సూసన్న వెస్లీ 19మంది పిల్లలకు జన్మనిచ్చింది, కాని ఆ కాల పరిస్థితుల్ని బట్టి తొమ్మిదిమంది చనిపోయారు. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీతో పాటుగా 10మంది పిల్లల్ని పెంచింది. ఆమె కుమారుడైన జాన్ పెద్దవాడైన తర్వాత, పిల్లల్ని పెంచే విషయంలో ఆమె పాటించిన పద్ధతి ఏంటో దానిని రాసి ఇవ్వమని కోరాడు, అందుకు ఆమె ఈ వివరణతో అతనికి ఒక లేఖ రాసి పంపింది.[1]
పిల్లలు మాట్లాడటం మొదలుపెట్టగానే పరలోక ప్రార్థన బోధించింది, ప్రతి ఉదయం సాయంత్రం దాన్ని పదే పదే చెప్తుండేవారు. పిల్లలు ప్రతిరోజు కలిసి లేఖనంలో ఒక అధ్యాయం చదివేవారు. ఆ రోజుల్లో చాలామంది స్త్రీలు విద్యలేని పామరులు, కాని సూసన్న పిల్లలందరికి చదువు నేర్పించాలని పట్టుబట్టింది. పని నేర్చుకోవడం కంటే విద్యకు ఎక్కువ ప్రాధాన్యత చూపించింది.
తిరుగుబాటే పాపాలన్నిటికి, దుఃఖాలన్నిటికి మూలమని సూసన్న చెప్పింది. పిల్లలు తమ ఆవేశాల్ని నియంత్రించుకుని అధికారానికి లోబడాలని బోధించింది. పని పరిపూర్ణంగా చేయకపోయినా, ప్రతి విషయంలో విధేయత చూపినప్పుడు అది మెచ్చుకోబడుతుందని చెప్పింది. తప్పులు సహించవచ్చుగాని అవిధేయతకు తగిన శిక్ష ఉంటుంది.
కుటుంబమంతా ఎల్లప్పుడు కలిసి భోజనం చేసేవారు¸ మరియు భోజనంలో ఏదైతే వడ్డించారో ఎటువంటి ఫిర్యాదు లేకుండా తినడం పిల్లలు నేర్చుకున్నారు.
“బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును…” (సామెతలు 22:15) అని బైబిల్ మాట్లాడుతుంది. పిల్లలు పుట్టినప్పుడే అబద్ధాలు చెబుతారని కీర్తనాకారుడు చెప్పాడు, “...పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు” (కీర్తన 58:3). ఇది వాస్తవం కాబట్టి పిల్లల్ని సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.
ఒక మూడు సంవత్సరాల పిల్లవాడిని, ఒక చాక్లెట్ ఇప్పుడే కావాలా లేక వారానికి ఒక పెట్టెడు చాక్లెట్లు కావాలా అని అడగండి. తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి ఎంపిక గురించి స్పష్టంగా వివరించినప్పటికీ, చాలామంది పిల్లలు వెంటనే ఆ ఒక్క చాక్లెట్ ని ఎంపిక చేసుకుంటారు. పిల్లల దుష్ప్రవర్తనను సరిదిద్దడానికి వివరణ ఒకటే సరిపోదని ఈ దృష్టాంతం మనకు చూపిస్తుంది.
పిల్లవాడిని సరిదిద్దడానికి తప్పొప్పుల గురించి వివరిస్తే చాలదు, ఎందుకంటే
1. పిల్లలు పెద్దవారి ఆలోచనను అర్థం చేసుకోలేరు (1 కొరింథీయులకు 13:11).
2. పిల్లలు తమ చర్యల వలన వచ్చే దీర్ఘకాల ఫలితాల్ని పరిపూర్ణంగా చూడలేరు
3. పిల్లలు తమ ఆవేశాల్ని, కోరికల్ని హేతుబద్ధంగా నియంత్రించుకునేంత పరిపక్వత స్థితిలో ఉండడు.
పిల్లవాడిని శారీరకంగా బాధించడం బహుశా క్రూరంగా అనిపిస్తుంది, కాని తల్లిదండ్రులు, మరింత ఘోరమైన హాని నుండి తప్పించడానికి ఆ విధంగా చేస్తారు: “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును” (సామెతలు 13:24). ఉదాహరణకు, మంట దగ్గర ఆడుకునే పిల్లోడు అందులో పడిపోతాడు, మరియు గాయాలపాలౌతాడు ఎందుకంటే ప్రమాదం గురించి వాడికి తెలీదు. కాని వాడు మంట దగ్గరకు వెళ్లినప్పుడు తల్లి వాడిని కొడితే, ఆ చిన్న బాధ పెద్ద ప్రమాదం నుండి తప్పిస్తుంది.
కొందరు, తమను ప్రేమించనివారి నుండి శారీరక బాధలు అనుభవిస్తారు. ఈ కారణం చేత, పిల్లల్ని శారీరకంగా శిక్షించే విధానాన్ని వారు ద్వేషిస్తారు. అయితే, సరైన దిద్దుబాటును నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు తర్వాత తమ పిల్లలకు చాలా ఇబ్బంది కలిగిస్తారు.
► విద్యార్థులు తరగతి కోసం సామెతలు 19:18 మరియు సామెతలు 29:17 చదవాలి.
పిల్లవాడు తల్లిదండ్రుల్ని ఎదిరిస్తున్నాడనే అర్థం చేసుకునే వయస్సు రాగానే దిద్దుబాటు మొదలుపెట్టాలి. తాను సహరించట్లేదని చిన్న పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది.
పిల్లవాడు చిన్నవాడిగా, సున్నితంగా ఉన్నప్పుడే చాలా దిద్దుబాటు జరగాలి (సామెతలు 22:15). కాలక్రమేణా గట్టిపడి, కావలసిన ఆకారంలోకి మలచడం కష్టతరం అయ్యే మట్టిలాగే, కాలం గడిచేకొద్దీ పిల్లల స్వభావాన్ని తీర్చిదిద్దడం కష్టం అవుతుంది. ఒకవేళ పిల్లవాడు 10 సంవత్సరాల వయసు తర్వాత కూడా తన తల్లిదండ్రులను నిరంతరం ధిక్కరిస్తూ ఉంటే, తల్లిదండ్రులు తమ దిద్దుబాటులో విజయం సాధించలేదని, వారి అంతిమ విజయావకాశాలు చాలా తగ్గుముఖం పడుతున్నాయని అర్థం. పిల్లవాడికి వయసు పెరిగే కొద్దీ శారీరక దిద్దుబాటు తక్కువ ప్రభావం చూపుతుంది. పిల్లవాడు పెద్దయ్యాక దిద్దుబాటు చేయడం సులభం అవుతుందని తల్లిదండ్రులు భావించడం పొరపాటు; అది మరింత కష్టమవుతుంది, చివరికి అసాధ్యం అవుతుంది.
పిల్లలు యుక్తవయసులోకి వచ్చే కొద్దీ, చిన్నతనంలో మాదిరిగా వారిని భౌతికంగా సరిదిద్దలేము. యువతీ యువకులకు వారి ప్రవర్తన పరిణతి చెందినది కాకపోయినా, వారికి గౌరవం అవసరం. తల్లిదండ్రులు వినోదం, ఫోన్ సమయం లేదా సామాజిక కార్యకలాపాలను పరిమితం చేయడం వంటి ఇతర మార్గాల ద్వారా వారిని సరిదిద్దవచ్చు, కానీ ప్రేమతో కూడిన, జాగ్రత్తగా చెప్పే సంభాషణ చాలా ముఖ్యం. యుక్తవయసులో ఉన్నవారు నిజమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తల్లిదండ్రులు గ్రహించాలి. తల్లిదండ్రులకు వారిపై ప్రభావం ఉన్నప్పటికీ, ఆ యవ్వన వ్యక్తి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరచకుండా, తన నిర్ణయాల పర్యవసానాలను అనుభవించకుండా నిరోధించలేరు.
కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలను శారీరకంగా శిక్షించేటప్పుడు ఎంత కఠినంగా ఉండాలో తెలియదు. ఒక బిడ్డ శిక్ష తర్వాత కూడా కోపంగా, ఎదురు తిరుగుతూ ఉంటే, ఆ శిక్ష సరిపోనంత కఠినంగా లేదు (శారీరక శిక్షతో సరిదిద్దడానికి చాలా పెద్ద వయసు ఉన్న పిల్లలకు ఈ సూత్రం వర్తించదు). ఆ బిడ్డ తన అవిధేయతకు పశ్చాత్తాపపడి, అధికారాన్ని అంగీకరించేలా చేసేంత కఠినంగా శిక్ష ఉండాలి. శిక్ష గాయాలు కలిగించకూడదు. చర్మంపై గాయాలు లేదా ఎక్కువసేపు ఉండే గుర్తులు కలిగించే శిక్ష చాలా కఠినమైనది కావచ్చు.
దేవుడు పిల్లలతో వ్యవహరించే విధానాన్ని వివరించడానికి, బైబిల్ శారీరక శిక్ష దృష్టాంతాన్ని ఉపయోగిస్తుంది.
► విద్యార్థులు తరగతి కోసం సామెతలు 3:11-12 మరియు హెబ్రీయులకు 12:5-8 చదవాలి.
దేవుడు తన పిల్లల్ని ప్రేమిస్తున్నాడు గనుక వారిని క్రమశిక్షణలో ఉంచుతున్నాడని ఈ లేఖన భాగాలు మనకు బోధిస్తాయి. అలాగే, తండ్రి తన కుమారుని ప్రేమిస్తున్నాడు గనుక క్రమశిక్షణలో ఉంచుతాడు. సరైన క్రమశిక్షణ ప్రేమకు ప్రతీక. క్రమశిక్షణ లేకపోవడం అంటే ప్రేమ లేకపోవడమే.
శారీరక దిద్దుబాటు పిల్లవాడికి ఆశా నిగ్రహాన్ని బోధిస్తుంది ఎందుకంటే తాను ఒకవేళ తప్పు చేస్తే శిక్షించబడతాడని తెలుసు గనుక, శోధనను ఎదురించడం నేర్చుకుంటాడు. తప్పు చేయాలనే శోధనను జయించినప్పుడు, అతడు బలమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అతడు పరిణతి చెందినప్పుడు, శారీరక శిక్షవలన కాకుండా దాని పర్యావసానాల్ని గ్రహించి శోధనను జయిస్తాడు. ఏదేమైనా, క్రమంగా దిద్దుబాటు పొందని పిల్లవాడు, పెద్దవాడై శోధన చెడ్డదని తెలిసినప్పటికీ దానిని అడ్డుకునే శక్తి లేకుండా ఉంటాడు.
తల్లి లేదా తండ్రి, పిల్లవాడు తినాలని కోరుకున్నందుకే కేవలం మిఠాయి మాత్రమే ఇస్తున్నాడని ఊహించండి. అతడు పిల్లవాడిని బాధ పెట్టకూడదని అనుకుంటున్నాడు, కాని నిజానికి అతడికి హాని చేస్తున్నాడు. అదే విధంగా, ఎప్పుడూ పిల్లవాడి ప్రవర్తనకు తలొగ్గే తల్లిదండ్రులు, తమ పిల్లల స్వభావానికి మరియు భవిష్యత్ పరిస్థితులకు హాని కలిగిస్తున్నారు. దిద్దుబాటు చేయని తండ్రి తన కుమారుని ద్వేషిస్తున్నాడని బైబిల్ కూడా చెబుతోంది (సామెతలు 13:24).
సరిహద్దులు లేని కుటుంబంలో పెరిగే పిల్లవాడు అనందంగా ఉండడు. హద్దులు భద్రత కలిగిస్తాయి. వాదించడంవల్ల, ఏడ్వడంవల్ల తనకేదైనా లభిస్తుందనే విధానాన్ని పిల్లవాడు నేర్చుకుంటే, ఎల్లప్పుడు అలాగే చేస్తుంటాడు కాని సంతోషంగా ఉండలేడు. పిల్లలు భద్రంగా ఉన్నప్పుడు, పరిమితుల్లో నడిపించబడుతున్నప్పుడు సంతోషంగా ఉంటారు, ఏదైనా పొందుకోవడానికి పోరాడాలి, నియంత్రణను నిరోధించాలని భావించరు. క్రమశిక్షణ నొందని పిల్లవాడు సంతోషంగా ఉండలేడు.
పిల్లోడు పెరిగి పెద్దవాడైనప్పుడు, తాను కోరుకున్న ప్రతిదీ లోకం ఇవ్వదు. మర్యాద లేకుండా మూర్ఖంగా స్వార్థంగా, బాధ్యతారహితంగా ఉంటే అతనికి గౌరవం రాదు, పదవులు ప్రమోషన్లు కూడా రావు. అందుకే తల్లిదండ్రులు జీవితాన్ని ఎదుర్కొనే విధంగా పిల్లలను సిద్ధపరచాలి. తల్లిదండ్రులు పిల్లల్ని కాదు; పెద్దల్ని పెంచుతున్నారని తప్పక గుర్తుంచుకోవాలి.
తల్లిదండ్రులు తమ పిల్లల్ని సరిదిద్దుతున్నారంటే, వారిని నమ్మకమైన, గౌరవనీయమైన మంచి వ్యక్తులుగా ఎదగడానికి సహాయపడుతున్నారని వారికి వివరించాలి, చూపించాలి.
► విద్యార్థులు తరగతి కోసం సామెతలు 22:15, సామెతలు 23:13-14, మరియు సామెతలు 29:15 చదవాలి.
దిద్దుబాటు పిల్లవాడి అభివృద్ధి కోసమేనని గుర్తుంచుకోవాలి. పిల్లవాడు తాను చేసిన తప్పును అర్థం చేసుకుని, పశ్చాత్తాపపడినప్పుడు, శారీరక శిక్ష అవసరం లేకపోవచ్చు. దీని ఉద్దేశ్యం సరిదిద్దడం, న్యాయం కాదు; పిల్లవాడికి తగిన శిక్ష పడేలా చూసుకోవలసిన అవసరత తల్లిదండ్రులకు లేదు.
► ఒక తల్లిదండ్రులు తమ బిడ్డను సరిదిద్దడానికి తీసుకునే చర్యలకు, భయపెట్టి, బెదిరించి ఇతరులను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకునే వ్యక్తి చర్యలకు మధ్య తేడా ఏమిటి?
ఒక హింసాత్మకమైన వ్యక్తి తనకు కావలసిన దానిని పొందుకోవడానికి ఇతరులకు హాని కలిగించడానికి ఇష్టపడతాడు. తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రేమిస్తారు. పిల్లవాడి ప్రయోజనం కోసం శారీరకంగా శిక్షిస్తారు. ప్రేమగల తల్లిదండ్రులు పిల్లవాడికి హాని కలిగించడానికి ఇష్టపడరు. ఎగతాళి చేస్తూ, చిన్నచూపు చూసేవారు, బాధించేవారు తనను ప్రేమిస్తున్నారని ఎవరు భావించలేరు కాని దిద్దుబాటు పొందుతున్నప్పుడు కూడా తాను ప్రేమించబడుతున్నాడని పిల్లవాడు తెలుసుకోగలడు. తన తల్లిదండ్రుల అధికారాన్ని బట్టి తన జీవితం ఉత్తమంగా ఉందని గ్రహించగలడు.
కొంతమంది తల్లిదండ్రులు కోపం లేక క్రూరత్వం కారణంగా అప్పుడప్పుడు కఠినంగా శిక్షిస్తారు. పిల్లల్ని శారీరకంగా, మానసికంగా గాయపరుస్తారు. జీవితంలో వారికున్న ఒత్తిళ్లు నిరాశలు తగ్గించుకోవడానికి తమ పిల్లల్ని శిక్షిస్తారు. ఇది చాలా తీవ్రమైన సమస్య గనుక గమనిస్తున్నవారు దీనిని సహించకూడదు. పిల్లవాడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, మిత్రులు, పొరుగువారు, మరియు బంధువులు ఖచ్చితంగా ఎదుర్కోవాలి. శారీరకంగా వేధించే వ్యక్తి యొక్క భాగస్వామి, బంధువులు, మిత్రులు లేక పాస్టర్ సహాయం తీసుకోవాలి. పిల్లల్ని కాపాడడం చాలా ప్రాముఖ్యం.
► కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పుచేసినప్పుడు బహిరంగంగా వారిని అవమానిస్తారు. ఇది దిద్దుబాటుకు సరైన విధానమేనా?
► ఒక విద్యార్థి తరగతి కోసం ఎఫెసీయులకు 6:4 చదవాలి.
తల్లిదండ్రులు తనను ప్రేమిస్తున్నారని, దిద్దుబాటు తన ప్రయోజనం కోసమని పిల్లవాడు నిర్థారించుకోవాలి. తల్లిదండ్రులు పిల్లవాడిని అవమానించినప్పుడు, ప్రేమించబడుతున్న భావన అతనిలో కలుగదు. అతడు మరింత బాధకు గురై, తల్లిదండ్రుల అధికారం హానికరమైందని భావించి, తప్పించుకోవాలని అనుకుంటాడు. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని బహిరంగంగా శిక్షించక ఏకాంతంగా శిక్షించాలి, ఇతరుల ఎదుట అవమానించకూడదు. తల్లిదండ్రులు సహనంగా సున్నితంగా పిల్లల్ని హెచ్చరించాలి, సరిదిద్దాలి.[1] సామెతలు 16:21b ఇలా సెలవిస్తుంది "... రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును."
► మీరు మీ పశువులకు చూసుకునే బాధ్యత మీ పిల్లలకు ఇచ్చారని ఊహించండి. మీరు సాయంకాలం ఇంటికి వచ్చేవేళకు, జంతువులకు మేత వేయలేదు. రోజంతా పని చేసి మీరు బాగా అలసిపోయారు, కాని మీ పిల్లలు, జంతువులకు మేత వెయ్యలేదు కాబట్టి మీరు విశ్రాంతి తీసుకునే ముందే వాటికి మేత వెయ్యాలి. మీరు కోపపడతారా? తల్లి/తండ్రి తన కుమారుడి విషయంలో కోపపడడం తప్పా?
దిద్దుబాటు పిల్లవాడి ప్రయోజనం కోసమని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. తనను అగౌరవపరచినందుకు లేక పిల్లవాడు చూపిన అవిధేయత తనకు అసౌకర్యం కలిగించినందుకు తల్లి/తండ్రి కోపపడినప్పుడు, అతని కోపం పిల్లవాడికి మంచి చేయదు (యాకోబు 1:20). అతని కోపం స్వార్థపూరితం.
తల్లిదండ్రులు కోపాన్ని ఈ విధంగా సరైన రీతిలో వ్యక్తపరచవచ్చు: “బిడ్డా, నేను చెప్పినట్లుగా నువ్వు పశువులకు మేత వేయలేదు. అవి ఆకలిగా ఉన్నాయి. నేను వేయకపోతే అవి రాత్రంతా ఆకలితో ఉండిపోయేవి. రోజంతా పనిచేసి అలసిపోయినా, నేను వాటికి మేత వేయాల్సి వచ్చింది. నీకు చెప్పిన పని చేయకపోవడం వల్ల నేను కోపపడ్డాను—ఎందుకంటే ఇతరుల అవసరాలను పట్టించుకోని వ్యక్తిగా మారకూడదని కోరుతున్నాను. సామెతలు 12:10 ఇలా బోధిస్తుంది, ‘నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే.’”
జ్యోతి తన పిల్లలతో కొత్తగా కార్పెట్ వేసిన గదిలోకి ఆహారం లేదా పానీయాలు తీసుకెళ్లవద్దని చెప్పింది. మరుసటి రోజు ఆమె పిల్లలలో ఒకరు ఆ గదిలో తింటూ ఉండటం చూసి, అతన్ని మందలించింది. ఆ తర్వాత పిల్లలలో ఇంకొకరు ఒక గ్లాసు నిండా జ్యూస్ తీసుకెళ్తుండగా చూసి, అతన్ని కూడా మందలించింది. ఆ తర్వాతి కొద్ది రోజులు పిల్లలు అప్పుడప్పుడు పానీయాలు ఆ గదిలోకి తీసుకెళ్తుండేవారు, కానీ జ్యోతి బిజీగా ఉండటం వల్ల వాళ్లను సరిదిద్దలేదు. ఆ తర్వాత ఒకరోజు తన కొడుకు కార్పెట్ మీద కోకా-కోలా కింద పడేశాడు. జ్యోతికి కోపం వచ్చి అతన్ని కొట్టింది.
► జ్యోతి తన పిల్లల్ని సరిదిద్దే విషయంలో ఎక్కడ తప్పు చేసింది?
జ్యోతి పెట్టిన నియమం ఏమిటంటే పిల్లలు ఆహారాన్ని లేదా పానీయాలను కార్పెట్ ఉన్న గదిలోకి తీసుకువెళ్ళకూడదు. కానీ ఆమె వారు ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నప్పటికీ ఒక సంఘటన జరిగే వరకు సహించింది. ఆమె ఆ నియమాన్ని ఉల్లంఘించినందుకు శిక్షించకుండా ఆ సంఘటన జరిగినప్పుడు శిక్షించింది. చెడు పరిణామాలు రాకుండా చూడగలిగితే నిబంధనలను ఉల్లంఘించవచ్చని ఇది పిల్లలకు నేర్పుతుంది. ఇది అన్ని నియమాలను ఉల్లంఘించడానికి ఆధారమైనందున చెడు లక్షణాన్ని అభివృద్ధి చేస్తుంది. ఒక వ్యక్తి తాను కోరుకున్న ఫలితాలను పొందగలనని మరియు చెడు ఫలితాలను నివారించగలనని భావించి నిబంధనలను ఉల్లంఘిస్తాడు. తల్లిదండ్రులు పిల్లల తప్పు చేసినప్పుడు శిక్షించకుండా వారి అవిధేయతను సరిదిద్దాలి.
లోహిత్ తన కుమారులకు సాయంకాల సమయాల్లో సైకిళ్లు ప్రక్కనపెట్టమని చెప్పాడు. ఒక వారం పాటు ప్రతిరోజు, లోహిత్ ఇంటికి వచ్చినప్పుడు సైకిళ్లు బయటే ఉన్నాయి. ఒకరోజు లోహిత్ పనిలో ఉన్నప్పుడు ఒక పనిముట్టు పోయింది, అనుకోకుండా తన వ్రేలికి దెబ్బతగిలింది, ఇంటికి వస్తుండగా టైర్ పంచర్ పడింది. ఇంటికి వచ్చేసరికి సైకిళ్లు ఇంకా బయటే ఉన్నాయి, కాబట్టి అతడు తన కుమారుల్ని శిక్షించాడు.
► తన కుమారుల్ని సరిదిద్దే విషయంలో లోహిత్ చేసిన తప్పేంటి?
చాలామంది తల్లిదండ్రులు మంచిగా ఉన్నప్పుడు అవిధేయతను సహిస్తారు, జీవిత పరిస్థితులను బట్టి కోపంగా ఉన్న సమయంలో అవిధేయతను శిక్షిస్తారు. తల్లిదండ్రులు స్థిరంగా సరిదిద్దితే తప్ప పిల్లలు విధేయత నేర్చుకోరు.
► క్రింద ఇవ్వబడిన వాటిని చూసి, ప్రతిదీ ఎందుకు ముఖ్యమో వివరించండి. తల్లిదండ్రులు ఈ విషయాలు అనుసరించకపోతే ఏం జరుగుతుంది?
అవసరాలు పిల్లల సామర్థ్యాలకు, పరిపక్వతకు తగినవిగా ఉండాలి.
అనుకోకుండ తప్పు చేసినప్పుడు కాకుండా, ఉద్దేశ్యపూర్వకంగా అవిధేయత చూపినప్పుడే శిక్షించాలి.
నియమాలు మరియు అవసరాలు స్పష్టంగా, అర్థవంతంగా ఉండాలి.
పిల్లవాడు అవిధేయత చూపినప్పుడు, పిల్లవాడు ఏమి చేసి ఉండాలో తల్లిదండ్రులు వివరించాలి.
[1]2 తిమోతికి 2:24-25 మరియు గలతీయులకు 6:1 సంఘంలో పాపంతో వ్యవహరించడానికి హెచ్చరికగా రాయబడినప్పటికీ, తప్పు చేసేవారిని సరిదిద్దుతూ సహనంగా, మృదువుగా ఉండాలని చెప్పే సూచనలు, తల్లిదండ్రులకు కూడా వర్తిస్తాయి.
పిల్లల నుండి ఆచరణాత్మక హెచ్చరికలు
కొన్ని సంవత్సరాల క్రితం, డా.ఆర్.యఫ్. హెర్ట్జ్ అనే బ్రిటీషు మనస్తత్వవేత్త ఒక పరిశోధనా ప్రాజెక్ట్ చేపట్టాడు. అతను 8 నుండి 14 ఏళ్ల మధ్య వయస్సున్న లక్షమంది పిల్లల్ని 24 దేశాల నుండి ఎంపిక చేసి, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలనే విషయమై నిబంధనల జాబితా తయారుచేయమని కోరాడు. ఈ పరిశోధనకు దేవుని వాక్య అధికారం లేదుగాని పిల్లలు అవసరమని భావించే కొన్ని అవసరాల్ని ఇది చూపిస్తుంది. కొన్ని సాధారణ ప్రతిస్పందనలు ఇక్కడ ఉన్నాయి:
మీ పిల్లల ముందు గొడవపడవద్దు.
పిల్లలకు అబద్ధం చెప్పవద్దు.
పిల్లల ప్రశ్నలకు ఎల్లప్పుడు జవాబులు ఇవ్వాలి.
మీ పిల్లలందర్ని ఒకే విధంగా ప్రేమించాలి.
తల్లిదండ్రులు, పిల్లలు మధ్య ఖచ్చితంగా [స్నేహబంధం] ఉండాలి.
మీ పిల్లల స్నేహితుల్ని స్వాగతించే అతిథులుగా భావించాలి.
స్నేహితుల యెదుట మీ పిల్లల్ని నిందించవద్దు, శిక్షించవద్దు.
మీ పిల్లల మంచి అలవాట్లు మీద దృష్టిపెట్టాలి, వారి వైఫల్యాల్ని ఎక్కువగా నొక్కి చెప్పకూడదు.
ఆప్యాయత చూపించే విషయంలో, భావాల విషయంలో స్థిరంగా ఉండాలి.
పిల్లల సమక్షంలో తండ్రి, తల్లిని విమర్శించినప్పుడు, పిల్లలు కూడా గౌరవించబడని తల్లిలో తప్పులు వెదకాలని, ఆమెతో ఏకీభవించకూడదని భావిస్తారు.[1] తల్లిదండ్రులు తమ విభేదాలను వ్యక్తిగతంగా చర్చించుకుని, సహకారంతో అనుసరించాల్సిన విధానాలను రూపొందించుకోవాలి.
తల్లిదండ్రులు, తమ పిల్లలు సహకరించాలని లేక తమ పిల్లల ఆందోళనలు తీర్చాలనే ఉద్దేశ్యంతో కూడా పిల్లలతో అబద్ధమాడకూడదు (కొలొస్స 3:9). తన తండ్రి తనతో అబద్ధమాడుతున్నాడని పిల్లవాడు గ్రహించినప్పుడు, సురక్షితంగా భావించడు. తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు నమ్మరు గనుక పిల్లలు భయపడినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఆదరించలేరు లేక నడిపించలేరు.
► పైన ఇవ్వబడిన వాటిలో ఒకదానిని ఎంపిక చేసుకుని, తల్లిదండ్రులు ఆ విధంగా నడవనప్పుడు కలిగే సమస్యలు గురించి వివరించండి.
[1]ఎఫెసీయులకు 4:29-32, ఎఫెసీయులకు 5:33; 1 పేతురు 3:7-12 లోని సూత్రాలు మరియు ఉపదేశాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి.
ఒక క్రైస్తవ కుటుంబం
► ఒక కొత్త వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు, అది క్రైస్తవులు నివసించే ఇల్లని వెంటనే అతనికి అర్థమౌతుందా? ఎలా?
► ఒక విద్యార్థి తరగతి కోసం ద్వితీయోపదేశకాండము 6:6-9 చదవాలి.
ఇశ్రాయేలీయులు పిల్లల స్వభావాన్ని రూపొందించడం ద్వారా పిల్లల భవిష్యత్తును రూపొందించడంపై దృష్టిపెట్టాలి. అయితే వారు దానిని ఎలా చేయాలి? తమ పిల్లల్ని బైబిలు సూత్రాల ఆధారంగా క్రమశిక్షణలో పెట్టడానికి సురక్షితమైన పరిసరాలు సృష్టించాలి. వారు ప్రతిచోట లేఖనాల్ని ఉంచాలి (“నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.”) లేఖనాల్ని ఇంట్లో పెట్టుకోవడమే కాదుగాని, ముఖ్యంగా, ఇంట్లో జరిగే ప్రతిదీ లేఖనానుసారంగా ఉండాలి.
ఈ కుటుంబాల్లో ఒక గోడమీద పదిఆజ్ఞలు, మరొక గోడమీద లోక సంబంధమైన వినోదం కలిగించే, పాప చిత్రాలు ఉండకూడదు. ఇది, విలువలపై పిల్లలకున్న అవగాహనను తారుమారు చేస్తుంది.
పిల్లలు ప్రతిరోజు చూసే, వినే విషయాల ద్వారా తెలియకుండానే ప్రభావితమవుతారు. ఒకవేళ వారి ఇంట్లో ఎల్లప్పుడు రేడియో మ్రోగుతుంటే, ఆ సంగీతంలో ఉండే తత్వాన్ని వారు గ్రహిస్తారు.
తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ దుష్ట లోకం నుండి, లోక ప్రభావం నుండి కాపాడడం అసాధ్యం, కాని క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు, వారు చూసే ప్రతిదీ వినే ప్రతిదీ దేవుని వాక్య ఆధారంగా పరిశీలించాలని బోధించాలి. యేసు, “నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను…సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము” (యోహాను 17:15, 17) అని ప్రార్థించాడు.
తల్లిదండ్రులు ఎవర్ని హీరోలుగా ఆరాధిస్తారో పిల్లలు గమనిస్తారు. తల్లిదండ్రులు ఎవర్ని గౌరవిస్తారో పిల్లలకు తెలుసు. తల్లిదండ్రులు లోక సంబంధమైన, అనైతికమైన ప్రజల్ని ప్రేమిస్తూ, క్రైస్తవ సత్యం గురించి పిల్లలకు బోధించడం సరైంది కాదు. ఈ విధంగా బోధించే వ్యక్తి, ఒక నమ్మకమైన క్రైస్తవుడుగా ఉండడం కంటే లోకరీతిగా పేరుపొందిన వ్యక్తిగా ఎదిగితేనే తల్లిదండ్రులు ఇష్టపడతారనే భావన పిల్లల్లో కలుగజేస్తాడు.
తల్లిదండ్రులు, పాప విషయాలు ఎందుకు తప్పో తమ పిల్లవాడికి వివరించిన తర్వాత, వాడు వాటికి గురికావడం సరైనదే అని ఆలోచిస్తుంటారు. కానీ దీని గురించి ఇలా ఆలోచించండి: మీ పిల్లవాడు మంచి ఆహారం తినాలని మీరు అనుకున్నప్పుడు, అతని ముందు చాక్లెట్లు, కేకు పెట్టి ఆ తర్వాత కూరగాయలే ఎందుకు తినాలో చెప్పకూడదు. విటమిన్లు గురించి మీరిచ్చిన వివరణ, చాక్లెట్లు చూడడం ద్వారా అతనిలో కలిగిన ఆ సహజ కోరికను అడ్డుకోలేదు.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఏమి చూస్తున్నారో పట్టించుకోకుండా ఎప్పుడు టి.వి. ఆన్ చేసి పెట్టుకుంటారు. ఫలితాల్ని నియంత్రించగలిగేంత వరకు పాపం చేయడం సరైనదేనని సమాజం బోధిస్తుందని క్రైస్తవులు తప్పక గుర్తుంచుకోవాలి. ఎలాంటి పరిణామాలు లేకుండా పాపంలో జీవించే ప్రజల్ని టి.వి చూపిస్తుంది, కాని ఇది నిజ జీవితం గురించిన నిజమైన వివరణ కాదు. తన తల్లిదండ్రులు జీవితాన్ని ఆనందించకుండా తనను నియంత్రిస్తున్నారని పిల్లవాడు భావించేలా చేస్తుంది. టి.వి. చూడడం అతడు తనకు నచ్చింది చేయగల సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.
చాలామంది క్రైస్తవులు, తమ క్రైస్తవేతర బంధువులతో కలిసి జీవిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో, తప్పుడు ప్రభావాల నుండి కాపాడబడే విధానం ఇంట్లో ఉండదు. పరిశుద్ధాత్ముడు తమ పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడానికి సహాయపడాలని ప్రార్థిస్తూ, క్రైస్తవ తల్లిదండ్రులు ప్రేమ, నమ్మకం, పరిశుద్ధత, మరియు ఆనందానికి మాదిరిగా జీవించాలి.
అసంపూర్ణ కుటుంబాలు
కుటుంబాలు పరిపూర్ణంగా ఉండవు కాబట్టి, సంబంధాలలో తరచుగా గతంలో చేసిన తప్పులు మరియు పరిష్కారం కాని వివాదాల చరిత్ర ఉంటుంది.
ప్రతి క్రైస్తవ తల్లి/తండ్రి పరిపూర్ణులు కారు. నియమాలు సృష్టించే విషయంలో వాటిని అమలు చేసే విషయంలో వారెప్పుడు స్థిరంగా ఉండరు. కౌమారదశలో ఉన్నవారి పరిస్థితి ఎల్లప్పుడు అర్థం చేసుకోలేరు-క్రొత్త తరంలో పరిస్థితులు మారిపోయాయి. పిల్లవాడు ఎదుర్కునే సమస్యల విషయంలో ఎల్లప్పుడు సానుభూతి చూపించరు. ఎల్లప్పుడు మంచి వైఖరి చూపించరు, బాధించే మాటలు మాట్లాడతారు.
దేవుడు మొదటి మనుష్యులను సృజించి, కుటుంబాన్ని రూపొందించాడు. పురుషుని చేశాడు, అతనికి భార్యను ఇచ్చాడు, వారు పెంచడానికి పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి సమస్తం తెలుసు. తల్లిదండ్రులు తప్పులు చేస్తారని దేవునికి తెలుసు, అయినప్పటికీ తల్లిదండ్రుల బాధ్యతనిచ్చాడు. ప్రజలకు ఎన్ని బలహీనతలున్నా, ఇది ఉత్తమమైన మార్గమని ఎంచాడు. అంటే, కుటుంబం ముందుకు సాగాలంటే ఒక మార్గం ఉండాలి. కుటుంబం పరిపూర్ణంగా లేనప్పటికీ, కుటుంబ వ్యవస్థలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
దేవుడు తల్లిదండ్రుల్ని ఏర్పరచాడనే వాస్తవం పిల్లలకు చాలా ప్రాముఖ్యం. అంటే, పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థను తిరస్కరించడానికి పూనుకున్నారని దీని అర్థం. దేవుడు, "పిల్లలారా... మీ తల్లిదండ్రులకు విధే యులైయుండుడి" (ఎఫెసీయులకు 6:1) అని చెప్పాడు. దేవుడు తల్లిదండ్రులకిచ్చిన బాధ్యతల్ని విస్మరించినప్పుడు, వారు దేవుని ప్రణాళిక విషయంలో తిరుగుబాటు చేస్తున్నారని అర్థం. దేవుని ప్రణాళికను తిరస్కరించమంటే దేవుని మీద తిరుగుబాటు చేయడం.
పిల్లల్ని పెంచే బాధ్యత
తల్లిదండ్రులు పిలల్ని పెంచే విషయం గురించిన ఈ దృశ్యంలో, మూడు బాధ్యత కోణాలు ఉన్నాయి. పిల్లవాడి బాధ్యత. తల్లిదండ్రుల బాధ్యత. దేవుని బాధ్యత. గత రెండు పాఠముల్లో తల్లిదండ్రుల బాధ్యత గురించి లోతుగా పరిశీలించాం. ఇప్పుడు పిల్లల జీవితాల్లో, పిల్లల బాధ్యతల్లో దేవుని పాత్రను పరిశీలిద్దాం.
పిల్లల జీవితాల్లో దేవుని కార్యం
1. యేసునందు విశ్వాసం ద్వారా పిల్లలు తనతో వ్యక్తిగత సంబంధం కలిగియుండాలని దేవుడు ఆశిస్తున్నాడు. (మత్తయి 18:1-6 మరియు మత్తయి 19:13-15 చదవండి)
2. పిల్లల్ని ఆయనతో సంబంధంలోకి నడిపించడానికి దేవుడు నమ్మదగినవాడు (యోహాను 6:44 చదవండి).
3. దేవుడు తన వాక్యం ద్వారా మన పిల్లలతో మాట్లాడతాడు. (2 తిమోతికి 3:14-15 చదవండి)
దేవునితో సంబంధమున్న పిల్లలు
1. పిల్లలు తమ పాపాల నుండి క్షమించబడతారు (1 యోహాను 2:12).
2. పిల్లలు దేవుని తెలుసుకుంటారు (1 యోహాను 2:13).
3. దేవునితో సహవాసంలో పిల్లలు ఎదుగుతారు (1 సమూయేలు 2:26).
4. పిల్లలు దేవుణ్ణి ఆరాధిస్తారు (మత్తయి 21:15-16).
5. పిల్లల్ని, యౌవనులను దేవుడు వాడుకుంటాడు (యోవేలు 2:28).
దేవుడు తన ఉద్దేశ్యాలు నెరవేర్చుకోవడానికి పిల్లల్ని, యౌవనుల్ని ఉపయోగించుకున్న అనేక సందర్భాలు బైబిల్లో ఉన్నాయి; సమూయేలు, నయమాను ఇంటిలో పనిచేసే చిన్నది, జనసమూహానికి ఆహారం పెట్టడానికి యేసుకు ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చిన బాలుడు, దానియేలు, యోసేపు, దావీదు మరియు మరియ, కొంతమందిని పేర్కొనవచ్చు.
పిల్లవాడి బాధ్యత
దేవుని వాక్య ప్రకారం, తల్లిదండ్రులకు విధేయత చూపడమే పిల్లవాడి బాధ్యత (ఎఫెసీయులకు 6:1-3). కొన్నిసార్లు తల్లిదండ్రులు తప్పు చేస్తే ఏమౌతుంది? పిల్లవాడు తన బాధ్యతను నెరవేర్చాలి కాని తల్లిదండ్రుల ప్రవర్తన ఆధారంగా బాధ్యత వహిస్తానని షరతులు పెట్టకూడదు. తల్లిదండ్రుల ప్రవర్తనకు పిల్లవాడు బాధ్యుడు కాదు. విధేయత చూపవలసిన బాధ్యత పిల్లవాడిది.
తల్లిదండ్రులు మంచి చేసినప్పుడు మాత్రమే పిల్లవాడు విధేయత చూపించాలని నిర్ణయించుకుంటే, తల్లిదండ్రులకు ఎలాంటి అధికారం ఉండదు. అది దేవుని ఉద్దేశ్యం కాదు ఎందుకంటే అది పూర్తి వ్యవస్థనే నాశనం చేస్తుంది.
తల్లిదండ్రులు తమ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారనేది పిల్లవాడి బాధ్యత కాదు. విధేయత చూపవలసి బాధ్యత మాత్రం అతనిపై ఉంది. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లవాడికి, రిఫ్రిజరేటర్ నుండి బీరు తీసుకురమ్మని చెప్పడం వంటి తప్పుడు పనులు చెప్పినప్పుడు ఏం చెయ్యాలి? తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారా లేదా అనే విషయాన్నీ నిర్ణయించే బాధ్యత పిల్లవాడికి ఉండదు. అతడు తన అభిప్రాయాన్ని మర్యాదపూర్వకంగా చెప్పొచ్చు, కాని అతడు తప్పక పాటించాలి.[1]
పిల్లలకు వారి తల్లిదండ్రులకు మధ్య ఉన్న సమస్యలు, సాధారణంగా తల్లిదండ్రుల ఆదేశాలు క్రైస్తవ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని ప్రశ్నించడం వల్ల కాదు. తిరుగుబాటు చేసే పిల్లలు వారి గదిని శుభ్రం చేయడం, ఇంటి పనుల్లో సహాయపడటం, నిర్ణీత సమయానికి ఇంటికి రావడం, లేదా వారు వినోదం కోసం ఉపయోగించే పరికరాలపై పరిమితులు వంటి రోజువారీ విషయాలలోనే తమ తల్లిదండ్రులను ప్రతిఘటిస్తుంటారు.
తిరుగుబాటు చేసే పిల్లవాడు, తన తల్లిదండ్రుల ఆదేశాలు సరైనవి కానప్పుడు, తమకు నచ్చింది నిర్ణయించుకునే హక్కు తనకుందని చెప్పుకోవడం ద్వారా తల్లిదండ్రుల అధికారాన్ని ప్రతిఘటిస్తాడు. అతని ప్రతిఘటన స్వేచ్ఛగా, స్వయం-అధికారంతో, మరియు వ్యక్తిగత స్వయంప్రతిపత్తిగా ఉండాలనే తన కోరికల నుండి వస్తుంది. ఒక వ్యక్తిని ఏ వయసులో వీటిని పొందుతాడు? ఎన్నడు కాదు.
స్వేచ్ఛ అనే భావనే ఒక భ్రమ. ఇతర వ్యక్తుల్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఎల్లప్పుడు మీకు బాధ్యతలు ఉంటూ ఉంటాయి. ఒకవేళ బాధ్యతలు గురించి చెప్పడానికి మీ తల్లి లేనప్పటికీ, మీరు చేయవలసిన పనులు ఎల్లప్పుడు ఉంటాయి. ఇతరుల విషయంలో ఎలాంటి బాధ్యత లేకుండా జీవించాలనుకునే వ్యక్తి, అతని మీద ఆశపెట్టుకున్నవారికి తన మీద ఆధారపడేవారికి దుఃఖాన్ని, బాధను, నాశనాన్ని కలిగిస్తాడు.
కొన్నిసార్లు తమ తల్లిదండ్రులు, తమని ఇంకా ఎక్కువగా నమ్మాలని భావించి, వారి తల్లిదండ్రులు చింతించడాన్ని బట్టి పిల్లలు కొప్పడతారు. పిల్లవాడు తల్లిదండ్రుల ఆందోళనలు అర్థం చేసుకుని, గౌరవిస్తే, తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని ఎక్కువగా నమ్ముతారు, ఆంక్షలను సర్దుబాటు చేయడానికి సిద్ధంగా ఉంటారు. పిల్లవాడు తల్లిదండ్రుల ఆలోచనలను, ఆందోళనలను తిరస్కరించినప్పుడు, పిల్లవాడి మీద మరిన్ని ఆంక్షలు పెట్టాలని భావిస్తారు.
[1]ఒక పిల్లవాడు తల్లిదండ్రుల నుండి లేక వేరొకరి నుండి శారీరక లేక లైంగిక వేధింపులకు గురైనట్లయితే, ఆ పిల్లవాడిని కాపాడడానికి ఎవరొకరు చొరవ తీసుకోవాలి. ఆ పరిస్థితిలో ఎలా సహాయం పొందాలి పిల్లవాడికి సహజంగా అర్థం కాదు.
తప్పులు ఒప్పుకోవడం
చాలామంది వ్యక్తులు ఒక సంబంధంలో తాము చేసిన తప్పును అంగీకరించడానికి భయపడతారు, ఎందుకంటే ఆ అంగీకారం భవిష్యత్తులో వచ్చే గొడవలలో తమ స్థానాన్ని బలహీనపరుస్తుందని వారు భావిస్తారు. వాస్తవానికి, నిజాయితీగా ఉండి, సరైనది చేయడానికి సిద్ధంగా ఉండటమే అత్యంత బలమైన స్థానం. ఆ స్థానాన్ని పొందడానికి, అందులో కొనసాగడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే, మీరు చేసిన తప్పులను ఒప్పుకోవడం, సరైన పనులను చేయడం ప్రారంభించడం మరియు మీరు తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా సరిదిద్దబడటానికి సిద్ధంగా ఉండటం.
కొన్నిసార్లు అధికారంలో ఉన్న వ్యక్తి తన క్రిందున్న వారు తప్పులు చేసినప్పుడు వాటిని ఒప్పుకోవాలని భావిస్తాడు కాని తాను తప్పుచేసినప్పుడు ఒప్పుకోవడానికి ఇష్డపడడు ఎందుకంటె అలా ఒప్పుకోవడం అతని అధికారాన్ని తగ్గిస్తుందని భావిస్తాడు. అది తప్పు. అధికారంలో ఉన్న వ్యక్తి తన తప్పులు ఒప్పుకోనప్పుడు, అతని క్రిందున్న వారు అతన్ని నమ్మరు. ఈ సూత్రం తల్లిదండ్రుల అధికారంతో సహా ప్రతి అధికారానికి వర్తిస్తుంది.
తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లవాడితో గొడవపడినప్పుడు, బహుశా మీరు కొన్ని తప్పులు చేసి ఉంటారు కాబట్టి వాటిని ఒప్పుకోవాలి. మీ తప్పులను బట్టి పిల్లవాడు తన తప్పులు సమర్థించుకుంటాడు. మీరు కఠినమైన మాటలు మాట్లాడినందుకు, అనాలోచితంగా స్పందించినందుకు, పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమైనందుకు క్షమాపణ చెప్పండి. మీరు ఇలా చేసే వరకు సంఘర్షణ ముగింపు ఉండదు, ఎందుకంటే, “…దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును” (యాకోబు 4:6).
మీరు తల్లిదండ్రులైనా లేక పిల్లలైనా, మీ తప్పులు ఒప్పుకోవాలి. పశ్చాత్తాపపడినప్పుడు, క్షమాపణ చెప్పినప్పుడు, దేవుని అధికారానికి స్థిరంగా లోబడినప్పుడు, సహజంగా ఇతరులతో మెరుగ్గా సహకరించగలుగుతారు, కాని ఇతరులతో మెరుగ్గా సహకరించడమే కారణం కాకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి చెయ్యాలి.
మీరు చేసిన తప్పులు ఒప్పుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తి చేసిన తప్పులకు నిందలు పొందుకునేలా చూడవలసిన అవసరత మీకు ఉండదు. మీరు చేసిన తప్పులకు సాకులు చెప్పేలా ఎదుటి వ్యక్తి తప్పులను ఉపయోగించకూడదు.
కొంతమందిలో బంధం వెంటనే మెరుగుపడుతుంది, మరికొంతమందిలో సమయం పడుతుంది. ఒక మార్పు నిజమని ప్రజలు గ్రహించినప్పుడు మాత్రమే, వాళ్ళు కూడా మారతారు. కానీ మీరు సరైన పని చేయడానికి గల కారణం వేరొకరిని మార్చడం కాదు. దేవుడు మీకు కేటాయించిన పనిని మీరు చేయాలి. బహుశా అవతలి వ్యక్తి మారకపోవచ్చు, కానీ మీకు మాత్రం మంచి మనసు, మరియు దేవుని ఆశీర్వాదం లభిస్తాయి, ఎందుకంటే మీరు మీ బాధ్యతను నెరవేరుస్తున్నారు. మిగిలిన బాధ్యతలను దేవుడే చూసుకుంటాడని నమ్మండి.
జీవితంలోని ప్రతి విషయాన్ని దేవుని అధికారానికి అప్పగించుకోవడంలో ఉన్నప్రాముఖ్యత
జీవియా అనే చిన్న ద్వీపాన్ని గురించి ఆలోచించండి. సమీపంలో ఉన్నటువంటి గ్రేకియా ద్వీపం, జీవియాను జయించాలని అనుకుంది. జీవియా ద్వీపం మధ్యలో ఒక 10 ఎకరాల భూమిని గ్రేకియాకు ఇచ్చినట్లయితే, ఆ రెండు ద్వీపాల మధ్య శాంతి ఉంటుందని గ్రేకియా పాలకుడు జీవియా ప్రభుత్వానికి హామీ ఇచ్చాడు. శాంతి కలిగించడానికి ఇది సరైన పరిష్కారమేనా? జీవియా ద్వీపస్తులు తమ భూభాగంలో కొంత తన శత్రువులకు ఇచ్చినప్పుడు, శత్రువు దానిని స్వాధీనం చేసుకుని మరింత భూభాగాన్ని సొంతం చేసుకుంటాడు.
మీ జీవితాన్ని వివిధ ప్రాంతాలతో కూడిన ఒక భూభాగంగా ఊహించుకోండి. ఒక ప్రాంతం మీ ఉపాధి లేక విద్య కావచ్చు. మరో ప్రాంతం మీ వినోదం కావచ్చు. ఇంకొక ప్రాంతం మీ కుటుంబ సభ్యులతో మీకున్న సంబంధం కావచ్చు. ఇంకా చాలా ప్రాంతాలు ఉంటాయి.
మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో ఆ భూభాగమంతా, దేవుని స్వాధీనంలో ఉండాలి. ఒకవేళ ఒక ప్రాంతం, మీ కుటుంబంతో మీకున్న సంబంధాలు దేవుని స్వాధీనంలో లేకపోతే ఏమి అవుతుంది? ఆ ప్రాంతంలోకి సాతానుడిని ఆహ్వానించినట్లు అవుతుంది. ఆ ప్రాంతంలో మొదలుకొని మీ జీవితంలోని ఇతర ప్రాంతాలన్నిటిని సాతానుడు స్వాధీనం చేసుకుంటాడు. అదే విధంగా, ఒక వ్యక్తి తన వినోదాల విషయంలో అపవిత్రంగా ఉంటే, తన జీవితంలోని ఇతర విషయాలన్నిటిని సాతానుడు స్వాధీనం చేసుకుంటాడు. క్రైస్తవుడు తన జీవితంలోని ప్రతి ప్రాంతాన్ని దేవుని అధికారానికి అప్పగించుకోవాలి.
తల్లిదండ్రులకు కొన్ని ముఖ్య సూచనలు
► విద్యార్థులు తరగతి కోసం ఎఫెసీయులకు 6:4, కొలొస్స 3:21, 1 కొరింథీయులకు 13:11, మరియు కొలొస్స 3:8 చదవాలి.
మీ బిడ్డ భావోద్వేగానికి లోనై, కోపాన్ని నిరాశను చూపిస్తుంటే మీరు వాడిని అర్థం చేసుకోవట్లేదని ఆలోచిస్తాడు. మీరు అతనిని పట్టించుకోకుండా, అతని మాటలు సరిగా వినట్లేదని, సరిగా అర్థం చేసుకోవట్లేదని భావిస్తాడు.
వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అతని సమస్యల్ని చిన్నవిగా లేక హాస్యాస్పదంగా భావించినప్పుడు, అతడు నిజమైన బాధను మీరు సరిగా అర్థం చేసుకోలేరు. ఒకవేళ అది అతనికి పెద్ద సమస్యగా అనిపిస్తే, అది అతని విశ్వాసాన్ని, ప్రవర్తనను సవాలు చేస్తుంది. అతడు అంత బలంగా ఎందుకు స్పందిస్తున్నాడో మీరు అర్థం చేసుకోలేకపోతే, ఆ పరిస్థితిలో ఉన్నటువంటి తీవ్రత మీకు అర్థం కాదు.
మీ బిడ్డను ఎన్నడు పట్టించుకోకుండా ఉండవద్దు, మీరు పట్టించుకోవట్లేదని తెలియజేసే ప్రకటనలు మీరు చేయవద్దు.
మీ పిల్లలందరూ ఒకేలా ఉన్నారని మీరు అనుకుంటున్నారా?
► ఒక విద్యార్థి తరగతి కోసం ఎఫెసీయులకు 4:30-32 చదవాలి.
సమస్య ఎదురైనప్పుడు, గత వైఫల్యాలను మళ్ళీ ప్రస్తావించకూడదు. పిల్లవాడు తన గత వైఫల్యాలను ప్రస్తుత పరిస్థితికి సంబంధించినవిగా చూడాలనుకోడు. ఇప్పుడు మారిపోయాడని, గతంలో చేసిన తప్పులు గుర్తు చేయడం అన్యాయమని భావిస్తాడు. అయితే, అతడు మీతో ఉదారంగా ఉంటాడని అనుకోవద్దు.
సమూహ చర్చ కోసం
► ఈ పాఠంలో మీకు క్రొత్తగా అనిపించిన కొన్ని విషయాలు ఏంటి? మీ అలవాట్లలో మీరు మార్చుకోవాలని అనుకున్న కొన్ని విషయాలను పంచుకుంటారా?
► సంఘ కుటుంబాలు, గృహాలలో జీవితాన్ని మెరుగుపరచడానికి, చర్చిలోని పిల్లలకు సహాయం చేయడానికి కలిసి పనిచేయగల మరిన్ని మార్గాలను చర్చించండి.
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
మా కుటుంబాలు ప్రేమ, భద్రత, మరియు ఆశీర్వాద స్థానాలుగా ఉండాలని ఆశిస్తున్నాను. మేం చేసే ప్రతి పనిలో పవిత్రంగా ప్రేమ ఉండునట్లు మాకు సహాయం చేయుము.
క్రైస్తవ బోధలో, ప్రవర్తనలో స్థిరంగా ఉండునట్లు సహాయం చేయుము. నిన్ను అనుసరించే ఆశ మా పిల్లలకు అనుగ్రహించుము.
మా పిల్లల విషయంలో నమ్మకంగా ఉన్నందుకు ధన్యవాదాలు. వారి హృదయాల్లో నీ ఆత్మ కార్యం జరిగిస్తుందని మాకు తెలుసు.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) కుటుంబాల కోసం బైబిల్ ఇచ్చిన ఏడు మార్గదర్శకాల జాబితాను సంకలనం చేయండి. ఆ తర్వాత, ఆ మార్గదర్శకాలను నిజ జీవిత పరిస్థితులకు అన్వయించండి. ప్రతి అన్వయాన్ని వివరిస్తూ ఒక పేరా రాయండి (మొత్తం ఏడు పేరాలు).
(2) క్రింది పేర్కొన్న అంశాలలో నుండి ఒక దానిని ఎంపిక చేసుకోండి. సామెతలు గ్రంథాన్ని పరిశీలించి, ఈ అంశం గురించి మాట్లాడే సామెతలను ఒక జాబితాగా చేయండి. ఆ తర్వాత, ఆ అంశం గురించి సామెతలు గ్రంథం ఏమి బోధిస్తుందో రెండు పేరాల్లో సంక్షిప్తంగా రాయండి. తరువాత, తల్లిదండ్రులు ఈ సూత్రాల్ని తమ పిల్లలకు లేదా కౌమారదశలో ఉన్నవారికి ఎలా బోధించగలరో మూడు పేరాల్లో రాయండి. అంశాలు:
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.