ఈ కోర్సులో, మనం ప్రధానంగా ఒకే గృహంలో నివసించే కుటుంబాలను గురించి నేర్చుకుంటాం. ఒక ఇంట్లో అనేక రకాల ప్రజలు కలిసి నివసిస్తూ ఉంటారు. వాటిని మనం కుటుంబాలు అంటాం. తల్లి లేక తండ్రి ఒక్కరు మాత్రమే ఉన్న కుటుంబాలు, విడాకులవల్ల విడిపోయిన కుటుంబాలు, రెండవ వివాహంవల్ల కలిసిన కుటుంబాలు, దత్తతకు తీసుకున్న పిల్లలతో ఉన్న కుటుంబాలు, బహుళ తరాలుగల కుటుంబాలు, అలాగే తాత్కాలికంగా అదనపు పిల్లల్ని లేక పెద్దలకు ఆతిథ్యమిస్తున్న కుటుంబాలు ఉన్నాయి.
కుటుంబం అంటే ఏమిటి అనే దానిపై మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. కుటుంబం గురించిన చర్చలు మన వ్యక్తిగత అనుభవాలను బట్టి మనలో వివిధ రకాల భావోద్వేగాలను కలిగిస్తాయి.
బాల్యం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది
మీరు మీ బాల్యం గురించి అద్భుతమైన జ్ఞాపకాలను కలిగి ఉండవచ్చు. లేక చిన్నతనంలో ఎదుర్కొన్న అనుభవాలను బట్టి మీరు కోపంతో ఇబ్బందిపడుతూ ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండొచ్చు లేక ఒకరినొకరు పట్టించుకోకుండా దూరంగా ఉంటూ, కలిసినప్పుడు గొడవలు పడుతూ ఉండొచ్చు. మీ జీవితానికి మీ కుటుంబమే ఒక గొప్ప ఆధారమని మీరు అనుకోవచ్చు, లేక ఎప్పుడు బయటపడదామా అని అనుకునే ఒక చెరసాలగా ఉందని అనుకోవచ్చు. మీ కుటుంబం కంటే మంచిగానున్న మరో కుటుంబాన్ని చూసినప్పుడు, మీ వైఫల్యానికి మీ కుటుంబమే కారణమని అనుకోవచ్చు.
మన కుటుంబాల్ని గురించి మన అవగాహన చాలా ముఖ్యం ఎందుకంటే జీవితం పట్ల, దేవుని పట్ల మనకున్న అవగాహనను అది ప్రభావితం చేస్తుంది. దేవుడు తన ప్రజలకు తండ్రిగా ఉన్నాడని బైబిలు చెబుతుంది. మన తల్లిదండ్రులతో-ముఖ్యంగా మన తండ్రులతో-మనకున్న సంబంధం, పరలోకపు తండ్రి గురించి మనలో ఒక అవగాహనను ఏర్పరుస్తుంది. ఒకవేళ మనకు శారీరక తండ్రి లేకపోతే, అతడు క్రూరుడైతే, పట్టించుకోకపోతే, కఠినుడైతే, మోసగాడైతే, పనిచేయని వాడైతే, లేక ఏ విధంగానైనా బాధించేవాడైతే, తండ్రియైన దేవుని గురించి మన ఆలోచన సరిగా ఉండకపోవచ్చు. మనం ఆయన వాక్యం ద్వారా, యేసు జీవితం ద్వారా, ఆయనతో మన వ్యక్తిగత సంబంధం ద్వారా దేవుణ్ణి తెలుసుకునే వరకు, ఆయన్ని మంచి తండ్రిగా చూడడం కష్టంగా ఉంటుంది. ఆయన నిజంగా ఒక మంచి తండ్రిగా, తన పిల్లల్ని కాపాడతాడు, వాళ్ళకి కావాల్సింది ఇస్తాడు. ఆయన తన పిల్లల మాట వింటాడు, వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్లని నడిపిస్తాడు, వాళ్ల శ్రేయస్సు కోరతాడు. మనం దేవుణ్ణి తెలుసుకునేకొద్దీ, ఆయన పట్ల మన అవగాహనను సరిచేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు.[1]
ఆత్మీయ భిన్నతలు మనల్ని ఎలా ప్రభావం చేస్తాయి
క్రీస్తును వెంబడించడంవల్ల కొంతమంది తమ కుటుంబీకుల నుండి తిరస్కరణ ఎదుర్కుంటారు. మనం ఆయన పట్ల విశ్వాసం వల్ల అవిశ్వాసులైన కుటుంబీకుల నుండి హింసలు ఎదుర్కోవలసి వస్తుందని యేసు చెప్పాడు. అనేక ప్రదేశాల్లోని విశ్వాసులు, క్రీస్తును అంగీకరించని తమ కుటుంబీకుల ద్వారా తిరస్కరణ, అవమానం, నిందలను భరిస్తున్నారు లేక చంపబడుతున్నారు.
► ఒక విద్యార్థి మత్తయి 10:21-22, 28, 32-39 చదవాలి. ఈ వచనాలు చదివిన తర్వాత, క్రింది ప్రశ్నలను చర్చించాలి:
ఈ వాక్యభాగం ప్రకారం, విశ్వాసులు ఏం ఆశించాలి?
ఇక్కడ ఏ వాగ్దానాలు ఉన్నాయి?
విశ్వాసులు, హింస గురించి ఎలా ఆలోచించాలి?
మనలో మరికొంతమంది తమ కుటుంబీకుల ద్వారా హింస ఎదుర్కోకపోయినా, వారి విశ్వాసం కారణంగా సంబంధాల్లో సమస్యలను ఎదుర్కోవచ్చు. విశ్వాసులుగా మన జీవన విధానం మన కుటుంబీకుల జీవన విధానం కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి, మన కుటుంబ బాంధవ్యాలు వికృతంగా, దూరంగా లేక పరిమితంగా ఉండొచ్చు. మనల్ని అపార్థం చేసుకోవచ్చు లేక అగౌరవపరచవచ్చు. బంధువులు మన పరిచర్యను అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. యేసు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు (మార్కు 3:21, యోహాను 7:3, 5) కాబట్టి మనకు ఇలా జరిగినప్పుడు, ఆశ్చర్యపోకూడదు.
[1]దేవుని గురించిన అవగాహనను ఎలా పునరుద్ధరించుకోవాలో తెలుసుకోవాలంటే, Shepherds Global Classroom నుండి Spiritual Formation 4వ పాఠం చూడండి.
మీరు, మీ కుటుంబం
కొద్ది నిమిషాల్లో, మీరు మీ తోటి విద్యార్థులకు మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు, కాని మీ పేరు ఒక్కటే కాకుండా మీ కుటుంబంలో మీరు ఎవరో కూడా పంచుకుంటారు.
మొదటిగా, మీరు మీ కుటుంబంలో కుమారుడు లేక కుమార్తె, భార్య లేక భర్త, తల్లి లేక తండ్రి, అత్త లేక మామయ్య, అమ్మమ్మ లేక తాతయ్య వంటి విభిన్న హోదాలో, దేనిని కలిగియున్నారో ఆలోచించాలి. అదనంగా ఉండే హోదాల గురించి ఆలోచించగలరా? బహుశా మీరు అనేక హోదాలను కలిగి ఉండవచ్చు.
మీ కుటుంబంలో మీకున్న ఇతర బాధ్యతలు లేక స్థానాలు ఏంటి? మీరు పెద్దవాళ్ళా లేక చిన్నవాళ్ళా? ఆర్థిక విషయాలు చూసుకుంటారా? ఇంటి పనులు చూసుకుంటారా? వృద్ధుల్ని లేక వికలాంగుల్ని చూసుకుంటారా? మీ కుటుంబంలో మీకున్న ఇతర పాత్రలు, బాధ్యతల గురించి ఆలోచించండి.
► మీ కుటుంబంలో మీకున్న పేర్లు, పాత్రలు పేర్కొంటూ, తోటి విద్యార్థులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి.
► ఇప్పుడు, మీ హోదాలు, బాధ్యతలు (1) మిమ్మల్ని మీరు చూసుకునే విధానాన్ని (2) మీరు మీ కుటుంబీకుల్ని చూసే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించండి.
మీ సొంత కుటుంబం గురించి లేక మీ బంధువులు గురించి మీరేమి అనుకున్నప్పటికీ, వాళ్లు మీ వాళ్ళే. మీ కుటుంబం చిన్నాభిన్నమై, గాయాలు బాధలు అనుభవిస్తూ ఉండొచ్చు. మీరు పరిపూర్ణంగా ఉన్నారని ప్రజలు మీ కుటుంబాన్ని చూసి అసూయపడవచ్చు: మీకు మంచి వివాహ జీవితం కలిగి ఉండవచ్చు, తెలివైన, ఆరోగ్యకరమైన పిల్లలు, ప్రేమ, శాంతి, నవ్వులతో నిండిన కుటుంబం ఉండవచ్చు.
మీ కుటుంబం బలహీనంగా ఉన్నా, బలంగా ఉన్నా, దేవుడు మీ కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి, దానిని పట్టించుకుంటాడు. మీ కుటుంబం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది.
► మీ కుటుంబ సభ్యుల పేర్లు రాయండి (కనీసం 3-4 తరాల కుటుంబ సభ్యులు). ఉదాహరణకు, మీ తాత అమ్మమ్మల పేర్లు (మొదటి తరం), మీ తల్లిదండ్రుల పేర్లు (రెండవ తరం), మీ పేరు, మీ తోబుట్టువుల పేర్లు (మూడవ తరం), మీ పిల్లల పేర్లు లేక మేనల్లుడు మేనకోడల్ల పేర్లు (నాల్గవ తరం).
మీకు ఎవరితో సన్నిహిత సంబంధం, మంచి సంబంధం ఉందో వాళ్ల పేర్ల ముందు నక్షత్రం గుర్తు గీయండి. ఎవరితో తక్కువ సంబంధం ఉందో వాళ్ల పేర్ల ముందు త్రికోణం గుర్తు గీయండి, మరియు ఏ కారణం చేతైనా సంబంధం పోగొట్టుకున్న వాళ్ల పేర్ల ముందు చతురస్రం గుర్తు గీయండి.
మీకు రక్తసంబంధం లేకపోయినా కుటుంబ సభ్యుల్లా భావించే వాళ్లు ఎవరైనా ఉన్నారా: కుటుంబ సభ్యుల్లాగా ప్రతి కుటుంబ సమావేశాల్లో, వేడుకల్లో పాల్గొనేవారు? వాళ్ల పేర్లు రాసి, ఆ పేర్ల చుట్టూ గుండ్రంగా గీయండి.
మొట్టమొదటి మానవుని కుటుంబం
► ఆదాము, హవ్వ మరియు అబ్రాహాము శార జీవితాలు అధ్యయనం చేస్తుండగా మీ బైబిల్లో ఆదికాండము పుస్తకం తెరచి ఉంచండి.
మొట్టమొదటి వివాహం
ఆదాము హవ్వలు, మొట్టమొదటి కుటుంబంగా ఉన్నారు: ఒక భర్త, ఒక భార్య మరియు ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహంలో జతపరచబడ్డారు. మొదటి వివాహంలో, “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును” (ఆదికాండము 2:23) అని ఆదాము పేర్కొన్నాడు.
తర్వాత వచనం, బైబిలు ప్రకారమైన వివాహాన్ని నిర్వచిస్తుంది: “కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు” (ఆదికాండము 2:24). క్రొత్త నిబంధన గ్రంథంలో, మత్తయి 19:5 మరియు ఎఫెసీయులకు 5:31లో ఇవే మాటలు పునరావృతమౌతాయి. భార్యభర్తలు ఏకశరీరమవ్వడం అనేది స్థిరమైన నిబద్ధత, అంటే అది జీవితకాలం ఉంటుందని దేవుని యెదుట, మానవుని యెదుట ప్రమాణం చేయడం.
వివాహం అనేది మూడు విధాల అద్భుతం. ఇద్దరు వ్యక్తులు ఏకశరీరమయ్యే జీవసంబంధ అద్భుతం; రెండు కుటుంబాలు కలిసిపోయే సామాజిక అద్భుతం; క్రీస్తుకు, వధువు సంఘానికి మధ్య ఐక్యతను ప్రతిబింబించే ఆత్మీయ అద్భుతం.[1]
వివాహం, త్రిత్వంలోని సంబంధాల్ని ప్రతిబింబిస్తుంది
వివాహం, దేవుని గుణాన్ని ఆయన సంబంధాల్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు నిరంతరం పరస్పర సంబంధం కలిగియున్నారు, కలిగియుంటారు. ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన బాధ్యతలు కలిగి ఉన్నప్పటికీ, త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు నిత్యం ఏకమై ఉన్నారు, ఒకే స్వభావాన్ని కలిగియున్నారు. త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తుల మధ్యగల సంబంధంలో, ఐక్యత, నమ్మకం, స్థిరమైన ప్రేమను మనం చూస్తాం. ఈ అద్భుతమైన సంబంధానికి అనుగుణంగా వివాహ బంధం ఏర్పాటు చేయబడింది. భార్యభర్తలు తమ ప్రేమ విషయంలో, సమర్పణకలిగి ఉండే విషయంలో జీవితాంతం పవిత్రంగా ఉండాలని దేవుడు ప్రణాళిక కలిగియున్నాడు. [2]
మానవుని వైవాహిక బంధం ఈ విషయాల్లో త్రిత్వంలోని సంబంధాల్ని ప్రతిబింబించాలి:
1. వివాహం అంటే భాగస్వామితో జీవితాంతం నమ్మకంగా స్థిరమైన బంధం కలిగియుండడం.
2. వివాహం అంటే నిస్వార్థమైన ప్రేమ బంధం.
3. వివాహం అంటే ఫలభరితమైన బంధం.
మొదటి ఆజ్ఞ
దేవుడు తానే చేసిన మొదటి వివాహంలో,
దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా–మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను (ఆదికాండము 1:28).
బైబిల్లో దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ, ఫలించి అభివృద్ధి పొంది, విస్తరించడం. వివాహ బంధం, త్యాగపూరితమైన ప్రేమతో కూడిన ఫలప్రదమైన సంబంధంగా ఉండాలి. భార్యభర్తలు కలిసి దేవుని సృజనాత్మక పనిని కొనసాగిస్తూ, నూతన జీవితాల్ని కుటుంబ బంధంలోకి తీసుకొస్తారు గనుక వైవాహిక జీవితంలో పిల్లల్ని కనడం సృష్టికర్తను మహిమపరుస్తుంది. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప బాధ్యత!
► ఒక విద్యార్థి తరగతి కోసం కీర్తన 127:3-5 చదవాలి. ఈ వాక్యభాగం, పిల్లలు గురించి వివరించడానికి పదచిత్రాలను, సాదృశ్యాలను ఉపయోగిస్తుంది. పదచిత్రాలు అంటే ఏంటి? ఈ పదచిత్రాల ఆధారంగా, మనం మన పిల్లలు గురించి ఎలా ఆలోచించాలి?
పిల్లలు బహుమానమని, విలువైన స్వాస్థ్యమని బైబిలు చెబుతుంది. వాళ్లని, కేవలం లైంగిక సంబంధం ద్వారా పుట్టినవారిగా భావించకూడదు. ఒక శిశువును గర్భం ధరించిన పరిస్థితులు కోరుకున్నవైనా లేదా నీతియుక్తమైన, జీవాన్నిచ్చే దేవుడు ప్రతి శిశువును ఉద్దేశ్యపూర్వకంగానే గర్భంలో ఉంచాడు, పుట్టించాడు. నిన్ను నన్నూ కూడా అలాగే సృజించాడు. ఒకరి పుట్టుక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రతి వ్యక్తిని ఒక ఉద్దేశ్యంతో చేశాడు.
అవును, పిల్లలు దేవుడిచ్చు బహుమానం, అయితే వాళ్లు తల్లిదండ్రులు దేవునికిచ్చే బహుమానంగా కూడా ఉన్నారు.
కొంచెముగానైనను దైవాత్మనొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి (మలాకీ 2:15).
పిల్లలు ఒక పవిత్రమైన నమ్మకం (పవిత్రమైన బాధ్యత). తల్లిదండ్రులు తన ఉద్దేశాల్ని నెరవేర్చడానికి పిల్లల్ని పెంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. తన రాజ్య వ్యాప్తి కోసం దేవుడు మన పిల్లల్ని వాడుకుంటాడు (ఆదికాండము 18:19). తనకు పరిచర్య చేసే విధంగా పిల్లల్ని సిద్ధపరిచే బాధ్యత దేవుడు మనకిచ్చాడు (ద్వితీయోపదేశకాండము 6:2). వాళ్లని, మన సేవ కోసం లేక మన కలలు నెరవేర్చుకోవడం కోసం పెంచట్లేదు. దేవుడు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే బాణాలుగా వాళ్లని మనం చూడాలి.
మానవ కుటుంబం పతనం, విచ్చిన్నం
ఆదికాండము 3లో, అప్పటివరకు పరిపూర్ణంగా ఉన్న ఏకైక కుటుంబం పతనమైపోయి, రక్షకుని అవసరతలో ఉంది. ఆదాము, హవ్వ పాపం చేశారు, మరణ శాపం మానవాళి మీదికి వచ్చింది. ఆదాము, హవ్వ పరస్పరం కలిగియున్న సంబంధం శాశ్వతంగా నాశనమై, వారు దేవునికి దూరమైయ్యారు.
స్త్రీ పురుషులు ఇద్దరు మరిన్ని శాపాలు అనుభవించారు:
ప్రజలు సాతాను అబద్ధాలను నమ్మినందున కుటుంబం పట్ల దేవుని పరిపూర్ణ ప్రణాళిక వక్రీకరించబడింది.
ఆదికాండము 4వ అధ్యాయం, పతనమైన మానవ కుటుంబ స్థితిని చూపిస్తుంది.
ఇప్పుడు మొట్టమొదటి గర్భధారణ, పుట్టుకను వివరించే ఆదికాండము 4:1ను గమనించండి. ఈ వచనం తొమ్మిది నెలల కాలాన్ని-శిశు గర్భధారణ మొదలుకొని, పుట్టుకవరకు- చూపిస్తుంది. హవ్వ తన భయాల్ని ఆనందాన్ని ఆదాముతో చెప్పే ప్రయత్నంలో, ఆ తొమ్మిది నెలలు హవ్వకు ఎలా ఉండి ఉంటాయో ఊహించండి. ఆమెకు సలహాలు, తన ప్రశ్నలకు జవాబులును ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆమె పొట్ట పెరగడం, బిడ్డ తన్నడం, పురిటి నొప్పులు మరియు ప్రసవ వేదన - ఇవన్నీ ఏ మానవ తల్లికైనా మొదటిసారి అనుభవాలే. అందుకే కయీను పుట్టుక గురించి హవ్వ “యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నా” (ఆదికాండము 4:1) అని చెప్పడంలో ఆశ్చర్యమేమి లేదు.
కాలం గడిచింది, ఆ తర్వాత వచనంలో రెండవ గర్భధారణ, పుట్టుక గురించి మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఆదాము, హవ్వ కుటుంబంలో నలుగురు ఉన్నారు. అదే వచనం, రెండో భాగంలో వాళ్ల కుమారుల పని గురించిన సమాచారం ఉంది, 3వ వచనానికి వచ్చేసరికి, పిల్లలు పెరిగి పెద్దవారైపోయారు, ఆ తర్వాత వచనాల్లో మొదటి హత్య గురించిన విషాద కథను మనం చదువుతాం. ఆదాము హవ్వల పెద్ద కుమారుడు కోపం, అసూయతో తన సోదరుడ్ని చంపేశాడు. ఆ దిగ్భ్రాంతి, విచారం, ప్రశ్నలు, బాధ, గాయం మీరు ఊహించగలరా?
“అవును! నేను ఊహించగలను. నిజానికి, నాకూ ఇలాంటిదే జరిగింది!” అని మీరు చెప్పొచ్చు. అయితే మీకొక ప్రోత్సాహకరమైన వార్త: మీరు ఒంటరివారు కాదు. మీ కుటుంబం విడుదల పొందగలదు! ప్రతి కుటుంబానికి ఒక శుభవార్త ఉంది.
గోర్డాన్ వెన్హాం (Gordon Wenham) ఇలా రాశాడు,
…...ఆదికాండములోని సందేశం... మానవుడు పాపం చేసినప్పటికీ దేవుని కృప గెలిచిందని చెబుతుంది, పాపంవలన కుటుంబాలు విచ్ఛిన్నమైనప్పటికీ దేవుని కృప విజయం సాధించిందని చూపిస్తుంది. ఈ పుస్తకం, లోకం ఎంత అద్భుతంగా సృష్టించబడిందో అనే విషయంతో మొదలై, దేవుడు తన స్వరూపంలో మానవుని సృజించాడని, దేవుడు తాను చేసింది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉందని చెబుతుంది......కాని మూడవ అధ్యాయంలో విషయాలు తలక్రిందులౌతాయి, అవిధేయత కనిపిస్తుంది, [విభేదం], మరియు విధేయత, సామరస్యం, జీవితమనే విషయాల్ని మరణం భర్తీ చేస్తుంది. 4వ అధ్యాయంలో పరిస్థితులు మరింత ఘోరమయ్యాయి....6వ అధ్యాయంలో మరింత దిగజారిపోయాయి, అక్కడ భూమి బలాత్కారముతో నిండిపోయిందని చెబుతుంది (ఆదికాండము 6:11, 13).[4]
[1]The Woman’s Study Bible, (Thomas Nelson, Inc., 1995), 9.
[2]“వివాహం.....నిబంధన కర్తగా, నిబంధనను పాటించేవ్యక్తిగా దేవుని గుణాన్ని వెల్లడి చేస్తుంది. నిబంధనలో, కీలకమైన విషయాలు భావోద్వేగం కాదుగాని విశ్వసనీయత, యదార్థత.”
- Robertson McQuilkin, An Introduction to Biblical Ethics
[3]శిశుజన్మ, శాపంలో భాగం కాదని నొక్కి చెప్పడం చాలా ముఖ్యం. శిశుజన్మలో వేదన అనేది శాప ఫలితం, కాని తర్వాత తరంవారిని ఉనికి లోనికి తీసుకురావడానికి శిశుజన్మ ఎల్లప్పుడు దేవుని అద్భుతమైన ప్రణాళికగానే ఉంది. పని శాపం కాదుగాని కష్టంతో పనిచేయడమనేది శాప ఫలితం. నిజానికి ఆదికాండము 1:28 లో దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చిన ఇతర ఆజ్ఞలు, మనం పని కోసం చేయబడ్డామని సూచిస్తాయి! దేవుని స్వరూపాన్ని ప్రతిబింబించే విధానాల్లో పని కూడా ఒకటి.
[4]Gordon Wenham writing in Family in the Bible, edited by Richard S. Hess and M. Daniel Carroll R., Grand Rapids, MI: Baker Academic, 2003, 29
అబ్రాహాము కుటుంబంలో విచ్ఛిన్నత (నలిగిన స్థితి)
తర్వాత ఆదికాండములో, హెబ్రీయులకు తండ్రిగా పిలువబడిన అబ్రాహాము గురించి చదువుతాం (ఆదికాండము 11:27-25:11).[1] దేవుడు, అబ్రాహాము కుటుంబం ద్వారానే మానవుని కుటుంబంలోకి రక్షకుని అనుగ్రహిస్తాడు.
ఆదికాండము 11 నోవహు కుమారుడైన షేము వంశంలో పుట్టిన అబ్రాము వంశావళి గురించి మాట్లాడుతుంది. అబ్రాము భార్యయైన శారయి గొడ్రాలై సంతానం లేకుండా ఉందని ఆదికాండము 11:30 చూపిస్తుంది. దీన్ని చదివేవాళ్లకి ఇది కన్నీళ్లు, బాధ, హృదయవేదన, నిరాశ, కోపం మరియు దుఖం కలిగించే వచనం. ఒకవేళ ఈవచనంలోని శారయివలే మీరు ఉన్నట్లయితే, మీరు ఒంటరిగా లేరని తెలుసుకోండి.
పిల్లలు కావాలనుకుని గొడ్రాలైనవాళ్లు, ఆదికాండము 1:28 మరియు కీర్తన 127:3-5 వంటి వాక్యభాగాలు చదివినప్పుడు గొప్ప బాధ, దుఖం కలుగుతుంది. పిల్లలు లేకపోవడాన్ని శిక్షగా లేక శాపంగా భావించడం సహజమే.
వాస్తవమేంటంటే, మీకు పిల్లలు లేనందున, దేవుని దృష్టిలో మీరు విలువలేని వారు కాదు. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. మీకు పిల్లలు లేరంటే మీ కుటుంబం లోపాలతో ఉందని కాదు. ఇతరులు కూడా ఇదే లోతైన బాధను అనుభవించారు.
సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులు, వ్యక్తిగతంగాను, జంటగాను కలిసి ఎలా ఎదుర్కొంటారు అనేది చాలా ప్రాముఖ్యం. అబ్రాము, శారాయి జీవితాల్లో మనం చూసినట్లు, అనాలోచితంగా మనం తీసుకొనే నిర్ణయాలు మరిన్ని సమస్యలకు నడిపిస్తాయి.
వాగ్దానం కోసం వేచి ఉండడం
[3]తండ్రి మరణం తర్వాత, అబ్రాము తన కుటుంబానికి మూల పురుషుడయ్యాడు. దేవుడు అబ్రామును గొప్ప జనంగా చేస్తానని (ఆదికాండము 12:2), అలాగే అతని సంతానానికి కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు (ఆదికాండము 12:7). అప్పుడు అబ్రాముకు 75 సంవత్సరాలు (ఆదికాండము 12:4) శారా అతని కంటే పది సంవత్సరాలు చిన్నది (ఆదికాండము 17:17). శారయి 65 సంవత్సరాల వయస్సులోను అందంగా ఉన్న స్త్రీ (ఆదికాండము 12:11), ఇంకా సంతానం లేకుండా, సాధారణ సంతానోత్పత్తి వయస్సు దాటిపోయి ఉంది.
ఆదికాండము 13:14-17లో దేవుని వాగ్దానం స్పష్టంగా పునరుద్ధరించబడినప్పటికీ, సంవత్సరాలు గడిచిపోతున్నా, ఇంకా సంతానం కలుగలేదు. ఆదికాండము 15:2-3లో, తన దాసుడే తన వారసుడని అబ్రాము మాట్లాడుతున్నాడు గనుక సొంత బిడ్డకు తండ్రయ్యే ఆశను కోల్పోతున్నట్లు కనిపిస్తున్నాడు. అప్పుడు దేవుడు, “ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని” (ఆదికాండము 15:4) చెప్పాడు. అటు తర్వాత, దేవుడు అబ్రాముకు లెక్కింపజాలని సంతానం గురించిన రెండవ వాగ్దాన చిత్రాన్ని ఇచ్చినప్పుడు, అబ్రాము దేవుని నమ్మాడు (ఆదికాండము 15:6).
వేచి ఉండిన ఈ సంవత్సరాలన్ని శారయికి ఎలా గడిచి ఉంటాయో ఆలోచించండి:
ఆమె గురించి ఇతరులు చేసిన విమర్శల కంటే కూడా తన వ్యక్తిగత నిరుత్సాహమే మరెక్కువ బాధ కలిగించి ఉంటుంది. బహుశా తాను తల్లి అవ్వాలనే తపన మాత్రమే కాకుండా, పిల్లలు లేని వారిని చిన్న చూపు చూసే ఆ సమాజంలో తల్లులకు లభించే గౌరవం, మర్యాద తనకు కూడా కావాలనుకుంది. సంతానలేమికి పురుషుల్లోని వంధత్వం కూడా కారణం కావచ్చని మనకు తెలుసు, కాని శారయి జీవించిన కాలంలో ఈ విషయం పట్ల అంత అవగాహన లేదు. ఒక స్త్రీగా శారయు గుర్తింపు, ఆమె విలువ పిల్లల్ని కని, పెంచడం మీద ఆధారపడి ఉంది. ఆమె, నీతిగా నమ్మకంగా జీవించడం ద్వారా విలువ పొందుకోదు గాని, తన భర్తకు వారసుని కనడంవల్ల విలువ సంపాదించుకుంటుంది. సంతాన లేమి అంటే అర్థరహిత జీవితమని అర్థం.[4]
మానవుల పరిష్కారాలు, బాధాకరమైన ఫలితాలు
[5]అబ్రాముకు 85 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, శారయికి ఒక ఆలోచన వచ్చింది- అదే అబ్రాముకు సంతానం ఎలా కలుగుతుందో అనే విషయానికి పరిష్కారం. శారయి దాసి వాళ్ల బిడ్డకు తల్లి కావచ్చు! (ఆదికాండము 16:1-4). కాని, పరిపూర్ణ పరిష్కారంగా ఉంటుందని అబ్రాము శారయి చేసిన ఆలోచన, హాగరు గర్భం దాల్చినప్పుడు తమ ఇంటిలో సమాధానాన్ని నాశనం చేసింది. ఎంతో మంచిగా, సరైనదిగా అనిపించిన ఆలోచన తప్పు అయ్యింది. దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి వాళ్లు చేసిన ప్రయత్నం విభేదాలు సృష్టించింది. ప్రజలు దేవుని సమయాన్ని, ఆయన ప్రణాళికను నమ్మకపోతే, తత్ఫలితంగా సంబంధాలు తెగిపోతాయి, బాధలు అనుభవించవలసి వస్తుంది.
తరువాత సంవత్సరాల్లో, ఉద్రిక్తత, బాధ, అపార్థాలు, సంభాషణ సమస్యలు, కోపం, పరిత్యాగం, నిరాశ అబ్రాము శారయి ఇంట్లో మాత్రమే కాకుండా తన సహోదరుని కుమారుడైన లోతు కుటుంబంలో కూడా అంతకంతకు పెరిగాయి (ఆదికాండము 16-21).
లోపాలున్న కుటుంబాలు
జనములకు తండ్రిగా దేవుడు అబ్రామును ఎన్నుకున్నాడు, ఈ వంశం ద్వారానే యేసు జన్మిస్తాడు! అబ్రాము తన కుటుంబ సభ్యులవలే, దేవుని ప్రణాళికను నాశనం చేస్తున్నట్లుగా కనబడుతున్నాడు! వారి కుటుంబం, లోపాలున్న కుటుంబానికి మాదిరి.
ఆదికాండము 49:33 నాటికి, అబ్రాహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, యాకోబు, తన భార్యలు అందరు చనిపోయారు. యాకోబు పిల్లలతో సహా, వాళ్లంతా వైఫల్యాలు, లోపాలున్న కుటుంబంగా ఉన్నారు. పోరాటాలు, వాదాలు, పక్షపాతం, మోసం, పరిత్యాగం, తోబుట్టువుల మధ్య శత్రుత్వం, మానభంగం మరియు అనుచిత సంబంధాలు ఇవన్నీ వాళ్ల కుటుంబంలో భాగమయ్యాయి. ఈ మాటలన్నీ వర్ధిల్లుతున్న, సమాధానకరమైన కుటుంబాన్ని సూచించవు!
విచారకరంగా, అప్పటినుండి కూడా ఈ కథ బైబిలు అంతటా, అలాగే ప్రపంచమంతటా పునరావృతమౌతూనే ఉంది. అయితే, ఈ కుటుంబాల్లో కూడా అనందకర పరిస్థితులు, అందమైన ప్రేమ కథలు, మరియు కొందరు నీతిమంతులు కూడా ఉన్నారు.
వీటన్నిటిలో కూడా, మానవాళిని విడిపించాలనే ఆయన ప్రణాళికను దేవుడు విడిచిపెట్టలేదు. కుటుంబపట్ల ఆయన ప్రణాళికను కూడా మార్చుకోలేదు. మీరు పాత నిబంధన గ్రంథమంతా చదవడం కొనసాగించుచున్నప్పుడు, హెబ్రీ కుటుంబ కథల్లో విమోచన అనే ఒక అద్భుతమైన విషయాన్ని చూస్తారు. అనేక సంఘటనలు యేసు వైపుకు సూచిస్తాయి. అబ్రాహాము ఇస్సాకును అర్పించడం; పస్కా మరియు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడటం; రాహాబు తీర్పు నుండి తప్పించబడి, దేవుని ప్రజల్లో చేర్చబడడం; ఇంకా అనేక ఇతర సంఘటనలు, రక్షకుడు వచ్చి మానవాళిని విమోచిస్తాడని చూపిస్తాయి.
[1]ఆదికాండము 17:5, 15లో దేవుడు అబ్రాము, శారయి పేర్లను అబ్రాహాము, శారాగా మార్చాడు.
మనల్ని యేసువలే మార్చడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని వేచి ఉండేలా చేస్తాడు, ఎందుకంటే ఆ వేచియున్న సమయం ద్వారా మరో విధంగా సాధ్యం కాని కార్యాన్ని మన హృదయాల్లో చేస్తాడు.
[4]David and Diana Garland, Flawed Families of the Bible, Grand Rapids, MI: Brazos Press, 2007, 21-22
“ఎలీసబేతు విషయంలో చేసినట్లుగా (లూకా 1:7, 13) మనం ఎంత వేడుకున్నా, కొన్ని పరిశుద్ధ కారణాలవల్ల దేవుడు ఆలస్యం చేస్తాడు, మరియ విషయంలో చేసినట్లుగా (లూకా 1:34) సిద్ధంగా లేకపోయినప్పటికీ దేవుడు ముందుకు సాగుతాడు.
మనం దేవునికి విధేయత చూపించి, ఆయన్ను ఆరాధించినప్పుడు, ఆయన నడిపిస్తాడు, బోధిస్తాడు, మరియు ఆయన ప్రణాళికకు అవసరమైనదానిని అనుగ్రహిస్తాడు, ఆ ప్రణాళిక మనం ఊహించలేనంత గొప్పది.”
- షానా లెటెల్లియర్ (Shauna Letellier) నుండి తీసుకున్నది, రిమార్కబుల్ అడ్వెంట్ (Remarkable Advent)
కుటుంబాల్లో దేవుని స్వస్థత, కృప
వివాహమనేది క్రీస్తుకు, ఆయన వధువైన సంఘానికి మధ్య సంబంధానికి సూచనగా ఉండడానికి దేవుడు రూపొందిచాడని ఎఫెసీయులకు 5 చెబుతుంది. శిరస్సైన క్రీస్తు సంఘం కోసం తన్నుతాను అప్పగించుకున్నట్లుగా, తన భార్యకు శిరస్సైన ప్రతి భర్త ఆమె కోసం తన్నుతాను అప్పగించుకోవాలి. అలాగే, ప్రతి భార్య సంఘ మాదిరిని అనుసరించాలి. సంఘం క్రీస్తుకు లోబడినట్టుగా, ప్రతి భార్య తన భర్తకు లోబడాలి.
మానవాళి పతనం, మానవ కుటుంబాల కోసం దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికను నాశనం చేసింది, వైవాహిక సంబంధాల్లో వినాశనకరమైన పరిణామాలను తీసుకొచ్చింది. మానవుడు పాపంలో పడిపోవడం వలన కలిగే పర్యవసానాల్ని ప్రతి కుటుంబం ఎదుర్కొంటుంది. అయినప్పటికీ,
యేసు వివాహంతో పాటు సమస్తాన్ని విమోచించడానికి వచ్చాడు. పాపంవల్ల నాశనమై, దెబ్బతిన్న ప్రతిదాన్ని విడిపించి, పునరుద్ధరించడానికి వచ్చాడు. వివాహంపట్ల దేవుడు కలిగియున్న ప్రణాళిక ప్రకారం మనం జీవించలేనప్పుడు, యేసు దేవుని ప్రమాణాల్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. యేసు, సంఘం కోసం ప్రాణం ఇచ్చేంతగా దాన్ని ప్రేమించాడు. ఆయన తండ్రియైన దేవుని ప్రణాళికకు పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. యేసు దేవుడు రూపొందించిన దానికి పరిపూర్ణమైన నెరవేర్పుగా ఉన్నాడు: మన వివాహాలు నెరవేర్చలేని ప్రేమను, విధేయతను ఆయన నెరవేర్చాడు.[1]
► వివాహమైన వ్యక్తి కలిగియుండవలసిన వైఖరికి యేసు ఎలా ఆదర్శంగా ఉన్నాడు?
యేసు పరిపూర్ణంగా లోబడడం ద్వారా, పరిపూర్ణంగా ప్రేమించడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే కాకుండా, సహజంగా పతనమైన మానవుల్లో నష్టాన్ని, కీడును కలిగించే ధోరణిని జయించే శక్తి భార్యభర్తలకు అనుగ్రహించాడు. ఆయన కృపను బట్టి, భార్యభర్తలు ఇరువురు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించినప్పుడు, వివాహ విషయంలో దేవుని ప్రణాళికను నెరవేర్చగలరు (ఎఫెసీయులకు 5:18).
ఏ కుటుంబం కూడా పరిపూర్ణమైంది కాదుగాని దేవుడు ప్రతి కుటుంబాన్ని విమోచించాలని ఆశిస్తున్నాడు. దేవుని కృప కుటుంబాల్లో పనిచేసి, ప్రతి వ్యక్తిని దేవుడు మొదటగా ఉద్దేశించిన దానికి తగినట్లుగా మార్చగలదు. కుటుంబాలలోని వ్యక్తులు దేవుని ఆజ్ఞలకు విధేయులై జీవించినప్పుడు, వారి విధేయత కుటుంబాలు సహజమైన లోపాలను, తప్పులను సరిదిద్దుకోవడంలో వాటికి సహాయపడుతుంది. మానవ సంబంధాలను ప్రభావితం చేసే పతనపు ఫలితాలు మనం దేవుని చిత్తానికి లోబడినప్పుడు తగ్గుతాయి.
ఉదాహరణకు, ఎఫెసీయులకు 5లో దైవికమైన భర్త దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు, భార్యపై తన అధికారాన్ని స్వార్థపూరితంగా ఉపయోగించే తన సహజ ధోరణిని అధిగమిస్తాడు. దేవుని పట్ల అతడు చూపే విధేయత, పతనంవల్ల కలిగే ప్రభావాల్ని తగ్గించి, స్వస్థతను ఇస్తుంది. ఈ విధేయత వల్ల, అతని భార్య లోబడాలనే ప్రేరణను పొందుతుంది.
భార్య దేవుని ఆదేశాన్ని (ఎఫెసీయులకు 5:24) అనుసరించి తన భర్తకు లోబడినప్పుడు, ఆమె తన భర్త అధికారాన్ని ఎదిరించాలనే తన సహజ పాపపు ప్రవృత్తిని జయిస్తుంది. ఆమె దేవునికి విధేయత చూపడం ద్వారా వారి సంబంధం దేవుడు వివాహాన్ని ఉద్దేశించిన విధంగా (1 కొరింథీయులకు 11:3, 1 పేతురు 3:1-7) మరింత పునరుద్ధరించబడుతుంది.
కుటుంబ సంబంధాలు దేవునికి చాలా ముఖ్యం. ఈ కారణంతోనే, దేవుడు స్వస్థతను, పునరుద్ధరణను తీసుకొచ్చే సూచనలను కుటుంబాలకు ఇచ్చాడు.
తల్లిదండ్రులు, తాతలు, అమమ్మలు తమ పిల్లలకు, మనవళ్ళకు, మనవరాళ్లకు దేవుని మార్గాల్ని బోధించవలసిన అవసరతను గురించి అనేక వాక్యభాగాలు మాట్లాడతాయి. మూడింటిని క్లుప్తంగా చూద్దాం.
► ఒక విద్యార్థి తరగతి కోసం ఎఫెసీయులకు 6:4 చదవాలి. ఈ వాక్య అర్థమేమిటి?
తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుడిని తెలుసుకోవడం, ఆయనకు విధేయత చూపడం ఎలాగో నేర్పించడం దేవుని ప్రణాళిక. తల్లిదండ్రులు తమ పిల్లలను నడిపించే, బోధించే, సరిదిద్దే, శిక్షణ ఇచ్చే విధానం, దేవుడు తన పిల్లల పట్ల ఈ పనులను చేసే విధానాన్ని ప్రతిబింబించాలి.
► ఒక విద్యార్థి తరగతి కోసం కీర్తన 78:1-8 చదవాలి. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి:
ఈ వాక్యభాగంలో ఎన్నికుటుంబ తరాలు పేర్కొనబడ్డాయి?
ప్రతి తరం యొక్క బాధ్యత ఏంటి?
పెద్దవాళ్లు యువ తరాలకు ఏం నేర్పించాలి?
కీర్తన 78 దేవుని అద్భుతమైన కృప మరియు దయతో నిండియుంది. ఇది ఐగుప్తును విడిచిపెట్టిన నాటనుండి దావీదు రాజు పరిపాలన వరకు ఇశ్రాయేలు కుటుంబాల్లో ఆయన చేసిన కార్యమును తెలియజేస్తుంది. ఈ కీర్తన, పాఠకుల కుటుంబ పరిస్థితుల్లో నిరీక్షణను అనుగ్రహిస్తుంది.
► ఒక విద్యార్థి తరగతి కోసం ద్వితీయోపదేశకాండము 6:1-9 చదవాలి. ఈ వాక్యభాగం పరిశీలిస్తూ, దేవుని ప్రజలైన మనం చేయవలసిన కొన్ని పనులు ఏంటి?
ఈ వాక్యభాగం, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇవ్వబోయే వాగ్దాన దేశంలోకి వెళ్లే ముందు, మోషే వాళ్లకు ఇచ్చిన ఉపదేశంలో భాగం. వారు దేవుని ప్రజలుగా ఎలా ఉండాలో, దేవునికి చెందినవారిగా ఉండడం అంటే ఏంటో నేర్చుకుంటున్నారు. ఈ వచనాల్లోని సత్యాలు, ఇప్పటికీ దేవుని పిల్లలుగా జీవించుటకు పునాది వలె ఉన్నాయి.
ఆయన వాక్యాన్ని విధేయతతో విని- ఆయన మన నుండి ఆశించేది చేయాలని దేవుడు మనలను ఆజ్ఞాపించుచున్నాడు! (వచనాలు 3-4).
2. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోవాలి (వచనం 6).
3. దేవుని వాక్యాన్ని ఎలా అనుసరించాలో మన పిల్లలకు జాగ్రత్తగా నేర్పించాలి (వచనం 7).
4. ఎల్లప్పుడు దేవుని వాక్యాన్ని మన మనస్సుల్లో, మన యెదుట ఉంచుకోవాలి (వచనాలు 8-9).
ఈ ఆజ్ఞలు ప్రతి తరానికి ఇవ్వబడినవని గమనించండి (వచనం 2). తమ పిల్లలకు, మనవళ్లు మనవరాళ్ళకు తనను ఎలా అనుసరించాలో నేర్పించే బాధ్యత తల్లిదండ్రులకు, తాత అమ్మమ్మలకు దేవుడు ఇచ్చాడు. ఎంతకాలం వరకు? వారు జీవించినంతకాలం (వచనం 2). తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని మార్గాలు గురించి రోజంతా బోధించాలని, ప్రతిరోజు, వాళ్లు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, బోధిస్తూ ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు (వచనలు 7-9).
పిల్లల ఆత్మీయ విద్య తల్లిదండ్రుల బాధ్యతే. ఈ బోధన ప్రతిరోజు తల్లిదండ్రులు చూపించే మాదిరివల్ల, ధర్మశాస్త్రాన్ని పదే పదే చెప్పడంవల్ల జరగాలి. ఈ ఆజ్ఞకున్న ప్రాముఖ్యత, తల్లిదండ్రులు పిల్లలకు బోధించడానికి ఎంత దూరం వెళ్తున్నారనే విషయంలో కనిపిస్తుంది. ఇది కేవలం ధర్మశాస్త్రంలోని విషయాలు బోధించడమే కాదుకానీ, ప్రతిరోజు జీవించే విధానంలో చూపే జీవనశైలి కావాలి. ఇంటి పనులు చేసుకుంటూనే దేవుని కట్టడల్ని బోధించడానికి సృజనాత్మకత చాలా అవసరం.[1]
తల్లిదండ్రులు తమ పిల్లల మనస్సులకే కాకుండా వారి హృదయాలకు బోధించాలి. వారు దేవుని గురించిన సత్యాలను మాత్రమే కాకుండా, దేవునితో సహవాసం కలిగి జీవించడాన్ని, ఆయనకు విధేయత చూపించడాన్ని, ఆచరణాత్మక అన్వయాలను కూడా బోధించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మాటలతోను, అలాగే జీవనశైలి ద్వారాను బోధించాలి. రెండూ అవసరమైనవే.
ఈ వాక్యభాగం సులభంగా కనిపించవచ్చు, కాని ఇది చాలా ముఖ్యమైనది. ఈ సత్యాలు, ఆజ్ఞలు వ్యక్తులకు, కుటుంబాలకు కావలసిన ఉద్దేశ్యాన్ని, మార్గాల్ని కలుగజేస్తాయి. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ దేవుణ్ణి బాగా ఎరిగి, అన్ని విషయాల్లో ఆయనకు పూర్తిగా విధేయులవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే, వారు తమ పిల్లలకు కూడా అదే నేర్పగలరు. తల్లిదండ్రులలో కూడా జీవితాంతం నేర్చుకొనే, విధేయత చూపే వైఖరి ఉండాలి. ఇది వారి పిల్లలకు మాదిరి, అలాగే దేవుని గురించి మరింత తెలుసుకోవాలనే ఆకాంక్షను వాళ్లలో కలుగజేస్తుంది.
► తల్లిదండ్రులు ప్రతిరోజు తమ పిల్లలకు క్రైస్తవ శిష్యత్వ తర్ఫీదునిచ్చే కొన్ని ఆచరణాత్మక మార్గాలు ఏవి?
కుటుంబం-ఇతరుల్ని ప్రేమించడానికి శిక్షణ స్థలం
► ఒక విద్యార్థి తరగతి కోసం 1 యోహాను 4:7-13, 19 చదవాలి.
ఈ వాక్యభాగంలోని ప్రధాన విషయం ప్రేమ. దేవుడు తన సంపూర్ణతలో ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి మనం ఒకనినొకడు ప్రేమించాలి. ఒకనినొకడు అంటే ఇందులో కుటుంబం కూడా భాగం. దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చిన కారణాలలో ఒకటి - మనం ఇతరులను ఎలా ప్రేమించాలో నేర్చుకోవడం. మనం మన కుటుంబీకుల్ని ప్రేమించడం నేర్చుకుంటున్నప్పుడు (అది కష్టంగా ఉన్నప్పటికీ), మనం దేవునివంటి వారమవుతాం - ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి! (వచనం 8).
కుటుంబ సభ్యులు - ఆత్మీయులైనా లేక భౌతిక కుటుంబమైనా- ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు, వారు దేవుని మూలంగా పుట్టారని తెలుస్తుంది (వచనం 7). వారు ఒకరినొకరు ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమ వారియందు సంపూర్ణమౌతుంది (వచనం 12).
దేవుడు మనం ఇతరుల్ని ప్రేమించాలని మాత్రమే ఆశించడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు (వచనాలు 9-11, 19). మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా యేసును పంపడం ద్వారా ఆయన మనల్ని ప్రేమించాడు (వచనం 10). ఆయన ప్రేమే, మనం ఇతరుల్ని ప్రేమించడానికి ప్రేరణ (వచనం 11).
మన కుటుంబాన్ని ప్రేమించడం కొందరికి సులభం, మరికొందరికి చాలా కష్టం, కానీ మనందరం దేవుని ఆజ్ఞకు విధేయులవ్వడానికి కావలసినదంతా ఉంది- అనగా దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా మనలో నిలిచియున్నాడు (వచనాలు 12-13).
దేవుడు మనల్ని ఒకరినొకరు ప్రేమించుకోమని పిలుస్తున్నాడు, ఇందులో మన తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, పిల్లలు ఉన్నారు. మన కుటుంబ సభ్యులను ప్రేమించడం అంటే వారు చేసే తప్పులను లేదా చెడు పనులను ఆమోదించడమని కాదు. వారిని జవాబుదారులుగా ఉంచకూడదని కాదు. మన కుటుంబ సభ్యులకు ఏది మంచిదో అదే మనం కోరుకుంటున్నామని, వారి మంచి కోసం మనల్ని మనం త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని దీని అర్థం.
[1]The Woman’s Study Bible, Thomas Nelson, Inc. 1995, 292
సమూహ చర్చ కోసం
► త్రిత్వంలో ఉన్న సంబంధాల్ని వివాహం ఎలా ప్రతిబింబిస్తుందో మీ మాటలలో వివరించండి.
► పాపం ద్వారా పాడైన వివాహా బంధాన్ని దేవుడు ఎలా బాగుచేశాడో చెప్పండి.
► దేవునికి విధేయత చూపడం, పాపం ద్వారా నాశనమైన దాన్ని ఎందుకు స్వస్థపరుస్తుందో, పునరుద్ధరిస్తుందో వివరించండి.
ప్రార్థన
కొద్ది సమయం తీసుకొని, మీ కుటుంబం కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థించండి. మీ కుటుంబం కోసం ప్రార్థించండి. బాధలు, వైఫల్యాలు, వేడుకలు మరియు ఆనందాలు గురించి ప్రార్థించండి. ద్వితీయోపదేశకాండము 6:4-9లోని మాటల్ని మీ సొంత మాటల్లో, సమర్పణ, విజ్ఞాపన ప్రార్థనగా చేయండి.
పాఠం అభ్యాసాలు
(1) ద్వితీయోపదేశకాండము 6:4-9ను కంఠస్తం చెయ్యండి. తరువాత క్లాసును మొదలుపెట్టే ముందు, కంఠస్తం చేసిన వాక్యభాగాన్ని రాయండి లేక చెప్పండి.
(2) ద్వితీయోపదేశకాండము 6:1-9లో, దేవుడు మన నుండి నాలుగు విషయాలను కోరుతున్నాడు. ఈ నాలుగు అంశాలలో మిమ్మల్ని మీరు ప్రార్థనాపూర్వకంగా, నిజాయితీగా మూల్యాంకనం చేసుకోండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.