ప్రభావవంతమైన ప్రసంగం కేవలం మానవ కష్ట ఫలితమే కాదు; ప్రభావవంతమైన ప్రసంగం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలపరచబడుతుంది.
పరిచయం
యేసు ప్రసంగానికి జనసమూహం ఎలా స్పందించారో చూడండి.
“యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి” (మత్తయి 7:28-29).
“జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడడం చూచి” (మార్కు 11:18).
“సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి” (మార్కు 12:37).
యేసు ప్రసంగం శక్తివంతమైంది. ఆయన ప్రసంగం వినడానికి వేలమంది కూడుకున్నారు. ఖచ్చితంగా ఆయన ప్రసంగ శైలి నేడు మనకు మాదిరి. భులోకంలో యేసు తన మానవత్వంతో ప్రసంగించాడని గుర్తుంచుకోండి. “వాస్తవానికి, యేసు శక్తివంతమైన ప్రసంగికుడైనప్పటికిని ఆయన దేవుడు” అని ఆలోచించవద్దు. దానికి బదులుగా, “యేసు-మానవుడుగా-అధికారంతోను శక్తితోను ప్రసంగించాడని” ఆలోచించండి. ఆయన ప్రసంగం ప్రేక్షకులను సత్యంవైపు ఆకర్షించింది. నేను సువార్తను ప్రభావవంతంగా బోధించడానికి యేసు దగ్గర ఏం నేర్చుకోగలను?”
► మీరు క్రీ.శ. 30లో జీవిస్తూ, యేసు ప్రసంగం విన్నారనుకోండి. మీరు ఏం చూడడానికి, వినడానికి ఆశపడతారు?
యేసు అధికారంతో ప్రసంగించాడు
► 2 కొరింథీయులకు 4:1-6 చదవండి.
యేసు కపెర్నహూములో ప్రసంగించినప్పుడు, ఆయన వాక్యం అధికారంతో కూడినది గనుక ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు (లూకా 4:32). కొండమీద ప్రసంగం ముగించినప్పుడు, “జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను” (మత్తయి 7:28-29). శాస్త్రులు తమ సిధ్ధాంతాలకు మద్దతుగా ఇతర రబ్బీల మాటలను వాడేవాడు, కాని యేసు అధికారంతో ప్రకటించాడు.
పాస్టర్లుగా, మనం అధికారంతో ప్రసంగించాలి. మన అధికారం యేసు అధికారం కంటే భిన్నమైంది. ఆయన అధికారం, స్వాభావికంగా ఆయనలో నుండే వచ్చింది; మన అధికారం యేసుక్రీస్తు ప్రతినిధులుగా మనకు అనుగ్రహించబడింది; మన అధికారం మనం ప్రకటించే సందేశం నుండి వస్తుంది.
మనం యేసుక్రీస్తు ప్రతినిధులుగా అధికారంతో ప్రసంగిస్తాం.
“పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది” అని యేసు చెప్పాడు. తరువాత వచనంలో, ఆయన తన అనుచరులను నియమించాడు, “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి…. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను” (మత్తయి 28:18-20). మనం యేసుక్రీస్తు ప్రతినిధులుగా నియమించబడ్డాం గనుక మనకూ అధికారం ఉంది.
1783లో, అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రతినిధులు, అదే విధంగా కింగ్ జార్జ్ III ప్రతినిధులు అమెరికా విప్లవాత్మక యుద్ధాన్ని ముగించే పారిస్ ఒప్పందంపై సంతకం చేయడానికి సమావేశమయ్యారు. ఒప్పందంపై సంతకం చేయడానికి కింగ్ జార్జ్ III పారిస్ వెళ్ళలేదు. జార్జ్ వాషింగ్టన్ ఒప్పందంపై సంతకం చేయలేదు. అయితే తమ పరిపాలకుని పేరున ఒప్పందంపై సంతకం చేసే అధికారం ప్రతి దేశ ప్రతినిధికి ఉంది.
అదే విధంగా, మనం యేసుక్రీస్తు ప్రతినిధులుగా ప్రసంగిస్తాం. “గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము” (2 కొరింథీయులకు 4:6) అని పౌలు రాశాడు. పౌలు అధికారం తన సొంత అధికారం కాదు. అతడు ఒక దాసుడు, కాని ప్రభువైన యేసుక్రీస్తు ప్రతినిధి.
మనకు అప్పగించబడిన సందేశం వలన మనం అధికారంతో ప్రసంగిస్తాం
మన అధికారం మనం ప్రకటించే లేఖనంపై ఆధారితం. పౌలు ఇలా రాశాడు: “అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతిమనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు” (2 కొరింథీయులకు 4:2). పౌలు కపటంగా ఏది చేయలేదు లేక దేవుని వాక్యాన్ని బలహీనపరచే పని ఏది చేయలేదు.
కొందరు పాస్టర్లు బైబిల్ని నమ్మకూడదని చెప్పే విశ్వవిద్యాలయాల్లో చదివారు. వారు అధికారంతో ప్రకటించరు. బదులుగా, ఎప్పుడు అనుమానిస్తూ ఉంటారు. ఎందుకు? వారు బైబిల్ అధికారాన్ని అనుమానిస్తారు; కేవలం మానవుల జ్ఞానంపై ఆధారపడతారు. దేవుని సేవకులుగా, మన అధికారం దేవుని వాక్య ఆధారితమావ్వాలి.
మీరు దేవుని వాక్య సందేశాన్ని నమ్మనియెడల దాని ప్రకటించటం వ్యర్థం. మనం దేవుని వాక్య సందేశాన్ని నమ్మినప్పుడు మాత్రమే అధికారంతో ప్రసంగించగలం.
మన అధికారం యేసు నుండి, మనం ప్రసంగించే సందేశం నుండి వస్తుందని గ్రహించినప్పుడు, సేవకులు రెండు ప్రమాదాలు తప్పించుకోగలరు.
(1) మొదటి ప్రమాదం “నేనే పాస్టర్. నేనే బాస్! ఎవ్వరు నన్ను ప్రశ్నించలేరు” అని చెప్పే అహంకారం.
ఈ అహంకారం ప్రజలను సువార్తకు దూరం చేస్తుంది. “మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి” (2 కొరింథీయులకు 4:5) ప్రకటిస్తున్నామని పౌలు చెప్పాడు. మన అధికారం యేసు నుండి, ఆయన వాక్యం నుండి వస్తుంది.
మనం తప్పు చేసినప్పుడు దాని ఒప్పుకునే వినయం మనకు కావాలి. ఒక పాస్టర్ ఇలా చెప్పాడు: “నేనెప్పుడైన తప్పు చేస్తే సంఘానికి చెప్పను. వారు నా అధికారాన్ని నమ్మరు.” మన అధికారం మన సొంత పోరపాటులపై ఆధారపడదు; మన అధికారం దేవుని వాక్యంపై ఆధారపడుతుందని ఈ పాస్టర్ మర్చిపోయాడు. మనం మన సంఘాన్ని దేవుని వాక్యాధికారం వైపు నడిపించాలి. నా మాటలు ముఖ్యం కాదు; దేవుని వాక్యం ప్రాముఖ్యం.
(2) రెండవ ప్రమాదం, “నేను కేవలం ఒక పాస్టర్ ని. నాకు అధికారం లేదు. కౌన్సిలింగ్ నిపుణుడికి మనస్తత్వశాస్త్రం గురించి తెలుసు; శాస్త్రజ్ఞులకు భూమి మూలాల గురించి తెలుసు; సాంఘికవేత్తలకు మానవుని లైంగిక కోరికలు గురించి తెలుసు. నేను భావోద్వేగ అవసరాలు, సృష్టి, లేక నైతికత గురించి మాట్లాడలేను ఎందుకంటే అందులో నేను నిపుణుడ్ని కాదు” అని చెప్పే తప్పుడు వినయం.
“మేం దాసులం, కాని యేసుక్రీస్తు ప్రతినిధులంగా మాకు అధికారముందని” పౌలు చెప్పాడు. దాసునిగా, మనం వినయంతో బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రతినిధులుగా, నమ్మకంతో ప్రకటించాలి. మనం దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రసంగించినప్పుడు, విశ్వానికి రాజు అధికారంతో మనం సేవిస్తాం.
యేసు ప్రసంగాలు, అవసరతలో ఉన్న ప్రజలకు శుభవార్తను తెస్తాయి
యేసు తన శ్రోతల అవసరాలు గురించి మాట్లాడాడు. యేసు సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతంలో పర్యటిస్తుండగా, జనులు విసిగి చెదరియున్నందున వారిమీద కనికరపడ్డాడు (మత్తయి 9:35-36). యూదులు రోముకు బానిసలు; బీదలు తమ పేదరికం నుండి బయటపడే ఆశలు లేవు; కుష్ఠురోగులను బహిష్కరించారు; సుంకరులను సమాజం తిరస్కరించింది. వీళ్లందరికీ, యేసు ఆశ కలిగించాడు.
మీరు ప్రజల అవసరాలు గురించి మాట్లాడినప్పుడు, వాళ్ల దృష్టి మీవైపు మళ్లుతుంది. ఒకవేళ నేను అరణ్యంలో నివసిస్తుండగా, “నేడు జీవజలం గురించి నేను ప్రకటిస్తాను” అని మీరు చెబితే, నేను జాగ్రత్తగా వింటాను! నేను ముసలివాడిగా, బలహీనుడుగా ఉన్నప్పుడు, “నేడు పక్షిరాజువంటి బలం ఇచ్చే దేవుని గురించి ప్రకటిస్తాను” అని మీరు చెబితే, నేను వింటాను!
సువార్త అంటే శుభవార్త అని యేసు ఎప్పుడూ మర్చిపోలేదు. నిరీక్షణ అవసరమైన వారికి సువార్త ప్రకటించటం కోసం ఆయన వచ్చాడు. ప్రభావవంతమైన ప్రసంగం మన మాటలు వింటున్నవారికి నిరీక్షణ ఇవ్వాలి. యేసువలే, “నేను ఎవరికి ప్రకటిస్తున్నాను? వాళ్ల అవసరాలు ఏంటి?” అని ప్రశ్నించుకోవాలి.
మీ కారుకు ప్రమాదం జరిగి, రక్తస్రావంతో చనిపోయే స్థితిలో ఉన్నారని ఊహించుకోండి. ఆసుపత్రిలో, వైద్యుడు మీకు కారు యాక్సిడెంట్ల గురించి గణాంకాలతో కూడిన పూర్తి రంగురంగుల చార్ట్ ఇస్తాడు. స్టెతోస్కోపు చారిత్రికంగా ఎలా అభివృద్ధి చెందిందో వివరిస్తాడు. చివరిగా, అజాగ్రత్తగా కారు నడిపితే ఏమౌతుందో హెచ్చరిస్తాడు.
వైద్యుడు చెప్పిన ప్రతి విషయం సరైనదే, కాని అది మీ అవసరాన్ని తీర్చదు. ఎవరో ఒకరు మీ గాయాలు కట్టాలి. మీ బాధకు మందు ఇవ్వాలి. ప్రసంగం కేవలం వాస్తవిక విషయాలకు మించింది; ప్రసంగం శ్రోతల అవసరాలకు అనుగుణంగా ఉండాలి.
మన పతనమైన లోకంలో చెడ్డ వార్తలు వినటం చాలా సులభం. సువార్త దానికి మించింది; అది పతనమైన లోకానికి నిరీక్షణ ఇస్తుంది. యేసు ఎల్లప్పుడు తన శ్రోతలకు నిరీక్షణ కలిగించాడు. యేసు ఎన్నడు సత్యం విషయంలో రాజీపడలేదు, మనం సత్యం విషయంలో ఎన్నడు రాజీపడకూడదు. అయితే సత్యాన్ని సరైన విధంగా ప్రకటిస్తే అది నిరీక్షణ ఇస్తుందని యేసుకు తెలుసు. ఒక పెద్ద ప్రసంగికుడు “ప్రజలకు దురదపుట్టిన చోట మీరు గోకాలి” అని చెప్పాడు. మీరు ఎవరినైతే చేరుకొనే ప్రయత్నం చేస్తున్నారో వారి అవసరాలకు అనుగుణంగా ప్రకటించాలి.
యేసు ప్రసంగాలు ఒప్పింపజేస్తాయి
యేసు తన శ్రోతల అవసరాలతో ఆరంభించాడు, కాని ఆయన ఉద్దేశ్యం కేవలం గాయంపై తాత్కాలిక కట్టువేయడమే కాదుగాని అంతకు మించింది. యేసు ప్రసంగం వాళ్ల మనస్సాక్షిని ఒప్పింపజేసి, వాళ్ల జీవితాలు మార్చింది.
యేసు, తన శ్రోతలు చేసిన పాపాలకు తీర్పు ఉంటుందని ప్రకటించడానికి భయపడలేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో యేసు, “నేనును నీకు శిక్ష విధింపను” అని చెప్పాడు, అంతేకాదు, “నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని” కూడా చెప్పాడు (యోహాను 8:11).
యోహాను, యేసు పరిచర్యలో బెతెస్థ కోనేరు యొద్ద ఉన్న పక్షవాయువుగల ఒక వ్యక్తి గురించి చెప్పాడు. అతన్ని స్వస్థపరచిన తరువాత, “ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని” (యోహాను 5:14) యేసు చెప్పాడు. పాపాన్ని ప్రతిఘటించడానికి యేసు భయపడలేదు.
యేసు ప్రసంగించినప్పుడు, ఆయన శ్రోతలు ఒప్పించబడ్డారు. సమకాలీన ప్రసంగికులవలే కాక, నీతిగా జీవించే ఆవశ్యకత గురించి బోధించాడు. “మీరాయన ఆజ్ఞలు గైకొనవలెనని నా తండ్రి ఆశించడు” అని యేసు ఎక్కడా చెప్పలేదు. బదులుగా, “శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను” (మత్తయి 5:20) అన్నాడు. యేసు ప్రసంగం, ఆయన మాటలు, విన్న ప్రతి ఒక్కరిని ఒప్పింపజేసింది.
యేసు ప్రసంగాలు జీవితాలను మార్చివేశాయి
[1]అమెరికా సివిల్ వార్ సమయంలో, ప్రెసిడెంట్ అబ్రాహాం లింకన్ పాస్టర్ డా. ఫినేయాస్ గుర్లె కాపరిగా పనిచేస్తున్న చర్చికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆరాధన అయిపోయిన తర్వాత, “ప్రసంగం గురించి మీరేమి అనుకుంటున్నారు?” అని ఒక మిత్రుడు అడిగినప్పుడు, “మంచిగా ప్రసంగించారు, మంచి ఆలోచనలు ఇచ్చారు” అని లింకన్ బదులిచ్చాడు.
అప్పుడు మిత్రుడు, “నీకు నచ్చిందా?” అని అడుగగా, మిస్టర్ లింకన్ సంకోచించి, “లేదు. ఈరాత్రి రెవ. గుర్లె విఫలమయ్యాడు” అని చెప్పాడు. మిత్రుడు ఆశ్చర్యపోయి, “ఎందుకలా చెబుతున్నావు?” అని ప్రశ్నించాడు. అప్పుడు లింకన్, “అతను మనల్ని ఏ గొప్ప కార్యం చేయమని చెప్పలేదు” అన్నాడు. ప్రసంగం ప్రతిస్పందించే పిలుపు ఇవ్వాలని ప్రెసిడెంట్ లింకన్ నమ్మాడు. ప్రసంగం జీవితాలని మార్చాలని నమ్మాడు.
► మత్తయి 18 చదవండి.
యేసు జీవితాలు మార్చడానికి ప్రసంగించాడు. ఆయన ప్రసంగం ఆచరణాత్మకం. “పరలోకరాజ్యంలోని సంబంధాల” గురించి మత్తయి 18వ అధ్యాయం యేసు ప్రసంగాన్ని నమోదు చేస్తుంది. యేసు ఈ విషయాలు బోధించాడు:
వినయం యొక్క ప్రాముఖ్యత (18:2-6)
శోధనకు ప్రతిస్పందన (18:7-9)
తప్పినపోయినవారి పట్ల ప్రతిస్పందన (18:10-14)
మీకు వ్యతిరేకంగా పాపం చేయువారిపట్ల ప్రతిస్పందన (18:15-20)
క్షమాపణ ఆవశ్యకత (18:21-35)
ఇవి అనుదిన జీవితంలో ఆచరణాత్మక విషయాలు. యేసు తన శ్రోతల నిజమైన అవసరాలు గురించి మాట్లాడాడు. ఆయన జీవితాలు మార్చడానికి ప్రసంగించాడు.
పుట్టుగ్రుడ్డివానికి, యేసు కంటిచూపు ఇచ్చాడు, పిమ్మట శాశ్వతంగా తన జీవితాన్ని మార్చగల సందేశం ఇచ్చాడు.
పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని–నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు–ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా యేసు – నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు–ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను (యోహాను 9:35-38).
ఆకలిగొన్నవారికి, యేసు ఆహారం పెట్టాడు పిమ్మట, వారి జీవితాలను శాశ్వతంగా మార్చగల సత్యాన్ని ప్రకటించాడు. “జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు” (యోహాను 6:35).
జీవితాలను మార్చే ప్రసంగం, దేవుని వాక్య సత్యాన్ని, ప్రజల అక్కరలను కలిపి చూస్తుంది. ప్రభావవంతమైన ప్రసంగం దేవుని సత్యాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతుంది.
యేసు ప్రకటించినప్పుడు, ఆయన మనసుతో, భావాలతో, చిత్తంతో మాట్లాడాడు. నిజమైన మార్పులో ఈ మూడు ఉంటాయి.
యేసు మనసుతో మాట్లాడాడు
మత్తయి 18లో, మీరు యేసు ప్రసంగం గురించి చదివినప్పుడు, సంబంధాలు గురించి ఎన్నడు చెప్పని జ్ఞానమైన బోధ మీరు చూస్తారు. ప్రజలు ఒకరినొకరు వినయంగా చూసుకునే సమాజం గురించి ఆలోచించండి. క్షమాపణ ప్రమాణంగా ఉన్న సమాజం గురించి ఆలోచించండి. యేసు తన శ్రోతల మనసులతో వివేకాన్ని మాట్లాడాడు.
యేసు భావోద్వేగాలతో మాట్లాడాడు
యేసు శ్రోతల ఆశ్చర్యం, అద్భుతం, వింత గురించి సువార్తలు 34సార్లు మాట్లాడతాయి. ఎమ్మాయి మార్గంలో శిష్యులు, “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని?” (లూకా 24:32) చెప్పుకున్నారు. యేసు మాటలు విన్నవారు ఆయన దయగల మాటలకు ఆనందించారు, పాపాలను బట్టి దుఖించారు, అన్నిటికి మించి భవిష్యత్ నిరీక్షణ పొందుకున్నారు.
యేసు సంకల్పం/చిత్తంతో మాట్లాడాడు
యేసు కేవలం శ్రోతలతో తృప్తిపడలేదు; అనుచరులను పిలిచాడు. యేసు బాహ్య మార్పు చూసి తృప్తిపడలేదు; జీవితాలు, హృదయాలు మారాలని పిలిచాడు. పాపంతో నిండిన సమరయ స్త్రీయైనా లేక ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ధనవంతుడైన యువకుడైన, దేవునికి అప్పగించుకోవాలని తన శ్రోతలను పిలిచాడు. మనం యేసువలే ప్రసంగించినప్పుడు, మన శ్రోతలకు క్రొత్త జీవన విధానానికి పిలుపునిస్తాం.
“బైబిల్ ను మన జ్ఞానాన్ని పెంచడానికి ఇవ్వలేదు,మన జీవితాలు మార్చడానికి ఇచ్చాడు.”
- డి. యల్. మూడి రచనల నుండి తీసుకున్నారు.
నిశిత పరిశీలన: మీరు సువార్త ప్రకటిస్తున్నారా?
ఒక పాస్టర్ రోమా 1వ అధ్యాయం నుండి స్వలింగ సంపర్క పాపం గురించి ప్రసంగించాడు. అతడు సత్యం బోధించాడు. కాని ఏదో లోపించింది....అక్కడ కూర్చున్నవాళ్లలో ఒకడు స్వలింగ-ఆకర్షితుడు. స్వలింగ సంపర్కం పాపమని ఆ యువకుడికి తెలుసు, విమోచన కోసం ప్రార్థించడం మొదలుపెట్టాడు. అతని పాపస్వభావపు వాస్తవం అతనికి తెలుసు; దేవుడు శోధనపై జయిమివ్వగలడనే సుసమాచారం (సువార్త) అతడు వినాలి/అతనికి అవసరం.
విడాకుల గురించి యేసు హెచ్చరించిన మాటలను పాస్టర్ ప్రస్తావించాడు. సులభంగా విడాకులు ఇచ్చే నియమాలు గురించి చెప్పాడు. అతడు సత్యం బోధించాడు. కాని ఏదో లోపించింది....ఆ వారం ఇద్దరు పిల్లలుగల యువ దంపతులు విడాకులకు నడిపిస్తున్న గొడవను పరిష్కరించుకోలేక, విడాకులు కోసం న్యాయవాది యొద్దకు వెళ్ళారు. విడాకులు తీసుకోవడం పాపమని వాళ్ళకు తెలుసు; విచ్ఛిన్నమౌతున్న వైవాహిక జీవితాలను యేసు స్వస్థపరచగలడనే సుసమాచారం (సువార్త) వారు వినాలి/వారికి అవసరం.
ఒక పాస్టర్ ఇలా అరిచాడు, “గర్భస్రావం ఏ తప్పు చేయనిశిశువు ప్రాణం తీస్తుంది.” అతడు సత్యం బోధించాడు. కాని ఏదో లోపించింది..... అతని సంఘంలో ఒక స్త్రీ పెళ్లికాకుండా తాను గర్భస్రావం చేయించుకోవడానికి హాస్పిటల్ కు వెళ్లిన ఆ దినం జ్ఞాపకం చేసుకొని ఏడుస్తుంది. ఇరవై-ఏళ్ళ తరువాత, దేవుడు తన పాపం క్షమిస్తాడా అనే అనుమానంలో ఉంది; దేవుడు గతంలో ఆమె చేసిన పాపానికి పశ్చాత్తాపపడితే, ఆయన క్షమాపణ అందిస్తాడనే సుసమాచారం (సువార్త) ఆమె వినాలి/ఆమెకు అవసరం.
యేసు ఎన్నడు సత్యం విషయంలో రాజీపడలేదు, కాని నిరీక్షణ ఇవ్వడం కూడా మర్చిపోలేదు. సువార్త జీవితాలను మారుస్తుందని ఆయనకు తెలుసు. స్వలింగ-ఆకర్షణతో పోరాడుతున్న యువకునితో యేసు, “శోధనపై జయమివ్వడానికి నా కృప నీకు చాలును” అని చెబుతాడు. విచ్ఛిన్నమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్న దంపతులతో యేసు, “ప్రేమను పొందని విధంగా కనిపిస్తున్న జీవిత భాగస్వామి యెడల ప్రేమ చూపించే హృదయం నేను ఇవ్వగలను” అని చెబుతాడు. గర్భస్రావ పాపంతో ఉన్న స్త్రీతో యేసు, “నేను ఇతర పాపాలను క్షమించినట్లుగానే గర్భస్రావ పాపం కూడా క్షమిస్తాను. వెళ్లి ఇకమీదట పాపం చేయకు” అని చెబుతాడు.
పాపంపై తీర్పు సందేశం కూడా సువార్తలో భాగం. కాని యేసువలే ప్రకటించాలంటే, జీవితాలను మార్చే కృపాశక్తిని మనం మర్చిపోకూడదు. మనం దేవుని కృపా సువార్తను పతనమైన లోకంలో ప్రకటించాలి.
సువార్తలో ఎలప్పుడు రెండు సుసమాచారాలు ఉంటాయి. మొదటిగా, దేవుడు మన కొరకు ఏం చేశాడో సువార్త చెబుతుంది. నిరీక్షణలేని లోకంలో నిరీక్షణ కలిగిస్తుంది.
తరువాత, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఏం అవ్వగలం అనే విషయం సువార్త చెబుతుంది. సువార్త మనలను ఉన్నచోటనే విడిచిపెట్టదు; దేవునితో మరింత సన్నిహితంగా నడవడానికి సవాలు చేస్తుంది.
యేసు ప్రసంగాలు సరళమైనవి మరియు జ్ఞాపకముంచుకోదగినవి
యేసు ఎన్నడు సత్యంతో ప్రజల్ని విసిగించలేదు. సులభంగా సూటిగా ఎలా ప్రసంగించాలో ఆయనకు తెలుసు. ఆయన లోతైన సత్యాలు ప్రకటించాడు, కాని శ్రోతల్లో పామరుల ఆసక్తిని ఆకర్షించాడు.
ప్రభావవంతమైన ప్రసంగికుని లక్ష్యం లోతైన తన జ్ఞానంతో శ్రోతలను ముగ్ధుల్ని చేయడం కాదు. ప్రసంగికుని లక్ష్యం, దేవుని వాక్యాన్ని సులభంగా శక్తివంతంగా ప్రకటించడం, దేవుని వాక్య సత్యంతో శ్రోతల్ని ఒప్పించడంలో పరిశుద్ధాత్ముని అనుమతించడం.
యేసు తన ప్రసంగాలను సులభంగా, ఆసక్తికరంగా ఎలా చేశాడు?
యేసు కథలు చెప్పాడు
యేసు ప్రసంగాలు విన్న ప్రతి ఒక్కరు తరచుగా “నేను ఒక కథ చెబుతాను” అనే మాటలు వింటారు. ఆయన కథలు శ్రోతలను ఆకర్షించాయి, ఆయన సందేశం వైపు వారి చెవులు తెరచేలా చేశాయి.
మనలో చాలామంది మూడు అంశాలున్న సందేశం కంటే కథను ఎక్కువగా గుర్తుంచుకుంటారు. సందేశాన్ని ఉదహరించిన మంచి కథలు సందేశంలోని ప్రధాన అంశాన్ని గుర్తుంచుకునేలా చేస్తాయి. గొప్ప కథ ప్రసంగికుడు చేస్తున్న సందేశాన్ని సంగ్రహిస్తుంది.
► సందేశంలో మీరు విన్న చివరి కథ గురించి చర్చించండి. అది ప్రసంగికుని సందేశాన్ని ప్రభావితంగా వెల్లడి చేసిందా? కథ ఉద్దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలరా? కథ లేకుండా కూడా సందేశం ప్రభావవంతంగా గుర్తుండిపోయేలా ఉందా?
యేసు సరళమైన భాష ఉపయోగించాడు
బోధకుడు ఒక విషయాన్ని ఎంత మంచిగా అర్థం చేసుకుంటే, దానిని అంత సులభంగా విద్యార్థికి వివరించగలడు. బోధనా సమయంలో సంక్లిష్టమైన పదాలు ఉపయోగించే బోధకుడు, తన అవగాహన లేమిని కప్పిపుచ్చుకుంటాడు. ఒక విషయాన్ని మంచిగా అర్థం చేసుకున్నప్పుడు, దానిని అంతే సులభంగా బోధించగలుగుతాం.
సత్యాన్ని తన శ్రోతల భాషలో ఎలా మాట్లాడాలో యేసుకు తెలుసు. ఆయన విత్తనం విత్తటం గురించి రైతులకు బోధించాడు. గొర్రెల గురించి కాపరులకు బోధించాడు. చేపలు పట్టడం గురించి జాలర్లకు బోధించాడు. చాలామంది యేసు సందేశాన్ని తిరస్కరించారు, కాని ఏ ఒక్కరు ఆయన సందేశాలకు విసుకు చెందలేదు.
యేసు సందేశాన్ని జాలర్లు, రైతులు, గృహిణులు అందరు అర్థం చేసుకోగలరు. కాని ఆయన పండితులు, మతాధికారులు, రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడాడు. ఆయన ప్రసంగం సమాజంలో ప్రతి స్థాయి గురించి మాట్లాడుతుంది. సరళం అంటే పైపైన చెప్పటం కాదు. మన ప్రసంగాలు కూడా సువార్త గొప్ప సత్యాన్ని సరళంగాను, స్పష్టంగాను ప్రకటించాలి.
యేసు పునరావృతం చేసే పద్ధతిని ఉపయోగించాడు
ఒక యౌవ్వన సేవకుడు తన సంఘం విషయంలో విసిగిపోయి, “వారికిది ఇప్పటికే తెలిసుండాలి; నేను గత రెండు సంవత్సరాల క్రితం ఇది చెప్పాను” అన్నాడు. తనశిష్యులు అర్థం చేసుకునేవరకు యేసు అదే సందేశం చెప్పాడని అతని మిత్రుడు అతనికి జ్ఞాపకం చేశాడు.
మిత్రుడు ఈ సేవకుడ్ని అడిగాడు, “నీ ప్రసంగం యేసు ప్రసంగం కంటే గొప్పదనుకుంటున్నావా?”
“నిజానికి, కాదు!”
“మీ సంఘ సభ్యులు శిష్యుల కంటే తెలివైనవారా?”
“కాదు!”
“అయితే నువ్వు యేసువలే సత్యాన్ని పునరావృతం చేయాలి.”
యేసు ఒకే సత్యాన్ని పదే పదే ప్రకటించాడు. పదే పదే ఆయన మరణం, పునరుత్థానం గురించి శిష్యులకు బోధించాడు. అనేకసార్లు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. ఈ సత్యాలు ముఖ్యమైనవని ఆయనకు తెలుసు, కాబట్టి శ్రోతలకు చేరే వరకు ఆయన తన సందేశాన్ని అనేకమార్లు ప్రకటించాడు.
యేసు ప్రసంగాలు యధార్థమైనవి
యేసు ప్రసంగం యదార్థం. ఆయన జీవితం ఆయన సందేశానికి అనుగుణం. యేసు కేవలం దైవిక జీవితం గురించి ప్రకటించలేదు; దైవిక జీవనం గడిపాడు. యేసు సందేశం, ఆయన జీవితానికి మధ్య ఏ ఒక్కరు కూడా వ్యత్యాసం చూపించలేరు. యేసు ఏది ప్రకటించాడో అలా జీవించాడు.
మీరు కారు నడపడం నేర్చుకోవాలనుకున్నారని అనుకోండి. కారు నేర్పుతామని ఇద్దరు వచ్చారు. ఒకడు నడపటం గురించి చాలా పుస్తకాలు చదివాడు కాని ఎప్పుడు కారు నడపలేదు. మరొకడు, చాలాకాలంగా కారు మంచిగా నడుపుతున్నాడు. మీరు ఎవర్ని ఎన్నుకుంటారు?
మీరు క్రైస్తవ జీవితం జీవించాలనుకున్నారు అనుకోండి. ఇద్దరు పాస్టర్లను కనుగొన్నారు. ఒకరు, పాపజీవితంలో ఉన్నారు, కాని మంచి ప్రసంగాలు చేస్తారు. మరొకరు, దేవునికి సన్నిహితంగా జీవిస్తున్నారు. ఏ పాస్టర్ ని ఎన్నుకుంటారు?
[1]మన ప్రసంగం యదార్థంగా ఉండాలి. మనం ప్రకటించే విధంగా జీవించాలి. కొంతకాలం పాటు నకిలీ యదార్థతను కలిగి ఉండటం సాధ్యమని చాలామంది బోధకులు కనుగొన్నారు. నిజాయితీగా ప్రసంగిస్తూ, కానుకల డబ్బులు దొంగిలించే బోధకుల విషయంలో ప్రజలు మోసపోతున్నారు. వ్యభిచారం చేస్తూ, నైతికత గురించి బోధించే ప్రసంగికుల వలన మోసపోతున్నారు. తన భార్యను కొడుతూ ప్రేమ గురించి మాట్లాడే ప్రసంగికుల వలన మోసపోతున్నారు. కాని చివరకు, సత్యం బయటకు వస్తుంది. శూన్యతతో నిండిన హృదయం ఆత్మీయ శక్తిలేని పరిచర్యనిస్తుంది. మనలో పనిచేయడానికి దేవునిని అనుమతించినప్పుడు ఆయన మన ద్వారా పనిచేస్తాడు.
పాప జీవితాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రసంగ ఆకర్షణను వాడొద్దు. ప్రభావవంతమైన ప్రసంగం దేవుని ఎరిగిన హృదయంతో మొదలౌతుంది.
‘వారి పరిచర్య పరిమాణం బట్టి మీరు వారిని ఎరుగుదురు’ అని యేసు చెప్పలేదు. ‘వారి క్రియల ఆధారంగా వారికి తెలుసుకుంటారు’ అని చెప్పాడు.
- క్రెయిగ్ కీనర్
అన్వయం: కాపరిగా సేవకుడు
► మార్కు 6:30-34 చదవండి.
పాస్టర్ గురించి ఒక ఉత్తమ చిత్రం కాపరి. “గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను.” యేసు జనసమూహాన్ని చూసినప్పుడు, కాపరి అవసరతలో ఉన్న గొర్రెలను చూశాడు.
► మార్కు 6లో 5000 మందిలో ఎవరెవరున్నారో ఊహించండి. జాబితా చేయండి.
మీ జాబితాలో ప్రజల్ని మోసం చేసిన సుంకరులు ఉన్నారా? ఉన్నారు. ఈ నిజాయితీ లేనివారిని ఖండించడం సులభమే కాని యేసు నశించిపోయి, విమోచన అవసరతలో ఉన్న గొర్రెలను చూశాడు.
మీ జాబితాలో, యేసును పట్టుకోవాలని చూస్తూ తీర్పుతీర్చెడి పరిసయ్యులు ఉన్నారా? ఉన్నారు. జనసమూహం యెదుట వాళ్ళని అవమానించడం యేసుకు చాలా సులభం కాని యేసు సరైన మార్గం అవసరమైన కఠిన గొర్రెలను చూశాడు.
మీ జాబితాలో, వ్యభిచారాన్ని బట్టి దోషిగా ఉన్న అవిశ్వాసి భర్త ఉన్నాడా? ఉన్నాడు. యేసు, దిద్దుబాటు ఆఫై స్వస్థత అవసరతలో ఉన్న పడిపోయిన గొర్రెలను చూశాడు.
ఇంటిలో తిరుగుబాటు చేసి, పాఠశాలలో నుండి పారిపోయి అన్య సమూహంలో చేరిన యువకులు మీ జాబితాలో ఉన్నారా? ఉన్నారు. వాళ్లు మరింత దారితప్పిపోకుండా సరైన మార్గంలోకి తీసుకురావడానికి తిరుగులాడుతున్న గొర్రెలను యేసు చూశాడు.
మీరు ప్రసంగిస్తున్నప్పుడు ఎవర్ని చూస్తున్నారు? మీ సంఘ లోపాలు మాత్రమే చూస్తున్నారా లేక మీ గొర్రెల అవసరాలు చూస్తున్నారా? కేవలం కోపంతో ఉన్న బోర్డు సభ్యుడిని చూస్తున్నారా లేక పాపం వలన బాధపడుతున్న గొర్రెను చూస్తున్నారా? యేసు అవసరతలో ఉన్న గొర్రెలను చూశాడు.
► యోహాను 10:1-18 చదవండి.
పాస్టర్లుగా, సంఘానికి మనం కాపరులుగా ఉండుటకు పిలవబడ్డాం. కాపరి గొర్రెలకు ఎలా సేవ చేస్తాడు? యోహాను 10 దీనికి మాదిరి.
కాపరి గొర్రెలను నడిపిస్తాడు
కాపరిని గమనిస్తే, దుడ్డుకర్ర పట్టుకుని గొర్రెలను చెల్లాచెదురు చేయడు. దానికి బదులుగా, కాపరి గొర్రెలను సరైన మార్గంలో నడుపుతాడు. యేసు “అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును” (యోహాను 10:3-4) అని యేసు చెప్పాడు.
మనం సువార్తలు చదువుతుండగా, యేసు పేతుర్ని, యోహానుని, లేక తోమాను దుడ్డుకర్రతో కొడితే బాగుండని మనం అనుకునే సందర్భాలు చాలా ఉన్నాయి! పదే పదే వాళ్లు సమస్యలో ఇరుక్కున్నారు. అయితే యేసు వారిని కొట్టకుండా, ఈ బలహీన శిష్యులను లేవనెత్తి, వారిని సరైన త్రోవలో నడిపించడానికి ఆ దుడ్డుకర్రను ఉపయోగించాడు.
కాపరిగా, దేవుడు మీ సంఘంలో ఉంచిన గొర్రెలను మీరు నడిపిస్తున్నారా లేక వెళ్లగొడుతున్నారా? మీరు గొర్రెలను నడిపించే కాపరులా లేక గొర్రెలను విధేయత చూపుమని ఆజ్ఞాపించే నాయకులా?
కాపరి గొర్రెలపట్ల శ్రద్ధచూపుతాడు
“ఉదయం 9:00 గంటలు నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఉండి, వారాంతాల్లో సెలవులు ఇచ్చి, సాయంత్రం 5:00 గంటలు తరువాత ఏ ఫోన్ కాల్ లేని ఉద్యోగం అంటే నాకిష్టం” అని మీరెప్పుడైన ఆలోచించారా? ఇది కొన్నిసార్లు అద్భుతంగా ఉంటుంది! కాని కాపరి జీవితం అలా ఉండదు.
కాపరి గొర్రెలకు అవసరమైన సమయాల్లో శ్రద్ధ చూపుతాడు కాని కేవలం పనివేళలో కాదు. కాపరి దెబ్బతగిలిన గొర్రెతో, “రేపు ఉదయం 9:00గంటల వరకు, నేను పనికి వచ్చే వరకు వేచియుండు” అని చెప్పడు. కాపరి గొర్రెపిల్లను తప్పించడానికి రాత్రివేళ పరిగెడతాడు.
అదే విధంగా, తన గొర్రెలు అవసరంలో ఉన్నప్పుడు పాస్టర్ శ్రద్ధ చూపుతాడు. ఆత్మీయ గొర్రెల పట్ల శ్రద్ధ అనేది ప్రసంగానికి మించి ఉంటుంది. ఇందులో ప్రసంగం ఒక భాగమే, కాని సలహాలు ఇవ్వడం, దర్శించడం, వినటం, ప్రార్థించడం, కొన్నిసార్లు గాయపడిన గొర్రెపిల్ల దగ్గర కూర్చోవడం కూడా ఇందులో భాగం.
అవును, పాస్టర్లు, మీకు మీరు శ్రద్ధ చూపుకోవాలి. మీరు భౌతికంగా, భావోద్వేగపరంగా, ఆత్మీయంగా అలసిపోతే ప్రభావవంతమైన కాపరిగా ఉండలేరు. యేసు ఏకాంతంగా సమయం గడిపాడు, మీరు కూడా ఏకాంత సమయం తీసుకోవాలి. అయితే, గొర్రెలపై శ్రద్ధచూపడానికి తన సౌకర్యాన్ని త్యాగం చేయాల్సిన సందర్భాలు ఉన్నాయని కూడా యేసుకు తెలుసు.
పరిచర్య, విశ్రాంతి – ఈ రెండు విషయాలలో సమతుల్యత కలిగి ఉండడం కష్టమే. ఒక తెలివైన సేవకుడు-కాపరిగా, మీరు పరిశుద్ధాత్మ నడిపింపు విషయంలో అదే విధంగా మీ చుట్టూ ఉన్నవారి సలహాల విషయంలో సున్నితంగా ఉండాలి. “ఇది విశ్రాంతి, పునరుద్ధరణకు సమయం” అని ఆత్మ మీతో చెప్పినప్పుడు ఆలకించాలి. “నీకు కొంత సమయం కావాలి” అని చెప్పినప్పుడు నీ భార్య లేక మిత్రుని మాట వినాలి. పునరుద్ధరణ పొందిన తరువాత ఒక నూతన ఆసక్తితో, దేవుడు అప్పగించిన గొర్రెల పట్ల శ్రద్ధ చూపాలి.
కాపరి గొర్రెలను కాపాడతాడు
ప్రమాదం సంభవించినప్పుడు పారిపోయే జీతగాడికి, తన ప్రాణానికి తెగించి గొర్రెలను కాపాడిన మంచి కాపరికి మధ్య వ్యత్యాసాన్ని యేసు వివరించాడు. జీతగాడు గొర్రెలను గూర్చి లక్ష్యం చేయడు, కాని కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు (యోహాను 10:13, 15).
ఆయన తన చివరి ఘడియల్లో కూడా, యేసు శిష్యుల పట్ల శ్రద్ధ చూపాడు. ప్రభురాత్రి భోజన సమయంలో, వారు త్వరలో ఎదుర్కొనబోవు విచారణకై వారిని సిద్ధపరచాడు. గెత్సమనే తోటలో, పేతురు, యాకోబు, యోహానులకు తన బోధ కొనసాగించాడు. సిలువలో, మరియను యోహాను చేతులకు అప్పగించాడు. చివరి వరకు, మంచి కాపరి గొర్రెలను లక్ష్యపెడుతూనే ఉన్నాడు.
కాపరులవలే సేవచేయాలని ఎఫెసీ సంఘ పెద్దలను పౌలు నియమించాడు. వారు యేసు రక్తంలో సంపాదించబడిన గొర్రెమందను కాయాలి. తరువాత వచనంలో, క్రూరమైన తోడేళ్లు గొర్రెమందపై దాడిచేస్తాయని కూడా పౌలు హెచ్చరించాడు. గొర్రెమందను కాపాడే బాధ్యత కాపరులది (అపొస్తలుల కార్యములు 20:28-31).
సేవకుడు-కాపరిగా, దేవుడు మీ సంఘంలో ఉంచిన గొర్రెలను కాపాడుతున్నారా? తప్పుడు సిధ్ధాంతాల నుండి, వివాహంలో, కుటుంబంలో, ఇతర ఆత్మీయ దాడుల నుండి వారిని కాపాడుతున్నారా? మీరు జీతగాళ్లా లేక కాపరులా?
మీరు తరువాతి ఆదివారం ప్రసంగించడానికి ముందు, మీ గొర్రెల అవసరాలను మీకు బయలుపరచమని దేవుని అడగండి. మీ మందలో విరిగి నలిగిన హృదయాలను బయలుపరచమని అడగండి. మీరు ప్రసంగిస్తున్నప్పుడు, వేధింపులకు గురై, నిస్సహాయంగా ఉండి, దైవిక కాపరి ప్రేమ అవసరతలో ఉన్న గొర్రెలను చూడండి.
నిశిత పరిశీలన: “శ్రమ!”
► మత్తయి 23:1-39 చదవండి.
యేసు, ఆయనను తిరస్కరించిన పట్టణాలు గురించి (మత్తయి 11:21), ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న పరిసయ్యులు, శాస్త్రులు గురించి (మత్తయి 23:13-29), ఆయన్ని ధిక్కరించబోవు యూదా గురించి (మార్కు 14:21) మాట్లాడుతూ, ఆయన “అయ్యో మీకు శ్రమ” అనే మాట ఉపయోగించాడు. మనం కొన్నిసార్లుతనను తిరస్కరించిన వారిపట్ల యేసు చూపిన ప్రేమను మరచిపోయేంతగా, ఈ “శ్రమలను” కోపంతో చదువుతాం.
శ్రమ అనే పదంలో తీర్పు ఉంది, కాని దుఖం కూడా ఉంది. “శ్రమ” అనే పదంలో, విచారణకు గురైన వ్యక్తికి తీర్పు మరియు “దుఖం, చింత” రెండు ఉంటాయి. “తమ పరిస్థితి యొక్క నిజమైన దుస్థితిని గుర్తించడంలో విఫలమైనవారి పట్ల యేసు విచారాన్ని” ఇది వ్యక్తపరుస్తుంది.[1] “శ్రమ” లోతైన దుఃఖాన్ని అదే విధంగా హెచ్చరికను అందిస్తుంది.
యేసు తాను ప్రేమించిన పట్టణ గతిని చూసి దుఃఖపడుతూ మతాధికారులపై తీర్పు ప్రకటనలను, ముగించాడు “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచునుఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.” త్వరలో ఆయనను సిలువవేయబోవు పట్టణ గతిని చూసి యేసు ఏడ్చాడు (మత్తయి 23:37 మరియు లూకా 19:41).
తీర్పు ప్రకటించే విషయంలో ఇది మనకు మాదిరి. మన ప్రసంగంలో పాపం గురించి హెచ్చరికలు, మారుమనసు పొందుటకు నిరాకరించే వారిపై తీర్పు సందేశాలు ఉండాలి. కాని మన సందేశం పాపం విషయంలో దుఖం చూపించాలి, కాని పాపి పై కోపం చూపకూడదు.
నరకం గురించి ప్రసంగం విన్న తర్వాత తిరుగుబాటు స్వభావం కలిగిన ఒక యువకుడు ఇంటికెళ్లాడు. “బాబు, ప్రసంగం గురించి నువ్వేమనుకుంటున్నావ్?” అని తండ్రి అడిగాడు. “నాకది నచ్చలేదు. కోపం తెప్పించింది!” అని చెప్పాడు. తర్వాత వారం, మరొక ప్రసంగికుడు నరకం గురించి చెప్పటం మళ్ళీ కుమారుడు విన్నాడు. “ప్రసంగం గురించి నువ్వేమనుకుంటున్నావ్?” అని తండ్రి అడిగాడు. “నేను యేసును సేవించాలి. నాకు ఆ భయంకరమైన చోటుకి వెళ్లాలనిలేదు!” అని బదులిచ్చాడు.
తండ్రి ఆశ్చర్యపోయాడు. “గత వారం, నరకం గురించి చెప్పిన ప్రసంగం నీకు కోపం రేపింది. ఈ వారం, నరకం గురించి చెప్పిన ప్రసంగం పశ్చాత్తాపానికి గురిచేసింది. ఏంటి తేడా?” అని తండ్రి అడిగాడు. అప్పుడతడు, “నరకం గురించి నన్ను హెచ్చరించటప్పుడు ప్రసంగికుడు ఏడ్చాడు!” అని బదులిచ్చాడు.
మీరు తీర్పును గూర్చి ప్రకటిస్తున్నప్పుడు ఏడుస్తారా? నరకం గురించి ప్రసంగం తయారు చేసేటప్పుడు మీరు ఏడుస్తారా? మీరు, తీర్పు గురించి హెచ్చరించేటప్పుడు కూడా గొర్రెలను ప్రేమించే కాపరేనా?
[1]Martin H. Manser, Dictionary of Bible Themes. (London: Martin Manser, 2009). Joel B. Green and Scot McKnight, Dictionary of Jesus and the Gospels. (Westmont, Illinois: InterVarsity Press, 1992) ఇవి కూడా చూడండి.
ముగింపు: ప్రసంగంలో పరిశుద్ధాత్ముని పాత్ర
ప్రసంగికులంగా, మన బోధ వినే వారిలోఒప్పింపు కలుగజేయడానికి పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడాలి. భావోద్వేగ విజ్ఞప్తులను కలిగించడానికి మనం మానవ పద్ధతుల్ని మాత్రమే ఉపయోగిస్తే, త్వరిత ఫలితాలు చూస్తాం కాని ఆత్మీయ ఫలితాలు నశిస్తాయి. మన శ్రోతల్లో శాశ్వత ఫలితాలు తీసుకొచ్చేది కేవలం పరిశుద్ధాత్ముడే.
► 1 కొరింథీయులకు 2:1-16 చదవండి.
ఆత్మీయ మార్పు కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే కలుగుతుందని పౌలు గ్రహించాడు. ఎథెన్సు పట్టణంలో అరేయొపగులో తత్వశాస్త్రులతో వాదించిన తరువాత, అతడు కొరింథుకి వచ్చాడు (అపొస్తలుల కార్యములు 17:16-18:1). కొరింథులో, అతను వాక్చాతుర్యంతో, జ్ఞానంతో కాకుండా సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప మరేది ప్రకటించకూడదని నిశ్చయించుకున్నాడు. “పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని” (1 కొరింథీయులకు 2:1-5).
పరిశుద్దాత్మ దేవుడు ఆత్మీయులైనవారికి ఆత్మీయ సత్యాలు బయలుపరుస్తాడని పౌలుకు తెలుసు (1 కొరింథీయులకు 2:13). పౌలు శిక్షణకు, నేర్చుకోవడానికి విలువిచ్చాడు; అతడు గొప్ప పండితుడు. ప్రభావవంతమైన బహిరంగ ప్రసంగ అవగాహనగలవాడు; అతడు గొప్ప గ్రీకు ఉపన్యాసకులను అధ్యయనం చేశాడు. తార్కికంగా ఎలా మాట్లాడాలో అతనికి తెలుసు; తార్కిక నిర్మాణంలో రోమా పత్రిక గొప్పది. కాని అన్నిటికి మించి, పౌలు పరిశుద్ధాత్మ శక్తికి విలువిచ్చాడు. నిజమైన ఒప్పుకోలు ఆత్మ కార్యం ద్వారానే వస్తుందని అతనికి తెలుసు.
పౌలు కొరింథీయులకు “అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు” (2 కొరింథీయులకు 4:7) అని జ్ఞాపకం చేశాడు. శరీరం సంపద కాదు! పరిచర్య చేసే మనం పగిలిన మట్టి పాత్రల వంటివాళ్ళం. కానీ మనం సేవించే ప్రజల యొద్దకు ఐశ్వర్యమైన సువార్తను తీసుకెళ్ళే గొప్ప అద్భుత అవకాశం మనకుంది.
పరిచార నాయకులకు ఇది గొప్ప హెచ్చరిక. శరీరంలో ఉన్న సంపదపై కాకుండా ఘటంపై దృష్టిపెట్టడం చాలా సులభం. మనం మన సందేశం కంటే మనపై దృష్టిపెట్టగలం; మనం సంపద కంటే ఘటముపై దృష్టిపెట్టగలం. శక్తి మనది కాదు దేవునిదని చూపించడానికి ఆయన ఉద్దేశ్యపూర్వకంగా మంటి ఘటాలను ఉపయోగించుకున్నాడని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం దేవుని శక్తికి అడ్డుపడకూడదు. కేవలం ఆయనకు చెందిన మహిమ మనం తీసుకోకూడదు. మనం ఆత్మ శక్తితో ప్రకటించాలి.
పాఠం 5 అభ్యాసాలు
(1) మత్తయి సువార్తలో ఐదు ప్రధాన ప్రసంగాలు ఉన్నాయి. ప్రతి ప్రసంగం చదివి, దానిని ప్రభావవంతంగా చేసిన ఒక లక్షణం గుర్తించి, క్రింద పట్టికలో రాయండి. ఈ అభ్యాసంలో తప్పు లేక ఒప్పు సమాధానాలు ఏమి ఉండవు. “యేసు నన్ను ఎలా ఒప్పింపజేశాడు, ప్రేరేపించాడు, లేక ఆయన సందేశం గుర్తుంచుకుని, దాని అన్వయించుకోవడానికి ఎలా సహాయం చేశాడు?” అని అడగండి.
(2) మీరు తదుపరి ప్రసంగం సిద్ధం చేసేటప్పుడు, యేసు ప్రసంగాల్లో మీరు చూసిన లక్షణాలు సమీక్షించండి. ప్రభావవంతంగా ప్రకటించడానికి ఆయన ప్రసంగాలను మాదిరిగా తీసుకోండి. తరగతిలో ఈ ప్రసంగాన్ని ఇతరులతో పంచుకొనండి. ఈ ప్రశ్నతో ప్రసంగాన్ని మూల్యాంకనం చేయండి, “నా ప్రసంగం యేసు మాదిరికి అనుగుణంగా ఉందా?”
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.