గత పాఠంలో, త్యాగం గురించి, షరతులు లేని ప్రేమ గురించి మనం నేర్చుకున్నాం. ఐదు విభిన్నమైన మార్గాల్లో (ప్రేమ భాషల్లో) ప్రేమ చూపించగలమని కూడా నేర్చుకున్నాం. సహజంగా, చాలామంది ఈ ఐదు ప్రేమ భాషల్లో ఒకటి లేక రెండు భాషల్లో తమ ప్రేమను వెల్లడిచేస్తారు.
ధృవీకరణ మాటల గురించి మాట్లాడుకున్నాం, కుటుంబ సభ్యులకు ప్రేమ చూపించే ఆచరణాత్మకమైన మార్గాలు కనుగొన్నాం. ఈ పాఠంలో, మిగిలిన నాలుగు ప్రేమ భాషల గురించి నేర్చుకుందాం, ఆ తర్వాత మన పిల్లలకు ఆ ప్రేమను చూపించే కొన్ని ప్రత్యేకమైన అన్వయాలు కూడా చూద్దాం.
ప్రేమ భాష 2: నాణ్యమైన సమయం
నాణ్యమైన సమయాన్ని, ప్రాథమిక ప్రేమ భాషగా ఉన్నవారు, ఇతరులు తమతో గడపడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించినప్పుడు, పూర్తిగా తమపై దృష్టి పెట్టినప్పుడు, మరియు కలిసి ఆనందంగా గడిపినప్పుడు తమకు అత్యంత ప్రేమ లభించిందని భావిస్తారు. ఈ సమయం కేటాయించడం అనేది కేవలం కలిసి ఉండటం కాదు, ఒకరిపై ఒకరు పూర్తి శ్రద్ధ పెట్టడం, మరియు ఆ బంధాన్ని ఆస్వాదించడం.
నాణ్యమైన సమయం, యాదృచ్ఛికం కాదు లేక ఖాళీ సమయాల్లో వెచ్చించేది కాదు. ఒకవేళ మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడో లేక అపాయింట్మెంట్ కోసం వేచి ఉన్నప్పుడో, ఆ సమయాన్ని జ్ఞానంగా వాడుకోవచ్చు కాని ఇది ఉద్దేశ్యపూర్వకంగా కేటాయించిన నాణ్యమైన సమయంగా పరిగణించకూడదు. జీవిత భాగస్వామి లేక మీ పిల్లలు మీతో కలిసి పని చేయవచ్చు, కాని అది వారికి కావలసిన నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవచ్చు.
ఆటంకాలు లేకుండా మాట్లాడుకోవడం నాణ్యమైన సమయం యొక్క ఉత్తమ రూపాలలో ఒకటి. అలాంటి సంభాషణల్లో, ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తి చెప్పే మాటల్ని శ్రద్ధగా వింటారు. ఎదుటి వ్యక్తి మీద మరియు సంభాషణ మీద దృష్టి పెట్టడానికి, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వంటి ఆటంకాలను ప్రక్కనబెడతారు.
ఆటంకాలు లేకుండా మాట్లాడుకోవడం ఒక విధంగా నాణ్యమైన సమయం కేటాయించినప్పుడే సాధ్యమౌతుంది. అలాంటి సంభాషణల్లో, ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తి చెప్పే మాటల్ని శ్రద్ధగా వింటారు. ఎదుటి వ్యక్తి చెప్పే మాటల్ని శ్రద్ధ వినడానికి, సంభాషణ మీద దృష్టిపెట్టడానికి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వంటి వాటిని ప్రక్కనబెడతారు.
మీరు శ్రద్ధగా వింటున్నారని చూపించే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి:
1. ఎదుటి వ్యక్తి కళ్ళను చూస్తూ మాట్లాడాలి.
2. శ్రద్ధగా వినాలి. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు తర్వాత ఏం మాట్లాడాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచించకండి. బదులుగా, అవతలి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో, ఏం చెప్తున్నారో మీకు ఎంతవరకు అర్థమైందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి సమయం కేటాయించండి. మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవడానికి, "నేను సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే, మీకు ఇలా అనిపిస్తుంది..." వంటి వాక్యాలు ఉపయోగించవచ్చు.
3. మధ్యలో అడ్డుకోవద్దు. చాలా సందర్భాల్లో వినే వ్యక్తి, తనకు అర్థమైందని అనుకొని, తన అభిప్రాయం చెప్పడానికి మధ్య అడ్డుకుంటాడు. ఇలా చేయడంవలన, చెప్పే వ్యక్తి, వింటున్న వ్యక్తి తనను సరిగా అర్థం చేసుకోవట్లేదని భావిస్తాడు.
4. కేవలం మాటలే కాకుండా భావాలు కూడా ఆలకించండి. ఇతరుల భావాలు మనం అర్థం చేసుకున్నప్పుడే, వారికి విలువ ఇచ్చినవారిగా పరిగణించబడతాం. మనస్పూర్తిగా వారి మాటలు వినడంవలన, వారి అభిప్రాయాలూ వారి భావాలు మనకు ముఖ్యమని సూచిస్తాం; వారు కూడా మనకు ముఖ్యమేనని సూచిస్తాం.
మంచి నాణ్యమైన సమయం అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, మరేమీ చేయకుండా గడపడమే. అయితే, ఇతర రకాల సమయాలు కూడా విలువైనవే. ప్రతి రోజు భోజన సమయంలో, కుటుంబ సభ్యులతో ముఖాముఖిగా మాట్లాడుతూ కూడా నాణ్యమైన సమయాన్ని గడుపవచ్చు.
పిల్లలకు కథలు చదివి వినిపించడం, కలిసి ఆడుకోవడం, కలిసి వినోదాత్మకమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటి వాటి ద్వారా కుటుంబంతో నాణ్యమైన సమయం గడపవచ్చు. పాఠశాల కోసం లేక పరిచర్య కోసం కాకుండా కేవలం వినోదం కోసమే కలిసి ఏదైనా పని చేసినప్పుడు అది కూడా నాణ్యమైన సమయంగానే పరిగణించబడుతుంది.
ఎవరైనా కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు, ఫోన్ ద్వారా వారితో కలిసి నాణ్యమైన సమయం గడపవచ్చు.
నాణ్యమైన సమయం అంటే ఎటువంటి కంగారు లేకుండా ఒకరినొకరు చూసుకుని, ఒకరి సహవాసాన్ని ఒకరు ఆనందించుకోవడానికి కేటాయించుకున్న సమయం. ప్రతిరోజు జీవిత భాగస్వామితో, పిల్లలతో గడపడానికి కొంత నాణ్యమైన సమయాన్ని కేటాయించాలి.
సమయాన్ని కేటాయించనప్పుడు
జీవితభాగస్వామి లేక తల్లి/తండ్రి పరిచర్య చేసే నాయకులుగా ఉన్నప్పుడు, కుటుంబానికి నాణ్యమైన సమయం కేటాయించడం చాలా కష్టమౌతుంది. తమ తండ్రికి ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తారు కానీ తమకు సమయం ఇవ్వడానికి చాలా బిజీగా ఉంటారని పాస్టర్ల పిల్లలు సహజంగా భావిస్తుంటారు. పరిచర్య కోసం కుటుంబానికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా త్యాగం చేస్తున్నారని అనిపించవచ్చు.
పరిచర్యలో ఉన్నవారు అంతరాయాల్ని పూర్తిగా నివారించలేరు, అయినప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించే ప్రయత్నం చెయ్యాలి. అలా చేసినప్పుడు, మీ కుటుంబం మీ దైనందిన బాధ్యతల్ని, అప్పుడప్పుడు వచ్చే అనివార్యమైన అంతరాయాల్ని అర్థం చేసుకుంటుంది.
తనకి ముఖ్యమైన ప్రేమ భాష 'నాణ్యమైన సమయం' అయిన వ్యక్తికి, కుటుంబంతో ఉద్దేశపూర్వకమైన, శ్రద్ధగా గడిపే సమయం దొరకనప్పుడు చాలా తక్కువగా ప్రేమించబడినట్లు అనిపిస్తుంది. నాణ్యమైన సమయానికి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు, కొన్ని అంతరాయాల వలన నాణ్యమైన సమయాన్ని కేటాయించలేనప్పుడు అతడు చాలా బాధపడతాడు. కుటుంబీకులు అతనితో సమయం గడుపలేనంత బిజీగా ఉన్నప్పుడు, బాధపడతాడు. కుటుంబీకులు శ్రద్ధగా అతని మాటలు విననప్పుడు, తనకు అంత విలువలేదనుకుంటాడు.
మీరు మీ జీవితభాగస్వామి లేక పిల్లలపై శ్రద్ధ చూపనప్పుడు, వారి కోసం ఏ పని చేసినా మీ ప్రేమ వారికి అర్థం కాదు. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం కష్టపడి పని చేస్తున్నా, అతడు తన భార్యతో సమయం గడపలేనంత బిజీగా ఉంటే, ఆమె అతని ప్రేమను అర్థం చేసుకోలేదు.
ఒక బాలుడు ఇటీవల విన్న కథను తన తండ్రితో పంచుకోవాలని అతని దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో, తండ్రి పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు, కాని తన పుస్తకం పక్కన పెట్టి బాలుడు చెప్పే కథ వినడం ప్రారంభించాడు, కథ మధ్యలో ఉండగా అతడు మళ్ళీ తన పుస్తకం తీసుకుని చదవడం కొనసాగించాడు. ఆ క్షణంలో బాలుడికి కలిగిన ఆ బాధను తన జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు.
► సాధారణంగా, నాణ్యమైన సమయం మీ కుటుంబానికి ఎలా కనిపిస్తుంది? కలిసి అర్థవంతమైన సమయం గడపడంలో మీరు ఎదుర్కొనే కష్టాలు ఏంటి?
ప్రేమ భాష 3: బహుమతులు
బహుమతులు స్వీకరించడాన్ని ప్రేమ భాషగా భావించేవారు, ఎవరైనా వారిని గుర్తుపెట్టుకుని వారికి బహుమానాలు ఇచ్చినప్పుడు ప్రేమను అనుభవించగలుగుతారు.
ఒక వ్యక్తిలో ప్రేమ అనుభూతిని కలిగించే బహుమతులు, ఆలోచనతో ఇస్తారు. వాటిని అందుకునే వ్యక్తి అభిరుచి ఆధారం చేసుకొని ఎన్నుకుంటారు. అవి, అవసరంగా లేక ఉపయోగపడేవిగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమ బహుమతులు ఇచ్చేవారికి వాటి అవసరం లేదు కాబట్టే వాటిని ఇవ్వకూడదు. బహుమతుల్ని ఉద్దేశ్యపూర్వకంగా ఎంచుకోవాలి లేక ఇచ్చేవారే తయారు చేసి ఇవ్వాలి.
ప్రేమ అనుభూతిని కలిగించడానికి ఇచ్చే బహుమతి ఖరీదైనదిగా ఉండనక్కరలేదు. అది, కొన్ని గంటల్లో అయిపోయే ప్రత్యేకమైన ఆహారం కావచ్చు లేక చాక్లెట్ వంటిది కావచ్చు; లేక బంధానికి గుర్తుగా ఎక్కువ కాలం ఉండే బహుమతి కావచ్చు. బహుమతులు స్వీకరించడం ఒకరి ప్రాథమిక ప్రేమ భాషయైనప్పుడు, వారికి పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, సెలవు దినాలు చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు ఈ ప్రత్యేక దినాల్ని గుర్తు పెట్టుకుని, ఆ వ్యక్తికి బహుమతి ఇవ్వడం ఇంకా ముఖ్యం. ఈ దినాల్లో బహుమతి అందకపోవడం, ఈ వ్యక్తికి చాలా బాధాకరంగా ఉంటుంది.
బహుమతులు ఇవ్వడం ఈ ప్రత్యేక రోజులకే పరిమితం కాకూడదు; ఇది ఎల్లప్పుడు జరుగుతూ ఉండాలి. బహుమతులు స్వీకరించడాన్నే ప్రాథమిక ప్రేమ భాషగా భావించేవారి జీవితభాగస్వామి, తల్లి/తండ్రి లేక పిల్లలు బహుమతుల కోసం వెతకడం అలవాటు చేసుకోవాలి, అప్పుడే తాము గుర్తున్నామని, తమ గురించి ఆలోచిస్తున్నారని, తమను ప్రేమిస్తున్నారనే భావన వారిలో కలుగుతుంది.
బహుమతులు స్వీకరించడాన్ని ప్రాథమిక ప్రేమ భాషగా భావించే భార్యకు, తన భర్త అవసరమైనది మాత్రమే బహుమతిగా ఇచ్చి ఖర్చు ఆదా చేయడానికి ప్రయత్నించినప్పుడు, భర్త తనను ప్రేమించట్లేదని అనుకుంటుంది. బహుశా ఆమెకు క్రొత్త చీపురు అవసరం, అది ఇచ్చాడు. క్రొత్త చీపురు ఆమెకు మంచిదే, కాని ఆ బహుమతి ద్వారా ఆమె ప్రేమ అనుభూతిని పొందుకోలేదు.
బహుమతులు ఇచ్చే వ్యక్తి, అందుకునే వ్యక్తిని మంచిగా అర్థం చేసుకుని, జాగ్రత్తగా అలోచించి ఇచ్చినప్పుడు అవి గొప్పవి అవుతాయి. అవి అవసరమైనవి కానప్పటికీ ప్రాముఖ్యమైనవే. అలోచించి, ప్రయత్నించి, ఖర్చు పెట్టి బహుమతి ఇచ్చినప్పుడు, అది గొప్పగా ఉంటుంది.
బహుమతులు స్వీకరించడాన్ని ప్రాథమిక ప్రేమ భాషగా భావించే పిల్లలకు, వారి తండ్రి స్కూల్ ఫీజు- ముఖ్యమైంది, ఎక్కువ ఖర్చుతో కూడినది- కట్టినప్పుడు వచ్చే ఆనందం కంటే వారికి ఐస్ క్రీం కొనిచ్చినప్పుడు వచ్చే ఆనందాన్నే గొప్పగా అనుభవిస్తారు. కాబట్టి, మనం మామూలుగా చేసే పనులను కుటుంబ సభ్యులు గుర్తించాలని ఆశించడం కంటే, వారికి ప్రత్యేకంగా అనిపించే పనులను చేయడానికి ప్రయత్నించాలి.
కొంతమంది, వారి పిల్లలు లేక జీవితభాగస్వామి ప్రతిదానికి వారినే అడగాలని అనుకుంటారు. తక్కువగా ఖర్చుచేసేవాడు లేక తమ కోసం ఏది ఖర్చుపెట్టుకోనివాడు, దాతృత్వంగా ఉండలేడు, అవసరంలేని బహుమతులు ఇవ్వడు. తన కుటుంబీకులు బహుమతులు ఆశించకూడదని అనుకుంటాడు. ఒకవేళ బహుమతుల్ని ప్రాముఖ్యంగా ఎంచే జీవితభాగస్వామి లేక పిల్లలు అతనికి ఉన్నట్లయితే, తన స్వాభావిక అలవాటును అధిగమించడానికి ప్రయత్నించాలి. వారు బహుమతుల్ని ఎలా - ప్రాముఖ్యంగా మరియు విలువైనవిగా- చూస్తున్నారో అతడు కూడా అలాగే చూడాలి. బహుమతులు ఇస్తున్నప్పుడు, ఉచితంగా ఇవ్వాలి, ఆనందంతో ఇవ్వాలి!
► ఒక విద్యార్థి తరగతి కోసం 2 కొరింథీయులకు 9:6-9 చదవాలి. ఈ వాక్యభాగంలో, అవసరతలో ఉన్న తన తోటివిశ్వాసులకు దాతృత్వంతో ఇవ్వాలని పౌలు కొరింథీయులకు విశ్వాసుల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ వచనాల నుండి, దాతృత్వంగా ఉండడానికి మనల్ని ప్రోత్సహించే నాలుగు లేక ఐదు విషయాలు గుర్తించడానికి ప్రయత్నించండి. ఈ వాక్యభాగంలోని సూత్రాలు మన కుటుంబాల్లో దాతృత్వానికి ఎలా వర్తిస్తాయి?
► మీ కుటుంబంలో బహుమతులు ఇవ్వడానికి ఎటువంటి స్థానం ఉంది? బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమ పంచడం మీకు కష్టం అనిపిస్తుందా? ఎలాంటి కష్టాలు ఉన్నాయి, వాటిని మీరెలా అధిగమించగలరు?
ప్రేమ భాష 4: సేవా కార్యాలు
ప్రాథమిక ప్రేమ భాష 'సేవా కార్యాలు' అయిన వాళ్ళు, ఇతరులు తమ కోసం పనులు చేసినప్పుడు ఎక్కువగా ప్రేమించబడినట్లు భావిస్తారు.
సేవా కార్యాలు రోజువారీ అవసరాల్ని తీరుస్తాయి. అవి ఒక వ్యక్తి చేయలేని పనులు అయ్యుండొచ్చు లేక చేయగల పనులు అయ్యుండొచ్చు. సేవా కార్యాలు అంటే, మంచినీరు ఇవ్వడం. అనారోగ్యంగా ఉన్నవారిని చూసుకోవడం. అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడం వంటి పనులు కావచ్చు.
చాలా కుటుంబాల్లో, ఒక కుటుంబ సభ్యుడిని ఎక్కువ కాలం పాటు దగ్గర ఉండి చూసుకోవలసిన పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రేమ, సమర్పణ వల్ల, వారు అనేక సేవా కార్యాలు చేయడం కొనసాగిస్తారు. సేవా కార్యాల కోసం చాలా సమయం వెచ్చించినప్పటికీ, ముఖ్యంగా ఈ వ్యక్తి ప్రాథమిక ప్రేమ భాష సేవా కార్యాలు కానప్పుడు కుటుంబీకులు మరింత అర్థవంతమైన విధానాల్లో ప్రేమను చూపించాలి.
కొన్ని సేవా కార్యాలు దినచర్యగా అనిపిస్తాయి, వాటిని నిర్లక్ష్యం చేయొచ్చు లేక తేలికగా తీసుకోవచ్చు. చాలామంది స్త్రీలు ప్రతిరోజు వంట చేయడం, ఇంటి పనులను చక్కబెట్టడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. అలాగే, ఒక పురుషుడు తన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడి పని చేయవచ్చు. ఒకవేళ మీరు మీ కుటుంబానికి ఈ విధంగా రోజువారీ పనుల ద్వారా సేవా కార్యాలు చేస్తున్నప్పటికీ, మీ కుటుంబ సభ్యులలో ఒకరికి ఈ 'సేవా కార్యాలు' అనేదే ప్రధానమైన ప్రేమ భాష అయితే, మీరు వారికోసం ప్రత్యేకమైన పద్ధతుల్లో సేవ చేయడానికి ప్రయత్నించాలి.
భార్య, తన భర్తకుండే చిన్న చిన్న అవసరాలు పట్టించుకోనప్పుడు, ఈ ప్రేమ భాషలో ప్రేమను వ్యక్తపరచకుండా విఫలమౌతుంది. “ఆయనే నీళ్లు తీసుకుని త్రాగగలడు” అని ఆమె అనుకోవచ్చు. కాని ఆమె నీళ్లు తీసుకొచ్చి అతనికి ఇచ్చినప్పుడు, ఆమె అతని పట్ల ప్రేమ చూపించినట్లు అవుతుంది.
అలాగే, భర్త కూడా శ్రద్ధ చూపించాలి. భార్య సాధారణంగా చేసే పనిని, తనంతటతానే చేసి, ఆమెకు కొంత విశ్రాంతి ఇచ్చినప్పుడు, అతడు ఆమె పనిని గౌరవిస్తాడు, ఆమె చేసే పని ఎంత కష్టమైందో ఎంత ముఖ్యమైందో గుర్తిస్తాడు.
ఒక భర్త, తాను ఇప్పటికే కష్టపడి చాలా పనిచేస్తున్నానని, ఇంటి పనులన్నిటి బాధ్యత భార్యదే అని అనుకోవచ్చు. ఆమె చేసేదానికంటే కూడా మరింత సమర్థవంతంగా పనిచేయాలని అనుకోవచ్చు. ఇంటి పనులు తన స్థాయికి తక్కువని భావిస్తే, అతడు స్త్రీలను తక్కువారిగాను, తక్కువ పనులకు అర్హులుగాను భావిస్తున్నట్లు అర్థమౌతుంది. స్త్రీలు తక్కువవారు కాదు, ఇంటిపనులు బయట పనుల కంటే తక్కువ కాదు.
గృహంలో తన భార్యకు సహాయం చేస్తున్నప్పుడు ఒక పురుషుడు తాను సేవకుడి పాత్ర పోషిస్తున్నాను (తన భార్య కంటే తక్కువగా) అని భావించవచ్చు, కానీ అది నిజం కాదు. అతను స్వచ్ఛందంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు, ఆ పని యొక్క విలువను, అలాగే తాను సహాయం చేస్తున్న వ్యక్తి యొక్క విలువను కూడా అతను చూపిస్తున్నాడు. అతని సేవ సాధారణంగా ఆ పని చేసే వ్యక్తిని గౌరవిస్తుంది, మరియు అతని అభినందనను తెలియజేస్తుంది. అతని భార్య అతన్ని సేవకుడిలా కాకుండా, మరింత గౌరవప్రదంగా చూస్తుంది.
ఒకవేళ ప్రజలు సణుక్కుంటూ, అయిష్టంగా సహాయం చేసినప్పుడు, బలవంతంగా సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. వారి సేవా కార్యాలు ప్రేమను చూపించవు. ఒకవేళ వారు ఉత్సాహంగా, కష్టపడి సేవాకార్యాలు చేస్తుంటే, వారు సేవ చేయడానికి ఇష్టపడుతున్నారని తెలియజేస్తుంది, ఎందుకంటే ఎవరు అలాంటి సేవను బలవంతం చేయలేరు. ఈ ఆనందకరమైన సేవా కార్యాలు వారి ప్రేమను స్పష్టంగా వెల్లడిచేస్తాయి. దీనివలన వారు, వారి ప్రియుల నుండి గౌరవాన్ని కూడా పొందుకుంటారు.
► మీ కుటుంబానికి సేవ చేయడం మీకు ఎప్పుడు కష్టమని అనిపించింది? సేవా కార్యాల్ని ప్రేమ వ్యక్తీకరణగా భావించడం మీ అభిప్రాయాన్ని ఎలా మారుస్తుంది?
ప్రేమ భాష 5: శారీరక స్పర్శ
శారీరక స్పర్శనే ప్రధాన ప్రేమ భాషగా భావించేవారిని, కుటుంబ సభ్యులు ప్రేమగా తాకినప్పుడు అధిక ప్రేమను అనుభవిస్తారు.
శారీరక స్పర్శ ద్వారా ప్రేమను చూపించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొన్ని విధానాలు, కొన్ని బంధాలకు మాత్రమే వర్తిస్తాయి కాని ఇతర బంధాలకు వర్తించవు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:
ఒకరినొకరు హత్తుకోవడం
ఒకరి వీపుపై లేక భుజంపై చేయు వేయడం
భుజాలపై చేతులు పెట్టడం
వీపుపై లేక భుజాలపై తట్టడం
కలిసి కూర్చోవడం
ఒకరికొకరు చేతులు పట్టుకోవడం
ముద్దు పెట్టుకోవడం
వీపు ఒత్తడం
పిల్లలను పట్టుకోవడం
పిల్లల జుట్టు నిమరడం లేక దువ్వడం
అనారోగ్యంగా ఉన్నప్పుడు లేక శరీర బలహీనతతో ఉన్నపుడు మృదువుగా, సున్నితంగా ఉండడం
ఎవరైనా కష్టకాలంలో ఉన్నపుడు, శారీరక స్పర్శ వారికి కూడా అర్థవంతంగా ఉంటుంది. దుఃఖ సమయంలో, బాధలో, ఒంటరితనంలో లేక నిరాశలో ఉన్నవారికి, ప్రాథమిక ప్రేమ భాష శారీరక స్పర్శ అయ్యింటే, ఆదరణ మాటల కంటే, సేవా కార్యాల కంటే కౌగలింత అర్థవంతంగా ఉంటుంది.
శారీరక స్పర్శనే ప్రధాన ప్రేమ భాషగా భావించేవారికి, వారు అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా సాధ్యమైతే శారీరక స్పర్శ ద్వారా ప్రేమను వ్యక్తపరచడం ప్రాముఖ్యం. ప్రేమ షరతులు లేనిది, త్యాగపూరితమైనదని గుర్తుంచుకోండి. లూకా 15:20 లోని తండ్రి, పశ్చాత్తాపంతో ఉన్న తన కుమారుడు మురికిగా ఉన్నా, దుర్వాసనతో ఉన్నా, ఏ విధంగాను ప్రేమించే స్థితిలో లేకున్నా అతనిని హత్తుకుని ముద్దుపెట్టుకున్నాడు.
శారీరక స్పర్శ ద్వారా ప్రేమను వ్యక్తపరచడం అంటే అది కేవలం లైంగికత గురించే కాదు. లైంగిక చర్య స్పర్శకు సంబంధించినదే. తాకాలి, తాకబడాలనే కోరిక లైంగిక చర్యకు దారితీయవచ్చు, అందులో వ్యక్తమవ్వవచ్చు కాని శారీరక స్పర్శయే ప్రధానమైన ప్రేమ భాషగా ఉన్న వ్యక్తికి కేవలం లైంగిక చర్య మాత్రమే చాలదు.
శారీరక స్పర్శ ద్వారా ప్రేమను అనుభవించాలనే కోరిక ఒక వ్యక్తిని అనైతిక లైంగిక చర్య వైపు శోధించబడవచ్చు. తల్లిదండ్రులు, తగిన లైంగికేతర శారీరక స్పర్శను వారి కుమారులకు, కుమార్తెలకు ఇవ్వడం చాలా ప్రాముఖ్యం, తద్వారా పిల్లల శారీరక స్పర్శ అవసరాలు తీరుతాయి. ప్రేమించబడే పిల్లల్లో శోధనలను ఎదుర్కొనే శక్తి ఉంటుంది.
శారీరక స్పర్శ ద్వారా జరిగే పాపాలు
శారీరక స్పర్శను ప్రాథమిక ప్రేమ భాషగా భావించేవారిని, బలవంతంగా తాకినప్పుడు బాధపడతారు. కోపంతో ఎవరినైనా కొట్టడం (గలతీయులకు 5:20), అవమానించాలని చెంపమీద కొట్టడం (మత్తయి 5:39), లేక అధికారాన్ని తప్పుగా ఉపయోగించి కొట్టడం (మత్తయి 24:48-49) పాపం. తల్లిదండ్రుల కోపంతో ఉన్నా లేక విసిగిపోయినా పిల్లలను హింసించే హక్కు వారికి లేదని ఈ లేఖనభాగాల ద్వారా మనకు అర్థమౌతుంది. పిల్లలు తల్లిదండ్రులను కొట్టడం కూడా పాపమేనని దేవుడు సెలవిస్తున్నాడు (నిర్గమకాండము 21:15).
తల్లిదండ్రులు పిల్లలను సరిచెయ్యడానికి, నీతియందు శిక్షణ ఇవ్వడానికి మృదువుగా వారిని క్రమశిక్షణలో పెట్టినప్పుడు (కొలొస్సయులకు 3:21), అది పాపం కాదు. బదులుగా, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలను కాపాడాలనేది దేవుని ఉద్దేశ్యమై ఉంది (సామెతలు 13:24, సామెతలు 19:18, సామెతలు 29:15, హెబ్రీయులకు 12:5-7).
సమస్త విధమైన లైంగిక చర్యలు, లైంగిక వేధింపులు, వావి వరుసతప్పి చేసే లైంగిక చర్యలు అన్నియు కూడా (లేవీయకాండము 20:11-12, 14) పాపమే.
మీ ప్రాథమిక ప్రేమ భాషను గుర్తించడం
చాలామందికి తమ ప్రాథమిక ప్రేమ భాష గురించి తెలియదు. వారు ఇతరుల్ని ఎలా ప్రేమిస్తున్నారో గమనించకపోవచ్చు. అలాగే ఇతరులును తమను ఎలా ప్రేమిస్తున్నారో గుర్తించకపోవచ్చు. కొంత సమయం తీసుకుని, ఐదు ప్రేమ భాషల గురించి మీకు తెలిసిన వాటిని ఆలోచించండి.
► మీరు సాధారణంగా, ఎక్కువగా ఇతరులపై మీ ప్రేమను ఎలా (ఏ ప్రేమ భాషలో) వ్యక్తపరుస్తారు?
► మీ ప్రధాన ప్రేమ భాష, రెండవ ప్రాధాన్యత గల ప్రేమ భాష ఏవీ? ఏ ప్రేమ వ్యక్తీకరణలు మీకు ముఖ్యమో తెలుసుకోవడం కష్టమనిపిస్తే, మీక సహాయం చేసే కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:
మీకు సంతోషం కలిగించే విషయాలు ఏంటి?
మీకు ఇష్టమైన జ్ఞాపకాలు ఏంటి?
మీరు దేని గురించి (మౌనంగా అయినా) ఫిర్యాదు చేస్తారు?
మీకు ఏది బాధను కలిగిస్తుంది?
ప్రేమకు ఐదు భాషలు మరియు పిల్లలు
ప్రతి ఒక్కరికీ ఐదు రకాల ప్రేమ భాషలలో ప్రేమను వ్యక్తపరచడం అవసరం, అయితే ఇది పిల్లలకు మరీ ముఖ్యం. పిల్లలు భావోద్వేగంగా ఆరోగ్యంగా, సమతుల్యంగా ఎదగడానికి, తల్లిదండ్రులు వారిని షరతులు లేకుండా ప్రేమిస్తున్నారని స్థిరంగా, తరచుగా వారికి చెప్పడం, చూపించడం అవసరం. తల్లిదండ్రులు తమ ప్రేమను తమ పిల్లల పట్ల వివిధ మార్గాలలో ప్రతిరోజూ అనేక సార్లు చూపించినప్పుడు, అది వారి పిల్లల హృదయాలనే నేలపై కురిసే మృదువైన, పోషణనిచ్చే వర్షం వంటిది.
మీ పిల్లలకు మీ ప్రేమ ఇప్పటికే తెలుసని అనుకోవద్దు. వారికి ఇష్టమైన ప్రేమ భాషలో మాత్రమే కాకుండా, ఇతర ప్రేమ భాషల్లోను, వారు మీ ప్రేమను నిరంతరం చూస్తుండాలి.
పిల్లల ప్రాథమిక ప్రేమ భాషను గుర్తించడం
మీరు మీ పిల్లల ప్రాథమిక ప్రేమ భాషను గుర్తించడానికి గ్యారి చాప్‌మేన్ మరియు రాస్ క్యాంప్‌బెల్ ఈ సూచనలు ఇచ్చారు:[1]
1. మీ పిల్లలు మీపై ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నారో గమనించాలి.
2. మీ పిల్లలు ఇతరులకు ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నారో గమనించాలి.
3. మీ పిల్లలు ఎక్కువగా ఏం అడుగుతున్నారో వినండి.
4. మీ పిల్లలు ఎక్కువగా ఏ విషయంలో ఫిర్యాదు చేస్తున్నారో చూడండి.
5. మీ పిల్లలకు రెండు విషయాలు ఇచ్చి ఎంపిక చేసుకోమని చెప్పండి.
ఐదు సంవత్సరాల వయసు వరకు, మీ పిల్లల ప్రాథమిక ప్రేమ భాషను గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు.
పిల్లల ప్రేమ భాషలపై ప్రత్యేకమైన గమనికలు
ప్రతి ప్రేమ భాష గురించి ముందుగానే చర్చించుకున్నాం గనుక ఇక్కడ వివరంగా మాట్లాడుకోము. బదులుగా, పిల్లలపై ప్రేమ చూపించే కొన్ని ప్రత్యేకమైన భావాలను గురించి, అన్వయాలను గురించి మాత్రమే ఇక్కడ చూస్తాం.
ధృవీకరణ మాటలు
ఎవరైనా ఎక్కువగా తప్పులు చేస్తున్నప్పుడు లేక సరిగా ప్రదర్శించనప్పుడు, వారికి అభినందించే మాటలు చెప్పడం చాలా కష్టం అనిపిస్తుంది. కాని మీరు యధార్థంగా, అభినందించేది ఏదైనా కనుగొని చెప్పగలిగితే, అది మీ పిల్లలను ప్రోత్సహిస్తుంది, అప్పుడు వారు ఎదిగే అవకాశం కూడా ఉంటుంది.
నాణ్యమైన సమయం
కుటుంబాలు కనీసం రోజులో ఒకసారైన కలిసి భోజనం చేయడం, ఆ సమయంలో ఒకరికొకరు మాట్లాడుకోవడం చాలా ప్రయోజనకరం.
అనేకమంది పిల్లలున్న కుటుంబాల్లో, ఒక బిడ్డతో నాణ్యమైన సమయం గడపకుండా నిర్లక్ష్యం చేయడం చాలా సులభం. అయితే, ఒక్కొక్క బిడ్డకు సమయం కేటాయించి వారికోసం ఏదైనా చేసినప్పుడు, మీ ప్రేమను పొందుకుంటారు. ఆ సమయంలోనే, తోబుట్టువుల మధ్య లేక ఇతర కుటుంబీకుల మధ్య పంచుకోలేని వ్యక్తిగత విషయాలు మీతో పంచుకునే అవకాశం ఉంటుంది.
చాలాసార్లు, పిల్లలు అనుకోకుండా ఒక్కసారిగా తల్లి/తండ్రితో నాణ్యమైన సమయం గడపాలని కోరుకుంటారు. కొన్నిసార్లు, రాత్రిపూట నిద్రపోయే సమయంలో పిల్లవాడు తన మనసులో ఉన్న బాధను చెప్పాలనుకుంటాడు. ఇలాంటి సమయాల్లో తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించి పిల్లలు చెప్పే మాటలు వినడం చాలా ముఖ్యం. చాలాసార్లు పిల్లవాడు ఆత్మీయ విషయాలను గురించి ఆలోచిస్తూ, వ్యక్తిగతంగా అమ్మ లేక నాన్న దగ్గరకు వచ్చి, ఆత్మీయ విషయాల్లో సహాయం కోరుతుంటాడు. ఇలాంటి సందర్భాల్లో, తల్లిదండ్రులు తమ పిల్లల్ని యేసు వైపు నడిపించడానికి ప్రత్యేకమైన అవకాశం పొందుకుంటారు.
మీరు మీ పిల్లలతో గడిపే ఆ నాణ్యమైన సమయంలో, వారు వివరంగా సమాధానాలు చెప్పగలిగే (ఓపెన్-ఎండెడ్) ప్రశ్నలు అడగడం నేర్చుకోవాలి అప్పుడే వారు ఏం ఆలోచిస్తున్నారో ఏం భావిస్తున్నారో అర్థమౌతుంది. ఓపెన్-ఎండెడ్ ప్రశ్నలు అంటే “అవును” లేక “కాదు” అనే ప్రతిస్పందనతో సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు. ఓపెన్-ఎండెడ్ ప్రశ్నలకు ప్రత్యేకమైన సమాధానం అంటూ ఉండదు. ఓపెన్-ఎండెడ్ ప్రశ్నలు సహజంగా “ఎందుకు.....” “ఎలా...” లేక “....ఏంటి” అనే వాటితో ప్రారంభమౌతాయి. ఓపెన్-ఎండెడ్ సంభాషణ మొదలుపెట్టేవారు “..........గురించి చెప్పండి” లేక “......గురించి మీ అభిప్రాయం ఏంటి” అనే మాటలతో మొదలుపెడతారు.
మీ పిల్లలు మీ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నప్పుడు, వాళ్ల జవాబులు జాగ్రత్తగా విని, సరిగా స్పందించాలి. కొన్నిసార్లు, ఆ జవాబుకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు అడుగవలసి వస్తుంది. మరికొన్నిసార్లు, వారు చెప్తున్న జవాబు మీకు అర్థమైందని స్పష్టత ఇవ్వాలి. ఇంకొన్నిసార్లు, వారు అర్థం చేసుకుంటున్న విషయాల్ని, వారు అనుభవిస్తున్న భావాల్ని మీరు ప్రోత్సహించాలి. అది ఒక ఇంటర్వూలాగా ఉండకుండా, సహజ సంభాషణగా ఉండేలా చూడడం ఎంతో ముఖ్యం. మీరు జాగ్రత్తగా వినడం వలన, తల్లి/తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు, నాకు విలువిస్తున్నారని మీ బిడ్డ అనుకుంటాడు.
పిల్లలు కథ చెప్తుండగా సమయం తీసుకుని శ్రద్ధగా ఆలకించినప్పుడు, మీరు వారిని బాగా ప్రేమిస్తున్నారని అనిపిస్తుంది. పిల్లలకు కథలు చెప్పడం లేక పుస్తకాలు చదివి వినిపించడం కూడా నాణ్యమైన సమయం గడిపే ఒక అద్భుతమైన మార్గం.
కలిసి ఆటలు ఆడడం లేక వినోదాత్మకమైన పనులు చేయడం ద్వారా కూడా నాణ్యమైన సమయం గడపవచ్చు.
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన సమయం ఇవ్వరు. ఈ నాణ్యమైన సమయాన్ని బహుమతులతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, బహుమతులు నాణ్యమైన సమయాన్ని భర్తీ చేయలేవు. పిల్లల ప్రాథమిక ప్రేమ భాష ఏదైనప్పటికీ, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయం గడపడం ఎంతో అవసరం. మీరు మీ పిల్లలతో గడిపే ఆ నాణ్యమైన సమయాన్ని ఎన్ని బహుమతులైనా భర్తీ చేయలేవు.
బహుమతులు
చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు ఆట వస్తువులుగాని లేక ఆసక్తికరమైన పుస్తకాలుగాని కొనుగోలు చేయరు ఎందుకంటే అవి అంత అవసరమైనవిగా అనిపించవు. అయితే, అవి పిల్లల అభివృద్ధికి తోడ్పడతాయి, అలాగే ప్రేమను వ్యక్తపరచే మార్గంగా కూడా ఉంటాయి.
సేవా కార్యాలు
సేవా కార్యాల ద్వారా మీరు మీ పిల్లలను ఎలా ప్రేమించగలరో చూపించే కొన్ని విషయాలు:
పుట్టినరోజున వారికి ఇష్టమైన భోజనం తయారు చేయడం
అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రేమగా చూసుకోవడం
స్కూల్ ప్రాజెక్టులో సహాయం చేయడం
మీ పిల్లలతో కలిసి ఇంటి పనులు చేయడం, వారి సహాయాన్ని అభినందించడం
బయట వ్యక్తులకు సహాయం చేయడానికి మీ పిలల్లతో కలిసి పనిచేయడం.
శారీరక స్పర్శ
శిశువులందరూ, చిన్న పిల్లలందరూ శారీరక స్పర్శ ద్వారా ప్రేమ పొందుకుంటారు. చిన్న పిల్లలకు డైపర్లు మార్చడం, తినిపించడం వంటి అవసరాలు ఉంటాయి, అయితే వారిని ఎత్తుకోవడం, లాలించడం, ముద్దాడడం వంటి వాటిని చేయడం కూడా ఎంతో అవసరం. ఈ విధమైన శారీరక స్పర్శ ద్వారా వారు ప్రేమను పొందుకుంటారు, వారి భావోద్వేగ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తండ్రి తన కుమారులతో పోట్లాడడం ద్వారా కూడా ప్రేమను చూపించవచ్చు. కాని, పోటీ బాధాకరంగా, కోపంగా లేక నియంత్రించలేనిదిగా ఉండకూడదు.
తల్లిదండ్రులు యొక్క మాటలు, క్రియలు వలన కలిగే దీర్ఘకాలిక ప్రభావాలు
తల్లిదండ్రులు పిల్లలతో వ్యవహరిస్తున్నప్పుడు దేవుని మాదిరిని అనుసరించాలి. ఆయన ఎల్లప్పుడు తన పిల్లల విషయంలో పరిపూర్ణమైన, త్యాగపూరితమైన, షరతులు లేని ప్రేమను చూపిస్తాడు. పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి శిక్షణ ఇస్తాడు, సరిచేస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు (హెబ్రీయులకు 12:5-7). తండ్రి/కుమారుడు మధ్య ఉన్న సంబంధం నేపథ్యంలోనే, ఆయన స్వరూపంలోనికి మార్చుకోవడానికి విశ్వాసుల జీవితాల్లో పని చేసి చేస్తాడు (హెబ్రీయులకు 12:10-11).
తల్లిదండ్రులు చూపించే ప్రేమ పిల్లల ప్రవర్తన మీద ఆధారపడడం మంచిది కాదు. నిజానికి, మంచి ప్రవర్తనకు బహుమతులివ్వడం లేక చెడు ప్రవర్తనకు శిక్షించడం పిల్లలకు ఇచ్చే శిక్షణలో భాగమే, కాని ప్రవర్తనను బట్టి ప్రేమించడం లేక ప్రేమించకపోవడమనేది మంచిది కాదు.
పిల్లవాడు తన తల్లిదండ్రుల ప్రేమను షరతులు లేకుండా అనుభవించినప్పుడు, దేవుని ప్రేమను సులభంగా అర్థం చేసుకుని నమ్మగలడు. అయితే, చిన్నతనంలో వేధింపులకు గురై, నిర్లక్ష్యం చేయబడిన పిల్లలు, పెద్దయ్యాక కూడా దేవుని అర్థం చేసుకోవడం, ఆయనను నమ్మడం చాలా కష్టం.
పిల్లలు తమ్మునుతాము అర్థం చేసుకునే విధానం-వ్యక్తిగతంగా తమ విలువను గుర్తించుకోవడం-ఎక్కువగా ఇతరులు చెప్పే మాటల ద్వారా, ఇతరుల నుండి పొందుకునే అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. తల్లిదండ్రులు చెప్పే మాటలు, చేసే పనులు వారి మీద గొప్ప ప్రభావం చూపిస్తాయి, అయితే బంధువులు మిత్రులు కూడా ప్రభావితం చేస్తారు. పిల్లలు తమకు అవసరమైన ప్రేమను పొందినా లేక పొందకపోయినా, అది వారి స్వీయ-చిత్రం (self-image) మీద ప్రభావం చూపిస్తుంది. పిల్లల్ని ప్రేమించనప్పుడు, లేక వారు భావోద్వేగ లేక శారీరక వేధింపులకు గురైనప్పుడు, అది వారి జీవితమంతా ప్రభావితం చేసే విధంగా స్వీయ-విలువను దెబ్బతీస్తుంది.
తల్లిదండ్రుల మాటలు, పిల్లలు స్వీయ అవగాహనను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు:
ధృవీకరణ మాటలు: “నువ్వు కష్టపడి పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది! నువ్వు తప్పక విజయం సాధించగలవని నాకు తెలుసు!” దీని ద్వారా, కష్టానికి విలువ ఉందని, వారు విజయం సాధించగలరన్న నమ్మకం మీకు ఉందని పిల్లలకు అర్థమౌతుంది.
గాయపరిచే మాటలు: “నువ్వు చాలా సోమరిపోతువు. కాబట్టి ఏ విషయంలో నీ మీద ఆధారపడలేను!” అని చెప్పినప్పుడు పిల్లలు, ఇంకా మారలేమని అనుకుంటారు; మారడానికి లేక గౌరవాన్ని పొందుకోవడానికి ఏం చెయ్యలేము ఎందుకంటే ఇప్పటికే నన్ను విడిచిపెట్టేశారని అనుకుంటారు. మీరు వారిని తిరస్కరించారని కూడా భావిస్తారు.
ధృవీకరణ మాటలు: “ఫర్వాలేదు. కొన్నిసార్లు మనందరం తప్పులు చేస్తుంటాం, ఆ తర్వాత ఇంకా మంచిగా బాగా ఎలా చెయ్యాలో నేర్చుకుంటాం.” తప్పులు చెయ్యడం సహజమే-వారి పట్ల మీ ప్రేమ వారి పరిపూర్ణ ప్రదర్శన మీద ఆధారపడదు- అని పిల్లలకు అర్థమౌతుంది. ప్రయత్నించడానికి కారణాలు ఉన్నాయని, వారు ఎదగాలని కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు.
గాయపరిచే మాటలు: “నువ్వు మూర్ఖుడివి. ఎప్పుడు గందరగోళం చేస్తావు.” పిల్లలు, ప్రయత్నించడం వలన ఉపయోగం లేదని అనుకుంటారు. వారి విలువ వారు చేసే పని మీద ఆధారపడి ఉందని భావిస్తారు; వారు ఎల్లప్పుడు వైఫల్యం చెందుతూ ఉంటారు గనుక విలువలేదని అనుకుంటారు. మీ ద్వారా లేక ఇతరుల ద్వారా ప్రేమను పొందుకునే అర్హత లేదనుకుంటారు.
ఒక పిల్లవాడు తననుతాను ఒక వ్యక్తిగా అర్థం చేసుకునే విధానం, అతడు పొందుకునే లేక పొందుకొనని ప్రేమ ద్వారా రూపుదిద్దుకుంటుంది. ఇతరులతో ఆరోగ్యకరమైన బంధాలు పెట్టుకున్నాడా లేదా అనే విషయం తల్లిదండ్రులతో తనకున్న బంధం మీద ఆధారపడి ఉంటుంది. బాగా ప్రేమ పొందుకున్నవాడు ఇతరుల్ని నిస్వార్థంగా, షరతులు లేకుండా ప్రేమిస్తాడు. అతడి గుండె నిండా ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమను పంచిపెడతాడు.
పెద్దలవలనే, నిజమైన ప్రేమ అనేది పిల్లలకు కూడా భావోద్వేగ ఇంధనం వంటిది.
భావోద్వేగ ఇంధన ట్యాంక్ నింపబడడం వలన కలిగే ప్రయోజనాలు
భావోద్వేగ ఇంధన ట్యాంక్ నింపబడడం వలన పిల్లలు అనేక ప్రయోజనాలను పొందుకుంటారు. పిల్లలు ప్రేమను అనుభవించినప్పుడు, సవాళ్లు ఎదుర్కోవడానికి, అభివృద్ధి చెందడానికి బలంగా, స్థిరంగా ఉంటారు.
షరతులు లేకుండా ప్రేమను పొందుకునే పిల్లలు మానసికంగా బలంగా ఉంటారు. దీని కారణంగా, వారు తల్లిదండ్రుల క్రమశిక్షణను, దిద్దుబాటును, నడిపింపును అంగీకరిస్తారు. తోటివారు కలిగించే ఒత్తిళ్ళను సైతం ఎదురించగలుగుతారు ఎందుకంటే వారెవరో వారికి తెలుసు గనుక, ఇతరులకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు.
అబ్బాయిలతో తరచుగా సరసాలాడే అమ్మాయి, బహుశా వాళ్ళు తనని ఇష్టపడరేమో లేదా పట్టించుకోరేమో అని భయపడి అలా ప్రవర్తించవచ్చు. ఇంకొందరు అమ్మాయిలు అబ్బాయిల పట్ల సిగ్గుపడతారు, ఎందుకంటే వాళ్ళు తమ నిజమైన వ్యక్తిత్వాన్ని బయటపెడితే వాళ్ళు ఇష్టపడరేమో అని వాళ్ళు భయపడతారు. కానీ, తమ తండ్రుల నుండి మెప్పు, ఆప్యాయత పొందే కూతుర్లు అబ్బాయిలతో ఆరోగ్యకరమైన రీతిలో, సరసాలాడకుండా లేదా సిగ్గుపడకుండా మెలుగుతారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి ప్రేమ వల్ల వాళ్ళు తమ గుర్తింపులో సురక్షితంగా ఉంటారు. వాళ్ళకి తమ గురించి ఒక స్పష్టమైన, భద్రమైన భావన ఉంటుంది.
ఐదు ప్రేమ భాషల్లో తరచుగా తల్లిదండ్రులు నిజమైన షరతులు లేని తమ ప్రేమను పిల్లలపై చూపినప్పుడు, ప్రమాదాల నుండి కాపాడబడతారు. సహజంగా ప్రేమను పొందుకునే పిల్లలు, హాని కలిగించే వ్యక్తుల నుండి ప్రేమను, భద్రతను ఆశించరు.
సంక్షిప్తంగా, భావోద్వేగ ఇంధన ట్యాంక్ నింపబడడం వలన పిల్లలకు అనేక లాభాలు ఉన్నాయి:
ఒకరి విలువను, దాని మూలాన్ని సరిగా అర్థం చేసుకుంటారు.
ప్రయత్నం, తప్పులు, ఎదుగుదల, షరతులు లేని ప్రేమను సరిగా అర్థం చేసుకుంటారు
ఇతరుల్ని ప్రేమించడం నేర్చుకోగలుగుతారు
సవాళ్లను ఎదుర్కోవడానికి, అభివృద్ధి చెందడానికి కావాల్సిన బలం, స్థిరత్వం ఉంటుంది
భావోద్వేగ భద్రత
క్రమశిక్షణ, దిద్దుబాటు, నడిపింపును అంగీకరించగలరు
తోటివారి తప్పుడు ప్రభావాలను తిరస్కరించగలరు
భవిష్యత్తు బంధాల్లో వేధింపులకు గురికాకుండా ఉంటారు
► ప్రేమను పొందుకోవడం ద్వారా, పిల్లలు ఇంకా ఏ రకంగా మేలు పొందుతారు?
భావోద్వేగ ఇంధన ట్యాంక్ నింపబడనప్పుడు కలిగే నిష్ప్రయోజనాలు
ప్రేమ పొందటం లేదని అనిపించే పిల్లలు నడిపింపును అంగీకరించరు, ఎందుకంటే తమ తల్లి లేక తండ్రిని మెప్పించాలన్న కోరిక వారిలో ఉండదు. భావోద్వేగ ఇంధన ట్యాంక్ నింపబడనప్పుడు, చాలామంది పిల్లలు తమను నడిపించే తల్లి/తండ్రితో బలమైన, అనుకూలమైన విశ్వాస బంధాన్ని కలిగి ఉండరు.
కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన, ప్రేమగల బంధాలను కలిగియుండే పిల్లల కంటే తమ భావోద్వేగ ఇంధన ట్యాంకులు ఖాళీగా ఉన్న పిల్లలు, వేధింపులకు ఎక్కువగా గురౌతారు. ప్రేమ పొందకపోవడం వలన, వాడుకుని వారికి హాని కలిగించే ప్రజల నుండి ప్రేమ కోరుకుంటారు.
[1]Dr. Gary Chapman మరియు Dr. Ross Campbell, The Five Love Languages of Children, (Northfield Publishing, Chicago, 1997), 101-103.
బలమైన కుటుంబాలకు ఉండే లక్షణాలు
ఈ పాఠాల్లో, ఐదు ప్రాథమిక ప్రేమ భాషలు గురించి నేర్చుకున్నాం. సహజంగా ప్రతి ఒక్కరికి ఒకటి లేక రెండు ప్రాథమిక ప్రేమ భాషలున్నప్పటికీ, ప్రతి ఒక్కరు ఎల్లప్పుడు ఈ ఐదు ప్రేమ భాషల్లో ప్రేమను పొందుకోవాలి. ఆరోగ్యకరమైన కుటుంబంలో, ప్రతి ఒక్కరు ప్రతి రోజు ధృవీకరణ మాటలు మాట్లాడతారు, నాణ్యమైన సమయం గడుపుతారు, సేవా కార్యాలు చేస్తారు, శారీరక స్పర్శ ఇస్తారు తద్వారా ఉద్దేశ్యపూర్వకంగా బంధాలను సంరక్షిస్తారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చువడం ప్రతి రోజు జరిగే పని కాదుగాని ఆరోగ్యకరమైన కుటుంబాల్లో ఇది కూడా ఒక ముఖ్య భాగం.
► మీ కుటుంబాల్లో ప్రేమను ఎక్కువగా ఎలా చూపిస్తారు? ఐదు భాషల్లో చూపిస్తారా? ఎంత తరచుగా ప్రేమను పంచుకుంటారు?
మతాన్ని ఆధారంగా పెట్టుకోకుండా 25 సంవత్సరాల పాటు 14,000 కుటుంబాలపై చేసిన ఒక పరిశోధన ప్రకారం, వివిధ సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చిన ఆరోగ్యకరమైన, విజయవంతమైన, సమతుల్య కుటుంబాల్లో ఆరు సాధారణ లక్షణాలు ఉన్నాయి.[1] ఈ ఆరు లక్షణాల్లో కొన్ని నేరుగా ప్రేమ భాషలతో సంబంధం కలిగియున్నాయి, ప్రేమను వివిధ రకాలుగా చూపించడం ఎంత ముఖ్యమో ఇవి నొక్కి చెబుతాయి. స్టిన్నెట్ మరియు బీమ్ ఈ ఆరు లక్షణాలను మరియు వాటి వివరణలను ఇచ్చారు:
1. సమర్పణ. బలమైన కుటుంబ సభ్యులు ఒకరికొకరి మేలు కోసం, సంతోషం కోసం కృషి చేయడానికి కట్టుబడి ఉన్నారు. వారు కుటుంబ ఐక్యతను విలువిస్తారు.
2. అభినందించడం, ఆప్యాయత చూపడం. బలమైన కుటుంబ సభ్యులు తరచుగా ఒకరికొకరు అభినందించుకుంటూ ఉంటారు. వారి కుటుంబం మంచిదని భావిస్తారు.
3. అనుకూల సంభాషణ: మంచి కుటుంబ సభ్యులు, మంచి సంభాషణ నైపుణ్యాలు కలిగియుంటారు, ఒకరికొకరు మాట్లాడుకుంటూ అధిక సమయం గడుపుతారు.
4. కలిసి గడిపే సమయం. బలమైన కుటుంబ సభ్యులు కలిసి సమయం -దాతృత్వంగా విలువైన సమయాన్ని- గడుపుతారు.
5. ఆత్మీయాభివృద్ధి. మతపరమైన కార్యక్రమాలకు వెళ్లినా వెళ్లకపోయినా, బలమైన కుటుంబాలు, జీవితంలో దేవుని పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారు నమ్మకమే వారిని బలపరుస్తుంది, ఉద్దేశ్యాన్ని ఇస్తుంది.
6. ఒత్తిడి, సంక్షోభాన్ని ఎదుర్కొనే సామర్థ్యం. బలమైన కుటుంబ సభ్యులు ఒత్తిడి లేక సంక్షోభాన్ని అభివృద్ధి చెందడానికి అవకాశాలుగా చూస్తారు.
[1]Dr. Nick & Nancy Stinnett and Joe & Alice Beam, Fantastic Families: 6 Proven Steps to Building a Strong Family, (Brentwood, TN: Howard Books, 2008)
వ్యక్తిగత అన్వయం
ఈ రెండు పాఠాల్లో, అనేక విషయాలను గురించి మనం నేర్చుకున్నాం. నిజమైన ప్రేమ గురించిన చర్చతో ప్రారంభించాం, సహజంగా ప్రేమను చూపించే ఐదు ప్రేమ భాషల్ని గుర్తించాం. భావోద్వేగ ఇంధన ట్యాంక్ గురించి, మన కుటుంబ సభ్యులు వారి ప్రాథమిక ప్రేమ భాషలో ప్రేమను పొందుకోవలసిన అవసరత గురించి నేర్చుకున్నాం. కుటుంబ సభ్యుల్లో ఉన్న భిన్న వ్యక్తిత్వాల కారణంగా ప్రేమలో ఎలా ఎదగగలమో చూశాం.
ఆ తర్వాత, ఐదు ప్రేమ భాషల్ని లోతుగా అన్వేషించాం, ప్రతి ఒక్కదానికి ఉదాహరణలు చూశాం, వాటిని నిర్లక్ష్యం చేసినప్పుడు లేక దుర్వియోగం చేసినప్పుడు కలిగే ప్రమాదాలు గురించి నేర్చుకున్నాం. భావోద్వేగ ఇంధన ట్యాంకులు నిండి ఉన్నప్పుడు పిల్లలు ఎలా మేలు పొందుకున్నారో, భావోద్వేగ ఇంధన ట్యాంకులు ఖాళీగా ఉన్నప్పుడు ఎలా బాధపడ్డారో చూశాం. మన పిల్లలకు ప్రేమను ఎలా వ్యక్తపరచాలో లోతుగా చర్చించాం. ఆ తర్వాత, ప్రేమకు ఐదు భాషలు పాటించడం, బలమైన కుటుంబాల్లో ఉండే ఆరు సహజ లక్షణాలకు ఎలా అనుసంధానం ఉందో కూడా చూశాం.
ఈ పాఠాల్ని ముగించుకునే ముందు, మీ వ్యక్తిగత బాధ్యత గురించి చర్చించుకుందాం-మీరు నేర్చుకున్న విషయాల ఆధారంగా మీరు ఏం చేయగలరు మరియు ఏం చేయాలి.
(1) మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమించే బాధ్యత మీకుంది.
మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రేమించేవరకు వేచి ఉండకుండా, మీరు అవసరమైన మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నిజమైన ప్రేమ, ఎదుటివాడు ప్రేమ చూపించే వరకు వేచి ఉండదు. ఎదుటి వ్యక్తి ప్రేమను పొందడానికి అర్హుడు కాకపోయినా ప్రేమ చూపిస్తుంది, ఎందుకంటే ప్రేమ దానిని పొందుకునే వ్యక్తి యొక్క విలువ మీద ఆధారపడదు.
(2) మీ కుటుంబానికి అత్యంత ముఖ్యమైన రీతిలో ప్రేమను వ్యక్తపరచడానికి మీవంతు శ్రద్ధతో ప్రయత్నించవలసిన బాధ్యత మీపై ఉంది.
మనకు అలవాటు లేని భాషలో ప్రేమను వ్యక్తపరచడానికి మనం మరింత కృషి చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో, ప్రేమను వ్యక్తపరిచే కొన్ని పద్ధతులు మీకు సహజంగా అనిపించకపోవచ్చు, కొంచెం ఇబ్బందిగా లేదా విచిత్రంగా కూడా అనిపించవచ్చు.
మీ కుటుంబ సభ్యులకు ప్రేమ చూపించే అవకాశాలు గమనించడం నేర్చుకోవాలి. మీ కటుంబ సభ్యులకు ఆ సమయంలో ఏది అవసరమో శ్రద్ధగా గ్రహించాలి. ప్రతి ప్రేమ భాషకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:
ధృవీకరణ మాటలు: ఆలోచించు, “______బహుశా ఇప్పుడు చెప్పిన దాని గురించి అతడు నిశ్చయతతో లేడు. కాని అతడు చెప్పింది నిజమే. నేను దృఢపరచే విషయం చెప్పాలి.”
నాణ్యమైన సమయం: ఇలా అడగండి, “దాని గురించి మాట్లాడాలని అనుకుంటావా?” ఆ తర్వాత మీరు చేస్తున్న పనిని ఆపి, మీ సంపూర్ణ శ్రద్ధను ఇవ్వండి, నిజంగా వింటున్నారని మీ శరీర భాష ద్వారా చూపించండి.
బహుమతులు:బహుమతి ఇస్తుండగా, “ఇది చూడగానే, నువ్వే గుర్తుకువచ్చావ్” అని చెప్పండి.
సేవా కార్యాలు: యెగిరి, అడగండి “నేనది అందించనా?” లేక “నీకు సహాయం చెయ్యనా?”
శారీరక స్పర్శ: వాళ్ల దగ్గరకు వెళ్లి, వాళ్లని హత్తుకొంటూ “నీకు కౌగలింత అవసరం” అని చెప్పండి.
(3) మీ భావోద్వేగాలకు మీరే బాధ్యులు
మనం ఇతరులతో ఆరోగ్యకరమైన బంధాలు కలిగి ఉండే విధంగా దేవుడు మిమ్మల్ని సృజించాడు. కాని అది సాధ్యమైనా కాకపోయినా, దేవుడే మీకు ఆధారం, సంతృప్తి కలుగజేయువాడు. మీ భావోద్వేగ శ్రేయస్సుకు మీ కుటుంబం పూర్తిగా బాధ్యత వహించదు. దేవుడే పరిపూర్ణంగా ప్రేమించగలడు, మరెవ్వరు అలా ప్రేమించలేరు. ఆయన ప్రేమలో అంటుకట్టబడి ఉన్నప్పుడు, హృదయంలో ఉండే ఏ లోటైనా ఆయన తీర్చగలడు (యోహాను 15:9-11).
మీ ప్రాథమిక ప్రేమ భాషలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రేమించలేకపోవచ్చు. మీ ప్రాథమిక ప్రేమ భాష, మీ భావోద్వేగ అవసరత వారికి తెలీకపోవచ్చు. మీకు ఇష్టమైన రీతిలో ప్రేమను చూపించలేకపోవచ్చు. మీరెలా ప్రేమ పొందుకోగలరో వారికి మీరు వివరించియుండవచ్చు. కాని ఆ విధంగా ప్రేమ చూపించాలని మీరు వారిని బలవంతం చేయలేరు.
బహుశా మీ కుటుంబం ఇతర మార్గాల్లో ప్రేమ చూపిస్తుండవచ్చు. ప్రేమ భాషలు గురించి తెలుసుకునే కొద్దీ, వారు చూపించే ప్రేమను మీరు అర్థం చేసుకోగలరు. వారిని మీరు మార్చలేరు కానీ వారు చూపించే ప్రేమను అంగీకరించి, ఆ ప్రేమకు కృతజ్ఞులుగా ఉండగలరు.
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
నాకు నా కుటుంబాన్ని ఇచ్చినందుకు వందనాలు. నేను విలువ ఇవ్వవలసిన రీతిలో వారికి విలువ ఇచ్చేలా, మరియు ఒకోక్కరితో మంచి సంబంధం కలిగి ఉండేలా సహాయం చేయండి.
నా కుటుంబానికి నా ప్రేమను చూపించే విధానలను పరిశీలించుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యేసువలె మారడానికి సహాయం చేయండి: నా సమయాన్ని, మానసిక మరియు శారీరక శక్తిని, నాకున్న వనరులను నా కుటుంబ దీవెనకై, దాని ప్రోత్సాహానికై ఇచ్చేందుకు సహాయం చేయండి. నా సొంత అవసరాలు కంటే ఇతరుల అవసరాలకు ప్రాధన్యత ఇచ్చే వినయముగల మనసు నాకు దయచేయండి. ప్రతి కుటుంబ సభ్యునికి ప్రేమను చూపించే అవకాశాలు గమనించేలా సహాయం చేయండి.
నిజమైన ప్రేమను నాకు చూపించావు. నీవు నాకు చూపించిన ప్రేమ ప్రకారంగా నా కుటుంబమును ప్రేమించాలని ఆశపడుతున్నావు. నేను నా జీవిత భాగస్వామిని, పిల్లలను నిస్వార్థ, భేషరతు ప్రేమతో ప్రేమించాలను ఆశపడుతున్నాను. నేను విఫలమైన మార్గాల్లో నన్ను కనికరించి, కృప చూపుము. ప్రేమించవలసిన రీతిలో వారిని ప్రేమించడానికి సహాయం చేయండి.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) మీ జీవిత భాగస్వామి, మీ పిల్లల ప్రాథమిక ప్రేమ భాష గురించి ఆలోచన చేయండి. మీ కుటుంబ సభ్యుల పేర్లు రాయండి. ప్రతి ఒక్కరి ప్రేమ భాషలు ఒకటి లేక రెండు రాయండి.
(2) ఏ ప్రేమ భాషకు, మీ అదనపు కృషి అవసరం? వాటిని గుర్తించండి. ఈ విధానాల్లో మీ కుటుంబీకులకు ప్రేమను ఎలా చూపించగలరో కొన్ని ఆలోచనలు రాయండి.
(3) మీ సంస్కృతి గురించి, మరిముఖ్యంగా మీ సొంత సమాజం బృందాన్ని పరిశీలించండి. ఐదు ప్రేమ భాషల జాబితా చేయండి. మీ సంస్కృతిలో, ప్రతి ప్రేమ భాష ఎలా వ్యక్తీకరించబడుతుంది? ఈ ఐదింటిలో విస్మరించబడేవి ఏవైనా ఉన్నాయా? మీ సంస్కృతిలో సహజంగా కనిపించే దానికంటే ఉత్తమమైన మార్గాల్లో ప్రేమను చూపించగల కొన్ని ప్రత్యేక పద్ధతులు ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబిస్తూ అనేక పేరాలు రాయండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.