రక్షణకు నడిపించే కృప (The Grace That Leads to Salvation)
బలిని అర్పించినప్పటికీ, తన హృదయంలో దేవుని కృప పనిచేయకపోతే పాపి నిరాశలోనే ఉంటాడు. పాపియైన వ్యక్తి, సాతాను అధికారం క్రింద జీవిస్తూనే, చెడు కోరికలతో నియంత్రించబడుతూ, పాపంలో ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉంటాడు (ఎఫెసీయులకు 2:1-3). అతను తన ప్రవర్తనను మార్చుకోవడానికి శక్తి లేనివాడు (రోమా 7:18-19). అలాంటి వ్యక్తి పశ్చాత్తాపంతోను, విశ్వాసంతోను సువార్తకు ఎలా ప్రతిస్పందిస్తాడు?
దైవజ్ఞాన పండితులు, మనిషి స్థితికి, దేవుని కృప ఎలా స్పందించిందో వివరించే ప్రయత్నం చేశారు.
జాన్ కాల్విన్
మనిషి సంపూర్ణ భ్రష్టత్వానికి లోనయ్యాడు గనుక దేవునికి స్పందించాలనే ఎంపికను చేసుకోలేడని/నిర్ణయం తీసుకోలేడని జాన్ కాల్విన్ నమ్మాడు.[1] కాబట్టి, ఎవరు రక్షణ పొందుతారో, ఎవరు రక్షణ పొందరో దేవుడే ఎంపిక చేస్తాడు/నిర్ణయిస్తాడు. దేవుడు రక్షణ పొందడానికి కొంతమందిని మాత్రమే ఎంపిక చేసుకొన్నాడు గనుక ప్రాయశ్చిత్తం వారికొరకే అందించబడింది కానీ ప్రజలందరికీ కాదు. ఈ వ్యక్తులు ఎంపిక చేసుకోలేరు. ఎదురాడలేని/నిరోధించలేని కృపతో, వాళ్ళు పశ్చాత్తాపపడి, విశ్వాసముంచేలా దేవుడు చేస్తాడు. వారి చిత్తం దేవుని నియంత్రణ క్రింద ఉంది కనుక వాళ్ళు రక్షణ నుండి ఎప్పటికీ తొలగిపోరు. ఇది దేవుని సార్వభౌమాధికారం గురించి కాల్విన్ భావన.
రక్షణార్థమైన కృప ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని కాల్విన్ నమ్మలేదు. ప్రత్యేకమైన కృప లేకుండా ఏ వ్యక్తి పశ్చాత్తాపపడలేడు, నమ్మకముంచలేడు అని అతను నమ్మాడు మరియు ఈ కృప అనేకమందికి ఇవ్వబడలేదని నమ్మాడు.
ఒక వ్యక్తి దేవుని నుండి సహాయం పొందకుండా ప్రమాణాన్ని/వాగ్దానాన్ని నెరవేర్చడం లేదా తన కుటుంబాన్ని ప్రేమించడం లాంటి మంచి పనులు చేయలేడని కెల్విన్ నమ్మాడు. సత్క్రియలు చేయు సామర్థ్యం ఇచ్చే కృపను దేవుడు ప్రజలందరికీ ఇచ్చాడు అని అతడు నమ్మాడు. అతను దీనిని “సాధారణమైన కృప” అని పిలిచాడు. సాధారణ కృప ఒక వ్యక్తిని రక్షణలోనికి తీసుకురాగలదని అతను నమ్మలేదు.
జాన్ వెస్లీ దేవుని కృపను గురించి ఒక భిన్నమైన దృక్కోణాన్ని కలిగి ఉన్నాడు. బైబిల్, దేవునికి స్పందించడానికి ప్రజలను నిరంతరం పిలవడం అతను చూశాడు. దీన్ని బట్టి, మనిషి ఎంపిక/నిర్ణయం వాస్తవమైనదని నమ్మాడు. కాల్విన్ వలె, మనిషి భ్రష్టుడైపోయాడని, దేవుని నుండి సహాయం లేకుండా సువార్తకు స్పందించలేడని, కానీ దేవుడు ఆ సహాయాన్ని ప్రతి ఒక్కరికీ ఇస్తాడని నమ్మాడు. దేవుడు స్పందించాలనే కోరికను, స్పందించడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు, కానీ అనివార్యంగా వారిని రక్షించడు. దేవుడు మనిషి ఎంపికను సాధ్యం చేశాడు. ఇది ప్రతి వ్యక్తి యొద్దకు వచ్చిన మొదటి కృప. దైవజ్ఞాన పండితులు దీనిని, “ముందస్తు కృప/పూర్వకృప” అని పిలుస్తారు, “ముందుగా వచ్చే కృప” అని దీనర్థం.
దేవుని కృప, పాపి హృదయంలోనికి చేరి, తన పాపాలను ఒప్పింపజేసి, దేవునినుండి దూరమవ్వడానికి తనకు తానే కారణమని చూపిస్తుంది. దేవుని కృప, ఆ వ్యక్తి క్షమాపణను కోరుకునేలా చేస్తుంది మరియు దేవునికి స్పందించగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది.
కృప లేకుండా ఏ వ్యక్తి కూడా కనీసం దేవుని యొద్దకు రాలేడు. కృప పొందుటకు అర్హత సంపాదించడానికి అతను ఏం చేయకపోయినప్పటికిని, దేవునిని వెదకడం ప్రారంభించడానికి ముందే కృప ప్రతి వ్యక్తి దగ్గరకు వస్తుంది.
ఎఫెసీయులకు 2:1-3 వచనాలు, ఎంతటి నిస్సహాయమైనస్థితిని గురించిన వివరణనిస్తాయో జ్ఞాపకం చేసుకోండి? కానీ ఆ వివరణ తరువాత వచ్చే రెండు వచనాలను చూడండి.
“అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు.” (ఎఫెసీయులకు 2:4-5).
ఒక వ్యక్తి రక్షణ పొందకపోతే, అతనికి కృప అందుబాటులో లేనందువల్ల కాదు, కానీ అతనికి అందుబాటులో ఉన్న కృపకు స్పందించకపోవడం ముఖ్య కారణం.
► మనిషి దేవుని కొరకు వెదకడం లేదా మనిషి అంతరంగంలో దేవుడు పనిచేయడం - వీటిలో ఏది మొదటిగా వస్తుంది? దీన్ని మీరు ఎలా వివరిస్తారు?
ఈ పాఠంలో, రోమా పత్రిక యొక్క 2వ భాగాన్ని ముగిస్తాం. అన్యులు, దేవుని జ్ఞానాన్ని తిరస్కరించి, విగ్రహాల తట్టు ఎలా తిరిగారో మనం చూశాం. యూదులు దేవుని ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు, కానీ దానికి విధేయత చూపలేదు. ఇప్పుడు, లోకంలో ఉన్న ప్రజల పరిస్థితిని అపొస్తలుడు క్లుప్తీకరిస్తున్నాడు/క్లుప్తంగా వివరిస్తున్నాడు.
3:1-20 యొక్క ప్రధానాంశం
లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి పాపియై, దేవుని న్యాయస్థానంలో దోషిగా నిలబడ్డాడు.
3:1-20 యొక్క సారాంశం
ఈ లేఖనభాగం, 1:18-3:20 వరకు ఉన్న పెద్ద లేఖనభాగాన్ని క్లుప్తీకరిస్తుంది. 3:19-20 వచనాలు, చిన్న లేఖనభాగాన్ని, అదేవిధంగా పెద్ద లేఖన భాగాన్ని కూడా క్లుప్తీకరిస్తాయి. లోకమంతా దోషులేనని ధర్మశాస్త్రం చూపిస్తుంది; కాబట్టి, ఏ వ్యక్తి కూడా తన క్రియల ఆధారంగా నీతిమంతునిగా తీర్పుతీర్చబడడు.
ప్రతి నోరు మూయబడడమే ఈ విషయాన్ని చెప్పడానికి కారణం (3:19), అంటే ఏ వ్యక్తి తనకు తానుగా నీతిమంతునిగా తీర్చుకోవడానికి కారణం గాని, ఆధారం గాని లేదని అర్థం. 3:9 వచనం, పౌలు తర్కించే విధానాన్ని చూపిస్తుంది: ఆయన యూదులు, అన్యులు పాపం క్రింద ఉన్నారని తెలియజేసాడు. ఎవరికి కారణం లేదు/సాకు లేదు కనుక, మనుష్యులందరిని పాపులుగా పరిగణించి, వారితో వ్యవహరించడంలో దేవుడు న్యాయవంతుడు.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 3:1-20 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(3:1-2) యూదులు, కేవలం యూదులైనంత మాత్రాన రక్షణ పొందరని పౌలు చెబుతున్నాడు; తమ క్రియలను బట్టి అన్యులు తీర్పు పొందినట్లే, యూదులు కూడా తీర్పుపొందుతారు. సర్వసాధారణంగా వచ్చే ప్రశ్న ఏమిటంటే “యూదులకు నిజంగా ఏదైనా ప్రయోజనం ఉందా?” వాళ్ళు లేఖనాన్ని పొందడమే గొప్ప ప్రయోజనం. దాదాపు బైబిల్ మొత్తం, దేవుడు ప్రేరేపించిన యూదులే రాశారు (ఇతర ప్రయోజనాలను 9:4-5లో ప్రస్తావించారు).
బాప్తిస్మం, సంఘం, సభ్యత్వం, ప్రభురాత్రి భోజన సంస్కారం లేదా ఇతర మతపరమైన ఆచారాల వంటి ఏ మతపరమైన పద్ధతి గురించి లేదా కృపా సాధనం గురించి ఇదే ప్రశ్నను అడగవచ్చు. అవి రక్షణ నిశ్చయతను ఇవ్వవు, కనుక ఒక వ్యక్తి, “అవి ఏవిధంగా మంచివి/ప్రయోజనకరమైనవి?” అని అడగవచ్చు. ఆరాధన పద్ధతులు, మన విశ్వాసానికి దోహదపడడానికి/ సహాయపడడానికి ఇవ్వబడ్డాయనేది సమాధానం. మనం విశ్వాసంతో వాటిని ఆచరించినప్పుడు, కృపను పొందుతాము. కానీ, విశ్వాసం లేకుండా వాటిని ఆచరించినా విధేయతకు ప్రత్యామ్నాయంగా వాటిని చేసినా అవి నిరర్థకమైనవి.[1]
(3:3) మరి కొంతమంది అవిశ్వాసులైతే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఆవిశ్వాసులైనంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా? ప్రశ్నించే వ్యక్తి, అవిధేయులైన యూదులను దేవుడు రక్షించనట్లయితే, దేవుని వాగ్దానము నెరవేరలేదని అంటాడు.
దేవుని కృప, యూదుల పట్ల షరతులు లేనిదిగా ఉంటుందని వారి ఆలోచన. వాళ్ళు అవశ్యకంగా చేయాల్సిన వాటి విషయంలో విఫలమైనప్పటికిని, దేవుడు అపనమ్మకస్తుడని నిందించవచ్చని అనుకునేవాళ్ళు.
(3:4) ఈ దృశ్యం, ఒక న్యాయస్థానంలో దేవుడు, మనిషి ప్రత్యర్థులుగా/ఎదురెదురుగా/ఒకరికొకరు విరోధంగా ఉన్నారనే భావనను కలిగిస్తుంది. మనిషి అపనమ్మకత్వానికి భిన్నంగా దేవుని నమ్మకత్వం నిరూపించబడుతుంది. దేవుని న్యాయాన్ని మనం పరీక్షించకూడదని అపొస్తలుడు చెప్పడం లేదు. మనం దేవుని చర్యలను/కార్యాలను పరీక్షించినప్పుడు, ఆయన తాను చేసే వాటన్నింటిలో న్యాయవంతుడు, నీతిమంతుడు అనే విషయాన్ని చూడాలని చెబుతున్నాడు.[2]
పత్రికలో తరువాత, రక్షణ షరతులతో కూడినది గనుక దేవుడు రక్షించినప్పుడు, శిక్షించినప్పుడు కూడా ఆయన న్యాయం ప్రదర్శించబడుతుందని చూస్తాం.
(3:5) ఎవరో ఒకరు అడిగే ప్రశ్నను, అపొస్తలుడు అడుగుతున్నాడు: “మన పాపం, దేవుడు న్యాయవంతుడనే విషయాన్ని చూపిస్తే, అప్పుడు అది ఏదో ఒక మంచిని నెరవేరుస్తుంది. అలాంటప్పుడు, దీనిని బట్టి మనల్ని శిక్షించడం దేవునికి తప్పేలా అవుతుంది?”
► 3:5లో ఉన్న ప్రశ్నకు మీరు ఎలా సమాధానం చెబుతారు?
(3:6) లేదు, ఎందుకంటే, మనిషి పాపం, దేవుని నీతిని కనబరుస్తుంది కనుక అది క్షమాపణను పొందినట్లయితే, ఏ పాపం తీర్పుపొందకూడదు. ఇది న్యాయవంతుడైన దేవునిలో విశ్వాసముంచే వ్యక్తికి ప్రాముఖ్యమైన సిద్ధాంతపరమైన అంతిమ తీర్పును తిరస్కరిస్తుంది. అన్నింటికీమించి, దేవుడు పాపాన్ని శిక్షించినప్పుడు, స్పష్టమైన వెలుగులో ఆయన న్యాయం ప్రదర్శించబడుతుంది, కానీ పాపం తన న్యాయాన్ని చూపుతుందనే దానిపై ఆధారపడి ఆయన పాపాన్ని సమర్థించినట్లయితే, అప్పుడు ఆయన పాపాన్ని శిక్షించలేడు. అభ్యంతరం దానినదే ఖండిస్తుంది.
(3:7) మన పాపం, దేవునిని మహిమ పరచడానికి వాడినట్లయితే, అప్పుడు పాపికి తీర్పు తీర్చకూడదనే ఆలోచన మరోసారి ప్రతిపాదించబడింది. ఇది వాటి అంతిమ పర్యవసానాల ప్రకారం చర్యలను అంచనా వేయడానికి చేసిన ప్రయత్నం. అయితే, తీర్పనేది వైఖరులను బట్టి ఉంటుందనే వాస్తవానికి ఇది భిన్నంగా ఉంటుంది (2:15-16). అదేవిధంగా, చెడు కార్యాల నుండి మంచి ఫలితాలను తీసుకురావడమనేది పూర్తిగా దేవునికి చెందింది. ఒక పాపి, తన పాపం ద్వారా మంచిని సాధించలేడు. దేవుడు కలుగుజేసుకున్న సందర్భాలలో మినహాయిస్తే, మిగిలిన అన్ని సందర్భాలలో పాపం, చెడు ఫలితాలనే ఇస్తుంది.
(3:8) పాపులు మరియు పాపాన్ని క్షమించే వారు శిక్షకు అర్హులని పౌలు చెప్పాడు. దేవుని కృప ద్వారా మన పాపం మంచిని సాధించవచ్చు కాబట్టి, మనం దానిని అంగీకరించి పాపులుగా మిగిలిపోవాలని క్రైస్తవులు బోధిస్తారనే తప్పుడు ఆరోపణను కూడా అతను ఖండించాడు. మీరు మీ పాపాన్ని అంగీకరించడం మాత్రమే సరిపోదు. ఒక వ్యక్తి పశ్చాత్తాపపడాలి; కానీ నిజంగా పశ్చాత్తాపపడాలంటే, అతను తన పాపాన్ని నిజంగా చెడ్డదానిగా చూడాలి.
(3:9) “మనం” అనే మాట యూదులను సూచిస్తుంది. వారు యాంత్రికంగా ఆత్మీయ స్థాయిని కలిగి ఉండలేరు. అందరూ పాపం క్రిందనే ఉన్నారు; వాళ్ళు పాపం చేశారు, దాని శిక్ష క్రింద ఉన్నారు.
(3:10-18) ఈ వచనాలను కీర్తనలు మరియు పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల నుండి తీసుకొన్నాడు.[3] కొంతమంది, 3:10వ వచనాన్ని ఉటంకించి/ఉదహరించి, క్రైస్తవునితో సహా ఎవరు నీతిమంతులు కాదని దీని భావమని చెబుతారు. అయితే, 3:10-18 వచనాలు, క్రైస్తవునిని గురించి వివరించడం లేదు. ఇది క్రైస్తవుని గురించి వివరిస్తుందని ఎవరైనా అనుకున్నట్లయితే, మీకు తెలిసిన ఒక క్రైస్తవుని పేరు ఈ వాక్యాలలో పెట్టె ప్రయత్నం చేయండి. ఉదాహరణకు, “పాస్టర్ అహరోను నోరు శాపంతో నిండి ఉంది, అతని పాదాలు హత్య చేయుటకు పరుగెత్తుతున్నాయి, మరియు అతనికి దేవుని భయం లేదు.”
ఈ వచనాలు, మారుమనసు పొందని వ్యక్తుల సాధారణ స్థితిని వివరిస్తున్నాయి. 1:29-31లో కూడా ఇదే విధమైన వివరణ ఉంది. ఏ వ్యక్తి తన క్రియలను బట్టి రక్షణ పొందలేడని చూపించడమే పౌలు ఉద్దేశ్యం. ఏ వ్యక్తి దేవుని నీతిని పొందకుండా నీతిమంతుడు కాలేడని రోమా 3:10-18 చూపిస్తుంది.
► ఈ వ్యాఖ్యకు/ప్రకటనకు మీరు ఎలా స్పందిస్తారు: “ఎవరూ నీతిమంతులు కాదని బైబిల్ చెబుతుంది కనుక తాను శోధనపై జయాన్ని కలిగి జీవిస్తున్నానని ఏ వ్యక్తి ప్రకటించలేడు?”
3:19-20 వచనాలు 3:1-20 వచనాలను క్లుప్తీకరించడం మాత్రమే కాదు, కానీ 1:18-3:20 వచనాలను కూడా క్లుప్తీకరిస్తాయి.
(3:19-20) ధర్మశాస్త్రాన్ని, మనుషులు ఎలా నీతిమంతులుగా తీర్చబడాలో చూపించడానికి ఇవ్వలేదు, కానీ ప్రతి ఒక్కరూ ఇప్పటికే ఎలా దోషులుగా ఉన్నారో చూపించడానికి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం, నీతిమంతులుగా తీర్చబడుటకు మార్గం కాదు కానీ శిక్షావిధికి సాధనం/మాధ్యమం. “ప్రతి నోరు మూయబడునట్లు” అంటే ఏ వ్యక్తి తనను తాను నీతిమంతునిగా కనబరచుకోవడానికి సాకు లేదు లేదా ఆధారం లేదు. అతను దేవుని న్యాయస్థానంలో తనను తాను సమర్థించుకోలేడు.
దేవునిచే అంగీకరించబడడానికి ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించాలని భావించే వ్యక్తి, ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు. ధర్మశాస్త్రం క్రింద ఉండడం అనేది, పాతనిబంధన యొక్క చారిత్రక సమయాన్ని సూచించడం లేదు. ఏ వ్యక్తి అయినా రక్షణార్థమైన కృపను పొందకపోతే, అతను ధర్మశాస్త్ర ఆధీనంలో ఉంటాడు; అతడు దేవుని తీర్పులోని వెళ్ళవలసి ఉంటే, ధర్మశాస్త్ర ఉల్లంఘనను బట్టి తీర్పుతీర్చబడతాడు. రక్షణ పొందిన వ్యక్తి ధర్మశాస్త్రం క్రింద ఉండడు, ఎందుకంటే తన కృప ఆధారంగా దేవుడు అతనిని అంగీకరించాడు.
విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట (Justification by Faith)
ఒక పాపి దేవుని ఎదుట ఎలా నీతిమంతునిగా తీర్చబడుతున్నాడో అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ ఆవశ్యకం. ఒక సమయంలో గాని లేదా నిత్యత్వంలో గాని మనం దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు నిజమైన సమాధానాన్ని లేదా ఖచ్చితమైన సంతోషాన్ని కలిగి ఉండలేము.[1]
ప్రజలు, దేవుని స్వరూపమందు సృష్టించబడ్డారు మరియు తమ సృష్టికర్తయైన దేవుడు పరిశుద్దుడైనట్లు వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉన్నారు. దేవుడు ప్రేమామయుడైనట్లు, స్త్రీ పురుషులు కూడా ప్రేమలోను, దేవునిలోను జీవిస్తున్నారు మరియు దేవుడు వారిలో ఉన్నాడు. దేవుడు ఏవిధమైన పాపపు డాగులు లేకుండా శుద్ధుడైనట్లు, వాళ్ళు కూడా శుద్ధులుగా ఉన్నారు. వాళ్ళకు ఏ కీడు తెలీదు కానీ, అంతరంగంలోను, బాహ్యంగాను పాపం లేనివారిగా ఉన్నారు. వాళ్ళు తమ దేవునిని తమ పూర్ణహృదయాలతోను, మనసులతోనూ, ఆత్మలతోను, బలంతోను ప్రేమించారు.
వెంటనే ఆదామును దేవుని నీతియుక్తమైన తీర్పుతో ఖండించాడు. అవిధేయతకు మరణమే శిక్ష అని దేవుడు ఆదామును హెచ్చరించాడు (ఆదికాండము 2:17). ఆదాము, నిషేధించబడిన ఫలాన్ని రుచి చూసిన క్షణమే, అతను మరణించాడు. అతను దేవుని నుండి వేరైనందున అతని ఆత్మ మరణించింది. (దేవుడు లేకుండా ఆత్మకు జీవం లేదు.) అదేవిధంగా, అతని శరీరం మర్త్యమైనదిగా మారింది. అతను ఆత్మలో చనిపోయాడు, దేవుని విషయంలో మరణించాడు మరియు పాపంలో మరణించినందున, అతను శాశ్వతమైన మరణం వైపు పరుగెత్తాడు; ఎన్నటికీ చల్లారని నరకాగ్నిలో తమ ఆత్మదేహాలకు శిక్ష అనుభవించడానికి వెళ్లాడు.
“ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను” (రోమా 5:12). పాపం, మనందరికీ పితరుడు/తండ్రి మరియు ప్రతినిధియైన ఆదాము ద్వారా వచ్చింది. దీనిని బట్టి ప్రజలందరూ మరణించారు - దేవుని విషయంలో మరణించారు, పాపంలో మరణించారు, త్వరగా శిథిలమైపోయే మర్త్యమైన శరీరాలలో, నిత్యమరణ శిక్ష క్రింద జీవిస్తున్నారు. ఒక మనుష్యుని అవిధేయత వలన అందరూ పాపులుగా చేయబడుతున్నారు (రోమా 5:19) మరియు “....కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై…” (రోమా 5:18).
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మనం నశించక నిత్యజీవం పొందాలని తన కుమారుడిని అనుగ్రహించినప్పుడు (యోహాను 3:16) ప్రజలందరూ పాపస్వభావం మరియు శిక్షా విధి కలిగిన స్థితిలో ఉన్నారు. దేవుని కుమారుడు మానవునిగా, మానవ కుటుంబానికి రెండవ యాజమానిగా, మానవజాతి మొత్తానికి రెండవ ప్రతినిధిగా మారాడు. ఆయన మన రోగాలను భరించాడు (యెషయా 53:4), మరియు ప్రభువు మనందరి దోషాన్ని అతనిపై మోపాడు (యెషయా 53:6). మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మరియు మన దోషాలను బట్టి నలగగొట్టబడ్డాడు (యెషయా 53:5). ఆయన తన్నుతానే అపరాధ పరిహారార్థబలిగా అర్పించుకున్నాడు (యెషయా 53:10). పాపుల కోసం ఆయన తన రక్తాన్ని ధారపోశాడు. సర్వలోకపు పాపాల కొరకు సంపూర్ణమైన, సంతృప్తికరమైన బలిని అర్పించాడు.
దేవుని కుమారుడు అందరి కొరకు మరణాన్ని రుచి చూశాడు గనుక (హెబ్రీయులకు 2:9), ఇప్పుడు దేవుడు వారికి విరోధంగా వారి దోషాలను లెక్కించక, లోకాన్ని తనతో సమాధానపరచుకున్నాడు (2 కొరింథీయులకు 5:19). “కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను” (రోమా 5:18). తన కుమారుడు మన కొరకు శ్రమపడుట వలన, మన పాపాలకు రావలసిన శిక్షను రద్దు చేస్తానని, మనల్ని మరలా తన కృపకు పాత్రులనుగా చేస్తానని, మృతమైన మన ఆత్మలను ఆత్మీయ జీవితానికి పునఃస్థాపిస్తానని భరోసానిచ్చాడు మరియు మనకు నిత్యజీవాన్ని గూర్చిన నిశ్చయతను ఇస్తున్నాడు. ఈ వాగ్దానానికి ఒక్కటే షరతు ఉంది, ఆ షరతును నెరవేర్చడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు.
► చివరి పారాలో ప్రస్తావించిన ఒక షరతు ఏమిటి?
[1]ఈ భాగాన్ని “విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట” అనే శీర్షికతో జాన్ వెస్లీ ప్రసంగం నుండి తీసుకున్నాం. ఇది ఈ క్రింది లింక్ నందు అందుబాటులో ఉంది. https://holyjoys.org/justification-by-faith/
పాత నిబంధనలో కృప (Grace in the Old Testament)
► పాత నిబంధన కాలంలో జీవించిన ప్రజలకు ఏవిధమైన కృప, ఆత్మీయ అనుభవం అందుబాటులో ఉంది? ఈ ప్రశ్న ఎందుకు ప్రాముఖ్యం?
పాత నిబంధనలో ఉన్న ప్రజలు మార్పు చెందరని, పరిశుద్ధాత్ముని పనిని అనుభవించలేరని కొంతమంది నమ్ముతారు. కాబట్టి, ఈరోజుల్లోని విశ్వాసులకు పాతనిబంధన ప్రాముఖ్యమైనదిగా వాళ్ళు చూడరు. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ అనే అంశం క్రొత్త నిబంధనతోనే ప్రారంభమైందని వాళ్ళు భావిస్తారు. పాతనిబంధన ప్రజలు, ధర్మశాస్త్రం మరియు బలుల ద్వారా రక్షణ పొందుతారని వాళ్ళు అనుకుంటారు.
ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదా బలులను అర్పించడం ద్వారా రక్షణ పొందరనేది వాస్తవం (హెబ్రీయులకు 10:4). అయితే వాళ్ళు ఎలా రక్షణ పొందారు? విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు.
(1) పాతనిబంధనలో సువార్త ఉందని క్రొత్త నిబంధన చెబుతుంది.
యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా రక్షణ పొందుతామని పాతనిబంధన బోధిస్తుంది (2 తిమోతికి 3:15).
అబ్రాహాముకు సువార్త ఉంది, అతను కూడా విశ్వాసం ద్వారానే నీతిమంతునిగా తీర్చబడ్డాడు (రోమా 4:1-3; గలతీయులకు 3:6, 8).
విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం గురించి దావీదు వివరించాడు (రోమా 4:6-8).
సువార్త మొదట వచ్చింది; ధర్మశాస్త్రం తరువాత వచ్చింది (గలతీయులకు 3:17).
మనకు ప్రకటించినట్లుగానే, పాతనిబంధన ప్రజలకు కూడా సువార్త ప్రకటించబడింది (హెబ్రీయులకు 4:2).
నీకొదేము తన పాత నిబంధన అధ్యయనం నుండి నూతనంగా జన్మించడాన్ని గురించి ఇప్పటికే తెలుసుకొని ఉండాలని యేసు సూచించాడు (యోహాను 3:10).
విశ్వాసం ద్వారానే నీతి ఆపాదించబడుతుందని (రోమా 1:17) ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు (రోమా 3:21).
(2) విశ్వాసం ద్వారా కృపను పొందడానికి ఎక్కువ జ్ఞానం అవసరం లేదు
యేసు, క్షమాపణ కొరకు పశ్చాత్తాపం గురించి బోధించాడు, కానీ ప్రాయశ్చిత్తం గురించి వివరించలేదు. ప్రజలు ఆయన సందేశాన్ని నమ్మడం ద్వారా రక్షణ పొందారు (ఉదాహారణకు బావి యొద్ద సమరయ స్త్రీ, యోహాను 4:39-42).
పాత నిబంధన విశ్వాసులకు, ప్రాయశ్చిత్తం అర్థం కాలేదు, కానీ దేవుడు క్షమాపణ కొరకు ఒక ఆధారాన్ని అందిస్తాడని వాళ్ళు నమ్మాల్సిన అవసరం ఉంది. అప్పుడు వాళ్ళు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడతారే గాని బలుల ద్వారా, వారి క్రియల ద్వారా కాదు. మన విషయంలో మాదిరిగానే, వారి బలులు, వారి విధేయత అనేవి వారి విశ్వాసానికి వ్యక్తీకరణలు.
ఒక వ్యక్తి దేవునికి భయపడితే, ఆ వ్యక్తి తనతో సంబంధంలోనికి రావడానికి దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. కీర్తనలు 25:14, “యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును” అని చెబుతుంది.
(3) దేవుని ఆజ్ఞలు, కృపను ఆవశ్యకం చేస్తాయి.
యేసు, మత్తయి 22:37-40 వచనాల్లో, నీ సమస్తంతో నీ దేవునిని ప్రేమించడం (ద్వితీయోపదేశకాండము 6:5) మరియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించడం (లేవీ 19:18) అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞలని చెప్పాడు. కృప లేకుండా ఈ ఆజ్ఞలకు విధేయత చూపలేం. దేవుడు పాతనిబంధన ప్రజలకు అసాధ్యమైన ఆజ్ఞలను ఇచ్చాడా లేదా కృప ద్వారా విధేయతను సాధ్యం చేశాడా?
తిరిగి కీడును చేయవద్దు (సామెతలు 24:28-29). మీకు కీడు చేసే వారికి మేలు చేయండి (సామెతలు 25:21-22). శత్రువు ఎద్దు తప్పిపోయి తిరుగుతున్నప్పుడు మీరు చూస్తే, దానిని తిరిగి ఇవ్వండి (నిర్గమకాండము 23:4-5). నీ శత్రువు పడిపోయినప్పుడు సంతోషించవద్దు (సామెతలు 24:17).
(4) పాత నిబంధన ప్రజలు విధేయతతో జీవించాలని దేవుడు ఆశించాడు.
ద్వితీయోపదేశకాండము 27 మరియు 28 అధ్యాయాలు, విధేయత వలన కలిగే దీవెనలను, అవిధేయత వలన కలిగే శాపాలను గురించి తెలియజేస్తాయి. ఈ శాపాలలో మనం ఊహించగలిగిన విషయాలన్నీ ఉంటాయి. విధేయతను సాధ్యం చేయడానికి కృప లేకపోతే, ఈ ప్రజలందరూ ఆ శాపాలన్నింటిని పొందడానికి యోగ్యులు మరియు వారి దీవెనలన్నింటినీ కోల్పోతారు.
(5) వారి హృదయాలను మార్చడానికి దేవుడు కృపా కార్యాన్ని అందించాడు.
ద్వితీయోపదేశకాండము 30:6 వచనం, వారు మరియు వారి సంతానం విధేయత చూపి, జీవించునట్లు హృదయంలో సున్నతి పొందారని చెబుతుంది. ద్వితీయోపదేశకాండము 30:11-20 లో ఈ క్రింది విషయాలను మనం చూస్తాం. దీనిని పొందడం అసాధ్యం అని వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే ఇది వారి నోళ్లలోనూ, హృదయాలలోనూ ఉంది - పౌలు, రోమా 10:6-8 వచనాల్లో, విశ్వాసం ద్వారా కృపను పొందడాన్ని గురించి సూచించడానికి ఈ వ్యాఖ్యను ఉపయోగించాడు. విషయం, వారి హృదయాలలో నిర్ణయించబడుతుంది (ద్వితీయోపదేశకాండము 30:17). దేవుని పట్ల ప్రేమ, వారిని విధేయతలోనికి నడిపిస్తుంది (ద్వితీయోపదేశకాండము 30:20).
(ద్వితీయోపదేశకాండము 10:12, 16 కూడా చూడండి). సంపూర్ణమైన ప్రేమను, హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవడాన్ని దేవుడు కోరుకుంటాడు. హృదయపు సున్నతి, దీనిని సాధ్యం చేస్తుంది.
(6) ఏ సమయంలోనైనా నిజమైన ప్రజలు, ఆయనను ప్రేమించి, ఆయనకు సేవ చేస్తారు.
రోమా 2:28-29, కొలొస్సయులకు 2:11-12 మరియు ఫిలిప్పీయులకు 3:3 వచనాలు, నిజమైన యూదుడు ఆత్మ సంబంధమైన వాడని చెబుతున్నాయి. ప్రవక్తలు కూడా ఇదే చెప్పారు. రక్షణ, హృదయపు విధేయతపై ఆధారపడి ఉంటుంది మరియు బలులు, దుష్టత్వం కలిగిన హృదయాన్ని నీతిమంతునిగా తీర్చలేవు. తన కాలంలోని యూదులు వారి పాత నిబంధన పూర్వీకుల వలె హృదయంలోనూ, చెవులలోనూ సున్నతి పొందని వారిగా ఉన్నారని స్తెఫను నిందించాడు (అపొస్తలుల కార్యములు 7:51). ఆరాధనా రూపాలనే దేవుడు కోరుకున్న సమయమంటూ ఎప్పుడూ లేదు.
దావీదు, “నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక” (కీర్తనలు 19:14) అని ప్రార్థన చేశాడు.
నోవహు, తన తరంలో నీతిమంతునిగాను, నిందారహితుడు గాను ఉన్నాడు (ఆదికాండము 6:9).
యెషయా, హృదయ శుద్ధీకరణను అనుభవించాడు (యెషయా 6).
తన పాప స్వభావం యొక్క సంపూర్ణ శుద్ధీకరణ కొరకు దావీదు ప్రార్థించాడు (కీర్తనలు 51).
విశ్వాసం ద్వారా రక్షణ, శుద్ధమైన హృదయం, పాత నిబంధనలో అందుబాటులో ఉందని ఈ ఋజువులు చూపిస్తున్నాయి. పాతనిబంధన మనకు ప్రాముఖ్యమని దీనర్థం. పాత నిబంధనలో నీతియుక్తమైన జీవితం కొరకు దేవుని సూచనలు, పరిశుద్ధుడైన దేవుని నుండి కృపలో జీవించవలసిన ప్రజలకు ఇవ్వబడిన సూచనలు. వాస్తవానికి చాలా ఆజ్ఞలు ఆ సమయానికి, ఆ పరిస్థితికి తగినవే గాని అదేవిధంగా మన కాలంలో వర్తించవు. 7వ పాఠములో, పాత నిబంధన లేఖనాలను మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో వివరించే ఒక భాగం ఉంది.
పాఠం 4 - పునఃశ్చరణ ప్రశ్నలు
(1) కాల్విన్ యొక్క “సాధారణమైన కృప” అనే అంశాన్ని వివరించండి.
(2) వెస్లీ చెప్పిన “ముందుగా వచ్చే కృప” అనే అంశాన్ని వివరించండి.
(3) రోమా 3:19లో, “ప్రతి నోరు మూయబడునట్లును,” అనే మాటకు అర్థం ఏమిటి?
(4) రోమా 3లో ప్రస్తావించిన యూదులకున్న గొప్ప ప్రయోజనం ఏమిటి?
(5) ఆరాధన పద్ధతులు/విధానాలు మనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి?
(6) రోమా 3:10-18 ఏం చూపిస్తుంది?
(7) ధర్మశాస్త్రం క్రింద ఉన్నది ఎవరు? (రోమా 3:19-20)
పాఠం 4 - అభ్యాసాలు
(1) ఈ క్రింది అంశాలలో ఒక దానిని గురించి ఒక పేజీలో రాయండి:
ముందస్తు కృప/ముందుగా వచ్చే కృప
పాత నిబంధనలో కృప (Grace in the Old Testament)
పాపులు విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా చేయబడడం వెనుకున్న కారణం
అవసరమైతే రోమీయులకు రాసిన పత్రికతో పాటు ఇంకా అనేక రకాల లేఖనాలను కూడా మీరు వాడుకోవచ్చు.
(2) మీరు మూడు ప్రసంగాలను బోధించాలి లేదా ఈ కోర్సు జరుగుతున్న కాలంలో ఇతర గ్రూపులకు మూడు సెషన్లు బోధించాలని జ్ఞాపకం చేసుకోండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.