(2) దేవుడు తాను పిలిచినవారిని సిద్ధపరచడంలో ఆయన సార్వభౌమాధికారాన్ని అభినందించాలి.
(3) దేవుడు తన కోసం ఎంపిక చేసుకున్న పనికి, దేవుని పిలుపుకు విధేయత చూపాలి.
(4) శోధనలు జయించడానికి యేసు అడుగుజాడల్లో నడవాలి.
ఈ పాఠం కొరకు సిద్ధపాటు
మత్తయి 1-4, లూకా 1-3, మరియు యోహాను 1 చదవండి.
పరిచర్యకు సూత్రం
దేవుడు పరిచర్యకు పిలిచిన వారిని, తాను పిలిచిన పని కొరకు సిద్ధపరుస్తాడు.
పరిచయం
ఈ కోర్సులో, యేసు నేటి దినాల్లోని పరిచర్యకు, జీవితానికి ఒక మాదిరి అనే విషయాన్ని అధ్యయనం చేస్తాం. యేసు “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని” (యోహాను 13:15) అని చెప్పాడు. భూమిపై యేసు జీవితం ఆయన్ని వెంబడించినవారికి మాదిరి.
పౌలు ఈ సూత్రం అర్థం చేసుకున్నాడు. ఫిలిప్పిలో క్రైస్తవుల మధ్య సంఘర్షణ గూర్చి విన్నప్పుడు, పౌలు యేసు మాదిరి సూచించాడు. “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి” (ఫిలిప్పీయులకు 2:5). ఈ క్రైస్తవులు యేసు మాదిరి అనుసరిస్తే, వారి విధేయత సంఘంలో సంఘర్షణను పరిష్కరిస్తుందని పౌలుకు తెలుసు.
ఆఫ్రికా పర్యటనలో, యూదుడైన ఒక జర్నలిస్టు డేవిడ్ ప్లోట్జ్, మలావి విమానాశ్రమంలో నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు. అక్కడ ఒక ఆఫ్రికా దేశపు పాస్టర్ ని కలిశాడు. ఆ పాస్టర్ ప్లోట్జ్ ని తన ఇంటికి తీసుకెళ్ళి రెండు రోజులు ఆహారం పెట్టి, యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చాడు. తరువాత డేవిడ్ ప్లోట్జ్ అతని గురించి ఇలా రాశాడు: “ఈ వ్యక్తి విశ్వసించే దేనిని నేను నమ్మనుగాని అతని విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాను. క్రీస్తు అతనిలో ఉన్నాడని, అందుకే పరదేశులను ఇంటికి తీసుకెళ్ళి ఆశ్రయమిచ్చి, ఆహారం పెట్టి, వస్త్రాలు ఇచ్చాడని భావిస్తాడు.” యేసు మాదిరిని అనుసరించడానికి దేవుడు మనల్ని పిలిచాడని ఈ ఆఫ్రికా పాస్టర్ గ్రహించాడు.
ఈ కోర్సు, యేసు జీవితం గురించి సమగ్ర అధ్యయనం కాదు, గాని నేటి పరిచర్యకు మాదిరి చూపించు యేసు జీవితంలో కొన్ని విషయాలపై దృష్టిపెడదాం. యేసు మాదిరిని అనుసరించి, మన పరిచర్య ఆ ప్రకారం ఉండేలా చూద్దాం.
ఈ మొదటి పాఠంలో, పరిచర్యకు యేసు సిద్ధపడడం అనే విషయాన్ని గూర్చి చూస్తాం. దేవుడు పరిచర్యకు పిలిచిన వారిని, ఆయన పిలిచిన పని కొరకు సిద్ధపరుస్తాడనే సూత్రాన్నిఇది వివరిస్తుంది.
దేవుడు తన సేవకుని కుటుంబ నేపథ్యాన్ని సిద్ధపరిచాడు
► మీ కుటుంబ నేపథ్యం, భూలోక జీవితం గురించి ఆలోచించండి. మిమ్మల్ని పరిచర్య కోసం సిద్ధపరచటానికి దేవుడు ఏ విధంగా మీ నేపథ్యం ఉపయోగించాడు?
సార్వభౌముడైన దేవుడు యేసు పుట్టుకకు శతాబ్దాల క్రితమే ఆయన సేవకుని కొరకు మార్గం సిద్ధపరచాడని సువార్తల్లోని వంశావళి చూపిస్తుంది. యేసు పుట్టుకకు చాలాకాలం క్రితం, ఆయన రాకకై దేవుడు మార్గం సిద్ధపరిచాడు.
“యేసు ఎవరు?” అనే ప్రశ్నకు వంశావళి సమాధానం. వంశావళి అబ్రాహాము, దావీదు గొప్పతనాన్ని చూపిస్తుంది. దేవుడు అబ్రాహాముతో, “భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని” (ఆదికాండము 12:3) వాగ్దానం చేశాడు గనుక యేసు వంశావళిలో అబ్రాహాము ముఖ్యుడు. ఈ వాగ్దానం నజరేయుడైన యేసులో నెరవేరింది.
దావీదు సింహాసనం నిత్యం స్థిరంగా ఉంటుందని (2 సమూయేలు 7:16) దేవుడు వాగ్దానం చేసినందున వంశావళిలో దావీదు ముఖ్యుడు. యేసు జన్మించినప్పుడు, దావీదు సింహాసం అధిరోహించి 500 సంవత్సరాలు దాటిపోయింది. యేసు దావీదు వాగ్దాన నెరవేర్పుగా ఉన్నాడని మత్తయి మరియు లూకా తెలియజేస్తారు.
యేసు దావీదు కుమారుడు (మత్తయి 1:1-17)
గ్రీకు క్రొత్త నిబంధనలో, మత్తయి సువార్తలోని మొదటి రెండు పదాలు మొదటిగా మత్తయి సువార్తను చదివిన వారికి ఆదికాండాన్ని జ్ఞాపకం చేసి ఉంటాయి (ఆదికాండము 2:4, ఆదికాండము 5:1). ఆదికాండము సృష్టిపై దేవుని సార్వభౌమాధికారాన్ని చూపించినట్లే, మత్తయి చరిత్రపై దేవుని సార్వభౌమాధికారాన్ని చూపిస్తాడు. ఇశ్రాయేలు చరిత్రంతా మెస్సీయ పుట్టుకపై నడిచిందని మత్తయి వంశావళి చూపిస్తుంది.
మత్తయి వంశావళి, ఒక్కో గుంపులో 14 పేర్లతో మూడు గుంపులను గురించి వివరిస్తుంది. ఇది సాధారణంగా యూదులు గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. అనేకమంది పేర్ల జాబితాను గుర్తుంచుకునేందుకు క్రమమైన గుంపులు విద్యార్ధులకు సహాయపడతాయి. ఈ జాబితాలో అబ్రాహాముకు, యోసేపుకు మధ్యనున్న ప్రతి పితరుని పేరు చేర్చలేదని మత్తయి పాఠకులకు తెలుసు. మత్తయి పదే పదే ఉపయోగించిన “కనెను” అను పదం ప్రతి పితరుడిని సూచిస్తుంది. యూదుల వంశావళిలో సాధారణంగా కొన్ని తరాలను విడిచిపెడతారు. యేసు వంశావళిలో మత్తయి ముఖ్యమైన వారి పేర్లపై దృష్టిపెట్టి, మిగిలిన పేర్లను విడిచిపెట్టాడు.
మత్తయి కొన్ని తరాలు విడిచిపెట్టడం వలన అతడు చేర్చిన పేర్లు మరిముఖ్యంగా ఆసక్తికరమైనవి. మత్తయి ఈ పేర్లను ఒక ఉద్దేశ్యంతో ఎన్నుకున్నాడు. ఉదాహరణకు, మత్తయి నలుగురు స్త్రీల పేర్లు చెప్పాడు. ఇది యూదుల వంశావళిలో అసాధారణం. జాబితాలోని స్త్రీలలో మనం ఆశించే అర్హతలు లేవు. రాహాబు, రూతు పరదేశులు. తామారు, రాహాబు, బత్షెబ లైంగిక పాపం చేసినవారు.
అదేవిధంగా, జాబితాలో ఉన్న కొందరు పురుషులు అవమానం పొందివారు. యూదా తామారును అవమానించాడు. యెకొన్యా సంతానం ఇశ్రాయేలు సింహాసనానికి అనర్హులు (మత్తయి 1:12, యిర్మీయా 22:30). గమనించదగిన విషయం ఏంటంటే, మత్తయి దావీదు గొప్ప విజయాలు సాధించాడని గుర్తించలేదుగాని ఊరియా భార్య ద్వారా సొలొమోనుకు తండ్రిగా గుర్తించాడు.
ఈ పేర్లు యేసును పాపస్వభావం గల మానవత్వంతో గుర్తిస్తాయి. దేవుడు ఆయన కుమారుణ్ణి మచ్చలేని కుటుంబ నేపథ్యం ద్వారా కాదుగాని సాధారణ పాపుల సంతానం ద్వారా లోకంలోకి పంపాడు. యూదా అధికారులు యేసు గౌరవింపదగని పుట్టుకను అవమానించి, అనర్హుడిగా తిరస్కరించారు (యోహాను 8:41, 48). దేవుడు పాపపు నేపథ్యంగల వ్యక్తిని వాడుకుని, తన గొప్ప ఉద్దేశ్యాలను నెరవేర్చగలడని మత్తయి చూపించాడు.
► మన సంస్కృతిలో, వ్యక్తి నేపథ్యంలో ఏ విషయాలను బట్టి మనం అతన్ని తక్కువ సామర్థ్యంగలవాడిగా చూస్తాం?
దేవుడు చాలాసార్లు తన సేవ కొరకు ఊహించని నేపథ్యాల నుండి ప్రజలను పిలుస్తాడు. కుటుంబ నేపథ్యాన్ని బట్టి పనికిరాని వారంటూ ఎవరు లేరు. ఒక వ్యక్తి తక్కువ సామర్థ్యంగలవాడని భావించడానికి కారణమయ్యే నేపథ్యాలు దేవునికి ముఖ్యం కాదు.
యేసు ఆదాము కుమారుడు (లూకా 3:23-38)
మత్తయి “యూదుల రాజు” వంశావళిని అబ్రాహాము నుండి ఆరంభిస్తాడు. లూకా యేసు వంశావళిని ఆదాము నుండి ఆరంభిస్తాడు. యేసు “మనుష్య కుమారుడు” అని నొక్కి చెప్పే లూకా మాటలకు ఇది సరిగ్గా సరిపోతుంది. లూకా వంశావళి యేసు మానవత్వాన్ని నొక్కి చెప్తుంది. లూకా యేసు వంశావళిని ఆయన శోధన సన్నివేశానికి ముందుంచాడు. మొదటి ఆదాము విఫలమయ్యాడు, రెండవ ఆదాముగా యేసు విజయం సాధించాడని ఇది పాఠకులకు జ్ఞాపకం చేస్తుంది.
నిశిత పరిశీలన: మత్తయి మరియు లూకా సువార్తల్లోని వంశావళి
మత్తయి 1 మరియు లూకా 3 లో యేసు వంశావళి భిన్నంగా ఉన్నాయి. మత్తయి అబ్రాహాము నుండి మొదలుపెట్టి, రాజైన సొలొమోను, తరువాత చివరికి యోసేపుతో ముగించాడు. లూకా వంశావళిని యోసేపు నుండి మొదలుపెట్టి, నాతాను (దావీదు మరొక కుమారుడు)తో కొనసాగించి, చివరికి ఆదాముతో ముగించాడు.
అబ్రాహాము, దావీదు మధ్య వంశావళి ఒకటే. అయితే దావీదు, యోసేపు మధ్య రెండు వంశాలు వేరు. ఈ భిన్నత్వానికి వివరణ, మత్తయి యోసేపు పూర్వికుల్ని ప్రస్తావించాడు, అయితే లూకా మరియ పూర్వికుల గురించి రాశాడు.[1]
మత్తయిలో యోసేపు పూర్వికులు సొలొమోను నుండి వచ్చిన రాజ వంశస్తులు. యేసు రాజు అనే మత్తయి ప్రసంగానికి/విషయానికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఇది యేసు చట్టపరమైన వంశం-యోసేపు ద్వారా రావాలి.
లూకాలో మరియ పూర్వికులు దావీదు కుమారుడైన నాతానుతో ఆరంభమైన “భౌతిక” వంశావళి. యేసు “మనుష్య కుమారుడు” అనే లూకా ఉద్ఘాటనకు ఇది సరిగ్గా సరిపోతుంది. దీనిని చూపించాలని, లూకా యేసు వంశావళిని మరియతో మొదలుపెట్టాడు. అయినా, “యోసేపు కుమారుడు” అనే మాటతోనే ఆరంభిస్తాడు, ఎందుకంటే యూదుల వంశావళిలో స్త్రీ వంశం కనుగొనాలంటే కూడా పురుషుల పేర్లు ఉపయోగిస్తారు.
మరియ వంశవృక్షం దావీదు ద్వారా రక్తసంబంధం చూపిస్తుంది. యోసేపు వంశవృక్షం సొలొమోను ద్వారా సింహాసనాధికారం చూపిస్తుంది.
దేవుడు తన సేవకుని కుటుంబ నేపథ్యం సిద్ధపరచాడు (కొనసాగింపు)
యేసు దేవుని కుమారుడు (యోహాను 1:1-18)
యోహాను సువార్త దైవిక వంశావళితో ఆరంభమైంది; యేసు దేవుని కుమారుడు. “యేసు జీవితం ఆయన జన్మతో.. ఆరంభం కాలేదు. ఆయన ఒక నిర్దిష్ట పని నెరవేర్చుటకు ఆదిసంభూత స్థితి నుండి లోకంలోకి వచ్చాడు.”[1]
పాత నిబంధనలో, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రసన్నతను ప్రత్యక్షగుడారంపై మేఘంగా చూశారు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తునందు మన మధ్య ఉన్నాడు (యోహాను 1:14). దేవుని దివ్య మహిమ ఇప్పుడు మానవ రూపంలో ప్రత్యక్షమైంది.
వాక్యం శాశ్వతమైంది: “వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను” (యోహాను 1:1). తండ్రి, కుమారుడు నిత్య సహవాసం కలిగియున్నారు.[2] యేసు మన లోకంలోకి ఎందుకు వచ్చాడు? తండ్రిని కనుపరచుటకు. ఎవడును ఎప్పుడైనను తండ్రిని చూడలేదు, కాని యేసు ఆయనను బయలుపరచాడు (యోహాను 1:18). మనం యేసును చూస్తే, తండ్రిని చూసినట్లే (యోహాను 14:9).
నేడు, అనేకులు యేసును ప్రేమగల మిత్రుడుగా, తండ్రిని కఠిన తీర్పరిగా చూపిస్తారు. అయితే, యోహాను 1 యేసు స్వభావాన్ని తండ్రి స్వభావంతో సమానంగా చూపిస్తుంది. యేసును చూస్తే, తండ్రిని చూసినట్లే.
[1]J. Dwight Pentecost, The Words and Works of Jesus Christ. (Grand Rapids: Zondervan, 1981), 28
[2]యేసు సృష్టించబడినవాడు అనే యెహోవ సాక్షుల వాదనను యోహాను 1:3 ఖండిస్తుంది. యేసు సృష్టిలో ఉన్నాడు. “కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు.”
దేవుడు, తన సేవకుని అద్భుత జననం ద్వారా సిద్ధపరచాడు
యేసు సుమారు క్రీ.పూ. 5లో యూదయలోని బెత్లేహేములో జన్మించాడు.[1] రోమా జనాభా లెక్కల కొరకు యోసేపు బెత్లేహేముకు వెళ్ళాడు. రోమా ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నిటిపై పన్నులు విధించడం జనాభా లెక్కల ప్రధాన ఉద్దేశ్యం.
పట్టణంలో ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో, ఎక్కడ పని చేస్తున్నారో తెలుసుకోవటం రోమీయుల సాధారణ పద్ధతి. అయితే, తిరుగుబాటు చేయాలని చూస్తున్న యూదులతో శాంతి కొనసాగించాలని, యూదయ ప్రాంతంలో ఉన్నవారు యూదా పద్ధతిలో తమ పూర్వికుల ఇంటికి వెళ్లి నమోదు చేసుకోవడానికి రోమా అనుమతి ఇచ్చింది. తత్ఫలితంగా, యోసేపు మరియ నజరేతు నుండి బెత్లెహేముకు 100 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. కుటుంబ పెద్ద, పురుషుడు మాత్రమే నమోదు చేసుకోవలసిన అవసరత ఉన్నప్పటికీ, యోసేపు మరియను కూడా బెత్లెహేముకు తీసుకెళ్ళాడు. చిన్న గ్రామమైన నజరేతులో, చుట్టుప్రక్కల కొండెములు చెప్పుకొంటున్న వాళ్ల మధ్య మరియను విడిచిపెట్టడానికి యోసేపు ఇష్టపడి ఉండకపోవచ్చు.
దేవుడు ఆయన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవడానికి లోక సంఘటనలు ఉపయోగిస్తాడు. దేవుని ఉద్దేశ్యాలు నెరవేర్చడానికి, యూదుల జనాభా గణన చేయాలనే “ఎంపిక”ను ఒక అన్య చక్రవర్తికి దేవుడు సార్వభౌమాధికారంతో అప్పగించాడు. “యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును” (సామెతలు 21:1). దేవుని రాజ్యంలో పనివారంగా, చెడ్డవారు అధికారంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన ఉద్దేశ్యాలు నెరవేర్చగలడనే గొప్ప నిశ్చయత ఇది మనకు ఇస్తుంది.
యేసు జననం కొరకు దేవుడు లోకాన్ని ఎలా సిద్ధపరచాడో చూపించే ఒక ఉదాహరణ, జనాభా గణన. మన లోకాన్ని మెస్సీయ కొరకు సిద్ధపరచడానికి, దేవుడు గ్రీకు సామ్రాజ్యపు సాంస్కృతిక నేపథ్యం, రోమా సామ్రాజ్యపు న్యాయ వ్యవస్థ, యూదా మత సూత్రాలు వాడుకున్నాడు. ఈ నేపథ్యాన్ని అధ్యయనం చేయడానికి, దయచేసి Shepherds Global Classroom (షెఫర్డ్ గ్లోబల్ క్లాస్ రూమ్) కోర్సులో, క్రొత్త నిబంధన అన్వేషణ[2] అనే మొదటి పాఠం చూడండి.
కాపరులు వెళ్లి చూడడం (లూకా 2:8-20)
యేసు జన్మించాడనే ప్రకటన మొదట బెత్లెహేము వెలుపల ఉన్న గొర్రెలకాపరులు విన్నారు. మొదటి శతాబ్దపు యూదులు కాపరులను విస్మరించేవారు గనుక ఇది గమనించదగిన విషయం. కాపరులు సామాజికంగా తక్కువ స్థాయిలో ఉన్నందున యూదుల న్యాయస్థానాల్లో వాళ్ల సాక్ష్యం అంగీకరించరు. కాపరులపై దృష్టిపెట్టడం వలన, “కాపరులను స్వాగతించారు గనుక దేవుని రాజ్యంలో అందరినీ స్వాగతిస్తారు!” అని లూకా సూచిస్తున్నాడు. “ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను” (లూకా 2:10) అని దేవదూత కాపరులతో చెప్పాడు.
సువార్త కేవలం ఒక్క రాజ్యానికే (ఇశ్రాయేలు) లేక ఒక్క సామజిక వర్గానికే పరిమితం కాదు; సువార్త ప్రజలందరికీ. ఇది లూకా సువార్త అంతటా కనిపిస్తుంది. స్తీలకు, సమరయులకు, జక్కయ్యవంటి సమాజం నుండి వెలివేయబడిన వారికి యేసు చేసిన పరిచర్య పట్ల లూకా ఎక్కువ శ్రద్ధ చూపుతాడు.
జ్ఞానులు వెళ్లి చూడడం (మత్తయి 2:1-12)
మత్తయి సువార్త మొదట యూదులకు ఉద్దేశించింది. యేసు సందేశం ప్రజలందరికీ అనేదానిపై లూకా దృష్టిపెట్టాడు, మత్తయి మొదట పరలోక రాజ్యం గురించి యేసు ఇచ్చిన సందేశంపై దృష్టిపెట్టాడు. కాపరులకు బదులుగా, మత్తయి జ్ఞానుల సందర్శనను చూపించాడు. బహుశా ఆయన జన్మించిన కొన్నినెలలకు, యేసు కుటుంబం తమ స్థిర నివాసానికి చేరుకున్న తరువాత ఈ సందర్శన జరిగింది (మత్తయి 2:11). రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగల మగపిల్లలందరినీ వధించమని హేరోదు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఇది అర్థమవుతుంది.
జ్ఞానులు, అసాధారణ విషయాల కొరకు చూసే ఖగోళ శాస్త్రజ్ఞులు. ప్రయాణం ప్రమాదకరమైన సమయంలో, ఆకాశంలో చూసిన వింత సూచన పరిశోధించడానికి వారు చాలా దూరం ప్రయాణించారు.
జ్ఞానులు ముందుగా యెరూషలేముకు వచ్చారు, యూదుల రాజును కనుగొనే హేతుబద్ధమైన ప్రదేశం. ప్రత్యర్థిని గూర్చిన వార్త హేరోదు విన్నప్పుడు, అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి (మత్తయి 2:3). “యెరూషలేము వారందరును” అనే మాట యెరూషలేములోని మతాధికారులు తరువాత యేసును తిరస్కరిస్తారని ముందుగానే సూచిస్తుంది.
జ్ఞానుల సందర్శన, మెస్సీయను అన్యులకు మొదటిగా వెల్లడిపరచడం. సూచనవల్ల కలవరంతో నిండిన యెరూషలేము ప్రజలకు భిన్నంగా జ్ఞానులు విశ్వాసం చూపించారు. యేసు కేవలం యూదుల రాజుగా మాత్రమే కాదు రాజ్యలన్నిటికీ రాజుగా ఆవిర్భవించాడు.
యేసును ఆరాధించుటకు ఎంతమంది జ్ఞానులు వచ్చారో మత్తయి చెప్పలేదు. మత్తయి 2:11 లో చెప్పిన మూడు బహుమతుల ఆధారంగా ముగ్గురు జ్ఞానులు అని సాంప్రదాయ వాదం చెబుతుంది. ప్రతి బహుమానం యేసు పరిచర్యలోని కొన్ని కోణాలను సూచిస్తుంది.
బంగారం రాజుకిచ్చు బహుమానం. అయితే, యేసు సింహాసనం నుండి కాదుగాని సిలువ నుండి పరిపాలిస్తాడు.
సాంబ్రాణి యాజకుడికిచ్చు బహుమానం. బలులు అర్పించేటప్పుడు, సాంబ్రాణిని సుగంధద్రవ్యంలా వాడతారు. యేసు యాజకునిగా, ప్రజలందరు దేవుని సన్నిధిలో చేరే ప్రవేశం కలిగించాడు.
బోళం చనిపోయినవారిని భద్రపరచుటకు వాడతారు. యేసు మానవులందరి నిమిత్తం చనిపోవడానికి జన్మించాడు.
[1]1582 వరకు గ్రెగోరియన్ క్యాలెండర్ అభివృద్ధి చెందలేదు. ఈ క్యాలెండర్ సుమారుగా ఉండేది కాని, ఖచ్చితమైనది కాదు. సుమారు క్రీ.పూ 4లో హేరోదు మరణించాడు. ఈ తేదీ ఆధారంగా, యేసు జననం సుమారు క్రీ.పూ.5-6 జరిగింది.
యేసు జననం ముందు, దేవుని ప్రణాళిక బయలుపరచడానికి దేవదూత స్వప్నమందు యోసేపుతో మాట్లాడాడు. జ్ఞానులు సందర్శించిన పిమ్మట, ఐగుప్తుకు పారిపొమ్మని దేవదూత యోసేపును హెచ్చరించాడు. హేరోదు మరణం వరకు వారు ఐగుప్తులోనే ఉన్నారు (సుమారు క్రీ.పూ. 4).
అనేక కోణాల్లో, హేరోదు మహాన్ ప్రభావవంతమైన పాలకుడు. ఆయన యూదులను గౌరవించేవాడు, యూదుల ఆహార నియమాలను కూడా పాటించేవాడు. ఆయన యేసు జీవితం మొత్తం కొనసాగిన దేవాలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించాడు. క్రీ.పూ. 25లో వచ్చిన కరువు సమయంలో, యూదయలో ఆకలితో ఉన్నవారికి తాను తన సొంత డబ్బుతో ఆహారం కొనుగోలు చేసి అందించాడు.
అయితే, హేరోదు తార్కికత లేని భయంతో తన స్థానాన్ని ఎవరో తీసుకోవచ్చని అనుకున్నాడు. అతన్ని చంపడానికి కుట్ర చేస్తున్నారని అనుమానించి, తన భార్య మరియామ్నే, తల్లి అలెగ్జాండ్రాను హత్యచేశాడు. హేరోదు ముగ్గురు కుమారులు వయస్సులో ఉండగా, ముప్పుగా ఉంటారనే భావనతో వారిని హత్యచేశాడు. హేరోదు వంటి పిచ్చోడు, బెత్లెహేములో పిల్లలను వధించడం ఆశ్చర్యమేమి కాదు. తన సింహాసనం కాపాడుకోవడానికి కొంతమంది పిల్లలను చంపటం ఇబ్బందేమి కాదు.
హేరోదు క్రూరత్వం మరణం వరకు కొనసాగింది. అతని మరణం సమీపిస్తుండగా, యెరూషలేములోని ప్రముఖ పౌరులను అరెస్టు చేసి, చంపాలని హేరోదు ఆదేశించాడు. ఈ సంఘటన అతని మరణ దినం దుఃఖ దినంగా ఉండే భరోసా ఇస్తుందని నమ్మాడు. (బదులుగా, హేరోదు మరణం తరువాత విధవరాలైన తన భార్య, చెరలో ఉన్నవాళ్ళని విడిపించి, పాలస్తీనా అంతటా వేడుక వాతావరణం నెలకొల్పింది.)
హేరోదు మరణం తరువాత, అతని సంస్థానాన్ని ముగ్గురు కుమారులు పంచుకున్నారు. అంతిపకు గలిలయ మరియు పెరెయపై అధికారం ఇచ్చారు; ఫిలిప్పుకు పాలస్తీనా ఈశాన్య భాగంపై అధికారం ఇచ్చారు; అర్కెలాస్ కి యూదయ, ఇదూమియ మరియు సమరయపై అధికారం ఇచ్చారు. అర్కెలాస్ కు తన తండ్రి బలహీనతలన్నీ ఉన్నాయికాని ఒక్క మంచి లక్షణం కూడా రాలేదని ప్రాచీనా చరిత్రకారులు చెబుతారు. యూదులు అతన్ని ద్వేషించి, కైసరుకు ఫిర్యాదులు చేయడం వల్ల క్రీ.శ. 6లో అతన్ని తప్పించారు. దీని తరువాత, యూదయను పొంతు పిలాతు వంటి రోమా గవర్నర్ లు పాలించారు.
హేరోదు మరణం తరువాత, యోసేపును ఇశ్రాయేలుకు తిరిగి వెళ్ళుమని హెచ్చరించుటకు స్వప్నమందు దూత మరల కనిపించాడు. అయితే, అర్కెలాస్ హేరోదు అంతటి ప్రమాదకరమైనవాడు గనుక, యోసేపు బెత్లెహేముకు వెళ్ళక తన కుటుంబాన్ని నజరేతుకు తీసుకెళ్ళాడు.
► చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, జాన్ వెస్లీ మంటల్లో నుండి అద్భుతంగా బయటపడ్డాడు. దేవుడు తనను ఒక ప్రత్యేక ఉద్దేశ్యం కొరకు రక్షించాడని నమ్మాడు. వెస్లీ తన గురించి, “అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే” (జెకర్యా 3:2) అని చెప్పుకున్నాడు. అద్భుతంగా రక్షించడం ద్వారా లేక దైవకృత కార్యం ద్వారా దేవుడు తమను పరిచర్య కొరకు ఎలా రక్షించాడో తెలియజేయడానికి తరగతిలో ఉన్న సభ్యులను ఆహ్వానించండి.
నిశిత పరిశీలన: మత్తయి 2:23
ఇతర సువార్తల కంటే, యేసు పరిచర్య పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చిందని, మత్తయి చూపిస్తుంది. యూదులకు రాస్తూ, యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయ అని మత్తయి చూపించాడు.:
యేసు కన్యకకు జన్మించడం (మత్తయి 1:22-23) యెషయా 7:14 నెరవేర్పు.
బెత్లెహేములో యేసు జననం (మత్తయి 2:5-6) మీకా 5:2 నెరవేర్పు.
ఐగుప్తు ప్రయాణం (మత్తయి 2:14-15) హోషేయ 11:1 నెరవేర్పు.
యెరూషలేము ప్రవేశం (మత్తయి 21:1-5) జెకర్యా 9:9 నెరవేర్పు.
ప్రవచన నెరవేర్పు గూర్చిన ఒక క్లిష్టమైన ఉదాహరణ మత్తయి 2:23లో కనిపిస్తుంది. మత్తయి రాశాడు, “నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు.”
ఇక్కడ క్లిష్టమైన విషయం ఏంటంటే, మెస్సీయ నజరేయుడనబడుననే పాత నిబంధన ప్రవచనం లేదు. బహుశా ఈ వచనం వెనుక రెండు ఆలోచనలు ఉన్నాయి:
1. యేసు కాలంలో, నజరేతు ప్రాముఖ్యతలేని గ్రామం (యోహాను 1:46). యూదులు తమ మెస్సీయ యూదయ నుండి వస్తాడని నమ్మారు, గలిలయలోని వాణిజ్య ప్రాంతం నుండి కాదు (యోహాను 7:41, 52). యేసు నజరేతు వంటి తృణీకరించబడిన గ్రామంలో నుండి వచ్చాడనే వాస్తవం యెషయా 49:7 మరియు యెషయా 53:3 వంటి ప్రవచనాలు నెరవేర్చింది.
2. యెషయా 11:1 మెస్సీయ “చిగురు” అని ప్రవచిస్తుంది. అంకురానికి (నెట్జర్) హెబ్రీ పదం “నజరేతు” అనే పదంలా ఉంటుంది. మత్తయి యూదా శ్రోతలు ఈ పదాలను గుర్తించియుంటారు.
దేవుడు ఆయన సేవకుని కొరకు పూర్వుడు ద్వారా మార్గం సిద్ధపరచాడు
బాప్తిస్మమిచ్చు యోహాను యేసు బంధువు. తన తండ్రి జెకర్యా, యాజకులకు అత్యంత గౌరవనీయమైన విధిని నిర్వర్తిస్తుండగా, అంటే రాజ్యం పక్షాన ధూపం వేయుచున్నప్పుడు యోహాను కథ ఆరంభమైంది (లూకా 1:9).
జెకర్యా ఈ పవిత్ర విధి నిర్వర్తిస్తుండగా, దూత ధూపవేదిక కుడి వైపున నిలబడెను. యూదుల సాంప్రదాయం ప్రకారం, అర్పణ సమయంలో ఇది దేవుడు నిలబడే చోటు. కుమారుని కొరకు తాను చేస్తున్న ప్రార్థన ఆలకించబడెనని గబ్రియేలు దూత జెకర్యాకు సెలవిచ్చాడు.
ఎలీసబెతుకు పిల్లలు కనే వయసు దాటిపోయినందున, జెకర్యా దూత వాగ్దానం అనుమానించాడు. అతని అపనమ్మిక కారణంగా, యోహాను జన్మించేవరకు మూగవాడైయ్యాడు. ఒక యాజకునిగా లేఖన విద్యార్థిగా, జెకర్యాకు హన్నా, రాహేలు గురించి పాత నిబంధన కథలు తెలుసు కాబట్టి దేవుడు అద్భుతంగా ఎలీసబెతు గర్భం తెరుస్తాడనే వాగ్దానం నమ్మాలి.
ముప్పై ఏళ్ళ తరువాత, యోహాను తన పరిచర్య మొదలుపెట్టాడు. యెరూషలేములో యాజకుడుగా సేవచేయక, యూదయ అరణ్యంలో ప్రవక్తగా పరిచర్య చేశాడు. యోహాను యేసుకు ముందుగా పంపబడ్డాడు. యోహాను ప్రకటిస్తుండగా, “వాగ్దానము చేయబడిన మెస్సీయ నీవేనా?” అని ప్రజలు అడిగినప్పుడు, “అయితే నాకంటె శక్తి మంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను” (లూకా 3:16) అని సమాధానమిచ్చాడు. ఒక బానిస చేసే అత్యంత హీనమైన పని, యజమానుడి చెప్పులు చూసుకోవడం, కాని యోహాను, “అయితే నాకంటె శక్తి మంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను” అని చెప్పాడు. యోహాను విధేయతగల సేవకు మాదిరి.
లేఖనమంతటిలో, మరొకరికి మార్గం సిద్ధపరచడానికి దేవుడు ప్రజలను వాడుకున్నాడు. ఉదాహరణకు బర్నబా, పౌలును చూడండి. సౌలు క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు, బర్నబా సంఘంలో ఘనత కలిగిన నాయకుడు. కొందరు క్రైస్తవులు సంఘాన్ని హింసించే పౌలును నమ్మలేదు, కానీ బర్నబా పౌలును నమ్మాడు.
వారు మొదటి మిషనరీ యాత్ర మొదలుపెట్టినప్పుడు, అపొస్తలుల కార్యములు ఆ బృందమును “బర్నబా మరియు సౌలు” అని సూచించింది (అపొస్తలుల కార్యములు 13:2). త్వరలో, వారిని “పౌలు బర్నబా” అని పిలిచారు (అపొస్తలుల కార్యములు 13:43 దాని కొనసాగింపు ). ఆరంభంలో బర్నబా నాయకుడు, కాని పౌలు నాయకుడుగా ఉండాలని అతడు ఇష్టపడ్డాడు.
కొన్నిసార్లు మీ పాత్ర బాప్తిస్మమిచ్చు యోహాను లేక బర్నబావలే ఉండొచ్చు, మరొకరి కొరకు మార్గం సిద్ధపరచడం. దేవుడు మిమ్మల్ని ఎక్కడ వాడుకోవాలని ఆశపడతాడో, అక్కడ ఆయనకు విధేయులవ్వండి. దేవుడు మిమ్మల్ని మద్దతిచ్చే పాత్రలో ఉంచితే, ఆ పరిచర్య తిరస్కరించకండి. దేవుడు మిమ్మును ప్రభావవంతమైన విధానంలో వాడుకుంటాడని మీరు నమ్మొచ్చు.
బాప్తిస్మమిచ్చు యోహాను తన అనుచరులను యేసు వైపు చూపినప్పుడు, అతని విధేయత కనిపిస్తుంది (యోహాను 1:35-37). తమ బోధకుని గౌరవిస్తూ అనుసరించే శిష్యులను సంపాదించటం బోధకుని/రబ్బీ లక్ష్యం. కాని, బాప్తిస్మమిచ్చు యోహాను తన అనుచరులకు గొప్ప బోధకుడ్ని చూపించాడు. తన కంటే గొప్పవాడిని చూపించడమే తన బాధ్యతని అతడు గ్రహించాడు. తన అనుచరులు తనను విడిచి యేసును వెంబడించడం అతడు చూశాడు. అతని లక్ష్యం, తన సొంత మహిమ కాదుగాని దేవుని రాజ్యం. క్రైస్తవ నాయకులుగా, మన లక్ష్యం మనకొరకు పేరు సంపాదించుకోవడం కాదుగాని ప్రజలకు యేసును చూపించడమని, గుర్తుంచుకోవాలి.
నిశిత పరిశీలన: మారుమనస్సు పొందటం అంటే ఏంటి?
► మత్తయి 3:1-6 చదవండి.
యోహాను మారుమనస్సు సందేశం ప్రకటించాడు. ఈనాడు, మారుమనస్సు అంటే మనసు మార్చుకోవడమని కొందరంటారు. క్రైస్తవులుగా చెప్పుకునే అనేకులు వారు మారారు అనడానికి పెద్దగా ఋజువులు ఏం చూపించరు.
అయితే, “మారుమనస్సు” అనే పదానికి అర్థం, మానసిక నిర్ణయానికి మించినది. క్రొత్త నిబంధన రచయితలు హెబ్రీ ప్రవక్తల మాదిరిగానే “మారుమనస్సు” అనే పదాన్ని ఉపయోగించారు. దాని అర్థం జీవితం పూర్తిగా మారటం. క్రొత్త నిబంధనలో, మారుమనస్సు అంటే:
మీ ఆలోచనలు, నమ్మకాలు మార్చుకోవడం మరియు
మీ క్రియలు, జీవనశైలి మార్చుకోవడం.
కొన్నిసంవత్సరాల క్రితం అమెరికాలో పాపంతో నిండిన జీవనశైలికి పేరు గాంచిన పాప్ గాయకుడు ఒకడున్నాడు. ఇతను “నేను క్రైస్తవుడుగా మారి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. మునుపటివలే జీవిస్తున్నాను కాని క్రైస్తవుడను. ఒకవేళ నేను మరణిస్తే, పరలోకం వెళ్తాను.” ఇతడు “మారుమనస్సు” గురించి చెప్పుకుంటున్నాడు కాని జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ఇది నిజమైన మారుమనస్సు కాదు.
మారుమనస్సు మన జీవన విధానాన్ని మారుస్తుందని యోహాను బోధించాడు. మారుమనస్సుకు తగిన జీవితం జీవించే వారు బాప్తిస్మానికి అర్హులని యోహాను చెప్పాడు (లూకా 3:8). బాప్తిస్మం, కేవలం ఒక ఆచారంగా మారకూడదు: “నమ్ముతున్నాను, కాబట్టి నాకు బాప్తిస్మం ఇవ్వండి.” బాప్తిస్మం నిజమైన మారుమనస్సుకు, మారిన జీవితానికి సాక్ష్యంగా ఉండాలి.
దేవుడు ఆయన సేవకుని పరీక్ష ద్వారా సిద్ధపరచాడు
శోధనపై యేసు సాధించిన విజయం మన శోధనకు మాదిరి. “యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను” (మత్తయి 4:1). యేసు తన బహిరంగ పరిచర్య ఆరంభించడానికి ముందు శోధన ఎదుర్కొన్నాడు. ఇతరులకు ప్రకటించే ముందు, యేసు తన తండ్రి చిత్తానికి పరిపూర్ణ విధేయత చూపించాడు.
మత్తయి శోధన వృత్తాంతాన్ని యేసు బాప్తిస్మం తీసుకున్న తరువాత రాశాడు. మన గొప్ప శోధనలు ఎల్లప్పుడు ఆథ్యాత్మిక విజయం తరువాత వస్తాయి. కర్మెలు పర్వతంపై ఏలీయా విజయాన్ని పొందిన వెంటనే, అతను తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతుండగా నిరాశ, అనుమానమనే శోధనలో ఉన్నట్లు చూస్తాం (1 రాజులు 18-19).
లూకా యేసు వంశావళిని ఆదాముతో ముగించిన తరువాత శోధన కథ రాశాడు. ఆదాము విఫలమైనప్పుడు, మనుష్యుకుమారుడు, యేసు విజయం సాధించాడని లూకా చూపించాడు (లూకా 3:38). యేసు తననుతాను మానవాళితో గుర్తించుకున్నాడు మరియు పాపంపై సాధారణ క్రైస్తవులు విజయం ఎలా సాధించాలో మాదిరి చూపించాడు.
రాళ్లను రొట్టెలుగా మార్చుటకు దైవిక శక్తిని ఉపయోగించుమని సాతాను యేసును శోధించాడు. తండ్రి మీద ఆధారపడకుండా ఆయన తన స్వప్రయోజనం కొరకు తన శక్తిని ఉపయోగించాలని సాతాను యేసును శోధించాడు. యేసు ఆహారం పొందే హక్కు తండ్రికి అప్పగించాడు.
తాను తినకూడని ఆహారం తినడానికి శోధించబడినప్పుడు మొదటి ఆదాము దేవునికి అవిధేయుడయ్యాడు. రెండవ ఆదాము విధేయుడయ్యాడు.
దేవాలయ శిఖరం నుండి క్రిందికి దూకాలనే శోధన
దేవాలయ శిఖరంపై నుండి దూకమని సాతానుడు యేసును శోధించాడు (కిద్రోను లోయకు 91 మీటర్లు ఎత్తు). ఇది ప్రజలకు ఆశ్చర్యం కలిగించవచ్చు, అదే సమయంలో కాపాడతానన్న వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో తండ్రిని బలవంతపెడుతుంది.
తండ్రి వాగ్దానాలు పరీక్షించాలని యేసుని శోధించడానికి సాతాను కీర్తన 91:11-12లోని వాగ్దానాన్ని ప్రస్తావించాడు. ఈ పరీక్షతో, యేసు తండ్రిని తన దాసునిగా చేస్తాడు- తన కోరికలను, అంచనాలను తీర్చేటట్లు చేస్తాడు.
కీర్తన 91లోని వాగ్దానాన్ని, అది వర్తించని సందర్భంలో వర్తింపజేయడానికి యేసు నిరాకరించాడు. సాతానుకు ప్రతిస్పందనగా, యేసు ద్వితీయోపదేశకాండము 6:16ను ఉల్లేఖించి, “మీరు దేవుడైన యెహోవాను ఆయనను శోధింపకూడదు” అని చెప్పాడు. దేవుని పిల్లలముగా, దేవుడు మన ఉద్దేశ్యాల కొరకు ఆయన శక్తిని ఉపయోగించాలని కోరకూడదు.
“‘నా హక్కులు ఉద్ఘాటిస్తూ బలాన్ని నిరూపించుకుంటాను.’ కాని నిజమైన బలం మానవుని చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకోవడంలో ఉందని పరిపూర్ణ మానవుడు చూపించాడు” అని చెప్పేవాళ్లని మేం మెచ్చుకుంటాం,
- జి. కాంప్‌బెల్ మోర్గాన్ నుండి తీసుకున్నారు.
నిశిత పరిశీలన: నిజమైన విశ్వాసం
కొందరు క్రైస్తవులు “బైబిల్ లోని ప్రతి వాగ్దానం నాది” అని చెబుతారు. లేఖనంలో ప్రతి వాగ్దానం వాస్తవమైనప్పటికీ, “ఈ వాగ్దానం ఈ సందర్భానికి వర్తిస్తుందా?” అని ఎల్లప్పుడు ప్రశ్నించుకోవాలి. యేసు అరణ్యంలో ఎదుర్కొన్న ఆ పరిస్థితికి కీర్తన 91 లోని వాగ్దానం దేవుని చిత్తం కాదని ఆయనకు తెలుసు. దేవుని శక్తిని నియంత్రించకుండా దేవుని వాగ్దానాలను నిజమైన విశ్వాసంతో పట్టుకున్నామని ఎలా తెలుస్తుంది?
(1) దేవుని వాక్యం ఖచ్చితంగా తెలుసుకోవాలి.
బైబిల్లోని వాగ్దానాల సందర్భాన్ని, దాని షరతులను ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే, దాని అన్వయం మన పరిస్థితికి ఎలా సరిపోతుందో అంతే ఎక్కువగా తెలుసుకుంటాం.
కొన్ని వాగ్దానాలను కొన్ని పరిస్థితుల్లో కొందరికి ఇచ్చారు. పాత నిబంధనలో, ఇశ్రాయేలు ప్రజలు నిబంధనకు నమ్మకంగా ఉంటే భౌతిక ఆశీర్వాదాలను దేవుడు వాగ్దానం చేశాడు. వాళ్ల భూమి అధిక ఫలమిస్తుంది, కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, యుద్ధాల్లో విజయం కలుగుతుంది. క్రొత్త నిబంధన వాగ్దానాలు ఎక్కువగా ఆత్మీయ ప్రయోజనాలకు సంబంధించినవి. దీని నేర్చుకోవడానికి కొందరు చింతిస్తారు, కాని మనం ఆనందించాలి. భౌతిక ఆశీర్వాదాలు తాత్కాలిక విలువగలవి; ఆత్మీయ ఆశీర్వాదాలు నిత్య విలువగలవి. దేవుడు మన వ్యక్తిగత కోరికలు నెరవేర్చునట్లు కాదుగాని ఆయన వాగ్దానాలు ఆయన పద్ధతిలో నెరవేర్చాలని విశ్వాసం నమ్ముతుంది.
(2) సాధారణ మరియు ప్రత్యేక వాగ్దానాలు మధ్య వ్యత్యాసం గుర్తించాలి.
మనం సాధారణ వాగ్దానం చదివినప్పుడు, దేవుడు మన నిర్దిష్ట పరిస్థితికి వాగ్దానం ఇస్తున్నాడా అని అడగాలి. కొన్ని వాగ్దానాలు సాధారణమైనవి కాని సార్వత్రికం కాదు.
కీర్తన 103:3 “నీ సంకటములన్నిటిని కుదుర్చువాడైన” దేవుని స్తుతిస్తుంది. కొందరు క్రైస్తవులు దీనిని, ప్రతి విశ్వాసి ఎదుర్కొనే ప్రతి రోగాన్ని దేవుడు స్వస్థపరుస్తాడనే సార్వత్రిక వాగ్దానంగా చూస్తారు. అయితే, ప్రతి రోగం స్వస్థపడదని వాక్యభాగం సెలవిస్తుంది. పౌలు స్వస్థత కొరకు ప్రార్థించాడు, దేవుడు “లేదు” అని చెప్పాడు (2 కొరింథీయులకు 12:7). కొన్నిసార్లు దేవుడు తన పిల్లలను స్వస్థపరుస్తాడు; మరికొన్నిసార్లు ఆ బాధ భరించే కృప అనుగ్రహిస్తాడు.
మనం ముగ్గురు హెబ్రీ యువకుల్లా స్పందించాలి. నెబుకద్నెజరు వాళ్లను అగ్నిగుండలో వేస్తానని బెదిరించినప్పుడు వారిలా చెప్పారు: “మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము” (దానియేలు 3:17-18). దేవుడు వాళ్ళని విడిపించగల సమర్థుడని వాళ్ళకి తెలుసు; ఒకవేళ దేవుడు విడిపించకపోయినా, ఆయనను నమ్మకంగా సేవిస్తామనే సమర్పణతో ఉన్నారు.
దేవుడు శారీరక బాధల నుండి తన పిల్లలను విడిపించగల సమర్థుడు, కాని ఎల్లప్పుడు ఆ మార్గం అనుసరించడు. బైబిల్ వాగ్దానం ప్రత్యేకంగా మీ కొరకేనని దేవుడు స్పష్టపరచేవరకు, ఆయన తన చిత్తానుసారంగా చేస్తాడని నమ్మండి. అపొస్తలుడైన యోహాను ఈ వాగ్దానం ఇచ్చాడు, “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము” (1 యోహాను 5:14-15).
ప్రతి బైబిల్ వాగ్దానం నేనున్న పరిస్థితికి వర్తిస్తుందని ఆశించకూడదు. “‘ఆయన చిత్తప్రకారం అడుగుతాను” అని విశ్వాసం చెబుతుంది. ప్రతి వాగ్దానం వ్యక్తిగత వాగ్దానంగా తీసుకోకూడదు. దానికి బదులుగా, వాగ్దానం నా పరిస్థితికి ఉద్దేశించిందా కాదా అని అడగాలి.
(3) యేసు నామంలో ప్రార్థించాలి.
“మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును” (యోహాను 14:13) అని యేసు వాగ్దానం చేశాడు. యేసు నామంలో ప్రార్థించడమంటే, మీ ప్రార్థన యేసు ప్రాధాన్యతలు, చిత్తం, స్వభావానికి అనుగుణంగా ఉందని అర్థం. దేవుని మహిమపరచు వాటి కొరకు యేసు ప్రార్థించాడు; మనం కూడా అలాగే చెయ్యాలి. మనకు నిజమైన విశ్వాసం ఉంటే, మన చిత్తం కాదుగాని దేవుని మహిమపరచాలని చూస్తాం.
తండ్రి మహిమపరచబడునట్లు ప్రార్థించడం అంటే, మన జీవితంలో దేవుని అంతిమ ఉద్దేశ్యాలకు అప్పగించుకోవడమని అర్థం. దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు, “‘నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు” (యిర్మీయా 29:11). ఇశ్రాయేలు 70 ఏళ్లు బబులోను చెరలో ఉండగా, దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడని గుర్తుంచుకోవాలి. బబులోనులో బానిసత్యం కూడా దేవుని ప్రజలకు మేలు చేస్తుంది; బాధలో, ఇశ్రాయేలు దేవునికి మొరపెడుతుంది, ఆయన వారి మొర ఆలకిస్తాడు.
ఈ వాగ్దానం నేడు మనకు వర్తిస్తుందా? అవును! దేవుని స్వభావం మారదు; ఆయన పిల్లలకు మేలు చేస్తాడు. జరిగే ప్రతిదీ మంచి కాదు, కాని మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో దేవుడు తన ఉద్దేశ్యం నెరవేరుస్తున్నాడని మనకు తెలుసు గనుక యేసు నామంలో నమ్మకంగా ప్రార్థించవచ్చు.
దేవుడు ఆయన సేవకుని పరీక్ష ద్వారా సిద్ధపరచాడు (కొనసాగింపు)
శోధనలు (కొనసాగింపు)
లోక రాజ్యాల ప్రతిపాదన
సాతానుడి అంతిమ శోధన రాజీపడే ప్రతిపాదన ఇచ్చింది, సిలువ లేకుండా యేసు పరిపాలన సాధించే మార్గం. ఒకవేళ యేసు సాతానుడికి నమస్కరిస్తే, సిలువ శ్రమ తప్పించుకోగలడు. యేసు ద్వితీయోపదేశకాండము 6:13ని ఉటంకిస్తూ స్పందించాడు, “నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను” (మత్తయి 4:10).
శోధనపై యేసు విజయం
శోధనలో యేసు మాదిరిననుసరించి ప్రయోజనం పొందాలంటే, యేసు పరిపూర్ణ మానవుడని గుర్తుంచుకోవాలి. ఆయన “సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను” (హెబ్రీయులకు 4:15).
► 1 కొరింథీయులకు 10:13 మరియు హెబ్రీయులకు 4:15 చదవండి. శోధన గురించి అవి ఏం బోధిస్తాయి?
1 యోహాను 2:16లో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ద్వారా శోధన కలుగుతుందని అపొస్తలుడు చెప్పాడు. యేసు ఈ మూడు కోణాల్లో శోధించబడ్డాడు.
యేసు రొట్టెకొరకు ఆకలిగొన్నప్పుడు సాతానుడు శరీరాన్ని శోధించాడు.
శోధనపై యేసు విజయం, మన శోధనకు మాదిరి. శోధనపై విజయం సాధించడానికి యేసు వాడిన మూడు సాధనాలను గమనించండి.
ఆత్మ శక్తి
యేసు పరిశుద్ధాత్మ నడిపింపులో నడిచాడు. ఆత్మ నడిపింపునుబట్టి చేశాడు. “యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి” (లూకా 4:1).
ఆయన భూలోక పరిచర్య అంతటా, పరిశుద్ధాత్మ శక్తితో పనిచేశాడు. ఆత్మ శక్తితో దయ్యాలు వెళ్లగొట్టాడు. (మత్తయి 12:28). “దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను” (అపొస్తలుల కార్యములు 10:38).
యేసు భూలోక పరిచర్యను పరిశుద్ధాత్మ శక్తితో చేశాడు. శోధనలో మనం బలంగా ఉండాలంటే, పరిశుద్ధాత్మ శక్తితో జీవించాలి.
ప్రార్థనా శక్తి
40 దినాలు ఉపవాస ప్రార్థన తరువాత యేసు శోధించబడ్డాడు. ప్రార్థన ఆత్మీయ పోరాటానికి ఆయన్ని సిద్ధపరచింది. తరువాత పాఠంలో, యేసు జీవితం మరియు పరిచర్యలో ప్రార్థనకున్న కేంద్ర స్థానం చూద్దాం. యేసు ప్రార్థనపై ఆధారపడినప్పుడు, ప్రార్థన లేకుండా ఆత్మీయ పోరాటాలు గెలుస్తామని మనం ఎలా ఆశిస్తాం?
మన ప్రార్థనా జీవితంపై అజాగ్రత్తగా ఉన్నప్పుడు సాతానుడు మనపై తరచు దాడిచేస్తాడు. విలువైన ప్రార్థనా జీవితం లేకపోతే, శోధనలో బలహీనంగా ఉంటామని వాడికి తెలుసు.
వాక్య శక్తి
యేసు ప్రతి శోధనను వాక్యంతో ఎదుర్కొన్నాడు. ఆయనకు ఈ లేఖనాలు ఎలా తెలుసు? యూదుల బాలురు తమ బాల్య విద్యలో భాగంగా తోరాను (ధర్మశాస్త్రాన్ని) కంఠస్థం చేస్తారు. యేసు శోధించబడినప్పుడు, ఆయనకు వాక్యం గుర్తొచ్చింది.
క్రైస్తవులుగా, మన హృదయంలో దేవుని వాక్యం నాటుకోవాలి. శోధన సమయాల్లో, శోధన ఎదుర్కొనే శక్తి వాక్యం ఇస్తుంది.
శోధన ఎదుర్కొంటున్న సమయంలో, మన యొద్ద ఉన్న సాధనాలే యేసు ఉపయోగించాడు. మనం కూడా యేసువలే ఆత్మ శక్తితో, ప్రార్థనా శక్తితో, వాక్య శక్తితో శోధన ఎదుర్కోవాలి. ఈ ఆయుధాలు లేకుండా, సాతానుడి అఘాతంలో పడిపోతాం.
నిశిత పరిశీలన: శరీరాధరణం
యేసు దైవత్వంగలవాడని ఆరంభ క్రైస్తవులు సార్వత్రికంగా నమ్మారు. ఏరియస్ వంటి అబద్ధ బోధకులు యేసు దైవత్వాన్ని నిరాకరించినప్పటికీ, ఆర్తోడాక్స్ క్రైస్తవులు యేసు దైవికమైనవాడని బోధించారు.
ఆర్తోడాక్స్ క్రైస్తవ్యం యేసు పరిపూర్ణ మానవుడు అని కూడా బోధించింది. ఈ సిద్ధాంతాన్ని అబద్ధ బోధకులు నిరాకరించారు. నేటికీ, చాలామంది ఇవాంజెలికల్స్ యేసు మానవత్వాన్ని ఎక్కువ పట్టించుకోరు. యేసు పరిపూర్ణ దైవత్వంగలవాడే కాని ఆయన మానవత్వం వాస్తవం కాదని చాలామంది క్రైస్తవులు అనుకుంటారు. ఆయన మానవ శరీరాన్ని అరువు తీసుకున్నాడే తప్ప, పరిపూర్ణ మానవుడు కాదని చెబుతారు.
ఈ తప్పుడు ఆలోచనకు కొన్ని ప్రసంగ ఉదాహరణలు కూడా సహకరిస్తాయి. ప్రయాణించడానికి రైతుగా నటించిన ఒక రాజు పురాణాన్ని కొందరు ప్రసంగికులు చెబుతారు. అయితే, యేసు మానవుడిగా నటించలేదు. ఆయన మనలో ఒకడయ్యాడు.
మన క్రైస్తవ అనుభవానికి యేసు మానవత్వ సిద్ధాంతం ప్రాముఖ్యం. యేసు పరిపూర్ణ మానవుడు కానట్లైతే, ఆయన జీవితం మనకు వాస్తవ మాదిరి కాదు. ఒక వేదాంతవేత్త “యేసు నిజంగా మనవంటి వాడు కాకపోతే, మనం ఆయనవలే ఉండనక్కరలేదు” అని చెప్పాడు. [1]
మనం ఎల్లప్పుడు ఉద్దేశ్యపూర్వక పాపంలో పడిపోతామని చాలామంది నమ్ముతారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాధారణ క్రైస్తవులు పాపంపై విజయం పొందుతారని యేసు ఆయన మానవత్వంలో చూపించాడు.
యేసు మన పతనమైన మానవత్వంలో భాగమైనప్పుడు, ఆత్మ కొరకైన మన అవసరత ఆయన అనుభవించినప్పుడు, మనవలె ఆయన శోధించబడినప్పుడు, శోధనపై ఆయన విజయం మన అనుదిన జీవితాల్లో విజయం ఎలా సాధించాలో చూపిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా, మనం విజయవంతమైన జీవితం కలిగియుంటాం.
► వీటిలో దేన్ని అర్థం చేసుకోవడం మీకు కష్టం: యేసు దైవత్వ సిద్ధాంతమా లేక మానవత్వ సిద్ధాంతమా? మన క్రైస్తవ జీవితం, పరిచర్యలో ఈ సిద్ధాంతాల ప్రాముఖ్యతను చర్చించండి.
[1]Cherith Fee Nordling, “Open Question” Christianity Today, April 2015, 26-27
ముగింపు: దేవుడు ఆయన సేవకులను సిద్ధపరుస్తాడు
ఈ పాఠంలో, యేసు పరిచర్యకు దేవుడు మార్గం ఎలా సిద్ధపరిచాడో చూశాం. ఆయన వంశావళి ద్వారా, రోమా సామ్రాజ్యం ద్వారా, అద్భుత జననం ద్వారా, బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య ద్వారా, మరియు శోధన ద్వారా కూడా దేవుడు యేసు కొరకు మార్గం సిద్ధపరిచాడు.
ఈ సత్యాన్ని బైబిల్ అంతటా పదే పదే చూస్తాం. పౌలు ఉదాహరణ చూడండి. పౌలు రోమా పట్టణమైన తార్సులో పెరిగాడు. చిన్నప్పటినుండి, అతనికి అన్య స్నేహితులు ఉన్నారు. చాలామంది యూదుల్లా కాకుండా, పౌలు అన్యులతో సౌకర్యంగా ఉండేవాడు.
పౌలు తండ్రి, రోమా పౌరుడు, కాబట్టి పౌలుకు రోమా పౌరసత్వపు హక్కులు ఉన్నాయి. అతని తల్లి, యూదురాలు, కాబట్టి పౌలు పాత నిబంధన లేఖనాల్లో ఆరంభ శిక్షణ పొందాడు. అతను తెలివిగలవాడు, గొప్ప రబ్బీయైన గమలియేలు దగ్గర హెబ్రీ దైవజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. రోమా నేపథ్యంతో, గ్రీకు భాషను, గ్రీకు తత్వవేత్తల బోధలు నేర్చుకున్నాడు.
ఈ నేపథ్యాన్ని బట్టి, దేవుడు పౌలును అన్యజనులకు మిషనరీగా పిలవడంలో ఆశ్చర్యం లేదు. పుట్టుక నుండి, దేవుడు పౌలును అన్యజనులకు అపొస్తలుడుగా సిద్ధపరిచాడు. ఈ పరిచర్య కొరకు దేవుడు చేసిన సిద్ధపాటు గురించి ఆలోచించండి:
పౌలు రోమా పౌరసత్వం వల్ల ఉచిత ప్రయాణం చేయగలడు.
పౌలుకున్న హెబ్రీ, గ్రీకు శిక్షణ, క్రొత్త నిబంధనలో అతి గొప్ప పత్రికలు రాసే సాధనాలను ఇచ్చింది.
పౌలు గ్రీకు తత్వశాస్త్రం నేర్చుకోవడం, ఏథెన్సు వంటి ప్రదేశాల్లో గ్రీకువారితో మాట్లాడే సమర్థత ఇచ్చింది.
బహుశా మీరు ఇలా అనొచ్చు: “పౌలువలే దేవుడు నాకు గొప్ప విద్వ ఇవ్వలేదు. నాకు గొప్ప కుటుంబ నేపథ్యం లేదు.” అది సరే! మొదటి శతాబ్దపు సంఘంలో మరొక నాయకుడ్ని చూడండి.
సీమోను వాణిజ్య మత్స్యకారునిగా పెరిగాడు. అతనికి విద్య లేదు లేక పౌలు వంటి తెలివి లేదు. నిజానికి, పౌలు రాసిన కొన్ని విషయాలు గ్రహించడానికి కూడా కష్టమైనవని పేతురు తరువాత చెప్పాడు (2 పేతురు 3:15-16). కాని దేవుడు పేతురును అద్భుతంగా వాడుకున్నాడు. పౌలు మాట్లాడిన గంభీరమైన మాటలను గ్రహించలేనివారు, పేతురు చెప్పిన సరళ ప్రసంగాలు అర్థం చేసుకుంటారు.
దేవుడు నిన్ను పరిచర్య కొరకు సిద్ధపరిచాడు. నీ శిక్షణ, నీ నేపథ్యం, దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతిదీ ఆయనకు అప్పగించుకుంటే, ఆయన ఉద్దేశ్యం నెరవేర్చుకోవడానికి నిన్ను వాడుకుంటాడు. దేవుడు పరిచర్యకు పిలిచిన వారిని, ఆయన పిలిచిన పని కొరకు సిద్ధపరుస్తాడు.
పాఠం 1 అభ్యాసాలు
(1) ఈ పాఠంలో, యేసు శోధనను జయించిన మాదిరిని మనం చూశాం. క్రింది ఇచ్చిన మొదటి చార్ట్ లో, బైబిల్లో శోధనపై జయం పొందిన ముగ్గురు వ్యక్తుల పేర్లు రాయండి. శోధన సమయంలో వారికి బలమిచ్చిన ఒక విషయం చెప్పండి. బైబిల్లో శోధనలో పడిపోయిన ముగ్గరు వ్యక్తుల పేర్లు రాయండి. ప్రతి వ్యక్తి విషయంలో వారు శోధనలో పడిపోవడానికి కారణమైన ఒక కారణం రాయండి.
(2) మీ రాసిన ఉదాహరణల ఆధారంగా, శోధనపై ఒక ప్రసంగం లేక బైబిల్ అధ్యయనం సిద్ధం చేయండి. యేసు ఉదాహరణ అదే విధంగా చార్ట్ లో మీరు రాసిన పేర్లు కూడా ఉపయోగించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.