జోనాథన్ ఎడ్వర్డ్స్ 1700లలో ఒక గొప్ప గౌరవం పొందిన సేవకుడుగాను, వేదాంతవేత్తగాను జీవించాడు. అతను మరియు అతని భార్య శారాకు పదకొండు మంది పిల్లలు. శారా ఒక గొప్ప భార్య మరియు గొప్ప తల్లి, ఆమె తన పిల్లల ప్రవర్తన విషయంలో గొప్ప ప్రభావం చూపింది. జోనాథన్ ఒక సమర్పణగల తండ్రి. “ప్రతి రాత్రి జోనాథన్ ఇంటికి వచ్చినప్పుడు, ఒక గంటపాటు కుటుంబంతో మాట్లాడి ఆ తర్వాత పిల్లల కోసం ప్రార్థించి వారిని దీవించేవాడని” మనకు చెప్పబడింది.”[1]
ఏ. ఈ. విన్ షిప్, 1800 చివరి కాలంలో బోధించిన విద్యావేత్త జోనాథన్ మరియు శారా ఎడ్వర్డ్స్ కుటుంబ వారసత్వాన్ని పరిశీలించాడు, జోనాథన్ చనిపోయిన తర్వాత, 150 సంవత్సరాల తరాల గురించి పరిశోధించాడు. ఎడ్వర్డ్ కుటుంబ తరాల విషయంలో ఇవి కనుగొన్నాడు:
1 అమెరికా ఉప-అధ్యక్షుడు
1 న్యాయ పాఠశాల డీన్
1 వైద్య పాఠశాల డీన్
3 అమెరికా సినేటర్లు
3 గవర్నలు
3 మేయర్లు
13 కళాశాల పెసిడెంట్లు
30 న్యాయమూర్తులు
60 వైద్యులు
65 ప్రొఫెసర్లు
75 మిలటరీ అధికారులు
80 ప్రభుత్వ అధికారులు
100 న్యాయవాదులు
100 పాస్టర్లు/ సంఘ నాయకులు
285 కళాశాల పట్టభద్రులు
ఇంత గొప్ప ఫలవంతమైన వారసత్వం ఎలా సాధ్యమైంది? ఎడ్వర్డ్స్ దంపతుల పదకొండు మంది పిల్లల జీవితాల్లో దేనిని పెంచితే, వారి వారసులు వారి నిజాయితీ, బాధ్యత, నాయకత్వం, సమాజానికి సేవ వంటి వాటితో ప్రసిద్ధి చెందారు? నిస్సందేహంగా, జొనాథన్ ఒక దైవభీతిగల, శ్రద్ధగల తండ్రి, అతను తన పిల్లలకు ఆదర్శప్రాయంగా ఉన్నాడు.
తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు, భవిష్యత్తు తరాలపై దేవునితో తమ పిల్లలకున్న సంబంధంపై ప్రభావం చూపుతాయని బైబిల్ చెబుతుంది.
► విద్యార్థులు తరగతి కోసం ద్వితీయోపదేశకాండము 5:9-10 మరియు ద్వితీయోపదేశకాండము 7:9 చదవాలి.
ఒకరి తల్లిదండ్రులు ఏ నిర్ణయాలు తీసుకున్నారన్న దానితో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరికి ప్రభువును సేవించే అవకాశం ఉంది, తమ పిల్లలకు దైవికమైన తల్లిదండ్రులుగా ఉండే అవకాశం ఉంది. మీరు మీ వారసులు నమ్మకంగా ప్రభువును సేవిస్తూ, ఆయన కృపా ఆశీర్వాదాలను అనుభవించవచ్చు. దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తూ, మీ పిల్లలను ఆయన అవగాహనలోకి నడిపించే తల్లిదండ్రులుగా ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారా?
[1]ఈ ఉల్లేఖనం మరియు ఈ భాగానికి సంబంధించిన సమాచారం Larry Ballard, “Multigenerational Legacies – the Story of Jonathan Edwards,” YWAM Family Ministries, July 1, 2017 నుండి వచ్చింది. https://www.ywam-fmi.org/news/multigenerational-legacies-the-story-of-jonathan-edwards/ on January 11, 2021 నుండి తీసుకోబడింది.
పిల్లవాడికి దేవునిని పరిచయం చేయడం
దేవుడు యాకోబుతో మొదటిగా మాట్లాడినప్పుడు, “నేను విశ్వానికి దేవుడను,” లేక “నేను లోకాన్ని సృష్టించిన దేవుడను,” అని ఆయన చెప్పలేదు, నిజానికి ఈ రెండు ప్రకటనలు వాస్తవాలే. ఆయన ఇలా చెప్పాడు, “నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను…” (ఆదికాండము 28:13). యాకోబు దేవునితో తన సంబంధాన్ని, ఆయన గురించి ఏమాత్రం తెలియకుండానే ప్రారంభించలేదు. తన తండ్రి, తాతల బోధల ద్వారా అతనికి దేవుని గురించి తెలుసు.
ఆబ్రహాము దేవుడిని ఆరాధించే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించాడు. ఆబ్రహామును చూసి, వారంతట వారికి దేవుడితో అనుభవం కలగక ముందే, చాలా మందికి దేవుడిపై నమ్మకం కలిగింది. ఆబ్రహాము సేవకుడైన ఎలీయెజెరు ప్రార్థన చేసినప్పుడు, అతడు తన యజమానియైన ఆబ్రహాము దేవుడైన యెహోవాను ప్రార్థించాడు (ఆదికాండము 24:12).
తర్వాత కాలంలో, దేవుడు అనేకసార్లు "అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు"గా గుర్తించబడ్డాడు (ఉదాహరణకు, నిర్గమకాండము 3:15). తర్వాతి తరంవాడైన యోసేపు, దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాలను గుర్తు చేశాడు (ఆదికాండము 50:24). గత తరాలకు దేవుడు చేసిన వాగ్దానాల కారణంగా తన కుటుంబం దేవునికి నమ్మకంగా ఉంటుందని యోసేపు ఆశించాడు.
► దేవుడు తననుతాను గుర్తించుకున్న విధానం ద్వారా, ప్రజలు దేవుణ్ణి తెలుసుకున్న విధానం గురించి మనం ఏం నేర్చుకోగలం?
సహజంగా ప్రజలు, కేవలం దేవుని గురించిన సిద్ధాంతాలు మాత్రమే విని దేవునితో సహవాసం చేయరు. దేవునితో సహవాసం చేసే వారి జీవితాల్ని పరిశీలిస్తూ దేవుని గురించి నేర్చుకుంటారు. గొప్ప ఆత్మీయ ప్రభావం దైవభక్తిగల తల్లిదండ్రుల నుండి వస్తుంది.
పరిగణలోకి తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి: మీ జీవితాన్ని పరిశీలించడం ద్వారా మీ పిల్లలు దేవుని గురించి ఏం నేర్చుకుంటారు? మీ పిల్లలు, దేవునితో మీకున్న సంబంధాన్ని చూసి దేవునికి నమ్మకంగా ఉండాలని అనుకుంటారా?
తల్లిదండ్రుల బాధ్యత
దేవుడు తల్లిదండ్రులకు గొప్ప బాధ్యత అనుగ్రహించాడు. “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు” (సామెతలు 22:6).
పిల్లలు దేవుణ్ణి అనుసరించే విధంగా తల్లిదండ్రులు ఉద్దేశ్యపూర్వకంగా వారికి బోధించాలి. పిల్లల్ని నడిపిస్తూ వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను తల్లిదండ్రులు తప్పక అర్థం చేసుకోవాలి.
పిల్లలకు శిక్షణ ఇచ్చే బాధ్యత ముందుగా తల్లిదండ్రులదే, సమాజానిది, పాఠశాలది లేదా సంఘానిది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు సంఘంలో ఉండేలా చూసుకోవాలి, కానీ చర్చి తమ పిల్లలకు శిక్షణ ఇస్తుందని వారు భావించకూడదు.
► ఒక విద్యార్థి తరగతి కోసం ఎఫెసీయులకు 6:1-4 చదవాలి. తండ్రులు ఏమి చేయవలసి ఉంది?
పిల్లలకు శిక్షణ ఇవ్వడం కేవలం తల్లి బాధ్యత కాదు. కుటుంబాన్ని ఆత్మీయంగా సంరక్షించవలసిన బాధ్యత తుదకు తండ్రిపై ఉంది.
పిల్లల జీవితానికి అవసరమైన శిక్షణ ఇవ్వడం తల్లిదండ్రుల గొప్ప బాధ్యత. జీవితానికి అవసరమైన శిక్షణ అంటే వృత్తి కోసం ఇచ్చే శిక్షణ కాదు; దేవునికి ఇష్టమైన నీతి జీవితాన్ని గడపడానికి అవసరమయ్యే శిక్షణ అని అర్థం. తల్లిదండ్రులు, పిల్లలు నిదానంగా మారతారులే అనే ఆలోచనతో వారిని పాపంలో కొనసాగనియ్యకూడదు.
లోకం అందించే తప్పుడు తత్వశాస్త్రాలు నేర్చుకోకూడదని లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది.
► ఒక విద్యార్థి తరగతి కోసం కొలొస్స 2:8 చదవాలి.
మనం తప్పుడు జ్ఞానాన్ని నమ్మడం ద్వారా, తప్పుడు జీవనశైలిని అంగీకరించడం ద్వారా మోసపోతామని లేఖనం హెచ్చరిస్తుంది. క్రీస్తును అనుసరించకుండా, లోక ఆలోచనల్ని అనుసరించాలని బోధిస్తూ లోకం మన పిల్లల్ని మోసం చేస్తుంది.
పిల్లలు తమ విద్యను క్రైస్తవ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుండి నేర్చుకోవడం మంచిది. క్రైస్తవ పాఠశాలలు అందుబాటులోలేని ప్రాంతాల్లో, పిల్లలకు జీవితం గురించిన మంచి దృక్కోణాన్ని పొందుకునేలా తల్లిదండ్రులు చూడాలి. లౌకిక విద్య పిల్లలకు నాస్తికత్వం, పరిణామ క్రమం మరియు మానవత్వం గురించి బోధిస్తుంది. పిల్లలు ముఖ్యంగా అబద్ధ బోధలకు లోనైపోతారు (ఎఫెసీయులకు 4:14), తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పక కాపాడుకోవాలి.
తప్పుడు తత్వజ్ఞానాల నుండి ప్రజలను కాపాడగలిగే సిధ్ధాంతాలను ఎలా బోధించాలో సేవకులు నేర్చుకోవాలి. పిల్లలను సత్యంలో స్థిరపరచడానికి సహాయపడే సమాచారాన్ని, సేవకులు బోధకులు కుటుంబాలకు అందించాలి.
ఆరంభ శిక్షణ
► ఒకరు Children Are Wet Cement (పిల్లలు తడి సిమెంట్ లాంటి వాళ్ళు) అనే పుస్తకాన్ని రాశారు. ఈ పేరుకు అర్థం ఏమై ఉండవచ్చని మీరు భావిస్తున్నారు?
పిల్లలు జీవితం గురించి నేర్చుకుని, చిన్నప్పుడే ఏది ప్రాముఖ్యమో నిర్ణయించుకుంటారని తల్లిందండ్రులు గ్రహించాలి. చిన్నతనంలోనే పిల్లల గుణం రూపొందించబడుతుంది.
పిల్లలు కౌమార దశలోకి వెళ్లకముందే క్రమశిక్షణ గురించిన బోధ ఎక్కువగా చెయ్యాలి. బైబిలు సాహిత్య లక్ష్యాలు, స్వభావ లక్ష్యాలు, వ్యక్తిగత, సాంఘిక, ఆత్మీయ అలవాట్లు కౌమార దశకు ముందే వృద్ధిచెందాలి.
ఐదేళ్లు రాకముందే, ఒక పిల్లవాడు ప్రజలు ఒకరితో ఒకరు ఎలా సంబంధం పెట్టుకుంటారు మరియు ఎలాంటి ప్రవర్తనతో తాను కోరుకున్న ఫలితాలు పొందుతాడో అనే విషయాల ప్రాథమిక అంశాలను నేర్చుకుంటాడు. అతను న్యాయం ఆశించవచ్చా లేదా మరియు శిక్షలు, బహుమతులు స్థిరంగా ఉంటాయా లేదా అని తెలుసుకుంటాడు. తనని ప్రేమిస్తున్నారో లేదో అతనికి తెలుసు. తన భావాలు ఇతరులకు ముఖ్యమైనవో కాదో అతనికి తెలుసు. తప్పు చేసినప్పుడు తనని క్షమించగలరో లేదో అతనికి తెలుసు. తన తప్పులు, పాపాలను ఒప్పుకోవాలా లేక దాచాలా అని అతను నేర్చుకుంటాడు. అధికారం ఉన్న వ్యక్తులను నమ్మి, తన పట్ల శ్రద్ధ తీసుకుంటారని మరియు వారి వాగ్దానాలను నిలబెట్టుకుంటారని నమ్మవచ్చా లేదా అని అతను నిర్ణయించుకుంటాడు.
పిల్లలు తమ తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా నేర్పించాలని ప్రయత్నించనప్పుడు కూడా, వారి మాటలు, చేతల నుండి నేర్చుకుంటారు (ఎఫెసీయులకు 5:1). పెద్దల జీవనశైలుల ద్వారా జీవితమంటే ఏమిటో పిల్లలు నేర్చుకుంటారు. పెద్దలకు ఏది ముఖ్యమో దానిని చూసి, పిల్లలు కూడా అదే ముఖ్యమని నేర్చుకుంటారు. ఇతరులతో ఎలా ఉండాలో, పరిస్థితులకు ఎలా స్పందించాలో, బాధ్యతలు ఎలా నిర్వహించాలో పెద్దలను చూసి నేర్చుకుంటారు. ఈ విద్య, బిడ్డ జన్మించినప్పటినుండే ప్రారంభమౌతుంది.
పిల్లలు ఏం చెయ్యాలో వారికి నేర్పించినప్పుడే బోధిస్తున్నామని కొంతమంది తల్లిదండ్రులు భావిస్తారు. అయితే, పిల్లలు తల్లిదండ్రులను పరిశీలించిన ప్రతిసారి కూడా వారు పిల్లలకు బోధిస్తున్నారు.
ఒక అబ్బాయి, పెద్దలను చూసి ఒత్తిళ్ళలో ఎలా స్పందించాలో నేర్చుకుంటాడు. అపరిచితులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటాడు. తక్కువ స్థాయిలో ఉన్నవారితో ఎలా ఉండాలో నేర్చుకుంటాడు. విమర్శల సమయంలో ఎలా స్పందించాలో నేర్చుకుంటాడు. ఇతరుల అవసరాలకు ఎలా స్పందించాలో నేర్చుకుంటాడు. తల్లిదండ్రులు పిల్లలకు బోధించట్లేదు అని భావించినప్పుడు కూడా ఎల్లప్పుడు పిల్లలకు బోధిస్తారు.
ఒక పిల్లవాడిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటే, అతను తన తప్పులను దాచడం, సాకులు చెప్పడం, మరియు ఇతరులను నిందించడం నేర్చుకుంటాడు. అతను పెద్దవాడైనప్పుడు ఖండిస్తూ, వేషధారణతో కూడిన రహస్య జీవితాన్ని జీవిస్తాడు. ఇంట్లో తరచు సంఘర్షణలు ఉంటే, అతడు పిరికితనంతో ఉంటాడు లేక కోపంతో మండిపడతాడు. కుటుంబ సభ్యులు అతడిని ఎగతాళి చేస్తే, అతను ఇతరులతో కలవకుండా దూరంగా ఉంటాడు లేదా ఇతరులను వేధించేవాడిగా మారతాడు. ఒకవేళ తన తల్లిదండ్రులు ఎల్లప్పుడు అతన్ని అవమానిస్తుంటే, అపరాధ భావంతోనే జీవిస్తాడు, దేవుడు నన్ను ఎన్నడు అంగీకరించడనే భావనలో బ్రతుకుతాడు. తల్లిదండ్రులు ఆశించే జీవితాన్ని జీవించలేనప్పుడు, తిరుగుబాటు చేస్తాడు మరియు ఇతర తిరుగుబాటు చేసే వారితో మమేకమై దాన్నే ఒక కుటుంబంగా భావిస్తాడు.
ఒకవేళ ప్రజలు అతనితో సహనంగా ఉంటే, ఇతరులతో సహనంగా ఉండడం నేర్చుకుంటాడు. ప్రజలు అతన్ని ప్రోత్సహిస్తే, ప్రయత్నించాలనే నమ్మకంతో ఉంటాడు. అతన్ని మెచ్చుకుంటే, తాను విలువైనవాడనని భావించి, ఇతరులను మెచ్చుకుంటాడు. అతడు న్యాయాన్ని చూసినప్పుడు, న్యాయంగా ఉండాలనుకుంటాడు.
తల్లిదండ్రులు సూత్రాల్ని ఉల్లంఘిస్తూ, విధేయత చూపాలని వాళ్ళ పిల్లవానికి చెబితే, ఒకరోజు పెద్దవాడైనప్పుడు తాను కూడా సూత్రాల్ని ఉల్లంఘించగలనని అనుకుంటాడు. తల్లిదండ్రులు ఇతరులపట్ల కనికరం చూపనప్పుడు, పిల్లవాడు కూడా బలవంతుడై ఇతరుల పట్ల కనికరం చూపకూడదని అనుకుంటాడు. పిల్లల సమస్యలు, అవసరాలు అంత ప్రాముఖ్యం కాదని తల్లిదండ్రులు భావిస్తే, పిల్లవాడు పెద్దయ్యాక తనను మాత్రమే పట్టించుకుంటూ ఇతరులను విస్మరించగలనని భావిస్తాడు.
తల్లిదండ్రులు ఎలప్పుడు దేవుని పట్ల సమర్పణను చూపిస్తూ ఉండాలి. తమ తల్లిదండ్రులు దేవుని వాక్యానికి లోబడతారని పిల్లలకు తెలియాలి. దేవుని అధికారం కంటే తమ ఇష్టమే గొప్పదని తల్లిదండ్రులు చూపించినప్పుడు, పిల్లలు కూడా అదే విధంగా జీవించాలని చూస్తారు. తల్లిదండ్రులు ఎల్లప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు పరిగణించగలసిన కారణాలను, విషయాలను పిల్లలకు వివరించాలి. ఇది, నిర్ణయాలు ఎలా తీసుకోవాలో పిల్లవాడికి నేర్పుతుంది.
తల్లిదండ్రులు పిల్లలతో ఆటలు ఆడినప్పుడు వారు నేర్చుకుంటారు. వారు న్యాయాన్ని, పరిగణలోకి తీసుకోవలసిన విషయాల్ని, ఇతరులకు స్పందించవలసిన విధానాన్ని నేర్చుకుంటారు. ఆటలు పిల్లల నైపుణ్యాల్ని మెరుగుపరుస్తాయి. కుటుంబంలో ఆడే ఆటల ఉద్దేశ్యం నేర్చుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడపడం. కుటుంబ ఆటల్లో పోటీతత్వం మంచిదే కాని ఇతరులను అధిగమించాలనే ఉద్దేశ్యంతో ఉండకూడదు, ఒకవేళ ఆ విధంగా ఉంటే గెలిచినవాడు ఆధిపత్య భావనను ఆనందిస్తాడు. ఆటలు ఆడేడప్పుడు, “అందరు ఆటను ఆనందిస్తున్నారా?” అనే ప్రశ్నను పరిగణలోనికి తీసుకోవాలి. కేవలం గెలిచినవాడు మాత్రమే ఆటను ఆనందిస్తే, అక్కడ తప్పుడు ఉద్దేశ్యం పని చేస్తుంది. ఆటలో ఆడేవారికి కోపం వస్తుంటే లేక నిరుత్సాహపడుతుంటే, ఆటలో మంచి ఉద్దేశ్యం లేదని అర్థం.
తల్లిదండ్రులు పిల్లల కార్యాచరణలకు సమయం వెచ్చించినప్పుడు పిల్లలు ఎంత విలువైనవారో చూపించగలరు. తల్లిదండ్రులు పిల్లలకు తమ స్కూల్ ప్రాజెక్టుల్లో, ఆట బొమ్మలను తయారు చేయడంలో లేక బాగు చేయడంలో సహాయం చెయ్యాలి, ఇంట్లో పిల్లలకు ప్రత్యేక స్థలం కల్పించాలి, వారి కథలు జోకులు వినాలి మరియు బాధలో ఉన్నప్పుడు ఆదరించాలి.
తల్లిదండ్రులు తమ పిల్లల ఉపాధ్యాయులను కచ్చితంగా తెలుసుకోవాలి. పిల్లల చదువు గురించి తెలుసుకోవడానికి ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశాలకు వారు హాజరు కావాలి. వీలైతే, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వెళ్లాలి. ఒకవేళ తండ్రి వెళ్లకపోతే, అతనికి తన పిల్లల కన్నా వేరే విషయాలు ముఖ్యమని అనిపిస్తుంది.పిల్లల మార్కుల గురించి, పాఠశాలలో జరిగే విషయాల గురించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడగాలి. తల్లిదండ్రులకు ఆసక్తి ఉందని తెలిస్తే, ఉపాధ్యాయులు పిల్లల పట్ల మరింత శ్రద్ధ పెట్టి, వారితో దురుసుగా ప్రవర్తించడం మానేస్తారు.
ఒక కుటుంబంగా కలిసి నివసించే వ్యక్తులు ఒకరినొకరు బాగా తెలుసుకుంటారు. పరస్పర అవసరాలు, లోపాలు అర్థం చేసుకుంటారు. పరస్పరం ప్రేమ చూపించుకుంటారు, లోకంలో ఇతరులపై చూపించే ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమించగలుగుతారు. ఒకవేళ పరస్పరం ప్రేమ చూపకపోయినట్లయితే, ఇతరులకంటే ఎక్కువగా ఒకరినొకరు బాధించుకుంటారు. కొంతమంది అపరిచితులకంటే కుటుంబ సభ్యుల్ని చులకనగా చూస్తారు. క్రైస్తవ కుటుంబంలో సహనం, క్షమాపణ, శ్రద్ధ, కనికరం ఉండాలి.
బాల కార్మికులు
చిన్నపిల్లవాడికి ప్రతిరోజు ఆడుకునే సమయం ఉండాలి, అలాగే విశ్రాంతి తీసుకునే సమయం ఉండాలి. విశ్రాంతి తీసుకోవడానికి, ఆలోచనా శక్తిని ఉపయోగించడానికి, పుస్తకాలు చదవడానికి, ఏదొక బొమ్మ తయారు చేయడానికి లేక నిర్మించడానికి, ప్రకృతిని ఆనందించడానికి సమయం ఉండాలి. ఆహారం సమకూర్చుకోవడానికి లేక మరేదైనా చేయడానికి కుటుంబమంతా కలిసి పనిచేసే నేపథ్యాల్లో, పిల్లలు కుటుంబ పనుల్లో సహాయం చేయడం మంచిది, అయితే తల్లిదండ్రులు ఇతర విలువలు కూడా గుర్తుంచుకోవాలి.
పిల్లలు, ఎక్కువ గంటలు పని చేయడం వల్ల అది కేవలం శారీరకంగా కష్టమనిపించడమే కాకుండా అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తుంటే అది వారికి విసుగ్గా అనిపిస్తుంది. కల్పనాశక్తిని ఉపయోగించి చేసే పనులకు సమయం కేటాయించాలనుకుంటాడు. పిల్లవాడు తినడానికి, నిద్రపోవడానికి మాత్రమే తన ఖాళీ సమయాన్ని వెచ్చించి, మిగిలిన సమయమంతా అధికంగా పనిచేయడం చాలా విచారకరం. [1]
కొన్ని కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాయి గనుక పిల్లలు పనిచేస్తే ఆ ఆదాయం ఉపయోగపడుతుందని అనుకుంటారు. అయితే, వారి పిల్లలను చదివించకపోతే, వారి కుటుంబ పరిస్థితి ఎన్నటికి మారదు. పిల్లవాడు స్కూల్ కు వెళ్లకుండా పనిచేసుకుంటే, అతడు జీవిత కాలమంతా తక్కువ జీతానికే పని చేయవలసి వస్తుంది. మంచి మంచి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు అతనికి అందుబాటులో ఉండవు.
కొంతమంది ప్రజలు తమ సొంత పిల్లలకు విద్యను అందిస్తారు, కానీ పేద కుటుంబాల పిల్లలను పొలాలలో లేదా ఇంటి పనులలో లేదా వీధి వ్యాపారంలో ఎక్కువ గంటలు పనిలో పెట్టుకుని తప్పుగా ప్రయోజనం పొందడానికి సిద్ధంగా ఉంటారు, వారికి విద్య అందడం లేదని తెలిసినా కూడా అలాగే చేస్తారు. క్రైస్తవులు తమ సమాజంలోని కుటుంబాల కోసం మెరుగైన పరిష్కారాలను కనుగొనడానికి కలిసి పనిచేయాలి.
పిల్లలకు ఏదైనా పనిలో విజయం సాధించాలనే భావన కలిగితే, వారు ఆ పనిని ఆనందిస్తారు. అలాగే, తల్లిదండ్రులు ప్రోత్సహించే విధంగా ఉంటే, వారితో కలిసి పని చేయడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు. తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాలపై వాస్తవిక అంచనాలను కలిగి ఉండాలి. పిల్లలు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ ఉండేందుకు వీలుగా, నిర్మాణాత్మకమైన సలహాలను సానుకూల దృక్పథంతో ఇవ్వాలి.
పిల్లలు నమ్మదగినవారుగా, శ్రద్ధగలవారుగా ఉండడానికి రోజువారి బాధ్యతలు అప్పగించడం మంచిది. పిల్లలు పనిచేస్తున్నప్పుడు వారిలో కనిపించే మంచి గుణాలను అంటే చొరవ తీసుకునే విధానం, శ్రద్ధ, జాగ్రత్త, పట్టుదల వంటి వాటిని తల్లిదండ్రులు మెచ్చుకోవాలి. దేవుని వాక్యం చెప్పే పని సూత్రాలు వారికి బోధించాలి.
పిల్లలు సొంతంగా డబ్బు సంపాదించుకునే అవకాశముండడం మంచిది, వారు దానిని ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించుకోగలరు. వారి పని విలువ తెలుసుకుంటారు, మంచి ఫలితాల కోసం డబ్బు ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటారు. డబ్బు సంపాదించడానికి పని చేసే పిల్లవాడు వాటిని పూర్తిగా చాక్లెట్లు కొనుక్కోవడానికి వాడకూడదని గ్రహించాలి; అతడు ఎక్కువకాలం ఉంచుకోగలిగే వాటిని కొనుక్కోవాలి. డబ్బును దైవికమైన మార్గంలో ఉపయోగించేలాగా తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణ ఇవ్వాలి.
పిల్లలకు మరియు కౌమారదశలో ఉన్నవారికి వారి సామర్థ్యాల్ని పెంచే పనుల గురించి పరిచయం చేయడం మంచిది. రకరకాల నైపుణ్యాలుగలవారితో పనిచేసే అవకాశం వస్తే అది యౌవనులకు చాలామంచిది. వారు దాని ద్వారా నేర్చుకుంటారు.
► మీ సమాజంలో ఎలాంటి బాల కార్మిక పరిస్థితులు ఉన్నాయి? తల్లిదండ్రులు ఏమి చేయాలి? సంఘం ఏమి చేయాలి?
“ఒక వ్యక్తికి చిన్నవారి యెడల సానుభూతి లేనప్పుడు, భూలోకంలో అతని వల్ల ప్రయోజనం లేనట్లే.”
- George MacDonald
ఉద్దేశ్యపూర్వక పిల్లల అభివృద్ధి
తమ పిల్లల ప్రవర్తనను పెంపొందించే విషయంలో తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారు. మ్యాట్ మరియు మేరి అనే ఒక క్రైస్తవ దంపతులు తమ పిల్లల్లో పెంపొందించుకోవాలని ఆశపడిన గుణాల జాబితా చేశారు. జాబితా చేసిన తర్వాత, వారు దాన్ని సమీక్షించి, ఈ ప్రతి గుణాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి పనులు చేయాలో ప్రణాళిక రూపొందించారు. ప్రక్రియ త్వరితంగా ఉండదు. ఈ గుణాలు వెంటనే కనిపించవు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే సంవత్సరాలన్నిటిలో స్థిరంగా, ఉద్దేశ్యపూర్వకంగా ఉండాలి. క్రింద ఫ్రైడ్మెన్ కొన్ని గుణాలు జాబితా చేశాడు.[1] ఈ జాబితాలో ఇతర గుణాలు కూడా జోడించబడ్డాయి.
శ్రేణి
18వ ఏళ్ల వయసులోపు ఉండవలసిన లక్షణాలు
ఆధ్యాత్మికత
వారు దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారని, వారికి నిత్యత్వపు విలువ ఉందని తెలుసుకోండి.
వారు పాపులని, వారికి రక్షకుడు అవసరమని తెలుసుకోండి.
క్రీస్తుకు సమర్పించుకోవాలి
అనుదినం భక్తి జీవితం గడపాలి
ఆత్మీయ వరాలు ఉపయోగించాలి
క్రైస్తవ పరిచర్య కోసం సిద్ధపడాలి
వివాహం వరకు లైంగిక పవిత్రతతో ఉండాలి
బైబిలు సాహిత్యం
మూల క్రైస్తవ సిద్ధాంతాలు అర్థం చేసుకోవాలి
ముఖ్య లేఖన వచనాలు కంఠస్తం చేయాలి (300 వచనాలు)
బైబిలు కథలు తెలుసుకోవాలి
బైబిలు పుస్తకాలు తెలుసుకోవాలి
పది ఆజ్ఞలు, కొండమీద ప్రసంగం తెలుసుకోవాలి
బైబిలు అంతటిలో పాపం మరియు రక్షణ గురించి సువార్త విషయాలు చూడాలి.
బైబిలు దృష్టికోణం
విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి
జీవితంలో వచ్చే పెద్ద పెద్ద ప్రశ్నలకు బైబిలు ఆధారంగా సమాధానాలు ఇవ్వగలగాలి.
ప్రపంచ మతాలు, తప్పుడు బోధల్లో క్రైస్తవ్యం ఎందుకు ప్రత్యేకమైందో గ్రహించాలి.
జ్ఞానం (విద్య)
వీలైనంతవరకు క్రైస్తవ విద్యను అభ్యసించాలి
క్రమం తప్పకుండా చదవడం, పాడ్‌కాస్ట్‌లు లేదా విద్యాపరమైన వీడియోలు వినడం అలవాటు చేసుకోవాలి
వారి బహుమతులు, పిలుపులను బట్టి కళాశాల విద్యను లేదా వృత్తిపరమైన శిక్షణను పొందాలి
ప్రవర్తన
ఆశా-నిగ్రహాన్ని పాటించాలి
విధేయతతో ఉండాలి-క్షమాపణ చెప్పే విధంగా ఉండాలి
అధికారంలో ఉన్నవారి యెడల గౌరవం చూపించాలి.
దయగా మాట్లాడాలి
సమయాన్ని తెలివిగా ఉపయోగించాలి- సోషల్ మీడియా, వినోదం మొదలగువాటి విషయంలో క్రమశిక్షణతో ఉండాలి
డబ్బు & సేవ
పేదల పట్ల దేవుని శ్రద్ధను అర్థం చేసుకోవాలి
దాతృత్వంగా ఉండాలి, పేదలకు సేవ చేయాలి
దశమ భాగం ఇవ్వాలి మరియు పొదుపు చేసుకోవాలి
ఆర్ధిక బడ్జెట్ ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి
సంబంధాలు
తోబుట్టువులను ప్రేమించాలి, కలిసిమెలిసి ఉండాలి
సమాజంలో సాధారణ మర్యాద పాటించాలి
నమ్మకమైన మిత్రుడుగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి
పెద్దలతో గౌరవంగా, నమ్మకంతో మాట్లాడగలగాలి
ఆరోగ్యం
మంచి పరిశుభ్రత పాటించాలి
ప్రతిరోజు వ్యాయామం చేయాలి
వారికి వడ్డించిన ఆహారం తినాలి
సాధ్యమైనప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి
నైపుణ్యాలు
దేవుడు వారికి ఇచ్చిన వరాలు అభివృద్ధి చేసుకోవాలి
స్థిరమైన అభ్యాసం ద్వారా క్రమశిక్షణతో తమ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి
ఈ గుణాలు జాబితా చేసిన తర్వాత అతడు అతని భార్య ఏమి చేశారో మాట్ ఫ్రైడ్మెన్ వివరించాడు.
ఒక పేపరులో పైన చెప్పినవాటిని [గుణాలు] రాసిన తర్వాత, పేపరు మధ్యలో ఒక గీత గీసి, “ఇప్పుడు మనం ఏం చెయ్యాలో[మన పిల్లల్లో ఈ గుణాలు పెంపొందించడానికి మనం వంతు ఏం చెయ్యాలో]?” అని మమ్మును మేము ప్రశ్నించుకున్నాం. ఆ పేపరు యెడమ ప్రక్క, [మన]తల్లిదండ్రుల బాధ్యతలు పెర్కొన్నాం.[2]
ఇది ఒక గొప్ప బాధ్యతగా కనిపించినట్లయితే, దేవుడు మన పిల్లలను శిష్యులుగా చేయడానికి 16-18 ఏళ్ళు ఇచ్చాడని గుర్తుంచుకోండి. ఇవి చాలా ప్రాముఖ్యం:
1. శిష్యత్వ ప్రణాళిక అమలు చేయాలి.
2. అనుదిన ఆహారం మరియు కొద్ది నిమిషాలు నిర్మాణాత్మకమైన బోధన/శిక్షణ వంటి కుటుంబ ఆచారాలు ఏర్పాటు చేయాలి.
3. శిష్యత్వాన్ని దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని, వారికి బోధించడానికి శిక్షణ ఇవ్వడానికి అనేక అవకాశాలు ఉపయోగించాలి.
4. మీ పిల్లల గురించి ఎల్లప్పుడు దేవుని వాక్యాన్ని ప్రార్థించాలి.
5. విఫలమైనప్పటికీ ఎన్నడు విడిచిపెట్టొద్దు
► పైన ఇచ్చిన చార్టులో నుండి కొన్ని విషయాలు ఎంపిక చేసుకుని, ఆ లక్ష్యాలు చేరుకోవడానికి తల్లిదండ్రులు ఉద్దేశ్యపూర్వకంగా ఏం చేయగలరో వివరించండి.
[1]Matt Friedeman, Discipleship in the Home, (Wilmore: Francis Asbury Society, 2010), 31-33.
► కొన్నిసార్లు ఒక వ్యక్తి, “నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అందుకు నా అనుభవాలే కారణం” అని చెబుతుంటారు. మరో విధంగా చెప్పాలంటే, “ఒక వ్యక్తి తన పరిస్థితుల ద్వారా వచ్చిన ఫలితమే.” ఈ మాటలు వాస్తవమేనా?
మానవులు దేవుని పోలికెలో సృజించబడ్డారు. ప్రజలు ఎంపికలు చేసుకుంటారుగాని పరిస్థితుల ద్వారా లేక ప్రవృత్తి ద్వారా నడిపించబడరు. లేఖనమంతటా, ప్రజలు చెడును విసర్జించి మంచిని ఎంపిక చేసుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు.[1] ప్రజలు తీసుకున్న నిర్ణయాల్ని బట్టి దేవుడు తీర్పుతీరుస్తాడు.
మన పర్యావరణం, మన అనుభవాలు మనల్ని ప్రభావితం చేస్తాయి, కాని మనల్ని నడిపించవు, ఎందుకంటే దేవుని స్వరూపంలో సృజించబడిన మానవులముగా మనం నిర్ణయాలు తీసుకుంటాం. అంటే, ఒక పిల్లవాడు తాను పెరిగిన పర్యావరణానికి, కుటుంబానికి భిన్నంగా బహుశా నిర్ణయాలు తీసుకుంటాడు. సహజంగా పాపభరితమైన అన్యుల కుటుంబంలో నుండి వచ్చిన పిల్లవాడు బహుశా మారుమనస్సు పొంది దేవుని కోసం జీవిస్తాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్లవాడు బహుశా దేవుణ్ణి అనుసరించకూడదని నిర్ణయించుకుంటాడు.
ప్రజలు నిజమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వారు పరిపూర్ణ స్వేచ్ఛాపరులు కాదు. మనం పాప స్వభావంతో జన్మించామని బైబిల్ బోధిస్తుంది (కీర్తన 51:5, కీర్తన 58:3). మానవులు అధికారాన్ని ఎదురిస్తారు, తమ సొంత దిశను వెదుక్కుంటారు, శోధనకు గురౌతారు, ఇతరుల్ని మోసం చేస్తారు మరియు స్వార్థంగా ఉండాలనే స్వాభావిక ధోరణితో ఉంటారు (ఎఫెసీయులకు 2:1-3). పిల్లలు ఏ దిశలోనైన నడిపించబడడానికి ఎదురుచూస్తూ తటస్థంగా ఉండరు. పిల్లలు తమ సొంత కోరికలు తీర్చుకోవడానికి అబద్ధాలు చెబుతారు, తమకు కావలసినది పొందుకోవడానికి అవిధేయత చూపుతారు. అంతేకాదు, సాతాను వారిని మోసం చేస్తాడు, శోధిస్తాడని మనకు తెలుసు (ఎఫెసీయులకు 2:2, ప్రకటన 12:9).
పిల్లల్ని సరైన మార్గంలో నడిపించడానికి కేవలం సూచనలు ఇస్తే చాలదని తల్లిదండ్రులు తప్పక గ్రహించాలి. ఆత్మీయ పోరాటం ఉంది (గలతీయులకు 5:17). దేవుని ఆత్మ పిల్లల్ని ప్రభావితం చేసి, వారిని నడిపించునట్లుగా తల్లిదండ్రులు ప్రార్థించాలి. తల్లిదండ్రులు జ్ఞానం కోసం మరియు ఆత్మీయతకు ఆదర్శంగా నిలబడే బలం కోసం దేవుని మీద ఆధారపడాలి. తమ పిల్లలు మారుమనస్సు పొందాలని, చిన్నతనంలోనే ఆత్మీయంగా తిరిగి జన్మించాలని తల్లిదండ్రులు నిరంతరం ప్రార్థించాలి.
పిల్లవాడు మారుమనసుపొందినప్పటికీ, పిల్లవాడు పరిణతిచెందిన క్రైస్తవుడుగా ఉండాలని తల్లిదండ్రులు ఆశించకూడదు. అతని వైఖరులు, అనుభూతులు స్థిరంగా ఉండవు. కొన్నిసార్లు అతడు శోధనలో పడిపోతాడు. పిల్లవాడు సరైన పని చేయాలనే కోరికను చూపించినంత కాలం, క్రైస్తవునిగా జీవించే విషయంలో నీవు విఫలమౌతున్నావు అని చెప్పి తల్లిదండ్రులు అతన్ని నిరుత్సాహపరచకూడదు. బదులుగా, తల్లిదండ్రులు పిల్లల మంచి ప్రవర్తనను మెచ్చుకోవాలి మరియు పోరాటాల్లో దేవుని సహాయం కోసం ప్రార్థించమని ప్రోత్సహించాలి.
ప్రతి మానవుడు పాప ప్రవృత్తితో జన్మించినప్పటికీ, ప్రతి మానవునికీ దేవుని అవసరత ఉంది. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, దేవునితో సహవాసం కలిగి జీవించాలనే ఆశ కలిగిస్తున్నాడు. మనం మన పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుని సహాయం పొందుతున్నామని మనకు తెలుసు. దేవుని ఆత్మ పిల్లవాడి హృదయంలో సహాయకునిగా పనిచేస్తూ, సత్యాన్ని ధృవీకరిస్తూ, దేవునితో సంబంధం కలిగియుండాలనే ఆశను ఇస్తున్నాడు.
[1]యెహోషువ 24:14-15, యెహెజ్కేలు 33:10-11, ప్రకటన 22:17
కుటుంబ ప్రార్థన సమయం
కుటుంబాలు ప్రతిరోజు కొంత సమయం గడుపుతూ బైబిలు చదవాలి, చర్చించాలి, మరియు ప్రార్థించాలి. తల్లిదండ్రులు ఇరువురు, కుటుంబంలోని పిల్లలందరు హాజరవ్వాలి. తండ్రి నడిపించాలి, కాని లేఖనం చదవమని, వివిధ రకాలుగా పాలుపొందాలని కుటుంబీకుల్ని అడగొచ్చు.
భక్తి సమయం ఎల్లప్పుడు ఒకే విధానంలో ఉండవలసిన పని లేదు. వివిధ రూపాల్లో ఉండొచ్చు, బైబిలు కథలు, క్రైస్తవ చరిత్ర మరియు పరిచర్యలు గురించిన కథలు, ప్రశ్నలు చర్చించుకోవడం, సిద్ధాంత సత్యాలు బోధించడానికి కంఠస్తం చేసిన ప్రశ్నలు సమాధానాలు ఉపయోగించడం, క్రైస్తవ పుస్తకాలు చదవడం, పాటలు, బైబిల్ వచనాలు కంఠస్తం చేయడం, నాటకం, వివిధ రకాలైన ప్రార్థనలు భాగం కావచ్చు.
భక్తి సమయ కార్యాచరణ ఉదాహరణ: బైబిలు కథ ఎంపిక చేసుకుని, కుటుంబ సభ్యులు దానిని నటించి చూపాలి.
పాస్టర్లైనవారు తమ సంఘంలో భక్తి సమయం గురించి బోధించడానికి కొంత సమయం కేటాయించాలి. దేవుని వాక్యాన్ని తమ పిల్లలకు బోధించే బాధ్యత తమపై ఉందని తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి (ద్వితీయోపదేశకాండము 6:5-7).
సమూహ చర్చ కోసం
► ఈ పాఠంలో మీకు క్రొత్త అనిపించిన విషయాలు ఏంటి? మీరు నేర్చుకున్న సత్యాన్ని ఎలా అన్వయించుకోవాలని ఆశపడుతున్నారు?
► కుటుంబాలను బలపరచడానికి, పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులకు సహాయం చేయడానికి సంఘం ఏమి చేయగలదు?
► క్రీస్తు వెంబడించడానికి పిల్లలకు శిక్షణనిచ్చే సవాలు విషయంలో సహాయం చేయడానికి సంఘం, ప్రజలు కలిసి ఎలా పనిచేయగలరు?
► కుటుంబాలు పాటించవలసిన అనుదిన కార్యచరణలకు కొన్ని ఉదాహరణలు ఏంటి?
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
కుటుంబాన్ని రూపొందించినందుకు, తల్లిదండ్రులుగా ఉండే గొప్ప ఆధిక్యతను ప్రజలకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
మీవలే పిల్లల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. వారు నిన్నెరగడానికి మరియు నీకు పరిచర్య చేయడానికి వారు సృజించబడ్డారని ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకోవడానికి సహాయం చేయండి.
పిల్లలు నిన్ను అనుసరించేలా, వారికి శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ప్రేమ, సహనం మరియు అవగాహన మాకు దయచేయండి.
కుటుంబాల్ని, యౌవనుల్ని, పిల్లల్ని వారి విశ్వాసంలో విధేయతలో బలంగా ఉండేలా చేయడానికి మా సంఘాల్లో విశ్వాసులకు సామర్థ్యం అనుగ్రహించండి.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) ఈ క్రింది ఇవ్వబడిన వాక్యభాగాలను అధ్యయనం చేయండి. తల్లిదండ్రుల బాధ్యత గురించి లేఖనం ఏం బోధిస్తుందో ఈ వాక్యభాగాలను ఉపయోగించి మూడు పేజీలు రాయండి:
ఆదికాండము 18:17-19
ద్వితీయోపదేశకాండము 6:4-9
కీర్తన 78:1-8
కొలొస్స 3:21
ఎఫెసీయులకు 6:4
1 తిమోతికి 3:4-5, 12
2 తిమోతికి 3:14-17
మత్తయి 18:5-6
(2) మీరు తల్లిదండ్రులైనా కాకపోయినా, ఈ పాఠంలో ఇచ్చిన గుణలక్షణాల లక్ష్యాల జాబితాలో ఐదు గుణలక్షణ లక్ష్యాలను ఎంపిక చేసుకోండి. ఎంపిక చేసుకున్న ఐదు గుణలక్షణ లక్ష్యాలను మీ పిల్లలు చేరుకోవడానికి సహాయపడే మూడు ఆచరణాత్మక మార్గాలు రాయండి.
(3) ఒకవేళ మీరు తల్లిదండ్రులైతే, మీ పిల్లలతో అనుదినం భక్తి సమయం గడపడానికి ఒక ప్రణాళికను, సమర్పణను రాయండి. మీరు చేసిన ప్రణాళిక, సమర్పణ విషయంలో ఎవరికైన లెక్క అప్పజెప్పేవారిగా ఉండండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.