ప్రభావవంతమైన పరిచర్యంతా సిలువ పునరుత్థాన శక్తిలో జరుగుతుంది.
పరిచయం
సువార్తలలో చివరిది శ్రమను గూర్చిన కథ (సిలువ). సువార్తలలోని 89 అధ్యాయాల్లో, 30 అధ్యాయాలు యెరూషలేములో విజయోత్సవ ప్రవేశం మరియు పునరుత్థానం మధ్య జరిగిన సన్నివేశాలకే కేటాయించారు. యోహాను సువార్తలో సుమారు సగానికి సగం ఈ వారంలో జరిగిన సంఘటనలకే కేటాయించారు. యేసు పూర్తి జీవితం, ఆయన పరిచర్య సూచించిన చివరి ఘట్టం ఇదే. ఈ పాఠంలో, యేసు ఈ లోకంలో చేసిన పరిచర్య చివరి వారాన్ని అధ్యయనం చేసి, మన జీవితానికి, పరిచర్యకు పాఠాలు నేర్చుకుందాం.
► ఈ పాఠం కొనసాగించే ముందు, రెండు ప్రశ్నలు చర్చిద్దాం:
వేదాంతపరంగా, వ్యక్తిగతంగా సిలువ నాకు ఎలా వర్తిస్తుంది?
వేదాంతపరంగా, వ్యక్తిగతంగా పునరుత్థానం నాకు ఎలా వర్తిస్తుంది?
యేసుకు ఇచ్చిన ప్రతిస్పందనలు: యేసు బహిరంగ పరిచర్య చివరి వారం
సువార్తికులు ప్రాధమికంగా నొక్కి చెప్పిన విషయాలలో ఒకటి, యేసును ముఖాముఖిగా ఎదుర్కొనినవారి ప్రతిస్పందన. ఉదాహరణకు, యేసు జీవిత ఆరంభంలో, మత్తయి జ్ఞానుల ఆరాధనకు, ప్రత్యర్థి రాజును చంపడానికి చూసిన హేరోదు ప్రతిస్పందనకు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. యోహాను బావి యొద్ద చదువులేని సమరయ స్త్రీతో చేసిన సంభాషణకు, యూదుల బోధకుడైన నీకొదేము ప్రశ్నకు ప్రతిస్పందించడానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరించాడు.
► మత్తయి 10:32-39 చదవండి.
యేసు సందేశ విషయంలో ఎవ్వరు తటస్థంగా ఉండరు; అయితే ఆయన మాటలు అంగీకరిస్తారు లేక తిరస్కరిస్తారు. యేసు తన పరిచర్య గురించి, ఈ రెండు బృందాలను వేరు చేసే ఖడ్గంగా వివరించాడు. తమ స్పందన ఆధారంగా కుటుంబాలు విభజించబడతాయి; యేసు కుటుంబం కూడా ఈ పరీక్ష ఎదుర్కొంది (యోహాను 7:5, మార్కు 3:21). ఎవ్వరు తటస్థంగా ఉండరు.
యేసుకు విరుద్ధమైన ప్రతిస్పందనలు, ఆయన బహిరంగ పరిచర్య చివరి వారంలో మరింత నాటకీయంగా కనిపిస్తాయి. ఈ వైరుధ్యం సిలువలో కూడా కొనసాగింది, ఇద్దరు దొంగలు యేసుకు భిన్నంగా ప్రతిస్పందించారు.
లాజరును లేపిన సందర్భంలో ప్రతిస్పందనలు
► యోహాను 11:1-57 చదవండి.
లాజరును లేపడానికి ముందు, మతాధికారులు యేసును వ్యతిరేకించారు. శీతాకాలంలో ప్రతిష్ఠిత పండుగ సమయంలో యేసు దేవాలయాన్ని దర్శించినప్పుడు, ఆయన దేవదూషణ చేస్తున్నాడని మతాధికారులు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు. అది ఆయన త్యాగానికి సమయం కాదు గనుక, యేసు యెరూషలేమను మతపరమైన కేంద్రం నుండి తప్పించుకుని యోర్దాను వైపుకు వెళ్ళాడు (యోహాను 10:22-42).
లాజరు చనిపోయాడన్న వార్త విన్నప్పుడు, యేసు యూదయకు తిరిగి వెళ్ళటం ప్రమాదమని శిష్యులకు తెలుసు. పాఠకులు తోమా అనుమానం, నిరాశావాదాన్ని అవమానిస్తారు కాని అతడు తన యజమాని యెడల నమ్మకంగా ఉన్నాడు. యేసును యూదయలో చంపుతారని అతడు సరిగానే ఊహించాడు, అయితే తోమా నమ్మకస్తుడు. యేసు యూదయకు వెళ్ళాలని నొక్కి చెప్పినప్పుడు, “ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్లుదము” (యోహాను 11:16)అని తోమ తన తోటి శిష్యులతో చెప్పాడు. తోమా తరువాత అనుమానం వ్యక్తపరచినప్పటికీ, ఈ భయపడే ఈ శిష్యుని నమ్మకత్వాన్ని మనం మర్చిపోకూడదు. పునరుత్థానం తర్వాత, తోమా భారతదేశానికి సువార్త తీసుకెళ్ళి, అక్కడ హతసాక్షి అయ్యాడని ఆశ్చర్యపోతున్నారా?
బేతనియ వంటి చిన్న గ్రామంలో, లాజరును లేపడాన్ని రహస్యంగా ఉంచలేదు. అలాంటి నాటకీయ సంఘటనను దాచే విధానం మతాధికారులకు లేదు. ఈ అద్భుతానికి వివిధ ప్రతిస్పందనలు వచ్చాయని యోహాను చూపించాడు.
జనసమూహం ప్రతిస్పందన
లాజరును లేపిన వార్త వ్యాప్తి చెందగా, యేసు రోమాను పడద్రోసి, యెరూషలేములో దావీదు సింహాసనం స్థిరపరుస్తాడని ప్రజలంతా ఆశించారు. యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయని నమ్మారు. “కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి” (యోహాను 11:45 మరియు 12:11). “ఇదిగో లోకము ఆయనవెంటపోయినదని చెప్పుకొనిరి” (యోహాను 12:19) అని యేసు గురించి పరిసయ్యుడు మాట్లాడిన మాటలు చాలామంది నమ్మారు. యేసు గాడిదపై యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు, ఇది జనసమూహంలో ఉత్సాహాన్ని ప్రేరేపించింది.
మతాధికారుల ప్రతిస్పందన
లాజరును లేపటం, మతాధికారులు యేసును మెస్సీయగా తిరస్కరించే విధానాన్ని పాడుచేసింది. జనసమూహమంత యేసు వైపు మొగ్గు చూపినందున, మతాధికారులకు కేవలం రెండు ఎంపికలు మాత్రమే మిగిలాయి:
1. యేసు తాను ప్రకటించినట్లు మెస్సీయ అని నమ్మడం. అయితే, అధికారం కొరకు వారికున్న ఆశను వారు ఆయనకు అప్పగించుకోవాలి. యేసు అప్పటికే వారి వేషధారణ ప్రవర్తనను ఖండించాడు. యేసు మెస్సీయని వారు ఒప్పుకుంటే, యూదా ప్రజలకు నాయకులుగా వారు తమ అధికారాన్ని కోల్పోతారు.
2. యేసును పట్టుకుని చంపడం. యేసు మెస్సీయగా అంగీకరించకపోతే, వారు ఆయనను చంపుతారు.
యేసును చంపటం రాజ్యానికి ఉత్తమమైన విషయంగా మతాధికారులు సమర్థించారు. చరిత్రయంతటిలోని బలహీనమైన నాయకులవలే, వారు తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. “కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి–మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి” (యోహాను 11:47-48). యేసు రోమాకు వ్యతిరేకంగా విప్లవం నడిపిస్తాడని వారు భయపడ్డారు. ఆయన రాజ్యం ఆత్మీయమైనదని వారు గ్రహించలేకపోయారు.
“మన స్థలమును” అంటే బహుశా దేవాలయాన్ని సూచిస్తుంది, మరియు “మన జనమును” అంటే ఇది రోమీయులు యూదులకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది (అపొస్తలుల కార్యములు 6:13 మరియు అపొస్తలుల కార్యములు 21:28 చూడండి). యూదయ రోమా ఆధీనంలో ఉన్నప్పటికీ, యూదులు దేవాలయంలో ఆరాధించేవారు, మతపరమైన నియమాలు పాటించేవారు, సన్హెడ్రిన్/మహాసభ ద్వారా కొంతమేరకు పౌర వ్యవహారాలు నడిపించుకుంటారు. రోమా తిరుగుబాటును పతనం చేస్తే ఇదంతా నాశనమైపోతుంది.
జనమంతయు నశించిపోకుండా ఒక మనుష్యుడు చనిపోవడం ఉత్తమమని కయప సన్హెడ్రిన్ కు ధృవీకరించాడు (యోహాను 11:49-50). వ్యంగ్యంగా, యేసును చంపిన తరువాత, సన్హెడ్రిన్ భయం నిజమైంది. యేసును చంపిన నలభై సంవత్సరాలకు, రోమీయులు యూదుల తిరుగుబాటుదారులను అణచివేసి, దేవాలయాన్ని నాశనం చేశారు, యూదా ప్రజల హక్కులు తీసివేశారు, కయప నివారించడానికి చూసిన ప్రతి పనిని చేశారు.
రుజువులన్నిటిని నాశనం చేయకుండా వారు ఈ అద్భుతాన్ని దాచిపెట్టలేకపోయారు గనుక, రాజ్య రక్షణ కొరకు యేసును మరియు లాజరును చంపాలని సన్హేడ్రిన్/మహాసభ నిర్ణయించింది (యోహాను 11:53 మరియు యోహాను 12:10). అద్భుతాలు ఖచ్చితంగా అవిశ్వాసులను నమ్మించలేవు. మనం చాలాసార్లు ఇలా ఆలోచిస్తాం, “ఒక అద్భుతం ద్వారా దేవుడు తననుతాను ‘నిరూపించుకుంటే,’ అందరు నమ్ముతారు.” అయితే, సంశయవాదికున్న అవిశ్వాసాన్ని బట్టి అద్భుతం అతని హృదయాన్ని మరింత కఠినపరుస్తుంది.
ధనవంతుడు, లాజరు కథలో (యేసు లేపిన లాజరు కాదు), తన సోదరులను హెచ్చరించుటకై లాజరును పంపుమని ధనవంతుడు అబ్రాహామును వేడుకున్నాడు. అప్పుడు అబ్రాహాము, “ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలోనుండి ఒకడు లేచినను వారు నమ్మరని” (లూకా 16:31) చెప్పాడు. సత్యానికి లేఖనమే చాలినంత ఆధారం. మనం లేఖనాలు విస్మరిస్తే, ఇతర సాక్ష్యాలు మనలను ఒప్పించలేవు.
యేసుకు ఇచ్చిన ప్రతిస్పందన: మరియ
► మత్తయి 26:6-13 మరియు యోహాను 12:1-11 చదవండి.
యేసు భూమిపై చేసిన పరిచర్య అంతటా, లాజరు మార్తాల సహోదరియైన మరియ, ఆయనను భయభక్తులతో అనుసరించినవారిలో ఒకరు. ముందు జరిగిన కథలో, మార్తా అనేక పనుల భారంతో ఉండగా మరియ యేసు మాటలు వినడానికి కూర్చుందని మార్తా ఫిర్యాదు చేసింది. ఆ కథలో, యేసు మరియను కొనియాడాడు. “ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదు” (లూకా 10:42).
ఆయన మరణానికి వారంలోపే, యేసు ఆయన శిష్యులు కుష్ఠురోగియైన సీమోను ఇంటిని దర్శించారు. లాజరు మరియు అతని సహోదరీలను కూడా అక్కడికి ఆహ్వానించారు. భోజనం సమయంలో, మరియ విలువైన అత్తరు యేసు తల, పాదాలు మీద పోసింది. ఈ అత్తరు వెల, ఒక సంవత్సరం వేతనమైన మూడు వందల దేనారాలు. బ్యాంకులు లేని దినాల్లో, బహుశ ఇది మరియ పొదుపు కావచ్చు.
మరియ చాలా డబ్బు వృథా చేసిందని శిష్యులు కోపపడ్డారు (మత్తయి 26:8, మార్కు 14:5), కాని మరియ మాత్రం యేసు ప్రతిస్పందన కొరకు చూసింది. ఆమె ప్రేమతో ఆ పని చేసింది గనుక ఇతరులు ఏమనుకుంటారో అనే విషయం ఆమె పట్టించుకోలేదు. ఆ అత్తరు వెల ఎంతో పట్టించుకోలేదు, ఇతరులు ఏమనుకుంటారో అనే విషయం ప్రక్కన పెట్టింది. ఆమె తన యజమానుని ఆరాధించింది, మరేది పట్టించుకోలేదు.
మరియ పనిని శిష్యులు వ్యతిరేకించారు, యేసు వారిని గద్దించాడు: “ఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను” (మార్కు 14:6). సిలువకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయని గ్రహించి, యేసు ఆమె చేసిన ఆ సూచనార్థక పనిని గుర్తించాడు: “ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను” (మత్తయి 26:12). తన ఉత్తమమైనదాన్ని నిస్వార్థమైన ప్రేమపూర్వక ఆరాధనగా అర్పించిన ఈ స్త్రీని యేసు గౌరవించాడు.
మరియ యేసును అభిషేకించిన కథ గురించి చదివినప్పుడు, “నేను యేసును ఎంత ప్రేమిస్తున్నాను? నేను ఆయనకు ప్రాముఖ్యత ఇస్తానా లేక ఇతరులకు ఇస్తానా?” అని ప్రశ్నించుకోవాలి. మరియ యేసును నిజంగా ప్రేమించింది.
యేసుకు ఇచ్చిన ప్రతిస్పందనలు: విజయోత్సవ ప్రవేశం
► మత్తయి 21:1-11 మరియుయోహాను 12:12-19 చదవండి.
ఆదివారం, యేసు గాడిదపై యెరూషలేములో ప్రవేశించాడు. సాధారణమైన రోజు, ఈ సంఘటలో ఎటువంటి అసాధారణం లేదు; గలిలయ బోధకుడు చిన్న గుంపుతో పస్కా పండుగకు యెరూషలేముకు వచ్చాడు. కాని ఇది సాధారణ సమయం కాదు. లాజరును లేపటంవలన ఈ పస్కా పండుగ, మతపరమైన రాజకీయపరమైన ప్రకటనగా మారిపోయింది.
యేసు యెరూషలేములోకి ప్రవేశించిన మతపరమైన సూచనలను మత్తయి నొక్కి చెప్పాడు. యేసు ప్రవేశం జెకర్యా ప్రవచన నెరవేర్పని మత్తయి చూపించాడు. జనసమూహం మాట్లాడిన మాటలు కీర్తన 118 నుండి తీసుకోబడినవి, ఇది యెరూషలేములో విజయోత్సవ ఊరేగింపును వివరించే పస్కా కీర్తన (మత్తయి 21:4-11, జెకర్యా 9:9, కీర్తన 118:26).
ఈ ఊరేగింపు రాజకీయ ప్రకటనలతో నిండుకొనియుంది:
రాజుకు లోబడుతున్నామనడానికి సూచనగా జనసముహమంతా మార్గంలో తమ వస్త్రాలు పరిచారు (మత్తయి 21:8, 2 రాజులు 9:13).
మక్కాబీయుల కాలం నుండి, ఖర్జూర మట్టలు సైనికు శత్రువులపై విజయానికి సూచనగా ఉన్నాయి (యోహాను 12:13, 1 మక్కాబీయులు 13:51).
“జయము” అంటే “రక్షించుము” రక్షణకొరకైన మొర అని అర్థం.
“దావీదు కుమారునికి” అనే పదం రాజరిక మెస్సీయ బిరుదు.
యేసు రోమాను పారద్రోలి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి యెరూషలేములో ప్రవేశిస్తున్నాడని ప్రజలు నమ్మారు. దావీదు రాజు కోసం చాలాకాలం నుండి వేచిచూస్తున్న విధానం ముగిసింది. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు త్వరలో నెరవేరతాయి.
కేవలం కొన్ని దినాలు తరువాత, ఈ ప్రజలే, “వానిని సిలువవేయుమని! కేకలు వేశారు.” ఎందుకు? వారు యేసును తప్పుడు కారణాలతో గొప్ప చేశారు. ఆయన రోమాను పారద్రోలతాడని వారు నమ్మారు కాని సైనిక దళాన్ని నడిపించే ఉద్దేశ్యం ఆయనకు లేదు. వారు రాజకీయ సంబంధమైన రాజ్యం కోసం చూస్తున్నారు, కాని ఆయన ఆత్మీయ సంబంధమైన రాజ్యాన్ని తీసుకొస్తున్నాడు. కాబట్టి వారు నిరుత్సాహపడి, త్వరలోనే యేసుకు వ్యతిరేకంగా తిరుగబడ్డారు.
సన్హెడ్రిన్/మహాసభలో రాజకీయ అధికారులు, సమాజంలో ఉన్నతమైనవారు యేసును చంపాలని నిర్ణయించుకున్నారు; సాధారణ ప్రజలు, ఎలాంటి పలుకుబడి లేని వారు కూడా యేసుకు వ్యతిరేకంగా మారారు. ముందు జరుగబోవు దానిని గ్రహించి, ఆయనను తిరస్కరించు పట్టణ గతి చూసి యేసు కన్నీరు విడిచాడు (లూకా 19:41-44). ఆయన విజయోత్సవ ఊరేగింపు సిలువకు నడిపిస్తుందని యేసుకు తెలుసు. జనసమూహం కీర్తన 118:26, “యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక” అను మాటలు ఉల్లేఖించారు. కీర్తనలో తరువాత మాటలు యేసుకు తెలుసు, “ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి.” (కీర్తన 118:27) త్వరలోనే “బలిపీఠం” అంటే రోమా సిలువకు కట్టివేయబడు బలిపశువుగా యేసు యెరూషలేములోకి ప్రవేశించాడు.
నిశిత పరిశీలన: యేసు అంజూరపు చెట్టును శపించుట
► మార్కు 11:12-25 చదవండి.
యేసు ఆయన పరిచర్య చివరి వారంలో ఫలించని అంజూరపు చెట్టును శపించిన సంఘటన సారూప్య సువార్తలన్నిటిలో ఉంది. బేతనియలో రాత్రి గడిపి, సోమవారం ఉదయాన యెరూషలేములోకి ప్రవేశిస్తుండగా యేసు అంజూరపు చెట్టును శపించాడు. మంగళవారం, 24 గంటల్లోనే ఆ చెట్టు వాడిపోవడం శిష్యులు చూశారు.
అది అంజూరపు పండ్లకాలము కాదు (మార్కు 11:13) అయినప్పటికీ, పచ్చటి పండ్లు చెట్టుకు ఉండాలని ఆకులు సూచిస్తున్నాయి. అంజూరపు పండ్లు ఆకులు వచ్చిన కొద్దిదినాలకే కనిపిస్తాయి. చెట్టుకు అంజూరపు పండ్లు లేకుండా ఆకులు మాత్రమే ఉన్నప్పుడు, ఆ సంవత్సరం ఆ చెట్టు ఫలించదు.
ఈ కథ ఫలించని ఇశ్రాయేలును గూర్చిన ఒక సజీవమైన ఉదాహరణ.[1] అనేక రాజ్యాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు (ఆదికాండము 12:3). అయితే, ఇశ్రాయేలు యెహోవా నామానికి అవమానం తెచ్చింది.
దేవాలయం సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడాలి (యెషయా 56:7). కాని, దేవాలయం దొంగల గుహగా మారింది, శక్తివంతమైన ప్రధాన యాజకులు బీదలను మోసం చేస్తున్నారు.
అంజూరపు చెట్టు ఫలించలేదు; ఇశ్రాయేలు ఫలించలేదు. అంజూరపు చెట్టు శపించబడింది. ఇశ్రాయేలు త్వరలో శపించబడుతుంది.
అంజూరపు చెట్టును శపించటం, యేసు బహిరంగ పరిచర్య చివరి దినాల్లో ఒక తీవ్రమైన తీర్పు సందేశం:
1. ఫలాలు లేని అంజూరపు చెట్టు సజీవ ఉపమానం (మార్కు 11:12-14, 20-25).
2. దేవాలయం శుద్ధీకరణ (మార్కు 11:15-19).
3. అపనమ్మకమైన కాపులవారి ఉపమానం (మార్కు 12:1-12).
4. మతాధికారులతో వివాదాలు (మార్కు 12:13-40).
5. దేవాలయాన్ని నాశనమవ్వడాన్ని గురించి యేసు ప్రవచనం (మార్కు 13:1-37).
[1]పాత నిబంధనలో, అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సూచనగా ఉంది (ఉదా. యిర్మీయా 8:13, హోషేయ 9:10, యోవేలు 1:7).
యేసుకు ఇచ్చిన ప్రతిస్పందనలు: యేసు బహిరంగ పరిచర్య చివరి వారం (కొనసాగింపు)
యేసుకు ఇచ్చిన ప్రతిస్పందనలు: మతాధికారులు
► మత్తయి 21:23-22:46 చదవండి.
లాజరును లేపిన తర్వాత, మతాధికారులు యేసును చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన జనాదరణవలన కష్టమైంది. ప్రజల దృష్టిలో యేసును కించపరచడానికి కొన్ని మార్గాల కోసం వెదకసాగారు. యేసు విజయోత్సవ ప్రవేశానికి కొన్ని రోజులు తరువాత, మతాధికారులు దేవాలయంలో సంఘర్షణలను కలిగించారు. యేసును ఇరికించాలని చూశారు, కాని పదే పదే విఫలమయ్యారు. యేసు తరచూ ఆయన జ్ఞానంతో తెలివితో మతాధికారులను ఇబ్బందిపెట్టడం ప్రజలు చూశారు.
మొదటిగా, దేవాలయాన్ని శుద్ధీకరించే, మరియు బహిరంగంగా ప్రకటించే ఆయన అధికారాన్ని మతాధికారులు పెద్దలు సవాలు చేశారు. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఒక ప్రశ్నతో యేసు వారిని ఇబ్బంది పెడుతూ సమాధానమిచ్చాడు.
ఆ తర్వాత మతాధికారులను ఖండించే మూడు ఉపమానాలు యేసు చెప్పాడు. కేవలం వృత్తి మాత్రమే కాదుగాని విధేయత దేవుని రాజ్యంలో సంబంధాన్ని నిరూపిస్తుందని ఇద్దరు కుమారుల ఉపమానం చూపిస్తుంది. యేసును మెస్సీయగా అంగీకరించకపోవడం వలన కలిగే ఫలితాలు గురించి దుర్మాగ్గులైన కావాలివారి ఉపమానం సెలవిస్తుంది. చివరిగా, విందుకు ఆహ్వానించబడిన మతాధికారులు ఆహ్వానాన్ని తిరస్కరించారు కాని అర్హతలేని వారు ఆహ్వానానికి స్పందించారని వివాహ విందు ఉపమానం సెలవిస్తుంది.
యేసును కించపరచటానికి నిర్ణయించుకుని, ఆయనను ఇరికించాలని మతాధికారులు అనేక ప్రశ్నలు తీసుకొచ్చారు. వాళ్ల ఉద్దేశ్యం సత్యం నేర్చుకోవడం కాదు; యేసును నాశనం చేయడం. వారు సత్యాన్ని ఆశించడం లేదని యేసుకు తెలుసు గనుక, ఆయన వారి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదు.
యేసును ఇరికించడంలో విఫలమైనందున, నాయకులు విరమించుకున్నారు. మత్తయి వాళ్ల వైఫల్యాన్నిచూపిస్తూ, ఈ భాగం ముగించాడు: “ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు” (మత్తయి 22:46). ఈ వివాదాలను చూస్తున్న సాధారణ ప్రజల ఆనందం చూపిస్తూ మార్కు ముగించాడు, “సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి” (మార్కు 12:37).
► పాస్టరుగా లేక క్రైస్తవ నాయకునిగా, మీరు కష్ట ప్రశ్నలు ఎదుర్కొంటారు. నిజాయితీగా అడిగే ప్రశ్నలకు, మిమ్మల్ని ఇరికించాలని చూసే ప్రశ్నలకు తేడా ఎలా గ్రహిస్తారు? ఈ రెండు విధాల ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానాలు ఎలా ఉంటాయి? (ఈ విరుద్ధతకు ఉదాహరణగా సామెతలు 26:4-5 చూడండి.)
విచారణ మరియు సిలువ
► 1 కొరింథీయులకు 15:1-8 చదవండి.
యేసు ఆరోహణమైన ఇరవై సంవత్సరాలు తర్వాత, పౌలు కొరింథీ పట్టణంలో సంఘం స్థాపించాడు. ఈ సంఘంలో వివిధ నేపథ్యాల వారు ఉన్నారు. హెబ్రీ లేఖనాలు ఎరిగిన యూదులు, నిజమైన దేవుని గురించి అవగాహనలేని అన్యులు ఉన్నారు.
కొరింథీ సంఘంలో విభేదాలు వచ్చాయి, అబద్ధ బోధలు బయలుదేరాయి. ఈ సమస్యలకు ప్రతిస్పందనగా, పౌలు మొదట ప్రకటించిన మాటలు కొరింథీయులకు గుర్తుచేశాడు. ఒక పెద్ద అన్య పట్టణంలో పౌలు చేసిన మొదటి ప్రసంగం నాలుగు చారిత్రిక సంఘటనల ఆధారంగా ఉంది:
క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతిపొందెను.
సమాధిచేయబడెను.
మూడవదినాన లేపబడెను.
ఆయన బహిరంగంగా- కేఫాకు, పండ్రెండుగురికి, ఒకేసారి ఐదువందలమందికి, యాకోబుకు, అపొస్తలులకు, చివరిగా పౌలుకు కనబడెను.
కొరింథీ పట్టణంలో పౌలు చేసిన ప్రసంగంలో మొదటి భాగం సిలువ గురించి: “క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను.” సిలువ సందేశం క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం.
పాత నిబంధనలో, బలి అర్పణ కోసం గొర్రెపిల్లను తెచ్చిన వ్యక్తి దానితో గుర్తించబడుటకు గొర్రెపిల్ల తలపై చేయి పెడతాడు. గొర్రెపిల్ల తలపై చేయి పెట్టడం ద్వారా, ఆరాధించే వ్యక్తి “నేను నా పాపము నిమిత్తం మరణానికి పాత్రుడను. ఈ గొర్రెపిల్ల నా స్థానంలో మరణిస్తుంది” అని చెబుతాడు. అదే విధంగా, మనం మన పాపాల నిమిత్తం మరణ పాత్రులం; కాని క్రీస్తు మన స్థానంలో మరణించాడు. మనం మరణ పాత్రులం; మనం జీవించునట్లుగా ఆయన మరణించాడు.
క్రీస్తు బాధపడటానికి గల కారణం
“ఆయనను కొరడాలతో కొట్టారా?
అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థతకలుగుచున్నది.
ఆయన నిర్దోషిగా ఉన్ననూ, దోషియాయెనా?
మనం అపరాధులమైననూ, విడిచిపెట్టబడితిమి.
ఆయనపై ముళ్ళ కిరీటం పెట్టారా?
మనం మహిమ కిరీటం పొందుతాము.
ఆయన వస్త్రాలు తీసివేశారా?
మనం శాశ్వత నీతితో కప్పబడుతాం.
ఆయనను దూషించి, అవమానించారా?
మనం గౌరవాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతాం.
ఆయన దుష్టునిగా ఎంచబడి, అపరాధులలో యెంచబడ్డాడా?
మనం నిర్దోషులుగా, పాపం నుండి నీతిమంతులుగా తీర్చబడుతాం.
[1] J.C. Ryle, Expository Thoughts on the Gospel of Matthew: A Commentary, Updated ed. (Abbotsford, WI: Aneko Press, 2020), 331
విచారణ మరియు సిలువ (కొనసాగింపు)
బంధించడం
► మత్తయి 26:1-5, 14-56చదవండి.
ప్యాషన్ వీక్ బుధవారం, యేసు తన మరణం రెండు దినాల తరువాత జరగనుందని ముందుగానే చెప్పాడు. మహాసభవారు పస్కా పండుగ జనాలు పట్టణాన్ని విడిచి వెళ్ళిన తరువాత, ఈ భవిష్యవాణి చెబుతున్న సమయానికి కనీసం తొమ్మిది రోజుల తరువాత, యేసును అరెస్టు చేయాలని ప్రణాళిక చేశారు. అయితే, యూదా తన యజమానుని తిరస్కరించడానికి సిద్ధమయ్యినప్పుడు, ఆయన అనుచరుల్లో ఒకరి సహకారం ఉన్నప్పుడే యేసును అరెస్టు చేయాలని నిర్ణయించారు.
ప్రధానయాజకులకు యూదా ఎందుకు అవసరం? ఆయన జనసమూహానికి దూరంగా ఉన్నప్పుడే వారు యేసును పట్టుకోవాలి. ఆయన ప్రజాదరణవలన, బహిరంగంగా ఆయనను అరెస్టు చేస్తే అల్లర్లు జరుగుతాయి.[1]
ఆయన శిష్యులతో కలిసి పస్కా భోజనం చేసిన తరువాత, యేసు ప్రార్థించడానికి గెత్సెమనే తోటకు వెళ్ళాడు. సిలువ శ్రమను, అదే విధంగా తండ్రికి దూరమైన ఆత్మీయ ఆవేదన అనుభవిస్తూ, యేసు ఇలా ప్రార్థించాడు, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే” (మత్తయి 26:39). ఉన్నత విచారణలో కూడా, యేసు తన తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు.
ఆ రోజు సాయంకాలవేళ, యేసును బంధించడానికి యూదా గొప్ప జనసమూహంతో వచ్చాడు.[2] యూదా యేసును ముద్దుతో గుర్తించిన తర్వాత, యేసు సైనికులతో మాట్లాడాడు. “ఆయన–నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి” (యోహాను 18:6). ఈ సైనిక బృందం మరణంపై అధికారమున్న వ్యక్తికి భయపడ్డారు. ఆయన శత్రువులు కాదు, యేసు అధికారంలో ఉన్నాడు. 19వ శతాబ్దపు ప్రసంగికుడైన ఆక్టేవియస్ విన్స్లో, “యేసును మరణానికి అప్పగించింది ఎవరు? డబ్బు కోసం యూదా కాదు. భయంతో పిలాతు కాదు. శత్రుత్వంతో యూదులు కాదు. ప్రేమ కోసం తండ్రి అప్పగించాడు!” అని అన్నాడు.[3]
యేసు విచారణలో యూదుల విచారణ మరియు రోమీయుల విచారణ రెండు ఉన్నాయి. యూదుల ధర్మశాస్త్రం ప్రాచీన న్యాయవ్యవస్థలో అత్యంత మానవత్వంగలది; జీవితాన్ని కాపాడడానికి యూదుల ధర్మశాస్త్రం సాధ్యమైనంత చేసింది. రోమా చట్టం దాని కఠినమైన నియమాలకు మరియు సమగ్రతకు ప్రసిద్ధి చెందింది. ప్రాచీన లోకంలో ఈ రెండూ ఉత్తమమైన న్యాయవ్యవస్థలే, కాని అవి దేవుని కుమారుని చంపకుండా పాపులను ఆపలేకపోయాయి.
ఆయనను బంధించిన తర్వాత, యేసును చట్టబద్ధమైన ఆరు విచారణలు చేశారు. యూదుల మతపరమైన విచారణలు, రోమీయుల పౌర విచారణలు. యూదుల విచారణ యూదుల ధర్మశాస్త్రం ప్రకారం చట్టవిరుద్ధమని చరిత్రకారులు చెబుతారు. యేసును ఒప్పించాలనే కంగారులో, మహాసభవారు:
రాత్రి విచారణ చేపట్టారు (చట్టవిరుద్ధం)
యేసును బంధించడానికి ముందు అధికారికంగా ఆరోపణలు చేయలేదు (చట్టవిరుద్ధం)
యేసు తన పక్షాన సాక్ష్యం చెప్పేందుకు సాక్షులను పిలవడానికి ఆయన్ని అనుమతించలేదు (చట్టవిరుద్ధం)
యూదా ధర్మశాస్త్రం అనుమతించిన దానికంటే వేగంగా విచారణను చేపట్టారు (చట్టవిరుద్ధం)
ఇదంతా యేసును సిలువవేసి పస్కా ముగిసే లోపే ఆయన దేహాన్ని తీసివేయటానికి చేశారు. సరైన సమయంలో పస్కా గొర్రెపిల్లను భుజించగలిగేలా వారు దేవుని గొర్రెపిల్లను చంపారు.
విచారణల క్రమం
(1) అన్న ఎదుట యూదుల విచారణ (యోహాను 18:12-14, 19-23)
అన్నను జీవితకాల ప్రధాన యాజకునిగా నియమించారు. అన్న స్థానంలో అతని అల్లుడు కయపను రోమీయులు నియమించినప్పటికీ, చాలామంది యూదులు అన్నను “ప్రధాన యాజకుడు” అనే పేరుతో పిలిచేవారు. అన్న ఎదుట ఈ మొదటి విచారణను అనధికారికంగా చేపట్టారు. ఇందులో ఆరోపణలు లేవు, సాక్షులు లేరు.
(2) మహాసభ ఎదుట యూదుల విచారణ (మత్తయి 26:57-68)
మహాసభ యెదుట మొదటి విచారణ తెల్లవారుజామున 2:00 గంటలు జరిగియుండవచ్చు. వారు సూర్యోదయానికి ముందు చట్టబద్ధంగా విచారణ నిర్వహించలేకపోయినప్పటికీ, యూదా నాయకులు మరింత వేగవంతం చేయాలని చూశారు. రాత్రి జరిగిన విచారణ చట్టవిరుద్ధమైనప్పటికీ, మహాసభ అనధికార విచారణ చేపట్టి, దేవదూషణ చేశాడని ఆరోపించి, అందుకు మరణ శిక్ష సరైనదని నిర్ణయించారు.
(3) మహాసభ ఎదుట అధికారికంగా యూదుల విచారణ (లూకా 22:66-71)
ఉదయకాలమైనప్పుడు, మహాసభ అధికారికంగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో, యేసు దేవదూషణ చేశాడని అధికారికంగా ఆరోపించింది.
(4) పిలాతు ఎదుట మొదటి రోమీయుల విచారణ (లూకా 23:1-5, యోహాను 18:28-38)
నేరస్తులను చంపే అధికారం రోమా మహాసభకు ఇవ్వలేదు (యోహాను 18:31). పిలాతు మరణ శిక్ష విధించాలని, యూదా మతాధికారులు మతపరమైన ఆరోపణలను రాజకీయపరమైన ఆరోపణగా మార్చారు. “ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి” (లూకా 23:2).
పస్కా సమయంలో, యూదులు అపవిత్రులై పస్కా భోజనం చేయలేమనే భయంతో ఏ రోమీయుల భవనాల్లోకి ప్రవేశించరు. వారు రాజభవనంలోకి వెళ్ళలేరు గనుక, రాజభవనం బయట పిలాతు విచారణ చేపట్టాడు.
(5) హేరోదు అంతిప ఎదుట రోమీయుల విచారణ (లూకా 23:6-12)
యేసు నిర్దోషియని పిలాతుకు తెలుసు, కాని యూదా నాయకులకు అతడు కోపం తెప్పించాలని అనుకోలేదు. “ఇతడు గలిలయదేశము మొదలుకొని ఇంతవరకును యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని,” (లూకా 23:5) యేసు గురించి అతడు విన్నప్పుడు, పిలాతు గందరగోళ పరిస్థితి నుండి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పస్కా వారంలో, గలిలయ పాలకుడు హేరోదు అంతిప, యెరూషలేములో ఉన్నాడు.[4] యేసు గలిలయకు చెందినవాడు గనుక, ఈ కేసులో హేరోదు న్యాయవాదిగా వ్యవహరిస్తాడని పిలాతు ఆశించాడు. పిలాతు యేసును హేరోదు యొద్దకు పంపించాడు, కాని హేరోదు జోక్యం చేసుకోవడానికి నిరాకరించాడు.
యేసు, అతని న్యాయస్థానానికి తిరిగి వచ్చినప్పుడు, పిలాతు మరో పరిష్కారం కోసం వెదకాడు. యేసు నిర్దోషియని పిలాతుకు తెలుసు: “ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ లేదు” (లూకా 23:14). పిలాతు నిర్దోషియైన యేసును ఖండించుటకు ఇష్టపడలేదు.
నమ్మకద్రోహం చేసినందున కైసరుకు చెప్తామని నాయకులు అతన్ని బెదిరించినప్పుడు, పిలాతు వారి మాటలకు లొంగిపోయాడు. పిలాతు బలహీనమైన నాయకుడు. మునుపటి సంఘర్షణలో, చక్రవర్తి రూపాన్ని మోసుకుంటూ యెరూషలేములో ప్రవేశించడానికి అతడు సైనికులను అనుమతించాడు. ఐదు రోజులు పిలాతు రాజభవనం వెలుపల యూదులు నిరసనలు చేపట్టారు. నిరసనకారులను చంపుతానని అతడు బెదిరించినప్పుడు, పరిశుద్ధ పట్టణంలో కైసరు ప్రతిమను సహించటం కంటే చనిపోతామని చెప్పారు. అప్పుడు పిలాతు వెనక్కి తగ్గవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఈ అనుభవం వలన, పిలాతు యూదా ప్రజలకు భయపడ్డాడు. తరువాత, రోములో అతనిపై అధికారి సిజేనస్, పిలాతు యూదా ప్రజలను నియంత్రించలేడని భావించాడు. యేసును విడుదల చేస్తే కైసరుకు ఫిర్యాదు చేస్తామని నాయకులు బెదిరించినప్పుడు, “సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను” (యోహాను 19:16). యేసు దోషియని చెప్పి పిలాతు ఆయనకు మరణ శిక్ష విధించలేదుగాని, అతని బలహీనతవలన విధించాడు.
విచారణ సమయంలో, పేతురు యేసును తిరస్కరించాడు
పస్కా భోజన సమయంలో, యేసు పేతురును “ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను” (యోహాను 13:38) అని హెచ్చరించాడు. ఇప్పుడు, యేసు విచారణ సమయంలో, పేతురు యేసును ముమ్మారు తిరస్కరించాడు.
పేతురు అవమానకరంగా పతనమైన సంఘటన గురించి మనం చదివినప్పుడు, ఆ రాత్రి యేసును విఫలం చేసింది కేవలం పేతురు మాత్రమే కాదని మనం గుర్తుంచుకోవాలి. పేతురు మరియు యోహాను మాత్రమే విచారణలో హాజరయ్యారు. ఇతర శిష్యులు భయంతో పారిపోయారు.
పేతురు యేసును ప్రేమించాడనేది స్పష్టం. అయితే ఎందుకు పడిపోయాడు? మునుపు, శోధన ఎదుర్కోవడం గురించి పాఠాలు నేర్చుకోవడానికి యేసు శోధన గురించి మనం చదివాం. పేతురు పతన స్థితి నుండి, మనం శోధించబడినప్పుడు సహాయపడే హెచ్చరికలు నేర్చుకుంటాం. పేతురు పతనానికి కనీసం రెండు లక్షణాలు కారణం:
(1) మితిమీరిన విశ్వాసం/అతి నమ్మకం
సాతాను దాడి గురించి యేసు హెచ్చరించినప్పుడు, పేతురు అతిశయంతో ఇలా చెప్పాడు: “చూచి నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను” (మత్తయి 26:35). మనం అతి నమ్మకంతో ఉన్నప్పుడు, పతనమయ్యే ప్రమాదంలో ఉంటాం. కేవలం ఆత్మ శక్తి ద్వారా మాత్రమే మనం జయజీవితం పొందగలం. ఆత్మీయ విఫలతకు అతి నమ్మకం ప్రధాన కారణం.
(2) ప్రార్థనలేమి
తోటలో, “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి” యేసు తన శిష్యులకు హెచ్చరించాడు (లూకా 22:40). రాబోవు పరీక్షను ఎదుర్కొనే బలం కోసం ప్రార్థించకుండా, పేతురు నిద్రపోయాడు.
ప్రార్థన లేకపోవడం, ఆత్మీయ ఓటమికి నడిపిస్తుంది. శక్తివంతమైన ప్రార్థనా జీవితం లేకుండా జయజీవితం కొనసాగించటం అసాధ్యం. సాతానుడు, క్రైస్తవ పరిచారకులను అనేక పనుల్లో నిమగ్నం చేసి, ప్రార్థించే సమయం లేకుండా చేస్తాడు. ప్రార్థించలేనంత బిజీగా ఉన్నప్పుడు, మనం పతనమైపోతామని సాతానుడికి తెలుసు.
► మీ క్రైస్తవ జీవితాన్ని, పరిచర్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. శోధనలో పడిపోయిన లేక పతనమగుటకు సమీపమైన సందర్భాలు గుర్తు చేసుకోండి. పతనానికి ఏవి కారణం? అతి నమ్మకం కలిగించే పరిచర్య జయం మీరు అనుభవిస్తున్నారా? మీరు బిజీగా ఉండి, ప్రార్థనలో తగినంత సమయం గడుపలేకపోతున్నారా? భవిష్యత్తుకు హెచ్చరిక సంకేతాలుగా ఉండే ఇతర విషయాలు ఉన్నాయా?
విచారణ సమయంలో యూదా ఆత్మహత్య చేసుకున్నాడు
పేతురు తిరస్కరించిన వెంటనే, మత్తయి యూదా ఆత్మహత్య చేసుకోవడాన్ని గురించి చెబుతాడు. ద్రోహ ఫలితాలు చూసి, యూదా తన మనసు మార్చుకుని, ఆ ముప్పై వెండి నాణేలు ప్రధాన యాజకులు, పెద్దలు యొద్దకు తీసుకొచ్చి, “నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని” (మత్తయి 27:3-4) అని చెప్పాడు. ద్రోహం చేయడానికి తీసుకున్న ఆ వెండి నాణేలు పారవేసి, పోయి ఉరిపెట్టుకున్నాడు (మత్తయి 27:5). యూదా జీవితకాలం అపరాధ భావనతో ఉండకుండా ఆత్మహత్యను ఎంచుకున్నాడు.
మత్తయి కథనం పేతురు పశ్చాత్తాపాన్ని మరియు యూదా విచారాన్ని ప్రక్కప్రక్కన ఉంచుతుంది. పేతురు, యూదా ఇద్దరు పశ్చాత్తాపపడ్డారు. అయితే, యూదాకు, నిజమైన పశ్చాత్తాపానికి ఉపయోగించే సాధారణ పదం కాకుండా ఒకరి మనసు మార్చుకొనుట అనే ఆలోచనను వ్యక్తపరిచే పదాన్ని మత్తయి ఉపయోగించాడు. పాప నేరారోపణల విషయంలో ప్రజలు ప్రతిస్పందించే విధానం అర్థం చేసుకోవడానికి ఈ వ్యత్యాసం చాలా ప్రాముఖ్యం.
పౌలు విచారం (పాప ఫలితాలు విషయంలో దుఖం) మరియు పశ్చాత్తాపం (పాప విషయంలో దుఖం, దిశ మార్చుకునే విధానం) మధ్య వ్యత్యాసం గురించి రాశాడు. అపొస్తలుడు ఇలా రాశాడు: “దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును” (2 కొరింథీయులకు 7:10).
దైవచిత్తానుసారమైన దుఖం రక్షణార్థమైన మారుమనసు జీవితం కలిగిస్తుంది. లోకానుసారమైన దుఖం విచారం కలిగిస్తుంది, అది అపరాధానికి, మరణానికి నడిపిస్తుంది. పేతురు, యూదా ఇద్దరు దుఃఖపడ్డారు, కానీ కేవలం పేతురు మారుమనసు పొందాడు.
యూదా తన ద్రోహ ఫలితాలు చూసి, అపరాధం అవమానం కంటే మరణాన్ని ఎన్నుకున్నాడు; అతడు విచారపడ్డాడు, కాని మారుమనసు పొందలేదు. పేతురు తన పతన ఫలితాలు చూసి, నిజమైన మారుమనసు పొందాడు. యూదా విచార ఫలితం మరణం; పేతురు పశ్చాత్తాప ఫలితం ఫలభరితమైన శాశ్వత పరిచర్య.
► పాప విషయంలో విచారపడి, నిజమైన మారుమనసు పొందని ప్రజలను మీరు చూశారా? ఫలితం ఏంటి? మన ప్రసంగంలో, మనం ప్రజలను నిజమైన మారుమనసులోకి ఎలా నడిపిస్తాం?
సిలువ
► మత్తయి 27:27-54చదవండి.
యూదయ ఒక రోమా సైనికునికి భయంకరమైన ప్రదేశం. ప్రజలకు రోమా సైనికులంటే ద్వేషం, జేలోతులు వారిని చంపడానికి కుట్రలు చేశారు. పస్కా సమయంలో, అల్లర్లు జరుగుతాయని సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండేది. ఒక సైనికునికి ఇంతకంటే ఘోరమైన నియామకం మరొకటి లేదు. యూదా ఖైధీకి మరణశిక్ష విధించినప్పుడు, సైనికులు వారిపై తమ కోపం తీర్చుకునేవారు.
యేసుకు చేసిన విధానంలో-దెబ్బలు, అవమానం, ముళ్ళ కిరీటం- తమ పనిని ద్వేషించిన, తిరిగి పోరాడలేనివారిని శిక్షిస్తూ ఆనందిస్తున్న సైనికుల కఠిన క్రూరత్వం కనిపిస్తుంది. ఈ సైనికుల యెడల ఎటువంటి కోపం చూపకుండానే యేసు వీటన్నిటిని భరించాడు.
యేసు సిలువలో పలికిన ఏడు మాటల ద్వారా చాలామంది రచయితలు సిలువ కథ గురించి అధ్యయనం చేశారు. ఒక వ్యక్తి చివరి మాటలు, ఆ వ్యక్తికి ఏది ముఖ్యమో అవి చూపిస్తాయి. ఆయన మరణం ఎదుర్కొనుచుండగా, యేసు ఏమి చెప్పాడు?
క్షమాపణ మాటలు
వారయనను సిలువలో మేకులతో కొట్టుచుండగా, యేసు ఇలా ప్రార్థించాడు, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.” (లూకా 23:34). ముగింపువరకు, ఆయన ప్రేమ, క్షమాపణ కనుపరచాడు.
మరణ శిక్షకు అర్హుడైన దొంగతో, “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను” (లూకా 23:43) అని వాగ్దానం చేశాడు
దయగల మాటలు
“యిదిగో నీ తల్లి” (యోహాను 19:26-27) అని చెప్పినప్పుడు యేసు తన తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించాడు. మునుపు, లోతైన కుటుంబ బంధాలు ఆత్మీయమైనవని యేసు బోధించాడు. “ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహో దరియు, నాతల్లియుననెను” (మత్తయి 12:49-50).
ఆయన మరణ సమయంలో, యేసు భౌతిక సహోదరులు అవిశ్వాసులు; వారు ఆయన ఆత్మీయ కుటుంబ సభ్యులు కాదు. కాబట్టి, యేసు తన తల్లి బాధ్యతను ఆత్మీయ సహోదరుడైన యోహానుకు అప్పగించాడు.
భౌతిక హింసను తెలియజేయు మాటలు
దేవుని కుమారుడైనందువలన సిలువలో శారీరక హింస నుండి యేసు విడిపించబడలేదు. తీర్పుపొందిన నేరస్తుడు అనుభవించే హింసలన్నీ అనుభవించాడు. ఆ ఘోరమైన ఎండలో నీరు లేకుండా కొన్ని గంటలు గడిపిన తర్వాత, యేసు “నేను దప్పిగొనుచున్నాననెను” అని కేక వేశాడు (యోహాను 19:28).
ఆత్మీయ ఆవేదన మాటలు
మత్తయి మరియు మార్కు సిలువపై యేసు పలికిన అత్యంత హృదయ విదారకమైన మాటలను నమోదు చేశారు: “నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని” (మత్తయి 27:46 మరియు మార్కు 15:34, కీర్తనలు 22:1 ను ఉటంకిస్తూ).
తన మానవ స్వభావంలో యేసు, దావీదు అనుభవించిన తృణీకరణ భావాన్ని అనుభవించాడు. దావీదును ప్రజలు ఎట్లా అపహాస్యం చేశారు, ఆయనను చూసి తలలు ఊపారు (కీర్తనలు 22:7), అదే విధంగా యేసును కూడా అపహాస్యం చేస్తూ ప్రజలు తలలు ఊపారు (మత్తయి 27:39). మరియు దావీదు తన ఆత్మలో దేవునిచే విడిచిపెట్టబడ్డాననే అనుభూతిని పొందినట్లుగానే, యేసు కూడా ఈ క్షణంలో “నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని” అని బాధతో అరిచాడు (మత్తయి 27:46).
అయితే, దేవుడు నిజంగా దావీదును విడిచిపెట్టలేదు అని తరువాత అదే కీర్తనలో స్పష్టంగా తెలుస్తుంది. దావీదు ఇలా సాక్ష్యమిచ్చాడు: “ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను” (కీర్తనలు 22:24).
అలాగే, యేసుకూడా తండ్రిచే పూర్తిగా విడిచిపెట్టబడలేదని తెలిసింది. సిలువపై యేసు తదుపరి పలికిన మాటలు తండ్రిని ఉద్దేశించి జరిగిన ప్రార్థన. తన తండ్రి తన్ను విడిచిపెట్టలేదని తెలుసుకొని యేసు ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను” (లూకా 23:46).
తన మానవత్వంలో యేసు దేవుడు తన ప్రార్థనలను వినడం లేదన్న శూన్యతను మనం అనుభవించే విధంగా అనుభవించాడు. అయితే, ఆయన అనుభవించిన మరో వాస్తవం ఇది—మన పరలోక తండ్రి తన పిల్లలను ఎప్పుడూ విడిచిపెట్టడు. మనకు ఆయన ఉనికిని అనుభవించనప్పటికీ, ఆయనను ముట్టడి చేయవచ్చు, ఎందుకంటే ఆయన మన మొఱ్ఱను ఆలకిస్తాడు.
విరమణ మాటలు
“తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను.” (లూకా 23:46) ఆయన జీవితమంతటి ద్వారా, యేసు తన తండ్రిలో విధేయుడుగా జీవించాడు. సిలువను ఎదుర్కొంటూ, “అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని” (మత్తయి 26:39) ప్రార్థించాడు. ఇప్పుడు ఆయన తండ్రి చిత్తానికి అప్పగించుకునే చివరి మాటలు మాట్లాడాడు.
విజయోత్సవ మాటలు
“సమాప్తమైనదని చెప్పి” (యోహాను 19:30). ఈ విజయోత్సవ మాటతో, తండ్రి తనను పంపిన పని తాను నెరవేర్చానని యేసు ప్రకటించాడు. పాపానికి వెల చెల్లించబడింది; సాతాను ఓడిపోయాడు. పాత నిబంధన గొర్రెపిల్లలు చూపిన మరియు యెషయా 53లో వాగ్దానం చేసిన ప్రాయశ్చిత్తం నెరవేరింది.
సిలువపై, పాపము ఎరుగనివాడైన ఆయనను దేవుడు మనకొరకు పాపంగా చేసెను, తద్వారా మనము ఆయనయందు దేవుని నీతిగా మారుదుము (2 కొరింథీయులకు 5:21). యెషయా 53లో ప్రవక్త, మన పాపాలను మోయబోయే బాధపడే దాసుని గురించి ముందుగా ప్రవచించాడు (యెషయా 53:4-12). అపొస్తలుడైన పౌలు ఈ పాపానికి బదులుగా జరిగే ప్రాయశ్చిత్తం సిలువపై నెరవేరిందని చూపిస్తున్నాడు.
యేసు మన కొరకు పాపంగా మారాడు, తద్వారా ఆయనయందు మనము దేవుని నీతిగా మారవలెను (2 కొరింథీయులకు 5:21). ఇక మనము పాపపు బానిసత్వంలో ఉండము; క్రీస్తు మరణం ద్వారా మనము నీతిమంతులముగా చేయబడినాము. పౌలు ఇలా మాత్రమే చెప్పడంలేదు—“మనము ఆయనయందు నీతిమంతులని పిలవబడతాము” అని కాదు. కాబట్టి, ఆయనయందు మనము దేవుని నీతిగా నిజంగా మారవచ్చు అని చెప్పారు. క్రీస్తు సిలువపై చేసిన కార్యం ద్వారా నిజమైన పరివర్తన జరుగుతుంది. క్రీస్తు పాపమైయ్యెను, మనము నీతిమంతులముగా మారునట్లు.
[1] “యేసు తన దైవత్వంలో మానవత్వపు శ్రమల నుండి ఉపశమనం పొందలేదు; ప్రార్థనలో నెమ్మది పొందాడు.”
- టి.బి. కిల్పాట్రిక్ నుండి తీసుకున్నారు.
[2] యోహాను 18:3 ఈ బృందాన్ని “సైనుకులు” లేక బంట్రౌతులు” అని సూచిస్తుంది. రోమా బంట్రౌతుల బృందం మొత్తం 600 మంది ఉంటారు.
[3]John Stott, The Message of Romans (Westmont, Illinois: InterVarsity Press, 1994), 255.లో ఉల్లేఖించబడింది.
[4] పస్కా వారంలోమ, పాలస్తీనాలోని ప్రతి రోమా అధికారి తిరుగుబాటు జరుగకుండ చూసేందుకు యెరూషలేముకు వస్తాడు.
ఓ దివ్యమైన ప్రేమా! నీవు ఏమి చేసావు!
ఓ దివ్యమైన ప్రేమా! నీవు ఏమి చేసావు!
అమరుడైన దేవుడు నాకోసం మరణించెను!
తండ్రితో సమానుడైన కుమారుడు
నా పాపాలన్నిటిని సిలువపై భరించెను.
అమరుడైన దేవుడు నాకోసం చనిపోయెను:
నా ప్రభు, నా ప్రియుడు సిలువ వేయబడెను!
నీవు కొరకు, నా కొరకు సిలువ వేయబడెను,
మనుష్యులు దేవుని తీరునకు తిరిగెనేల.
విశ్వసించుడి! ఆ వాక్యము నిజము,
మీరు అందరూ యేసు రక్తముతో కొనుగోలు చేయబడ్డారు.
క్షమా ప్రవాహమంతయు ఆయన ప్రక్కనుండి జలమార్చెను:
నా ప్రభు, నా ప్రియుడు సిలువ వేయబడెను!
చూడుడి! ఓ అందరూ, గమనించుచు పోవువారు,
ఈ రక్తసిక్తమైన జీవజాతి రాజును!
రండీ పాపులారా! మీ రక్షకుని మరణమును చూడుడి,
ఇంత శోకము ఎక్కడున్నదని చెప్పుడి!
"రండీ, నాతో కలిసి ఆయన రక్తం ఎలా వర్తించబడిందో అనుభవించుడి:"
నా ప్రభు, నా ప్రియుడు సిలువ వేయబడెను!
- Charles Wesley
విచారణ మరియు సిలువ (కొనసాగింపు)
సమాధి
► మత్తయి 27:57-61చదవండి.
పౌలు కొరింథీయులకు ఇచ్చిన సందేశంలో, యేసు మన పాపాల నిమిత్తం మృతిపొంది, సమాధిచేయబడెను అని ప్రసంగించాడు (1 కొరింథీయులకు 15:3-4). పౌలు మరియు ఆది సంఘానికి, సమాధి చాల ప్రాముఖ్యం.
నేడు శ్రమవార ఆచారాలు, శుభశుక్రవారం మరియు ఈస్టర్ ఆదివారం పాటిస్తారు. కాని సంఘ చరిత్రలో ఎక్కువగా “పరిశుద్ధ శనివారాన్ని” ఈష్టర్ ఆరాధనలో భాగంగా గుర్తించారు. సమాధి ప్రాముఖ్యత ఏంటి?[1]
చారిత్రక ప్రాముఖ్యత
యేసు నిజంగా చనిపోయాడని సమాధి చూపిస్తుంది. మైకంలో నుండి తరువాత లేచాడనే ఇస్లామీయుల వాదనలకు విరుద్ధంగా, ఆయన నిజంగా చనిపోయాడని సమాధి చూపిస్తుంది. శిక్ష విధించిన ఖైదీని ఎలా చంపాలో రోమీయులకు తెలుసు. వారు, ఒక వ్యక్తి చనిపోకుండా, అతనిని సిలువలో నుండి దింపే అవకాశమే లేదు.
ఇంకా, బరువైన రాయి మరియు కాపలాదారుల వలన, సమాధి నుండి ఎవ్వరు తప్పించుకునే అవకాశమే లేదు. రోమా సైనికులు ఒకవేళ చనిపోక ముందే పొరపాటున ఆయనను పాతిపెట్టినప్పటికీ, సిలువలో గంటలు తరబడి వేదనను అనుభవించిన వ్యక్తి సమాధి నుండి రాయిని తొలగించి, కాపలాదారులను అధిగమించగలరనేది అసాధ్యం. నజరేయుడైన యేసు చనిపోయాడనే చారిత్రిక సత్యాన్ని సమాధి ధృవీకరిస్తుంది.
ప్రవచన ప్రాముఖ్యత
వధకు తేబడిన గొర్రెపిల్ల గురించి రాస్తూ, “భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను” (యెషయా 53:9) అని యెషయా ప్రవచించాడు. యేసు సమాధి మెస్సీయత్వ ప్రవచనం నెరవేర్చింది.
యేసు చనిపోయిన తర్వాత, అరిమతయియ యోసేపు దేహం కోసం పిలాతు యొద్దకు వెళ్ళాడు. యోసేపు మహాసభ సభ్యుడు, కాని యేసును చంపడానికి అంగీకరించలేదు. చాలామంది నాయకులు యేసుకు వ్యతిరేకమైనప్పటికీ, కొందరు దేవుని రాజ్యం కోసం ఎదురుచూస్తున్నారు. యోసేపు ఈ రహస్య శిష్యులలో ఒకడు. అతడు మరియు నీకొదేము యోసేపు సమాధిలో యేసు దేహాన్ని ఉంచారు (మత్తయి 27:57-60, మార్కు 15:42-46, లూకా 23:50-54, యోహాను 19:38-42).
దీనికి ఎంత సాహసం అవసరమో ఆలోచించండి. శిష్యులు యేసును విడిచిపెట్టినప్పటికీ, నేరస్తుడైన ఖైదీతో గుర్తించబడుటకు యోసేపు ముందుకొచ్చాడు. ఈ బహిరంగ వైఖరి వలన, మహాసభలో యోసేపు స్థానానికి ముప్పు మరియు సమాజంలో అతని స్థానానికి కూడా ముప్పు. అంతేకాదు, యోసేపు పిలాతు కోపానికి కూడా తెగించాడు. శిక్షించబడిన వారి దేహాలు తీసుకెళ్లడానికి వారి మిత్రులను లేక బంధువులను రోమీయులు అనుమతించరు. ఇతర నేరస్తులకు ఒక హెచ్చరికగా వారి దేహాలు అక్కడే బహిరంగంగా విడిచిపెట్టేవారు. యేసు నిర్దోషియని పిలాతుకు తెలుసు అనేదానికి అతని అనుమతి మరొక రుజువు.
వేదాంత పరమైన ప్రాముఖ్యత
పౌలు మన బాప్తిస్మాన్ని యేసు సమాధితో పోల్చాడు:
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి (రోమా 6:3-4).
సమాధి యేసు మరణానికి బహిరంగ ధృవీకరణ. అదే విధంగా, బాప్తిస్మం యేసు మరణంలో మనం పాలిభాగస్తులమనడానికి సాక్ష్యం. బాప్తిస్మంలో, మన పాత జీవితాన్ని పాతిపెట్టామని ప్రకటిస్తున్నట్లు అర్థం.
ఒక వ్యక్తి మరణాన్ని గుర్తించడానికి సమాధి చివరి మెట్టు. పాశ్చాత్య సంస్కృతిలో, ఈ భూలోకంలో “వీడ్కోలు” ముగింపును తెలియజేయడానికి దుఃఖపడే కుటుంబ సభ్యులు సమాధి చేసినప్పుడు దానిపై ధూళి వేస్తారు. పాపం విషయంలో మనం చనిపోయామనడానికి తుది మెట్టును పౌలు నొక్కి చెప్పాడు. క్రీస్తు మరణించినట్లుగా, మనం పాప విషయంలో మరణించాం. క్రీస్తుతో పాతిపెట్టబడిన తర్వాత మళ్ళీ పాపం చేయటమంటే, మృతదేహాన్ని తవ్వి తీయడమే.[2] మనం క్రీస్తుతో కూడా పాతిపెట్టబడితిమి; మనమిక పాపానికి దాసులం కాదు.
పౌలు కొరింథులో సిలువ గురించి ప్రసంగించాడు; క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించి, పాతిపెట్టబడెను. ఆ తర్వాత, పునరుత్థానం గురించి ప్రసంగిచాడు; క్రీస్తు మూడవ దినాన లేచి, అనేకమందికి కనిపించాడు (1 కొరింథీయులకు 15:3-8). పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం.
►మత్తయి 27:62-28:15 చదవండి.
సిలువపై పేరు మార్చమని మతాధికారులు పిలాతును అడిగినప్పుడు, అతను నిరాకరించాడు. అతను యేసును “యూదులరాజైన నజరేయుడగు యేసు” (యోహాను 19:19) అను మాటతో సిలువవేశాడు. నేరస్తునికి ఈ బిరుదు ఉపయోగించడం వలన, పిలాతు తాను అసహ్యించుకున్న యూదులను ఎగతాళి చేశాడు.
సిలువ తరువాత, మతాధికారులు మళ్ళీ పిలాతు యొద్దకు వచ్చి, సమాధికి భద్రతగా కావాలివారు ఉండాలని అడిగారు.
అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడుదినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞా పించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి –ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదు రేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి (మత్తయి 27:63-64).
పిలాతు అనుమతితో, వారు సమాధికి ముద్ర వేసి, యేసును తోటలో అరెస్టు చేసిన వారిలోనుండి కొందరిని కాపలాదారులుగా నియమించారు. అకస్మాత్తుగా:
ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి (మత్తయి 28:2-4).
యేసు తిరిగి లేచాడు!
► యోహాను 20:1-29 చదవండి.
యేసు పునరుత్థానం తరువాత అనేకమందికి కనిపించాడని సువార్తలు చెబుతాయి. వివిధ సందర్భాల్లో అనేక రకాల ప్రజలకు ఆయన కనిపించాడు.
సంశయవాదులు కొన్నిసార్లు, “సమాధి యొద్ద స్త్రీలు భ్రమలో ఉన్నారు. వారు చూడాలనుకున్నది చూశారు.” అయితే, వీరు యేసును సజీవంగా చూడాలని ఆశించలేదు; ఆయన చనిపోయాడని వారికి తెలుసు! ఆయన పునరుత్థాన ప్రవచనాలు వారు గ్రహించలేదు (యోహాను 20:9). తాము యేసుని చూశామని మొదటి సాక్షులు చెప్పినప్పటికీ, తక్కిన శిష్యులు నమ్మలేదు (మార్కు 16:13). యేసు మృతుల్లో నుండి లేస్తాడని వారు ఆశించలేదు” అని చెప్పారు.
క్రమంగా, మగ్దలేనే మరియకు (యోహాను 20:11-18), ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న ఇద్దరు శిష్యులకు (లూకా 24:13-32), పదకొండుమంది అపొస్తలులకు (యోహాను 20:19-31), 500మందికి కనిపించినప్పుడు (1 కొరింథీయులకు 15:6), ఆయన నిజంగా లేచాడని యేసు అనుచరులు గ్రహించారు. ఆదిమ సంఘం ఆరాధన సమావేశాలు ఈ మాటలతో ప్రారంభించింది, “ఆయన లేచాడు. ఆయన నిజంగా లేచాడు!”
అన్వయం: సిలువ మరియు పునరుత్థాన శక్తిలో పరిచర్య
చాలామంది ఉదారవాద వేదాంతవేత్తలు పునరుత్థానాన్ని ఒక పురాణంగా దాటవేస్తారు. అయితే, అపొస్తలుల విశ్వాసం యేసు జీవితం ద్వారా కలిగే శాశ్వత ప్రభావం గూర్చిన అందమైన కథపై ఆధారపడలేదు కాని ఆయన మరణ పునరుత్థానమనే దృఢమైన వాస్తవాలపై ఆధారిపడింది. యేసు చనిపోయి మృతుల్లో నుండి తిరిగి లేచాడని అపొస్తలులకు తెలుసు. దీని వలన వారు హింసను, మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. యేసు మరణ పునరుత్థానాలు నేటి పరిచర్యలో ఎలా మాట్లాడుతాయి?
సిలువ శక్తితో పరిచర్య చేయడం
► 1 కొరింథీయులకు 1:17-2:5 చదవండి.
తన రెండవ సువార్త యాత్రలో, పౌలు అరెయొపగులో ప్రసంగించి ఎథెన్సు నుండి కొరింథుకు వచ్చాడు. పౌలు ఎథెన్సులో చేసిన పరిచర్య ద్వారా పరిమిత ఫలితాలు మాత్రమే చూసినట్లు కనిపిస్తుంది (అపొస్తలుల కార్యములు 17:16-34). అతడు ఎథెన్సులో సంఘ స్థాపన చేయలేదు, తాత్విక మనసుగల ఎథెన్సు పట్టణస్తులు తన పునరుత్థాన సందేశాన్ని అవమానించారు. ఎథెన్సు నుండి, 75 కిలోమీటర్లు పశ్చిమవైపు కొరింథుకు, అకయలో అత్యంత ప్రభావవంతమైన పట్టణానికి వచ్చాడు.
క్రమంగా థెస్సలొనీక, బెరయ, ఎథెన్సు అను మూడు పట్టణాల్లో వ్యతిరేకత ఎదుర్కొన్న తర్వాత పౌలు కొరింథుకు వచ్చాడు: బహుశా అందుకే అతడు ఇలా చెప్పాడు, “మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని” (1 కొరింథీయులకు 2:3). గ్రీకు శ్రోతలు వాక్చాతుర్యం, మేధస్సు కోసం చూసినప్పటికీ, పౌలు సిలువ మాత్రమే ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. అతని సందేశంలోని శక్తి వాక్చాతుర్యంవల్ల కలుగలేదు కాని సిలువవల్ల వచ్చింది. “క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యములేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను” (1 కొరింథీయులకు 1:17).
కొరింథులో, “నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసు క్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని” (1 కొరింథీయులకు 2:2) అని పౌలు చెప్పాడు. సిలువ సందేశం అనేకమందికి అవరోధంగా ఉంటుందని పౌలుకు తెలుసు.
యూదులు సూచకక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము (1 కొరింథీయులకు 1:22-23).
ఈ సందేశం యూదులకు ఆటంకంగా ఉంటుంది. వారు మెస్సీయను ధృవీకరించే సూచనల కోసం చూశారు. వారి మనసుల్లో, సిలువవేసిన వ్యక్తి ఎన్నుకోబడిన మెస్సీయగా ఉంటాడనే ఆలోచన అసంబద్ధమైంది. “వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు” (ద్వితీయోపదేశకాండము 21:23) అని ధర్మశాస్త్రం సెలవిస్తుంది. సిలువవేయబడిన యేసు మెస్సీయ అని ప్రకటించటం యూదులకు ఆటంకం.
సిలువను గూర్చిన వార్త అన్యజనులకు వెర్రితనం. గ్రీకులు హతసాక్షి మరణాన్ని గౌరవించారు. రోమీయులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో యేసు చంపబడితే, ఆయన సాహసానికి గ్రీకు తత్వవేత్తలు ఆయనను గౌరవించేవారు. కాని సిలువ బాధితునికి అగౌరవం; ఇది గౌరవార్థమైన మరణం కాదు. సిలువవేయబడిన వారికి సరైన సమాధి కూడా చేయరు. వాళ్ల దేహాన్ని ఆకాశపక్షులు, ఎలుకలు తింటాయి, ఎముకలు సాధారణ గోతిలో పడేస్తారు. సిలువవేయబడిన యూదాలోనే అతి సామాన్యుడిని, ఒక పల్లెటూరి వాడిని ‘ప్రభువు”గా ప్రకటించటం, అన్యులకు అర్థరహితం.
సిలువ యూదులకు ఆటంకం మరియు అన్యజనులకు వెర్రితనం, కాని పౌలు నిస్సంకోచంగా సిలువ సందేశం ప్రకటించాడు. పౌలు ఉదాహరణ నేడు మనకు మాదిరి. మొదటి శతాబ్దంలో మాదిరిగానే, నేడు సిలువ కొందరికి ఆటంకంగాను మరికొందరికి వెర్రితనంగాను ఉంది, కాని అది మనం ప్రకటించవలసిన సందేశం.
పరిచారకులు మరియు సంఘ నాయకులుగా మన విశ్వాసం మన సామర్థ్యం నుండి రాదు; మన విశ్వాసం సిలువ సందేశం నుండి వస్తుంది. పౌలు అద్భుతమైన విద్యనభ్యసించాడు, మేధస్సుగలవాడు, ఆ కాలంలోని తెలివైనవారితో వాదించగలవాడు. కాని అతని తుది విశ్వాసం సిలువలో ఉంది. మనం ప్రజలను కేవలం వాదనలతో గెలుచుకుంటే, వాళ్ల విశ్వాసం మనుష్యుల జ్ఞానమందు నిలిచియుంటుంది; కాని వాళ్ళని సిలువవైపు నడిపించినప్పుడు, వాళ్ల విశ్వాసం దేవుని శక్తిపై ఆధారపడుతుంది (1 కొరింథీయులకు 2:5).
పునరుత్థాన శక్తితో పరిచర్య చేయడం
► అపొ. కా. 2:22-36 చదవండి.
ఆరంభ క్రైస్తవ బోధకు పునరుత్థానం కేంద్రమని అపొస్తలుల కార్యములు చూపిస్తుంది. పెంతెకొస్తను దినమందు, యేసు ప్రవక్తలు ప్రవచించిన వాగ్దానాలకు నెరవేర్పని రుజువుగా పేతురు పునరుత్థానమును సూచించాడు.
అగ్రిప్ప ఎదుట తననుతాను సమర్థించుకుంటూ, పౌలు ఇలా చెప్పాడు: “ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీ క్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీ క్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు.” ఈ వాగ్దానం ఏంటి? పునరుత్థానం. “దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచుచున్నారు?” (అపొస్తలుల కార్యములు 26:6-8)
► 1 కొరింథీయులకు 15:12-34 చదవండి.
1 కొరింథీలో, తన పరిచర్య సిలువ శక్తితో మాత్రమే కాదుగాని పునరుత్థాన శక్తితో స్థిరపడిందని పౌలు చూపించాడు. పునరుత్థానం లేకుండా తన పరిచర్య అర్థరహితమని నొక్కి చెప్పాడు. “మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేముచేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే” (1 కొరింథీయులకు 15:14). పునరుత్థానం లేకుండా, యేసు కూడా విఫలమైన మెస్సీయగా ఉన్నాడు. పునరుత్థానానికి వేరుగా, యేసు ఒక విషాదకరమైన హతసాక్షి కావచ్చు, కాని వాగ్దానం చేయబడిన మెస్సీయ కాదు.
పునరుత్థానం మన క్రైస్తవ విశ్వాసానికి ఆధారం. “క్రీస్తు లేపబడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు” (1 కొరింథీయులకు 15:17). సిలువలో, క్రీస్తు మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం అందించాడు, కాని పాపంపై మరణంపై క్రీస్తు శక్తి నిరూపించింది పునరుత్థానం. పునరుత్థానం లేకపోతే, మీ విశ్వాసం వ్యర్థం మీరింకను మీ పాపంలోనే ఉన్నారని పౌలు చెప్పాడు.
పునరుత్థానం మన క్రైస్తవ నిరీక్షణకు ఆధారం. “మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు” (1 కొరింథీయులకు 15:21-22). క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడు గనుక పునరుత్థాన నిరీక్షణ ఉందని పౌలు కొరింథీయులకు ధృవీకరించాడు.
రెండవ శతాబ్దంలో, లూసియన్, గ్రీకు నవలా రచయిత, పునరుత్థానమును విశ్వసించినందుకు క్రైస్తవులను అపహసించాడు. అతడు ఇలా చెప్పాడు: “బీదలు నిరంతరం బ్రతుకుతామని నమ్ముతారు. దానివలన, వారు మరణాన్ని లెక్కచేయకుండా తమ విశ్వాసం కోసం జీవితాలను త్యాగం చేయడానికి ఇష్టపడతారు.” లూసియన్ క్రైస్తవులను అపహసిస్తున్నాడు కాని అతని మాటలు వాస్తవం. లూసియన్ చెప్పినట్లుగా, రెండవ శతాబ్దపు క్రైస్తవులు తాము యుగయుగాలు జీవిస్తామని నమ్మారు. ఆ నమ్మకం వలన, తమ విశ్వాసం విషయంలో చనిపోవడానికి కూడా ఇష్టపడ్డారు.
ఇది నేటికీ నిజమైయుండాలి. క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడని మనం నిజంగా నమ్మితే, అది హింసలో మరణంలో కూడా మనకు నమ్మకం ఇవ్వాలి. పునరుత్థానం మన క్రైస్తవ నిరీక్షణకు ఆధారం.
పునరుత్థానం మన క్రైస్తవ జీవితానికి ఆధారం. పౌలు పునరుత్థాన సిద్ధాంతమును ఆశ్చర్యపరిచే ఆచరణాత్మక అన్వయం ఇచ్చాడు. “మృతులు లేపబడనియెడల – రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము … నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి” (1 కొరింథీయులకు 15:32, 34). పౌలు ప్రకారం, దైవికంగా జీవించడానికి పునరుత్థానం ఒక ప్రాముఖ్యమైన కారణమిస్తుంది. పునరుత్థానం లేకపోతే, మనం కూడా ఎపికురియనులు వలే జీవిస్తాం, వారిలా చెబుతారు: “మనం త్వరగా చనిపోతాం గనుక తినండి త్రాగండి.” పునరుత్థానం లేకుండా నిత్యత్వం కోసం జీవించడంలో అర్థం లేదు. కాని పౌలు ఇలా కొనసాగించాడు: పునరుత్థానం ఉంది గనుక, పాపం లేని జీవితం జీవించడం మంచిది. పాపంపై జయం, పునరుత్థానంలో మన విశ్వాసం నుండి కలుగుతుంది.
పరిచర్య సవాళ్లలో విశ్వాసం సన్నగిల్లుతున్నందున పునరుత్థానం మనల్ని ఒప్పించాలి. ఎన్నిసార్లు మన ప్రార్థనలకు సమాధానాలు రాకుండా పోవాలని ఆశిస్తాం? ఎందుకు? ఎందుకంటే మనం పునరుత్థాన శక్తి మర్చిపోతున్నాం! ఎన్నిసార్లు మనం జయం పొందుతామనే నమ్మకం లేకుండా శోధన ఎదుర్కొంటున్నాం? ఎందుకు? ఎందుకంటే మనం పౌలు వాగ్దానం మర్చిపోతున్నాం: “మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును” (రోమా 8:11).
క్రీస్తు మనలో నివసిస్తే, మనం ఇకమీదట శరీరంతో జీవించం. పాపానికి దాసులం కాదు. ఇది పునరుత్థాన జీవితం. యేసును మృతుల్లో నుండి లేపిన శక్తి, మనకు అనుదినం పాపంపై జయమిస్తుంది. పునరుత్థాన శక్తితో జీవిస్తూ పరిచర్య చేయటం అంటే ఇదే.
ముగింపు: క్రీస్తువంటి జీవితం, పరిచర్యకు గుర్తులు
మీ జీవితం క్రీస్తువలే ఉందా?
లూకా “మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి” (అపొస్తలుల కార్యములు 11:26) అని రాశాడు. అంతియొకయలో క్రైస్తవులను ప్రజలు చూసి, “వారు క్రీస్తువలే ఉన్నారు. వాళ్ళని మనం ‘క్రైస్తవులుగా’ పిలవాలి” అని అనుకున్నారు. మీరు ఈ వచనం చదివినప్పుడు, “నా పొరుగువారు నా ప్రవర్తన, మాటలు, వైఖరులు చూసి ‘క్రైస్తవుడు’ అనే పేరు పెడతారా? నేను క్రీస్తువలే కనిపిస్తానా?” అని అడగాలి. అంతియొకయలో క్రైస్తవులు యేసుక్రీస్తును ప్రతిబింబించేటట్లుగా జీవించారు; వారు క్రైస్తవులనబడ్డారు.
ఒక పాస్టరుగా అనేక సంవత్సరాల తర్వాత, డా.హెచ్.బి లండన్ ప్రస్తుతం యౌవ్వన పాస్టర్లకు బోధకునిగా పనిచేస్తున్నాడు. పాస్టర్లు ఎదుర్కొనే ఆత్మీయ ప్రమాదాలు గురించి హెచ్చరించాడు. “ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండకుండా పరిశుద్ధమైన విషయాలకు దగ్గరగా ఉండగలరు. క్షమించకుండ క్షమాపణ గురించి ప్రసంగించటం సాధ్యమే. పరిచారకులు పరిచర్యకు ప్రాణం పెడతారు కాని తమ ఆత్మీయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు.”[1] ఇతరులకు ప్రసంగించి, మీకు మీరు అనర్హులు అవ్వడం సాధ్యం (1 కొరింథీయులకు 9:27).
డా.లండన్ ఇతరులను నడిపిస్తుండగా పాస్టర్లు ఆత్మీయ వైఫల్యాన్ని నివారించడానికి సహాయపడే ఆచరణాత్మక విషయాలు సూచించాడు. క్రీస్తువంటి జీవితం జీవించడానికి అవి సహాయపడతాయి. అతడు ఇలా రాశాడు:
ఏం బోధిస్తున్నారో అలా జీవించండి. మీరు మొదట మీ జీవితానికి అన్వయించుకోకుండా ఇతరులకు ప్రసంగించవద్దు.
మీ ఆత్మ పట్ల శ్రద్ధ చూపండి. కొందరు వైద్యులు అనారోగ్యంగా ఉంటారు. వారు ఇతరులపై శ్రద్ధ చూపుతారు, కాని తమ సొంత ఆరోగ్యం పట్టించుకోరు. ఒక పాస్టరుగా, మీ ఆత్మీయ శ్రేయస్సు పట్ల శ్రద్ధ చూపాలి.
మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. పాస్టరు బ్యాంకు ప్రెసిడెంట్ కాదు, కాపరి అని గుర్తుంచుకోండి, పరిచారకునిగా ఉండండి.
నిరుత్సాహాల్లో ఎదగండి. మీరు పరిచర్యలో నిరుత్సాహం ఎదుర్కొంటారు. మీరు శిక్షణ ఇస్తున్న వారు దూరమైపోతారు. మీ సన్నిహిత స్నేహితుడు మీకు వ్యతిరేకి అవుతాడు. సంఘ సభ్యులు మిమ్మల్ని తిరస్కరిస్తారు. నిరుత్సాహాలు మిమ్మల్ని నిరాశగలవారిగా చేయకూడదు. యూదా యేసును ధిక్కరించాడు. దేమేత్రి పౌలును విడిచిపెట్టాడు. కన్నీళ్ళలో, ఎదగండి, గొర్రెమందను నడిపించండి.
మీ పరిచర్య క్రీస్తును పోలి ఉందా?
యేసు జీవితం మరియు పరిచర్యను గూర్చిన ఈ పాఠాల్లో, యేసు పరిచర్యలో అనేక గుణలక్షణాలు మనం చూశాం. ఈ గుణలక్షణాలు మీ పరిచర్యలో ఉన్నాయా?
మీ పరిచర్యను మూల్యంకనం చేసేటప్పుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలు ఇవి:
పాపులు రక్షించబడుతున్నారా? యేసు ప్రసంగించినప్పుడు, ప్రజలు నూతన జీవం పొందారు. మీరు ప్రజలను నూతన జననంలోకి నడుపుతున్నారా?
విశ్వాసులు ఆత్మతో నింపబడుతున్నారా? యేసు తన పిల్లలకు ఆత్మను పంపుతానని వాగ్దానం చేశాడు. మీరు పరిచర్య చేస్తున్న వారి మధ్య ఈ వాగ్దానం నెరవేరిందా?
సాతానుడు ఓడిపోయాడా? సాతానుడి దుర్గాలు పడగొట్టబడతాయా? యేసు పరిచర్య ఆత్మీయ అధికారం ద్వారా గుర్తించబడింది.
బాధించబడినవారు స్వస్థపొందుతున్నారా? విడిపోయిన కుటుంబాల్లో సమాధానం ఉందా? విచ్ఛిన్నమైన జీవితాలు సమాధానంతో ఉన్నాయా? విచ్ఛిన్నమైన సంబంధాలు పునర్నిర్మించబడ్డాయా? యేసు భౌతికంగా, భావోద్వేగపరంగా, ఆత్మీయంగా గాయపడిన వారిని స్వస్థపరిచాడు.
ప్రజలు కృపా సత్యాలు చూస్తున్నారా? నేను ప్రజలను యేసు వైపు నడుపుతున్నానా లేక యేసుకు దూరంగా నడుపుతున్నానా? యేసు నిశ్చయతతో సత్యాన్ని కృపను ప్రకటించాడు.
► మీరు ఈ ప్రశ్నలు చర్చించే క్రమంలో, మీ పరిచర్య ఏ విషయంలో క్రీస్తు పోలికలో ఎదగాలో చూడండి. ప్రతి పరిచారకుడు ఎదుగవలసిన విషయాలు ఉన్నాయని గుర్తించండి, కాబట్టి ఈ జాబితాను ఎదుగుదలకు సవాలుగా చూడండి తప్ప స్వీయ నిందారోపణకు సవాలుగా చూడొద్దు.
[1]H. B. London, They Call Me Pastor. (Grand Rapids: Baker Books, 2000), 145
పాఠం 8 అభ్యాసాలు
(1) “సిలువలో పలికిన ఏడు మాటలు” పై ఒక ప్రసంగం లేక బైబిల్ పాఠం తయారుచేయండి. యేసు పలికిన ఈ మాటల సందేశాన్ని నేటి క్రైస్తవులకు నొక్కి చెప్పండి.
(2) అనుదిన క్రైస్తవ జీవితానికి పునరుత్థాన అర్థం ఏమైయుందో అనే విషయంపై ఒక బైబిల్ పాఠం లేక ప్రసంగం తయారుచేయండి. మీరు సిద్ధపడుతున్నప్పుడు, సువార్తలలోని పునరుత్థాన కథను అదే విధంగా 1 కొరింథీయులకు 15:15-17లోని పౌలు మాటలను ఉపయోగించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.