ఈ పాఠ్యాంశంలో, రోమా పత్రిక యొక్క 4వ భాగం మనం కొనసాగిస్తాం. మనం రోమా 6వ అధ్యాయాన్ని (పాపంపై విజయాన్ని గురించి) మరియు రోమా 7వ అధ్యాయాన్ని (ఒప్పింపబడిన పాపిని గురించి) అధ్యయనం చేశాం. ఈ పాఠంలో, కఠినమైన ఈ లోకపు పరిస్థితులలో క్రైస్తవుని జీవితాన్ని గురించి వివరించే రోమా 8వ అధ్యాయాన్ని అధ్యయనం చేస్తాం.
8వ అధ్యాయం యొక్క ప్రధానాంశం
విశ్వాసి, పతనమైన ప్రపంచంలో జీవిస్తూ, దాని పరిస్థితుల నుండి, తన వ్యక్తిగత బలహీనతల నుండి శ్రమలు అనుభవిస్తున్నప్పటికిని, పరిశుద్ధాత్ముడు పాపంపైనా, పరిస్థితులన్నింటిపైనా అతనికి విజయాన్నిస్తాడు.
8వ అధ్యాయం యొక్క సారాంశం
ఈ అధ్యాయం, త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులలో ప్రతి ఒక్కరిని అనేకసార్లు సూచిస్తుంది. ముగ్గురు దైవవ్యక్తులు, మన ప్రస్తుత, మరియు అంతిమ రక్షణలో చాలా సన్నిహితంగా/దగ్గరగా పనిచేశారు. మనం శరీరంపై విజయాన్ని కలిగి జీవిస్తూ, రక్షణను గూర్చి వ్యక్తిగత నిశ్చయతను అనుభవిస్తూ, పతనమైన సృష్టిలోని పరిస్థితులను సహిస్తూ, మన వ్యక్తిగత అవగాహనకు మించిన ఆత్మీయ సహాయంతో ప్రార్థన చేస్తూ, దేవునితో రక్షణార్థమైన సంబంధంలో స్థిరంగా కొనసాగుతూ జీవించవచ్చు.
8:1-13 “ఇక మీదట శరీర స్వభావము గలవారు కారు” అనే శీర్షికను ఇవ్వగలిగే వాక్యభాగం.
8:1-13 లేఖన భాగానికి పరిచయం
శిక్షావిధి పొందని వాళ్ళు, ఇక మీదటశరీరానుసారంగా జీవించేవాళ్ళు కాదు. శరీరమందు ఉండడం అంటే కేవలం మానవ స్వభావంతో ఉండడం అని భావం కాదు, కానీ పడిపోయిన స్వభావం యొక్క నియంత్రణ క్రింద ఉండడం అని అర్థం.[1]
శరీరంలో జీవించడం అనేది రక్షించబడడానికి భిన్నమైంది. శరీరానుసారమైన మనసు మరణం (8:5) మరియు అది దేవునికి విరోధమైంది (8:7). శరీరానుసారంగా జీవించే వ్యక్తి దేవునిని (8:8) సంతోషపరచలేడు మరియు చావవలసినవాడై ఉంటాడు (8:13). శరీరానుసారంగా జీవించడం అంటే 7:7-25లో వివరించిన అదే స్థితిని కలిగి ఉండడం (7:14, 18, 25 చూడండి).
8:12-13 వచనాలు ముగింపు. శరీరానుసారంగా జీవించే వ్యక్తి చావవలసిన వాడై ఉంటాడు అంటే దేవుని తీర్పు పొందుతాడు గనుక మనం శరీరానుసారంగా జీవించకూడదు (1:17 చూడండి). మనం శరీరం యొక్క పాపక్రియలను చంపివేయాలి. శరీరం చేత నియంత్రించబడే వ్యక్తి యేసును వెంబడించేవాడు కాదు గనుక, ఆత్మ శక్తి చేత పాపాన్ని అంతమొందించాలి.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 8:1-13 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(8:1) ఆత్మను అనుసరించే వ్యక్తి శిక్షా విధిని పొందడు. శరీరాన్ని అనుసరించే వ్యక్తి శిక్షావిధి పొందుతాడు మరియు క్రీస్తునందు ఉండడు.
(8:2) జీవమునిచ్చు ఆత్మయొక్క నియమం అంటే క్షమాపణ పొందిన వ్యక్తి, కృప చేత అంగీకరించబడి, ఆత్మీయజీవితాన్ని కలిగి ఉంటాడు. పాపమరణముల నియమం అంటే ధర్మశాస్త్రం ద్వారా తీర్పుపొందిన వ్యక్తి, మరణశిక్షను పొందుతాడు.
(8:3) ధర్మశాస్త్రం, నెరవేర్చవలసిన విధులను మాత్రమే అందిస్తుంది; అది శక్తిని అందించదు. అవిశ్వాసి, ధర్మశాస్త్రాన్ని పాటించలేడు; కాబట్టి, ధర్మశాస్త్రం రక్షణకు ఒక సాధనంగా ఉండడమనేది అసాధ్యం. దేవుడు తన కుమారుడిని, విమోచకునిగా, పంపించాడు.
[2](8:4) మనం దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోకూడదు గాని, ఆత్మ శక్తిచేత దానికి విధేయత చూపాలి.
(8:5) ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని అనుసరిస్తాడు. అతను ఆత్మీయ జీవాన్ని పొందుకోకపోతే, అతను శరీరం చేత నియంత్రించబడతాడు.
(8:6) పాపస్వభావం చేత నియంత్రించబడడం అంటే శిక్షావిధి క్రింద ఉండడమే అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయం, ఆత్మయందు నడుచుకుంటూ, దేవునికి విధేయత చూపడం. పాపాన్ని అనుసరించడంలో కొనసాగుతూ, క్షమాపణ పొందుతూ ఉండే అవకాశం లేదు.
(8:7-8) శరీర స్వభావం కలిగిన వ్యక్తి, సహజంగానే దేవునికి విరోధిగా ఉంటాడు, ఎందుకంటే తాను పాప స్వభావం చేత నియంత్రించబడినంత కాలం, అతను దేవునికి లోబడలేడు. ఆ స్థితిలో దేవుడు అతన్ని అంగీకరించడు.
► శరీరానుసారియైన వ్యక్తి యొక్క వివరణను గురించి కొన్ని వివరాలను పేర్కొనండి.
[3](8:9) శరీర స్వభావం గలవారు అంటే, పడిపోయిన, పాప స్వభావపు నియంత్రణ క్రింద ఉండడం అని అర్థం. విశ్వాసి, ఇక మీదట శరీరస్వభావం కలిగి ఉండడు. అతడు ఇంకనూ శరీర శోధనలు ఎదుర్కుంటాడు కాని దాని నియంత్రణలో ఉండడు మరియు శోధనను జయించడానికి శక్తిని కలిగి ఉంటాడు. దేవుని ఆత్మ ఉన్నాడు గనుక ఈ శక్తి అందుబాటులో ఉందని ఈ వచనం మనకు చెబుతుంది. ఒక వ్యక్తి పాపంపైన విజయాన్ని కలిగి లేనట్లయితే, అతను ఆత్మ చేత నడిపించబడుతున్నానని , అభిషేకించబడ్డానని చెప్పకూడదు.
(8:10-11) మానవుని శరీరం ఇప్పటికీ ఆదాము పాపాన్ని బట్టి, గతంలో మనం చేసిన పాపాలను బట్టి ప్రభావితమైంది. కాబట్టి, దాని కోరికలు తప్పుడు మార్గంలో వెళ్తాయి. మన శరీర కోరికలు మనల్ని నడిపిస్తాయని మనం నమ్మకూడదు. యేసుని మరణం నుండి జీవంలోనికి లేపిన అదే శక్తి, మనలోను పని చేసి, మనల్ని జీవంలోనికి నడిపిస్తుంది, తద్వారా మన శరీరాలు దేవుని పట్ల విధేయత చూపే స్థితికి వస్తాయి. శరీర బలహీనత పాపం చేయడానికి సాకు కాదు, ఎందుకంటే దేవుని శక్తి మరింత గొప్పది.
(8:12-13) శరీరాన్ని అనుసరించడం ఆత్మీయ మరణానికి నడిపిస్తుంది. ఆత్మ ద్వారా శరీరం యొక్క పాప క్రియలను చంపి, వాటిని తుదముట్టిస్తాం. అలా చేసిన ప్రజలే జీవిస్తారు - వాళ్ళే దేవుని తీర్పును తప్పించుకుంటారు. పాపం చేయడంలోనే కొనసాగాలి అని కోరుకున్న వ్యక్తిని దేవుడు క్షమించి, అంగీకరిస్తాడనే ఆలోచనే ఇక్కడ లేదు.
[1]ఈ లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి, 7వ పాఠంలో “శరీరాన్ని/శరీర స్వభావాన్ని ర్వచించుట” అనే అంశాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం.
“మనుష్యులు బాహ్యమైన, దృశ్యమైన భౌతికమైన, పైపైన కనిపించే, వాటితో సౌఖ్యంగా ఉంటారు. మన హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే లోతైన, అంతర్గత, రహస్యమైన పని దేవునికి ప్రాముఖ్యమైనది.”
- జాన్ ఆర్. డబ్ల్యూ. స్టాట్
(The Message of Romans:
God's Good News for the World)
“నియంత్రణలో ఉన్న మంచి ఆకలి, ఆరోగ్యాన్ని, ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అదే ఆకలి వ్యక్తిని పూర్తిగా బానిసగా చేసి, అతని జీవితాన్ని పరిపాలిస్తూ, బానిసత్వం క్రిందకు, పాపం క్రిందకు తీసుకొని వస్తుంది.”
క్రైస్తవ జీవితానికి దేవుని ధర్మశాస్త్రంతో సంబంధం లేదని కొందరంటారు. "మీ క్రియలను దేవుడు అసలు పట్టించుకోడు" మరియు "మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు మీ పనులకు ఎలాంటి విలువ ఉండదు" లాంటి మాటలు చెబుతారు. వారి ఆలోచనల్లో విధేయత స్థానాన్ని కృప తీసుకుంటుంది. కానీ పౌలు, విశ్వాసముద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము" (రోమా 3:31) అని చెప్పాడు. ధర్మశాస్త్రమును నిరర్థకం చేసే సువార్తను బోధించినట్లయితే, అది పౌలు ప్రకటించిన సువార్త కాదు.
పౌలు మాట్లాడుతున్న ధర్మశాస్త్రం, దేవుడు కేవలం మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన నియమాల జాబితా కాదు. మోషే ధర్మశాస్త్రం, ఒక నిర్దిష్టమైన కాలానికి, సమయానికి దేవుని చిత్తం యొక్క అన్వయం. దానిలోనున్న చాలా విషయాలు అదే విధంగా అన్ని కాలాలకు, అన్ని స్థలాలకు వర్తించవు, ప్రాముఖ్యంగా ఆచారాలకు మరియు ఒక రాజ్యంగా ఇశ్రాయేలునకు ఇచ్చిన నియమాలకు అసలు వర్తించవు. కానీ మోషే ధర్మశాస్త్రం యొక్క సూత్రాలు లేదా నిత్యత్వపు సత్యాలు ఇప్పటికీ వర్తిస్తాయి ఎందుకంటే దేవుని స్వభావం మారదు.
సాధారణంగా చెప్పాలంటే , దేవుని ధర్మశాస్త్రమనేది మనిషి నుండి దేవుడు కోరుకునేది. ధర్మశాస్త్రం, పరిశుద్ధమైంది, న్యాయమైంది, మంచిది (7:12), ఎందుకంటే ఇది దేవుని స్వభావం నుండి వచ్చింది. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది (7:14).
శరీరానుసారంగా కాక, అత్మానుసారంగా నడుచుకునేవారిలో ధర్మశాస్త్ర నీతి నెరవేరుతుంది (8:4), ఎందుకంటే వాళ్ళు దేవుని పట్ల విధేయత కలిగి జీవిస్తారు.
దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి బైబిల్ ఈ క్రింది వ్యాఖ్యలు చేస్తుంది:
2. పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమ (1 తిమోతికి 1:5) యొక్క అవసరతను చూపడమే కొన్ని నిర్దిష్టమైన ఆజ్ఞల పట్ల దేవుని ఉద్దేశ్యం. ప్రేమ యొక్క వైఖరి లేకుండా దేవుడు కోరిన వాటిని నెరవేర్చడం ఒక వ్యక్తికి అసాధ్యం, కాబట్టి అవిధేయత అనేది ప్రేమ లేకపోవడాన్ని చూపిస్తుంది.
3. ఈ ప్రేమ కలిగిన వ్యక్తి ధర్మశాస్త్రమంతటిని నెరవేరుస్తాడు; అంటే దేవుడు మనిషి నుంచి ఆశించే వాటిని అతడు సంపూర్ణంగా నెరవేరుస్తాడు (రోమా 13:8-10). కాబట్టి, సంపూర్ణ ప్రేమ కలిగి ఉండడం అంటే సంపూర్ణ విధేయత కలిగి జీవించడం.
4. ప్రేమ, విధేయతలో వ్యక్తీకరించబడుతుంది (1 యోహాను 5:2-3). ప్రేమ అంటే ఒక భావన లేదా దేవుని పట్ల ప్రకటించుకునే విశ్వాసం కాదు. ప్రేమ, విధేయతను భర్తీ చేయదు గాని విధేయతను ప్రేరేపిస్తుంది.
5. యేసు, ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేయడానికి రాలేదు మరియు ఒకడు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించమని ఇతరులకు బోధించినట్లయితే, వాడు పరలోక రాజ్యంలో అల్పునిగా పిలవబడతాడని ఆయన చెప్పాడు (మత్తయి 5:17-20).
దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినందుకు ప్రజలు నిత్యశిక్షను పొందుతారు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోవడం, సువార్తకు అవశ్యకం. ఒక వ్యక్తి పాపాన్ని గురించి మరియు ధర్మశాస్త్రాన్ని గురించి దేవునితో అంగీకరించకుండా పశ్చాత్తాపపడలేడు. పాపి, దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినందుకు నరకానికి పాత్రుడని కొంతమంది గ్రహిస్తారు, అయినప్పటికీ, ఒక వ్యక్తి విశ్వాసిగా మారిన తరువాత దేవుడు ధర్మశాస్త్రం గురించి పట్టించుకోడనే వింత భావన కలిగి ఉంటారు.
దేవుడు మనల్ని అంగీకరించడానికి ధర్మశాస్త్రం ఆధారం కాదు, కాని మనమెలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో చూపించడం ద్వారా క్రైస్తవుని జీవితాన్ని నడిపిస్తుంది.
► విశ్వాసికి, దేవునిని ప్రేమించడానికి, దేవుని ధర్మశాస్త్రానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 4వ భాగం, 3వ లేఖన భాగం
8:14-27 లేఖన భాగానికి పరిచయం
8:14వ వచనం, తరువాత వచనాల్లోని రక్షణ నిశ్చయత అనే ప్రాముఖ్యమైన అంశానికి, ముందటి వచనాలను కలుపుతుంది. శరీరాన్ని అనుసరించకుండా, పాపంలో జీవించకుండా, ఆత్మను అనుసరించి జీవిస్తూ, జయజీవితాన్ని కలిగి ఉండే వారే దేవుని పిల్లలుగా గుర్తింపును పొందుతారు.
8:14-27 వచనాలకు, “పడిపోయిన లోకంలో పరిశుద్ధాత్ముని సహాయం” అనే శీర్షికను ఈ లేఖన భాగానికి ఇవ్వొచ్చు.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 8:14-27 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(8:14) శరీరాన్ని అనుసరించకుండా, పాపంలో జీవించకుండా, ఆత్మను అనుసరించి జీవిస్తూ, జయజీవితాన్ని కలిగి ఉండే వారే దేవుని పిల్లలుగా గుర్తింపును పొందుతారు.
8:14-17 వచనాలు, పరిశుద్ధాత్ముడు ఇచ్చే రక్షణ గురించి వ్యక్తిగత నిశ్చయతను వివరిస్తాయి.
(8:15) విశ్వాసులుగా, మనం ధర్మశాస్త్రపు భయం క్రిందకు తిరిగి రాకూడదు. దానికి బదులుగా, మనం కృప ద్వారా రక్షణ నిశ్చయతను కలిగి జీవించాలి. మనం దేవుని పిల్లలుగా దత్తస్వీకారం పొందాము. క్రైస్తవ విధేయత అంటే రక్షణ మాధ్యమంగా ధర్మశాస్త్రం క్రిందికి తిరిగి రావడం కాదు, కాని దేవునితో సంబంధాన్ని గూర్చిన విషయం.
ప్రస్తుతం క్రైస్తవులుగా చెప్పుకొనే వారిలో కేవలం కొద్ది శాతం మాత్రమే తమ జీవితాలలో క్రీస్తు తమను నీతిమంతులుగా చేసే కార్యాన్ని బలంగా వినియోగిస్తున్నారు. చాలామంది దేవుని పరిశుద్ధతను, వారి పాపం యొక్క పరిధిని, అపరాధభావనను సరిగా అర్థం చేసుకొనలేదు. వాళ్ళు తమ జీవితంలో లోతైన అపరాధభావనను, అభద్రతాభావాన్ని కలిగి ఉన్నప్పటికిని నీతిమంతులుగా తీర్చబడడం యొక్క ఆవశ్యకతను గ్రహించలేదు. చాలామంది ఈ సిద్ధాంతం పట్ల సిద్ధాంతపరమైన సమర్పణను కలిగి ఉంటారు, కానీ వారి అనుదిన జీవితంలో నీతిమంతులుగా తీర్చబడడం కొరకు పరిశుద్ధికరణపై ఆధారపడతారు, అగస్టీన్ వలె వారి యదార్థత నుండి, వారు మారుమనసు పొందిన గత అనుభవం నుండి, ప్రస్తుత మతపరమైన ప్రదర్శన లేదా వారు ఉద్దేశ్యపూర్వకంగా అరుదుగా ఆవిధేయత చూపుతారనే భావన నుండి దేవుడు తమను అంగీకరిస్తాడనే నిశ్చయతను పొందుతారు. కొంతమంది లూథర్ వేదికపై దృఢంగా నిలబడడంతో ప్రతి దినాన్ని ప్రారంభించగలిగినంతగా గ్రహింపు కలిగి ఉంటారు: మీరు అంగీకరించబడ్డారు, విశ్వాసంతో బయటికి చూస్తూ, మీరు అంగీకరించబడడానికి క్రీస్తు నీతి ఆధారమని ప్రకటిస్తారు. విశ్వాసం, ప్రేమలోను మరియు కృతజ్ఞతలోను క్రియాశీలకంగా ఉండగా, మరింత ఎక్కువైన పరిశుద్ధీకరణను కలిగించే నాణ్యమైన విశ్వాసంలో సేదతీరుతారు.[1]
(8:16) ఈ వచనం, ఇవాంజెలిస్టిక్ విశ్వాసులు “ఆత్మ యొక్క సాక్ష్యం” అని పిలిచే విషయాన్ని వర్ణిస్తుంది. మనం దేవునితో ప్రేమ, విధేయత కలిగిన సంబంధంలో ఉన్నామని పరిశుద్ధాత్మ మనకు నిర్ధారించి, మనం రక్షణ పొందామని సాక్ష్యమిస్తాడు. మన ఆత్మ ఆ సత్యాన్ని గురించి అవగాహన కలిగి ఉంటుంది. దేవుని ఆత్మ, మరియు మన ఆత్మ ఈ విషయంలో సమాధానం కలిగి ఉండడం, నిశ్చయతకు ఆధారం, కాబట్టి మనం నిజమైన విశ్వాసులమా అని ఆలోచిస్తూ అనిశ్చితిలో జీవించాల్సిన అవసరం లేదు.
మతాలు, తప్పుడు బోధలు రక్షణ నిశ్చయతను గురించి బోధించకుండా, వారి ప్రజలను భయంలోనే ఉంచుతాయి. రక్షణ పొందుటకు చేయాల్సినంతగా తాము చేయలేదని ప్రజలు భయపడతారు. సువార్త, భయం నుండి విడుదలనిస్తుంది ఎందుకంటే మనం క్షమాపణ పొందామని మనకు తెలుసు. మన విధేయత అనేది మనల్ని అంగీకరించిన దేవునిని సంతోషపెట్టడానికి ఆత్మను అనుసరించడంపై ఆధారపడి ఉంటుందే గాని, ఆయన అంగీకారం పొందడానికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంపై ఆధారపడదు.
దేవుని పట్ల విధేయత కలిగిన సంబంధంలో మనం జీవిస్తున్నాం గనుక, అది సత్యమని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తున్నాడు గనుక రక్షణ పొందామని మనకు తెలుస్తుంది (రక్షణ నిశ్చయత అంశాన్ని గురించి లేఖన ఆధారం కొరకు 1 యోహాను 2:3, 29; 1 యోహాను 3:14; 18-21; 24 చూడండి).
► తన రక్షణ విషయమై నిశ్చయత లేని వ్యక్తికి మీరు ఏ సలహా ఇస్తారు?
(8:17-18) మనం క్రీస్తుతో కూడా దేవుని మహిమను, రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఆయన మనలో గొప్ప కార్యాలు చేసి, ఆయన ఉద్దేశించిన విధంగా మన స్వభావాన్ని మార్చడం ద్వారా ఆయన మహిమ మనలో వెల్లడవుతుంది. మనం నిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటాం, అంటే దేవుని జీవాన్ని మనం జీవిస్తాం. మనం క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తాం. అయినప్పటికిని, మన విశేషాధికారాలన్నిటిని ఇప్పుడే పొందలేం. ఇక్కడ ప్రస్తావించిన మహిమపరచబడడం అనేది భవిష్యత్ లో జరిగే కార్యం. ఇప్పుడేమో శ్రమ, తరువాత పరిపాలన. అయినప్పటికిని, భవిష్యత్ మహిమ ఎంత గొప్పగా ఉంటుందంటే, మన భవిష్యత్ తో పోల్చినప్పుడు మన ప్రస్తుత పరిస్థితులు ప్రాముఖ్యంగా అనిపించవు.
8:19-25 వచనం దేవుడు తన సృష్టిని సంపూర్ణంగా పునఃస్థాపించడం కొరకు ఎదురుచూసే క్రమంలో మనం విశ్వాసం ద్వారా సహిస్తామని వివరిస్తుంది.
(8:19) సృష్టించబడిన సమస్తం, దేవుడు తన పిల్లలను సంపూర్ణంగా మహిమపరిచే సమయం కొరకు ఎదురుచూస్తోంది. మనం పరలోకంలో కలిగి ఉండే రూపాన్ని మనమింకను చూడలేదని అపొస్తలుడైన యోహాను చెప్పాడు (1 యోహాను 3:2).
(8:20-21) సృష్టించబడిన సమస్తం, పాపపు పర్యవసానాల వలన శ్రమపొందుతోంది. పాపపు పర్యవసానాలు చూసి పాపులు పశ్చాత్తాపపడతారనే నిరీక్షణతో దేవుడు శాపాన్ని అనుమతించాడు. సృష్టించబడినవి చివరికి పునఃస్థాపించబడి, దేవుని అంతిమ ప్రణాళికను నెరవేర్చడానికి తీసుకొని రాబడతాయి. దేవుని చిత్తాన్ని తిరస్కరించి, పశ్చాత్తాపపడని వ్యక్తులు దీనిలో ఉండరు.
(8:22) పాప శాపం, సృష్టినంతటిని ప్రభావితం చేసింది (ఆదికాండము 3:17-19). పని కఠినమైంది. నేల పతనానికి ముందు సహకరించినట్లు, ఇప్పుడు సహకరించదు. వ్యాధి, వృద్ధాప్యం మరియు మరణం, సమస్త జీవులకు సంభవించాయి.
(8:23) విశ్వాసులు కూడా శారీరకంగా పాపఫలాలను అనుభవిస్తారు, ఎందుకంటే వారి శరీరాలు పతనానికి ముందున్న పరిపూర్ణ స్థితికి పునఃస్థాపించబడలేదు. మనం మొదటి భాగంగా, మాదిరిగా మరియు దేవుని అంతిమ పునఃస్థాపనకు సాక్ష్యంగాను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. సృష్టి అంతిమంగాను, సంపూర్ణంగాను పునఃస్థాపించబడడమే అంతిమ రక్షణ. మనం ఇప్పటికే రక్షణ పొందామని చెప్పవచ్చు, అయితే మనం అంతిమ రక్షణ కొరకు ఇప్పటికిని ఎదురుచూస్తూనే ఉన్నాం.
► సృష్టి, పాప శాపం క్రింద ఉందనడానికి మీరు చూసిన కొన్ని సూచనలు ఏమిటి?
సాతాను, పాపులతో పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే, మొదట ఉత్తమమైన దానిని ఇస్తాడు, తరువాత మరింత చెడ్డదానిని, నీచమైనదానిని ఇచ్చి, తాను నెరవేర్చని వాగ్దానాలను ఎరగా వేసి, చివరికి నరకానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు దేవుడు పరలోకపు ఛాయను మనకు ఇచ్చి, ఉత్తమమైన దానిని మనకొరకు దాచి ఉంచాడు.
(8:24-25) మనం చూడని లేదా పొందని వాటి కొరకు ఎదురు చూస్తున్నామనే విషయాన్ని ఈ వచనాలు చెబుతాయి.
శరీరపునరుత్థానం అనేది ఒక ప్రధానమైన క్రైస్తవ సిద్ధాంతం మరియు దీనిని తిరస్కరించడం పాపజీవితానికి నడిపిస్తుంది. కొరింథీ సంఘంలో ఉన్న కొంతమంది వ్యక్తులు పునరుత్థానాన్ని తిరస్కరించారు మరియు రెండు విరుద్ధమైన భావాలు తెరమీదికి వచ్చాయి:
1. శారీరక కోరికలను చెడ్డవిగా భావించి, వాటిని పూర్తిగా అణచివేయడం.
2. శారీరక కోరికలు హానికరమైనవి కాదని భావించి, అజాగ్రత్తతో కోరికలు నెరవేర్చుకోవటం
శరీరం విలువలేనిదిగా, దుష్టత్వం కలిగినదిగా విజర్జించబడితే, శారీరక కోరికలన్ని పాప స్వభావం కలిగినవని కొందరు భావించారు. ఈ హేతుబద్ధతను అనుసరించి, వారు బ్రహ్మచర్యాన్ని సిఫారసు చేశారు. మరికొందరు, శరీరం నశించిపోతుంది గనుక ఇప్పుడు అన్ని రకాల పాపపు కోరికలను నెరవేర్చుకోవచ్చు అని నిర్ణయించారు. ఈ రెండు తీవ్రమైన ఆలోచనలు క్రైస్తవ సిద్ధాంతానికి విరుద్ధమైనవి. శరీర పునరుత్థానాన్ని తిరస్కరించినప్పుడు, ఈ విధమైన తప్పుడు బోధలు వెలుగులోనికి వస్తాయి..
8:26-27వ వచనం, విశ్వాసి ప్రార్థనలోపరిశుద్ధాత్ముని పనిని వివరిస్తుంది.
(8:26-27) మన పతనమైన స్థితి మన మానసిక, ఆధ్యాత్మిక అవగాహనలను ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక వాస్తవాలను మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. దేవుడు ప్రపంచంలో ఏమి చేయాలనుకుంటున్నాడో మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఉచ్ఛరించలేని మాటలతో మనతో కలిసి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్ముడు మన బలహీనతను పూరిస్తాడు. దేవుని చిత్తానికి అనుగుణంగా ఎలా ప్రార్థించాలో ఆయనకు తెలుసు.
ఈ వచనాలు, తెలియని భాషలో ప్రార్థన చేయడాన్ని సూచించడం లేదు. మనం ప్రార్థనను చేయలేము గనుక పరిశుద్ధాత్ముడు మనకొరకు ప్రార్థన చేస్తాడనేది వ్యాఖ్య. మనం అర్థం చేసుకోలేని విధానంలో ప్రార్థన చేస్తామని ఇది చెప్పడం లేదు.
8:28-39 లేఖన భాగానికి పరిచయం
ఈ లేఖన భాగం, విశ్వాసులు దేవుని ప్రణాళికలో ఉన్నారని మరియు వారు తమ క్రైస్తవ యాత్రను ముగించడానికి మరియు క్రీస్తు సారూప్యతలోనికి పరివర్తన చెందడానికి అవసరమైన కృపను వారికివ్వడానికి ఉద్దేశించాడని చెబుతున్నాయి. ఆయన కృప మరియు శక్తి ఉన్నతమైనవి గనుక లోకంలోనున్న ఏ పరిస్థితులు మనల్ని దేవుని నుండి వేరు చేయలేవు.
ఈ లేఖన భాగానికి, “విశ్వాసికున్న ఆత్మీయ భద్రత” అని పేరు పెట్టవచ్చు.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 8:28-39 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(8:28) “సమస్తం” అనే మాటలో మనం శ్రమపడే విషయాలన్నీ ఉంటాయి. పాపంతో పాటు సమస్తం జరగాలని దేవుడు నిశ్చయించాడని దీని భావం కాదు. విశ్వాసుల కోసం విషయాలన్నింటి నుండి మంచి ఫలితాలను దేవుడు తీసుకొస్తాడని దీని భావం. 8:37లో, అన్ని రకాల శ్రమల జాబితాను పేర్కొన్న తరువాత, ఈ విషయాలన్నింటిలో మనం అత్యధిక విజయాన్ని పొందామని చెబుతున్నాడు. దేవుడు వాటిని తన ఉద్దేశ్యాల కొరకు వాడుకొని, వాటి ద్వారా మనలను అభివృద్ధి చేస్తాడు.
జరిగే ప్రతి దానిని దేవుడు నిశ్చయించడు. స్వచిత్తం పనిచేయడానికి, అవకాశమున్న చోట నిజమైన సాహసం చేయడానికి మరియు పాపానికి కూడా అనుమతిస్తాడు. అయితే వీటన్నింటినుండి, ప్రమాదకరమైన ఉద్దేశ్యాలతో ఇతరులు చేసిన పాపాల నుండి కూడా దేవుడు విశ్వాసికి మేలు కలుగజేస్తాడు.
(8:29) లోకంలో ఉన్నవారందరూ రక్షణ పొందరని మనకు తెలుసు. కాబట్టి, ఆయనకు ముందుగా తెలిసిన వారిని గురించి నిర్దిష్టమైనది ఆయనకు తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక సందర్భం నుండి, విశ్వాసముంచే వారిని దేవుడు ఎంపిక చేస్తాడని మనకు తెలుసు. ఆయన అనుగ్రహించే రక్షణకు విశ్వాసంతో ఎవరు స్పందిస్తారో ఆయనకు తెలుసు (11:2ను, వ్యాఖ్యానాన్ని చూడండి). ఈ క్రమంలో పూర్వగమ్య నిర్దేశానికి (Predestination) ముందే భవిష్యత్ జ్ఞానం రావడం గమనార్హం. దేవుడు విశ్వాసులను రక్షించడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. (దేవుడు ‘ఎరిగి ఉండడాన్ని’ గూర్చిన ఉదాహరణల కొరకు కీర్తనలు 1:6, 1 కొరింథీయులకు 8:3, గలతీయులకు 4:9 మరియు 2 తిమోతికి 2:19 చూడండి)
వారు క్రీస్తువలె మారాలని ఆయన ప్రణాళిక చేశాడు. ఆయన వలె మారడం అంటే, స్వభావంలో మనం క్రీస్తువలె మారతామని అర్థం.
(8:30) దేవుడు చేసే కార్యం, మనల్ని నిత్య రక్షణలోనికి తీసుకొస్తుంది. మన ఇష్టతను తప్పా ఆయన మన నుండి ఇంకేమి ఆశించడం లేదు.
(8:31-32) ఏ పరిస్థితులూ దేవునికి కష్టమైనవి కాదు. అంతిమమైన త్యాగాన్ని ఆయన ఇప్పటికే చేసేశాడు, కాబట్టి ఇప్పుడు మన విజయానికి అవసరమైన ప్రతి దానిని ఆయన మనకు ఇస్తాడు.
(8:33) మన రికార్డులపై నున్న పాపాలను బట్టి ఎవరూ మనల్ని దోషులుగా పరిగణించరు, ఎందుకంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చినప్పుడు వాటిని తుడిచివేశాడు.
(8:35-39) ఈ లేఖనభాగం, యేసును అనుసరించువారికి గొప్ప నిరీక్షణను, ఆదరణను అందిస్తుంది. దేవుని నుండి ఏదీ మనలను వేరుచేయలేదు. మనం ఈలోకంలో ఎదుర్కొనే ప్రతిదాని నుండి ఆత్మీయంగా భద్రపరచబడ్డామని పౌలు చెబుతున్నాడు. ఒక విశ్వాసి తన విశ్వాసంలో స్థిరంగా కొనసాగడానికి అవసరమైన శక్తిని అందించడంలోను దేవుడు ఎన్నటికీ విఫలమవ్వడనే మరియు దేవుని నుండి మరే శక్తికూడా మనల్ని దూరం చేయలేదనే వాగ్దానమే విశ్వాసికి భద్రత.
► ఒక విశ్వాసి, విశ్వాసంతో అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి దేవుడతనికి సహాయం చేసే విధానాన్ని మీరు ఎలా వివరిస్తారు?
[1]Richard Lovelace, The Dynamics of Spiritual Life, (Downers Grove, IL: Intervarsity Press, 1979) 101.
పాఠం 8 - పునఃశ్చరణ ప్రశ్నలు
(1) ధర్మశాస్త్రం, రక్షణకు ఒక సాధనమవ్వడం ఎందుకు అసాధ్యం?
(2) విశ్వాసి, యికను శరీరాన్ని అనుసరించి జీవించడు అంటే అర్థం ఏమిటి?
(3) ఒక క్రైస్తవుని జీవితాన్ని, ధర్మశాస్త్రం ఎలా నడిపిస్తుంది?
(4) ఆత్మ యొక్క సాక్ష్యం అంటే ఏమిటి?
(5) అంతిమ రక్షణ అంటే ఏమిటి?
(6) శరీర పునరుత్థాన సిద్ధాంతాన్ని తిరస్కరించడం ఏ రెండు విరుద్ధమైన అతి పరిమితులకు దారితీస్తుంది?
(7) విశ్వాసికున్న భద్రత ఏమిటి?
పాఠం 8 - అభ్యాసాలు
పతనమైన లోకంలో క్రైస్తవునిగా జీవించడంలో ఎదురయ్యే సమస్యలను ఒక పేజీలో వివరించండి మరియు పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవుని పట్ల చేసే కార్యాలను వర్ణించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.