మన లోకంలో దేవుని రాజ్యానికి ప్రాతినిధ్యం వహించే రాయబారులుగా మనం పరిచర్య చేస్తాం.
పరిచయం
క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని రాజ్యం ప్రధాన విషయం.[1] రాజ్యం అను పదం మత్తయిలో 54సార్లు, మార్కులో 14సార్లు, లూకాలో 39సార్లు, మరియు యోహానులో 5సార్లు కనిపిస్తుంది.[2]
యేసు ఉపమానాలు సగానికి సగం దేవుని రాజ్యం గురించి బోధిస్తాయి. ఆయన రాజ్యం గురించి ప్రకటించాడు. రాజ్య శక్తిని కనుపరచడానికి స్వస్థతలు చేశాడు, దయ్యాలను వెళ్లగొట్టాడు. ఆరోహణమైన తర్వాత, ఆది సంఘం దేవుని రాజ్య సందేశాన్ని ప్రకటించడం కొనసాగించింది (అపొస్తలుల కార్యములు 8:12, అపొస్తలుల కార్యములు 28:23).
ఈ పాఠంలో, యేసు పరిచర్యలో దేవుని రాజ్యం గురించి, అదే విధంగా నేటి పరిచర్యపై దాని ప్రభావం గురించి మనం అధ్యయనం చేస్తాం. ఈ కోర్సు ముగింపులో, దేవుని రాజ్యం గురించి నైజీరియాలో ప్రకటించిన ప్రసంగం ఉంది. ఈ ప్రసంగం, మన ప్రపంచంలో రాజ్య సందేశం ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరిస్తుంది.
[1]ఈ అధ్యాయంలో ఉపయోగించిన మూలాలు:
D. Matthew Allen, “The Kingdom in Matthew.” (1999). https://bible.org/article/kingdom-matthew వద్ద అందుబాటులో ఉంది March 22, 2021.
Darrell L. Bock, Luke: Baker Exegetical Commentary on the New Testament. (Grand Rapids: Baker Books, 1994-1996)
J. Dwight Pentecost, The Words and Works of Jesus Christ. (Grand Rapids: Zondervan, 1981)
Martyn Lloyd-Jones, Studies in the Sermon on the Mount. (Grand Rapids: Eerdmans, 1959)
[2]మత్తయి సాధారణంగా “పరలోక రాజ్యం” అని సూచిస్తాడు, లూకా “దేవుని రాజ్యం” అని సూచిస్తాడు. మత్తయి ప్రాథమిక శ్రోతలు యూదులు; యూదులు దేవుని పేరును ఉచ్ఛరించరు గనుక దేవునికి సభ్యోక్తిగా “పరలోకం” అనే పదాన్ని వాడతారు. చాలావరకు మత్తయి “దేవుని రాజ్యానికి” బదులుగా “పరలోక రాజ్యం” అని ఉపయోగించాడు. ఈ పాఠంలో, మత్తయి ని ఉల్లేఖించునప్పుడు మినహా నేను “దేవుని రాజ్యం” అనే పదం వాడతాను.
దేవుని రాజ్యం
దేవుని రాజ్య అధ్యయనాన్ని పరిచయం చేసే రెండు ప్రశ్నలు.[1]
1. దేవుని రాజ్యం అంటే ఏంటి?
2. దేవుని రాజ్యం ఎప్పుడు స్థాపితమైంది?
దేవుని రాజ్యం అంటే ఏంటి?
► అపొ. కా. 1:1-8 చదవండి.
పునరుత్థానం తర్వాత 40 రోజుల కాలంలో, యేసు దేవుని రాజ్యం గురించి బోధిస్తూ శిష్యులతో ఉన్నాడు. యేసు ఆరోహణమయ్యే ముందు, శిష్యులు, “ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?” అని అడిగారు. శిష్యులు ఇలా ఆశించారు:
1. తక్షణ రాజ్యం: “యీ కాలమందు.” యేసు తక్షణమే రాజ్యం స్థాపించాలని వారు ఆశించారు.
2. రాజకీయ, భౌగోళిక రాజ్యం: “రాజ్యమును మరల.” యేసు రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి, ఇశ్రాయేలు రాజకీయ అధికారాన్ని మరలా పునరుద్ధరిస్తాడని వారు ఆశించారు
3. జాతీయ రాజ్యం: “ఇశ్రాయేలునకు రాజ్యమును.” పాత నిబంధన దావీదు రాజులవలే యేసు పరిపాలిస్తాడని వారు ఆశించారు.[2]
యేసు సమాధానమిచ్చాడు, “వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.”
దేవుని రాజ్యం ఈవిధంగా ఉంటుందని యేసు సమాధానం సూచిస్తుంది:
1. నిత్య రాజ్యం: “కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు.” యేసు రాజ్యం మనుష్యుల సమయంపై ఆధారితం కాదుగాని తండ్రి కాలంపై ఆధారితం.
2. అతీంద్రియ రాజ్యం: “అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు.” యేసు రాజ్యం పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడుతుందే గాని రాజకీయ అధికారంపై ఆధారపడదు.
3. సార్వత్రిక రాజ్యం: “భూదిగంతముల వరకును.” యేసు రాజ్యం సమస్త దేశాలను చేరుతుంది. అది కేవలం ఇశ్రాయేలుకు పరిమితం కాదు.
కాలాలు, సమయాలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని యేసు శిష్యులతో చెప్పాడు. బదులుగా, వారు రెండు విషయాలపై దృష్టిపెట్టాలి: పరిశుద్ధాత్మ పొందాలి, భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి.
వేదాంతవేత్తల మధ్య, దేవుని రాజ్యం గురించి మూడు ప్రాథమిక అభిప్రాయాలున్నాయి.
రాజ్యం వస్తుంది
కొందరు వేదాంతవేత్తలు, వెయ్యేండ్లకాలంలో యేసు భూమిమీద పరిపాలించే సమయంలో, అంత్యకాల రాజ్య స్థాపనను చూస్తారు. ఈ రచయితలు రాజ్య రాజకీయ మరియు ప్రాంతీయ విషయాలను ఉద్ఘాటించే మత్తయి 24-25 వంటి లేఖనాలు చూస్తారు.
రాజ్యం వచ్చింది.
యేసు భూలోకంలో ఉండగానే రాజ్యాన్ని స్థాపించాడని ఇతర వేదాంతవేత్తలు బోధిస్తారు. “పరలోక రాజ్యము సమీపించియున్నది” మరియు “దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది” (మత్తయి 4:17 మరియు లూకా 11:20) వంటి యేసు లేఖనాలపై వారు దృష్టిపెడతారు. రాజ్యాన్ని గూర్చిన ఈ దృక్పథం, విశ్వాసుల హృదయాల్లో దేవుని పాలన, ఆత్మీయ రాజ్యంపై దృష్టిపెడుతుంది.
రాజ్యం వచ్చింది గాని పూర్తిగా పరిణితి చెందలేదు
రాజ్యంలో వర్తమాన, భవిష్యత్ కోణాలు ఉన్నాయని చాలామంది వేదాంతవేత్తలు బోధిస్తారు. ఈ అభిప్రాయం ప్రకారం, దేవుని రాజ్యం యేసు భూమిపై పరిచర్య చేసిన సమయంలో ఆరంభమైంది; సంఘ పరిచర్య ద్వారా కొనసాగుతుంది; క్రీస్తు పాలించడానికి తిరిగి వచ్చినప్పుడు పూర్తిగా పరిణితి చెందుతుంది.[4] క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన సమస్తమైన ఆధిపత్యాన్ని, సమస్తమైన అధికారాన్ని, బలాన్ని కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును (1 కొరింథీయులకు 15:24). ఇది దేవుని రాజ్య సంపూర్ణ స్థాపన.
► రాజ్యాన్ని గూర్చిన ఈ అభిప్రాయాల్లో మీరు దేనిని కలిగియున్నారు? పరిచర్యలో ప్రతి అభిప్రాయం యొక్క ఆచరణాత్మక ప్రభావం ఏంటి?
ఈ పాఠంలో, ఇప్పటికే ఉనికిలో ఉన్న రాజ్య విషయాలు అదే విధంగా నెరవేర్చబడలసిన రాజ్య విషయాలు చూద్దాం. రాజ్యంలో ఈ క్రింది విషయాలు భాగంగా ఉంటాయి:
రాజు: ఆయన పుట్టినప్పుడు వచ్చిన జ్ఞానులు నుండి సిలువపై పైవిలాపం రాసే వరకు, యేసు రాజుగా వచ్చాడు.
అధికారం: యేసు తన అద్భుత కార్యాల ద్వారా, సమాధిని జయించడం ద్వారా అధికారాన్ని కనుపరచాడు.
ధర్మశాస్త్రం/నియమం: యేసు కొండమీద ప్రసంగంలో రాజ్య నియమాన్ని సంగ్రహించాడు.
భూభాగం: ఆయన రాజ్యం భూదిగంతాల వరకు వ్యాపిస్తుందని, అందులో అన్ని జాతులవారు, అన్ని భాషలు మాట్లాడువారు ఉంటారని యేసు బోధించాడు.
ప్రజలు: రాజు విమోచించిన వారందరూ, ఆయన పరిపాలనలోనున్న వారందరూ యేసు రాజ్య పౌరులు.
[4]యేసు భూలోక పరిచర్య కాలంలో రాజ్య ఆరంభాన్ని సూచించటానికి వ్యాఖ్యాతలు “రాజ్య ఆరంభం” అనే పదం ఉపయోగించారు. “రాజ్య ముగింపు” అనేది, క్రీస్తు తిరిగి వచ్చునప్పుడు రాజ్య వాగ్దానాల తుది నెరవేర్పు.
రాజ్య వాగ్దానం
► మత్తయి 3:1-12 చదవండి.
దేవుని రాజ్యం గూర్చిన మొదటి క్రొత్త నిబంధన సూచన బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటనలో కనిపిస్తుంది. పాత నిబంధన చివరి ప్రవక్తగా, యోహాను ఇశ్రాయేలు మతాధికారుల వేషధారణను ఖండించాడు. మొదటి క్రొత్త నిబంధన దూతగా, నూతన రాజు కోసం మార్గం సరాళం చేశాడు. “పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి” (మత్తయి 3:2). “సమీపించియున్నది” అను మాట రాజ్యం వేగంగా సమీపిస్తుందనే ఆలోచన ఇస్తుంది. అది ఇంకా రాలేదు, కాని చాలా దగ్గరగా ఉంది. నూతన రాజ్యాన్ని తీసుకొచ్చే మెస్సీయ రాక కోసం ఇశ్రాయేలును సిద్ధపరచడానికి యోహాను ప్రకటించాడు.
యోహాన్ని బంధించిన తర్వాత, యేసు బహిరంగ పరిచర్య మొదలుపెట్టాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతాలు పర్యటించాడు (మత్తయి 4:23). బాప్తిస్మమిచ్చు యోహానువలే, యేసు, “పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని” (మత్తయి 4:17) ప్రకటించాడు.
► మత్తయి 10:5-42 చదవండి.
ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకు వెళ్లి రాజ్య సువార్త ప్రకటించమని యేసు పన్నెండుమంది శిష్యులను పంపాడు. బాప్తిస్మమిచ్చు యోహాను, యేసువలే, వారు “పరలోకరాజ్యము సమీపించియున్నదని” (మత్తయి 10:5-7) ప్రకటించారు.
శిష్యుల పరిచర్య వాళ్ల యజమాని పరిచర్యకు అనుగుణంగా రూపించబడింది. యేసువలే, వారు రాజ్యం గురించి ప్రకటిస్తూ, ప్రజల భౌతిక అవసరాలు తీర్చాలి. యేసువలే, వారు రోగులను స్వస్థపరచారు, దేవుని రాజ్యం సాతాను రాజ్యంలోకి విరుచుకుపడిందనుటకు సూచనగా దయ్యాలను వెళ్లగొట్టారు. యేసు, రోగులను స్వస్థపరచుటకు, మృతులను లేపుటకు, కుష్ఠురోగులను శుద్ధులుగా చేయుటకు, దయ్యాలను వెళ్లగొట్టుటకు తన ప్రతినిధులను పంపాడు. (మత్తయి 10:8).
రాజ్య ఆరంభం
► మత్తయి 12:22-32 చదవండి.
రాజ్య వాగ్దానం క్రొత్త కాదు. పాత నిబంధన ప్రవక్తలు భవిష్యత్ రాజ్యాన్ని వాగ్దానం చేశారు. అయితే, రాజ్యం కేవలం భవిష్యత్ నిరీక్షణ కాదుగాని తక్షణ వాస్తవికత అని యేసు చెప్పాడు. యేసు రాజ్య ఆరంభాన్ని ప్రకటించాడు. యేసు ఉన్నప్పుడెల్లా దేవుని రాజ్యం ఉంది.
అపవిత్రాత్మలపై ఆయన అధికారంతో, సాతాను రాజ్యాన్ని పారద్రోలిన రాజు అధికారాన్ని యేసు చూపించాడు. ఆయన అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని స్వస్థపరచిన తర్వాత, యేసు దయ్యాలకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యాలను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదని పరిసయ్యులు చెప్పారు. అందుకు యేసు, తాను దేవుని శక్తివలన దయ్యాలను వెళ్లగొట్టుచున్నానని చెప్పాడు: “దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది” (మత్తయి 12:28). యేసు సాతాను రాజ్యాన్ని ఓడించాడు.
► మత్తయి 11:1-24 చదవండి.
యేసు అద్భుత కార్యాలు ఆయన రాజ్య ఆరంభానికి సంకేతాలు. యోహాను సువార్త యేసు అద్భుతాలకు సూచకక్రియలు అనే పదం ఉపయోగిస్తుంది. అద్భుతాలు యేసు దైవత్వానికి సూచనలు, నూతన రాజ్యానికి రుజువులు.
“దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది” అని బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించాడు. ఇశ్రాయేలుకు విమోచన కలిగించే రాజకీయ సంబంధమైన రాజ్యాన్ని అతడు ఆశించాడు. బదులుగా, యోహానును చెరసాలలో వేశారు! అతను తన శిష్యుల్ని పంపించి ఇలా అడుగమని చెప్పాడు: “క్రీస్తు చేయుచున్న కార్యములనుగూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా?” (మత్తయి 11:3) భూసంబంధమైన రాజ్యాన్ని స్థాపించే రాజకీయ సంబంధమైన మెస్సీయను గూర్చిన యోహాను అంచనాలకు యేసు పరిచర్య సరిపోలలేదు.
యేసు, మెస్సీయగా తాను చేసిన క్రియలు ఉద్ఘాటిస్తూ ప్రతిస్పందించాడు.
మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు (మత్తయి 11:4-6).
మెస్సీయ గురించి ప్రవచించిన సూచనలు నెరవేరుచున్నవని యేసు యోహానుకు జ్ఞాపకం చేశాడు. యేసు యోహానుకున్న బలాన్ని, ధైర్యాన్ని మెచ్చుకున్నప్పటికీ, పరలోకంలో అల్పులు యోహాను కంటే గొప్పవారని ప్రకటించాడు. ఎందుకు? యేసు రాజ్యాధిక్యతలన్నిటితో క్రొత్త నిబంధన స్థాపించడానికి వచ్చాడు. గొప్ప పాత నిబంధన పరిశుద్ధుడు ఎన్నడు చూడని ఆధిక్యతలు, కొత్త నిబంధనలోని అల్ప విశ్వాసికి ఉన్నాయి. క్రొత్త నిబంధన విశ్వాసులు పాత నిబంధనల నెరవేర్పును చూశారు. వాగ్దానం చేయబడిన రాజ్యం ఆరంభమైంది.
రాజ్యంలో జీవితం: కొండమీద ప్రసంగం
సువార్తల్లో కొండమీది ప్రసంగమే, సుధీర్ఘమైన ప్రసంగం. ఈ ప్రసంగంలో దేవుని రాజ్యమే సమగ్రమైన ఇతివృత్తం. దీనిని అనేక విధానాల్లో చూడొచ్చు:
ధన్యతల్లో మొదటి మాట, పరలోక రాజ్యము, ఆత్మవిషయమై దీనులైనవారు (మత్తయి 5:3) కలిగియున్నారు అని బోధిస్తుంది. చివరి ధన్యత పరలోక రాజ్యము నీతినిమిత్తము హింసింపబడువారు (మత్తయి 5:10) కలిగియున్నారు అని బోధిస్తుంది. ధన్యతల్లో ప్రధాన విషయం పరలోక రాజ్యమని చూపిస్తూ, మిగిలిన ధన్యతల చుట్టూ ఈ రెండు ధన్యతలు ఒక కప్పు/ఆవరణం లాగా పనిచేస్తాయి.
ధర్మశాస్త్రాన్ని పునఃవ్యాఖ్యానించే అధికారం తనకుందని యేసు ప్రకటించాడు (మత్తయి 5:21-48). ఇది, తన రాజ్య నియమాలు వివరించడానికి, అన్వయించడానికి అధికారంగల రాజు యొక్క చర్య.
యేసు తన శిష్యులకు ప్రార్థించడం నేర్పించాడు, “నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక” (మత్తయి 6:9-13). భూలోకంలో దేవుని రాజ్య పురోగతి కోసం ప్రార్థించడానికి మనం పిలువబడ్డాం. దేవుని ప్రజలు కొండమీద ప్రసంగం ప్రకారం జీవిస్తే, రాజ్యం, దేశంలోని నూతన పౌరులకు విస్తరిస్తుంది.
ప్రసంగ ముగింపులో, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అద్భుత కార్యాలు సరిపోవని యేసు బోధించాడు. తండ్రి చిత్త ప్రకారం చేసేవారే రాజ్యంలో ప్రవేశిస్తారు (మత్తయి 7:21).
కొండమీద ప్రసంగం చదవడానికి సూత్రాలు
కొండమీద ప్రసంగం చదివేటప్పుడు మూడు సూత్రాలు గుర్తించుకోవాలి.
(1) కొండమీద ప్రసంగంలో ఆజ్ఞలకి విధేయత చూపడం పరలోక రాజ్యంలో పౌరత్వాన్ని “సంపాదించదు.”
“ఈ విధంగా జీవిస్తే, క్రైస్తవుడౌతావు” అని ఆలోచించకూడదు. బదులుగా, రాజ్య పౌరునిగా మన జీవితాలను మార్గనిర్దేశం చేసేదిగా మనం ఈ ప్రసంగం చదవాలి: “నీవు క్రైస్తవుడవు గనుక ఈ విధంగా జీవించు.” మనం కృపచేతనే రక్షించబడ్డాం; కాబట్టి దేవుని రాజ్య పౌరులుగా, మనమాయన ఆజ్ఞలకు విధేయత చూపుతాం.
(2) కొండమీద ప్రసంగం శిష్యులకే గాని, అవిశ్వాసులకు కాదు.
ఇది లౌకిక ప్రపంచానికి రాజ్యాంగం కాదు. అవిశ్వాసులు ఈ సూత్రాల ప్రకారంగా జీవించనప్పుడు ఆశ్చర్యపడొద్దు! ఇది దేవుని రాజ్యంలో జీవితం గురించిన వివరణేగాని మానవ రాజ్యాల్లో జీవితం గురించిన వివరణ కాదు.
(3) కొండమీద ప్రసంగం ప్రతి విశ్వాసికి.
ఈ సూత్రాలు సాధారణ విశ్వాసులకు వర్తించవని వాదిస్తూ, ఈ ప్రసంగంలోని విషయాలు అనేకమంది విస్మరిస్తారు. “ఈ నియమం భవిష్యత్ వెయ్యేండ్ల రాజ్యానికి సంబంధించిందని” కొందరంటారు. మరి కొందరు, “ఇది కొంతమంది పరిశుద్ధులకే. చాలామంది క్రైస్తవులు ఈ ఆజ్ఞలు పాటించలేరని” చెబుతారు. ఇంకొందరు, “మనం ఎన్నటికీ దేవుని ఆజ్ఞలు పాటించలేం. మనం దేవుని ఆజ్ఞలు పాటించలేమని గ్రహించినప్పుడు, కేవలం కృప మీద ఆధారపడతామని” చెబుతారు.
ఏదేమైనా, ఆది సంఘం ప్రతి విశ్వాసికి మార్గదర్శినిగా ఈ ప్రసంగాన్ని చూస్తుంది. యాకోబు మరియు 1 పేతురు పత్రికలు ఈ ప్రసంగంలోని అనేక విషయాలను పునరావృతం చేస్తాయి. దేవుని పరిశుద్ధమైన ప్రామాణికతను బలహీనపరచడానికి యేసు నిరాకరించాడు. పరిసయ్యుల కంటే తక్కువ ప్రమాణికతకు బదులుగా, యేసు తన అనుచరులను ఉన్నత ప్రామాణికత కొరకు పిలిచాడు: “శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను” (మత్తయి 5:20).
దేవుని రాజ్యంలో జీవితం
► మత్తయి 5-7 చదవండి.
యేసు ఈ భూమిపై తన పరిచర్య కాలంలో రాజ్యాన్ని ఆరంభిన యెడల, ప్రస్తుతం మనం దేవుని రాజ్యంలో జీవిస్తున్నాం. కొండమీద ప్రసంగం పరలోక రాజ్య పౌరుని పాత్ర గురించి వివరిస్తుంది. ప్రసంగంలోని విషయాల సంక్షిప్త వివరణ ఇక్కడుంది.
(1) దేవుని రాజ్య విలువలు, లోక విలువలకు విరుద్ధం.
బీదలు, దుఃఖపడువారు, హక్కులు కోల్పోయినవారు, హింసించబడినవారు ధన్యులని ఏ భూలోక పాలకుడు చెప్పడు. యేసు కాలంలోని రోమా సామ్రాజ్య విలువలకు లేక మన ప్రస్తుత లోక విలువలకు పూర్తి విరుద్ధంగా ధన్యతలు ఉన్నాయి. దేవుని రాజ్యం మానవ రాజ్యానికి భిన్నం.
(2) దేవుని రాజ్య పౌరులు తమ ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి.
యేసు కాలంలో ఎస్సేనులు, నీతిమంతులు సమాజం నుండి వైదొలగి, దూరంగా ఏకాంత ప్రదేశంలో దేవుని రాజ్యం స్థాపించాలని చెప్పారు. యేసు, “కాదు! మీరు మీ లోకాన్ని భద్రపరచే ఉప్పుగాను, పరలోకమందున్న మీ తండ్రికి మహిమతెచ్చు వెలుగుగాను ఉండాలని” చెప్పాడు. దేవుని రాజ్యం ప్రధానంగా ఆత్మ సంబంధమైనప్పటికీ, రాజ్యంలోని పౌరుల ద్వారా మన లోకం రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ప్రయోజనం పొందాలి.
[1]లౌకిక ప్రపంచంలో ఉప్పుగా, వెలుగుగానున్న క్రైస్తవుల ఉదాహరణలు చాలా ఉన్నాయి. విలియం విల్బర్ ఫోర్స్ బ్రిటీష్ సామ్రాజ్యంలో బానిసల వ్యాపారం రద్దు చేయడానికి నాయకత్వం వహించాడు; మెథడిస్ట్ పునరుద్ధరణ ఆంగ్ల సమాజంలోని అన్ని స్థాయిల్లో సామాజిక సంస్కరణ తీసుకొచ్చింది; విలియం కేరి భారతదేశంలో చట్టబద్ధంగా చిన్న పిల్లలను చంపడం, అదే విధంగా సతికి (విధవలను-దహించడం) వ్యతిరేకంగా పోరాడాడు; క్రైస్తవులు అక్షరాస్యత పెంచారు, ఆసుపత్రులు, అనాథ ఆశ్రయాలు స్థాపించారు, అనేక దేశాల్లో బీదలకు, అవసరతలో ఉన్నవారికి సహాయం చేశారు.
(3) దేవుని రాజ్య పౌరులు తండ్రి ప్రేమను కనుపరచడానికి ధర్మశాస్త్రం ఆశించే కనీస విషయాలను దాటివెళ్ళారు.
యేసు ధర్మశాస్త్రాన్ని భర్తీ చేయడానికి రాలేదుగాని నెరవేర్చడానికి వచ్చాడు. “నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు” (మత్తయి 5:17). ఒకదానిని నెరవేర్చాలంటే దాన్ని ముగింపుకు తేవాలి. యేసు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదుగాని ధర్మశాస్త్రం వెనుకున్న ఆత్మను వెల్లడిపరచడానికి వచ్చాడు. యేసు క్రమంగా చెప్పిన ఆరు ఉదాహరణలలో, రాజ్య పౌరుల నీతి, శాస్త్రులు, పరిసయ్యుల నీతికంటే మించినదిగా ఉండాలని యేసు చెప్పాడు.
ధర్మశాస్త్రం
రాజ్య పౌరులు
ధర్మశాస్త్రం హత్యను నిషేధిస్తుంది.
రాజ్య పౌరులు మూల ప్రేరణయైన కోపంపై దృష్టి పెడతారు.
ధర్మశాస్త్రం వ్యభిచారాన్ని నిషేధిస్తుంది.
రాజ్య పౌరులు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడరు.
ధర్మశాస్త్రం
“పరిత్యాగ పత్రిక” కోరుతుంది.
రాజ్య పౌరులు వైవాహిక జీవితంలో నిలిచియుండడానికి చూస్తారు కాని వదిలించుకోవడానికి సాకులు వెదకరు.
ధర్మశాస్త్రం తప్పుడు ప్రమాణాలనునిషేధిస్తుంది.
రాజ్య పౌరుడు చెప్పే “అవును” లేక “కాదు” అనే మాట సరిపోతుంది.
రాజ్య పౌరులు ప్రతీకార భావంతో కాక ప్రేమతో వ్యవహరిస్తారు.
ధర్మశాస్త్రం మీ పొరుగువారిని ప్రేమించమని సెలవిస్తుంది.
రాజ్య పౌరులు తమ శత్రువులను ప్రేమిస్తారు.[2] వారు తమ పరలోక తండ్రి ప్రేమ, దయను ప్రతిబింబిస్తారు (లూకా 6:36).
(4) రాజ్య పౌరులు ఇతరులను మెప్పించక దేవుని మెప్పించడానికి శ్రద్ధ చూపుతారు.
ప్రజలు తమ దాతృత్వం చూడాలని పరిసయ్యులు ఆశిస్తారు; దేవుని రాజ్య పౌరులు రహస్యంగా ఇస్తారు. ఆకట్టుకునే తమ ప్రార్థనలు ప్రజలు వినాలని వేషధారులు ఆశిస్తారు; దేవుని రాజ్య పౌరులు సరళంగా, నిజంగా ప్రార్థిస్తారు. తమ సుదీర్ఘ ఉపవాసాలు చూసి ప్రజలు తమను గౌరవించాలని పరిసయ్యులు ఆశిస్తారు; దేవునిరాజ్య పౌరులు తండ్రి బహుమానం కొరకే ప్రార్థిస్తారు.
(5) దేవుని రాజ్య పౌరులు తమ సంపదను నమ్ముకోరు, తమ అవసరాలు గురించి చింతపడరు.
బదులుగా, వారు పరలోక తండ్రి సహాయం కోసం కనిపెడతారు.
(6) దేవుని రాజ్య పౌరులు ఇతరులకు తీర్పుతీర్చరు.
అయితే, అబద్ధ బోధకుల చెడ్డ ఫలితాలు గ్రహించే విషయంలో జాగ్రత్తగ ఉంటారు.
(7) దేవుని రాజ్య పౌరులు తమ ప్రార్థనలలో నమ్మకంగా ఉంటారు.
దేవుని రాజ్య పౌరులు తమ ప్రార్థనల్లో నమ్మకంగా ఉంటారు ఎందుకంటే పరలోకమందున్న తమ తండ్రి ఆయనను అడుగువారికి నిశ్చయంగా మంచి యీవులు ఇస్తాడని వారికి తెలుసు! (మత్తయి 7:11)
(8) దేవుని రాజ్య పౌరులకు కేవలం రెండు మార్గాలే ఉన్నాయని తెలుసు.
విశాల మార్గం, ఇరుకు మార్గం. మంచి వృక్షం, చెడ్డ వృక్షం. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. దేవుని రాజ్య పౌరులు వివేచన కలిగినవారు.
మనం కొండమీద ప్రసంగ సూత్రాలు ఆధారంగా ఎలా జీవిస్తాం? మూలం, మత్తయి 5:48. రాజ్య పౌరులు మన పరలోక తండ్రివలే ఉండుటకు పిలువబడ్డారు. యేసు బోధన చాలా సరళం, చాలా కష్టం. యేసు కృప మాత్రమే ఆయన బోధన ప్రకారం జీవించే శక్తినిస్తుంది. మన సొంత శక్తితో, ప్రసంగ నియమాలకు అనుగుణంగా మనం జీవించలేం. రాజ్య జీవితాన్ని సాధ్యపరచేది కేవలం ఆత్మ.
మనం కొండమీద ప్రసంగం బోధించునప్పుడు, ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ప్రసంగాన్ని కేవలం ధర్మశాస్త్రంగా బోధిస్తే, ప్రజలు నిరుత్సాహంలో, నిరాశలో ఉంటారు. ప్రసంగాన్ని కృప చేత అనుగ్రహించబడి, కుమారుని బలి ద్వారా కొనుగోలు చేయబడి, పరిశుద్ధాత్మ శక్తితో బలపరచబడిన దేవుని రాజ్య జీవితానికి మాదిరిగా ప్రకటించినప్పుడే, కొండమీద ప్రసంగం నిజంగా సువార్తలా, “శుభవార్త”గా ఉంటుంది.
► కొండమీద ప్రసంగం చదివి, ఈ సారాంశాన్ని సమీక్షించిన తర్వాత, వీటిని చర్చించండి:
మీ సమాజంలో క్రైస్తవులకు ప్రసంగంలోని ఏ బోధలు కష్టంగా ఉన్నాయి?
ఒక క్రైస్తవ నాయకుడిగా మీకు ప్రసంగంలోని ఏ బోధలు కష్టంగా ఉన్నాయి?
“కొండమీద చేసిన ప్రసంగాన్ని స్వార్థపరులకు, నిజమైన నీతిని తిరస్కరించువారికి వ్యతిరేకంగా చేశారు. నిజానికి, ప్రసంగం, క్షమించాలని, ఇవ్వాలని, కృతజ్ఞులుగా ఉండాలని కనికరంతో ప్రేమగా మెలగాలని పిలుపునిస్తుంది.”
- డారెల్ బాక్
రాజ్య మర్మం: రాజ్య ఉపమానాలు
ప్రతిపాదిత ప్రకటనలు గుర్తుపెట్టుకోవడం కంటే కథలు గుర్తుంచుకోవడం సులభమని యూదా బోధకులకు తెలుసు. ఈ కారణంగా, యూదా బోధకులకు ఉపమానాలే సుప్రసిద్ధ బోధనా పద్ధతి. దేవుని రాజ్యం గురించి లోతైన సత్యాలు తెలియజేయడానికి యేసు ఉపమానాలు ఉపయోగించాడు.
ఆయన పరిచర్య ఆరంభంలో, ఉపమానాల వాడకంవల్ల, యేసు తన శత్రువులతో సంఘర్షణ నివారిస్తూ, శిష్యులకు బోధించాడు. తరువాత, యెరూషలేములో మతాధికారులతో ముఖాముఖిగా మాట్లాడాడు. కాని ఈ ఆరంభ సంవత్సరాల్లో, శిష్యుల బోధనపై దృష్టిపెట్టాడు.
అనేకులు ఉపమానాలు విన్నారు కాని అర్థం చేసుకోలేదు. వారు విన్నారు కాని అర్థం చేసుకోలేదు; వారు చూశారు కానీ గ్రహించలేదు (మత్తయి 13:14). ఎందుకు? ఎందుకంటే వారు కఠిన హృదయులు. యెషయా ప్రవచించాడు:
ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు (మత్తయి 13:14-15, యెషయా 6:9 ఉల్లేఖనం).
వినగలిగే మనసున్న వారికి యేసు ఉపమానాల ద్వారా బోధించగలిగాడు.
దేవుని రాజ్య మర్మాలను గురించి మత్తయి 13లోని ఉపమానాల క్రమం అందిస్తుంది (మత్తయి 13:11). ఈ ఉపమానాలు యేసు అనుచరులకు దేవుని రాజ్య స్వభావం గురించి బయలుపరచుచునే, అవిశ్వాసులైన నాయకులకు మరుగు చేస్తుంది.
► ముందుకు కొనసాగడానికి ముందు, ఆగి మత్తయి 13:1-52 మరియు లూకా 19:11-27చదవండి. మీరు ప్రతి ఉపమానం చదివినప్పుడు, తర్వాత పేజిలోనున్న పట్టికలో ఒకటి రెండు వాక్యాల్లో ప్రధాన విషయాన్ని కుదించి రాయండి. ప్రతి ఉపమానంలో, నేటి పరిచర్యకు ఒక అన్వయం కనుగొనండి. ఒక ఉదాహరణగా మొదటి ఉపమానం మీ కోసం సంపూర్తి చేశాం.
దేవుని రాజ్య ఉపమానాల క్రమంలో మొదటి ఉపమానం, విత్తనం విషయంలో మన ప్రతిస్పందన విత్తన ఫలితాన్ని నిర్ణయిస్తుందని బోధిస్తుంది. పరలోక రాజ్యంలో, కొందరు నమ్మి ఫలిస్తారు, కొందరు నమ్మకుండా మొదటి ప్రతిస్పందన తర్వాత పతనమైపోతారు.
ఈ ఉపమానాన్ని నేలలను గురించిన ఉపమానం అని పిలవచ్చు ఎందుకంటే ఇది వివిధ నేలల గురించి మాట్లాడుతుంది గాని వ్యవసాయదారుని గురించి మాట్లాడదు. ప్రతి ఉదాహరణలో, విత్తనం మారలేదు, రైతు మారలేదు; మారిందల్లా నేల. మనం దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తుండగా, కొందరు మిగిలిన వారిలా సరిగా స్పందించనప్పుడు ఆశ్చర్యపడకూడదు. మనం నిరుత్సాహపడకూడదు. కొందరు ఫలించే నేలగా ఉంటారు కాని మరికొందరు వాక్యానికి కఠినంగా ఉంటారని యేసు బోధించాడు.
వ్యవసాయదారుని ఉపమానానికి లూకా ఇచ్చే ముగింపు, ఇది సత్యాన్ని వినటం గూర్చిన ఉపమానమని చూపిస్తుంది. “కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునది కూడ తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను” (లూకా 8:18). ఒక వ్యక్తి సత్యానికి అనుకూలంగా ప్రతిస్పందించినప్పుడు, వారు మరింత సత్యాన్ని స్వీకరిస్తారు. ప్రసంగంలో మరిన్ని ఉపమానాలు చెప్పే ముందు, ఫలించే నేలగా తన శ్రోతలు ఎలా వినాలో యేసు బోధించాడు.
గురుగుల ఉపమానం (మత్తయి 13:24-30, 36-43)
దేవుని రాజ్యం దుష్టులపై తక్షణ తీర్పు తెస్తుందని యూదులు ఆశించారు. విశ్వాసులు, అవిశ్వాసులు కలిసి జీవించే లోకం కొరకు యేసు తన శిష్యులను సిద్ధపరచాడు. ఈ కథలో, పొలమే లోకం (మత్తయి 13:38). యుగాంతంలోనే దేవదూతలు గురుగులను సేకరించి అగ్నితో కాల్చేస్తారు (మత్తయి 13:40). దేవుని రాజ్యం దేవుని సమయంలో ఎదుగుతుంది కాని మానవుని సమయంలో కాదు.
ఆవగింజ ఉపమానం (మత్తయి 13:31-32)
యేసు ఈ లోకంలో చేసిన పరిచర్యను చూసిన ఏ ఒక్కరూ, సంఘం లోకమంతటా వ్యాపిస్తుందని ఊహించలేదు. శిష్యులు పామరులు, బీదలు, భయస్తులు. వారికి జనాకర్షణ, సాంఘిక స్థితి లేక రాజకీయ అధికారం లేదు. వాళ్లు చిన్న ఆవగింజవంటివారు. ఒక చిన్న ఆవగింజ, మొక్కలన్నిటిలోకెల్లా పెద్దగా పెరిగినట్లే లేక పొదగా మారినట్లే, దేవుని రాజ్యం లోకమంతటా వ్యాపిస్తుంది.
యేసు దేవుని రాజ్యాన్ని ఆవగింజతో పోల్చినప్పుడు ఆయన శ్రోతలు విని, ఆశ్చర్యపోయి ఉంటారు. దేవుని రాజ్యం మహిమతోను శక్తితోను వస్తుందని యూదుల రబ్బీలు ఆశించారు. పాపులపై తీర్పు వస్తుందని ఆశించారు; రోమా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుందని ఆశించారు; నూతన యూదా రాజ్య స్థాపన సాంఘిక విప్లవం సృష్టిస్తుందని ఆశించారు. బదులుగా, యేసు తన శిష్యులను ఆకట్టుకోని రాజ్యం కొరకు సిద్ధపరచాడు.
మనం క్రొత్త నిబంధన చదివినప్పుడు, మొదటి శతాబ్దంలో యూదయకు అంతగా ప్రాముఖ్యత లేకపోవడాన్ని మర్చిపొవచ్చు. యూదయ క్రొత్త నిబంధనకు కేంద్రం, కాని అది మొదటి శతాబ్దపు ప్రపంచ కేంద్రానికి చాల దూరంగా ఉంది. మీ దేశంలో రాజధాని గురించి ఆలోచించండి. మొదటి శతాబ్దంలో యూదయ పాత్ర అలా ఉండేది కాదు; ఆ పాత్రను రోమా సామ్రాజ్యం పోషించింది. గొప్ప విశ్వవిద్యాలయం, విద్యాసంస్థలున్న పట్టణం గురించి ఆలోచించండి. మొదటి శతాబ్దంలో యూదయ పాత్ర అలా ఉండేది కాదు; ఆ పాత్ర ఏథెన్సు లేక అలెగ్జాండ్రియ పోషించింది.
ప్రపంచంలోని ఇతర దేశాలకు సంబంధించి, యూదయకు రాజకీయ ప్రాముఖ్యత లేదు; ఆర్ధిక ప్రాముఖ్యత లేదు; సాంఘికంగా ప్రాముఖ్యత లేదు. మీ దేశంలో ప్రాముఖ్యత లేని ఒక ప్రాంతం గురించి ఆలోచించండి; రోమా సామ్రాజ్యంలో యూదయ స్థానమదే.
ఆవగింజ ఉపమానం, దేవుని రాజ్యం రోమా సామ్రాజ్యంలోని ఒక మూలలో చిన్న గుంపుతో ఆరంభమై అన్ని రాజ్యాల్లో విస్తరించిన గొప్ప వృక్షంగా అభివృద్ధి చెందిందని చూపిస్తుంది.[1] దేవుని రాజ్యం కేవలం యూదులకు మాత్రమే పరిమితమని యూదా రబ్బీలు బోధించారు; దేవుని రాజ్యం భూదిగంతాలవరకు వ్యాపిస్తుందని యేసు బోధించాడు.
పులిసిన పిండి ఉపమానం (మత్తయి 13:33)
పులిసిన పిండి ఉపమానం కూడా దేవుని రాజ్యపు స్వాభావిక ఎదుగులను గురించి వివరిస్తుంది. దేవుని రాజ్య వ్యాప్తికి చిహ్నంగా యేసు పులిసిన పిండిని ఉపయోగించాడు. మూడు కుంచాల పిండి 100మందికి చాలిన రొట్టెలు అందిస్తుంది. ఆరంభం ప్రాముఖ్యంగా లేనప్పటికీ, దేవుని రాజ్యం గొప్ప శక్తితో ఎదుగుతుంది.
పులిసిన పిండి ఉపమానం రాజ్యం యొక్క స్థిరమైన ఎదుగుదలను చూపిస్తుంది. పులవడం అనేది నాటకీయం కాదు; అది డైనమైట్ వలే పేలదు; అది నెమ్మదిగా రొట్టె వలె పనిచేస్తుంది. దేవుని రాజ్యం ప్రపంచవ్యాప్తంగా పరిచయమౌతుందని యూదుల రబ్బీలు ఆశించారు; రాజ్యం ప్రపంచవ్యాప్తంగా చేరుకునే వరకు నెమ్మదిగా, క్రమంగా పెరుగుతుందని యేసు బోధించాడు.
దాచబడిన ధనం, గొప్ప విలువైన ముత్యం ఉపమానాలు (మత్తయి 13:44-46)
ఈ రెండు ఉపమానాలు రాజ్య ఆనందానికి సంబంధించినవి. రెండింటిలో, ఒక వ్యక్తి విలువైనదానిని కనుగొని, అతనికి ఉన్నదంతా అమ్మేసి దానిని కొనుగోలు చేశాడు. ఉపమాన దృష్టి, మానవుడు చేసిన త్యాగంపై కాదుగాని విలువైనదాని కనుగొనుటపై ఉంది. అతడు ఆనందంలో తనకు కలిగినదంతా అమ్మేశాడు! నిజమైన శిష్యులు క్రీస్తును అనుసరించునట్లు సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఆనందిస్తారు.
ఈ ఉపమానాలు దేవుని రాజ్యపు అత్యున్నత విలువను చూపిస్తాయి. మరోచోట, యేసు “నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులుకలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు” (మార్కు 9:47) అని చెప్పాడు. దేవుని రాజ్య ప్రవేశం భూసంబంధమైన ఏ త్యాగానికంటే కూడా విలువైనది.
వల ఉపమానం (మత్తయి 13:47-50)
గలిలయ సముద్రంలో చేపలు పట్టే దోనెలు, తినదగిన తినలేని చేపలు రెంటినీ వలలో పట్టి లాగుతాయి. సముద్ర తీరానికి వచ్చిన తర్వాత, జాలర్లు మంచి చేపలను, చెడు చేపలను వేరుచేస్తారు.
గురుగుల ఉపమానంవలే, ఈ ఉపమానం తీర్పు యుగాంతంలో వస్తుందని శిష్యులకు జ్ఞాపకం చేస్తుంది. తక్షణ తీర్పు ఆశించక, దేవుడు తన కాలంలో నీతిమంతులకు దుష్టులకు తీర్పుతీర్చుతాడని ఎరిగి దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. మంచివారిని చెడ్డవారిని వేరు చేసే తుది తీర్పు ఉంటుంది కాని ఆ సమయాన్ని దేవుని చేతికి విడిచిపెట్టాలి.
ఇంటి యజమాని ఉపమానం (మత్తయి 13:51-52)
శిష్యులు ఫలవంతమైన నేలగా ఉండాలని బోధిస్తూ, యేసు ఈ ఉపమానాలను ఆరంభించాడు. ఇతరులకు దానిని పంచే బాధ్యతను వారికి బోధిస్తూ, యేసు ఈ ఉపమానాలను ముగించాడు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కడు ఇతరులకు బోధించడానికి తన జ్ఞాన నిధిని విప్పాలి. మనం కేవలం మన స్వప్రయోజనం కోసం నేర్చుకోము. శిష్యులు ఇతర శిష్యులకు శిక్షణ ఇచ్చేలా శిక్షణ పొందారు.
ఈ ఉపమానం లూకాలో ఉంది కాని మత్తయి ఒలీవ ఉపన్యాస సమయంలో ఇదే విధమైన ఉపమానం చెప్పాడు. యేసు యెరూషలేముకు సమీపంగా ఉన్నప్పుడు పది మినాల ఉపమానం చెప్పాడు, ఎందుకంటే దేవుని రాజ్యం తక్షణమే కనిపిస్తుందని ప్రజలు భావించారు (లూకా 19:11).
యేసు యెరూషలేమును సమీపిస్తుండగా, ప్రజలు రాజకీయ మెస్సీయ గురించిన తమ అంచనాల విషయంలో చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఆయన శిష్యులు రాజ్యం కొరకు వేచియుండగా నమ్మకంగా ఉండాలని బోధించడానికి యేసు ఈ ఉపమానం చెప్పాడు. యజమానుడు వారికిచ్చిన దానిని జాగ్రత్తగా దాచిపెట్టకూడదు; వారు రాజ్య వ్యాప్తి కోసం తమ వనరులు ఉపయోగించాలి.
[1]దానియేలు 4:12 మరియు యెహెజ్కేలు 31:6 లో, ఆకాశపక్షులు గూళ్ళుకట్టుకోవడం, రాజ్యం అనేక దేశాలకు వ్యాపించిందని సూచిస్తుంది.
[2]“మీనా” అనేది ఒక యూనిట్. ఇది ఒక కార్మికుని సుమారు మూడు నెలల వేతనంతో సమానం.
దేవుని రాజ్య సంపూర్ణ స్థాపన
► మత్తయి 24-25 చదవండి.
యేసు తన పరిచర్య ఆరంభంలో చేసిన బోధలు ఎక్కువగా రాజ్య తక్షణ ఆరంభంపై దృష్టినిలుపుతాయి. ఆయన తన భూలోక పరిచర్య ముగింపుకు వచ్చేసరికి, భవిష్యత్ లోదేవుని రాజ్య సంపూర్ణ స్థాపన గురించి ఎక్కువగా మాట్లాడాడు. మత్తయి 24 మరియు 25లో ఒలీవ ఉపదేశంలో, రాజ్య వాగ్దానాలు భవిష్యత్ లో నెరవేర్చబడతాయనే దానిపై విస్తృతంగా బోధించాడు.
నిశిత పరిశీలన: హేరోదు దేవాలయం
క్రీ.పూ.19లో, గొప్ప హేరోదు దేవాలయ పునర్నిర్మాణం మొదలుపెట్టాడు.[1] ఈ దేవాలయాన్ని, క్రీ.పూ. 516లో జెరుబ్బాబెలు పూర్తిచేశాడు, ఇది సొలొమోను అసలు దేవాలయం కంటే కొంచెం చిన్నది, సరళమైంది. హేరోదు దాని పూర్వపు అందాన్ని పునరుద్ధరించాలని ఆశపడ్డాడు. అది 80 ఏళ్ళకు పైగా కొనసాగింది. నిర్మాణం కోసం హేరోదు 10,000మంది నైపుణ్యంగల పనివాళ్లని నియమించాడు, కేవలం యాజకులకు మాత్రమే ప్రవేశమున్న భాగాలలో పనిచేయడానికి 1,000మంది లేవీయులకు శిక్షణ ఇచ్చాడు.
ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేవాలయాన్ని నిర్మించినవాడిగా హేరోదు పేరుపొందాలనుకున్నాడు. యేసు పరిచర్య సమయానికి, పని 46 ఏళ్లుగా కొనసాగింది (యోహాను 2:20). క్రీ.శ. 63వరకు దేవాలయమంతా పూర్తి కాలేదు, ఆ తర్వాత ఏడు సంవత్సరాల్లో క్రీ.శ. 70లో యెరూషలేమును రోమా జనరల్ టైటస్ ముట్టడించినప్పుడు దేవాలయం నాశనమైపోయింది.
హేరోదు దేవాలయం సొలొమోను దేవాలయం కంటే రెండు రెట్లు పెద్దది, పండుగల కోసం యెరూషలేముకు వచ్చిన వేలాదిమంది యూదా యాత్రికులకు ఎక్కువ స్థలం ఉంది. ఇది రోమా సామ్రాజ్యంలో ఒక గొప్ప అద్భుతం.
[1]"Temple Comparison" ను SGC Ricardo Gandelman (CC BY 2.0) తీసిన ఫోటో నుండి సృష్టించారు మరియు దేవాలయ ప్రణాళికలు EB Vol. IV and Gal m, నుండి తీసుకున్నారు https://www.flickr.com/photos/sgc-library/52345523784, public domain (CC0).
దేవుని రాజ్య సంపూర్ణ స్థాపన (కొనసాగింపు)
యెరూషలేములో యేసు చివరి వారంలో, శిష్యులు దేవాలయ నిర్మాణం గురించి ఆయనకు చెప్పారు. దేవాలయ నిర్మాణం కొనసాగుతుంది గనుక, వాళ్లు ముందు చూసినట్లుగా కాకుండా కొన్ని మార్పులు జరిగినందున వారు వాటిని ఎత్తి చూపారు.
దేవాలయం పట్టగొట్టడం గురించి ముందుగానే వివరిస్తూ “మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను” అని యేసు సమాధానం చెప్పాడు. అప్పుడు శిష్యులు, “ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా” (మత్తయి 24:2, 3).
శిష్యుల ప్రశ్న రెండు భాగాలు; యేసు సమాధానం రెండు భాగాలు. పాత నిబంధన ప్రవచనాలు దగ్గర, దూరపు కోణాలు కలిగియున్నట్లుగా, యేసు ప్రవచనంలో తక్షణమే జరిగే కొన్ని విషయాలు, యుగాంతంలో జరిగే కొన్ని విషయాలు ఉన్నాయి.
శిష్యులు, “వచ్చి ఇవి ఎప్పుడు జరుగును?” అని అడిగారు. “ఇవి” (రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడు దేవాలయం) క్రీ.శ. 70లో జరిగాయి.
శిష్యులు, “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అని అడిగారు. “మనుష్యకుమారుడు ప్రభావంతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట” (మత్తయి 24:30) అని యేసు భవిష్యత్ రాకడ గురించి మాట్లాడాడు.
దేవుని రాజ్యంలో అన్ని రాజ్యాలవారు, యూదులు అన్యులు ఉంటారని యేసు చూపించాడు. అన్యజనులు రాజ్యంలో పాలివారగుట దేవుని ప్రణాళికని చూపించాడు, “లోకము పుట్టినది మొదలుకొని” (మత్తయి 25:34). దేవుని రాజ్యం దేవుని ప్రజలకు ఆయన నిత్య ప్రణాళిక.
ఒలీవ ఉపదేశంలో రెండు ఉపమానాలు, రాజ్యం కోసం వేచియుండగా నమ్మకంగా ఉండాలని బోధిస్తాయి. ఐదుగురు బుద్ధిలేని కన్యకలు వేచియున్నారు, కాని సరైన సిద్ధపాటుతో లేరు. ఒక తలాంతుగల సేవకుడు వేచియున్నాడు, కాని నమ్మకంగా లేడు. దేవుని రాజ్య పౌరులుగా, మనం రాజుకు సేవ చేసే విషయంలో, నమ్మకంగాను, స్థిరంగాను ఉండడానికి పిలువబడ్డాం.
తుది తీర్పులో, మత్తయి 13 ప్రకారం మంచి చెడులు వేరుచేయబడతాయి. ప్రధాన పాఠం, ఈ తీర్పు ఎప్పుడు ఎలా జరుగుతుందని కాదు. తుది తీర్పు కోసం సిద్ధపడుతూ నేటి రాజ్య పౌరులు ఎలా జీవించాలనేది యేసు బోధించాడు. ఆ దినాన, రాజు, “మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును” (మత్తయి 25:40). మనం రాజు రాకడ కోసం స్థిర సిద్ధపాటుతో జీవించాలి. ఆయన వచ్చినప్పుడు మనం నమ్మకంగా కనిపించాలి.
అన్వయం: శిష్యరికం వెల
► లూకా 9:21-27 చదవండి.
దేవుని రాజ్యంలో పౌరసత్వం కేవలం కృపవలన సాధ్యం. సత్క్రియల ద్వారా దేవుని రాజ్య పౌరులం కాలేము. అయితే, దీని అర్థం శిష్యత్వానికి వెల/మూల్యం లేదని కాదు. లూకా 9లో, శిష్యత్వం వెల గురించి యేసు తన అనుచరులకు బోధించాడు.
డల్లాస్ విల్లార్డ్ “కృప శ్రమకు వ్యతిరేకం కాదు; కృప సంపాదనకు వ్యతిరేకం” రాశాడు.[1] శిష్యులుగా మనం చేసే శ్రమ/ప్రయత్నం కృపకు వ్యతిరేకం కాదు. నిజానికి, శిష్యత్వాన్ని పొందుకునే ఒకే ఒక మార్గం, దేవుని కృప వలననే.
దయచేసి యేసు బోధనా పద్ధతి గమనించండి: ముందు సిలువ ఆ తర్వాత మహిమ.
యేసు తన మరణం, పునరుత్థానం గురించి ముందుగా చెప్పాడు (లూకా 9:21-22). రాజ్యంలో మనకు పౌరసత్వాన్ని అందించడానికి యేసు చెల్లించిన వెల ఇదే.
తన శిష్యులుగా ఉండాలంటే వెల ఎంతో యేసు తన అనుచరులకు చెప్పాడు (లూకా 9:23-25). “ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.” దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి యేసు సిలువలో శ్రమపొందాడు; మనం దేవుని రాజ్యంలో నివసించాలంటే సిలువను ఎత్తుకోవాలి.
యేసు దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు (లూకా 9:26-27). “నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో వానిగూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ధదూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.”
సిలువలో పాలుపంచుకోకుండా మనం దేవుని మహిమలో పాలుపంచుకోలేం. యేసు, “అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను. అందుచేతను…దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” (ఫిలిప్పీయులకు 2:8-11).
దేవుని పిల్లలంగా, మనం కూడా ఇదే పద్ధతి పాటిస్తాం. “తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును” (1 పేతురు 5:10). ఇది దేవుని రాజ్య జీవన విధానం. క్రీస్తు మహిమపరచబడకముందు సిలువలో శ్రమపొందాడు. ఆయన అనుచరులు కూడా నిత్య మహిమను ఆనందించడానికి ముందు తమ సిలువ ఎత్తుకోవాలి.
యేసు సమర్పణగల శిష్యుల కోసం చూశాడు. తన శిష్యులు తెలివైనవారిగా ఉండాలని ఆశించలేదు; యదార్థ హృదయులుగా ఉండాలని ఆశించాడు. శిష్యులుగా ఉండాలంటే వెల ఎంత? “ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను” (మత్తయి 16:24).
1. శిష్యుడు తననుతాను ఉపేక్షించుకోవాలి. “స్వయానికి” కాదు అని చెప్పడం చాలా కష్టం.
2. శిష్యుడు తన సిలువను ఎత్తుకోవాలి. సిలువ అంటే మరణమని యేసు అనుచరులకు తెలుసు. సిలువ శ్రమకు, అవమానానికి సూచన. అయితే, శిష్యత్వానికి సిలువ అవసరమని ఆది క్రైస్తవులకు తెలుసు. ఇగ్నేషియస్ హతసాక్షి అవ్వడానికి రోమాకు ప్రయాణించినప్పుడు, అతడిలా చెప్పాడు: “నేను శిష్యుడుగా ఉండటం మొదలుపెట్టాను.” శిష్యత్వానికి సిలువ అవసరం.
3. శిష్యుడు ప్రవర్తనలోను పాత్రలోను యేసును వెంబడిస్తూ ఉండాలి.వెంబడించు అనే క్రియా పదం వర్తమాన కాలంలో ఉంది.
శిష్యత్వానికి వెల చెల్లించాలా? శిష్యునిగా ఉండడానికి యేసు మూడు కారణాలు ఇచ్చాడు. విచిత్రమేమిటంటే ఈ కారణాలవల్లే చాలామంది శిష్యులుగా ఉండరు. మనం శిష్యత్వానికి వెల ఎందుకు చెల్లించాలి?
1. భద్రత. సిలువను ప్రక్కనపెట్టి తన ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు పోగొట్టుకుంటాడు (లూకా 9:24).
2. నిజమైన సంపద. క్రీస్తుతో గుర్తింపు కలిగి ఉండనివాడు సమస్తం నష్టపోతాడు (లూకా 9:25).
3. బహుమానం. క్రీస్తును అనుసరించేవారు మాత్రమే దేవుని రాజ్య ఆహ్వానం పొందుతారు (లూకా 9:26-27).
► లూకా 14:25-33 చదవండి.
తరువాత యేసు శిష్యత్వం గురించి తన బోధను మరింతగా వివరించాడు. ఆయన ఉపదేశాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు:
మీరు కారు కొనుగోలు చేయాలని వెళ్లినప్పుడు, అమ్మేవాడు కొన్నిసార్లు పూర్తి ధరను చెప్పడు. “ఈ అందమైన కారు చూడండి!” ఈ కారు ప్రభావాన్నిఅనుభవించండి!” అని చెబుతాడు. మీరు ఆ కారును ఇష్టపడిన తర్వాత మాత్రమే పూర్తి ధర చెబుతాడు.
యేసు ఎప్పుడు కూడా తన అనుచరులకు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సులువైన మార్గాన్ని ఇవ్వలేదు. ఆయన ఈ వెలతో మొదలుపెట్టాడు:
ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు (లూకా 14:26-27).
ఈ వాక్యభాగంలో, ఒకదానిని ద్వేషించడమంటే మరొకదాని కంటే దానిని తక్కువగా ప్రేమించడం. “నీ తండ్రికంటే, తల్లికంటే, పిల్లలకంటే, అన్నదమ్ములకంటే, అక్కచెల్లెళ్ళకంటే, మీ సొంత జీవితం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించని వాడు నా శిష్యుడు కాడని” యేసు చెప్పాడు.
శిష్యుడుగా ఉండాలంటే ఎంత మూల్యం చెల్లించాలి? సమస్తం! క్రీస్తు శిష్యుడుగా ఉండడమంటే మెస్సీయ వాగ్దానాల్లో పాలుపంచుకోడమే కాదు; సిలువలో పాలుపంచుకోవడం కూడా.
► యోహాను సువార్త శిష్యత్వం గురించి మూడు అదనపు షరతులు ఇస్తుంది. యోహాను 8:31, యోహాను 13:35, మరియు యోహాను 15:8 చదవండి. లూకా మరియు యోహానులో శిష్యత్వానికి షరతుల ఆధారంగా, మీరు మీ పరిచర్యలో శిష్యుల్ని చేస్తున్నారా?
[1]Dallas Willard, The Great Omission: Reclaiming Jesus’s Essential Teachings on Discipleship. (New York: HarperOne, 2006)
ముగింపు: దేవుని రాజ్యం అంటే ఏంటి?
క్రీస్తు తిరిగి వచ్చేవరకు, రాజ్యం గురించి ఆయన చేసిన బోధలన్నిటి వివరాలు మనం అర్థం చేసుకోలేం. అయితే, సువార్తలు అనేక దేవుని రాజ్య లక్షణాలు చూపిస్తాయి.
దేవుని రాజ్యం ఆత్మీయ రాజ్యం. “దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది” (రోమా 14:17). నూతనంగా జన్మించడం మనలని సాతాను అధికారం నుండి విడిపించి, దేవుని రాజ్య వారసులుగా చేస్తుంది.
యుగాంతమందు దేవుని రాజ్యంలో భౌతిక, రాజకీయ పాలన ఉంటుంది.
దేవుని రాజ్యం సార్వత్రికం; కేవలం యూదా రాజ్యానికి పరిమితం కాదు.
దేవుని రాజ్యం, లోకంలో పనిచేయు దేవుని శక్తి. రాజ్యం భౌతిక ఏలుబడి కాదు. పది మి నాల ఉపమానంలో, రాజ్యం అంటే పాలించే అధికారం, భౌగోళిక స్థానం కాదు (లూకా 19:11-12).
దేవుని రాజ్యం అతీంద్రియం. మనిషి విత్తనాన్ని విత్తుతాడు; దాని వృద్ధి చేయలేడు. దేవుని శక్తి ద్వారా రాజ్యం పెరుగుతుంది.
దేవుని రాజ్యం కేవలం అస్పష్టమైన భవిష్యత్ నిరీక్షణ కాదు; అది తక్షణ ప్రతిస్పందన కోరే ప్రస్తుత వాస్తవికత.
దేవుని రాజ్యం యేసు పరిచర్య ద్వారా ఆరంభించబడింది. అపవిత్రాత్మలపై ఆయన అధికారం, సాతాను రాజ్యంపై దేవుని రాజ్యం విజయం పొందిందని చూపిస్తుంది.
దేవుని రాజ్యం సంఘ పని ద్వారా కొనసాగుతుంది. కొండమీద ప్రసంగం, నూతన విశ్వాసులు ప్రస్తుత యుగంలో జీవించడానికి ఎలా పిలువబడుతున్నారో చూపిస్తుంది.
క్రీస్తు మహిమలో ఏలుబడి చేయడానికి వచ్చినప్పుడు దేవుని రాజ్యం పూర్తిగా స్థాపితమౌతుంది. సాతాను అధికారం విచ్ఛిన్నమౌతుంది, దేవుడు నిత్యం పరిపాలన చేస్తాడు.
► ఈ కోర్సు వెనుక భాగంలో, “రాజ్య సువార్త” అనే ప్రసంగం ఉంది. 7వ పాఠంలోకి వెళ్లే ముందు దీన్ని చదవండి.
పాఠం 6 అభ్యాసాలు
యేసు కొండమీద ప్రసంగం ఆధారంగా మూడు ప్రసంగాలు సిద్ధం చేయండి. మీ ప్రసంగ ప్రధాన విషయం, “దేవుని రాజ్యంలో జీవం/జీవితం” అయ్యుండాలి. దేవుని రాజ్య పౌరులుగా నేడు మనమెలా జీవించాలో చూపించండి. మీ ప్రసంగాన్ని సువార్తగా ప్రకటిస్తున్నారో లేదో చూసుకోండి. దేవుని రాజ్య పౌరులుగా జీవించడానికి దేవుని కృప మనల్ని ఎలా బలపరుస్తుందో చూపించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.