రోమా 6వ అధ్యాయం, పాపం యొక్క శక్తి నుండి విడుదల పొందడం గురించి మాట్లాడుతుంది. పశ్చాత్తాపాన్ని, విజయాన్ని అర్థం చేసుకోవాలంటే, అసలు పాపం అంటే ఏమిటో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి.
► పాపం అంటే ఏమిటి?
సాధారణంగా బైబిల్ పాపపు కార్యాలంటే, ఉద్దేశ్యపూర్వకంగా చేసే చర్యలని మాట్లాడుతుంది (1 యోహాను 3:4-9, యాకోబు 4:17). ఒక వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా, తెలిసి తెలిసి దేవునికి విధేయత చూపాలనుకుంటే, అది చిత్తానుసారమైన/ఉద్దేశపూర్వకమైన పాపం.
అనుకోకుండా లేదా తెలియకుండా దేవుని అంతిమమైన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే పాపాలు ఉన్నాయి, అవి ఉద్దేశ్యపూర్వకంగా చేసే పాపాల వలె దేవునితో మన సంబంధాన్ని ప్రభావితం చేయవు. మనం వెలుగులో నడుస్తుండగా, (మనకు తెలిసిన సత్యానికి అనుగుణంగా జీవించడం), మనం పాపాలన్నింటి నుండి శుద్దీకరించబడతాం (1 యోహాను 1:7) మరియు తెలియకుండా చేసిన అతిక్రమాలు మనల్ని దేవుని నుండి వేరు చేస్తాయని మనం భయపడాల్సిన అవసరం లేదు.
ఈ లేఖన భాగం ప్రాథమికంగా ఉద్దేశ్యపూర్వకంగా చేసే పాపాన్ని గురించి మాట్లాడుతుంది, ఇది విశ్వాసాన్ని పాడు చేసి, దేవునితో ఒక వ్యక్తికి ఉన్న సంబంధాన్ని దెబ్బతీస్తుంది.
రోమా పత్రిక యొక్క నాల్గవ భాగం (రోమా 6-8 అధ్యాయాలు) నీతిమంతులుగా తీర్చబడిన వారి పరిశుద్ధీకరణను గురించి మాట్లాడుతుంది.
ఇప్పటి వరకు, పౌలు ఆపాదించబడిన నీతిని గురించి మాట్లాడుతున్నాడు. ఇది విశ్వాసి యొక్క గత పాపాల స్థానంలో జమ చేయబడిన నీతి. ఇప్పుడు ఆయన అనుగ్రహ నీతిని గురించి వివరించడం ప్రారంభించాడు. అనుగ్రహ నీతి కూడా నీతిమంతులుగా తీర్చబడినప్పుడు కృప ద్వారానే అనుగ్రహించబడుతుంది మరియు విశ్వాసి పాపపు శక్తి నుండి విడిపించబడుతుండడం ద్వారా వాస్తవంగా నీతిమంతునిగా చేయబడతాడు మరియు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్ముని ద్వారా సహకారం పొందుతాడు. కాబట్టి, విశ్వాసి పరిశుద్ధునిగా లెక్కించబడడమే కాదు గాని అతను పరిశుద్ధునిగా చేయబడతాడు; దీనిని పరిశుద్ధీకరణ అంటారు.
ఈ పాఠంలో పాపంపై విజయాన్ని గురించి మాట్లాడే రోమా 6వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తాం.
6వ అధ్యాయం యొక్క ప్రధానాంశం
విశ్వాసి పాపపు బానిసత్వం నుండి విడుదల పొందాడు మరియు పాపం యొక్క నియంత్రణలోకి తిరిగి రాకుండా, పాపంపై విజయం సాధించి దేవునిపట్ల విధేయతతో జీవించాలని ఎంచుకోవాలి.
6వ అధ్యాయం యొక్క సారాంశం
రోమా 6వ అధ్యాయం, చాలామంది ప్రజలలో ఉండే తప్పుడు ఆలోచనకు పౌలు స్పందన: కృప అందుబాటులో ఉంది గనుక విశ్వాసులు దేవుని నియమాలకు విధేయత చూపుతూ జీవించాల్సిన అవసరం లేదనేది తప్పుడు ఆలోచన. కృపను గురించి తప్పుగా అర్థం చేసుకోవడం, ఈ తప్పుడు ఆలోచనకు మూలం. రెండు ఊహాత్మక ప్రశ్నలను అడిగి, వాటికి సమాధానాలు చెప్పడం ద్వారా ఈ తప్పుడు ఆలోచనకు పౌలు స్పందిస్తున్నాడు (6:1, 15).
కొంతమంది వ్యక్తులు 5:20ని చదివినప్పుడు, మనం మరింత కృపను కలిగి ఉండగలుగునట్లు, పాపంలో కొనసాగాలి అని వాదిస్తారు (6:1). మన పాపాల చిట్టా ఆపాదించబడిన నీతితో భర్తీ చేయబడింది కాబట్టి, మనం పాపం చేస్తూనే ఉన్నా పర్వాలేదు అని వారు భావిస్తున్నట్లు అనిపిస్తుంది.
విశ్వాసులు, దేవుని నియమాలకు విధేయత చూపుతూ జీవించాల్సిన అవసరం లేదని మరికొంతమంది వ్యక్తులు భావించటానికి మరో కారణం ఉంది. మనం మన క్రియలను బట్టి కాక, కృపను బట్టి అంగీకరించబడ్డాం. ఈ కారణాన్ని బట్టి మనం చేసేది పెద్ద విషయం కాదని వాళ్ళు తప్పుగా అనుకుంటారు (6:15).
ఈ రెండు ఊహాత్మక ప్రశ్నల వాదనను పౌలు బలంగా ఖండిస్తున్నాడు. పాపంపై విజయం ఎందుకు ప్రాముఖ్యమో ఆయన వివరిస్తూ స్పందించాడు.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 6వ అధ్యాయాన్ని చదవాలి.
వచనాల వారీ వివరణ
(6:1) ఇక్కడ పాపం కంటే ఎక్కువగా కృప విస్తరిస్తుందని విన్న తరువాత ఎవరైనా సహజంగానే అడిగే ప్రశ్నను అపొస్తలుడు అడిగాడు. పాపం దాని ఫలితాలలో నిజంగా మంచిది, ఎందుకంటే మరింతగా కృపను పొందడానికి అదొక మార్గమని ఎవరైనా అనుకోవచ్చు. ఇది మనం పాపంలో అజాగ్రత్తగా జీవించడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నామనే ఆలోచననిస్తుంది.
(6:2) ఈ ప్రశ్న సరైంది కాదన్నట్లుగా అపొస్తలుడు స్పందించాడు. తరువాత మనం పాపంలో చనిపోయాం కాబట్టి మనం పాపంలో జీవించడం అనేది సాధ్యం కాదని వివరించాడు.
(6:3-5) మనం క్రీస్తుతో కూడా ఆయన మరణ పునరుత్థానాలలో ఐక్యమయ్యాం కాబట్టి మనం పాపంలో కొనసాగము. 5:15-19 వివరించినట్లు, యేసు మనందరి కోసం రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. విశ్వాసం ద్వారా మనం ఆయనతో సంబంధంలోనికి వస్తాం, తద్వారా దేవుని అనుగ్రహం క్రీస్తుకు ఉన్నట్లే మనకు కూడా విస్తరించబడుతుంది.
యేసు ఒక్కసారే పాపం విషయమై మరణించాడు, తరువాత దేవుని కొరకు జీవిస్తున్నాడు. యేసు, తన కొరకు కాదు మనకొరకే మరణించాడు, కానీ పాపాన్ని గూర్చిన విషయం సమాప్తమైంది. విశ్వాసం ద్వారా, మనం మరణించి, ఆయనతో కూడా లేచాము; కాబట్టి మనం కూడా పాపం విషయంలో మృతిపొందాము.
బాప్తిస్మం అనేది యేసు మరణ పునరుత్థానాలలో మనం భాగస్వాములమయ్యామని సూచించే విషయం.
(6:6) ప్రాచీన స్వభావం, మారుమనసు పొందకమునుపు పాపజీవితాన్ని సూచిస్తుంది. (ఈ పాఠంలో తరువాతి భాగం, ప్రాచీన స్వభావాన్ని గూర్చిన అంశాన్ని వివరిస్తుంది.) పాప జీవితం సంపూర్ణంగా ముగిసింది, కాబట్టి మనమికమీదట పాపమునకు దాసులం కాదు.
పాపానికి ఏమవుతుందనే దానిని గురించి ఈ లేఖన భాగంలో ఉపయోగించిన పదాన్ని గమనించండి: పాపం మృతమైనది, సిలువ వేయబడింది మరియు నాశనం చేయబడింది. ఈ పదాలు, పాపంపై విజయాన్ని వ్యక్తపరుస్తాయి.
(6:7-11) విశ్వాసి జీవితంలో పాపం యొక్క నియంత్రణ శాశ్వతంగా ముగిసిందని ఈ వచనాలు నొక్కి చెబుతున్నాయి. మరణం, దీనికి వివరణ. మరణించిన వ్యక్తి, పాపం నుండి విడుదల పొందుతాడు, మరియు మనం మరణం వంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండాలి.
పునరుత్థానం తరువాత, యేసు మరలా మరణించడు, మరణంలోను కొనసాగడు. ఆయన మరణంతో ముగించాడు. మనం పాప విషయంలో సంపూర్ణంగా చనిపోయి, ముగించి, దాని నుండి విడుదల పొందాలి. పాపం విషయమై మరణించడం ముగించబడాలి, ఆ తరువాత మనం దేవుని కొరకు జీవించాలి.
రోమా 6:1-23లో పౌలు వివరించినట్లు, పాపం విషయమై క్రీస్తు చనిపోయి, సమాధి చేయబడి, ఆ తరువాత పునరుత్థానం చెందడంతో ఐక్యత కలిగి ఉండడం, క్రైస్తవుడిని పాపపు శక్తినుండి, బానిసత్వం నుండి విడిపిస్తుంది. అతను పాపం విషయం చనిపోయాడని (రోమా 6:2) మరియు దాని నుండి విడుదల పొందాడని (రోమా 6:7) ప్రకటించబడింది. పాపం విషయమై చనిపోవడం అంటే పాపం యొక్క శక్తి క్రింద లేక నియంత్రణ క్రింద జీవించకపోవడం. విశ్వాసం ద్వారా, ఒక విశ్వాసి తాను పాపం విషయమై చనిపోయి, యేసుక్రీస్తు నందు దేవుని కొరకు జీవిస్తున్నానని పరిగణించాలి (రోమా 6:11). దేవుడు తనని గురించి సత్యమని ప్రకటించిన దానిని క్రైస్తవుడు తన వ్యక్తిగత అనుభవంలోనికి తీసుకురావడమని దీనర్థం. అతను తన శరీరంలో పాపాన్ని ఏలనివ్వకూడదు (రోమా 6:12), లేదా అతను తన అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకూడదు (రోమా 6:13). దానికి బదులుగా, అతను పరిశుద్ధమును, దేవునికి అంగీకారమునునైన సజీవయాగంగా తనని తాను సమర్పించుకోవాలి (రోమా 12:1) మరియు తన శరీర అవయవాలను నీతికి సాధనాలుగా వాడుకోవాలి (రోమా 6:13, 19).[1]
రోమా 6:11లో, ఎంచుకొనుడి అనేది ఖాతా లెక్కలకు సంబంధించింది. ఇది సత్యమైన దానిని ధృవీకరించడం. ఇది నటనతో/కపటంతో చేసే ప్రకటన కాదు. అపొస్తలుడు, సత్యం కాని దానిని చెప్పమని విశ్వాసులకు సూచించడం లేదు. ఒక విశ్వాసి తాను మరణించినట్లుగా పాపం నుండి సంపూర్ణంగా విడుదల పొందాడని గ్రహించాలి మరియు అతను పాపపు శక్తి నుండి సంపూర్ణ స్వేచ్ఛతో జీవించడానికి ఎంచుకోవాలి.
► మిమ్మల్ని మీరు పాపం విషయమై చనిపోయిన వారిగా ఎంచుకోవడం అంటే అర్థం ఏమిటి?
ఈ అధ్యాయంలోని మిగిలిన భాగం, పాపంపై విజయం ప్రాముఖ్యమనే మరో కారణాన్ని వివరిస్తుంది. మనం పాపానికి బానిసలం కాదు, దేవునికి దాసులం. మీరు ఇద్దరినీ సేవించలేరు. నీవు పాపానికి బానిసగా ఉంటే నీతిని జరిగించలేవు (6:20). ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది, దేవునికి దాసులయ్యారు; కాబట్టి, మీరు పరిశుద్ధతతో జీవిస్తారు (6:22).
(6:12-13) ఇక్కడ మనం ఒక వ్యత్యాసాన్ని చూస్తాం. పాపంపై మనకు విజయం లేకపోతే, పాపం మనల్ని పరిపాలిస్తుంది. విశ్వాసులను, పాపపు కోరికలు నియంత్రించకూడదు. మీ శరీరాన్ని తప్పుడు చర్యలకు ఉపయోగించడం అంటే పాపపు అధికారానికి అప్పగించడమే అవుతుంది. దానికి బదులుగా, మీ శరీరం దేవునికి చెందినది, దానిని ఆయన కోసమే ఉపయోగించాలి.
(6:14) ధర్మశాస్త్రానికి లోనైయుండడం అంటే దేవుని అంగీకారం కొరకు ధర్మశాస్త్రానికి విధేయత చూపడంపై ఆధారపడడమని అర్థం. ఆ వ్యక్తి రక్షణార్థమైన కృప లేకుండా ఉంటాడు, కాబట్టి క్రియల ఆధారంగానే తీర్పుతీర్చబడతాడు. కృప లేకుండా ఎవరూ పాపంపై విజయం సాధించలేరు కాబట్టి, ధర్మశాస్త్రానికి లోబడి ఉండటం అంటే ఖండించబడడం/శిక్షను పొందడం మరియు పాపం యొక్క శక్తి కింద ఉండటం అని అర్థం. కృప క్రింద ఉండడం అంటే దేవుని అంగీకారం కొరకు కృపపై ఆధారపడడం. కృప క్రింద ఉన్న వ్యక్తి, పాపపు శక్తి క్రింద ఉండడు. ధర్మశాస్త్రానికి లోబడి ఉండడం లేదా కృప లోబడి ఉండడం అనేవి పాత నిబంధనలో లేదా క్రొత్త నిబంధనలో ఉండడాన్ని సూచించవు.
► ధర్మశాస్త్రం క్రింద ఉండడం అంటే అర్థం ఏమిటో వారి స్వంత మాటల్లో వివరించమని విద్యార్థులను అడగండి.
(6:15) మనం ధర్మశాస్త్రం క్రింద లేమని విన్నప్పుడు ఎవరైనా అడిగే ప్రశ్నను అపొస్తలుడు ఇక్కడ అడుగుతున్నాడు: “ధర్మశాస్త్రానికి లోబడిన వారము కాదు గనుక మనం పాపం చేస్తామా?” దేవుని ఎదుట మన అంగీకారాన్ని, మన విధేయత ద్వారా సాధించకపోతే, అప్పుడు విధేయత అవసరం లేదని ఒక వ్యక్తి ఆలోచిస్తాడు. పౌలు ఈ ప్రశ్నకు ఎంతో బలంగా స్పందించాడు.
కృప స్వతస్సిద్ధంగా, కొనసాగుతున్న పాపాన్ని ఎందుకు కప్పలేదో పౌలు నేరుగా వివరించలేదు. దానిని బదులుగా, ఒక వ్యక్తి పాపపు శక్తికి లోబడి ఉంటే, అతను దేవుని సేవకుడు కాలేడని ఆయన వివరించాడు.
(6:16) మీరు దేవునికి, పాపానికి సేవ చేయడం అసాధ్యం, ఎందుకంటే మీరు లోబడిన వారికి దాసులవుతారు. మీరు పాపానికి లోబడితే, పాపం మీకు యజమాని, అంటే దేవుడు మీ యజమాని కాదని అర్థం. అపొస్తలుడైన పేతురు చెబుతున్నట్లు, “ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడవుతాడు (2 పేతురు 2:19). మీరు పాపానికి బానిస కాకుండా పాపానికి లోబడలేరు.
(6:17-18) విశ్వాసులు పాపం యొక్క శక్తి నుండి విడుదల పొంది, ఇప్పుడు నీతికి దాసులుగా ఉన్నారు. వాళ్ళు సువార్తకు లోబడడం ద్వారా ఈ విడుదలను అనుభవిస్తున్నారు. మరలా, వాళ్ళు నీతికి దాసులుగా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా పాపం నుండి విడుదల పొందాలి.
ఈ అధ్యాయమంతా పాపం చేత బంధించబడి ఉండడానికి మరియు విజయంలో జీవించడానికి మధ్య ఉన్న పూర్తి వ్యత్యాసాన్ని అందిస్తోంది. ఒక విశ్వాసి పాపపు శక్తి క్రింద ఉండడం లేదా ఒక పాపి, పాపంలో కొనసాగుతూనే నీతిని జరిగించడం సాధ్యమయ్యేది కాదు. పౌలు మరింత ఖచ్చితంగా/స్పష్టంగా చెప్పగలిగే మార్గాన్ని కనుగొనడం కష్టం.
(6:19) వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగునట్లు దీనిని మానవ పరిభాషలో (మనుష్యరీతిగా) వివరిస్తున్నానని ఆయన చెప్పాడు. వాళ్ళు గతంలో పాపానికి లోబడ్డారు, అది వారిని మరింత లోతైన పాపం లోనికి నడిపించింది. ఇప్పుడు, వాళ్ళు వాళ్ళ క్రియలలో నీతిమంతులుగా ఉన్నారు, అది పరిశుద్ధతకు ఆవశ్యకం. ఒక వ్యక్తి సరైన క్రియలు చేయడం ద్వారా పరిశుద్ధులవ్వరు, కానీ అతను సరైంది చేయకపోతే పరిశుద్ధుడు కాలేడు.
► ఒకే సమయంలో పాపంలో జీవిస్తూ, దేవునికి దాసులుగా ఉండడం యొక్క ఆసాధ్యతను మీరు ఎలా వివరించగలరు?
(6:21-23) పాపం ఏ మేలును కలిగించదు గాని సహజంగానే మరణాన్ని తీసుకొస్తుంది. పాపి, మరణాన్ని సంపాదిస్తాడు; పాపం వలన వచ్చు జీతం మరణం. విశ్వాసి, నిత్యజీవాన్ని సంపాదించడు, ఎందుకంటే అతను దానిని సంపాదించలేడు; అతను దానిని కృపావరంగా పొందుతాడు.
ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించిన తర్వాత అతని జీవనశైలి పూర్తిగా విరుద్ధంగా ఉన్నప్పటికీ అతని రక్షణ భద్రంగా ఉంటుందని కొందరు అనుకుంటారు.[1] ఒక వ్యక్తి జీవితం మారనప్పుడు; పశ్చాత్తాపం, మారుమనసు యొక్క ఫలం కనిపించనప్పుడు; మరియు ఆ వ్యక్తి యేసుకు నిజమైన శిష్యుడిగా మారడానికి నిరాకరించినప్పుడు కూడా, అతను రక్షణను పొందానని తప్పుగా ప్రకటించవచ్చు. ఇది ఘోరమైన మోసం మరియు అనేక లేఖనాలకు విరుద్ధంగా ఉంది.
మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములుగలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములుగలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.(హెబ్రీయులకు 10:22).
కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.(1 పేతురు 1:5).
ఈ లేఖన భాగాల నుండి బైబిల్ వాక్యానుసారమైన రక్షణ నిశ్చయత విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని నేర్చుకుంటాం:
రక్షణ నిశ్చయత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది, అది “సంపూర్ణ నిశ్చయతను” కలిగి ఉంటుంది. నిశ్చయత అనేది సువార్త యొక్క స్పష్టమైన అవగాహనతో ప్రారంభమవుతుంది (1 కొరింథీయులకు 15:3-4). ఇది కొలొస్సయులకు 2:2లో కూడా చెప్పబడిన “సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము”. రక్షణ, కృప ద్వారా, మన పక్షాన క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ మరణంలో విశ్వాసముంచడం ద్వారా కలుగుతుంది (ఎఫెసీయులకు 2:8-9). రక్షణకు కావలసింది పాపరహితమైన పరిపూర్ణత కాదు (ఎవరు అర్హతను పొందలేరు) లేదా రక్షించబడ్డామని ఎల్లప్పుడూ భావించడం కాదు, కానీ మనం విఫలమైనప్పుడు కూడా క్రీస్తు యొక్క యోగ్యతపై, ఆయన సంపూర్తి చేసిన విమోచన కార్యంపై స్థిరమైన నమ్మకం కావాలి. నిజమైన రక్షణార్థమైన విశ్వాసం వచ్చిన తరువాత విశ్వసనీయత పట్ల మక్కువ వస్తుంది.
రక్షణ నిశ్చయత యదార్థమైన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది - “యథార్థమైన హృదయం”: యదార్థంగా మారుమనసు పొందిన వ్యక్తి, “మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన” (హెబ్రీయులకు 10:22) వ్యక్తి. అవమానం, అపరాధభావన తీసివేయబడి, శాంతితోను, ప్రేమతోను భర్తీ చేయబడినాయి. యదార్థంగా మారుమనసు పొందిన వ్యక్తి, తన శరీరాన్ని “నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన వ్యక్తి,” ఎందుకంటే పాతవి గతించి, సమస్తం నూతనంగా చేయబడ్డాయి (2 కొరింథీయులకు 5:17). యదార్థంగా మారుమనసు పొందిన వ్యక్తి, క్షమాపణ పొందునట్లు తన పొరపాట్లను, పాపాలను ఒప్పుకొని, వాటి నుండి విడుదల పొందిన వ్యక్తి (మత్తయి 6:12; యాకోబు 5:16).
నిశ్చయత, సజీవమైన విశ్వాసానికి లోబడి పనిచేస్తుంది “విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుట” ఒక కోటను లేదా దుర్గాన్ని కాపాడడం లాంటిదే ఈ ఆలోచన. దేవుని దైవీకమైన శక్తి కాపాడుతుంది, సంరక్షిస్తుంది, చివరికి విజయంలోనికి నడిపిస్తుంది. మనం విశ్వాసం ద్వారా వినియోగించే క్రీస్తు శుద్ధీకరణ రక్తం యొక్క శక్తి మరియు పునరుత్థానపు శక్తి మన ఆత్మలను నిత్యజీవం కొరకు సంరక్షిస్తుంది. పట్టుదల కలిగి స్థిరంగా ఉండే విశ్వాసమే అంటే క్రీస్తునందు, సిలువపై ఆయన చేసిన చేసి ముగించిన కార్యమందు నిరంతరం నమ్మకముంచే విశ్వాసమే నిజమైన రక్షణార్థమైన విశ్వాసం. విశ్వాసం క్రియ కాదు, కానీ అది రక్షణకు షరతు. హెబ్రీ గ్రంథ కర్త దానిని ఈవిధంగా చెబుతున్నాడు: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము” (హెబ్రీయులకు 11:6).
రక్షణకు మరే ఇతర విషయాలను జోడించినా అది సాంప్రదాయవాదమవుతుందని నమ్ముతారు, కానీ యేసు, క్రొత్త నిబంధనలోని ప్రతి రచయిత విశ్వాసంలో కొనసాగడం యొక్క ఆవశ్యకతను స్పష్టంగా బోధించారు.
మీరు నా వాక్యమందు నిలిచినవారైతేనిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు (యోహాను 8:31)
.... ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును.... (కొలొస్సయులకు 1:23).
నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసినయెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. (హెబ్రీయులకు 10:38).
...నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై... అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమైఓడ బద్దలై పోయినవారివలె చెడియున్నారు. (1 తిమోతికి 1:18-19)
రక్షణ నిశ్చయతను గురించి వివరిస్తూ, జాన్ వెస్లీ ఈ విధంగా చెప్పాడు,
నా ఆదరణ అనేది, ఒక విశ్వాసి పడిపోవడం, లేదా పడకుండా ఉండడం అనే అభిప్రాయంపై గాని, నేను నిన్న చేసిన ఒక పనిని జ్ఞాపకం చేసుకోవడంపై గాని ఆధారపడి ఉండదు. కానీ ఈరోజుపై, ప్రస్తుతం నన్ను తనతో సమాధానపరచుకొనే క్రీస్తునందు నాకున్న దేవుని జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు ముఖంలో దేవుని మహిమ కాంతిని నేను చూడడంలో ఉంటుంది; ఆయన వెలుగులో ఉన్నట్లుగా నేను కూడా వెలుగులో ఉండడంపై, తండ్రితోను, కుమారునితోను సహవాసం కలిగి ఉండడంపై ఆధారపడి ఉంటుంది. కృప ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నందు మరియు నేను దేవుని కుమారుడనని నా ఆత్మతో సాక్ష్యమిచ్చే ఆత్మయందు విశ్వాసముంచడంలో నా ఆదరణ ఉంది.[2]
► ముందు చెప్పిన అంశాల నుండి, ఒక క్రైస్తవుడు సజీవమైన విశ్వాసాన్ని ఆధారం చేసుకొని రక్షణ నిశ్చయతను కలిగి ఉండగలడని ఎలా వివరించగలరు?
[2]John Wesley, “Serious Thoughts Upon the Perseverance of the Saints”, in The Works of John Wesley: Letters, Essays, Dialogs and Addresses Vol. X, (Grand Rapids, MI: Zondervan) 295. Also available online at: https://archive.org/details/worksofjohnwesle0010wesl/
ప్రాచీన స్వభావం
ప్రాచీన స్వభావం అనే మాట పత్రికల్లో మూడు సార్లు కనబడుతుంది. ఈ మూడుసార్లు కూడా పౌలే ఈ మాటను ఉపయోగించాడు. ఈ మూడు మాటలను వాటి సందర్భాలతో పోల్చడం ద్వారా మనం ఈ మాటకు అర్థం ఏమిటో చూడవచ్చు.
కొలొస్సయులకు 3:9
కొలొస్సయులకు 3:9-10 వచనాలు, “…ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతోకూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు” అని చెబుతుంది. ఈ విశ్వాసులు ఇప్పటికే తమ ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించారని పౌలు చెబుతున్నాడు. వాళ్ళు ఇప్పటికే సంపూర్ణంగా పరిశుద్ధులనేది ఆయన ఉద్దేశ్యం కాదు, ఎందుకంటే కొలొస్సయులకు 3వ అధ్యాయం చాలా వరకు వారిని పరిశుద్ధత కొరకు పిలుస్తుంది.
ముందు ఆయన కొలొస్సయ విశ్వాసులతో, "... పైనున్న వాటినే వెదకుడి... భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది" (కొలొస్సయులకు 3:1-3). అని చెప్పాడు. ఆయన ఇంకా చెబుతూ, “భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి” (3:5) అని అన్నాడు. అలాంటి పాపాలు దేవుని తీర్పును తీసుకొస్తాయని 3:6 చెబుతుంది మరియు ఈ విశ్వాసులు గతంలో వీటిని చేసేవారని 3:7వ వచనం చెబుతుంది. వాళ్ళు తమ జీవితాల్లో ఆ విషయాలను ఏ మాత్రం సహించకూడదని పౌలు అడుగుతున్నాడు. వాళ్ళు ఆ విషయాలన్నింటిని చంపివేయాలనే ప్రకటన ద్వార ఇది సూచించబడింది.
కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు లాంటి వాటిని విసర్జించాలని (3:8) ఆయన పిలుస్తున్నాడు. ఇవి క్రీస్తు జీవితంతో ఏ మాత్రం సంబంధం లేనివి.
తరువాత, వాళ్ళు తమ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించారు గనుక ఇదంతా చేస్తున్నారనే ప్రకటన యొద్దకు మనం వస్తాం.
వాళ్ళు పరిశుద్ధమైన లక్షణాలను వివరించడం ద్వారా (3:12), సంబంధాలలో క్రీస్తును పోలిన స్వభావాన్ని కలిగి ఉండమని బ్రతిమాలడం ద్వారా (3:13), వారి క్రైస్తవ విశ్వాసంలో ముందుకు పురోగమించమని ఆయన పిలిచాడు , తరువాత పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి (3:14) అని చెబుతున్నాడు.
ఈ సందర్భంలో ప్రాచీన స్వభావం అంటే మారుమనసు పొందినప్పుడు విడిచిపెట్టే ప్రాచీన జీవితాన్ని సూచిస్తుంది. వాళ్ళు దానిని చేశారు గనుక, వాళ్ళు సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి పురోగమిస్తారని పౌలు నమ్ముతున్నాడు.
ఎఫెసీ 4:22
ఈ వచనం, కొలొస్సయ పత్రికలోని వచనంతో సమాంతరంగా ఉన్న లేఖనం నుండి వస్తుంది. 4:17-19 వచనాల్లో, ఆయన అన్యజనుల జీవిత విధానాన్ని/జీవితశైలిని గురించి వివరించాడు; ఆ తరువాత 4:20లో దీనిని విశ్వాసి జీవితంతో విభేదించాడు. 4:21-24 వచనాలు, “క్రీస్తును నేర్చుకోవడం” (4:20) మరియు ఆయన మాట వినడం, ఆయన ద్వారా నేర్చుకోవడం (4:21) అంటే ఏమిటో వివరిస్తాయి. ఈ విషయాల్లో ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించి, నూతన స్వభావాన్ని ధరించుకోవడం అనేవి భాగంగా ఉంటాయి. వాళ్ళు మారుమనసు పొందినప్పుడు జరిగిన దానిలో ఇది భాగంగా ఉంటుంది.
ఎఫెసీ పత్రికలోని ఈ లేఖనభాగం, కొలొస్స 4వ అధ్యాయంలో నమూనా మాదిరిగానే ఉంటుంది. ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించడం, వాళ్ళు ఇప్పటికే నేర్చుకున్న సువార్తలో భాగం అనే ప్రకటన చేసిన తరువాత, అబద్ధమాడవద్దు అనేది పౌలు చెప్పిన మొదటి ఆజ్ఞ. కోపం, సకలవిధమైన దుష్టత్వము, దూషణ మొదలగు వాటిని గురించి ప్రస్తావించాడు. దయకలిగి క్షమించుకోవాలని వారికి చెప్పాడు. కొలొస్సయ పత్రికలో ఇప్పటికే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టారు అని చెప్పిన తరువాత, ఇవే విషయాలను గురించి ప్రస్తావించారు.
ప్రాచీన స్వభావం అనేది విశ్వాసి ఇప్పటికీ విడిచిపెట్టవలసిన విషయం కాదు, కానీ మార్పుమనసు పొందిన సమయంలో విడిచిపెట్టింది. వాళ్ళు ఇప్పటికీ సంపూర్ణంగా పరిశుద్ధులు కాదు. వాళ్ళు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రారంభమైన దాని విషయంలో స్థిరంగా ఉండడం ద్వారా వారి జీవితాల్లో పరిశుద్ధతను సంపూర్తి చేయమని పౌలు వారిని ఆహ్వానిస్తున్నాడు.
రోమా 6:6
ఈ లేఖనభాగంలో, విశ్వాసికి, ఆవిశ్వాసికి మధ్య గొప్ప వ్యత్యాసాన్ని పౌలు చూపించాడు. యేసును వెంబడించే వ్యక్తి పాపంపై విజయాన్ని కలిగి ఉన్నాడనే నిశ్చయతనివ్వడం ఈ అధ్యాయం యొక్క ముఖ్యాంశం. విశ్వాసి పాపంపై విజయం కలిగి జీవించగలడని నిరూపించడానికి ప్రాచీన స్వభావం సిలువ వేయబడిందనే ఒక కారణాన్ని ఇస్తున్నాడు. “ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువ వేయబడెనని యెరుగుదుము.” విశ్వాసి మారుమనసు పొందినప్పుడు జరిగిన కార్యం కారణంగా పాపం నుండి విడుదల పొందగలడని ఆయన చెబుతున్నాడు.
ముగింపు
అయితే ప్రాచీన స్వభావం అంటే అర్థం ఏమిటి? ప్రాచీన స్వభావం అంటే ఒక వ్యక్తి మారుమనసు పొందినప్పుడు విడిచిపెట్టిన స్వయం కేంద్రీత పాపపు జీవితం.
నూతనంగా మారుమనసు పొందిన వ్యక్తి, నూతన స్వభావం కంటే ప్రాచీన స్వభావానికి అనుగుణంగా ఉన్న ప్రవర్తనలను, వైఖరులను కలిగి ఉంటాడు. అందుకే పౌలు ప్రాచీన స్వభావాన్ని తిరస్కరించడానికి అనుగుణంగా తమ జీవితాలలో దిద్దుబాటు చేసుకొమ్మని విశ్వాసులకు చెబుతున్నాడు. ఆయన, “మీరు మీ ప్రాచీన పాపపు జీవితాన్ని విడిచిపెట్టినందున, నీతియుక్తమైన నూతన జీవితానికి సరిపోని ప్రవర్తనను మీరు మానివేయాలి” అని చెబుతున్నాడు.
మన పరిశుద్ధీకరణకు యేసు యొక్క ఏర్పాటు
రోమా 6:1-10 వచనాలు, మన వ్యక్తిగత పరిశుద్ధీకరణ కొరకు యేసు అనుగ్రహించిన విషయాలను గురించి మనకు వివరిస్తాయి.[1] మనం నూతనంగా జన్మించినప్పుడు, క్రీస్తునందు స్థాపించబడ్డాము. ఆయన మరణించి, తిరిగి లేచుట ద్వారా సాధించినవన్నీ ఇప్పుడు ఆయనయందు మన స్వంతమయ్యాయి. పాపంపై సంపూర్ణ విజయం సాధించడానికి అవసరమైన వనరులన్నీ క్రీస్తునందు మనం కలిగి ఉన్నామని దీనర్థం.
క్రీస్తుతో మన ఐక్యతను బట్టి, ఆయనకు జరిగింది మనకు కూడా జరుగుతుంది. ఆయన మరణించినప్పుడు, నేను కూడా మరణించాను. ఆయన తిరిగి లేచినప్పుడు, ఆయనలో నేను కూడా లేచాను. క్రీస్తుతో సజీవమైన ఈ ఐక్యతను బట్టి, విశ్వాసి పాపంతో పూర్తిగా ఒక నూతనమైన సంబంధాన్ని కలిగి ఉంటాడు. మనమిప్పుడు పాపం విషయమై చనిపోయాం. మనం పాపపు కార్యాల విషయమై, పాపపు నియమం విషయమై కూడా చనిపోయాం. ఇది పాపంతో మన స్థాన సంబంధం.
క్రీస్తుతో మన ఐక్యతను బట్టి, మనం జీవితపు నూతనత్వంలో నడుస్తున్నాం, ఎందుకంటే మనం ఆయన పునరుత్థాన జీవాన్ని పంచుకొంటున్నాం.
క్రీస్తుతో మన ఐక్యత కారణంగా, ఆయన సిలువ కార్యం, నా సిలువ కార్యంగా మారింది. ఆయన మరణం పాపపు శక్తిని ఓడించింది గనుక, మన జీవితంలో దాని శక్తి క్రింద, అధికారం క్రింద ఉండము.
ఎంచుకొనుట అనే మాటకు అర్థం ఏమిటి? (రోమా 6:11). ఈ సందర్భంలో, ఇది ఖాతాపుస్తకాలను నిర్వహించడానికి సంబంధించిన పదం. ఈ గ్రీకు పదం భిన్నమైన లేఖనభాగాలలో, భిన్నమైన పదాలుగా అనువాదం చేసినప్పటినికి, క్రొత్తనిబంధనలో ఈ పదాన్ని 11 సార్లు ఉపయోగించడం జరిగింది . ఇక్కడ ఇది, “పాపం నుండి విడుదలను, క్రీస్తు ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానంలో అందించబడిన దేవునితో ఐక్యతను విశ్వాసం ద్వారా కేటాయించడాన్ని” సూచిస్తుంది.[2] ఇప్పటికే మనం పాపం విషయంలో మృతిపొందామనే సత్యాన్ని నమ్మాలని ఈ క్రియ సూచిస్తుంది:
నేను పాపం విషయమై చనిపోయి, క్రీస్తు యేసునందు దేవుని విషయమై సజీవంగా ఉన్నాను అనే సత్యాన్ని లెక్కలోనికి తీసుకోవడానికి ఏమి చేయాలి? విశ్వాసం ద్వారా నేను దేవుని వాక్యాన్ని సత్యంగా నా హృదయంలో నమ్ముతాను. నేను [3]పాపాలన్నింటి నుండి విడుదల పొంది, నా ప్రభువైన క్రీస్తు యేసులో దేవుని విషయమై సజీవంగా ఉన్నానని తప్పులేని, నిర్దోషమైన దేవుని వాక్యపు అధికారాన్ని ఆధారం చేసుకొని నేను ప్రకటిస్తున్నాను.
యేసుక్రీస్తుకు స్వచ్ఛంధ ప్రేమ బానిసగా, ప్రాచీన జీవితానికి సంబంధించిన వైఖరులను, చర్యలను నేను ఇష్టపూర్వకంగా విడిచిపెడతాను. యేసుకు సంపూర్ణంగా సమర్పించుకోవడంలో సంతోషం ఉంది! మరియు క్రీస్తుతో నాకున్న సంబంధం ఫలితంగా, నేను నిత్యజీవాన్ని కలిగి ఉన్నాను.
ముగింపు
పాపం యొక్క నియంత్రణ శక్తి నుండి పూర్తి స్వేచ్ఛను పొందడం రక్తం ద్వారా కొనబడిన అధికారంగా మనం చూశాము. కానీ దానికంటే మించి, మనం విజయం సాధించాలనేది దేవుని ఆజ్ఞ.
బహుశా మనం ఈ సత్యాన్ని మునుపెన్నడూ గ్రహించలేదేమో. దేవుడు మిమ్మల్ని రక్షించాడు మరియు మీరు జీవితపు నూతనత్వంలో నడుస్తున్నారు; కానీ పాపం ఇంకా మీ జీవితంలో కనబడడం మీరు కనుగొంటారు. అది కనిపించాలని మీరు అనుకోరు! తన మార్గంలో చేయడానికి ఇష్టపడేది మీ అంతరంగంలో ఉంది. ఇదే ఆ పరిస్థితి అయితే పాపం విషయమై మిమ్మల్ని మీరు మృతులుగా ఎంచుకొని (6:11), మిమ్మలని మీరు దేవునికి సమర్పించుకొనుమని (6:13) పౌలు చెప్పిన ఆజ్ఞను మీరు అనుసరించాలి.
ఆయనకే సంపూర్ణ నియంత్రణ ఇవ్వాలి! మీరు ఇది చేసినట్లయితే, పాపపు నియంత్రణ లేని జీవితాన్ని జీవించేటట్లు చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. దేవుడు చెప్పిన దానిని నమ్మి, పాపం నుండి మీ విడుదలను విశ్వాసంతో స్వతంత్రించుకోవాలి.
► క్రీస్తుతో ఐక్యపరచబడడం అంటే అర్థం ఏమిటి? మీరు క్రీస్తుతో ఐక్యపరచబడ్డారు గనుక మీ జీవితం నుండి ఏం ఆశించాలి?
“మనం రోమా 6-8 అధ్యాయాలను అధ్యయనం చేస్తుండగా, సాధారణ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి షరతులు నాలుగంచెలుగా ఉంటాయని కనుగొంటాం. అవి (1) తెలుసు కోవడం, (2) లెక్కలోనికి తీసుకోవడం, (3) మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం, (4) ఆత్మలో నడవడం. ఇవి ఆ క్రమాన్ని ఏర్పరచాయి.”
- వాచ్ మన్ నీ, సాధారణ క్రైస్తవ జీవితం
(The Normal Christian Life)
జయజీవితాన్ని ఎలా జీవించాలి
పాపంపై విజయంతో జీవించడం నిజంగా సాధ్యమేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శోధనలో మన బలహీనతకు పరిహారం చేయడం కంటే ఎక్కువగా బలపరిచే కృపను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు:
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును. (1 కొరింథీయులకు 10:13).
ఈ వచనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనకు చెబుతుంది.
1. ప్రతి శోధన మానవునికి సాధారణమైంది. మన మానవత్వాన్ని బట్టి ఇది వస్తుంది మరియు ఏదో ఒక మానవ బలహీనతపై దృష్టి నిలుపుతుంది. దాని అర్థం, మీ ఇబ్బందులు నిజంగా మీకు ప్రత్యేకమైనవి కాదు.
2. మన పరిమితులు దేవునికి తెలుసు. మనం ఎంతవరకు సహించగలమో ఆయనకు తెలుసు. వాస్తవానికి మనం ఎంతగా సహించగలమో మనకు తెలీదు కానీ ఆయనకు తెలుసు.
3. మనం విజయంలో జీవించాలని దేవుడు కోరుకుంటాడు గనుక మనకు వచ్చే శోధనకు ఆయన పరిమితిని విధిస్తాడు. మనం మనుష్యులం గనుక శోధన మన సామర్థ్యానికి మించి ఉంటుందని కొంతమంది ప్రజలు భావిస్తారు. స్థిరంగా విజయం సాధించడం అసాధ్యమని వాళ్ళు భావిస్తారు, కానీ ఈ వచనం ప్రకారం అది సాధ్య.
4. విజయంలో జీవించడానికి అవసరమైన దానిని దేవుడు అనుగ్రహిస్తాడు. తప్పించుకోవడానికి ఆయన ఒక మార్గాన్ని కలుగజేస్తాడు.
కాబట్టి, మనం విజయంలో జీవించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడని ఈ వచనం నుండి మనం ఒక తీర్మానానికి రావొచ్చు. విజయవంతమైన జీవితానికి అవసరమైన కృప, విశ్వాసానికి స్పందనగా ఇవ్వబడుతుంది.
దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే (1 యోహాను 5:4).
శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును (యాకోబు 1:12).
శోధన విశ్వాసులను ఎలా ఓడించిందో మనం అర్థం చేసుకున్నప్పుడు, దానిని ఎలా నివారించాలో మనం అర్థం చేసుకుంటాం. శోధనలో పడిన వ్యక్తి, ఒక నిర్దిష్టమైన ప్రక్రియ గుండా వెళ్లుటకు తననుతాను అనుమతించుకుంటాడు.
ఈ ప్రక్రియ, యాకోబు 1:14-15లో వివరించబడింది: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా...”
ఉద్దేశ్యపూర్వకంగా చేసే పాపం, ఈ క్రింద పేర్కొనబడిన దశలలో జరుగుతుందని జాన్ వెస్లీ గమనించారు.
1. శోధన కలుగుతుంది/వస్తుంది (లోకం నుండి, శరీరం నుండి లేదా దుష్టుని నుండి)
2. జాగ్రత్తగా ఉండమని పరిశుద్ధాత్ముడు విశ్వాసిని హెచ్చరిస్తాడు.
3. వ్యక్తి, శోధన పట్ల శ్రద్ధ వహిస్తాడు, అప్పుడు దాని ఆకర్షణ పెరుగుతుంది. (ఈ ప్రక్రియలో వ్యక్తి ఇక్కడే తన మొదటి పొరపాటును చేస్తాడు).
4. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, వ్యక్తి యొక్క విశ్వాసం బలహీనమవుతుంది మరియు దేవుని పట్ల అతని ప్రేమ చల్లారిపోతుంది.
5. పరిశుద్ధాత్ముడు తీవ్రంగా గద్దిస్తాడు.
6. వ్యక్తి, బాధ కలిగించు ఆత్మ స్వరం నుండి తొలగి, ఆకర్షణ కలుగజేయు శోధకుని స్వరాన్ని వింటాడు.
7. చెడు కోరికలు ప్రారంభమై, హృదయాన్ని నింపుతాయి; విశ్వాసం, ప్రేమ అదృశ్యమవుతాయి; అతను బహిరంగ పాపాన్ని చేయడానికి సిద్ధపడతాడు.
ప్రతి ఒక్కరి అనుభవం, ఈ నమూనాతో ఎల్లప్పుడూ సరిపోతుందని మనం భావించకూడదు. కొన్నిసార్లు ప్రజలు ఎలాంటి ప్రక్రియ గుండా వెళ్ళకుండా, అకస్మాత్తుగా శోధనకు లోనవుతారు.
శోధన, మన ఏకాగ్రతను కట్టిపడేసి, దాని శక్తిని పెంచుతుంది గనుక, పాపంపై విజయాన్ని కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణించే వ్యక్తి, తన హృదయాన్ని స్థిరపరచుకోవాలి, తద్వారా శోధనను వెంటనే తిరస్కరించగలుగుతాడు. శోధన, పాపానికి నడిపిస్తుందని గుర్తించినప్పటికీ, దానిని ప్రతిఘటించడానికి/నిరోధించడానికి సంకోచించే వ్యక్తి, తనని తాను గొప్ప ప్రమాదంలో పడవేసుకుంటాడు. సంకోచించే వ్యక్తి, తన హృదయంలో దేవునిని సంతోషపెట్టాలని సంపూర్ణంగా నిర్ణయించుకోలేదనే విషయాన్ని వెల్లడి చేస్తుంది.
శోధన, మన విశ్వాసానికి ఒక సవాలు, ఎందుకంటే దేవునికి విధేయత చూపడం ఆ సమయంలో ప్రయోజనకరమైన మార్గమనే సత్యాన్ని అనుమానించడానికి శోధన అవకాశమిస్తుంది.
► ఒక విశ్వాసి పాపంపై విజయంతో జీవించలేడని అనిపిస్తే, దానికి కారణం ఏమిటి?
బహుశా ఇది క్రిందివాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమస్యల వల్ల కావచ్చు.
1. దేవునికి విధేయత అవసరమని అతడు చూసి ఉండడు.
2. సామర్థ్యాన్ని కలిగించే కృపను గూర్చిన దేవుని వాగ్దానాన్ని అతను చూడకపోవచ్చు లేదా నమ్మకపోవచ్చు.
3. బలపరిచే దేవుని కృపపై కాకుండా తన వ్యక్తిగత శక్తిపై ఆధారపడడం.
4. అతను సంపూర్ణంగా, షరతులు లేకుండా దేవునికి విధేయత చూపడానికి బదులు, ఎంపిక చేసిన విషయాల్లోనే దేవునిని సేవచేయడం.
5. అతను కృప ద్వారా దేవుని చిత్తాన్ని చేయాలనే ఏకత్వపు వైఖరిని కలిగి ఉండకపోవడం (ఫిలిప్పీయులకు 3:13-15).
6. తన విశ్వాసాన్ని, దేవునితో సంబంధాన్ని బలంగా ఉంచే ఆత్మీయ క్రమశిక్షణలను నిర్వహించకపోవడం.
7. అతను స్థానిక సంఘంలో ఆత్మీయ జవాబుదారీతనాన్ని నిర్వహించకపోవచ్చు.
8. అతను దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించడు.
9. తన జీవితంలో పరిశుద్ధాత్ముని స్వరాన్ని వినే అలవాటు చేసుకొని ఉండకపోవచ్చు.
ముగ్గురు వ్యక్తులు, డ్రైవరు ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకున్నారు. మొదటి వ్యక్తి, తనకు ఉద్యోగమివ్వబోయే వ్యక్తిని ఆకట్టుకోవాలనుకుని, “నేను ఎంత నైపుణ్యం కలిగిన డ్రైవరునంటే, నేను కొండ అంచుకు కొన్ని అడుగుల దూరంలో అతివేగంతో వాహనాన్ని నడిపినా కూడా మీరు భయకుండా ఉండగలరు” అన్నాడు. రెండవ వ్యక్తి తానేమి తక్కువకాదు, తానే ఉత్తమమైన వ్యక్తిగా కనుపరచుకోవాలని, అతను “నేను కొండపైకి వెళ్ళకుండా, కొన్ని అంగుళాల లోపలే అతివేగంతో నడపగలను” అని అన్నాడు. మూడవ వ్యక్తి కాస్త సంకోచించి, ఉద్యోగమిచ్చే వ్యక్తితో, “కొండ సమీపానికి వెళ్ళి, నేను మీ జీవితాన్ని ప్రమాదంలో పడవేయలేను” అని అన్నాడు. ఈ ముగ్గురిలో ఎవరికి ఉద్యోగం వచ్చిందని మీరు అనుకుంటున్నారు?
మనం శోధనకు ఎంత సమీపంగా వెళ్తున్నామో చూసే ప్రయత్నం చేయకూడదు. మనం బలహీన విషయాల నుండి మనల్ని సంరక్షించడానికి మనకు వ్యక్తిగత సూచనలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. నిర్దిష్టమైన వినోద కార్యక్రమాల వంటి కొన్ని ప్రమాదకరమైన విషయాలను గురించి మనం నేర్చుకొని, ఆ విషయాల నుండి మనం దూరంగా ఉండాలి.
ఒక విశ్వాసి, దేవునితో తన సంబంధాన్ని సరిగా నిర్వహించకపోతే, అతను వెంటనే పశ్చాత్తాపపడి, మన మధ్యవర్తియైన యేసుక్రీస్తు ద్వారా సంబంధాన్ని పునఃస్థాపించుకోవాలి (1 యోహాను 2:1-2). తాను మరింత సౌకర్యవంతంగా ఉంటానని భావించే భవిష్యత్ సమయం కొరకు ఎదురు చూడకూడదు. తాను పునఃస్థాపించబడాలని కోరుకున్నట్లయితే, పరిశుద్ధాత్ముడు ఆ కోరికను తనలో కలిగించి, దేవునితో సంబంధంలోనికి వెనక్కి తిరిగి తీసుకొస్తాడు. అతని పశ్చాత్తాపం నిజమైనదైతే, అతను తక్షణమే పునఃస్థాపించబడతాడు.
దేవుడు యేసు అర్పణ యందు, మన రక్షణ కొరకు అంతిమ పెట్టుబడిని ఇప్పటికే చేశాడు. మనం కొనసాగించడానికి అవసరమైన కృపను మనకు ఇవ్వడంలో వైఫల్యం చెందడం ద్వారా ఆ పెట్టుబడిని వృధాకానివ్వడు.
తెలుసుకొని, స్వంతంగా ఆమోదించుకోవడానికి అయిదు సత్యాలు
పాపక్రియలపై విజయం అనేది క్రైస్తవునికి ఒక సాధారణ అనుభవం, ఎందుకంటే ఆ వ్యక్తి యేసు యొక్క మరణం, భూస్థాపన మరియు పునరుత్థానం ద్వారా పాపపు బానిసత్వం నుండి విడుదల పొందాడు.[1] పాపంలో కొనసాగడం అనేది దేవుని కృపను నిర్లక్ష్యం చేయడం, క్రీస్తుతో ఐక్యత కొనసాగడంలో విఫలమవ్వడం, పాపం విషయమై మరణించి, దేవుని విషయమై సజీవులుగా పరిగణించుకోవడంలో విఫలమవ్వడం, తన శరీరాన్ని పూర్తిగా నీతికి సాధనాలుగా దేవునికి సమర్పించుకోవడంలో విఫలమవ్వడం ద్వారా కలుగుతుంది.
ప్రతి నిజమైన విశ్వాసి, పాపంపై విజయాన్ని అనుభవించాలని కోరుకుంటాడు. పాపం నుండి మనలను రక్షించడానికి యేసు చెల్లించిన అమూల్యమైన వెల దీనికి కారణం. పాపం యొక్క నాశనకరమైన స్వభావం దీనికి కారణం. “పాపం విషయమై కృప విస్తరిస్తుంది గనుక పాపాన్ని ఎందుకు చేయకూడదు?” అని వాదించే వారికి పౌలు ఇచ్చిన సమాధానం బలమైనది. “అట్లనరాదు” అని ఆయన ధృవీకరించాడు (రోమా 6:1-2). పాపమనే వ్యాధికి దేవుడు స్వస్థతను అందుబాటులోనికి తీసుకొచ్చాడు గనుక పాపం పట్ల అజాగ్రత్తతో కూడిన వైఖరిని కలిగి ఉండడమనేది HIV/ఎయిడ్స్ లేదా క్యాన్సర్ కు మందు కనుగొన్నారు గనుక వాటి విషయమై అజాగ్రత్తగా ఉన్నట్లు ఉంటుంది. చికిత్స, వ్యాధినుండి మరియు వేదన నుండి తప్పించలేదు. గాయాల గుర్తులను కూడా దూరం చేయలేవు. సరైన దృక్పథంతో ఆలోచించే ఏ వ్యక్తి కూడా “చికిత్స అందుబాటులో ఉంది కాబట్టి వ్యాధిబారినపడతాను” అని చెప్పడు. పాపం యొక్క భయానక స్వభావం, పరిశుద్ధుడైన దేవుడు పాపం పట్ల కలిగి ఉన్న హేయభావనను మరియు పాపాన్ని పరిహరించడం కోసం చెల్లించబడిన అమూల్యమైన వెలను అర్థం చేసుకొన్న వ్యక్తి, “పాపాన్ని కృప కప్పుతుంది కనుక పాపం చేద్దాం” అని చెప్పడు.
పాపం నుండి విడుదల విషయమై ఒక క్రైస్తవుని అనుభవం, ఈ సత్యాలను గూర్చిన తన జ్ఞానంపై (రోమా 6:3, 6, 9) మరియు వాటిని ఉపయోగించడంపై ఆధారపడి ఉంటుంది:
(1) పాపియైన వ్యక్తిగా నేను మరణించాను.
మన ప్రాచీన స్వభావం, ప్రాచీన పాపపురుషుడు, సిలువపై క్రీస్తుతో పాటు ఆత్మీయంగా మరణించి, ఆయన సమాధిలో పాతిపెట్టబడ్డాడు. చనిపోయిన వ్యక్తి, బానిసగా సేవ చేయడు గనుక, మనపై పాపపు అధికారం/ప్రభుత్వం వీగిపోయింది. ఈ మరణం ఇప్పటికే సంభవించింది. మన కొరకు క్రీస్తు చనిపోయాడని నమ్మి, మన పాపాల విషయమై పశ్చాత్తాపపడి, ఆయనిచ్చే నిత్యజీవపు బహుమానాన్ని స్వీకరించిన క్షణమే మన ప్రాచీన పాప జీవితం మరణించింది.
రోమా 6 నుండి ఈ ప్రకటనలను గమనించండి:
“....పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?” (6:2).
“క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?” (6:3).
నేటి దినాలలో చాలామంది విశ్వాసులు వారి సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో జీవించడం వారితో ఉన్న పెద్ద సమస్య. చాలామంది క్రైస్తవులు, వైఫ్యల్యాన్ని/ఓటమిని సర్వసాధారణమైందిగా భావించాలనే షరతును కలిగి ఉన్నారు. విజయవంతమైన క్రైస్తవ జీవితం సాధ్యం కాదని, పాపంలో కొనసాగే అవకాశముందని వాళ్ళు భావిస్తారు. మనిషి వైఫల్యం సహించలేనిదని కొంతమంది విశ్వాసులు అనుకుంటారు. ఈ బోధన కూడా విశ్వాసాన్ని పాడుచేస్తుంది మరియు అనేకులను నిరాశలోనికి లేదా వేషధారణలోనికి నడిపిస్తుంది. సిలువ యొద్ద క్రీస్తు విజయంలో పాలుపంచుకోవడం ద్వారా విజయం మన స్వంతమవుతుందని పౌలు స్పష్టం చేశాడు.
(2) నేను నూతన వ్యక్తిగా ఉండడానికి గాను దేవుడు నన్ను యేసుతో కూడా లేపాడు.
యేసు, తన పునరుత్థానం ద్వారా పాపమంతటిని జయించాడు. ఈ పునరుత్థాన జీవాన్ని పంచుకోవడానికి విశ్వాసం ద్వారా మనం వచ్చాం. విశ్వాసం ద్వారా, మనపై భారం మోపడానికి, అవమానించడానికి, గాయపరచడానికి లేదా మనల్ని చంపడానికి పాపానికి శక్తిలేదు. నూతన జయజీవితానికి మనం ఆత్మీయంగా క్రీస్తుతో కూడా లేపబడ్డాం.
“కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు....” (6:4).
“.... ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము” (6:5).
“.... మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదు మని నమ్ముచున్నాము.” (6:8-9).
“ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు” (6:10).
నా ప్రాచీన జీవితం ఆయనతో కూడా సిలువవేయబడడం మాత్రమే కాదు, ఆయన వంటి నూతన జీవితాన్ని నేను పొందడం మాత్రమే కాదు; కాని నేను ఆయనలో నివసిస్తాను, ఆయన నాలో ఉంటాడు! (గలతీయులకు 2:20 మరియు యోహాను 14-16 కూడా చదవండి). యేసు దీనిని ప్రతి శిష్యునికి వాగ్దానం చేశాడు: పరిశుద్ధాత్ముని ద్వారా విశ్వాసులలో నివసించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. విశ్వాసులతో ఈ ఐక్యత మరియు వారిలో నివసించడమే పాపంపై విజయాన్నిస్తుంది మరియు పరిశుద్ధంగా జీవించడాన్ని సాధ్యం చేస్తుంది. ఇదే విశ్వాసులు స్వచ్ఛమైన, కృపాసహితమైన, ప్రేమ కలిగిన, దయ, క్షమాపణ, పరిశుద్ధత కలిగిన యేసు జీవితాన్ని పొందడాన్ని, దానికి అనుగుణంగా జీవించడాన్ని సాధ్యం చేస్తుంది.
“మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము” (6:5).
“....మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము” (6:6)
ఎంచుకోవడం అంటే దీనిని మన జీవితంలో అనుభవించునట్లు ఇది సత్యమని పరిగణించడం.
పాతనిబంధనలోని ఒక ఉదాహరణ ఇక్కడ మనకు సహాయకరంగా ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశాన్ని వాగ్దానం చేయడం మాత్రమే కాదు గాని వాళ్ళు దానిని వాస్తవంగా స్వతంత్రించుకోవడానికి చాలాకాలం క్రితమే వారికిచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు, వారి సామర్థ్యానికి క్రింద జీవించారు, ఎందుకంటే భయపడి, దేవునిని నమ్మడంలో విఫలమయ్యారు. కానీ దేవుడు వారిని ప్రేమించి, తమ స్వాస్థ్యంలోనికి వారిని నడిపించాడు.
యెహోషువా 1:3, “నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను” అని చెబుతుంది. కొన్ని వచనాల తరువాత, దేవుడు “మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై మూడుదినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను...."(యెహోషువ 1:11).
దేవుని ప్రజలు విశ్వాసం ద్వారా దేవుడు తమకిచ్చిన స్వాస్థ్యమును స్వాధీనపరచుకోవాలి. కనాను నివాసులపై విజయం అందించబడుతున్నపటికీ, వాస్తవ భావనలో అది ఇప్పటికే పూర్తయింది, కానీ ఇశ్రాయేలు విధేయతతో కూడిన విశ్వాసం ద్వారా మాత్రమే ఈ విజయాన్ని అనుభవించగలదు. క్రొత్త నిబంధన విశ్వాసులు కూడా ఇదే విధానంలో జయిస్తారు; విశ్వాసం ద్వారా క్రీస్తు యేసు మన కొరకు సాధించిన విజయాన్ని పరిగణలోనికి తీసుకోవడం ద్వారా ఆ విజయాన్ని స్వాధీనపరచుకొంటాం మరియు వాగ్దానాలను స్వతంత్రించుకొంటాం.
(5) నేను నా దేహాన్ని దేవునికి సమర్పించాలి.
కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి (రోమా 6:12-13).
(1) పాపం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
(2) ఉద్దేశ్య పూర్వక పాపానికి నిర్వచనం ఏమిటి?
(3) రోమా 6లో పౌలు ఏ తప్పుడు ఆలోచనకు స్పందిస్తున్నాడు?
(4) పాపం విషయమై మరణించడం అంటే అర్థం ఏమిటి?
(5) కృప క్రింద ఉండడం అంటే అర్థం ఏమిటి?
(6) ధర్మశాస్త్రం క్రింద ఉండడం అంటే అర్థం ఏమిటి?
(7) దేవునికి, పాపానికి సేవ చేయకపోవడం ఎందుకు అసాధ్యం?
(8) ప్రాచీన స్వభావం అనే మాటకు అర్థం ఏమిటి?
పాఠం 6 - అభ్యాసాలు
(1) విశ్వాసికి పాపంపై ఏ విజయం సాధ్యమవుతుందో ఒక పేజీలో వివరించండి. ఉద్దేశ్యపూర్వక పాపాన్ని నిర్వచించండి మరియు పాప నిర్వచనం ఎందుకు ప్రాముఖ్యమో వివరించండి. పాపంపై విజయం సాధ్యమనే అంశానికి ప్రజల అభ్యంతరాలకు స్పందించండి.
(2) మీ ప్రసంగ లేదా పాఠ్యాంశ ప్రదర్శనలను/వివరణలను పూర్తి చేయాలి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.