స్త్రీ పురుషులు అనేక విషయాల్లో భిన్నంగా ఉంటారనే విషయం తెలియనిది కాదు! చాలామంది పురుషులు తమ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఇబ్బందిపడతారు, కాని చాలామంది స్త్రీలు భావోద్వేగాలు వ్యక్తపరచడమే నిజమైన సంభాషణగా భావిస్తారు. పురుషులు ఎక్కువగా సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు, కాని స్త్రీలు భద్రతను గురించి ఆలోచిస్తారు. పురుషులు సాధారణంగా శారీరక సౌందర్యానికి ఆకర్శింపబడతారు, కాని చాలామంది స్త్రీలు భావోద్వేగ బంధాలకు ఆకర్షితులౌతారు. ఇంకా చాలా తేడాలు చెప్పొచ్చు.
భార్య భర్తల మధ్య సర్వసాధారణంగా ఉండే లింగ వ్యత్యాసాలతో పాటుగా, వారి వ్యక్తిత్వాల్లో కూడా ఎన్నో తేడాలు కలిగి ఉంటారు. ఒకరు జనాల్లో ఉండడానికి ఇష్టపడవచ్చు, మరొకరు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడవచ్చు. ఇంట్లో ఎంత వెలుతురు ఉండాలి లేక ఎంత వేడి ఉండాలి వంటి చిన్న అభిరుచులలో కూడా తేడాలు ఉండవచ్చు. డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయంలో చాలా వైవాహిక బంధాల్లో విభేదాలు వస్తుంటాయి. ఈ వ్యత్యాసాలు, ఖచ్చితంగా గుణంలో ఉండే వ్యత్యాసాలు కాదు; ఇవి కేవలం వ్యక్తిత్వం, అభిప్రాయాల్లో కలిగే తేడాలు.
వివాహం, స్త్రీ పురుషుల్ని ఐక్యపరుస్తుంది గనుక వాళ్ల మధ్య ఉండే వ్యత్యాసాలు ఉండకూడదని కొందరు భావిస్తారు. తన భాగస్వామికి ఉన్న తేడాల్ని లోపాలుగా భావించి వాటిని సరిచేసుకోవాలని భావిస్తుంటారు. ప్రతి ఒక్కరు తమ భాగస్వామి అభిప్రాయాలు, అలవాట్లు మరియు ప్రాధాన్యతలు తరచూ మార్చడానికి ప్రయత్నిస్తుంటారు.
ప్రతి ఒక్కరు తమ బంధాన్ని బట్టి అభివృద్ధి పొందాలనుకోవడం, మెరుగుపడాలనుకోవడం వాస్తవమే. అయితే, కొన్నిసార్లు మనం ఒక వ్యక్తిని మార్చడానికి చేసే ప్రయత్నం, వాళ్ల వ్యక్తిత్వం మీద దాడిచేసినట్లు అవుతుంది. ఆరోగ్యకరమైన వివాహ బంధాల్లో, ప్రతి భాగస్వామి ఒకరినొకరు ప్రేమించడం, గౌరవించడం, అభినందించడం మరియు సేవ చెయ్యాలనే క్రమశిక్షణను పెంపొందించుకోవడం చేయాలి.
► స్త్రీ పురుషుల మధ్య ఉండే ఇతర వ్యత్యాసాలు ఏంటి? వ్యక్తిత్వంలో ఇతరులు ఇంకా ఎటువంటి వ్యత్యాసాలు అంగీకరించాలి?
సేవచేయడానికి నిర్ణయించుకోవాలి
Sacred Marriage, అను తన పుస్తకంలో గ్యారి థామస్ ఇలా చెప్పారు,
ఒక మంచి వివాహం అనేది దొరికేది కాదు, అది మీరు కష్టపడి నిర్మించుకోవాల్సింది. దీనికి కృషి అవసరం. మీరు మీ స్వార్థాన్ని సిలువవెయ్యాలి. కొన్నిసార్లు మీరు హెచ్చరించాలి, మరికొన్నిసార్లు మీరు తప్పులు ఒప్పుకోవాలి. క్షమించే గుణం చాలా అవసరం. ఇది నిస్సందేహంగా కష్టమైన పని, కాని ఇది తుదకు ఫలిస్తుంది. చివరికి, ఒక అందమైన, నమ్మకమైన పరస్పరం సహాయం చేసుకునే బంధాన్ని ఏర్పాటు చేస్తుంది.[1]
థామస్, ఒట్టో పైపర్ మాటల్ని ఉదాహరిస్తూ ఇలా చెప్పారు:
వివాహమనేది....చాలామందికి నిరాశపరచే అనుభవమైతే, వారి విశ్వాసపు [అలసటనే] అందుకు కారణం. నిరంతరం వెదకి, కనుగొన్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయనే వాస్తవాన్ని ప్రజలు ఇష్టపడరు (మత్తయి 7:7; లూకా 11:9). కాబట్టి, వివాహం అనేది ఒక వరం, అలాగే నిర్వర్తించవలసిన ఒక బాధ్యత కూడా.[2]
వివాహాలు తరచుగా దెబ్బతినడానికి కారణం భార్యాభర్తలు ఒకరి అవసరాలను మరొకరు తీర్చడానికి ప్రయత్నించకుండా, వారి స్వంత అవసరాల గురించి మాత్రమే ఆలోచించడమే.
మనం ఒకరి లోతైన అవసరాలను మరొకరం పూర్తిగా తీర్చలేం. కేవలం మన పరలోకపు తండ్రి మాత్రమే మన కోరికల్ని, ఆశల్ని పూర్తిగా తృప్తిపరచగలడు, ఈ కారణంతోనే యేసు వచ్చాడు. మనల్ని రక్షించడం, ఆయన ఆత్మతో - పరిశుద్ధాత్మతో - నింపడం, “అబ్బా తండ్రీ” (రోమా 8:14-15; గలతీయులకు 4:6) తో బలమైన, తృప్తికరమైన బంధంలోకి నడిపించడమే ఆయన ఉద్దేశ్యం.
అయితే, వివాహం అనేది సేవాగుణం నేర్చుకోవడానికి ఒక శిక్షణా క్షేత్రంగా ఉండాలనేది దేవుడు వివాహ బంధాన్ని నియమించడానికిగల ఉద్దేశాలలో ఒకటి; ఇలాంటి సేవగుణాన్నే మనం యేసులో చూస్తాం (యోహాను 13:14). దేవుడు ప్రతి ఒక్కరికి, తమ భాగస్వామికి పరిచారం చేసే దీన హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు (ఫిలిప్పీయులకు 2:3-8).
ఒక భాగస్వామి తన సొంత అవసరాలపై దృష్టిపెట్టకుండా, తన భాగస్వామి అనారోగ్యం, వైఫల్యం, విషాదం, దుఖం మొదలగు కష్ట పరిస్థితుల్లో వారికి సేవ చేస్తారు గనుక కొన్ని వివాహ బంధాలు అందంగా, ఆనందంగా ఉనికిలో ఉన్నాయి. వారి భార్యలు వారి కోసం ప్రార్థించకపోతే, వారిని క్షమించకపోతే, వారిని జవాబుదారితనంగా ఉంచకపోతే, ప్రేమించదగని స్థితిలో కూడా వారిపై ప్రేమ చూపకపోతే, వారి జీవితాలు సర్వనాశనమైపోయేవని కొంతమంది భర్తలు చెబుతారు. కొంతమంది భార్యలు, వేధించే తండ్రి ద్వారా లేక ఇతర గాయాల ద్వారా వారు పొందిన మానసిక వేదనను అధిగమించడానికి, వారి భర్త చూపిన సహనం, అర్థం చేసుకున్న విధానమే కారణం అని చెబుతారు. మనం పతనమైన, పాపభరితమైన, సృష్టి అంతా మూల్గుతున్న లోకంలో జీవిస్తున్నాం గనుక (రోమా 8:22) వివాహమైన ప్రతి ఒక్కరు, గాయాలు దెబ్బలు అనుభవిస్తారు. కాని, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, గాయాల్ని కట్టుకోవడానికి దేవుని కృప ఎంతో సహాయపడుతుంది!
మనమందరం స్వార్థపరులుగానే పుట్టాం. మనం ఇతరుల అవసరాల కంటే మన అవసరాలపైనే ఎక్కువ దృష్టిపెడతాం. అయితే, మనలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని రక్షించే, పవిత్రపరచే దేవుని కృప, మన అవసరాల కంటే ఇతరుల అవసరాలపై ఎక్కువ దృష్టిపెట్టేవరకు మనల్ని మార్చగలదు. ప్రతి ఒక్కరు తమ భాగస్వామి అవసరాలు, కోరికలపై ఆసక్తి చూపినప్పుడు వివాహ బంధాలు మరింతగా బలపడతాయి.
దేవుడు స్త్రీ పురుషుల్ని వేర్వేరు అవసరాలు, కోరికలతో రూపించాడు. అంటే, తనకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అదే భార్యకు కూడా సంతోషాన్ని ఇస్తుందని పురుషుడు అనుకోకూడదు. భార్య, తన భర్తను ఆమె కావలసిన విధంగానే చూసుకోవాలని అనుకోకూడదు. స్పష్టంగా చెప్పాలంటే, కొన్ని విషయాల్లో మర్యాద, కనికరం అనేవి ఇద్దరికీ ఒకే విధంగా ఉండాలి, కానీ స్త్రీ పురుషులు ఇద్దరు కొన్ని ప్రత్యేక అవసరాలను కలిగి ఉంటారు.
పురుషులు మరియు స్త్రీల ప్రత్యేక అవసరాలను మనం అర్థం చేసుకుంటే, జీవిత భాగస్వామి అవసరాలను ఎలా తీర్చాలో మనం తెలుసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య జరిగే అనేక వాదనలు, చర్చలు సమస్యలను పరిష్కరించలేకపోవడం బాధాకరం, ఎందుకంటే ప్రతి ఒక్కరూ అవతలివారి అవసరాలను అర్థం చేసుకోలేరు. అవతలివారు తమను అర్థం చేసుకోలేదని ప్రతి ఒక్కరూ కోపంగా, ఆగ్రహంగా ఉండవచ్చు.
అందరిని ప్రేమించాలి, గౌరవించాలి కాని స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఉంది. స్త్రీ ప్రాథమిక అవసరత ప్రేమ, పురుషుని ప్రాథమిక అవసరత గౌరవం.[1]
► స్త్రీ పురుషుల అవసరాల మధ్య ఈ వ్యత్యాసాన్ని మీరు ఎలా గమనించగలరు?
[1]The book Love and Respect by Dr. Emerson Eggerich has been very helpful in this section.
భర్త, తన భార్యను ఎలా ప్రేమ చూపాలి
ఎఫెసీయులకు 5:25, 28, “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి...దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను…అటువలెనే పురుషులు కూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు…” అని సెలవిస్తుంది.
భర్త ఎల్లప్పుడు తన భార్యతో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి గాని, ఆమెకు తెలుసులే అనుకోకూడదు. అతడు తన ప్రేమను మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించాలి. ఆమెకు ఇష్టమైన మార్గాల్లో కనుపర్చాలి. తనకు నచ్చిన రీతిలో ప్రేమ చూపి, ఆ ప్రేమను ఆమె అనుభూతి చెందాలని అనుకోకూడదు. ఆమె అవసరాలు అతని అవసరాలకంటే భిన్నంగా ఉంటాయి.
(1) భర్త, తన భార్యకు భద్రత ఇవ్వడం ద్వారా ఆమెను ప్రేమిస్తాడు.[1]
భార్య, తన భర్త తనను శారీరకంగా, మానసికంగా కాపాడుతున్నాడో లేదో తెలుసుకోవాలని ఆశ పడుతుంది. పొరుగువారితో ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు భర్త దానిని పరిష్కరించగలగాలి. భర్త, ఇల్లు సురక్షిత ప్రాంతంగా ఉందో లేదో చూసుకోవాలి. ఇతరులు, బంధువులు తనను విమర్శించినప్పుడు అతడు ఆమె పక్షాన మాట్లాడాలి. తనకు లోబడాలని భార్య మీద చెయ్యెత్తడం లేక శారీరకంగా బాధపెట్టడం వంటివి చెయ్యకూడదు. ఆయన తన కుటుంబ అవసరాలను తీర్చడానికి తన శక్తిమేర కృషి చేయాలి. ఒక భర్త డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉంటే, తన కుటుంబ అవసరాల గురించి అతడు పట్టించుకోవడం లేదని భార్య భావిస్తుంది.
భర్తలకు ఆర్ధిక సూచనలు
ఆర్థిక సమస్యలే వివాహ బంధాల్లో గొడవలకు ఒక ముఖ్య కారణం. భర్తలారా,
లాభాపేక్ష కోసం మోసం చేయొద్దు, అనైతికతకు పాల్పడొద్దు; దేవుని అధికారంలో ఉన్నారని గుర్తుంచుకోండి.
సమస్తం సమకూర్చువాడు దేవుడేనని నమ్మి, సంఘంలో మీ దశమభాగం ఇవ్వండి.
ఉపాధి కోసం మంచి ఉద్యోగం చూసుకోండి, కాని ప్రస్తుతానికి మీకు ఇష్టంలేని పనైనా చేయడానికి సిద్ధంకండి.
ఉద్యోగియైనా కాకపోయినా, మీకు, మీ చుట్టూ ఉన్న ఇతరులకు సహాయపడేలా ప్రతి రోజు పని వెతుక్కోండి.
ఈరోజు అప్పు అడిగి, రేపటి డబ్బును ఖర్చు చేయకండి.
సంతోషం కోసం ఖర్చు చేసినప్పుడు, అందులో భార్యను పిల్లల్ని కూడా భాగం చెయ్యండి.
ఇంటి అద్దె వంటి సాధారణ అవసరాల కోసం నిత్యం కొంత డబ్బు దాచుకోండి.
సౌకర్యం కోసం డబ్బు ఖర్చు చేసుకోకుండా మీ స్థితిని మెరుగుపరచుకోవడానికి పెట్టుబడి పెట్టండి.
(2) భర్త, తన్నుతాను ఆమెకు అప్పగించుకోవడం ద్వారా ఆమెను ప్రేమిస్తాడు.
భర్త తననుతాను పవిత్రంగా కాపాడుకుంటూ, భార్యయందు ఆనందించాలి, “ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము” (సామెతలు 5:19). ఒకవేళ భర్త ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే లేక అపవిత్రమైన వినోదాలను అనుభవిస్తే, భార్య తన ప్రేమను అనుభూతి చెందదు.
(3) భర్త, తన భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ఆమెను ప్రేమిస్తాడు.
భర్త, తన భార్యను అర్థం చేసుకునే విషయంలో ఎల్లప్పుడు విజయం సాధించడు, కాని ఆమె మాటలు విని, ఆమె గురించి తెలుసుకోవడానికి సమయం వెచ్చిస్తాడు. లేఖనం భర్తలతో, “అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి...జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి” (1 పేతురు 3:7) అని మాట్లాడుతుంది. భర్త, తన భార్య భావాల్ని అభిప్రాయాల్ని ఎగతాళి చేస్తే, తన భర్త తనను ప్రేమించడనే భావన కలుగుతుంది. ఆమె మాటలు అతనికి సరైనవిగా అనిపించేలా లేకపోయినా తన విషయాన్ని అర్థం చేసుకోవడానికి అతను ప్రయత్నించడం ఆమెకు అవసరం.
దేవుడు, భర్తను తన కుటుంబానికి శిరస్సుగా చేశాడు గనుక (ఎఫెసీయులకు 5:23), కుటుంబాన్ని నడిపించే బాధ్యత భర్తది (1 తిమోతికి 3:4-5). అయితే, నిర్ణయాలు తీసుకునే విషయంలో, భార్యాభర్తలిద్దరూ చర్చకు కొంత సమయం కేటాయించాలి. తన భార్య అభిప్రాయాలు, భావాలు పరిగణలోనికి తీసుకోకుండా, భర్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ ఏదొక విషయంలో వారిద్దరూ ఏకీభవించకపోతే, భర్త నిర్ణయం తీసుకోవాలి కాని ఏకీభవించలేకపోయినందుకు భర్త బాధపడాలి. సహజంగా, ఏకీభవించకపోవడమనేది భర్తకు ఒక హెచ్చరికగా ఉండాలి. మంచి నిర్ణయాలు తీసుకునే విషయంలో భర్తలకు అవసరమైన జ్ఞానం, వివేచన భార్యలకు ఉంటుంది.
► ఒక విద్యార్థి తరగతి కోసం ఎఫెసీయులకు 4:2-3, 15-16 చదవాలి. ఈ వచనాలు భార్యభర్తల బంధానికి ఎలా వర్తిస్తాయి?
(4) భర్త, తన భార్యను అభినందించడం ద్వారా ఆమెను ప్రేమిస్తాడు.[2]
భర్తలు, తాము చేసే పనిని అభినందించరని చాలామంది భార్యలు భావిస్తారు. భర్త, తన భార్యకు కృతజ్ఞుడై ఉండాలి. కుటుంబం కోసం ఆమె పడే ప్రయాసను గుర్తించాలి. ఇతరుల యెదుట ఆమెను ఎన్నడు కించపరచకూడదు.[3] ఆమె గుణాన్ని, ఆకర్షించే విధానాన్ని, సామర్థ్యాల్ని మెచ్చుకోవాలి. సాధ్యమైనంతవరకు, మంచి వస్త్రాలు ధరించడానికి సహాయపడాలి. తన రూపం గురించి భర్త పట్టించుకోవట్లేదని ఆమెకు అనిపించినప్పుడు, అతను తనను ప్రేమించట్లేదనే భావన కలుగుతుంది.
భర్త, తన భార్యను విమర్శించినప్పుడు, ఒక వ్యక్తిగా తాను సరిపోలేనెమోనన్న భావన కలిగించి, నిరుత్సాహానికి గురి చేస్తాడు. పౌలు విశ్వాసులకు ఇలా చెప్పాడు, “మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు” (తీతుకు 3:2). ఒకవేళ విమర్శించవలసి వస్తే, తాను చేసే విమర్శల కంటే తన అభినందనలే గొప్పగా ఉండేలా చూసుకోవాలి. రకరకాల గుణాల్లో, తన భార్య కంటే ఉత్తమంగా ఉన్న స్త్రీలను మాదిరిగా చూపకూడదు.
(5) భర్త, తమ బంధానికి కొంత సమయం కేటాయించడం ద్వారా ఆమెను ప్రేమిస్తాడు.
కలిసి జీవించాలంటే, సంభాషణకు కొంత సమయం కేటాయించాలి. బంధాలు మాటల ద్వారా బలపరచబడతాయి (సామెతలు 16:24, సామెతలు 20:5). భార్యభర్తలు, రోజు జరిగే విషయాలను గురించి మాట్లాడుకోవాలి. వారి బంధాలు, భావాలు, కోరికలు, అందోళనల గురించి మాట్లాడుకోవాలి. భార్య తన భర్త కొంత సమయం కేటాయించి, తనతో మాట్లాడుతూ తన మాటలు ఆలకిస్తున్నప్పుడు, భర్త తనను ప్రేమిస్తున్నాడని భావిస్తుంది. పనిలో అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇంట్లో సమస్యలు గురించి మాట్లాడడానికి, వినడానికి ఇష్టపడడు, కాని ఈ అవసరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. భర్త, భావోద్వేగ సాన్నిహిత్యానికి అందుబాటులో లేకుండా కేవలం శారీరక సాన్నిహిత్యాన్ని మాత్రమే కోరుకుంటే, అతడు ఆమెను వాడుకుంటున్నాడు కాని ప్రేమించట్లేదనే ఆలోచన భార్యకు కలుగుతుంది.
(6) భర్త, తన భార్య బలహీనతల్లో సహనం చూపడం ద్వారా ఆమెను ప్రేమిస్తాడు.
1 పేతురు 3:7, “అటువలెనే పురుషులారా...యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి...జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి…” చాలామంది స్త్రీలు శారీరకంగా చాలామంది పురుషులంత బలంగా ఉండరు. అలాగే, చాలామంది స్త్రీలు భావోద్వేగపరమైన బాధకు, నిరాశకు పురుషులకన్నా ఎక్కువగా లోనవుతారు. భర్త తన భార్యను ఆదరించాలి, ప్రోత్సహించాలి. ఆమె ఒత్తిడిని తగ్గించడం ఎలా అనేది అతడు నేర్చుకోవాలి. భార్య అలసిపోయినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, లేక చింతిస్తున్నప్పుడు, ఆమెపై డిమాండ్లు పెట్టకుండా ఉండాలి.
(7) భర్త, తన భార్య అవసరాలను తీర్చడం ద్వారా ఆమెను ప్రేమిస్తాడు.
భర్త, తన పని చేసుకోవడానికి మంచి పనిముట్లు, మంచి ప్రదేశం కావాలని కోరుకున్నట్లే, తన భార్యకు కూడా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలి. ఇంట్లో ఆమెకు అవసరమైనవన్ని ఉండేలా చూసుకోవాలి.
భర్తలు తమ భార్యల్ని ప్రేమించినప్పుడు వచ్చే ఫలితాలు
చాలామంది భర్తలు, తమ భార్యల్ని ప్రేమించినప్పుడు, భార్యలు ఎంతో సంతోషంగా సహకారంగా ఉండడం గమనిస్తారు. భర్తలు, తమ భార్యల పట్ల అంకితభావంతో ఉన్నప్పుడు, వారిని నిజంగా ప్రేమించినప్పుడు వారు ఆనందిస్తారు. భర్తలు, భార్యల్ని ప్రేమించినప్పుడే వివాహ బంధంలో గొప్ప మేలు అనుభవిస్తారు (ఎఫెసీయులకు 5:28). అయితే, పురుషులు ఎల్లవేళలా ఇలా ఉంటారని హామీ ఇవ్వలేం. కొన్ని మినహాయింపులు ఉంటాయి. భర్త, భార్య నుండి ఏదో పొందుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమెను ప్రేమించకూడదు. అతడు, తన వ్యక్తిగత అవసరాలను గురించి చింతపడకుండ, తన భార్య అవసరాలను తీర్చడానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి భార్యను ప్రేమించాలి.
భర్తల ప్రేమకు కొందరు భార్యలు వెంటనే స్పందించకపోవచ్చు, ఎందుకంటే గత అనుభవాల వల్ల వాళ్ళు మానసికంగా గాయపడివుంటారు. ప్రేమను చూపించే ఈ పద్ధతులు కొన్ని రోజులు ప్రయోగంలా చేసి చూసేవి కావు. భర్త తన హృదయంలో దేవుని పట్ల, తన భార్య పట్ల ఉన్న ప్రేమను బట్టి ఈ మార్గాల్లో స్థిరంగా ప్రేమను చూపిస్తూనే ఉండాలి. క్రీస్తు సంఘాన్ని ఇలాంటి నమ్మకత్వం, త్యాగపూరితమైన సమర్పణతో ప్రేమిస్తున్నాడు.
[1]ఎఫెసీయులకు 5:28-31, కొలొస్సయులకు 3:19 (భావోద్వేగ భద్రత), 1 తిమోతికి 5:8 (భౌతిక సదుపాయం), నెహెమ్యా 4:13-14 (శారీరక భద్రత), and 1 తిమోతికి 2:14 (ఆత్మీయ భద్రత) తో పాటుగా ఈ సత్యానికి సంబంధించి అనేక లేఖన భాగాలు ఉన్నాయి.
[3]వివాహ బంధంలో, ఇది ఎఫెసీ 4:29-32, ఎఫెసీ 5:25-29 మరియు మత్తయి 7:12 లో దేవుడు మనకు ఇచ్చిన సూచనల యొక్క అన్వయం.
భార్య, తన భర్తను ఎలా గౌరవించాలి
ఎఫెసీయులకు 5:33 ఇలా ఆదేశిస్తుంది, “మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.”
భర్తకు గౌరవం అవసరం. చాలామంది పురుషులు, ఇతర ప్రజలు తమను ఇష్టపడాలకునే దానికంటే తమను గౌరవించాలనే ఎక్కువగా కోరుకుంటారు. తమ కుటుంబాల్ని రక్షించి, పోషించి, నడిపించేటట్లుగా దేవుడు పురుషుల్ని చేశాడు. తండ్రి, భర్త - ఈ రెండు స్థానాలు, ఏ పని చేయక మునుపే, స్వాభావికంగానే గౌరవం పొందడానికి యోగ్యమైనవి. భర్త చేసే పనులు తప్పైనప్పటికీ, భార్య తన భర్తను గౌరవించాలి. అతడు తన అధికారాన్ని పరిపూర్ణంగా ఉపయోగించనప్పటికీ, అతడు దేవుని స్వరూపంలో సృజించబడ్డాడనే ఆలోచనతో ఆమె అతన్ని గౌరవించాలి (ఎఫెసీయులకు 5:23). దీని అర్థం అతని చర్యలు లేదా నిర్ణయాలతో ఆమె విభేదించకూడదని కాదు, కానీ ఆమె అతన్ని అగౌరవపరచకూడదు.
భార్య, తన భర్త అధికారానికి లోబడుతూ అతన్ని గౌరవించినప్పుడు, యేసు పట్ల తనకున్న ప్రేమను ఆమె చూపిస్తుంది (ఎఫెసీయులకు 5:22, 31-33).
కొంతమంది భార్యలు తమ భర్తలను అగౌరవంగా చూస్తూ కూడా, అంటే స్నేహితుల ముందు వారిని విమర్శించడం, రహస్యంగా వ్యవహరించడం మరియు బాధపెట్టే మాటలు ఉపయోగించడం వంటివి చేస్తూ కూడా తాము వారిని ప్రేమిస్తున్నామని అనుకుంటారు. ఎంత ఆప్యాయత ఉన్నా అగౌరవాన్ని భర్తీ చేయలేదని వారు అర్థం చేసుకోవాలి.
చాలామంది మహిళలకు చిన్న పిల్లల పట్ల మాతృత్వం చూపించాలనే బలమైన కోరిక ఉంటుంది. వారికి బిడ్డ అవసరాలను తీర్చగల సహజమైన సామర్థ్యం, సహజమైన కోరిక ఉంటాయి. “నీకు పిల్లల్ని చూసుకోవడం చేతకాదు” అని ఎవరైనా ఒక మహిళతో అంటే ఆమెకు ఎలా అనిపిస్తుందో ఊహించండి. అదేవిధంగా, పురుషులకు రక్షించడం, పోషించడం, నాయకత్వం వహించడం పట్ల బలమైన కోరిక ఉంటుంది. తన భార్య “ఆ పనులు నువ్వు చేయలేవని చెప్పినప్పుడు” అతను ఒక పురుషుడిగా తాను విఫలమయ్యానని భావిస్తాడు.
భార్య తన భర్త కంటే బలమైన వ్యక్తిత్వమున్నవారు, బాగా సంపాదించేవారు లేక ఉన్నతమైన స్థానాలు అధిరోహించిన పురుషులు ఉంటారని గ్రహించాలి. భర్తను ఇతర పురుషులతో పోలుస్తూ, విఫలమయ్యాననే భావన కలిగించకూడదు. ఎఫెసీయులకు 5:21-33 లో మనం నేర్చుకున్నట్లుగా, భార్య భర్త ఏకశరీరులు. భార్య, తన భర్తను ఇతరులతో పోల్చినప్పుడు లేక విమర్శించినప్పుడు, ఆమె ఇద్దరికీ బాధ కలిగిస్తుంది, అలాగే వారి బంధాన్ని నాశనం చేస్తుంది.
► ఒక విద్యార్థి తరగతి కోసం సామెతలు 31:11-12, 26 చదవాలి. దైవికమైన భార్య తన మాటల్లో, ప్రవర్తనలో తన భర్తను ఎలా చూడాలని ఈ వచనాలు బోధిస్తాయి?
(1) భార్య, తన నిశ్చయ మాటలతో తన భర్తను గౌరవిస్తుంది.
భార్య, తన భర్త సామర్థ్యాన్ని ధృవీకరించాలి. భార్య తన భర్తతో మాట్లాడే ధృవీకరణ మాటల ద్వారా భర్త పట్ల ఆమెకున్న గౌరవం కనబడుతుంది. పురుషులపై మాటల ప్రభావం చాలా ఉంటుంది. అయితే అవి బలపరుస్తాయి లేక బలహీనపరుస్తాయి (సామెతలు 14:1). అవి ప్రోత్సహించగలవు లేదా నిరుత్సాహపరచగలవు. అవి అతనిని ధైర్యపరచగలవు లేక మనసును కృంగదీయగలవు (సామెతలు 18:21). భర్త, ప్రతి పయత్నంలో విజయం సాధించకపోవచ్చు, కాని కుటుంబాన్ని పోషించేందుకు, దాన్ని కాపాడేందుకు అతను చేసే కృషిని భార్య గుర్తించాలి. క్రొత్త సవాళ్లు ఎదుర్కునేప్పుడు, క్రొత్త ఆలోచనలు చేసేటప్పుడు భార్య అతన్ని నిరుత్సాహపరచకూడదు.
► విద్యార్థులు తరగతి కోసం సామెతలు 15:4 మరియు సామెతలు 16:24 చదవాలి.
(2) భార్య, భర్తకు లోబడడం ద్వారా అతన్ని గౌరవిస్తుంది (1 పేతురు 3:5).
భార్య భర్తకు లోబడటం అంటే ఆమె భర్త కంటే తక్కువ అని కాదు. బదులుగా, వారి పాత్రలు భిన్నంగా ఉన్నాయని దీని అర్థం. త్రిత్వంలో కూడా కుమారుడు తండ్రికి లోబడటం మనం చూస్తాం, అయినప్పటికీ కుమారుడు స్వభావంలో గానీ, శక్తిలో గానీ, ఏ విషయంలో గానీ తండ్రి కంటే తక్కువ కాదు.
కొందరు భార్యలకు ఈ సూత్రం సులభంగా అనిపించకపోవచ్చు, ప్రత్యేకించి వారి భర్త దేవుని వాక్యం ప్రకారం జీవించనప్పుడు లేదా వారి పట్ల దయ చూపనప్పుడు అసలు సులభం కాదు. కొందరు భార్యలు తమ భర్తల కంటే లేదా తమ కుటుంబం కంటే తామే మంచి నిర్ణయాలు తీసుకోగలమని భావిస్తారు. కొన్నిసార్లు భార్య చెప్పింది సరైనది కావచ్చు, భర్త సరైనది చేయకపోవచ్చు. అయితే, భార్య తన భర్తతో ఏకీభవించినప్పుడు మాత్రమే అతనికి లోబడితే, ఆమె అధికారాన్ని చెలాయిస్తున్నట్లు అవుతుంది తప్ప నిజంగా లోబడినట్లు కాదు. లోబడటం అంటే మరొకరు నిర్ణయం తీసుకోవడానికి అనుమతించడం.
పేతురు భార్యలకు ఇలా చెబుతున్నాడు,
స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే...వాక్యములేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును…. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవునిదృష్టికి మిగుల విలువగలది (1 పేతురు 3:1-2, 3-4).
అనేక క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది భార్యలు "అతను నన్ను _______ చేయమని చెబితే నేను చేయాలా?" అని అడుగుతారు. ఈ పాఠం అన్ని రకాల పరిస్థితుల గురించి వివరించదు. అయితే, లోబడడానికి సంబంధించిన సమస్య, భర్త భార్య చేయకూడని పనులను చేయమని చెప్పడం వల్ల తలెత్తదు. భార్య విధేయత చూపేందుకు ఇష్టపడకపోవడానికి కారణం, ఆమె అలా చేస్తే తన భర్త సరిగా ఉండడని భావించవచ్చు. బహుశా భర్త ప్రేమగా, దయగా ఉండకపోవచ్చు. భార్య తన సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను వదులుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. భార్యకు ధిక్కార వైఖరి ఉండవచ్చు. భార్య తన భర్త యొక్క దయలేని చర్యలు లేదా తప్పులను సాకుగా చూపి, సాధారణంగా అతని అధికారాన్ని తిరస్కరిస్తుంది. ఇది దేవుని వాక్య ఆజ్ఞలకు అవిధేయత చూపడం.
దైవికమైన, విధేయత చూపించే భార్య ప్రభువునందు తన భర్తను గెలుచుకుంటుందని బైబిల్ చెబుతుంది. మంచి భార్య వలన భర్త ఒక మంచి విశ్వాసి అవుతాడనేది ఖచ్చితంగా చెప్పలేం గాని, క్రైస్తవురాలైన భార్య తిరస్కారపు స్వభావం గలదైతే, అతడు విశ్వాసిగా మారే అవకాశం ఉండదు. భార్య తన భర్తను గౌరవించడం ద్వారా అధిక దయను పొందవచ్చు కాని ఆమె గౌరవించడానికి అదే ప్రధాన కారణం కాకూడదు. భర్తను గౌరవించవలసిన బాధ్యత ఆమెపై ఉంది గనుక, దేవునిని సంతోషపెట్టవలసిన బాధ్యత ఆమెపై ఉందని భర్తను గౌరవించాలి.
సామెతలు 12:4, “యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు” అని చెబుతుంది. భార్య, తన భర్తను తన స్నేహితుల సమక్షంలో అగౌరవపరిస్తే, అతని గౌరవాన్ని పోగొడుతుంది, దాన్ని ఎన్నటికి తిరిగి పొందుకోలేదు. భర్త పట్ల సమర్పణ కలిగిన భార్యలు ఉన్న పురుషులను ఇతర పురుషులు మెచ్చుకుంటారు. లోబడని భార్యలుగల భర్తలపై జాలిపడతారు.
(3) భార్య, తన భర్త అవసరాల పట్ల శ్రద్ధ చూపుతూ అతన్ని గౌరవిస్తుంది (సామెతలు 31:15, 21, 25, 27).
భార్య, తన భర్తకు ఇష్టమైన రీతిలో ఆహారం సిద్ధపరచినప్పుడు, కుటుంబాన్ని చూసుకుంటున్నప్పుడు అది అతనికి గౌరవంగా ఉంటుంది. ఒకవేళ అతని కోసం తన అలవాట్లు మార్చుకోవడానికి నిరాకరిస్తే, తాను ఆమెకు ప్రాముఖ్యం కాదని భావిస్తాడు.
ఒకవేళ భార్య పనిలో లేక మిత్రులతో లేక సంఘంతో లేక వినోదంతో నిమగ్నమై, భర్త మాటలు వినడానికి అతని అవసరాలు పట్టించుకోవడానికి సమయం కేటాయించకపోతే, తానంటే ఆమెకు అంత ముఖ్యం కాదని భావిస్తాడు.
ఆదికాండము 2:18 ఇలా బోధిస్తుంది: “మరియు దేవుడైన యెహోవా–నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.”
(4) భార్య, తన భర్త పట్ల శారీరకంగా ప్రేమ చూపడం ద్వారా అతన్ని గౌరవిస్తుంది.
కొందరు స్త్రీల కంటే కూడా, చాలామంది పురుషులకు లైంగిక సంతృప్తి అనేది చాలా ముఖ్యం. స్త్రీలు భావోద్వేగాలు, మానసిక స్థితి అనుకూలించినప్పుడు మాత్రమే లైంగిక కార్యకలాపాల పట్ల ఆసక్తి చూపుతారు, ఇది పురుషులు కోరుకునే దానికంటే చాలా తక్కువ. అంటే, భార్య తన భర్త అవసరాలను అర్థం చేసుకోనప్పుడు, అసంతృప్తిగా ఉంటాడు. బహుశా, గతంలో ఆమె అనుభవించిన లేక చూసిన బలాత్కారంవలన పురుషుల లైంగిక కోరికను ఆమె ద్వేషిస్తుంది. భర్త, తన భార్యను అర్థం చేసుకునే విషయంలో సహనంగా ఉండాలి. అయితే, భార్య తనకు అవసరం అనిపించకపోయినప్పటికీ కూడా భర్తకున్న లైంగిక అవసరాలు తీర్చడం మంచిదని గ్రహించాలి. భర్త, ఇతర స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకోకుండా తన భార్యపట్ల నమ్మకంగా ఉంటే, తన భార్య తన లైంగిక కోరికలు పట్టించుకోనప్పుడు నిరాశ చెందుతాడు. ఒక భర్త తన వైవాహిక బంధానికి కట్టుబడి ఉండటం అనేది అతడి శారీరక సంతృప్తిపై ఎప్పుడూ ఆధారపడి ఉండకూడదు, అయితే అతడి భార్య అతని లైంగిక అవసరాలపై శ్రద్ధ చూపించడం వలన అతడు శోధనలతో చేసే పోరాటం తగ్గవచ్చు.
పరమగీతము ఇలా సూచిస్తుంది, “నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను… నా ప్రియుడా, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము... అచ్చటనే నా ప్రేమసూచనలు నీకు చూపెదను. (పరమగీతము 2:16; పరమగీతము 7:11-12; అలాగే 1 కొరింథీయులకు 7:3-5 చూడండి).
దేవుని అదేశాలకు విధేయత చూపడం వలన కలిగే ఫలితాలు
ఈ పేరాల్లో ఇవ్వబడిన వివరాలు వైవాహిక జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు వర్తించవు, కానీ సర్వసాధారణం. ఈ వివరాలు, భార్యాభర్తలు (1) వారి కోరికలను గుర్తించకుండా, (2) దేవుని సత్యాన్ని, వారి పట్ల దేవుని ఆశను జ్ఞాపకం చేసుకోకుండా, (3) బైబిలు మార్గాల్లో స్పందించడానికి ఆత్మపై ఆధారపడకుండా, తమ కోరికలకు ఆత్మీయంగా స్పందించనప్పుడు కలిగే కారణ-ఫలిత ప్రవర్తనను చూపిస్తాయి.
భార్య, ఆత్మానుసారంగా నడచుకోకుండా, దేవుని ప్రేమ ద్వారా నడిపించబడకుండా ఉంటే, ఆమె వైవాహిక బంధానికి హాని కలిగించే విధంగా స్పందిస్తుంది. భార్యకు ప్రేమించబడట్లేదు అనే భావన కలిగితే, భద్రతను అనుభవించలేదు. ఆమె తననుతాను ధృవీకరించుకుంటూ, భర్త అధికారాన్ని దిక్కరిస్తుంది ఎందుకంటే ఆమె అతని సంరక్షణను నమ్మదు. ఆమె ఇలా చేసినప్పుడు, అతడు అగౌరవాన్ని పొందుతాడు. ఒకవేళ అతడు తన అధికారాన్ని నొక్కి చెప్పి, గౌరవాన్ని బలవంతంగా కోరితే, అతను తనను ప్రేమించట్లేదని మరెక్కువగా భావిస్తుంది.
భర్త, ఆత్మానుసారంగా నడచుకోకుండా, దేవుని ప్రేమ ద్వారా నడిపించబడకుండా ఉంటే, వైవాహిక బంధాన్ని బలపరచే వైఖరిని కలిగియుండలేడు. భర్త, అగౌరవాన్ని ఎదుర్కొన్నప్పుడు, బాధపడతాడు, కోపపడతాడు. భార్యను బాధపెట్టే విధంగా మాట్లాడతాడు. ఒకవేళ అతడు తన భావాలను దాచుకోవడానికి ప్రయత్నిస్తే, మౌనంగా ఉంటాడు. భార్యకు దగ్గరగా ఉండలేడు లేక మనస్పూర్తిగా మాట్లాడలేడు, ఎందుకంటే ఆమె తన సంబంధి కాదనుకుంటాడు. అతడిలా చేసినప్పుడు, ఎందుకిలా చేస్తున్నాడో భార్యకు అర్థం కాదు. అతను చేసే పనులు ఆమెకు ఇష్టం లేకపోవడం వలన అతనిలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో బహుశా ఆమె అతన్ని అగౌరవపరచి ఉండొచ్చు. అతడు కోపపడినా లేక వెనక్కి వెళ్లిపోయినా, తన భావాలు పట్టించుకోనట్లుగా ధృవీకరిస్తున్నాడని భావిస్తుంది. ఆమె మరింత అగౌరవం చూపించవచ్చు.
వైవాహిక బంధాలు దెబ్బతిన్నప్పుడు, భాగస్వాములు మరింత శోధనలకు గురౌతారు. భార్య, తన భర్త నాయకత్వాన్ని మరింత ధిక్కరిస్తుంది. అతని గురించి ఇతరుల దగ్గర అమర్యాదగా మాట్లాడే శోధనకు గురౌతుంది. ఆమెను అభినందించే మరో పురుషుడి వైపు ఆకర్షించబడే శోధనలో పడిపోతుంది. భార్య ప్రవర్తన తనకు అభ్యంతర కారణంగా ఉండడం వలన అతడు ఆమెకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఆమె కోసం ప్రేమగా ఏది చెయ్యడు. అతన్ని అభినందించే ఇతర స్త్రీల వైపు ఆకర్షించబడతాడు.
ప్రతి ఒక్కరు తమ నిర్ణయాల విషయంలో దేవునికి లెక్క అపజెప్పవలసినవారిగా ఉన్నారు. తన భాగస్వామి చేసిన పని కారణంగా దేవుడు ఒక వ్యక్తి పాపాన్ని క్షమించడు. మనం జీవించవలసిన రీతిలో జీవించడానికి దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఈ సమాచారం యొక్క ఉద్దేశ్యం, భాగస్వామి నుండి అవసరమైనది కోరుకోవడం లేక పాపాన్ని బట్టి భాగస్వామిని నిందించడం కాదు. దేవుణ్ణి సంతోషపెట్టే బాధ్యతను, భాగస్వామి అవసరాలు తీర్చే బాధ్యతను గ్రహించడమే దీని ఉద్దేశ్యం.
తప్పుడు లక్ష్యాలు
కొన్నిసార్లు ఒక వ్యక్తి జీవితాన్ని సులభతరం చేసుకునే మార్గాల కోసం వెతుకుతాడు. భర్త, తన భార్యను మార్చడం వలన జీవితాన్ని సౌకర్యంగా చేసుకోవాలనుకుంటాడు. అలాగే, భర్త మారితే తన జీవితం సుఖవంతంగా ఉంటుందని భార్య అనుకుంటుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు తన భాగస్వామిని ఎలా మార్చాలని సలహాదారుని లేక పాస్టర్ ని లేక మిత్రుల్ని అడుగుతారు. తమ భాగస్వామిని మార్చుకోవడం సరైన లక్ష్యం కాదు. బంధాల మెలకువలను ఉపయోగించి తన జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తికి దేవునిపై లేదా ఇతరులపై ప్రేమ ప్రేరణ కాదు.
కొన్నిసార్లు, ఒక వ్యక్తి తన భాగస్వామిలో ఉన్నటువంటి లోపాలు సరిచేయడానికి సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తుంటారు. అవే లోపాలని పదే పదే విమర్శిస్తుంటారు. ప్రతి వ్యక్తిలో నిజంగా లోపాలు ఉన్నప్పటికీ, ప్రతి భాగస్వామి లోపాలతోనే ఆ వ్యక్తిని అంగీకరించాలి. లోపాలు వ్యక్తిగత లోపాలు కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు లేక ఆత్మీయ లోపాలు (పాపం కూడా) కావచ్చు. భాగస్వామి మారాలనే ఉద్దేశ్యంపై బంధాలు ఆధారపడకూడదు. వారు మారలేకపోవచ్చు. మారకపోవడానికి కారణం ఏదైనప్పటికీ, ప్రతి భాగస్వామి లోపాలున్నప్పటికీ కూడా ప్రేమను చూపిస్తూ, గౌరవిస్తూ విలువిచ్చేవారిగా ఉండాలి.
ముగింపు
దేవుడు స్త్రీ పురుషుల స్వభావాలు రూపొందించాడు, మరియు మానవుల అవసరాలు తీర్చడానికి వైవాహిక బంధాన్ని ఏర్పాటు చేశాడు. అయితే, పాపం చేత కుటుంబాలు, వైవాహిక బంధాలు పతనమైన లోకంలో మనం జీవిస్తున్నాం. మనలో ప్రతి ఒక్కరం మన సొంత పాపాల వల్ల, ఇతరుల పాపాలు మనపై చూపిన ప్రభావం వల్ల పతనమైపోయాం. దేవుని కృప మనలను మార్చి, ఇతరులకు కృప చూపడానికి మనకు సహాయం చేయకపోతే, దేవుడు ఉద్దేశించిన వైవాహిక జీవితాన్ని మనం అనుభవించలేము. నిర్మలమైన ఉద్దేశాలు, బలమైన ప్రేమ, మరియు సేవ చేసే వినయం మనకు కలగాలంటే దేవుని ఆత్మ మనల్ని శుద్ధి చేయాలి.
సమూహ చర్చ కోసం
► ఈ పాఠంలో మీకు క్రొత్తగా అనిపించినా విషయాలు ఏంటి? మీ వైఖరులు, ప్రవర్తనలు ఎలా మార్చుకోవాలని అనుకుంటున్నారు?
► వైవాహిక బంధాలు బలపరచడానికి సంఘం ఏమి చేయగలదు?
ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ,
అనేక నిర్దిష్టమైన అవసరాలను తీర్చడానికి వైవాహిక బంధాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు. వివాహానికి తగిన ఆదేశాలు ఇచ్చినందుకు వందనాలు.
ఎలా ప్రేమించాలో, ఎలా అర్థం చేసుకోవాలో మాకు నేర్పించు. లోకంలో నీ ప్రేమను ప్రతిబింబించే కుటుంబాలుగా మమ్మల్ని చేయండి.
నువ్వు ప్రేమించినట్లుగా ప్రేమించడానికి కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు.
ఆమెన్
పాఠం అభ్యాసాలు
(1) 1 కొరింథీయులకు 13:4-8 కంఠస్తం చెయ్యండి. తరువాత క్లాసును మొదలుపెట్టే ముందు, కంఠస్తం చేసిన వాక్యభాగాన్ని రాయండి లేక చెప్పండి.
(2) భార్య లేక భర్త అవసరాలను వివరిస్తూ రెండు-పేజీల వ్యాసం రాయండి. ఆ అవసరాలను తీర్చడానికి సహాయపడే భాగస్వామి ప్రవర్తన గురించి ఉదాహరణలు ఇవ్వండి. మీరు చర్చించే ప్రతి అవసరాన్ని బలపరచడానికి లేఖనాలు ఉపయోగించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.