యేసు జీవితమూ పరిచర్య
యేసు జీవితమూ పరిచర్య
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 4: యేసువలే బోధించడం

1 min read

by Randall McElwain


పాఠం లక్ష్యాలు

ఈ పాఠం ముగిసే లోపు, విద్యార్థి:

(1) యేసును గొప్ప బోధకునిగా చేసిన గుణలక్షణాలను గుర్తించగలుగుతారు.

(2) బోధకునిగా అభివృద్ధి చెందడానికి ఆచరణాత్మక పద్ధతులు నేర్చుకొంటారు.

(3) తరగతికి విద్యార్థుల సిద్ధపాటును మెరుగుపరిచే అభ్యాసాలను ప్రణాళిక చేస్తారు.

పరిచర్యకు సూత్రం

మన విద్యార్థులు పూర్తిగా శిక్షణ పొందిన తర్వాత, వాళ్ల బోధకునిలా ఉంటారు.

పరిచయం

► ఈ పాఠం ముగింపులో అభ్యాసం లేదు. బదులుగా, పాఠం అంతటిలో “పాఠాన్ని ఆచరణలో పెట్టండి” అనే శీర్షిక క్రింద చిన్న చిన్న అసైన్మెంట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని రాయాల్సి ఉంటుంది లేక ఆచరించాల్సి ఉంటుంది. మిగిలిన అభ్యాసాలు, ఆలోచించేవి లేక చర్చించేవి. మీరు పాఠం మెటీరియల్ పై పని చేస్తుండగా ప్రతి అభ్యాసాన్ని చెయ్యాలి.

బోధనా శక్తి గురించి చేసిన ప్రకటనలన్నిటిలోకెల్లా ఒక అత్యద్భుత ప్రకటన యేసు చేశాడు: “శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును” (లూకా 6:40). యేసు శిష్యులకు శిక్షణ ఇస్తున్నప్పుడు, వాళ్లు ఆయన స్వభావాన్ని ప్రతిబింబిస్తారని యేసుకు తెలుసు. దీనిని బట్టి, యేసు పన్నెండుమంది శిష్యులకు బోధించడానికి గొప్ప సమయాన్ని వెచ్చించాడు.

కొన్ని సంఘాల్లో, సండేస్కూల్ ఉపాధ్యాయులకు ఎటువంటి అనుభవం, శిక్షణ లేకుండా పని అప్పగిస్తున్నారు. క్రొత్తగా రక్షించబడినవారికి లేక యౌవ్వన పిల్లలకు బోధించడానికి అసలు సమయమే కేటాయించట్లేదు.

సంఘ నాయకులుగా, యేసు బోధనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనం కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులు తమ బోధకునిలా మారినప్పుడు, బోధనా బాధ్యత చాలా గొప్పగా ఉంటుంది. ఉన్నత బోధకుడైన యేసు మాదిరిని అనుసరించునట్లుగా బోధకులకు మనం శిక్షణ ఇవ్వాలి.

► యేసు బోధనా శైలి గురించి మీకు ఇప్పటికే తెలిసిన విషయాలు ఆలోచించండి. ఆయనను గొప్ప బోధకునిగా చేసిన మూడు లేక నాలుగు లక్షణాలను గుర్తించండి. ఇప్పుడు మీరు నేర్చుకున్న ఉత్తమ బోధకుని గురించి ఆలోచించండి. ఆ వ్యక్తిని గొప్ప బోధకున్ని చేసిన మూడు లేక నాలుగు లక్షణాలు గుర్తించండి. వీటిలో ఎన్ని లక్షణాలు ఈ రెండింటిలోను ఉన్నాయి?

ప్రధాన బోధకుని హృదయం: గుణం/స్వభావం

యేసు బోధనలో విషయాలు, బోధకుని స్వభావంపై ఆధారపడి ఉంటాయి. యేసు హృదయమే ఆయన బోధకు పునాదిని ఏర్పరుస్తుంది. గొప్ప బోధకుని హృదయం ఏలా ఉంటుంది?

యేసు, ప్రధాన బోధకుడు, ఆయన విద్యార్థుల అవసరతలు గ్రహించాడు.

► లూకా 4:16-21 చదవండి.

స్కూల్ టీచర్లు, ప్రతి రోజు తరగతికి పాఠ్య ప్రణాళికను సిద్ధపరుస్తారు. ప్రతి తరగతిలో బోధకుడు ఏం చేస్తాడనేది పాఠ్య ప్రణాళిక చూపిస్తుంది. పాఠ్య ప్రణాళికలో ఇలాంటివి ఉంటాయి:

  • లక్ష్యం: విద్యార్థులు చిన్న చిన్న ముక్కలను జతచేయటం నేర్చుకుంటారు.

  • కార్యాచరణ: తరగతి వర్క్ బుక్ 89వ పేజీలోని 1-20 లెక్కలు చేస్తారు.

యేసు ఆయన పరిచర్య కొరకు పాఠ్య ప్రణాళిక కలిగియున్నాడు, కాని ఆయన పాఠ్య ప్రణాళికలో తరగతి వర్క్ బుక్ లో ఉన్నట్లుగా పేజీలు ఉండవు. బదులుగా, యేసు పాఠ్య ప్రణాళిక ఆయన విద్యార్థుల అవసరాలపై దృష్టిపెడుతుంది. యేసు ఏం నెరవేర్చడానికి పంపబడ్డాడో తన శ్రోతలకు చెప్పాడు:

  • బీదలకు సువార్త ప్రకటించుట.

  • చెరలోనున్న వారికి విడుదల.

  • గ్రుడ్డివారికి చూపు.

  • నలిగినవారిని విడిపించుట.

  • ప్రభువు హితవత్సరము ప్రకటించుట (లూకా 4:18-19).

యేసు లక్ష్యాలు ఆయన శిష్యుల అవసరాలు తీర్చాయి. యేసు శిష్యులు యెరూషలేము దేవాలయంపై నియంత్రణ కలిగి, సన్హేడ్రిన్లో/మహాసభలో రాజకీయ అధికారం, ఆస్తి కలిగిన సద్దూకయ్యులు కారు. ఆయన శిష్యులు, రోమీయులు పెట్టే బాధలు అనుభవిస్తున్న సాధారణ యూదా ప్రజలు. వాళ్లలో కొందరు గ్రుడ్డివారు లేక కుంటివారు. చాలావరకు, అధిక పన్నులు కట్టలేని బీదలు.

యేసు పాఠ్య ప్రణాళిక సులభం; ఆయన తన విద్యార్థుల అవసరాలు తీరుస్తాడు. చెరలోవారిని విడిపిస్తాడు. గ్రుడ్డివారికి చూపు ఇస్తాడు. యూదుల క్యాలెండర్లో, హితవత్సరం అంటే వేడుక జరుపుకునే సందర్భం. రుణాలు రద్దు చేసే సమయం; భూమి, అసలైన యజమాని కుటుంబానికి తిరిగి వస్తుంది; బానిసలకు స్వేచ్ఛ కలుగుతుంది. నలిగినవారికి హితవత్సరం ప్రకటించడానికి వచ్చానని యేసు ప్రకటించాడు.

ఆయన భూమిపై చేసిన పరిచర్య అంతటా, యేసు తన శిష్యుల అవసరాలు గురించి మాట్లాడారు. ప్రజలకు కోరిన ప్రతిదీ ఇవ్వలేదుగాని, అవసరమైనది ఇచ్చాడు. సమరయ స్త్రీకి నీళ్లు కోరింది; కానీ ఆమెకు విమోచన అవసరం (యోహాను 4:7-42). పేతురు చేపలు పట్టాలనుకున్నాడు; అతనికి పరిచర్య/మిషన్ అవసరం (మత్తయి 4:18-22). ప్రతి సందర్భంలో, యేసు తన శిష్యుల లోతైన అవసరాలు తీర్చాడు.

► మార్కు 10:17-22 చదవండి.

యేసు యొద్దకు వచ్చిన ధనవంతుడైన యౌవ్వనస్తుని కథలో, “యేసు అతని చూచి అతని ప్రేమించి” అని సువార్తికుడు చెప్పాడు. ఈ వచనంలో చూచి అనే పదానికి అర్థం కేవలం చూడటం మాత్రమే కాదు. లోతుగా చూసి, గ్రహించడమని అర్థం. యేసు ఈ యువకుడి హృదయం చూశాడు. కొందరు ధనవంతుడైన యువకుని మాత్రమే చూసి ఉంటారు; కాని యేసు ఆకలితో ఉన్న హృదయం చూశాడు.

► మార్కు 16:1-8 చదవండి.

పేతురు యేసును తిరస్కరించిన తరువాత, అతనికి కలిగిన అవమానం గురించి ఆలోచించండి. అతను కోడి కూయడం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన అవమానం పునరుత్థాన ఆనందాన్ని కూడా మ్రింగివేసింది. ఈ సందర్భంలో, దేవదూత మరియతో, “మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను.” శిష్యులందరిలోకెల్లా పేతురుకు ఎక్కువ భరోసా కావాలని యేసుకు తెలుసు. ఇతరులు తన యజమానుని తిరస్కరించిన పిరికివాని చూశారు; కాని యేసు పునరుద్ధరణ అవసరతలోనున్న తప్పిపోయిన శిష్యుడ్ని చూశాడు.

శిష్యుల్ని అర్థం చేసుకోకుండా వాళ్లకి బోధించలేమని యేసుకు తెలుసు. మీరు విద్యార్థి హృదయం గెలుచుకోవాలంటే, విద్యార్థిలాగా ఆలోచించాలి. మీరు బోధిస్తున్న వాళ్ల మనసు అర్థం చేసుకోవాలి. ఒక బోధకునిగా, విషయాలు అధ్యయనం చెయ్యాలి, అంతకంటే ఎక్కువగా, మీ విద్యార్థులను చదవాలి. మీ విద్యార్థుల అవసరాలు అర్థం చేసుకోవాలి.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీరు బోధిస్తున్న వాళ్ల గురించి ఆలోచించండి (అధికారికంగా లేక అనధికారికంగా). పోరాటాల్లో ఉన్న విద్యార్థిపై దృష్టిపెట్టండి. ఈ విద్యార్థి అవసరాలు తీర్చడానికి ఎలాటి ఆచరణాత్మక పనులు చేయగలరో జాబితా చేయండి.

యేసు, ప్రధాన బోధకుడు, సహనంగలవాడు

ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారి యెడల యేసు సహనంగా ఉన్నాడు.

► యోహాను 6:41-71 చదవండి.

ఈ కథ యేసు పరిచర్యలో ముఖ్య పరావర్తన దశలో చోటుచేసుకుంది. గత సంవత్సరంలో, యేసు గొప్ప ప్రజాదరణ పొందాడు. ఆయన అద్భుతాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, రొట్టెలు చేపలు తింటూ బాగా ఆనందించారు. ఇప్పుడు యేసు, “జీవాహారము నేనే” అని ప్రకటించాడు. ఆయన శ్రోతలను కలవరపరిచే మాటలు చెప్పాడు. “కావున యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు. అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.”

చాలామంది ఆయన బోధ అంగీకరించరని తెలిసి కూడా యేసు వేలమందికి బోధించాడు. ఒకరు ఆయనను తిరస్కరిస్తారని తెలిసి కూడా ఆయన పండ్రెండుగురికి బోధించాడు (యోహాను 6:70). ఆయన సహనంగల బోధకుడు.

ఆయనను అర్థం చేసుకోని వారియెడల యేసు సహనంగా ఉన్నాడు.

► మార్కు 8:27-33 చదవండి.

నిదానంగా నేర్చుకునే విద్యార్థుల విషయంలో యేసు సహనంగా ఉన్నాడు. సువార్తల్లో ఎన్నిసార్లు శిష్యులు తమ అనుమానాలను, అంధత్వాన్ని చూపించారో గమనించండి. పేతురు, “నీవు క్రీస్తువని,” గుర్తించినప్పుడు కూడా నిజంగా దాని అర్థం ఏంటో గ్రహించలేదు. కొన్ని వచనాల తరువాత, పేతురు చెడ్డ ఆలోచనలు బట్టి యేసు అతన్ని గద్దించాడు.

► యోహాను 3:1-21 చదవండి.

ఆయన బోధను అర్థం చేసుకోని పరిసయ్యుని విషయంలో యేసు సహనంగా ఉన్నాడు. నీకొదేము సందిగ్దంలో ఉన్నప్పుడు, “నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?” అని యేసు ఆశ్చర్యంతో అడిగాడు. ఇశ్రాయేలు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించే దినమొకటి వస్తుందని యెహెజ్కేలు చెప్పిన ప్రవచనం నీకొదేముకు తెలిసియుండాలి. కాని యేసు నిరాశపడకుండా, సహనంతో నీకొదేముకు బోధించాడు.[1]

ఇక్కడ బోధకుని సహనానికి ఒక మంచి పరీక్ష ఉంది: “నేను నిరాశతో వెనకడుగు వేయడానికి ముందు ఎన్నిసార్లు బోధించడానికి ఇష్డపడతాను?” యేసు తన విద్యార్థులకు బోధించాడు, మళ్లీ బోధించాడు. ఆయన బోధనకు విద్యార్థులు ఆసక్తిగా ఉన్నారని గ్రహించినప్పుడు, ఆ బోధన కొనసాగించాడు. యేసు, ప్రధాన బోధకుడు, సహనంగలవాడు.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీరెప్పుడైనా, నిదానంగా నేర్చుకునే విద్యార్థులను విడిచిపెట్టాలనే శోధనను ఎదుర్కొన్నారా? వాళ్లు మీ బోధకు స్పందించనప్పుడు నిరుత్సాహానికి గురైయ్యారా? ప్రధాన బోధకుని సహనం మీరు బోధించేవాళ్ల పట్ల ఎలా చూపించగలరు?

ప్రధాన బోధకుడైన యేసు, విద్యార్థుల్ని ప్రేమించాడు

► మార్కు 6:30-34 చదవండి.

పరిచర్య, జనసమూహం వలన కలుగుతున్న నిరంతర ఒత్తిడి నుండి విశ్రమించడానికి కొంచెం దూరంగా, ఏకాంతంగా యేసు తన శిష్యులను గలిలయ సముద్ర తీరానికి తీసుకెళ్లాడు. ఆయన వెళ్తున్నప్పుడు వేలమంది చూసి, యేసును కలుసుకోవాలని సముద్ర తీరాన పరిగెత్తుతూ వచ్చారు. యేసు అక్కడ 5,000 మంది పురుషులు, స్త్రీలను మరియు పిల్లలను చూశాడు. ఆయన జనసమూహాన్ని చూసి, “వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను” (మార్కు 6:34). ప్రధాన బోధకుడైన యేసు తన విద్యార్థులను ప్రేమించాడు గనుక బోధించాడు.

ముందు ఈ పాఠంలో, యేసును వెంబడించే క్రమంలో వెల చెల్లించడానికి ఇష్టపడకుండా విచారంగా వెళ్లిపోయిన ధనవంతుడైన ఒక యువకుని కథ మనం చదివాం (మార్కు 10:17-22). “యేసు అతని చూచి అతని ప్రేమించాడు” (మార్కు 10:21). ప్రధాన బోధకుడు తన శిష్యుడ్ని, తనను విడిచి వెళ్లిపోయిన శిష్యుడ్ని సైతం ప్రేమించాడు.

యేసు సమూహాలను, వ్యక్తులను, మరియు ఆయనను తిరస్కరించినవారిని సైతం చూసి కనికరపడ్డాడు. ఒక ప్రసంగికుడు, “యూదా, యేసు ప్రేమించిన శిష్యుడు” అనే ప్రసంగ శీర్షికపై ప్రసంగించాడు. యేసు యూదాను సైతం ప్రేమించాడనే విషయాన్ని ఈ ప్రసంగికుడు గుర్తించాడు. యూదా తనను తిరస్కరిస్తాడని తెలిసి కూడా, యేసు తుది వరకు అతన్ని ప్రేమించాడు.

క్లాసుకి త్వరగా వస్తూ, ప్రతి అభ్యాసాన్ని చేస్తూ, నేర్చుకోవడానికి ఆసక్తి చూపించే విద్యార్థిని ప్రేమించటం సులభం. మనలను తిరస్కరించే యూదాను, వెళ్లిపోయిన ధనవంతుడైన యువకుడిని, పదే పదే అర్థం చేసుకోవడంలో విఫలమౌతున్న వారిని ప్రేమించడం కష్టం. ప్రధాన బోధకుడైన యేసు, కష్టమైన విద్యార్థుల్ని సైతం ప్రేమించాలని చూపించాడు.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► ప్రేమించడానికి కష్టంగా అనిపించే విద్యార్థి గురించి ఆలోచించండి. బహుశా మీ నాయకత్వాన్ని ప్రతిఘటించే సిబ్బంది కావచ్చు. మిమ్మల్ని విమర్శించే సంఘ సభ్యుడు కావచ్చు. ఇలా ప్రార్థించడం మొదలుపెట్టండి, “దేవా, ఈ వ్యక్తిని ప్రేమించటం కష్టం, కాని నీవు వారిని ప్రేమిస్తున్నావని తెలుసు. నీ నేత్రాల ద్వారా వారిని చూడ్డానికి నాకు సహాయం చేయండి. యేసు తన శిష్యుల్ని ప్రేమించినట్లుగా నేను వారిని ప్రేమించడానికి సహాయం చేయండి.”


[1]యోహాను 3:5, యెహెజ్కేలు 36:25-27 వాగ్దానాన్ని సూచిస్తుంది. దేవుని ప్రజలు నీటితో కడుగబడు (ఇది అపవిత్రత నుండి, విగ్రహములవల కలుగు అపవిత్రత నుండి శుద్ధి చేస్తుంది) మరియు నూతన ఆత్మ పొందుకునే (ఇది దేవుని నియమాల్ని ఆచరించాలనే ఆశ కలిగిస్తుంది) దినము యెహెజ్కేలు చూశాడు.

ప్రధాన బోధకుని చేతులు: పద్ధతులు

“ప్రధాన బోధకుని హృదయం”లో మనం యేసు గుణం చూశాం. యేసు బోధించిన ప్రతిదీ ఆయన గుణంపై ఆధారితం. “ప్రధాన బోధకుని చేతుల”లో యేసు ఉపయోగించిన పద్ధతులు మనం చూస్తాం. మనం యేసువలే బోధించాలంటే, ఆయన పద్ధతులు తప్పక పాటించాలి.

యేసు, ప్రధాన బోధకుడు, ఆయన లక్ష్యాలు తెలియపరిచాడు

► లూకా 5:1-11 చదవండి.

యేసు గలిలయ తీరాన బోధిస్తుండగా, జనసమూహం ఆయన మీద పడుతున్నప్పుడు ఆయన సీమోను పేతురు దోనె ఎక్కవలసి వచ్చింది.[1] బోధించిన పిమ్మట, యేసు పేతురును చూసి, “నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని” (లూకా 5:4) చెప్పాడు.

సీమోను అనుభవజ్ఞుడైన జాలరి, రాత్రంతా చేపలుపట్టినా ఏం దొరకలేదు. ఆ సమయంలో చేపలు పట్టే ప్రయత్నం చేసినా అది పని చెయ్యదని అతనికి తెలుసు కాని యేసు ఆజ్ఞాపించినట్లు చేశాడు. పేతురు ఆశ్చర్యపోయేలా, జాలర్లు విస్తారమైన చేపలను పట్టుకొని తీసుకొచ్చారు. యేసు సీమోనుతో, “ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని” (లూకా 5:10) చెప్పాడు.

యేసు, మంచి బోధకులందరివలే, ఆయన లక్ష్యాలు తన విద్యార్థులకు తెలియజేశాడు. పెంతెకొస్తను దినమందు, యేసు తన కొరకు ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని పేతురు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించాడు.

ప్రభావవంతమైన బోధకులు తమ లక్ష్యాలు తెలియజేస్తారు. వారు విద్యార్థులకు ఇలా చెబుతారు, “నేడు మీరు నేర్చుకోబోయేది ఇది.” పాఠం ముగింపులో, “నేడు మీరు ఏం నేర్చుకున్నారు” అని అడుగుతారు. పాఠం లక్ష్యం నెరవేరిందని విద్యార్థులు గుర్తించారో లేదో నిర్థారించుకుంటారు.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీకు మళ్లీ బోధనా అవకాశం వచ్చినప్పుడు, పాఠం లక్ష్యాలు బోర్డుపై విద్యార్థులకు కనబడేటట్లు రాయండి. లక్ష్యం తేటగా, సులభంగా అర్థమయ్యేట్లుగా చూడండి. పాఠం మొదలుపెట్టే ముందుగా లక్ష్యాన్ని పరిచయం చెయ్యండి. పాఠం ముగింపులో. “మన లక్ష్యం సాధించామా?” అని విద్యార్థుల్నిఅడగండి.

ప్రధాన బోధకుడైన యేసు, తన మార్గదర్శకత్వంతో అభ్యాసం చేసే అవకాశాలు ఇచ్చాడు

ప్రభావవంతమైన బోధన సాధారణ ఉపన్యాసాలకు మించింది. నిజంగా నేర్చుకోవాలంటే అభ్యాసం అవసరం.

► లూకా 10:1-24 చదవండి.

ఈ శిష్యులు ఇంకా పూర్తిగా శిక్షణ పొందలేదు కాని యేసు తాను బోధిస్తున్న పాఠాలు వాళ్లకి అభ్యసింపజేశాడు. శిష్యులు పరిచర్య చేసి, తిరిగి వచ్చిన తర్వాత, యేసుకు ఆ పరిచర్య విషయాలు చెప్పారు. వాళ్లకి పాఠాలు అర్థం కాలేదని యెరిగి, ఆయన మరిన్ని హెచ్చరికలు ఇచ్చాడు. “మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి” (లూకా 10:23)” అని చెప్పి కూడా వారిని ప్రోత్సహించాడు. యేసు వారి అభ్యాసానికి దిశా నిర్దేశం చేశాడు.

అభ్యసించడానికి అవకాశం ఇస్తే చాలదు; అభ్యాసాన్ని పరీక్షించాలి, తరువాత మరింత శిక్షణ ఇవ్వాలి. “అభ్యాసం పరిపూర్ణత నిస్తుంది” అనే ఒక సుపరిచితమైన సామెత ఉంది. ఇది పూర్తిగా నిజం కాదు. తప్పుడు అభ్యాసం సరైన పనితీరును కలిగించదు. “మార్గనిర్దేశిత అభ్యాసం పరిపూర్ణత నిస్తుంది” అని చెప్పడం మంచిది. ప్రభావవంతమైన బోధకుడు తన విద్యార్థులకు అభ్యాస అవకాశం ఇస్తాడు, విద్యార్థులతో కలిసి అభ్యాసాన్ని సమీక్షిస్తాడు, ఆ తర్వాత విద్యార్థులను ప్రోత్సహించి, నడిపిస్తాడు.

మార్గనిర్దేశిత అభ్యాసపు విలువ పౌలుకు తెలుసు. అతను తిమోతి, తీతుకు శిక్షణ ఇచ్చి, వాళ్లని పరిచర్యలో ఉంచాడు. కాపరి పత్రికల్లో, తిమోతి, తీతుకు మరింత ఉపదేశమిస్తూ పౌలు రాశాడు. అతడు బోధించిన సూత్రాలను వారు అభ్యసిస్తుండగా తన శిష్యులను నడిపించాడు.

దక్షిణ ఆఫ్రికాలోని ఒక పాఠశాల, తరగతి గదిలో ప్రతి విద్యార్థి 1 కొరింథీయులకు 13 కంఠస్థం చేశారు. ఈ అభ్యాసంతో ఒక విద్యార్ధి కొన్ని వారాలు సతమతమయ్యాడు. సరిగా కంఠస్థం చేయలేకపోయాడు, ఇతర విద్యార్థుల ఎదుట సిగ్గుపడ్డాడు. చివరకు, ఒకరోజు ఆ విద్యార్ధి తరగతి అందరి మధ్యలో అధ్యాయం మొత్తాన్ని చూడకుండా చెప్పగలిగాడు.

అతడు ఆ అధ్యాయాన్ని చూడకుండా చెప్పడం ముగించగానే, ఇతర విద్యార్థులు లేచి నిలబడి, చప్పట్లు కొట్టారు. ఎందుకు? ఈ అధ్యాయం ప్రేమ గురించి, పేమ ఇతరులను ప్రోత్సహిస్తుందని వాళ్ల బోధకుడు విద్యార్థులకు బోధించాడు. వాళ్లు వాళ్ల తోటి విద్యార్థిని ప్రోత్సహిస్తుండగా, ఈ విద్యార్థులు 1 కొరింథీయులకు 13 పాఠాన్ని ఆచరణలో పెట్టారు! ప్రభావవంతమైన బోధకులు తమ విద్యార్థులు నేర్చుకుంటున్న సూత్రాలను ఆచరించేలా ప్రోత్సహించాలి.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీ విద్యార్థులు నేర్చుకుంటున్న వాటిని ఆచరించడానికి అవకాశం ఇవ్వండి. మీరు యౌవ్వన పాస్టర్లకు శిక్షణ ఇస్తుంటే, వాళ్లకి ప్రసంగించే అవకాశం, రోగులను దర్శించే అవకాశం లేక అవిశ్వాసితో సువార్త పంచుకునే అవకాశం ఇవ్వండి. వాళ్లు ఆ పని చేసిన తర్వాత, వాళ్ల పరిచర్యను మూల్యంకనం చేయండి, మెరుగుపడడం కోసం కొన్ని సలహాలు ఇవ్వండి, వాళ్లు సాధించిన కొన్ని విషయాలను ప్రస్తావించి వాళ్లని ప్రోత్సహించండి.

యేసు, ప్రధాన బోధకుడు, మృదువైనవాడు

యేసు బోధించిన అనేక పరిస్థితులను, ప్రదేశాలను గురించి ఆలోచించండి. ఆయన ఈ పరిస్థితుల్లో, ప్రదేశాల్లో బోధించాడు:

  • సముద్రతీరాన (లూకా 5)

  • తుఫాను మధ్యలో (లూకా 8:22-25)

  • విద్యార్థికి పోరాటాలు అనుమతించడం ద్వారా (మత్తయి 14:25-33)

  • ఆయన పాఠానికి ఇతరులు అంతరాయం కలిగించినప్పుడు (మత్తయి 12:46-50)

  • దేవాలయ దర్శన సమయంలో (మత్తయి 24)

  • ఒకరు ఆయన తరగతి గది పైకప్పు తొలగించినప్పుడు (లూకా 5:18-26)

లూకా 5:18-26లో అద్భుతం తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన విద్యార్థుల గురించి ఆలోచించండి. యేసు శక్తి గురించి వాళ్లు నేర్చుకున్న ఈ పాఠం వారెన్నడూ మర్చిపోలేదు. “అందరును విస్మయమొంది–నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి” (లూకా 5:26) అని లూకా రాశాడు.

విద్యార్థులు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రధాన బోధకుడు బోధించే అవకాశాలు కనుగొంటాడని యేసు గ్రహించాడు. లూకా ఈ సూత్రానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. “ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు– ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను.” (లూకా 11:1) ఆయన ప్రార్థన గురించి బోధించడానికి ఈ సందర్భం ఉపయోగించుకున్నాడు.

ఎనిమిదేళ్ల అమ్మాయి అబీగయీలు పియానో పాఠం నేర్చుకోవడానికి గదిలోకి వచ్చి, “ఈ ఉదయం నా పిల్లి చనిపోయింది!” అని చెప్పి ఏడ్వసాగింది. స్కేల్ వాయించాలనిగాని లేక పియానో టెక్నిక్ నేర్చుకోవాలనిగాని అబీగయీలుకు ఆసక్తి లేదు. అయితే, ఆమె గురువు ఆమెకు “My Favorite Kitten” (నాకు ఇష్టమైన పిల్లి) అనే సంగీతం పుస్తకం ఇచ్చినప్పుడు “దీనిని నేను నా పిల్లికి జ్ఞాపకార్థంగా నేర్చుకుంటాను” అని అబీగయీలు నిర్ణయించుకుంది.

బోధకులుగా, మనం మన విధ్యార్థుల బాధ విని, దానికి అనుగుణంగా స్పందించాలి. ప్రధాన బోధకుడైన యేసువలే, మనం బోధనా విధానంలో సున్నితంగా ఉండాలి. మన విద్యార్థుల పరిస్థితులకు అనుగుణంగా పాఠాలు చెప్పడానికి ఇష్టపడాలి.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీరు మీ బోధనా విధానంలో సున్నితంగా ఉన్నారా? పాఠాన్ని బోధించే కనీసం రెండు పద్ధతులు ప్రణాళిక చేయండి. ఒకవేళ మీరు సహజంగా ఉపన్యాసం ఇచ్చేవారైతే, ఉపన్యాసం లేకుండా చర్చ లేక కార్యాచరణ ఆధారంగా పాఠాన్ని ప్రణాళిక చేయండి. ఒకవేళ మీరు పవర్ పాయింట్ లేక ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే, విద్యుత్ శక్తి ఉపయోగించకుండా పాఠాన్ని ప్రణాళిక చేయండి.

యేసు, ప్రధాన బోధకుడు, సృజనాత్మకంగా బోధించాడు/సంభాషించాడు

యేసు కూర్చొని, “ఈరోజు మనం మన పాఠ్యపుస్తకం నుండి 212వ పేజి చదువుకుందాం. పేతురు, మా కొరకు నువ్వు మొదటి పేరా చదువు” అని ఎప్పుడూ చెప్పలేదు. బదులుగా, సృజనాత్మకంగా సంభాషించే మార్గాలు కనుగొన్నాడు.

► యేసు సృజనాత్మక బోధలో ఈ ఉదాహరణలు చదవండి:

  • లూకా 6:39-42. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపే వ్యంగ్యం గురించి ఆలోచించండి. తన కంటిలో దూలం ఉంచుకొని సహోదరుని కంటిలో నలుసు తీయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి గురించి ఆలోచించండి.

  • లూకా 18:18-30. భూలోక సంపదతో దేవుని రాజ్యంలో ప్రవేశం పొందటం సాధ్యమా? సూది బెజ్జంలో ఒంటె దూరటం గురించి ఆలోచించండి!

  • లూకా 9:46-48. విధేయత గురించి బోధించడానికి యేసు పిల్లల జీవితాన్ని మాదిరిగా ఉపయోగించాడు.

  • లూకా 15:1-7. నశించిన ఆత్మల పట్ల దేవుడు ఎలా స్పందిస్తాడు? యేసు గొర్రె విలువ గురించి రైతులకు/కాపరులకు తెలియజేశాడు.

  • లూకా 15:11-32. పూర్తి అధికారం తండ్రి చేతిలో ఉన్న పితృస్వామ్య సమాజంలోని ప్రజలకు బోధిస్తూ, యేసు ఒక ఉపమానం చెప్పాడు, ఆ ఉపమానంలో, తండ్రి తిరుగుబాటు చేసిన కుమారుని యొద్దకు పరిగెత్తుకుని వెళ్తూ ప్రజలను ఆశ్చర్యపరిచాడు.

యేసు, తనకు ఎదురైన ఒక ప్రశ్నకు నేరుగా సమాధానం చాలా తక్కువగా చెప్పాడు. బదులుగా, ఆయన ఒక కథ ద్వారానో లేక తిరిగి ప్రశ్నించడం ద్వారానో సమాధానం చెబుతాడు. లూకా 10లో, “బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను?” ఒక న్యాయవాది ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా, యేసు మంచి సమరయుని కథ చెప్పాడు (లూకా 10:25-37).

గొప్ప ప్రశ్నలు ఎలా అడగాలో యేసుకు తెలుసు. “అవును” లేక “కాదు” అని సులభంగా సమాధానం చెప్పే ప్రశ్నలు యేసు చాలా తక్కువగా అడిగేవాడు. ఎక్కువగా, ఆయన అడిగే ప్రశ్నలు శ్రోతలను క్రొత్త అవకాశలవైపు దృష్టిపెట్టేలా చేసేవి.

► ఈ ఉదాహరణలు చదవండి:

  • లూకా 7:36-50. ఆయనను విమర్శించిన పరిసయ్యునితో యేసు, “ఎవడు అతని ఎక్కువగా ప్రేమించును, ఎక్కువ అప్పు క్షమించబడినవాడా లేక తక్కువ అప్పు క్షమించబడినవాడా?” అని ప్రశ్నించాడు.

  • మార్కు 8:36. శిష్యత్వం గురించి బోధిస్తూ, యేసు ఇలా అడిగాడు, “ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?”

  • లూకా 6:46. విధేయత చూపనివారితో, యేసు ఇలా చెప్పాడు, “నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక– ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?”

ఈ ప్రశ్నల్లో దేనికీ సులభమైన సమాధానం లేదు. ప్రతి ప్రశ్న యేసు బోధ గురించి లోతుగా ఆలోచించేటట్లు చేస్తుంది.

బోధకులు ప్రశ్నలు సరిగా ఉపయోగించడంలో విఫలమవ్వడానికి రెండు కారణాలున్నాయి.

1. మనం మరీ సులభమైన ప్రశ్నలు అడుగుతుంటాం. మన విద్యార్థులు లోతుగా ఆలోచించాలంటే, అవునని లేక కాదని లేక పాఠ్యపుస్తకంలో నుండి చెప్పే సమాధానాలు లేనటువంటి ప్రశ్నలు అడగాలి.

2. మనం జవాబు కోసం ఎక్కువ సమయం వేచివుండం. చాలామంది బోధకులు విద్యార్ధి సమాధానం చెప్పడానికి కనీసం ఒక్క క్షణం కూడా ఇవ్వకుండా ప్రక్క విద్యార్థిని అడుగుతుంటారని పరిశోధనలో వెల్లడైంది. విద్యార్థి ప్రశ్నను సరిగా అర్థం చేసుకుని సమాధానం చెప్పడానికి కనీసం మూడు క్షణాలు పడుతుంది. మీరు ప్రశ్నలు ఉపయోగించే విధానం మెరుగుపడాలంటే, ప్రక్క విద్యార్థిని అడిగే ముందు కనీసం యేడు క్షణాలు వేచి ఉండాలి.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీరు బోధించేటప్పుడు సృజనాత్మకంగా ఉన్నారా? గలతీయులకు 6:7-8 పై పాఠం సిద్ధపరచండి. విత్తటం మరియు కోయడమనే సూత్రం గురించి విద్యార్థులు లోతుగా ఆలోచించేలా ప్రశ్నలు సిద్ధపరచండి. ప్రశ్నలు సిద్ధపరచిన తర్వాత, మరిన్ని అదనపు ప్రశ్నల కోసం క్రింద సూచనలు/ఫుట్ నోట్స్ చూడండి.[2]


[1]లూకా “గెన్నేసరెతు సరస్సు” యోహాను “తిబెరియ సముద్రం” మరియు మార్కు “గలిలయ సముద్రం,” మోషే “కిన్నెరెతు సముద్రం” (సంఖ్యాకాండము 34:11) ఇవన్నీ యేసు పరిచర్యలో ముఖ్యమైన పెద్ద సరస్సును సూచిస్తాయి. యేసు శిష్యులలో చాలామంది ఈ సరస్సులో జాలర్లు, అదే విధంగా ఆయన పరిచర్య ఎక్కువగా గలిలయ సముద్ర తీరంలో జరిగింది.
[2]గలతీయులకు 6:7-8: లో విత్తటం మరియు కోయటం అనే సూత్రం గురించి ప్రశ్నలు:
ప్రకృతి లేక సమాజంలో విత్తటం కోయటం గురించి ఉదహరరించే ఉపమానాలు ఏంటి?
ఈ సూత్రాన్ని ఉదహరించే కొన్ని బైబిల్ పాత్రలు ఏవి?
ఈ సూత్రం గురించి మీకు ఏవైన వ్యక్తిగత ఉదాహరణలు ఉన్నాయా?
మీ వ్యక్తిగత జీవితంలో కోయటానికి ఇష్టలేని విత్తనాలు మీరు విత్తుతున్నారా?

నిశిత పరిశీలన: ఉపమానాలు వివరించడం

ఉపమానం యేసుకు ఇష్టమైన బోధనా విధానం. ఉపమానం అంటే “పరలోక పాఠం కలిగిన భూలోక కథ” అని ఒకరు చెప్పారు. యేసు, తన విద్యార్థుల ఆసక్తితో అనుసంధానం చేయడానికి ఉపమానాల్లో, సుపరిచిత గ్రామీణ సందర్భాలు (రైతులు, కాపరులు, గొర్రెలు), సుపరిచిత ప్రజలు (సమరయులు, యాజకులు, సుంకరులు, పరిసయ్యులు) మరియు సుపరిచిత పరిస్థితులను (తప్పిపోయిన గొర్రె, పోయిన నాణెం, పారిపోయిన కుమారుడు) ఉపయోగించాడు.

Shepherds Global Classroom లో బైబిల్ భాష్యానికి సూత్రాలు అనే పుస్తకంలో ఉపమానాల వివరణపై ఒక భాగం ఉంది. ఆ సబ్జెక్టులో బోధించిన సూత్రాల సారాంశం ఇక్కడుంది. ఒక ఉపమానం చదువుతున్నప్పుడు, మనం ఇలా ప్రశ్నించాలి:

(1) ఈ ఉపమానాన్ని ప్రేరేపించిన ప్రశ్న లేక పరిస్థితి ఏంటి?

మంచి సమరయుని ఉపమానం, “నా పొరుగువాడెవడని?” న్యాయవాది అడిగిన ప్రశ్నకు సమాధానం. యేసు ఉపమానం ఇలా జవాబిస్తుంది, “నా మార్గంలో అవసరతలో ఉన్న ప్రతివాడు నా పొరుగువాడు మరియు అది నా బాధ్యత” (లూకా 10:36-37).

పాపులతో తన స్నేహాన్ని విమర్శించిన మతాధికారులకు యేసు తప్పిపోయిన కుమారుని ఉపమానం చెప్పాడు: “ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులును శాస్త్రులును అది చూచి–ఇతడు పాపులను చేర్చుకొని వారితోకూడ భోజనముచేయుచున్నాడని చాల సణుగుకొనిరి.

అందుకాయన వారితో ఈ ఉపమానం చెప్పెను” (లూకా 15:1-3).

  • కాపరి గొర్రెను పోగొట్టుకున్నాడు. ఆ గొర్రె దొరికినప్పుడు ఆనందించాడు!

  • ఒక స్త్రీ నాణెం పోగొట్టుకుంది. ఆ నాణెం దొరికినప్పుడు ఆమె ఆనందించింది!

  • తండ్రి తన కుమారుని పోగొట్టుకున్నాడు. తన కుమారుడు తిరిగి రాగా అతను ఆనందించాడు!

యేసు ఇలా సూచించాడు: “నేను పాపులతో భోజనం చేసినప్పుడు మీరు ఆశ్చర్యపడకూడదు. ఒక్క పాపి పశ్చాత్తాపపడినప్పుడుపరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది!”

మన వివరణ, ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే లేక కథను ప్రేరేపించిన పరిస్థితిని పరిష్కరించకపోతే, మనం ఉపమాన సారం కోల్పోయినట్లే.

(2) ఉపమానంలో ప్రధాన విషయం (లేక విషయాలు) ఏంటి?

ఉపమానంలో ఎల్లప్పుడు ప్రతి కథలోని ప్రధాన పాత్రకు ఒక ముఖ్య విషయం ఉంటుంది. ఉపమానంలోని ప్రధాన పాఠం నేరుగా ఉపమానాన్ని ప్రేరేపించిన ప్రశ్నకు లేక పరిస్థితికి అనుసంధానంగా ఉంటుంది. ఇతర పాఠాలు కథలోని పాత్రల నుండి వస్తాయి.

తప్పిపోయిన కుమారుని కథలో మూడు పాత్రలున్నాయి. కథలోని ప్రధాన పాఠం, మారుమనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషం కలుగుతుందని చెప్పడమని మనం చూశాం. ఈ పాఠం యేసు ఉపమానాన్ని ప్రేరేపించిన పరిస్థితికి సమాధానమిస్తుంది. ఉపమానంలోని ప్రతి పాత్ర, కథలోని ప్రధాన పాఠానికి సంబంధించి పాఠాలు బోధించవచ్చు. ఉపమానంలోని తండ్రి, మన పరలోకపు తండ్రి యొక్క అద్భుత ప్రేమ గురించి బోధిస్తాడు. తప్పిపోయిన కుమారుడు పాపం యొక్క వెలను, అదే విధంగా పశ్చాత్తాప సాధ్యతను రెండింటిని బోధిస్తాడు. అన్న, మంచి కుమారుడుగా కనిపించినప్పటికీ, తండ్రి ప్రేమ వలన పొందే ఆధిక్యతలను మనం కోల్పోయే అవకాశముందని బోధిస్తాడు.

(3) ఉపమానానికి ఏ సాంస్కృతిక వివరాలు ముఖ్యం?

యేసు ఉపమానాలు ఎల్లప్పుడు ఆయన సంస్కృతికి భిన్నంగా ఉండేవి. ఈ కారణంగానే ఉపమానాలు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది: తండ్రి తిరుగుబాటు చేసిన కుమారుని ఆహ్వానించడానికి పరిగెత్తటం; సమరయుడు వీరుడు/హీరో; నిస్సయురాలైన విధవరాలు అధికారియైన న్యాయాధిపతిని ఓడించటం. మనం ఉపమాన సాంస్కృతిక నేపథ్యాన్ని బాగా అర్థం చేసుకుంటే, యేసు సందేశాన్ని కూడా అంతే బాగా అర్థం చేసుకుంటాం.

అన్వయం: బోధకుని ఏడు నియమాలు

డా. హోవార్డ్ హెండ్రిక్స్[1] డల్లాస్ థియోలాజికల్ సెమినరీలో 60 సంవత్సరాలకు పైగా బోధించాడు. అతని కెరీర్లో, 10,000 మందికి పైగా విద్యార్థులకు బోధించాడు. అతని అత్యంత ప్రభావవంతమైన పుస్తకాల్లో ఒకటి, తన తత్వశాస్త్రాన్ని సంగ్రహించి రాసిన చిన్న పుస్తకం “Seven laws of the teacher” (బోధకుని ఏడు నియమాలు). ఈ నియమాలు యేసు బోధనా శైలి ఆధారితం. మీరు ఈ నియమాలు అన్వయించుకొంటే ప్రభావవంతమైన బోధకులౌతారు.

బోధకుని నియమం

బోధకుని నియమం. ఈరోజు మీరు ఎదగటం మానేస్తే, రేపు బోధించటం మానేస్తారు.

డా. హెండ్రిక్స్ ఇలా అడిగాడు, “మీరు మంచినీళ్లు పాత చెరువులోవి త్రాగుతారా లేక ప్రవహించే సెలయేరు నుండి త్రాగుతారా?” ప్రవహించకుండా ఒకేచోట నిలవుండి, చూడడానికి మంచిగా అనిపించని చెరువులో నీళ్ల కంటే తాజాగా ప్రవహించే సెలయేరు నీళ్లే త్రాగుతారు.

కొందరు బోధకులు తమ సబ్జెక్ట్ కి సంబంధించిన ఇతర క్రొత్త పుస్తకాలు చదవకుండ లేక ఎటువంటి క్రొత్త ఆలోచనలు పొందకుండ సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు. వాళ్ల బోధన నిలవున్న ఆ పాత చెరువు నీళ్లలా మారుతుంది. బోధకులుగా, దేవుని వాక్యంలో క్రొత్త అవగాహనను పొందడానికి నిరంతరం అధ్యయనం చేస్తున్న పాస్టర్లవలే మనం కూడా నేర్చుకోవాలి.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► “బోధకుడా, నువ్వు బైబిల్లోనుండి ఈ మధ్యకాలంలో ఏం నేర్చుకున్నావు?” అని ఒక విద్యార్థి మిమ్మల్ని అడిగాడని భావించండి. మీ సమాధానం ఈవారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో లేక చాలాకాలం క్రితం అని వస్తుందా? దేవుని వాక్య జ్ఞానమందు మీరు అనుదినం ఎదుగుతున్నారా?

బోధన నియమం

బోధన నియమం: ప్రజలు నేర్చుకునే విధానం మీరెలా బోధిస్తున్నారో నిర్ణయిస్తుంది

యేసు కాపరులకు గొర్రెల కథలు చెప్తూ బోధించాడు; “మనుష్యులను పట్టే జాలర్లు” గురించి మాట్లాడుతూ జాలర్లకు బోధించాడు; బావి యొద్ద స్త్రీతో నీళ్ల గురించి మాట్లాడుతూ బోధించాడు. ప్రభావవంతమైన బోధకుడు ప్రతి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ఉంటాడని యేసుకు తెలుసు.

[2]డా. హెండ్రిక్స్ బోధనను ఫుట్ బాల్ కోచ్ పనితో పోల్చాడు. కోచ్ ఆట ఆడడు; ఆటగాళ్లను నడిపిస్తాడు, ఉత్తేజపరుస్తాడు. అదేవిధంగా, ప్రధాన బోధకుడు ఉపన్యాసాలిస్తూ పనంతా తానే చేయడు. ప్రధాన బోధకుడు విద్యార్థికి ప్రభావవంతమైన రీతిగా ఉండే విధంగా నేర్చుకోవడానికి ప్రతి విద్యార్థిని ప్రేరేపిస్తాడు.

అరుణ్, ఒక బైబిల్ క్లాస్ విద్యార్థి. విద్యార్థులందరూ పరీక్ష కోసం జాగ్రత్తగా నోట్స్ తీసుకోవాలని బోధకుడు ఆశించాడు. అరుణ్ నోట్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. బదులుగా, బోధకుడు బోధిస్తూ ఉండగా, నోటు బుక్ లో బొమ్మలు గీస్తూ ఉండేవాడు. అరుణ్ వినట్లేదని బోధకుడు భయపడ్డాడు. “అరుణ్, బొమ్మలు గీయకు. నేను చెప్పేది రాసుకో” అని బోధకుడు పదే పదే చెప్పాడు. బోధకుడు చెప్పింది చేయడానికి అరుణ్ ప్రయత్నించాడు కాని చాలా విసిగిపోయాడు.

అప్పుడు బోధకునికి డా. హెండ్రిక్స్ బోధనా నియమం గుర్తొచ్చింది. “అరుణ్, ఒక ప్రయోగం చేద్దాం. నేను క్లాసులో చెప్పింది నీకు గుర్తుంటే బొమ్మల్లో గీసి చూపించు” అన్నాడు. ప్రయోగం సఫలమయ్యింది. అరుణ్ మాటల్ని బొమ్మల్లోకి మార్చి నేర్చుకున్నాడు. బోధకుడు తన అంచనాలు మార్చుకోవటం నేర్చుకున్నాడు ఎందుకంటే “ప్రజలు నేర్చుకునే విధానం మీరెలా బోధిస్తున్నారో నిర్ణయిస్తుంది.”

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీ తరగతిలో విద్యార్ధులందరిలో భిన్నంగా నేర్చుకునే విద్యార్ధి ఉన్నాడా? విద్యార్ధి ప్రభావవంతంగా నేర్చుకోవడానికి మీరెలా సహాయపడగలరు?

కార్యాచరణ నియమం

కార్యాచరణ నియమం: ఎక్కువ భాగస్వాములవ్వడం ఎక్కువ నేర్చుకోవడానికి సహాయం చేస్తుంది.

ఆయన శిష్యులు తాను బోధిస్తున్న పాఠాలను తప్పక ఆచరించాలని యేసుకు తెలుసు. ఆయన వారిని పరిచర్య కొరకు పంపాడు; జనసమూహాలకు రొట్టె చేపలు పంచిపెట్టించాడు; ప్రార్థన కోసం అరణ్యప్రదేశానికి తీసుకెళ్ళాడు. వాళ్లు నేర్చుకున్నది ఆచరించే అవకాశాలు ఇచ్చాడు. దాని ఫలితం ఏంటి? అపొస్తలులు భూలోకాన్ని తలక్రిందులు చేసేవారిగా ప్రసిద్ధిచెందారు (అపొస్తలుల కార్యములు 17:6).

[3]మనస్తత్వవేత్తలు ఇలా చెబుతారు

  • మనం విన్నవాటిలో పదిశాతం కంటే తక్కువ గుర్తుంచుకుంటాం.

  • మనం చూసి, విన్న వాటిలో యాభైశాతం కంటే తక్కువ గుర్తుంచుకుంటాం, కాని

  • మనం విని, చూసి, చేసినప్పుడు తొంబై శాతం గుర్తుంచుకుంటాం.

చురుకుగా పాలుపొందినప్పుడు ఎక్కువగా నేర్చుకుంటాం.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీరు తదుపరి పాఠం కోసం సిద్ధపడుతుండగా, మీరు బోధిస్తున్న సూత్రాన్ని విద్యార్థులు ఆచరణలో పెట్టేటట్లుగా కార్యాచరణ సిద్ధం చేయండి.

సంభాషణ/సమాచార నియమం

సమాచార/సంభాషణ నియమం: నిజంగా బోధించాలంటే, విద్యార్థితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి.

బోధకులు, సేవకులుగా మనం సమాచార పనిలో ఉన్నాం. మన పని కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, దానికి మించింది; మన పని, సత్యాన్ని మన శ్రోతలకు చెప్పడం. సంభాషించాలంటే సాధారణ విషయం కనుగొనడం అవసరం. మన విద్యార్ధులతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని కమ్యూనికేషన్ ఆశిస్తుంది.

విద్యార్థులతో సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి యేసు ఒక మాదిరిని అందించాడు.యేసుకు, సమరయ స్త్రీకి మధ్య అవరోధాలు ఉన్నాయి : జాతీ, మత, సాంఘిక అవరోధాలు. యేసు యూదుడు; ఆమె సమరయురాలు. యేసు పురుషుడు; ఆమె స్త్రీ. యేసు గౌరవనీయమైన బోధకుడు; ఆమె అనైతికమైన స్త్రీ. ఈ అవరోధాలున్నప్పుడు యేసు సంబంధం ఎలా ఏర్పాటు చేస్తాడు? ఆయన సామాన్యమైన విషయాన్ని కనుగొన్నాడు; ఇద్దరు దప్పిగొన్నారు. శారీరక అవసరత జీవితాన్ని మార్చివేసే అనుభవాన్ని ఇచ్చింది. (యోహాను 4:1-42).

కమ్యూనికేషన్ లో మూడు దశలుంటాయని డా. హెండ్రిక్స్ రాశాడు:

1. జ్ఞానం- నాకు తెలిసింది. ఇది సమాచారంలో సరళ స్థాయి.

2. భారం- నా భావన. ఇది సమాచారంలో లోతైన స్థాయి.

3. క్రియ- నేను చేసే పని. ఈ సమాచార స్థాయి మన విద్యార్థులను మారుస్తుంది.

ఆఫ్రికాలో సెమినరీ పరిపాలకుడు (అడ్మినిస్ట్రేటర్) తన దర్శనాన్ని ఒక సంపన్న దాతకు చెబుతుండగా, సునీల్ విన్నాడు. సునీల్ ఊహించినదానికంటే ఎక్కువ డబ్బు అతను ఆ దాతను (Donor) అడిగాడు. సునీల్ ఆశ్చర్యాన్ని మరింత పెంచేలా, ఆ దాత ఉదారంగా ఇచ్చాడు. ఎందుకు? సెమినరీ పరిపాలకుడు మూడు స్థాయిల్లో మాట్లాడాడు:

1. జ్ఞానం- ఆఫ్రికాలో సెమినరీ శిక్షణ అవసరత అతనికి తెలుసు.

2. భారం – అతను ఆఫ్రికాలో సంఘ నాయకులకు శిక్షణ ఇవ్వాలనే భారం కలిగినవాడు.

3. క్రియ- అతడు ఆఫ్రికాలో ఉండి, సంఘ నాయకులకు శిక్షణ ఇవ్వడానికి చాలా త్యాగం చేశాడు. తాను ఆఫ్రికాలో ఏం చేస్తున్నాడో పరిపాలకుడు చెప్పాడు.

ప్రభావవంతంగా బోధించాలంటే, మనకు సబ్జెక్ట్ విషయంలో భారం ఉండాలి. అనేక సండేస్కూల్ తరగతుల్లో ఈ సంభాషణ ఊహించండి:

గురువు: “ఈరోజు మనం యోహాను 6లో 5000మందికి ఆహారం పెట్టిన కథ చదువుతాం.

విద్యార్థి: “నాకొక ప్రశ్న. వాళ్లు కేవలం పురుషులను మాత్రమే లెక్కించారని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు?”

గురువు: “నాకు తెలీదు. అది అంత ముఖ్యం కాదు. పాఠంపై దృష్టిపెట్టు.”

అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న బైబిల్ కథ ఒక్కసారిగా విచారంగా మారిపోతుంది. కొన్ని రొట్టెలు, చేపలను యేసు 20,000మందికి ఎలా పంచాడో పిల్లలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. దానిని మనం వినసొంపుగా ఎందుకు చేయలేం? ఈ గురువు జ్ఞానాన్ని సంభాషించడం లేదు; యూదా రచయితలు కేవలం పురుషుల్ని మాత్రమే ఎందుకు లెక్కించారో తెలుసుకోవడానికి నేపథ్యం చదవలేదు. ఈ ఉత్తేజకరమైన కథ విషయంలో గురువుకి అంత అభిరుచి లేదు. ఈ పాఠం ద్వారా గురువు జీవితం మార్చబడే అవకాశం లేదు, విద్యార్థుల జీవితాలు మార్చడానికి వీలు కలిగించే విధానం లేదు.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీరు పాఠం కోసం సిద్ధపడుతుండగా, మీ ప్రపంచం మీ విద్యార్థుల ప్రపంచం మధ్య దూరం గురించి ఆలోచించండి. ఈ విద్యార్థులతో సంబంధం ఏర్పాటు చేసుకోండి. మీ విద్యార్థుల ఆసక్తులతో పాఠాన్ని అనుసంధానం చేసే మార్గాలు వెదకండి.

హృదయపు నియమం

హృదయ నియమం: ప్రభావవంతమైన బోధన ముఖాముఖి సంభాషణ కాదుగాని హృదయాన్ని హత్తుకొనే సన్నిహిత సంభాషణ.

యేసు కొండమీద ప్రసంగం ముగించిన తర్వాత, జనసమూహం ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, “ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను” (మత్తయి 7:28-29). యేసు బోధ తన హృదయంలో నుండి వచ్చి, తన శ్రోతల హృదయాలను తాకింది.

యేసు కనికరం గురించి సువార్తలు పదే పదే చెబుతాయి. ఆయన ప్రజల మీద కనికరపడ్డాడు. ఆయన హృదయం వారి హృదయాలను చేరుకుంది. హోవార్డ్ హెండ్రిక్స్ ప్రభావవంతమైన బోధనా మూలకాలను గురించి చెప్పాడు.

బోధకుని ప్రవర్తన విద్యార్థిలో నమ్మకాన్ని ప్రేరేపిస్తుంది.

విద్యార్థి బోధకుని ప్రవర్తన నమ్మితే, బోధించే దానిని కూడా నమ్ముతాడు. పాస్టర్లుగా మరియు బోధకులుగా, ఆ నమ్మకాన్ని పాడుచేయకూడదు. నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడం కష్టం. జ్ఞానంగల క్రైస్తవ నాయకులు నైతిక లేదా నైతిక వైఫల్యాలకు నడిపించేవాటికి దూరంగా పారిపోతారు. మీ ప్రవర్తన మీ విద్యార్థులలో నమ్మకాన్ని ప్రేరేపించాలి.

బోధకుని కనికరం విద్యార్థిలో ప్రేరణ కలిగిస్తుంది.

ఒక విద్యార్థి బోధకుని కనికరాన్ని అనుభవించినప్పుడు, నేర్చుకోవాలనే ప్రేరణతో ఉంటాడు. యేసు వారిని ప్రేమిస్తున్నాడని శిష్యులకు తెలుసు గనుక వారాయనను అనుసరించారు. మీరు మీ విద్యార్థులను ప్రేమించకపోతే, మీ నుండి నేర్చుకోవాలనే ప్రేరణ వాళ్లకి ఉండదు.

చిన్న పిల్లలకు బోధించే బోధకులతో మాట్లాడుతూ, డా. హెండ్రిక్స్ ఇలా చెప్పాడు, “ఒకవేళ స్రవంతికి క్రొత్త బూట్లు ఉంటే, మీరు ఆ క్రొత్త బూట్లు గమనించాలి, లేకపోతే ఆమె మీ పాఠం వినదు!” మీరు విద్యార్థిపై ఆసక్తి చూపినప్పుడు (మీ ప్రేమను బట్టి) మీరు బోధించే పాఠం నేర్చుకోవడానికి వాళ్లు ఇష్టపడతారు.

బోధకుని విషయాలు విద్యార్ధికి అవగాహన కలిగిస్తాయి.

విద్యార్థిని నేర్చుకోవడానికి ప్రేరేపించబడిన తర్వాతే, మీరు విషయాన్ని బోధించడానికి సిద్ధంగా ఉండాలి. మీరు వాళ్ల నమ్మకం చూశాక, మీ విద్యార్థితో హృదయపూర్వకంగా మాట్లాడవచ్చు.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీరు మీ విద్యార్థుల్ని ప్రేమిస్తున్నారా? అంతే ముఖ్యంగా, మీరు వాళ్లని ప్రేమిస్తున్నారని వాళ్లకి తెలుసా? దేవుడు మీకిచ్చిన విద్యార్థులతో హృదయపూర్వకంగా ఎలా మాట్లాడగలరు?

ప్రోత్సాహ నియమం

ప్రోత్సాహ నియమం: విద్యార్థిని సరిగా ప్రేరేపించినప్పుడే బోధన ప్రభావవంతంగా ఉంటుంది

ప్రేరణ అనే పదం విన్నప్పుడు, చాలామంది బోధకులు మిఠాయి, సర్టిఫికెట్లు, గ్రేడులు లేక విద్యార్థులను ప్రేరేపించే ఇతర మార్గాల గురించి ఆలోచిస్తారు. ఈ ఫలితాలు (బహుమానాలు) తప్పుకాదు, ఇవి యౌవనస్తులకు ఆసక్తి కలిగిస్తాయి, కాని ఇవి నిజమైన లక్ష్యానికి సంబంధించినవి కాదు. బహుమానం ఆశించి పనిచేసే విద్యార్ధి తాను నేర్చుకుంటున్న సత్యాన్ని బట్టి మారే అవకాశం ఉండదు. విద్యార్థి అంతర్గత ఉద్దేశ్యాల గురించి బోధకుడు మాట్లాడడం మంచిది.

డా. హెండ్రిక్స్ కొన్ని అంతరంగ ఉద్దేశ్యాల జాబితా ఇచ్చాడు:

  • యాజమాన్యం. “ఇది నా చర్చి. ఇది పెరగాలంటే, నేను సందర్శకులను ఆహ్వానిస్తాను.”

  • అవసరత. “శోధన జయించడానికి నాకు దేవుని వాక్యం అవసరం, కాబట్టి నేను లేఖనాన్ని కంఠస్తం చేస్తాను.”

  • ఆమోదం. “నా బోధకుడంటే నాకిష్టం మరియు నాకు ఆయన్ని సంతోషపెట్టాలని ఉంది గనుక నేను పాఠం చదువుతాను.”

ఈ ప్రేరణలు, మిఠాయి లేక గ్రేడుల కంటే ఎక్కువకాలం ఉంటాయి. మనం ఈ ప్రేరేపకాలు ఉపయోగిస్తూ, సుదీర్ఘ-కాల అధ్యయనం కోసం మన విద్యార్థులను ప్రోత్సహిద్దాం.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీ విద్యార్థుల కోసం మీరు ఉపయోగించే ప్రేరణ ప్రేరేపకాల జాబితా చేయండి. నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల ద్వారా మీరు వారిని ఎలా ప్రేరేపిస్తారు?

సిద్ధపాటు నియమం

సిద్ధపాటు నియమం: బోధకుడు మరియు విద్యార్థి ఇద్దరూ మంచిగా సిద్ధపడినప్పుడే బోధన ప్రభావవంతంగా ఉంటుంది.

ఇది మీ సంఘంలో ఒక సాధారణ సండేస్కూల్ పాఠంలా అనిపిస్తుందా?

బోధకుడు: “ఈరోజు మనం ఎఫెసీయులకు 5వ అధ్యాయాన్ని అధ్యయనం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిళ్ళు తెరవండి.”

విద్యార్థులు ఆలోచిస్తారు: “మనం ఎఫెసీయులకు 5 వ అధ్యాయం ఎందుకు అధ్యయనం చేయాలి?”

ఎఫెసీయులకు 5 బోధిస్తూ, బోధకురాలు ఒక గంట సమయం గడుపుతుంది. ఆమె మంచి బోధకురాలు. ఆ గంట ముగిసే సమయానికి, విద్యార్థులు పౌలు సందేశం ద్వారా ప్రేరణ పొందుతారు. పాఠం ముగుస్తుంది, విద్యార్థులు ఇంటికి వెళ్లిపోతారు. వారం గడిశాక, మనం మళ్ళీ ఈ మాటలు వింటాం:

బోధకుడు: “ఈరోజు మనం ఎఫెసీయులకు 6 వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిళ్ళు తెరవండి.”

విద్యార్థులు ఆలోచిస్తారు: “మనం ఎఫెసీయులకు 6 వ అధ్యాయం ఎందుకు అధ్యయనం చేయాలి?”

తరగతి మొదలవ్వక ముందే విద్యార్థులు ఎఫెసీయులకు 6 వ అధ్యాయం చదివితే ఎంత బాగుంటుంది! విద్యార్థులు ప్రశ్నలతో తరగతికి వస్తే పాఠం మరింత బాగుంటుందా? అవును! దీన్ని మీరెలా సాధిస్తారు? పాఠం కోసం విద్యార్థులను సిద్ధపరిచే అభ్యాసం ఇవ్వాలని ప్రొఫెసర్ హెండ్రిక్స్ సూచించాడు. ఉదాహరణకు:

  • వచ్చే వారంలో తాము నేర్చుకోబోయే పాఠం గురించి ఆలోచన చేసే అభ్యాసాన్ని విద్యార్థులకు ఇవ్వాలి. “వచ్చే ఆదివారం లోపు, ఎఫెసులో పౌలు సంఘం ఎలా మొదలుపెట్టాడో నేర్చుకోవడానికి అపొస్తలుల కార్యములు 19 చదవండి.”

  • పాఠానికి నేపథ్యాన్ని అందించే అభ్యాసాలు ఇవ్వండి. “వచ్చే ఆదివారం లోపు, ఎఫెసులో అర్తెమీదేవి దేవాలయం గురించి బైబిల్ నిఘంటువులో చదవండి. ఇది ఎఫెసీయులకు 6:10-20లో పౌలు నొక్కి చెప్పిన ఆత్మీయ పోరాటం గురించి వివరించడానికి సహాయపడుతుంది.

  • విద్యార్థులు వ్యక్తిగతంగా అధ్యయనం చేసే సామర్థ్యాన్ని పెంచే అభ్యాసాలు ఇవ్వండి. ఈ వారంలో ప్రతిరోజు ఎఫెసీయులకు 6వ అధ్యాయం చదవండి. చదివేటప్పుడు ఈ అధ్యాయంలో మీకున్న ఒక ప్రశ్న రాయండి. వచ్చే ఆదివారం, మీ ప్రశ్నలు చర్చిద్దాం.”

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► మీరు బోధించే తర్వాత క్లాసులో, విద్యార్థులను తర్వాత పాఠం కోసం సిద్ధపరచటానికి అస్సైన్మెంట్ ఇవ్వండి. అసైన్మెంట్, వాళ్లు చదవబోతున్న పాఠం గురించి వారి అవగాహన పెంచేలా చూడండి.


[1]ఈ భాగంలోని మెటీరియల్ Howard Hendricks, Teaching to Change Lives (Colorado Springs: Multnomah Books, 1987) నుండి తీసుకున్నాం.
[2]

“బోధన యొక్క తుది పరీక్ష మీరు ఏం చేస్తున్నారు లేక ఎంత బాగా చేస్తున్నారన్నది కాదుగాని నేర్చుకునేవారు ఏం నేర్చుకుంటున్నారు ఎంత బాగా నేర్చుకుంటున్నారనేది ముఖ్యం.”

- డా. హోవార్డ్ హెండ్రిక్స్

[3]

“నేను వింటాను...మళ్లీ మర్చిపోతాను.

నేను చూస్తాను...గుర్తుంచుకుంటాను

నేను చేస్తాను.....అర్థం చేసుకుంటాను.”

- చైనీయుల సామెత

ముగింపు: బోధకుని ప్రవర్తన ప్రాముఖ్యత

“సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును” (లూకా 6:40) అని యేసుకు తెలుసు. ఆయన శిష్యులు ఈ సూత్రాన్ని పాటించారు. అతను పరిపూర్ణ ప్రేమగల వ్యక్తి యొద్ద శిక్షణ పొందాడు గనుక, “ఉరిమెడువాడైన” యోహాను “ప్రేమగల అపొస్తలుడైన” యోహానుగా మారాడు. అతడు విశ్వాసానికి ఆదర్శవంతుడైనవాని యొద్ద శిక్షణ పొందాడు గనుక, “అనుమానస్తుడైన తోమ,” “భారతదేశానికి అపొస్తలుడైన” తోమాగా మారాడు. శిష్యులు పరిపూర్ణ శిక్షణ పొందినప్పుడు, తమ బోధకునివలే అయ్యారు.

బోధకుని మొదటి మెట్టు, మీ విద్యార్థులు ఎలా ఉండాలని మీరు కోరుకుంటారో అలా మీరు ఉండటమే. యేసు స్థిరత్వానికి మాదిరిగా ఉండకుండా స్థిరత్వంలేని పేతురును “బండ”గా మార్చలేడు. విద్యార్థులు ఎలా ఉండాలనుకుంటామో ముందు మనం ఆ విధంగా ఉండాలి.

పౌలు ఈ సూత్రం అర్థం చేసుకున్నాడు. అతను కొరింథీయులతో, “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” (1 కొరింథీయులకు 11:1) అని చెప్పాడు. దైర్యంతో కూడిన ఎంత గొప్ప ప్రకటన! పౌలు భావం ఇదే: “మీరు సరైన జీవితం గడపాలనుకుంటే, నన్ను అనుసరించండి.” పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు కాబట్టి, కొరింథీయులు పౌలును అనుసరించటం మంచిది.

నా విద్యార్థులు ఒకవేళ నావలే మారితే, నేను తప్పక ఇలా అడగాలి: “నా విద్యార్థులు అనుసరించడానికి సిగ్గుపడుతున్న లక్షణాలు నేను చూపిస్తున్నానా?” నేను నా విద్యార్థులతో కోపంతో, అసహనంతో స్పందించినప్పుడు, “వాళ్లు శిక్షణ పూర్తి అయ్యాక” ఇతరులపట్ల కోపం, అసహనం వెల్లడిచేసినప్పుడు నేను ఆశ్చర్యపడకూడదు.

ప్రవర్తన బోధకునికి కేంద్రం. మీ జీవితంలో మీరు కలిగిలేని లక్షణాలు మీ విద్యార్థుల జీవితంలో పెంపొందించలేరు. బోధకుడు గొప్ప జ్ఞానాన్ని, బోధను కనుపరచడం కంటే దైవికమైన స్వభావం చూపించడం చాల ప్రాముఖ్యం. మన విద్యార్థులు ఎలా ఉండాలని మనం ఆశపడతామో మనం ఆ విధంగా ఉండాలి.

పాఠాన్ని ఆచరణలో పెట్టండి

► యేసువలే బోధించడం అనే ఈ పాఠం ముగిస్తుండగా, మీ విద్యార్థులు అనుసరించకూడని గుణాలు మీలో ఏమైనా ఉంటే చూపించమని దేవుని అడగండి. మీ విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకున్నప్పుడు, వాళ్ల జీవితాల్లో దేవుని స్వభావం ప్రతిబింబించడం చూడగలుగునట్లు మీ జీవితాలను మార్చుకోవడానికి అవసరమైన మార్పు చేసుకోవడానికి కృపనివ్వమని దేవునిని అడగండి.

పాఠం 4 అభ్యాసం

ఈ పాఠానికి సంబంధించిన అభ్యాసాలను పాఠం అంతటిలో చేశాం. పాఠం మధ్య మధ్యలో చెప్పిన కార్యాచరణలు పూర్తి చేస్తే, 4వ పాఠానికి అదనపు అభ్యాసాలు ఏం లేవు.

ముద్రించగల PDF ఇక్కడ అందుబాటులో ఉంది.

Next Lesson