తన భార్య సంతోషంగా లేదని రితేశ్ నిరుత్సాహంతో ఉన్నాడు. ఆతని నుండి ఆమె ఏం ఆశిస్తుందో అతనికి అర్థం కాలేదు. రితేశ్ కష్టపడి పనిచేసి, ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారం, జీవితానికి కావలసిన ప్రతిదీ ఇచ్చాడు. ఆమెకు కావాల్సిన ప్రతిదీ కొనుక్కోమని చెప్పాడు. ఆమె దేని గురించి చింతపడనక్కరలేదు. భార్యకు ఇంకేం కావాలి? రితేశ్ తన భార్య తాను చేసే పనిని అస్సలు మెచ్చుకోదని భావించాడు.
స్నేహ సంతోషంగా లేదు, అందుకు కారణం రితేశ్ ఆమె కోసం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం ద్వారా ఆమెకు ప్రేమను చూపించట్లేదు. రితేశ్ ఆమెకిచ్చిన ఇష్టమైన బహుమానం ఏమిటంటే, అతడు తన షాపులో ఒక చెక్క మీద ఆమె పేరు రాసి ఇచ్చాడు. నీకు ఏం కావాలో అది కొనుక్కో అని చెప్పడం కాకుండా కొన్నిసార్లు తన కోసం పువ్వులు కొనుక్కొస్తే బాగుండని ఆమె అనుకునేది.
రితేశ్ మరియు స్నేహ వారి భావాలను గురించి మాట్లాడుకుని, ఒకరి అవసరాలు మరొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు.
నిజమైన ప్రేమ అంటే ఏంటి?
► ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించడమంటే అర్థం ఏంటి?
► ఒక విద్యార్థి తరగతి కోసం 1 కొరింథీయులకు 13:4-8 చదవాలి. ఈ వాక్యభాగం నుండి, ప్రేమ గుణాలు, కార్యాలు జాబితాను చేయండి. ప్రేమ అంటే ఏది కాదో, ప్రేమ ఏమి చెయ్యదో జాబితా చేయండి.
ఈ వాక్యభాగంలో ప్రేమ అంటే ఏమిటో అనేదానికన్నా ప్రేమ అంటే ఏది కాదో అనేదే ఎక్కువ కనిపిస్తుంది. ప్రేమ అంటే ఏది కాదో అనేదాని ద్వారా ప్రేమ అంటే ఏమిటో కూడా మనం తెలుసుకుంటాం. ప్రేమ ఉప్పొంగేది కాదు (గర్వపడదు) అంటే, మరి అది ఎలా ఉంటుంది? దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రేమ వినయంతో ఉంటుంది.
► 1 కొరింథీయులకు 13:4-8 మరియు పైన పట్టికలో రాయబడినట్లుగా, నిజమైన ప్రేమ ఏది కాదో దానికి వ్యతిరేక పదాలు జాబితా చేయండి.
ప్రేమ ఎలా ఉంటుంది
ప్రేమ ఏం చేస్తుంది
నిజమైన ప్రేమ:
కేవలం భావన కాదు (భావనలు ప్రేమతో అనుబంధంగా ఉన్నప్పటికీ).
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా …” (యోహాను 3:16). నిజమైన ప్రేమ ఇవ్వడం ద్వారా వ్యక్తమవుతుంది. ఇది ఎప్పుడూ భౌతికమైన, స్పష్టమైన బహుమతిని ఇవ్వడం కాదు. కొన్నిసార్లు ఆ బహుమానం, ప్రేమగల మాటలు కావచ్చు. కొన్నిసార్లు ఆ బహుమానం సమయం కావచ్చు: ఒకరితో ఉండడం, వారికి అందుబాటులో ఉండడం. కొన్నిసార్లు ప్రేమ అనేది చేసే క్రియల్లో కనిపిస్తుంది, ప్రేమగా తాకడంలో కనిపిస్తుంది. తండ్రియైన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు గనుక మనం కూడా ఆయన పిల్లలమవ్వాలని మనకోసం తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. మనం ఇతరులను నిజంగా ప్రేమించినప్పుడు, మనం వారికి ఏదైనా ఇస్తాం.
నిజమైన ప్రేమ షరతులు లేనిది. ఇది ప్రేమించబడే వ్యక్తి ప్రవర్తనపై లేక విలువపై ఆధారపడదు. “నువ్విలా చేసి, నన్ను మెప్పిస్తేనే, నేను నిన్ను ప్రేమిస్తాను; ఒకవేళ అలా చేసి నన్ను బాధపెడితే, నేను నిన్ను ప్రేమించను” అని చెప్పదు.
షరతులతో కూడిన ప్రేమ ఇలా చెబుతుంది, “నీ ప్రవర్తన నాకు సంతోషం కలిగిస్తే, నీకు అర్థవంతం అనిపించే రీతిలో ప్రేమను చూపిస్తాను. ఒకవేళ నువ్వు నాకు నచ్చనిపని చేస్తే, అర్థవంతమైన ప్రేమ కార్యాలు చేయను.”
నిజమైన ప్రేమ షరతులు లేనిది. ప్రేమను పొందుకునే వ్యక్తి ఏం చేసినా, ఏం చెయ్యకపోయినా, నిజమైన ప్రేమ తననుతాను వ్యక్తపరచుకుంటుంది. ప్రేమను పొందే వ్యక్తి సరిగా స్పందించకపోయినా, ప్రేమను పొందే వ్యక్తి తిరిగి ఏమి ఇవ్వలేకపోయినా, అది వ్యక్తపరచుకుంటూనే ఉంటుంది.
ఒకరిని షరతులు లేకుండా ప్రేమించడం అంటే వారు కోరుకున్నది వారికి ఇవ్వడం కాదని మనం అర్థం చేసుకోవడం ముఖ్యం. దాని అర్థం, వారి చెడు ప్రవర్తన వలన వచ్చే పర్యవసానాలను మనం తొలగించమని కాదు. కానీ, మనం ఎల్లప్పుడూ వారికి ఏది మంచిదో అదే చేయడానికి ప్రయత్నిస్తామని అర్థం. మనం ఇష్టపడేవాళ్ళు బాధపడటం చూడటం కష్టమే, కానీ వారు తప్పు చేస్తున్నప్పుడు, ఆ శ్రమ అనుభవం తరచుగా వారిని నాశనకరమైన ఆ ప్రవర్తన నుండి దూరం చేయగల ఏకైక మార్గం. కొన్నిసార్లు మనం ఇష్టపడే వారిని వారి కష్టాలలో ఉండనివ్వడమే వారికి మంచిది. మరికొన్నిసార్లు, వారి కష్టం నుండి బయటపడటానికి మనం వారికి సహాయం చేయడం మంచిది. ఇటువంటి పరిస్థితులలో మనం ఏమి చేయాలో తెలుసుకోవడానికి మనకు తరచుగా దైవిక సలహా, పరిశుద్ధాత్మ సహాయం అవసరం.
► ఇతరులను షరతులు లేకుండా ప్రేమించడానికి ఏది మనల్ని ప్రేరేపిస్తుంది?
► ఒక విద్యార్థి తరగతి కోసం రోమా 5:8 చదవాలి.
దేవుని ప్రేమ, తాము చేసే పనులపై ఆధారపడి ఉంటుందని చాలామంది భావిస్తారు. దీని కారణంగా, వారు ఇతరులను ఎందుకు షరతులు లేకుండా ప్రేమించాలో అర్థం చేసుకోలేరు. అయితే, మనం శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడని రోమా 5:8 చెబుతుంది. మనం పాపులమై ఉన్నప్పుడే ఆయన రక్షకుని అనుగ్రహించాడు. ఆయన షరతులు లేకుండా మానవాళి అంతటిని ప్రేమించాడు. నీవు దేవుని స్వరూపంలో సృజించబడిన వ్యక్తిగా ఉన్నావు గనుక దేవుడు నిన్ను ప్రేమించాడు.
ఆయన మనల్ని ప్రేమించిన రీతిగానే మనం ఇతరుల్ని ప్రేమించాలని ఆశపడుతున్నాడు (యోహాను 15:12, ఎఫెసీయులకు 5:2, 1 యోహాను 4:11). మనం ఇతరుల్ని షరతులు లేకుండా ప్రేమించడానికి ప్రధాన కారణం, అలా చేయమని దేవుడు మనల్ని పిలిచాడు (మత్తయి 5:43-48, 1 పేతురు 4:8).
ప్రేమించకుండా కూడా ఇవ్వవచ్చు, కాని ఇవ్వకుండా ప్రేమించడం అనేది అసాధ్యం.
ప్రేమ మీ నుండి ఏదొకటి కోరుతుంది. ప్రేమకు వెల చెల్లించవలసి ఉంటుంది.
ప్రజలు, వివిధ రకాలుగా ప్రేమను అనుభవిస్తారు
దేవుడు వైవిధ్యాన్ని ఇష్టపడతాడు. ఆయన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వాలను ఇచ్చాడు. ఏ ఇద్దరు ఒకే రకంగా ఆలోచించరు, ఒకే రకంగా వారి భావనలు తెలియజేయరు. వ్యక్తిత్వాల్లో వైవిద్యం వల్ల, మన కుటుంబీకులకు మనకంటే భిన్నమైన అవసరాలు ఉంటాయి. మన వైవిధ్యాలు అనుదినం మన కుటుంబ బంధాలపై ప్రభావం చూపిస్తాయి.
ప్రేమను వ్యక్తపరిచే విధానంలోనూ, ఇతరులతో తమ సంబంధాలలో ప్రేమించబడినట్లు, అభినందించబడినట్లు, మరియు సురక్షితంగా ఉన్నట్లు భావించే విషయంలోనూ వ్యక్తులు.
ప్రేమ చూపించడానికి అనేక మార్గాలుంటాయి, ప్రేమను పొందుకోవడానికి అనేక మార్గాలుంటాయి. గ్యారీ చాప్మాన్ ప్రేమను వ్యక్తీకరించే ఐదు ప్రధాన విధానాలు గురించి చెప్పారు.[1] వాటిని, ప్రేమకు ఐదు భాషలుగా పిలిచాడు. ఈ ప్రతి ప్రేమ భాష కేవలం ఒక చర్యను మాత్రమే కాదుగాని, ప్రవర్తనా విధానమంతటిని చూపిస్తుంది.
ప్రతి ఒక్కరూ ఐదు రకాల ప్రేమను పొందాలని కోరుకున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు ఒక రకమైన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు ఎక్కువ ప్రేమను పొందినట్లు భావిస్తారు. ఇతర రకాల ప్రేమ వ్యక్తీకరణలు వారికి అంతగా అర్థం కావు.
ప్రేమకు ఐదు భాషలు
ప్రజలు ఈ క్రింది మార్గాల ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తారు:
1. ధృవీకరణ మాటలు
2. నాణ్యమైన సమయం
3. బహుమతులు
4. సేవా కార్యాలు
5. శారీరక స్పర్శ
అలాగే, ప్రజలు ఈ ఐదు మార్గాల్లోనే ప్రేమను గుర్తిస్తారు, ప్రేమను పొందుకుంటారు.
ప్రాథమిక ప్రేమ భాష
సాధారణంగా చాలామంది పైన ఇవ్వబడిన ఐదింటిలో కనీసం ఒకటి లేక రెండు విధానాల్లో ప్రేమను గుర్తిస్తారు, ప్రేమను చూపిస్తారు. కుటుంబ సభ్యులు భాగస్వామికిగాని లేక పిల్లలకుగాని వారి ప్రాథమిక ప్రేమ భాషలో ప్రేమను చూపకపోతే, ఇతర మార్గాల్లో ప్రేమ చూపించినప్పటికీ, ఆ భాగస్వామి లేక ఆ పిల్లవాడు ప్రేమను అనుభవించలేడు.
ఉదాహరణకు, ఒక స్త్రీ తాను ప్రేమించే వారికి తన సమయాన్ని కేటాయించడం ద్వారా ప్రాథమికంగా తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఆమె తాను ప్రేమించే వారితో మాట్లాడటానికి, వారితో కలిసి సమయం గడపడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఆమె వారితో కలిసి పని చేయడానికి సమయాన్ని వెచ్చిస్తుంది. అదేవిధంగా, ఆమె ప్రేమను చూపించే ప్రధాన మార్గం ఇదే కాబట్టి, ఇతరులు తనపై చూపించే ప్రేమను కూడా ఆమె ఈ పద్ధతిలోనే సులభంగా గుర్తిస్తుంది. ఎవరైనా ఆమెకు తమ సమయాన్ని కేటాయించినప్పుడు ఆమె ఎక్కువగా ప్రేమించబడినట్లు భావిస్తుంది. ఆమె భర్త బహుమతులు కొనిచ్చినా లేదా ఆమె కోసం ఏదైనా చేసినా, అతను ఆమెతో కలిసి సమయాన్ని గడిపిన దానికంటే అవేవీ ఆమెకు ముఖ్యం కాదు.
ఒక పురుషుడు తన ప్రేమను ప్రధానంగా శారీరక స్పర్శ ద్వారా చూపిస్తాడు. అతను తన భార్యను, పిల్లలను కౌగిలించుకుంటాడు. వారు తనను కౌగిలించుకున్నప్పుడు, తన దగ్గర ఉండాలని కోరుకున్నప్పుడు అతను సంతోషిస్తాడు. అతను తన స్నేహితులను కూడా కౌగిలించుకోవచ్చు లేదా కనీసం వారి భుజాలను తట్టడం, వారితో ప్రేమగా సరదాగా గొడవపడటం చేస్తుంటాడు. తన కుటుంబం కోసం తన భార్య పడే కష్టాన్ని అతను అభినందించవచ్చు, కానీ ఆమె పని చేయడం వల్ల తనను ప్రేమిస్తుందని అతను భావించడు. ఆమె తన పక్కన కూర్చుని, తన చేయి తన చుట్టూ వేసుకోనిచ్చినప్పుడు లేదా ఆమె రకరకాల ఆప్యాయమైన పద్ధతుల్లో తనను తాకినప్పుడు అతను ప్రేమించబడినట్లు భావిస్తాడు.
ఒక వాహనంలో పెట్రోల్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ ఖాళీ అయినప్పుడు, వాహనం నడవదు. అలాగే, ఒక వ్యక్తి తాను గుర్తించిన రీతిలో, తనకు అవసరమైన రీతిలో ప్రేమను పొందుకున్నప్పుడు, అది ఆ వ్యక్తి యొక్క భావోద్వేగ ట్యాంక్ కి, భావోద్వేగ ఇంధనాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి మానసికంగా నిండుగా ఉన్నప్పుడు, సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం, శక్తి అతనిలో ఉంటాయి. ఇతరులతో మరెక్కువగా సహకరించగలుగుతాడు. సంఘర్షణలను సులువుగా పరిష్కరించగలుగుతాడు. ఎదగాలని, ఏదైనా పొందుకోవాలనే కసితో ఉంటాడు.
అదే, తనకు అవసరమైన రీతిలో ప్రేమను పొందుకోలేనప్పుడు, అతనికి భావోద్వేగ ఇంధనం అందదు. ప్రేమను పొందుకోనప్పుడు, ఏదైనా సాధించాలన్న లేక ఏదైనా అభివృద్ధి చేసుకోవాలన్న కసి అతనిలో ఉండదు.
మనం మన కుటుంబ సభ్యులకు ప్రాథమిక ప్రేమ భాషలో తరచుగా ప్రేమను చూపించనప్పుడు, మనం ఎంత ప్రేమిస్తున్నామో వారికి అర్థం కాదు. ఎంత ప్రేమించినా, అది వారికి అర్థం కాదు, ఇది నిజం. వారికి అర్థమయ్యే రీతిలో ప్రేమను చూపించాలి.
మనం ఒకరి ప్రాథమిక ప్రేమ భాష విషయంలో వారిని బాధించినట్లయితే, అది మరింత ఘోరంగా మారుతుంది. ఉదాహరణకు, మనం మన పిలల్ని ప్రేమించే విధానం దృవీకరణ మాటలైతే మనం విమర్శించినప్పుడు, పిల్లవాడికి ప్రేమ భాష కలిగించే మరో విధానంకంటే మరింత బాధ కలిగిస్తాయి.
[1]ఈ భాగంలోని అనేక ఆలోచనలు Gary Chapman, ప్రేమకు ఐదు భాషలు (Telugu Edition), (Manjul Publishing House Pvt. Ltd., 2014, ISBN: 9788183223911) ఆధారితమైనవి.
ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా అభివృద్ధి చెందడం
1వ పాఠంలో, దేవుడు తనతో మరియు ఇతర ప్రజలతో సంబంధం కలిగియుండాలనే ఉద్దేశ్యంతో ప్రజల్ని ఎలా సృజించాడో మనం నేర్చుకున్నాం. ప్రతి బంధంలో ప్రేమ చూపించే విధానాలు ముఖ్య భాగం. మన జీవిత భాగస్వాములు, పిల్లలు మరియు ఇతర కుటుంబీకులు ఎలా ప్రేమను అనుభవిస్తారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే, మనం వారికి అర్థమయ్యే భాషలో ప్రేమను చూపించగలుగుతాం.
వివాహం, చాలాసార్లు ప్రజల ఊహలకు భిన్నంగా ఉంటుంది. ప్రజలు తరచుగా వారి మధ్య మరియు వారి జీవిత భాగస్వాముల మధ్య ఉన్నటువంటి భిన్నమైన స్వభావాలను బట్టి నిరాశపడుతుంటారు. ప్రేమను వ్యక్తపరచే విధానానికి వస్తే, ఇరువురికి ప్రధాన ప్రేమ భాష ఒకటే అయితేనే ఉత్తమమని అనిపించవచ్చు. ఈ విషయంలో వారు ఒకటిగా ఉంటే అనేకమైన అపార్థాలకు, కోపాలకు తావు ఉండదు. అయితే, జీవిత భాగస్వాములు ఒకరికొకరు కట్టుబడి, ప్రేమలో ఎదుగుతూ ఉంటే, ఇలాంటి భిన్నతలు వివాహాన్ని బలపరుస్తాయి.
ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరికొకరు సర్దుకుపోవడానికి, అర్థవంతమైన రీతిలో శ్రద్ధ చూపించడానికి ప్రయత్నించే ప్రక్రియ ప్రతి వ్యక్తిని అభివృద్ధి చేస్తుంది. అంతేకాక, ఇది నిజమైన ప్రేమకు అద్భుతమైన వ్యక్తీకరణగా మారుతుంది. కుటుంబ సభ్యులకు ప్రేమను వ్యక్తపరిచే మార్గాల ద్వారా మనం వారికి సేవ చేస్తున్నప్పుడు, మన అవగాహన మరియు వ్యక్తిత్వం మరింతగా వృద్ధి చెందుతాయి.[1]
మన జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు ప్రేమను వ్యక్తపరిచే విషయంలో, మనం మనదైన పద్ధతిలో మాత్రమే ప్రేమను చూపలేమని, లేదా మనకు అనిపించినప్పుడు మాత్రమే ప్రేమను వ్యక్తపరచలేమని అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రేమ అనేది ఒక ఎంపిక, సమర్పణ, సంబంధం యొక్క విలువ ద్వారా ప్రేరేపించబడుతుంది. కొన్ని సందర్భాల్లో, ప్రేమను వ్యక్తపరిచే కొత్త మార్గాలను మనం నేర్చుకోవలసి ఉంటుంది. బహుశా మనం పెరిగిన కుటుంబం ప్రేమను ఒక నిర్దిష్ట పద్ధతిలో వ్యక్తపరచకపోయి ఉండవచ్చు, కానీ ఈ రోజు ఒక కుటుంబ సభ్యునికి ఆ పద్ధతిలో ప్రేమ అవసరం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, మనకు పరిచయం లేని పద్ధతిలో ప్రేమను వ్యక్తపరచడం మొదట్లో వింతగా లేదా అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ మనం నేర్చుకోగలం! మన ప్రేమను వ్యక్తపరచడం అనేది ఇష్టంలేని బాధ్యత లేదా ఇబ్బంది అన్నట్లుగా కనబరచపోవడం ప్రాముఖ్యం. మనం ఏదో బాధ్యతగా, భారంగా చేస్తున్నట్లు అనిపిస్తే, మన ప్రేమ నిజమైన ప్రేమగా వ్యక్తపరచబడదు.
► విద్యార్థులు తరగతి కోసం రోమా 12:9-10, 16 మరియు 1 పేతురు 3:7-8 చదవాలి. ఈ లేఖనాల ఆధారంగా, మన కుటుంబ సభ్యులు ఎలా ప్రేమించబడాలని కోరుకుంటున్నారో మనం ఎందుకు శ్రద్ధ వహించాలో కొన్ని కారణాలను పేర్కొనండి.
ప్రేమ అంటే మరొక వ్యక్తికి మేలు కలగడానికి, స్వయాన్ని త్యాగపూరితంగా సమర్పించుకోవడం అని జ్ఞాపకముంచుకోవడం ముఖ్యం.
మనం పుట్టుకతోనే స్వార్థపూరిత స్వభావాన్ని కలిగి ఉన్నాం. ఇతరుల పట్ల నిజమైన ప్రేమ మనకు సహజంగా రాదు. పరిశుద్ధాత్మ మన హృదయాలలో పనిచేయడం ద్వారానే నిజమైన ప్రేమ సాధ్యమవుతుంది (రోమా 5:5). విశ్వాసులుగా, పౌలు ఫిలిప్పీయులకు 2లో వివరించినట్లుగా, మనం క్రీస్తు ఆలోచనా విధానాన్ని నేర్చుకోవాలి. అలా చేసినప్పుడు మనం:
వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తన కంటే యోగ్యుడని యెంచుచు (వచనం 3)
ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక (వచనం 3)
ఇతరుల కార్యములను కూడా చూస్తాము (వచనం 4)
కుటుంబ సభ్యుల పట్ల మన ప్రేమను అభివృద్ధి పరచుకోవడానికి మనం కట్టుబడి ఉండాలి. వారి అవసరాలను గమనించడం, వాటిని తీర్చడానికి మార్గాలను వెతకడం మనం నేర్చుకోవాలి. వారు ఎక్కువగా ప్రేమించబడ్డారని భావించే విధంగా వారికి మన ప్రేమను చూపడమే మన లక్ష్యం కావాలి.
తల్లిదండ్రులమైన మనం, మన పిల్లలకు ఈ విధంగా వారి తోబుట్టువులకు, తల్లిదండ్రులకు, తాత అమ్మమకు శ్రద్ధ చూపడం నేర్పించాలి. మన పిల్లలు వాళ్ల కుటుంబాలను ప్రేమించడం, సేవించడం నేర్చుకోవాలి. అర్థవంతమైన రీతిలో వాళ్ల కుటుంబాలను ఏ విధంగా ప్రేమించాలో వారు నేర్చుకోవాలి. మనం మాదిరి ద్వారా వారికి బోధించాలి. కొంత సమయం కేటాయించి మరీ ఈ విషయాలు వారికి బోధించాలి, వారి సంబంధాల్లో వాటిని ఎలా అన్వయించుకోవాలి కూడా చెప్పాలి.
► సొంత కుటుంబంతో మొదలుపెట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ త్యాగపూరితమైన ప్రేమను ఏ విధంగా చూపించాలో నేర్పే కొన్ని ఇతర మార్గాలు ఏమిటి?
అభినందించడమే ఒకరి ప్రధాన ప్రేమ భాష అయితే, ధృవీకరణ మాటలతో వారిని అభినందించినప్పుడు వారు ప్రేమను అనుభవిస్తారు. ఒక స్త్రీ ప్రధాన ప్రేమ భాష అభినందించడం అయినప్పుడు, భర్త ఆమెతో మాట్లాడుతున్నప్పుడు లేక ఆమె గురించి మాట్లాడుతున్నప్పుడు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆమెను కొన్ని విషయాల్లో అభినందిస్తున్నానని చెప్పి ఒక కాగితంపై రాసి కూడా ఇవ్వవచ్చు. భార్యకున్న మంచి గుణం, మంచి పనులను గురించి ఇతరులకు చెప్పొచ్చు. భార్య అతని మాటలు విన్నప్పుడు, ఆమె ప్రేమను, విలువను అనుభవిస్తుంది.
మన స్నేహితుల విలువను గుర్తించే విధంగా వారిని సలహాలు అడగవచ్చు. ఉదాహరణకు:
“మీరు ఎప్పుడు సహాయకరమైన అభిప్రాయలు చెబుతారు, కాబట్టి ఈ విషయంలో మీ ఆలోచన తీసుకోవాలని ఆశపడుతున్నాను...”
“ఈ విషయంలో మీకు ఎక్కువ అనుభవం ఉంది, కాబట్టి మీ అభిప్రాయం కోసం చూస్తున్నాం.”
“_______గురించి నాకంటే మీకు బాగా తెలుసు, కాబట్టి ఏదైనా సలహాలు లేక అభిప్రాయాలు ఉంటే చెప్పండి, వింటాను.”
ధృవీకరణ మాటలను యదార్ధంగా చెప్పాలి. అలా కాకుంటే, అవి నిరుపయోగంగా లేక బాధాకరంగా ఉంటాయి. యదార్థతలేని అభినందన మాటలు బంధాల్ని బలహీనపరుస్తాయి. అవి సత్యం మీద ఆధారపడవు గనుక వినేవారు చెప్పేవారి ప్రేరణ మాటలు నమ్మరు.
ధృవీకరణ మాటలు, సత్యానికి అనుగుణంగా ఉంటాయి. అవి అబద్ధపు మాటలు కాదు లేక అతిశయోక్తి మాటలు కావు. యధార్థమైన ధృవీకరణ మాటలు హృదయంలో నుండి పుట్టుకొస్తాయి. అభినందించే వ్యక్తి తాను భావించింది, నమ్మిందే మాట్లాడతాడు.
ధృవీకరణ మాటలు వినేవారికి భవిష్యత్తులో వృద్ధి కలుగజేస్తాయి, వారి విజయానికి తోడ్పడతాయి కాని మోసపూరితంగా ఉండవు. మనం ధృవీకరణ మాటల ద్వారా ఇతరులను అదుపుచేయలేము.
► ఒక విద్యార్థి తరగతి కోసం ఎఫెసీయులకు 4:29 చదవాలి. చెప్పకూడని విషయాలు గురించి ఇక్కడ ఇవ్వబడిన వివరణ ఏంటి? మన మాటలు ఏమి సాధించాలి? కొన్ని మాటలు ఒక పరిస్థితికే వర్తిస్తాయా మిగిలిన పరిస్థితులకు వర్తించవా?
మనం ఇతరులతో చెప్పే మాటలు సరైనవిగా, దయగలవిగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు, ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ల హృదయాల్లో కార్యాలు జరిగించే దైవావకాశాలు అనుగ్రహించేవిగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు నిర్మాణాత్మకంగా ఉండాలే గాని నాశనకరంగా ఉండకూడదు. అవి ఆరోగ్యం, స్వస్థత కలిగించేవిగా ఉండాలి కాని నాశనం కలిగించేవిగా ఉండకూడదు.
అభినందనకు సంబంధించిన విషయాలు
ధృవీకరించడానికి వివిధ రకాల పదాలు ఉంటాయి. ధృవీకరణ మాటలన్నిటికి ఒకే విలువ లేక ఒకే ప్రాముఖ్యత ఉండదు. గొప్ప ధృవీకరణ మాటలు చెప్పాలంటే, ఆ మాటలు పలికే వ్యక్తి ఎక్కువగా ఆలోచించాలి, ఎక్కువగా ప్రయత్నం చెయ్యాలి; కొన్నిసార్లు ఆ మాటలు చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది; కాని ఆ మాటలు అర్థవంతమైన రీతిలో ప్రేమను వెల్లడిపరుస్తాయి.
రూపాన్ని ప్రశంసించడం
ఒకరి రూపాన్ని మెచ్చుకోవడం, వారిని ఒక రకంగా అభినందించడం అవుతుంది, అది వారు చేసిన కృషిని లేక వారి వ్యక్తిత్వాన్ని చూపించిన విధానాన్ని ప్రశంసించడమవుతుంది. అయితే, ఒకరు రూపాన్ని మెచ్చుకోవడం పైపైన అభినందించినట్లే ఉంటుంది కాని వారి అసలు వ్యక్తిత్వాన్ని అభినందించినట్లుగా ఉండదు.
ముఖ్యంగా ఆకర్షణీయంగా కనిపించేవారు, తమ రూపాన్ని బట్టి ప్రశంసలు విన్నప్పుడు, వారి విలువ ఆ రూపం మీదే ఆధారపడి ఉందనుకొని, అది మరింత పరిపూర్ణంగా కనబడాలేమో అనుకుని అభద్రతా భావంతో ఉంటారు.
వ్యక్తిగత విలువ అనేది ఆకర్షణ మీద ఆధారపడదు. అలాగే, ఒక వ్యక్తి తన శారీరక అందాన్ని పెంచుకోవడానికి చేసే పనులకు కూడా పరిమితి ఉంది. ఈ విషయాల కారణంగా, ఈ రకమైన అభినందనను అతిగా ఉపయోగించకూడదు.
విజయాల్ని, సేవలను అభినందించడం
ఎదుటివారిని మాటలతో అభినందించే మరో మార్గం, వారు సాధించిన విజయాలను లేదా చేసిన పనిని మెచ్చుకోవడం. ఇలా అభినందించేటప్పుడు, ఆ వ్యక్తి చేసిన పనిని మామూలుగా తీసుకోకుండా, దాన్ని ప్రత్యేకంగా గుర్తించి అభినందిస్తారు.
ఉదాహరణకు:
తన భర్త ఏ పని కోసం కష్టపడి పని చేస్తున్నాడో ఆ పనిలో విజయం సాధించినప్పుడు భార్య అతన్ని మెచ్చుకుంటుంది.
భర్త ఏ పని కోసం కష్టపడి పని చేస్తున్నాడో ఆ పనిలో భార్య సహాయం చేసినందుకు అతడు అది గమనించి, ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతాడు.
కుటుంబం కోసం రుచికరమైన భోజనం తయారు చేసినవారిని కుటుంబ సభ్యులు అభినందించాలి.
ఒకరి పని గురించి లేక విజయం గురించి మెచ్చుకుంటున్నప్పుడు, మీ ప్రేమ వారి పని మీద ఆధారపడి ఉందనే భావనను వారిలో కలిగించొద్దు. ఉదాహరణకు, మీ కుమారుడు పరీక్షలో ఎక్కువ మార్కులు సంపాదించడం వలన మీరు అతన్ని ప్రేమిస్తే, తక్కువ మార్కులు సంపాదించినప్పుడు తక్కువ ప్రేమిస్తారని భావిస్తాడు. ఒక వ్యక్తి విలువను గుర్తించే ఒక విధానం ఏంటంటే, “పరీక్ష మంచిగా రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. నీ వంతు నువ్వు కష్టపడి బాధ్యతగా చదివినందుకు అతిశయిస్తున్నాను” అని చెప్పడం. మీరు ఎలా చేసినా సరే, వారు చేసిన మంచి పనులను బట్టి వారిని మెచ్చుకోవడం విస్మరించవద్దు.
ప్రవర్తనను, ప్రయత్నాన్నిగుర్తించడం
ఒక వ్యక్తి తాను చేసిన మంచి ప్రదర్శనను బట్టి అభినందించడం కంటే అతన్ని విజయానికి నడిపించిన తన వ్యక్తిత్వాన్ని, గుణాన్ని అభినందించడం మంచిది. ఉదాహరణకు, ఒక పిల్లవాడైన క్రీడాకారుడిని ఆటలో పొందిన విజయం కంటే కూడా అతడు చేసిన ప్రయత్నాన్ని బట్టి అతని మంచి వైఖరిని బట్టి అతన్ని మెచ్చుకోవాలి. కొందరు ఎల్లప్పుడు తమ ప్రదర్శనలో రాణించగలుగుతారు కాని ఒక వ్యక్తి తన మంచి గుణాన్ని, ప్రవర్తనను కలిగియుండడం ఎంతో ముఖ్యం.
ఒకరి వ్యక్తిత్వాన్ని బట్టి సంతోషించడం
ఒక ఉత్తమమైన అభినందన, ఒకరి మంచి లక్షణాలను గుర్తిస్తుంది: వ్యక్తిగత గుణాలు, ప్రవర్తన, వ్యక్తిత్వం. ఈ విధమైన అభినందన, విజయం పొందినప్పుడు పొందే అభినందన కంటే గొప్పది ఎందుకంటే అది మారే పరిస్థితుల మీద ఆధారపడదు గాని వ్యక్తి విలువ మీద ఆధారపడుతుంది.
ఉదాహరణలు:
“పిల్లలు మీ వైపు మొగ్గు చూపుతారు! మీరు విషయాల్ని వారికి బాగా వివరించగలరు, వాళ్ళు అడిగే ప్రశ్నలను ఓపికగా వింటారు.”
“మీరు నమ్మకస్తులని నాకు తెలుసు గనుక నేను మిమ్మల్ని నమ్ముతాను.”
ఈ విధమైన అభినందనకు దగ్గరగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుని కార్యం చేస్తున్నాడని గుర్తించి, ఒక ప్రత్యేకమైన విధంగా జీవించడానికి లేక ఒక ప్రత్యేకమైన పని చేయడానికి వీలు కల్పించడం.
ఉదాహరణలు:
“మీరు నడిపిస్తున్న యౌవనస్తుల జీవితంలో దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నాడో చూడడమంటే నాకు ఇష్టం. మీ జీవితాన్ని పరిశీలించడం ద్వారా వారిలో ఒకామె యేసు కోసం జీవించాలనే నిర్ణయం తీసుకున్నానని నాతో చెప్పింది!”
“మీకు అప్పగించబడిన ఈ పనిలో దేవుడు మీకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. నేను మీ కోసం ప్రార్థిస్తాను!”
ఒక వ్యక్తి మన జీవితంలో ఉన్నందుకు సంతోషాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడం అనేవి బలమైన ధృవీకరణ మాటల్లో కొన్ని. ఇవి ఆ వ్యక్తి విలువను తెలియజేస్తాయి.
ఉదాహరణలు:
“మీతో ఉన్నప్పుడు కుటుంబ సమావేశాలు ఎల్లప్పుడు ప్రత్యేకంగా ఉంటాయి.”
“మీతో ఉండడం నాకు ఇష్టం.”
“మీరు నాకు విలువైనవారు, మీరంటే నాకిష్టం!”
మాటలకు, అభినందనకు సంబంధించి ముఖ్య గమనికలు
1. ఒక వ్యక్తి శారీరక లక్షణాల్ని విమర్శించకూడదు లేక అవమానించకూడదు. వారు వాటిని తమ జీవితకాలం కలిగియుంటారు. ఒకరి బాహ్య ఆకారాన్ని బట్టి, వారి లక్షణాల్ని బట్టి మరిముఖ్యంగా లోపాల్ని బట్టి పేర్లు పెట్టకూడదు.
2. ఒకరి సామర్థ్యాలు, గుణాలు, మంచి ప్రవర్తనను మెచ్చుకోవడం వలన వారు వాటిలో ఇంకా ఎదుగుతారు. లోపాలు ఎత్తి చూపడం సహాయకరం కాదు.
3. చిన్నపాటి సలహాలు కూడా తప్పుదిద్దుతున్నట్లుగా అనిపించవచ్చు. కాని మెచ్చుకోవడం వలన వారు సలహాలను సంతోషంగా అంగీకరిస్తారు. ఒకవేళ మీరు సలహా ఇవ్వాలనుకుంటే, సలహాతో పాటుగా వారికి బలమైన ధృవీకరణ మాటలు చెప్పండి.
4. ఫిర్యాదుల రూపంలో సలహాలు ఇచ్చినప్పుడు వారు వాటిని అంగీకరించలేరు. ఉదాహరణకు, ఒక పనిని ఇప్పటికే పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం లేక ఆ పని చెయ్యడంలో వారు విఫలమయ్యారని చూపించడం సహాయకరం కాదు. ఇలా చెప్పడం వలన విఫలమయ్యామనే భావన ఆ వ్యక్తిలో కలుగుతుంది; ఒకవేళ ఆ పని ఆలస్యంగా చేసినప్పటికీ విఫలమయ్యాననే భావనలోనే ఉంటాడు.
బాధకలిగించేమాటలు
ధృవీకరణ మాటలు ఎక్కువగా ఇష్టపడేవారికి, కఠినమైన మాటలు బాధను కలిగిస్తాయి. ముఖ్యంగా విమర్శలు వారిని బాగా బాధపెడతాయి, ఎందుకు పనికిరానివారమనే భావన వారిలో కలిగిస్తాయి. కఠినంగా కోపంగా మాట్లాడే మాటలు మానసికంగా కృంగదీస్తాయి, వాటి నుండి ఆ వ్యక్తి ఎప్పటికీ బయటపడలేడు. మాట్లాడే వ్యక్తి, బాధను అర్థం చేసుకోకుండా వాటికి, క్షమాపణ చెప్పనప్పుడు ముఖ్యంగా ఇలాంటివి జరుగుతాయి.
ధృవీకరణ మాటలు ఒక వ్యక్తి విలువకు సంబంధించినట్లే, అత్యంత బాధాకరమైన మాటలు కూడా ఆ వ్యక్తి పై దాడి చేసినట్లుగా ఉంటాయి. ఉదాహరణకు, “నేను నిన్ను కలవకుండా ఉంటే బాగుండేది.”
తరువాత బాధ కలిగించే మాటలు అంటే, ప్రవర్తన గురించి ప్రతికూలంగా మాట్లాడడం, “నువ్వు ______ఉన్నావు.” ఇంకా, ప్రవర్తన గురించిన హానికరమైన మాటలు ఇలా మొదలౌతాయి, “నువ్వు ఎల్లప్పుడు_______చేస్తావు” లేక “నువ్వు ఎన్నడు______చెయ్యవు.” ఈ విషయాలు, ఒక వ్యక్తి తన లోపాలను మార్చుకోలేడని సూచిస్తున్నాయి ఎందుకంటే ఆ లోపాలు లోతైనవి, మారనివి.
ఎవరైనా గాయపడినప్పుడు-ముఖ్యంగా అతని ప్రాథమిక ప్రేమ భాషను అనుభవించే విధానంలో గాయపడినప్పుడు-మరింత గాయపడకుండా దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు. ప్రతికూలంగా మాట్లాడే వారు సహజంగా అనుకూలంగా మాట్లాడడానికి ఇష్టపడరు, కాబట్టి తన ప్రవర్తన మార్చుకోవడం వలన అనుకూల మాటలు పొందుకోగలననే ఆశ వినేవారిలో ఉండదు. ప్రేమను పొందడానికి తన ప్రవర్తన మార్చుకోవాలన్న ఆశ కూడా వారిలో కలుగదు.
కొన్నిసార్లు కోపిష్టులు బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో ఎదుటివారిని బాధపెడతారు. మరికొన్నిసార్లు, బాధపెట్టాలనే ఉద్దేశ్యం లేకపోయినా, వారి మాటలు బాధపెడతాయి. కొన్నిసార్లు ప్రవర్తనలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కొందరు కఠినంగా మాట్లాడతారు, కాని అది అంతగా పనిచెయ్యదు.
► ఒక విద్యార్థి తరగతి కోసం కొలొస్స 3:8 చదవాలి. విశ్వాసులు దేవునికి, ఇతరులకు విరుద్ధంగా ఏ విధానాల్లో పాపం చేయడం కొనసాగించకూడదు.
సమూహ చర్చ కోసం
► మీ సొంత మాటల్లో, నిజమైన ప్రేమ గురించి చెప్పండి. మనం ఇతరులను ప్రేమించడానికి పరిశుద్ధాత్ముడు మనకు ఎందుకు సహాయం చెయ్యాలి?
► ఒకరిని షరతులు లేకుండా ప్రేమించడం అంటే ఏంటో వివరించండి. దేవుడు మీ పట్ల చూపించే షరతులు లేని ప్రేమ ప్రాముఖ్యత ఏంటి?
► మీ జీవిత భాగస్వామిని లేక మీ పిల్లలను, వారు ఎక్కువగా ప్రేమను అనుభవించే విధానంలో ప్రేమించడం ఎందుకు ప్రాముఖ్యం?
► ధృవీకరణ మాటలు పొందడం మీకు ఎలా సహాయకరం?
► ఈ వారంలో, ధృవీకరణ మాటల ద్వారా మీ కుటుంబీకులకు మీ ప్రేమను ఎలా వ్యక్తపరిచారు?
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
నిజమైన, షరతులు లేని ప్రేమను నాకు బోధించినందుకు వందనాలు. దానిని నీ వాక్యంలో వివరించినందుకు, నా పట్ల నీవు చూపించిన ప్రేమలో వెల్లడిచేసినందుకు ధన్యవాదాలు.
క్రీస్తు ప్రేమించి, పరిచారం చేసినట్లుగా, నా కుటుంబాన్ని ప్రేమించి, పరిచారం చేయడం నాకు నేర్పించు. నా జీవిత భాగస్వామి, పిల్లలు, తోబుట్టువులు, తల్లిదండ్రుల మేలు కోరడానికి సహాయం చెయ్యి.
నేను మాట్లాడే మాటల్లోని ప్రాముఖ్యత గురించి నాకు గుర్తు చేసినందుకు వందనాలు. ఇతరులకు బాధ కలిగించే మాటలు నేను మాట్లాడినందుకు, నిన్ను అగౌరవపరచినందుకు నన్ను క్షమించు. నేను మాట్లాడే మాటలు అభినందించేవిగా, జీవితాల్ని కట్టేవిగా, స్వస్థత కలిగించేవిగా ఉండుటకు సహాయం చేయుము.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) దృఢమైన వైవాహిక జీవితం కలిగియున్న దంపతులతో మాట్లాడండి, వారి జీవితాల్లో నుండి నేర్చుకోవడానికి ప్రశ్నలు అడగండి. మాట్లాడడం అయిపోయిన తర్వాత, వారు పంచుకున్న విషయాలను గురించి అలాగే మీ వైవాహిక జీవితంలో మీరు పాటించాలనుకుంటున్న వాటి గురించి రెండు పేరాలు రాయండి.
మీరు అడుగవలసిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:
మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఏ తేడాలు మీ వైవాహిక బంధాన్ని ప్రభావితం చేశాయి?
ఈ తేడాలు మీ ఎదుగుదలకు ఎలా తోడ్పడ్డాయి?
ఒకరినొకరు గౌరవించుకుంటూ, పరిచారం చేసుకోవడానికి మీ ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రవర్తనలు ఎలా మార్చుకున్నారు?
మీరు ప్రేమను చూపించే కొన్ని ఆచరణాత్మకమైన మార్గాలు ఏంటి?
మీలో ప్రేమ పొందుకుంటున్నామనే భావన కలిగించడానికి, మీ జీవిత భాగస్వామి ఏం చేస్తాడు లేక ఏం చెబుతాడు?
మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి మీ బంధం, దేవునితో మీకున్న బంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
(2) సామెతలు 31:10-31లో, రచయిత తన భార్యను అనేక తన మాటలతో ధృవీకరిస్తాడు. ఆమె ప్రవర్తన గురించి పలికిన ఆ మాటలు, ఆమె స్వభావాన్ని చూపిస్తాయి. ఎలాంటి విషయాలను బట్టి అతడు తన భార్యను ధృవీకరిస్తున్నాడు? ఈ విషయాల కోసం వాక్యభాగంలోకి చూడండి:
ఆమె రూపం
ఆమె విజయాలు, సేవ
ఆమె గుణం, కృషి
ఒక వ్యక్తిగా ఎలా ఉంది
ఒక విశ్వాసిగా ఎలా ఉంది
ఈ వాక్యభాగంలో ఉద్ఘాటించబడిన విషయాల నుండి మనం ఏం నేర్చుకోగలం?
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.