(1) దేవుడు మనతో కలిగియుండాలనుకునే సంబంధాన్ని గుర్తించి, దాని విలువను తెలుసుకోవాలి.
(2) ప్రతి వ్యక్తిలో ఉండే దేవుని స్వరూపాన్ని గ్రహించి, గౌరవించాలి.
(3) మన సంబంధాల్లో, మనం తీసుకునే నిర్ణయాల విషయంలో దేవునికి లెక్క అప్పజెప్పవలసినవారమని గ్రహించాలి.
(4) దైవ సంబంధాలకు బైబిలు ఒక మార్గదర్శక పుస్తకమని, అలాగే మన సంబంధాల్లో మనం దేవుణ్ణి అనుసరించాలని తెలుసుకోవాలి.
దేవునితో సంబంధం
లేఖనాలలో, దేవుడు వ్యక్తిగతమైన దేవుడని, సంబంధాలను కలిగి ఉంటాడని, ఇతరులతో సంభాషిస్తాడని మనం నేర్చుకుంటాం (హెబ్రీయులకు 1:1-2). తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు నిరంతరం పరస్పర సంబంధం కలిగియున్నారని లేఖనం చూపిస్తుంది.[1]
యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించాడు (నిర్గమకాండము 20:11). ఆయన చేసిన సృష్టి అంతటిలో, మానవాళి ఉత్తమైంది, అతి ముఖ్యమైందని కీర్తన 8:3-8 చూపిస్తుంది. దేవుడు సంబంధం కలిగియున్నట్లుగానే, మనుష్యుల్ని కూడా సంబంధాలు కలిగి ఉండేలాగా సృజించాడు. లేఖనమంతటా, దేవుడు ప్రజల్ని ఆయనతో జీవింపజేసే సంబంధంలోకి ఆహ్వానిస్తున్నాడు.[2]
సృష్టికర్తయైన దేవుడు, నీతో నాతో సంబంధం కలిగియుండడానికి ఆశపడుతున్నాడని తెలుసుకోవడం ఎంత అద్భుతం!
► ఒక విద్యార్థి తరగతి కోసం ఆదికాండము 3:8-9 చదవాలి.
ఒక్క క్షణం ఆగి, కళ్లు మూసుకుని, మీరిప్పుడు చదివిన సన్నివేశాన్ని ఊహించుకోండి. ఈ వచనాలను జీవంలోనికి వచ్చినట్లుగా ఊహించుకోండి. ఒక అందమైన తోటలో, సాయంకాలవేళ చల్లగా వీస్తున్న గాలిని ఆస్వాదిస్తూ నిలబడ్డారు. దేవుని అడుగుజాడల శబ్దాన్ని, ఆయనకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు మౌనంగా ఇచ్చే ప్రతిస్పందనను, ఆపై దేవుడు “ఎక్కడ ఉన్నావు?” అనే ప్రశ్నను కూడా వినండి.
దేవుడు స్త్రీ పురుషునితో సహవాసం చేయడానికి పిలుస్తున్న ఆ క్షణాన్ని మీరు ఊహించగలరా? మళ్ళీ ఆగి, దేవుని హృదయాన్ని గురించి ఆలోచించండి. దేవుడు ఆదాము హవ్వతో అలాగే నీతో, నాతో సహవాసం చేయాలని కోరుతున్నాడు-చూస్తున్నాడు!
మనం మన అవిధేయత ద్వారా దేవునికి దూరమైపోయినా (యెషయా 59:2), దేవుడు ఇంకను సజీవమైన ప్రతి వ్యక్తితో సంబంధం కలిగియుండాలని ఆశిస్తున్నాడు. ఆయన ప్రతి పాపి కోసం వెదకుతున్నాడని లూకా 19:10 చెబుతుంది. “నీవు ఎక్కడ ఉన్నావు?” అని దేవుడు ఇప్పటికీ అడుగుతున్నాడు. యేసు మన కోసం మరణించాడు గనుక, మనం ఆయనతో సరైన సంబంధంలోకి తిరిగి రాగలం (ఎఫెసీయులకు 2:13, 19). ఆయనతో సంబంధం కలిగియుండడానికే నీవు నేను సృజించబడ్డాం.
[1]ఉదాహరణకు, ఈ లేఖనాలు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని మధ్య సంబంధాన్ని చూపిస్తాయి: యోహాను 17:22-24; యోహాను 14:16, 26; మరియు యోహాను 15:26. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నిత్యుడైయున్నాడో ఆ వచనాలు మాట్లాడవు కాని, హెబ్రీయులకు 9:14వంటి ఇతర వచనాల ద్వారా ఆయన నిత్యుడు అని మనకు అర్థమౌతుంది.
[2]ఉదాహరణకు, యెషయా 55:3, యోహాను 1:12-13, యోహాను 3:36, యోహాను 17:3, 2 కొరింథీయులకు 6:16-18, 1 యోహాను 1:3, ప్రకటన 3:20 చూడండి.
మన సృష్టికర్త నిర్మాణం
ప్రేమతో కూడిన, ఉద్దేశపూరితమైన దేవుని సృష్టిని నమ్మనివాళ్లు, తమ వ్యక్తిగత గుర్తింపును, ఉద్దేశ్యాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దేవునితో సంబంధం లేకుండా మానవాళిని సరిగా అర్థం చేసుకోవడం అసాధ్యం. ఈ లోక జ్ఞానాన్ని అనుసరించి నడుస్తూ - మానవ ఆధారిత ఆనందాన్ని కోరేవాడు- జీవితాన్ని నిజంగా అర్థం చేసుకోలేడు.
మన గుర్తింపును (మనం ఎవరు), మన ఉద్దేశ్యాన్ని (మనం ఎందుకు ఉన్నాం), మరియు మనం ఎలా రూపించబడ్డామనే విషయాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే, మన సృష్టికర్త ఉద్దేశ్యాన్ని తెలుసుకోవాలి, అది పరిశుద్ధ గ్రంథంలో లభిస్తుంది. దేవుడు ముందుగానే మన గుర్తింపును ఏర్పరచాడు; అది మనం సృష్టించుకునేది కాదు. ఆయన మనల్ని ఒక ఉద్దేశంతో సృష్టించాడు, ప్రణాళికతో రూపించాడు. మన జీవితాల్లో, మన సంబంధాల్లో దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నప్పుడే, మనం తగినవారీగా ఉంటూ, ఆయన ఉద్దేశ్యాన్ని నెరవేర్చగలం.
దేవుని స్వరూపంలో సృజించబడడం అంటే, ప్రజలు ప్రత్యేకంగా సంబంధం కోసమే సృజించబడ్డారని అర్థం. దేవుడు సంబంధం కలిగియున్నట్లుగానే, ఆయన మనుష్యుల్ని కూడా సంబంధాలు కలిగి ఉండేలాగా సృజించాడు. మనిషి దేవునితోను, ఇతరులతోను సంబంధం కలిగియుండాలని ప్రతి ఒక్కరికి ప్రాణం, ఆత్మ మరియు శరీరాన్ని దేవుడు ఇచ్చాడు.
మానవ సంబంధాలకు మన మార్గదర్శిని.
దేవుడు సంబంధం కోసం ప్రజల్ని రూపించాడనే వాస్తవం, మన సంబంధాలకు కావాల్సిన సూత్రాలు, మార్గదర్శకాలు ఆయన దగ్గర ఉన్నాయని సూచిస్తుంది. ఒక వస్తువును తయారు చేసినవాడు, ఆ వస్తువు నిర్మాణం, రూపకల్పన గురించి, దాన్ని ఉపయోగించాల్సిన విధానం గురించి తెలియజేసే ఒక మాన్యువల్ ని రాసిస్తాడు. అలాగే, దేవుడు తన వాక్యమైన బైబిలు గ్రంథాన్ని మనకు ఇచ్చాడు, అది మన నిర్మాణం గురించి, మన జీవితాలు, సంబంధాలు సరిగా ఎలా పనిచేస్తాయో అనే విషయం గురించి వివరిస్తుంది.
మానవ సంబంధాల కోసం దేవుడు నియమించిన పాత్రల్ని బైబిలు స్పష్టంగా వివరిస్తుంది. అది భార్యాభర్తలు; తల్లిదండ్రులు, పిల్లలు; అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు; తాతమామ్మలు; మిత్రులు; శత్రువులు; పొరుగువారు; ప్రభుత్వం మరియు పౌరులు; యజమానులు మరియు ఉద్యోగులు వీళ్లందరి పాత్రలు గురించి మాట్లాడుతుంది. మన పరిస్థితులు మన పరిసరాలు ఎలా ఉన్నప్పటికీ, దేవుని వాక్యంలోని సూత్రాలు ఆయన మన కోసం రూపించిన నిర్మాణాన్ని మనకు బోధిస్తాయి. మన జీవితంలోని ప్రతి దశలో బైబిలు దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది.
మనుష్యుల సమాజాలు, సంస్కృతులు దేవుని నిర్మాణాన్ని ప్రతిబింబిస్తాయి, కాని పరిపూర్ణంగా కాదు. సంబంధాలన్నిటిలో, పరిస్థితులన్నిటిలో మనుష్యులు సాధారణంగా ఎలా ప్రవర్తిస్తారో సంస్కృతి వివరిస్తుంది. ప్రతి సంస్కృతి వివాహ సంబంధాలు, పిల్లల పెంపకం లాంటి విషయంలో తనదైన విధానాలను కలిగి ఉంది. సంప్రదాయాలు, పర్యావరణం, జన్యుశాస్త్రం, వంటి ముఖ్య విషయాల్లో సంస్కృతులు వైవిధ్యాన్ని చూపిస్తున్నా కాని ప్రతి సంస్కృతిలో ఒక ప్రాథమిక నైతికత ఉంటుంది. ఉదాహరణకు, ప్రతి సంస్కృతిలో వివాహ వ్యవస్థ ఉంటుంది. అయితే, ప్రవర్తన అంతటిని సాంస్కృతిక నియమాల ప్రకారం కాకుండా బైబిలు సూత్రాల ప్రకారం పరిశీలించాలి. మన అధికారం బైబిల్, సంస్కృతి కాదు (రోమా 12:2).
సాంస్కృతిక విషయాలు తటస్థంగా ఉండవు, అవి అలా ఉండాలని మనం ఆశించకూడదు (ఎఫెసీయులకు 2:2). తప్పుడు కోరికలతో, స్వార్థంతో నిండిపోయిన పతనమైన ప్రజల ద్వారా సంస్కృతులు అభివృద్ధి చెందాయి. సమాజానికి కొంత బైబిలు పరిజ్ఞానం ఉండొచ్చు కాని, ఏ సమాజం కూడా దేవుని నియమాలకు అనుగుణంగా ఏది తప్పు ఏది ఒప్పు అనేదానిపై నిలకడగా ఉండదు. సాంస్కృతికమైనదని దేనిని కూడా సమర్ధించకూడదు. కేవలం బైబిలే దేవుని ప్రమాణాన్ని పరిపూర్ణంగా చూపిస్తుంది (కీర్తన 19:7-11).
ఒకవేళ మీరు లిబియా దేశానికి వెళ్లి, అక్కడి ప్రజలు భద్రత గురించి ఆలోచించకుండా వాహనాలు నడపడం చూసినప్పుడు, “అది వాళ్ల సంస్కృతి; వాహనాలు నడిపే ఆ విధానం వాళ్ళకి పని చేస్తుంది” అని అనుకోవచ్చు. అది వాస్తవమే, వాళ్ళు వాళ్ళ సంస్కృతి ప్రకారం, వాహనాలు నడపడం నేర్చుకున్నారు. అయితే, ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు లిబియాలోనే అత్యధికంగా జరుగుతాయి. వాళ్ల ప్రమాద రేటు, అధిక రోడ్డు ప్రమాదాలు జరిగే రెండవ స్థానంలోని దేశం కంటే రెండింతలు ఎక్కువ. స్పష్టంగా చెప్పాలంటే, వాళ్ల సంస్కృతి సురక్షితమైన డ్రైవింగ్ విధానాన్ని అభివృద్ధి చేసుకోలేదు.
జీవితం ఎలా సాగిపోవాలో దేవునికి తెలుసు గనుక నియమాలు ఇచ్చాడు. మనం కేవలం వాటిని పరీక్షించి, ప్రయోగాలు చేయకూడదు. మనకు కావలసిన దానిని ఇచ్చేది మాత్రమే చేయకూడదు. మనకు సంతోషం కలిగిస్తుందని ఆశించే దానిని మాత్రమే చేయకూడదు. మనం సంబంధాల విషయంలో ఖచ్చితంగా దేవుని నిర్మాణాన్ని, విధానాన్ని అనుసరించాలి.
ముఖ్య విషయం ఏంటంటే, దేవుని నియమాలకు లోబడడం మనకే మేలు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆజ్ఞలను ఇచ్చాడు (ద్వితీయోపదేశకాండము 6:24). వాటిని గైకొనడం ద్వారా, మంచి ఫలితాలు అనుభవిస్తాం, అలాగే అనేక చెడు పర్యవసానాల నుండి తప్పించబడతాం. మనకు ఏది ఉత్తమమో మనల్ని రూపించిన వానికి తెలుసు, గనుక మనం ఆయన ప్రణాళికను అనుసరించినప్పుడు, ఆశీర్వదించబడతాం.
సంబంధాల విషయంలో దేవునికి లెక్క అప్పజెప్పడం
► ఇతరులతో మనం ప్రవర్తించే విధానం, దేవునితో మన సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
► విద్యార్థులు తరగతి కోసం క్రింద ఇవ్వబడిన ప్రతి వాక్యభాగాన్ని చదవాలి. ఈ మానవ సంబంధాల విషయంలో దేవుడు ఏం కోరుతున్నాడో, విధేయత దేవునితో మనం కలిగియున్న సంబంధంపై ఎలా ప్రభావం చూపుతుందో చర్చించండి. దేవుని నియమాలకు లోబడకపోతే, అది దేవునితో మనకున్న సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఇతరులతో మన సంబంధం మరియు దేవునితో మన సంబంధం
లేఖన భాగం
వ్యక్తి/
పాత్ర
మానవ సంబంధాల్లో దేవుడు ఏం కోరుతున్నాడు
దేవునితో సంబంధంపై ప్రభావం
1 పేతురు 3:7
భర్త
భార్యను అర్థం చేసుకుని, గౌరవించాలి
భర్త ప్రార్థనలకు అభ్యంతరం కలుగదు.
ఎఫెసీయులకు
5:22, 24, 33;
1 పేతురు 3:1-6
భార్య
భర్తకు లోబడాలి
ఈ విధంగా భార్య దేవునికి లోబడుతుంది. దేవుడు ఆమెలోనున్న ఈ వైఖరిని, ప్రవర్తనను గౌరవిస్తాడు.
కొలొస్సయులకు 3:20
పిల్లలు
అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలి.
ఈ ప్రవర్తనను ప్రభువు మెచ్చుకుంటాడు.
మత్తయి 6:12-15
అందరూ
మనకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని క్షమించాలి.
దేవుడు మనల్ని క్షమిస్తాడు.
రోమా 13:1-5
అందరూ
భూలోక అధికారులకు లోబడాలి.
ఈ విధంగా దేవునికి లోబడతాం.
1 పేతురు 2:18-20
పనివాడు
అన్యాయంగా శ్రమపొందినప్పుడు ఓర్పుగా సహించాలి.
పనివాడు దేవుని కృపను పొందుకుంటాడు.
మనం నైతికత కలిగిన వాళ్ళం, అంటే మంచేదో, చెడేదో తెలిసిన వాళ్ళం. అలాగే మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా దేవునికి లెక్క అప్పగించవలసినవారమై ఉన్నాం. ఇది మనకు ఒక గొప్ప సామర్థ్యాన్ని, బాధ్యతను ఇస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలు, దేవునితో మనకున్న సంబంధంపై ప్రభావం చూపుతాయి. సంబంధాల విషయంలో దేవుని నియమాలకు లోబడడం అంటే కేవలం సంతోషంగా ఉండడం, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం మాత్రమే కాదు. మనం తీసుకున్న నిర్ణయాల విషయంలో, అలాగే సంబంధాల్లో మనం చూపించే ప్రవర్తన విషయంలో దేవునికి లెక్క అప్పజెప్పాలి (రోమా 14:10, 12).
ఇతరుల పట్ల న్యాయం చూపడానికి, ప్రేమ కనికరాలతో వ్యవహరించడానికి దేవుడు మనల్ని పిలిచాడు (మీకా 6:8). సమస్య ఏంటంటే, ఆదాము చేసిన పాపంవల్ల అతని సంతానమంతా పాప స్వభావంతో పుట్టారు (రోమా 5:12, 19). దీనివల్ల, మనం నిరంతరం ప్రేమించలేం, కనికరించలేం, న్యాయంగా ప్రవర్తించలేం (రోమా 7:15-24). అయితే మనం తిరిగి జన్మించినప్పుడు దేవుని కృప మనల్ని మార్చింది. దేవుడు కోరిన వాటిని నెరవేర్చే కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించాడు (రోమా 8:3-4).
ప్రతి వ్యక్తికున్న విలువ
► విద్యార్థులు తరగతి కోసం యెషయా 44:24, కీర్తన 139:13-16, ఆదికాండము 9:6, మరియు యాకోబు 3:9 చదవాలి. ఈ వాక్యాలు ప్రతి జీవితం యొక్క విలువ గురించి మనకు ఏమి తెలియజేస్తాయి? ఒక వ్యక్తికి విలువను ఇచ్చేది ఏమిటి?
ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు కలిగియుండాలంటే, మనం దేవుడు విలువిచ్చినట్లుగా మనుష్యులకు విలువివ్వాలి. ప్రతి వ్యక్తి దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు గనుక విలువైనవాడు. ప్రతి వ్యక్తి, అది స్త్రీయైనా లేక పురుషుడైనా, ఆరోగ్యవంతుడైనా లేక రోగియైనా, సంపూర్ణ శరీరంతో ఉన్నా లేక వికలాంగుడైనా, యౌవ్వనుడైనా లేక వృద్ధుడైనా, ధనికుడైనా లేక పేదవాడైనా (సామెతలు 14:31), పుట్టినవాడైనా లేక తల్లి గర్భంలో ఉన్నా; వాళ్ల రంగు ఏదైనా వాళ్ల మానసిక లేక శారీరక సామర్థ్యాలు ఎలా ఉన్నాసరే (నిర్గమకాండము 4:11) వాళ్లు దేవుని ప్రత్యేకమైన సృష్టి.
పెద్దలను మర్చిపోయే, స్త్రీల కంటే పురుషులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే లేక పిల్లల్ని భారంగా భావించే సంస్కృతులు ఉన్నాయి. కొన్ని సంస్కృతుల్లో, వికలాంగుల్ని శాపంగా భావించి, వాళ్లని సమాజంలో నుండి తిరస్కరిస్తారు లేక దాచిపెడతారు. ప్రపంచమంతటిలో జాత్యహంకారం సర్వసాధారణం: ఒక తెగ లేక ఒక జాతి వాళ్లని వాళ్లు ఉన్నతంగా భావించుకుని, మిగిలినవాళ్లని అవమానిస్తారు. ఇలాంటి ప్రతి క్రియ, దేవుని సృష్టి అంతటిలో శ్రేష్టులైన మనుష్యుల్ని అగౌరవపరుస్తుంది. దేవుణ్ణి-మహిమపరచే సంబంధాలు, ఆరోగ్యకరమైన సంబంధాలు కలిగి ఉండాలంటే, మొదట ప్రజలందర్ని దేవుని స్వరూపులుగా భావించాలి.
దేవుని కోసం, ఇతరుల కోసం సృజించబడడం
దేవుడు సమస్తాన్ని తన కోసమే సృష్టించుకున్నాడని ప్రకటన 4:11 తెలియజేస్తుంది. అందులో ఖచ్చితంగా మానవాళి ఒక భాగం. దేవుడు మనల్ని తన కోసమే సృష్టించాడు. మనం ఏది చేసినా అది దేవుని మహిమ కోసమే చెయ్యాలి (1 కొరింథీయులకు 10:31, 1 పేతురు 2:12). మనం ఇతరుల ప్రయోజనం కోసం కూడా సృజించబడ్డాం.
మనం ఇతరులతో కలిసి పనిచేస్తూ దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని ఆయన మనల్ని సృజించాడు. వివాహం, ప్రజలు కలిసి పనిచేయడానికి దేవుడు రూపొందించిన ఒక ఉదాహరణ. దేవుడు మొదటి మానవుని చేసిన వెంటనే, “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను” (ఆదికాండము 2:18). కొన్ని ముఖ్యమైన విషయాల్లో స్త్రీ పురుషుడు సమానంగా ఉంటారు, కాని మరికొన్ని ముఖ్యమైన విషయాల్లో భిన్నంగా ఉంటారు. వాళ్లిద్దరు కలిసి దేవుని ఉద్దేశ్యాల్ని నెరవేర్చగలరు. దేవుడు వాళ్లు చేయవలసిన పనిని – కలిసి చేసే పనిని - వాళ్లకు అప్పగించాడు (ఆదికాండము 1:26-28).
ప్రజలు కలిసి పనిచేసే విషయంలో దేవుని నిర్మాణాన్ని, నమూనాను చూపించగల మరొక ఉదాహరణ, సంఘం. అపొస్తలుడైన పౌలు శరీర అవయవాల దృష్టాంతాన్ని ఉపయోగించాడు (1 కొరింథీయులకు 12:12-26). ఒక వ్యక్తి, ఒంటరిగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలనని లేక తనకు ఇతరుల అవసరం లేదని అనుకోకూడదు. ప్రజలు కలిసి పని చేయాలని దేవుడు చూపించిన అనేక ఉదాహరణలలో సంఘం, వివాహం కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే.
మనం ఇతరులకు పరిచారం చేయడానికి సృజించబడ్డాం (గలతీయులకు 5:13-14). ఇతరులతో ప్రేమగల సంబంధాలు కలిగియుండడానికి, ఇతరుల ప్రయోజనం కోసం మనల్ని మనం అప్పగించుకోవడానికి సృజించబడ్డాం.
► విద్యార్థులు తరగతి కోసం సామెతలు 17:17, గలతీయులకు 6:2, మరియు ఫిలిప్పీయులకు 2:4 చదవాలి.
దేవుడు మనల్ని తనకోసం, ఇతరుల కోసం సృష్టించాడు. దేవుడు వాక్యంలో దేవుడు మన నుండి ఆశించే ప్రతిదీ, ఆయనతో మనకున్న సంబంధం గురించి లేక ఇతరులతో మనకున్న సంబంధం గురించి లేక రెండు సంబంధాల గురించి మాట్లాడుతుంది. నిజానికి, దేవుడు మన నుండి ఆశించేవన్నీ, దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించడం, అలాగే మనవలె మన పొరుగువారిని ప్రేమించడం అనే ఆజ్ఞలో సంగ్రహించబడ్డాయని యేసు చెప్పాడు.
► ఒక విద్యార్థి తరగతి కోసం మత్తయి 22:36-39 చదవాలి.
మనం దేవుని కోసం, ఇతరుల కోసమూ సృజించబడ్డాం; ఈ వాస్తవాలకు పరస్పర సంబంధం ఉంది. మనం దేవుణ్ణి మహిమపరచి, ఆయన స్వరూపాన్ని ప్రతిబింబించే ప్రధానమైన విషయాలలో ఇతరులతో మనకున్న సంబంధాలు కూడా ఒకటి. దేవుని గుణం, ఆయన కార్యాలు మనం ఆయనలాగే ఉండాలని పిలుపునిస్తాయి (1 పేతురు 1:16, మత్తయి 5:48). అందరు దేవుని స్వరూపంలో చేయబడ్డారు, కాని మనం ఆయన వ్యవహరించినట్లుగా వ్యవహరించగలిగినప్పుడే దేవుని స్వభావాన్ని ప్రతిబింబించగలం.
అవసరతలో ఉన్నవాళ్ళపై కనికరం చూపినప్పుడు, అతను చూపిన కనికరం దేవుడు చూపిన కనికరాన్ని పోలి ఉంటుంది, అతని దయగల కార్యం దేవుని పనిని పోలి ఉంటుంది. కనికరం చూపేవాడు విశ్వాసియైనా లేక అవిశ్వాసియైనా, ఇది వాస్తవం. అయితే, దేవునితో మనం సమాధానపరచబడినప్పుడు, ఆయన ఆత్మ మనలో పని చేస్తున్నప్పుడు, అత్యుత్తమంగా దేవుని పోలి నడుచుకోగలం.
► ఒక విద్యార్థి తరగతి కోసం 2 పేతురు 1:2-11 చదవాలి.
దేవునిని వెంబడించే ప్రతి ఒక్కరి విషయంలో ఆయన కలిగియున్న అద్భుతమైన ప్రణాళికను ఈ వాక్యభాగం వివరిస్తుంది. ఈ వాక్యభాగం నుండి మనం ఈ విషయలను నేర్చుకుంటాం:
1. ఆయన మహిమనుబట్టి, గుణాతిశయాన్ని బట్టి, యేసు మనల్ని పిలిచాడు, అద్భుతమైన వాగ్దానాలు దయచేశాడు (వచనాలు 3-4).
2. ఈ వాగ్దానాల ద్వారా, క్రీస్తును ఎరిగినవారు దైవస్వభావం కలిగియుంటారు (వచనం 4).
3. తండ్రియైన దేవునితో, యేసుతో సంబంధం కలిగి ఉండడం ద్వారా, జీవానికి, భక్తికి కావాల్సిన ప్రతిదీ మనం కలిగియుంటాం (వచనం 3).
4. ఈ విషయాల ద్వారా, మనం యేసు జీవించినట్లుగా జీవిస్తాం, దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవిస్తాం (వచనాలు 5-8).
► మన సంబంధాల్లో దేవుని స్వభావాన్ని, ఆయన గుణాన్ని ప్రతిబింబించడం ఎలా సాధ్యమౌతుంది?
► ఒక విద్యార్థి తరగతి కోసం 2 కొరింథీయులకు 4:4 చదవాలి. దేవుని పరిపూర్ణ ప్రతిరూపం ఎవరు?
► ఒక విద్యార్థి తరగతి కోసం 2 కొరింథీయులకు 3:18 చదవాలి.
పరిశుద్ధాత్ముడు, ప్రభువు మహిమను అధికంగా ప్రతిబింబించేలా విశ్వాసుల్ని మారుస్తాడు. యేసుని చూస్తూ, మనం మన వైఖరుల్లో ప్రవర్తనల్లో ఆయన పోలికగా మార్చబడతాం. సువార్తకు ఉన్న గొప్ప శక్తి ఇదే. తండ్రియైన దేవుడు, యేసు మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మనం దేవుని గుణాన్ని ప్రతిఫలిస్తూ, ఆయన్ను అనుసరించగలుగుతాం.
ఇతరులతో మనకున్న సంబంధాల్లో, ఆయన్ను పోలి నడుచుకోవాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు (ఎఫెసీయులకు 5:1). పిల్లవాడు తన తల్లిదండ్రుల్ని లేక తన అన్నల్ని, అక్కల్ని చూసి నేర్చుకున్నట్లే, మనం ఇతరులతో వ్యవహరించేడప్పుడు యేసు మాదిరిని చూసి, ఆయన వైఖరులు, అభిప్రాయలు, క్రియల్ని పోలి నడుచుకోవాలి (ఫిలిప్పీయులకు 2:5-7, ఎఫెసీయులకు 5:2).
► విద్యార్థులు తరగతి కోసం క్రిందనున్న ప్రతి వాక్యభాగాన్ని చదవాలి. రెండు విషయాలను గమనించాలి (1) దేవుని గుణం లేక కార్యం మరియు (2) దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు. (మొదటి రెండు వాక్యభాగాలకు నోట్సు ముందుగానే ఉదాహరణగా ఇవ్వబడింది. ఈ పాఠం ముగింపులో, అభ్యాసం 2 ఈ అధ్యయనానికి కొనసాగింపుగా పనిచేస్తుంది.)
మానవ సంబంధాలు దేవుని మహిమను ఎలా ప్రతిబింబిస్తాయి
లేఖనభాగం
దేవుడు ఏం చేశాడు/క్రీస్తు ఏం చేశాడు
దేవుని ప్రతిబింబించే మన కార్యం
ఫిలిప్పీయులకు 2:3-8
ఆయన హక్కులు విడిచిపెట్టాడు.
దాసుడయ్యాడు.
సంపూర్ణ విధేయత చూపి, తగ్గించుకున్నాడు.
మన హక్కులు విడిచిపెట్టాలి.
ఇతరుల కార్యాలపై దృష్టిపెట్టాలి.
విధేయులవ్వాలి.
యోహాను 13:3-5, 12-15
తన శిష్యులకు పరిచారం చేశాడు, రోజువారీ అవసరత తీర్చాడు.
ఇతర విశ్వాసులకు పరిచారం చెయ్యాలి.
ఎఫెసీయులకు 4:32-5:2
మనలో ఎవ్వరు దేవుని ప్రేమను స్వాభావికంగా చూపలేరు ఎందుకంటే మనందరం స్వార్థ పూరిత స్వభావంతో పుట్టాం. అయితే, దేవుడు తన స్వభావం, నిర్మాణంలోనికి పునఃస్థాపించడానికి కృపను మనకు అనుగ్రహించాడు. ఒక వ్యక్తి, వినయంగా అప్పగించుకుంటానని చేసే ఒక చిన్న ప్రార్థన ఈ అద్భుతమైన మార్పుకు నడిపిస్తుంది.
ముగింపు
దేవుడు తన ప్రజల్ని సంబంధాల కోసం: ఆయనతో, ఇతరులతో సంబంధం కలిగియుండడం కోసం ప్రేమతో రూపించాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది.
దేవుడు ప్రజల్ని సృజించి, సంబంధాల కోసం రూపించాడు, గనుక మనం:
1. మన సంబంధాల్లో ఆయన దృక్కోణాన్ని పొందాలి.
2. మన సంబంధాల్లో తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయనకు లెక్క అప్పజెప్పవలసినవారమని గుర్తించాలి.
3. మన సంబంధాల్లో ఆయన ప్రణాళికను అంగీకరించి, దాన్ని అనుసరించాలి.
ఈ కోర్సు అధ్యయనం, ఈ విషయాలు పాటించడానికి మీకు సహాయపడుతుంది అలాగే మానవ సంబంధాల్లో దేవుని చిత్తం ఏంటో ఇతరులకు బోధించడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.
సమూహ చర్చ కోసం
► మానవ సంబంధాల్లో, సంస్కృతి అనేది ఒక మార్గదర్శినిగా ఎందుకు చాలదు?
► ఈ పాఠంలో మీకు కొత్తగా అనిపించిన అంశం ఏమిటి? అది ఎందుకు ముఖ్యమైనది? దానిని అర్థం చేసుకోవడం మీ సంబంధాలలో ఎలా సహాయపడుతుంది? దానిని అర్థం చేసుకోవడం మీ పరిచర్యపై ఎలా ప్రభావం చూపుతుంది?
► ఈ కోర్సు అధ్యయనం ద్వారా మీరు ఏ విధంగా ఎదగాలని ఆశపడుతున్నారు?
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
నన్ను ఒక ఉద్దేశ్యంతో, నీ స్వరూపంలో సృజించినందుకు వందనాలు.
నీతో సంబంధం కలిగియుండేలా నన్ను రూపించినందుకు అలాగే నా పాపాల నిమిత్తం యేసు మరణం ద్వారా దాన్ని సాధ్యపరచినందుకు వందనాలు.
ఇతరులతో ఎలా సంబంధం కలిగి ఉండాలో, దాని ద్వారా నిన్నెలా మహిమపరచాలో నాకు బోధించే నీ వాక్యపు నిధిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా, నా పట్ల నీ ప్రణాళికను అంగీకరించడం నాకు నేర్పించు.
ఇతరులు నీ దగ్గరకు వచ్చి, నిన్ను తెలుసుకొనునట్లు, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో నిన్ను పోలి నడుచుకోవడానికి సహాయం చెయ్యి.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) దేవుని స్వరూపంలో సృజించబడ్డారనే సత్యం, ప్రతి వ్యక్తికి ఎలా విలువిస్తుందో, దాన్ని తిరస్కరించడం ద్వారా మనుష్యులు తమ విలువను ఎలా కోల్పోతారో వివరించండి?
(2) క్రింద ఇవ్వబడిన పట్టికలో, ప్రతి వాక్యభాగాన్ని చదవండి. ఈ రెండు విషయాలపై నోట్స్ రాయండి (1) దేవుని గుణం లేక పని మరియు (2) దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు.
(3) అభ్యాసం 2లో పట్టికను, అలాగే పాఠం చివర్లో ఇవ్వబడినదాన్ని చూస్తూ, మీ జీవితాన్ని పరీక్షించుకోవడానికి సమయం కేటాయించండి:
నీవు ప్రస్తుతం దేవుణ్ణి గౌరవించి, మహిమపరిచే విధంగా ఆయన స్వరూపాన్ని ప్రతిబింబిస్తున్నావా?
మీ జీవితం స్పష్టంగా మరింత శక్తివంతంగా దేవుని ప్రణాళికకు అనుగుణంగా ఉండడానికి, మీరు ఒప్పుకుని విడిచిపెట్టవలసిన అవిధేయత ఏదైనా ఉందా?
యేసు పోలికలోకి మారడానికి మీరు ఏ విషయాలు పాటించాలని దేవుడు ఆశిస్తున్నాడు?
ఈ అధ్యయనానికి ప్రతిస్పందనగా ఒక పేరా ప్రార్థన రాయండి. (దీన్ని మీ తరగతి నాయకుడితో పంచుకోనవసరం లేదుగాని, కేవలం అభ్యాసం చేశారని రిపోర్ట్ ఇవ్వొచ్చు.)
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.