దివ్య భారతదేశంలోని ఒక క్రైస్తవ కుటుంబంలో పెరిగింది. ఒకరోజు, ఆమె కుటుంబ సభ్యులు, కిరణ్ అనే ఒక యవ్వన ప్రసంగికుని గురించి ఆమెకు చెప్పారు. వారు ఆమె గురించి కిరణ్ తో కూడా మాట్లాడారు. అయితే దివ్య, అతన్ని చూడడానికి ఆసక్తి చూపలేదు. ఒకరోజు సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి వచ్చే సరికి, కొన్ని గంటల నుండి ఆమె కోసం ఎదురుచూస్తున్న కిరణ్ కనబడ్డాడు. ఆమెకు ఇష్టం లేకపోయినా, అతడు ఏం చెబుతాడో విందామని అక్కడ కూర్చుంది. అప్పుడతడు, “నేను ఒక బైబిలు కళాశాల బోధకుడ్ని. నాకు జీతం తక్కువ. కొన్నిసార్లు ప్రభువు సువార్త ప్రకటన కోసం కష్టమైన ప్రదేశాలకు వెళ్తాను, కొన్నిసార్లు ఆరుబయట నేలమీదే పడుకుంటాను. నాతో బాధలు అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?” అని అడిగాడు. అతడలా చెప్తుండగా దివ్య ఏడ్వసాగింది ఎందుకంటే దేవుడు ఇతన్నే తన జీవిత భాగస్వామిగా నిర్ణయించాడన్న భావన ఆమెకు కలిగింది. ఆ సంభాషణ తర్వాత, పెళ్లి వరకు వారు ఒకరినొకరు పెద్దగా చూసుకోలేదు, ఒంటరిగా కలవలేదు. ఇప్పుడు వారు కొన్ని సంవత్సరాలుగా కలిసి ప్రభువు పరిచర్యలో ఉన్నారు.
జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం
జాగ్రత్తగా ఎన్నుకోండి!
దేవుని ప్రణాళిక ప్రకారం, వివాహం జీవితాంతం కొనసాగే సమర్పణ అని యేసు చెప్పాడు (మత్తయి 19:6-8). మీరు ఇప్పటి కోసమే వివాహం చేసుకోవడం లేదు. మీలో ఒకరు చనిపోయే వరకు మీతో జీవిత భాగస్వామిగా ఉండే వ్యక్తిని మీరు వివాహం చేసుకుంటారు (రోమా 7:2). వివేకంతో ఎంపిక చేసుకోవాలి!
మీ జీవితంలో మీరు కేవలం మంచి దినాలను, ఆనందరకమైన దినాలను మాత్రమే పంచుకోరు. కష్టాలు, హృదయంలోని బాధలు, సంక్షోభాలు, అనేక విషాదాలు కూడా పంచుకుంటారు. ఎలాంటి దుఃఖ పరిస్థితులు ఎదుర్కొంటారో కూడా మీకు తెలియదు. కష్ట సమయాల్లో మంచి, దైవభక్తిగల భాగస్వామిని వివాహం చేసుకోవడం వల్ల అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే, ప్రభువులో బలంగా నాటబడని భాగస్వామిని మీరు కలిగియుంటే కష్టసమయాలు మరింత అధ్వాన్నంగా ఉంటాయి. మీరు మీ జీవితమంతా, అన్ని పరిస్థితుల్లో మీతో ఉండే ఒకరిని వివాహం చేసుకుంటున్నారు. కాబట్టి, భాగస్వామిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి!
[1]మీరు మీ కుటుంబాన్ని నిర్మించి, అభివృద్ధి పరచుకోవడానికి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటారు. మీరు మీ పిల్లలకు తల్లిదండ్రుల్ని, వారసులకు తాత అమ్మమల్ని ఎన్నుకుంటున్నారు. మీ పిల్లల ఆత్మీయ జీవితాల్ని గొప్పగా ప్రభావితం చేసే వ్యక్తిని మీరు ఎన్నుకుంటున్నారు. వారి ప్రవర్తన, అలవాట్లు, గుణాలను మీ పిల్లలు అనుసరిస్తారు (ఎఫెసీయులకు 5:1). వారు తమ మాటలు, మాదిరి ద్వారా మీ పిల్లలకు శిక్షణ ఇస్తారు (సామెతలు 23:26). మీ పిల్లలను ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునే, శ్రద్ధతో, ప్రేమతో వారిని నడిపించి క్రమశిక్షణ నేర్పించే వారిని ఎన్నుకోండి. మీరు తరాలపై మంచి లేదా చెడు ప్రభావం చూపే వారిని ఎంచుకుంటున్నారు. కాబట్టి, జ్ఞానంతో ఎంచుకోండి!
► విద్యార్థులు తరగతి కోసం సామెతలు 14:1, సామెతలు 24:3-4, మరియు సామెతలు 31:10-12, 30 చదవాలి.
జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అనేది మీ జీవితంలో మీరు తీసుకునే అత్యంత ముఖ్యమైన రెండవ నిర్ణయం; మొదటిది, యేసును మీ ప్రభువుగాను, రక్షకుడుగాను అంగీకరించడం. మీరు తీసుకున్న నిర్ణయం మీ జీవితాన్ని మార్చివేస్తుంది, అయితే అది ఇతరుల్ని కూడా ప్రభావితం చేస్తుంది. తెలివైన ఎంపిక మీకు, ఇతరులకు ఆశీర్వాదకరం. అవివేక నిర్ణయం మీకు, ఇతరులకు హానికరం. కావున, ప్రార్థనాపూర్వకంగా ఎన్నుకోండి!
లోకంలో పరిపూర్ణులు ఎవరూ లేరు. మీకు సమస్యలు, బలహీనతలు, వైఫల్యాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి కూడా పరిపూర్ణులుగా ఉండరు, జీవితకాలం పరిపూర్ణత లేనివారిగానే ఉంటారు. కాబట్టి పరిపూర్ణులైన భాగస్వామి కోసం చూడకండి. బదులుగా, దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించే భాగస్వామి కోసం చూడండి. తప్పుల్ని, వైఫల్యాల్ని ఒప్పుకుని సరిదిద్దుకోవడానికి వినమ్రతతో సమ్మతించే వారి కోసం చూడండి. ఇలాంటి భాగస్వామి మీకు ఆశీర్వాదకరం, మరియు బలహీనతల్లో మీరు ఒకరుకొకరు సహాయం చేసుకొంటూ ఒకరికొకరు సహాయకరంగా ఉండగలరు.
► విద్యార్థులు తరగతి కోసం సామెతలు 11:14, సామెతలు 12:15, సామెతలు 13:18, మరియు సామెతలు 23:22 చదవాలి.
జ్ఞానంతో ఎన్నుకోండి. జీవితకాలం కోసం ఎన్నుకోండి. ఆత్మీయంగా ఉండే పెద్దల నుండి, మీ తల్లిదండ్రుల నుండి సలహా తీసుకోండి. వారి హెచ్చరికలు వినండి. మీ స్వంత భావోద్వేగాలు చెప్పే విషయాలు వినకండి. నిర్ణయం చాలా ముఖ్యమైనది, కాబట్టి మీరు అశ్రద్ధగా ఉండకూడదు.
ఒక అవిశ్వాసిని వివాహం చేసుకోవద్దు
దేవుని దృష్టికి అతి ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, తన ప్రజలు విశ్వాసులనే వివాహం చేసుకోవాలి. ఎందుకంటే దేవునితో ఒకరి సంబంధం ఈ జీవితంలో, నిత్యత్వంలో అన్నింటికంటే ముఖ్యమైనది. వివాహం - మానవ సంబంధాలలో అత్యంత సన్నిహితమైనది - ఇది దేవునితో ఒక వ్యక్తి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక విశ్వాసి, అవిశ్వాసియైన జీవిత భాగస్వామిని కలిగి ఉంటే, దేవునితో సన్నిహితంగా, జాగ్రత్తగా నడవటం మరింత కష్టం.
అంతేకాదు, తల్లిదండ్రుల అవిశ్వాసం పిల్లలపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. తల్లిదండ్రులలో ఒకరు (తల్లి లేక తండ్రి) అవిశ్వాసిగా ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో పిల్లలందరు ప్రభువును సేవించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మనం ఆయన్ని సేవించాలని, మన పిల్లల్ని దేవుని పరిచర్యకొరకు పెంచాలని దేవుడు ఆశపడుతున్నాడు (ఆదికాండము 18:19; ద్వితీయోపదేశకాండము 6:2, 7; మలాకీ 2:15).
పాత నిబంధన గ్రంథంలో, ఇశ్రాయేలీయులకు, వారి విశ్వాస కుటుంబ పరిధి దాటి బయట ఎవ్వరితోనూ వివాహం చేసుకోవడానికి అనుమతి లేదు.[2] అవిశ్వాసుల్ని వివాహం చేసుకోవడం వలన, ప్రజలు ఇతర అన్యదేవతల్ని ఆరాధిస్తారని, అద్వితీయ సత్య దేవునితో ఉన్న బంధాన్ని పాడు చేసుకుంటారని దేవునికి తెలుసు! ఇశ్రాయేలులో ఖచ్చితంగా ఇలాగే జరిగిందని పాత నిబంధన మనకు చూపిస్తుంది.[3]
నేటికీ, విశ్వాసులు విశ్వాసుల్ని మాత్రమే వివాహం చేసుకోవాలి. ఈ విషయంలో రాజీపడకండి. ఒక అవిశ్వాసితో ప్రేమ బంధాన్ని కొనసాగించవద్దు.
► విద్యార్థులు తరగతి కోసం 2 కొరింథీయులకు 6:14-18 మరియు 1 కొరింథీయులకు 7:39 చదవాలి.
మీ జీవిత భాగస్వామి విశ్వాసి కానప్పుడు
వివాహం కాని ఒక విశ్వాసి, అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. ఇది ఖచ్చితం. అయితే, అవిశ్వాసులైన దంపతుల్లో, ఒక భాగస్వామి రక్షణ కోసం క్రీస్తులోనికి వచ్చినప్పుడు, తన భాగస్వామి అతనితో ఉండడానికి ఇష్టపడకపోతే తప్ప, అతడు అవిశ్వాసియైన తన భాగస్వామితోనే జీవించాలి (1 కొరింథీయులకు 7:12-16). కొన్ని సందర్భాల్లో, క్రైస్తవ భర్త లేక భార్య విశ్వాసాన్ని బట్టి అవిశ్వాసులైన భాగస్వాములు కూడా రక్షణ పొందుతా రు (1 కొరింథీయులకు 7:14, 16; 1 పేతురు 3:1-2). అయితే, పెళ్ళికాని క్రైస్తవులు, అవిశ్వాసిని వివాహం చేసుకోవడానికి ఆలోచన కూడా చేయకూడదు.
వివాహం చేసుకోవాలనుకొనే జీవిత భాగస్వామిలో చూడాల్సిన గుణాలు
వివాహం కోసం సిద్ధపడుతున్నప్పుడు, తమను ఒక మంచి జీవిత భాగస్వామిగా చేయగల మంచి లక్షణాలను పెంపొందించుకోవాలి. వివాహం చేసుకోవాలనుకుంటున్నప్పుడు, ఈ క్రింది లక్షణాల్ని కలిగిన వారి కోసం వెదకాలి.
1. క్రీస్తుతో మీ సంబంధాన్ని ప్రోత్సహించే, ఆధ్యాత్మికంగా మీరు ఎదగడానికి సహాయపడే క్రీస్తుతో సంబంధం ఉన్నవారిని వివాహం చేసుకోండి. (2 పేతురు 1:5-9, 2 పేతురు 3:18).[4]
2. మంచి ప్రవర్తన గలవారిని వివాహం చేసుకోండి. భార్యలు తమ భర్తల్ని వ్యక్తిత్వంతో సంబంధం లేకుండా ప్రేమించాలని ఎఫెసీయులకు 5:33 ఆదేశిస్తుంది, అయితే గౌరవానికి అర్హులైనటువంటి పురుషుల్ని వివాహం చేసుకున్నప్పుడు ఈ పని చాలా సులభం. మంచి ప్రవర్తన అంటే, క్షమించడం, స్వీయ-నియంత్రణ కలిగి ఉండడం, వినయంగా, శ్రద్ధగా, బాధ్యతాయుతంగా ఉండడం, బోధించే మనసు కలిగి ఉండడం అని అర్థం. మీరు వివాహం చేసుకునే వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు కాని ఈ గుణాల్లో ఎదుగుతాడు.
దేవుడు సంఘ నాయకులు, వారి భార్యల విషయంలో ఉన్నత ప్రమాణాలను కలిగియున్నాడు (1 తిమోతికి 3:2-4, 8-9, 11-12; తీతుకు 1:6-8). సంఘ నాయకుడు చెడు ప్రవర్తనగల వ్యక్తిని వివాహం చేసుకుంటే, పరిచర్య చాలా దెబ్బతింటుంది.
3. పవిత్రత, మంచి ప్రవర్తనకు పేరు సంపాదించుకునే వారిని వివాహం చేసుకోండి (1 తిమోతికి 2:9-10, 1 తిమోతికి 3:7, 2 తిమోతికి 2:19, తీతుకు 1:15, తీతుకు 2:4-5).
4. బైబిలు ప్రకారంగా ఆలోచించే వారిని వివాహం చేసుకోండి (కీర్తన 119:66). శోధనలు, భయాలు, తప్పుడు వైఖరులు లేక తప్పుడు ప్రేరణలు ఎదురైనప్పుడు, వారు దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటారు, నమ్ముతారు, విధేయులౌతారు (సామెతలు 4:4-6, యెహోషువ 1:7-8). అవసరత, ప్రమాదం, బాధ, లేక ఏ విధమైన సమస్యైన ఎదురైనప్పుడు, వారు దేవుని మీద దృష్టిపెడతారు, వాక్యంలో వారికి కావాల్సిన సహాయాన్ని పొందుకుంటారు (కీర్తన 119:50, 92, 114).
5. మీ పిల్లలకు మంచి తండ్రి లేక తల్లిగా ఉండేవారిని వివాహం చేసుకోండి: దేవుని మార్గాల్ని వారికీ బోధించి, వారి యెదుట మంచి స్థిరమైన క్రైస్తవ జీవితాన్ని గడిపేవారిని వివాహం చేసుకోండి (సామెతలు 6:20-23, ఎఫెసీయులకు 6:4, 2 తిమోతికి 1:5, 2 తిమోతికి 3:14-15).
6. దైవభక్తిగల మిత్రులు, సలహాదారుల ద్వారా ప్రభావితమయ్యేవారిని వివాహం చేసుకోండి (కీర్తన 119:63, 2 తిమోతికి 2:22).
7. అధికారానికి లోబడేవారిని వివాహం చేసుకోండి. ఒక పురుషుడు లోబడే స్త్రీని వివాహం చేసుకోవడం తెలిగల పని (ఎఫెసీయులకు 5:22). అలాగే స్త్రీ కూడా దేవునికి లోబడే వ్యక్తిని అలాగే సంఘంలో, ఉద్యోగంలో, ప్రభుత్వంలో దేవుడు అతనిపై ఉంచిన అధికారులకు లోబడే వ్యక్తిని వివాహం చేసుకోవాలి (రోమా 13:1, ఎఫెసీయులకు 6:5-8, హెబ్రీయులకు 13:17, 1 పేతురు 5:5). ఆమె భర్త దేవునికి లోబడినప్పుడు, ఆమె భద్రతను పొందుకుంటుంది, ఆశీర్వదించబడుతుంది.
► పైన పేర్కొన్న గుణాల్లో, మీకు ఏది ముఖ్యమైంది? ఈ గుణాల ప్రాముఖ్యతను చూపించే ఏ ఉదాహరణలు మీరు చూశారు?
[1]“మీరు మీ కుటుంబంలో జన్మించాలని ఎంపిక చేసుకోలేదు; కాని మీరు తర్వాతి కుటుంబాన్ని నిర్మించడానికి ఎవరిని వివాహం చేసుకోగలరో ఎంపిక చేసుకోవచ్చు.”
[3]న్యాయాధిపతులు 3:5-7, 1 రాజులు 11:1-6, ఎజ్రా 9:10-15
[4]వివాహం చేసుకునే స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకరితో మరొకరు యదార్ధంగా ఇలా చెప్పకుండా వివాహం చేసుకోకూడదు, “నా ఒంటరిగా ఉన్నప్పటి కంటే కూడా నిన్ను వివాహం చేసుకున్న తర్వాత ప్రభువును మరింతగా సేవించగలను.”
తల్లిదండ్రులు నిశ్చయించిన వివాహాలు
చాలా సంస్కృతుల్లో, తల్లిదండ్రులే తమ పిల్లలకు వివాహాలను నిశ్చయించడం సర్వసాధారణం. ఉదాహరణకు, ఒక పెద్ద దేశంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన జీవిత భాగస్వామిని కనుగొని వారి తల్లిదండ్రులతో మాట్లాడతారు. సాధారణంగా, అప్పుడు వాళ్ళు అబ్బాయి, అమ్మాయి కలుసుకోవడానికి అవకాశం ఇస్తారు. వివాహం చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే ముందు, యౌవనస్తులు ఇద్దరు ఒకటి లేక రెండు లేక మూడుసార్లు కలుసుకుంటారు. తల్లిదండ్రులు ఎన్నుకున్న వ్యక్తిని అంగీకరించాలో లేదో పిల్లలు నిర్ణయించుకోవచ్చు, కాని ఒకరికొకరు బాగా అర్థం చేసుకునే సమయం వారికి ఉండదు.
ఈ సంస్కృతుల్లోని క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు భాగస్వాముల్ని వెదకుతున్నప్పుడు బైబిలు విలువలను పాటించాలి. తమ పిల్లలకు దైవికమైన, తెలివైన, పరిణతి చెందిన భాగస్వాముల కోసం చూడాలి. దేవునికి ప్రధాన స్థానం ఇచ్చే వారి కోసం చూడాలి. ఈ విషయాలు తల్లిదండ్రుల ఎంపికను ప్రభావితం చెయ్యాలి, అవి ఒకరి విద్య, వృత్తి, సామజిక హోదా లేక ఆర్ధిక స్థితి కంటే మించినదిగా ఉండాలి.
వ్యక్తిగతంగా నిశ్చయించుకున్న వివాహాలు
జీవిత భాగస్వాముల్ని ఎంపిక చేసుకునే ఎదిగిన పిల్లల తల్లిదండ్రులకు ఉండాల్సిన జ్ఞానం
ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలతో సహా, కొన్ని సమాజాల్లో సంస్కృతుల్లో, యౌవనస్తులు తల్లిదండ్రుల ఆలోచన లేకుండా తమ భాగస్వాముల్ని ఎన్నుకోవడం సర్వసాధారణం.
ఈ సంస్కృతుల్లో క్రైస్తవ తల్లిదండ్రులు, జీవితభాగస్వాముల్ని వెతుక్కుంటున్న యౌవనులైన తమ పిల్లల్నిప్రభావితం చేయకూడదని భావిస్తారు. వారి పిల్లలు వివాహం చేసుకుంటున్న వ్యక్తి వారికి ఇష్టం లేకపోయినప్పటికీ, వారికి అడ్డుచెప్పకూడదని భావిస్తారు. ఈ విమర్శలు భవిష్యత్తులో కుమారుడు/కూతురుకు మరియు కోడలు/అల్లుడికి మధ్య బేధాలు కలిగిస్తాయని భావిస్తారు.
క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు ఏర్పాటు చేయనప్పటికీ, పిల్లలు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ప్రభావం చూపించాలి. తల్లిదండ్రులు చిన్నతనంలోనే ఈ విషయాలు గురించి పిల్లలతో మాట్లాడాలి. తల్లిదండ్రులు ఉద్దేశ్యపూర్వకంగా తమ పిల్లల ఆలోచన విధానాన్ని, విలువల్ని ప్రభావితం చెయ్యాలి (ద్వితీయోపదేశకాండము 6:5-9). ఒక తల్లిగా/తండ్రిగా దీనిని మీరు ఎలా చేయగలరు?
1. ఒక మంచి దైవికమైన జీవిత భాగస్వామిగా, మంచి తల్లి/తండ్రిగా మీరు స్వయంగా మంచి మాదిరిగా ఉండండి. మీ జీవితంలో దేవుని సూత్రాలను పాటించకపోతే, మీరు మీ పిల్లలకు చెప్పే మాటలకు అర్థం ఉండదు. మీరు చెప్పే మాటలకు, మీరు చేసే పనులకు పొంతన లేకపోతే, మీ పిల్లలు మీ మాటల కంటే మీరు చేసే పనులనే ఎక్కువగా అనుసరిస్తారు.
2. జీవిత ఉద్దేశ్యం గురించి, వివాహ ఉద్దేశ్యం గురించి, భాగస్వామిలో ఏం చూడాలో అనే విషయం గురించి దేవుని ప్రమాణాలు ఏం చెబుతున్నాయో నొక్కి చెప్పండి (కీర్తన 34:11-12). మనం లోక నియమాల్ని చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, లేక చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మాదిరిగా బోధించకుండా లోకమే మనకు మాదిరి అన్నట్లుగా పిల్లలకు బోధిస్తాం. కాబట్టి ఇలా చేయకుండా, దేవుని మంచి ప్రణాళికల్ని అనుసరించేవారి వైపు పిల్లల దృష్టిని మళ్లించి, దైవికమైన ఆశల్ని వారిలో పెంపొందించాలి. దేవుని విధేయత చూపడంవలన వీరు అనుభవించే మంచి ఫలాల్ని పిల్లలకు చూపించాలి.
3. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ఇతర వాటన్నిటికంటే ప్రవర్తన ముఖ్యమని మీ పిల్లలకు బోధించాలి. ఇతరుల శరీర లేక వ్యక్తిత్వ అందం కంటే కూడా వారి ప్రవర్తనను, మంచి గుణాన్ని చూడాలని చిన్ననాటి నుండి వారికి బోధించాలి. వారి స్నేహితులు బాధ్యత కలిగిన వారో లేదా సోమరులో, విధేయులో లేక అవిధేయులో, నిజాయితీపరులో లేక మోసపరులో గమనించమని వారికి బోధించాలి. వారి బాహ్య ఆకారం కంటే అంతరంగ ప్రవర్తనను ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని వారికి నేర్పించాలి.
తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దయ్యాక జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు వారి సలహాను తీసుకోవాలని కోరుకుంటే, చిన్నప్పటి నుండే వారికి తల్లిదండ్రుల మాట వినడం ఎంత మంచిదో నేర్పించాలి (సామెతలు 1:8). యుక్తవయస్సు వచ్చాక లేదా పెద్దయ్యాక ఈ విషయాన్ని నేర్పించడం చాలా ఆలస్యం అవుతుంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఈ విషయాన్ని నేర్పించాలి (సామెతలు 4:3-9). దేవుని యందు భయభక్తులు గల తల్లిదండ్రుల మాట వినడం అనేది పిల్లలు రక్షించబడటానికి, ఆశీర్వదించబడటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం.
4వ పాఠంలో చర్చించుకున్నట్లుగా, యౌవనస్తులు తమ సంబంధాల విషయాల్లో పవిత్రంగా ఉండేలా చూడడం తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చిన బాధ్యత. ఇలా చేయాలంటే, మీ పిల్లలతో మీకున్న సంబంధం మంచిగా, పారదర్శకంగా ఉండాలి, అప్పుడు వారు మీకు జవాబుదారులుగా ఉంటారు, మీ ఆలోచనలను అంగీకరిస్తారు. మీ చిన్నపిల్లలకు ప్రతిరోజు మీరు బోధిస్తుండగా, శిక్షణ ఇస్తుండగా, నడిపిస్తుండగా ఈ విధమైన బంధం వారి బాల్యంలోనే ఏర్పడుతుంది.
జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొనే యౌవనస్తులకు జ్ఞానం
వివాహ విషయంలో సొంత నిర్ణయం తీసుకునే యౌవన విశ్వాసులకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇక్కడ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానంతో కూడిన కొన్ని సలహాలు ఉన్నాయి:
(1)వాక్యానికి విరుద్ధమైన ఎంపికలను తిరస్కరించండి.
ఉదాహరణకు, విశ్వాసులు అవిశ్వాసుల్ని వివాహం చేసుకోవడం దేవుని చిత్తం కాదని మనకు తెలుసు, కాబట్టి మనం అవిశ్వాసితో ప్రేమ బంధం పెట్టుకోవడానికి ఇష్టపడకూడదు.
(2) జ్ఞానం కోసం ప్రార్థించడం (సామెతలు 2; యాకోబు 3:13, 17).
మనం పూర్ణ హృదయంతో దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆయన మనకు జ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడతాడు. జ్ఞానం అనేది దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి, దానికి విధేయత చూపినప్పుడు దొరుకుతుంది. దేవుడు, భక్తిపరులైన వ్యక్తుల సలహాల ద్వారా కూడా జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని జ్ఞానాన్ని సంపాదించినప్పుడు, అది మనల్ని పాపం నుండి కాపాడుతుంది, హాని నుండి తప్పిస్తుంది. ఆయన జ్ఞానం మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది, దేవుని ఉన్నతమైన ప్రణాళికను ఉత్తమంగా అనుభవించేలా చేస్తుంది. మరి ముఖ్యంగా, మనం తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, పరలోకమందున్న మన తండ్రిని మహిమపరుస్తాం.
పరిశుద్ధాత్ముడు మనల్ని వాక్యానికి అవిధేయత చూపే మార్గంలో ఎప్పుడూ నడిపించడు. బదులుగా, వాక్యం గురించి నమ్మకంగా మనకు జ్ఞాపకం చేస్తాడు (యోహాను 14:26, యోహాను 16:13-14). తనకు లోబడి జీవించే ఆయన ప్రజలను పాపం నుండి తప్పిస్తాడు, వారికి జీవాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు (రోమా 8:5-6, 13-14; గలతీయులకు 5:16, 22-25). ప్రతి పరిస్థితిలో దేవుని చిత్తానికి సంబంధించిన ప్రతి విషయం మీకు తెలియకపోవచ్చు, కాని ఖచ్చితంగా మీకు తెలిసిన దానిని మాత్రం పాటించాలి. మీరు ఆత్మీయంగా, నైతికంగా నమ్మకంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడని మీకు తెలుసు. మీరు కొన్ని విషయాలను విస్మరించి, కొన్నింటిని ఆచరించాలని ఆయన ఆశపడుతున్నాడనీ మీకు తెలుసు. దేవుని నడిపింపు కోసం ప్రార్థిస్తున్నప్పుడు, ఏది సత్యమని గ్రహిస్తారో దానిని చెయ్యండి.
(4) దైవభక్తిగల ప్రజల సలహాలను శ్రద్ధగా వినాలి.
దైవభక్తిగల తల్లిదండ్రుల్ని కలిగియున్న యౌవ్వనస్తులు వారి జ్ఞానాన్ని వెదకాలి. వారు తమ వివాహ విషయాలకు సంబంధించిన వాటిలో వారి తల్లిదండ్రులతో పారదర్శకంగా నిజాయితీగా ఉండాలి. వారి తల్లిదండ్రులకు ఉన్న ఆసక్తుల విషయంలో కుడా వారు శ్రద్ధ చూపించాలి. వారికి సహాయం చేసి, వారిని రక్షించి, ప్రతి విధమైన హాని నుండి వారిని తప్పించి వారికి మంచి చేయడానికి దేవుడు మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు. యౌవనస్తులు ఈ విధంగా ఆశీర్వదించబడే అవకాశాల్ని వృథా చేసుకోకూడదు.
చాలామంది క్రైస్తవులైన యౌవనస్తులకు, దైవభక్తిగల పెద్ద కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు. మంచి ఫలితాలతో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యాన్ని కనబరిచే దైవభక్తిగల వ్యక్తుల నుండి వారు ఖచ్చితంగా సహాయం పొందాలి.
అయితే, యౌవనులు తమ తల్లిదండ్రులు ప్రభువును సేవించనప్పటికీ వారి సలహాలు విస్మరించకూడదు. కొన్నిసార్లు దేవుని మాటకు లోబడవలసివచ్చినప్పుడు, రక్షించబడని తమ తల్లిదండ్రుల మాట విస్మరించాల్సి వస్తుంది, అయినా కూడా తిరుగుబాటుతనంతో (1 సమూయేలు 15:23) లేక అగౌరవంతో విస్మరించకూడదు (నిర్గమకాండము 20:12). తల్లిదండ్రులు దేవునికి సమర్పించుకొనప్పటికీ, దేవుడు వారి హృదయాలను సున్నిత పరచగలడు అప్పుడు వారు వారి కుమారుడు లేక కుమార్తె వివాహాన్ని ఆశీర్వదిస్తారు. తమ తల్లిదండ్రుల మనసులు దేవుడు మార్చాలని ప్రార్థన చేస్తూ, వేచి ఉన్నప్పుడు అది కుమారుడు లేక కుమార్తె విశ్వాసాన్ని పరీక్షించి, బలపరుస్తుంది.
► వివాహ నిర్ణయాల్లో తల్లిదండ్రుల ప్రమేయం ఉన్నటువంటి లేఖన సూత్రాలు లేక ఉదాహరణలు చర్చించండి. భాగస్వామిని ఎంపిక చేసుకునే నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి తల్లిదండ్రులు ఏం చేస్తారు? వివాహ నిర్ణయాలలో ఒక క్రైస్తవ యౌవనస్తుని వైఖరి తమ తల్లిదండ్రుల యెడల ఎలా ఉండాలి?
వివాహానికి ముందు, భాగస్వాముల మధ్య స్నేహం
వివాహానికి ముందు కోర్ట్‌షిప్ కాలం సాధ్యమైతే, ఒక స్త్రీ, పురుషులు వివిధ సందర్భాలలో ఒకరితో ఒకరు సమయం గడపడం ఉత్తమం. అప్పుడు వారు ఒకరు మరొకరు ఎలా ప్రవర్తిస్తారో, ఇతరులతో ఎలా మెలుగుతారో, అనుకోని పరిస్థితులకు ఎలా స్పందిస్తారో, వేర్వేరు పరిస్థితులను ఎలా నిర్వహించగలుగుతారో నేర్చుకోగలరు. కలిసి గడిపిన ఈ సమయం వారు వివాహ భాగస్వాములుగా సరిపోతారా లేదో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
పవిత్రతకు కట్టుబడి ఉండడం
► విద్యార్థులు తరగతి కోసం 1 స్సలొనీకయులకు 4:1-8 మరియు 2 తిమోతికి 2:19-22.
దేవుడు స్త్రీ పురుషులను భావోద్వేగ, శారీరక కోరికలతో ప్రేమపూర్వకంగా సృజించాడు. ఈ కోరికల వలన, భవిష్యత్తులో వివాహం చేసుకోవాలని ఆశించేవారు తమ సంబంధంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కోరికలను కేవలం వివాహ నిబంధనలో మాత్రమే తీర్చుకోవడానికి దేవుడు ఉద్దేశించాడు.
ఒకవేళ స్త్రీ పురుషుడు తమ బంధంలో ఉద్దేశ్యపూర్వకంగా పవిత్రతకు కట్టుబడి లేనట్లయితే, శోధన సమయంలో తమ శరీర కోరికల్ని అనుసరించి దేవుని ఆదేశాలకు అవిధేయత చూపించే అవకాశం ఉంటుంది. నైతిక పవిత్రత విషయంలో దేవుని ఆజ్ఞలకు అవిధేయులవ్వడం వలన అది ఆ స్త్రీ పురుషుల మీద మాత్రమే ప్రభావం చూపక, అనేకుల మీద ప్రభావం చూపిస్తుంది. అవిధేయత వలన పశ్చాత్తాపం, బంధకం, అవమానం, అపరాధం, భయం, అపనమ్మకం కలుగుతాయి, బంధాలు తెగిపోతాయి.
[1]పవిత్రత విషయంలో దేవుని ఆదేశాలు అనుసరించేవారికి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. విధేయత చూపి దేవుణ్ణి గౌరవించేవారు దేవుడు వారి కోసం ప్రణాళిక చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. అవిధేయతవలన కలుగు ఫలితాలను కాకుండా, వారు ఆనందాన్ని, సమాధానాన్ని అనుభవిస్తారు. వారు ఒకరినొకరు నమ్ముతారు. వారు ప్రభువుతో, ఒకరితోనొకరు ఉన్నతమైన సంబంధం కలిగి ఉంటారు.
ఈ ఆశీర్వాదాలు దేవుని పవిత్రత ప్రణాళికను అనుసరించడానికి బలమైన ప్రేరణ. అయితే, ఈ విషయంలో విశ్వాసులకు అతిపెద్ద ప్రేరణ, జీవితంలోని ప్రతి భాగంలో ప్రభువైన యేసుకు గౌరవం తీసుకురావాలనే వారి కోరిక అయి ఉండాలి. డేటింగ్ చేస్తున్న జంట “మా సంబంధంలో మేము దేవుడిని ఎలా ఉత్తమంగా గౌరవించగలం? మేము యేసుకు అత్యధిక మహిమను ఎలా తీసుకురాగలం?” అని అడగాలి.
అపవిత్రమైన కార్యాలు నివారించడానికి, డేటింగ్ చేస్తున్న జంట శారీరక సంబంధం లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చూడని స్థలాల్లో ఎక్కువ సమయం గడపడం మానుకోవాలి. వారి జీవితంలో సంభాషణ కంటే శారీరక స్పర్శ ఎక్కువ ప్రాముఖ్యమైనప్పుడు వారు శోధనతో పోరాడతారు. వారి మనసులు, భావోద్వేగాలు శరీర కోరికలతో నిండి ఉంటాయి గనుక ఆత్మీయ విషయాలతో, సంబంధ బాంధవ్య విషయాలతో సరిగా వ్యవహరించలేరు. సంబంధం ఆరంభంలోనే, వివాహానికి ముందున్న సంబంధంలో ఎలాంటి పనులను చేయాలో (ఏవి చేయకూడదు అనుకుంటున్నారో) నిర్ణయించుకోవాలి. మీరు చేసుకున్న ప్రణాళిక పాపం నుండి ఇద్దరిని కాపాడుతుంది, మీ జీవిత భాగస్వామిని [2]ప్రేమించేలా చేస్తుంది, దేవుణ్ణి గౌరవించేటట్లు చేస్తుంది. మీ ప్రణాళికకు కట్టుబడి ఉండండి. దైవభక్తిగల వ్యక్తులకు జవాబుదారులుగా ఉండండి. వారి సలహాలు వినండి. ఇద్దరూ దైవభక్తిగల మిత్రులతో, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపండి.
అభివృద్ధిని కలుగజేసే కార్యకలాపాలు
కోర్ట్‌షిప్ అంటే ఒకరినొకరు బాగా తెలుసుకునే సమయం, కాని ఇది అభివృద్ధి చేసుకునే సమయంగా కూడా ఉండాలి. డేటింగ్ చేస్తున్న జంట కలిసి చేయవలసిన కొన్ని కార్యకలాపాలు ఇక్కడ ఉన్నాయి:
ఇద్దరూ కలిసి ఏదైనా ఒక పని చేయడం
మీ ఇద్దరికి క్రొత్తవైన నైపుణ్యాలు నేర్చుకోవడం.
మంచి పుస్తకాలు చదివి వాటిని చర్చించడం.
ఒకే లేఖన భాగాన్ని అధ్యయనం చేసి లేక కంఠస్తం చేసి, ఆ తర్వాత చర్చించడం.
పరిచర్య కార్యకలాపాల్ని ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయడం.
కలిసి పిల్లల్ని చూసుకోవడం.
ఇరు కుటుంబాలతో సమయం గడపడం.
ఈ కార్యకలాపాలు:
స్త్రీ పురుషుడు పరస్పరం అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
వారు ఒకరికొకరు సాటియైన సహాయం అవునా కాదా తెలుసుకోవడానికి సహాయపడతాయి.
ఒకరికొకరు మంచిగా మాట్లాడుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి.
వాళ్ళలో అభివృద్ధిని కలుగజేస్తాయి.
► కోర్ట్‌షిప్ విషయంలో ఈ సూత్రాల్లో, ఆలోచనల్లో ఏవి మీకు క్రొత్తగా అనిపించాయి? మీ ప్రాంతంలోని విశ్వాసులు పవిత్రతను గురించిన బైబిలు సూత్రాలు ఎలా అన్వయించుకుంటారు మరియు వివాహానికి ముందు సంబంధాల్లో దేవుణ్ణి ఎలా గౌరవిస్తారు?
వివాహానికి ముందు చర్చించుకోవలసిన విషయాలు
పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు సమయం తీసుకునే సంస్కృతులలో, పెళ్లికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి.
వివాహాలు తల్లిదండ్రులే నిశ్చయించే సంస్కృతుల్లో, ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం వారికి లభించదు. వివాహానికి ముందు ప్రతి ముఖ్య విషయాన్ని చర్చించుకునే అవకాశం వారికి ఉండదు. ఈ పరిస్థితిలో, స్త్రీ పురుషుడి తల్లిదండ్రులు ఒకరికొకరు సమాచారాన్ని పంచుకుని, యువ జంట ఒకరికొకరు సాటియైన సహాయంగా ఉండేలా చూసుకోవడం మంచిది.
ఒకరికొకరు సరిగా అర్థం చేసుకోకుండా వివాహం చేసుకున్న సందర్భాల్లో, వివాహమైన తర్వాత ఈ విషయాల గురించి ఆలోచిస్తారు కాని ఇవి వారి ఎంపికలను ప్రభావితం చేయలేవు ఎందుకంటే వారి ఇప్పటికే ప్రభువు యెదుట ఒకరితోనొకరు నిబంధన చేసుకున్నారు.
వివాహం చేసుకునే స్త్రీ పురుషుల నమ్మకాలు, నేపథ్యాలు, జీవిత లక్ష్యాలు, విలువలు ఎంత సారుప్యంగా ఉంటే వారి వైవాహిక జీవితం అంత అనుకూలంగా ఉంటుంది. సాధ్యమైతే, వివాహం చేసుకోవాలని ఆశించేవారు ఈ విషయాలను గురించి చర్చించుకోవాలి:
వారి జీవిత లక్ష్యాలు
వారిరువురికి ముఖ్యమైన విలువలు
వారి చిన్నతనం, వారు పెరిగిన విధానం
తల్లిదండ్రులతో, ఇతర బంధువులతో వారికున్న సంబంధం
వ్యక్తిగత ఆత్మీయ క్రమశిక్షణ, సంఘానికి హాజరయ్యే విధానం, సేవ మరియు పరిచర్యా కార్యాలు వంటి వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసం గురించి మాట్లాడుకోవడం.
పిల్లల్ని పెంచడం, వారికి బోధించడం, శిక్షణ ఇవ్వడం, క్రమశిక్షణలో పెంచడం, క్రీస్తును తెలుసుకోవడం, విధేయత చూపడం వంటి వివరాలను గురించి చర్చించుకోవడం.
ఆర్ధిక విషయాలు అంటే ఖర్చు చేయడం, పొదుపు చేయడం, కష్ట సమయాల్లో జీవించడం వంటి వాటి గురించి అభిప్రాయాలను తెలుసుకోవడం.
ఏవైనా శారీరక లేక మానసిక సమస్యలు లేక వారికున్న అంగవైకల్యాలు, వారి కుటుంబంలో సాధారణంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు.
ఈ విధమైన సంబంధంలో, జీవితంలో కష్టమైన, సంక్లిష్టమైన విషయాలను గురించి మాట్లాడుకోవాలి. ఒక్కసారి దేవునితో, భాగస్వామితో నిబంధన చేసిన తర్వాత, అది కష్టమైనా సుఖమైనా మీరు వివాహం చేసుకున్నట్లే (భార్యాభర్తలే). వివాహంలో, భార్యాభర్తలు వారిదగ్గర ఉన్నవన్నీ ఒకరితోనొకరు పంచుకుంటారు కాబట్టి వివాహం గురించి మాట్లాడుకునేటప్పుడు సంభాషణ యదార్ధంగా ఉండడం చాలా ముఖ్యం. చర్చ, పారదర్శకంగా లోతుగా జరగాలి. ఒకవేళ మీరు వివాహం చేసుకోబోయే వ్యక్తి ఈ ముఖ్య విషయాలను మాట్లాడడానికి సుముఖత చూపకపోతే, అది అపాయ సంకేతం.
పెళ్లికి ముందు, కాబోయే దంపతులు తమ వైవాహిక జీవితంలోని లైంగిక సంబంధం గురించి వారి నమ్మకాలు, అంచనాలు, మరియు కోరికల గురించి చర్చించుకోవాలి. బంధం మొదలైన కొత్తలో దీని గురించి మాట్లాడటం అనవసరమైన శోధనలకు దారితీయవచ్చు. అయితే, పెళ్లికి ముందే ఈ అంశంపై మాట్లాడుకోవడం చాలా ముఖ్యం.
వివాహం చేసుకునే స్త్రీ పురుషులకు ఇవి చాలా సహాయకరంగా ఉంటాయి:
మేధోపరంగా సమానంగా ఉండడం.
వైవాహిక జీవితంలో సమానమైన అంచనాలను కలిగి ఉండడం.
ఒకే రకమైన సిద్ధాంతపరమైన నమ్మకాలు, ఆత్మీయ ఆచరణలను కలిగి ఉండడం.
డబ్బు, సమయాన్ని ఖర్చు చేసే విషయంలో ఒకే రకమైన విలువలు, ఆచరణలను కలిగి ఉండడం.
జీవితం మరియు పిల్లల పెంపకం గురించి ఒకే ఆలోచన కలిగి ఉండడం.
వివాహానికి ముందు సంబంధంలో అపాయ సంకేతాలు
వివాహానికి ముందున్న సంబంధాన్ని ముగించడానికి స్త్రీ లేక పురుషుడు తీవ్రంగా పరిగణించవలసిన ఎనిమిది సమస్యల జాబితాను జాన్ డ్రేషర్ పొందుపరచారు:[3]
1. మీరు, మీ స్నేహితుడు పరస్పరం తరచు వాదోపవాదాలు చేసుకుంటారు.
2. మీ స్నేహితునిని మానసికంగా బాధపెట్టడం ఎందుకనే ఉద్దేశ్యంతో సున్నితమైన విషయాలను చర్చించకుండా వదిలేస్తారు. “దీని గురించి మాట్లాడకపోతేనే బాగుంటుంది” అని అనుకుంటారు-ఇది ప్రమాద సంకేతం. వివాహం అంటే, అనేక విషయాలు ధైర్యంగా, ప్రేమగా మాట్లాడుకోవాలని అర్థం.
3. మీ సంబంధంలో శారీరక సాన్నిహిత్యం ఎక్కువగా ఉండడం. వివాహమవ్వని జంటగా మీరు శారీరకంగా ఎంత దగ్గరైతే, మాటలు, స్వర స్థాయి, ముఖ కవళికలు మరియు శరీర భాష ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అంత తక్కువగా నేర్చుకుంటారు. ఎక్కువగా తాకడం, తక్కువగా మాట్లాడడం మీ బంధానికి నిజమైన ప్రమాద సంకేతం కావచ్చు.
4. ఒక రకమైన భయంతో మీరు సంబంధంలో ఉన్నారనే భావన మీకు కలుగుతుంది. ఉదాహరణకు, “నేను ఈ బంధాన్ని తెంచుకోవాలని అనుకుంటున్నాను, కాని ఎవర్ని బాధపెట్టదలచుకోలేదు.”
5. మీ స్నేహితుడు మీ అనుకూల విమర్శలను అంగీకరించలేకపోవచ్చు. మీ స్నేహితుడు తప్పు చేసినప్పుడు, క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తారా? అప్పుడది, పెద్ద సమస్యగా మారుతుంది, ఒకవేళ వివాహం చేసుకుంటే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది.
6. మీ సంబంధ విషయంలో, మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నవారి విషయంలో తల్లిదండ్రులు, స్నేహితులు అభ్యంతరాలు చెప్పవచ్చు. ఇది ఖచ్చితంగా అపాయ సంకేతం కావచ్చు, సంబంధాన్ని ముగించడానికి కారణమవ్వొచ్చు. మీరు ఆ వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవట్లేదు కాని వివాహం చేసుకుని ఒక కుటుంబంలోకి వెళ్తారు, అది మీ భద్రతపై, మీ విజయంపై ప్రభావం చూపిస్తుంది.
7. మీ స్నేహితుడు అసూయతో లేక అనుమానంతో నిండి ఉంటాడు. ఉదాహరణకు, ఒకవేళ మీ స్నేహితుడు మీ మాటల్ని ప్రశ్నిస్తే లేక మీ మీద నమ్మకం కోల్పోతే, ఇది అపాయ సంకేతం. అపనమ్మకం ఏ వివాహ బంధాన్నైనా నాశనం చేస్తుంది. కాబట్టి, మీ స్నేహితుడు అతిగా అసూయతో లేదా అపనమ్మకంతో ఉంటే, మీకు అవకాశం ఉన్నప్పుడే సంబంధాన్ని ముగించండి.
8. మీ సంబంధం గురించి మీకు అసౌకర్య భావన కలిగియుండవచ్చు; మరి ముఖ్యంగా, మీ స్నేహితునితో ఒంటరిగా ఉన్నప్పుడు అసౌకర్య భావన కలిగియుండవచ్చు. “ఏదో తప్పు జరుగుతుంది” అనే ఆలోచన లేక భావన మీకు ఉండొచ్చు. అంతరంగంలో సమాధానం లేని స్థితిని జాగ్రత్తగా దృష్టించండి!
[1]దేవునికి లోబడడం అంటే, మీకు ఉత్తమమైనదేదో అది ఆయనకు తెలుసు, ఆయన అదే కోరుతున్నాడని నమ్మడం.
(సామెతలు 3 చూడండి.)
[2]నేటి మీ స్వీయ-నియంత్రణ మీకు కాబోయే జీవిత భాగస్వామికి ఒక బహుమతి.
దేవునికి విధేయత చూపాలనే మీ నిర్ణయం వలన మీ భాగస్వామి భద్రతను, గౌరవాన్ని భావిస్తాడు.
జీవిత భాగస్వామి ప్రేమను అనుభవిస్తుంది.
[3]Adapted from John Drescher, For Better, For Worse: A Premarital Checklist, (Morgantown, PA: Masthof Press, 1999), 30-31.
ముగింపు
సామెతలు 24:3-4, “జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును. తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును.”
ఒక వ్యక్తి తీసుకోగల ఒక ముఖ్యమైన నిర్ణయం, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడమే. దేవుని పిల్లలు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో జ్ఞానంగా నడచుకోవడానికి ఆయన సంతోషంగా సహాయం చేస్తాడు.
సమూహ చర్చ కోసం
► పాఠంలో మీకు కొత్తగా అనిపించిన అంశం ఏమిటి? అది ఎందుకు ముఖ్యమైనది? దానిని అర్థం చేసుకోవడం మీ సంబంధాలలో ఎలా సహాయపడుతుంది? దానిని అర్థం చేసుకోవడం ఇతరులకు మీరు చేసే పరిచర్యపై ఎలా ప్రభావం చూపుతుంది?
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
మమ్మును నడిపించినందుకు, మాకు అనుగ్రహించుచున్నందుకు ధన్యవాదా లు. జీవితంలో తీసుకునే ముఖ్య నిర్ణయాల విషయంలో తెలివైన ఎంపికలు చేసుకోవడానికి సహాయం చేసే సూత్రాలు నీ వాక్యంలో మాకు ఇచ్చినందుకు వందనాలు.
మేము జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు నీ ప్రాధాన్యతలను కలిగి ఉండేందుకు మాకు సహాయం చెయ్యి. నీవు కోరుకునే స్త్రీ పురుషులుగా మేము ఉండేందుకు మాకు సహాయం చెయ్యి. మేము వినయంగా ఉండి, భక్తిపరులైన వారి సలహాలను వినేందుకు మాకు సహాయం చెయ్యి.
నీకు మహిమ తీసుకొచ్చే పరిశుద్ధమైన, ఫలవంతమైన జీవితాలు జీవించడానికి మాకు సహాయం చేయండి.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) మీ పరిచర్యలో బోధించడానికి ఈ పాఠంలో ఒక భాగం ఎంపిక చేసుకోండి. మీరు ఒక వ్యక్తికి బోధించవచ్చు లేక ఒక సమూహానికి కూడా బోధించవచ్చు. ఈ తరగతి వెలుపల బోధన చేయడం ముగిసిన తర్వాత, మీ తరగతి నాయకుడికి చెప్పండి.
(2) మీ సంస్కృతిలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న లేక వివాహం గురించి ఆలోచిస్తున్న దైవభక్తిగల స్త్రీ లేక పురుషుని గుణాలను గురించి రాత పూర్వకంగా వివరించండి.
(3) మీరు వివాహితులైనా వివాహితులుకాకపోయినా, మీ జీవిత భాగస్వామిలో చూడాలని ఆశిస్తున్న గుణాల జాబితాను సమీక్షించండి. ఇచ్చిన ప్రతి లేఖన భాగాన్ని చదవండి. మీరెలా ఎదగాలని ఆశిస్తున్నారో దేవుణ్ణి చూపించమని వేడుకొనండి.
(4) ఒకవేళ మీరు ఒంటరివారైతే, భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లయితే, మీ జీవిత భాగస్వామిలో చూడాలనుకుంటున్న వాటిని జాబితా చేయండి. దీనిని మీ తరగతి నాయకుడితో పంచుకోవలసిన అవసరత లేదు కాని మీరు అభ్యాసం పూర్తి చేశారని చెప్పండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.