మనం వెళ్ళిపోయిన తరువాత, మన తరువాతి తరానికి దేన్ని విడిచి వెళ్తామో అదే మన పరిచర్యకు పరీక్ష
పరిచయం
అనేక సంవత్సరాలు ఒక గౌరవనీయమైన పాస్టరుగా పని చేసి సూరజ్ పదవి విరమణకు దగ్గరగా ఉన్నాడు. ఒకరతన్ని “నీ పదవి విరమణకు సంఘాన్ని ఎలా సిద్ధపరుస్తున్నావు? రాబోవు 10 సంవత్సరాలకు సంఘ దర్శనం ఏంటి?” అని అడిగారు. “నేను ఇక్కడ ఉండను, కాబట్టి నేను వెళ్లిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకు అనవసరం” అని సూరజ్ బదులిచ్చాడు. ఈ పాస్టరు, సువార్తలో ప్రాముఖ్యమైన సూత్రాన్ని గ్రహించలేదు: మనం వెళ్లిపోయిన తర్వాత మన పరిచర్యకు పరీక్ష కలుగుతుంది.
ఈ పాస్టరుకు ప్రమోద్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించవచ్చు. ప్రమోద్ 25 ఏళ్ల పరిచర్య తరువాత అనుకోకుండా మరణించాడు. ఆ సంవత్సరాల్లో, ప్రమోద్ తన స్థానిక సంఘంలో అనేక పరిచర్యలు చేశాడు. నిరాశ్రయులైనవారి కోసం పరిచర్య అభివృద్ధి చేశాడు, మాదకద్రవ్యాల నుండి బయటపడడానికి పునరావాస కార్యక్రమాలు నిర్వహించాడు, వ్యాపార నాయకుల కోసం సువార్త కార్యక్రమాలు నిర్వహించాడు. ప్రమోద్ సమాధి కార్యక్రమంలో, మాదకద్రవ్య వ్యసన పునరావాస కేంద్రంలోని నాయకుడు, “గత నెలలో, రాబోయే సంవత్సర బడ్జెట్ గురించి చర్చించటానికి ప్రమోద్ మరియు నేను కలిశాం.” నిరాశ్రయులకు పరిచర్య చేసే కార్యక్రమాన్ని చూసే నాయకుడు, కుటుంబాలకు తాత్కాలిక గృహాలను అందించే క్రొత్త భవన నమూనాను చూపించాడు. ప్రమోద్, పరిచర్య భవిష్యత్తును జాగ్రత్తగా ప్రణాళిక చేశాడు. అతడు చెరగని ప్రభావాన్ని విడిచి వెళ్లాడు.
చివరి పాఠంలో, యేసు శిష్యులకు ఇచ్చిన చివరి బోధలు, శిష్యుల చివరి నియామకం, ఆరోహణం తరువాత శిష్యుల పరిచర్య గురించి అధ్యయనం చేస్తాం. చెరగని ప్రభావాన్ని విడిచి వెళ్ళడం గురించి పాఠాలు నేర్చుకుందాం.
► మీరు ఒకవేళ ఈ రాత్రి మరణిస్తే, ఏమి విడిచి వెళతారు?
మీ కుటుంబానికి మీరు ఇచ్చేది ఏంటి?
మీ సమాజానికి మీరు ఇచ్చేది ఏంటి?
మీ పరిచర్యకి మీరు ఇచ్చేది ఏంటి?
యేసు వీడ్కోలు ఉపదేశం
యోహాను 13-16 ను, పాత నిబంధన గ్రంథంలో యాకోబు, మోషే, యెహోషువ, దావీదు ఇచ్చిన “వీడ్కోలు”లతో పోల్చి చూడవచ్చు.[1] యేసు “వీడ్కోలు ఉపదేశం” ఆయన ఇచ్చిన అత్యంత లోతైన, సన్నిహితమైన బోధను అందిస్తుంది.
యోహాను 13:1 ఈ వీడ్కోలు ఉపదేశానికి సందర్భం ఏర్పాటు చేస్తుంది: “తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై.” 48 గంటల్లో చనిపోతామని మీకు తెలిస్తే, మీ పరిచర్యను కొనసాగించు వారితో మీరేమి చెబుతారు? మీ అనుచరుల విషయంలో మీరు ముఖ్యంగా భావించిన విషయాలు, ఆ మాటలు తెలియజేస్తాయి.
ఈ ప్రభు రాత్రిభోజనంలో, యేసు తన మాటలు మరియు క్రియల (వారి కాళ్లు కడుగుట) ద్వారా శిష్యులకు తన ప్రేమను వెల్లడిచేశాడు. యేసు “లోకములోనున్న తనవారిని ప్రేమించాడు.” ఇప్పుడు ఆయన “వారిని అంతమువరకు ప్రేమించెను” (యోహాను 13:1). “అంతమువరకు” అనే మాటలో రెండు ఆలోచనలు ఉన్నాయి:
1. యేసు వారితో గడిపిన సమయం ముగింపు వరకు యేసు వారిని ప్రేమించాడు.
2. యేసు వారిని ఉన్నతంగా ప్రేమించాడు. యేసు వారిని పూర్తిగా ప్రేమించాడు.
► యోహాను 13:31-14:31 చదవండి.
యేసు వీడ్కోలు ఉపదేశంలో ఆజ్ఞలు, వాగ్దానాలు
ఆజ్ఞ: ఒకరినొకరు ప్రేమించాలి (యోహాను 13:34).
“మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.” ప్రేమ కంటే గొడవలకే ప్రసిద్ధిచెందిన శిష్య బృందానికి, ఇది ఒక కష్టమైన ఆజ్ఞే.
ఇది ఏ విధంగా క్రొత్త ఆజ్ఞ? “నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను” అని దేవుని ప్రజలకు పాత నిబంధన కూడా బోధిస్తుంది. యేసు ప్రేమ గురించి బోధించినప్పుడు, అందులో రెండు నూతన కోణాలు ఉన్నాయి.[2]
మొదటిగా, యేసు తాను ఆజ్ఞాపించిన ప్రేమకు మాదిరి చూపించాడు. ఆయన ప్రేమించినట్లుగా వారు ప్రేమించాలి. వారి పాదాలు కడిగిన తరువాత, “నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను” అని యేసు చెప్పాడు. వినయపూర్వకమైన సేవ ద్వారా ఆయన ప్రేమ చూపించాడు. అప్పటి, ఇప్పటి శిష్యులు యేసు ప్రేమించినట్లుగా ప్రేమించాలి. ఈ ప్రేమ, పరిచారం చేయడానికి తువాలు తీసుకుంటుంది. ఈ ప్రేమ మోసం చేసేవాడిని కూడా ప్రేమిస్తుంది. ఈ ప్రేమ మరణం వరకు నిలిచియుంటుంది.
రెండవదిగా, క్రైస్తవుల మధ్య ప్రేమ, యేసు సత్యసందేశానికి ప్రత్యేక సాక్ష్యంగా ఉండాలి. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను” (యోహాను 13:35). తరువాత, “వారియందు నేనును నాయందు నీవును ఉండుటవలనవారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని” (యోహాను 17:23) అని యేసు ప్రార్థించాడు. సంఘ ప్రేమ, ఐక్యత యేసు సందేశానికి సాక్ష్యంగా ఉండాలి.
వ్యక్తిగత లోపాలతో నిండిపోయిన ఒక క్రైస్తవుడ్ని ప్రేమించడం కంటే ఒక అవిశ్వాసిని ప్రేమించడం సులభమని అనేకమంది క్రైస్తవులు కనుగొన్నారు. అయితే క్రైస్తవులుగా, ఒకరినొకరు ప్రేమించాలనే ఆజ్ఞ మనకు ఉంది. యాభై సంవత్సరాలు తరువాత, యోహాను తన సందేశం గురించి సంఘానికి జ్ఞాపకం చేశాడు:
ఎవడైనను–నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము (1 యోహాను 4:20-21).
ఒకరినొకరు ప్రేమించాలనే ఆజ్ఞతో యేసు తన వీడ్కోలు ఉపదేశం మొదలుపెట్టాడు. ఈ ఆజ్ఞ, ఆయన ఈ సందేశంలో ప్రకటించిన సమస్తానికి మూలం.
ఆజ్ఞ: కలవరపడకుడి; విశ్వాసముంచుడి (యోహాను 14:1).
ఎప్పటివలే, పేతురు, “ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావని?” ప్రశ్నించడానికి మధ్యలో జోక్యం చేసుకున్నాడు. ఆయన ఇచ్చిన సమాధానంలో, పేతురు తనని తృణీకరిస్తాడని, ఎరగనని అబద్ధం చెప్తాడని యేసు చెప్పాడు. ఆ తరువాత, యేసు పేతురుతో, తక్కిన శిష్యులతో, నేడు మనతో తన సందేశాన్ని కొనసాగించాడు. “మీ హృదయమును కలవరపడనియ్యకుడి.”
యోహాను 13:38 తర్వాత, అధ్యాయానికి కొంత విరామం ఉంది గనుక, యోహాను 14:1ను ఒక క్రొత్త సందేశంగా చదువుతాం. యోహాను 14:1 పేతురుకి ఇచ్చిన సమాధానంలో భాగం. దీనిని ఇలా చదవండి:
పేతురూ, నీవు నన్ను ముమ్మారు నేను తెలియదని అబద్ధం చెప్తావు. నీవు అనుకున్నదానికంటే బలహీనుడవు. కాని, నిరాశపడవద్దు; పేతురూ, నీ కోసం, ముఖ్యంగా నన్ను పట్టుకున్నప్పుడు భయంతో పారిపోయే మీయందరి కోసం ఒక నిరీక్షణ సందేశముంది. మీ హృదయాలు కలవరపడనీయవద్దు. దేవుని నమ్మండి; నన్ను కూడా నమ్మండి.
తాను విఫలమైనప్పటికీ, యేసు నిరీక్షణ సందేశం ఇస్తాడని పేతురు తెలుసుకోవాలి. శిష్యులు భయపడుతునప్పటికీ, యేసు నిరీక్షణ సందేశం ఇస్తాడని శిష్యులు తెలుసుకోవాలి. “మీ హృదయమును కలవరపడనియ్యకుడి” అనే మాట వర్తమానకాలంలో ఉంది. యేసు హెచ్చరికలు, మతాధికారుల వ్యతిరేకతల కారణంగా, శిష్యులు అప్పటికే భయపడ్డారు. “కలవరపడనియ్యకుడి.....దేవునియందు విశ్వాసముంచుడి, నాయందు విశ్వాసముంచుడి” అని యేసు చెప్పాడు.
పరిచర్య ఒత్తిళ్లతో ఇబ్బందిపడకుండా ఉండే ఏకైక మార్గం విశ్వాసముంచటం. సోమవారం, ప్రపంచవ్యాప్తంగా కొందరు పాస్టర్లు నిరుత్సాహపడుతూ ఉంటారు. నిన్న, మీరు నమ్మకంగా ప్రసంగించారు-మీ సభ్యుల్లో ఒకరు కోపగించుకున్నారు. మీరు పశ్చాత్తాపం గురించి ప్రసంగించారు-ఒక్కరు కూడా స్పందించలేదు. మీరు అవిశ్వాసులను ఆహ్వానించారు-ఒక్కరు కూడా రాలేదు.
కొన్ని దేశాలలో, సంఘాలు ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని దేశాలలో, సంఘాలు ఇస్లాం ఉగ్రవాదుల బెదిరింపులకు గురౌతున్నాయి. ఇంకొన్ని దేశాల్లో, సంఘాలు సాంఘిక నిర్లక్ష్య వైఖరికి, ఎవరు పట్టించుకోని స్థితికి ప్రభావితమౌతున్నాయి. అయితే యేసు, “కలవరపడకుడి. దేవునియందు విశ్వాసముంచుడి; నాయందు విశ్వాసముంచుడి” అని సెలవిస్తున్నాడు.
వాగ్దానం: నేనే మార్గమును (యోహాను 14:6).
యేసు తమ కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని తన శిష్యులను ప్రోత్సహించాడు. ఇప్పుడు తోమా జోక్యం చేసుకుని, “ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని” అడిగాడు.
యేసు ఇచ్చిన సమాధానం, క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్య సూత్రాన్ని ఇస్తుంది. “నేను ఇక్కడికి వెళ్లుచున్నాన”ని యేసు చెప్పలేదు. బదులుగా, “నేనే మార్గమును” అని చెప్పాడు. యేసు, మార్గం లేక దిశ గురించి సూచించలేదు; తననే సూచించుకున్నాడు. లేఖనాల్లో, తండ్రి దగ్గరకు వెళ్ళే ఏకైక మార్గం క్రీస్తు ద్వారా అనే స్పష్టమైన ప్రకటన లేదు. ఉదారవాద వేదాంతవేత్తల (లిబరల్ తీయాలోజియన్) వాదనలకు భిన్నంగా, యేసు తానే దేవుని యొద్దకు వెళ్ళే మార్గమని పేర్కొన్నాడు.
వాగ్దానం: మీరు మరి గొప్పకార్యాలు చేస్తారు (యోహాను 14:12-14).
“నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేనుచేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు వాగ్దానం చేశాడు. ఈ కార్యాలు మరింత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి గొప్పవి కాదుగాని అవి విస్తృతమైన పరిధి కారణంగా గొప్ప కార్యాలుగా పరిగణించబడ్డాయి. ఆయన భూలోక పరిచర్య సమయంలో, యేసు కార్యాలు కేవలం ఒక భౌగోళిక ప్రదేశానికి మాత్రమే పరిమితం. ఇప్పుడు, యేసు పరిశుద్ధాత్ముని పంపుతున్నాడు గనుక, సంఘ కార్యాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి.
“మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతున”ని యేసు కొనసాగించాడు. ఈ వాగ్దానానికి రెండు షరతులు ఉన్నాయి.
(1) “నా నామములో అడగాలి.”
ప్రార్థన ముగింపులో “యేసు నామములో అడుగుతున్నాం” అనే దానికంటే ఇది గొప్పది. ఇది, యేసు మన విన్నపాలు ఆలకించేలా ఆయనను బలవంతం చేయడానికి ఉపయోగించే తాంత్రిక పదం కాదు. బైబిల్ అంతటిలో, దేవుని నామం ఆయన లక్షణాన్ని సూచిస్తుంది. “యేసు నామంలో ప్రార్థించడం” అంటే యేసు చిత్తానికి, లక్షణాలకు అనుగుణంగా ప్రార్థించడం అని అర్థం.
యేసు నామంలో ప్రార్థించడమంటే, కుమారుని అధికారం ద్వారా తండ్రి దగ్గరకు రావడం. మోషే, ప్రభువు నామంలో మాట్లాడడానికి ఫరో యొద్దకు వచ్చినప్పుడు, (నిర్గమకాండము 5:23) తనను పంపిన దేవుని అధికారంతో వచ్చాడు. యేసు నామంలో ప్రార్థించడమంటే, ఆయన అనుమతి, అధికారంతో ప్రార్థించడం. మన కోసం “విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్న” కుమారుని ద్వారా తండ్రిని చేరుకుంటాం (హెబ్రీయులకు 7:25).
(2) “…తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును.”
మన ప్రార్థనలు ఖచ్చితంగా దేవుని మహిమకొరకు ఉద్దేశించబడాలి. “మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు” (యాకోబు 4:3) అని యాకోబు హెచ్చరించాడు. మనం యేసు వాగ్దానాన్ని ప్రకటన చేసేప్పుడు, మన సొంత ఉద్దేశాల కొరకు కాదు; దేవుని మహిమ కొరకు ప్రార్థించాలని నిశ్చయతతో ఉండాలి.
ఆజ్ఞ: నా ఆజ్ఞలను గైకొందురు (యోహాను 14:15).
యేసు ఒక ప్రామాణికత ఇచ్చాడు, దాని ద్వారా మనం ఆయన యెడల మనకున్న ప్రేమను కొలవగలం. “మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు.” యోహాను తన మొదటి పత్రిక రాసినప్పుడు ఈ మాట గుర్తు చేసుకున్నాడు: “ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను” (1 యోహాను 2:5). కొందరు ఆధునిక బోధకుల బోధకు విరుద్ధంగా, శిష్యులు తన ఆజ్ఞల యెడల అవిధేయులుగా జీవించవచ్చని యేసు ఎన్నడు బోధించలేదు. ప్రేమ ఇష్టపూర్వక విధేయతలో కనిపిస్తుంది.
ఆజ్ఞ: ఆయన ఆదరణకర్తను అనుగ్రహిస్తాడు (యోహాను 14:16).
యోహాను 14:16లో “ఆదరణకర్త”గా అనువదించిన పదం, ఒకరి పక్షాన నిలబడే న్యాయవాదిని సూచిస్తుంది. కష్ట సమయాల్లో ఆదరించే సహాయకుని లేక ఆదరణకర్తను సూచిస్తుంది.
తండ్రి “మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను” అనుగ్రహించునని యేసు చెప్పాడు. పరిశుద్ధాత్ముని పరిచర్య యేసు పరిచర్యలా ఉంటుందని ఇది సూచిస్తుంది. ఆత్మ ఏదో ఒక శక్తిగా రాలేదుగాని, యేసులాగా ఒక వ్యక్తిగా వచ్చాడు.
ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు, “ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును” (యోహాను 14:17). ఆయన “సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును” (యోహాను 14:26). ఆయన పరిచర్య చాలా శక్తివంతంగా ఉంటుంది గనుక యేసు ఇలా చెప్పాడు, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును” (యోహాను 16:7).
యేసు వెళ్లిపోవడం శిష్యులకు ఎలా ప్రయోజనకరం? రాబర్ట్ కోల్మెన్ ఇలా వివరించాడు:
ఆయన వారి [శిష్యులు] మధ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఆత్మపై ఆధారపడే అవసరత కొద్దిగా చూశారు, కాబట్టి వారాయన జీవితాన్ని లోతుగా, సన్నిహితంగా తెలుసుకోలేదు. అయితే, ఆయన వారి మధ్య లేనప్పుడు, వారికి కనిపించే సహాయం లేదు. మనుగడ సాగించాలంటే, ఆయనకు తండ్రితో ఉన్న అంతరంగ సంబంధంలోని రహస్యాన్ని గురించి నేర్చుకోవాలి. వారికున్న అవసరాన్ని బట్టి వారు మునుపెన్నడూ లేని దానికంటే అధిక సహవాసం క్రీస్తుతో అనుభవిస్తారు.[3]
ద్రాక్షావల్లిలోని జీవం
► యోహాను 15:1-16:37 చదవండి.
యేసు అత్యంత శక్తివంతమైన సాదృశ్యాలలో ఒకటైన సాదృశ్యంతో కొనసాగించాడు. “నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.” పాత నిబంధన తరచుగా ఇశ్రాయేలును ద్రాక్షావల్లితో పోలుస్తుంది.[4] అయితే, పాపం కారణంగా, ఇశ్రాయేలీయులు, దేవుడు వారిని నాటిన ఉద్దేశ్యాన్ని ఎన్నడు నెరవేర్చలేదు. బదులుగా, ఇశ్రాయేలు భౌతికంగా అభివృద్ధి చెందుతుండగా, అబద్ధ దేవతలకు బలిపీఠాలు కట్టింది (హోషేయ 10:2). రాజ్యాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు ఫలించకుండా, కారు ద్రాక్షాలు ఇచ్చింది[5] (యెషయా 5:2). ఇశ్రాయేలు భయంకరంగా పాపం చేసింది కాబట్టి దేవుడు ఈ ద్రాక్షవల్లితో ఏమీ చేయలేక అగ్నికి అప్పగిస్తాడు (యెహెజ్కేలు 15:1-6).
యేసు నిజమైన ద్రాక్షావల్లిగా వచ్చాడు. ఇశ్రాయేలు రాజ్యం విఫలమైన దానిని నెరవేర్చడానికి వచ్చాడు; రాజ్యాలకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఇశ్రాయేలు పిలుపును నెరవేర్చడానికి వచ్చాడు.
ఆయన ద్రాక్షావల్లియని, వారు తీగెలని యేసు శిష్యులతో చెప్పాడు. యేసు సందేశం స్పష్టంగా ఉంది: ఫలించడం, పూర్తిగా ఆయనయందు నిలిచి ఉండాలనే ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు (యోహాను 15:5).
ద్రాక్షావల్లికి వేరుగా శిష్యులు ఏం చేయలేరు; ద్రాక్షావల్లికి వేరుగా మనం ఏం చేయలేం. మనం మన సొంత బలంతో పరిచర్య చేసినప్పుడు, నిరుత్సాహపడతాం, శక్తిహీనులౌతాం. ఎందుకు? మనం మన సొంతగా ఫలించడానికి ఉద్దేశించబడలేదు.
మన ఆత్మీయ జీవితం కూడా ద్రాక్షావల్లితో కొనసాగే సంబంధం నుండి కలుగుతుంది. ఒకడు ద్రాక్షావల్లిలో అంటుకట్టబడకపోతే, “వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును” (యోహాను 15:6). ఈ వచనం హెచ్చరిస్తున్నప్పటికీ, గొప్ప ప్రోత్సాహం కూడా ఇందులో ఉంది. ద్రాక్షావల్లికి వేరుగా, మనం పనికిరానివారం మరియు విలువలేనివారం. ఒకవేళ ద్రాక్షావల్లితో కొనసాగితే, ఫలభరితమైన జీవితం కలిగి ఉంటాం. మన ఆత్మీయ జీవితం మన సొంత బలంపై ఆధారితం కాదు; మనం “ద్రాక్షావల్లి”లో జీవించాలి.
ఈ విషయం హెబ్రీ పత్రికలో కూడా కనిపిస్తుంది. మన ప్రధాన యాజకుడైన యేసు, ఆయన యొద్దకు వచ్చు వారి కోసం, “విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు” (హెబ్రీయులకు 7:25). హోవార్డ్ హెన్డ్రిక్సన్ ఒంటరితనం అనుభవిస్తున్న శ్రమల్లో ఉన్న పాస్టర్లను ప్రోత్సహించాడు; “మీ కోసం ప్రార్థించే వారు ఎవరు లేకపోతే, క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడని ఎన్నడు మర్చిపోవద్దు.” ఆయన మన విజ్ఞాపనకర్త; ఆయన మన ఆత్మీయ జీవితానికి మూలం.
వారు ద్రాక్షావల్లిలో నిలిచియుండాలని యేసు శిష్యులకు జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు కూడా ఇది వాస్తవమే. పాస్టర్లు, సంఘ నాయకులుగా, మీరు మీ సొంత బలంతో పరిచర్య చేయరు. మీరు ద్రాక్షావల్లి శక్తితో జీవిస్తారు మరియు మీ కోసం మీరు విజ్ఞాపన చేసుకునే శక్తి లేనప్పుడు మన కోసం విజ్ఞాపన చేసే మన ప్రధాన యాజకుని శక్తితో జీవిస్తారు.
యేసు చివరి ఉపదేశంలో మిగిలిన భాగం ద్వారా, శిష్యులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని యేసు బోధించాడు. ఈ లోక ద్వేషాన్ని ఎదుర్కొవడానికి వారిని సిద్ధపరిచాడు. లోకం యేసును ద్వేషించింది; లోకం యేసు నిజమైన శిష్యుల్ని ద్వేషిస్తుంది.
ఆ తర్వాత యేసు పరిశుద్ధాత్ముని కార్యాలు గురించి లోతుగా వివరించాడు. ఉపదేశ ఆరంభంలో, ఆత్మను పంపుతానని వాగ్దానం చేశాడు. ఇప్పుడాయన పరిశుద్ధాత్మ కార్యాలను గురించి మరింతగా వారికి బోధించాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోకాన్ని ఒప్పింపజేస్తాడు; శిష్యుల్ని సర్వసత్యంలోకి నడుపుతాడు; కుమారుని మహిమపరుస్తాడు.
కొద్ది సమయంలో తాను వెళ్ళిపోవడం గురించి వివరించాడు. మళ్ళీ శ్రమల్లో సమాధానం గురించి మాట్లాడాడు. ఉపదేశం ఆరంభంలో, యేసు “మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి” (యోహాను 14:1) అని ఆజ్ఞాపించాడు. ఉపదేశాన్ని సమాంతర ప్రోత్సాహంతో ముగించాడు: “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను” (యోహాను 16:33).
రెండు సందర్భాల్లో, మన నిరీక్షణ కేవలం యేసులోనే ఉందని గమనించండి. మనం క్రీస్తును నమ్మితే కలవరపడకూడదు. బదులుగా, క్రీస్తు లోకాన్ని జయించినందున మనం ధైర్యంగా ఉండాలి! ద్రాక్షావల్లితో జీవితం సమాధాన జీవితం. మన నిశ్చయత భూలోక పరిస్థితులపై ఆధారితం కాదుగాని క్రీస్తుపై, లోకాన్ని జయించిన జయంపై ఆధారితం.
[5]“కారు” అంటే నాటబడిన ద్రాక్షాతోటలో తీపి రుచి కాకుండా “పుల్లటి” రుచి అని అర్థం.
నిశిత పరిశీలన: ప్రభురాత్రి భోజనం
మిష్నా, ఒక ప్రాచీన యూదుల సాంప్రదాయాల నివేదిక. యూదులు పస్కా భోజనం ఎలా చేస్తారో మిష్నాలో ఒక భాగం చూపిస్తుంది.[1] ప్రభురాత్రి భోజనంలో, బహుశ యేసు మరియు శిష్యులు, 2000 సంవత్సరాలు తర్వాత కూడా ఆచరిస్తున్న ఈ పద్ధతి పాటించారు.
నీటితో కలిపిన మొదటి గిన్నె ద్రాక్షారసాన్ని వారికి పోస్తారు. గిన్నె ఇస్తున్నప్పుడు ఆశీర్వచనంలో, నిర్గమకాండంలోని ఈ వాగ్దానం ఉంది: “నేను ఐగుప్తీయులు మోయించు బరువులక్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి.”
ద్రాక్షారసపు రెండవ గిన్నె కలుపుతారు, కాని అప్పుడే పోయరు. చిన్న కుమారుడు “ఈ రాత్రి ఇతర రాత్రులకంటే ఎందుకు ప్రత్యేకం?” అని అడుగుతాడు. అప్పుడు తండ్రి, ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి విడిపించబడిన కథ చెబుతాడు.
కథ ముగిసిన తర్వాత, కుటుంబం మొదటి పస్కా హల్లెల్, కీర్తనలు 113-114 పాడుతుంది. రెండవ గిన్నెను ఈ వాగ్దానంతో త్రాగుతారు: “వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి.”
ఆశీర్వచనం తర్వాత, భోజనం వడ్డిస్తారు. భోజనంలో చేదు ఆకులు, పులియని రొట్టెలు, గొర్రెపిల్ల, వెనిగర్ మరియు దినుసులతో కూడిన సాస్ భాగంగా ఉంటాయి. తండ్రి చేతులు కడుక్కున్న తర్వాత, రొట్టెలు విరిచి ఆశీర్వదించి, రొట్టె ముక్క తీసుకుని, చేదు ఆకులలో చుట్టి, సాస్ లో ముంచి, తింటాడు. ఆ తర్వాత కృతజ్ఞతలు చెప్పి, మాంసం ముక్క తింటాడు. ఆ తర్వాత, కుటుంబ సభ్యులు తింటారు.
మూడవ గిన్నెను పస్కా వాగ్దానంతో ఆశీర్వదిస్తారు: “నేను మిమ్మును విడిపించి.”
నాల్గవ గిన్నెను పస్కా వాగ్దానంతో ఆశీర్వదిస్తారు: “మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని.”
కుటుంబం చివరి పస్కా హల్లెల్, కీర్తనలు 115-118 పాడుతుంది.[2]
పస్కా భోజనంలో, దేవుడు ఇశ్రాయేలును బానిసత్వం నుండి విడిపించాడని యూదులు జ్ఞాపకం చేసుకుంటారు. మరి ముఖ్యంగా, మెస్సీయ ఒకేసారి వారిని బానిసత్వం నుండి విడిపిస్తాడనే దేవుని వాగ్దానాల నెరవేర్పు కోసం కనిపెడతారు.
పస్కా భోజనమైన తర్వాత రోజు, యేసు పరిపూర్ణ పస్కా గొర్రెపిల్లగా వధించబడతాడు. సిలువలో, విమోచనా వాగ్దానం నెరవేర్చబడింది.
[2]గెత్సెమనేకు వెళ్ళేముందు యేసు తన శిష్యులతో కలిసి పాడిన చివరి కీర్తన ఇది (మత్తయి 26:30).
ప్రధాన యాజకుని ప్రార్థన
► యోహాను 17 చదవండి.
శిష్యులు మరియు నేటి సంఘం యేసు విడిచివెళ్ళిన చెరగని ప్రభావాన్ని అర్థం చేసుకోవాలంటే, తన శిష్యులతో చివరిగా చేసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈ ప్రార్థనను “హోలీ ఆఫ్ హోలీస్ ఆఫ్ జీసస్ ప్రేయర్” అని పిలుస్తారు. అది ఆయన చేసిన అత్యంత సన్నిహిత ప్రార్థన.
యేసు తన కోసం ప్రార్థించాడు (యోహాను 17:1-5)
యేసు తన తండ్రికి ప్రార్థించాడు, “నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము.” ఈ ప్రార్థన శిష్యులు గ్రహించనప్పటికీ, ఈ ప్రార్థనకు సమాధానం రోమీయుల సిలువలో కనబడుతుందనే దిగ్భ్రాంతికరమైన సత్యాన్ని త్వరలో నేర్చుకుంటారు.
యేసు శ్రమపొందిన చివరి వారంలో సోమవారం నాడు, “నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని” యేసు చెప్పాడు. “తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెన”ని (యోహాను 12:32-33) యోహాను వివరించాడు. యేసు గెలవడం ద్వారా మహిమపొందలేదు, గాని స్పష్టమైన ఓటమి ద్వారా మహిమపొందాడు. యేసు సిలువ ద్వారా మహిమపొందాడు.
యేసు తన శిష్యుల కోసం ప్రార్థించాడు (యోహాను 17:6-19)
యేసు తన శిష్యుల కోసం మూడు విషయాలు ప్రార్థించాడు. ఆయన నామంలో తండ్రి వారిని కాపాడుతాడని ప్రార్థించాడు. వారిని దుష్టుని నుండి కాపాడుతాడని ప్రార్థించాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అని ప్రార్థించాడు.
యేసు విశ్వాసులందరి కోసం ప్రార్థించాడు (యోహాను 17:20-26)
భవిష్యత్తులో తనయందు విశ్వాసముంచే వారందరి కోసం యేసు ప్రార్థించాడు. వారు ఏకమైయుండాలని ప్రార్థించాడు. ఈ ఐక్యత లోకానికి సాక్ష్యం: “నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు.”
యేసు లోకం కోసం ప్రార్థించలేదు: “లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్ర హించియున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను” (యోహాను 17:9). బదులుగా, క్రైస్తవుల కోసం ప్రార్థించాడు, తద్వారా లోకం నమ్ముతుంది. ఆయన సంఘం కోసం చేసిన చివరి ప్రార్థనలో, మన ఐక్యత, నమ్మకత్వం ద్వారా లోకానికి సాక్ష్యంగా ఉండాలని యేసు ప్రార్థించాడు.
యేసు ఇచ్చిన చెరగని ప్రభావం ఏమిటంటే, లోకంలో తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చు విశ్వాసుల బృందం. పాత నిబంధనలో, సమస్త రాజ్యాలకు ఆశీర్వాద మాధ్యమంగా ఉండడానికి దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించాడు (ఆదికాండము 12:1-3). క్రొత్త నిబంధనలో, ప్రజలందరికీ ఆశీర్వాద మాధ్యమంగా ఉండడానికి దేవుడు సంఘాన్ని దీవించాడు. ప్రజలందరికీ ఆశీర్వాదంగా ఉండాలనే ఆజ్ఞను మనం నెరవేర్చాలని యేసు ప్రార్థించాడు.
నాయకుడి నిలిచిఉండే ప్రభావం, ఎక్కువగా తన దర్శనం ఇతరులతో పంచుకునే విధానంలో నిర్ణయించబడుతుంది. సమర్పణగల అనుచరులను ప్రేరేపించే విధంగా దర్శనాన్ని వివరించే మాదిరి యేసు ఇచ్చాడు. ఆయన దర్శనాన్ని బట్టి, రోమా సామ్రాజ్యమంతటా దేవుని రాజ్య సందేశం ప్రకటించడానికి శిష్యులు తమ జీవితాలు సమర్పించుకున్నారు.
సువార్తలలో యేసు ఆజ్ఞల గురించి మూడు ప్రకటనలు ఉన్నాయి. ప్రతి ప్రకటన విభిన్న కోణంపై దృష్టిపెడుతుంది. మిషన్ లో అధికార అవసరత గురించి మత్తయి నొక్కి చెప్పాడు. మార్కు పరిధి గురించి చెప్పాడు: “సర్వసృష్టికి.” లూకా అపొస్తలులు ప్రకటించవలసిన సందేశ విషయాలపై దృష్టిపెట్టాడు.
యేసు యొక్క చివరి ఆజ్ఞలోని అత్యంత సంపూర్ణమైన ప్రకటన మత్తయి 28:18-20లో ఉంది.
పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను.
ఈ ఆజ్ఞలో మొదటి ఆదేశం “శిష్యులనుగా చేయుడి.” ఈ ఆదేశం నెరవేర్చాలంటే మనం వెళ్ళాలి, క్రొత్తగా మారినవారికి బాప్తిస్మం ఇవ్వాలి, యువ విశ్వాసులకు బోధించాలి. ఈ కార్యాలు “శిష్యులనుగా చేయుడి” అనే కేంద్ర ఆజ్ఞకు మద్దతుగా ఉంటాయి. సౌవార్తీకరణ, సమాజ సేవ, విద్య, పరిచర్యలో మిగిలిన కోణాలు ఈ కేంద్రీయ ప్రాథమిక విషయం ద్వారా నడపబడతాయి: శిష్యులుగా చేయాలని మనల్ని ఆజ్ఞాపించడం.
కాయడం యొక్క (Pastoring) ఉద్దేశ్యం
అమెరికా పాస్టరైన ఎడ్ మార్క్ క్వార్ట్, కమ్యూనిస్ట్ చెరలో చాలా సంవత్సరాలు గడిపిన రోమన్ పాస్టర్ రిచార్డ్ వుమ్బ్రాండ్ తో కలిసి భుజించాడు. భోజన సమయంలో, వుమ్బ్రాండ్ మార్క్ క్వార్ట్ సంఘ సభ్యునివైపు చూసి, “మీ పాస్టర్ మంచివాడేనా?” అని అడిగాడు. “అవునని” అతడు బదులిచ్చాడు.
“అతడు ఎందుకు మంచి పాస్టర్?” అని వుమ్బ్రాండ్ అడిగాడు. “అతడు మంచి ప్రసంగాలు చేస్తాడు” అందుకే మంచివాడని సమాధానమిచ్చాడు.
“కాని అతడు శిష్యులను చేస్తాడా?” అని వుమ్బ్రాండ్ మళ్ళీ అడిగాడు. ఈ ప్రశ్న తన పరిచర్య దిశను మార్చేసిందని పాస్టర్ మార్ క్వార్ట్ చెప్పాడు. అతడిలా చెప్పాడు:
పాస్టర్లందరి యెడల దేవుని ఉద్దేశ్యం.....యేసుక్రీస్తు శిష్యులను తయారుచేయటం. యేసుక్రీస్తును ప్రేమించేవారుగా, యేసుక్రీస్తును అనుసరించేవారుగా, యేసుక్రీస్తును తమ ప్రభువుగా పిలిచేవారుగా తయారు చేయాలి. అందుకే మనం పిలువబడ్డాం; యేసుక్రీస్తు శిష్యులనుగా చేయడానికే గాని సంఘ సభ్యులని చేయడానికి కాదు. సండేస్కూల్ జరిపించడానికి కాదు. భవనాలు నిర్మించడానికి కాదు....యేసు క్రీస్తు శిష్యులుగా చేయడానికి. అదే ఉద్దేశ్యం.[1]
యేసు పరిచర్య చివరి వారంలో జరిగిన సంఘటనలు, అన్ని రాజ్యాలు, మతాలు, జాతులుగల ప్రజలతో తన రాజ్యాన్ని సృష్టించడం ఆయన పని అని చూపిస్తాయి. యేసు పరిచర్య చివరి వారంలోని దృశ్యాలు, ఆయన పరిచర్య దేశాలన్నిటికీ అని చూపిస్తుంది.
యేసు గాడిదపై పట్టణంలోకి ప్రవేశించాడు. మత్తయి మరియు యోహాను జెకర్యా ప్రవచనం ఉల్లేఖించారు, “ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లైయెన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడని.” జెకర్యా ఈ రాజు పరిపాలన గురించి వివరించాడు. “నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు” (మత్తయి 21:5, జెకర్యా 9:9-10).
ఆయన అన్యులు ఆరాధించే దేవాలయ ఆవరణాన్ని శుద్ధిచేసినప్పుడు, యేసు యెషయా మాటలు ఉల్లేఖించాడు: “నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా?” (మార్కు 11:17, యెషయా 56:7 ఉల్లేఖించాడు). అన్యజనులు కూడుకొని ప్రార్థించు స్థలాన్ని యూదా నాయకులు రూకలు మార్చే, గువ్వలమ్ముతు క్రమవిక్రయాలు చేసే స్థలంగా మార్చారు.
విలువైన అత్తరు వృథా చేస్తుందని చెప్పి శిష్యులు మరియను విమర్శించినప్పుడు, యేసు: “సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను” (మార్కు 14:9).
ఒలీవ (Olivet) ప్రసంగంలో, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” (మత్తయి 24:14) అని యేసు చెప్పాడు. రాజ్యం కేవలం ఎన్నుకోబడిన వారికే అని నమ్మే ఈ యూదులైన శిష్యులతో, లోకమంతటా సువార్త ప్రకటించబడుతుందని యేసు చెప్పాడు.
రాజ్యలన్నిటి కొరకు మెస్సీయ వస్తాడని పాత నిబంధన ప్రవక్తలు చెప్పారు. ఆయన పరిచర్య చివరి వారంలో, దేవుని రాజ్యంలో అన్ని రాజ్యాల ప్రజలుంటారని యేసు తన శిష్యులకు బోధించాడు. ప్రవక్తల వాగ్దానం సంఘం ద్వారా నెరవేర్చబడుతుంది.
యేసు విడిచి వెళ్ళిన నిలిచియుండు స్వాస్థ్యం: అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘం
క్రీస్తు జీవితంపై రాసిన అనేక పుస్తకాలు ఆరోహణంతోనే ముగుస్తాయి. అయితే, యేసు పరిచర్య సిలువ లేక ఖాళీ సమాధి వరకే కాదు; ఆయన పరిచర్య పెంతెకొస్తు యొద్దకు నడిపింది. వారితో ఎల్లప్పుడు ఉండునట్లు యేసు ఆదరణకర్తను పంపుతానని చెప్పాడు (యోహాను 14:16). ఈ వాగ్దానం అపొస్తలుల కార్యములలో నెరవేరింది. అపొస్తలుల కార్యములలో రెండు దృశ్యాలు, యేసు వారసత్వం నెరవేర్పును చూపిస్తాయి.
పెంతెకొస్తుదినమందు సంఘం
► అపొస్తలుల కార్యములు 1:4-11 మరియు అపొస్తలుల కార్యములు 2:1-41 చదవండి.
ఆరోహణమయ్యే ముందు, శిష్యులు, “ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?”అని అడిగారు. యేసు భౌతిక, రాజకీయ సంబంధమైన రాజ్యం స్థాపిస్తాడని ఆశించారు. వారి మనసుల్లో, పునరుత్థానం భౌతిక రాజ్య అవకాశాన్ని బలపరచింది. యేసు రోమీయులను వెల్లగొట్టడానికి తన అధికారం ఉపయోగించాలని వారు ఆశించారు. అయితే యేసు ఇలా స్పందించాడు,
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను (అపొస్తలుల కార్యములు 1:7-8).
“రాజ్యం ఎప్పుడొస్తుందని తెలుసుకోవడం మీ పని కాదు,” అని యేసు సూచించాడు. “బదులుగా, నేను మీకిచ్చిన పని నెరవేర్చాలి. భూదిగంతాలవరకు నాకు సాక్షులై ఉండాలి. కాని మీరు వెళ్ళే ముందు, వేచియుండాలి.” లూకాలో, “పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని” (లూకా 24:49) యేసు చెప్పాడు.
పస్కా పండుగైన యాభై దినాలు తర్వాత, 120మంది శిష్యులు మేడగదిలో ఉండగా, పరిశుద్ధాత్ముని వాగ్దానం నెరవేరింది. యూదుల పెంతెకొస్తను పండుగకు ఇతర దేశాల నుండి వచ్చిన ప్రజల భాషల్లో మాట్లాడటం వారు మొదలుపెట్టారు (అపొస్తలుల కార్యములు 2:4, 6-11). ఇది, సమస్త దేశాల నుండి వచ్చిన ప్రజలతో తన సంఘాన్ని ఏర్పాటు చేయాలనే క్రీస్తు ప్రణాళిక నెరవేర్పుకు సూచన.
అపొస్తలుల కార్యములు 2లోని రాజ్యాల జాబితా, ఆదికాండము 10లో రాజ్యాల జాబితాను మనకు గుర్తుచేస్తుంది. ఆదికాండము 11లో, వారి భాషలు తారుమారు చేస్తూ బాబెలు యొద్ద సార్వత్రిక రాజ్యం ఏర్పాటు చేయాలనే మానవుని ప్రయత్నానికి దేవుడు తీర్పుతీర్చాడు. అపొస్తలుల కార్యములు 2లో, భాషల తారుమారును త్రిప్పికొడుతూ, దేవుడు తన రాజ్యాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు.
పెంతెకొస్తు, “వాటికంటె మరి గొప్పవియు” అని యేసు వాగ్దానం చేసినదానికి ఆరంభం (యోహాను 14:12). యేసు విడిచివెళ్ళిన చెరగని ప్రభావపు నెరవేర్పు ఆరంభమైంది. వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు అపొస్తలుల పరిచర్యలో పని చేస్తున్నాడు. ఈ సమయం నుండి, తన రాజ్యాన్ని స్థాపించడంలో దేవుని గొప్ప ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం, సంఘం ఆరంభించింది. పేతురు ప్రసంగం స్పష్టం చేసినట్లుగా, పాత నిబంధన వాగ్దానాలు సంఘం ద్వారా ఇప్పుడు నెరవేరుతున్నాయి.
పెంతెకొస్తను దినంలో నాలుగు కోణాలు జాన్ స్టాట్ వివరించాడు.[1]
పెంతెకొస్తు దినం, భూలోకంలో యేసు చివరి రక్షణ చర్య.
పెంతెకొస్తు దినం గొప్ప ఆదేశం కోసం అపొస్తలులను సిద్ధపరచింది.
పెంతెకొస్తు దినం, పరిశుద్ధాత్ముని నూతన యుగానికి ఆరంభం. పాత నిబంధన అంతటా, పరిశుద్ధాత్ముడు పరిచర్యలోని ప్రత్యేక సమయాల్లో దేవుని బిడ్డలను బలపరచాడు. పెంతెకొస్తు తర్వాత, అన్ని సమయాల్లో, అన్ని ప్రాంతాల్లోని క్రైస్తవులు ఆయన పరిచర్య ద్వారా ప్రయోజనం పొందుతారు.
పెంతెకొస్తు దినం నాడు మొదటి క్రైస్తవ ఉజ్జీవం మొదలైంది.
పెంతెకొస్తు ప్రభావాలు అపొస్తలుల కార్యములు పుస్తకమంతటా కనిపిస్తాయి. పెంతెకొస్తు దినమందు జరిగిన సూచనలు ప్రత్యేకం. ఆనందం, విశ్వాసుల సహవాసం, ఆరాధనలో స్వేచ్ఛ, దైర్యంగా సాక్ష్యమివ్వడం, పరిచర్యలో శక్తి ఇవన్నీ పరిశుద్ధాత్ముని శక్తిలో పరిచర్యకు సాధారణ రుజువులు.
ఆది సంఘంలో అనుదిన జీవం
► అపొస్తలుల కార్యములు 2:42-47 చదవండి.
యేసు వారసత్వం నెరవేర్పును చూపించే రెండవ దృశ్యం అపొస్తలుల కార్యములు 2 చివర్లో కనిపిస్తుంది.
ఆయన ప్రధాన యాజకుని ప్రార్థనలో, తన అనుచరుల ఐక్యత గురించి యేసు ప్రార్థించాడు. “మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని” (యోహాను 17:22) అని ప్రార్థించాడు. ఈ ప్రార్థనకు సమాధానం, అపొస్తలుల కార్యములు 2లో మొదలౌతుంది. “విశ్వసించినవారందరు ఏకముగా కూడి” “ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు;” మరియు ప్రభువు “రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.”
అపొస్తలుల కార్యముల్లో “ఏకమనస్సుతో”అనే పదం, సంఘ ఐక్యతను సూచిస్తుంది. యూదులు మరియు అన్యజనులతో కూడిన సంఘాన్ని ఏర్పరచడంలో ఇబ్బందులున్నప్పటికీ, యూదా నాయకులు హింసిస్తున్నా, అపొస్తలుల మధ్య వ్యక్తిగత విభేదాలున్నప్పటికీ సంఘం ఐక్యంగా ఉంది. ఇబ్బందులున్నా, “వారును ఏకమై యుండవలెనని” యేసు చేసిన ప్రార్థన నెరవేరింది.
► అపొస్తలుల కార్యములు 2:42-47లో ఈ సంఘ దృశ్యం, మీ సంఘంలా ఉందా? మీరు ఆత్మ శక్తితో పరిచర్య చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే, మీ పరిచర్యలో ఆత్మ కార్యాన్ని ఏ అవరోధాలు అడ్డుకుంటున్నాయి? మీ అవిధేయతా? ప్రార్థనాహీనతా? విశ్వాసలేమి? ఐక్యత లేమి? మీ పరిచర్యలో ఆత్మ కుమ్మరింపు మీరు ఎలా చూస్తారు?
[1]John W. Stott, The Message of Acts (Westmont, Illinois: InterVarsity Press, 1990), 60-61
అన్వయం: చెరగని ప్రభావాన్ని విడిచి వెళ్ళడం
పదవి విరమణ నొందిన పరిచర్య నాయకులు వారు విడిచివెళ్ళే చెరగని ప్రభావాన్ని గురించి, నాయకత్వాన్ని విడిచిపెట్టె తమ సిద్ధపాటు గురించి, పరివర్తనా పాఠాల గురించి కొన్ని మాటలు చెప్పారు.[1]
(1) చెరగని ప్రభావాన్ని విడిచివెళ్ళే నాయకులు భవిష్యత్ కొరకు ప్రణాళిక చేస్తారు.
ఒక నిర్మాణకుడ్ని ఇలా అడిగినట్లు ఊహించుకోండి, “మీరేమి నిర్మిస్తున్నారు?” “నాకు ఇంకా తెలీదు. ఏం జరుగుతుందో చూస్తున్నాను” అని సమాధానమిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
అతడు నిర్మాణం మొదలుపెట్టె ముందు, అంతిమంగా నిర్మించే దానిని ప్రణాళిక చేస్తాడు. చెరగని ప్రభావాన్ని విడిచివెళ్ళే నాయకులకు, ఏమి విడిచివెళ్ళాలో తెలుసు.
మంచిగా పూర్తి చేసే నాయకులకు వారు విడిచివెళ్లాలనుకుంటున్న వారసత్వం గురించి స్పష్టమైన అవగాహన ఉంటుంది. వారు గ్రుడ్డిగా పరిచర్య చేయరు. ఈ నాయకులు, “నా పరిచర్య స్థలంలో దేవుడు నన్ను ఈ పని నెరవేర్చమని పిలిచాడు” అని విశ్వసించారు.
యేసు ఇచ్చిన చెరగని ప్రభావం, సంఘాన్ని నడిపించే శిష్య బృందాన్ని సిద్ధపరచడం. ఆయన పరిచర్య ఆరంభం నుండి, వీరిని సిద్ధపరచడానికి తగినంత సమయాన్ని, శక్తిని వెచ్చించాడు.
[2]మీరు చెరగని ప్రభావాన్ని విడిచిపెట్టాలంటే, భవిష్యత్ ప్రణాళిక ఉండాలి. విచారకరంగా, చాలామంది లక్ష్యం లేకండా జీవితాలు గడుపుతున్నారు. ఒకవేళ మీరు వారిని, 30, 50, 70 ఏళ్ళ వయసులో, “మీ జీవితంలో ఏం చేస్తున్నారు?” అని అడిగితే, “నాకు తెలీదు, ఏం చెయ్యాలో చూస్తున్నాను” అని చెబుతారు.
(2) చెరగని ప్రభావాన్ని ఇచ్చే నాయకులు బాధ్యతల్ని సజావుగా అందించడానికి జాగ్రత్తగా సిద్ధపడతారు.
ఒక పెద్ద ప్రాజెక్టు ముగింపుకి దగ్గరలో ఉన్నప్పుడు, నిర్మాణకుడిని దర్శించారని అనుకోండి. గోడలు కట్టాడు; పైకప్పు వేశాడు; అందులోకి వెళ్లి, ఉండటమే ఆలస్యం. “నిర్మాణం పూర్తవ్వాలంటే ఇంకా ఏం మిలిగియున్నాయి?” అని అడగండి.
ఒకవేళ అతడు ఇలా సమాధానమిస్తే మీరు ఆశ్చర్యపోతారు, “ఈ ముగింపు విషయాలు గురించి నేను అంత ఆలోచన చేయలేదు. నాకు తెలీదు!” కాదు! తాను చేయాలనుకున్నది ఏదో విడిచిపెడుతున్నాడు. అతడు ప్రతిదీ జాగ్రత్తగా ప్రణాళిక చేస్తాడు. “ఫలానా రోజు మేం నిర్మాణం ముగిస్తాం. ఫలానా రోజు మీరు ఇంట్లోకి వెళ్ళొచ్చు” అని చెప్పగలడు. పరివర్తనకు ప్రతిదీ ప్రణాళిక చేయబడుతుంది.
చెరగని ప్రభావాన్ని ఇచ్చు నాయకులు నాయకత్వ మార్పుకు జాగ్రత్తగా సిద్ధపడతారు. సాధ్యమైనప్పుడు, వారు ముందుగానే తమ పదవి విరమణ ప్రణాళిక చేసుకుంటారు, వారసుని ఎన్నుకోవడానికి వ్యవస్థకు సమయమిస్తారు, వారసులు నూతన బాధ్యతలు చేపట్టే అనుమతిస్తారు. కొన్ని సందర్భాల్లో, వెళ్లిపోయే నాయకుడు సలహాలివ్వడానికి అందుబాటులో ఉన్నప్పుడే క్రొత్త నాయకుడు నిర్ణయాలు తీసుకునే సమయం కూడా ఉంటుంది.
చెరగని ప్రభావాన్ని ఇచ్చే నాయకులు, వారు నడిపే పరిచర్యను మార్పుకు సిద్ధం చేస్తారు. వెళ్లిపోయే ప్రభావవంతమైన నాయకులు భవిష్యత్తుపట్ల దేవుని ఏర్పాటునందు విశ్వాసాన్ని పంచుతారు. తరువాత వచ్చే నాయకుని క్రింద మంచిగా పనిచేయడానికి ప్రజలను సిద్ధపరుస్తారు. నాయకత్వ మార్పులో, వ్యవస్థలోని ప్రజలు సురక్షితంగా ఉండేట్లు చూసుకుంటారు. ఒక నాయకుడు ఇలా రాశాడు: “నేను వెళ్లిపోయానన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తించలేని విధంగా దానిని సున్నితం చేయటమే నా లక్ష్యం.”
(3) చెరగని ప్రభావాన్ని విడిచివెళ్ళే నాయకులకు ఎప్పుడు వెళ్ళాలో తెలుసు
నాయకులు తమ వారసులకు బాధ్యతలు అప్పగించి, పశ్చాత్తాపపడకుండా వెళ్లిపోవాలి. మునుపటి నాయకులు సలహాలకు అందుబాటులో ఉండాలి, కాని వారసులు అడిగినప్పుడు మాత్రమే.
ఈ కోర్సులో, సంఘ నాయకత్వాన్ని శిష్యులు తీసుకోవడానికి యేసు వారిని ఎలా సిద్ధపరిచాడో మనం చూశాం. ముందుగా, ఆయన వారికి జాగ్రత్తగా శిక్షణ ఇచ్చాడు. తరువాత, పరిచర్య కోసం బయటకు పంపించాడు, పరిశీలన కోసం వచ్చారు. ప్రభు భోజనంలో, పరిచర్యకు తుది హెచ్చరికలు ఇచ్చాడు. ఆరోహణమయ్యే ముందు, గొప్ప ఆజ్ఞ గురించి చివరిగా గుర్తుచేశాడు. పరివర్తన కోసం యేసు జాగ్రత్తగా సిద్ధపడ్డాడు.
విచారకరమైన విషయమేమిటంటే, చాలామంది క్రైస్తవ నాయకులు నాయకత్వ బదిలీపై దృషిపెట్టరు. “నన్ను భర్తీ చేసేవరకు నా పని నేను చేస్తాను. ఆ తర్వాత, అది మరొకరి సమస్య అవుతుంది” అనుకుంటారు. వాస్తవానికి, ఆకస్మిక అనారోగ్యం, మరణం, లేక పరిచర్యలో గొప్ప మార్పు, పరివర్తనకు తగినంతగా సిద్ధపడలేని సందర్భాలు ఉంటాయి. కాని సాధ్యమైనప్పుడు, తదుపరి నాయకుడు పరివర్తన కోసం మనం జాగ్రత్తగా ప్రణాళిక చేయాలి. భవిష్యత్తుకు చెరగని ప్రభావాన్ని సంరక్షించడంలో ఇది చాలా ముఖ్యం.
[1]ఈ భాగానికి సంబంధించిన ఇంటర్వ్యూలలో ఈ క్రింది నాయకులు ఉన్నారు:
Dr. Michael Avery, God’s Bible School and College, Cincinnati, OH మాజీ అధ్యక్షుడు.
Rev. Paul Pierpoint, Hobe Sound Bible Church మాజీ పాస్టర్ మరియు FEA Missions, Hobe Sound, FL అధ్యక్షుడు.
Rev. Leonard Sankey, రిటైర్డ్ పాస్టర్ మరియు బహుళ మిషన్ సంస్థల నాయకుడు
Dr. Sidney Grant, FEA Missions, Hobe Sound, FLమాజీ అధ్యక్షుడు.
“మీరు చెరగని ప్రభావాన్ని ప్రతిరోజు నిర్మిస్తారు, మీ జీవితం ముగింపులో కాదు.”
- అలాన్ వీస్
పాఠం 9 అభ్యాసాలు
ఈ సూచనల ఆధారంగా 3-5 పేజీల వ్యాసం రాయండి:
(1) మీ క్రైస్తవ జీవితం, పరిచర్యను ప్రభావితం చేసే, చెరగని ప్రభావాన్ని విడిచివెళ్ళిన నాయకుడు లేక కుటుంబ సభ్యుడు గురించి ఆలోచించండి. ఒక పేజిలో, మీ జీవితంలో వాళ్ల ప్రభావం గురించి క్లుప్తంగా రాయండి. రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
మీ జీవితంపై వాళ్ల ప్రభావం ఏంటి?
మీరు ప్రభావితమయ్యే విధంగా వాళ్లు ఏం చెప్పారు లేక చేశారు?
(2) మీరు చనిపోయేటప్పుడు, మీరు విడిచివెళ్ళాలనుకునే చెరగని ప్రభావం ఏంటి? నిర్దిష్ట సమాధానం చెప్పండి. 1-2పేజీల్లో సమాధానం రాయండి.
మీ కుటుంబానికి మీరు ఏ చెరగని ప్రభావాన్ని ఇస్తారు?
మీ సమాజానికి, మీరు ఏ చెరగని ప్రభావాన్ని ఇస్తారు?
మీ పరిచర్యకు, మీరు ఏ చెరగని ప్రభావాన్ని ఇస్తారు?
(3) సమాధానం 2లోని మూడు విషయాల్లో ప్రతి దానికి, మీరు విడిచిపెట్టడానికి ఇష్టపడే ప్రభావం కోసం మీరు ఇప్పుడు పాటించాలనుకునే వాటిని గుర్తించండి. 1-2 పేజీల్లో సమాధానం రాయండి.
ఈ పేపరు మీ దగ్గర పెట్టుకుని, వచ్చే ఆరు నెలలు వారానికి ఒకసారి పునఃపరిశీలన చేయండి. తరువాత తరానికి మీరు ఇవ్వాలనే చెరగని ప్రభావాన్ని ప్రణాళిక చేయడానికి దీనిని వాడుకోండి.
Print Course
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.