ప్రతి సాయంత్రం నిఖిత తన ఇద్దరు పిల్లలతో ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి కొంత సమయం వెచ్చించేది. లేఖన భాగంలో కొన్ని వచనాలు చదివి, ఒకొక్క వచనానికి మధ్య కొంచెం సమయం తీసుకుని అవి జీవితానికి ఎలా వర్తిస్తాయో మాట్లాడేది. ఆమె పిల్లలు కౌమారదశలో ఉన్నప్పుడు, లేఖన భాగాలు చదివి వాటిని వివరించడానికి వారికి సమయం ఇచ్చింది. అప్పుడు వారు లేఖనాల్ని అద్భుతంగా వివరించారు ఎందుకంటే వారు ఆమె తల్లి నుండి నేర్చుకున్నారు. ఆమె నుండి నేర్చుకున్న జీవిత సూత్రాల్ని తమ సొంత మాటల్లో చెప్పగలిగారు.
కౌమారదశ
ప్రతి సమాజంలో బాల్యానికి, యుక్తవయస్సుకు మధ్య జీవిత కాలానికి ఒక పేరు ఉంటుంది. ఈ కాలంలో, యవ్వనస్తుల్లో లైంగికత వంటి వయోజనుల ఆసక్తులు మొదలౌతాయి, కానీ వయోజనులు తీసుకునే బాధ్యతలు చేపట్టలేడు. కొన్ని దేశాల్లో, చట్టపరంగా 18 సంవత్సరాలు వస్తేనే వయోజనుల వయస్సులో ఉన్నట్లుగా పరిగణిస్తారు. అలాంటి దేశాల్లో, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు వివాహం చేసుకోలేరు, సైన్యంలో పనిచేయలేరు లేక తల్లిదండ్రుల అనుమతి లేకుండా చట్టబద్దంగా ఒప్పందాలు చేయలేరు.
కౌమారదశ ప్రతిచోట ఒకేలా ఉండదు. కొన్ని సమాజాల్లో, వయోజనులు చేసే పనులు అతడు లేక ఆమె నేర్చుకున్నప్పుడు, 18 సంవత్సరాల్లోపే వయోజనులుగా జీవించడానికి సిద్ధంగా ఉంటారు. మరికొన్ని సమాజాల్లో, 18 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా విద్య అభ్యసిస్తుండగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు.
► బాల్యానికి, వయోజన వయస్సుకు మధ్య కాలాన్ని సూచించడానికి మీ సమాజంలో ఏ పదం ఉపయోగిస్తారు?
► వయోజన (దశ) అంటే ఏంటి?
మనుష్యులకు, జంతువులకు రెంటికీ ఉపయోగించే వయోజన (దశ) అను పదానికి నిర్వచనం ఇది: శారీరక పరిపక్వతగల జీవి. అయితే మనుష్యుల దృక్కోణంలో, వయోజన (దశ) అంటే శారీరక పరిపక్వత కంటే మించినది. యువకుడికి, వయోజనునికి ఉండే బలం, పరిమాణం ఉండొచ్చు కాని, వయోజనుడు తీసుకునే బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండడు.
► వయోజనులకు శారీరక ఎదుగుదలతో పాటుగా ఇంకేమి లక్షణాలు ఉంటాయి?
సాధారణంగా, ఒక వయోజనుడు అంటే స్వయంగా నిర్ణయాలు తీసుకోగల మరియు వాటికి బాధ్యత వహించగల వ్యక్తి. ఈ నిర్వచనం ఖచ్చితమైనది కాకపోవచ్చు, ఎందుకంటే వ్యక్తిగత బాధ్యత స్థాయిలు చాలా తేడాగా ఉంటాయి. ఒంటరిగా జీవించేవారు తప్ప ప్రతి ఒక్కరూ ఇతరుల ప్రభావానికి లోనవుతారు, మరియు పెద్దలు కూడా అన్ని నిర్ణయాలలో పూర్తిగా స్వతంత్రంగా ఉండరు. అయినప్పటికీ, వయోజనుల లక్షణం ప్రధానంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం మరియు వాటికి బాధ్యత వహించడం. కౌమారదశ ముగిసే సమయానికి, వ్యక్తి తన కోసం నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ బాధ్యతకు కౌమార దశలో ఉన్నవారిని సిద్ధం చేయడమే తల్లిదండ్రుల లక్ష్యం.
తండ్రి బ్రతికి ఉండగానే తనకు రావలసిన ఆస్తిని అడిగిన కుమారుడి గురించి యేసు ఒక కథ చెప్పాడు (లూకా 15:11-32). కుమారుడు డబ్బు తీసుకుని నిర్లక్ష్యంగా వృథా చేశాడు. కౌమారదశ ముగించుకుని వయోజన దశలోకి అడుగుపెట్టినప్పటికీ, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా లేని వ్యక్తికి ఇది ఒక మంచి ఉదాహరణ. వయోజన దశలోని బాధ్యతలు, స్వేచ్ఛ స్వీకరించడానికి ముందు వారు సరిగా ఎదగలేదు గనుక యుక్తవయసులో ఉన్న చాలామంది తాము తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మానవ అభివృద్ధిలో ఒక ముఖ్య దశయైన కౌమారదశకు సంబంధించి దేవుని వాక్యంలో గొప్ప జ్ఞానం దాగియుంది.
శారీరక, మానసిక పురోగతి
► ఒక విద్యార్థి తరగతి కోసం లూకా 2:40, 52 చదవాలి.
యేసు యుక్తవయస్సులోకి అడుగుపెట్టి, మానసికంగా, శారీరకంగా ఎదిగాడు. ఈ రెండు వచనాల మధ్య, యేసు దేవాలయాన్ని సందర్శించి బోధకులతో మాట్లాడిన విషయం ఉంది. ఆయన శారీరకంగా ఎదగడమే కాకుండా, మరింత స్వతంత్రంగా ఉండగలనని భావించాడు. తన కుటుంబం, స్నేహితులకు మించి ఇతరులతో కూడా తన ఆలోచనలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
యేసు బోధకులతో సంభాషించడం చూసిన మరియ, యోసేపులు ఆశ్చర్యపోయారు అయితే వారు మూడు దినాల నుండి యేసు విషయంలో ఆందోళన చెందుతున్నారని మరియ యేసుతో చెప్పింది (లూకా 2:46-48). అయితే యేసు, మీరు చింతించకూడదు, ఎందుకంటే నేను నా తండ్రిపనుల మీద ఉన్నానని చెప్పాడు (లూకా 2:49). ఒక యువకుడుగా తన జీవితంలో తన ఆలోచనలు అనుసరించి నడుచుకోవాలనే సాధారణ కోరిక ఆయనలో ఉంది. అయితే, ఆయన ఇంటికి తిరిగివచ్చి, మిగిలిన కౌమారదశ అంతటా తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు (లూకా 2:51).
పూర్వ వయోజనదశలో, పిల్లల శరీరం పెద్దవారిలా మారుతుంది. పిల్లలు వేగంగా ఎత్తు పెరుగుతారు. శరీరంలో పలుచోట్ల వెంట్రుకలు వస్తాయి. స్వరం గంభీరంగా మారుతుంది. ఈ మార్పులు సహజమేనని పిల్లలు అర్థం చేసుకునేలా తల్లిదండ్రులు సహాయపడాలి. దేవుడు మానవులలో సహజ శరీర, మానసిక అభివృద్ధిని ప్రణాళిక చేశాడు.
మీ పిల్లలతో మంచి సంబంధం కలిగి ఉండడంవల్ల, ఈ కాలంలో వారు మీతో పారదర్శకంగా మాట్లాడగలుగుతారు. ఈ విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడలేనివారు లోలోపల భయపడతారు. వీటి గురించి మరింత సమాచారం కోసం మిత్రుల్ని అడుగుతారు లేక ఆన్లైన్లో వెదుకుతుంటారు.
మానసిక పురోగతి
కౌమారదశ అనేది, బాల్య దశ కొనసాగింపు మాత్రమే కాదు. తల్లిదండ్రులు, తమ పిల్లల చిన్నతనంలో ఎలా బోధించాలో కౌమారంలో ఉన్నప్పుడు కూడా అలాగే బోధించవచ్చు లేక నడిపించవచ్చు అని అనుకోవడం తప్పు. కౌమారంలో ఉన్నప్పుడు ఆలోచనలు, ఆసక్తులు మారుతుంటాయి. అతడు స్వేచ్ఛ, విజయం మరియు గౌరవం కోసం చూస్తాడు. కౌమారంలో ఉన్నవారితో చిన్నపిల్లలతో వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తే చిరాకుపడతారు.
లేఖనమంతటా యేసువలే తెలివిగల నిర్ణయాలు తీసుకున్నవారు, లేక యేసు చెప్పిన కథలోని వ్యక్తివలే చెడ్డ నిర్ణయాలు తీసుకున్న చాలామంది ఉన్నారు (లూకా 15:11-32). తమ కుమారుడు లేక కుమార్తె మానసికంగా ఎలా అభివృద్ధి చెందుతుందో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల లక్ష్యం ఏమిటంటే, యువత జీవితంలోని అన్ని విషయాల్లో ముఖ్యంగా భావోద్వేగాల విషయంలో ఆశా-నిగ్రహం నేర్చుకోవడానికి సహాయపడాలి, అప్పుడు వారికి తల్లిదండ్రుల నియంత్రణ అవసరం ఉండదు.
► ఎఫెసీయులకు 6:1-4 చదవండి. ఈ వాక్యభాగం నుండి మనకు ఎలాంటి నిర్దిష్టమైన మార్గదర్శకాలు లభిస్తాయి?
పిల్లలు తల్లిదండ్రులకు ఇద్దరికీ లోబడవలసి ఉంది, అంటే అందుకు తల్లి, తండ్రి ఇద్దరూ కూడా సహకరించాలని ఇది సూచిస్తుంది. తల్లిదండ్రులకు చూపించే విధేయతకు, దేవునికి చూపించే విధేయతకు మధ్య ఒక స్పష్టమైన సంబంధాన్ని ఈ వాక్యభాగం చూపిస్తుంది. తమ పిల్లలకు విధేయత నేర్పని తల్లిదండ్రులు, దేవుని పట్ల విధేయత చూపడానికి వారిని సిద్ధపరచడం లేదు. మీ పిల్లల్ని మీ మీద తిరుగుబాటు చేయడానికి అనుమతిస్తే, మీరు వారిని దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా సిద్ధపరుస్తున్నారు.
ఈ వాక్యభాగం ముఖ్యంగా తండ్రులకు ఉపదేశమిస్తుంది. తండ్రులు తమ పిల్లల్ని నిరుత్సాహానికి గురి చేయకుండా లేక వారికి కోపం రేపకుండా శిక్షణ ఇవ్వాలి. శిక్ష, దిద్దుబాటు అవసరం, మరియు అవి పిల్లవాడికి వెంటనే సంతోషాన్ని కలిగించవు, కాని తండ్రి స్థిరంగా, ప్రేమగా ఉండాలి. అంటే, తండ్రి తన బిడ్డలో జరిగే మానసిక పురోగతిని అర్థం చేసుకోవాలి.
తండ్రి దిద్దుబాటు మాత్రమే కాకుండా ప్రభువు శిక్షలో, బోధలో వారిని పెంచాలి. మనం కేవలం మన పిల్లల తప్పులు సరిదిద్దడం ద్వారానే వారిని పెంచం. మనం వారిని అర్థం చేసుకోవడానికి, ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి. మనం మన సొంత ఆవసరాలే కాకుండా దేవుని సత్యాన్ని కూడా ఉపయోగించాలి. మనం దేవునికి విధేయత చూపుతున్నామని కూడా చూపించాలి.
పిల్లవాడు తన చిన్నతనంలో గౌరవించడం, విధేయత చూపడం నేర్చుకుంటే, కౌమార దశలో శిక్షణ ఇవ్వడం సులభం! పిల్లలు చిన్నవయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారితో పెంచుకున్న సంబంధం, కౌమార దశలో శారీరక, మానసిక, ఆత్మీయ మార్పులు కలిగినప్పుడు వారికి సహాయపడుతుంది. పిల్లల పెంపకాన్ని సులభతరం చేసే సూచనలేమి లేవు, కాని చిన్ననాటి నుండే మంచి సంబంధం ఏర్పరచుకుంటే కౌమారదశ అంతా సంభాషణ సాధ్యమౌతుంది.
పిల్లలు తమ మాట వినాలని తల్లిదండ్రులు ఆశపడతారు, కాని తల్లిదండ్రులే ముందుగా పిల్లల మాట ఆలకించాలి. దయచేసి, మీ కోసం, వారి కోసం -మీ ఫోన్లు, పుస్తకాలు, పనులు లేక మీరు చేసే ఏ పనైనా ప్రక్కనబెట్టి, వారు మాట్లాడాలనుకున్నప్పుడు సమయం ఇవ్వండి. మరేది ముఖ్యం కాదు వారి మాటలే ముఖ్యం అన్నట్లుగా వినండి. మధ్య మధ్యలో తప్పులు సరిచేయకుండా, వారు చెప్పేది మీకు అర్థమయ్యేవరకు జాగ్రత్తగా వినండి. వారికి, వారి ఆలోచనలకు మీరు విలువిస్తున్నారని, వారిని గౌరవిస్తున్నారని అనిపించాలి. మీ సలహాలు వారికి ఇష్టం లేకపోయినా, మీరు నిజంగా విన్నారని వారికి అర్థమైనప్పుడు వారు దాన్ని మరింత గౌరవిస్తారు.
యువకుడు నిరాశ, కోపం లేక ఒంటరిగా ఉండడం వంటి భావోద్వేగాలు వ్యక్తపరుస్తున్నప్పుడు వినడం కొంచెం కష్టంగానే ఉంటుంది. యువకుడికి తన సొంత భావాలు పూర్తిగా అర్థం కావని గుర్తుంచుకోండి. కొన్నిసార్లు వారి పరిస్థితులవల్ల, సంబంధాలవల్ల, మరియు శరీరమార్పులవల్ల భావోద్వేగాలు ప్రభావితమౌతాయి గనుక వారు ఏదొకటి మాట్లాడుతుంటారు. ఇవన్నియు కౌమారదశలో ఉన్నవారి భావోద్వేగాల్ని ప్రభావితం చేస్తాయి: పాఠశాలలో ఒత్తిడి, స్నేహితుల నుండి అంగీకారం పొందాలనే ఒత్తిడి, శారీరక మార్పులవల్ల కలిగే ఆందోళన, గౌరవం, విలువ పొందుకోవట్లేదనే అసహనం, హార్మోన్ల ప్రభావం మరియు అస్థిరమైన నిద్ర వలన కలిగే అలసట.
ఆత్మీయ పురోగతి
► ప్రసంగి 11:9-12:1, 13 చదవండి. ఒక యువకునికి, ఈ వచనాల్లోని ఆజ్ఞల్ని మీరెలా వివరిస్తారు?
యువతలో అజాగ్రత్తను, అనైతికను ప్రపంచం క్షమించవచ్చు, కాని యువత తమ చర్యల విషయంలో దేవునికి లెక్క అప్పజెప్పవలసినవారిగా ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలని ఈ వచనాలు సెలవిస్తున్నాయి. ఆయన వారి న్యాయాధిపతి.
జీవితంలోని వివిధ కార్యకలాపాల మధ్య దేవుని వాక్యాన్ని బోధించడం ఈ దశలో కూడా ఎంతో ముఖ్యమైంది (ద్వితీయోపదేశకాండము 6:6-7). అయితే, ఇది చాలా కష్టం ఎందుకంటే కౌమారంలో ఉన్నవారు కుటుంబంతో గడిపే సమయంకంటే ఇతర కార్యక్రమాల్లో ఎక్కువ నిమగ్నమౌతారు. వారికి వారి సొంత ఆశలు ఉంటాయి, విద్యా కార్యకలాపాలు, క్రీడా కార్యక్రమాలు, స్నేహితుల గుంపులు మొదలైనవి ఉంటాయి. ఎల్లప్పుడు తల్లిదండ్రులు వారితో ఉండలేరు, కానీ దేవుడు ఉంటాడు. అయితే తల్లిదండ్రులు వారి కోసం నమ్మకంగా ప్రార్థించాలి. ప్రత్యేకమైన సంభాషణలకై సమయాన్ని కేటాయించడంలో తల్లిదండ్రులు దేవుని జ్ఞానం కోసం వేడుకోవాలి. పిల్లల వ్యక్తిగత జీవితంలోని వివిధ విషయాలు గురించి తల్లిదండ్రులు తెలుసుకోవడం, వాటిలో పాల్గొనడం ఎంతో ముఖ్యం.
► 1 స్సలొనీకయులకు 2:11-12 కలిసి చదవండి. ఎదుగుతున్న వారి పిల్లలతో వారికున్న సంబంధాల విషయంలో దేవుడు తండ్రులకు ఎలాంటి బాధ్యత ఇచ్చాడు?
సమస్యలు స్పష్టంగా కనిపించడం లేదనే కారణంతో అంతా బాగానే ఉందని తల్లిదండ్రులు అనుకోకూడదు. మీ కుమారుడు లేక కుమార్తె శోధనలకు గురౌతారని, బలహీనతలు అనుభవిస్తారని ఆశించండి, ఎందుకంటే వారు ఖచ్చితంగా అనుభవిస్తారు! వారి ఆర్ధిక విషయాల్లో, సమయాన్ని ఖర్చు చేసే విషయంలో, జీవిత నిర్ణయాల విషయంలో, లైంగిక పవిత్రత విషయంలో ఎలా ఉన్నారో అనేదానిపై లెక్క అప్పజెప్పేవారిగా చెయ్యండి. ఇతరుల ఆలోచనలు, సలహాలు అడగండి. గురువుల మాటలు , ఇతరుల ఆందోళనలు వినండి. మీ పిల్లల విషయంలో ఇతరుల అభిప్రాయాలతో మీరు ఏకీభవించనప్పటికీ, ఆ మాటలు శ్రద్ధగా విని, మీ పిల్లల అవసరాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి.
కౌమారంలో ఉన్నవారి కోసం ప్రార్థించండి, వారి కోసం ప్రార్థిస్తున్నారని చెప్పండి. మీరు చేసే ప్రార్థన వారికి వినిపించండి. మీరు ఏ విషయాల కోసం ప్రార్థిస్తున్నారో వారితో పంచుకోండి. ఉదాహరణకు, ఇలా చెప్పవచ్చు, “నీవు నీతికొరకు ఆకలిదప్పులు (మత్తయి 5:6) కలిగియుండాలని ప్రార్థిస్తున్నాను; దుప్పినీటివాగుల కొరకు ఆశపడునట్లు నీవు ఆశపడాలని ప్రార్థిస్తున్నాను (కీర్తన 42:1). ఆత్మ పూర్ణులై ఉండాలని ప్రార్థిస్తున్నాను (ఎఫెసీయులకు 5:18) తద్వారా నీవు పూర్ణహృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఆయన్ను ప్రేమిస్తావు అలాగే నిన్నువలె నీ పొరుగువారిని [లేక తోబుట్టువుని] ప్రేమిస్తావు (మత్తయి 22:37-39).”
► ఇంకా ఏ ఇతర వాక్యభాగాలు కౌమారంలో ఉన్నవారి కోసం ప్రార్థించగలరు?
చివరిగా, కౌమారంలో ఉన్న మీ పిల్లలతో ఈ ఆత్మీయ ప్రయాణంలో, వారితో దేవుని వాక్యాన్ని ఉపయోగించండి:
మాదిరిగా ఉండండి: ప్రతిరోజు వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి. దేవుడు మీకు ఏమి బోధిస్తున్నాడో, దేవుని వాక్యం జీవితాల్లో ఎలా అన్వయించబడుతుందో మీ కుమారుడు లేక కుమార్తెతో మాట్లాడండి. వారు ఉత్సాహంగా స్పందించకపోయినా లేక సంభాషణ కొనసాగించకపోయినా, వారు వింటున్నారు, వాక్యం ద్వారా ప్రభావితమౌతున్నారు!
కుటుంబంగా కలిసి లేఖన భాగాలు కంఠస్తం చేయండి, మరియు భోజన సమయంలో లేక రోజు ముగింపులో వచనాలు చదవండి.
సామెతల గ్రంథాన్ని ఒకొక్క వచనం చొప్పున చదవండి, మాట్లాడండి. కొద్ది సమయం కుటుంబంగా ధ్యానించడానికి సామెతల గ్రంథం ఒక అద్భుతమైన పుస్తకం, ప్రతిరోజుకు కావలసిన ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తుంది. అనేక సంభాషణలకు అవకాశాలు కలిగిస్తుంది, గొప్ప ప్రభావం చూపిస్తుంది.
లేఖనంలో ఉన్నటువంటి సూచనలు, సూత్రాలు, మరియు ఉదాహరణలు జీవితంలో అన్ని కాలాలకు వర్తిస్తాయి, కాబట్టి మీ కుమారులు కుమార్తెలతో కలిసి దేవుని వాక్యమంతటిని అధ్యయనం చేయండి.
సాంఘిక పురోగతి
లూకా 2:52, కౌమారంలో యేసు పురోగతిని వర్ణించే ఈ వచనం, ఆయన ఇతరులతో తన సంబంధాల విషయంలో కూడా ఎదిగాడని చెబుతుంది. దేవుడు మన సంబంధాల విషయంలో ఆసక్తి కలిగియున్నాడు. మానవులతో సంభాషించాలని, సహవాసం కలిగియుండాలని ఆయన మనల్ని రూపొందించాడు.
కుటుంబ సభ్యులతో పాటుగా, మనం మన సహవిద్యార్థులు, పొరుగువారు, సంఘ బృందాలు, యజమానులు, బోధకులు, ఇతర నాయకులు మరియు మీడియా ద్వారా ప్రభావితులౌతారు. తోటి స్నేహితులు సాధారణంగా మంచిగానో లేక చెడుగానో ఎక్కువ ప్రభావం చూపుతారు. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలు, యువకులు ఎవరితో ఎలా సన్నిహితంగా ఉంటున్నారో పర్యవేక్షించాలి.
మీ బిడ్డ యుక్తవయసులోకి అడుగుపెడుతున్నప్పుడు, వారు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలరో జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. మీ కుటుంబంలోని కంప్యూటర్లు, మొబైల్ పరికరాల్లో, చెడ్డ విషయాలను చూడకుండా ఉండటానికి పాస్వర్డ్లను, నిర్దిష్ట యాప్లను ఉపయోగించండి. పరికరాలను వాడడానికి సమయ పరిమితులను ఏర్పాటు చేయండి. వెబ్సైట్లు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు మరియు సోషల్ మీడియా వేదికలను పర్యవేక్షించండి. మీ బిడ్డ మీ పరిసరాల్లోని కొందరితో గడపడానికి మీరు ఎలా అనుమతించరో, అదే విధంగా వారి ఎలక్ట్రానిక్ పరికరాల్లో చెడ్డవారిని అనుసరించడానికి లేదా వారితో సంబంధాలు పెట్టుకోవడానికి అనుమతించవద్దు.
► మీ పిల్లల్ని కేవలం రక్షించడం మాత్రమే సరిపోదు. కౌమారంలో, మీ కుమారుడు లేక కుమార్తె దేవుణ్ణి గౌరవించి, వారి ఆత్మలను రక్షించుకునే తెలివిగల నిర్ణయాలు తీసుకునే విధంగా బాధ్యతను స్వీకరించడానికి కూడా మీరు వారిని సిద్ధపరుస్తున్నారు. కౌమారంలో ఉన్నవారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విషయంలో, వారి సాంఘిక లోకంలో బాధ్యతను, జవాబుదారీతనాన్ని నేర్పించగల కొన్ని మార్గాలు ఏంటి?
యవ్వనస్తులు మిత్రుల బృందాల్ని ఏర్పాటు చేసుకుని ఎక్కువ సమయం గడుపుతారు. వారు ఒకే రకమైన వినోదాన్ని ఆస్వాదించడం వంటి ఆసక్తులు పంచుకోవడం నేర్చుకుంటారు. సంఘం, తల్లిదండ్రులు, పాఠశాల, మరియు ఇతర సంస్థలపట్ల ఒకేరకమైన ఆలోచనలు పంచుకుంటారు. తల్లిదండ్రులు, తమ పిల్లల్లో కలిగే మార్పులకు తరచు ఆశ్చర్యపడుతుంటారు. యవ్వనస్తులు కొన్నిసార్లు ఊహించని వ్యాఖ్యలు చేస్తారు, విమర్శలు చేస్తారు, మిత్రుల నుండి నేర్చుకున్న పదజాలం వాడతారు. ఆ స్నేహితుల బృందం ఒక ప్రత్యామ్నాయ కుటుంబంగా మారి, దాని సభ్యుల్ని అంగీకరిస్తుంది. ఒకవేళ తన సొంత కుటుంబం నుండి విలువ, గుర్తింపు, అంగీకారం పొందనప్పుడు ఈ ప్రత్యామ్నాయ కుటుంబం వైపు బలంగా ఆకర్షించబడతారు.
కౌమారంలో ఉన్నవాడిని స్నేహితుల బృందం నుండి బయటకు తీసుకురావడం లేదా ఆ బృంద ప్రభావాన్ని తగ్గించడం చాలా కష్టంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఆ బృందాన్ని లేక వ్యక్తుల్ని విమర్శించినప్పుడు, పిల్లవాడు వారి పక్షంగా నిలబడతాడు, తల్లిదండ్రులు తనను అర్థం చేసుకోవట్లేదని భావిస్తాడు. తండ్రి లేక తల్లి శ్రద్ధ చూపినప్పుడు, ఆసక్తి చూపించినప్పుడు, ప్రేమ చూపినప్పుడు కౌమారంలో ఉన్నవాడికి సహాయం చేస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల భావోద్వేగ అవసరాలు తీర్చినప్పుడు, ప్రత్యామ్నాయ కుటుంబమైన స్నేహితుల బృందం మీద వారు ఆధారపడరు.
► అనేక కుటుంబాల తల్లిదండ్రులు కౌమారంలో ఉన్న తమ పిల్లలకు సహాయం చేయడానికి ఎలా కలిసి పనిచేయగలరు?
► దేవుణ్ణి గౌరవించే ఆరోగ్యకరమైన సాంఘిక జీవితాలు గడపడంలో కౌమారదశలో ఉన్న తమ పిల్లలకు సహాయం చేస్తున్నప్పుడు, సంఘం తల్లిదండ్రులకు ఎలా మద్దతు ఇవ్వగలదు?
యుక్తవయసుకు మారే తరుణంలో ఉండే ఇబ్బందులు
పిల్లవాడు ఒక్కసారిగా వయోజనుడు కాలేడు. ఒక బిడ్డ అనేక సంవత్సరాల పాటు ఉండే పరివర్తన కాలం గుండా వెళతాడు.
లేఖనమంతటిలో, ముఖ్యంగా సామెతలు గ్రంథం యువతను ఉద్దేశించి రాయబడింది. సామెతల గ్రంథంలో, జీవితం గురించి నేర్చుకుంటూ, ప్రాపంచిక దృక్కోణాన్ని అభివృద్ధి చేసుకునే తన కుమారుడ్ని ఉద్దేశించి రాజైన సొలొమోను మాట్లాడాడు. జీవితంలో ప్రతి కోణం గురించి, దేవుని మార్గాలు అనుసరించడంవల్ల కలిగే బహుమానాలు దేవుని మార్గాలు తిరస్కరించడంవల్ల కలిగే ప్రమాదాలు గురించి సొలొమోను తన కుమారుడితో మాట్లాడాడు.
బాల్యంలో, కౌమారదశలో ఏర్పడిన నమ్మకాలు, ఆ సమయంలో చేసుకున్న ఎంపికలు ఒక వ్యక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యం. యుక్తవయసుకు మారే తరుణంలో ఎదురయ్యే అనేక సవాళ్లను మనం పరిశీలిస్తున్నప్పుడు, ఆ సమయంలో మన పిల్లలతో కలిసి ముందుకు సాగడంలో దేవుని వాక్యం మనకెలా సహాయం చేస్తుందో చూద్దాం.
సవాలు 1: కౌమారంలో ఉన్నవాడు తనకు బోధించబడినవాటన్నిటిని పరిశీలించుకుని, ఏది నమ్మాలో నిర్ణయించుకుంటాడు.
కౌమారంలో ఉన్నవ్యక్తి, తన మనసులో నమ్మకాలు స్పష్టంగా ఉండాలని కోరుకుంటాడు, కాబట్టి బోధించబడినవాటన్నిటిని పరిశీలించి, ప్రశ్నిస్తాడు. కొన్ని సందర్భాల్లో, తల్లిదండ్రులు బోధించేవాటన్నిటిని అంగీకరించకపోవచ్చు. అందువల్ల, తల్లిదండ్రులు ఆందోళనకు గురౌతారు. అతడు పరిశీలించే విషయాల్ని అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పలేనప్పుడు, వారు అతన్ని మళ్ళీ చిన్నవాడిలా చూడడం మొదలుపెడతారు, ప్రశ్నించకుండా వారి నమ్మకాలు అంగీకరించాలని కోరతారు. దీనివలన, కౌమారంలో ఉన్నవారు తమకు సొంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వట్లేదని భావిస్తారు.
తల్లిదండ్రులు తమ నమ్మకాల వెనుక ఉన్న కారణాలను ఓపికగా వివరించాలి మరియు ఆ నమ్మకాలను వివరించడంలో సహాయపడే ఇతర వ్యక్తులతో మాట్లాడే అవకాశాలను యవ్వనస్తులకు కల్పించాలి.
► సామెతలు 23:22-23 కలిసి చదవండి.
ఈ వచనాల్లో, యువకులు తమ తల్లిదండ్రుల జ్ఞానవాక్కులు వినడానికి నిర్ణయించుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు వారి కుమారుడు లేక కుమార్తె కోసం ఈ నిర్ణయం తీసుకోలేరు, కాని మంచి సంబంధాన్ని పెంపొందించగలరు. తల్లిదండ్రులు తమ కుమారుడు లేక కుమార్తెతో గౌరవంగా మాట్లాడితే, అది వారిని మంచి నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది.
సవాలు 2: కౌమారంలో ఉన్నవారు నిర్ణయాలు తీసుకునే బాధ్యతను స్వీకరించడం ఆరంభిస్తారు.
కౌమారంలో ఉన్నవాడు నిర్ణయాలు ఎలా తీసుకోవాలో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు, తన కోసం నిర్ణయాలు తీసుకోగలనని భావిస్తాడు, కాని అతని తల్లిదండ్రులు, ఇతరులు తన ఎంపికలని పరిమితం చేస్తూ ఉంటారు. వారు అతని సామర్థ్యాలు గుర్తించట్లేదని భావించి వారి అధికారంపై తిరుగుబాటు చేస్తాడు. అతడు తిరుగుబాటు చేస్తే, తల్లిదండ్రులు సహజంగా అతడిని మరింత నియంత్రించడానికి ప్రయత్నిస్తారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసులోనే మంచి పునాది వేయాలి. దేవుని క్రమశిక్షణ మన మేలు కోసం ఉన్నట్లే (హెబ్రీయులకు 12:9-10), తల్లిదండ్రులు కూడా తాము విధించే నియమాలు వారి మేలు కోసమేనని తమ పిల్లలకు చూపించగలరు. తద్వారా, వారు కేవలం తమ సౌలభ్యం కోసమే నియమాలను పెట్టడం లేదని పిల్లలకు అర్థమవుతుంది.
రెండవదిగా, తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యదశలో, కౌమారదశలో పెద్ద పెద్ద, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యతను క్రమంగా అప్పగించవచ్చు. అప్పుడు వారు బాధ్యత తీసుకోవడం నేర్చుకుంటారు, వారి నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటారు, యుక్తవయసుకు సిద్ధపడతారు.
తల్లిదండ్రులు కౌమారంలో ఉన్న తమ పిల్లల విషయంలో పరిమితులు పెట్టడానికి దేవునికి ఇంకా బాధ్యులుగానే ఉన్నారు (1 తిమోతికి 3:4), అయితే కౌమారదశ, యుక్తవయస్సుకు సిద్ధపడే కాలం, అప్పుడు అతడు/ఆమె తాను తీసుకున్న నిర్ణయాల్ని బట్టి దేవునికి పూర్తిగా లెక్కఅప్పజెప్పవలసి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కౌమారంలో ఉన్న తమ పిల్లల్ని యుక్తవయసుకు సిద్ధపరచాలి. ఒక తండ్రి తన కుమారునితో తెలివైన నిర్ణయాలు తీసుకోవాలని వేడుకుంటూ సామెతలు రాశాడు. ఒక తండ్రిగా తాను తన కుమారుని కోసం నిర్ణయాలు తీసుకోలేడు కాని సరైన నిర్ణయాల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేయగలడని సొలొమోనుకు తెలుసు.
సవాలు 3: కౌమారంలో ఉన్నవారికి వయోజనులకు ఉన్న పరిణతి ఉండదు.
తల్లిదండ్రులు చింతించే ప్రమాదాలు, నష్టాలు కౌమారంలో ఉన్నవారు అర్థం చేసుకోలేకపోవచ్చు. సహజంగా కౌమారంలో ఉన్నవారు ప్రమాదాలు తప్పించుకుని లక్ష్యాలు సాధించగలరని అనుకుంటారు. తల్లిదండ్రులకు వారి సామర్థ్యాలు, వివేచన మీద నమ్మకంలేదని భావించి తరచు చిరాకుపడుతుంటారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది సరైనదో ఏది సరైనది కాదో చెప్పడమే కాకుండా లేక పరిమితులు పెట్టడమే కాకుండా, వారు చేసుకునే ప్రతి ఎంపిక ఫలితాలు గురించి వారితో మాట్లాడడం చాలా ముఖ్యమని సామెతలు గ్రంథం చూపిస్తుంది. ఈ సూచన ఆలకించినప్పుడు, అది అతడు మరింత పరిపక్వతతో ఆలోచించడానికి సహాయపడుతుంది.
► 1 పేతురు 5:5 కలిసి చదవండి.
ఒక యువకుడు చేయగల తెలివైన పని ఏంటంటే, దైవభక్తిగల తన తల్లిదండ్రుల అధికారానికి లోబడడం, వారి తెలివైన సలహాలు ఆలకించడం. 1 పేతురు 5:5 మాట్లాడుతున్నట్లుగా, ఇలా చేసే యువకులపై దేవుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది.
సవాలు 4: కౌమారంలో ఉన్నవాడికి యుక్తవయసువారిలో ఉండే కోరికలు ఉంటాయి కాని వారికున్న విశేషాధికారాలు ఉండవు.
వయోజనుల్లో వివాహం, ఆస్తి యాజమాన్యం, నాయకత్వ స్థానాలు, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వంటి అనేక విశేషాధికారాలు ఉంటాయి. కౌమారంలో ఉన్నవారికి ఇలాంటి సహజసిద్ధమైన కోరికలు ఉన్నప్పటికీ విశేషాధికారాలు ఉండవు గనుక నిరుత్సాహానికి గురౌతారు. వారి కోరికలు బలమైన శోధనలు రేకెత్తిస్తాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో 2 తిమోతికి 2:22 యువకులకు సహాయం చేస్తుంది.
► 2 తిమోతికి 2:22 కలిసి చదవండి.
తనకు విధేయత చూపడానికి ఇష్టపడే యువకుల పట్ల దేవుడు కృప చూపుతాడు. వారి నాయకులకు లోబడడానికి సహాయం చేస్తాడు, ఆయన సమయానికి లేక చిత్తానికి వెలుపలున్న సొంత కోరికలు నెరవేర్చుకోవడాన్ని తిరస్కరిస్తాడు. అవగాహన, ప్రవర్తన, మరియు జీవిత నైపుణ్యాల్లో ఎదగడం ద్వారా యుక్తవయస్సు కోసం సిద్ధపడడానికి ఈ కోరికలను ప్రేరణగా మార్చడానికి దేవుడు కౌమారంలో ఉన్న క్రైస్తవులకు సహాయం చేస్తాడు.
సవాలు 5: కౌమారంలో ఉన్నవాడు ఇతరులలోని అస్థిరతను చూసి, బాధపడతాడు.
చాలాసార్లు, కౌమారంలో ఉన్నవారు ఆదర్శంగా ఉండవలసిన, ఉత్తమ ఆత్మీయ నాయకులుగా ఉండవలసిన వారిని చూసి నిరాశ చెందుతారు. ఇలా జరిగినప్పుడు, కౌమారదశలో ఉన్నవారు అందరినీ అనుమానించుటకు శోధించబడతారు. ఈ కారణం చేత, సంఘ నాయకులుగా, తల్లిదండ్రులుగా మీరు స్థిరమైన భక్తిగల జీవితం గడపడం ఎంతో అవసరం. మీ జీవితంలో అస్థిరతల ఫలితంగా యువకులు తమ నిత్యత్వాన్ని నరకంలో గడుపుతారు. యేసు కౌమారంలో ఉన్నవారి గురించి కాకుండా పిల్లల గురించి మాట్లాడుతున్నప్పటికీ మత్తయి 18:6 వచనం ఇక్కడ ఖచ్చితంగా వర్తిస్తుంది.
► మత్తయి 18:6 కలిసి చదవండి.
క్రైస్తవ యువకుడు ఇతరులలో దైవభక్తిగల జీవితం చూడనప్పటికీ, అతడు దైవభక్తికి ఆదర్శంగా ఉండవచ్చు. పాత నిబంధన గ్రంథంలో, సమూయేలు దీనికి ఉదాహరణ. సమూయేలు అనేక విధాలుగా భక్తిహీనతతో, దుర్నీతితో నిండిన యాజక కుటుంబంలో పెరిగినప్పటికీ, చిన్ననాటి నుండే దేవుని కోసం జీవించాలని నిర్ణయించుకున్నాడు (1 సమూయేలు 1:20; 1 సమూయేలు 2:11-18, 22-26). చిన్నతనంలోనూ, కౌమారంలోనూ పరిశుద్ధమైన జీవితం జీవించాడు (1 సమూయేలు 3:19, 21).
► 1 తిమోతికి 4:12 కలిసి చదవండి.
సవాలు 6: కౌమారంలో ఉన్నవారు అనేక నిర్ణయాలని, అవకాశాల్ని ఉత్సాహంగా ఎదుర్కొంటారు.
కౌమారంలో ఉన్నవారు అవకాశాలతో నిండిన ప్రపంచాన్ని చూస్తారు. వారు తమ జీవితాలకు దిశను కనుగొనడానికి కష్టపడవచ్చు. వారు అనేకమంది నుండి విరుద్ధమైన సలహాలు పొందుకుంటారు.
అవకాశాన్ని వెంబడించడానికి అవసరమైనవాటిని ఎవరైనా ఇవ్వాలని అనుకుంటారు. కౌమారంలో ఉన్నవారు చిన్న చిన్న విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉంటూ, ఆయన సమయంలో మరిన్ని అవకాశాలు ఇస్తాడని నమ్మడం చాలా ముఖ్యం.
► లూకా 16:10 కలిసి చదవండి.
కౌమారంలో ఉన్నవారు దైవికమైన సలహా వినాలని నిర్ణయించుకోవడం కూడా ఎంతో ముఖ్యం.
► సామెతలు 11:14 కలిసి చదవండి.
దేవుని జ్ఞానమార్గాలు అనుసరించడంలో ఆశీర్వాదాలు, స్వేచ్ఛ ఉందని యువకులు కనుగొంటారు.
సమూహ చర్చ కోసం
► ఈ పాఠంలో ఏ ఆలోచనలు మీకు అత్యంత సహాయకరంగా ఉన్నాయి? అవి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సమాజాన్ని లేక సంఘాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
► ఒకవేళ మీరు కౌమారంలో ఉన్న కుమారుడు లేక కుమార్తెకు తల్లిదండ్రులుగా ఉంటే, ఈ సమయంలో మీ బిడ్డతో గౌరవప్రదమైన పారదర్శకమైన సంబంధం కలిగియుండడానికి మీరు ఎలాంటి సలహా ఇవ్వగలరు? మీ తప్పుల విషయంలో యధార్థంగా ఉండండి.
► మీ పిల్లలు తెలివిగా ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడడానికి ఎలాంటి ఆచరణాత్మక విషయాలు ఇవ్వగలరు?
► మీ పిల్లల బాధ్యతలు, హక్కులు ఎప్పుడు విస్తరింపజేయాలో తల్లిదండ్రులుగా మీకెలా తెలుస్తుంది?
► తల్లిదండ్రుల ప్రధాన బాధ్యతలు, కౌమారంలో పిల్లల ప్రధాన బాధ్యతలను క్లుప్తంగా చెప్పండి.
► ఒక తండ్రి, తన పిల్లలు ఎదుగుతుండగా ఎలాంటి విషయాల్లో వారిని ప్రోత్సహించాలి, జాగ్రత్త వహించాలి, మార్గనిర్దేశం చెయ్యాలి?
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
పిల్లల్ని పెంచే బాధ్యత మాపై ఉంచి, మమ్మును నమ్మినందుకు ధన్యవాదాలు. ఈ బాధ్యత అనేక విధాలుగా సంక్లిష్టమైంది, అందుకు నీ అవగాహన మాకు అవసరం.
నీ వాక్యంలో, మా పిల్లలకు జ్ఞానాన్ని, ఆశా-నిగ్రహాన్ని, విధేయతను నేర్పించే మా బాధ్యతను మేం చూశాం. మా పిల్లలతో మాకున్న సంబంధాల్లో ఈ విషయాల్లో మేము అనేకసార్లు విఫలమైనందుకు మమ్మును క్షమించండి.
మేము నీ వాక్యం చదివి, విధేయత చూపుతుండగా, మా పిల్లల అవసరాల్లో ప్రత్యేక జ్ఞానం మాకు ఇవ్వండి. వారు తమ జీవితకాలమంతా నమ్మకంగా నిన్ను అనుసరించాలనేది మా గొప్ప ఆకాంక్ష.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) మీ కుటుంబంలో లేక మీ ప్రభావ ఆధీనంలోఉన్న కౌమారదశలోని పిల్లల కోసం ప్రార్థించడానికి మీరు ఉపయోగించగల మూడు వచనాల్ని లేక వాక్యభాగాల్ని కనుగొనండి. ఈ క్రింది విషయాలకు సంబంధించిన లేఖన భాగాల కోసం చూడండి
వారి ఆత్మీయ అవసరతలు
వారి వ్యక్తిగత వికాసం
వారిని ప్రభావితం చేసే విషయాలు , ప్రజలు
వారు ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవసరమయ్యే మార్గాలు
ఈ వచనాలను తరచు మీరు చూడగలిగే చోట రాసుకోండి. ప్రతిరోజు మీ పిల్లల కోసం ప్రార్థించడానికి ఈ వచనాలు ఉపయోగించండి.
(2) పాఠం చివర్లో ఉండే చర్చా ప్రశ్నల్లో రెండింటిని ఎన్నుకోండి. వాటిని ఒక పేరా చొప్పున జవాబులు రాయండి.
(3) చదవడానికి ఒక లేఖన భాగం ఎంచుకోండి:
సామెతలు 4-5
సామెతలు 6
సామెతలు 23
సామెతలు 24
మీరు చదువుతుండగా, క్రింది వాటిని పరిగణలోకి తీసుకోండి. ఈ వాక్యభాగం నుండి...
కౌమారదశలో ఉన్నవారి తల్లిదండ్రులకు ఎలాంటి ప్రాధాన్యతలు ఉండాలి?
కౌమారదశలో ఉన్నవారికి ఎలాంటి ప్రాధాన్యతలు ఉండాలి?
కౌమారదశలో ఉన్నవారి తల్లిదండ్రులకు ఎలాంటి వైఖరులు ఉండాలి?
కౌమారంలో ఉన్నవారికి ఎలాంటి వైఖరులు ఉండాలి?
కౌమారదశలో ఉన్నవారి యొక్క తల్లిదండ్రులు ఏమి చేయాలి?
కౌమారంలో ఉన్నవాడు ఏం చెయ్యాలి?
తల్లిదండ్రులు మరియు కౌమారంలో ఉన్నవారు జీవితంలో ఏ విషయాలు గురించి మాట్లాడుకోవాలి?
కౌమారదశలో ఉన్నవారి తల్లిదండ్రులకు వాక్యభాగ సందేశాన్ని సంగ్రహిస్తూ ప్రకటనల జాబితా రాయండి. కౌమారదశలో ఉన్నవారికి వాక్యభాగ సందేశాన్ని సంగ్రహిస్తూ రెండవ ప్రకటనల జాబితా రాయండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.