క్రీస్తువంటి పరిచర్యకు, క్రీస్తువంటి ప్రేమ ప్రేరణ.
పరిచయం
ప్రేమే, యేసు జీవితాన్ని, పరిచర్యనంతటినీ ప్రేరేపించింది. దేవుని పట్ల తనకున్న ప్రేమ మరియు ఇతరుల పట్ల తనకున్న ప్రేమ తన జీవితానికి, పరిచర్యకు కేంద్రం అనే విషయాన్ని పదే పదే చూపించాడు. మనం యేసు మాదిరి అనుకరిస్తే, మన జీవితానికి, పరిచర్యకు ప్రేమ కేంద్రంగా ఉండాలి. ఇది మంచి సమరయుని ఉపమానంలో కంటే మరెక్కడా స్పష్టంగా లేదు.
► లూకా 10:25-37 చదవండి.
యేసు ఈ ఉపమానం చెప్పే ముందు, “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని” (లూకా 10:21) చెప్పాడు. ఇది ఆత్మీయ అవగాహన గురించి ఒక ముఖ్య పాఠాన్ని బోధిస్తుంది. ఆత్మీయ అవగాహన కావాలంటే, మేధోపరమైన అధ్యయనం చాలదు; ఆత్మీయ ప్రత్యక్షత అవసరం. దేవుని సత్యం, దేవుని ఆత్మ సహాయంగా చిన్నపిల్లవాడు కూడా అర్థం చేసుకోగలిగేంత సరళమైంది కాని పండితుడు కేవలం తన మేధో శక్తితో అర్థం చేసుకోలేనంత లోతైనది.
1. ఆత్మీయ సత్యం కేవలం పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతుంది. పౌలు “దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు” అని రాశాడు. కాబట్టి, “మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము” (1 కొరింథీయులకు 2:11, 13).
2. ఆత్మీయ సత్యం కేవలం స్వీకరించే శ్రోతలకే బయలుపరచబడుతుంది. పౌలు ఇలా కొనసాగించాడు: “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు” (1 కొరింథీయులకు 2:14).
లూకా 10:25 లోని ధర్మశాస్త్రోపదేశకుడు, రెండవ సూత్రానికి నిజమైన ఉదాహరణ. ధర్మశాస్త్రోపదేశకుని ప్రశ్న సత్యం తెలుసుకోవాలనే తాపత్రయం నుండి పుట్టలేదు, కాని యేసును ఇబ్బందిపెట్టాలనే కోరిక నుండి పుట్టింది; యేసును పరీక్షించాలనుకున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడు, యేసు సమాధానం విన్న తరువాత, అతని సమాధానం ఫలవంతమైన నేల ప్రతిస్పందనకాదు. దానికి బదులుగా, తననుతాను సమర్థించుకోవడానికి మరో ప్రశ్న అడిగాడు (లూకా 10:29).
“నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?” అను ప్రశ్నకు యేసు సమాధానం ఇచ్చాడు. ” సమాధానం ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, “నీ దేవుడైన ప్రభువు ను నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” (లూకా 10:27).
ఇది యేసు మనకు చూపించు మాదిరి. యేసువలే జీవించి, పరిచారం చేయాలంటే, యేసు ప్రేమించినట్లుగా మనం దేవుని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. క్రీస్తువంటి ప్రేమ లేకుంటే, ఈ కోర్సులోని ఇతర పాఠాలు అంత ప్రముఖంగా ఉండవు. ప్రార్థన, నాయకత్వం, బోధనా మరియు ప్రసంగం- ప్రేమ లేకపోతే ఏది నిజంగా ప్రభావవంతంగా ఉండదు.
బహుశా ఇది చాల సరళంగా కనిపించొచ్చు. మీరిలా అనుకోవచ్చు, “నిజానికి మనం దేవుని ప్రేమించాలి, ప్రజలను ప్రేమించాలి” అది నాకు తెలుసు!” కాని అనుదిన పరిచర్య భారంలో, ప్రేమతో నిండిన హృదయాన్ని మనం కలిగి లేకపోవచ్చు. సంఘ సభ్యుల్ని ప్రేమించకుండా, వారికి సేవ చేయటం సాధ్యం. మన కుటుంబాలను ప్రేమించకుండా, వారికి సేవ చేయడం సాధ్యం. దేవుని ప్రేమించకుండా, క్రైస్తవ పని చేయటం సాధ్యం. క్రైస్తవ పరిచర్యలో క్రీస్తువలె ప్రేమించడమే మన ప్రేరణగా ఉండాలి.
[1]ముఖ్యంగా, మత్తయి 13:12 గమనించండి. సత్యాన్ని అంగీకరించువానికి మరింత ఇవ్వబడుతుంది:: “కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును.” సత్యాన్ని తిరస్కరించువాడు వాడు వినిన సత్యం కూడా అతనికి మరుగుచేయబడుతుంది: “లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును.”
యేసు ప్రేమించినట్టుగా దేవుని ప్రేమించడం
మానవాళికి యేసు చేసిన పరిచారం తండ్రి యెడల ఆయనకున్న ప్రేమ నుండి వెలువడింది. పరిచర్యలో మానసికంగాను, భావోద్వేగపరంగాను నిరాశకు లోనవ్వడం, ఆందోళనకు లోనవ్వడం వంటివి నివారించాలంటే, ప్రజలకు మనం చేసే సేవ, దేవుని యెడల ప్రేమ నుండి కలగాలి. దేవుని ప్రేమ లేని పరిచర్య త్వరలో శూన్యంగా, నిష్ఫలంగా మారిపోతుంది.
తండ్రి యెడల యేసుకున్న ప్రేమలోని మూడు కోణాలు మనకు మాదిరి: సంబంధం, జ్ఞానం, నమ్మకం.
యేసు తన తండ్రితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు
పదే పదే, తండ్రితో యేసుకున్న సంబంధాన్ని సువార్తలు చూపిస్తాయి. ఇది ఈ వాక్యాల్లో కనిపిస్తుంది:
యేసు తన తల్లిదండ్రులతో చెప్పిన మాట, “నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా?” (లూకా 2:49)
యోహాను 17లో యేసు సన్నిహిత ప్రార్థన.
సిలువలో యేసు ఆవేదనతో మాట్లాడిన మాట, “నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని?” (మత్తయి 27:46)
గెత్సెమనే తోటలో యేసు, దేవునిని కుటుంబంలో ఉపయోగించే సన్నిహిత భాష ఉపయోగించి సంబోధించాడు, “నాయనా తండ్రీ” (మార్కు 14:36). ఇది తండ్రితో తనకున్న సంబంధంలో భద్రత కలిగిన కుమారుడు మాట్లాడే భాష.
సాంప్రదాయ యూదుల ప్రార్థనల్లో దేవునికి అనేక పేర్లు ఉపయోగించారు: అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు; మా పితరుల దేవా; యెహోవా; ఇశ్రాయేలు విమోచకుడు. యేసు అబ్బా అనే సన్నిహిత పదం ఉపయోగించాడు. యేసు తన తండ్రితో సన్నిహిత సంబంధం కలిగి జీవించాడు.
కెన్నెత్ ఇ. బెయిలీ చాలా సంవత్సరాలపాటు మధ్య తూర్పు ప్రాంతంలో బోధించాడు. మధ్య తూర్పు ప్రాంతంలో పిల్లలు నేర్చుకునే మొట్టమొదటి పదం అబ్బా అని అతడు రాశాడు. అబ్బా అనేది పిల్లాడు తన తండ్రికి ఉపయోగించే పేరు.
దేవుని పిల్లలముగా, “అబ్బా తండ్రీ” (రోమా 8:15, గలతీయులకు 4:6) అని మొర్రపెట్టగల ఆధిక్యత మనకుందని పౌలు చెప్పాడు. మనం ఆరాధించే దేవుడు సుదూరంగా లేడు. బదులుగా, యేసువలే మనం మన తండ్రి ప్రేమలో భద్రంగా, సౌకర్యంగా జీవిస్తున్నాం.
సేవకులముగా, మన పరిచర్యలో మనం పొందే విజయాన్ని బట్టి మనల్ని మనం అంచనా వేసుకునే శోధనలో పడిపోతాం. మన విలువ మన సంఘ పరిమాణం బట్టి లేక సంఘ ఆమోదాన్ని బట్టి, లేక తోటివారి గుర్తింపును బట్టి వస్తే, విజయం కోసం యదార్థతను విడిచిపెట్టె శోధనలో పడిపోతాం. మన ప్రయత్నాలు విఫలమైనప్పుడు నిరుత్సాహపడతాం. అయితే, మన విజయంతో నిమిత్తం లేకుండా మన తండ్రి మనలను ప్రేమిస్తున్నాడని నమ్మితే, ఫలితాలు ఆయన చేతికి అప్పగించవచ్చు. ఆయన ప్రేమ మన ప్రదర్శనపై ఆధారపడదు.
యేసుకు తన తండ్రి చిత్తం తెలుసు
ఆయన భూలోక పరిచర్య ముగింపులో, “చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని” (యోహాను 17:4) అని యేసు సాక్ష్యమిచ్చాడు. తన తండ్రి ఏమి నెరవేర్చడానికి తనను భూలోకంలోకి పంపాడో యేసుకు తెలుసు, ఆ పనికే ఆయన తన జీవితాన్ని సమర్పించుకున్నాడు.
యేసు మానవుడిగా జీవించినప్పుడు, తన తండ్రి చిత్తాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నేర్చుకున్నాడు. ప్రార్థన ద్వారా, యేసు తండ్రి చిత్తాన్ని కనుగొన్నాడు.
యేసు వాక్యం ద్వారా కూడా తండ్రి చిత్తం నేర్చుకున్నాడు. కపెర్నహూములో, యేసు తన మిషన్ ను యెషయా ప్రవచన నెరవేర్పుగా సంగ్రహించాడు. (లూకా 4:18-19). బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులకు సమాధానం చెప్పినప్పుడు, తన మెస్సీయత్వ పరిచర్యకు రుజువుగా యేసు యెషయా మాటలు ఉపయోగించాడు. (మత్తయి 11:4-5). యేసుకు వాక్యం తెలుసు.
క్రొత్త నిబంధన అంతటిలో, క్రైస్తవులు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు లేఖనాలు సూచించటం మనం చూస్తాం. హతసాక్షియైనప్పుడు, స్తెఫను చివరి ప్రసంగంలో ప్రధానంగా పాత నిబంధన లేఖనాలు, యేసుక్రీస్తులో వాటి నెరవేర్పు భాగంగా ఉన్నాయి (అపొస్తలుల కార్యములు 7:1-53). యూదా నాయకులు, యేసు సందేశాన్ని ప్రకటించడాన్ని మానేయమని క్రైస్తవులకు ఆజ్ఞాపించినప్పుడు, సంఘం కలిసి ప్రార్థించింది. ఈ ప్రార్థన కీర్తన 2 యొక్క సుదీర్ఘ ఉల్లేఖనం (అపొస్తలుల కార్యములు 4:24-30, కీర్తన 2:1-2). ఆది సంఘంలోనున్న విశ్వాసులకు లేఖనాలు తెలుసు. ప్రసంగించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఇది వారి సాధారణ భాష.
సంఘ చరిత్ర అంతటా, ప్రపంచాన్ని తలక్రిందులు చేసినవారు వాక్యం తెలిసిన వ్యక్తులే. మార్టిన్ లూథర్ డైట్ ఆఫ్ వార్మ్స్ అనే సభలో ఇలా సాక్ష్యమిచ్చాడు: “నేను లేఖనాలకు కట్టుబడి ఉన్నాను, నా మనసు దేవుని వాక్యంతో నిండియుంది.” జాన్ వెస్లీ తననుతాను “మ్యాన్ ఆఫ్ వన్ బుక్” అని చెప్పుకున్నాడు. “బైబిల్ సారం మీలో నుండి ప్రవహించేవరకు” వాక్యంలో మునిగితేలాలని చార్ల్స్ స్పర్జన్ ప్రసంగికులకు చెప్పాడు. హడ్సన్ టేలర్ వాక్యంలో ఎక్కువ సమయం గడిపేవాడు గనుక అతని గురించి ఒక రచయిత, “టేలర్ బైబిల్ వాతావరణంలో జీవించాడు” అని రాశాడు. వీరు వాక్యాన్ని అధికారంతో ప్రకటించారు గనుక భూలోకాన్ని మార్చగలిగారు.
[1]మనం యేసువలే, ఆది క్రైస్తవులవలే, చరిత్రలో గొప్ప బోధకులవలే పరిచర్య చేయాలంటే, దేవుని వాక్యంతో మనం మన వైఖరులు, ఆలోచనలు మార్చుకోవాలి. పౌలు పరిచర్యలో, లేఖనాలు అత్యున్నత అధికారం గలవి (2 తిమోతికి 3:16-17). తన శిష్యులు సేవ కొరకు ప్రత్యేకించబడాలని లేక ప్రతిష్ఠించబడాలని, వేరుచేయబడాలని యేసు ప్రార్థించాడు. ఇది వాక్యం ద్వారా సాధ్యమౌతుంది: “సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము” (యోహాను 17:17). వాక్యం, పరిచర్యలో శిష్యులను ప్రభావవంతులుగా చేసింది; వాక్యం మనలను పరిచర్యలో ప్రభావవంతులుగా చేస్తుంది.
అజిత్ ఫెర్నాండో (Ajith Fernando) తన జీవితం మొత్తం శ్రీలంకలో పరిచర్య చేస్తూ గడిపాడు. తన బోధనలో ఏ ముఖ్యమైన ప్రకటన చేయడానికి ముందుగా దానికి లేఖన ఆధారం ఉండాలని ఎల్లప్పుడూ పాటించే సాధనగా ఆయన రాశాడు. ఇది ఆయన బోధనను వాక్యంపై ఆధారపడి ఉండేలా చేస్తుంది. క్రైస్తవులుగా, మనం దేవుని ఆయన వాక్యం ద్వారా తెలుసుకుంటాం. పరిచారకులుగా, దేవుని వాక్యంపై ఆధారపడిన పరిచర్య ద్వారా బలమైన సంఘాలను నిర్మిస్తాం.
యేసు తన తండ్రిని నమ్మాడు
భూమిపై యేసు పరిచర్య చేసిన కాలంలో, యేసుకు తన తండ్రితో ఉన్న సంబంధాన్ని గెత్సెమనే తోట ప్రార్థనలో సంగ్రహించవచ్చు, “అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము” (మత్తయి 26:39). ఇది సంపూర్ణమైన నమ్మకం, విధేయత చూపించే మాట.
నమ్మకంలేని వారి చిత్తానికి లోబడటం చాలా కష్టం. బయట నమ్మేలా బలవంతం చేయబడతాం కాని మనం నమ్మలేని వారికి లోబడడానికి మన హృదయం ఒప్పుకోదు. యేసు తండ్రి ప్రేమను, ఆయన మంచితనాన్ని పూర్తిగా నమ్మాడు గనుక తండ్రి చిత్తానికి లొంగిపోయాడు.
► యోహాను 5:1-47 చదవండి.
యేసు పూర్తిగా తండ్రిపై ఆధారపడ్డాడని ఆయన పరిచర్య అంతటిలో కనిపిస్తుంది. విశ్రాంతి దినమందు యేసు కుంటివాడిని బాగుచేసినప్పుడు వ్యతిరేకించిన యూదా నాయకులకు, యేసు సమాధానం ఇచ్చాడు:
తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును…. నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది (యోహాను 5:19, 30).
యేసు దైవికమైనవాడని అప్పటికే చెప్పుకున్నాడు: “నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను” (యోహాను 5:17). అయితే, యేసు పూర్తిగా దైవికమైనవాడైనప్పటికీ, ఆయన భూమిపై చేసిన పరిచర్యలో సేవకుని పాత్రకు ఇష్టపూర్వకంగా లోబడ్డాడు. ఆయన, తండ్రితో సమానుడు, కాని ఆయన తండ్రి చిత్తానికి లోబడ్డాడు.
కొన్నినెలలు తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు యేసును వ్యతిరేకించినప్పుడు, తండ్రి అధికారాన్ని నొక్కి చెప్తు, తన క్రియలను సమర్ధించుకున్నాడు: “నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు” (యోహాను 8:28). ఆయన తండ్రిని పూర్తిగా నమ్మాడు గనుక, తండ్రి చిత్తానికి పూర్తిగా తలవంచగలిగాడు.
సంఘ నాయకత్వానికి కష్టమైన సమతుల్యత అవసరం. అనేకమంది పాస్టర్లకు, సంఘ నాయకులకు బలమైన నాయకత్వ నైపుణ్యాలు ఉన్నాయి. నాయకులుగా, వారికి బలమైన అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు ఉన్నాయి. నాయకునికి ఇదొక విలువైన బలం. అయితే, ఈ బలం, దేవునికి ఇష్టపూర్వకంగా లోబడడం ద్వారా సమతుల్యమవ్వాలి. మనం విశ్వాసంతో దేవునికి లోబడకపోతే, దేవుని మార్గానికి అనుగుణంగా జీవించడానికి బదులు మన వ్యక్తిగత మార్గాలకు లొంగిపోతాం.
బైబిల్లో దీనికి మోషే ఒక ఉత్తమ ఉదాహరణ. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు (సంఖ్యాకాండము 12:3). మోషే బలవంతుడు, అదే సమయంలో సాత్వికుడు కూడా. అతను ఐగుప్తులో అత్యంత బలవంతుడైన ఫరోను ఎదుర్కొన్నాడు. అరణ్యంలో కఠిన హృదయులైన ఇశ్రాయేలీయులను నడిపించాడు. మోషే బలమైన నాయకుడు. కానీ అదే సమయంలో, అతడు దేవునికి లోబడ్డాడు. ప్రభావవంతమైన సంఘ నాయకత్వానికి, మన సాధారణ బలం దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అవసరం. దేవునితో నమ్మకంగా, విశ్వాసంగా నడిచినప్పుడే ఇది సాధ్యపడుతుంది.
► తండ్రి యెడల ప్రేమ చూపించు ఈ మూడు కోణాల్లో (సంబంధం, ఆయన వాక్య జ్ఞానం, విశ్వాసం కలిగి లోబడడం), వ్యక్తిగతంగా మీకు ఏది గొప్ప సవాలు?
“బైబిల్ ను మంచి పుస్తకాలతో భర్తీ చేయొద్దు. బావిలోనిది త్రాగుడి!”
- అమీ కార్మైఖేల్
నిశిత పరిశీలన: యేసు దేవుడనని చెప్పుకున్నాడా?
మర్మోనిజం, యెహోవా సాక్షులువంటి తప్పుడు శాఖలు, అదే విధంగా ఇస్లాం వంటి క్రైస్తవేతర మతాలు యేసు నిజమైన దేవుడని ఒప్పుకోవు. వారు యేసును ఒక గొప్ప బోధకుడు లేక ప్రవక్తగా, మొదట సృష్టించబడిన వ్యక్తిగా మరియు మెస్సీయగా కూడా గుర్తిస్తారు. కాని ఆయన నిజమైన దేవుడని ఒప్పుకోరు.[1]
ఈ మతాలను అనుసరించేవారు ఎల్లప్పుడు ఇలా చెప్తారు: “యేసు ఎప్పుడూ తాను దేవుడనని చెప్పుకోలేదు. మనం దేవుని కుమారులుగా ఉన్నట్లే, ఆయన కూడా దేవుని కుమారుడని చెప్పుకున్నాడు.”
యేసు దేవుడని చెప్పుకున్నాడా? చెప్పుకున్నాడు. యేసు మాటలు విన్న ప్రజలు ఆయన మాటలు అర్థం చేసుకున్నారు. యేసు దేవుడిని “నాతండ్రి,” అని సంబోధించినప్పుడు, యూదా నాయకులు ఆయన్ని చంపాలని చూశారు. ఎందుకు? “ఆయన విశ్రాంతిదినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి” (యోహాను 5:18).
యేసు దేవుడని చెప్పుకున్న ఒక ప్రకటనలో, యూదా నాయకులతో, “అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను” (యోహాను 8:58). మండుచున్న పొదలో దేవుడు మోషేకు తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఉపయోగించిన మాటలు ఇవి: “మరియు ఆయన–ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను” (నిర్గమకాండము 3:14). ఈ మాటలతో, యేసు మోషేకు ప్రత్యక్షమైన దేవుడనని చెప్పుకున్నాడు. యేసు మాటల అర్థం ఖచ్చితంగా యూదా నాయకులకు తెలుసు. కాబట్టి, ఆయన్ని చంపడానికి రాళ్ళు ఎత్తారు. ఇది దేవదూషణకు- తనని తాను దేవునిగా చెప్పకోవడానికి- తగిన శిక్ష (లేవీయకాండము 24:16).
యేసును విచారణ చేసినప్పుడు, కయప “పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా?” అని అడిగాడు. యేసు స్పష్టంగా జవాబిచ్చాడు: “అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను.” ఈ జవాబుతో, యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండువాడనని, దానియేలు ప్రవచన ఆధారంగా లోకానికి తీర్పుతీర్చడానికి వచ్చు మనుష్యకుమారుడనని చెప్పుకున్నాడు (కీర్తన 110:1 and దానియేలు 7:13-14). యేసు దేవుడుగా చెప్పుకుంటున్నాడని కయపకు తెలుసు. కాబట్టి అతను తన వస్త్రములు చింపుకొని, “ఈ దేవదూషణ మీరు విన్నారు కారా” (మార్కు 14:61-64) అని చెప్పాడు.
యేసు మాటలు నమ్మడానికి మీరు నిరాకరించవచ్చు, కాని మీరు సువార్తలు జాగ్రత్తగా చదివినప్పుడు, యేసు దేవుని కుమారునిగా చెప్పుకున్నాడని ఒప్పుకోకుండా ఉండలేరు. ఆయన మాటలు విన్న శ్రోతలు ఆయన్ను దేవునిగా అంగీకరించడానికి లేక దేవదూషకుడు, అబద్ధ ప్రవక్తయని చెప్పి చంపడానికి బలవంతం చేయబడ్డారు.
[1]ఈ తప్పుడు మతాల బోధనలను తెలుసుకోవడానికి, దయచేసి Shepherds Global Classroom కోర్సు, "ఈ లోకంలోని విశ్వాస సంప్రదాయాలు" ను అధ్యయనం చేయండి.
యేసు ప్రేమించినట్లుగా మన పొరుగువారిని ప్రేమించడం
యేసు బోధిస్తుండగా, ఆయన సుంకరులను పాపులను దగ్గరకు తీసుకున్నాడు. యేసు వీరికి బోధించడమే కాదుగాని వారితో కలిసి భుజించాడు. యేసు పాపులతో తినడం చూసిన పరిసయ్యులు, ఆయన్ని విమర్శించారు. యేసు మూడు కథలతో సమాధానం చెప్పాడు. మీరు ఈ కథలు చదివినప్పుడు, నేపథ్యంలో రెండు ముఖ్య విషయాలు గ్రహించాలి.
1. యేసు కాలంలో, ఒక వ్యక్తితో కలిసి తినడం అంటే సంబంధం ఏర్పాటు చేసుకున్నట్టు.[1] యేసు పాపులతో తిన్నప్పుడు, ఆయన వారితో కలిసిపోయాడని అర్థం. ప్రజలు ఆయన దగ్గరకు వచ్చేవరకు దేవుడు వేచియుండడు; బదులుగా, నశించినవారి కొరకు దేవుడే వెదకుతాడని యేసు చూపించాడు.
2. యేసు కాలంలో యూదులు, నీతిమంతులు పాపులతో సాంగత్యం చేయకూడదని భావించారు. మెస్సీయ వచ్చినప్పుడు, ఆయన దుష్టులతో సాంగత్యం చేయక, కేవలం నీతిమంతులతోనే భుజిస్తాడని రబ్బీలు బోధించారు.
► లూకా 15:1-32 చదవండి.
ఇది మూడు భాగాలుగల ఒక పెద్ద ఉపమానం: తప్పిపోయిన గొర్రె, పోయిన నాణెం, తప్పిపోయిన కుమారుడు. ప్రతి సందర్భంలో, తప్పిపోయిన దానిని కనుగొన్న వ్యక్తి ఆనందమే ప్రధాన విషయం. పాపులు మారుమనసు పొందినప్పుడు పరలోకంలో ఆనందముంటుందని యేసు చూపించాడు.
[2]రబ్బీలకు సుప్రసిద్ధ సామెత ఉంది: “దేవుని యెదుట పాపి నశించినప్పుడు పరలోకంలో ఆనందం ఉంటుంది.” యేసు దీనిని మార్చి చెప్పాడు: “మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.” యేసు మరియు ఇతర రబ్బీల మధ్య ఏంటి వ్యత్యాసం? ప్రేమ. ప్రేమగల హృదయంతో పరిచర్య చేయడమంటే ఏంటో యేసు చూపించాడు.
మనం ప్రేమలేకుండా పరిచర్య చేసినప్పుడు, హోదా, స్థాయి ప్రజల కంటే ముఖ్యమైపోతాయి. అయితే, ప్రేమగల హృదయంతో పరిచర్య చేసినప్పుడు, నశించినవారి కోసం మన హోదాను త్యాగం చేస్తాం. ప్రేమను పొందాల్సిన అవసరతలో ఉన్నవారిపై ప్రేమను చూపడానికి, యేసు మతాధికారుల విమర్శలు కూడా అనుభవించడానికి ఇష్టపడ్డాడు.
► “మీరు తప్పిపోయిన కుమారుని ప్రేమిస్తారా?” అని మనం అడిగితే, “ప్రేమిస్తాం” అని అందరు చెప్తారు. మనకు సరైన సమాధానం తెలుసు! బదులుగా, “నా మార్గంలో నేను ఎదుర్కొన్న తప్పిపోయిన కుమారుడు ఎవరు? ఆ వ్యక్తిని నేనెలా ప్రేమించాను?” అని అడగండి.
బాధను అనుభవించే వారిపై కనికరం చూపడం ద్వారా యేసు ప్రేమ చూపించాడు
సువార్తలు చదివినప్పుడు, ఇతర మతాధికారుల నుండి పారిపోయినవారు యేసు యొద్దకు పరిగెత్తుకురావడం గమనించారా? పాపులు యేసు కోసం ఎందుకు వెదికారు?
యేసు వారి పాపాలు పట్టించుకోలేదని కాదు; ఆయన పరిసయ్యుల నీతి కంటే అధిక నీతి ఆశించాడు (మత్తయి 5:20). యేసు కనికరంగలవాడు గనుక పాపులు ఆయన యొద్దకు పరిగెత్తుకొచ్చారు. ఆయన పాపాన్ని మినహాయించలేదు, పాప బంధకాల్లో ఉన్నవారిపై కనికరపడ్డాడు.
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో మాట్లాడిన యేసు మాటల్లో దీన్ని మనం చూడొచ్చు. ఆమెను నిందించువారు వెళ్లిపోయిన తర్వాత, యేసు “నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను” (యోహాను 8:11). యేసు పాపానికి మినహాయింపు ఇవ్వలేదు; పాప బంధకాల్లో నుండి ఆమె విడిపించబడాలని కోరాడు. ఆమెను శిక్షించకుండా కనికరించాడు.
లూకా సువార్త యేసు కనికరం పట్ల శ్రద్ధ చూపుతుంది. లూకా ఇతర మతాధికారులు త్రుణీకరించిన, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య కథ చెబుతాడు. చూస్తున్న వారు ఆశ్చర్యపడే విధంగా, పాపి ఇంటిలో అతిథిగా ఉంటానని యేసు చెప్పాడు (లూకా 19:7).
► లూకా 5:12-16 చదవండి.
లూకా ఈ స్వస్థత గురించి నివేదిస్తూ, జనసమూహానికి ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇచ్చాడు. యేసు చేయి చాపి, వానిని ముట్టాడు. ప్రాచీన లోకంలో ఎవ్వరు కుష్ఠురోగిని తాకలేదు! అంటువ్యాధి గనుక వైద్యపరంగా ఇది ప్రమాదకరం. ఒక యూదునికి, ఆచారపరంగా ఇది అపవిత్రతకు కారణం.
[3]యేసు ఎందుకు ఈ కుష్ఠురోగిని ముట్టాడు? ఆయన కనికరపడ్డాడు. “ఆయన కనికర పడి, చెయ్యిచాపి వానిని ముట్టి” (మార్కు 1:41). ఈ కుష్ఠురోగికి భౌతిక స్వస్థత అవసరం, కాని భావోద్వేగ స్వస్థత కూడా అవసరం. కుష్ఠురోగులు ఇతరులకు దూరంగా ఉండాలి. కుష్ఠురోగం వచ్చిన తర్వాత, ఇతడు మరొక మానవుని స్పర్శ అనుభవించలేడు. ఈ కుష్ఠురోగిని ముట్టకుండానే యేసు ఇతనిని స్వస్థపరచగలడు, కాని కుష్ఠురోగికి మరొకరి స్పర్శ అవసరమని ఆయనకు తెలుసు. యేసు కనికరపడ్డాడు.
మనం యేసువలే పరిచర్య చేయాలంటే, యేసువంటి కనికర హృదయం కావాలి. పాపులు యేసు కళ్లలోకి చూసినప్పుడు, కనికరం చూశారు. పాపులు మన కళ్లలోకి చూసినప్పుడు, ఏం చూస్తారు?
యేసు అవసరతలో ఉన్నవారికి సేవ చేస్తూ ప్రేమ చూపించాడు.
“పేదవారిని చూస్తే జాలేస్తుంది” అని చెప్పడం సులభం; వారి అవసరాలు తీర్చడం చాలా కష్టం. యేసు తన చుట్టూనున్న ప్రజలకు సేవ చేస్తూ ప్రేమ చూపించాడు. యేసు పరిచర్య అంతా సేవే. యేసు దాసుని స్వరూపం తీసుకుని, తననుతాను రిక్తునిగా చేసుకున్నాడని పౌలు రాశాడు (ఫిలిప్పీయులకు 2:7). “మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనని” (మార్కు 10:45) యేసు తన శిష్యులకు చెప్పాడు.
యేసు అద్భుతాలు ఇతరులకు తన సేవను కనుపరచాయి. అద్భుతాలు ఆయన మెస్సీయత్వ పరిచర్యకు సంకేతాలు, కాని మానవుని అవసరాలు తీర్చే సాధనాలు. కొన్నిసార్లు అద్భుతాలు కేవలం కొద్దిమందికి మాత్రమే చేయబడ్డాయి. కొన్నిసార్లు అవి అధికారం లేక ప్రభావం లేని ప్రజలకు ప్రయోజనం కలిగించాయి. కొన్నిసార్లు ఆయన అద్భుతాలు (విశ్రాంతి దినమున) ఆయనకు మరింత తిరస్కరణ కొనితెచ్చాయి.
యేసు అధికారుల అనుగ్రహం పొందాలని అద్భుతకార్యాలు చేయలేదు; అవసరతలో ఉన్నవారికి సహాయం చేయాలని చేశాడు. యేసు అద్భుతాలు చేయుటకు తిరస్కరించిన రెండు సందర్భాలు లేఖనాలు జ్ఞాపకం చేస్తాయి. “ఆకాశమునుండి యొక సూచకక్రియను చూపుమని” (మార్కు 8:11) పరిసయ్యులు ఆయనతో వాదించారు. యేసు వారికి సూచన ఇవ్వలేదు. యేసు విచారణలో, ఆయన చేయు సూచక క్రియ చూడాలని హేరోదు ఆశించాడు (లూకా 23:8). యేసు హేరోదుకు ప్రతిస్పందించడానికి కూడా ఇష్టపడలేదు. సందేహంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి లేక వాళ్లు కోరినప్పుడు అద్భుతాలు చేయలేదు.
యేసు హేరోదు అంతిప కోసం అద్భుతం చేయడానికి నిరాకరించినప్పటికీ, ఆయనకు తిరిగి ఏమి చెల్లించలేని జాలరి అత్తను, గ్రుడ్డి బిక్షగాడిని, దయ్యాలు పట్టినవారిని బాగుచేశాడు. ఆయనను విడిచిపెట్టి కృతజ్ఞతలేమి చూపించే 5,000మందికి ఆహారం పెట్టాడు, ఆయనను బంధించడానికి వచ్చే ప్రధాన యాజకుని దాసుని బాగుచేశాడు. యేసు తన అద్భుతాలు ద్వారా అవసరతలో ఉన్నవారికి సేవచేశాడు.
పాస్టర్లు మరియు సంఘ నాయకులుగా, మనకు సహాయం చేసేవారికి సహాయం చేయాలనే నిర్ణయాన్ని సమర్థించుకోవడం సులభం. మనం బీదలతో కాకుండా సంపన్నులతో ఎక్కువ సమయం గడిపినప్పుడు, బహుశ మనమిలా చెబుతాం, “వ్యాపారవేత్తలు సంఘానికి సహాయం చేయగలరు.” ఒక ప్రాభల్యం కలిగిన అధికారిని కలవాలని ఒక విధవరాలి యొద్దకు వెళ్ళటం మానేస్తే, “ఆయన ప్రాభల్యం కలిగిన అధికారి గనుక దేవుని పనికి సహాయం చేస్తాడు” అని మనం సమర్థించుకోవచ్చు. యేసు ఎప్పుడు ఇలా చేయలేదు. మనం యేసువలే పరిచర్య చేయాలంటే, యేసువలే దాసునిగా ఉండాలి. ఆయనవలే, పరిచారం చేయించుకోవడం కాదు, పరిచారం చేయాలి (మత్తయి 20:28). “గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము” (2 కొరింథీయులకు 4:5) అని పౌలు రాశాడు.
కొందరు పాస్టర్లు “నాకు మంచి విద్య ఉంది. నేను నా సంఘ విశ్వాసియైన రైతుకు సేవకుడ్ని కాదు!” అని భావిస్తారు. పౌలు ఎప్పుడు ఇలా అనుకోలేదు. పౌలుకు శ్రేష్ఠమైన విద్య ఉంది, కాని యేసును బట్టి అతడు కొరింథీయులకు దాసుడయ్యాడు. ఆయన “నా విద్య చూడు; నేను యూదుల సాహిత్యంలో, గ్రీకు తత్వశాస్త్రంలో, క్రైస్తవ వేదాంతంలో శిక్షణ పొందాను. నేను సన్హెడ్రిన్ లో(మహాసభ), గ్రీకు అరెయోపగులో, రోమా సినేట్ లో మాట్లాడగలను” అని చెప్పి ఉండవచ్చు. కాని అతను “నా యజమానుడైన యేసు నిమిత్తం నేను కొరింథులో విద్యావంతుడుకాని వాని దాసుడను” అని చెప్పాడు.
మనం యేసువలే పరిచర్య చేయాలంటే, దాసునివలే జీవించే విధేయత మనకు కావాలి. దాసులముగా, మన జీవన శైలి గవర్నర్ వంటి ఘనమైన జీవనశైలి కాదు. మనం యేసువలే ప్రేమించాలనుకుంటే, మనం విధేయతగల దాసులుగా ఉండాలి.
యేసు తన శత్రులపై దయ చూపుతూ ప్రేమ చూపించాడు
► మత్తయి 5:43-48 చదవండి.
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలని యేసు తనను వెంబడించేవారికి బోధించాడు, అంటే మీ పరలోకపు తండ్రి ప్రేమించినట్లుగా ప్రేమించాలని అర్థం. అంటే, “మీ శత్రువులను ప్రేమించుడి” మరియు “మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి” అని అర్థం. మీరు ఆ విధమైన ప్రేమ చూపినప్పుడు, “మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై” యున్నారని లోకం తెలుసుకుంటుంది.
యేసు కొండమీద ప్రసంగం ప్రకటించడానికి సుమారు 200 సంవత్సరాల క్రితం, యూదా శాస్త్రి సిరాక్ అనే బోధనల సంకలనం చేశాడు. సహాయానికి అనర్హులైన వారితో ఎలా వ్యవహరించాలో అతడు తన అనుచరులకు నేర్పిన విధానం వినండి:[4]
మీరు మంచి పని చేసినప్పుడు, దాని నుండి ఎవరు ప్రయోజనం పొందుతున్నారో తెలుసుకోండి; అప్పుడు మీరు చేస్తుంది వృథా కాదు.
దీనులకు మంచి చేయండి, భక్తిలేని వారికి ఏం ఇవ్వద్దు.
వారికి ఆహారం పెట్టొద్దు, లేక వారు మీ కనికరాన్ని మీకు విరోధంగా ఉపయోగిస్తారు. అలాంటి వారికి మీరు చేసే ప్రతి మంచి, రెండింతల సమస్యను తెచ్చిపెడుతుంది.
దేవుడు పాపులను ద్వేషిస్తాడు, వారిని శిక్షిస్తాడు.
మంచివాళ్లకి ఇవ్వండి, కాని పాపులకు సహాయం చేయొద్దు.
యేసు కాలంలో యూదులు బెన్ సిరాను లేఖనంగా పరిగణించేవారు. “నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా” (మత్తయి 5:43) అని యేసు చెప్పినప్పుడు దీనినే సూచిస్తున్నాడు. సికార్ “నీతిమంతులకు మాత్రమే మేలు చేయండి. దుష్టుల పై మంచి పనులు వృథా చేయొద్దు” అని చెబుతుంది.
► ఇప్పుడు మత్తయి 5:43-48 మళ్లీ చదవండి. యేసు బోధ ఆయన ప్రేక్షకులకు ఎందుకు ఆశ్చర్యం కలిగించిందో చూశారా?
పాత నిబంధనలో, తమ శత్రువులను ప్రేమించాలని దేవుడు తన ప్రజలకు బోధించాడు. ఇది క్రొత్తది కాదు. పాత నిబంధన సబ్జెక్టులో కాలేజి విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయుడు ఒక ప్రశ్న వేశాడు.
మీ పొరుగువాడు మీ సంఘానికి శత్రువు. మీరు వాళ్ళని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు మిమ్మల్ని శపిస్తాడు. మిమ్మల్ని మోసం చేస్తాడు, మీ పశువులు దొంగిలిస్తాడు. ఒకరోజు తుఫానులో, మీ పొరుగువాని ఎద్దు విడిపించుకుని పారిపోవడం మీరు చూశారు. మీ పొరుగువారి యెడల మీ బాధ్యత ఎలా ఉంటుంది?
1. కొరడా తీసుకుని ఆవును మరింత దూరం తోలతారా?
ఇది సరైన సమాధానం కాదని విద్యార్థులకు తెలుసు!
2. దానిని పట్టించుకోకుండా, “అది నా సమస్య కాదు” అంటారా?
చాలామంది విద్యార్థులు ఈ ఎంపిక చేసుకుంటారు. “అది పొరుగువాని ఆవు, మాది కాదు. నా పని నేను చేసుకుంటా. పైగా పొరుగువానికి నేనంటే ఇష్టం లేదు; అతనికి నా సహాయం నచ్చదు” అని చెబుతారు.
3. నిర్గమకాండము 23:4కు విధేయత చూపుతారా? “నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను.”
పాత నిబంధనలో కూడా, దేవుని ప్రజలు తమ శత్రువులను ప్రేమించవలసి ఉంది. యేసు కాలంలో, ప్రజలు నిర్గమకాండము 23 కంటే సిరాక్ ఎక్కువగా ప్రస్తావించారు. తమ పొరుగువారిని ప్రేమించి, శత్రువులను ద్వేషించుమని చెప్పే బోధ వారు ఇష్టపడ్డారు. “మీ పరలోకపు తండ్రి మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు గనుక మీరు మీ శత్రువులను ప్రేమించాలని” యేసు చెప్పాడు.
నిజ జీవితంలో ఇదెలా ఉంటుంది? మీ పరిచర్యలో ఈ దృశ్యాన్ని ఆలోచించుకోండి:
మీ అనేకమైన నమ్మకాలు పంచుకునేవారు మిమ్మల్ని బహిరంగంగా వ్యతిరేకిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టె ప్రశ్నలడుగుతారు; మీరు అబద్ధ బోధకులని మీ సభ్యులకు చెబుతారు; మీ అనుచరులతో మీకు భేదం కలిగించే పని చేస్తారేమోనని మీకోసం ఎదురుచూస్తారు. అలాటివారిని మీరెలా చూస్తారు?
1. వాళ్లని పంపించేసి, మళ్లీ రావద్దని చెబుతారా?
2. వారు మీతో ఉన్నట్లుగా మీరు వారితో ఉంటారా?
3. వాళ్ల తప్పుల విషయంలో యదార్థంగా ఉండి, ప్రేమతో స్పందిస్తారా?
యేసును వ్యతిరేకించాలని పరిసయ్యులు అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. వాళ్ల తప్పుల విషయంలో ఆయన యదార్థంగా ఉన్నాడు; వాళ్లకి సత్యం బోధించాడు; కాని వాళ్లతో ప్రేమగా వ్యవహరించాడు.
మనం యేసువలే పరిచర్య చేయాలంటే, మన శత్రువులను ప్రేమించాలి. ఇది యేసు ఎక్కువగా కోరుకునే బోధ. మనల్ని మోసగించేవారికి, మన సందేశం తిరస్కరించేవారికి, మనల్ని హింసించేవారికి, యేసు ప్రేమ చూపించాలి.
[1]సామెతలు.గ్రంథంలో ఇది వివరించబడింది. జ్ఞానం తన బల్ల యొద్ద భుజించుటకు “జ్ఞానంలేనివారిని” పిలుస్తుంది (సామెతలు 9:1-6). జ్ఞానంతో సంబంధం ద్వార, జ్ఞానంలేనివాడు జ్ఞానవంతుడౌతాడు.
దేవునిని, పొరుగువారిని ప్రేమించడం గురించి రాయడం చాలా సులభం. ఆ ప్రేమ అనుదిన జీవితంలో చూపడం చాలా కష్టం. మన జీవితాల్లో యేసు గుణగణాలు ప్రతిబింబించినప్పుడే, మన లోకంలో ఆయనను పంచుకోవడానికి సిద్ధంగా ఉంటాం.
యేసు స్వభావం కలిగియుండటం మనకు సాధ్యమా? ఆయనవలే ఆలోచించడానికి దేవుడు తన ప్రజలకు శక్తినిస్తాడని లేఖనం సెలవిస్తుంది. దేవుడు ఆశించినట్లుగా ఉండడానికి, ఆయన ఆశించినట్లుగా జీవించడానికి దేవుడు తన ప్రజలకు నూతన ఆత్మ ఇస్తాడు (యెహెజ్కేలు 36:26-27). దేవుడు తన కుమారుని స్వభావం మనలో వృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు.
అనుదిన సేవలో విశ్వసనీయత గురించి ఆస్వాల్డ్ ఛాంబర్స్ ఏం చెప్పాడో వినండి:
మీకు దేవుని దర్శనం లేనప్పుడు, మీ జీవితంలో ఉత్సాహం లేనప్పుడు, మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించనప్పుడు, మీరాయన పట్ల చూపే భక్తిలో మరో అడుగు ముందుకు వేయడానికి సర్వశక్తిగల దేవుని కృప అవసరం...సువార్త ప్రకటించడానికి కావలసిన కృప కంటే మరెక్కువ దేవుని కృప చాలా అవసరం.
ఇతరులు ఆ పని చూడనప్పుడు కూడా నిలకడగా ఉండడమే దేవునికి ఆయన ప్రజలకు నిజంగా సాక్ష్యమిచ్చే విషయం. దేవుని వైపు చూడడమే జయ జీవితం గడపడానికి ఏకైక మార్గం. పునరుత్థానుడైన క్రీస్తుని చూడడానికి సహాయం చేయమని దేవుని వేడుకోవాలి…[1]
పరిచర్యలో ఈ విశ్వాస్యతను మనం ఎలా కాపాడుకోగలం? వారం వెంబడి వారం, సంవత్సరాల తరబడి మనం దేవునిని, పొరుగువారిని ఎలా ప్రేమించగలం? మన అనుదిన జీవితంలో యేసు గుణగణాలు పెంపొందించుకోవాలి. దీనికి మనం క్రీస్తు మనసు కలిగియుండాలి.
క్రీస్తు మనసు వివరణ
► ఫిలిప్పీయులకు 2:1-16 చదవండి.
ఫిలిప్పీ సంఘానికి పౌలు ఇచ్చిన ఉపదేశం, యేసు స్వభావం కలిగియుండడానికి శక్తివంతమైన మార్గదర్శిని. వ్యక్తిగత సంఘర్షణలతో నిండిన సంఘానికి, పౌలు “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” (ఫిలిప్పీయులకు 2:3-4) అని రాశాడు.
వారు దీనిని ఎలా సాధిస్తారు? “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి” (ఫిలిప్పీయులకు 2:5) అనే పౌలు మాటలకు విధేయత చూపితే సాధిస్తారు.
క్రైస్తవ జీవితానికి తెలియని నాలుగు లక్షణాలు పౌలు ఇచ్చాడు.[2] ఈ లక్షణాలు క్రైస్తవ సాక్ష్యాన్ని, క్రైస్తవ నాయకుని ప్రభావాన్ని నాశనం చేస్తాయి. పౌలు చెప్పాడు:
(1) కక్ష చేత ఏమియు చేయకూడదు (ఫిలిప్పీయులకు 2:3).
స్వార్థపూరితమైన ఆలోచన, “ఇందులో నాకేముంది? నాకేంటి ప్రయోజనం?” అని అడుగుతుంది. సిలువకు వెళ్ళడానికి ముందు లేక కుష్ఠురోగిని బాగుచేయడానికి ముందు, “దీని వల్ల నాకేంటి ప్రయోజనం?” అని యేసు అడగడం ఊహించగలరా? ఊహించలేం!
మనం “క్రీస్తుయేసునకు కలిగిన మనసు కలిగియుంటే-క్రీస్తువలే ఆలోచిస్తే- కక్షచేత ఏది చేయము” అని పౌలు చెబుతున్నాడు. మన వైఖరి దాసుని వైఖరిలా ఉంటుంది. “నేనెలా పరిచారం చేయగలను?” అని అడుగుతాం తప్ప “నేనెలా పరిచారం చేయించుకోగలను?” అని అడగము.
అతిశయం, “ఇది నన్నెలా చూపిస్తుంది? ప్రజలు ఆకర్షితులౌతారా?” అని అడుగుతుంది. మళ్ళీ, యేసు బావి యొద్ద సమరయ స్త్రీని దర్శించడానికి ముందు “ప్రజలు ఆకర్షితులవుతారా?” అని అడగడం మీరు ఊహించగలరా? ఊహించలేరు!
మనం “క్రీస్తుయేసునకు కలిగిన మనసు కలిగియుంటే-క్రీస్తువలే ఆలోచిస్తే- వృథాతిశయంతో ఏది చేయము” అని పౌలు చెబుతున్నాడు. మనం క్రీస్తును చూపించే అవకాశాల కొరకు చూద్దాం కాని హోదాను సంపాదించుకునే అవకాశాలు కోసం కాదు.
సణుగుడు “నేను దీనికి మించి అర్హుడను!” అని చెబుతుంది. యేసు “నేను శిష్యుల పాదాలు కడగనక్కర్లేదు. నేను బోధకుడను. నేను దీనికి మించి అర్హుడను” అని చెప్పడం ఊహించగలరా? ఊహించలేరు!
మనం “క్రీస్తుయేసునకు కలిగిన మనసు కలిగివుంటే-క్రీస్తువలే ఆలోచిస్తే- క్లిష్ట పరిస్థితులలో కూడా సణుగుకొనక పరిచర్య చేస్తాం” అని పౌలు చెబుతున్నాడు. మనం దేనికీ అర్హులు కాదని గ్రహిస్తాం. మనకున్న సమస్తం దేవుని బహుమానంగా గుర్తించినప్పుడు, పరిచర్యలో వచ్చే సవాళ్ల విషయంలో మన వైఖరి మారుతుంది.
Helen Roseveare (హెలెన్ రోజ్వేరే) ఇరవయ్యవ శతాబ్దంలో ఒక గొప్ప మిషనరీ. ఆమె కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన వైద్యురాలు. జైరెలో మిషనరీ డాక్టర్ గా పనిచేస్తున్నప్పుడు, ఆసుపత్రిని నిర్మించాలనుకుంది. అక్కడ సామాగ్రి లేనందున, మొదటి మెట్టు ఇటుకలు తయారుచేయుట. Dr. Roseveare (డా. రోజ్‌వేరే) ఒక బట్టీలో ఇటుకలను తయారుచేసే ఆఫ్రికన్ కార్మికులతో కలిసి పనిచేసింది.
ఇటుకల పనిచేస్తున్నప్పుడు, ఆమె మృదువైన చేతులు రక్తస్రావమయ్యాయి. “దేవా, నేను ఇటుకలు తయారు చేయడానికి కాదు, శస్త్రచికిత్స నిపుణురాలుగా ఆఫ్రికాకు వచ్చాను! ఖచ్చితంగా ఈ అల్పమైన పని చేయడానికి మిగిలిన వాళ్లు ఉన్నారు” అని సణుగుకుంటూ ఉండేది.
కొన్ని వారాల తర్వాత, ఒక ఆఫ్రికా కార్మికుడు ఆమెతో, "డాక్టరుగారు, మీరు శస్త్రచికిత్స గదిలో ఉన్నప్పుడు, డాక్టర్ గా మమ్మల్ని భయపెడతారు. కాని మాతో పాటు ఇటుకులు తయారుచేస్తున్నప్పుడు, మావలే మీ చేతులు రక్తం చిందుతున్నప్పుడు, మీరు మా సహోదరిగా, మేం మిమ్మల్ని ప్రేమిస్తాం” అని చెప్పాడు. Dr. Roseveare (డా. రోజ్‌వేరే) వెంటనే, “దేవుడు నన్ను ఆఫ్రికా దేశానికి శస్త్రచికిత్స నిపుణురాలుగా మాత్రమే పంపలేదు; క్రీస్తు ప్రేమను చూపించడానికి కూడా నన్ను పంపాడు” అని గ్రహించింది.
(4) సంశయాలను మాని, సమస్త కార్యాలను చేయుడి (ఫిలిప్పీయులకు 2:14-15).
సంశయం, “అవును, ప్రభువా, కాని....నేను విధేయత చూపడానికి ఇష్టపడుతున్నాను, కాని....” అని అంటుంది. మళ్ళీ, యేసు ఇలా చెప్పడం మీరు ఊహించగలరా: “తండ్రీ, నేను నిన్ను సేవిస్తాను; ఇది ఎందుకు కష్టంగా ఉంచారు?” యేసు తండ్రితో తన సందేహాన్ని వెల్లడి చేయడం మనం ఊహించలేం.
పౌలు, మనకు క్రీస్తుయేసునకు కలిగిన మనసు ఉంటె- మనం క్రీస్తువలే ఆలోచిస్తే- వాదించి, సులభ మార్గం ఎన్నుకోము” అని చెబుతున్నాడు. సులభమైన మార్గం కోసం అడగడం ద్వారా మన జీవితాల్లో దేవుని చిత్తంతో రాజీపడం. “సరే ప్రభువా” అని దేవునికి మనం సమాధానం ఇస్తాం. క్రీస్తుయేసునకు కలిగిన మనసు కలిగియుంటాం.
ఫిలిప్పీయులు క్రీస్తుయేసునకు కలిగిన మనసు కలిగియుండాలని పౌలు పిలుపునిచ్చాడు గనుక, అది సాధ్యమని అతడు నమ్మాడు. యేసు మాదిరిని సూచించే వినయం, విధేయత వారు కలిగియుంటారని అతనికి తెలుసు. ఈ క్రీస్తు మనసు మనం ఎలా పొందుకుంటాం?
మన మనసులు లేఖనాల ద్వారా రూపాంతరం పొందుతాయి
మునుపు ఈ పాఠంలో, లేఖనం దేవుని చిత్తం గురించి ఎలా బోధిస్తుందో మనం చూశాం. యేసుకు దేవుని వాక్యం తెలుసు. అపొస్తలులకు దేవుని వాక్యం తెలుసు. సంఘ చరిత్రలోని ప్రతి ఉజ్జీవ కార్యక్రమం దేవుని వాక్య అధ్యయనంతో మొదలైంది.
ఫిలిప్పీ విశ్వాసులు జీవవాక్యం చేత పట్టుకోవాలని పౌలు సవాలు చేశాడు (ఫిలిప్పీయులకు 2:16). సువార్తలో వారి నమ్మకం, వారి సమర్పణ లోకంలో వారిని వెలుగుగా చేస్తుంది.
దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారానే మనం యేసువలే ఆలోచించడం మొదలుపెడతాం, క్రీస్తు మనసు కలిగియుంటాం. అంటే లేఖనాలు అర్థం చేసుకోవడానికి మీరు హెబ్రీ, గ్రీకు భాషలు నేర్చుకోవాలని కాదు; మీకు పెద్ద పెద్ద బైబిల్ వ్యాఖ్యానాలు ఉండాలని కాదు; దేవుని వాక్యంలో ఎక్కువ సమయం గడపాలి. అది మీ అనుదిన జీవితంలో భాగం కావాలి.
క్రైస్తవులమైన మనకు, దేవుని వాక్యం అనుదిన ఆహారం. అది కేవలం బాధ్యత కాక ఆనందంగా ఉండాలి. “నువ్వు ఈ రోజు తినాలి! తినకపోతే, అనారోగ్యానికి గురౌతావు” అని ఆరోగ్యవంతునికి ఎవరు చెప్పక్కర్లేదు. మీరు చేయవలసిన పని, మంచి ఆహారం అందుబాటులో ఉంచడం, ఆరోగ్యవంతుడైన వ్యక్తి భుజించటం! దేవుని వాక్యం ఆకలిగొన్న ప్రతి క్రైస్తవునికి ఆహారం.
మనం దేవుని వాక్యం భుజిస్తుండగా, మన మనసులు క్రీస్తు మనసువలే మారతాయి. చాలామంది క్రైస్తవులు తిరిగి జన్మించారు, కాని అవిశ్వాసులుగానే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ల మనసులు క్రీస్తు మనసువలే మారలేదు. ఎందుకు?
నూతన విశ్వాసులుగా, క్రీస్తువలే ఆలోచించునట్లుగా మన మనసులు మార్చుకోవాలి. మీరు క్రైస్తవులుగా మారక మునుపు, మీ అవసరాలు గురించి మొదటిగా ఆలోచించేవారు. బీదవాని చూసి, “నాకు డబ్బు కావాలి. నేను అతనికి ఇవ్వలేను” అని ఆలోచించి ఉంటారు. క్రైస్తవునిగా, మీరు దేవుని వాక్యంలో “బీదలకిచ్చువానికి లేమి కలుగదు” (సామెతలు 28:27) అనే మాటలు చదువుతారు. యేసు మాటలు వింటారు, “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను” (లూకా 6:38). క్రీస్తు డబ్బు గురించి అలోచించినట్లుగా మీరు ఆలోచించడం మొదలుపెడతారు. దేవుని వాక్యం ద్వారా మీరు క్రీస్తు మనసు పొందుకుంటారు.
మనం క్రైస్తవులము కాకమునుపు, మనలను బాధించేవాళ్ళని బాధించాం. మన యెడల కఠినంగా ఉన్నవారిని, కోపంతో కొట్టి ఉంటాం. కాని క్రైస్తవులుగా, “మీరు జాలిగల మనస్సును…ధరించుకొనుడి” (కొలొస్సయులకు 3:12) అని చదువుతాం. “ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి” (1 పేతురు 3:9) అని చదువుతాం. క్రీస్తు తనను బాధించిన వారి పట్ల ఎలా స్పందించాడో అదేవిధంగా స్పందించడం మొదలుపెడతాం. దేవుని వాక్యం ద్వారా మనం క్రీస్తు మనసు పొందుకుంటాం.
మన మనసులు అనుదిన సమర్పణ ద్వారా రూపాంతరం పొందుతాయి
క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిసియుండుడని పౌలు ఫిలిప్పీయులకు చెప్పాడు. ఈ మనసు గురించి వివరించాడు, వాళ్ల జీవితాల్లో అదెలా కలుగుతుందో చెప్పాడు. వాళ్లు విధేయతతో తమ సొంత రక్షణ కొనసాగించాలి- తమ రక్షణ సంపాదించుకొవాడానికి కాదుగాని-దేవుడు కార్యసిద్ది కలుగజేస్తున్నాడు గనుక, “తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే” (ఫిలిప్పీయులకు 2:12-13). వాళ్లు దేవునికి అప్పగించుకొనుచుండగా, ఆయన వారికి దైవికంగా జీవించే ఆశను, (“సంకల్పం”) శక్తిని (“పని చేయుటకు”) ఇస్తాడు.
మనం సమర్పణగల జీవితం గడుపుతుండగా, యేసు జీవితం పరిచర్యలో చూసే అదే గుణలక్షణాలను పరిశుద్ధాత్ముడు మనలో పెంపొందిస్తాడు. మన ప్రయత్నాల ద్వారా క్రీస్తు మనసు మనం కనుగొనలేము; సమర్పణ ద్వారా క్రీస్తు మనసు కనుగొనగలము.
ఇది అనుదిన సమర్పణగా ఉండాలి. పౌలు మనలను పిలిచాడు: సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు (రోమా 12:1). సజీవ యాగం మృతమైనది కాదు; అది జీవించడమే కొనసాగిస్తుంది. ఒక సమర్పణలో మనం మన చిత్తాన్ని పూర్తిగా దేవుని చిత్తానికి అప్పగిస్తాం, కానీ అనుదినం మనం ఆయన చిత్తానికి లోబడుతూ కొనసాగించవలసి ఉంటుంది.
Nancy Leigh DeMoss (నాన్సీ లీ డెమోస్) సమర్పణగల జీవితం గురించి ఒక చిత్రం ఇచ్చాడు.[3] మీరు ఈ వివరాలు చదివేటప్పుడు, ఈ విషయంలో నేను అనుదిన సమర్పణతో జీవిస్తున్నానా? ఈ విషయంలో క్రీస్తు మనసు కలిగియున్నానా?” అని అడగండి.
మీ శరీర స్వభావం విమర్శనాత్మక పదాలు పలుకనుద్దేశించినప్పుడు, “ఎవనిని దూషింపక” (తీతుకు 3:2) అని ఆత్మ చెబుతాడు. సమర్పణగల హృదయం “అవును” అని చెబుతుంది.
మీ శరీర స్వభావం కష్టాలు గురించి ఫిర్యాదు చేసినప్పుడు, “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి” (1 థెస్సలొనీకయులకు 5:16-18) అని ఆత్మ చెబుతాడు. సమర్పణగల హృదయం “అవును” అని చెబుతుంది.
మీ శరీర స్వభావం, ఇబ్బంది పెడుతున్న యజమానిని ఎదిరించాలనుకున్నప్పుడు, “మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువునిమిత్తమై లోబడియుండుడి” (1 పేతురు 2:13) అని ఆత్మ చెబుతాడు. సమర్పణగల హృదయం “అవును” అని చెబుతుంది.
[4]మనం సమర్పించుకున్నప్పుడు, క్రీస్తులో నివసించిన ఆత్మ మనలో నివసిస్తాడు. మనకుండే మంచి ఉద్దేశ్యాల ద్వారా కాదు గాని ఆత్మ ద్వారా అనుదిన జీవితంలో పరిచర్యలో నిరాశలు ఎదురైనప్పుడు, సాతాను శోధించినప్పుడు క్రీస్తువలే స్పందించే శక్తి మనకు ఉంటుంది.
► శరీరసంబంధమైన కోరికలు దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్న సందర్భాన్ని పంచుకోండి. ఈ శోధన ఎదుర్కొన్నప్పుడు మీరు అనుదిన సమర్పణ విషయంలో ఎలా ఉన్నారు? మీరు మళ్ళీ దేవుని చిత్తానికి అప్పగించుకోవలసిన ప్రస్తుత శోధన ఏదైనా ఉందా? తరగతిగా, ఈ విషయాల్లో ఒకరికొకరు ప్రార్థించండి.
“పరిశుద్ధ జీవిత రహస్యం యేసును అనుకరించడంలో లేదుగాని, నా జీవితంలో యేసును కలిగివుండడంలో ఉంది.. పవిత్రీకరణ అంటే పరిశుద్ధంగా ఉండడానికి యేసు నుండి శక్తి పొందుకోవడం కాదుగాని ఆయనలో ప్రత్యక్షపరచబడిన పరిశుద్ధత నుండి పొందుకోవడం. ”
- ఓస్వాల్డ్ ఛాంబర్స్
ముగింపు: దేవుడు క్రీస్తు-వంటి ప్రేమ ద్వారా కార్యం చేస్తాడు
మనం సమస్యాత్మక లోకంలో జీవిస్తున్నాం. ఈ పాఠాలు చదువుతున్న అనేకులు, ప్రభుత్వం, అబద్ధ మతాలు లేక సాంఘిక ఒత్తిళ్లకు లోనైన సంఘ పరిస్థితుల్లో జీవిస్తున్నారు. మన శత్రువులను ప్రేమించడం ద్వారా మన లోకాన్ని మార్చగలమని ఆలోచించడం సమంజసమేనా? మన శత్రువు మనల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎలా ప్రేమించగలం?
ఒక విలేఖరి బాగ్దాద్ లో నివసిస్తున్న ఇరాక్ కి చెందిన క్రైస్తవునితో మాట్లాడాడు.[1] విలేఖరి ఈ వ్యక్తితో మాట్లాడుతుండగా, ISIS సైనికులు 40 నిమిషాల దూరంలో ఉన్నారు. “మీ సంఘం ఆరాధన కోసం సమావేశమవుతుందా?” అని విలేఖరి అడుగగా, అతడు:అవును! నిజానికి, మా సంఘంలో మరో రెండు ప్రార్థన బృందాలు మొదలుపెట్టాం-ఒకటి ఉత్తర ప్రాంతంలో హింసల గుండా వెళ్తున్న మా సోదరుల కొరకు ప్రార్థిస్తుంది, మరొకటి శత్రువుల కొరకు ప్రార్థిస్తుంది” అని చెప్పాడు.
బాగ్దాద్ లోని St. జార్జ్ సంఘ సభ్యులు తమ శత్రువుల కొరకు ప్రార్థించారు. ముస్లిం విధవరాళ్లకు ఆహార పొట్లాలు అందించారు. వారు యేసు మాదిరి అనుసరించడానికి పిలువబడ్డారని నమ్మారు గనుక తమ శత్రువులను ప్రేమించారు.
సంఘ చరిత్ర అంతటా కనిపించే సత్యాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు పని చేసే విధానం ఎల్లప్పుడు మనుష్యులు పని చేసే విధానానికి భిన్నంగా ఉంటుంది. మధ్య యుగంలో మానవుడు ముస్లింలకు వ్యతిరేకంగా సైనిక క్రూసేడ్ల ద్వారా పనిచేస్తాడు; 82 ఏళ్ల వయసులో ఇస్లాం దేశంలో తన చివరి మిషనరీ పర్యటనలో ఉండగా మరణించిన రేమండ్ లల్ ద్వారా దేవుడు పనిచేశాడు. మనిషి సైనిక బలం (ఆర్మీ) ద్వారా పనిచేస్తాడు; చైనా అంతర్భాగాల్లో సువార్త ప్రకటనకు తన జీవితాన్ని కేటాయించిన హడ్సన్ ద్వారా దేవుడు పని చేశాడు. మనిషి బలంతో పనిచేస్తాడు; దేవుడు బలహీతల ద్వారా పనిచేస్తాడు.
దేవుని మార్గం మనిషి మార్గానికి భిన్నం. కానీ తుదకు, దేవుని మార్గమే గెలుస్తుంది. క్రైస్తవులు యేసువలే ప్రేమించినప్పుడు మన లోకం నిత్యత్వంలా మారిపోతుంది. మార్పు నెమ్మదిగా బాధగా ఉంటుంది కాని పతనమైన లోకంలో దేవుడు ఆ విధంగానే పనిచేస్తాడు.
యేసువలే పరిచర్య చేయడం అంటే యేసువలే ప్రేమించాలి. ఒక వృద్ధ సువార్తికుని ఆయన పరిచర్య రహస్యం ఏమిటని అడిగారు. అతడు, “దేవుడు వారిని ఎంత ప్రేమిస్తున్నాడో ప్రజలు తెలుసుకోవడం కొరకు మీరు వారిని ఎంత ప్రేమిస్తున్నారో చూడటమే ఏకైక మార్గం” అని చెప్పాడు. ఈ సువార్తికుడు క్రీస్తు ప్రేమ మనద్వారా ప్రకాశించినప్పుడు, లోకాన్ని దేవుని యొద్దకు తీసుకెళ్లగలమని అర్థం చేసుకున్నాడు. యేసువలే ప్రేమించడమంటే ఇదే.
[1]Mindy Belz, “How Does the Church Move the World?” World Magazine, May 27, 2017
పాఠం 7 అభ్యాసాలు
ఈ పాఠంలో, యేసు ఎలా ప్రేమించాడో మనం చూశాం. మీ పొరుగువారిని ప్రేమించడంలో యేసు మాదిరిని అనుసరించే మార్గాలు కనుగొనాలని ఈ అభ్యాసం కోరుతుంది. ఈ అభ్యాసం పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టదు; కాని దానిని ఆచరించడానికి సమయం పడుతుంది! ఆచరించడంలో విఫలమవ్వద్దు. మనం యేసువలే ప్రేమించాలి.
సువార్తల నుండి, ప్రజల యెడల యేసు చూపిన ప్రేమకు మూడు ఉదాహరణలు ఇవ్వండి. మీ జీవితంలో మూడు అన్వయాలు ఇవ్వండి. యేసు మాదిరిని మీరు ఎలా అనుకరిస్తారు? ఈ అభ్యాసం మీ కోసమే; సాధ్యమైనంత నిర్దిష్టంగా ఉండండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.