అభయ్ చిన్నతనంలో, అతని తల్లిదండ్రులు అతనికి కష్టపడి పని చేయడం బోధించారు. అతనికి పని చేసి సంపాదించుకునే అవవకాశం వచ్చినప్పుడెల్లా సంతోషించేవాడు. అతనికి ఎవరైనా ఒక పని అప్పగిస్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. ఒక యువకుడుగా పెరటి పని చేసేవాడు, వార్తా పత్రికలు వేసేవాడు, సైకిళ్లు బాగు చేసేవాడు. అభయ్ కి వ్యాపారవేత్తగా ఉండడం ఎంతో ఇష్టం కాని దేవుడు పరిచర్య కోసం పిలుస్తున్నాడని తెలుసుకున్నాడు. అభయ్ బైబిల్ కళాశాలలో చదివాడు. అక్కడ తన ఖర్చుల కోసం ఆఫీసు శుభ్రం చేసేవాడు, రెస్టారెంట్లో పని చేసేవాడు, పెరట్లో పనిచేసేవాడు. అతడు పట్టభద్రుడైనప్పుడు, పరిచర్య ఆరంభించాడు కాని కొన్నిసార్లు ఇళ్లకు రంగులు వేసేవాడు లేక భవనాలు మరమ్మత్తులు చేసేవాడు ఎందుకంటే పరిచర్య వలన అతనికి పూర్తి మద్దతు దొరకలేదు. అతనికి భార్యా పిల్లలున్నప్పటికీ, లాభం కోసం కాకుండా ఎల్లప్పుడు పరిచర్య బాధ్యతల్ని, వ్యక్తిగత వికాస అభివృద్ధినే ధ్యేయంగా పెట్టుకునేవాడు. తుదకు అతని పరిచర్య అతనికి పూర్తిగా మద్దతిచ్చింది.
పరిపక్వత మరియు ప్రవర్తన
► విద్యార్థులు తరగతి కోసం 1 తిమోతికి 4:12 మరియు విలాపవాక్యములు 3:27 చదవాలి.
1 తిమోతి పత్రిక అనేక సంఘాల్ని పర్యవేక్షించే బాధ్యత కలిగిన ఒక యౌవనస్తుడికి రాయబడింది. విశ్వాసులైన యువకులు తమ ప్రవర్తనలో, గుణంలో ఆదర్శంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడని 1 తిమోతికి 4:12 లో మనం చూస్తాం. క్రైస్తవ సిధ్ధాంతాల్లో స్థిరపదడానికి ప్రాధన్యత ఇవ్వాలి. ఇతరులతో చేసే సంభాషణల్లో స్వచ్ఛత, నిస్వార్థమైన ప్రేమ చూపించాలి. వారి ప్రవర్తన, వారి మాటలు దేవుని గౌరవించేవిగా ఉండాలి, ఆయన్ను మహిమపరచాలి.
విశ్వాసులైన యువకులు జాగ్రత్తగా, ఉద్దేశ్యపూర్వకంగా జీవించాలి. ఈ కాలంలో దేవుడు వారికిచ్చిన బలాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. నేర్చుకోవడం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం, ఇతరులకు పరిచారం చేయడం, బాధ్యతలు తీసుకోవడం వంటి అవకాశాలు వృథా చేసుకోకూడదు. కౌమారదశ, పూర్వ యౌవన దశను స్వార్థ లక్ష్యాల కోసం వృధా చేసుకోకూడదు. అవి ఎదుగుదలకు, సేవకు ప్రధానమైన సంవత్సరాలు. యువకులు ఆశా-నిగ్రహాన్ని నేర్చుకునేలా దేవుడు సహాయపడొచ్చు తద్వారా వారు ఆయన కొరకు ఫలవంతులౌతారు.[1]
పని
పని గురించిన దృక్పథాలు
కొన్ని సంస్కృతులలో, ప్రజలు ఆరోగ్యంగా యౌవ్వనంగా ఉన్నా పని చేయకుండా కూర్చుంటారు, ఇది వారికి సర్వసాధారణం. వారికి అవసరాలు ఉన్నప్పటికీ, వారు ఇతరులకు బాధ్యత వహిస్తున్నప్పటికీ, వారికీ పని చేయాలనే ప్రేరణ ఉండదు. మంచి జీతం వస్తేనే పని చేస్తామని వారు చెబుతారు. వారు, తక్కువ జీతానికి పని చేయరు లేక తక్కువ స్థాయిలో ఉండే పని చేయడానికి ఇష్టపడరు. వ్యక్తిగతంగా లాభం పొందకపోతే, పరిసరాలు అభివృద్ధి చేసుకోవడానికి కూడా కష్టపడి పని చేయడానికి ఇష్టపడరు.
కొన్నిసార్లు ఉద్యోగంలో చేరినవారు ఉద్యోగం పొందుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. బహుశా వారు ఎక్కువ శాతం మంది ప్రజలకు ఉపాధి దొరకని దేశంలో నివసిస్తున్నారు. కంపెనీ యూనిఫాం ధరించడాన్ని బట్టి వారు సంతోషిస్తుంటారు, ఉద్యోగ స్థితిని బట్టి అతిశయపడుతుంటారు. అయితే వారు తమ హోదాను చూసుకుని మురిసిపోతూ, యజమానుడికి లేక కస్టమర్లకు సేవ చేయాలనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ కంపెనీలో భాగమైనందుకు గర్వపడతారు కాని అసలు ఎందుకు వాళ్ళను తీసుకున్నారో గ్రహించరు.
పని చేయడానికి నిరాకరించే వ్యక్తులకు భిన్నంగా, కొంతమంది ఉద్యోగం మీద లేక డబ్బు సంపాదించడం మీద ఎక్కువ దృష్టిపెడతారు. వారు, వారి పరిసరాల కంటే జీతం ఎక్కువగా ఇచ్చే ప్రాంతాలకు వెళ్తారు. వారు సాధ్యమైనంత ఎక్కువ డబ్బు సంపాదించడానికి పని చేస్తారు. వారు, దేవునితో, తమ కుటుంబంతో సంబంధాల్ని పెంపొందించుకోవడం వంటి ముఖ్య విషయాల్ని అంతగా పట్టించుకోరు.
సమాజంలో ప్రజలు ఇలాంటివి చేయవచ్చు కాని, విశ్వాసులు తమ సంస్కృతిలో సహజంగా జరిగే వాటిని చేయకూడదు. బదులుగా, వారు దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసుకుని, ఆయనకు విధేయత చూపించాలి. పని, శ్రద్ధ మరియు ఉత్పాదకత గురించి బైబిలు చాలా విషయాలు మాట్లాడుతుంది.[2]
పనికి మూలము
దేవుడు సృజనాత్మకత కలిగినవాడు (కీర్తన 104:24). దేవుడు ఉత్పాదకుడు (కీర్తన 104). దేవుడు ఎల్లప్పుడు పని చేస్తున్నాడు, వ్యక్తుల జీవితాల్లో, ప్రాపంచిక విషయాల్లో అన్ని సమయాల్లోను పని చేస్తున్నాడు (యోహాను 5:17). దేవుడు మానవుల్ని సృజించినప్పుడు, ఆయన తన స్వరూపమందు, ఆయన పోలీకలో సృజించాడు. ప్రజలు తన సృష్టిలో సృజనాత్మకంగా ఉత్పాదకంగా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు, సముద్రపు చేపలు, ప్రతి భూజంతువు, ప్రతి ఆకాశపక్షిపై మానవుడికి అధికారం ఇచ్చాడు (ఆదికాండము 1:26). ఆయన తన ప్రజలను భూవనరులన్నిటిపై నిర్వాహకులుగా ఉంచాడు (ఆదికాండము 1:28-30).
పని, మానవుని జీవితం కోసం దేవుని రూపకల్పనలో ఒక భాగం. మొదటి నుండి, దేవుడు ప్రజలకు గొప్ప బాధ్యత అప్పగించాడు. ఆయన మనకిచ్చిన పనిని నమ్మకంగా చేశామో లేదో ఆయనకు లెక్క అప్పజెప్పాలి.
సామెతల గ్రంథ సూత్రాలు
సామెతల గ్రంథం ముఖ్యంగా యౌవనస్తులకు రాయబడింది, తెలివిగా అలోచించి ప్రవర్తించుమని వారికి బోధిస్తుంది. సామెతలు, పని గురించి చాలా విషయాలు మాట్లాడుతుంది.
► విద్యార్థులు తరగతి కోసం ప్రతి వాక్యభాగాన్ని చదవాలి.
సామెతలు 6:6-11, సామెతలు 10:5. చీమలు ప్రజలకు మంచి ఉదాహరణలు.
పని చేయమని ఎవ్వరు బలవంతం చేయనప్పటికీ అవి శ్రద్ధగా పని చేస్తాయి. ఏం చెయ్యాలో లేక ఎలా చెయ్యాలో చెప్పేవారు లేకపోయినా, అవి ఉత్పాదకంగా ఉంటాయి. చీమల నుండి, పని చేయడానికి మనల్ని ఎవరూ బలవంతం చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని నేర్చుకుంటాం. మనం పని చేయాలని అనుకోవాలి ఎందుకంటే దేవుడు మన అవసరాలు ఈ విధంగా తీరుస్తాడు.
పని చేసే సమయంలో అవి పని చేస్తాయి. పని చేయడానికి సమయం ఉంది, ఇతర కార్యకలాపాలకు, విశ్రాంతికి తీసుకోవడానికి ఒక సమయం ఉంది. “ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి?” అని అడగడం సహాయకరంగా ఉంటుంది.
పని చేసే అవకాశం ఉన్నప్పుడు అవి పని చేస్తాయి. కాలాలు మారతాయి, సంపాదించుకునే అవకాశాలు గతించిపోతాయి. మన అవకాశాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు మనకున్న అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి, లేక అది వృధా అయిపోతుంది.
తరువాత వాటికి అవసరమైన ఆహారం ఉండునట్లు అవి పని చేస్తాయి. పని చేసే సమయంలో మనం కూర్చుని విశ్రాంతి తీసుకోకూడదు. పనిలో నిమగ్నమై ఉండవలసిన సమయంలో సోమరితనంతో ఉంటే, మన భవిష్యత్తు అవసరాలు తీరవు. రేపటి అవసరాలు తీర్చుకోవడం కోసం నేడు కష్టపడి పని చెయ్యాలి.
సామెతలు 19:15, సామెతలు 20:4, సామెతలు 12:24. మన ఎంపికలకు నిజమైన ఫలితాలు ఉండే విధంగా దేవుడు ఈ లోకాన్ని ఏర్పాటు చేశాడు (గలతీయులకు 6:7).
ఒకవేళ మనం ఎల్లప్పుడు దేహం విషయంలో సోమరితనంతో ఉంటే, భౌతికంగా బలహీనులైపోతాం. ఒకవేళ మనం మన ఆలోచనల విషయంలో సోమరులుగా ఉంటే, నేర్చుకోవడం, ఆలోచించడం మరియు తర్కించడంలో మనకు ఉండే సామర్థ్యం తగ్గిపోతుంది.
పని చేయగలిగినప్పుడు, పని చేయడానికి నిరాకరిస్తే, మనకు ఆహారం ఉండదని దేవుడు చెబుతున్నాడు (2 స్సలొనీకయులకు 3:6-12 చదవండి).
మనం శ్రద్ధగా ఉంటే, దేవుడు మనకు మరెక్కువ అవకాశాలు, గొప్ప బాధ్యతలు ఇస్తాడు.
దేవుడు, మన ఎంపికలకు సాధారణ ఫలితాలు ఏర్పాటు చేశాడు. మనం మన ఫలితాల్ని ఎన్నుకోలేము కాని మన పనిని ఎన్నుకోగలం!
సామెతలు 14:23, సామెతలు 20:6. కొంతమంది చాలా తెలివైనవారనుకుంటారు, కాని పని చేయడానికి నిరాకరిస్తారు. పని ఎలా చేయాలో కలలు కంటారు, దాని గురించి మాట్లాడతారు కాని నిజానికి వారేమి చేయరు. అయితే మనం కేవలం మాట్లాడడమే కాకుండా పని చేయాలనీ దేవుడు కోరుతున్నాడు. మనం బాధ్యతలు తీసుకోవాలని, చేస్తామని చెప్పిన పనిని నమ్మకంగా చేయాలని దేవుని కోరుతున్నాడు.
సామెతలు 15:19. కొన్నిసార్లు ప్రజలు పని చేసే విధానంలో సోమరులుగా ఉంటారు. మంచి ఫలితాలు లేకపోయినా, సులభమైన మార్గాన్ని ఎంచుకుంటారు. బహుశా వారు తక్కువ ఖర్చుతో ఏదైనా చేస్తున్నారేమో కాని అది ఎక్కువ కాలం ఉండదు. బహుశా వారు తక్కువ శ్రమతో చేస్తున్నారేమో కాని చివరికి అందులో నాణ్యత ఉండదు. బహుశా వారు సవాళ్లను ఎదుర్కొని పని చేయడానికి ఇష్టపడకుండా, ఇతరులు పెట్టే ఒత్తిడికి లొంగిపోతున్నారు.
► పని చేసే విధానంలో సోమరులుగా ఉండే ప్రజల విషయంలో ఎలాంటి ఉదాహరణలు గురించి మీరు ఆలోచించగలరు?
మనం పని చేసే విధానంలో సోమరులుగా ఉన్నప్పుడు, అది మనకు, ఆ తర్వాత ఇతరులకు సమస్యలు సృష్టిస్తుందని ఈ సామెత మనకు బోధిస్తుంది. అయితే మనం సరైన పని చేసినప్పుడు, మంచి ఫలితాలు పొందుతాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా, సంపూర్ణంగా ఉంటే, తరువాత మంచి ఫలితాలు అనుభవించగలం.
► సోమరితనం కష్టాల్ని, ఆ తర్వాత సమస్యల్ని కలిగించినప్పుడు ఎలాంటి ఉదాహరణ గురించి మీరు ఆలోచిస్తారు? నమ్మకత్వానికి, శ్రద్ధకు మంచి ఫలితాలు వచ్చినప్పుడు ఎలాంటి ఉదాహరణలు గురించి మీరు ఆలోచిస్తారు?
సామెతలు 12:11, సామెతలు 21:20, సామెతలు 28:19. యౌవనస్తులారా, వ్యర్థమైన విషయాల్లో వృథా చేయడానికి దేవుడు మీకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. మీరు మీ భౌతిక మానసిక సామర్థ్యాలు మంచిగా ఉపయోగించుకోగలరని ఆయన మిమ్మల్ని నమ్మాడు. ఆయన్ను సేవించగల అవకాశాలు మీకు ఇచ్చాడు. నమ్మకమైన సేవకుడుగా ఉండాలంటే మీకు ఆశా-నిగ్రహం ఉండాలి. మీరు మీ ఆనందం కోసం ప్రతి కోరికను నెరవేర్చలేరు. మీరు మీ శక్తిని, వనరుల్ని, సమయాన్ని దేవుని ఉద్దేశ్యాలు నెరవేర్చడానికి ఉపయోగించాలి.
మీరు మీ సొంత అవసరాలు, మీ కుటుంబ అవసరాలు (1 తిమోతికి 5:8), సహాయం పొందదగిన వారి అవసరాలు మరియు సహాయం చేయడానికి ఎవరు అందుబాటులో లేకుండా ఉన్నవారి అవసరాలు మీరు (1 తిమోతికి 5:3-16, ఎఫెసీయులకు 4:28, యాకోబు 1:27, యాకోబు 2:15-16) తీర్చాలని ఆశపడుతున్నాడు.
1 స్సలొనీకయులకు 4:11-12 సెలవిస్తుంది,
…అభివృద్ధినొందుచుండవలెననియు, సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువలేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక, మీ సొంతకార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.
విశ్వాసుల విషయంలో ఇదే దేవుని చిత్తం.
► విశ్వాసులు ఎలాంటి పని చేయడానికి సిద్ధపడాలి? హోదా ముఖ్యమేనా? అలా అయితే, ఏ విధంగా ముఖ్యం లేక ఎంతవరకు ముఖ్యం?
ఆర్థిక విషయాలు గురించి చర్చిస్తూ ఈ విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం. దేవుడు, మనం పని చేయాలని చెప్పడానికి ముఖ్యమైన కారణాలు ఏంటో మనం చర్చించుకున్నాం, వాటిలో మన సొంత అవసరాలు, ఇతరుల అవసరాలు తీర్చడం కూడా భాగం. పని అనేది దేవుడు ఆహారం, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు తీర్చే మార్గం (1 తిమోతికి 6:8). అనేకచోట్ల, ప్రజలు పని చేసుకుని డబ్బు సంపాదిస్తారు, ఆ తర్వాత భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి ఖర్చు చేస్తారు. ఇంకొన్ని చోట్ల, ప్రజలకు డబ్బుకు బదులుగా ఆహారం, ఆస్తి లేక సేవతో చెల్లింపు చేస్తారు. ఎలాగైనా, దేవుడు వారి శ్రమ ద్వారా ప్రజల అవసరాలు తీరుస్తున్నాడు.
[1]ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలంటే, Spiritual Formation లో పాఠం 12 చూడండి, ఇది Shepherds Global Classroomలో అందుబాటులో ఉంది.
[2]ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలంటే, Practical Christian Living లో పాఠం 3 చూడండి, ఇది Shepherds Global Classroomలో అందుబాటులో ఉంది.
ఆర్ధిక విషయాలు
డబ్బు గురించి అనేక వాక్యభాగాలు మాట్లాడతాయి. మనం డబ్బు గురించి ఆలోచించే విధానం, దానితో వ్యవహరించే విధానం దేవునితో, ఇతరులతో మనకున్న సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యం గనుక, డబ్బు మరియు దాని ఉపయోగం విషయంలో మనకు సరైన అవగాహన ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.[1]
సామెతలు గ్రంథ సూత్రాలు
► విద్యార్థులు తరగతి కోసం ప్రతి వాక్యభాగం చదవాలి.
మన భద్రతకు మూలం ఏంటి?
1. తుదకు నీతిమంతులకు సహాయం చేయువాడు దేవుడే (సామెతలు 10:3).
2. మనం ధనమును నమ్ముకోకూడదు, ప్రేమించకూడదు ఎందుకంటే అది శక్తిలో పరిమితం, కాలంలో తాత్కాలికం (సామెతలు 11:4, 28).
► ఒక వ్యక్తికి సహాయం చేయువాడుగా, భద్రపరచువాడుగా ఏ ఆలోచనలు, వైఖరులు మరియు క్రియలు దేవునిపై నమ్మకాన్ని చూపిస్తాయి?
ధనవంతులుగా ఉండడం కంటే గొప్పవైన విషయాలు చాలా ఉన్నాయి; ఉదాహరణకు:
1. ఇతరులతో మంచి సంబంధం కలిగి ఉండడం (సామెతలు 15:17).
2. బుద్ధి జ్ఞానం కలిగి ఉండడం (సామెతలు 8:10-11).
3. దేవునియందలి భయభక్తులు కలిగి, ఆయనతో సరైన సంబంధం కలిగి ఉండడం (సామెతలు 15:16).
4. సత్ప్రవర్తనవలన గౌరవించబడడం (సామెతలు 11:16).
5. నమ్మకంగా, యధార్థంగా మరియు దయగా ఉండడం (సామెతలు 19:22).
► మీ పరిస్థితుల కారణంగా వీటిలో ఏది మీకు గొప్ప సవాలుగా ఉంది?
డబ్బును సరిగా ఉపయోగించడానికి సూత్రాలు:
1. శ్రద్ధగా, నమ్మకంగా పని చేసి డబ్బు సంపాదించండి (సామెతలు 10:4).
2. ఓపికతో క్రమంగా డబ్బు కూర్చుకొనండి (సామెతలు 13:11).
3. మీ రాబడిలో ప్రథమఫలం ఇస్తూ దేవుణ్ణి గౌరవించండి (సామెతలు 3:9-10).
► వీటిలో ఏ విషయంలో మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు?
డబ్బును దుర్వినియోగం చేయడం గురించి హెచ్చరికలు:
1. డబ్బు సంపాదించే అవకాశం కోసం దేవుని వాక్యానికి ఎన్నడు అవిధేయత చూపవద్దు (సామెతలు 10:2, సామెతలు 15:27).
2. తొందరపడి లేక అజాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవద్దు (సామెతలు 21:5).
3. ఇతరుల రుణాలు తీరుస్తామని మాట ఇవ్వొద్దు (సామెతలు 6:1-5; సామెతలు 17:18).
► మీ సంస్కృతిలో, సామెతలు గ్రంథంలోని ఈ సూత్రాల్లో ఏవి ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడతాయి?
[1]ఈ విషయం గురించి మరింత తెలుసుకోవడానికి, Practical Christian Living లో పాఠం 9 చూడండి, ఇది Shepherds Global Classroomలో అందుబాటులో ఉంది.
సన్నిహిత స్నేహితులు
► విద్యార్థులు తరగతి కోసం సామెతలు 13:20 మరియు 1 కొరింథీయులకు 15:33 చదవాలి.
యవ్వనస్తుల జీవితంలో అత్యంత శక్తివంతమైన ప్రభావాలలో సన్నిహిత స్నేహాలు ఒకటి. ప్రజలు సహజంగా తమ విలువలు పంచుకునేవారితో సన్నిహిత స్నేహితులౌతారు. కాని స్నేహం, స్నేహబంధంలో ఉన్న ప్రతి ఒక్కరిని, అయితే మంచిగా లేకపోతే చెడుగా మారుస్తుంది. ఎవరితోనైన సన్నిహిత స్నేహితులుగా ఉంటూ ఉంటే, వారు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. మీ దృక్పథాలు, తత్వాలు, ప్రాధాన్యతలు, ప్రవర్తన, ఎంపికలు, మరియు వ్యక్తిత్వం ప్రభావితమౌతాయి. మీ సన్నిహిత స్నేహితులు వారి మాదిరి ద్వారా మిమ్మల్ని ప్రభావితం చేస్తారు, అలాగే మీ ఎంపికలను ఆమోదించడం లేక తిరస్కరించడం ద్వారా మరియు ఒప్పించే తమ మాటల ద్వారా మిమ్మల్ని ప్రభావితం చేస్తారు.
► ప్రతి విద్యార్థి, ఈ ప్రతి ప్రశ్నకు సమాధానంగా 1-5 మంది పేర్లు రాయాలి:
ఆమోదం లేక ధృవీకరణ కోసం నేను సాధారణంగా ఎవరివైపు చూస్తాను?
నా జీవితంలో సమస్యలు గురించి నేను ఎవరితో మాట్లాడతాను?
నిర్ణయం తీసుకునేట ప్పుడు నేను ఎవరి సలహా కోసం చూస్తాను?
ఎవరి ప్రవర్తన నన్ను ప్రభావితం చేస్తుంది?
నేను ఎవరి తత్వాలు పంచుకుంటాను?
మీరు ఎవరి పేర్లు రాశారో వారి గురించి ఆలోచించండి. వారి గుణం ఎలా ఉంది? వారి ప్రవర్తన ఎలా ఉంది? వారి మాటలు ఎలా ఉన్నాయి? ఒకవేళ మీరు వారి మాదిరి అనుసరిస్తే, క్రీస్తును అనుసరిస్తున్నారా? (1 కొరింథీయులకు 11:1). వారిలో ఈ లక్షణాలు ఉన్నాయా:
వారు దేవుని యెడల భయభక్తులుగలవారు (ద్వితీయోపదేశకాండము 10:12, 20, కీర్తన 112:1).
వారు దేవుని వాక్యం చేత రూపించబడుతున్నారు (యోహాను 17:14-17).
సమస్త విషయాల్లో దేవుని సంతోషపరచడం, ఆయనకు విధేయత చూపడమే వారి ప్రధాన లక్ష్యం (2 కొరింథీయులకు 5:9-10).
మీరు దేవునితో సన్నిహితంగా ఉండడానికి, ఆయనకు విధేయులవ్వడానికి వారు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారా? వారు మీకు ఏది సత్యమో (దేవుని వాక్యానికి అనుగుణంగా) దాని గురించి చెబుతున్నారా, లేక వినడానికి సులభమైన దాని గురించి చెబుతున్నారా? మీకు ఇష్టమైనది చేయడానికి ప్రోత్సహిస్తున్నారా, లేక కష్టమైనా సరే దేవుని దృష్టిలో సరైన దానిని చేయమని ప్రోత్సహిస్తున్నారా?
ఒకప్పుడు ప్రభావంగల ఒక యౌవనస్తుడు ఉండేవాడు. ఇతర యౌవనస్తులు వారి ప్రవర్తన ఆమోదం కోసం అతనివైపు చూసేవారు. వారు వ్యంగ్యంగా లేక అసభ్యకరంగా మాట్లాడినప్పుడు, అతడు నవ్వుతున్నాడో లేదో చూస్తారు. వారు ఏదైనా తిరుగుబాటు చేస్తున్నప్పుడు, అతడు తన కళ్ళు ఎగరేసి తన ఆమోదం తెలుపుతున్నాడో లేదో చూస్తారు. వారు అతన్ని సంతోషపెట్టాలని చూస్తారు. వారిలో ఏ ఒక్కరు కూడా ఈ ప్రశ్నలను పరిగణలోనికి తీసుకోరు: నాకు అతని ఆమోదం ఎందుకు అవసరం? నేను సంతోషపెట్టడానికి ప్రయత్నించవలసిన వ్యక్తి ఇతడేనా? అతని ప్రవర్తన, గుణం నాకు మంచి మాదిరేనా?
ఈ విషయాలు గురించి ఆలోచించడానికి కృషి అవసరం. విశ్వాసులు సన్నిహిత స్నేహితుల్ని, గొప్ప ప్రభావితుల్ని ఎంపిక చేసుకునే విషయంలో ఉద్దేశ్యపూర్వకంగా ఉండాలి. నిజానికి, తన ప్రజలు ఆత్మీయతలో పరిపక్వత లేనివారిని లేక అవిశ్వాసులైనవారిని ప్రభావితం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, కాని వారు మన సన్నిహిత సహచరులుగా, సలహాదారులుగా, ప్రభావితులుగా ఉండడానికి అర్హులు కారు. మనం వారి ఆమోదం కోసం చూడకూడదు.
► ఒక విద్యార్థి తరగతి కోసం కీర్తన 101 చదవాలి.
ఈ కీర్తనను దావీదు రాశాడు. అతడు దేవునికి భయపడ్డాడు. యధార్థంగా జీవిస్తానని దేవునితో నిబంధన చేసుకున్నాడు. తనను ప్రభావితం చేయడానికి అతడు అనుమతించేవారు దేవుని ఆజ్ఞలు నెరవేర్చడంలో అతనికి సహాయపడతారు లేక భంగం కలిగిస్తారని అతనికి తెలుసు. ఈ కారణం చేత, తనను ప్రభావితం చేయడానికి కేవలం నమ్మకమైన, దైవభక్తిగలవారిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మనం దావీదు వలే రాజులము కాదు గనుక దావీదు మాట ఇచ్చినట్లుగా దుష్టులను శిక్షించే అధికారం లేక బాధ్యత మనకు లేదు. అయినప్పటికీ, ఇతర విషయాల్లో మనం దావీదును అనుసరించాలి. యధార్థంగా జీవించడానికి కట్టుబడి ఉండాలి. మన సన్నిహిత స్నేహితులుగా, గొప్ప ప్రభావితులుగా కేవలం దైవభక్తిగల ప్రజలను మాత్రమే ఎన్నుకోవడానికి నిర్ణయించుకోవాలి.
నిర్ణయాలు తీసుకోవడం
ఆరంభ వయోజన దశ నిర్ణయాలు తీసుకునే సమయం. ఆ నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాలు జీవితకాల (లేక నిత్య) ఫలితాలు కలిగియుంటాయి.[1] మనం మన ఎంపికలు పరిగణలోకి తీసుకునే ముందు ఈ క్రింది విషయాలు పరిగణలోకి తీసుకోవలసి ఉంది:
ఈ చర్య దేవుడు నన్ను ఏం కావాలని కోరుతున్నాడో దానికు అనుగుణంగా ఉందా? “నువ్వు నీలా ఉండు.” “నీకు నువ్వు నిజాయితీగా ఉండు.” నీ మనసు చెప్పేది చెయ్” అని సమాజం చెబుతుంది. అయితే మనం క్రీస్తుకు నిజాయితీగా ఉండడానికి పిలువబడ్డాం కాని మనకు మనం నిజాయితీగా ఉండడానికి పిలువబడలేదు. నిజానికి, మన సొంత కోరికలు ఆయనకు విధేయత చూపే విషయంలో అవరోధంగా ఉన్నప్పుడు వాటిని విస్మరించాలని ఆయన చెప్పాడు (మత్తయి 16:24-26). దేవుడు తన నీతి ప్రామాణికల ప్రకారం మనం జీవించాలని ఆశపడుతున్నాడు. ఆశీర్వదించబడిన ప్రజలు, ఆయనకు భయపడువారు, అన్నిటిలో ఆయనకు విధేయత చూపువారి గురించి ఆయన వివరిస్తున్నాడు (కీర్తన 15, కీర్తన 112, మత్తయి 5:3-11). మనం ఆయన్ను నమ్మకంగా వెంబడిస్తుండగా, దేవుడు ఆశించే ప్రజలుగా మనం మారిపోతాం.
ఈ చర్య నా ప్రతిష్ఠను ఎలా ప్రభావితం చేస్తుంది? మనం చేసుకునే ప్రతి ఎంపిక విషయంలో, మనం మన ఖ్యాతిని నిర్మించుకుంటాం (సామెతలు 20:11). దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడో దాని గురించి ఎక్కువ శ్రద్ధ చూపించాలనే విషయం వాస్తవం. అయితే మనం యధార్థవంతులుగా ఉన్నప్పుడు, ఇతరులను మంచిగా ప్రభావితం చేస్తూ క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా ఉంటాం. మనం గొప్ప సంపద కంటే మంచి పేరుకు ప్రాధాన్యత ఇవ్వాలని సామెతలు 22:1 బోధిస్తుంది.
ఈ ఎంపికకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? నేడు మంచి ఎంపికలు చేసుకోవడం ద్వారా రేపటికి సిద్ధపడాలని సామెతలు 22:3 చూపిస్తుంది. మనం మన ఎంపికల గురించి అలోచించినప్పుడు, ప్రతి ఎంపికకు వచ్చే ఫలితాల గురించి కూడా ఆలోచించాలి. మన ఎంపికలు మన జీవితాన్ని, ఇతర జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
మన ఎంపికలు, ప్రవర్తనలు హృదయ ప్రేరణల నుండి వస్తాయని సామెతలు 4:23 సెలవిస్తుంది. మనం దేవుని సంతోషపెట్టే మంచి ఎంపికలు చేసుకోవాలంటే, మనం ఆయనకు నమ్మకంగా ఉండేలా చూసుకోవాలి (ద్వితీయోపదేశకాండము 6:2, 5-6, ద్వితీయోపదేశకాండము 13:4).
[1]ఈ విషయం గురించి మరింత తెలుసుకోవడానికి, Practical Christian Living లో పాఠం 5 చూడండి, ఇది Shepherds Global Classroomలో అందుబాటులో ఉంది.
శరీర ఆరోగ్యం
యువకులు, తినే ఆహారం, శారీరక వ్యాయామం, ఇతర వ్యాయామాలు, నిద్ర అలవాట్ల వంటి వాటితో సహా వ్యక్తిగత ఎంపికలకు బాధ్యత వహిస్తారు. ఈ విషయాలన్నిటిలో ఆశా-నిగ్రహం అతి ముఖ్యమైంది (1 కొరింథీయులకు 9:27). విశ్వాసుల శరీరాలు దేవుని ఆలయమని, క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడినవని విశ్వాసులు గుర్తుంచుకోవాలి (1 కొరింథీయులకు 6:19-20). మనం దేవుని సేవకులం గనుక, ఈ చర్యలన్నిటిలో మంచి ఎంపికలు చేసుకునేలా మనం మన శరీరాలను శ్రద్ధగా చూసుకోవాలి, మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి, అప్పుడు మనం ఆయన కోసం ఉత్తమంగా ఉండగలం.[1]
► విద్యార్థులు తరగతి కోసం 1 కొరింథీయులకు 6:12-13, 19-20, మరియు 1 కొరింథీయులకు 10:31 చదవాలి.
గత వారంలో మీ ఆహార ఎంపికలు, పరిమాణాల గురించి ఆలోచించండి. బహుశా మీరు తినడానికి చాలా రకాల ఆహారాలు, ఎంపికలు ఉండొచ్చు. లేక, తక్కువ ఆహారం తక్కువ ఎంపికలు ఉండొచ్చు. ఏదేమైనా, మీరు తినే తిండి, త్రాగే నీరు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి. ఒకవేళ యేసు మీతో కూర్చుని భోజనం చేయడానికి అవకాశం ఉంటే, మీరు సాధారణంగా ఎంచుకునే ఆహారాన్ని, దాని పరిమాణాన్ని ఆయన ముందు కూడా ఎంచుకుంటారా? ఇది ఒక వెర్రి ప్రశ్నగా అనిపించవచ్చు, కానీ బహుశా ఇది తినేటప్పుడు శ్రద్ధగా, కృతజ్ఞతతో మరియు ఆశా-నిగ్రహంతో ఉండాలని గుర్తుచేయడానికి ఉపయోగపడుతుంది.
విశ్వాసులు ఆశా-నిగ్రహం చూపవలసిన మరొక కోణం, నిద్ర. మనం సోమరులుగా ఉండి, అతిగా నిద్రపోకూడదు (సామెతలు 6:10-11, సామెతలు 20:13), అయితే మన శరీరాలకు క్రమం తప్పక తగినంత విశ్రాంతి అవసరమయ్యేలా దేవుడు రూపొందించాడు (కీర్తన 3:5). ఆరోగ్యకరమైన యువకులకు ప్రతి రాత్రి 6-8గంటల నిద్ర అవసరం.
శ్రద్ధగా పనిచేసేవారికి నిద్ర ఒక వరమని ప్రసంగి 5:12 సెలవిస్తుంది. సామెతలు 3:24 మరియు కీర్తన 4:8 దేవుడు తన పిల్లలకు ఇచ్చే ప్రశాంతమైన నిద్ర గురించి మాట్లాడుతుంది. ఇలాంటి నిద్ర మన శరీరాలను పునరుద్ధరిస్తుంది. దేవుడు అనుగ్రహించే సమాధానం ద్వారా, నమ్మదగిన మన దేవుడు మనల్ని దృష్టిస్తున్నాడనే నమ్మకంతో పగటికాల చింతలన్నిటిని మరచిపోతాం. ప్రశాంతమైన నిద్ర శరీరాన్ని మనస్సును ఉత్తేజపరుస్తుంది, రాబోవు కార్యాకలాపాలకు, పరిచర్యకు మనల్ని సిద్ధపరుస్తుంది.
జ్ఞానం, అవగాహన, మరియు వివేచనతో కూడిన జీవితాన్ని గడపడానికి సూచనలు ఇచ్చే సామెతలు గ్రంథంలోని ఒక భాగంలో సామెతలు 3:24 కనిపిస్తుంది. మీకు ప్రశాంతమైన నిద్ర కావాలంటే, టి.వి. లేక సినిమాలు చూసే సమయాన్ని, ఇంటర్నెట్ లేక ఫోన్ వాడకాన్ని, మరియు స్నేహితులతో గడిపే సమయాన్ని తగ్గించుకోవడంతో పాటుగా మీరు మీ జీవితంలోని ఇతర విషయాల్లో తెలివిగల నిర్ణయాలు తీసుకోవాలి.
నిద్ర అనేది మీ ఆహార ఎంపికల ద్వారా, తీసుకున్న మోతాదును బట్టి, చేసిన వ్యాయామాన్ని బట్టి, కష్టమైన పరిస్థితిని నిర్వహించిన విధానాన్ని బట్టి, లేక డబ్బును ఖర్చు చేసిన విధానాన్ని బట్టి ప్రభావితమౌతుంది. ఇతరులతో మనకున్న సంబంధం గలతీయులకు 5:22-23లో రాయబడిన ఆత్మ ఫలాలతో నింపబడినప్పుడు ప్రశాంతమైన నిద్ర వస్తుంది.
► పైభాగంలో ఇచ్చిన వాక్యభాగాన్ని చదవడానికి సమయం కేటాయించండి. ఈ లేఖన భాగాల్లో ఇవ్వబడిన సూత్రాల ఆధారంగా మీ నిద్రను పరీక్షించండి. దేవుడు ఉద్దేశించిన రీతితో శరీరం పనిచేయడానికి దానికి కావలసిన విశ్రాంతిని మీరు ఇస్తున్నారా? కీర్తనలలోని చరణాల సందర్భాన్ని గమనించండి: దావీదు ఒత్తిడికి గురైన పరిస్థితిలో దానిని రాశాడు, అయినప్పటికీ నిద్ర ద్వారా తన శరీరాన్ని పునరుద్ధరించడానికి సహాయం చేయడంలో దేవుని నమ్మకత్వానికి సాక్ష్యం ఇచ్చాడు.
[1]ఈ విషయం గురించి మరింత తెలుసుకోవడానికి, Practical Christian Living లో పాఠం 13 చూడండి, ఇది Shepherds Global Classroomలో అందుబాటులో ఉంది.
ఒత్తిడిని ఎదుర్కోవడం
దేవుని రూపకల్పన ద్వారా, ఆరంభ వయోజనులకు అనేక బాధ్యతలు, చింతలు ఉంటాయి, వాటికి శ్రద్ధ అవసరం, అవి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి (విలాప 3:27). ఒక వ్యక్తి తన చదువు పూర్తి చేసుకుని, వ్యాపారం మొదలుపెట్టి, ఉద్యోగం లేక అనేక ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు. యువకుడి ఉద్దేశ్యపూర్వకంగా దృష్టి నిలిపే అనేక సంబంధాలు ఉంటాయి. ఆర్ధిక విషయాలు, రవాణా అవసరాలు, ఇళ్లు వీటన్నిటికి శ్రద్ధ అవసరం, కాని ఒత్తిడి కలిగిస్తాయి.
ఒత్తిడిని ఇలా నిర్వచించారు, “మనల్ని బెదిరించే లేక మనల్ని సవాలు చేసే సంఘటనలకు శారీరక మరియు మానసిక ప్రతిస్పందన.”[1] మీరు మీ పరిస్థితుల్ని ఎలా చూస్తారో ఆలోచించండి. మీరు అనుభవిస్తున్న పరిస్థితిని మానసికంగా ఎలా ఎదుర్కొంటారు?
మీ భవిష్యత్తులో ఏదైనా జరుగబోతున్నప్పుడు, మీరు దాని గురించి ఎలా ఆలోచిస్తారు? అవకాశాలు గురించి ఎలాంటి భావాలను మీరు అనుమతిస్తారు? ఆ పరిస్థితితో ఎలా వ్యవహరిస్తారో ఏ దృక్పథం ప్రభావితం చేస్తుంది? మీ సహజ స్వభావం, వ్యక్తిత్వం ఏంటి (సామెతలు 15:15)?
మీ అభిప్రాయం, స్వభావం, మరియు వ్యక్తిత్వం జీవిత పరిస్థితులకు ప్రతిస్పందించే విధానాన్ని మీరు అనుభవించే ఒత్తిడి స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి జీవితం సహజమైనప్పటికీ, ఒత్తిడితో ఎలా వ్యవహరిస్తారనేది వ్యక్తిగత విషయం. కొన్నిసార్లు ఆందోళన వలన తలనొప్పి, కండరాలు నొప్పి, అనారోగ్యం, అధిక రక్తపోటు, అల్సర్లు, ఇతర మానసిక భావోద్వేగ, శారీరక బలహీనతలు సంభవిస్తాయి (సామెతలు 12:25). ఒత్తిడికి సరిగా స్పందించనప్పుడు, మీరు క్రీస్తుకు చేసే సేవకు భంగం కలుగుతుంది. దీని కారణంగా, దేవుని వాక్యం చింతించవద్దని చెప్పడంలో ఆశ్చర్యం ఏమి లేదు.
► విద్యార్థులు తరగతి కోసం మత్తయి 6:34, 1 పేతురు 5:7, మరియు కీర్తన 105:4 చదవాలి.
మనం విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, పరిమితులు లేని ఏకైక దేవుని నమ్మి, ఆయన మీద ఆధారపడాలి, బలంలో, జ్ఞానంలో, మంచితనంలో ఆయన పరిపూర్ణుడు. ఆయన తన పిల్లల్ని పరిపూర్ణ శ్రద్ధ చూపుతాడు. మనం ఆయన మీద ఆధారపడడాన్ని గ్రహించాలని, ప్రతిదీ ఆయనకు చెప్పాలని, ఆయన బలం కోసం వేడుకోవాలని కోరుతున్నాడు. మనం అలా చేస్తుండగా, ఆయన మనకు శాంతి, విశ్రాంతి, మనకు కావలసిన ప్రతిదీ దయచేస్తాడు. మన యౌవ్వనంలో, మనం దేవుని యెదుట నిశ్చలంగా, నిశబ్దంగా ఉండడం నేర్చుకోవాలి మరియు ఆయన నడిపింపు కోసం ఎదురుచూడాలి (కీర్తన 46:10, విలాప 3:25-27).
► మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒత్తిడి పరిస్థితులను జాబితా చేయండి. దేవుని వాక్య ఆధారంగా మీ ప్రతిస్పందన ఏంటి?
[1]Robert S. Feldman, Discovering the Lifespan, 2nd ed. (Upper Saddle River, NJ: Pearson, 2012), 317.
సమూహ చర్చ కోసం
► ఈ పాఠంలో, ఏ ఆలోచనలు లేక సూత్రాలు మీకు క్రొత్తగా ఉన్నాయి? యౌవనస్తుల జీవితంలోని ఈ రంగాలకు సంబంధించిన ఇతర బైబిల్ సూత్రాలు ఏంటి?
► ఈ పాఠంలో మీరు చదివిన వాటి ద్వారా మీ వ్యక్తిగత జీవితం ఎలా ప్రభావితమౌతుంది?
► మీ సంఘంలో, యౌవనస్తులైన విశ్వాసుల మధ్య ఈ విషయాల్లో ఏవి చర్చించవలసిన అవసరం ఉంది?
► మీకు తెలిసిన క్రైస్తవ యవ్వనస్తులను ఈ రంగాల్లో ఈ విధంగా ఆలోచించడానికి, బైబిలు ప్రకారంగా ప్రవర్తించడానికి వారిని మీరెలా ప్రభావితం చేయగలరు?
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
జీవితంలోని ప్రతి దశలో ఏ విధంగా జీవించాలో బోధించే నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు. మా యౌవన ప్రాయంలో ఫలభరితమైన, ఉత్పాదకమైన జీవితాలు జీవించునట్లు మమ్మును సిద్ధపరస్తున్నందుకు వందనాలు.
నీవు మాకిచ్చిన బలం, వనరులు, అవకాశాలు నమ్మకంగా ఉపయోగిస్తూ నీకు మహిమ తెచ్చేవారంగా ఉండడానికి సహాయం చేయుము. ఇతరులపై దైవిక ప్రభావం చూపడానికి, దైవభక్తిగల స్నేహితుల్ని, సలహాదారుల్ని ఎన్నుకోవడానికి మాకు సహాయం చేయుము.
మేము తెలివైన నిర్ణయాలు తీసుకుని, మా శరీరాలు, మనసులు, మరియు ఆత్మలతో నిన్ను ఘనపరచుదముగాక.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) 1 తిమోతికి 4:12లో, నిర్దిష్టమైన విషయాల్లో మాదిరి ఉండాలని పౌలు తిమోతికి ఉపదేశించాడు. అవేమిటో రాతపూర్వకంగా వివరించండి. ఆ తర్వాత, యౌవనస్తుల జీవితాల్లో వీటిని ఎలా అన్వయించుకోవాలో వివరించండి. ప్రతి దానికి కనీసం ఒక ఆచరణాత్మక ఉదాహరణ ఇవ్వండి.
(2) ఈ పాఠం నుండి ఒక విషయం ఎంపిక చేసుకోండి:
పరిపక్వత మరియు ప్రవర్తన
పని
ఆర్ధిక విషయాలు
సన్నిహిత స్నేహితులు
నిర్ణయాలు తీసుకోవడం
భౌతిక ఆరోగ్యం
ఒత్తిడి
మీరు ఎన్నుకున్న విషయం గురించి కనీసం మూడు పేరాలు రాయండి:
ఆ విషయానికి సంబంధించి బైబిలు సూత్రాలు సంగ్రహించండి.
ఆ సూత్రాలకు కట్టుబడి ఉండడం ద్వారా వచ్చే కొన్ని అనుకూల ఫలితాలు గురించి వివరించండి.
ఆ సూత్రాల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు వచ్చే కొన్ని ప్రతికూల ఫలితాలు గురించి వివరించండి.
అనుకూల, ప్రతికూల ఫలితాలు గురించి రాస్తున్నప్పుడు, ఒక వ్యక్తి చేసుకున్న ఎంపికలు ఇతర వ్యక్తుల మీద చూపే ప్రభావాలు గురించి ఆలోచించండి: ఆ వ్యక్తి, వారి కుటుంబం, వారి సమాజం, మరియు వారి సంఘం.
Print Course
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.