[1]పాత నిబంధనలో నుండి ఆరాధనను గూర్చి వారు నేర్చుకున్న విషయములను చర్చించుటకు కాపరులైన సమీర్, ఆకాశ్, రాహుల్, మరియు మనోజ్ మరలా కలుసుకున్నారు.
సాంప్రదాయిక ఆరాధనకు విలువనిచ్చు సమీర్ ఇలా అన్నాడు, “నా సంఘము సరియైన ఆరాధనను చేయుచున్నట్లు పాత నిబంధన రుజువు చేస్తుంది అని నేను భావిస్తున్నాను. దేవాలయములో ఆరాధన అధికారికముగాను, క్రమముగాను ఉండేది. మేము అలానే చేయుటకు ప్రయత్నిస్తాము.”
ఆకాశ్ నవ్వుతు ఇలా అన్నాడు, “అవును, కాని ప్రవక్తలు చెప్పిన మాటలను నీవు చదివావా? దేవాలయములోని అధికారిక ఆరాధనలో ప్రాముఖ్యత ఏమియులేదు! హృదయపూర్వక ఆరాధన దేవని సంతోషపరుస్తుంది. మా సమకాలీన ఆరాధనలో మేము ఇలానే చేస్తాము; మేము నూతన తరమువారి హృదయములను తాకుతున్నాము.”
విసుగుచెంది రాహుల్ ఇలా అన్నాడు, “మనము ఆరాధనను గూర్చిన అధ్యయనమును ఆరంభించిన నాటి నుండి కొంచెము కూడా ముందుకు సాగలేదు. ‘మీరు ఇలానే ఆరాధన చేయాలి’ అని దేవుడు ఎందుకు చెప్పకూడదు?”
మనోజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు, “మనము ఓటమినంగీకరించవద్దు. మనము క్రొత్త నిబంధన క్రైస్తవులము; బహుశా క్రొత్త నిబంధన మన ప్రశ్నలకు జవాబివ్వవచ్చు. క్రొత్త నిబంధనలో ఆరాధనను చదివి, అది ఏమి చెబుతుందో చూద్దాము.”
► క్రొత్త నిబంధనలో ఆరాధన ఏ విధముగా మార్పుచెందింది? ఆదిమ సంఘములోని ఆరాధన మందిరము మరియు దేవాలయములోని ఆరాధన కంటే యే విధముగా భిన్నముగా ఉన్నది? క్రొత్త నిబంధన ఆరాధనను గూర్చి మీకిప్పటికే తెలిసిన విషయములను సంగ్రహించండి.
“ఆరాధన క్రైస్తవ సంఘము యొక్క సర్వోన్నతమైన మరియు ఏకైక అంతముకాని కార్యమైయున్నది. అది మాత్రమే పరలోకము వరకు నిలిచియుంటుంది... కాని సంఘములోని కార్యకలాపాలన్నీ గతించిపోతాయి.”
- డబ్ల్యు. నికోల్స్
సువార్తలు: యేసు క్రీస్తులో ఆరాధన నెరవేర్చబడుతుంది
క్రొత్త నిబంధనలో కనిపించు ఆరాధన అను మాటలో సగభాగం సువార్తలలోనే ఉన్నవి. యేసు ఆరాధనకు అత్యున్నతమైన నెరవేర్పు అయ్యున్నాడు అని సువార్తలు చూపుతాయి. ఆయన ఆరాధనను రెండు విధాలుగా నెరవేర్చుతాడు.
1. ఆయన మానవత్వములో, యేసు ఆరాధనకు మాదిరిని చూపాడు.
2. ఆయన దైవత్వములో, యేసు ఆరాధించబడినాడు.
ఆయన మానవత్వములో, యేసు ఆరాధనకు ఉన్నతమైన మాదిరి అయ్యున్నాడు
యేసు నిజమైన ఆరాధనకు మాదిరిగా ఉన్నాడు. ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించువారిని దేవుడు వెదకుచున్నాడని యేసు సమరయ స్త్రీకి చెప్పాడు (యోహాను 4:24). ఆయన వ్యక్తిగత ఆరాధన ఆచారములలో కూడా (బైబిలు అధ్యయనము, ప్రార్థన, సమాజ మందిరములో మరియు దేవాలయములో హాజరగుట), ఆత్మతోను సత్యముతోను ఆరాధించుట అంటే ఏమిటో యేసు చూపాడు.
యేసు ఆరాధన స్థలమును ప్రేమించాడు.
ఆరాధన స్థలము పట్ల యేసు కలిగియుండిన ప్రేమను లూకా చూపాడు. బాలునిగా కూడా, యేసు దేవాలయమును తన తండ్రి ఇంటిగా గుర్తించాడు (లూకా 2:41-49). దేవాలయ ఆరాధనలో పరిశుద్ధత కొరకు ఆయన ఆసక్తిని కలిగియుండినాడు; దేవాలయమును దుర్వినియోగం చేస్తున్నవారిని ఆయన రెండుమార్లు త్రోలివేశాడు.[1]
ఆయన బహిరంగ పరిచర్య యొక్క ఆరంభ దినములలో, యేసు విశ్రాంతి దినమున ఆచారపరంగా నజరేతులోని సమాజ మందిరములోనికి వెళ్లాడు (లూకా 4:16). ఆయన భూలోక పరిచర్య అంతటిలో, యేసు తరచుగా సమాజ మందిరములను దర్శించాడు.
దేవుడు మినహా ఎవరినైనా లేక దేనినైనా ఆరాధించుటకు యేసు నిరాకరించాడు.
అరణ్యములో, అబద్ధ ఆరాధన కొరకు కలిగిన శోధనను యేసు తిరస్కరించాడు.
► మత్తయి 4:9-10ని చదవండి.
సృష్టికర్తనుగాక సృష్టిని ఆరాధించుటకు శోధన లేఖనములో తరచుగా కనబడు ఒక అంశమైయున్నది. పాత నిబంధనలో విగ్రహారాధనకు ఇది మూలముగా ఉన్నది. క్రూర మృగము మరియు ఘటసర్పము యొక్క ఆరాధన, మరియు దేవుడు మరియు గొర్రెపిల్ల యొక్క ఆరాధన మధ్య ఇన్న వ్యత్యాసమును ప్రకటన గ్రంథము చూపుతుంది. యేసు సృష్టము ఆరాధించుటకు నిరాకరించాడు.[2]
యేసు అలవాటుగా ప్రార్థన చేసేవాడు.
యేసు పరిచర్య అంతటిలో ప్రార్థన ప్రాముఖ్యమైయుండినది. యేసు ప్రార్థన చేశాడు అని సువార్తలు పదిహేనుసార్లు నివేదిస్తాయి. కొన్ని సందర్భములలో, ఆయన రాత్రంతా తన తండ్రితో ఒంటరిగా గడిపాడు. పన్నెండుమంది శిష్యులను ఎన్నుకొనుటకు ముందు, ఆయన ఒక రాత్రి ప్రార్థనలో గడిపాడు (లూకా 6:12). ఆయన శిష్యులతో ఆయన గడిపిన చివరి ఘడియలలో, యేసు శిష్యుల కొరకు మరియు తరువాత ఆయనను నమ్మువారందరి కొరకు ఆయన ప్రార్థించాడు (యోహాను 17). సిలువను ఎదుర్కొనుచు, ఆయన ప్రార్థించుటకు గెత్సేమనేకు వెళ్లాడు (మత్తయి 26:36-42). ప్రార్థన యేసు ఆరాధనలో ప్రాముఖ్యమైయుండెను.
యేసు నిజమైన ఆరాధనను వివరించాడు.
ఆయన సొంత క్రియల ద్వారా ఆరాధనకు మాదిరిని చూపుటతో పాటుగా, యేసు తరచుగా ఆరాధనను గూర్చి బోధించాడు. నిజమైన ఆరాధనను గూర్చి ఆయన సమరయ స్త్రీకి బోధించాడు. యేసు ఒక మాదిరికరమైన ప్రార్థనను శిష్యులకు నేర్పించి, ఉపమానముల ద్వారా ప్రార్థనను గూర్చి బోధించాడు (లూకా 11:5-8, లూకా 18:1-14).
► లూకా 11:1-4ను చదవండి.
ప్రార్థన ఆరాధనా హృదయములో నుండి వెలువడాలని యేసు మాదిరికరమైన ప్రార్థన చూపుతుంది. ప్రార్థన ఇలా ఆరంభమవుతుంది, “నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” పరిశుద్ధపరచబడుట అంటే పరిశుద్ధమైనదిగా గౌరవించుట. ప్రార్థనలో, మనము దేవుడు పరిశుద్ధుడు అని గుర్తిస్తాము.
యేసు అబద్ధ ఆరాధనను గద్దించాడు.
నిజమైన ఆరాధన ఆత్మతోను, సత్యముతోను ఆరాధన అయితే, అబద్ధ ఆరాధన దీనిని అందుకోలేనిదిగా ఉన్నది. యేసు వీటిని తిరస్కరించాడు:
(1) వేషధారణతో కూడిక ఆరాధన
కొండమీద ప్రసంగములో, సరికాని కారణముల కొరకు సరియైన పనులను చేయుట సాధ్యమే అని యేసు హెచ్చరించాడు. పేదలకిచ్చుట, ప్రార్థించుట, ఉపవాసముండుట అన్నీ ఆరాధనలో భాగములైయున్నవి. ఇతరులను మెప్పించుటకు ఈ పనులను చేయుచున్నవారిని యేసు హెచ్చరించాడు; వారు వేషధారులు (మత్తయి 6:1-18). నిజమైన ఆరాధకులు దేవుని ఆరాధించుట కొరకు ఈ కార్యములను చేస్తారు.
మత్తయి 23లో, ఆరాధనను గూర్చి సరియైన విషయములను బోధించుచు, హృదయములను మాత్రం దేవునికి దూరముగా కలిగియున్న మత నాయకులను యేసు గద్దించాడు. వారి బోధనలు సరియైనవేగాని, వారి హృదయములు మాత్రం సరికానివి అని యేసు చెప్పాడు; వారు వేషధారులు.
(2) ధర్మశాస్త్రవాద ఆరాధన
ఒక అపాయము వేషధారణ ఆరాధన; ఆరాధన దేవుని సంతోషపరచుటకు బదులుగా, చూచువారిని మెప్పించుటకు ప్రయత్నిస్తుంది. మరొక అపాయము ధర్మశాస్త్రవాదము; కొన్ని అర్హతలను కలిగియుండుట ద్వారా దేవుని కటాక్షమును సంపాదించుకొనుటకు ఉద్దేశించు ఆరాధన. మన ఆరాధనా కార్యముల ద్వారా దేవుని కటాక్షమును సంపాదించుటకు మనము ప్రయత్నించినప్పుడు, మనము నిజమైన ఆరాధనలోని వాస్తవికతను కోల్పోతాము. ఆరాధన పని అవుతుంది, మరియు దాని ద్వారా దేవుని మంచితనమునకు ఆనందముగా స్పందించుటకు బదులుగా దేవుని ఆమోదమును సంపాదించుటకు ప్రయత్నిస్తాము.
యేసు వారి ఆచారములను ఉల్లంఘించినప్పుడు ఇస్రయెలూలోని మత నాయకులకు కోపము పుట్టించాడు.[3] యేసు ధర్మశాస్త్రమును లేక ధర్మశాస్త్రములోని ఆత్మను ఉల్లంఘించలేదు; పరిసయ్యుల ధర్మశాస్త్రవాదము ద్వారా అనేక సంవత్సరములుగా ఎదిగిన మానవ సంప్రదాయములను ఆయన ఉల్లంఘించాడు. పరిసయ్యులకు, ఇవి స్వయంగా ధర్మశాస్త్రమంత ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. ధర్మశాస్త్రమును పాటించుట దేవుని కటాక్షమును సంపాదిస్తుంది అని వారు నమ్మారు. ధర్మశాస్త్రవాదమును ఈ విధముగా నిర్వచించవచ్చు: కొన్ని అర్హతలను నెరవేర్చుట ద్వారా దేవుని కటాక్షమును పొందుటకు ప్రయత్నము. యేసు వేషధారణను ఎంత బలముగా తిరస్కరించాడో. ధర్మశాస్త్రవాదమును కూడా అంతే బలముగా తిరస్కరించాడు.
ఆయన దైవత్వములో, యేసు ఆరాధించబడినాడు
ఆయన మరణ పునరుత్థానము తరువాత, యేసు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని సరియైన రీతిలోనే ఆరాధనను పొందియున్నాడు (ప్రకటన గ్రంధం 5:12-14). ఫిలిప్పీయులకు 2లో పౌలు ఈ మార్పును గూర్చి వ్రాశాడు. యేసు తనను తాను స్వేచ్చగా తగ్గించుకొనుట వలన, ఇప్పుడు ఆయన ఘనపరచబడి, ఆరాధించబడుతున్నాడు.
అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను (ఫిలిప్పీయులకు 2:9-11).
మత్తయి 18:20లో, ఆయన ఆరాధనకు పాత్రుడు అని యేసు సాక్ష్యమిచ్చాడు. యూదా ఆచారములో, ప్రార్థన మరియు ఆరాధన కొరకు సమాజ మందిరములో కూడుకొనుటకు కనీసం 10 మంది పురుషులు కావాలి. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.” సంఘములో, యేసు సన్నిధి ఆరాధనను నిర్థారిస్తుందిగాని, కూడివచ్చిన ప్రజల సంఖ్య కాదు.
ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను గమనించిన సమూహముల మీద ఆయన కలిగియుండిన ప్రభావము ద్వారా, తాను ఆరాధనకు పాత్రుడను అని యేసు చూపుతున్నాడు. వారు ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను చూసినప్పుడు, ప్రజలు దేవుని మహిమపరచారు, ఇది ఆరాధన కార్యము. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను చూసిన ప్రజలంతా ఆశ్చర్యపోయారు (మార్కు 1:23-27).
శిష్యులతో ఆయన గడిపిన చివరి రాత్రిలో, యేసు పస్కా భోజనము చేశాడు. ఈ భోజనము సాంప్రదాయిక యూదుల పస్కా భోజనమును పోలియున్నప్పటికీ, యేసు తన శిష్యులకు ఇలా చెప్పినప్పుడు దానికి ఒక నూతన అర్థమునిచ్చాడు “ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము ...ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన” (లూకా 22:19-20).
► లూకా 22:13-20ని చదవండి.
ఆయనను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయమని ఆయన వారిని ఆజ్ఞాపించాడు. ప్రభువు బల్ల క్రీస్తు మీద, అనగా పస్కాకు పరిపూర్ణమైన నెరవేర్పు మీద దృష్టిపెట్టింది.
[1]యోహాను 2:13-16 మొదటి సారి శుద్ధి చేయుటను గూర్చి మాట్లాడుతుంది. మత్తయి 21:12-27, మార్కు 11:15-17, మరియు లూకా 19:45-46 ఆయన భూలోక పరిచర్య యొక్క చివరి వారములో రెండవసారి శుద్ధిచేయుటను గూర్చి నివేదిస్తాయి.
[2]యేసు రోమా 1:25లో ప్రస్తావించబడిన ప్రజల వలె లేడు.
[3]మత్తయి 12:1-14, లూకా 13:10-17, యోహాను 5:8-18, మరియు ఇతర వచనములు.
నేటి బైబిలానుసారమైన ఆరాధన
యేసు అబద్ధ ఆరాధనను గద్దించుట మరియు నిజమైన ఆరాధనకు తనను మాదిరిగా చూపుట, మన ఆరాధన నిజాయితీగా ఉండాలని, ఇతరులను మెప్పించుట కొరకు చేయకూడదు అని తెలియజేస్తుంది. నిజమైన ఆరాధన ఇతరులను సంతోషపరచుట గాక తండ్రిని సంతోషపరచుట కొరకు ఉద్దేశించబడింది.
ఇది సంఘ నాయకుల కొరకు స్థిరమైన శోధనగా ఉన్నది. ప్రసంగము మరియు ఆరాధన నాయకత్వము బహిరంగముగా జరుగుతుంది కాబట్టి, ఆరాధన కంటే ఎక్కువగా మనము ప్రదర్శించునట్లు శోధింపబడవచ్చు. దేవుని ఘనపరచుటకు బదులుగా ప్రజలను సంతోషపరచుట మీద మనము దృష్టిపెట్టినప్పుడు, మనము ఆరాధననుగాక ప్రదర్శనను చేస్తాము.
ఒక నాయకుడు అబద్ధ ఆరాధన చేయునట్లు కలుగు శోధన ఏమిటి?
వినువారు ఇష్టపడతారు కాబట్టి ప్రసంగము కొరకు వాక్యభాగమును ఎన్నుకొనుట
దేవుని కంటే ఎక్కువగా వినువారితో మాట్లాడు ప్రార్థన
ఇచ్చువానిని ఆకర్షించు విధముగా కానుకను అర్పించుట
దేవునికిగాక వాయించువానికి ఘనతను తెచ్చు సంగీతం
నిజమైన ఆరాధన కేవలం దేవునికి మాత్రమే చెందుతుంది అని యేసు యొక్క బోధన మరియు మాదిరి తెలియజేస్తాయి. ఆరాధన మనలను గూర్చినది కాదుగాని, ఆయనను గూర్చినదే.
చెకప్
“నేను ఆరాధనను నడిపించునప్పుడు ఎవరికి మహిమ కలుగుతుంది? నేను దేవుని మహిమ కొరకు ప్రసంగిస్తానా, పాడతానా, ప్రార్థిస్తానా, మరియు ఇస్తానా, లేక నా సొంత గుర్తింపు కొరకు చేస్తానా? నేను నిజముగా ఆరాధించుచున్నానా?”
అపొస్తలుల కార్యములు: ఆరాధన మరియు సువార్త ప్రకటన
ఆరాధన సువార్త ప్రకటనతో దగ్గర సంబంధము కలిగియున్నది. అవిశ్వాసులు సువార్తను విని, స్పందించినప్పుడు ఆరాధకులు అవుతారు. అపొస్తలుల కార్యములూ ఆరాధన మరియు సువార్త ప్రకటన మధ్య ఉన్న సంబంధమును చూపుతుంది.
ఆరాధన సువార్త ప్రకటనలోనికి నడిపిస్తుందని యెషయా 6:8 చూపుతుంది; యెషయా ఆరాధనకు ఇచ్చిన ప్రతిస్పందన ఏమనగా, “నేనున్నాను! నన్ను పంపుము.” మనము నిజముగా ఆరాధించినప్పుడు, సువార్త ప్రకటన కొరకు మనము ఆసక్తిని పొందుతాము. ఆరాధనలో, మనము దేవుని చూస్తాము మరియు మన లోకము యొక్క అవసరతలను దేవుని కన్నుల నుండి చూస్తాము. ఆరాధన సువార్తికులను సిద్ధపరుస్తుంది.
ఆరాధన సువార్త ప్రకటించుట కొరకు సంఘమును ప్రేరేపిస్తుంది. సంఘము అవిశ్వాసులను క్రీస్తులోనికి నడిపించుచుండగా, నూతన విశ్వాసులు ఆరాధకులవుతారు. ఈ నూతన ఆరాధకులు తరువాత సువార్తను ప్రకటించుటకు ప్రేరేపించబడతారు.
అపొస్తలుల కార్యములు ఈ ప్రక్రియను కార్యరూపములో చూపుతుంది. ఎఫెసులో పౌలు బోధించిన తరువాత, ప్రజలు డయానా ఆరాధన నుండి మరియు వారి హస్తముల చేసుకొనిన దేవతల ఆరాధన నుండి నిజమైన దేవుని ఆరాధించుట వైపుకు తిరిగారు (అపొస్తలుల కార్యములు 19:26-27). మనము క్రీస్తును ప్రకటించుచుండగా, క్రొత్త విశ్వాసులు రాజ్యములోనికి ఆకర్షించబడతారు; వారు ఆరాధకులవుతారు. సువార్త ప్రకటన ఆరాధకులను సిద్ధపరుస్తుంది.
నిజమైన ఆరాధన సువార్త ప్రకటనను ప్రేరేపిస్తుంది.
అపొస్తలుల కార్యములు శిష్యులు ఆరాధించుటతో ఆరంభమవుతుంది; వారు ఏక మనస్సు కలిగి, ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి (అపొస్తలుల కార్యములు 1:14). పౌలు రోమాలో సువార్త ప్రకటించుట ద్వారా అపొస్తలుల కార్యములు ముగుస్తుంది; అతడు “ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను” (అపొస్తలుల కార్యములు 28:31).
ఆదిమ క్రైస్తవుల యొక్క ఆరాధన సువార్త ప్రకటనలోనికి నడిపిస్తుంది. పౌలు, బర్నబాల పిలుపు ఆరాధన నేపథ్యములో జరిగింది.
వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ–నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి (అపొస్తలుల కార్యములు 13:2-3).
నిజమైన ఆరాధన సువార్త ప్రకటనను ప్రేరేపిస్తుంది.
ప్రభావవంతమైన సువార్త ప్రకటన ఆరాధకులను సృష్టిస్తుంది
అపొస్తలుల కార్యములు అంతట, శిష్యులు ఆరాధనలో పాలుపంచుకున్నారు. పెంతెకొస్తు దినమున, మూడు వేలమంది రక్షణపొందారు. ఈ క్రొత్త విశ్వాసులు ఆరాధకులైయ్యారు; వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి (అపొస్తలుల కార్యములు 2:42).
యూదులైన క్రైస్తవులు దేవాలయములో ఆరాధించుటను కొనసాగించారు.[1] అంతేగాక, యూదులైన క్రైస్తవులు మరియు అన్య క్రైస్తవులు ఆరాధన కొరకు సమాజ మందిరములో కూడుకునేవారు. చాలా పట్టణములలో, పౌలు తన పరిచర్యను సమాజ మందిరములలో ఆరంభించి, యేసు పాత నిబంధన వాగ్దానములకు నెరవేర్పుగా ఉన్నాడని చూపాడు. [2] వ్యక్తిగత గృహములలో కూడా ఆరాధన జరిగింది. సహవాసము మరియు ఆరాధన కొరకు విశ్వాసులు ఇంటింటికి వెళ్లేవారు (అపొస్తలుల కార్యములు 2:46). పౌలు వ్రాసిన పత్రికలలో గృహములలో కూడుకొనుచున్న సంఘములకు కూడా అభివాదములు తెలుపబడినవి.[3] ఆదిమ సంఘము యొక్క సువార్త ప్రకటన ఒక నూతన ఆరాధకుల సమాజమును సృష్టించింది.
మార్స్ హిల్ యొద్ద సువార్త ప్రకటన
మార్స్ హిల్ మీద పౌలు ఇచ్చిన సందేశం సువార్త ప్రకటన మరియు ఆరాధనకు మధ్య ఉన్న సంబంధమును చూపు ఒక విశిష్టమైన వాక్యభాగమైయున్నది (అపొస్తలుల కార్యములు 17:16-34). ఏథెన్సులో, విగ్రహారాధనతో నిండియున్న సంస్కృతిని పౌలు నిలదీశాడు. విగ్రహముల యొక్క అబద్ధ ఆరాధన మరియు యెహోవా యొక్క నిజమైన ఆరాధన మధ్య పౌలు వ్యత్యాసమును చూపాడు.
ఏథెన్సువారు బహు దేవతాభక్తిగలవారు (అపొస్తలుల కార్యములు 17:22).
ఏథెన్సు ప్రజలు అరాధకులు, కాని వారు నిజ దేవుని ఆరాధించలేదు. వారి ఆరాధన అబద్ధము. కేవలం ఆరాధన మాత్రమే సరిపోదు; ఆరాధన సరియైన విషయము మీద దృష్టిపెట్టవలసియున్నది.
వారు ఎవరిని ఆరాధించుచున్నారో వారికి తెలియదు. వారు వెదకుచున్న దేవుని గూర్చి పౌలు వారికి ప్రకటించాడు. ఆయన యొద్దకు వచ్చుటకు మరియు ఆయనను కనుగొనుటకు దేవుడు సకల జనులకు అవకాశమునిచ్చియున్నాడని అతడు వారికి చెప్పాడు. ఈ మాట చీకటిలో ఉన్నవారిని సూచిస్తుంది. దేవుని కొరకు మనుష్యుడు కలిగియున్న ఆకలి సువార్త కొరకు ద్వారమును తెరచింది.
ఏథెన్సువారు అసమర్థుడైన దేవతను ఆరాధించారు.
యెహోవా అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు (అపొస్తలుల కార్యములు 17:25). ఏథెన్సువారి దేవత సమర్థవంతమైనది కాదు కాబట్టి, వారి ఆరాధన అబద్ధపు ఆరాధన. నిజమైన దేవుడు అందరికీ జీవమునిస్తాడు; ఆయనకు ఏమియు అవసరములేదు. ఆయనకు మన ఆరాధన అవసరమైయున్నది కాబట్టి మనము ఆరాధించముగాని, ఆయన మన ఆరాధనకు పాత్రుడు కాబట్టి మనము దేవుని ఆరాధిస్తాము.
పౌలు విగ్రహములకు మరియు నిజమైన దేవునికి మధ్య వ్యత్యాసమును చూపాడు.
1. దేవుడు సృష్టికర్త. ఆయన జగత్తును అందలి సమస్తమును నిర్మించాడు... ఆయన భూమ్యాకాశములకు దేవుడు (అపొస్తలుల కార్యములు 17:24). మనుష్యుల చేతులతో చేయబడిన విగ్రహములకు భిన్నముగా, దేవుడు మనుష్యుని సృష్టించాడు. ఆయన విదేశీ దేవుడు కాదు (అపొస్తలుల కార్యములు 17:18); ఆయన సర్వలోకమునకు సృష్టికర్త.
2. దేవుడు సమీపమున ఉన్నాడు. ఆయన మనకు దూరముగా లేడు (అపొస్తలుల కార్యములు 17:27). దేవుడు సర్వోత్కృష్టుడైనప్పటికీ, ఆయన మన లోకములోనికి ప్రవేశించి, ప్రతి ఆరాధకునికి సమీపముగా ఉన్నాడు.
3. పశ్చాత్తాపపడుటకు నిరాకరించువారికి దేవుడు తీర్పుతీర్చుతాడు (అపొస్తలుల కార్యములు 17:30-31). దేవుడు తిరుగుబాటును సహించలేని నీతిగల న్యాయాధిపతి అని సత్యముతో ఆరాధన గుర్తిస్తుంది. ఆరాధనలో, మనలను మనము ఆయన సార్వభౌమత్వమునకు అప్పగించుకుంటాము.
4. దేవుడు యేసును మృతులలో నుండి లేపియున్నాడు, మరియు యేసు ఆరాధనకు యోగ్యుడు అని చూపాడు (అపొస్తలుల కార్యములు 17:31). యేసు స్వేచ్చగా తనను తాను మరణమునొందుటకు అప్పగించుకున్నాడు; “అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను” (ఫిలిప్పీయులకు 2:10-11).
ఏథెన్సులో పౌలు సందేశం విగ్రహముల యొక్క అబద్ధ ఆరాధనను యెహోవా యొక్క నిజమైన ఆరాధనను గూర్చిన సువార్తను ఉపయోగించి ఖండించింది. ప్రభావవంతమైన సువార్త ప్రకటన ఆరాధకులను సృష్టిస్తుంది.
అనేక సంఘములు ఆరాధనను సువార్త ప్రకటన మరియు మిషన్ పరిచర్య నుండి దూరముగా ఉంచుతాయి. “మేము సువార్త ప్రకటన భారము కలిగియున్నాము. నశించినవారికి సువార్త ప్రకటించుట మా ధ్యేయం” అని పలు సంఘములు చెబుతుంటాయి. ఈ సంఘములు ఆరాధన మీద ఎక్కువ ఆసక్తిని పెట్టవు. ఇతర సంఘములు ఇలా అంటాయి, “సంఘము యొక్క ప్రాధమిక ఉద్దేశ్యము ఆరాధన అని నేను నమ్ముచున్నాము. ఇతరులు సువార్త ప్రకటించవచ్చు; కాని నా లక్ష్యం మాత్రం ఆరాధనే.”
సంఘము ఆరాధన మరియు సువార్త ప్రకటన రెంటి పట్ల సమర్పణ కలిగియుండాలని అపొస్తలుల కార్యములు చూపుతుంది. నిజమైన ఆరాధన సువార్త ప్రకటన కొరకు మనకు ఆసక్తిని కలిగిస్తుంది. ప్రభావవంతమైన సువార్త ప్రకటన నిజమైన ఆరాధకులను సృష్టిస్తుంది.
మనము సువార్త ప్రకటనను మరియు ఆరాధనను విడదీయకూడదు. సువార్త ప్రకటనను ప్రేరేపించని ఆరాధన ప్రధానముగా మనలను మనము ప్రేరేపించుకొనుటకు చేయబడు స్వార్థపు ఆరాధన అవుతుంది. ఆరాధించటకు నడిపించని సువార్త ప్రకటన నిజముగా దేవుని చూడలేని పైపై భక్తిగల క్రైస్తవులను లేవనెత్తుతుంది.
బైబిలానుసారమైన ఆరాధనలో, సువార్త ప్రకటన కొరకు మనము నూతన ఆసక్తిని పొందుకుంటాము. యెషయా వలె, దేవుని గూర్చి మనము కలిగియున్న అభిప్రాయం అవసరతలో ఉన్న లోకమును గూర్చి మనకున్న అభిప్రాయముతో ముడిపడి ఉంటుంది. యెషయా వలె, దేవుని యెడల మనము కలిగియుండు ఆరాధనా సమర్పణ ఈ విధముగా చెప్పునట్లు మనలను నడిపిస్తుంది, “నేనున్నాను! నన్ను పంపుము.”
చెకప్
మిమ్మును మీరు ఇలా ప్రశ్నించుకోండి, “అవిశ్వాసులతో సువార్త ప్రకటించునట్లు ఆరాధన నన్ను పురికొల్పుతుందా? దేవుని యొద్దకు నూతన ఆరాధకులను తెచ్చు ఆసక్తి నాలో ఉందా?”
పత్రికలు: ఆదిమ సంఘములో ఆరాధన
యూదుల ఆరాధన కొరకు ప్రత్యేకమైన మార్గదర్శకములను ఇచ్చిన పాత నిబంధనకు భిన్నముగా, క్రొత్త నిబంధన సంఘములో ఆరాధన కొరకు చాలా తక్కువ మార్గదర్శకములను ఇస్తుంది.[1] క్రొత్త నిబంధనలో సువార్త కూడిక యొక్క సంపూర్ణ వర్ణన లేదు, కాని పత్రికలలో ఆదిమ క్రైస్తవ ఆరాధనలోని కొన్ని మూలకములను మనము చూడవచ్చు.
లేఖన పఠనం
లేఖన పఠనము ఆదిమ సంఘ ఆరాధనలో ప్రాముఖ్యమైనదిగా ఉండినది. పౌలు పత్రికలను బహిరంగముగా చదవమని కొలొస్సయులకు 4:16 మరియు 1 థెస్సలొనీకయులకు 5:27 సంఘములను హెచ్చరిస్తున్నాయి. 1 తిమోతికి 4:13లో, లేఖనమును బహిరంగముగా చదువుట పట్ల దృష్టిని పెట్టమని పౌలు తిమోతికి జ్ఞాపకము చేస్తున్నాడు.
లేఖన పఠనము యొక్క ప్రాముఖ్యత కొలొస్సయులకు ౩:16లో సూచించబడింది, “సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.” కీర్తనకారుడు ధన్యుడను వర్ణించాడు; అతడు యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానిస్తాడు (కీర్తనలు 1:2). మన బహిరంగ ఆరాధన లేఖనమునకు మనమిచ్చు విలువను చూపుతుంది.
వాక్యమును ప్రకటించుట
లేఖనమును అధ్యయనం చేయుటతో పాటుగా, వాక్యము ప్రకటించు బాధ్యత కూడా నాయకునికి ఉంది
(2 తిమోతికి 4:1-4, తీతుకు 2:15). ఎజ్రా కాలము నుండి, శాస్త్రులు ప్రజల కొరకు లేఖనమును వ్యాఖ్యానించారు. ఎజ్రా మరియు అతని సహచరులు గ్రంథములో నుండి, యెహోవా ధర్మశాస్త్రములో నుండి స్పష్టముగా చదివారు, మరియు దాని అర్థమును తెలిపారు కాబట్టి ప్రజలు దానిని అర్థము చేసుకున్నారు (నెహెమ్యా 8:8). క్రొత్త నిబంధన కాలములోని యూదా సమాజమందిరములు ఈ ఆచారమును కొనసాగించాయి (అపొస్తలుల కార్యములు 13:14-15). లేఖన అర్థమును ఇచ్చుట ఆదిమ క్రైస్తవ ప్రసంగమునకు పునాది అయ్యుండినది.
అపొస్తలుల కార్యములులోని ప్రసంగములు ఆదిమ క్రైస్తవ ప్రసంగములోని విషయములను తెలియజేసేవి.[2] ఈ ప్రసంగములలోని ముఖ్య అంశములు ఏవనగా:
యేసు పాత నిబంధన ప్రవచనముల యొక్క నెరవేర్పు అయ్యున్నాడు.
దేవుని శక్తి ద్వారా యేసు ఆశ్చర్య కార్యములను చేశాడు.
యేసు సిలువవేయబడి మృతులలో నుండి తిరిగిలేచాడు.
యేసు ఇప్పుడు హెచ్చించబడి, ప్రభువుగా చేయబదినాదూ.
విను ప్రతి ఒక్కరు మారుమనస్సుపొంది, బాప్తిస్మము పొందవలెను.
బహిరంగ ప్రార్థన
బహిరంగ ప్రార్థన ఆదిమ క్రైస్తవ ఆరాధనలో ప్రాముఖ్యమైయున్నది (1 తిమోతికి 2:1-3). పౌలు పత్రికలలో ఇవ్వబడిన ప్రార్థనలు బహిరంగ ఆరాధనలో ఉపయోగించబడేవి అని అనేకమంది పండితులు చెబుతారు. సంఘము “ఆమెన్” అని చెప్పు వారు ప్రార్థనతో ఏకీభవించారని సూచిస్తుంది.[3]
పాటలు
పాటలు పాడుట దేవాలయములో ప్రాముఖ్యమైనదిగా ఉండినది మరియు ఆదిమ క్రైస్తవ ఆరాధనలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది. క్రైస్తవులు తమ యూదా ఆరాధన నుండి తెచ్చుకున్న కీర్తనలతో పాటుగా, క్రొత్త పాటలు మెస్సీయగా యేసును స్తుతించాయి. ఇది ఎఫెసీయులకు 5:19 మరియు కొలొస్సయులకు 3:16లో సూచించబడింది. ఫిలిప్పీయులకు 2:5-11 ఆదిమ క్రైస్తవ పాట అని అనేకమంది బైబిలు పండితులు నమ్ముతారు. అంతేగాక, లూకా 1:46-55లో మరియ పాటను మరియు లూకా 2:29-32లో సుమేయోను చేసిన ప్రార్థనను ఆరాధన కూడికలలో పాడియుండవచ్చు.
అర్పణలు
కొన్ని సందర్భాలలో, బహిరంగ ఆరాధనలో అర్పణ భాగముగా ఉండేది. 1 కొరింథీయులకు 16:2 మరియు 2 కొరింథీయులకు 9:6-13, యెరూషలేములో ఉన్న శ్రమపడుతున్న క్రైస్తవుల కొరకు కానుకను సేకరించమని కొరింథులో ఉన్న సంఘమును నిర్దేశిస్తాయి.
బాప్తిస్మము మరియు ప్రభువు బల్ల
బాప్తిస్మము మరియు ప్రభువు బల్ల అను సంస్కారములు ఆరాధనలో భాగమైయున్నవి. కొరింథీయులు ప్రభువు బల్లను జరుపుకొనుటలో చేయుచున్న తప్పులనుసరిచేయుటకు పౌలు వ్రాశాడు. క్రీస్తు ఇచ్చిన బలిని జరుపుకొనుటకు బదులుగా, అది ఒక విందుగా మారిపోయింది. ప్రభువు బల్ల యొక్క తీవ్రతను గూర్చి పౌలు హెచ్చరించాడు. సంస్కారము ఒక క్రైస్తవునికి అత్యంత పవిత్రమైన సన్నివేశమును జ్ఞాపకము చేస్తుంది; దానిని తెలికగా తీసుకోకూడదు.[4]
ఆరాధనలోని మూలకములను గూర్చి ఇవ్వబడిన ఈ సూచనలు మినగా, ఆరంభ క్రైస్తవ ఆరాధనను గూర్చి మనకు ఎంతగా ఏమి తెలియదు. ఆరాధన, ఆరాధనా నేపథ్యం కొరకు ఒక ప్రత్యేకమైన క్రమమును, లేక ఆదిమ సంఘములో బహిరంగ ఆరాధనను గూర్చిన ఇతర వివరములను పత్రికలు నిర్దేశించవు. ఆదిమ సంఘములో ఉండిన విభిన్నమైన మతపరమైన మరియు సాంస్కృతిక నేపథ్యముల కారణంగా, బహిరంగ ఆరాధన ఒకొక్క స్థలములో ఒకొక్క విధముగా ఉండియుండవచ్చు. యూదులైన క్రైస్తవులు బహుశా సమాజమందిరపు ఆరాధనను పోలిన విధముగా ఆరాధించియుండవచ్చు. అన్య క్రైస్తవులు యూదుల ఆచారములను గూర్చి అంతగా తెలియనివారు కాబట్టి, భిన్నముగా ఆరాధించియుండవచ్చు. అయితే, ఆదిమ సంఘము లేఖనమునకు, దేవుని వాక్యమును ప్రసంగించుట మరియు బోధించుటకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు అని మాత్రం స్పష్టమవుతుంది.
[1]ఎక్కువ భాగము ఈ గ్రంథము నుండి సేకరించబడింది, Franklin M. Segler and Randall Bradely, Christian Worship: Its Theology and Practice. (Nashville: B&H Publishing, 2006), Chapter 2.
అనేక సంఘములలో, లేఖనమును బహిరంగముగా చదువుట చాలా అరుదు. ఇవాంజెలికల్ సంఘములలో ఒక కూడికలో లేఖనములో నుండి చాలా తక్కువ వచనములను చదువుట సహజమే. మన ఆరాధనలో లేఖనమునకు ప్రాధాన్యత ఇవ్వబడాలి. లేఖనము మీద ఆధారపడియున్న పాటలు, బైబిలు అధ్యయనములు, లేక ప్రసంగములో లేఖనమును జాగ్రత్తగా విశదీకరించుట ద్వారా, మనము “గ్రంథములోని ప్రజలముగా” ఉండాలి. బైబిలు మన ఆరాధనలో కేంద్ర స్థానము కలిగియుండాలి.
చెకప్
“నా ఆరాధనలో ఆదిమ సంఘ ఆరాధనలో భాగముగా ఉన్న మూలకములన్నీ ఉన్నాయా?” అని మిమ్మును మీరు ప్రశ్నించుకోండి.
ప్రకటన గ్రంథము: ఘనపరచుటగా ఆరాధన
ఆరాధన ప్రకటన గ్రంథములోని సందేశమునకు కేంద్రము అయ్యున్నది.
ప్రకటన గ్రంథములోని కేంద్ర అంశములలో ఒకటి, ఆయన సింహాసము మీద ఉన్న యెహోవాను ఆరాధించువారు మరియు క్రూర మృగమును ఆరాధించువారి మధ్య ఉన్న వ్యత్యాసము.
దేవుడు తన శత్రువులను జయిస్తాడు అని, సమస్త దేశములు వచ్చి ఆయనను ఆరాధిస్తారు అని ప్రకటన గ్రంథము వాగ్దానము చేస్తుంది (ప్రకటన గ్రంధం 15:4).
[1]ప్రకటన గ్రంథములోని ఆరాధనను అర్థము చేసుకొనుటకు, గ్రంథము యొక్క చారిత్రిక నేపథ్యమును సమీక్షించుట సహాయకరముగా ఉంటుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు రెండు పోటీపడు విషయములను ఎదుర్కొన్నారు. ఒక వైపున, యేసు క్రీస్తు ప్రభువని వారికి తెలుసు (ఫిలిప్పీయులకు 2:11). క్రీస్తునందు విశ్వసించుటకు యేసు క్రీస్తు యొక్క అధికారము మరియు ప్రభుత్వమునకు సమర్పణ కలిగియుండుట అవసరమైయున్నది. మరొక వైపున, కైసరు ప్రభువు మరియు దేవుడు అని సామ్రాజ్యములో ఉన్న ప్రతిఒక్కరు సాక్ష్యమివ్వాలని రోమా సామ్రాజ్యం కోరింది.
క్రైస్తవులు దేవునికి గాక మరొక వ్యక్తికి తమ భక్తిని చూపుట అసాధ్యము. రోమీయులు మరియు మొదటి శతాబ్దపు క్రైస్తవుల మధ్య తలెత్తిన వివాదము యొక్క మూలము ఈ ప్రశ్న అయ్యున్నది, “మన ఆరాధనకు యోగ్యుడెవరు?” ఈ నేపథ్యములో, ప్రకటన గ్రంథము ఇలా చెబుతుంది, “యేసు ప్రభువైయున్నాడు.” ఆయన అధికారమును గుర్తించని లోకములో కూడా, యేసు ప్రభువైయున్నాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ప్రకటన గ్రంథము నిజమైన ఆరాధనకు ఒక చిత్రమును చూపుతుంది.
పరలోక ఆరాధన విఫలమైన ఆరాధనకు వ్యతిరేకముగా ఉన్నది
ప్రకటన గ్రంథము చిన్న ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు ఇవ్వబడిన సందేశములతో ఆరంభమవుతుంది. చిన్న ఆసియా చక్రవర్తుల ఆరాధనకు బలమైన కేంద్రముగా ఉండినది. ప్రకటన గ్రంథములో తెలుపబడిన పట్టణములన్నిటిలో రాజుల దేవాలయములు ఉండేవి. ఆ ప్రాంతమంతటిలో చక్రవర్తుల ఆరాధన విరివిగా జరిగేది.
ఏడు సంఘములకు ఇవ్వబడిన సందేశము పలు సంఘములు ఆరాధన విషయములో విఫలమయ్యాయి అని చూపుతుంది. ఏడు సంఘములు దేవుని ఆరాధించుచున్నప్పటికీ, ఐదు సంఘములను గద్దించుట జరిగింది. ఈ సంఘములు ఆమోదయోగ్యమైన రీతిలో దేవుని ఆరాధించుటకు విఫలమయ్యాయని ఈ గద్దింపులు చూపుతాయి.
1. ప్రేమ లేకపోవుట నిజమైన ఆరాధనకు ఆటంకము కలిగిస్తుంది. ఎఫెసీ సంఘము అనేక విషయములను సరిగానే చేసిందిగాని, మొదటి ప్రేమను మరచిపోయింది. ఆరాధనలో ఖాళీతనము మనము ఆరాధించు దేవుని యెడల ప్రేమను మనము కోల్పోయాము అనుటకు గురుతుగా ఉన్నది.
2. అబద్ధ బోధ నిజమైన ఆరాధనకు ఆటంకము కలిగిస్తుంది. పెర్గము మరియు తుయతైర రెండు అబద్ధ బోధలను సహించాయి. బైబిలు సత్యము స్థానములో చిహ్నములు మరియు ఆశ్చర్య కార్యములకు ప్రాధాన్యతనిచ్చు సంఘములలో ఈ అపాయమును చూడవచ్చు.
3. మృతతుల్యమైన క్రియలు నిజమైన ఆరాధనకు ఆటంకం కలిగిస్తాయి. నిద్రించుచున్న కాపలావారు వారి వైపుకు వచ్చుచున్న శత్రువులను చూచుటలో విఫలమైనప్పుడు రెండుసార్లు సార్దీస్ ఓటమిని ఎదుర్కొన్నది.[2] సార్దీస్ లోని సంఘము దాని సత్క్రియలను నమ్ముకున్నది కాబట్టి నిద్రించుచున్నదని యోహాను హెచ్చరించాడు. ఆరాధనలో దేవుని ఎదుర్కొనుట సార్దీస్ సంఘమును దాని యొక్క సోమరితనము నుండి లేపుతుంది.
4. ఆసక్తిలేమి నిజమైన ఆరాధనకు ఆటంకం కలిగిస్తుంది. సమృద్ధిగల సమయములలో సంఘములో కనిపించిన నులివెచ్చని స్థితిని లవొదికయ సంఘము చూపింది. లవొదికయ సంఘములోని ప్రజల మధ్య ఆసక్తి లేకపోవుటకు కారణం వారి ఐశ్వర్యం మరియు స్వయం-సమృద్ధి. నిజమైన ఆరాధన దేవుని మీద మనము ఆధారపడుటను జ్ఞాపకము చేస్తుంది.
పరలోక ఆరాధన దేవుని మీద దృష్టిపెడుతుంది
పరలోక ఆరాధన దేవుని మీద మరియు ఆయన మహిమ మీద దృష్టిపెడుతుంది అని ప్రకటన గ్రంధం 4-5 అధ్యాయములు చూపుతాయి. పరలోక ఆరాధకులు నిత్య రాజును మరియు తిరిగిలేచిన గొర్రెపిల్లను ఆరాధిస్తారు.
ఒక దేవదూత యోహానుతో ఇలా చెప్పుటను మీరు ఊహించగలరా, “నీవు ఆరాధనలో మరింత సౌకర్యవంతముగా ఉండుటకు మనము ఇంకా ఏమైనా చేయగలమా?” చేయలేము! ఆరాధన దేవుని గూర్చినదేగాని, నన్ను గూర్చినది కాదు. ఆరాధన ఆరాధకుని దీవిస్తుందిగాని ఆరాధన యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం అది కాదు. ఆరాధన యొక్క ఉద్దేశ్యం దేవుని ఘనపరచుట. దేవుని సింహాసనము చుట్టు ఉన్న ఆరాధకులు దేవునికి స్తుతి పాట పాడుదురు:
ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు (ప్రకటన గ్రంధం 15:3-4).
పరలోక ఆరాధన దేవుని సన్నిధిలో జరుగుతుంది. ఆదాము హవ్వలు తోటలో నుండి తోలివేయబడిన నాటి నుండి, మనుష్యుడు దేవునికి దూరమైయ్యాడు. పరలోకమందు, మరొకసారి యే విధమైన దుష్ట ప్రభావము లేకుండా ఆరాధన దేవుని సన్నిధిలో జరుగుతుంది.
ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. (ప్రకటన గ్రంధం 21:3).
పరలోక ఆరాధన నిజమైన వాస్తవికతను తెలియజేస్తుంది.
అతడు ప్రకటన గ్రంథమును వ్రాసినప్పుడు, యోహాను పత్మోసు ద్వీపములో చెరలో ఉండినాడు. రోమా సామ్రాజ్యమంతటిలో క్రైస్తవులు హింసను ఎదుర్కొన్నారు. భూలోక దృష్టికోణము నుండి చూస్తే, భవిష్యత్తు చీకటిమయముగా కనిపించింది. అయితే, ప్రకటన గ్రంథము భూలోక సన్నివేశముల మీద పరలోక దృష్టికోణమును చూపుతుంది.[3]
భూమి మీద, మనము చరిత్రలోని ఒక వైపును మాత్రమే చూస్తాము. మన చుట్టూ ఉన్న లోకమే అంతిమ సత్యము అని భావించునట్లు మనము శోధింపబడతాము. ఆరాధన మరియు పరలోకం ఈ నిజమైన లోకములోని సంఘర్షణలకు చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. అయితే, ప్రకటన గ్రంధం 4, 5, మరియు 15లో కనిపించే పరలోక ఆరాధన మనకు నిజమైన లోకము యొక్క చిత్రమును చూపుతుంది.
క్రైస్తవ సేవకులకు, ఈ లోక శ్రమలు తాత్కాలికమైనవి అనుటకు ప్రకటన గ్రంథము ఒక ప్రాముఖ్యమైన జ్ఞాపకముగా ఉన్నది. ఆరాధన అన్నది వాస్తవికత నుండి వారానికొకసారి తప్పించుకొనుట కాదు; బదులుగా, ఆరాధన దేవుని దృష్టికోణము నుండి వాస్తవికతను చూపుతుంది – మరియు ఇది మన లోకమును గూర్చి మనము కలిగియున్న దృష్టికోణమును మార్చివేస్తుంది. ప్రకటన గ్రంథములో, దేవుడు ఇలా పలికాడు, “పరిస్థితులు ఇప్పుడు కనిపించుచున్నట్లుగా ఉండవు. పరిస్థితిలు చేయిదాటిపోలేదు, సాతానును గెలవలేదు, దుష్టత్వము గెలవలేదు. ద్వారములో నుండి చూసి, వాస్తవికతను గమనించండి. దేవుడు తన సింహాసనమందు ఉన్నాడు.”[4]
“నీ నూతన సృష్టిని తెమ్ము, మమ్మును పరిశుద్ధముగా, నిష్కళంకముగా ఉంచుము; నీలో పరిపూర్ణముగా పునరుద్ధరించబడిన నీ గొప్ప రక్షణను చూడనిమ్ము: పరలోకములో మా స్థలమును తీసుకొనువరకు,
నీ ఎదుట పాడి మా కిరీటములను పెట్టు వరకు మహిమ నుండి మహిమకు మార్చుము, ఆశ్చర్యములో మునిగి, నీ ప్రేమ మరియు స్తుతులలో మైమరచిపోతాము!”
- చార్లెస్ వెస్లీ
[2]క్రీ.పూ. 547లో కోరెషు దాడి చేసినప్పుడు, మరలా క్రీ.పూ. 214లో యాంటియోకస్ III దాడి చేసినప్పుడు ఇలా జరిగింది.
[3]ఉదాహరణకు: 6:1-7:8 భూమి మీద ఉన్నవి; 7:9-8:6 పరలోకములో ఉన్నవి. 8:7-11:14 భూమి మీద ఉన్నవి; 11:15-19 పరలోకములో ఉన్నవి.
[4]David Jeremiah. Worship. (CA: Turning Point Outreach, 1995), 72
నేటి బైబిలానుసారమైన ఆరాధన
“ఆయన లేచియున్నాడు!” “ఆయనే ప్రభువు!” ఈ ప్రకటనలు ఆరాధనకు కేంద్రమైయున్నవి. పునరుత్థానము యేసును ప్రభువుగా ప్రకటించింది (రోమా 1:4).
ఆదిమ సంఘము ప్రతి ఆదివారమును పునరుత్థానమును జరుపుకొనుటగా గుర్తించింది; ప్రతి ఆదివారం ఈస్టర్ పండుగే. క్రైస్తవులు ఆదివారమున ఉపవాసముండలేదు; ఆదివారము వేడుక దినము.
నేడు, మన ఆరాధన కూడా వేడుక చేసుకొను సమయముగా ఉండాలి. అవును, సర్వశక్తుని సన్నిధిలోనికి భయముతో ప్రవేశించాలి, కాని పునరుత్థానుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొనుచుండగా ఆనందము కూడా ఉన్నది. మన ఆరాధనలో వేడుక చేసుకొనుటకు అవకాశములు భాగమైయుండాలి.
ఆరాధనలో స్తుతి పాటలు, సభ్యుల జీవితములలో దేవుని కృపను గూర్చిన సాక్ష్యములు భాగమైయుండాలి. నైజీరియాలోని సంఘము కానులను అర్పించుచు వేడుక చేసుకుంటుంది. కానుకలు పట్టుచుండగా సభ్యులు సంఘ భవనము చుట్టు తిరుగుతారు. పునరుత్థానములోని ఆనందము ఆరాధకులకు తెలుసు. ఆరాధనలో మరణము మీద క్రీస్తు సాధించిన విజయము ద్వారా మనము పొందిన విజయమును జరుపుకొను అవకాశములు కూడా ఉండాలి.
చెకప్
“నా ఆరాధన ఒక వేడుకా లేక కేవలం ఒక బాధ్యతయేనా? నేను ఆరాధనలోనికి ప్రవేశించుటకు ఆనందిస్తానా, లేక ఒక క్రైస్తవునిగా అది నా బాధ్యత కాబట్టే నేను ఆరాధనకు హాజరవుతానా?”
దీనిని ఆచరణలో పెట్టండి
మనము ఆరాధించు దేవుని ధ్యానించుటకు కొంత సమయమును కేటాయించండి. ఆయనను గూర్చి మనకు లేఖనము ఏమి చెబుతుందో ఆలోచించండి.
ఆయన వధించబడిన గొర్రెపిల్ల, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు!
[1]ఈ పుస్తకము నుండి సేకరించబడింది, Vernon Whaley, Called to Worship. (Nashville: Thomas Nelson, 2009), 331-333.
ముగింపు: అపొస్తలుడైన యోహాను యొక్క సాక్ష్యం
“నా పేరు యోహాను. నా జీవితము ఆరాధన ద్వారా మార్పుచెందింది. నేను నజరేయుడైన యేసును మొట్టమొదటిసారిగా కలిసిన నాటి నుండి, నేను ఆరాధకుడను.
“నేను రూపాంతర కొండ మీద ఉన్నాను. మేము పరలోకము నుండి వచ్చిన స్వరము విన్నాము, మేము మహిమను చూశాము, మరియు మేము సాష్టాంగనమస్కారం చేశాము, మరియు భయపడ్డాము (మత్తయి 17:6).
మేము అపరిపూర్ణముగా ఆరాధించాము. శ్రమల వారములోని మా క్రియలు కొండ మీద మేము చూసిన విషయములను అర్థము చేసుకోలేకపోయాము అని చూపాయి.
“యేసు పునరుత్థానము తరువాత ప్రత్యక్షమైనప్పుడు నేను గలీలయలోని ఆ కొండ మీద ఉన్నాను. కొంతమంది సందేహించినప్పటికీ, మేము ఆరాధించాము (మత్తయి 28:17). మేము అపరిపూర్ణముగా ఆరాధించాము. ఆయన తిరిగిలేచాడని మనకు తెలుసు, కాని దానిని మేము అర్థము చేసుకోలేకపోయాము.
“మేము పైగదిలో ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నాము (అపొస్తలుల కార్యములు 1:14). మనము ఆరాధించుచుండగా, పరిశుద్ధాత్మ మా మీదికి దిగివచ్చాడు. ఆరాధన సువార్త ప్రకటనకు పురికొల్పు అయ్యింది; మేము సువార్తను యెరూషలేము, యూదయ, సమరయ మరియు భూదిగంతముల వరకు వ్యాపింపజేశాము.
“పత్మోసు ద్వీపములో వెలివేయబడిన సమయంలో, ప్రభువు దినమందు నేను ఆత్మ వశుడనై యుండగా, బూరధ్వనివంటి గొప్ప స్వరము విన్నాను. అది ఆద్యంతములైన అల్పా ఒమెగా స్వరము (ప్రకటన గ్రంధం 1:10-11).
“దేవుడు పరలోకములో ద్వారము తెరచి, దేవుని సింహాసనము చుట్టు జరుగు ఆరాధనను చూచుటకు నాకు అనుమతినిచ్చాడు.
"నేను నూతన యెరూషలేములో యుగయుగములు ఉండుదును, అది పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చును (ప్రకటన గ్రంధం 21:2). ఆ పట్టణములో, మన ఆరాధన తుదకు పరిపూర్ణముగా ఉంటుంది, ఎందుకంటే మనము ఆరాధించువాని ముఖమును మనము చూస్తాము. పరలోకములో, ‘దేవుని నివాస స్థలము మనుష్యుల మధ్య ఉన్నది. ఆయన వారితో నివసిస్తాడు, మరియు వారు ఆయన ప్రజలైయుంటారు, మరియు దేవుడు స్వయంగా వారి దేవునిగా ఉంటాడు.’ (ప్రకటన గ్రంధం 21:3)
“నా పేరు యోహాను. నేను నిత్యత్వమును నా దేవుడు మరియు విమోచకుని ఆరాధిస్తూ గడుపుతాను!”
దీనిని ఆచరణలో పెట్టండి
ఈ పాఠమును ముగించుటకు ముందు, ఆరాధించుటకు సమయము కేటాయించండి. ప్రకటన గ్రంధం 4, 5 మరియు 15 లేక కీర్తనలు 19లో ఉన్న పాటలను చదవండి. దేవుని స్తుతించు పాటను పాడండి. ఘనపరచు ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడుతుండగా వినండి. దేవుని నిజముగా ఆరాధించుటకు సమయము తీసుకోండి.
సమూహ సంభాషణ
► ఈ పాఠము యొక్క ఆచరణాత్మక అనువర్తన కొరకు, ఈ క్రింది విషయమును చర్చించండి:
సువార్త ప్రకటనను గూర్చి ఆసక్తి కలిగియున్న ఒక సంఘమునకు సంజయ్ కాపరిగా ఉన్నాడు. ప్రతి నెల క్రొత్తవారు బాప్తిస్మము పొందుతున్నారు. సంఘములో అది గొప్ప సమయం.
అయితే, సంఘము నిజముగా ఆరాధించుటలేదని సంజయ్ ఆందోళన చెందాడు. ప్రసంగములు చాలా వరకు అవిశ్వాసులు మరియు క్రొత్తగా మారుమనస్సుపొందినవారికి మాత్రమే చేయబడుతున్నాయి. క్రొత్త ప్రజలకు పాటలు రావు కాబట్టి గొప్ప పాటలు పాడలేకపోతున్నారు. అతని సంఘము సంఖ్యలో పెరిగినా, ఆత్మీయ లోతు విషయములో మాత్రం పైపైనే ఉంటుందేమో అని సంజయ్ భయపడ్డాడు. అతడు ఆరాధన మీద ఎక్కువ దృష్టిపెట్టగోరాడు. సంఘము యొక్క ఆరాధనను బలపరుస్తునే సువార్త ప్రకటన మీద ఉద్ఘాటనను సంజయ్ ఎలా కొనసాగించగలడో చర్చించండి.
పాఠం 4 సమీక్ష
(1) ఆరాధన యేసు క్రీస్తులో నెరవేర్చబడుతుంది అని సువార్తలు చూపుతున్నాయి:
యేసు ఆరాధనకు ఒక మాదిరిని చూపాడు.
అబద్ధ ఆరాధన కొరకు కలిగిన శోధనను యేసు తిరస్కరించాడు.
ప్రార్థన యొక్క ప్రాముఖ్యతకు యేసు మాదిరిని చూపాడు.
నిత్యత్వము అంతటా యేసు ఆరాధించబడతాడు.
(2) ఆరాధన మరియు సువార్త ప్రకటన మధ్య ఉన్న సంబంధమును అపొస్తలుల కార్యములు చూపుతుంది.
నిజమైన ఆరాధన సువార్త ప్రకటనను ప్రేరేపిస్తుంది.
ప్రభావవంతమైన సువార్త ప్రకటన ఆరాధకులను సృష్టిస్తుంది.
సువార్త ప్రకటనలోనికి నడిపించని ఆరాధన స్వార్థపు ఆరాధన అవుతుంది.
(3) పత్రికలు ఆదిమ సంఘములో ఆరాధనలోని ప్రాముఖ్యమైన మూలకములను చూపుతాయి. ఆదిమ సంఘ ఆరాధనలో ఇవి భాగమైయుండినవి:
లేఖన పఠనం
వాక్యమును ప్రకటించుట
బహిరంగ ప్రార్థన
పాటలు
అర్పణలు
బాప్తిస్మము
ప్రభువు బల్ల
(4) ఆరాధన దేవుని ఘనపరచుట అయ్యున్నది అని ప్రకటన గ్రంథము చూపుతుంది.
ఆరాధన ఆరాధకుని దీవిస్తుంది, కాని ఇది ఆరాధన యొక్క ప్రాధమిక ఉద్దేశ్యము కాదు.
ఆరాధన యొక్క ప్రాధమిక ఉద్దేశ్యము దేవునికి మహిమను తెచ్చుట అయ్యున్నది.
మనము చూచు లోకము అంతిమ వాస్తవికత కాదు అని పరలోక ఆరాధన జ్ఞాపకము చేస్తుంది.
(1) ఈ పాఠములో నుండి మూడు ఆరాధన నియమములను తెలుపండి. ప్రతి నియమమునకు, మీ సంఘములో ఈ నియమమును అనువర్తించుటకు ఆచరణాత్మక విధానములను చర్చిస్తూ ఒక పేరాను వ్రాయండి.
(2) తదుపరి పాఠము యొక్క ఆరంభములో, ఈ పాఠం ఆధారముగా మీరు ఒక పరీక్ష వ్రాస్తారు. సిద్ధపడుటకు పరీక్ష ప్రశ్నలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి.
పాఠం 4 పరీక్ష
(1) యేసు నిజమైన ఆరాధనకు మాదిరినిచ్చిన మూడు మార్గములను తెలుపండి.
(2) నిజమైన ఆరాధనను గూర్చి యేసు యొక్క బోధన మరియు మాదిరి ఏమి జ్ఞాపకము చేస్తుంది?
(3) ఏ రెండు వ్యాఖ్యలు ఆరాధన మరియు సువార్త ప్రకటన మధ్య సంబంధమును సంగ్రహిస్తాయి?
(4) అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయములో ఏథెన్సులోని అబద్ధ ఆరాధన ఎలా వర్ణించబడింది?
(5) అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయములో, నిజమైన దేవుడు ఎలా వర్ణించబడ్డాడు?
(6) పత్రికలలో ఆదిమ క్రైస్తవ ఆరాధనలోని ఐదు మూలకములను తెలుపండి.
(7) చిన్న ఆసియాలోని సంఘముల మధ్య కనిపించు ఆరాధనకు కలుగు ఆటంకములకు రెండు ఉదాహరణలను తెలుపండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.