బుసాబా ఆసియా దేశంలో పుట్టింది. ఒక యువ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నప్పుడు, ఇద్దరూ కలిసి ఆనందకరమైన జీవితం గడుతామనే ఆశతో ఆమె చాలా సంతోషించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి, బుసాబాకు పిల్లలు పుట్టలేదు. బుసాబాకు పిల్లలు పుట్టడం సాధ్యం కాదని వైద్యుడు చెప్పాడు. అప్పుడు ఆమె భర్తకు బాధ కలిగింది, కోపం వచ్చింది. అప్పుడు బుసాబాకు విడాకులు ఇచ్చి, వేరొక స్త్రీని వివాహం చేసుకుందామని అనుకున్నాడు. ఇప్పుడు బుసాబా వయస్సు పెరిగిపోయింది. ఒంటరిగా ఒక చిన్న ఇంట్లో ఉండేది, బంధువులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆమె భౌద్ధమతానికి చెందినది గనుక, భవిష్యత్తు ఏదొక రోజు పిల్లలు పుడతారు, ఇక అవమానం ఉండదని ఆమె ఆశించింది.
► ఒకవేళ మీరు బుసాబా ఉండే సమాజంలో ఒక పాస్టర్ అయితే, ఆమెకు ఏం చెబుతారు? మీరు బుసాబాకి ఇచ్చే క్రైస్తవ సందేశం ఏంటి?
ఈ పాఠంలో, సంతానలేమి సమస్యలకు బైబిలు ఎలా స్పందిస్తుందో చూద్దాం.
పిల్లలు మరియు దేవుని ఆశీర్వాద కార్యం
దేవుడు మొదటి పురుషుడిని, స్త్రీని చేసిన తక్షణమే, పిల్లల్ని కని, అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నింపమని చెప్పాడు (ఆదికాండము 1:28).
పాత నిబంధనలో, దేవుడు కొన్నిసార్లు ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా కుటుంబంలోని అనేక తరాలను ఆశీర్వదించాడు. ఉదాహరణకు, దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన ఆశీర్వాదాలు కేవలం అబ్రాహాముకే కాదు కాని తరువాత వచ్చే తరాలకు కూడా వర్తిస్తాయి. అబ్రాహాము సంతానం సముద్ర ఇసుక రేణువులవలె ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. అద్భుతరీతిగా శారా, ఇస్సాకును గర్భం దాల్చింది. కాలక్రమేణా కుటుంబం విస్తరించింది, తరాలు పెరిగాయి, తద్వారా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడని స్పష్టమైంది.
నిర్గమకాండము 23:25-27లో దేవుడు, ఇశ్రాయేలు నూతన వాగ్దాన భూమిలోనికి వెళ్ళినప్పుడు వారిని దీవిస్తానని చెప్పాడు. వారి ఆహారాన్ని దీవిస్తానని, వారి మధ్య నుండి రోగాలు తొలగిస్తానని, కడుపు దిగబడడంగాని గొడ్డుదిగాని వారి దేశంలో ఉండదని, శత్రువులను నాశనం చేస్తానని దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలు ఇశ్రాయేలీయుల విధేయతపై ఆధారపడి ఉన్నాయి. దేవుడు తన షరతులను వివరించాడు (నిర్గమకాండము 23:32లోని ఆజ్ఞ వంటివి). వాగ్దానాలు వ్యక్తిగతంగా కాకుండా దేశమంతటికి ఇచ్చాడు. దేశమంతటి విధేయత లేక అవిధేయత వ్యక్తుల మీద (ఒకొక్కరి మీద) ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి అనారోగ్యం రావచ్చు, లేక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చు అందుకు కారణం వారు చేసిన పాపం కాదుగాని దేశమంతా దేవునికి అపనమ్మకం చూపడం వలన కలుగుతుంది. కాబట్టి, సంతానం లేకపోవడం స్త్రీ చేసిన పాపానికి శిక్ష కాదు.
ద్వితీయోపదేశకాండము 7:12-15లో ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాలను చూస్తాం. మానవులకుగాని జంతువులకుగాని రోగం ఉండదు, గొడ్డుతనముండదు. ఇశ్రాయేలీయులు దేవునికి విధేయులైనప్పుడు, ఆయన తమ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి ఆశీర్వదిస్తాడని 12వ వచనం మాట్లాడుతుంది. ఒకవేళ ఇశ్రాయేలీయులు దేవుని పట్ల అపనమ్మిక చూపితే, కొందరు బీదలౌతారు, కొందరు స్త్రీలు సంతానలేమితో బాధపడతారు.
దేవుడు తన ప్రజలపట్ల కలిసియున్న ప్రణాళికలో పిల్లలు ముఖ్యులు. ఈ కోర్సులోని ఇతర భాగాల్లో, పిల్లలు దేవుని స్వరూపంలో సృజించబడిన కారణాన్ని బట్టి వారికి ఎంత విలువ ఇవ్వాలో మాట్లాడుకున్నాం. ప్రతి బిడ్డ విలువైనవాడు గనుక వారిని ప్రేమగా, శ్రద్ధగా చూడాలి. అయితే, కొంతమంది భవిష్యత్తులో తమ కుటుంబాన్ని బలంగా ఉంచగలరనే ఉద్దేశ్యంతో పిల్లలకు విలువిస్తారు. కొన్నిసార్లు, పిల్లవాడు తన తండ్రి గుర్తింపును ముందుకు తీసుకెళతాడు గనుక తండ్రి వాడికి విలువిస్తాడు. అయితే దేవుడు తన సొంత ఉద్దేశ్యాల కోసం బిడ్డల్ని ఇస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి (మలాకీ 2:15).
► ఒకరు కీర్తన 127:3-5 బిగ్గరగా చదువుతుండగా మిగిలినవారంతా వాక్య భాగంలోకి చూడాలి.
పిల్లలు యెహోవా ఇచ్చు ఆశీర్వాదమని ఈ వాక్యం సెలవిస్తుంది. వారు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఆయన ఇచ్చు బహుమానం. వారు భవిష్యత్తులో కుటుంబానికి రక్షణ, భద్రతను అందిస్తారు.
కొన్నిసార్లు, లేఖనంలో రెండు ఆశీర్వాదాలు - దీర్ఘాయువు, తరాలను చూడడం- గురించి ఒకేసారి ప్రస్తావించబడుతుంది. యోబు ఆశీర్వదించబడినవాడు ఎందుకంటే అతనికి పదిమంది పిల్లలు, అలాగే కుమారులను, కుమారుల కుమారులను నాలుగు తరాలవరకు చూశాడు (యోబు 42:13, 16). కీర్తన 128:6 లోని ఆశీర్వాదం ప్రకారం, మనవళ్లు మనవరాళ్లను చూడడం దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం.
దేవుడు యెహోనాదాబు కుటుంబాన్ని ఆశీర్వదించి, ప్రతి తరాన్ని నడపడానికి సంతతివాడు ఎన్నడు ఉండకుండా మానడు అని వాగ్దానం చేశాడు (యిర్మీయా 35:19). అలాగే, నీ సంతానం నీ రాజ్యం నిత్యం స్థిరపడుతుందని దేవుడు రాజైన దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు (2 సమూయేలు 7:16).
కాబట్టి, దేవుడు కుటుంబానికి ఇచ్చే ఆశీర్వాదాల్లో పిల్లలు కూడా భాగమని, పిల్లల ద్వారానే దేవుని ఆశీర్వాదాలు తరతరాలకు కొనసాగుతాయని మనం చూశాం.
గొడ్రాలితనం గూర్చి బైబిలు అవగాహన
కొన్ని సందర్భాల్లో పిల్లలు లేకపోవడం దేవుని శాపానికి సాదృశ్యం. దేవుడు పిల్లలు కలుగకుండా కుటుంబాల్ని శపించిన సందర్భాల గురించి బైబిలు మాట్లాడుతుంది. ఉదాహరణకు, అబీమెలెకు తప్పు చేశాడు గనుక తన తప్పును సరిదిద్దుకునే వరకు దేవుడు తన ఇంటిలో ప్రతి గర్భాన్ని మూసివేశాడు (ఆదికాండము 20:18). ఇక్కడ స్త్రీలు తప్పు చేయలేదు గాని రాజు చేసిన పాపానికి శిక్ష అనుభవించారు.
ఆదాము, హవ్వ పాపం చేసిన తర్వాత, వారి పాప ప్రభావం లోకమంతటిమీద పడుతుందని దేవుడు చెప్పాడు. ఆ శాపం కారణంగా, బంధాల్లో కష్టాలు ఉంటాయి, పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు వేదన, బాధ కలుగుతుంది, ప్రయాసపడాలి, భూమి సాగు చేయడానికి సహకరించదు, చివరికి మరణం వస్తుంది (ఆదికాండము 3:14-19). ఆదాము మొదలుకొని ప్రతి మానవుడు, వ్యక్తిగతంగా పాపాలు చేయకమునుపే పుట్టుకతోనే శాపం అనుభవిస్తున్నాడు. పాప రహితుడైన యేసు సైతం, శాపానికి లోనైన మానవ శరీరంలోనే భూలోకానికి వచ్చాడు. కాబట్టి, ఒక వ్యక్తి బాధ అనుభవించడానికి కారణం అతను చేసిన తప్పేనని మనం చెప్పకూడదు. మనందరం వృద్ధులౌతాం, అనారోగ్యానికి గురౌతాం, అనేక విధాలుగా బాధపడతాం, చివరికి మరణిస్తాం. పిల్లలు కనడంలో ఉండే సమస్యలతో సహా ఈ సమస్యలన్ని ఆదాము చేసిన మొదటి పాపం ఫలితంగా వచ్చాయి.
ఆదాము చేసిన పాపంతో పాటుగా, మన పూర్వికుల పాప ప్రభావం కూడా మనపై ఉంటుంది ఎందుకంటే వారి చర్యలు ప్రభావితం చేసిన సమాజంలోనే మనం పుట్టాం. మన కుటుంబస్తుల పాపం, మన సమాజం, మన దేశం చేసిన పాపం మనపై ప్రభావం చూపిస్తుంది. లోకంలో ప్రతిచోట ఉన్నటువంటి విశ్వాసులు వారు నియంత్రించలేని సమాజం సృష్టించిన షరతులను అనుభవిస్తున్నారు. స్వేచ్ఛ, అవకాశాలు లేని సమాజంలో ఉండడం వలన కుటుంబాలు పేదరికాన్ని అనుభవించవచ్చు. ఒక శిశువు తాను చేయని తప్పువలన కూడా శారీరక లోపంతో పుట్టొచ్చు (యోహాను 9:1-3).
దేవుడు కొందరికి పిల్లల్ని ఇవ్వడానికి లేక మరికొందరికీ పిల్లల్ని ఇవ్వకపోవడంలో ఆయన ఉద్దేశ్యం ఏంటో మనకు తెలియదు. కొన్నిసార్లు ప్రజల నిర్లక్ష్యంతో, తిరుగుబాటు ధోరణితో పాపం చేయడంవల్ల అనేకమంది పిల్లల్ని కని, దేవుని మహిమపరిచే విధానంలో వాళ్ళను పెంచరు (కీర్తన 17:14). కొన్నిసార్లు, నమ్మకంగా జీవించే విశ్వాసులకు సంతానం కలగదు. కాబట్టి ఎవరికైన సంతానం లేనప్పుడు అది వారి పాప ఫలితమని మనం ఎన్నడు భావించకూడదు.
దేవుడు ఏ సమయంలోనైనా స్వస్థత ఆశీర్వాదం ఇవ్వగలడు కాని సాధారణంగా, విశ్వాసులు ఈ లోక పరిస్థితుల్ని భరించాలి. దేవుడు తన సృష్టిని పునరుద్ధరించే సమయం కోసం విశ్వాసంతో వేచి చూడాలి (రోమా 8:18-23).
పిల్లలు లేనందువల్ల స్త్రీని నిందించడం అన్యాయం. అలాగే, శిశువు గర్భంలోనే మరణిస్తే, ఆ మరణానికి తల్లి కారణం కాదు. ఆదాము చేసిన పాపం, ఇతరులు చేసిన పాపం వలన మరియు లోక సహజ పరిస్థితులను బట్టి వ్యక్తులు బాధపడుతుంటారు. ప్రతి ఒక్కరు పాపం చేశారు గనుక లోక పరిస్థితికి స్వరమానవాళి బాధ్యత వహిస్తుంది, కాని ప్రజల బాధలు వివిధ రకాలుగా ఉంటాయి.
దేవుని అద్భుతాలు
యేసు స్వస్థపరచినప్పుడు, ఇతర అద్భుతకార్యాలు చేసినప్పుడు దేవుని ప్రేమ చూపించాడు. బైబిలు చరిత్ర అంతటిలో, దేవుడు తన ప్రజల కోసం చేసిన ఎన్నో అద్భుత కార్యాలు మనం చూస్తాం.
దేవుడు మనం ఈ అందమైన ప్రపంచంలో సంతోషంగా, బాధలు లేకుండా జీవించాలని కోరుకుంటున్నాడు (ఆదికాండము 1:28, 31, 1 తిమోతి 6:17). అయితే, దేవుని మొదటి ప్రాధాన్యత పాపం నుండి మనలను రక్షించడం, తద్వారా మనం ఆయనతో శాశ్వత సంబంధాన్ని ఆస్వాదించగలం. పాపుల రక్షణకు సమయం పడుతుంది, ఎందుకంటే ప్రజలు పశ్చాత్తాపపడి, నమ్మాలనే నిర్ణయం తీసుకోవాలి. దేవుడు ఇప్పుడే అన్ని శ్రమల్ని అంతం చేస్తే, చాలా తక్కువ మంది పశ్చాత్తాపపడతారు, ఎందుకంటే వారికి పాపం యొక్క చెడుతనం అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు, సువార్త ప్రపంచవ్యాప్తంగా బోధించబడుతున్నందున శ్రమలు కొనసాగాలి. దేవుడు మన కోసం అప్పుడప్పుడు అద్భుతాలు చేసినప్పటికీ, మన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి మరియు మన శ్రమలన్నింటినీ తొలగించడానికి మనం అద్భుతాలను ఆశించలేము. అంతిమంగా, దేవునితో సంబంధం ఉన్నవారికి శ్రమలన్నీ అంతమవుతాయి. అయితే ఈలోగా, దేవుడు మన బాధలలో మనతో కలిసి దుఃఖిస్తాడు (యోహాను 11:35) మరియు అనేక విధాలుగా మనలను ఓదారుస్తాడు (2 కొరింథీయులకు 1:3-7).
దేవుడు చేసే అద్భుతాల్లో ఒకటి, సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయడం (కీర్తన 113:9).
బైబిల్లో కనీసం ఆరు సందర్భాల్లో దేవుడు సంతులేనిదానికి కుమారుల్ని అనుగ్రహించాడు. దేవుడు చాలాసార్లు ఇదే అద్భుతం చేసినా, చరిత్రలో పిల్లలు ముఖ్య పాత్ర పోషించినందున ఈ ఆరు సందర్భాలు మాత్రమే బైబిల్లో లిఖించబడ్డాయి. శారాకు ఇస్సాకు పుట్టాడు (ఆదికాండము 21:1-3). రిబ్కాకు యాకోబు, ఏశావు పుట్టారు (ఆదికాండము 25:21, 25-26). రాహేలుకు యోసేపు పుట్టాడు (ఆదికాండము 30:22-24). మనోహ భార్యకు సంసోను, పుట్టాడు (న్యాయాధిపతులు 13:2-3, 24). హన్నాకు సమూయేలు పుట్టాడు (1 సమూయేలు 1:20). ఎలీసబెతుకు యోహాను పుట్టాడు (లూకా 1:13, 57).
ఈ ఆరు సందర్భాల్లో, స్త్రీకి పిల్లలు లేనందువల్ల దంపతులిద్దరూ బాధపడ్డారు. బైబిల్లో, స్త్రీకి పిల్లలు కలుగకపోవడం వలన దేవుడు ఏ ఒక్కరిని నిందించలేదు. పిల్లలు లేనందువల్ల, దేవుడు తల్లి/తండ్రిని ఇష్టపడలేదని బైబిల్లో ఎక్కడా కనిపించదు. జెకర్యా, ఎలీసబెతులు దేవుని దృష్టిలో నీతిగా ఉన్నారని, ఆయన ఆజ్ఞలకు పుర్తిగా లోబడ్డారని, కాలం గడిచి వృద్ధులైనా వారికి పిల్లలు కలుగలేదని లూకా 1:5-7 మాట్లాడుతుంది. ఈ ఆరు సందర్భాల్లో, వారు అద్భుతం కోసం ప్రార్థన చేస్తుండగా, పాపాన్ని ఒప్పుకున్నట్లుగాని లేక పశ్చాత్తాపపడినట్లుగాని అక్కడ కనిపించదు. దేవుడు వారికిచ్చిన సందేశాల్లో కూడా సంతానలేమికి కారణాలు చెప్పలేదు. కాబట్టి, సంతానం లేకపోవడం వలన, వ్యక్తిగతంగా వారిని నిందించకూడదని ఈ సంఘటనలు తెలియజేస్తాయి.
దేవుడు సంతానాన్ని ఇచ్చేటట్లు ప్రార్థించడం మంచిదే, కాని తుదకు మనం దేవుని నిర్ణయాన్ని అంగీకరించవలసినదే. దేవుడు ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచనట్లే, ప్రతి బాధను తీసివేయనట్లే, ప్రతి సందర్భంలోను సంతానం ఇస్తాడని మనం అనుకోకూడదు.
అపొస్తలుడైన పౌలు తన శరీరంలోని ముల్లును తీసివేయాలని దేవుణ్ణి ముమ్మారు అడిగాడు (2 కొరింథీయులకు 12:7-10). అతని సమస్య ఏంటో మనకు స్పష్టంగా తెలీదు, కానీ అది ఒక రకమైన శరీర బలహీనత. దేవుడు ఆ పరిస్థితిని మారుస్తాడని అనుకుని, అద్భుతం కోసం ప్రార్థించాడు. అయితే దేవుడు ఆ ముల్లును తీసివేయకుండా, ఆ బలహీనత కంటే గొప్పదైన తన కృపను అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆ బలహీనత దేవునికి మహిమ తీసుకొస్తుందని పౌలు చెప్పాడు ఎందుకంటే దేవుని శక్తి కనుపరచడానికి అది సహాయపడింది. బలహీనతల్లో, బాధల్లో దేవుడు మహిమపరచబడుతున్నాడు గనుక పౌలు వాటియందు సంతోషిస్తున్నానని చెప్పాడు.
అపొస్తలుడైన పౌలు గొప్ప విశ్వాసవీరుడు, కాని అతనికి కావలసిన అద్భుతాలు ఎల్లప్పుడు పొందుకోలేదు. అతడు దేవుని చిత్తాన్ని అంగీకరించాడు. మనం ఎల్లప్పుడూ దేవుని నుండి అద్భుతం కోరుతున్నప్పటికీ, దేవుని నిర్ణయాల్ని అంగీకరించేవారిగా ఉండాలి. కొన్నిసార్లు మన బలహీనతల ద్వారా ఆయన మరింత మహిమ పొందుకుంటాడు.
► మీరు అనుకున్నటువంటి అద్భుతాన్ని మీ జీవితంలో చేయకుండా దేవుడు మీపై కృప చూపిన ఒక సందర్భం గురించి పంచుకోండి.
గొడ్రాలితనంపై సాంస్కృతిక స్పందనలు
పిల్లలకు విలువ ఇచ్చే విషయంలో సంస్కృతులన్ని ఒకేలా ఉండవు. కొన్ని దేశాల్లో, కుటుంబాలు ఎక్కువమంది పిల్లల్ని కోరుకుంటారు. కుటుంబానికి మద్దతుగా పిల్లలు పనిలో సహాయం చేయగలరని అనుకుంటారు. దూరపు బంధువులైన బావలు, మేనమామలు, మరుదులు అవసరమైనప్పుడెల్లా పరస్పర సంరక్షణ అందించుకుంటూ ఉంటారు. ఆ పెద్ద కుటుంబంలోని ప్రతి భార్య పిల్లలను కంటూ కుటుంబాన్ని విస్తరింపజేస్తుంది. పెద్ద కుటుంబాల్లో ఎక్కువ కుమారులున్న తండ్రికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు. కుటుంబంలో పెద్దవారందరినీ చూసుకనే బాధ్యత కుటుంబంపై ఉంటుంది.
ఇంకొన్ని దేశాల్లో, చాలా కుటుంబాలు పట్టణంలో లేక నగరాల్లో ఉంటాయి, ఆ కుటుంబాల్ని తల్లి తండ్రి ఉద్యోగం చేస్తూ పోషిస్తారు. నగరాల్లో, పిల్లలు కుటుంబానికి తగినంత సహాయం చేయలేరు. పిలల్ని పోషించడానికి, వారికి విద్య అందించడానికి చాలా ఖర్చు అవుతుంది. కాలం గడిచేకొద్దీ, కుటుంబాలు అనేక తరాలపాటు నగరంలో నివసిస్తున్నప్పుడు, తక్కువమంది పిల్లలు కావాలని అనుకుంటారు. నగరాల్లో ఉండే కుటుంబాలు, ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కోరుకుంటాయి.
చాలా సంస్కృతులలో పిల్లలకు ఉన్న విలువ చాలా గొప్పది కాబట్టి దంపతులు గౌరవాన్ని విలువను పొందుకోవాలంటే ఖచ్చితంగా పిల్లల్ని కనాలని భావిస్తారు. పిల్లలు లేని తల్లి, తన జీవితంలో ముఖ్య బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నానని అనుకుంటుంది. అలాగే, పెళ్లికాని స్త్రీ ఒకరికి భార్య కాలేనందున, పిల్లల్ని కనలేనందున సిగ్గుపడుతుంది.
చాలా సంస్కృతుల్లో, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, నడిపించడానికి కుమారులు అవసరమని భావిస్తారు. కుమార్తెలకు పెద్దగా విలువ ఇవ్వరు. ఆడ శిశువుల్ని చంపేస్తారు లేక విడిచిపెట్టేస్తారు. చాలా దేశాలు శిశువు కడుపులో ఉన్నప్పుడే లింగాన్ని పరిశోధించి తెలుసుకునే పరీక్షలను నిషేధించాయి ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఆడ శిశువుల్ని కడుపులోనే చంపేస్తున్నారు. అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలకు కూడా అదే గౌరవం, విలువ ఉన్నాయని లేఖనాల ద్వారా మనకు అర్థమౌతుంది ఎందుకంటే వారు దేవుని స్వరూపంలో సృజించబడ్డారు (ఆదికాండము 1:27). కాబట్టి, సంస్కృతితో నిమిత్తం లేకుండా, క్రీస్తును అనుసరించే కుటుంబాలు కుమారుల్ని, కుమార్తెల్ని ఒకే విధంగా చూడాలి.
ఒకవేళ కుటుంబం బిడ్డను బట్టి అతిశయించాలనుకుంటే, బహుశా వారు శారీరక లేక మానసిక వైకల్యంతో పుట్టిన బిడ్డల్ని తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. కొన్ని దేశాల్లో, చాలామంది అంగవైకల్యంతో పుట్టిన పిల్లలు, తల్లిదండ్రుల తిరస్కరణ కారణంగా అనాధ ఆశ్రమాల్లో ఉంటున్నారు. ఈ విధంగా పిల్లల్ని తిరస్కరించడం మంచిది కాదు, ఎందుకంటె వారి పరిమితి ఏదైనా లేక వారి సామర్థ్యాలు ఎలా ఉన్నా వారు దేవుని స్వరూపంలో చేయబడ్డారు, ఆయన దృష్టిలో విలువైనవారు.
కొన్ని సంస్కృతులలో, బహుభార్యత్వం పిల్లల విలువ మీద ఆధారపడి ఉంటుంది. పురుషుడు చాలామంది భార్యల ద్వారా సంతానాన్ని విస్తరింపజేయాలనుకుంటాడు. అయితే భర్త కేవలం ఒకే భార్యను కలిగియుండడం దేవుని ఉద్దేశ్యమని బైబిల్ సెలవిస్తుంది (ఆదికాండము 2:22-24, 1 తిమోతికి 3:2).
పాత నిబంధన గ్రంథంలో, భర్తకు పిల్లల్ని కనాలని, భార్యలు తమ దాసీలను భర్తలకు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. దాసీ పిల్లల ద్వారా భార్య గౌరవాన్ని పొందుకునేది. యాకోబు భార్యలైన లేయ, రాహేలు ఎక్కువ మంది పిల్లల ద్వారా గౌరవం పొందుకోవాలని తమ దాసీలను యాకోబుకు ఇచ్చారు.
ఎక్కువమంది పిల్లలకోసం దాసీలను వాడడం సంక్లిష్ట సంబంధాలకు దారితీస్తుంది. శారా అబ్రాహాముకు హాగరును ఇచ్చింది, హాగరుకు బిడ్డ పుడితే తనకు గౌరవం వస్తుందని ఆశపడింది (ఆదికాండము 16:2-6). హాగరు గర్భం ధరించి, శారా కంటే గొప్పగా భావించుకుంది. శారా ఆమెను కఠినంగా శిక్షించి, తన సొంత అధికారం కోసం ప్రయత్నించింది.
అమినాటా పశ్చిమ ఆఫ్రికా దేశంలో పుట్టింది. పెళ్ళైన మూడు సంవత్సరాల వరకు ఆమెకు బిడ్డలు పుట్టలేదు. అమినాటా సంస్కృతిలో, సొంత బిడ్డలు లేనందువలన కలిగిన అవమానం, బిడ్డను దత్తతు తీసుకున్నప్పటికీ, తొలగిపోలేదు. అమినాటా మారుమూల గ్రామంలో ఉండే ఒక పేద గర్భవతిని కనుగొని, ఆమె బిడ్డను కొనుక్కోవాలనుకుంది. చాలా నెలలు పాటు తాను గర్భవతిగా కనబడాలని ఎత్తుగా ఉండేందుకు తన డ్రస్ లోపల యేవో పెట్టుకుంది. బిడ్డ పుట్టే సమయం ఆసన్నమైనప్పుడు, అమినాటా ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు నటించింది, ఆ తర్వాత ఆ గ్రామంలో నుండి ఆ బిడ్డతో ఇంటికి తిరిగి వచ్చింది.
ఒక కుటుంబం దాని ప్రయోజనం కోసమే పిల్లలు కావాలనుకుంటే, దేవుని స్వరూపంలో పుట్టిన బిడ్డలుగా వారికి విలువ ఇవ్వడంలో విఫలమైపోతారు. అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను అంగీకరించరు, ప్రేమించరు. కుమారుడు కావాలి కాబట్టి కుమార్తెను తిరస్కరిస్తారు. అనాధలను లేక నిరాశ్రయులను దత్తత తీసుకోవాలనే ఆలోచనను అంగీకరించరు. ఈ వైఖరులు, చర్యలు అన్ని స్వార్థంతో కూడినది, మంచివి కావు. ఏ కారణం చేతనైనా మనం వీరిని త్రుణీకరించినప్పుడు, సృష్టికర్తయైన దేవుణ్ణి అవమానిస్తున్నాం (నిర్గమకాండము 4:11, సామెతలు 14:31).
హెన్రీ VIII 1509-1547వరకు ఇంగ్లాండ్ దేశానికి రాజుగా ఉన్నాడు. అతనికి ఖచ్చితంగా కుమారుడు కావాలనే బలమైన కోరిక ఉండేది. తన భార్యకు కుమార్తె ఉంది కాని కుమారుడు ప్రాణాలతో బయటపడలేదు, హెన్రీ ఆమెను విడిచి, మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య కూడా కుమారుని కనలేనప్పుడు, ఆమె రాజద్రోహం చేసిందని చెప్పి ఉరిశిక్ష విధించాడు.
పురుషుడి యొక్క వీర్యం పిల్లల లింగాన్ని నిర్ణయిస్తుందని వైద్యశాస్త్రం నిరూపించింది. కుమార్తె పుడుతుందా లేక కుమారుడు పుడతాడా అనేది స్త్రీ శరీరం నిర్ణయించదు. అయితే, కుమారులు కాకుండా కుమార్తెలకు జన్మనిచ్చిందని చాలామంది పురుషులు తమ భార్యలపై కోపపడతాడు.
తనిష్ మరియు అతని భార్యకు ఇద్దరు కుమార్తెలున్నారు. తనిష్ భార్య మూడవసారి ప్రసవించడానికి ఆసుపత్రికి వెళ్లినప్పుడు, కొడుకు పుడతాడని ఆశించాడు. మూడవసారి కూడా కుమార్తె పుట్టింది. కాబట్టి తనిష్ భార్యను చూడడానికి ఆసుపత్రికి వెళ్లలేదు, ఆసుపత్రి బిల్ కూడా చెల్లించలేదు.
యోబు 24 లో యోబు, దుష్టుల చర్యలు గురించి సుదీర్ఘంగా మాట్లాడాడు. అక్కడ అతడు చెప్పిన ఒక చర్య ఏమిటంటే, దుష్టుడు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెడతారు (యోబు 24:21). పిల్లలు లేని స్త్రీని బాధపెట్టినప్పుడు దేవుడు సంతోషించడు.
► మీ సంస్కృతి పిల్లలకు ఎలా విలువను ఇస్తుంది? ప్రజలు, పిల్లలు కావాలనుకోవడానికి కొన్ని కారణాలు ఏంటి?
► మీ సంస్కృతిలోని కట్టుబాట్లవలన జరిగే అన్యాయాలు ఏంటి?
దేవుడు ఏం చెబుతున్నాడు
దేవుడు పిల్లలు లేనివారికి పిల్లలను అనుగ్రహించాడని తెలియజేసే బైబిల్లోని ఆరు కథనాల్లో, పిల్లలు లేకపోవడాన్ని బట్టి దేవుడు వారిని నిందించలేదు. నిజానికి, ప్రత్యేకమైన కుమారులను సంరక్షించడానికి దేవుడు ప్రత్యేకమైన తల్లిదండ్రులను ఎన్నుకున్నాడు. జెకర్యా ఎలిసబెతు నీతిమంతులుగా పిలువబడ్డారు (లూకా 1:5-6). ఒక స్త్రీ దేవుణ్ణి సంతోషపెట్టలేని కారణాన్ని బట్టి గొడ్రాలైందని మనం ఎన్నడు భావించకూడదు.
పిల్లల్ని కనని గొడ్రాండ్రను బాధపెట్టుట దుష్ట కార్యమని యోబు 24:21 చెబుతుంది. సంతానం లేని స్త్రీకి దేవుడు తీర్పుతీర్చడు లేక బాధపెట్టడు కాబట్టి మన కూడా బాధపెట్టకూడదు.
యెషయా 56:4-5లో, పిల్లలు లేని తండ్రి గురించి దేవుడు మాట్లాడాడు. ఈ వ్యక్తి దేవునికి విధేయుడై, ఆయన నిబంధనను గైకొనినప్పుడు, కుమారులు కుమార్తెలు కలిగినప్పుడు కలిగే గౌరవం కంటే మరింత ఉత్తమమైన స్థానాన్ని, గౌరవాన్ని కలుగజేస్తానని దేవుడు సెలవిచ్చాడు.
అపొస్తలుడైన పౌలు, తిమోతికి (1 తిమోతికి 1:2) తీతుకు (తీతుకు 1:4) మరియు ఒనేసిముకు (ఫిలేమోనుకు 10) తాను తండ్రినని చెప్పుకున్నాడు. కొరింథీయులకు విశ్వాసులకు తననుతాను తండ్రిగా పిలుచుకున్నాడు (1 కొరింథీయులకు 4:15). అతడు వారి శారీరక తండ్రి కాదుగాని ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. వారి ఆత్మీయ తండ్రిగా ఉండడం ఎంతో ముఖ్యం.
యేసు బోధిస్తుండగా ఆయన తల్లి మరియు ఆయన సోదరులు వచ్చిన సందర్భం గురించి మత్తయి 12:46-50 మాట్లాడుతుంది. అప్పుడు యేసు ఆయన మాటలు వింటున్నవారితో, “నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు?” అని అడిగాడు. దేవుని చిత్తము నెరవేర్చువారే తన సహోదరులు, సహోదరీలు, మరియు తన తల్లి అని చెప్పాడు. యేసు తన కుటుంబం పట్ల శ్రద్ధ చూపించాడని మనకు తెలుసు (యోహాను 19:26-27). అయితే శారీరక కుటుంబం కంటే ఆత్మీయ కుటుంబం మరింత ప్రాముఖ్యమైనదని యేసు చెప్పాడు.
విశ్వాస కుటుంబం శారీరక కుటుంబాన్ని భర్తీ చేయలేదు, కాని విశ్వాస కుటుంబంలో ఒక వ్యక్తి స్థానాన్ని బట్టి అతనికి లేక ఆమెకు ప్రాముఖ్యమైన గుర్తింపు లభిస్తుంది. సంఘంలో ఉపయోగించబడు సహోదరుడు మరియు సహోదరి అనే పదాలు విశ్వాస కుటుంబంలోని ప్రాముఖ్యతను చూపిస్తాయి (కొలొస్స 1:2).
ప్రవక్త్రియైన దెబోర ఇశ్రాయేలులో న్యాయాధిపతిగా చేసింది (న్యాయాధిపతులు 4:4). ఇశ్రాయేలీయులను అణగద్రొక్కుతున్న దేశం నుండి కాపాడడానికి, యుద్ధంలో నాయకత్వం వహించింది. న్యాయాధి 5:7లో, దెబోరా తననుతాను ఇశ్రాయేలుకు తల్లిగా చెప్పుకుంది. దెబోరా శారీరక పిల్లలు గురించి బైబిలు ప్రస్తావించదు, కాని ఆమె నాయకత్వం ద్వారా ప్రజల్ని చూసుకున్న విధానాన్ని బట్టి ఇశ్రాయేలుకు తల్లిగా పరిగణించబడింది.
శారా మాదిరిని అనుసరించే స్త్రీలు ఆమె కుమార్తెలని అపొస్తలుడైన పేతురు చెప్పాడు (1 పేతురు 3:6). ఈ మాటలో శారాకు ఇవ్వబడిన గొప్ప హోదా గురించి ఒక్కసారి ఆలోచించండి! ఈ హోదా ఆమె ఇస్సాకుకు తల్లిగా ఉన్నందువల్ల కలుగలేదుగాని ఆమె విశ్వాసం, విధేయత కారణాన్ని బట్టి ఇవ్వబడింది.
విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడిన వారందరూ అబ్రాహాము పిలల్లే (గలతీయులకు 3:7). విశ్వాసులకు తండ్రిగా అబ్రాహాముకు గొప్ప హోదా అనుగ్రహించబడింది. దేవుడు ఆత్మీయ తండ్రులను, తల్లులను ఘనంగా ఎంచుతాడని అబ్రాహాము మరియు శారా ద్వారా మనకు అర్థమౌతుంది.
పెళ్లి చేసుకోకుండా ఉండడంలో ప్రయోజనం ఏంటో అపొస్తలుడైన పౌలు చెప్పాడు. పెళ్లి చేసుకోని వ్యక్తి ఇతర ఎటువంటి బాధ్యతలు లేకుండా దేవుని సంతోషపెట్టే కార్యాల పట్ల శ్రద్ధ చూపుతారు (1 కొరింథీయులకు 7:32-35). పెళ్లికాని వ్యక్తికి సంతానం లేనప్పటికీ, ఒంటరిగా పవిత్రమైన జీవితం గడపగలిగినట్లయితే అది మంచిదని పౌలు చెప్పాడు. ఈ మాటల ప్రకారంగా, ఒంటరితనం (పెళ్లి చేసుకోకపోవడం) కొందరి విషయంలో దేవుని చిత్తమేనని మనం చెప్పగలం.
ఒంటరితనంవలెనే, గొడ్రాలితనానికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్నవారికి దేవుడు కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఇచ్చినట్లే, పెళ్లి చేసుకుని పిల్లలు లేనివారికి కూడా దేవుడు కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఇచ్చాడు. వారు పిల్లలు వద్దని నిర్ణయించుకోకపోయినా, దేవుని కోసం ఉత్తమంగా పని చేయడానికి ప్రయత్నించాలి.
ఒంటరితనంలో, గొడ్రాలితనంలో, మరియు ఇతర పరిస్థితుల్లో, మనతో పాటు ఇతరులకు ఆత్మీయ మేలులు కలిగించడానికి దేవుడు మన ద్వారా పని చేస్తాడని మనం నమ్మాలి (రోమా 8:28).
చాలామందికి శ్రద్ధ చూపించే తల్లిదండ్రులు ఉండరు. విశ్వాస కుటుంబంలోని కొందరు వ్యక్తులు లేక దంపతులు ఈ పిల్లల్ని ప్రేమించడానికి కృషి చేయకపోతే, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఈ అవసరాన్ని ఎవరు తీర్చలేరు.
మనం మన శరీరాలు దేవునికి సమర్పించుకోవడానికి, దేవునికి సేవ చేయడానికి మనం పిలువబడ్డాం (రోమా 12:1).
సంక్షిప్త సూచనలు
1. పిల్లలు దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదం, దేవుడు పిల్లల్ని కలుగజేయాలని దంపతులు ప్రార్థించడం మంచిది.
2. అద్భుతంగా పిల్లల్ని అనుగ్రహించడం ఎల్లప్పుడు దేవుని చిత్తమే అని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆయన ప్రతి అవసరంలో అద్భుతం చేయనట్లుగానే, ఎల్లప్పుడు బిడ్డలను కలుగజేయడు.
3. పిల్లలు కలగకపోవడాన్ని బట్టి స్త్రీని లేక దంపతుల్ని నిందించడం చాలా తప్పు. ఆదాము చేసిన పాపం, మన పూర్వికులు చేసిన పాపం, మన సమాజం చేసిన పాపం కారణంగా మానవుని పరిస్థితి ప్రభావితమౌతుంది.
4. కుమారులు, కుమార్తెలు దేవుని స్వరూపంలో సృజించబడ్డారు గనుక వారిరువురిని ఒకే విధంగా ప్రేమించాలి, విలువ ఇవ్వాలి.
5. ఒక వ్యక్తి శారీరకంగా పిల్లలు లేనప్పటికీ, వారు అనేక తరాల వారిని ప్రభావితం చేసే ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండగలరు.
6. దేవుడు, పెళ్లికాని వారికి లేక సంతానం లేనివారికి పరిచర్యలో ప్రత్యేక అవకాశాలు ఇస్తాడు.
7. దేవుడు, మనల్ని ఉంచిన పరిస్థితుల్లోనే మనమాయనను సేవించాలి, ఘనపరచాలి.
సేవకుని పరిచర్య
దురదృష్టవశాత్తూ, చాలా ప్రాంతాల్లోని సంఘాలవారు గొడ్రాలితనంతో బాధపడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని పాటించకుండా తమ సొంత సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.
గొడ్రాలితనాన్ని బైబిల్ దృక్కోణంలో, ముఖ్యంగా మునుపటి భాగంలో సంగ్రహించినట్లుగా చూడాలని సేవకుడు తన ప్రజలకు బోధించాలి.
సంతానం లేని దంపతుల జీవితంలో అద్భుతం జరగాలని సేవకుడు ప్రార్థిస్తుంటే, విశ్వాసం కలిగి ఉండే బాధ్యతను భార్యాభర్తలపై ఉంచకూడదు. యేసు చిన్న పిల్లవాడిని స్వస్థపరచినప్పుడు లేక చనిపోయినవానిని లేపినప్పుడు, ఆ అద్భుతం స్వస్థపడిన లేక తిరిగి లేపబడిన వ్యక్తి విశ్వాసంపై ఆధారపడలేదు. పాస్టర్కి దేవుడు అద్భుతం చేస్తాడనే నమ్మకం ఉంటే, దానికి భార్యాభర్తల విశ్వాసం లేకపోవడమే కారణమని నిందించకుండా, పాస్టర్కి విశ్వాసం ఉండాలి.
రోమా 12:15, దుఃఖించేవారితో దుఃఖపడాలని బోధిస్తుంది. సేవకుడు, తన సంఘంలో ఎవరు దుఃఖపడుతున్నారో తెలుసుకోవాలి. సంతానం లేకపోవడం వలన లేక పిల్లల్ని కోల్పోవడంవలన దుఃఖపడేవారిని సేవకుడు చొరవ తీసుకుని ప్రోత్సహించాలి, ఆదరించాలి. జన్మించని బిడ్డ విషయంలో తల్లిదండ్రులు దుఃఖపడతారు. భార్యభర్తలు ఇరువురు బాధపడతారు కాని ఆ బాధను భిన్నంగా వ్యక్తపరుస్తారు. దుఃఖపడే వారు స్వయంగా సలహా కోసం వచ్చేంతవరకు సేవకుడు వేచి ఉండకూడదు. సంఘంలో ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని, పరస్పర సహాయం చేసుకోవాలని సేవకుడు బోధించాలి.
పిల్లలు లేని వృద్ధ దంపతులతో సంబంధాలను పెంచుకునేలా, వారి బాగోగులు చూసుకునేలా సంఘకాపరి తన సంఘాన్ని నడిపించి, ప్రోత్సహించాలి. విశ్వాస కుటుంబీకులు వారిని ప్రేమిస్తూ, వారితో సమయం గడుపుతూ, వారికి కావలసిన అవసరాలు తీరుస్తూ వారిని తల్లిదండ్రులుగా లేక తాత అమ్మమ్మలుగా పరిగణించాలి.
అవివాహితులు, సంతానం లేనివారు సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండేలా సేవకుడు వారికీ సహాయం చెయ్యాలి. విశ్వాస కుటుంబంలో ప్రతి వ్యక్తి విలువైనవాడేనని సేవకుడు ధృవీకరించాలి.
సమూహ చర్చ కోసం
► మీ సంస్కృతిలోని ప్రజలు పిల్లల్ని ఎలా చూస్తారు? సంతానలేమిని ఎలా చూస్తారు?
► మీ సంస్కృతిలోని విశ్వాసులు పిల్లల్ని ఎలా చూస్తారు? సంతానలేమిని ఎలా చూస్తారు?
► ఈ పాఠంలో చర్చించిన లేఖన సూత్రాల్ని అధ్యయనం చేయడం వలన సంతానలేమిపై మీ అవగాహన ఎలా మారుతుంది లేక ఎలా సవాలు చేయబడుతుంది?
► మీ సంఘ కుటుంబంలో పిల్లలు లేక బాధపడుతున్న జంటలు ఎవరైనా ఉన్నారా? అలా అయితే, మీ సంఘం వారికి ఎలా అండగా ఉండగలదు మరియు వారు తమ కష్టాలను పంచుకోవడానికి సురక్షితమైన వాతావరణాన్ని ఎలా కల్పించగలదు?
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
క్రైస్తవ కుటుంబాలను బట్టి వందనాలు. మీ కోసం బ్రతుకుతున్న భార్యాభర్తలను బట్టి, రాజ్య విస్తరణ కోసం వారు చేస్తున్న పనిని బట్టి కృతజ్ఞతలు.
గొడ్రాలితనాన్ని అనుభవిస్తున్నవారి కోసం ప్రార్థిస్తున్నాం. వారిని ఆదరించి, వారి హృదయాల్ని బలపరచండి. వారికి సంతానం కలుగనప్పటికీ నీ ప్రేమ వారి యెడల స్థిరమైనదని తెలుసుకోవడానికి సహాయం చేయండి.
నీ చిత్తమైతే నీ సమయంలో వారికి పిల్లలను అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. వారికి పిల్లల్ని అనుగ్రహించినా లేకపోయినా, ఇతరులకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండడానికి సహాయం చేయండి.
ప్రతి ఒక్కరు నీ స్వరూపంలో చేయబడ్డారని గ్రహించి విలువ ఇవ్వడానికి విశ్వాసులందరికి సహాయం చేయండి.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) రెండు-పేజీల్లో ఈ విషయాలు గురించి రాయండి:
పిల్లలు, గొడ్రాలితనం విషయంలో మీ సమాజ దృక్కోణాన్ని వివరించండి.
పిల్లల గురించి లేఖనం ఏం బోధిస్తుందో వివరించండి.
గొడ్రాలితనం గురించి లేఖనం ఏం బోధిస్తుందో వివరించండి.
సంతానలేమి వలన పెళ్ళైన దంపతులను ఎందుకు నిందించకూడదో లేఖన సూత్రాలు వివరించండి.
(2) సంతానలేమితో ఉన్నవారిని ప్రోత్సహించండి.
ఎంపిక 1: సంతానలేమితో బాధపడుతున్నవారి పట్ల ఏ విధంగా కనికరం చూపగలరో రాత పూర్వకంగా వివరించండి. క్రీస్తునందు మీ సహోదరునికి లేక సహోదరికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీరు చేయగల లేక చెప్పగల విషయాలు ప్రత్యేకంగా పేర్కొనండి.
ఎంపిక 2: మీకు తెలిసి సంతానలేమితో బాధపడుతున్నవారిని ప్రోత్సహించడానికి కొన్ని మాటలు రాయండి. వారి బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి భావాలు పట్టించుకుంటున్నట్లు వారికి అనిపించేలా చేయండి. వారి కోసం ప్రార్థన చేస్తున్నామని చెప్పండి. మీరు వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాను అని చెప్పినప్పుడు, వారి మాటలు వినడానికి అందుబాటులో ఉండండి లేక సరైన రీతిలో మీ ప్రేమను వారికి చూపించండి.
సంతాన నియంత్రణ
11వ పాఠంలోకి వెళ్ళే ముందు, క్లాసు అంతా అనుబంధం B అధ్యయనం చేసి, చర్చించాలి. ఇది సంతాన నియంత్రణపై ఇది క్లుప్త చర్చ, ఇది వివాహానికి కుటుంబానికి సంబంధించిన ముఖ్య విషయం.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.