యేసు జీవితమూ పరిచర్య
యేసు జీవితమూ పరిచర్య
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 3: యేసువలే నడిపించుట

1 min read

by Randall McElwain


పాఠం లక్ష్యాలు

ఈ పాఠం ముగిసే లోపు, విద్యార్థి:

(1) యేసును గొప్ప నాయకునిగా చేసిన గుణలక్షణాలను గుర్తించగలుగుతాడు.

(2) అనుదిన ప్రాధాన్యతలను నిర్ణయించే విధంగా దేవుడిచ్చిన పరిచర్యను, పిలుపును అనుమతించగలుగుతాడు.

(3) భవిష్యత్ నాయకులకు శిక్షణ ఇవ్వడానికి, పరిచర్య బృందాన్ని నిర్మించడానికి ఒక ప్రక్రియను వృద్ధి చేయాలి.

(4) ఆయన నడిపిస్తున్న ప్రజల సేవకుడుగా అతని పాత్రను అభినందించాలి.

పరిచర్యకు సూత్రం

నాయకులు ఇతరులకు పరిచారం చేసినప్పుడు యేసువలే ఉంటారు.

పరిచయం

నాయకత్వం అనే పదం బలమైన భావాలను రేకెత్తిస్తుంది. లోక-మనస్తత్వంగల ప్రజలు నాయకత్వం గురించి ఆలోచించినప్పుడు, అధికారం, స్థానం గురించి ఆలోచిస్తారు. నాయకుడుగా ఉండటం అంటే “అధికారి”గా ఉండటం. ప్రతిష్టాత్మక నాయకులు ఉన్నత స్థానాలు సంపాదించి, ఉన్నత బిరుదులు పొందాలనుకుంటారు. సేవకులు/పాస్టర్లు కూడా ఈ మనసు కలిగియుండగలరు. పెద్ద సంఘాలు, ఉన్నత స్థానాలు, గొప్ప గౌరవం మీద దృష్టిపెట్టగలరు.

ఈ లోక మనస్తత్వానికి స్పందనగా, కొందరు క్రైస్తవులు నాయకత్వమనే పదానికి వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తారు. “నా సంఘంలో నాకు నాయకుడుగా ఉండాలని లేదు. పరిచారకునిగా ఉండాలని ఉంది” అని ఒకప్పుడు ఒక సేవకుడు/ పాస్టర్ చెప్పాడు. అతని మాటలు వినయంగా అనిపించినప్పటికీ, అది తన సంఘాన్ని ఒక దిశ లేక ఉద్దేశ్యం లేకుండా చేసింది. సంస్థలన్నిటికీ, సంఘాలకు కూడా, నాయకులు అవసరం.

పాస్టర్ అనే పదానికి మూల పదం “కాపరి” అని పాస్టర్లు గుర్తుంచుకోవాలి. కాపరికి, ఆకట్టుకునే ఉద్యోగమంటూ లేదు! కాపరి దుర్వాసన గల గొర్రెలతో రోజులు గడుపుతాడు. అతని పనులు అంత ఆసక్తికరంగా ఉండవు: ఆహారం, నీరు కోసం వెదకటం, గొర్రెల వెనక తిరగటం, గాయపడిన గొర్రెలపట్ల శ్రద్ధ చూపటం.

కాపరికి ఒక ముఖ్య పాత్ర ఉంది. కాపరి హీనమైన పనులు చేస్తాడు, కాని గొర్రెమందను సురక్షితంగా చూసుకునే గొప్ప బాధ్యత కూడా కలిగి ఉంటాడు. గొర్రెలమందలు నాయకుడైన కాపరిపై ఆధారపడతాయి.

యేసు, నిజమైన నాయకుడికి ఆదర్శవంతమైన మాదిరి. ఆయన లోతైన ఉద్దేశ్యంతో వినయంగా పరిచారం చేసిన కాపరి. ఆయన బలమైనవాడు కాని కనికరపూర్ణుడు. స్థానం కోసం చూడలేదు, కాని ఆయన పరిచర్య/పనిలో నమ్మకస్తుడు. పరిచార-నాయకులకు యేసు మాదిరి.

► మీకు వ్యక్తిగతంగా తెలిసిన ఒక విజయవంతమైన నాయకుని గురించి ఆలోచించండి. ఇతనిని ఒక మంచి నాయకుడిగా మార్చిన మూడు లేక నాలుగు లక్షణాలు రాయండి. ఈ లక్షణాలు యేసు పరిచర్యలో కనిపిస్తాయా? ఈ లక్షణాలు మీ పరిచర్యలో కనిపిస్తున్నాయా?

నిజమైన నాయకత్వంలో వినయంతో కూడిన సేవ ఉంటుందని యేసు చూపించాడు. దీనత్వం అంటే బలహీనత లేక అనిశ్చితి కాదు; యేసు బలవంతుడు. యేసు అధికారాన్ని సువార్తలు పదే పదే వెల్లడిస్తాయి.[1] అయితే, యేసు గౌరవాన్ని కోరటం వలన కాదుగాని పరిచారం చేయడం వలన అధికారం పొందాడు. రాజ్యంలో స్థానాలు కొరకు శిష్యులు వాదించినప్పుడు, యేసు ఇలా చెప్పాడు:

అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకునివలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్యచేయు వానివలె ఉన్నాను (లూకా 22:25-27).

ఈ పాఠంలో, యేసును గొప్ప నాయకుడ్ని చేసిన గుణాలను పరిశీలిస్తాం. యేసు మాదిరి అనుసరిస్తూ ప్రభావవంతమైన నాయకులుగా ఎలా ఉండాలో నేర్చుకుందాం.


[1]మత్తయి 7:28-29, మార్కు 1:22-28, లూకా 4:32-36, లూకా 20:1-8

ప్రభావవంతమైన క్రైస్తవ నాయకుడికి తన మిషన్/పని తెలుసు

గొప్ప నాయకుడికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యంపైనే ఏకాగ్రతతో ఉంటాడు. యేసుకు ఆయన పని తెలుసు. యేసు తన మిషన్ ను మార్కు 10:45లో సంగ్రహించాడు: మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.”

యేసు, తన మొదటి ప్రసంగంలో, యెషయా ప్రవచనం నెరవేర్చటానికి వచ్చానని యేసు శ్రోతలతో చెప్పాడు:

ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను (లూకా 4:18-19, యెషయా 61:1-3 ఉల్లేఖించాడు).

యేసు మిషన్ ఆయన అనుదిన నిర్ణయాలను మార్గనిర్దేశం చేసింది. యేసు యూదయ నుండి గలిలయకు వెళ్తున్నప్పుడు, ఆయన మిషన్ తన మార్గాన్ని నిర్దేశించింది. యూదా రబ్బీలు, సమరయుల అపవిత్రతకు దూరంగా ఉండడానికి గాను యోర్దాను నదికి తూర్పు వైపు ప్రయాణించేవారు. అయితే, సమరయ స్త్రీతో దేవుని కృపను పంచుకోవాలని తన మిషన్ కు అనుగుణంగా యేసు తన మార్గాన్ని నిర్దేశించుకున్నాడు (యోహాను 4:4). క్రైస్తవ నాయకుడుగా, మీ మిషన్ మీ అనుదిన నిర్ణయాలను దిశానిర్దేశం చెయ్యాలి.

నాయకుడుగా, మీరు సాధించగల దానికంటే చేయాల్సింది చాలా ఉంది. మీ ప్రాధాన్యతలు ఎలా నిర్ణయిస్తారు? మీరు సమస్తం చేయలేరు, చేయకూడదు. మీ మిషన్ ద్వారా అవకాశాలను అంచనా వెయ్యాలి. ప్రతి నాయకుడికి రెండు జాబితాలు ఉండాలి: “చేయాల్సినవి” మరియు “చేయకూడనివి.” చేయాల్సిన జాబితాలో మీరు సాధించాల్సిన విషయాలు ఉంటాయి. చేయకూడని జాబితాలో మీ మిషన్ పై నుండి మీ దృష్టిని తొలగించే విషయాలు ఉంటాయి. ఆ పనులు మరొకరు చేస్తారు, మీరు కాదు. మీ అనుదిన ప్రాధాన్యతలను మీ మిషన్ నిర్థారించాలి.

తన మిషన్ గురించి తెలుసుకున్న నాయకుడుగా అపొస్తలుడైన పౌలు ఒక మాదిరి చూపాడు. రోమా సామ్రాజ్యంలోని ముఖ్య పట్టణాల్లో సంఘాలు స్థాపించడానికి పౌలు పిలువబడ్డాడు. మరొకరి పునాది మీద నిర్మించాలనుకోలేదు కాని, ఎన్నడు సువార్త వినని వారికి సువార్త తీసుకెళ్లాలనుకున్నాడు (రోమా 15:20). పౌలు ప్రయాణాన్ని ఈ మిషన్ నడిపించింది, ప్రతి స్థలంలో ఎన్ని దినాలు గడపాలో, అతడు ప్రసంగించిన ప్రసంగాన్ని కూడా మిషన్ నడిపించింది. పౌలు మిషన్ ప్రతి నిర్ణయాన్ని మార్గనిర్దేశం చేసింది.

► ఈ ప్రశ్నలు చర్చించండి:

  • దేవుడు మీకు ఇచ్చిన మిషన్ ఏంటి? క్లుప్తంగా మీ మిషన్ ను సంగ్రహించండి.

  • మీ పరిచర్యలో మీతో చేరినవారికి మీ మిషన్ గురించి చెప్పారా?

  • మీ మిషన్ మీ అనుదిన నిర్ణయాలను మార్గనిర్దేశం చేస్తుందా?

ప్రభావవంతమైన క్రైస్తవ నాయకుడు ఇతర నాయకులకు శిక్షణనిస్తాడు

ఆయన పరిచర్య ఆరంభం నుండి, ఆయన తండ్రి యొద్దకు తిరిగివెళ్లిపోయిన తరువాత పరిచర్య కొనసాగించగల శిష్య బృందాన్ని యేసు జాగ్రత్తగా ఎన్నుకుని, వారికి శిక్షణ ఇచ్చాడు. ఈ శిష్యులు ఆయన నుండి నేర్చుకున్నారు, ఆయనతో ఉన్నారు, ఆయనతో పరిచర్య చేశారు, లోకమంతా ఆయన సందేశం ప్రకటించారు. ఈ శిష్యులను ఆయన పోలికెలో ముద్రించాడు, ఆయన సంఘ స్థాపనకు ఉపయోగించాడు.

[1]లూకా పరిచర్యలో ఒత్తిడి గురించి రాశాడు. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను” (లూకా 12:1). వేలమందికి పరిచర్య చేయటం ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ, యేసు శిష్యులకు చేసే పరిచర్యపై దృష్టిపెట్టాడు. రాజ్యం స్థాపించాలంటే సంఘాన్ని నడిపించటానికి శిష్యులకు శిక్షణ ఇవ్వాలని ఆయనకు తెలుసు. శిష్యులకు శిక్షణ ఇవ్వడం ద్వారా, తరువాత తరము వారి కోసం నాయకులను సిద్ధపరచగలం.

పౌలు ఇదే పద్ధతి అనుసరించాడు. జనసమూహానికి ప్రకటించాడు, కాని ప్రతి పట్టణంలో కొద్దిమంది నాయకులను సిద్ధపరచుటపై దృష్టిపెట్టాడు. ఇది నేటి నాయకులకు మాదిరి. పరిచర్య కోసం పరిశుద్ధులను నియమించమని పౌలు పాస్టర్లకు పిలుపునిచ్చాడు (ఎఫెసీయులకు 4:12). సంఘంలో పని అంతా చేయటం పాస్టర్ బాధ్యత కాదు; సంఘ పని కొరకు సభ్యులకు శిక్షణ ఇవ్వడం పాస్టర్ బాధ్యత. ప్రభావవంతమైన నాయకులు ఇతర నాయకులకు శిక్షణ ఇస్తారు.


[1]

“యేసు ఏ పుస్తకం రాయలేదు. బదులుగా, మనుష్యులపై, అపొస్తలులపై ఆయన సందేశం ముద్రించాడు.”

- విలియం బార్క్లే

శిష్యులకు బోధించే యేసు మాదిరి

బోధకుడు శిష్యులను జాగ్రత్తగా ఎన్నుకోవాలి[1]

► యోహాను 1:35-51, యోహాను 2:1-11, మత్తయి 4:18-22, లూకా 5:1-11, మరియు లూకా 6:12-16 చదవండి.

ఈ వచనాలు చదువుతున్నప్పుడు, ప్రక్రియ గమనించారా? యేసు, తన బహిరంగ పరిచర్య మొదటి వారంలో, తనను అనుసరించుమని యేసు అంద్రెయను, యోహానును పిలిచాడు. అంద్రెయ సీమోను పేతురును తీసుకొచ్చాడు. యేసు ఫిలిప్పుని పిలిచాడు, అతడు నతనయేలును కనుగొన్నాడు (యోహాను 1:35-51). ఇది వారి పిలుపులో మొదటి దశ. వారు యేసును గుర్తించారు, కాని శాశ్వతమైన అనుచరులుగా మారలేదు. ఇది యేసును వెంబడించుమనే పిలుపు. తరువాత, యేసు వారిని పూర్తి-కాల శిష్యరికానికి పిలుస్తాడు.

ఈ ప్రక్రియలో యోహాను 2 ముఖ్య దశ. కానా వివాహంలో, యేసు ఆయన మహిమను శిష్యులకు ప్రత్యక్షపరచాడు. మిగిలిన అతిథులకు అద్భుతం గురించి తెలియదు. యేసు తననుతాను శిష్యులకు ప్రత్యక్షపరచుకున్నాడు తద్వారా వారాయనయందు విశ్వాసముంచారు. ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి (యోహాను 2:11).

యేసు నజరేతు నుండి కపెర్నహూముకు వెళ్లి ప్రకటించడం ప్రారంభించిన తరువాత (మత్తయి 4:12-17) మత్తయి 4:18-22లోని సన్నివేశం జరిగింది. గలిలయ సముద్రం ప్రక్క నడుస్తూ, సీమోను, అంద్రెయ, యాకోబు, యోహానులను తనను వెంబడించుమని పిలుపునిచ్చాడు. “వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి” (మత్తయి 4:20). యోహాను 1లో, ఆరంభ పిలుపు తరువాత, ఈ శిష్యులు మత్స్యకారులుగా తమ పని కొనసాగించారు. యేసు వారిని పరిచారం కొరకు పిలిచాడు: “ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువు” (లూకా 5:10).

ఈ ప్రక్రియలో తరువాత మెట్టు యేసు, పన్నెండుమంది అపొస్తలులను ఎన్నుకోవడం. అనేకమంది అనుచరులలో నుండి (యోహాను 6లో “శిష్యులు” గా పిలువబడ్డారు), యేసు ఆయనకు సమీపంగా ఉండడానికి పన్నెండుమందిని ఎన్నుకున్నాడు.

పన్నెండుమంది అపొస్తలులను హడావిడిగా ఎన్నుకోలేదు. ఆ ప్రక్రియకు చాలా నెలలు పట్టినట్లు కనిపిస్తుంది. దీనివల్ల యేసు వారిలో ఒక్కొక్కరితో సమయం గడపగలిగాడు. చాలాసార్లు, నాయకుడు ఒక వ్యక్తిని తెలుసుకోవడానికి సమయం కూడా కేటాయించకుండ వారసుని ఎన్నుకోవడానికి తొందరపడతాడు. తెలివైన నాయకుడు ఒక వ్యక్తి నాయకత్య సామర్థ్యం అంచనావేయడానికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు.

గురువు తన శిష్యులతో సమయం గడపాలి

► ఏది ఎక్కువ ఉత్సాహకరం, ఎక్కువమందిని చేరుకోవడమా లేక తక్కువమందికి శిక్షణ ఇవ్వడమా? సుదీర్ఘ-కాలానికి ఏది ముఖ్యం? యేసు పన్నెండుమంది విషయంలో ఎందుకు ఎక్కువ కష్టపడ్డాడు?

యేసు ఎక్కువ సమయం పన్నెండుమంది అపొస్తలులతో గడిపాడు. వారు తనతోకూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను” (మార్కు 3:14-15). మొదట, ఆయన పద్ధతులు నేర్చుకోవడానికి వారు ఆయనతో సమయం గడుపుతారు. అప్పుడే వారు పరిచర్య కోసం పంపడానికి సిద్ధంగా ఉంటారు.

మార్కు గలిలయలో యేసు చేసిన ఒక ప్రయాణం గురించి రాశాడు: “[ఆయన అక్కడ ఉన్నాడని] అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేక పోయెను, ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించెను” (మార్కు 9:30-31). యేసు ప్రధాన ఉద్దేశ్యం జనసమూహాన్ని చేరుకునే కార్యక్రమాన్ని వృద్ధిచేయటం కాదుగాని సంఘాన్ని నడిపించే మనుష్యులను సిద్ధం చేయడం.

యేసు వేలమందికి ప్రకటించాడు, కాని ఆయన ప్రధాన ఉద్దేశం భవిష్యత్ పరిచర్య కోసం కొందరికి శిక్షణ ఇవ్వడం. శిక్షణ అనేది చిన్న గుంపుపై దృష్టిపెట్టి చేస్తే మరింత ప్రభావంగా ఉంటుందని యేసుకు తెలుసు. రాబర్ట్ కోల్మెన్ ఇలా హెచ్చరిస్తున్నాడు: “మీ పరిచర్య ఎక్కువగా వృద్ధిచెందినప్పుడు, వ్యక్తులనుశిష్యులుగా చేయడానికి సమయం కేటాయించడం కష్టమౌతుంది. కాని మీ పరిచర్య వృద్ధిచెందే కొద్దీ, వ్యక్తులను శిష్యులుగా చేయడానికి సమయం కేటాయించడం చాలా ప్రాముఖ్యం.”

మీరు సువార్తలు చదువుతున్నప్పుడు, యేసు తన యొద్ద కనీసం ముగ్గురు శిష్యులను ఉంచుకుని పరిచర్య చేశాడు. యేసు, ఆయన శిష్యులు, శిక్షణా తరగతుల కోసం అరణ్యప్రాంతాల్లోకి వెళ్ళేవారు. యేసు ఈ భూమిపై పరిచర్య ముగింపులో, శిష్యులతో మరింత సమయం గడిపాడు. యెరూషలేములో చివరి వారంలో, యేసు ఎక్కువ సమయం శిష్యులను తన వద్ద ఉంచుకున్నాడు. వీరికి శిక్షణ ఇవ్వడం ఆయన ముఖ్య పని.

యూదుల సామెత చెప్పినట్లుగా, “తన యజమాని ధూళి తినువాడు శిష్యుడు.” శిష్యుడు తన యజమానునికి దగ్గరగా నడుస్తాడు, అతని పాదాల ధూళి గాల్లో లేచినప్పుడు దానిని పీల్చుకుంటాడు. యజమానుడు తిన్నది శిష్యుడు తింటాడు; యజమానుడు వెళ్లిన చోటికి శిష్యుడు వెళ్తాడు; శిష్యుడు యజమానుడి బోధన, మాదిరికి కట్టుబడి ఉంటాడు. యేసు శిష్యులు ఆయన స్వభావం తమలో పెంపొందించుకునేంతవరకు ఆయనతో గడిపారు. తరువాత, వారు “క్రైస్తవులు”గా వెల్లడి చేసుకున్నారు; వారు వారి యజమానిలా మారిపోతారు.

అదే విధంగా, పౌలుకు కూడా ఎల్లప్పుడు తిమోతి, తీతు, లూకా లేక తుకికు వంటి అనుచరులున్నారు. వారితో సమయం గడుపుతూ పౌలు వారిని పరిచర్యకు సిద్ధం చేశాడు.

మరలా, ఇది కూడా నేడు మనకు మాదిరి. మీరు మీ పరిచర్య చేస్తుండగా, మీకంటే చిన్నవారిని ప్రోత్సహించవచ్చు, వారు పరిచారం నేర్చుకుంటారు. ఒక విజయవంతమైన నాయకుడు ఇలా చెప్పాడు: “నాతో పాటు యౌవ్వన పరిచారకుడిని తీసుకెళ్లకుండా, ఎప్పుడూ పరిచర్య పర్యటనకు నేను వెళ్లలేదు. భవిష్యత్తు సంఘ నాయకులను తయారుచేయడం, నేను ప్రస్తుతం చేస్తున్న పరిచర్యలాగే నాకు ప్రాముఖ్యం.” ప్రభావవంతమైన నాయకులు ఇతర నాయకులకు శిక్షణ ఇస్తారని ఈ పాస్టర్ అర్థం చేసుకున్నాడు.

గురువు తన శిష్యులకు పరిచర్య విషయంలో ఒక ఆదర్శాన్ని చూపించాలి

శిష్యుల పాదాలు కడిగిన పిమ్మట, “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని” (యోహాను 13:15) అని యేసు చెప్పాడు. యేసు మాదిరి ద్వారా బోధించాడు. “ఇది చెయ్యాలి” అని చెప్పడం సరిపోదని ఆయనకు తెలుసు. ఎలా చెయ్యాలో కూడా చేసి చూపించాలి. యేసు ఆయన చేసి చూపించకుండా ఫలానా పని చెయ్యాలని శిష్యులకు ఎన్నడు చెప్పలేదు.

శిష్యులు యేసు ప్రార్థన చూసి, “ప్రభువా…మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన” (లూకా 11:1) ను అడిగారు. యేసు ప్రార్థనను గురించి కేవలం ఒక పాఠం చెప్పి ఊరుకోలేదు. ఆయన ప్రార్థించాడు. ఆయన ప్రార్థించేటప్పుడు వారు చూసి, ఆ ప్రార్థన అర్థం చేసుకోవాలని చాలా ఆసక్తి చూపారు. శిష్యులు నేర్చుకోవాలనే ఆసక్తితో ఉన్నప్పుడు, మంచిగా నేర్చుకోగలుగుతారు!

యేసు ప్రసంగంలో లేఖనాలు ఉపయోగించడం శిష్యులు విన్నారు. యేసు ఎల్లప్పుడు పాత నిబంధనను సూచించాడు. ఆయన బైబిల్ ప్రసంగ మాదిరి చూపాడు. శిష్యులు ఈ పాఠం నేర్చుకున్నారా? ఖచ్చితంగా నేర్చుకున్నారు! అపొస్తలుల కార్యములు 2లో, పేతురు ప్రసంగించినప్పుడు, యోవేలు, కీర్తన 16, మరియు కీర్తన 110ను ఉటంకించాడు. తన ప్రసంగం లేఖనాలపై ఆధారపడాలని పేతురు యేసు నుండి నేర్చుకున్నాడు. అపొస్తలుల కార్యములు లోని ప్రతి ప్రసంగం పాత నిబంధనను సూచిస్తుంది.

పౌలు ఇదే పద్ధతి అనుసరించాడు. అతను పదే పదే ఇలా రాశాడు: “మీరు నా మాదిరి చూశారు. కావున నన్ను పోలి నడుచుకొనుడి.”[2] పౌలు మాదిరి ద్వారా బోధించాడు. తీతు, తిమోతి వంటి శిష్యులు తమ యజమానుడైన పౌలు మాదిరి ననుసరించి కాయుట నేర్చుకున్నారు.

నేడు, మనం శిక్షణ ఇచ్చేవారికి పరిచర్యలో మాదిరిగా ఉండాలి. వారు మన విజయాలు, వైఫల్యాలు రెండూ చూస్తారు. మనం తప్పులు ఒప్పుకుంటూ నేర్చుకొంటుండగా చాలామంది మన స్వభావాన్ని పరిశీలిస్తారు. శిష్యులు మనలను పరిశీలిస్తూ పరిచర్య వాస్తవాలు నేర్చుకుంటారు.

గురువు తన శిష్యులకు బాధ్యత అప్పగించాలి

► మత్తయి 10:5-11:1 చదవండి.

ఆరంభం నుండి, యేసు ఉద్దేశ్యం పరిచర్య కోసం శిష్యులను సిద్ధపరచడం. వారిని మనుష్యులు పట్టు జాలర్లుగా చేయటానికి తనను వెంబడించుమని ఆయన పిలిచాడు (మత్తయి 4:19).

శిష్యులు యేసుతో గడిపిన మొదటి సంవత్సరం, ఆయన పరిచర్యను పరిశీలించారు. ఆయన మాదిరి ద్వారా నేర్చుకున్నారు. వాళ్ళు పరిశీలించిన తరువాత, యేసు వారిని పరిచర్య కొరకు పంపాడు. యేసు తన శిష్యులపై ఎలాంటి బాధ్యత ఉంచాడో మత్తయి 10 చూపిస్తుంది.

ఆయన వారికి అధికారమిచ్చాడు (మత్తయి 10:1).

వారిని బయటకు పంపే ముందు, ఆయన వారికి అప్పగిస్తున్న పరిచర్య చేయడానికి అధికారం ఇచ్చాడు. కొన్నిసార్లు నాయకులు తమ మద్దతుదారులకు అధికారం ఇవ్వటానికి భయపడతారు. అయితే, అధికారం లేని బాధ్యత శిక్షణ పొందే వారిని ముందుకు వెళ్ళనీయదు. బాధ్యత నెరవేర్చడానికి తగినంత అధికారం ఇవ్వకుండా మన సహాయకులకు మనం ఎటువంటి బాధ్యత అప్పగించకూడదు.

ఆయన వారికి స్పష్టమైన సూచనలు ఇచ్చాడు (మత్తయి 10:5-42).

యేసు తన శిష్యులకు స్పష్టమైన సందేశం ఇచ్చాడు: రాజ్య ప్రకటన. వారి బాధ్యత స్పష్టమైంది. వారు ఏమి చెయ్యాలని యేసు కోరుతున్నాడో వారికి ఖచ్చితంగా తెలుసు.

ఎక్కడ పరిచర్య చెయ్యాలో యేసు శిష్యులకు చెప్పాడు: ఇశ్రాయేలులో నశిస్తున్న గొర్రెలకు. తరువాత, అపొస్తలులు అన్యజనులకు ప్రకటిస్తారు, కాని పరిచర్య చేయటం నేర్చుకుంటుండగా, ఇంటి నుండి మొదలుపెట్టాలని యేసు చెప్పాడు. మన శిష్యులు విజయం పొందడానికి సాధ్యమైన ప్రతి పని చెయ్యాలి. సాధించడానికి సులభంగా ఉండే పనితో మొదలుపెట్టాలి. యేసు సహేతుకమైన లక్ష్యాలు పెట్టాడు.

హింస గురించి యేసు తన శిష్యులను హెచ్చరించాడు. హింస, పరిచర్యలో శిష్యులు విఫలమైనందున రాదుగాని యేసుకు విధేయత చూపాలనే పిలుపు ద్వారా వస్తుంది, ఆయన అనుచరులకు, ఆయనను తిరస్కరించేవారికి మధ్య విభజన తెస్తుంది.

ఆయన వారిని ఇద్దరిద్దరుగా పంపాడు (మార్కు 6:7).

యేసు పరిచర్యలో బృందాలుగా కలిసి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను చూపించాడు. శిష్యులను ఇద్దరిద్దరుగా పంపాడు. కొన్ని నెలల తరువాత, ఆయన అనుచరుల్లో 72మందిని ఇద్దరిద్దరుగా పంపాడు (లూకా 10:1). ఇది ఆదిమ సంఘ పరిచర్యకు మాదిరి. పేతురు, యోహాను కలిసి పరిచర్య చేశారు. బర్నబా, సౌలు కలిసి పరిచర్య చేశారు. పౌలు సీల కలిసి పరిచర్య చేశారు.

గురువు తన శిష్యులను పర్యవేక్షించాలి

శిష్యులు పరిచర్య నుండి తిరిగివచ్చిన తరువాత, యేసుకు నివేదించారు (మార్కు 6:30). యేసు శిష్యులకు శిక్షణ ఇచ్చే క్రమంలో అనంతర పరీక్ష చాలా ముఖ్యం. బాధ్యత అప్పగిస్తే సరిపోదు; ప్రభావవంతమైన నాయకుడు శిష్యుల ప్రదర్శనను పరీక్షించాలి. పర్యవేక్షణ లేని బాధ్యత పేలవ ఫలితాలిస్తుంది.

► మత్తయి 17:14-21 చదవండి.

నేర్చుకునే ప్రక్రియలో వైఫల్యం ఒక ముఖ్య భాగమని హోవార్డ్ హెండ్రిక్స్ చెప్పాడు. “మేము ఈ చిన్నవానిలో దయ్యాన్ని ఎందుకు వెళ్లగొట్టలేకపోయాము?” అని శిష్యులు అడిగారు. వారికి విశ్వాసం గురించి బోధిస్తూ యేసు సమాధానమిచ్చాడు. యేసు పరలోకానికి తిరిగి వెళ్ళిన తర్వాత కంటే, పరిచర్య ఆరంభ దశలోనే విఫలమవ్వటం మంచిది!

శిష్యుని ప్రభావవంతమైన పర్యవేక్షణలో మూల్యనిర్థారణ ఒక భాగం. శిష్యుడు పనిలో విఫలమైనప్పుడు, జట్టులో నుండి వెలివేయబడడు. బదులుగా, మనం వైఫల్యానికి కారణం గుర్తించి, భవిష్యత్తులో మెరుగుపడటం కొరకు ప్రణాళిక చెయ్యాలి.

లూకా 9లో యేసు ఈ నమూనా చూపించాడు:

  • 9:1-6లో, యేసు పన్నెండుమంది శిష్యులను పంపాడు.

  • 9:10 లో, వారు వారి పర్యటన గురించి ఆయనకు చెప్పారు.

  • 9:37-43లో, శిష్యులు దయ్యాన్ని వెళ్లగొట్టలేకపోయారు.

  • 9:46-48లో, దేవుని రాజ్యంలో గొప్పదనం గురించి యేసు వారికి బోధించాడు.

  • 9:49-50లో, పరిచర్య విషయంలో ఒక తప్పుడు నిర్ణయాన్ని బట్టి యేసు యోహానును గద్దించాడు.

  • 9:52లో, సమరయలో ఆయన దర్శన సిద్ధపాటుకు యేసు శిష్యులను పంపాడు.

  • 9:54-55లో, పరిచర్య విషయంలో మరొక చెడ్డ నిర్ణయాన్ని బట్టి యేసు యాకోబు, యోహానులను గద్దించాడు.

  • 10:1లో, యేసు పరిచర్య చేయడానికి పెద్ద గుంపును పంపాడు.

బోధన, బాధ్యత, పర్యవేక్షణ/మూల్యంకనం మధ్య ప్రత్యామ్నాయాలు చేశాడు. వారు విఫలమైనప్పుడు కూడా ఆయన తన శిష్యుల్ని విడిచిపెట్టలేదు. వైఫల్యాన్ని బోధనా అవకాశంగా మార్చుకున్నాడు.

తరువాత పౌలు అదే పద్ధతి అనుసరించాడు. క్రేతు ద్వీపంలో సంఘాన్ని నడిపించడానికి తీతును, ఎఫెసులో పరిచర్య చేయటానికి తిమోతిని నియమించాడు. తదుపరి శిక్షణ కోసం పత్రికలు రాశాడు. మొదటి మిషనరీ యాత్రలో సంఘాలు స్థాపించిన తరువాత, సంఘాలను పర్యవేక్షించడానికి రెండవ యాత్రలో తిరిగి వచ్చాడు (అపొస్తలుల కార్యములు 15:36).

శిక్షణలో ఈ నమూనా/పద్ధతి నేటికీ ప్రభావవంతమే. చాలామంది నాయకులు నేడు పర్యవేక్షణ లేక జవాబుదారీతనం లేకుండ యౌవ్వన నాయకులను పంపుతున్నారు-పరిచర్య విఫలమైనప్పుడు ఆశ్చర్యపోతున్నారు. “నేను బోధించాను, గనుక వారు మంచిగా చేస్తారు” అని మనం అనుకోకూడదు. బదులుగా, పర్యవేక్షణ కొనసాగే ప్రక్రియ. మీరు నాయకులకు శిక్షణ ఇవ్వాలంటే, పర్యవేక్షణకు సమయం కేటాయించాలి.

క్రొత్త పనివారికి శిక్షణ ఇవ్వడంలో నాలుగు దశలను గూర్చి హోవార్డ్ హెండ్రిక్స్ చెప్పాడు:

1. చెప్పటం: వారికి విషయం చెప్పాలి. యేసు, రాజ్య సందేశం గురించి తన శిష్యులకు ప్రకటించాడు.

2. చూపించటం: పరిచర్యకు నమూనా చూపించాలి. యేసు తన శిష్యులకు పరిచర్య నమూనా అందించాడు.

3. ఆచరించడం: ప్రత్యక్ష పర్యవేక్షణలో పరిచర్య. యేసు తన శిష్యులను పరిచర్య కోసం పంపాడు, వారి అనుభవాలు పరిశీలించాడు.

4. చేయటం: ప్రత్యక్ష పర్యవేక్షణలేని పరిచర్య. పెంతెకొస్తు తరువాత, యేసు పర్యవేక్షణ లేకుండా శిష్యులు పరిచర్య చేశారు.

► శిష్యుల్ని నాయకులుగా చేయడానికి మీరేం చేస్తున్నారు? మనం నేర్చుకున్న దశల్లో, మీరు ఏది ఎక్కువ ప్రభావవంతంగా చేస్తున్నారు? ఇంకా ఏ దశలో మెరుగుపడాలి? సమూహంగా, భవిష్యత్ నాయకులకు శిక్షణ ఇచ్చే విషయంలో మరింత ప్రభావితంగా ఎలా ఉండాలో చర్చించండి. మీ పరిచర్యలో నాయకులను వృద్ధి చేసే ప్రణాళిక కలిగియుండేవరకు కూడా ఈ చర్చ కొనసాగాలి.

మన శిష్యులు ఇతర శిష్యులను సిద్ధపరచాలి

“…మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని” (యోహాను 15:16) అని యేసు శిష్యులతో చెప్పాడు. అనేకమంది శిష్యులను సిద్ధపరచాలని యేసు తన శిష్యులకు శిక్షణ ఇచ్చాడు.

► మత్తయి 13:31-32 చదవండి.

యేసు చెప్పిన ఆవగింజ ఉపమానం, దేవుని రాజ్యం దాని వాస్తవిక పరిమాణం కంటే ఎక్కువగా ఎదుగుతుందని చెప్తుంది. ఒక చిన్న ఆవగింజ ఊహించిన దానికంటే పరిమాణంలో పెద్ద మొక్కగా పెరిగినట్లే, సంఘం కూడా ఎవ్వరు ఊహించలేనిదానికంటే ఎక్కువ పెరుగుతుంది. పాత నిబంధనలో, ఆకాశపక్షులకు ఆశ్రయంగా ఉన్న చెట్టు గొప్ప రాజ్యంలో అనేక రాజ్యాలున్నాయని సూచిస్తుంది (దానియేలు 4:12 మరియు యెహెజ్కేలు 31:6). శిష్యులు శిష్యులను సిద్ధపరుస్తుండగా, సంఘం దాని అసలు పరిమాణం కంటే పెరిగి, భూదిగంతాల వరకు విస్తరిస్తుందని యేసు వాగ్దానం చేశాడు.

మన పరిచర్య తుది మూల్యాంకనం శిష్యులను సిద్ధం చేయటంలో ఉందని డా. రాబర్ట్ కోల్మెన్ రాశాడు. “తుదకు ఇక్కడ మన జీవితం ఎలా వృద్ధి చెందుతుందో అంచనా వెయ్యాలి. మనకు అప్పగించబడిన వాళ్లు గొప్ప ఆజ్ఞను పట్టుకుని, ఇతరులకు కూడా బోధించే నమ్మకమైన సేవకులుగా ఉంటారా? మన పరిచర్య వాళ్ల చేతుల్లోకి వెళ్ళే సమయం త్వరలో వస్తుంది.”[3]


[1]Robert Coleman, The Master Plan of Evangelism. (Grand Rapids: Baker Book House, 1963) నుండి తీసుకున్నారు.
[2]1 కొరింథీయులకు 11:1, ఫిలిప్పీయులకు 3:17, ఫిలిప్పీయులకు 4:9 లు కూడా ఉదాహరణలో ఉన్నాయి.
[3]Robert Coleman, “The Jesus Way to Win the World: Living the Great Commission Every Day.” Evangelical Theological Society, 2003.

నిశిత పరిశీలన: యేసు ప్రధాన యాజకత్వ ప్రార్థన

యేసు ప్రధాన యాజక ప్రార్థన మధ్యభాగంలో ఆయన శిష్యులపై దృష్టిపెట్టాడు (యోహాను 17:6-19). ఈ ప్రార్థన యేసు తన శిష్యులకు మార్గనిర్దేశం చేసే పద్ధతి గురించి విలువైన పాఠాలను బోధిస్తుంది.[1]

(1) మొదట, మనం శిక్షణ ఇచ్చేవారిని కాపాడుతాం.

యేసు ప్రార్థించాడు, “నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని.” సువార్తల్లో 20సార్లు, యేసు తన శిష్యులకు ప్రమాదాల నుండి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. తప్పుల నుండి కాపాడాడు. శిష్యులకు శిక్షణ ఇస్తుండగా, లోకంలో వారికి ఎదురయ్యే ప్రమాదాల నుండి వారిని కాపాడాలి. మన శిక్షణ ఆచరణాత్మకంగా ఉండాలి.

► మీ సంస్కృతిలో యువ పరిచారకులు ఎదుర్కొనే ప్రమాదాలు ఏంటి? గురువుగా, ఈ ప్రమాదాలు ఎదుర్కోవడానికి వారిని ఎలా సిద్ధపరుస్తారు?

(2) వారు పరిపక్వతలోకి వస్తుండగా, మనం శిక్షణ ఇస్తున్నవారిని నమ్ముతాం.

యేసు ఇలా ప్రార్థించాడు, “నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను” (యోహాను 17:15). శిష్యులు శోధనలెదుర్కొంటారని యేసుకు తెలుసు కాని ఆయన తాను శిక్షణ ఇచ్చిన వారిపై నమ్మకం కలిగియున్నాడు. మనం శిక్షణ ఇస్తున్న యువ నాయకులను నమ్మడం నేర్చుకోవాలి. నాయకత్వానికి అధికారం అప్పగించి, ముఖ్య నిర్ణయాల విషయంలో ఇతరులను నమ్మాలని ఇది కోరుతుంది.

నాయకులు తమ అనుచరులను వీక్షించే రెండు మార్గాలున్నాయని అజిత్ ఫెర్నాండో రాశాడు.

  • బలహీన నాయకులు తమ అనుచరుల బలహీనతలపై దృష్టిపెడతారు.

  • ప్రభావవంతమైన నాయకులు తమ అనుచరుల బలహీనతలపై పనిచేస్తూనే బలంపై దృష్టిపెడతారు. ప్రభావవంతమైన నాయకులు ఇతరులను “నిరీక్షణ నేత్రాలు” ద్వారా చూస్తారు.

(3) శిక్షణ పొందిన తరువాత, మన శిష్యులను లోకంలో పరిచర్య చేయడానికి పంపుతాం.

“నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని” (యోహాను 17:18) అని యేసు ప్రార్థించాడు. పెంతెకొస్తు తరువాత, యేసు వారిని ఏ పరిచర్య కొరకైతే సిద్ధపరిచాడో శిష్యులు ఆ పనిని మొదలుపెట్టాడు. మనం శిష్యుల్ని చేస్తాం, తత్ఫలితంగా వారు లోకంలో సువార్త ప్రకటిస్తారు.

“వారియందు నేను మహిమపరచబడి యున్నాను” (యోహాను 17:10) అని యేసు చెప్పాడు. శిక్షణ ఇచ్చినవారిని లోకంలోకి పంపుతుండగా, యేసు మహిమ పొందుతున్నాడని నిర్థారించుకోవాలి. శిక్షణ ఇచ్చిన వారి నుండి మనం మహిమపరచబడాలనే శోధనలో పడిపోతాం. ఇతరులను శిష్యులుగా చేసే మన సామర్థ్యం ద్వారా కీర్తి పొందాలనే శోధనలో పడిపోతాం. బదులుగా, మహిమ కేవలం దేవునికి మాత్రమే చెందేటట్లు చూడాలి.


[1]Ajith Fernando, Jesus Driven Ministry (Wheaton, Illinois: Crossway Books, 2002), 172-173 నుండి తీసుకున్నారు.

అన్వయం: పరిచర్య బృందం విలువ

పరిచర్యలో బృందం యొక్క విలువను గూర్చి యేసు మాదిరి చూపుతుంది. యువ సహోద్యోగులకు శిక్షణ ఇవ్వడం, తోటి పాస్టర్లతో సహవాసం నిర్మించుకోవడం జట్టు పరిచర్యలో భాగం. మనం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి సృష్టించబడ్డాం. బృందాలు ఎందుకు అంత ప్రాముఖ్యం?

బృందాలు, సమతుల్యతనిస్తాయి

యేసు ప్రజలను విభిన్న నేపథ్యాల నుండి ఎన్నుకున్నాడు. పేతురు యోహాను ఎల్లప్పుడు స్థిరమైన ప్రత్యర్థులు. మత్తయి రోము కోసం పనిచేసేవాడు, జెలోతీయుడైన సీమోను, రోమీయులను యూదయ నుండి వెళ్ళగొట్టాలనుకున్నాడు. వీరు వ్యతిరేకులు. శిష్యుల్ని ఎన్నుకునేటప్పుడు, యేసు విభిన్న ప్రజలను ఎన్నుకున్నాడు.

అలాటి వ్యతిరేక స్వభావం గలవారు జట్టులో ఉన్నప్పుడు కష్టాలున్నప్పటికీ, ఈ విభిన్న వ్యక్తిత్వాల్లో ఉండే ప్రయోజనాలు మనం విస్మరించకూడదు. అపొస్తలుడైన పేతురు లాంటివాడు పెద్ద పెద్ద ప్రకటనలు చేయడానికి తొందరపడతాడు. కాని జాగ్రత్తపరులైన తోమా, అంద్రెయ వంటి అపొస్తలులు ద్వారా సమతుల్యమయ్యాడు. నాయకత్వంలో విభిన్నమైన వ్యక్తులు ఉండటం వలన ఆదిసంఘం ప్రయోజనం పొందింది.

బుద్ధిగల నాయకులు విభిన్న నేపథ్యాల నుండి జట్టు సభ్యుల్ని ఎన్నుకుంటారు. బలమైన జట్టు సంఘ నాయకత్వంలో వివిధ బలాలు ఇస్తుంది. ఒక సభ్యుడికి ఆర్థిక విషయాల్లో ఎక్కువ అవగాహన ఉండొచ్చు; మరొకరికి వ్యక్తిగత సంబంధాల్లో ఉండొచ్చు. అందరు కలిసినప్పుడు, సంఘంలో సమతుల్య నాయకత్వం ఉంటుంది.

బృందాలు తెలివైన సలహా ఇస్తాయి

ఆయన శిష్యులకు శిక్షణ ఇస్తున్నప్పుడు, సంఘానికి పునాది వేస్తున్నాడని యేసుకు తెలుసు. పెంతెకొస్తు తరువాత, ఆది సంఘం అనేకమైన కఠినమైన నిర్ణయాలు ఎదుర్కోవలసి వచ్చింది. శిష్యులు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒకరి అవసరత మరొకరికి ఉంటుందని యేసుకు తెలుసు.

“అన్యజనులైన విశ్వాసులు సంఘంలో ఎలా భాగమౌతారు?” అనేది ఆది సంఘం ఎదుర్కొన్న ఒక నిర్ణయం. “వారు యూదుల ధర్మశాస్త్ర విషయాలు అన్నీ పాటించాలా?” ఇది మనకు సులభంగా ఉన్నప్పటికీ, ఒక కష్టమైన నిర్ణయం. ఇది వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించిన విషయం కాదు; ఆహారం, సున్నతి నియమాలు పాత నిబంధన ఆధారితం. ఈ నిర్ణయానికి దీర్ఘ-కాల ప్రభావం ఉంటుంది. ఈ నిర్ణయం వలన నేడు మనం ప్రభావితమౌతాం. యెరూషలేం సభ, భిన్నమైన నిర్ణయం తీసుకొని ఉంటే, నేడు అన్య క్రైస్తవులు యూదుల నియమాలను పాటించవలసి ఉండేది.

ఈ ముఖ్య విషయాన్ని ఆది సంఘం ఎలా పరిష్కరించిందో అపొస్తలుల కార్యములు 15 చూపిస్తుంది. వేర్వేరు ఆలోచనలు విన్న తర్వాత, వారు ఒక నిర్ణయానికి వచ్చారు. వారు అన్య సంఘానికి రాసిన పత్రికలో, నిర్ణయాన్ని వివరించడానికి అపొస్తలులు ఒక మంచి పదం వాడారు, “ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను” (అపొస్తలుల కార్యములు 15:28-29). సంఘ నాయకులు సమావేశమై, అభిప్రాయాలు చర్చించుకుని, సరైన నిర్ణయం తీసుకునేట్టుగా ఆత్మ వారిని నడిపించాడు.

నిర్ణయం తీసుకునేటప్పుడు భిన్నమైన దృక్పథాల విలువను గురించి సామెతల గ్రంథ రచయిత ఉద్ఘాటించాడు.

  • మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును (సామెతలు 12:15).

  • నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము (సామెతలు 11:14).

  • వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము (సామెతలు 24:6).

ఇది సంఘ నాయకులకు ముఖ్య సూత్రం. మీరు ఇతరుల మాటలు వినటానికి సుముఖత చూపకుంటే, జ్ఞానంగలవారు కాదని సామెతలు సెలవిస్తుంది. మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును.

బృంద ఉద్దేశ్యం తెలివిగల సలహా ఇవ్వడమైతే, మనకంటే భిన్నంగా ఆలోచించే ప్రజలు మనకు అవసరం. జట్టును ఎన్నుకునేటప్పుడు మనవలె ఉన్నవారిని ఎన్నుకోకూడదు. మనతో ఎల్లప్పుడు ఏకీభవించే ప్రజలు మనకు అవసరం లేదు.

బృందాలు, ప్రోత్సాహం అందిస్తాయి

ప్రసంగి బృందం యొక్క ప్రయోజనాలు వివరిస్తాడు: “ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలము కలుగును గనుక ఒంటిగాడైయుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును.” (ప్రసంగి 4:9-10).

సంఘం వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు, అపొస్తలులు ఒకరినొకరి ప్రోత్సహించుకున్నారు. ఆది సంఘ సభ్యుల మధ్య పరస్పర సహకారం గురించి వివరించడానికి లూకా “ఏకమనస్సుతో ఎడతెగక” అనే మాట వాడాడు.

గొప్ప మిషనరీ హడ్సన్ టేలర్ ఈ సూత్రం ఉదహరించాడు. పరిచర్యపై ఆసక్తితో టేలర్ చైనా వెళ్లాడు, కాని వెంటనే నిరుత్సాహపడ్డాడు. అతనికి ఆర్థిక సహాయం చేసే కొందరు, సహాయం చేయటం మానేశారు. స్థాపించబడిన మిషనరీలు అతనిని విమర్శించేవారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా అతని పనిని వ్యతిరేకించింది. అతన్ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి, మిషనరీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇంగ్లాండ్ నుండి లేఖ రాసింది. టేలర్ నిరుత్సాహానికి గురై, ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు.

ఈ సమయంలో, విలియం బర్న్స్ అనే స్కాటిష్ మిషనరీ హడ్సన్ టేలర్ తో కలిసి ఏడు నెలలు చైనా లోతట్టు ప్రాంతాల సువార్త ప్రకటనలో గడిపాడు. ఇద్దరు కలిసి ప్రయాణించారు, కలిసి ప్రార్థించారు, కలిసి ప్రకటించారు. ఆ పర్యటనలో, టేలర్ చైనా పట్ల తనకున్న దర్శనం తిరిగిపొందాడు. జాన్ పోల్లోక్ ఇలా రాశాడు: “విలియం బర్న్స్ హడ్సన్ టేలర్ ను తన నుండి రక్షించాడు.”

తరువాత హడ్సన్ టేలర్ చైనా ఇన్ల్యాండ్ మిషన్ ను స్థాపించాడు, ఆధునిక యుగంలో గొప్ప మిషనరీగా ప్రసిద్ధుడయ్యాడు; విలియం బర్న్స్ దాదాపు ఎవరికీ తెలియదు. అయితే, విలియం బర్న్స్ చైన ఇన్ల్యాండ్ మిషన్ ద్వారా మారిన వేలాదిమందిలో కొందరికి బాధ్యుడు. క్లిష్ట పరిస్థితిలో బర్న్స్ హడ్సన్ టేలర్ ను ప్రోత్సహించాడు. బృందాలు ప్రోత్సాహం అందిస్తాయి.

బృందాలు జవాబుదారీతనాన్ని అందిస్తాయి

మనందరికీ కనబడనివి - అంటే మనలో మనం చూడలేని లక్షణాలు కొన్ని ఉంటాయి. మన కుటుంబ నేపథ్యం నుండి, క్రైస్తవ్యంలోకి రాక మునుపు జీవితం నుండి, మన వ్యక్తిత్వం నుండి వచ్చే బలహీనతలను మనం పరిచర్యలోకి తీసుకోస్తాం. అవి మన పరిచర్యపై ప్రభావం చూపుతుంటాయి.

ఈ బలహీనతలను మనం చూడలేం కాని బృందంలోనున్న ఇతర సభ్యులు మన పరిచర్యను నాశనం చేయగల ఈ విషయాల్లో మనలను అప్రమత్తం చేస్తారు. సత్కార్యాలు చేయడానికి ఒకనినొకడు హెచ్చరించుచు ఉండాలని హెబ్రీ పత్రిక రచయిత క్రైస్తవులను పిలిచాడు (హెబ్రీయులకు 10:24). “హెచ్చరించుచు” అను పదానికి గ్రీకులో ఒకరిని గుచ్చటం లేక పొడవటం అనే ఆలోచన ఇస్తుంది. కొన్నిసార్లు, ఇది అంగీకరించనిది. ఎవరు పొడిపించుకోవడానికి (వేలు ఎత్తి చూపించుకోవడానికి) ఇష్టపడరు, కాని జవాబుదారీతనం విలువైనది. ప్రతి క్రైస్తవ నాయకుని జీవితంలో “ఇది తెలివితక్కువ పని. మళ్ళీ దాని గురించి ఆలోచించాలి” అని చెప్పే వ్యక్తి అవసరం.

మధ్యయుగంలో మఠాలు, వెస్లీ క్లాస్ మీటింగ్స్ నుండి ప్రామిస్ కీపర్స్ వంటి ఆధునిక బృందాలు వరకు క్రైస్తవుల నాయకులకు జవాబుదారీతనం అనే సుదీర్ఘ సంప్రదాయం ఉంది. నేటి సంఘ నాయకులు జవాబుదారీతనం వల్ల లబ్దిపొందుతున్నారు. దీనిని ఒక్కొక్కరుగా చిన్న గుంపులలో చెయ్యొచ్చు లేక ఫోన్లో అయినా చెయ్యొచ్చు. మనం పతనమవ్వకుండా ముందుగానే ఆత్మీయ ప్రమాదం గురించి ఇది మనలను హెచ్చరిస్తుంది.

మంచి జవాబుదారీతనంలో ప్రతి వ్యక్తి సంపూర్ణ నిజాయితీ కలిగి ఉండాలి, వ్యక్తుల మధ్య గోప్యత ఉండాలి. జవాబుదారీ ప్రశ్నలకు అనేక ఉదాహరణలు మీరే కనిపెట్టొచ్చు. ఒక జాబితాలో ఈ ప్రశ్నలు ఉంటాయి:

  • ఈ వారం, క్రమంగా దేవునితో సమయం గడిపారా?

  • ఈ వారం, ఏవిధంగానైన మీ యధార్థత విషయంలో రాజీపడ్డారా?

  • ఈ వారం, మీ ఆలోచన విధానం నిర్మలంగా ఉందా?

  • ఈ వారం, ఏ విధమైన లైంగిక పాపం చేశారా?

  • ఈ వారం, మీ భార్య (భర్త) కోసం ముఖ్య పని ఏం చేశారు?

  • ఈ వారం, మీ విశ్వాసాన్ని గూర్చి అవిశ్వాసితో పంచుకున్నారా?

  • ఈ సమాధానాలు నిజాయితీగా చెప్పారా?

బృంద జవాబుదారీతనం శోధన సమయాల్లో ప్రాముఖ్యం. యౌవ్వన పాస్టర్ కి రాస్తూ, శాశ్వతంగా నిలిచి ఉండే పరిచర్యను ఎలా నిర్మించాలో పౌలు చెప్పాడు. “నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము” (2 తిమోతికి 2:22) అని పౌలు తిమోతికి హెచ్చరించాడు. ప్రభువును పవిత్ర హృదయంతో పిలిచే దైవ-అనుచరులతో కలిస్తే తిమోతి ఆత్మీయ జీవితం బలపడుతుందని పౌలు అర్థం చేసుకున్నాడు.

► మీరు పరిచర్య బృందంలో భాగమైతే, మీ బృందం నుండి మీరు పొందుకున్న ప్రయోజనాలు పంచుకోండి. పరిచర్య బృందంలో ఉండటం వలన వచ్చే సవాళ్లు ఏంటి?

బృందంతో కలిసి పనిచేయటం

యేసు భిన్న వ్యక్తిత్వాలు గలవారిని ఒక బృందంగా రూపించాడు. యేసు వారి భిన్నత్వాలను తీసుకుని, ఆది సంఘాన్ని నడిపించగల ఒక జట్టును సృష్టించాడు. సంఘానికి పేతురుకున్న ధైర్యవంతమైన నాయకత్వం అవసరం, ఫిలిప్పుకున్న మౌన స్వభావం అవసరం. నాయకుడు ఎదుర్కొనే ఒక గొప్ప సవాలు, అనుచరులను ఒక జట్టుగా మలచడం.

శ్రీలంకలో ఒక సంఘ నాయకుడైన అజిత్ ఫెర్నాండో, జట్టును నిర్మించడంలో ఉండే సవాళ్లు బాగా అర్థం చేసుకున్నాడు. అతడు ఇలా రాశాడు:

ఇవాంజెలికల్ సంఘంలో ఉండే విషాదం ఏంటంటే, నిర్ణయం తీసుకుని చర్య జరిగించే విధానంలో చాలాసార్లు వేదాంతం కంటే భావాలు ఎక్కువగా పనిచేస్తుంటాయి. బైబిలానుసారమైన క్రైస్తవుడు ఇలా చెప్తాడు: “ఈ వ్యక్తి గురించి నా భావాలెలా ఉన్నా సరే, దేవుడు కోరుతున్నాడు గనుక నేనతన్ని అంగీకరిస్తాను. అతనితో అన్యోన్యత కలిగి పని చేసే కృప ఇవ్వమని దేవునిని అడుగుతాను.” మన అనుభవాలు వేరే సందేశమిచ్చినప్పుడు, ఈ వ్యక్తితో కలిసి పనిచేయాలనే ఈ ప్రయత్నం పని చేస్తుందని మన వేదాంతం చెబుతుంది. ఈ సంబంధం విషయంలో కష్టపడి పని చేయడానికి మన వేదాంతం మనల్ని నడిపిస్తుంది. మనం వ్యక్తి కొరకు, అతనితో మనం సంబంధం కొరకు ప్రార్థిస్తాం. అతన్ని క్రమంగా కలుస్తాం. అతనికి క్రైస్తవ ప్రేమ చూపుతాం, అతని వ్యక్తిగత శ్రేయస్సు కోసం చేయగలిగినదంతా చేస్తాం. బృందం ద్వారా ఇతడు ఏం సాధించగలడో ప్రణాళికలు వృద్ధిచేస్తాం.[1]

కేవలం నచ్చకపోవడం వలన ప్రజలను తిరస్కరించే హక్కు క్రీస్తు దేహంలో మనకు లేదని 1 కొరింథీయులకు 12:12-25 బోధిస్తుంది. మీరు సంఘాన్ని నిర్మిస్తే, మీకు నచ్చని సభ్యులు కూడా ఉంటారు. ఒక క్రైస్తవ నాయకుడుగా మీరిలా చెప్పాలి, “నా వ్యక్తిగత భావాలేవైనా సరే, దేవుడు నాకు అప్పగించాడు గనుక ఈ వ్యక్తిని నేను అంగీకరిస్తాను. అతనితో కలిసి పనిచేసే కృప ఇవ్వాలని దేవుని అడుగుతాను మరియు, పరిచర్యలో అతనిని దీవించి, వృద్ధి చేయమని వేడుకుంటాను.”


[1]Ajith Fernando, Jesus Driven Ministry (Wheaton, Illinois: Crossway Books, 2002), 133

ప్రభావవంతమైన క్రైస్తవ నాయకుడు, ఒక దాసుడు

ఒకసారి ఒక వ్యక్తి కాబోయే పాస్టర్ ని ఇలా అడిగాడు, “నువ్వు పాస్టర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావ్?” అప్పుడా యువకుడు, “విమానాశ్రయంలో, ఒక వ్యక్తి తన పాస్టర్ సంచి మోయటం చూశాను. నా సంచి మోయడానికి నాకు ఎవరైనా కావాలి!” అని సమాధానమిచ్చాడు.

యేసు దృక్పథం పూర్తి భిన్నం! ఈ యువకుడు పరిచారం చేయించుకోవాలనుకున్నాడు; యేసు పరిచారం చేయాలనుకున్నాడు. “మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను” (మార్కు 10:45). నిజమైన నాయకత్వం పరిచారం చేయడమని యేసు చూపించాడు. యేసు తననుతాను తగ్గించుకుని, దాసుని స్వరూపం ధరించుకున్నాడు (ఫిలిప్పీయులకు 2:7).

► యోహాను 13:1-20 చదవండి.

యేసు సేవా-నాయకత్వ మాదిరి గురించి సువార్తలలో పలుచోట్ల ఉంది, కాని ఒక అత్యంత గొప్ప ఉదాహరణ, యేసు తన శిష్యుల పాదాలు కడగటం. ఈ దృశ్యంలో, దాసుడు అంటే ఏంటో యేసు చూపించాడు.

ప్రభు రాత్రి భోజనం సమయంలో యేసు చేసిన పని (పాదాలు కడగటం) మళ్ళీ చేయాలని కొన్ని సంఘాల్లో పాదాలు-కడిగే కార్యక్రమం పెడతారు. ఇది అద్భుత కార్యక్రమం కావచ్చు, కాని యేసు ప్రత్యేకమైన ఆచారం జరిపించలేదని గ్రహించడం ఇంకా అద్భుతం. దానికి బదులుగా, ఆయన చేయవలసిన పని చేశాడు అంతే.

యెరూషలేములో మురికి వీధుల కారణంగా, భోజనపు బల్ల యొద్ద అతిథి పాదాలు కడగటం కూలీలకు ఆనవాయితీ. ఇది అల్పమైన సేవకులకు కేటాయించిన వినయపూర్వక విధి. యేసు ఆయన శిష్యులతో పస్కా వేడుకలో పాలుపంచుకొనగా, గదిలో పరిచారకుడు ఎవడు లేడు. ఈ పని చేయడానికి ఏ శిష్యుడు కూడా ముందుకు రాలేదు; యేసు రాజ్యంలో వారు ఉన్నత స్థానాల కోసం చూస్తున్నారు. యేసు వంగి అల్పమైన సేవకుడు చేసే పని చేయడం మొదలుపెట్టాడు.

ఈ దృశ్యం నాయకత్వంపై యేసు అవగాహనను చూపిస్తుంది. ఇతరులు నాయకత్వాన్ని అధికారం, స్థాయిగా చూశారు. వారి లక్ష్యం సంస్థలో ఉన్నతంగా ఉండడం. యేసు అప్పటికే ఉన్నత స్థాయిలో ఉన్నాడు; ఆయన శిష్యుల యజమానుడు. కాని దాసుని స్వరూపం తీసుకున్నాడు.

క్రీస్తునుపోలిన నాయకుడు అంటే ఇలా ఉండాలి. కీస్తునుపోలిన నాయకుడు ఏ ఒక్కరు కోరుకోని పనిని తీసుకుంటాడు. క్రీస్తునుపోలిన నాయకుడు ఇతరులపై విరుచుకుపడే తన అధికారం ద్వారా కాదుగాని వినయంతో పరిచారం చేయడం ద్వారా ఇతరులను ప్రేరేపిస్తాడు.

[1]ఒకసారి ఒకరు ఇలా చెప్పారు: “దాసుని స్వభావానికి పరీక్ష ఏంటంటే, ‘నన్ను దాసునిగా చూసినప్పుడు, నేను ఎలా ప్రవర్తిస్తాను?’” యేసు మాదిరి అనుసరిస్తున్న నాయకుడిని, దాసునివలే చూసినప్పటికీ అభ్యంతరపడడు. ఇతర శిష్యులతో పాటుగా యేసు యూదా పాదాలు కూడా కడిగాడనే విషయం మరచిపోకూడదు. మిమ్మల్ని అప్పగించడానికి నిర్ణయించుకున్నవాని పాదాలు కడగడం మీరు ఊహించగలరా?

శిష్యులు పాదాలు కడగటం ముగిసిన తర్వాత, అధికారం కొరకు చూస్తున్నవారితో యేసు, “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని” (యోహాను 13:15) అని చెప్పాడు. ముప్పై సంవత్సరాల తరువాత, “దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి” (1 పేతురు 5:5) అని రాసినప్పుడు బహుశా యేసు విధేయతను సీమోను పేతురు గుర్తుచేసుకున్నాడు. శిష్యులకు పరిచారం చేయాలని యేసు నడుం చుట్టూ తువాలు చుట్టుకున్నట్లుగా, ఇతరులకు పరిచారం చేసేటప్పుడు మనం విధేయతను చుట్టుకోవాలి.

క్రైస్తవ నాయకులుగా, పరిచారం కొరకు అవకాశాలు వెదకకుండ అధికారం కొరకు అవకాశాలు వెదకే శోధనలు మనం ఎదుర్కొంటాం. క్రైస్తవ నాయకత్వం పరిచారమని యేసు చూపించాడు.


[1]

“దేవుని ప్రజల మధ్య నాయకత్వానికి చిహ్నాలుగా పెద్ద బల్లల స్థానంలో తువాలు, నీటి తొట్టెను భర్తీ చేశారు....ఇది తువాలు వెనక్కి తిరిగి తీసుకురావలసిన సమయం.”

- సి. జీన్ విల్క్స్

ముగింపు: ఇతర క్రైస్తవ పరిచారకులకు మార్గదర్శకత్వం చేయడం యొక్క ప్రాముఖ్యత

మీ జీవిత ముగింపులో, ఇతర క్రైస్తవ పనివారిపై బోధకునిగా మీరు చూపే ప్రభావం, మీ పరిచర్యలో గొప్ప స్వాస్థ్యం. మీ పరిచర్యలో మీరు కేవలం 12మందికి మాత్రమే మార్గదర్శకత్వం చేస్తే, మీ ప్రభావం ఆ 12మందితో పాటు వారు మార్గదర్శకత్వం చేసే వారితో కూడా వృద్ధి చెందుతుంది.

విచారకరమైన విషయం ఏమిటంటే, మార్గదర్శకత్వం (మెంటరింగ్) ప్రాముఖ్యత గురించి చాలామంది క్రైస్తవ నాయకులకు తెలిసినప్పటికీ, కొందరే ఇతరులకు మార్గదర్శకత్వం చేయడానికి సమయం కేటాయిస్తారు. పరిచర్యలో ఈ కోణాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం?

ఒక కారణం, మార్గదర్శకత్వం యొక్క వెల. శిక్షణకు విలువైన సమయం అవసరం. యౌవ్వన నాయకులకు శిక్షణ ఇచ్చే సమయాన్ని, పెద్ద సమూహానికి పరిచర్య చేయడానికి కేటాయిస్తే మరీ మంచిదని మనం ఎల్లప్పుడు భావిస్తాం.

మరొక కారణం, మార్గదర్శకత్వం ఇవ్వడంతో పాటు వచ్చే నిరాశ. “నేను తరువాత తరం నాయకులకు శిక్షణ ఇస్తున్నాను” అని చెప్పడం ఆకర్షణీయంగా ఉంటుంది. వాస్తవంగా మాత్రం అంత ఉత్తేజకరంగా ఉండదు.

చాలసార్లు, యేసు ఆయన శిష్యుల్లో పురోగతి నెమ్మదిగా ఉండడాన్ని చూసి నిరాశ చెందియుండొచ్చు. యేసుతో మూడు సంవత్సరాలు గడిపిన పిమ్మట, ఫిలిప్పు, “ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా” (యోహాను 14:8). యేసు 5000మందికి ఆహారం పెట్టిన కొన్ని వారాల తరువాత, శిష్యులు 4000మంది జనసమూహాన్ని ఎదుర్కొన్నారు. “అందుకాయన శిష్యులు–ఈ అరణ్యప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి” (మార్కు 8:4).

అపొస్తలుడైన పౌలు కూడా అదే నిరుత్సాహం అనుభవించాడు. యోహాను అను మారుపేరు గల మార్కు, మొదటి మిషనరీ యాత్రలోనే విరమించుకున్నాడు (అపొస్తలుల కార్యములు 13:13). దేమాకు శిక్షణ ఇచ్చిన కొంత కాలానికి, పౌలు చెరలో ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా రాశాడు, “దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను” (2 తిమోతికి 4:10).

మార్గదర్శకత్వం ఖరీదైనది, నిరుత్సాహం కలిగిస్తుంది, కాని నాయకుని పనిలో ఆది ముఖ్య భాగం. పరిపక్వతగల ప్రతి నాయకుడు భవిష్యత్ నాయకులకు శిక్షణ ఇవ్వాలి. అదే సమయంలో, ప్రతి క్రైస్తవ నాయకునికి శ్రమ కాలంలో మద్దతిచ్చే శిక్షకుడు అవసరం.

హోవార్డ్ హెండ్రిక్స్ ప్రతి మనిషి జీవితంలో ముగ్గురు వ్యక్తులు అవసరమని చెప్పాడు:

1. ప్రతి మనిషికి అభివృద్ధి కొనసాగించాలని మిమ్మును సవాలు చేసే గురువు లాంటి పౌలు అవసరం.

2. ప్రతి మనిషికి మీ బలహీనతల విషయంలో నిజాయితీగా ఉండి మిమ్మల్ని ప్రేమించే మిత్రుడు లాంటి బర్నబా అవసరం.

3. ప్రతి మనిషికి పరిచర్యలో శిక్షణ ఇచ్చి, బోధించే యువకుని లాంటి తిమోతి అవసరం.

► ఇలా ప్రశ్నిస్తూ ఈ పాఠం ముగించండి:

  • “నా పౌలు ఎవరు??”

  • “నా బర్నబా ఎవరు?”

  • “నా తిమోతి ఎవరు?”

పాఠం 3 అభ్యాసాలు

(1) క్రింద ఇచ్చిన పట్టికలో, శిష్యులు యేసు పరిచర్యను పరిశీలించిన నాలుగు సందర్భాలు రాయండి. యేసును పరిశీలిస్తూ, శిష్యులు నేర్చుకున్న విషయాలు గమనించండి.

(2) భవిష్యత్ పరిచర్య కొరకు మీరు శిక్షణ ఇచ్చే ఇద్దరు లేక ముగ్గురు పేర్లు రాయండి. రెండు ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు చిన్న పేరా రాయండి:

  • నేను శిక్షణ ఇస్తున్న వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు చూడాలని కోరుతున్నాను?

  • నేను శిక్షణ ఇస్తున్న వ్యక్తిలో దేవుడు ఏం నెరవేర్చాలని కోరుతున్నాను? (నిర్దిష్టంగా చెప్పండి.)

మీరు పేరు చెప్పిన వ్యక్తులకు శిక్షణ ఇచ్చే దశలు మొదలుపెట్టండి. పరిచర్య అవకాశాల కొరకు వారిని ఎలా సిద్ధపరచగలమో చూపించమని దేవునిని అడగండి.

ముద్రించగల PDF ఇక్కడ మరియు Additional Files/అనుబంధం/అదనపు ఫైళ్ళు లో అందుబాటులో ఉంది.

సంఘటన లేఖనం శిష్యులకు పాఠం
యేసు దయ్యము పట్టిన బాలుని స్వస్థపరచడం మత్తయి 17:14-21 విశ్వాస శక్తి
     
     
     
     
Next Lesson