఖ్యాతిగాంచిన పాటతో పోల్చండి:

“యేసు నామమున మీరు నాట్యము చేసిన యెడల,
అలా చేయుట తగును ప్రభువు పేరిట నాట్యము చేయుట తగినదే…”[3]

వీటిలో ఏ పాట దేవుని వాక్యమును ప్రకటిస్తుంది? జ్ఞానయుక్తముకాని ఆరాధనను గూర్చి పౌలు హెచ్చరించాడు. అతడు ఇలా అన్నాడు, “కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును” (1 కొరింథీయులకు 14:15). మనము లేఖనములోని పాటలను పాడినప్పుడు, అవి స్పష్టతను బోధించుచున్నవని మనము కనుగొంటాము. మన ఆరాధన సంగీతములోని విషయములు బైబిలు సత్యమును తెలియపరచాలి.

పాటను మూల్యాంకనము చేయు ఫారం[4]

  బలహీనమైనది ఫర్వాలేదు బలమైనది
మాటలు సిద్ధాంతపరముగా నిజమైయున్నాయా?      
మాటలు క్రైస్తవ అనుభవమునకు నమ్మకముగా ఉన్నాయా?      
సంఘ సభ్యులు మాటలను అర్థము చేసుకుంటారా?      
సంగీత శైలు మాటలతో ఇమిడియున్నదా?      
సంఘము పాడుటకు పాట యొక్క ఆలాపన సులువుగా ఉండినదా?      

చెకప్

మీ ఆరాధన పాటలు నిజముగా బైబిలానుసారమైనవేనా? మీ సంఘములోని పాటలలో క్రొత్త విశ్వాసి బైబిలులోని దేవుని కనుగొనగలడా?

ఆరాధన సంగీత శైలులు భిన్నముగా ఉండవచ్చు

దేవుడు అపారమైన భిన్నత్వమునకు దేవుడైయున్నాడు. ఆయన క్రొత్త నిబంధనలో ఒకటిగాక నాలుగు సువార్త నివేదికలకు అనుమతినిచ్చాడు. ప్రతి రచయిత యొక్క ప్రత్యేకమైన శైలుల ద్వారా ఆయన మాట్లాడాడు. ఆయన ఒకటిగాక, వేల రకముల చేపలను సృజించాడు. ఎనభై లక్షల రంగుల మధ్య భిన్నత్వమును గుర్తించగల సామర్థ్యతను ఆయన మానవ కంటికి ఇచ్చియున్నాడు. సృష్టి దేవుని మహిమను విభిన్నమైన రీతిలో, అందముగా కనుపరుస్తుంది. ఆయన విశేషమైన వ్యక్తులను సృజించాడు, కేవలం ఒకే వ్యక్తిత్వ రకమును కాదు. దేవుడు అపారమైన భిన్నత్వమును చూపుతాడు.

మన సంగీతము మనము ఆరాధించు దేవుని యొక్క సృజనాత్మక భిన్నత్వమును ప్రతిబింబించాలి. కొలొస్సయులకు 3:16లో, ఆరాధనలో ఉపయోగించగల మూడు రకముల పాటలను పౌలు తెలిపాడు: సంగీతములు, కీర్తనలు, మరియు ఆత్మసంబంధమైన పాటలతోను (ఎఫెసీయులకు 5:19ని కూడా చూడండి). పౌలు ఈ మూడు శైలుల యొక్క నిర్వచనములను ఇవ్వలేదు. అనేకమంది రచయితలు వాటిని ఇలా నిర్వచించారు:

  • కీర్తనలు బహుశా కీర్తనల గ్రంథమును సంబోధించుచున్నాయి.

  • సంగీతములు బహుశా వ్రాయబడిన పాటలను సూచించుచున్నాయి. అనేకమంది రచయితలు ఈ పదమును దేవుని కొరకు మరియు దేవుని గూర్చి పాడిన పాటలకు పరిమితము చేస్తారు. ఇవి కీర్తనలు గ్రంథముగాక ఇతర బైబిలు పాటలు కావచ్చు.

  • ఆత్మ సంబంధమైన పద్యములను నిర్వచించుట చాలా కష్టము. కొందరు రచయితలు వీటిని అనధికారికమైన పాటలుగా నిర్వచిస్తారు; ఇతరులు ఆత్మ సంబంధమైన పాటలను క్రైస్తవ జీవితమును గుర్చిన పాటలు మరియు వ్యక్తిగత సాక్ష్యమునకు సంబంధించిన పాటలుగా పరిగణిస్తారు.

నిర్వచనముతో నిమిత్తము లేకుండా, ఆది నుండే సంఘము విభిన్నమైన సంగీతములను పాడింది అని ఈ వచనములు చూపుతాయి.

వారెన్ వియర్స్బి ప్రామాణికత యొక్క నియమమును గూర్చి మాట్లాడాడు. అతడు ఇలా వ్రాశాడు, “ఆరాధన వ్యక్తీకరణలు ప్రామాణికమైనవిగా ఉండాలి, ప్రజల యొక్క సాంస్కృతిక భిన్నత్వములను బయలుపరచాలి.”[5] ప్రామాణికమైన ఆరాధన ప్రతి సంస్కృతి యొక్క భాషలో సజీవమైన దేవుని వాక్యమును మాట్లాడుతుంది. ప్రతి తరములోను, వారి సంస్కృతి యొక్క సంగీత శైలిలో దేవుని స్తుతించుటకు క్రైస్తవులు పాటలు వ్రాశారు. మన సంస్కృతిలోని సంగీతము మాత్రమే నిజముగా పవిత్రమైనది అని మనము భావించకూడదు. బదులుగా, ఒక శైలి లేఖనములోని స్పష్టమైన నియమాలకు విరుద్ధముగా ఉంటే తప్ప, ప్రతి సంస్కృతి మరియు ప్రతి తరమువారు తమ భాషలో దేవుని స్తుతించుటకు మనము అనుమతి ఇవ్వాలి.

చెకప్

మీ సంఘములోని సంగీతము మన దేవుని యొక్క సృజనాత్మక భిన్నత్వమును చూపుతుందా?

ప్రతి శైలి ప్రతి సందర్భము కొరకు తగినది కాదు

బైబిలానుసారమైన సంగీత శైలిని నిర్వచించుటకు అనేకమంది ప్రయత్నించినప్పటికీ, బైబిలు ఒక విశేషమైన సంగీత శైలిని కోరదు. సంగీత శైలుల వెనుక ఉన్న తత్వజ్ఞానమును అధ్యయనం చేసిన తరువాత, ఫ్రాన్సిస్ చాఫెర్ ఇలా వ్రాశాడు, “దైవికమైన శైలి అనునది ఏదియు లేదు అని నేను బలముగా చెప్పగోరుచున్నాను…”[6]

సంగీత స్వరములు నైతిక విషయములను తెలియజేయవు. ఒక సంగీత లయ దైవికమైనది కాదు, అదైవికమైనది కూడా కాదు. అంటే, ప్రతి సంగీత శైలి ఆరాధనకు తగినది అని అర్తమ? కాదు. కొన్ని శైలులు పాపపు సంస్కృతితో ఎంతగా ముడిపడియున్నాయి అంటే, అవి ఆరాధనలో దైవికమైన సందేశమును అందించవు.

సంగీతకారులు మరియు మిషనరీలు ఇదే విషయమును కనుగొన్నారు: ప్రజలు సంగీత స్వరములకు భిన్నమైన రీతులుగా స్పందిస్తారు. ఇద్దరు వ్యక్తులు అదే సంగీతమును వినుచుంటే, వారిలో ఒకరు ఆ పాట ద్వారా ప్రభావితమైన విధానమును బట్టి విలపించవచ్చు. ఆ సంగీతమునకు స్పందనగా ఇతర వ్యక్తిలో ఎలాంటి భావన ఉండకపోవచ్చు.[7]

ఆరాధన సంగీతమునకు అత్యున్నతమైన పరీక్ష, “అది నాకు నచ్చిందా?” లేక “అది నన్ను ప్రేరేపిస్తుందా?” అనునది కాదు. అత్యున్నతమైన పరీక్ష దేవుని మహిమ అయ్యున్నది. అనగా మన సాంస్కృతిక నేపథ్యములో ఒక సంగీత శైలి ఏమి బయలుపరుస్తుందో మనము సమీక్షించాలి. మనము ఇలా ప్రశ్నించాలి, “నా సాంస్కృతిక నేపథ్యములో, ఈ సంగీత శైలి దేవుని మహిమపరుస్తుంద?”

అన్ని విషయములు న్యాయమైనవి అయినా, అన్ని విషయములు కట్టునవి కావు (1 కొరింథీయులకు 10:23). ఆరాధన సంగీతము యొక్క ఒక లక్ష్యము విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలిగించుట అయితే, మనము ఉపయోగించు శైలి ఈ ఉద్దేశ్యమునకు ఆటంకము కలిగించకూడదు. అదే సంగీతము ఒక సంస్కృతిలో ఆరాధించుటకు సహాయపడవచ్చు, కాని మరొక సంస్కృతిలో ఆటంకము కావచ్చు. జాగ్రత్తగల ఆరాధన నాయకుడు తను నడిపించు ప్రజలకు తగిన సంగీతమును ఎన్నుకుంటాడు.

ఒక విధమైన సంగీత శైలి తగినదో కాదో మనము ఎలా నిర్థారిస్తాము? ఒక నాయకునిగా, మీ సాంస్కృతిక నేపథ్యములో ప్రజలు ఈ ప్రశ్నకు జవాబిచ్చుటలో సహాయము చేయుట మీ బాధ్యత అయ్యున్నది. ఒక సంస్కృతిలో తగినది మరొక సంస్కృతిలో తగినది కాకపోవచ్చు. ఒక శైలిలోని మత అర్థముల కారణంగా, లేక ఒక శైలి చుట్టూ ఉన్న సంస్కృతిలోని పాపపు ఆచారములతో ముడిపడిపోవుట కారణంగా, ఒక సంగీత శైలి ఆరాధనకు తగినది కాకపోవచ్చు. మీ నేపథ్యమునకు అది తగినదా లేదా అను విషయము దృష్ట్యా మీరు సంగీతమును సమీక్షించాలి.

సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి అని పౌలు మనకు ఆజ్ఞాపించాడు (1 థెస్సలొనీకయులకు 5:21). పరీక్షించకుండా మరియు రుజువు చేయకుండా మనము దేనిని అంగీకరించకూడదు. మనము పాడు సంగీతమునకు కూడా ఇది వర్తిస్తుంది.

చెకప్

మీ సాంస్కృతిక నేపథ్యములో తగని పాటలను మీరు పడతారా? సంగీతము మీ సంస్కృతిలో లైంగిక లేక లోకపరమైన శైలిని తెలియపరుస్తుందా? సంగీతములోని సందేశము వాక్యములోని సందేశమునకు విరుద్ధముగ ఉన్నదా?

మన ఆరాధన సంగీతములో సమతుల్యత ఉండాలి

దేవుడు ఆరాధనలో భిన్నత్వమునకు విలువనిస్తాడు అని కీర్తనల గ్రంథము చూపుతుంది. కీర్తనల గ్రంథములో స్తుతులు, విలాపములు, సహాయము కొరకు కేకలు, మరియు విమోచన కొరకు కృతజ్ఞత ఉన్నవి. కీర్తనలు ఆరాధకులందరి యొక్క ఆరాధన అవసరతలతో మాట్లాడతాయి.

సంఘములో పరిపక్వతకు ఒక గురుతు భిన్నత్వము అయ్యున్నది (1 కొరింథీయులకు 12:4-6). క్రీస్తు శరీరములో విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన భాషలు, విభిన్నమైన వ్యక్తిత్వములు, మరియు విభిన్నమైన వరములు ఉన్నవి. మన సంగీతముతో సహా మన ఆరాధన క్రీస్తు శరీరములోని సభ్యులందరితో మాట్లాడవలసియున్నది. వాస్తవానికి, అవిశ్వాసులకు సువార్తను అందించుటకు మన ఆరాధన సంఘమునకు బయట కూడా మాట్లాడాలి. బైబిలులోని పాటలు మూడు రకముల శ్రోతలతో మాట్లాడేవి.[8]

సంగీతము దేవుని స్తుతించాలి: “మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి” (ఎఫెసీయులకు 5:19).

► కీర్తన 92:1-4 ను చదవండి.

మనము ప్రభువు కొరకు పడుతున్నాము అని 92వ కీర్తన చూపుతుంది. సంగీతము దేవుని స్తుతించాలి. నిర్గమకాండము 15లోని స్తుతి పాట నుండి ప్రకటన గ్రంథములోని పరలోక పాటల వరకు, బైబిలులోని పాటలు దేవుని గొప్పతనమును బట్టి ఆయనను స్తుతిస్తాయి. బైబిలులో సంగీతము యొక్క ప్రాధమిక అంశము స్తుతి. విలాప కీర్తనలు, విన్నపములు, లేక స్తుతి కీర్తనలు దేవునికి చెల్లించబడినవి.

కీర్తనల గ్రంథమును అనుసరించి పాడుడి, అప్పుడు మీరు ఇలా పడతారు:

  • “నేను యెహోవకు మొరపెట్టితిని…”

  • “నా నీతికాధారమైన దేవా, నేను మొర్రపెట్టగా నాకుత్తరమిమ్ము!”

  • “నా పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించెదను.”

  • “నేను యెహోవా కొరకు పాడెదను.”

  • “ఓ ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను.”

సంగీతము సంఘమునకు సత్యమును ప్రకటించాలి: “ఒకరికొకరు బోధించుకొనుచు, హెచ్చరించుకొనుట” (కొలొస్సయులకు 3:16).

అనేకమంది ఆరాధన నాయకులు ఇలా అన్నారు, “మనము ఇతర శ్రోతల కొరకు పడకూడదు; కేవలం దేవుని కొరకు మాత్రమే పాడాలి.” అయితే, కీర్తనలు చాలా వరకు ఇశ్రాయేలు కొరకు పడతాయి. అనేక బైబిలు పాటలు దేవునితో మాట్లాడుతున్న మాట వాస్తవమైనప్పటికీ, అనేక బైబిలు పాటలు ప్రజలతో మాట్లాడుతున్న మాట కూడా వాస్తవమైయున్నది.

ఎఫెసీయులకు 5:19 ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మాట్లాడుకొనమని విశ్వాసులను హెచ్చరిస్తుంది. మన పాటల యొక్క ఉద్దేశ్యము విషయములో కొలొస్సయులకు 3:16 మరింత స్పష్టముగా మాట్లాడుతుంది: “సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి…”

సంఘము పాడుతుండగా క్రీస్తు వాక్యము ప్రకటించబడుతుంది అని పౌలు చూపుతున్నాడు. మనము పాడుచుండగా, మన తోటి ఆరాధకులతో మనము దేవుని సత్యమును మాట్లాడతాము. పాటల ద్వారా, సంఘములోని ప్రజలు ఒకరికి ఒకరు బోధించుకుంటారు. పాటల ద్వారా, విశ్వాసులు కట్టబడతారు మరియు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుతుంది.

సంగీతము లోకమునకు సువార్తను ప్రకటించాలి: “అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి…” (కీర్తనలు 96:3).

దేశములకు సాక్ష్యముగ పాడమని కీర్తనకారుడు మనకు పిలుపునిచ్చాడు:

యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతిం చుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. (కీర్తనలు 96:1-3)

► 1 రాజులు 8:41-43ను చదవండి.

దేవుడు స్తుతింపబడినప్పుడు, దేశములకు సువార్త ప్రకటించబడుతుంది. దేవాలయ పతిష్ట జరిగినప్పుడు, దేవాలయములో ఇతర దేశములవారు కూడా ఆరాధించాలని సొలొమోను ప్రార్థించాడు; భూమి మీద ఉన్న సమస్త జనులకు దేవుని నామము తెలియబడాలని అతడు ప్రార్థించాడు. మనము ఆరాధించుచుండగా, చూచుచున్న లోకమునకు సువార్త ప్రకటించబడుతుంది.

మన ఆరాధన సంగీతము దేవునితో మరియు దేవుని గూర్చి మాట్లాడాలి; మన ఆరాధన సంగీతము సంఘముతో మాట్లాడాలి; మన ఆరాధన సంగీతం లోకమునకు సువార్తను ప్రకటించాలి.

ఈ శ్రోతలలో ఒకరిని మనము మరచిపోయినప్పుడు, సంఘము కొరకు దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశ్యమును నెరవేర్చుటలో మన ఆరాధన విఫలమవుతుంది. ఆరాధనకు ఉన్నతమైన శ్రోత దేవుడు అను విషయమును మనము మరచిపోయినప్పుడు, మన ఆరాధన ప్రాధమికముగా దేవునితో మాట్లాడుటలో విఫలమవుతుంది. సంఘము ఆరాధనకు శ్రోతలు అని మనము మరచిపోయినప్పుడు, ఆరాధనలో ఒకరికొకరు బోధించుకొనుటలో మరియు ఒకరినొకరు హెచ్చరించుకొనుటలో మనము విఫలమవుతాము. ఆరాధన లోకమునకు సువార్తను ప్రకటించాలి అను విషయమును మనము మరచిపోయినప్పుడు, మనము సువార్త ప్రకటించుటలో మరియు గొప్ప ఆజ్ఞను నెరవేర్చుటలో విఫలమవుతాము.

చెకప్

మీ పాటలలో మీరు దేవునితో, సంఘముతో, మరియు అవిశ్వాసులతో మాట్లాడతారా? ప్రతి పాటలో వీరిలో ప్రతి ఒక్కరితో మాట్లాడదు; అయితే కూడిక అంతటిలో, మనము వీరిలో ప్రతి ఒక్కరితో మాట్లాడవలసియున్నది.


దీనిని ఆచరణలో పెట్టండి

ఆరాధనలో సంగీతము ఎందుకు ప్రాముఖ్యమైయున్నదో మనము చూశాము. ఆరాధనలో సంగీతము కొరకు బైబిలు నియమాలను మనము పరీక్షించాము. ఆరాధనలో సంగీతమునకు ఆచరణాత్మక ఆలోచనలను చూస్తూ మనము ఈ పాఠమును ముగిద్దాము. మీ సంఘము మరియు సంఘ సభ్యుల నేపథ్యమునకు సరిపడు విధముగా వీటిని మీరు అనువర్తించుకోవచ్చు.

పైన ఇవ్వబడిన నియమములకు స్పందనగా, ఒక విద్యార్థి ఇలా ప్రశ్నించాడు, “ఆరాధన సంగీతము యొక్క శైలులు మార్పుచెందితే, మరియు సంగీత శైలులు వాటంతట అవే మంచివి లేక చెడ్డవి కాకపోతే, మన సంఘము కొరకు సంగీతమును ఎంపిక చేసుకొనుటకు మనకు సహాయపడు కొన్ని మార్గదర్శకములు ఏవైనా ఉన్నాయా?”

ఉన్నాయి, కొన్ని ఆచరణాత్మక మార్గదర్శకములు మనకు సహాయము చేయగలవు. మీ పరిస్థితికి వీటిని ఎలా అనువర్తించాలో మీరు నిర్ధారించుకోవాలి, కాని సంఘ సంగీతము విషయములో కొన్ని మౌలిక నియమాలు మన నిర్ణయాలను నిర్దేశించాలి.


సంఘములో అత్యంత ప్రాముఖ్యమైన సంగీతము సమూహముగా కలిసి పాడుట అయ్యున్నది

సంఘము యొక్క సంగీతము సంఘము యొక్క ఐక్యతను, విశ్వాసుల యజకత్వమును వ్యక్తపరుస్తుంది కాబట్టి, సంఘము కలిసి పాడుట మన అత్యంత ప్రాముఖ్యమైన సంగీతము అయ్యున్నది. క్వయర్లు, సోలో సాంగ్స్, స్తుతి ఆరాధన బృందములు, వాయిద్య బృందములు, మరియు ఇతర ప్రత్యేకమైన సంగీతము విలువైనది అయినప్పటికీ, సంఘముగా కలిసి పాడుట క్రైస్తవ ఆరాధనలో అత్యంత ప్రాముఖ్యమైన సంగీతము అయ్యున్నది. సంఘముగా కలిసి పాడుటను మనము అభివృద్ధి చేసుకొనుటకు కొన్ని ఆచరణాత్మక అడుగులు ఉన్నాయి.

గుర్తుంచుకోండి:

1. వాయిద్యము పాట నుండి ఆకర్షణను మళ్లించునంత బిగ్గరగా లేక వివరముగా ఉండకూడదు. క్రొత్త నిబంధనలో, పాడుట సంఘము యొక్క ప్రాధమిక సంగీతముగా ఉండెను. కీబోర్డ్ వాయించువారు, గిటార్ వాయించువారు, డ్రమ్ములు వాయించువారు – మనము సంఘము యొక్క ప్రాధమిక సంగీతము కాము. సంఘము పాడుటకు అవకాశం ఇవ్వండ!

2. కొన్ని పాటలు ఎలాంటి వాయిద్యములు లేకుండా పాడుట బాగుంటుంది. ప్రార్థన పాటలు కొన్నిసార్లు ఎలాంటి వాయిద్యములు లేకుండా మౌనముగా పాడితే చక్కగా వ్యక్తపరచబడతాయి. ఎలాంటి అవరోధము లేకుండా వాక్య సందేశము మీద దృష్టిపెట్టుటకు ఇది సంఘమునకు అవకాశం ఇస్తుంది.

3. సంఘము పాలుపంచుకోలేని విధముగా సంగీతము కఠినముగా లేక క్రొత్తగా ఉండకూడదు. క్రొత్త పాటలు మంచివే, కాని మరిన్ని క్రొత్త పాటలను పరిచయం చేయుటకు ముందు సంఘము ఒక క్రొత్త పాట నేర్చుకొనుటకు మనము అవకాశం ఇవ్వాలి. తరచుగా క్రొత్త పాటలను పరిచయం చేయుట కష్టముగా ఉంటుంది మరియు సందేశమును గ్రహించుట సాధ్యపడదు. తెలిసిన పాటలను పాడుతూనే క్రొత్తవాటిని పరిచయం చేయుట ఒక మంచి సాధరణ పద్ధతి అయ్యున్నది.

4. కాపరులు సంఘముతో కలిసి పాడాలి. సంఘముగా కలిసి పాడుట ఆరాధన అయితే, మీరు కూడా ఆరాధించాలి. సంఘము కలిసి పాడుతున్నప్పుడు కాపరి ఇతర పనులను చేస్తుంటే, అతని క్రియలు ఈ సందేశమునిస్తాయి, “ఆరాధన కూడికలో నా ప్రసంగము మాత్రమే ప్రాముఖ్యమైయున్నది.” కాపరులు మిగిలిన సంఘమంతటి కొరకు ఆరాధనను మాదిరికరముగా చేయాలి.

సంగీతము పాటలోని మాటలకు అనుగుణంగా ఉండాలి

ఆరాధన సంగీతము దేవుని స్తుతించుటకు, సంఘమునకు సత్యమును ప్రకటించుటకు, మరియు లోకమునకు సువార్తను ప్రకటించుటకు ఉద్దేశించబడినది కాబట్టి, పాటలలోని మాటలు అత్యంత ప్రాముఖ్యమనవిగా ఉన్నాయి. సంగీత శైలితో నిమిత్తము లేకుండా, సంగీతము వాక్యభాగము యొక్క ప్రకటనకు ఆటంకము కలిగిస్తే, కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను మనము ఒకనినొకడు హెచ్చరించుచు మాట్లాడుకొనుటలేదని అర్థము.

అనగా వాయిద్య సంగీతము ప్రాముఖ్యమైనది కాదని అర్థము కాదు. వాయిద్యములు మన మనస్సులు, భావనలు, మరియు చిత్తము ఆరాధన మీద దృష్టిపెట్టుటకు సహాయపడతాయి. వాయిద్య సంగీతము ఆరాధనలో విలువైనది, కాని సంఘముగా కలిసి పాడుటలో ప్రధానమైన దృష్టి పాటలోని మాటల మీద ఉండాలి.

పాటల అర్థము మీద దృష్టిపెట్టుటలో నాయకుడు సంఘమునకు సహాయము చేయాలి.

వారు నడిపించు విధానము ద్వారా నాయకులు వాక్యభాగమును మరింత అర్థవంతము చేయగలరు. ఒక నాయకుడు పాట యొక్క సందేశమును ప్రభావితము చేయు విధానమును ఈ రెండు ఉదాహరణలు చూపుతాయి.

సంఘముగా కలిసి పాడు పాటల యోక్క్ అర్థమును గూర్చి వికాస్ పెద్దగా ఆలోచన చేయడు. గతవారము, త్రిత్వమును గూర్చి మాట్లాడు రెండు పాటలను వికాస్ పాడాడు. మొదటిగా సంఘముగా కలిసి పాడు పాట, “త్రియేక దేవుడా.” మనము “1 మరియు 3 చరణాలను పాడదాము” అని వికాస్ చెప్పాడు.

ఈ పాటలోని 2వ చరణమును ఎందుకు విడిచిపెట్టాలి? మాటలను చూడండి; ఇది త్రిత్వమును గూర్చిన పాట. త్రిత్వములోని ముగ్గురు పురుషమూర్తులలో ఒకనిని గూర్చిన చరణమును విడిచిపెడితే సందేశము బలహీనపడిపోతుంది.

చరణం 1: పరలోక పితా నీకు వందనము
సృష్టికర్తవు, అన్నిటికీ ఆధారము…

చరణం 2: యేసు ప్రభువా నీకు స్తోత్రము
క్రూజు పై నాపై ప్రేమను చూపినవు…

చరణం 3: పరిశుద్ధాత్మా నీకు ఆరాధన
మార్గదర్శకుడు నీవు, మా స్నేహితుడు…[9]

తరువాత పాట, "ఆరాధ్య దైవమా," స్తుతి పాట. ప్రతి చరణం త్రిత్వములోని ఒక పురుషమూర్తి యొక్క స్తుతి మరియు ఆరాధన. వికాస్ ఇలా అన్నాడు, “మనము రెండు చరణాలు పాడదాము.” మరొకసారి, త్రిత్వమును గూర్చిన పాటలో ముగ్గురు పురుషమూర్తులు ఉండాలి అను విషయమును వికాస్ మరచిపోయాడు. మాటలను పరిగణించకుండా పాటలోని చరణములను విడచిపెట్టుట సంఘ ఆరాధనకు ఆటంకము కలిగిస్తుంది.

ఆరాధనలో సంఘము కలిసి పాడుట ప్రాముఖ్యమైయున్నదని ప్రకాష్ కు తెలుసు. ఆదివారమున, అతడు ఒక క్రొత్త పాటను పాడాడు. అతడు ఇలా చెబుతూ ఆరంభించాడు, “ఈ పాట మనకు క్రొత్తది. 150వ కీర్తనను వినండి, దాని మీద ఈ పాట ఆధారపడియున్నది.” కొన్ని మాటల ద్వారా సంఘము క్రొత్త పాట యొక్క అర్థము మీద దృష్టిపెట్టుటకు ప్రకాష్ సహాయము చేశాడు.

కూడికలో తరువాత, ప్రకాష్ ఒక సమకాలీన కోరస్ పాడాడు, అది “అత్యున్నత సింహాసనముపై.”[10] వారు పాడుటకు ముందు ప్రకాష్ 1 తిమోతికి 1:17ను చదివాడు, “సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్.” సంఘము ఇంతకు ముందు కలిసి అనేకసార్లు పాడిన ఈ పాట నూతనపరచబడింది, ఎందుకంటే ఆ పాటను ప్రేరేపించిన లేఖనభాగమును ఆరాధకులు విన్నారు. ఒక పాటను దాని బైబిలు మూలములతో జతపరచుట ద్వారా సంఘము చేయు ఆరాధన ప్రోత్సహించబడుతుంది.

మీరు ఒక ప్రొజెక్టర్ ను ఉపయోగిస్తే, ప్రొజెక్టర్ ను నిర్వహించు వ్యక్తి ఆరాధన నాయకత్వములో భాగమైయుండాలి.

స్క్రీన్ మీద ఉన్న మాటలు ఆరాధకులు మాటల మీద దృష్టిపెట్టునట్లు చేయగలవు లేక వారిని మాటల నుండి దారిమళ్ళించగలవు. ప్రొజెక్టర్ ను నిర్వహించు వ్యక్తి తన నాయకత్వము విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. పదములలో తప్పిదములు, ప్రొజెక్టర్ లో పొరపాట్లు, లేక సరికాని చోట పాట యొక్క వరుసలు విభజించబడుట ఆరాధనకు ఆటంకము కలిగించగలవు.

మూడు ఉదాహరణలను చూడండి. మొదటి ఉదాహరణలో, కొన్ని పదములు తప్పుగా వ్రాయబడినవి. ఇవి సంఘములోని కొందరు సభ్యులకు ఆటంకము కలిగించవచ్చు; వారి మనస్సులు ఆరాధన మీద గాక పొరపాట్ల మీద ఉంటాయి. రెండవ ఉదాహరణలో, మాటలు ఉన్నాయి, కానీ వరుసల యొక్క విభజన ఒక వరుస యొక్క అర్థమును చూచుటను కష్టతరం చేస్తుంది. మూడవ ఉదాహరణలో, మన సర్వశక్తిగల దేవుని స్తుతించుటను గూర్చిన సందేశమును గాయకుడు అర్థము చేసుకోగలడు.[11]

ఉదాహరణ 1

ప్పగొ దేవుడవని శక్తి సంన్నప డని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్

రాజల రాజువని రక్షణ దుర్గమన

నీ కీర్తిని నేను కొనియాడెడన్ హలూల్లెయా నా యేసునాథా

హల్లెలూయా నా ప్రాణథానా

ఉదాహరణ 2

గొప్ప దేవుడవని

శక్తి సంపన్నుడని గళమెత్తి

నిన్ను నేను

గానమాడెదన్ రాజుల

రాజువని రక్షణ

దుర్గమని నీ కీర్తిని

నేను

కొనియాడెదన్ హల్లెలూయా

నా యేసునాథా హల్లె

లూయా నా ప్రాణనాథా

ఉదాహరణ 3

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్

రాజుల రాజువని రక్షణ దుర్గమని

నీ కీర్తిని నేను కొనియాడెదన్

హల్లెలూయా నా యేసునాథా

హల్లెలూయా నా ప్రాణనాథా

వీటిలో ఏది మిమ్మును స్తుతి సందేశము మీద దృష్టిపెట్టునట్లు చేస్తుంది? స్క్రీన్ మీద పదములు సంఘము కలిసి పాడుటను ప్రభావితము చేస్తాయి.

ఆరాధన సంగీతములో, సంగీతము మాటలకు సహాయం చేస్తుంది. ఇది వాస్తవము కాబట్టి, అర్థమును పాడుటలో ఆరాధన నాయకులు సంఘమునకు సహాయము చేయాలి. వీరిలో ఎవ్వరు కూడా ఆరాధనను సృష్టించలేరు; ఆరాధన హృదయములో నుండి పుడుతుంది. అయితే, అవరోధములను నివారించుట ఆరాధనకు ఆధారమైన దేవుని మీద దృష్టిపెట్టుటకు ఆరాధకులను ప్రోత్సహిస్తుంది.


[1]

ఇరవై సంవత్సరముల నియమం

“మన పాటలను పడుతూ ఎవరైనా ఇరవై సంవత్సరముల పాటు ఎదిగియుంటే, వారు దేవుని ఎంత మంచిగా తెలుసుకుంటారు? దేవుడు పరిశుద్ధుడు, జ్ఞానవంతుడు, సర్వశక్తిగలవాడు, మరియు సర్వాధికారి అని వారు తెలుసుకోగలరా? సువార్తలోని మహిమను మరియు దాని యొక్క కేంద్ర స్థానమును వారు అర్థము చేసుకోగలరా?”

- బాబ్ కౌఫ్లిన్

వర్షిప్ మేటర్స్

[2]Warren Wiersbe, Real Worship (Grand Rapids: Baker Books, 2000), 137
[3]James Roberson, “Everybody Dance!” జనవరి 12, 2023 న యాక్సెస్ చేయబడింది. https://genius.com/James-roberson-everybody-dance-lyrics
[4]Constance M. Cherry, The Worship Architect (Grand Rapids: Baker Academic, 2010), 202-203 నుండి అనుకూలించబడింది.
[5]Warren Wiersbe, Real Worship (Grand Rapids: Baker Books, 2000), 139
[6]Francis Schaeffer, Art and the Bible (Downers Grove: InterVarsity Press, 1973), 51
[7]Gerardo Marti, Worship across the Racial Divide: Religious Music and the Multiracial Congregation. (England: Oxford University Press, 2012)
[8]ఇది Herbert Bateman సంపాదకుడు, Authentic Worship (Grand Rapids: Kregel Publications, 2002), 150-155 నుండి అనుకూలించబడింది.
[9]కోర్సు సంపాదకుల తెలియిన మేరకు, ఈ పాట ఇంకా లేదు. ఇది ఈ ఊహాత్మక కథ కోసం సృష్టించబడింది.
[10]పాట రచయిత: అంశుమతి మేరి, “అత్యున్నత సింహాసనముపై” జనవరి 6, 2025 న యాక్సెస్ చేయబడింది. https://christianlyricz.com/2015/01/19/athyunnatha-simhaasanamupai/?utm
[11]పాట రచయిత: తెలియని రచయిత, “గొప్ప దేవుడవని.” జనవరి 31, 2025 న యాక్సెస్ చేయబడింది. https://christianlyricz.com/2016/05/08/goppa-devudavani/?utm

సంఘముగా పాడుటను అభివృద్ధిచేసుకొనుటకు ఆచరణాత్మక అడుగులు

1. పాటల ద్వారా ఆరాధన యొక్క ప్రాముఖ్యతను బోధించండి. ప్రార్థన మరియు ఇతర ఆత్మీయ క్రమశిక్షణల యొక్క ప్రాముఖ్యతను క్రైస్తవులకు బోధించవలసియున్న విధముగానే, వారు పాడాలని దేవుడు కోరుచున్న విధానమును గూర్చి కూడా వారు నేర్చుకోవాలి.

2. వారు ఎందుకు పాట పాడుతున్నారో సంఘము తెలుసుకొనునట్లు చూడండి. అది ప్రార్థన అయితే, వారికీ జ్ఞాపకం చేయండి. అది సమర్పణ పాట అయితే, అది కూడా తెలుపండి. అది బోధించబడిన సందేశమును ప్రతిబింబిస్తుంటే, దానిని స్పష్టము చేయండి. వారు ఎందుకు పాట పాడుతున్నారో వారికీ తెలిస్తే, ప్రజలు మరింత ఉత్సాహముగ పాడతారు.

3. ప్రదర్శన పాటల కంటే సంఘముగా కలిసి పాడు పాటలను ఎన్నుకోండి. సంఘముగా కలిసి పాడు పాటలకు పాడదగిన మరియు గుర్తుండు ఆలాపనలు ఉంటాయి. అందరూ పాడాలని మీరు కోరితే, దీనిని పరిగణించండి, “పిల్లలు ఇంటికి వెళ్తూ దీనిని పాడగలరా?”

4. వాయిద్యముల శబ్దమును తగ్గించండి. గిటార్లు, కీబోర్డులు, డ్రమ్స్, లేక క్వయర్ వారు సంఘ ప్రజల యొక్క స్వరమును దిగమింగుటకు అవకాశం ఇవ్వవద్దు. గదిలో అతి పెద్ద శబ్దము సంఘ ప్రజల శబ్దములైయుండాలి.

5. క్రొత్త పాటలు మరియు పాత పాటల మధ్య సమతుల్యతను వెదకండి.

6. విశాలమైన క్రైస్తవ అనుభవమునకు ప్రాతినిధ్యము వహించు పాటలను ఉపయోగించండి. సంగీతము అంతా ఆనందకరమైతే, సంఘములో శ్రమలలో ఉన్న సభ్యులతో మీరు మాట్లాడలేరు. కీర్తనల వలె, మన పాటలలలో కూడా సంతోషముగా ఉన్న క్రైస్తవులు, దుఖముగా ఉన్న క్రైస్తవులు, శోధింపబడుతున్న క్రైస్తవులు, మరియు శ్రమపడుతున్న క్రైస్తవుల కొరకు మాటలు ఉండాలి.

7. వారు సరిగా పాడరు అని వారికి అనిపించినప్పటికీ, కాపరి మరియు సంఘ నాయకులు ఉత్సాహముగా పాడుటను ప్రోత్సహించాలి. అస్సలు పాడకుండా ఉండుట కంటే లయలేకుండా పాడుట మేలు. పాటలు పాడునప్పుడు ప్రసంగమును చూచుకొను కాపరి ఈ సందేశమును ఇస్తాడు, “ఆరాధనలో పాడుట అంత ప్రాముఖ్యము కాదు.”

8. సామూహిక ఆరాధనలో వారు ప్రాధమిక సాధనములైయున్నారు అని సంఘ ప్రజలకు జ్ఞాపకము చేయండి. ప్రజలు ఉత్సాహముగా పాడని యెడల, సంఘముగా కలిసి పాడుట యొక్క ఉద్దేశ్యము నెరవేరదు. ఆరాధన కార్యముగ కలిసి పాడుట వారి బాధ్యత మరియు ధన్యత అని సంఘ ప్రజలకు బోధించాలి.

ముగింపు: గ్లోరియా యొక్క సాక్ష్యం

ఆరాధన సంగీతము ద్వారా దేవుడు మాట్లాడతాడా? తైవాన్ దేశములోని ఒక పాస్టర్ యొక్క సాక్ష్యమును వినండి.

గ్లోరియా మా సంఘములోనికి వచ్చినప్పుడు, ఆమె ముందు ఎన్నడును సువార్త వినలేదు. ఆమె ఒక ప్రసంగము కొరకు చూచుటలేదు; ఆమె క్రైస్తవురాలు కావాలని కోరలేదు. గ్లోరియా దేవుని కొరకు వెదకలేదు, కాని దేవుడు గ్లోరియా కొరకు వెతికాడు.

గ్లోరియా తన ఆంగ్ల భాషను అభివృద్ధి చేసుకొనుటకు మా సంఘమునకు వచ్చింది. మా సంఘము ఉచిత ఆంగ్ల తరగతులను నేర్పింది అని ఆమె వినినది, కాబట్టి ఆమె ఆంగ్ల భాషను నేర్చుకొనుటకు వచ్చింది. ఆమె మొదటిసారి దర్శించినప్పుడు, గ్లోరియా ఆలస్యముగా వచ్చింది. ఆమె మందిరములోనికి ప్రవేశించినప్పుడు, సంఘము కీర్తనలు 42:1 మీద ఆధారపడియున్న ఒక చిన్న గీతమును పడుతుంది, “దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.”

ఒక సంవత్సరము తరువాత ఆమె బాప్తిస్మము తీసుకున్నప్పుడు, గ్లోరియా ఈ సాక్ష్యమును ఇచ్చింది:

“నేను వచ్చి కూర్చున్నప్పుడు మీరు పాడిన ఆ పాట మినహా అ కూడికలో నాకు ఏమియు గుర్తులేదు. నేను ఆ పాట వినుచున్నప్పుడు, నేను ఏడ్చుట ఆరంభించాను. ముప్పై సంవత్సరముల పాటు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నేను దేవుని కొరకు దప్పిగొనియుంటిని, కాని నేను ఎవరి కొరకు దప్పిగొనియుంటినో నేను ఎన్నడును గుర్తించలేదు. నేను విద్యను ప్రయత్నించాను; నేను ధనమును ప్రయత్నించాను; నేను వినోదమును ప్రయత్నించాను; నేను సమస్తమును ప్రయత్నించాను – అయినను నేను ఖాళీగా ఉంటిని. కాబట్టి నేను ఆంగ్లను ప్రయత్నించాలని కోరి, మీ సంఘమునకు వచ్చాను.”

“ఆంగ్లమునకు బదులుగా, నాకు అవసరమున్న నీటిని నేను కనుగొన్నాను. నేను అ కూడికలో కూర్చొనియున్నప్పుడు, దేవుడు నా హృదయ వాంఛకు నెరవేర్పు అయ్యున్నాడు అని గ్రహించి నేను ఏడ్చాను. ఆయన నిజమైన ఆనందమును అనుగ్రహించువాడు. ఆ దినమున, న హృదయమును దేవునికిచ్చుటకు నేను నిర్ణయించుకున్నాను. నేడు, ఆయన న కంటిపాప అయ్యున్నాడు.”

పాఠం 6 సమీక్ష

(1) సంగీతము మన ఆరాధనలో ప్రాముఖ్యమైయున్నది

  • బైబిలులోని ఆరాధనలో సంగీతము ప్రాముఖ్యమైయుండినది కాబట్టి.

  • విశ్వాసి యొక్క యాజకత్వము అను వేదాంతశాస్త్ర నియమమును అది వ్యక్తపరుస్తుంది కాబట్టి.

  • సంఘము యొక్క ఐక్యత అను వేదాంతశాస్త్ర నియమమును అది వ్యక్తపరుస్తుంది కాబట్టి.

(2) సంగీతము

  • మనస్సుతో మాట్లాడుతుంది కాబట్టి మనము పాడు సందేశము వాస్తవమైయుండాలి.

  • హృదయముతో మాట్లాడుతుంది మరియు భావనలను తాకుతుంది.

  • శరీరముతో మాట్లాడుతుంది కాబట్టి హేయమైన అలవాట్లకు అనుగుణంగా ఇది ఉండకూడదు.

  • చిత్తముతో మాట్లాడుతుంది మరియు స్పందనను కోరుతుంది.

  • సంపూర్ణ వ్యక్తితో మాట్లాడుతుంది. సత్యమును బోధించినప్పుడు ఇది విలువైనది అవుతుంది మరియు అబద్ధ బోధను బోధించినప్పుడు భయానకమవుతుంది.

(3) ఆరాధన సంగీతము కొరకు లేఖన నియమములలో ఇవి భాగమైయున్నవి:

  • ఆరాధన సంగీతములోని మాటలు సత్యమును స్పష్టముగా తెలియపరచాలి.

  • ఆరాధన సంగీత శైలులు భిన్నముగా ఉండవచ్చు. పౌలు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను గూర్చి మాట్లాడుతున్నాడు. ఆరంభ దినముల నుండే, సంఘము భిన్నమైన సంగీతమును పాడింది.

  • ప్రతి శైలి ప్రతి సందర్భము కొరకు తగినది కాదు. “నా సాంస్కృతిక నేపథ్యములో, ఈ సంగీత శైలి దేవుని మహిమపరుస్తుందా?” అని మనము ప్రశ్నించాలి.

(4) సంగీతము మూడు రకముల శ్రోతలతో మాట్లాడాలి:

  • సంగీతము దేవుని స్తుతించాలి.

  • సంగీతము సంఘమునకు సత్యమును ప్రకటించాలి.

  • సంగీతము లోకమునకు సువార్తను ప్రకటించాలి.

(5) సంఘ సంగీతము కొరకు నియమాలు ఏవనగా:

  • సంఘములో అత్యంత ప్రాముఖ్యమైన సంగీతము సంఘముగా కలిసి పాడుట.

  • సంగీతము పాటలోని మాటలకు అనుగుణంగా ఉండాలి.

ముద్రించగల PDF ఇక్కడ అందుబాటులో ఉంది.

పాఠం 6 అభ్యాసములు

(1) ఆరాధన కొరకు అందుబాటులో ఉన్న భిన్నమైన సంగీతమును మెచ్చుకొనుటకు, క్రింద ఇవ్వబడిన ప్రతి అంశమును గూర్చి మాట్లాడు నాలుగు లేక అంత కంటే ఎక్కువ పాటల జాబితాను సిద్ధపరచండి. తరువాత పాఠములో మీరు ఆరాధన కూడికను సిద్ధపరచునప్పుడు మీ జాబితా ఉపయోగించబడుతుంది. మనస్సు, హృదయము, మరియు చిత్తముతో మాట్లాడు పాటల కొరకు చూడండి.

  • దేవుని స్వభావమును గూర్చి 4 పాటలు

  • యేసు, ఆయన మరణ పునరుత్థానముల గూర్చి 4 పాటలు

  • పరిశుద్ధాత్మ మరియు సంఘమును గూర్చి 4 పాటలు

  • దేవుని ప్రజలను సమర్పణగల, పరిశుద్ధమైన జీవితములోనికి పిలచు 4 పాటలు

  • సువార్త ప్రకటన మరియు పరిచర్యను గూర్చి 4 పాటలు

మీరు ఒక సమూహములో చదువుతుంటే, మీ జాబితాలను పంచుకొని, తరువాత చర్చించండి, “వీటిలో ఎన్ని పాటలను గత సంవత్సరములో మనము పాడియున్నాము? మన పాటలలో మనము సంపూర్ణ సువార్తను ప్రకటించుచున్నామా?”

(2) తదుపరి పాఠము యొక్క ఆరంభములో, ఈ పాఠం ఆధారముగా మీరు ఒక పరీక్ష వ్రాస్తారు. సిద్ధపడుటకు పరీక్ష ప్రశ్నలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి.

పాఠం 6 పరీక్ష

(1) బైబిలులో నుండి మూడు పాటలను వ్రాయండి.

(2) ఏ నమ్మకము వలన లవొదికయ సభ సంఘముగా కలిసి పాడుటను నిషేదించింది?

(3) మన ఆరాధన సంగీతములో కనబడవలసిన రెండు వేదాంతశాస్త్ర నియమములను వ్రాయండి.

(4) ఆరాధనలో సంగీతము కొరకు నాలుగు ఆచరణాత్మక కారణములను వ్రాయండి.

(5) ఆరాధన కొరకు మనము ఎంచుకొను సంగీతమును నిర్దేశించు నాలుగు నియమములను వ్రాయండి.

(6) కొలొస్సయులకు 3:16లో ఏ మూడు రకముల పాటలను పౌలు వ్రాశాడు?

(7) మన ఆరాధన సంగీతమునకు అత్యున్నతమైన పరీక్ష ఏమిటి?

(8) బైబిలులోని పాటల ఆధారంగా, విభిన్నమైన శ్రోతలతో సంగీతము మాట్లాడవలసిన మూడు విధానములను వ్రాయండి.

(9) ఆరాధన సంగీతము యొక్క ఉద్దేశ్యమును గూర్చి కొలొస్సయులకు 3:16 ఏమి బోధిస్తుంది?

(10) మీరు కంటస్థం చేసిన కొలొస్సయులకు 3:15-17ను వ్రాయండి.

Next Lesson