లోకంలో దుష్టత్వం, అన్యాయం ఉన్నప్పటికీ, విశ్వాసాన్నికొనసాగించడం యొక్క సమస్యతో అంత్యకాల సంభావాలను గూర్చిన లేఖనాలు వ్యవహరిస్తున్నాయి. ఇది దేవుడు అకస్మాత్తుగా లోకంలో జోక్యం చేసుకొని, దుష్టత్వాన్ని శిక్షించి, తన ప్రజలకు సహాయం చేసే సమయాన్ని గురించి వివరిస్తుంది.[1]
దేవుడు చివరిగా జోక్యం చేసుకొనే సమయాన్ని సూచించడానికి తరచుగా “యెహోవా దినము” అనే మాటను ఉపయోగించారు. కొన్ని పాతనిబంధన లేఖనభాగాలు, ప్రభువు దినాన్ని, అన్యదేశాలు ఇశ్రాయేలుతో వ్యవహరించిన తీరును బట్టి శిక్షించే సమయాన్ని గురించి వివరించాయి.[2] యూదులుగా తాము దేవుని తీర్పును బట్టి భయపడాల్సిన అవసరం లేదని చాలామంది యూదులు భావించడం మొదలుపెట్టారు. వాళ్ళు పాపులుగా జీవిస్తే (జెఫన్యా 1:12, ఆమోసు 5:18-27), దేవుడు వాళ్ళకు కూడా తీర్పు తీరుస్తాడని మరియు వాళ్ళు యూదులైనంత మాత్రాన విడిచిపెట్టడని చూపించడానికి ప్రవక్తలు ప్రయత్నం చేశారు; కానీ వారిలో ఆ భావన అలానే ఉండిపోయింది.
వాళ్ళు కూడా రక్షణపొందాల్సిన అవసరత ఉందనే వాస్తవాన్ని అంగీకరించడం యూదులకు కష్టంగా ఉండేది. ఉదాహరణకు, బాప్తిస్మం అనేది అన్యులను యూదామతంలోనికి తీసుకొచ్చే ఒక సంస్కారంగా వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళు యూదులకు బాప్తిస్మమిచ్చేవాళ్ళు కాదు. బాప్తిస్మమిచ్చు యోహాను యూదులకు బాప్తిస్మమిచ్చాడు, అయితే తమకు బాప్తిస్మం లేదా పశ్చాత్తాపం అవసరం లేదని భావించే కొంతమంది యూదులు అతని పద్ధతిని వ్యతిరేకించారు. వాళ్ళు అబ్రహాము సంతానం గనుక (మత్తయి 3:9) వాళ్ళు దేవుని కృపను పొందుతారని భావించేవాళ్ళు.
రోమీయులకు రాసిన పత్రికలో, పౌలు ఉగ్రత దినాన్ని గురించి (2:5) మరియు దేవుడు తీర్పు తీర్చే దినాన్ని గురించి ప్రస్తావించాడు (2:16). ఈ రిఫరెన్స్‌లు, 1:16-18లో దేవుని ఉగ్రత నుండి తప్పించబడడమే రక్షణ అని చెప్పే సువార్తను అనుసరిస్తాయి. 2:2-3లో స్వనీతితో జీవించే యూదులు కూడా ప్రభువు దినాన్ని బట్టి భయపడడానికి ఒక కారణం ఉందనే వాస్తవాన్ని చెప్పడం ద్వారా వారిని దిగ్భ్రాంతికి గురి చేశాడు. యూదులకు కూడా రక్షణ కావాలి.
[1]పాత నిబంధనలో అంత్యకాల సంభవాలను గురించి లేఖనాలను దానియేలు, జెకర్యా, యోవేలు, యెహెజ్కేలు 37-39 మరియు యెషయా 24-27లో చూస్తాం. క్రొత్త నిబంధనలో, మనం మత్తయి 24, లూకా 21, మార్కు 13, 2 థెస్సలొనీకయులకు 2 మరియు ప్రకటనలో చూస్తాం.
ఈ పాఠంలో, రోమీయులకు రాసిన పత్రిక యొక్క 2వ భాగాన్ని అధ్యయనం చేయడం కొనసాగిస్తాం. గత పాఠంలో, అన్యుల అపరాధాన్ని వివరించిన లేఖనాన్ని మనం అధ్యయనం చేశాం. ఈ లేఖనం (2:1-29) ఇశ్రాయేలీయుల అపరాధాన్ని వివరిస్తుంది.
2వ భాగం, 1:18-3:20 వరకు ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుడు కోరిన వాటిని ఉల్లంఘించి/అతిక్రమించి శిక్షావిధి క్రింద ఉన్నారనేది 2వ భాగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దేవుడు ఆశించిన వాటిని చేయడం ద్వారా ఏ వ్యక్తి రక్షణ పొందడు, ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇప్పటికే వాటిని అతిక్రమించాడు.
మొదటిగా, అన్యులు దేవుని జ్ఞానాన్ని తృణీకరించి, విగ్రహాలవైపుకు, పాప కోరికలవైపుకు తిరిగారని పౌలు వివరించాడు. ఆ తరువాత, దేవుని ధర్మశాస్త్రం కలిగి, దానికి విధేయత చూపని ఇశ్రాయేలీయుల పరిస్థితిని గురించి వివరించాడు. ఇప్పుడు మనం ఇశ్రాయేలీయులను గూర్చిన లేఖన భాగాన్ని అధ్యయనం చేస్తాం.
ఇక్కడ పౌలు ప్రథమ పురుషం (వాళ్ళు) నుండి మధ్యమ పురుషానికి (మీరు) మారాడు. తాము ఇప్పటికే నీతి యొక్క ప్రామాణికతను చేరుకున్నామని, సువార్త తమకు వర్తించదని భావించే ప్రజలతో అతను మాట్లాడుతున్నాడు. చాలామంది యూదులు ఆ కోవకు చెందినవారే మరియు ఈ భాగం ప్రత్యేకంగా వారిని గురించి మాట్లాడుతుంది (2:17); కానీ ఉన్నతస్థాయి నైతికత కలిగిన అన్యులు కూడా అదే అపరాధంలో ఉన్నారు. కృప లేకుండా తాము నీతిమంతులమని ఆలోచించే వ్యక్తులు, వేషధారులని, అపరాధులని ఆయన చూపిస్తున్నాడు.
2వ అధ్యాయం యొక్క ప్రధానాంశం
అన్యులు చేసిన అవే పాపాల విషయంలో యూదులు కూడా దోషులే, మరియు వాళ్ళను కూడా దేవుడు అదేవిధంగా తీర్పుతీరుస్తాడు.
2వ అధ్యాయం యొక్క సారాంశం
2:1, 11 వచనాలు, ప్రధానాంశాన్ని నిర్మిస్తాయి. యూదులు కూడా సమానంగా అపరాధులని 2:1 చెబుతుంది; 2:11, దేవుడు నిష్పక్షపాతి అని చెబుతుంది. మిగిలిన అధ్యాయమంతా ఈ వచనాలలోని ప్రకటనలకై సందర్భాన్ని నిర్మిస్తాయి. అన్యులు నిరుత్తరులై ఉన్నట్లుగానే (1:20), వాళ్ళు కూడా క్షమించరాని వారిగా ఉన్నారు.
2:13,17 వచనాలు, యూదులు ఎందుకు కృపపొందడానికి ఆశిస్తున్నారో చూపిస్తాయి - ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రత్యక్షతను పొందారు, దానిపైనే వారి మతం ఆధారపడి ఉంది. రోమా 1లో, అన్యులు తీర్పుకు అర్హులనే వాస్తవాన్ని స్థాపించాడు. ప్రతి యూదుడు దీనితో ఏకీభవిస్తాడు. కానీ 2:1లో, పౌలు యూదుల అపరాధాన్ని బహిర్గతం చేయడం ద్వారా వారిని భయపెట్టాడు. వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి, అన్యులు పొందినట్లే అదే తీర్పును పొందనర్హులయ్యారు! ఎందుకంటే వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని అంగీకరించిన, నిజమైన మతాన్ని కలిగిన యూదులు కనుక వారు తప్పించబడతారని, క్షమాపణ పొందుతారని భావించారు.
నేటి దినాన లక్షలమంది ప్రజలు ఇదే కోవకు చెందిన వారు. దేవుని యందు విశ్వాసముంచి, మతపరమైన విధానాలను అనుసరించడం వలన దేవుడు వారిని అంగీకరించడని భావిస్తూనే, పాపంలో కొనసాగుతూ ఉంటారు.
► మీ సమాజంలో కూడా తాము క్రైస్తవులమని పొరపాటుపడే వ్యక్తులు అనేకమంది ఉన్నారా? వాళ్ళు ఎందుకలా అనుకుంటున్నారు?
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 2:1-29 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(2:1) యూదులు నిరుత్తరులై ఉండడం అనేది, నిరుత్తరులై ఉన్న అన్యుల పరిస్థితికి అనుగుణంగా ఉంది (1:20). ఆ ఆలోచన, తాను మంచివాడనని ఆలోచించే ఆధునిక మనుష్యునికి దిగ్భ్రాంతిని కలిగించినట్లే స్వనీతి కలిగిన యూదునికి కూడా కలిగిస్తుంది.
ఇతరులకు తీర్పు తీర్చడం ద్వారా, తమకు తామే తీర్పు తీర్చుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా అవే పాపాల విషయమై అపరాధులుగా ఉన్నారు. సత్యాన్ని గూర్చిన వారి జ్ఞానం, వారి బాధ్యతను పెంచింది. ఇశ్రాయేలులో ఉన్న కొన్ని పట్టణాలు, సొదొమ గొమొర్రా పట్టణాలకు మించిన తీర్పును పొందుతాయని యేసు చెప్పాడు (మత్తయి 11:21-24).
ఈ వచనం, తాను ఇతరులకు తీర్పు తీర్చగలనని అనుకుంటూ, తనని తాని నిర్దోషిగా తీర్చుకుంటానని భావించే వ్యక్తిని సూచిస్తోంది. మిగిలిన అధ్యాయమంతా దేవునిని న్యాయాధిపతి పాత్రలో ఉంచి, తమకు మేలు చేసే విధంగా తీర్పు తీర్చే వారి నుండి తన తీర్పు ఎలా భిన్నంగా ఉందో చూపిస్తుంది.
(2:2-3) దేవుని తీర్పు సంపూర్ణ ప్రమాణానికి అనుగుణంగా ఉంటుంది. మనుషులు మారిపోయే, సరిగాలేని ప్రమాణాలను బట్టి దేవుడు తీర్పు తీర్చడు.
(2:4) దేవుడు యూదుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచాడు, కాబట్టి ఆయన వారికి అనుకూలంగా న్యాయాన్ని మారుస్తాడని ఆలోచించారు. వాస్తవానికి, వారి పట్ల న్యాయాన్ని రద్దు చేయడానికి కాదు కానీ, వారిని పశ్చాత్తాపంలోనికి నడిపించడానికి ఆయన మంచితనాన్ని/దయను వారిపట్ల కనబరిచాడు. చాలా మంది దేవుని మంచితనాన్ని కేవలం ఔదార్యంగా, సహనంగా పరిగణించి తృణీకరించారు. లోకానుసారమైన వ్యక్తి, దేవుని నుండి పాపాన్ని సహించడంతో పాటు భౌతికమైన/లౌకికమైన ప్రయోజనాన్ని కూడా ఆశిస్తాడు. దేవుని మంచితనాన్ని ఈ విధంగా చూడడం అంటే దానిని తృణీకరించడమే. దేవుని గురించి తెలిసిన వారు మరింతగా అపరాధులు అవుతారు, ఎందుకంటే ఆయన మంచితనం వారికి పశ్చాత్తాపపడే అవకాశాన్ని ఇస్తుంది.
(2:5) వాళ్ళు పశ్చాత్తాపపడకుండా, పాపంలో కొనసాగుతూ ఆలస్యం చేసే సమయం, ఉగ్రతను నిల్వచేస్తుంది. వాళ్ళకు సత్యం తెలుసు కనుక, వాళ్ళు మరింతగా జవాబుదారీతనం కలిగి ఉన్నారు, తద్వారా వారి అవిధేయతకు వ్యతిరేకంగా దేవుని ఉగ్రత పెరుగుతుంది.
(ఈ అధ్యాయంలో మిగిలిన భాగాన్ని అర్థం చేసుకోవడానికి క్రింది విభాగం ప్రాముఖ్యం.)
క్రియల/చర్యల తీర్పు
► మనం తీర్పునొద్దకు వచ్చినప్పుడు, భూమిపై మనం చేసిన పనులు ప్రాముఖ్యమా?
అంతిమ తీర్పనేది, క్రియల మూల్యాంకనం. ప్రజలు చేసిన క్రియలకు అనుగుణంగా దేవుడు వారిని శిక్షిస్తాడు మరియు బహుమానం/ప్రతిఫలమిస్తాడు. భిన్నమైన వ్యక్తులకు భిన్నమైన స్థాయిలో శిక్ష మరియు బహుమానం ఉంటాయి (హెబ్రీయులకు 2:2; హెబ్రీయులకు 10:28-29; మత్తయి 10:42; లూకా 12:47-48, 2 కొరింథీయులకు 5:10).
పాపులు కేవలం తమ అవిశ్వాసాన్ని బట్టే శిక్షించబడతారనే ఆలోచన లేఖనానుసారమైనది కాదు. ప్రకటన గ్రంధం 20:12లో, ప్రజలు వారు చేసిన పనులను బట్టి తీర్పుపొందుతారు. 2 కొరింథీయులకు 5:10వ వచనం, విశ్వాసులతో పాటు మనమందరం మన క్రియలను బట్టి తీర్పుపొందుతామని చెబుతుంది. 1 కొరింథీయులకు 3:12-15 వచనాలు, క్రైస్తవులు వారి వైఖరులను బట్టి, ప్రయత్నాలను బట్టి, శ్రద్ధను బట్టి, వారి పని యొక్క నాణ్యతను బట్టి (బంగారం, వెండి, వెలగల రాళ్ళు; కర్ర, కొయ్యకాలు, గడ్డి) బహుమానాలు పొందుతారని చూపిస్తోంది. క్రైస్తవులందరూ బహుమానాలు పొందుతారు, ఎందుకంటే నిజమైన క్రైస్తవులందరూ సత్క్రియలు చేస్తారు, కానీ వారు చేసిన పనులన్నీ సమానమైన విలువను పొందవు. నాణ్యతా పరీక్షను నెగ్గని/ పరీక్షకు నిలవని విశ్వాసుల క్రియలు అగ్ని చేత కాల్చివేయబడతాయి.
రోమా 2వ అధ్యాయం, క్రొత్త నిబంధన సువార్తను వినని వారు, తమ క్రియలను బట్టి శిక్షించబడరని సూచిస్తోంది (2:7, 10, 13, 26-27 చూడండి). అసలు పాపం చేయని కొంతమంది వ్యక్తులు ఉన్నారని, వాళ్ళు కృప లేకుండా కేవలం క్రియల చేతనే అంగీకరించబడతారనేది దీనర్థం కాదు; ఎందుకంటే 3:19-20 వచనాలు, అందరూ పాపం చేశారని చెబుతోంది. తమ క్రియలను బట్టి అంగీకరించబడిన ప్రజలు, హృదయపు సున్నతి అని పిలవబడే కృపను అనుభవించిన ప్రజలు. వారి క్రియలను దేవుడు ఆమోదించాడు (2:29).
హృదయంలో జరిగే ఈ కృపాకార్యం, పాతనిబంధన కాలంలోనే వాగ్దానం చేయబడింది:
నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును. (ద్వితీయోపదేశకాండము 30:6).
కాబట్టి, ప్రాచీన కాలంలోనున్న యూదులు, క్రియలను బట్టి కాక, కృపను బట్టి రక్షణ పొందారని మనకు తెలుసు.
అన్యులు, ప్రత్యేక ప్రత్యక్షతను పొందినా, పొందకపోయినా, వారికి కృప అందుబాటులో ఉంది.
అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” (అపొస్తలుల కార్యములు 10:33-35).
నీతి క్రియలు, హృదయంలో కలిగిన మార్పుని, దేవుని పట్ల విధేయతను నిరూపిస్తాయి. ఈ ఋజువు రోమా 2:13, 16లో మాట్లాడిన అంతిమ తీర్పునొద్ద జరిగే అంతిమ నీతిమంతులుగా తీర్చబడుటకు ఆధారం.
ఈ లేఖన భాగం, ఒక వ్యక్తి క్రియల ద్వారా రక్షించబడతాడని బోధించడం లేదు, కానీ ధర్మశాస్త్రం కలిగి ఉండడం మాత్రమే సరిపోదు కానీ, నిజమైన విధేయత ప్రాముఖ్యమైంది. ఇది ఈ లేఖన భాగం చెప్పే “యూదులు కూడా అవిధేయత చూపారు కాబట్టి వారికి కూడా రక్షణ అవసరం” అనే అంశాన్ని బలపరుస్తుంది.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 2వ భాగం, 2వ లేఖన భాగం
వచనాల వారీ వివరణ కొనసాగింపు
(2:7) దేవునిని సంతోషపెట్టే క్రియలు చేయడంలో కొనసాగడం ద్వారా, దేవుని నుండి వచ్చే ఘనతను వెదికే వారికి దేవుడు నిత్యజీవమిస్తాడు.
(2:9) ఇక్కడ మనం, యూదులకు ఉన్న విశేషాధికారాలు, వారికి మరింతగా జవాబుదారీతనాన్ని కలిగిస్తాయని చూశాం. సువార్త మొదటిగా యూదుల దగ్గరకే వచ్చింది కనుక, వారే మొదటి తీర్పుకు అర్హులు.
(2:11) ఇది ఈ అధ్యాయంలోనే కీలక వచనం. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తూ, ధార్మికంగాజీవించేవాళ్ళు తీర్పుతీర్చబడతారు. వారు ధార్మికంగా ఉన్నంత మాత్రమున అనుగ్రహాన్ని సంపాదించుకోలేరు.
యాకోబు నుండి ఒక దృక్కోణం
ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా మాత్రమే కాదు గాని, క్రియల ద్వారా కూడా నీతిమంతునిగా తీర్చబడతాడని (యాకోబు 2:24) చెప్పాడు. కానీ ఎఫెసీ 2:8లో పౌలు మనం క్రియల ద్వారా కాదు కానీ కృప చేతనే రక్షించబడ్డామని చెప్పాడు. రోమా 3:28లో, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక, విశ్వాసం ద్వారానే రక్షించబడ్డారని చెప్పాడు.
కాబట్టి, మనం విశ్వాసం మరియు క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామా లేదా కేవలం విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డామా? యాకోబు, పౌలు ఒకరినొకరు వ్యతిరేకించుకొంటున్నారా? లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే విషయాన్ని గురించి మాట్లాడడం లేదు.
ఒక వ్యక్తి దేవుని ఎదుట ఎలా నీతిమంతునిగా తీర్చబడతాడనే విషయాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా కృప చేతనే నీతిమంతునిగా తీర్చబడతాడు.
ఒక వ్యక్తి ఇతర ప్రజల ఎదుట ఎలా నీతిమంతునిగా తీర్చబడతాడనే విషయాన్ని గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. ఒక నమ్మకమైన జీవితాన్ని జీవించడం ద్వారా తాను రక్షణార్థమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నానని చూపిస్తున్నాడు.
నిజమైన విశ్వాసం, అనుదిన జీవితానికి వర్తిస్తుందని నిరూపించడమే యాకోబు పత్రిక యొక్క ప్రధానాంశం. అబ్రాహాము క్రియల ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడని అతను చెప్పాడు. ఒక వ్యక్తి విశ్వాసం మరియు క్రియల ద్వారా నీతిమంతుడని చూపబడతాడు. ఒక వ్యక్తి తాను క్రైస్తవుడనని చెబుతూ, క్రైస్తవునికి తగినట్లుగా జీవిస్తుంటేనే క్రైస్తవుడవుతాడని మనకు తెలుసు.
సత్క్రియలు, విశ్వాసాన్ని అనుసరిస్తాయని కూడా పౌలు రూఢిగా చెబుతున్నాడు. ఎఫెసీ 2:10లో, మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డామని చెప్పిన వెంటనే, మనం సత్క్రియలు చేయడం కొరకే క్రీస్తునందు సృష్టించబడ్డామని పౌలు చెప్పాడు.
యాకోబు, పౌలు ఒకరినొకరు వ్యతిరేకించుకోవడం లేదు. వాళ్ళిద్దరూ, రక్షణార్థమైన విశ్వాసం, ఒక వ్యక్తిని దేవునికి అంగీకారయోగ్యంగా చేస్తుందని, మారుమనసు పొందిన తరువాత చేసే క్రియలు ఆ వ్యక్తి రక్షించబడ్డాడనే విషయాన్ని వెల్లడి చేస్తాయని అంగీకరిస్తున్నారు.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 2వ భాగం, 2వ లేఖన భాగం
వచనాల వారీ వివరణ కొనసాగింపు
(2:12) ధర్మశాస్త్రాన్ని ఎప్పుడూ వినని వారిని తీర్పు తీర్చడానికి అది ప్రామాణికంగా ఉండదు. దేవుడు ఇతర మార్గాలలో ప్రత్యక్షపరచిన ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళు శిక్షపొందుతారు. (1:20, 2:15 చూడండి).
(2:13) వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారనేది అంతిమ తీర్పును సూచిస్తుంది. కొంతమంది ప్రజలు, తాము ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నందున నీతిమంతులుగా తీర్చబడతామని ఆశిస్తారు. కానీ విధేయత లేకుండా ధర్మశాస్త్రాన్ని గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండడం నీతిమంతులుగా తీర్చదు.
(2:14) స్వభావాన్ని బట్టి వాళ్ళు సరైంది చేయొచ్చు, కానీ దేవుడు లేకుండా స్వభావసిద్ధంగా మంచివారు కాదనేది వాస్తవం. దేవుడు వారి హృదయాలలోనూ, మనస్సాక్షిలోనూ రాసిన ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు సరైనది చేయగలరని 2:15వ వచనం చూపిస్తోంది. “స్వాభావికంగా” అంటే దేవుడు లిఖితపూర్వక లేఖనం లేకుండా వారి స్వభావంలో ప్రత్యక్షపరచిన దాని ద్వారా చేస్తున్నారని అర్థం.
(2:15) లిఖితపూర్వక ధర్మశాస్త్రం లేని వాళ్ళు, వాళ్ళ నైతిక స్వభావంలో ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు మరియు నిర్దిష్టమైన ఎంపికలు చేసుకోగలరు. దీనర్థం మనస్సాక్షి పూర్తిగా నమ్మదగినది/ఆధారపడదగినదని కాదు. తమ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, చదువును బట్టి ప్రభావితమైన మనస్సాక్షి, ప్రతి విషయంలో ఖచ్ఛితమైంది కాదు; కానీ సాధారణంగా సరైన దానివైపుకు నడిపిస్తుంది. అయితే, చివరికి ఆ ప్రమాణాన్ని బట్టి, ప్రజలందరూ పాపులు, ఏది సరైందో వారికి తెలిసినా, ఎప్పుడూ దానిని చేయలేదు.
2:15, 16 వచనాలు, బాహ్యపరమైన క్రియలు మాత్రమే కాదు గాని, వైఖరులు కూడా తీర్పునొందుతాయని తెలియజేస్తున్నాయి. (ఈ వచనాలు, హృదయం, ఆలోచనలు, మనస్సాక్షి మరియు రహస్యాలను గురించి మాట్లాడుతున్నాయి).
(2:16) ఈ లేఖనభాగంలో చర్చించిన నీతిమంతులుగా తీర్చబడుట (2:13లో ప్రస్తావించబడింది) విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రత్యామ్నాయం కాదు. ఇది, అంతిమ తీర్పులో నీతిమంతులుగా ధృవీకరించబడే అంతిమ నీతిమంతులుగా తీర్చబడుటగా ఉంది.
తీర్పును గూర్చిన ఈ సూత్రాలు/నియమాలు పౌలు ప్రకటించిన సువార్తకు ప్రాముఖ్యం. క్షమాపణ పొందని వారిపైకి వచ్చే దేవుని తీర్పును గూర్చిన అవగాహన లేకుండా, క్షమాపణను గూర్చిన సువార్త ప్రాముఖ్యమైంది కాదు. దేవుని న్యాయాన్ని గూర్చిన సరైన దృక్పథాన్ని బలహీనపరిచే ఏ దోషమైనా, సువార్తను కూడా బలహీనపరుస్తుంది.
సువార్త అందని అన్యులకు నిరీక్షణ (Hope for the Unreached Heathen)
► సువార్త వినని అన్యులకు ఏం జరుగుతుంది? ఉత్తమమైన దానిని గురించి వారికి తెలియకపోతే, పాపం విషయమై తీర్పుకు ఎలా అర్హులవుతారు?
కొంతమంది సరైంది చేయాలని నిర్ణయించుకున్నారని, తద్వారా శిక్షను పొందలేదని రోమా 2:14-15 సూచిస్తుంది. అయితే, ఏ వ్యక్తి క్రియల మూలమున రక్షణ పొందడు. ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రాన్ని మీరి/అతిక్రమించి, తీర్పుకు లోనయ్యారు/అర్హులయ్యారు (3:9-10, 19-20). ఏ వ్యక్తి తన క్రియల యోగ్యతను బట్టి రక్షణ పొందడు. కాబట్టి సువార్తీకరించబడని వ్యక్తి రక్షించబడినట్లయితే, అతను సువార్త వినకపోయినప్పటికిని ప్రాయశ్చిత్తం ద్వారా, కృప చేతనే రక్షణ పొందుతాడు.
ఒక వ్యక్తి దేవునికి భయపడినట్లయితే, తనతో సంబంధంలోనికి రావడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపుతాడు. కీర్తనలు 25:14 వచనం, “యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును” అని చెబుతుంది. దేవుని నిబంధన, ఆయనతో సంబంధానికి ఏం కావాలో చూపిస్తుంది/చెబుతుంది. ప్రజలందరూ పాపం చేశారు కనుక దేవునితో సంబంధానికి కృప కావాలి.
లేఖనం లేకున్నా, దేవునిని ఎరిగిన యోబు, బాలాము, నోవహు వంటివారు ఉన్నారు. తరువాతి కాలంలో ఇశ్రాయేలు ద్వారా దేవుడు చేసిన దానితో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటిని మెల్కీసెదెకు దేవునికి యాజకుడిగా ఉన్నాడు. దేవుడు, ఏ సంస్కృతిలోనైనా, ఏ సమయంలోనైనా తనని తాను బయలుపరచుకోగలడు (కీర్తనలు 19:1-4, రోమా 10:18 కూడా చూడండి). రోమా 1లో ఉన్న విగ్రహారాధకులు, దేవుని గురించి తెలియకపోవడాన్ని బట్టి కాదు కానీ వారికి తెలిసిన సత్యాన్ని తృణీకరించినందువలన భ్రష్టత్వపు స్థితిలో ఉన్నారు.
ఒక అన్యుడు సువార్తను వినకుండా రక్షణ పొందుతాడా? ఒక వ్యక్తి, తాను కలిగి ఉన్న సత్యాన్ని అనుసరిస్తే, క్షమాపణను వెదకడానికి, దానిని కనుగొనడానికి తగినంత అవగాహనకు దేవుడు అతనిని నడిపిస్తాడు. అది కృప ద్వారా రక్షణ పొందడమే గాని, క్రియల ద్వారా రక్షణ పొందడం కాదు. ఇది అనేక ఇతర మతాలు చెప్పే క్రియల ద్వారా రక్షణ అనే ఆలోచనకు భిన్నమైంది.
కాబట్టి, ఒక వ్యక్తి సువార్త వినకుండా కూడా రక్షణపొందగలిగితే, మనం అత్యవసరంగా/అగత్యంగా సువార్త ప్రకటించవలసిన అవసరం ఏముంది? రాబోవు వచనాల్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 2వ భాగం, 2వ లేఖన భాగం
వచనాల వారీ వివరణ కొనసాగింపు
(2:17-20) యూదులు, వేషధారులు, ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ, దానిని బోధిస్తారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కలిగిన వారిగా, సరైన దానిని వివేచించేవారిగా, అజ్ఞానులకు బోధించేవారిగా తమ పాత్రను అనుభవించారు. వాళ్ళు గొప్పగా చెప్పుకొనే ప్రకటనల జాబితాను పౌలు వ్యంగ్యంగా ప్రస్తావిస్తున్నాడు.
ఎంతో భక్తిహీనంగా మారుతున్న సమాజంలో బైబిల్ ఎంతో ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకం. ప్రజలు, దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపకపోయినా, దానిని కలిగి ఉండడంలో విలువను చూస్తున్నారని ఇది తెలియజేస్తుంది.
ప్రజలు, దేవునితో సంబంధం యొక్క ఆధ్యాత్మిక వాస్తవికతను కోల్పోయిన తర్వాత, వారి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక రకమైన మతాన్ని కలిగి ఉంటారు.
(2:21-24) ధర్మశాస్త్రంతో అన్యులను నిందించడంలో యూదులు ఆనందిస్తారు, కానీ వాళ్ళు మాత్రం సంపూర్ణంగా దానికి లోబడరు. వాళ్ళు గొప్ప ఆధ్యాత్మిక స్థాయిని ప్రకటించుకుంటూ, పాపంలో జీవించడం ద్వారా దేవునిని అగౌరవపరుస్తారు. అదేవిధంగా, క్రైస్తవులు తాము నమ్ముతున్నామని చెప్పుకునే వాటి విషయంలో మంచి మాదిరిని చూపించలేరనేది, క్రైస్తవ మతానికున్న అత్యంత సాధారణ అభ్యంతరం.
(2:25) వాళ్ళు ధర్మశాస్త్రమంతటికి లోబడకుండా, సున్నతిని ఆధారం చేసుకొని దేవుని ఎదుట నీతిమంతులమని ప్రకటించుకోలేరు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్లయితే, వాళ్ళు సున్నతిలేని వంటివారే.
సున్నతి అను పదం
► సున్నతి దేన్ని సూచిస్తుంది?
యూదులు, లోకంలో రెండు తరగతుల ప్రజలను చూశారు: దేవుని నిబంధనలో భాగంగా ఉండడానికి అర్హతపొందిన వాళ్ళు మరియు అర్హత పొందని వాళ్ళు. సున్నతి అనేది ఇశ్రాయేలీయులకు, దేవునికి మధ్య నిబంధనకు గుర్తుగా ఇవ్వబడింది, కానీ కాలక్రమేణా నిబంధనకు అవసరమైన వాటన్నింటిని సూచిస్తుంది. కాబట్టి, యూదులు లోకంలో ఉన్న రెండు తరగతుల ప్రజలను సున్నతి పొందినవాళ్ళు, సున్నతి పొందని వాళ్ళు అని పిలుస్తారు. పౌలు ఉద్దేశ్యంలో సున్నతి పొందడం అంటే నిబంధనలో భాగంగా యూదా మతం యొక్క వ్యవస్థనంతటిని అనుసరించడమని అర్థం. (ఈ పదాన్ని ఉపయోగించిన ఉదాహరణ కొరకు గలతీయులు 5:2-3 చూడండి.) ఆ భావనలో సున్నతి పొందడం అంటే కృప ద్వారా కాక, క్రియల ద్వారా రక్షణ పొందే ప్రయత్నం చేయడం.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 2వ భాగం, 2వ లేఖన భాగం
వచనాల వారీ వివరణ కొనసాగింపు
(2:26) సున్నతి పొందని ఒక వ్యక్తి, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశ్యాలను నెరవేరిస్తే, అతనికి సున్నతి లేనందువలన దేవుడు అతనిని శిక్షించడు/ఖండించడు.
(2:27) నీతిమంతుడైన అన్యజనునికి, పాపియైన యూదునికి మధ్య వ్యత్యాసాన్ని బట్టి, అతను యూదా మతం యొక్క రూపాలను కలిగి ఉన్నప్పటికీ, యూదుడు దోషి అని చూపిస్తుంది. అదే కోణంలో, నోవహు తన నీతి ద్వారా ప్రపంచాన్ని ఖండించాడు ఎందుకంటే అతను నిజమైన విధేయత ఏమిటో చూపించాడు (హెబ్రీయులు 11:7).
(2:28-29) సున్నతి అనేది యూదుడికి గుర్తింపు చిహ్నంగాను, అతను దేవుని ప్రజలలో ఒకడనుటకు రుజువుగాను ఉంది. ద్వితీయో. ద్వితీయోపదేశకాండము 30:6లోను, కొత్త నిబంధనలో అనేక చోట్ల సున్నతి, ఒక పాపి హృదయమును మార్చి, దేవుని ప్రేమించి, ఆయన యెడల విధేయత చూపునట్లుగా చేయు పరిశుద్ధాత్ముని కార్యమును సూచిస్తుంది. ఒక క్రైస్తవునికి సున్నతి యొక్క ప్రాముఖ్యత ఇదే.
► బృందం కొరకు ఒక విద్యార్థి ద్వితీయోపదేశకాండము 30:6 వచనం చదవాలి.
దేవుడు, ప్రాచీన కాలంలోనున్న ఇశ్రాయేలీయులకు, వారి హృదయాలలో కృపా కార్యాన్ని చేస్తానని వాగ్దానం చేశాడు. ఇది కేవలం వారి సంతానానికి మాత్రమే కాదు, కానీ ఆ సమయంలో సందేశాన్ని వినే ప్రజలందరికీ వర్తిస్తుంది.
ఈ అధ్యాయంలో వర్ణించబడిన వ్యక్తి లేఖనం తెలియపోయినా, నీతి కార్యాలు చేస్తాడు. ఈ వ్యక్తి తన యొద్దనున్న సత్యాన్ని అంగీకరించడం ద్వారా, విశ్వాసం ద్వారా కృపను పొందుతాడు.
యెషయా నుండి ఒక దృక్కోణం
దేవుడు ఎల్లప్పుడూ సాంప్రదాయికమైన, ఆచారసంబంధమైన జీవితం కంటే హృదయపూర్వకమైన విధేయతను కోరుకుంటాడు మరియు ప్రతి దేశానికి చెందిన ప్రజలకు కృపను చూపుతాడు. యెషయా 56:6-7 లో ఉన్న వచనాలను గుర్తించండి.
విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమనబడును.
(2) తాము దేవుని కృపను పొందుతామని యూదులు ఎందుకు ఆశించేవాళ్ళు?
(3) ఒక వ్యక్తి నీతిమంతునిగా ఎలా చేయబడతాడు?
(4) ఒక వ్యక్తి తనకు రక్షణార్థమైన విశ్వాసం ఉందని ఎలా చూపిస్తాడు?
(5) సున్నతి, ఒక యూదునికి ఏం సూచిస్తుంది మరియు ఒక క్రైస్తవునికి ఇది దేనికి సాదృశ్యరూపకంగా ఉంటుంది?
పాఠం 3 - అభ్యాసాలు
తాము దేవునిచేత అంగీకరించబడతామని తప్పుగా భావించే యూదుల యొక్క తప్పుడు ఆలోచనను గురించి ఒక్క పేజీలో వివరించండి. ఈరోజుల్లో కూడా అదే విధమైన తప్పుడు ఆలోచనతో ఉన్న వ్యక్తులను వివరించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.