క్రిస్టోఫర్ యునైటెడ్ స్టేట్స్లోని ఒక ఆసియా-అమెరికన్ కుటుంబంలో పెరిగాడు. అతను యుక్తవయస్సు నుంచే స్త్రీల పట్ల కాకుండా పురుషుల పట్ల ఆకర్షితుడయ్యాడు. అతని తల్లిదండ్రులు తమ కొడుకుకున్న ఈ ఆసక్తిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు, సిగ్గుపడ్డారు. యువకుడిగా అతను పురుషులతో అనేక సంబంధాలు పెట్టుకున్నాడు. అతను నిజమైన ప్రేమను, సమర్పణను కనుగొంటాడని ఆశించాడు, కానీ ప్రతి సంబంధం చివరికి విఫలమైంది. అతను నిర్లక్ష్యంగా చాలా మంది పురుషులతో అనైతిక సంబంధాలు పెట్టుకోవడం ప్రారంభించాడు. అతని తల్లి విశ్వాసిగా మారి, అతను ఇంతకు ముందెన్నడూ అనుభవించని ప్రేమను, అంగీకారాన్ని అతనికి చూపినప్పుడు క్రిస్టోఫర్ జీవితంలో అంతా మారడం ప్రారంభించింది. దేవుని స్వరూపంలో తాను ఒక వ్యక్తిగా ఉన్నాడని అతను గ్రహించడం మొదలుపెట్టాడు. అతను పశ్చాత్తాపపడి, తన జీవితంలోని అన్ని విషయాలను దేవునికి సమర్పించాడు. దేవునితో తన సంబంధంలో నెరవేర్పును, ఉద్దేశ్యాన్ని కనుగొన్నాడు.
పతనమైన మానవ స్వభావం, పాప కోరికలు
దేవుడు ఆదాము హవ్వను సృజించినప్పుడు, ఎటువంటి లోపం లేకుండా వారిని అన్ని కోణాల్లో పరిపూర్ణంగా చేశాడు (ఆదికాండము 1:31). వాళ్ల స్వభావం, ఏది సరైనదో ఏది మంచిదో దాన్నే కోరుకునేది. వారి మనసులు, శరీరాలు పరిపూర్ణంగా పనిచేసేవి. కాని ఆ తరువాత, ఆదాము దేవుని ఆజ్ఞలకు అవిధేయుడయ్యాడు. అతను అలా చేసినప్పుడు, మానవుని స్వభావం చెడిపోయింది (రోమా 8:20-23). మానవుల శరీరాలు, మనసులు ప్రభావితమయ్యాయి. ఆరోగ్యవంతుడు, జ్ఞానవంతుడు కూడా పాప ఫలితాలకు గురయ్యాడు. పరిపూర్ణంగా ఉన్నదానిని, పాపం శాశ్వతంగా నాశనం చేసింది. క్రీస్తు తిరిగి వచ్చే వరకు సృష్టిలో ఏది పరిపూర్ణ స్వస్థత పొందుకోలేదు (1 కొరింథీయులకు 15).
మానవుని స్వభావం, శరీరాలు నాశనానికి గురయ్యాయి గనుక, మన శరీర కోరికలు ఎప్పుడూ మంచిగా, సమతుల్యంగా ఉంటాయని మనం అనుకోకూడదు. వాస్తవం ఏంటంటే, మన కోరికలు సమతుల్యంగా ఉండట్లేదు. మనుష్యులు సహజంగానే చెడును కోరుకుంటున్నారు. యేసు, హృదయంలో నుండి వచ్చే పాపాల జాబితా గురించి మాట్లాడినప్పుడు, సహజ మానవుని పాప స్వభావాన్ని గమనించాడు (మార్కు 7:21-22).
ఈ పాఠంలో, మనం లైంగిక సమస్యలు గురించి మాట్లాడుతున్నాం. మానవుని కోరికలన్నిటిలో, లైంగిక కోరిక అత్యంత శక్తివంతమైనదిగా ఉండవచ్చు.
తప్పుడు లైంగిక కోరికలు, వాటిని కలిగి ఉన్న వ్యక్తికి సహజంగానే కనిపిస్తాయి. తన కోరికల్ని తీర్చుకుంటున్నందుకు తనను ఎవ్వరు తప్పుపట్టకూడదని భావిస్తాడు. అయితే, ప్రతి వ్యక్తి సరైంది చేయడానికి, తన స్వాభావిక కోరికలను ఎదురించాలి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పే స్వభావం ఉండొచ్చు, లేక దొంగతనం లేక హింసాత్మకంగా ఉండడం, సోమరితనం, లేక అసహనంగా ఉండే స్వభావం ఉండొచ్చు. లోపాలతో పుట్టడానికి ప్రజలు బాధ్యులు కారు కాని, సహజ కోరికల్ని అనుసరించి పాపం చేసినప్పుడు వాళ్లు దోషులౌతారు.
కొన్నిసార్లు చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురవ్వడంవల్ల లేక పరిసరాల పరిస్థితుల కారణంగా కొందరు స్వలింగ సంపర్క కోరికలతో లేక ఇతర తప్పుడు లైంగిక కోరికలతో బాధపడుతుంటారు. అయితే, తప్పుడు లైంగిక కోరికల్ని ఇతర పాప కోరికలకు భిన్నంగా చూడకూడదు. కారణం ఏదైనప్పటికీ, ఆ వ్యక్తి విమోచించబడాలంటే, దేవుని నుండి శుద్ధీకరణపొందాలంటే అదే కృప అవసరమౌతుంది.
తప్పుడు కోరికలు కొంతమందికి తప్పుగా అనిపించవనే వాస్తవాన్ని బట్టి మనం ఆశ్చర్యపోకూడదు. పాప కోరికలుగల వ్యక్తికి పాపం సాధారణంగా, సహజంగా అనిపిస్తుంది.
మనం స్వభావసిద్ధంగా దైవ ఉగ్రతకు పాత్రులమయ్యాం (ఎఫెసీయులకు 2:3). అంటే, మనం స్వాభావికంగా పాపానికి మొగ్గుచూపుతాం, మరియు స్వాభావికంగా పాపం చేయడం ద్వారా మనల్ని మనం శిక్షావిధిలోకి తెచ్చుకుంటున్నాం. ఒక వ్యక్తి పాపస్వభావంతో పుట్టాడంటే, అది అతనికి సహజంగా అనిపించినప్పటికీ అతడు దానిని అనుసరించాలని కాదు దీని అర్థం.
► మనం మన స్వాభావిక కోరికలన్నిటికి ఎందుకు లోబడకూడదు?
మనం క్రీస్తుతో సారూప్యంగలవారగుటకు పిలువబడ్డామని బైబిలు బోధిస్తుంది (రోమా 8:29). మనం ప్రభువైన యేసుక్రీస్తును ధరించాలి. మన శరీరేచ్ఛలు జీవనాధారం కాకూడదు. బదులుగా, తప్పుడు ప్రేరణల్ని దేవుని అధికారానికి అప్పగించాలి (రోమా 13:14).
► మన తప్పుడు ప్రేరణల్ని దేవుని అధికారానికి లోబరచడం ఎలా ఉంటుంది?
మీ లైంగిక కోరికల్ని, దేవుని స్వరూపాన్ని ప్రతిబింబిస్తూ ఆయన్ను మహిమపరచాలనే మీ అంతిమ ఉద్దేశ్యానికి లోబరచాలి. క్రీస్తును అనుసరించే జీవితం, మీకున్న దేవుని స్వరూపానికి అనుగుణంగా ఉండే జీవితంతో సమానం.
మానవుని గుర్తింపు
మానవుని గుర్తింపును గురించి సరైన అవగాహన
అనేకమంది వారి మానవ స్వభావం తమను మంచి మార్గంలో నడిపిస్తుందని తప్పుగా భావిస్తారు. వ్యక్తిగత స్వభావంవల్ల కలిగే కోరికలు వాళ్లని తృప్తిపరుస్తాయని భావించడం వాళ్లకు సరైందిగా అనిపిస్తుంది. వాళ్ళ స్వభావం పాపం వల్ల నాశనమైందని, అందుకే దాన్ని నమ్ముకోకూడదనే వాస్తవాన్ని గ్రహించరు. ఒక వ్యక్తి స్వాభావిక కోరికలు అతన్ని తృప్తిపరచలేవు ఎందుకంటే అవి వికృతమైనవి. దేవునికి వేరుగా, మానవుని స్వాభావిక కోరికలు సరైన నైతికతలోకి నడిపించలేవు.
ప్రజలు వారి జీవితంలో సొంత ఉద్దేశ్యాన్ని సృష్టించుకోవడానికి సొంత కోరికల్ని, భావాల్ని అనుసరించాలనే నమ్మకంతో జీవిస్తున్నారు. వారు ఏ అధికారానికి లేక నైతిక ప్రమాణాలకు లోబడకుండా సొంత గుర్తింపును సృష్టించుకోవడం చాలా ముఖ్యమని అనుకుంటారు. వ్యక్తులు ఏది మంచిదో, ఏది విలువైందో వారే నిర్ణయించుకోవాలనుకుంటారు. మంచి మార్గంలో నడిపించబడ్డానికి సొంత ఆలోచనలను నమ్ముకుంటారు. వారు తమ ప్రవర్తనను పరిమితం చేసే సంస్థల్ని లేక నియమాల్ని ఇష్టపడరు. చెడిపోయిన మానవ స్వభావం దేవుని వాక్యానికి బదులుగా నైతికతకు ప్రమాణంగా మారిపోతుంది.
లైంగికత మానవ స్వభావంలో శక్తివంతమైంది గనుక, చాలామంది లైంగిక కోరికలను వారి గుర్తింపుకు కేంద్రమని భావిస్తారు. వాళ్లు వాళ్లుగా ఉండాలంటే లైంగిక కోరికల్ని అనుసరించాలని అనుకుంటారు. ప్రజలు లైంగికత అంటే వాళ్లకు ఏది కావాలో లేక వాళ్లు ఏం చేస్తున్నారో అనేది కాదు, అది వాళ్ల గుర్తింపని భావిస్తారు. దానిని వారి గుర్తింపుగా చేసుకుంటారు.
లోక ఆలోచనకు భిన్నంగా, మనం దేవుని స్వరూపంలో సృజించబడ్డామని, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఉద్దేశించబడ్డామని బైబిలు మాట్లాడుతుంది. మానవులుగా ఇదే మన నిజమైన గుర్తింపు.
ఈ లోకంలో ఏది కూడా మనకు నిజమైన గుర్తింపు ఇవ్వదు. ఈ లోకంలో ప్రస్తుతం మనకున్న లక్షణాలు కేవలం మన పరిస్థితులు మాత్రమే. అవి మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేవు. మన జాతి, సామాజిక హోదా, లేక ఆర్ధిక స్థాయి మన గుర్తింపు కాదు, అవి కేవలం మన పరిస్థితులు మాత్రమే. ఒక వ్యక్తి వైద్యుడు కావచ్చు, సినీ నటుడు కావచ్చు లేక దేశ నాయకుడు కావచ్చు, కాని అతడు దేవుని యెదుట దేవుని స్వరూపంలో సృజించబడిన దేవుని సృష్టి మాత్రమే, ఈ గుర్తింపే చాలా ముఖ్యమైంది.
మన లైంగికత మన జీవిత పరిస్థితిలో ఒక ముఖ్య భాగం. మనకు లైంగిక కోరికలు, ఆశలు, నిరాశలు ఉంటాయి. కాని అవి మన గుర్తింపు కాదు; అవి కేవలం మన పరిస్థితిలో ఒక భాగమే.
ఆదాము చేసిన పాపం మానవాళిని దేవునికి దూరం చేసింది కాబట్టి మనం పాప స్వభావంతో పుట్టాం (రోమా 5:18). అయితే మన పాప స్వభావం కూడా మన గుర్తింపు కాదు; అది మన పరిస్థితి, మరియు ఆ పరిస్థితి దేవుని కృప, శక్తి ద్వారా మారగలదు (రోమా 5:19).
► ఒక వ్యక్తి గుర్తింపుకు, అతని స్థితికి మధ్య వ్యత్యాసం ఏంటి?
మానవుని గుర్తింపు మరియు వ్యక్తిగత నైతికత
గుర్తింపు అనేది ముఖ్యం ఎందుకంటే ఒక వ్యక్తి తన నైతికతను తన గుర్తింపుపై ఆధారం చేసుకుంటాడు. నైతికత అంటే ఒకరి ప్రవర్తనను తప్పు లేక ఒప్పుగా చూపించే నియమాలు. ఒక వ్యక్తి లైంగికతనే గుర్తింపుగా భావిస్తే, అతని లైంగిక కోరికల్ని అనుసరించడం సరైనదే అని అనుకుంటాడు.
కొన్నిసార్లు ఒక వ్యక్తి “నేను ఇలా పుట్టాను; నేను ఇలా చేయడం సహజం; కాబట్టి, ఇది నాకు తప్పు కాదు” అని చెబుతుంటారు. అయితే మనందరం పాప స్వభావంతో పుట్టామని బైబిలు బోధిస్తుంది (రోమా 5:12, ఎఫెసీయులకు 2:3). మనకు సహజంగా అనిపించినంత మాత్రాన మన పాప స్వభావాన్ని అనుసరించడం సరైనది కాదు.
మన పాప స్వభావం మన నిజమైన వ్యక్తిత్వం కాదు. మన పాప స్వభావం మన స్థితి మాత్రమే. మన లైంగికత కూడా మన గుర్తింపు కాదు. మనం దేవుని స్వరూపంలో చేయబడడమే మన గుర్తింపు. మనం ఈ సత్యాన్ని ఒప్పుకున్నప్పుడు, ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించువాడు దేవుడేనని, మనం ఆయనకు లెక్క అప్పజెప్పవలసినవారమని గ్రహిస్తాం. మన నిజమైన గుర్తింపు, పరిశుద్ధ ప్రవర్తన గురించిన సరైన ప్రామాణికతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
► ఒక వ్యక్తికి తన గుర్తింపుపై ఉన్నటువంటి అవగాహన, తన నైతికతపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
లింగం (జెండర్) గురించి సరిగా అర్థం చేసుకోవడం
మనుష్యులు, చాలా జంతువులు, ఆడు-మగవిగా విభజించబడ్డాయని మనందరికీ తెలుసు. దేవుడు కూడా పురుషుడు లేక స్త్రీ అని మనం అనుకోవచ్చు, కాని అది తప్పు. దేవుడు లింగ భేదానికి అతీతుడు, స్త్రీ పురుషులు ఉనికిలోనికి రాకముందే ఆయన ఉన్నాడు. స్త్రీ పురుషులు ఇద్దరినీ దేవుడు తన స్వరూపంలో సృజించాడు (ఆదికాండము 1:27). స్త్రీ పురుషులు ఇరువురూ దేవుని స్వరూపానికి ప్రతిరూపాలు.
దేవుని స్వరూపం, మానవుని స్వభావంలో చేర్చబడిన ఒక భాగం మాత్రమే కాదు. దేవుని స్వరూపం అంటే, ప్రేమించే సామర్థ్యం, అందాన్ని ప్రశంసించడం, తప్పొప్పులను తెలుసుకునే శక్తి వంటి లక్షణాలు మాత్రమే కాదు. మానవుని స్వభావం అంతా కూడా దేవుని ప్రతిబింబమే. దేవుని స్వరూపమే మన అసలైన ఉనికికి సారం. మనం ప్రధానంగా దేవుని స్వరూపంలో సృజించబడినవారం. మానవుని పరిస్థితిలో ఏది కూడా ప్రాధమిక గుర్తింపు అవ్వకూడదు లేక మన నైతికతకు ఆధారమవ్వకూడదు.
దేవుడు స్త్రీలుగా పురుషులుగా సృష్టించడం, వాళ్ళు దేవుని స్వరూపాన్ని ఎలా వ్యక్తపరచాలన్న దేవుని ప్రణాళికలో భాగం. కొందరు దేవుడు వారికిచ్చిన లింగాన్ని తిరస్కరిస్తారు. వ్యతిరేక లింగంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. కొందరైతే శస్త్ర చికిత్సల ద్వారా వారి శరీర ఆకారాన్నే మార్చుకుంటారు. ఇలా చేయడం, దేవుని సృష్టిని నాశనం చేయడమే అవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి తన శరీర ఆకారాన్ని మార్చుకున్నంత మాత్రాన లింగాన్ని మార్చలేడు. ప్రతి వ్యక్తి, కేవలం శారీరకంగానే కాకుండా స్వభావమంతటిలో స్త్రీ లేక పురుషుడుగానే ఉంటాడు. దేవుడు మనకిచ్చిన లింగంలో కూడా ఆయన స్వరూపాన్ని ప్రతిబింబిస్తూ, ఆయనకు మహిమ తీసుకురావాలని కోరుతున్నాడు.
దేవుని నైతిక ప్రమాణం
► ఒక విద్యార్థి తరగతి కోసం హెబ్రీయులకు 13:4 చదవాలి.
వివాహాన్ని ఘనంగా ఎంచాలని ఈ వచనం చెబుతుంది. లైంగిక పాపం అంటే వివాహాన్ని అగౌరవపరచడమే. దేవుడు జారత్వానికి తీర్పుతీర్చుతాడు.
► ఒక విద్యార్థి తరగతి కోసం 1 కొరింథీయులకు 6:18 చదవాలి.
లైంగిక పాపాల్లో, కామపు కల్పనలు, జారత్వం, వ్యభిచారం, వరుసకాని వారితో లైంగిక సంబంధం, మానభంగం, పిల్లలపై లైంగిక వేధింపులు, స్వలింగ సంపర్క కార్యకలాపాలు, అశ్లీలత భాగం.
కామపు కల్పనలు: జీవిత భాగస్వామి కాకుండా మరొకరితో లైంగిక చర్య గురించి ఊహించడం.
జారత్వం: వివాహం కానివారి మధ్య లైంగిక చర్య.
వ్యభిచారం: వివాహమైన మరొక వ్యక్తితో లైంగిక చర్య.
వరుసకాని వారితో లైంగిక సంబంధం: మీ జీవితభాగస్వామితో కాకుండా సన్నిహిత బంధువుతో లైంగిక చర్య.
లైంగిక దాడి / మానభంగం: లైంగిక వేధింపులు, ఇష్టం లేకుండా ఒక వ్యక్తిని లైంగిక చర్యకు బలవంతం చేయడం.
పిల్లలపై లైంగిక వేధింపులు: లైంగిక సంబంధమైన నిర్ణయాలు తీసుకునే వయసులేనివారితో లేక లైంగిక కోరికలతో సరిగా వ్యవహరించలేనివారితో (బాలుడు లేక బాలికతో) లైంగిక చర్య.
స్వలింగ సంపర్క చర్య: ఒకే లింగం వారి మధ్య లైంగిక చర్య.
అశ్లీలత: నగ్నత లేక లైంగిక చర్యలకు కారణమయ్యేలా రూపించబడిన పుస్తకాలు, చిత్రాలు, లేక వీడియోలు.
ఇవన్నీ కూడా వివాహ బంధం యొక్క ఉల్లంఘనలే.
గుర్తించుకోండి- శరీరంలో మనల్ని ప్రలోభపెట్టే ప్రతి కోరిక, దేవుడు ఉత్తమంగా తీర్చగల అవసరతను నాశనం చేయడమే అవుతుంది. వివాహ బంధమే, దైవికమైన లైంగిక చర్యకు ఉన్న ఏకైక సందర్భం. అక్రమ లైంగిక సంబంధం...... తక్షణమే తీపిగా ఉంటుంది, కానీ మన ఆధ్యాత్మిక ఆకలికి విషంలా మారి, చివరికి మనల్ని నాశనం చేసే వాటిని కోరుకునేలా చేస్తుంది. అక్రమ లైంగిక చర్య మన పరిశుద్ధతను, నీతిని, మన జీవితాల్లో దేవుని సన్నిధిని దూరం చేస్తుంది.[1]
లైంగిక అనైతికత ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది, మరణానికి నడిపిస్తుందని సామెతలు గ్రంథంలో అనేకచోట్ల హెచ్చరించబడింది (ఉదాహరణకు, సామెతలు 2:16-19 మరియు సామెతలు 6:24-29, 32-33).
రాబర్ట్సన్ మెక్క్విల్కిన్ ఇలా రాశాడు,
[మానవుని లైంగిక చర్యపట్ల దేవుని ఉద్దేశాలు] చర్యలో పాల్గొన్నప్పుడు ఎంతగా ఉల్లంఘించబడతాయో, మనసులో తప్పుగా ఆలోచించినప్పుడు కూడా అంటే ఉల్లంఘించబడతాయి. ఆయన కేవలం స్త్రీ పురుషులను యేర్పరచడమే కాదు; వైవాహిక బంధంలో నిత్యం వారిద్దరూ ఒకరికొకరు సన్నిహితంగా ఉండేటట్లు, వారి ఏకత్వం దేవుని స్వభావాన్ని ప్రతిబించే విధంగా చేశాడు. ఈ ఉన్నతమైన ఉద్దేశ్యం నెరవేర్చబడాలంటే, సన్నిహిత సంబంధం ప్రత్యేకమైందిగా (భార్యభర్తల మధ్య మాత్రమే), వారి సమర్పణ శాశ్వతమైందిగా ఉండాలి లేకపోతే నిజమైన ఏకత్వం ఉండదు. నమ్మకత్వం అనేది ముఖ్యంగా మనసులో మొదలౌతుంది. ప్రత్యేకమైన సన్నిహిత సంబంధం, శాశ్వతకాల సమర్పణ, పరస్పర నమ్మకం మొదటిగా మనసులో ఉల్లంఘించబడతాయి.[2]
► విద్యార్థులు తరగతి కోసం 1 కొరింథీయులకు 6:9-11, 15-20 మరియు మత్తయి 5:27-30 చదవాలి.
ప్రతి సమాజానికి స్త్రీ, పురుషుల మధ్య సంబంధాల విషయంలో కొన్ని సాంస్కృతిక దృక్పథాలు ఉంటాయి. ఈ సాంస్కృతిక దృక్పథాలు బైబిల్ నైతిక ప్రమాణాల కంటే తక్కువ ప్రమాణాలను కలిగి ఉంటాయి. చాలా సంస్కృతులలో, ఒక క్రమబద్ధమైన సమాజాన్ని నిర్వహించడానికి అవసరమైన నియమాలు మాత్రమే ఉంటాయి. చెడు పరిణామాలు లేదా అపవాదు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటే లైంగిక పాపాన్ని కూడా అవి సహిస్తాయి. అయితే బైబిల్ చెప్పే నైతిక ప్రమాణం భిన్నంగా ఉంటుంది.
విచారకరంగా, కొన్ని సంఘాల్లో బైబిలు బోధించే నైతిక ప్రమాణాలు కాకుండా తమ సంస్కృతి అందించే ప్రమాణాలను ఎక్కువగా పాటిస్తున్నారు. నిర్లక్ష్య వైఖరితో, బహిరంగంగా పాపం చేసేవారిని శిక్షిస్తూ, రహస్యంగా అదే పాపం చేస్తూ బయటపడని వారిని లేక వాటి ద్వారా వచ్చే ఫలితాల్ని దాచేవారిని సహిస్తున్నారు.
ఈ విధమైన పాపాలు చేసే వారు, విశ్వాసులు కారని, వారు పరలోకం చేరరని ఈ వచనాలు బోధిస్తున్నాయి. కొరింథీయులకు సంఘంలో కొందరు గతంలో ఈవిధమైన పాపాలు చేశారు, కాని వాటి నుండి రక్షించబడ్డారు.
విశ్వాసియైన వాడు ఈ పాపాలు చేయవచ్చని అనుమతించే ఏ సిద్ధాంతమైనా అది తప్పుడు బోధే అవుతుంది. ఒకడు క్రీస్తు అనుచరుడ్ని అని చెప్పుకుంటూ లైంగిక పాపం చేస్తే, లేఖనం ప్రకారం అతన్ని సంఘంలో నుండి వెలివేసి, విశ్వాసిగానే పరిగణించకూడదు (1 కొరింథీయులకు 5:11-13).
సంఘ నాయకులు మంచి ప్రవర్తనకు ఆదర్శంగా ఉండాలి. ఎప్పుడైతే సంఘం ఆరాధన నడిపించే నాయకుల అసభ్యకరమైన వస్త్రధారణను లేదా కామాతురమైన నృత్య ప్రదర్శనల్ని అనుమతిస్తుందో, అది అక్రమ లైంగిక కోరికలు సహజమని చెప్పినట్లే అవుతుంది. లైంగిక పాపం అంత తీవ్రమైంది కాదని చెప్పినట్లే అవుతుంది.
సమాజంలో ఉన్నటువంటి వస్త్రధారణ ప్రకారం, ఎవరైనా శరీర భాగాల్ని కనుపరుస్తూ లైంగిక ఆకర్షణ కలిగించే విధంగా వస్త్రాలు ధరించనప్పుడు, ఆ వ్యక్తి వస్త్రధారణ సరిగా లేదని భావించవచ్చు. కొన్నిసార్లు సంఘ విశ్వాసులు కొన్నిసార్లు, మరి ముఖ్యంగా ప్రత్యేక వేడుకల సమయాల్లో ఈ తప్పుడు ధోరణికి గురైపోతారు. వారు సమాజ వస్త్రధారణ విధానాన్ని అనుసరించకపోతే మంచిగా దుస్తులు ధరించనట్లుగా భావిస్తారు. ఇలాంటి అభిప్రాయం తప్పని సంఘం ఖచ్చితంగా బోధించాలి. ఒక విశ్వాసి ఇతరుల్లో తప్పుడు కోరికలను కలిగించకూడదు. 1 తిమోతికి 2:9-10 ప్రకారం, విశ్వాసుల వస్త్రధారణ ఎలా ఉండాలంటే, ఎవరైనా వాళ్లని చూసినప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా జీవిస్తున్నారు, పాపానికి చోటివ్వట్లేదు లేక ఇతరులని పాపానికి గురిచేయట్లేదని భావించాలి.
[1]Gary Thomas, Sacred Marriage (Grand Rapids, MI: Zondervan, 2000), 210.
[2]Robertson McQuilkin, An Introduction to Biblical Ethics, 2nd ed. (Wheaton, IL: Tyndale House Publishers, Inc., 1995), 216.
అశ్లీల చిత్రాలు
అశ్లీలత అంటే శరీరాన్ని నగ్నంగా చూపిస్తూ లేక లైంగిక చర్యను చూపిస్తూ ఎదుటివారిలో లైంగిక భావాలు కలిగించేందుకు రూపించబడిన సాహిత్యాలు, చిత్రాలు, లేకా వీడియోలు.
ఇంటర్నెట్ అశ్లీలతను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోనికి తీసుకొచ్చింది. అనేకమంది పాత కాలపు పాస్టర్లు, నాయకులు ఇలాంటి శోధనలకు గురికాలేదు ఎందుకంటే వారు యౌవ్వనంలో ఉండగా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదు. అందుకే ఈ తరం యువత ఎదుర్కొంటున్న సంగతులు వాళ్లకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అయితే, వినోదాల్ని ఎంపిక చేసుకునే విషయంలో బైబిలు సూత్రాల్ని అన్వయించుకోవాలని ప్రజలకు బోధించాలి.
అశ్లీలత చెడ్డది, ఎందుకంటే ఇది ఒక వ్యక్తిలో జారత్వం, వ్యభిచారం, అనేకరకాలైన అక్రమ లైంగిక చర్యల గురించి ఆలోచింపజేస్తుంది. ఇది పాప కోరికలుగల వ్యక్తిని ఆకర్షిస్తుంది. దేవుడు ఖండించే అక్రమ చర్యల్లో పాలుపొందేలా చేస్తుంది. ఇలాంటి వాటి గురించి ఊహించడం పాపమని యేసు చెప్పాడు (మత్తయి 5:28).
అశ్లీలత చెడ్డది ఎందుకంటే అది మనుష్యుల్ని, వాళ్ల మధ్య ఉన్న సంబంధాల విలువను పొగొడుతుంది. ఇది లైంగిక చర్యను ఒక స్వార్థపూరితమైనదిగా మార్చేస్తుంది. ఇది మానవుల్ని, దేవుని స్వరూపంలో చేయబడినవారిగా, ఆరోగ్యకరమైన బంధాల కోసం ఏర్పాటు చేయబడినవారిగా చూడకుండా, వ్యక్తిగత సంతోషం కోసం వాడుకునే వస్తువుల్లా చూస్తుంది.
అశ్లీలత ఒక వ్యసనం. అశ్లీలత, అన్ని పాపాలవలే బానిసలను చేస్తుంది (యోహాను 8:24, 2 పేతురు 2:19). అశ్లీలతను చూసే వ్యక్తికి, అది అవసరమని, అది లేకుండా జీవించడం అతనికి అసాధ్యమని అనిపిస్తుంది. అతనికి అశ్లీలత ద్వారా లభించే ఆ ఊహలు లేకపోతే జీవితం వెలితిగా, ఆసక్తి లేకుండా అనిపిస్తుంది. ఇతర వ్యసనాల్లా, కోరిక దహించివేస్తుంది, కాబట్టి అప్పుడు అతడు తన జీవితంలోని మంచి విషయాలను త్యాగం చేయడం మొదలుపెడతాడు.
అశ్లీలత క్రమంగా పెరుగుతుంది. అశ్లీలతకు గురైనవాడు క్రమేపీ మరింత అసభ్యకరమైన, వికృత విషయాలు చూడడానికి ఇష్టపడతాడు. గతంలో అతడు అసహ్యంగా భావించిన లేక భయపడినవాటిని బట్టి ఇప్పుడు ఊహాగానాల్లో విహరిస్తూ ఆనందించడం ప్రారంభిస్తాడు.
అశ్లీలత హానికరం. అశ్లీలతలో మునిగిపోయినవాడికి ఆరోగ్యకరమైన బంధాలు ఆనందంగా అనిపించవు. అతని కోరికలు అసహజంగా ఉంటాయి గనుక అవి ఎన్నడు తృప్తిపరచవు. ఇతరుల బాధలు పట్టించుకోడు అలాగే తన అనందం కోసం ఇతరులు బాధపడినా ఇష్టపడతాడు. [1]
అశ్లీలత యొక్క కొన్ని ప్రభావాలు
అశ్లీలతలో చిత్రీకరించబడిన చర్యల్ని ఊహించడంవల్ల, స్వయంగా వారే ఆ చర్యల్ని జరిగిస్తున్నారన్నట్లుగా వీక్షకుల మనసులు, శరీరాలు ప్రభావితమౌతాయి.
అశ్లీలత వాస్తవ విరుద్ధమైన పరిస్థితుల్ని కలిగిస్తుంది, ఇవి సాధారణ లైంగిక సంపర్కంలో కలిగే ఆనంద స్పందన కంటే మెదడులో మరింత బలమైన ఆనంద స్పందనను కలిగిస్తాయి.[2] మెదడు, ఈ అసహజమైన అధిక సంతోష రసాయనాలకు అలవాటుపడుతుంది. దీనివల్ల, మెదడు ఎల్లప్పుడు మరింత ఎక్కువగా అశ్లీల చిత్రాలను కోరుతుంది, విపరీతంగా అసభ్యకరమైన చిత్రాలను కోరుతుంది తద్వారా వీక్షకులు మరింత సంతృప్తిపడతారు. మెదడులో కలిగే రసాయనాల మార్పులవలన ఒక వ్యక్తి చివరికి, సహజమైన నిజజీవిత లైంగిక అనుభూతిని పొందలేకపోవచ్చు లేక ఆస్వాదించలేకపోవచ్చు. మెదడులో, ఆనందాన్ని కలిగించే రసాయనం ఎక్కువగా ఉండడంవల్ల నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే భాగం కూడా దెబ్బతింటుంది.
దేవుడు లైంగిక అనుభవాలను బంధాల్ని బలపరచడానికి రూపొందించాడు. లైంగిక సంపర్క సమయంలో మెదడులో విడుదలయ్యే హార్మోన్, భావోద్వేగంగా భాగస్వాముల్ని కలుపుతుంది, వాళ్ల బంధాన్ని బలపరుస్తుంది. ఇది వివాహ వ్యవస్థలో అద్భుతమైన బహుమానం. అయితే, అశ్లీల చిత్రాలను చూసేవారికి అశ్లీల చిత్రాలతోనే భావోద్వేగ బంధం ఏర్పడుతుంది.
అశ్లీల చిత్రాలు చూడడం వలన కలిగే అపరాధం, అవమానం ప్రజల్ని ఒంటరివారిగా చేస్తుంది, ఆరోగ్యకరమైన సంబంధాల్లో ఇతరులతో కలవకుండా చేస్తుంది. వివాహ బంధంలో నమ్మకాన్ని కూడా ఇది నాశనం చేస్తుంది.
అది మెదడులో రసాయన సమతుల్యతను మార్చేస్తుంది గనుక, అశ్లీలత వీక్షకుణ్ణి మానసికంగా కృంగదీయవచ్చు.
అశ్లీల చిత్రాల్లో చిత్రీకరించబడిన దృశ్యాలు కొన్నిసార్లు నిజ-జీవిత లైంగిక సంబంధాల్లో హింసకు, వేధింపులకు నడిపిస్తాయి.
అశ్లీలతవలన కలిగే ప్రమాదాలను గురించి పాస్టర్లు, తల్లిదండ్రులు యౌవనులను హెచ్చరించాలి. పిల్లలకు శోధనను జయించే పరిపక్వత లేనప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంటర్నెట్ సదుపాయం కలిగించకూడదు. అశ్లీల చిత్రాలు చూడాలనే శోధనతో పోరాడుతున్నవారు ఎల్లప్పుడు దైవికమైన వ్యక్తికి లేక నమ్మకమైన వ్యక్తికి వారి విజయాలు లేదా వైఫల్యాలను నివేదిక ఇస్తూ ఉండాలి. పరిణతి చెందిన విశ్వాసితో తరచుగా పరిశీలించుకున్నప్పుడు, శోధనలో పోరాడుతున్న వ్యక్తి పరిశుద్ధతకు కట్టుబడి ఉంటాడు, నిదానంగా విజయం సాధిస్తాడు.
► అశ్లీలత అనే వ్యసనం నుండి ప్రజల్ని కాపాడడానికి మీరు ఏ విధమైన పద్ధతుల్ని సిఫార్సు చేయాలి? సంఘం ఎలా సహాయపడుతుంది?
“సాతానుడు మీ లైంగిక తృప్తిని ‘దొంగతనం, హత్య, నాశనం” (యోహాను 10:10) చేయడానికి చూస్తాడు, మరియు వాడు ఉపయోగించే సాధనం అశ్లీలత. అశ్లీలత లైంగిక తృప్తిని ఇస్తుందని చెబుతుంది కాని ఆస్వాదించే మీ సామర్థ్యాన్ని తొలగిస్తుంది.”
- The Freedom Fight
[2]ఈ పేరాగ్రాఫ్లోని సమాచారం మరియు తర్వాతి నాలుగు పేరాగ్రాఫ్లలోని సమాచారం మొత్తం https://thefreedomfight.org నుండి స్వీకరించబడింది. అశ్లీలత బానిసత్వం నుండి విముక్తి పొందాలనుకునే వారికి సిఫార్సు చేయబడిన బైబిల్-ఆధారిత వనరుగా ఇది ఉపయోగకరమైంది.
పిల్లలపై అత్యాచారం / లైంగిక దాడులు
పిల్లలపై అత్యాచారం అంటే పిల్లలతో లైంగిక చర్యలో పాల్గొనడం. ఇది లైంగికతకు సంబంధించిన వికృత చర్య. అనేక కారణాలవల్ల ఇది చాలా చెడ్డది, ఆ కారణాలు ఏవనగా:
నిబంధన వివాహంలో లైంగిక సంబంధం పట్ల దేవుడు కలిగియున్న మంచి ఉద్దేశ్యాల్ని ఇది ధిక్కరిస్తుంది (హెబ్రీయులకు 13:4).
ఇది పిల్లల అమాయకత్వాన్ని దొంగిలిస్తుంది- పిల్లలకు తెలియకూడని విషయాలపై అనుభవం ఏర్పడుతోంది.
పిల్లల కన్యత్వాన్ని దోచుకుంటుంది (1 స్సలొనీకయులకు 4:3-7).
పిల్లవాడికి ఇది తప్పుడు అపరాధ భావనను కలుగజేస్తుంది; పిల్లవాడు తప్పుడు చర్యలో ఉంటాడు కాని నిజమైన నిర్ణయం తీసుకోలేడు లేక తీసుకోవడానికి అనుమతించబడడు.
ఇది లైంగికతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు పిల్లవాడికి తగిన పరిణతి ఉండనప్పటికీ నిర్ణయాలు తీసుకోవడానికి కారణమౌతుంది.
ఇది పిల్లలకు అపవిత్రంగా లేక విలువలేకుండా ఉన్నామనే భావన కలిగించి, భవిష్యత్తులో అనైతికమైన ప్రవర్తన ఎంచుకునే అవకాశాన్ని కలిగిస్తుంది (మత్తయి 18:6).
ఇది పిల్లలకు భవిష్యత్తులో, వక్రమార్గంలో లేక వేధింపుల చర్యల్లో పాల్గొనే శోధనను పెంచుతుంది.
ఇది బలహీనంగా ఉన్నవారిని లేక తమనుతాము రక్షించుకోలేని వారిని పాడుచేస్తుంది.
ఇది గొప్ప విలువతో దేవుని స్వరూపంలో సృజించబడినవారిని గాయపరుస్తుంది (ఆదికాండము 1:27).
కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య కూడా పిల్లలపై అత్యాచారం జరుగుతుంది. వాళ్లు నమ్మకంగా కనిపిస్తారు కాబట్టి ఇలాంటి దానిని ఎవరు అనుమానించకపోవచ్చు, మరియు పిల్లలు జరిగిన విషయాన్ని ఎవరికైనా చెప్పడానికి భయపడవచ్చు.
లైంగిక దాడి అనేది ఇష్టం లేకుండా ఒక వ్యక్తిని (పిల్లలైనా లేక పెద్దలైనా) లైంగిక చర్యలో పాల్గొనమని బలవంతం చేయడం. పిల్లలపై అత్యాచారం ఎలాగైతే అనేక కారణాలవల్ల చెడ్డదిగా ఉందో అవే కారణాలవల్ల లైంగిక దాడి కూడా చెడ్డదే (ద్వితీయోపదేశకాండము 22:25-27).
లైంగిక వేధింపులకు మరో రూపం సెక్స్ ట్రాఫికింగ్ (sex trafficking). ప్రపంచమంతటా, అపరిచితులు పిల్లల్ని, యౌవనుల్ని దొంగిలిస్తున్నారు లేక కుటుంబ సభ్యులే అమ్మేస్తున్నారు, వాళ్లని వ్యభిచారం కోసం అలాగే అశ్లీల చిత్రాల కోసం వాడుతున్నారు. పేద కుటుంబాలకు డబ్బు అవసరం గనుక ఈ చెడు వ్యాపారం నుండి తమ పిల్లల్ని కాపాడలేకపోతున్నారు. ఎవరో లాభం పొందుకుంటారు, కాని పిల్లలు కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా, భావోద్వేగపరంగా కూడా బాగా దెబ్బ తింటున్నారు. ఇది పేదలను, బలహీనుల్ని అణచివేయడం, బాధించడం. దేవుడు దీనికి తీర్పుతీర్చుతాడు (సామెతలు 14:31).
పిల్లల విషయంలో చేసే ఈ పాపాలు దేవుని హృదయాన్ని గాయపరుస్తాయి (మత్తయి 18:10-14, కీర్తన 146:7-9). ఈ పాపాలు చేసేవారు శిక్ష నుండి తప్పించుకోలేరు (1 స్సలొనీకయులకు 4:6, యెహెజ్కేలు 7:8-9). విశ్వాసులు దేవుని ప్రేమ, కనికరాన్ని పంచాలి, బానిసలైనవారిని రక్షించడానికి, విడిపించడానికి, స్వస్థపరచడానికి కృషి చెయ్యాలి (సామెతలు 24:11-12, యోబు 29:12-16, కీర్తన 72:12-14).
స్వీయ-లైంగిక చర్య
హస్తప్రయోగం అంటే లైంగిక ఆనందం కోసం లేదా లైంగిక ఉద్రిక్తతను తగ్గించుకోవడానికి తమ జననాంగాలను స్వయంగా ఉత్తేజపరచుకోవడం.
హస్తప్రయోగం అనైతికమని బైబిలు స్పష్టంగా ఖండించదు. కాని స్వీయ-లైంగిక చర్య కామపూరితమైన ఆలోచనల్ని కలుగజేస్తుంది, అశ్లీల చిత్రాలు చూడడం, జారత్వం వంటి పాప కార్యాలలోకి నడిపిస్తుంది (మత్తయి 5:27-28, మత్తయి 15:19-20).
హస్తప్రయోగం అవివేకం ఎందుకంటే అదొక వ్యసనం: ఎంత ఎక్కువగా చేస్తే, అంత ఎక్కువగా చెయ్యాలని అనిపిస్తుంది.
బలవంతపు హస్తప్రయోగం కొన్నిసార్లు భావోద్వేగపరమైన లేక సంబంధాలకు సంబంధించిన సమస్యల్ని సూచిస్తుంది లేక గతంలో జరిగిన లైంగిక వేధింపుల్ని సూచిస్తుంది.
► విద్యార్థులు తరగతి కోసం 1 కొరింథీయులకు 6:12-13, 18-20 మరియు 1 స్సలొనీకయులకు 4:1-8 చదవాలి.
భార్యభర్తలు భావోద్వేగపరంగా, ఆత్మీయంగా ఏకమవ్వడంలో సహాయపడడానికి దేవుడు వివాహంలో శారీరక ఐక్యతను రూపొందించాడు (1 కొరింథీయులకు 6:16-20, మలాకీ 2:15).
హస్తప్రయోగం, వివాహం చేసుకునేంతవరకు ఒంటరితనాన్ని తట్టుకోవడానికి సహాయపడుతుందని అనేకులు భావిస్తారు, కాని అది అలవాటుగా మారినప్పుడు భవిష్యత్తులో వైవాహిక బంధంలో ఉండే అందాన్ని, సన్నిహిత బంధాన్ని నాశనం చేయగలదని వారు గ్రహించరు.
స్వీయ-లైంగిక చర్య లైంగిక అనుభవాన్ని ఇస్తుంది కాని లైంగిక సంబంధంలోని అసలైన ఉద్దేశ్యాన్ని కోల్పోతుంది: ఇద్దరు శారీరకంగా, ఆత్మీయంగా ఏకమవ్వడం.......వైవాహిక జీవితంలో ఉండే ఆరోగ్యకరమైన సహజ లైంగిక చర్యకు ప్రత్యామ్నాయంగా హస్తప్రయోగాన్నిఉపయోగించకూడదు.[1]
ఒకవేళ అవివాహితుని జీవితంలో హస్తప్రయోగం సమస్యగా ఉంటే అతడు ఏం చేస్తాడు? ఎవరైనా, లైంగిక ఉద్రేకతను తగ్గించుకోవడానికి మాత్రమే హస్తప్రయోగం చేస్తున్నప్పుడు కూడా దానిని నివారించడమే ఉత్తమం, ఎందుకంటే వారు శోధనలను ఎదుర్కుంటారు. స్వీయ-లైంగిక చర్య లైంగిక సంబంధం పట్ల దేవుని ఉద్దేశాల్ని నెరవేర్చదు.
ఒకవేళ వాళ్ల జీవితంలో ఏదైనా అనైతికత ఉంటే, ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. దైవభక్తిగలవారి దగ్గర జయాలు, అపజయాలు గురించి పంచుకోవాలి, వాళ్లు ప్రార్థించి సలహాలు ఇస్తారు.
ఒకవేళ హస్తప్రయోగానికి భావోద్వేగరమైన సమస్యలు, సంబంధబాంధవ్యాల సమస్యలు, గత లైంగిక వేధింపుల సమస్యలు కారణమైతే, ఒక శిక్షణ పొందిన క్రైస్తవ కౌన్సిలర్ దగ్గర సహాయం పొందడం మంచిది.
[1]Dr. Tim Clinton and Dr. Diane Langberg, The Quick-Reference Guide to Counseling Women, (Grand Rapids, MI: Baker Books, 2011), 185.
స్వలింగ సంపర్క చర్య గురించి బైబిలు ఏం చెబుతుంది
దేవుడు వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్య జీవితకాలం, సమర్పణ కలిగి ఉండే బంధంగా రూపొందించాడు. ఆదాముకు సాటియైన సహాయం అవసరమని దేవుడు చూశాడు (ఆదికాండము 2:18). సహాయకుడు అంటే, మరొకరికి సరిపోయేవాడు, భిన్నంగా ఉంటూ అనేక విధాలుగా సహాయపడేవాడు. ఆదాముకు సాటియైన సహాయంగా దేవుడు స్త్రీని చేశాడు కాని మరొక పురుషుని చేయలేదు (ఆదికాండము 2:22). సృష్టి కథనం సర్వ మానవాళికి వివాహం గురించి- వివాహంలో, స్త్రీ పురుషుడు ఒక విశేషమైన రీతిలో ఏకమౌతారు- అనే ఒక సాధారణ సూత్రాన్ని ఇస్తుంది (ఆదికాండము 2:24).
దేవుడు ఏర్పాటు చేసిన వివాహం గురించి యేసు మాట్లాడాడు (మత్తయి 19:4-6). ఆదికాండములోని వాక్యభాగాన్ని సూచిస్తూ, స్త్రీ పురుషుడు ఏకశరీరమై, శాశ్వతమైన బంధంలోకి నడిపించబడతారని చెప్పాడు.
అపొస్తలుడైన పౌలు వివాహం గురించి అనేక ప్రకటనలు చేశాడు. వివాహం అనేది క్రీస్తుకు, సంఘానికి మధ్య ఉన్న సంబంధం గురించి మనకు బోధించే ఒక దృష్టాంతమని చెప్పాడు (ఎఫెసీయులకు 5:22-33). ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ఆ వాక్యభాగమంతటిలో, పురుషులకు, వారి భార్యలకు మధ్య సంబంధం గురించి అతడు మాట్లాడాడు. భార్యభర్తల మధ్య ఉండే ఆ విశేషమైన సంబంధం గురించి చెప్పడానికి ఆదికాండము మరియు మత్తయి సువార్త నుండి ఉల్లేఖించాడు (ఎఫెసీయులకు 5:31). వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్య ఉండే బంధమని ఈ వాక్యభాగం ద్వారా స్పష్టమౌతుంది.
లేవీయకాండములో, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని గూర్చిన వివరణ ఉంది. స్త్రీతో శయనించినట్లుగా, ఒక పురుషుడు మరొక పురుషునితో శయనించడం హేయమని అది చెబుతుంది (లేవీయకాండము 18:22). స్వలింగ సంపర్కం చేసిన వారు హేయమైన పని చేసారు కాబట్టి ఇద్దరికీ మరణశిక్ష విధిస్తారు (లేవీయకాండము 20:13).
కొందరు లేవీయకాండము ఈ కాలపు ప్రజలకు వర్తించదని చెబుతుంటారు. నిజానికి, లేవీయకాండములో ఉన్న కొన్ని ఆజ్ఞలు కేవలం ఆచార సంప్రదాయాలకు సంబంధించినవి. అయితే, లేవీయకాండము 18-20 లోని ఆజ్ఞలు, సన్నిహిత బంధువులతో, జంతువులతో లైంగిక చర్యలో పాల్గొనడం, కుమార్తెను వ్యభిచారిణిగా చేయడం వంటి ఇతర లైంగిక సంబంధాల్ని నిషేధిస్తాయి. ఈ అధ్యాయాలలోని మిగిలిన ఆజ్ఞలు, పిల్లల్ని బలి ఇవ్వడం, దొంగతనం, విగ్రహారాధన, చెవిటివారిని లేక గ్రుడ్డివారిని బాధించడం, బీదలను అణచివేయడం, పరదేశులను బాధించడం, కొలతలలో అన్యాయం చేయడం వంటి వాటిని నిషేధిస్తాయి. ఈ ఆజ్ఞలన్ని దేవుని న్యాయసమ్మతమైన నైతిక ప్రమాణాల్ని చూపిస్తున్నాయి, ఇవి అన్ని చోట్ల, అన్నివేళలా, అందరికీ వర్తిస్తాయి.
► ఒక విద్యార్థి తరగతి కోసం రోమా 1:18-32 చదవాలి.
ఈ వాక్యభాగం తెలిసి తిరుగుబాటు చేసే వారందరిపై దేవుని తీర్పు వస్తుందనే మాటతో ప్రారంభమౌతుంది. సృష్టికర్తయైన అద్వితీయ సత్య దేవుణ్ణి గురించిన జ్ఞానాన్ని ప్రజలు తిరస్కరించినప్పుడు, వారు విగ్రహారాధికులై సృష్టిని పూజించడం మొదలుపెట్టారని ఈ వాక్యభాగం చెబుతుంది. వారు సత్యాన్ని తిరస్కరించినందువల్ల ఎంతగా లైంగిక పాపంలో పడిపోయారంటే, స్వలింగ సంపర్కమనే పాపానికి దిగజారిపోయారు. స్వలింగుల మధ్య లైంగిక సంబంధం సహజత్వానికి విరుద్ధం అని ఈ వాక్యభాగం చెబుతుంది. కొందరు ఈ వాక్యభాగం బలవంతపు స్వలింగ సంపర్కం గురించి మాట్లాడుతుందని చెబుతారు, కానీ వారు కలిసి పాపం చేసి దేవుని తీర్పు పొందుకున్నారు గనుక ఇది స్వచ్ఛందమైన చర్యనే సూచిస్తుందని వాక్యభాగం మాట్లాడుతుంది. వాక్యభాగం ఇంకా అనేకమైన పాపాలు గురించి మాట్లాడుతూ, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వైఖరిని వివరిస్తుంది.
అపొస్తలుడైన పౌలు, దేవుడు ఖండించే ఇతర పాపాల జాబితాలో స్వలింగ సంపర్క చర్యను కూడా చేర్చాడు (1 కొరింథీయులకు 6:9-10, 1 తిమోతికి 1:9-10).
సంఘ బాధ్యతలు
కొన్ని సంఘాలు లైంగిక సంబంధమైన పాపంలో పడిపోయినవారిని ఎలా ప్రేమించాలో తెలియక సతమతమౌతున్నాయి. కొన్ని సంఘాలైతే, కొన్ని లైంగిక పాపాల్ని సహజమైనవిగా పరిగణించి, వాటిని అంగీకరించడం మొదలుపెట్టాయి.
► లైంగిక నైతికతకు సంబంధించిన విషయాల గురించి సంఘం ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి?
నీతిని బోధించాలి, ప్రేమించాలి
కొన్నిసార్లు, సంఘం కొన్ని లైంగిక అనైతిక చర్యలు పెద్ద హానికరమైనవి కాదని, చాలా వికృతమైనవి కాదని భావించి, వాటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటుంది. ఉదాహరణకు, లైంగిక అనైతికత విషయంలో ఎదురయ్యే శోధనపై ఎలా విజయం సాధించాలో బోధించకుండా, వివాహం కాని అనేకమంది యౌవ్వనస్తులు లైంగిక చర్యలో పాల్గొంటారని భావిస్తారు. విశ్వాసులు దేవుని పరిశుద్ధ జీవన ప్రమాణానికి కట్టుబడి, లైంగిక చర్యను వివాహానికే పరిమితం చెయ్యాలి.
సంఘం చెప్పే సందేశం బైబిల్లో ఉన్న విషయాలంత స్పష్టంగా ఉండాలి. వివాహం వెలుపల లైంగిక కార్యకలాపాలు చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు (హెబ్రీయులకు 13:4). విశ్వాసులు అనైతిక లైంగిక కార్యకలాపాలు చేసే వ్యక్తిని అభినందించకూడదు. క్రీస్తును అనుసరించేవారు లైంగిక అనైతికత గురించి జోకులు వేయకూడదు. లైంగిక పాపాన్ని అవాంచిత గర్భం, లైంగిక వ్యాధులు రాకుండా జాగ్రత్తగా నిర్వహించాలని లోకం బోధిస్తుంది, కానీ సంఘం చెప్పే సందేశం మరింత ముఖ్యం. లైంగిక పాపం దుఃఖానికి, కుటుంబాలు దెబ్బతినడానికి, శోధన పెరగడానికి, అసంతృప్తి మరియు అపరాధ భావాలకు దారితీస్తుందని సంఘం బోధించాలి.
సువార్తను పంచాలి
సంఘం పాపులందర్నీ ప్రేమించాలి, క్రీస్తు కృప, క్షమాపణను అనుగ్రహించాలి.
శోధించబడడం పాపం కాదు; క్రీస్తు కూడా శోధించబడ్డాడు, కాని పాపం లేనివాడుగా ఉన్నాడు (హెబ్రీయులకు 4:15). శోధనలను బట్టి, అవి ఘోరమైన లైంగిక చర్యలకు నడిపించే శోధనలైన సరే, వాటిని బట్టి ఎవరూ ఖండించబడినవారిగా లేక నిరీక్షణలేనివారిగా భావించేలా సంఘం చేయకూడదు. తప్పుడు కోరికలు ప్రతి వ్యక్తిలో ఒకేలా ఉండవు, కాని అందరు తప్పుడు కోరికలు కలుగజేసే పాపస్వభావంతో, ఆత్మీయ లోపాలతోనే పుట్టారు.
తప్పుడు కోరికలతో బాధపడుతున్న వ్యక్తికి సహాయం చేయడానికి తనకు తగినంత శిక్షణ లేదని ఒక పాస్టర్ అనుకోవచ్చు, కాని ఇతర పాపాలతో పోరాడుతున్నవారికి ఎలా సహాయపడతాడో అలాగే ఈ సమస్యలో ఉన్నవారికి కూడా సహాయం చేయగలడు, సలహా ఇవ్వగలడు. (ఈ పాఠంలో తర్వాత వచ్చే రెండు భాగాలూ, జారత్వమనే శోధనపై జయం పొందడానికి విశ్వాసులకు మంచి సలహాలిస్తాయి.)
► సంఘ సభ్యుడు జారత్వం చేస్తున్నప్పుడు సంఘం ఏం చేయాలి?
పాపిని తిరిగి పునరుద్ధరించడం
గలతీయులకు 6:1 చెబుతోంది, పాపం చేసిన సంఘం సభ్యుడిని సంఘం పునఃస్థాపించడానికి ప్రయత్నించాలి. దీని అర్థం, ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత కూడా అతను పరిచర్య స్థానంలో ఉండాలి లేదా అతన్ని త్వరగా తిరిగి పరిచర్య స్థానంలో పెట్టాలి అన్నది కాదు. పునఃస్థాపన అంటే, సంఘం సహవాసంలోనూ శ్రద్ధలోనూ తిరిగి ఆహ్వానించబడటం. సభ్యుడు నిజంగా పశ్చాత్తాపపడితే, దేవుడు అతన్ని క్షమిస్తాడు, సంఘం కూడా క్షమిస్తుంది. సంఘం అతనికి ఆత్మీయ జవాబుదారీతనాన్ని ఇచ్చి, అతడు విజయాన్ని కొనసాగించడానికి, ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయాలి. పునఃస్థాపించబడిన విశ్వాసి జవాబుదారీతనంతో జీవించినప్పుడు, తన విశ్వాస కుటుంబ నమ్మకాన్ని క్రమంగా తిరిగి పొందగలడు.
పెళ్లికాని అమ్మాయి గర్భం దాల్చినప్పుడు, ఆమె ఆత్మీయ పునరుద్ధరణకు ప్రయత్నించకుండా, ఆమెను సంఘ సహవాసం, సంరక్షణ నుండి దూరం చేయకూడదు. ఆమె పశ్చాత్తాపపడి, ఆత్మీయ జవాబుదారీతనానికి లోబడితే, క్షమించబడుతుంది. ఆమె పాపం ఆ పాపానికి కారణమైన పురుషుని కంటే మరింత చెడ్డదేమి కాదు. కొన్నిసార్లు, అమ్మాయి చేసిన పాప ఫలితం కళ్లకు కనిపిస్తుంది కాబట్టి ఆమెను తీవ్రంగా వేధిస్తారు.
కొన్నిచోట్ల, వైవాహిక బంధానికి వెలుపల పుట్టినందువల్ల పిల్లల్ని చాలా హీనంగా చూస్తారు కాని అలా చేయడం తప్పు ఎందుకంటే అది వారి తప్పు కాదు. సంఘం అలాంటి పిల్లల్ని ప్రేమించి, అంగీకరించాలి, అంటే దానర్థం పాపాన్ని అంగీకరించాలని కాదు.
బలహీనులను రక్షించాలి
కొన్ని సమాజాల్లో, పెళ్ళికాని అమ్మాయి గర్భం దాల్చినందువల్ల తల్లిదండ్రులకు అవమానం కలుగుతుందని భావించి, కుటుంబ పరువు కాపాడుకోవడానికి పుట్టని ఆ బిడ్డను చంపెయ్యాలనుకుంటారు. కాని హత్యకు ఎన్నడూ మంచి కారణమనేది లేనేలేదు (నిర్గమకాండము 20:13). పుట్టని ప్రతి బిడ్డ దేవుని స్వరూపంలో సృజించబడినవాడే (ఆదికాండము 9:6, కీర్తన 139:13-14). ఆ బిడ్డను కాపాడాలి, ప్రేమించాలి మరియు పోషించాలి.
పేదరికానికి ప్రత్యామ్నాయాలు అందించాలి
సంఘమంటే విశ్వాస కుటుంబం. సంఘం, పాపాల్ని ఖండిస్తే చాలదు. అది దాని సభ్యుల్ని సంరక్షించాలి. ఉదాహరణకు, పాప కార్యాల ద్వారా ఆర్థిక సహాకారాన్ని పొందుకుంటున్న వ్యక్తికి, ప్రత్యామ్నాయ ఆర్థిక సహాకారాన్ని వృద్ధి చేయడంలో సహాయం చెయ్యాలి.
ఉదాహరణకు, చాలామంది అమ్మాయిలు ఒక పెద్ద సంఘానికి హాజరౌతూ, గాయక బృందంలో పాటలు పాడుతున్నారు. వాళ్ల కుటుంబాలు చాలా పేదరికంలో ఉన్నాయి. అయితే తమ కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడానికి వాళ్లు పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితిలో సంఘం ఏం చెయ్యాలి?
► పాప జీవన విధానాన్ని విడిచిపెట్టడానికి మీ సంఘం ఎలా సహాయపడుతుంది?
శోధన సహించేవారికి సహాయం చేయడం
ఈ పాఠంలో అనేక క్లిష్టమైన విషయాల గురించి మనం చర్చించుకున్నాం. ఈ పాఠాన్ని చదువుతున్న చాలామంది ఏదొక సమస్యతో బాధపడుతుండవచ్చు. కొంతమంది పాఠకులు, శోధనలు ఎదుర్కొంటున్న విశ్వాసులకు ఎలాంటి సలహాలు ఇవ్వాలో తెలియక ఇబ్బందిపడుతున్న సంఘ నాయకులై ఉన్నారు.
శోధన ఏదైనాసరే, ఒక విశ్వాసిని విజయ బాటలో నడిపించే ప్రవర్తనలు, ఆలోచనా విధానాలు కొన్ని ఉన్నాయి.
క్రీస్తును వెంబడించే వ్యక్తి ఇలా సహాయం పొందగలడు:
1. క్రీస్తుతో మీకున్న సంబంధానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి (మత్తయి 16:24-27). ఇతర శోధనల్లా, అక్రమ లైంగిక (జారత్వ) సంబంధ శోధన కూడా సాతానుడు మీ మీద చేసే దాడి (1 పేతురు 2:11). సాతానుడు కేవలం దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు (యోహాను 10:10) మాత్రమే వస్తాడు. మీరు మీ ప్రాణం కోసం పారిపోవాలి (2 తిమోతికి 2:22).
2. యేసు శ్రద్ధ చూపుతాడనే నమ్మకంతో ఉండటం (కీర్తన 139:1-3, 1 పేతురు 5:6-10). మీ విశ్వాసం, మీ శారీరక అవసరాలు, మీ పరిశుద్ధత పట్ల ఆయన శ్రద్ధ చూపుతాడు. మీ విశ్వాసం, మీ శారీరక అవసరాలు, మీ పరిశుద్ధత పట్ల ఆయన శ్రద్ధ చూపుతాడు. ఆయన మానవునిగా ఉన్నప్పుడు, మనం ఎదుర్కొనే శారీరక, మానసిక శోధనలను జయించాడు. అందువల్ల మనం విజయం సాధించడానికి అవసరమైన కృప ఆయన వద్ద ఉంది (హెబ్రీయులకు 4:14-16).
3. అపవాది అబద్ధాలు నమ్మకూడదు (యోహాను 8:44). అపవాది మీతో, దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదు, ఒకవేళ పట్టించుకుంటే నిన్ను ఎంతో బాధించే లైంగిక కోరికలను తీసివేసేవాడు" అని చెప్పవచ్చు. అయితే యేసు పట్టించుకుంటాడని, అపవాది నాశనం చేస్తాడని 1 పేతురు 5:7-8 చెప్తుంది. లైంగిక కోరికలవల్ల, మీరు పాపంతో నిండిపోయినవారని అపవాది మీపై తప్పుడు ఆరోపణలు చేయవచ్చు (ప్రకటన 12:10).
4. యేసు మీద దృష్టిపెట్టి, ఆయన ఏమైయున్నాడనే దాన్నిబట్టి ఆయన్ను ఘనపరచాలి (కీర్తన 105:3-4). అపవాది ఈ పరీక్ష ద్వారా మీ విశ్వాసాన్ని దేవునితో మీకున్న సంబంధాన్ని నాశనం చేస్తాడు (యోహాను 10:10). అయితే ఈ పరీక్ష పెట్టడంలో యేసు ఉద్దేశ్యం ఏంటంటే, మీ విశ్వాసం బలపడాలి, మీరు ఆయన్ను మరింత మహిమపరచాలి (1 పేతురు 1:5-9). మీరు యేసును ఆరాధించడంపై దృష్టిపెట్టినప్పుడు, ఆయన మీకు సహాయం చేస్తాడు (కీర్తన 46:1).
5. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి (కీర్తన 119:9). దేవుని వాక్యం చదవడం, వినడం, ధ్యానించడం శోధనను జయించడానికి సహాయపడతాయి. యేసు శోధించబడినప్పుడు, దాన్ని జయించడానికి ఆయన లేఖనాలను ఉపయోగించాడు (మత్తయి 4). మనం కూడా అలాగే చెయ్యాలి.
6. శోధనను జయించే శక్తి కోసం ప్రార్ధిస్తున్నప్పుడు కూడా, మీ లైంగిక కోరికలను బట్టి యేసుకు కృతజ్ఞతలు చెప్పాలి (2 కొరింథీయులకు 12:7-9). మీరు మీ సహజ కోరికలను బట్టి కృతజ్ఞులుగా ఉండాలి ఎందుకంటే అది దేవుడు మీ మానవత్వంలో ఏర్పరచిన భాగం, అవి మిమ్మల్ని దేవుని మీద ఆధారపడేలా చేస్తాయి, ఆయన బలాన్ని వెదకేలా చేస్తాయి. మీ బలహీనతలు, మీరు దేవునితో నడిచే విధానంలో ముందుకువెళ్ళడానికి ఒక అవకాశంగా పనిచేస్తాయి.
7. కనీసం ఒక దైవికమైన, అనుభవజ్ఞులైన వ్యక్తికి జవాబుదారులుగా ఉండాలి (గలతీయులకు6:2). విశ్వాస యాత్రలో మీ కంటే గొప్పగా ఉన్నవారితో (మీ లింగం వారితో) పారదర్శకంగా, యధార్థంగా ఉండడం చాలా సహాయకరం. వారు మీ కోసం ప్రార్థన చేస్తారు, మీకు సలహాను ఇస్తారు. వారితో మీ బాధలు గురించి పంచుకున్నప్పుడు, మీరు మీ పరిశుద్ధతను కాపాడుకోగలుగుతారు, విశ్వాసంలో మరింత బలపడతారు.
8. ఇతరులకు పరిచారం చేయాలి, వారి అవసరాలపై దృష్టిపెట్టాలి (ఫిలిప్పీయులకు2:3-5). ఇతరులకు పరిచారం చేయడం ద్వారా మీ సొంత అవసరాలు, సొంత కోరికలపై ఎక్కువగా దృష్టిపెట్టుకునే విధానంతో పోరాడాలి.
9. దేవుని సమయంలో సరైన వ్యక్తిని వివాహం చేసుకోవాలి (సామెతలు 5:15, 18-19). (వివాహంలో తెలివిగా ఎలా నిర్ణయం తీసుకోవాలో ముందున్న పాఠాలు చర్చిస్తాయి.)
► వీటిలో, ఏ విషయాలు మీకు క్రొత్తగా ఉన్నాయి? మీ జీవితంలో ఏవి సహాయకరంగా ఉన్నాయి?
► ఏ ఇతర ప్రవర్తనలు లేక ఆలోచనా విధానాలు మీకు సహాయకరంగా ఉన్నాయి?
వివాహానికి ముందు నైతిక పరిశుద్ధత
యౌవనస్తులు వివాహానికి ముందు బలమైన శోధనలను ఎదుర్కొంటారు. నమ్మకమైన జీవిత భాగస్వామి తమకు అవసరమని గుర్తుంచుకోవడం వారికి చాలా ముఖ్యం.[1] వివాహం లేకుండా తాత్కాలిక అనందం కోరుకునే వ్యక్తితో సంబంధం కలిగి ఉండకూడదు. సమర్పణ కలిగిన విశ్వాసం లేని వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడకూడదు (1 కొరింథీయులకు 7:39). వారు నమ్మకమైన జీవిత భాగస్వామి, మంచి తల్లిదండ్రులు అయ్యేవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
మంచి వివాహ బంధం కలిగి ఉండాలనుకునే యవ్వనస్తులు నమ్మకంగా ఉండాలి, క్రీస్తును సమర్పణతో అనుసరించాలి అప్పుడు సరైన వ్యక్తిని ఆకర్షించగలుగుతారు (సామెతలు 3:4-8). ఒక వ్యక్తి తన మంచి ప్రవర్తన, మంచి వస్త్రధారణ ద్వారా తమ గుణాన్ని బయలుపరచగలడు (1 తిమోతికి 2:9-10). అబ్బాయిలు అమ్మాయిలతో, అమ్మాయిలూ అబ్బాయిలతో అజాగ్రత్తగా ప్రవర్తించేవారు, తప్పుడు కోరికలతో వారితో సంబంధాన్ని ఇష్టపడుతున్నారని సూచిస్తారు (1 స్సలొనీకయులకు 4:1-7). చెడు కోరికలు కలిగించే విధంగా దుస్తులు ధరించిన వ్యక్తి, సమర్పణ లేకుండా కేవలం సుఖాన్ని మాత్రమే కోరుకునే వ్యక్తిని ఆకర్షిస్తారు (సామెతలు 7).
దేవుడు ప్రవర్తనలో, వస్త్రధారణలో, సంబంధాల్ని ఎంపిక చేసుకునే విషయంలో సహాయకరంగా ఉండడానికి తల్లిదండ్రుల్ని, పాస్టర్లను, ఇతర క్రైస్తవ నాయకుల్ని ఇచ్చాడు. యౌవనులు, దేవునికి విధేయులై ఈ నాయకులకు లోబడినప్పుడు, దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు, అపాయం నుండి, శోధనల నుండి కాపాడబడతారు.
► విద్యార్థులు తరగతి కోసం 1 పేతురు 5:5 మరియు హెబ్రీయులకు 13:17 చదవాలి.
తమ తల్లిదండ్రుల, ఆత్మీయ నాయకుల నాయకత్వ జ్ఞానానికి లోబడడం పిల్లల, యౌవనుల బాధ్యత. శోధనల్ని జయించడానికి యౌవనులకు సహాయం చేయడం నాయకుల బాధ్యత.
► విద్యార్థులు తరగతి కోసం రోమా 13:14 మరియు 1 కొరింథీయులకు 10:13 చదవాలి.
విశ్వాసులు సహింపగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు శోధింపబడనియ్యడు, శోధనలో నుండి పారిపోలేనంతగా శోధింపబడనియ్యడు. శోధనలో నుండి పారిపోవలసిన బాధ్యత యౌవనస్తులది (2 తిమోతికి 2:22). అయితే, యౌవనులు సాధ్యమైనంతవరకు శోధనను అనుభవించకుండా తల్లిదండ్రులు నిరోధించాలి. కనీసం మూడు మార్గాల్లో తల్లిదండ్రులు దీన్ని చేయగలరు:
1. పిల్లలు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎవరితో ఉండాలి, ఎక్కడికి వెళ్లాలి అనే వాటి గురించి నిర్దిష్టమైన సూచనలు ఇవ్వాలి (ఎఫెసీయులకు 6:1-4). శోధనలో నుండి తప్పించుకోగలిగేంత ఎదుగుదల లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టకూడదు. ఉదాహరణకు, ఒక యువకుడు ఒక యువతి రహస్య ప్రదేశంలో ఉన్నప్పుడు, తప్పుగా ప్రవర్తించే శోధనకు గురౌతారు.
2. శోధన సమయాల్లో తమ యౌవనుల్ని జవాబుదారులుగా చెయ్యాలి. తల్లి లేక తండ్రి తమ యౌవన బిడ్డలతో కలిసి ప్రార్థించి, వాళ్ల జీవితం గురించి అడిగి తెలుసుకోవాలి. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉన్న బలమైన బంధంపై జవాబుదారీతనం ప్రభావం ఆధారపడి ఉంది. పిల్లలు, తమ తల్లిదండ్రులు ప్రేమిస్తారని, అంగీకరిస్తారని, సహాయం చేస్తారని నమ్మకపోతే, వాళ్ళు తమ తప్పుల్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు.
3. యౌవన బిడ్డలకు దైవికమైన సలహా ఇవ్వాలి. యౌవనులు బైబిలు సూత్రాల్ని దృష్టిలో ఉంచుకుని, పరిస్థితుల్ని పరిగణించేలా తల్లిదండ్రులు సహాయపడాలి (సామెతలు 4:1-9, సామెతలు 7:1, 4-5). వారు ఎదుర్కొనే ప్రమాదాలు గురించి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్లు తీసుకోవలసిన వివిధ నిర్ణయాల విషయంలో సహాయపడాలి. శోధనను ఎలా జయించాలో, శోధనలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో ముందుగానే ఆలోచించగలిగేలా సహాయం చెయ్యాలి.
సంఘం, వాక్యానుసారమైన నైతికత గురించి బోధించేటప్పుడు, అది దాని సంస్కృతికి భిన్నంగా ఉండాలి. అనేక సంస్కృతులలో, లైంగిక పాపాన్ని తీవ్రంగా పరిగణించరు. వివాహానికి ముందు, పెళ్లికాని యువతీయువకులు లైంగిక సంబంధంలో పాల్గొనడాన్ని సహజంగా భావిస్తారు. సంఘం పాపంతో రాజీపడకూడదు. యౌవనుల మధ్య లైంగిక పాపం సహజమని భావించకూడదు. వ్యభిచారులకు క్రీస్తు రాజ్యంలో హక్కు లేదని దేవుడు చెప్పాడు (ఎఫెసీయులకు 5:5).
► లోక శోధనలతో పోరాడుతున్న యవ్వనస్తులకు సంఘం ఎలా సహాయపడుతుంది?
► విద్యార్థులు తరగతి కోసం ఎఫెసీయులకు 5:3-7 మరియు హెబ్రీయులకు 13:4 చదవాలి.
వివాహానికి ముందు, సంబంధం కలిగియున్న సమయం, లైంగిక సంబంధాన్ని మొదలుపెట్టే సమయం కాదు. బదులుగా స్త్రీ పురుషులిద్దరూ ఒకే ఆత్మీయ, బైబిలు ప్రాధాన్యతలు కలిగియున్నారో లేదో పరిశీలించుకోవలసిన సమయం. ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరితోనొకరు నిత్య నిబంధన చేసుకునేంతగా ఒకరినొకరు నమ్మే సమయం. ఒకవేళ ఈ విధమైన నమ్మకాన్ని ఏర్పరచుకోలేకపోతే, వారు పెళ్లి చేసుకోకుండా అక్కడితో ఆగిపోవాలి.
కొన్ని సమాజాల్లో వివాహాన్ని ఒక విస్తృతమైన, ఖర్చుతో కూడిన వేడుకగా భావిస్తారు గనుక వివాహాలు చాలా ఆలస్యంగా చేస్తారు. చాలాసార్లు, వివాహం ఆలస్యమైన కారణంగా, వారిరువురు సంవత్సరాలపాటు కలిసి జీవించి పిల్లల్ని కూడా కంటారు. కొంతమంది, తమ వివాహానికి ఉన్నదంతా ఖర్చు చేస్తారు, అవసరమైతే అప్పు కూడా తీసుకుని ఖర్చు పెడతారు కాబట్టి వివాహమైన తర్వాత ఆర్థికంగా అది వాళ్లని బాగా కృంగదీస్తుంది. సంఘం, వివాహం గురించి ఒక భిన్నమైన ఆదర్శాన్ని చూపించే విశ్వాస సమాజంగా ఉండాలి. క్రైస్తవ వివాహం, స్త్రీ పురుషులు దేవునికి మరియు ఒకరికొకరు కట్టుబడి ఉండడం కోసం నిర్ణయించబడింది, వివాహాన్ని ఆలస్యం చేసే లేక భవిష్యత్తులో దంపతుల్ని బాధించే గొప్ప ఖర్చు దీనికి అవసరం లేదు.
► సమాజంలోని వివాహ సంప్రదాయాల కంటే క్రైస్తవ వివాహం భిన్నంగా ఉండే కొన్ని మార్గాలు ఏంటి?
[1]సామెతలు 31:11-12, 1 తిమోతికి 3:11-12, మలాకీ 2:14-16, మరియు సామెతలు 2:16-17 చూడండి.
లైంగిక సంబంధం గురించి దేవుని ఉద్దేశ్యాన్ని, సూత్రాల్ని పిల్లలకు బోధించాలి
పిల్లలు, లైంగిక సంబంధం గురించిన సూచనలు చూస్తారు, వింటారు. ఏది తప్పో ఏది ఒప్పో ప్రజలు చెప్పే అభిప్రాయాలను వారు వింటారు. తుదకు, పిల్లల్లో లైంగిక కోరికలు, వాంఛలు, కలుగుతాయి, శోధనలు ఎదుర్కొంటారు కాబట్టి దేవుడు లైంగిక సంబంధం గురించి ఏం చెబుతున్నాడో పిల్లలకు బోధించడం క్రైస్తవ తల్లిదండ్రులకు చాలా ముఖ్యం. పిల్లలకు లైంగిక చర్యల వివరణ గురించి తెలియకూడదు, ఎందుకంటే వాళ్లు పెళ్లి చేసుకునేంత పెద్దలు కాదు, అది వాళ్లని అనవసరమైన శోధనల్లోకి నడిపిస్తుంది.
పిల్లలకు దేవుని ప్రణాళిక తెలియాలి, వారు దానికి విధేయులవ్వాలి. శోధనలు వస్తాయని వారికి తెలియాలి. వారు దేవునికి లోబడడానికి అలాగే వివాహమయ్యేంతవరకు తమ లైంగిక కోరికల్ని నియంత్రించుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
లైంగిక చర్య వివరాల గురించి మాట్లాడకుండా లైంగికత గురించి క్రైస్తవ్యం ఏం మాట్లాడుతుందో పిల్లలకు బోధించడానికి ఈ మెటీరియల్ సహాయపడుతుంది. దీనిని చాలా తేటగా, మీరు పిల్లలతో మాట్లాడే విధంగా రాయడం జరిగింది.
పిలల్లతో మాట్లాడడం
► ఆదికాండము 2:7, 18-24 పిల్లలతో కలిసి చదవాలి.
ఈ లేఖనభాగం, దేవుడు మొదటి పురుషుడు, మొదటి స్త్రీని సృజించి వారిని ఒక ప్రత్యేకమైన బంధంలో ఎలా ఉంచాడో మాట్లాడుతుంది.
దేవుడు వివాహాన్ని స్త్రీ పురుషుల మధ్య ఒక విశేషమైన బంధంగా ఏర్పాటు చేశాడు. వివాహమైన దంపతులు ఒకరిపైనొకరు ఒక ప్రత్యేకమైన ప్రేమ చూపుకుంటారు. ఆ బంధంలో భార్యాభర్తలు ఇరువురు రహస్యంగా శరీరాల కలయికతో ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని పంచుకుంటారు, దీనినే లైంగిక సంబంధం అంటారు. దేవుడు భార్యభర్తలు ఇద్దరి మధ్య ఆనందాన్ని కలిగించడానికి, మరికొన్నిసార్లు బిడ్డల్ని ఇవ్వడానికి లైంగిక సంబంధాన్ని సృష్టించాడు.
లైంగిక సంబంధం ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది గనుక, సహజ కోరికను బట్టి స్త్రీ పురుషులు ఒకరినొకరు చూసుకోవడానికి, తాకడానికి, ఒకరి దృష్టిని మరొకరు ఆకర్షించుకోవడానికి ఇష్టపడతారు.
బైబిల్లో, భార్యభర్తల మధ్య లైంగిక సంబంధం మంచిది, సరైనదని దేవుడు చెప్పాడు. అయితే, పెళ్లి చేసుకోనివారు లైంగిక సంబంధం కలిగి యుండడం చాలా తప్పని కూడా దేవుడు చెప్పాడు. కనీసం నాలుగు కారణాల వల్ల దేవుడు లైంగిక చర్యకు సంబంధించిన సూత్రాలను ఇచ్చాడు:
(1) లైంగిక ఆనందం వివాహ బంధం కోసం రూపొందించబడింది
దేవుడు లైంగిక సంబంధాన్ని, వివాహంలో ఒక ప్రత్యేకమైన భాగం చేశాడు. ఈ విధంగా ఏ పురుషుడైనా స్త్రీయైనా ఆనందాన్ని పొందుకోవడం సాధ్యమైనప్పటికీ, వివాహంలో ఈ ఆనందం విశేషమైంది ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ భాగస్వామికి మాత్రమే పూర్తిగా సమర్పించుకుంటారు. పెళ్లి చేసుకోనివారి విషయంలో, లైంగిక సంబంధానికి ఈ భావం ఉండదు, దేవుడు ఉద్దేశించిన బంధం వారు పూర్తిగా కలిగి ఉండలేరు. కాబట్టి, పెళ్లి చేసుకోవడానికి ఇంకా సిద్ధంగా లేనివారు లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. బహిరంగంగా వివాహ వేడుక లేకుండా, వివాహానికి సంపూర్ణంగా సమర్పించుకోకుండా లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఒకడు తన సొంత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం కలిగి ఉండాలి.
(2) లైంగిక సంబంధమైన కోరికలు చాలా బలమైనవి.
లైంగిక సంబంధమైన కోరికలు తప్పు కాదు ఎందుకంటే దేవుడు వాటిని కలిగించాడు. కాని దేవుడు ఇష్టపడని వాటిని చేయాలనే కోరికను కావాలని పెంచుకోవడం తప్పు. వీటి కారణంగా:
వివాహంలో తప్ప, ఒక వ్యక్తి లైంగిక కోరికలు బలపడేలా మరొకరి శరీరాన్ని చూడడం లేక దాని గురించి ఆలోచించడం చేయకూడదు.
వివాహంలో తప్ప, లైంగిక కోరికల్ని ప్రేరేపించేలా ఒకరు మరొకరిని తాకడం తప్పు.
ఒక వ్యక్తి చెడ్డ పనులు చేస్తున్నట్లుగా ఊహించుకోవడం తప్పు.
ఆనందం కోసం, తప్పుడు పనులు చేస్తున్న వారిని చూపించే చిత్రాలు లేక వీడియోలు చూడకూడదు.
ఇతరుల్లో తప్పుడు కోరికలు ప్రేరేపించేలా లేక తప్పుడు పనులు చేస్తున్నట్లు ఊహించుకునేలా దుస్తులు ధరించకూడదు.
తప్పుడు కోరికలతో ఉన్నట్లు చూపించే విధంగా ప్రవర్తించకూడదు లేక మాట్లాడకూడదు.
(3) మన కోరికలు మనల్ని నడిపించలేవు.
జంతువులు తమ భావాలు, కోరికల ద్వారా నియంత్రించబడతాయి. మనం జంతువులం కాదు; దేవుని స్వరూపంలో చేయడిన మనుష్యులం. దీని కారణంగా, మనం ఏం చెయ్యాలి అనే దాని గురించి ఆలోచించాలి, అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మనం మన భావాలు, కోరికల ద్వారా నడిపించబడకూడదు. కొన్నిసార్లు మనకు అనిపించింది చేయడం మంచిదే; కొన్నిసార్లు మంచిది కాదు. లైంగిక సంబంధం ఎప్పుడు మంచిదో మన కోరికలు చెప్పకూడదు. మన భావాలకు లొంగిపోకుండా, దేవుని ఆత్మ సహాయం ద్వారా బైబిలు ఆదేశాలను పాటించాలి.
(4) కొన్నిసార్లు లైంగిక సంబంధం పిల్లల్ని కలుగజేస్తుంది
దేవుడు ప్రేమ బంధం నుండి పిల్లలు పుట్టేలా చేశాడు. పిల్లలు, అనేక సంవత్సరాలు తమను ప్రేమించే, పోషించే కుటుంబంలో పెరగాలి అనే విధంగా దేవుడు చేశాడు. పెళ్లి చేసుకోని తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ, సాధారణంగా పెరిగి పెద్దయ్యేవరకు ఆ బిడ్డకు తల్లిదండ్రుల సహాయం ఉండదు.
పైన పేర్కొనబడిన నాలుగు వాస్తవాలు గ్రహించి, దేవుణ్ణి మెప్పించాలని, మంచిగా జీవించాలనుకునేవారు దేవుని మార్గనిర్దేశంలో నడుస్తారు. దేవునికి అవిధేయత చూపించే శోధనల్ని జయించడానికి సహాయపడే అలవాట్లను అలవరచుకుంటారు.
ఒక యవ్వనస్తుల ప్రార్థన
ప్రియమైన దేవా,
నన్ను (అబ్బాయి లేక అమ్మాయి)గా చేసినందుకు వందనాలు. వివాహం పట్ల నీ ప్రత్యేకమైన, మంచి ప్రణాళికకై వందనాలు. నా జీవితాంతం నిన్ను ప్రేమించి, నీకు లోబడడానికి సహాయం చేయి. నేను చేసే ప్రతిదీ నీకు తెలుసు, నా ప్రతి ఆలోచన నీకు తెలుసు. నీవు నడిపించే మార్గంలో నడవడానికి సహాయం చేయి. నా ఆలోచనలు, నా క్రియలు నీకు ఇష్టంగా ఉండాలి. నేను ఒక ఆదర్శంగా ఉండి, నా మిత్రుల్ని నీవైపు ఆకర్షించడానికి సహాయం చేయండి. సరైన సమయంలో, నేను ఎదిగినప్పుడు, నీవు కోరుకునే (భర్త లేక భార్య)గా ఉండడానికి సహాయం చేయండి. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను!
ఆమెన్
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
మమ్మల్ని నీ స్వరూపంలో చేసినందుకు, మా జీవితాలకు ఉద్దేశ్యాన్ని అర్థాన్ని ఇచ్చినందుకు వందనాలు. నీ స్వరూపాన్ని ప్రతిబింబించేలా స్త్రీనిగా పురుషునిగా చేసినందుకు వందనాలు.
వివాహంలో, లైంగిక సంబంధం కోసం నీవు చేసిన మంచి రూపకల్పనను బట్టి, ఉద్దేశ్యాలను బట్టి వందనాలు.
నీ వాక్యానికి అవిధేయత చూపినందుకు మమ్మల్ని క్షమించు. మమ్మును యేసు నామంలో కడుగు, క్షమించు, పరిశుద్ధపరచు (1 కొరింథీయులకు 6:11). పాపానికి దాసులు కాకుండా మమ్మును విడిపించు (రోమా 6:6-7). మా శరీరాలు నీకు అప్పగిస్తున్నాం, మీ దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాం (రోమా 6:13-14).
నీతియుక్తమైన ఆలోచనలు, ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం చేయండి (1 తిమోతికి 4:7, కీర్తన 23:3). మా నోటి మాటలు, మా తలంపులు నీ దృష్టికి అంగీకారమగును గాక (కీర్తన 19:14). ప్రతి శోధనలో జయమిస్తానని వాగ్దానం చేసినందుకు కృతజ్ఞతలు (1 కొరింథీయులకు 10:13).
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) ఈ పాఠంలో చర్చించుకున్న విషయాల్ని పరిగణలోకి తీసుకుని గలతీయులకు 5:16-6:9 చదవండి. ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి:
శరీరేచ్ఛలకు (5:16) మరియు శరీరకార్యాలకు (5:19) వ్యత్యాసం ఏంటి?
శరీర కార్యాలు చేయువారికి ఏ రెండు విషయాలు వాగ్దానం చేయబడినవి (5:19-21, 6:7-8)?
విశ్వాసి శరీరకార్యాలకు లోబడకుండా, ఎలా బలంగా ఉండగలడు (5:16, 22-23, 25)?
శోధన సమయాల్లో వాటిపై జయం పొందడానికి విశ్వాసులు గుర్తుంచుకోవలసిన కొన్ని సత్యాలు ఏవి? (ఈ వాక్యభాగం నుండి కనీసం నాలుగింటిని చెప్పండి.)
ఈ వాక్యభాగంలో విశ్వాసులు ఏం చెయ్యాలని ఆజ్ఞాపించబడెను? (ఈ వాక్యభాగం నుండి కనీసం నాలుగింటిని పేర్కొనండి.)
విశ్వాసులు ఒకరికొకరు చూపించుకోవలసిన బాధ్యతలు ఏవి (గలతీయులకు 6:1-2, 6)?
(2) రోమా 6:1-23 చదవండి. క్రింది ప్రశ్నలకు జవాబివ్వండి:
ప్రతి విశ్వాసి విషయంలో ఏవి వాస్తవమని ఈ వాక్యభాగం చెబుతుంది? (6-8 విషయాలను చెప్పండి)
విశ్వాసుల విషయంలో ఏది వాస్తవమో దానిని బట్టి వారు ఏ నిర్ణయాలు తీసుకోవాలి? (6-8 విషయాలను చెప్పండి.)
పాప శోధనలో, విశ్వాసి జయాన్ని ఎందుకు ఆశించగలడు? (ఒక పేరా రాయండి.)
(3) రోమా 8:1-14 చదవండి. ఈ వాక్యభాగంలో సత్యాల ఆధారంగా ప్రార్థన రాయండి.
(4) రోమా 6:11-14 మరియు కొలొస్స 3:5-7 కంఠస్తం చేయండి. తర్వాత క్లాసు ఆరంభించే ముందు, కంఠస్తం చేసిన వాక్యాలను రాయండి లేక చెప్పండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.