హర్ష మరియు అన్విత భారతదేశంలో నివసిస్తున్నారు. వారికి వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచినా సంతానం పిలలు పుట్టలేదు, వారికి అనుకోకుండా ఒక అవకాశం లభించింది. అన్విత బంధువుల్లో ఒకరికి కవల పిల్లలు పుట్టారు, కాని వారు వారిని సంరక్షించలేకపోయారు. హర్ష మరియు అన్విత ఆ ఇద్దరు శిశువులను ఎంతో ఆనందంతో అంగీకరించారు, కాని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ శిశువులు నెలలు నిండక ముందే జన్మించారు, ఒకొక్కరు కేజీన్నర బరువే ఉన్నారు. ఆ చిన్న బిడ్డల్ని ఎలా సంరక్షించాలో నూతన తల్లిదండ్రులు నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. చాలా నిద్రలేని రాత్రులు గడిపారు, కాని ఆ అమ్మాయిలు మంచిగా ఆరోగ్యంగా పెరిగారు.
శిశువు
గర్భధారణ సమయంలో శిశువు ఎదుగుదల
► ఒక విద్యార్థి తరగతి కోసం కీర్తన 139:13-18 చదవాలి.
తల్లి గర్భములో రూపించబడక మునుపే దేవుడు మనల్ని ఎరిగియున్నాడని ఈ వాక్యభాగం చెబుతుంది (16వ వచనం). మీరు పుట్టక ముందే దేవుడు మిమ్మల్ని ఎరిగియున్నాడు మీ కోసం ఒక ప్రణాళిక కలిగియున్నాడు.
ఒక స్త్రీ లోపల పురుషుడి వీర్యం ఆమె అండంతో కలిసిన క్షణంలో ఒక బిడ్డకు ప్రాణం పోస్తుంది. ఆ క్షణంలోనే ఒక కొత్త మానవ జీవితం - ఒక కొత్త వ్యక్తి - ఉనికిలోకి వస్తాడు! ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం జన్యు సమాచారం ఆ ఒక్క కొత్త కణంలో ఉంటుంది. గర్భధారణ జరిగిన 24 గంటల్లోగా, ఆ కణం రెండు కణాలుగా విభజించబడుతుంది. ఆ కణాలలో ప్రతి ఒక్కటి మరో రెండు కణాలుగా విభజించబడుతుంది. ప్రతి కణం రెండింటిగా విభజించబడటంతో కణాల సంఖ్య నిరంతరం పెరుగుతూ ఉంటుంది. దాదాపు ఒక వారంలో, బిడ్డ, ఇప్పుడు అనేక కణాలుగా మారి, తల్లి గర్భాశయం లోపలి భాగానికి అంటుకుంటుంది, అక్కడ అది పెరుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కణాలలో ప్రతి ఒక్కటి ఆ వ్యక్తిని తయారు చేయడానికి అవసరమైన “కోడ్” (DNA)ని కలిగి ఉంటుంది. కణాలు కోడ్‌లోని సూచనలను అనుసరించి, శరీరంలోని ప్రతి భాగాన్ని రూపొందించడానికి ప్రత్యేకంగా మారతాయి.
మూడవ వారం నాటికి, శిశువు యొక్క వెన్ను, మెదడు ఏర్పడటం ప్రారంభమవుతుంది. గర్భధారణ జరిగిన నాలుగవ వారం నాటికి, శిశువు కళ్ళు ఏర్పడటం, గుండె పనిచేయడం, మరియు చేతులు ఏర్పడటం ప్రారంభమవుతుంది. గర్భం దాల్చిన 12 వారాల నాటికి, శిశువు శరీరంలో అన్ని ముఖ్యమైన అవయవాలు ఉంటాయి.
14వ వారం వచ్చేసరికి, శిశువు వేలి ముద్రలు పూర్తిగా యేర్పడతాయి. 16-24 వారాలకి, గర్భంలో శిశువు కదలికలను తల్లి అనుభవిస్తుంది. 26-28 వారాల మధ్య, శిశువు ఊపిరి పీల్చుకోవడానికి ఊపిరితిత్తులు అభివృద్ధి చెందుతాయి, శిశువు బరువు సుమారు 900 గ్రాములు ఉంటుంది. సహజంగా, గర్భం దాల్చిన 38-40 వారాలకు పిల్లలు పుడతారు. ప్రతి బిడ్డ, మన సృష్టికర్తయైన దేవుడు సృజించిన అద్భుతమైన, ప్రత్యేకమైన సృష్టే.
► ఒక విద్యార్థి తరగతి కోసం ప్రసంగి 11:5 చదవాలి.
తల్లి గర్భంలో దేవుడు ఒక బిడ్డను సృజించిన, రూపించిన, నిర్మించిన విధానం నిజంగా ఎంతో అద్భుతం. ప్రజలు ఆ ప్రక్రియను లేక ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేరు. అయినప్పటికీ, అన్ని ఖండాల్లో అన్ని సమాజాల్లో, అన్ని సంస్కృతుల్లో పిల్లలు ఎదిగే ప్రక్రియ, విధానం ఒకేలా ఉంటుంది. సృష్టికర్త రూపకల్పనా పరిపూర్ణమైంది!
► ఒక విద్యార్థి తరగతి కోసం యోబు 10:8-12 చదవాలి.
ఈ వచనాల్లో, తల్లి గర్భంలో గర్భధారణ, బిడ్డ ఎదుగుదలను సూచించే పోలికను ఉపయోగించాడు. జీవమిచ్చువాడు సృష్టికర్తయైన దేవుడు అని యోబు చెప్పాడు.
దేవుని స్వరూపంలో సృజించబడడం ద్వారా వచ్చే విలువ
మనం దేవుని స్వరూపంలో సృజించబడ్డామని ఆదికాండము 1:26-27 మరియు ఆదికాండము 9:6 మాట్లాడతాయి. మానవుల జీవితమంతా పవిత్రమైనదే. కావున మానవులను చంపడం పాపం (ఆదికాండము 9:5, నిర్గమకాండము 20:13).
యెహెజ్కేలు 16:20-21, 36, 38లో, దేవుడు పిల్లలను చంపేవారికి వ్యతిరేకంగా చాలా కఠినంగా మాట్లాడాడు. విగ్రహాలకు పిల్లలను బలి అర్పించే ఇశ్రాయెలీయులను హెచ్చరించాడు, వారికి తీవ్రమైన తీర్పు వస్తుందని చెప్పాడు.
యెషయా 46:3-4లో, దేవుడు ఇలా మాట్లాడినప్పుడు, మానవుడు అభివృద్ధి చెందే దశలన్నిటిలో ఆయనకున్న శ్రద్ధ గురించి పేర్కొన్నాడు:
యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించినవారలారా,గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా,తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.
ఎంత గొప్ప వాగ్దానం!
ప్రజలందరికి విలువ ఉంది, పుట్టని పిల్లలకు, అంగవైకల్యం కలిగిన వారికి, ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి, పెద్దవారికి కూడా విలువ ఉంది. ఒక వ్యక్తి విలువ, తాను ఏమి చేయగలడో లేక ఒక్కడే బ్రతుకగలడో లేదో అనే విషయంమీద ఆధారపడి ఉండదు. అందరు దేవుని స్వరూపంలో సృజించబడ్డారు గనుక ప్రతి వ్యక్తికి విలువ ఉంటుంది.
గర్భధారణ సమయం నుండే ప్రతి బిడ్డ దేవుని దృష్టిలో విలువైనవాడని బైబిల్ చెబుతుంది (కీర్తన 139:13-18). ఈ కారణం చేత, గర్భధారణ సమయం నుండే మనం మనుషులని మనకు తెలుసు. ఉద్దేశ్యపూర్వకంగా గర్భస్రావం ద్వారా గర్భాన్ని తీసివేయడం మనిషిని హత్య చేయడమే అవుతుంది.
పుట్టని పిల్లల జీవితాల్ని కాపాడాలంటే, తల్లులకు పరిచారం చేయాలంటే క్రీస్తు అనుచరులు ఈ నాలుగు మార్గాలు పాటించాలి.
1. భ్రూణ హత్యాలను నివారించే తీర్పులు ఇచ్చి, చట్టాలు అమలులోకి తీసుకురాగలిగేలా వారు ప్రభుత్వాల్ని, రాజ్య న్యాయస్థానాల్ని ప్రభావితం చేయాలి.
2. గర్భవతులై, గర్భస్రావం తప్ప మరో దారి లేదనుకునే స్త్రీలకు ఆపద్ధర్మ సహాయం అందించాలి, తద్వారా వారు శిశువు ప్రాణాల్ని కాపాడాలని భావిస్తారు.
3. వద్దనుకున్న పిల్లలపై శ్రద్ధ చూపించాలి.
4. గత గర్భస్రావాల వల్ల అపరాధ భావం, అపమానం మరియు అవమాన భావనతో బాధపడుతున్న స్త్రీలకు వారు దేవుని కృపను తెలియజేసి, ఆత్మీయ సహాయాన్ని అందించాలి.
పుట్టని పిల్లలపై శ్రద్ధ చూపడం
ఒక తల్లి తన కడుపులో మోస్తున్న బిడ్డకు శాశ్వతమైన గమనం ఉందని గ్రహించడం చాలా ముఖ్యం. ఆ వ్యక్తి ఎప్పటికీ ఉనికిలో ఉంటాడు. దీనివల్ల, తల్లిదండ్రులు ప్రతి కోణంలో- శారీరకంగా, మానసికంగా, సాంఘికం/భావోద్వేగపరంగా, మరియు ఆత్మీయంగా - పిల్లలపై శ్రద్ధ చూపించాలి.
► ఒక విద్యార్థి తరగతి కోసం మత్తయి 18:2, 10 చదవాలి.
మనిషి ప్రవర్తన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపగలదు మరియు తండ్రి అయ్యే అవకాశాన్ని నిరోధించగలదు.. మద్యపానం, కొకైన్, లేక ధూమపానం పురుషుని వీర్యకణాల్ని దెబ్బతీస్తాయి, సంతానం కలిగే అవకాశాల్ని తగ్గిస్తాయి (గర్భధారణ అసాధ్యమౌతుంది) లేక గర్భస్రావం (గర్భధారణ సమయంలో శిశువు సహజంగా చనిపోవడం) జరుగుతుంది.
గర్భం ధరించిన తల్లి మత్తుపదార్థాలు (సూచించినవి లేక చట్ట విరుద్ధమైనవి), మద్యపానం లేక సిగరెట్లు వంటి వాటి వల్ల తన బిడ్డ శాశ్వత ప్రమాదం ఎదుర్కొంటుంది. అలాంటి పదార్థాలు బిడ్డ ఎదుగుదలను ఆపివేస్తాయి మరియు శారీరక, మానసిక సమస్యలతో పుట్టే అవకాశాలని పెంచుతాయి.[1]
బిడ్డకు ఎదుగుదలలో అత్యంత ముఖ్యమైన సమయం ఏమిటంటే, ముఖ్యంగా 3-4 వారాల్లో అవయవాలు, నరాలు ఏర్పడే సమయం. ఈ సమయంలో, చాలామంది స్త్రీలకు గర్భం ధరించారన్న విషయం కూడా తెలియదు!
► ఒక విద్యార్థి తరగతి కోసం 1 కొరింథీయులకు 10:31 చదవాలి.
పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితిని తల్లి పూర్తిగా నియంత్రించలేనప్పటికీ, మంచి ఆహారం తీసుకోవడం వలన, హానికరమైన వస్తువులను పక్కన పెట్టడం వలన బిడ్డ ఆరోగ్యానికి సహాయపడవచ్చు. పిల్లలు విలువైనవారని దేవుడు చెబుతున్నాడు మరియు పిల్లలను మంచిగా చూసుకోవడం వలన మనం దేవుణ్ణి మహిమపరుస్తాం.
బిడ్డ జన్మించకముందే చనిపోవడం చాలా విషాదకరం. సహజంగా, బిడ్డ జన్మించకముందే చనిపోవడమనేది తల్లి చేసిన ఏ పని ఫలితం కాదు. తల్లిదండ్రులు గొప్ప బాధలో ఉంటారు, మరియు ఇతర విశ్వాసులు ఆ సమయంలో వారిని ఆదరించడానికి ప్రయత్నించాలి.
జననం
ప్రసవ అనుభవాలకు సంబంధించిన ఆయా సాంస్కృతిక ఆచారాలు వైవిధ్యంగా ఉన్నప్పటికీ, లోకంలో స్త్రీలందరూ ఒకే విధంగా జన్మనిస్తారు. ఆదికాండము 3:16లో దేవుడు ఇలా సెలవిచ్చాడు: “నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు...”
శతాబ్దాలు గడిచిపోతున్నాయి, దేవుని వాక్యం లోకమంతటా సత్యంగానే నిలుస్తుంది. ఆదాము, హవ్వలు చేసిన మొదటి పాప ప్రభావం ఇంకనూ ప్రసవ వేదనలో కనబడుతుంది. యేసు తల్లియైన మరియ కూడా ప్రసవ వేదన పడింది.
[1]Greg Cook & Joan Cook, The World of Children, 3rd ed. (Pearson Education, 2013), 85.
ప్రారంభ బాల్యం
శారీరక ఎదుగుదల
బిడ్డ శారీరక ఎదుగుదల అంచలంచలుగా జరుగుతుంది. మొదటిగా బిడ్డ తల నిలుపుకుంటాడు, ఆ తర్వాత కూర్చుంటాడు, ప్రాకుతాడు, ఆ తర్వాత నడుస్తాడు. ఇవి సరైన సమయంలో జరగనప్పుడు తల్లిదండ్రులు చింతిస్తారు. పిల్లలు ఎదుగుతుండగా, వారు ఎక్కాలని, దూకాలని, 4-5 సంవత్సరాలలో పరిగెత్తాలని మనం ఆశపడతాం. మొదటిగా పాలు త్రాగుతూ బలమైన ఆహారం తినడం మొదలుపెడతారు. కుటుంబ సభ్యులు ఈ శారీరక అభివృద్ధిని సహజంగా ఆనందిస్తారు.
మానసిక అభివృద్ధి
పిల్లలను చూసుకునేవారు మొదటిగా శిశువు ఏడ్చే శబ్దాన్ని వినాలని ఎదురుచూస్తారు, రెండు నెలల్లో నవ్వే శబ్దాలు చేయాలని ఆశపడతారు. తరువాత, శిశువు అల్లరి శబ్దాలు చేస్తూ, కొంతమంది శబ్దాలను పునరావృతం చేయడం ప్రారంభిస్తాడు. ఆరు నెలల్లో “అమ్మ” లేక “నాన్న” అనే తొలి పలుకులు విని తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. పిల్లలు సాధారణంగా ఒక సంవత్సరం వయస్సు నాటికి మాటలు మాట్లాడటం మొదలుపెట్టి, రెండు సంవత్సరాల వయస్సు నాటికి పూర్తి వాక్యాలు మాట్లాడతారు.
చిన్నపిల్లలు గుర్తుపెట్టుకునే విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. వారితో ఏదైనా ప్రత్యేకమైన పని చేస్తానని వాగ్దానం చేస్తే, వారు దానిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. దేవుని నిర్మాణం వలన వారి మనసు అభివృద్ధి చెందుతుంది, కానీ తల్లిదండ్రులు మరియు ఇతర సంరక్షకుల పెంపకం పిల్లలు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడంలో చాలా సహాయపడుతుంది.
సాంఘిక, భావోద్వేగ అభివృద్ధి
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, శారీరకంగా అభివృద్ధి చెందాలంటే తల్లిదండ్రుల సహాయం ఎంతో అవసరం. అయితే, మానసికంగా, సాంఘికంగా అభివృద్ధి చెందాలంటే వారికి ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మరియు ఇతర సంరక్షకులు ఉద్దేశ్యపూర్వకంగా ప్రతి బిడ్డ మానసికంగా, సాంఘికంగా ఎదగడానికి ఎంతో సహాయపడాలి.
తల్లిదండ్రులు క్రింద ఇవ్వబడిన జాబితాలోని విషయాలు పాటించినప్పుడు, వారి పిల్లలు మానసికంగా, సాంఘికంగా ఎదగడానికి సహాయపడతారు.
► ఈ జాబితా జాగ్రత్తగా చదవండి. రెండవసారి మరలా చదవండి. తల్లిగా/తండ్రిగా మీరు ఇప్పటికే చేస్తున్న పనితో పాటుగా, ఆ పనిని ఏ విధంగా చేస్తున్నారో కూడా ఒక ఉదాహరణ రాయండి. మీరు ఉద్దేశ్యపూర్వకంగా చేయకుండా ఉన్నటువంటి విషయాల ప్రక్కన టిక్ గుర్తు పెట్టండి. ఆ తర్వాత దాని ప్రక్కన, మీరు చేయడానికి పూనుకున్న దానిని రాయండి. ఒకవేళ మీరు తల్లి/తండ్రి కాని యెడల, మీ బంధువుల్లో లేక మీ సన్నిహితుల్లో పిల్లలకు మీరు చేయగల విషయాలను ఈ జాబితాలో నుండి ఎంపిక చేసుకోండి.
మీ పిల్లల అభివృద్ధికి మీరు సహాయం చేయగల మార్గాలు[1]
(1) మిమ్మల్ని మీరు పట్టించుకోవడం ద్వారా
మీ వ్యక్తిగత ఒత్తిడిని సరిగా నిర్వహించుకోవాలి
మీ కుటుంబ వనరులను సరిగా చూసుకోవాలి
ఇతర తల్లిదండ్రులకు సహాయం చేయాలి
అవసరమైనప్పుడు ఇతరుల సహాయాన్ని అడిగి పొందుకోవాలి.
మీ వ్యక్తిగత సామర్థ్యాలు, సంరక్షించే సామర్థ్యాలు గుర్తించాలి
పిల్లలను పెంచడంలో మీ లక్ష్యాలు స్పష్టంగా ఉంచుకోవాలి
(2) అర్థం చేసుకోవడం ద్వారా
మీ పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ, వారి అభివృద్ధిని అర్థం చేసుకోవాలి
పిల్లలు వారి చుట్టూ జరిగే వాటికి ఎలా స్పందిస్తారో, వారిపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో గుర్తించాలి.
(3) మార్గనిర్దేశం చేయడం ద్వారా
మంచి ప్రవర్తన చూపించి, ఆదర్శంగా ఉండాలి.
సహేతుకమైన పరిమితులను యేర్పరచి, వాటిని ఆచరించాలి.
బాధ్యతను నేర్పించే అవకాశాలు పిల్లలకు ఇవ్వాలి. (అవకాశాలు వారి దశకు తగినట్లుగా ఉండాలి).
సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు బోధించాలి
పిల్లల కార్యక్రమాలపై దృష్టి ఉంచాలి
పిల్లలు ఇతర పిల్లలతో మరియు పెద్దలతో ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ఉంటున్నారో గమనించాలి.
(4) పోషించడం ద్వారా
ఆప్యాయత, కనికరం చూపించాలి.
పిల్లల ఆత్మాభిమానాన్ని, నిరీక్షణను పెంపొందించాలి.
పిల్లల భావాలు, ఆలోచనలు వినాలి, శ్రద్ధ చూపించాలి
కనికరం నేర్పించాలి
సంరక్షణ, ఆశ్రయం, దుస్తులు, ఆరోగ్యం మరియు భద్రత వంటి అవసరాలు తీర్చాలి
పిల్లలతో జీవితాన్ని ఆనందించాలి
కుటుంబ చరిత్రతో, సంస్కృతితో అనుసంధానంగా ఉండేలా పిల్లలకు సహాయం చెయ్యాలి
(5) ప్రోత్సహించుట ద్వారా
తమ గురించి, ఇతరుల గురించి, చుట్టూ ఉన్న ప్రపంచం గురించి పిల్లలకు బోధించాలి.
జిజ్ఞాస, ఊహ మరియు జ్ఞానం కొరకైన ఆశను ప్రోత్సహించాలి
నేర్చుకునే వాతావరణాన్ని సృష్టించాలి
సమాచారాన్ని అర్థం చేసుకొని, దానిని ఉపయోగించడంలో పిల్లలకు సహాయం చేయాలి.
(6) సలహాలిచ్చుట ద్వారా
సొంత పిల్లలు, సమాజంలో పిల్లల మేలు కోసం సామాజిక వనరులు కనుగొనాలి. ఉపయోగించాలి అవసరమైతే క్రొత్తవి కనిపెట్టాలి.
పిల్లలకు, కుటుంబాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృజించడానికి సామాజిక మార్పును ప్రోత్సహించాలి.
దేవుడు మనల్ని ఆత్మీయ జీవితంతో సృజించాడు గనుక (ఆదికాండము 2:7), పిల్లలకు విశ్వాసం బోధించాలి, దేవుని సహవాసంలో జీవించేలా వారిని నడిపించాలి.
► విద్యార్థులు తరగతి కోసం కీర్తన 78:5-8 మరియు ద్వితీయోపదేశకాండము 6:4-9 చదవాలి. మీ కుటుంబానికి జాగ్రత్తగా బోధించుమన్న దేవుని ఆజ్ఞను మీరు ఏ విధంగా పాటిస్తున్నారు? మీరు ఇంకా ఏ విషయాల్లో ఎదగవలసిన అవసరత ఉంది?
కుటుంబాలకు బోధించుమన్న దేవుని ఆజ్ఞలను మనం తీవ్రంగా పరిగణించాలి. లేనియెడల, దేవునికి అవిధేయత చూపిస్తాం, మన పిల్లలు కూడా దేవుని అధికారాన్ని తిరస్కరిస్తారు.
పిల్లలకు వివిధ రకాలుగా బోధించవచ్చు: బైబిల్ పఠనం, యేసు పాటలు పాడడం, లేఖన కంఠస్తం, ప్రార్థన, బోధించడానికి ప్రశ్నలు సమాధానాలు ఉపయోగించడం, అనుదిన సంభాషణలు చేయడం. సంఘంలో పాలుపొందడం కూడా కుటుంబమంతటికీ ఎంతో ముఖ్యం.
కొన్నిసార్లు పిల్లలను నిద్రపుచ్చే సమయంలో, తల్లి/తండ్రి వారిని ఒడిలో పడుకోబెట్టుకుని, విశ్వాసం గురించి యేసు ప్రేమ గురించి పాటలు పాడుతారు. వారు దేవుని ప్రేమ గురించి వింటూ, తల్లిదండ్రుల ప్రేమను అనుభవిస్తున్నప్పుడు వారి విశ్వాసం బలపడుతుంది.
[1]Charles A. Smith, et al., National Extension Parent Education Model. (Manhattan, Kansas: Kansas Cooperative Extension Service, 1994) నుండి తీసుకొనబడింది. https://www.k-state.edu/wwparent/nepem/nepem.pdf నుండి July 31, 2023న తీసుకొనబడింది.
ముగింపు
మీరు తల్లిగా/తండ్రిగా ఉన్నప్పుడు, మీ రోజులు చాలా సుధీర్ఘముగా ఉంటాయి. అవి చాలా బిజీగా, అలసిపోయేలా ఉంటాయి. అవి మీ దినాలు కాదు. అయినప్పటికిని, పిల్లల ఏడుపులు, ఒలికిన పాలు, తడిసిన డైపర్లు, ఎప్పటికీ ముగియని రోజువారీ పనుల మధ్య, కొంచెం సమయం తీసుకొని లోతుగా ఆలోచించండి. దేవుని పిల్లలలో ఒకరిని మీరు చూసుకుంటున్నారని, దేవుడు తన శాశ్వత ప్రణాళికలో మిమ్మల్ని నమ్మి ఆ బిడ్డను అప్పగించాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ నుండి ఒక పరిపూర్ణమైన ఇంటిని, గొప్ప ఆర్థిక ప్రణాళికను, విలాసవంతమైన భోజనాన్ని, లేదా ఆయన పిల్లల కోసం ఖరీదైన దుస్తులను అడగడం లేదు. ఆయన మీ నుండి అడుగుతున్నది ఇదే:
నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను (ద్వితీయోపదేశకాండము 6:5-7).
సమూహ చర్చ కోసం
► మీ సమాజంలో పిల్లల సంరక్షణకు సంబంధించిన ఏ విషయాలు తరచుగా నిర్లక్ష్యం చేస్తారు?
► కుటుంబాలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాయి? ఈ పాఠంలో వివరించబడిన పిల్లల సంరక్షణను అందించడం వారికీ ఎందుకు అంత సులభం కాదు?
► గర్భవతులైన తల్లులు వారినివారు చూసుకుంటూ పుట్టబోయే బిడ్డలను కూడా చూసుకోవడానికి విశ్వాసులు ఎలా సహాయపడగలరు?
► చిన్న పిల్లల జీవితాల్ని వారి తల్లుల జీవితాల్ని ఆశీర్వదించడానికి క్రైస్తవ కుటుంబాలు ఏ విధంగా కలిసి పనిచేయగలరు?
► చిన్న పిల్లల అవసరాలు తీర్చడానికి సంఘం ఎలాంటి పరిచర్య కార్యాలు ఏర్పాటు చేయగలదు?
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
అద్భుతమైన సృష్టికర్తా నిన్ను ఆరాధిస్తున్నాం. నీవు మమ్మును మా తల్లి గర్భంలో రూపించావు మరియు మా జీవితకాలమంతా శ్రద్ధ చూపించావు. మేము పుట్టక మునుపే నీవు సమస్తం ఎరిగియున్నావు.
బలహీనులను, తల్లి గర్భంలో ఉన్నవారిని కాపాడేందుకు మేము చేయగల కార్యాలు చేయడానికి మాకు సహాయం చేయుము. గర్భవతులైన తల్లులకు పరిచర్య చేయువారిని ఆశీర్వదించుము.
మమ్మును నమ్మి పిల్లలను కని, పెంచే బాధ్యతను మాకు అప్పగించినందుకు ధన్యవాదములు. మీరు మీ పిల్లలను కని, పెంచుతుండగా, వారి పట్ల శ్రద్ధ చూపిస్తూ, వారికి శిక్షణ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయుము.
మా పిల్లలను పెంచే విషయంలో నీకు లోబడి జీవించాలని ఆశించుచున్నాం. మా పిల్లలకు నిన్ను సరిగా చూపించడానికి సహాయం చేయుము. మా పిల్లలకు నీ ప్రేమను నీ విధేయతను నేర్పుటకు సహాయం చేయుము.
ఏ ఇద్దరు స్త్రీల గురించి పేర్కొనబడింది మరియు కుటుంబంలో వారి పాత్ర ఏంటి?
వారు తిమోతిపై స్పష్టంగా ఎలాంటి ప్రభావం చూపించారు?
ఆది సంఘంలో వారి ప్రభావం ఎలాంటి మార్పు తెచ్చింది?
(2) ఈ కోర్సులో మీరు కంఠస్తం చేసిన వాక్యభాగాలను సమీక్షించండి: ద్వితీయోపదేశకాండము 6:4-9, రోమా 6:11-14, కొలొస్స 3:5-7, అలాగే 5వ పాఠంలో, 4వ అభ్యాసంలో మీరు ఎంపిక చేసుకున్న వచనాలను కూడా సమీక్షించండి. ఈ వచనాలు మీరు అధ్యయనం చేస్తుండగా మీపై ఎలాంటి ప్రభావం చూపించాయి?
(3) కీర్తన 78:4-8 కంఠస్తం చేయండి. తరువాత క్లాసు మొదలుపెట్టే ముందు, కంఠస్తం చేసిన వాక్యభాగాన్ని రాయండి లేక ఉల్లేఖించండి.
(4) మీ కుటుంబలో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత అవసరాలు కోసం ప్రార్థించండి. మీ కోసం ప్రార్థన చేసుకోండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.