మహిత్, సౌందర్య, వివాహం చేసుకోవడం దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మిషనరీగా ఉన్న- మహిత్ ను పెళ్లి చేసుకుంటే తన జీవితం అనేక విధాలుగా మారిపోతుందని సౌందర్యకు తెలుసు. ఆమె క్రొత్త దేశానికి వెళ్లాలి, క్రొత్త భాష నేర్చుకోవాలి, క్రొత్త సంస్కృతికు అనుగుణంగా ఉండాలి. తాను సౌకర్యవంతమైన, సుపరిచితమైన ప్రదేశాన్ని విడిచిపెట్టాలని ఆమెకు తెలుసు. నిరాశలు ఎదురౌతాయి, త్యాగాలు చేయవలసి ఉంటుంది. వివాహమంటే కేవలం భర్తను ప్రేమించడానికి కట్టుబడి ఉండడమే కాకుండా, యేసుని ప్రేమించడం, విశ్వాసంతో పని చేయడం.
కాలక్రమేణా, మహిత్ మరియు సౌందర్య ఒకరికొకరు సరిపోరని, పెళ్లి చేసుకోకూడదని గ్రహించారు. సౌందర్య నిరాశ చెందింది. ఆమె తన నిరాశ గురించి ప్రార్థన చేసింది. తన జీవితంలోని ఈ సమయంలో దేవుని కోసం ఫలభరితంగా ఉండటానికి సహాయం చేయమని ఆమె ప్రార్థించింది. ఆమె అలా ప్రార్థిస్తున్నప్పుడు, వివాహం చేసుకోవడం యేసుపై ఎంత విశ్వాసంతో, ఎంత ప్రేమతో కూడిందో, దేవుని చిత్తానికి ఇలా లోబడడం కూడా విశ్వాసం, ప్రేమతో కూడుకున్న పని అని ఆమె అర్థం చేసుకుంది.
అవివాహ స్థితి
ఈ కోర్సులో దేవుడు వివాహాన్ని ఎలా రూపొందించాడో అన్వేషిస్తాం. లేఖనంలో నుండి వివాహానికి సంబంధించిన దేవుని ఉద్దేశ్యాలు నేర్చుకుంటాం. దేవుడు వివాహం కోసం ఇచ్చిన ఆదేశాలను చర్చించుకుంటాం, మన వివాహాల్ని బలపరచే ఆచరణాత్మక మార్గాలను కూడా చూస్తాం. వివాహం పట్ల దేవుని ప్రణాళిక మంచిదని చూస్తాం.
వివాహమనేది అనేకమంది జీవితాల్లో దేవుని చిత్తం. కాని వివాహం చేసుకునే ముందు చాలామంది అనేక సంవత్సరాలు వయోజనులుగా ఒంటరిగానే జీవిస్తారు. కొన్నిసార్లు, చాలా ఎక్కువకాలం ఒంటరిగానే ఉంటారు. కొందరైతే, వివాహమైన తర్వాత తమ భాగస్వామి మరణించడంవల్ల లేక విడాకులు తీసుకోవడం వల్ల ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తారు. కొందరైతే అసలు వివాహమే చేసుకోరు.
ఒక వ్యక్తి వివాహం చేసుకోకుండా ఉండడానికి కారణం వీటిలో ఒకటి లేక అంతకంటే ఎక్కువ కావచ్చు:
వివాహం చేసుకోవడం కంటే కూడా చేసుకోకపోవడంవలన కలిగే ప్రయోజనాల్ని వారు ఇష్టపడతారు.
వాళ్ళు ఎప్పుడూ మంచి వివాహా సంబంధాలను చూడలేదు గనుక వివాహం గురించి చింతపడతారు.
వారు ప్రస్తుతం విద్య లేక కేరీర్ వంటి లక్ష్యాలపై దృష్టిపెడుతున్నారు.
వివాహానికి ఎటువంటి భావోద్వేగ లేక భౌతిక అవసరాన్ని వారు భావించరు.
మంచి వివాహం చేసుకునే అవకాశం వారికి రాలేదు.
అవివాహ స్థితిలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయాలు దేవునితోను, ఇతరులతో ఉన్న బంధాల్ని గొప్పగా ప్రభావితం చేస్తాయి గనుక, ఈ పాఠం వివాహం చేసుకోని విశ్వాసి జీవితంపై దృష్టిసారిస్తుంది.
యేసు, పౌలు అవివాహ స్థితి గురించి ఏం చెప్పారు
విడాకుల గురించి పరిసయ్యులు యేసును ప్రశ్నించారు. యేసు చెప్పిన జవాబు విన్న తర్వాత, ఆయన శిష్యులు పెండ్లి చేసికొనుట యుక్తము కాదని (మత్తయి 19:10) చెప్పారు. పెళ్లి చేసుకోకుండా భూలోకంలో తన జీవితకాలమంతా ఒంటరిగా ఉన్న యేసు, చాలామంది పెళ్లి చేసుకోవాలని, కొందరు మాత్రమే ఒంటరిగా ఉండడానికి అనుగ్రహం పొందినవారని జవాబిచ్చాడు (మత్తయి 19:11-12).
అపొస్తలుడైన పౌలు-ఎన్నడు వివాహం చేసుకొనని లేక భార్య చనిపోయినవారికి- కూడా కొరింథులో అవివాహిత విశ్వాసులకు అదే సలహా ఇచ్చాడు. లైంగిక అనైతిక శోధన కారణంగా, చాలామంది వివాహం చేసుకోవడం మంచిది (1 కొరింథీయులకు 7:2, 8-9). వైవాహిక జీవితంలో లైంగిక సాన్నిహిత్యం దేవుడు అనుగ్రహించిన వరమని పౌలుకు తెలుసు (1 కొరింథీయులకు 7:7, 1 తిమోతికి 4:1-5, హెబ్రీయులకు 13:4). అతడు వివాహేతర లైంగిక సంబంధాలు ఉండకూడదని చెప్పాడు (1 స్సలొనీకయులకు 4:3-4).
అవివాహితులకు ఉండే మేలు గురించి పౌలు వివరించాడు. అవివాహితులు వారి సమయం, శక్తి, ప్రభువును సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయడం, పరిచర్య చేయడం వంటి వాటిపై మనసు పెట్టగలరు (1 కొరింథీయులకు 7:32-35).
పౌలు వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు (1 కొరింథీయులకు 9:5). దేవుడు తనకు అప్పగించిన పరిచర్యా పని మీద దృష్టిపెట్టడానికి అతడు వివాహం చేసుకోకుండా ఉండిపోయాడు. ఒంటరితనాన్ని ఒక వరంగా భావించాడు (1 కొరింథీయులకు 7:7-8). తన పరిచర్యలో ఎన్నో బాధలను భరించాడు (2 కొరింథీయులకు 11:23-28). అతనికి భార్య లేక పిల్లల బాధ్యత లేనందున ఈ బాధ సులభంగా భరించగలిగాడు (1 తిమోతికి 5:8).
అవివాహ స్థితి, తన పరిచర్యకు ప్రయోజకరంగా పౌలు భావించినప్పటికీ, వివాహం కూడా పరిచర్యకు ప్రయోజనకరంగా ఉండే మార్గాలు ఉన్నాయి.
► మీరు అవివాహ స్థితిని పరిచర్యకు ప్రయోజనకరంగా ఎలా చూస్తారు? వివాహ బంధాన్ని పరిచర్యకు ప్రయోజనకరంగా ఎలా చూస్తారు?
పెళ్లి చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునేటప్పుడు అనేక విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలని పౌలు చెప్పాడు:
పెళ్లి చేసుకోకుండా జీవించగల వ్యక్తిగత సామర్థ్యం లేక అసామర్థ్యం (1 కొరింథీయులకు 7:9, 36-37)
హింస వంటి ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు (1 కొరింథీయులకు 7:26)
వివాహ బాధ్యతలు (1 కొరింథీయులకు 7:27-28, 32-35)
సరైన ప్రాధాన్యతలు
అవివాహ స్థితి లేక వివాహం ఒకదానికంటే మరొకటి మెరుగైందో లేక ఆత్మీయమైనదో కాదు. రెంటిలోనూ శోధనలు, కష్టాలు, ఆశీర్వాదాలు, అవకాశాలు ఉన్నాయి. ప్రతిదీ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు వ్యక్తులకు తగినదిగా ఉంటుంది.
ఒక వ్యక్తి వివాహం చేసుకున్నా, చేసుకోకపోయినా చివరికి, వ్యక్తిగత సంతృప్తి, సంపూర్ణత అనేవి దేవునితో ఉన్న సంబంధంలో నుండే రావాలి (కీర్తన 73:25, కీర్తన 107:8-9). అంతేకాదు, విశ్వాసులంతా-వివాహితులైనా కాకపోయినా- నిత్యత్వంపై దృష్టిపెట్టాలి ఎందుకంటే జీవితం చిన్నది నిత్యత్వం ఖచ్చితమైంది (1 కొరింథీయులకు 7:31).
► ఒక విద్యార్థి తరగతి కోసం మత్తయి 6:26-33 చదవాలి.
ఈ వాక్యభాగంలో, లోక విలువలు, ప్రాధాన్యతలు - విశ్వాసుల విలువలు, ప్రాధాన్యతల కంటే భిన్నమైనవని యేసు చెప్పాడు. దేవుని రాజ్యంలో చేరడమే విశ్వాసికి ఉన్నత లక్ష్యం. దేవుని కృప ద్వారా నీతిగా జీవించడమే విశ్వాసికి మొదటి ప్రాధాన్యత. దేవుని పిల్లలు, మత్తయి 6:33లోని యేసు మాటలకు లోబడినప్పుడు వాళ్ల భౌతిక అవసరాలు, వస్తు అవసరాలను తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
ఒక క్రైస్తవుడు ఎప్పుడు వివాహం చేసుకోవాలి? దేవుని రాజ్యంలో పరిచర్య చేయడానికి వివాహం అతనికి ఉత్తమంగా సహాయపడినప్పుడు చేసుకోవాలి. మరింత ఫలవంతమైన, జయవంతమైన నీతి జీవితాన్ని జీవించడానికి అతనికి సహాయపడినప్పుడు చేసుకోవాలి.
ఒక వివాహం కానీ క్రైస్తవుడు ఎప్పుడు ఒంటరిగా ఉండాలి? వివాహం గురించిన అన్వేషణ లేక వివాహం దేవుని రాజ్యం మీద నుండి తన దృష్టిని మళ్లిస్తున్నప్పుడు, అతడు ఒంటరిగా ఉండాలి. ఒం ఒంటరి వ్యక్తిగా, అతను ఆత్మీయతలో మరింతగా ఫలిస్తున్నప్పుడు. వివాహ బంధంలో ఉండే లైంగిక సంబంధం లేకుండా, తన నైతికతను కాపాడుకుంటూ, నీతిగా జీవించగలిగితే ఒంటరిగా ఉండొచ్చు.
► మీరు అవివాహితులైతే, ఒక్క నిమిషం పాటు యధార్థంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.
మీరు దేవుని వాక్యానికి విధేయులై జీవిస్తున్నారా?
ప్రస్తుతం, దేవుడు తన రాజ్యంలో మీకు ఏ పనిని అప్పగించాడు?
మీ జీవితంలో సుధీర్ఘకాలం దేవుడు మిమ్మల్ని ఏ పని కోసం పిలిచాడని మీరు అనుకుంటున్నారు?
వివాహం, దేవునితో మీకున్న సంబంధాన్ని అలాగే ఈ లోకంలో మీరు దేవుని కోసం చేసే పనిని బలపరుస్తుందా లేక నష్టపరుస్తుందా?
అవివాహితులైన విశ్వాసులు పెళ్లి చేసుకోవాలా లేదా అనే విషయాన్ని నిర్ణయించుకునేటప్పుడు దేవుని ప్రాధాన్యతల్ని అంగీకరించడం సహాయకరంగా ఉంటుంది. అలాగే ఏ రకమైన భాగస్వామిని ఎన్నుకోవాలో అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. పెళ్లి చేసుకోవాలనుకునే ప్రతి విశ్వాసి, తమ భాగస్వామి దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నారా, దేవుని వాక్యానికి లోబడుతున్నారా, దేవుని రాజ్య వ్యాప్తి కోసం ప్రాకులాడుతున్నారా అనే విషయాలను చూసుకోవాలి.
► విద్యార్థులు తరగతి కోసం ఎఫెసీయులకు 4:17-24 మరియు 1 యోహాను 2:15-17 చదవాలి.
లోకానికి చెందిన వారు తమకోసమే జీవిస్తారు. తమ శరీరాలు మరియు మనసులు కోరిన వాటిని చేయటానికి వారు ఎంచుకుంటారు (ఎఫెసీయులకు 2:3), మరియు దేవుని వాక్యానికి అవిధేయత చూపటానికి సిద్ధంగా ఉంటారు. పాపస్వభావం కలిగిన వారు తరచుగా ఏది మంచిగా అనిపిస్తుందో, ఏది సౌకర్యంగా ఉంటుందో, లేదా ఏది ఇతరులు తమపైన దృష్టి పెట్టేట్టు చేస్తుందో, వాటినే చేస్తారు. వారి ప్రాధాన్యత తమను తాము సంతోషపరచుకోవడమే. వారు కేవలం శారీరకంగా ఎవరికైనా ఆకర్షితులయ్యారని మాత్రమే ఒక రొమాంటిక్ సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. ఎవరి దగ్గర ఉన్నప్పుడు ఉత్తేజకరమైన భావనలు కలుగుతున్నాయని మాత్రమే కారణంగా వారితో సంబంధంలో ఉండవచ్చు.
స్వార్థపరులు, వివాహ జీవితంలో ఉండే త్యాగపూరితమైన బంధాన్ని అంగీకరించరు. దేవుడు తప్పు అని చెప్పినా కూడా, వారు వివాహం చేసుకోకుండా లైంగిక సంబంధాలు పెట్టుకుంటారు (1 కొరింథీయులకు 6:9-11).
వివాహం చేసుకున్న స్వార్థపరులు, కష్టాలు వచ్చినప్పుడు తమ భాగస్వామిని విడిచిపెడతారు. విడాకులు తీసుకుని మరొకరితో క్రొత్త బంధం ఏర్పాటు చేసుకుంటారు. అయితే, దేవుని వాక్యానికి లోబడి జీవించేవారికి, దేవుడు ఎంతో మేలు దాచి ఉంచాడు (కీర్తన 19:8, 11, ద్వితీయోపదేశకాండము 6:24).
ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టడానికి యేసు మనల్ని పిలిచాడు (మత్తయి 16:24, 2 కొరింథీయులకు 5:9, కొలొస్స 1:10). మనం క్రీస్తు అనుచరులం గనుక, దేవుని రాజ్యం, నీతి అనేవి మన ప్రాధాన్యతలు కావాలి. అంతేకాకుండా, వివాహం పట్ల మన అన్వేషణలో దేవుని రాజ్యానికి, ఆయన నీతికి ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహం పట్ల మన కారణాలలో, మనం వివాహాన్ని కోరుకునే విధానంలో దేవుడిని గౌరవించాలి. యేసు చెప్పిన విలువలను మనం వినాలి. ఆయన సరైనది, మంచిది అని చెప్పిన వాటిని పాటించాలి. అప్పుడు మనం భార్యాభర్తలుగా మన నుండి ఆయన ఆశించే వాటిని పాటించడం ద్వారా దేవుడిని గౌరవించాలి.
ప్రతిదానికి ఒక సమయం ఉంది
వివాహం చేసుకోవడానికి ప్రారంభ యుక్తవయసు మంచి సమయం (సామెతలు 5:18, మలాకీ 2:15, తీతుకు 2:4). ఒక యువకునిగా, ఇప్పటికే శిక్షణ పొంది, జీవితం గడపడానికి సిద్ధంగా ఉండాలి. యువకుడు లేక యువతి నిర్ణయాలు తీసుకునేందుకు, బాధ్యతలు చేపట్టేందుకు పరిపక్వత చెంది ఉండాలి (1 తిమోతికి 4:12). సాధారణంగా, యౌవనస్తులు వివాహానికి, పిల్లల్ని పెంచే బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సంతానోత్పత్తికి వారి శరీరాలు కూడా సిద్ధంగా ఉంటాయి, చాలా సందర్భాల్లో, వారిలో బలమైన లైంగిక కోరికలు ఉంటాయి, అలాగే వివాహ బంధంలో సన్నిహిత సంబంధం అవసరాన్ని కలిగియుంటారు.
నేడు చాలా సంస్కృతుల్లో, ఉన్నత విద్య ముగించుకుని లేక ఉద్యోగాల్లో స్థిరపడేవరకు వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండడం సర్వసాధారణమైపోయింది. మరికొందరు బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడక, వివాహం పట్ల ఆసక్తి చూపించట్లేదు.
చాలామంది యౌవనులు వివాహానికి ముందే అక్రమ లైంగిక సంబంధాల్లో ఉంటారు. వారికి బలమైన లైంగిక కోరికలు ఉంటాయి. భావోద్వేగపరంగా, వారు సన్నిహిత సహవాసం కోరుకుంటారు. అయినా, బాధ్యతలు తీసుకోకూడదనే ఆలోచనలతో లేక జీవిత లక్ష్యాల కారణంగా, వివాహం చేసుకోవడానికి, కుటుంబాన్ని పోషించడానికి ఇష్టపడరు.
వివాహాన్ని ఆలస్యం చేస్తూ ఒంటరిగా జీవిస్తున్న క్రైస్తవ యౌవనస్తులు తమ ప్రాధాన్యతల్ని జాగ్రత్తగా ఆలోచించాలి. వారు దైవికంగా, పరిశుద్ధంగా జీవించాలి అలాగే దేవుని చిత్తానికి లోబడేడట్లు చూసుకోవాలి. కొందరైతే, వివాహం, పిల్లల్ని పెంచడంపై దేవుడు చూపించే ప్రాముఖ్యతను గురించి ఆలోచించాలి.
వివాహం చేసుకోకుండా కలిసి సహజీవం చేసే జంటలు
కొన్నిసార్లు, స్త్రీ పురుషులు సన్నిహిత సంబంధంతో కలిసి జీవిస్తారు, కాని వివాహాన్ని ఆలస్యం చేస్తారు. బహుశా వారు ఒకరి పట్ల ఒకరు సమర్పణ కలిగి ఉండొచ్చు, కాని వివాహ నిబంధనలు చేయలేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు:
1. కొన్నిసార్లు, వివాహాలు ఘనంగా, భారీగా, అంగరంగ వైభవంగా జరగాలనే సాంస్కృతిక అభిప్రాయాలవల్ల పేదరికంలో ఉన్న జంటలు సరైన విధానంలో పెళ్లి చేసుకోలేరు.
2. కొన్నిసార్లు, వివాహం విఫలమైపోతుందనే భయంతో వివాహానికి కట్టుబడి ఉండరు. పెళ్లి కాకుండా విడిపోతే అది పెద్ద నష్టం కలిగించదని అనుకుంటారు. కలిసి జీవిస్తే బంధం ఇంకా బలపడుతుందని అనుకుంటారు.
దేవుడు లైంగిక సంబంధాన్ని వివాహనికే పరిమితం చేశాడు (హెబ్రీయులకు 13:4). పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించే జంటలు దేవుని వాక్యానికి అవిధేయులై అపరాధులౌతారు. వారిద్దరి మధ్య శాశ్వతమైన, ప్రత్యేకమైన నిబద్ధత లేకపోవడం మరియు పరస్పర నమ్మకం కొరవడటం వల్ల, వారి సాన్నిహిత్యం ఎప్పటికీ ఉండాల్సినంత గొప్పగా ఉండదు.
విశ్వాసులు, అవిశ్వాసుల మాదిరిని అనుసరించక, దేవుని వాక్యానికి లోబడాలి. సంఘం దేవుని నైతిక ప్రమాణాలకు కట్టుబడి, వివాహ విషయంలో లేఖన ప్రణాళికను అనుసరించి నడుచుకునేలా జంటలకు సహాయం చెయ్యాలి. ఉదాహరణకు, ఒకవేళ వారు ఖర్చుతో కూడిన వివాహ వేడుక చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, సంఘ కుటుంబం వివాహాన్ని తక్కువ ఖర్చుతో జరిపించాలి. దీని ద్వారా, వివాహ బంధం దేవుని నైతిక ప్రమాణాలను పాటించేందుకు సహాయపడుతుంది. ఇది అప్పుల భారం లేకుండానే తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు కూడా సహాయపడుతుంది. వివాహ వేడుక కంటే కూడా వివాహమనేది చాలా ముఖ్యమైందని క్రైస్తవులు గుర్తుంచుకోవాలి, అయితే ఒక స్పష్టమైన వివాహ నిబద్ధత మాత్రం ఉండాలి.
► విద్యార్థులు తరగతి కోసం రోమా 12:2 మరియు ఫిలిప్పీయులకు 2:15-16 చదవాలి. విశ్వాసులు నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉన్నప్పుడు, అది వారి చుట్టూ ఉన్నటువంటి సంస్కృతిని ఎలా మార్చగలదో చర్చించండి.
ఆరోగ్యకరమైన అవివాహ స్థితి
సమర్పణకు సంబంధించిన విషయం
[1]ప్రతి దేవుని బిడ్డ తన (ఆమె లేక అతని) కోరికలను యేసుకు సమర్పించుకోవాలి. యేసే ప్రభువుగా ఉండాలి. జీవితకాలమంతా, ప్రతి విశ్వాసి తన విశ్వాస జీవితంలో యేసే వారి ప్రభువుగా పరీక్షించబడతాడు. కొన్నిసార్లు కష్టాలు ఎదురౌతాయి.....లేక మరికొన్నిసార్లు మనం కోరుకున్న మంచి జరగదు.....అప్పుడు యేసు తన అనుచరుల్ని ఇలా అడుగుతాడు, “నేను నీకు నిజంగా ప్రభువునా? నా మంచితనాన్ని నీవు నమ్ముతావా? నేను పరిపూర్ణ ప్రణాళిక కలిగియున్నానని నీవు నమ్ముతావా? నాకు లోబడతావా? నాకు అప్పగించుకుంటావా? నా కార్యాలకు లోబడతావా? ఇందులో నన్ను మహిమపరుస్తావా?”
కొందరు అవివాహితులు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. కాని, పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఉన్నప్పటికీ, పెళ్లి చేసుకునే మంచి అవకాశం లభించనివారు, వివాహాన్ని నిలువరించే దేవుని ఎంపికను వినయంగా అంగీకరించాలి.
క్రైస్తవ స్త్రీ పురుషులు.....ఒకవేళ దేవుడు తమను వివాహం చేసుకోమని ఆశిస్తే, ఆయన కాలంలో ఆయన దానిని స్పష్టం చేస్తాడని గ్రహించాలి. అయితే, ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి, ఎలప్పుడు ఆయన్ను [పూర్తిగా నమ్మాలి].[2]
దేవుడు నమ్మదగినవాడు, మంచివాడు. అవివాహితులైన విశ్వాసుల హృదయాల్లో ఆయన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎల్లప్పుడు, తన పిల్లలకు ఏది ఉత్తమమో, మరి ముఖ్యంగా యేసును ఏది ఎక్కువగా మహిమపరుస్తుందో దానిని చేస్తాడు. అన్ని విషయాల్లో, దేవుడు మనల్ని యేసు పోలికెలో మార్చడానికి (రోమా 8:28-29), నిరంతరం యేసును ఆరాధించవలసిన రీతిలో ఆరాధించేటట్లు చేయడానికి (1 పేతురు 1:6-7) కార్యాలు చేస్తున్నాడు.
దేవుడు తన పిల్లల్లో ఒకరికి దైవభక్తిగల భాగస్వామిని పరిపూర్ణంగా అందించగలడు. ఒక క్రైస్తవ పురుషునికి, తన జీవితంలో దేవుణ్ణి గౌరవించే ఒక గుణవంతురాలైన స్త్రీ కోసం వెదకుచుండగా, దైవభక్తిగల భార్యను కనుగొనడంలో దేవుడు అతనికి సహాయం చేస్తాడు (సామెతలు 18:22, సామెతలు 19:14, సామెతలు 31:10).
క్రీస్తు కోసం జీవిస్తున్న ఒక అవివాహితురాలు, దేవుడు ఆమెకు భర్తను ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, దేవుడు తన అవసరాలు ఉత్తమమైన రీతిలో తీరుస్తాడని నమ్మాలి. దేవుని అనుగ్రహం, ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆమె పూర్తిగా, ఆత్మీయంగా ఫలభరితమైన జీవితం గడుపుతుంది.
ఒకవేళ అవివాహ స్థితి, ఆమె పట్ల దేవుని ఉద్దేశ్యమైతే, ఆమెకు దేవుడే పరిపూర్ణ ప్రియుడు, పోషకుడు, రక్షకుడు, నాయకుడు. ఆమె హృదయానికి యేసు భర్తగా ఉండగలడు (యెషయా 54:5), భూలోక సంబంధమైన భర్తకు బదులుగా ఆమె ఆయనను ప్రేమించగలదు, ఘనపరచగలదు, లోబడగలదు.
ఒకవేళ ఆమె వివాహం చేసుకోవడం దేవుని ఉద్దేశ్యమైతే, ఆమె ఒంటరిగా ఉన్నటువంటి సమయం దేవుణ్ణి (కేవలం ఆయనే పరిపూర్ణ ప్రియుడు, పోషకుడు, రక్షకుడు మరియు నాయకుడిగా) నమ్మడం ఆమెకు నేర్పుతుంది, అపరిపూర్ణుడైన శారీరక భర్తను ఎలా ప్రేమించాలో, గౌరవించాలో అతనికి ఎలా లోబడాలో కూడా నేర్పుతుంది.
విశ్వాసులందరూ తమ సంపూర్ణ సంతృప్తిని మానవుడైన భాగస్వామియందు కాకుండా క్రీస్తులోనే కనుగొనాలి. ఒకవేళ వివాహం చేసుకోవాలనుకున్నవారు కూడా, ఎక్కువకాలం ఒంటరిగా ఉండడం ద్వారా యేసులోనే సంతృప్తి పొందే అవకాశాన్ని పొందుతారు. అవివాహ స్థితిలో ఒంటరిగా ఉండే సమయం యేసు ఉంటే చాలు అని చెప్పే అవకాశాన్ని కలుగజేస్తుంది (ఫిలిప్పీయులకు 4:11-13).
దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడని, దానిని మనం ఘనంగా యెంచాలని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది... ఆదాము ఒంటరిగా ఉండుట మంచికాదని చెప్పినప్పుడు, ఆదాము అవసరాలు తీర్చడానికి దేవుడొక్కడు సరిపోడనా? ఖచ్చితంగా కాదు! బైబిలు వివరిస్తున్నట్లుగా, ఆదాముకు సహాయం అవసరం గనుక ఆదాము చేయవలసిన పనిలో సహాయపడేందుకు దేవుడు హవ్వను చేశాడు. అవును, ఆదాము, హవ్వ తమ సహచర్యం ద్వారా అనేక ఆశీర్వాదాలు, మేలులు పొందుకున్నారు కాని వారి వివాహం ఎప్పటికీ దేవుని స్థానాన్ని తీసుకోకూడదు. ఆయన దేవుడుగానే ఉన్నాడు. మన మొదటి ప్రేమ, ఆరాధన ఆయన పట్ల మాత్రమే ఉండాలి.[4]
ఒక వ్యక్తి, శారీరక భావోద్వేగ ఆప్యాయతను అందించడానికి భాగస్వామిగాని లేక కుటుంబంగాని లేనప్పుడు, దేవుని ప్రేమను ఎక్కువగా అనుభవించడం నేర్చుకుంటాడు. భావోద్వేగ పరీక్షల్లో మరియు శారీరక శోధన సమయాల్లో కీర్తన 73:25-26 వంటి లేఖనాలు ప్రోత్సాహంగా ఉంటాయి:
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.
లెస్లీ లుడి ఇలా రాశారు,
కీర్తనాకారుడైన దావీదు తన జీవితంలో అనేకమంది స్త్రీలతో సహవాసం చేశాడు. కాని దేవునితో అతనికున్న సన్నిహిత సంబంధమే అతనికి పరిపూర్ణ సంతృప్తి కలుగజేసిందని ఈ వచనాలు చూపిస్తాయి.[5]
ఒంటరిగానున్న విశ్వాసి, యేసు చాలని భావిస్తారు; దేవునితో సంబంధం సంతృప్తినిస్తుంది.
పరిచర్య అవకాశాలు
[6]అవివాహితులైన విశ్వాసులు, క్రీస్తులో తమ సంతృప్తిని కనుగొన్నప్పుడు, ఇతరులకు పరిచారం చేయడానికి ఆయన వారి అవివాహ స్థితిలో ఒంటరితనాన్ని ఒక అవకాశంగా వాడుకుంటాడు. వారి సొంత అవసరాలపై దృష్టిపెట్టి, అసంతృప్తి చెందకుండా, వారు ఇతరుల అవసరాలు గుర్తించి వాటిని తీరుస్తారు. ఫలవంతమైన, తృప్తికరమైన జీవితం జీవించడానికి ఇతరులకు సహాయపడడం ఒక ఉత్తమ మార్గం. ఈ సమయంలో పెంపొందించుకున్న గుణం, తమ జీవితకాలమంతా ఫలించడానికి సహాయపడుతుంది.
► విద్యార్థులు తరగతి కోసం ఫిలిప్పీయులకు 2:3-4 మరియు తీతుకు 3:8, 14 చదవాలి.
ముందు చెప్పినట్లుగా, విభిన్న జీవన పరిస్థితులు ప్రత్యేకమైన అవకాశాలను కలిగిస్తాయి. ప్రతి జీవన దశలో, ఒక వ్యక్తి కొన్ని పనులు చేయగలడు, కొన్ని పనులు చేయలేడు. ముఖ్యంగా, ఒక యువతి, ఒంటరిగా ఉండడం వలన తాను చేయగల పనులను జాబితా చేసింది. ఇతర ఒంటరి పురుషులు, మహిళలు తాము చేయగల విభిన్న పనుల్ని కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు.
నేను ఒంటరి అమ్మాయిని గనుక, నాకు ఇవి చాలా సులభం:
వృద్ధుల్ని సందర్శించి, సమయం గడపడం.
నిరాశ్రయులకు ఆహారం తయారు చేసి పెట్టడం.
లోతైన బైబిలు అధ్యయనం చేయడం, పిల్లల కోసం బైబిలు పాఠాలు సిద్ధపరచడం.
మా ఇంట్లో స్త్రీలకు, ఆడపిల్లలకు పరిచారం చేయడం.
అంతరాయం లేకుండా విజ్ఞాపన ప్రార్థన చేయడం.
క్రొత్త నైపుణ్యం నేర్చుకోవడం.
ప్రోత్సాహకరమైన ఉత్తరాలు, కార్డులు రాయడం.
ప్రాజెక్టుల్లో ఇతరులకు సొంతగా సహాయం చేయడం.
అనుకోకుండా ఏదైనా అవసరత ఏర్పడినప్పుడు లేక ఏదైనా సంఘటన వచ్చినప్పుడు, నా పనుల్ని సర్దుబాటు చేసుకోవడం.
ప్రతి ఒక్కరికి వారి వారి జీవన పరిస్థితిని బట్టి నిర్దిష్ట అవకాశాలు లేక బాధ్యతలు ఉంటాయి. ఉదాహరణకు, చిన్న పిల్లల తల్లి, తన పిల్లలకు ఏం నేర్పుతుందో లేక వారికి ఎలా శిక్షణ ఇస్తుందో ఒక జాబితా తయారు చేయవచ్చు. ఆమె వారి తల్లి గనుక, ఈ విధంగా పని చేసే అవకాశం, బాధ్యత దేవుడు ఆమెకు ఇచ్చాడు. (ఈ పాఠం ముగింపులో మీరు మీ సొంత జాబితా తయారు చేస్తారు.)
సహచర్యం
వివాహం కాని వారు ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పరచుకోవడం ఎంతో ముఖ్యం. మునుపటి పాఠాల్లో చర్చించినట్లుగా, దేవుడు తనతో, ఇతరులతో సంబంధం ఏర్పరచుకోవడానికే ప్రజలను సృజించాడు.
వివాహం కానివారు, తాము పరిచారం చేయగలవారితో బంధాలు నిర్మించుకోవాలి-బహుశా పిల్లలతో లేక యౌవనులతో లేక పెద్దలతో.
వివాహం కానివారికి సలహా ఇవ్వడానికి, జవాబుదారితనం కోసం పరిణతిచెందిన పెద్దలు, సలహాదారులు అవసరం.
వివాహం కానివారికి, తమలాంటి స్థితిలో ఉన్నవారు స్నేహితులుగా ఉండాలి, తద్వారా ప్రభువులో, సహవాసంలో ఒకరికొకరు ప్రోత్సహించుకుంటారు.
వివాహం కానివారు, వివాహితులతో, కుటుంబాలతో స్నేహితులుగా ఉండాలి. అలాంటి స్నేహంలో పరస్పర ఆశీర్వాదాలు ఉంటాయి.
వివిధ రకాల వారితో స్నేహం చేయడం వలన, అనేకమందికి పరిచారం చేసే అవకాశాలు లభిస్తాయి. వివాహం కానివారికి అవసరమైన మానసిక, ఆత్మీయ ప్రోత్సాహాన్ని స్నేహ బంధం అందిస్తుంది. ఒకవేళ వారి కుటుంబం సమీపంగా లేనట్లయితే, స్నేహితులే కుటుంబీకులుగా ఉంటారు.
రెండు ముఖ్య హెచ్చరికలు ఉన్నాయి:
1. ఒక వ్యక్తి, తన మానసిక, శారీరక అవసరాలను బట్టి అనైతికమైన లేక అజ్ఞానమైన బంధాలు ఏర్పాటు చేసుకోకూడదు.
2. ఒక వ్యక్తి, మనుష్యులతో సంబంధాలకు మించి దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఆలోచనాత్మకమైన జీవితం
విశ్వాసులందరూ తమ ఆలోచనల్ని దేవుని కృప ద్వారా పవిత్రంగా ఉంచుకోవాలి (సామెతలు 4:23). కీర్తన 19:14 ఒక ప్రార్థనగా మన ఆలోచనల్లో, మన మాటల్లో ఆయనకు ఇష్టప్రకారంగా జీవించడానికి దేవుని సహాయం ఆశించేదిగా ఉంది. మన ఆలోచనల్లోనూ, మాటల్లోనూ దేవునికి లెక్క అప్పజెప్పవలసినవారంగా ఉన్నామని ఈ ప్రార్థన మనకు జ్ఞాపకం చేస్తుంది.
మన తలంపుల విషయంలో ఎంపికలు ఉంటాయి (ఫిలిప్పీయులకు 4:8): ఏం చూడాలి, వినాలి లేక చదవాలి. మనం దేవుణ్ణి గౌరవించాలంటే, మనల్ని దేవునికి సమీపంగా నడిపించే, ఆయన మాటలకు విధేయత చూపించే పవిత్రమైన మానసిక ఆహారం తీసుకోవాలి (రోమా 12:2, రోమా 13:14).
క్రీస్తు అనుచరులు ఇతరుల పాపపు కార్యాలతో తమను తాము వినోదపరచుకోకూడదు (కీర్తన 101:3, 1 కొరింథీయులకు 15:33). అనైతికమైన ప్రవర్తన చూసి అనందించడమంటే వారి పాపంలో పాలుపుచ్చుకోవడమే (రోమా 1:32). అలాంటి వాటిని చూడడం, వినడం వలన విశ్వాసి పాప విషయంలో జాగ్రత్తగా ఉండకుండా, దేవుణ్ణి సంతోషపెట్టే విషయాల్లో ఆసక్తి కోల్పోతాడు (సామెతలు 13:20). మనం ఎల్లప్పుడు దేవుని ఘనపరచాలని (సామెతలు 23:17) ఆయనవలె చెడుతనాన్ని అసహ్యించుకోవాలని (సామెతలు 8:13) దేవుని వాక్యభాగం నొక్కి చెబుతుంది. దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకున్నప్పుడు, మనం ధన్యులం (కీర్తన 111:10).
మన మనసుల్లో ఏం ఉంచుకోవాలో, వేటిని గూర్చి ధ్యానించాలో దేవుడు సూచించిన విషయాలకు మనం అవిధేయత చూపినప్పుడు, మనం మన పాపాన్ని ఒప్పుకొని, ఆ పనులు చేయడం మానేయాలి. అలాంటి సందర్భాలలో, ఏదైనా ఒక చెడు విషయాన్ని మనం అనుకోకుండా విన్నా లేదా చూసిన, వాటి స్థానంలో మంచివైన, దైవీకమైనవైన ఆలోచనలను ఉద్దేశపూర్వకంగా భర్తీ చేయాలి.
► విద్యార్థులు తరగతి కోసం కీర్తన 19:14, కీర్తన 1:1-2, ఫిలిప్పీయులకు 4:6-8, మరియు ఎఫెసీయులకు 5:25-27 చదవాలి.
దేవుడు మన హృదయాలకు, మనసులకు కావలికాయాలని ఆశపడుతున్నాడు, అయితే మనం కూడా ఉద్దేశ్యపూర్వకంగా మంచి ఆలోచనలపై దృష్టిపెట్టడం ద్వారా అందుకు సహకరించాలని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని వచనాలు మాట్లాడుతున్నాయి. మంచి ఆలోచననాత్మకమైన, పవిత్రమైన జీవితానికి లేఖనాన్ని ధ్యానించడం చాలా ముఖ్యం. దేవుని వాక్యం మనల్ని కడుగుతుందని ఎఫెసీయులకు రాసిన పత్రిక చెబుతుంది. ఇది ఖచ్చితంగా మన తలంపులు, ఆలోచనలను కూడా కడుగుతుంది.
► దేవుణ్ణి-ఘనపరచే ఆలోచనా జీవితాన్ని కలిగియుండడానికి ఏ కార్యకలాపాలు సహాయపడతాయి? మీ ఆలోచనాత్మక జీవితంలో మీకు సహాయపడిన ఇతర వచనాలు ఏమిటి?
అవివాహ స్థితి మరియు లైంగికత
కోర్సు అంతటితో నిమిత్తం లేకుండా మీరు ఈ పాఠం అధ్యయనం చేస్తున్నట్లయితే, దయచేసి 4వ పాఠం కూడా చదవండి, అందులో లైంగిక పవిత్రత మరియు నైతిక విషయాలను గురించి చర్చించబడినది.
“సంతృప్తి అంటే, దేవుడు నా పరిస్థితులన్నిటికంటే సార్వభౌముడు మరియు నాకు ఏది ఉత్తమమో దానినే అనుగ్రహిస్తున్నాడని తెలుసుకుని తృప్తి పొందడమని అర్థం.”
- Phil Brown
[2]Leslie Ludy, Sacred Singleness (Eugene, OR: Harvest House Publishers, 2009), 24 నుండి తీసుకోబడింది.
“ప్రభువా, నేను నీ వాడను/దానను.
అదే నా గుర్తింపు, ,
నా పిలుపు,
నా భద్రత,
నా ఆదరణ,
నా ఉద్దేశ్యం,
నా ఆనందం, మరియు
నా బహుమానం.
నువ్వు నాకు కావాలి.
నువ్వు చాలు.
నువ్వు నన్ను నింపు.
నువ్వే నా ఆధారం.
నన్ను పరిపూర్ణంగా చేసేది నువ్వే.”
[5]Leslie Ludy, Sacred Singleness, 67. Leslie Ludy కీర్తన 16:11, కీర్తన 73:25, మరియు కీర్తన 107:9 ను సూచిస్తున్నారు.
[6]“మీరు ఒంటరివారైతే, మీ సొంత అన్వేషణల్లోబడి మీ సమయాన్ని, స్వేచ్ఛను వృథా చేసుకోకుండా, సంఘానికి, లోకానికి పరిచర్య చేయడానికి పిలువబడ్డారని గుర్తుంచుకోండి.”
- Adapted from Paul Lamicela.
ముగింపు
అవివాహ స్థితి, విశ్వాసులు క్రీస్తుతో తమ బంధాన్ని పెంపొందించుకోవడానికి, అలాగే ఇతరులకు పరిచారం చేయడం నేర్చుకోవడానికి ప్రత్యేక అవకాశాలను ఇస్తుంది. అవివాహితులు ఇతరులతో ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పాటు చేసుకుంటూ క్రీస్తులో తమ సంతృప్తిని కనుగొనాలి. తమ అవివాహ స్థితిని దేవుని మహిమ కోసం, ఆయన రాజ్య మేలుకై ఉపయోగించాలి. దేవుని ప్రాధాన్యతల్ని అనుసరించడం ద్వారా, విశ్వాసులు వివాహాలపై మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
సమూహ చర్చ కోసం
► ఒంటరిగా ఉన్న సంవత్సరాలు, వివాహం చేసుకునే నిర్ణయం, మరియు వివాహ ప్రయత్నం వంటి విషయాలలో నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయాల్సిన అనేక ప్రాధాన్యతలను పేర్కొని, వాటిని చర్చించండి.
► వివాహం కానివారికి సంఘం ప్రభావవంతంగా ఎలా పరిచర్య చేయగలదు?
► వివాహం కానివారితో మీ కుటుంబం ఎలా స్నేహంగా ఉండగలదు?
► ఒకవేళ మీరు వివాహం కానివారైతే, మీ సంఘానికి మీరెలా సహాయపడగలరు? వివిధ కాలాలు, వయస్సుల వారికి మీరెలా ఆశీర్వాదంగా ఉండగలరు?
► ఈ పాఠంలో ఏ ఆలోచనలు మీకు క్రొత్తగా ఉన్నాయి?
► ఈ పాఠంలో ఏ విషయాలను చర్చిస్తే బావుంటుందని మీరు భావిస్తున్నారు?
► ఈ పాఠంలోని విషయాలు జీవితంలో ఇతర కాలాలకు ఎలా వర్తిస్తాయో చర్చించండి.
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
మా జీవిత ప్రతి దశలో నమ్మదగినవానిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. వివాహం కాని ఈ స్థితిలో నీ సన్నిధానంలో, నీ మహిమకోసం జీవించినవారిని మాకు మాదిరిగా చూపినందుకు ధన్యవాదాలు.
మా జీవితకాలమంతా నీకు సంపూర్ణంగా లోబడి జీవించడానికి సహాయం చెయ్యండి. నీతో మాకున్న సంబంధంలో ఆనందం, సంతృప్తి పొందడానికి సహాయం చేయండి. మా జీవితంలో నువ్వు మాకిచ్చిన అవకాశాలు వాడుకోవడానికి సహాయం చెయ్యండి.
మా ఎంపికల్లో, మా తలంపుల్లో, మా బంధాల్లో, మా పరిచర్యలో ఎల్లప్పుడు నిన్ను ఘనపరచు కృపనిమ్ము. నీ మహిమ కోసం మమ్మల్ని ఫలదాయకంగా చేయండి.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) యేసు, ఏ పరిస్థితిలో మిమ్మల్ని తన ప్రణాళికకు లోబడమని చెప్పాడో ఆలోచించండి. కనీసం రెండు పేరాల్లో ఆ పరిస్థితిని వివరించి, మీరు దానికి ఎలా స్పందించారో వ్రాయండి. (ఇది ప్రస్తుత పరిస్థితి కావచ్చు లేదా గతంలో జరిగినదై ఉండవచ్చు.) ఆ సందర్భంలో మీ విశ్వాసం ఎలా పరీక్షించబడింది? ప్రభువు మిమ్మల్ని ఎలా నడిపించాడు? ఆయన ప్రణాళికకు మీరు లోబడారా? ఆయనతో మీరు ఏమని చెప్పారో వ్రాయండి. ఈ పరిస్థితిలో విధేయత మీకు ఎలా అనిపించిందో వివరించండి.
(2) మీ వివాహ పరిస్థితి, లింగం, లేక జీవన పరిస్థితి కారణంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఒక్క నిమిషం పాటు, మీరు చేయలేని విషయాల గురించి ఆలోచన చేయకండి. బదులుగా, ప్రస్తుతం దేవుడు మిమ్మల్ని ఉంచిన స్థితిలో మీరు చేయగల పనులను జాబితా చేయడానికి కొంత సమయం కేటాయించండి. దీనిని రాయండి, “నేను ________ఉన్నాను కాబట్టి ________చేసే అవకాశం లభించింది”
(3) క్రింద ఇవ్వబడిన లేఖనాలను చదివి, అధ్యయనం చేయండి, ఇవన్నీ పాఠం చివర్లో సూచించబడ్డాయి. మీరు మార్చుకోవలసినవి ఏవి ఉన్నాయో దేవుణ్ణి అడగండి, తద్వారా మీ ఆలోచనలు పవిత్రంగాను, ఆయనకు ప్రియంగాను ఉంటాయి. ఒప్పుకోలు ప్రార్ధన, విధేయత చూపుతాననే ప్రార్థన చేయండి.
కీర్తన 1:1-2
కీర్తన 19:14
కీర్తన 101:3
కీర్తన 111:10
సామెతలు 4:23
సామెతలు 8:13
సామెతలు 13:20
సామెతలు 23:17
రోమా 1:32
రోమా 12:2
రోమా 13:14
1 కొరింథీయులకు 15:33
ఫిలిప్పీయులకు 4:6-8
(4) 3వ అభ్యాసంలో నుండి మూడు వచనాలను ఎంచుకుని, కంఠస్తం చెయ్యండి. తర్వాత తరగతి మొదలుపెట్టే ముందు, కంఠస్తం చేసిన వచనాలను రాయండి లేక చెప్పండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.