పౌలు కాలంలో, రోము 10 లక్షలకు పైగా జనాభా కలిగి, ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణం.[1] ఇక్కడ అన్ని రకాల జాతులు, భాషలు, మతాలకు చెందిన ప్రజలు నివసించేవారు. చాలామంది బానిసలు ఉండేవారు.
రోముకు మొదటి మిషనరీలు
రోమా పట్టణానికి మొట్టమొదటిసారిగా సువార్తను ఎవరు తీసుకెళ్లారో మనకు తెలీదు. పెంతెకొస్తు పండుగ దినాన, రోమా నుండి వచ్చిన యూదులు కూడా ఉన్నారు (అపొస్తలుల కార్యములు 2:10). మారుమనసు పొందినవాళ్ళు ఖచ్చితంగా సువార్త సందేశాన్ని రోముకు తీసుకెళ్ళి ఉంటారు. మెస్సీయా వచ్చాడనే వారి ప్రకటన ఉత్సాహానికి, వివాదానికి కారణమయ్యేది. అప్పటికే యూదా మతాన్ని గౌరవించే అన్యుల మధ్యలో సువార్త శరవేగంతో వ్యాపించి ఉండేది.
అన్యుల సంఘం
పత్రికలో అక్కడక్కడా యూదులను గురించి ప్రస్తావించినప్పటికీ, రోమా సంఘంలో చాలామట్టుకు అన్యులే ఉన్నారు. పౌలు వారిని అన్యులు (1:13-15) అని పిలిచాడు మరియు తాను గ్రీకు దేశస్థులకును, గ్రీకు దేశస్థులు కాని వారికిని రుణస్తుడు గనుక రోమీయులకు కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే మొదటి విశ్వాసులు యూదులైనందున, రోమా సంఘంలో యూదుల ప్రభావం బలంగా ఉండేది. యూదా మత నియమాల నుండి స్వేచ్ఛను కలిగించే విధంగా విశ్వాసులకు సువార్తను స్పష్టంగా వివరించలేదనేది సాధ్యమే.
[1]Bruce Wilkinson & Kenneth Boa, Talk through the New Testament, 375
సౌవార్తిక పనిని ప్రచారం చేయడమే పౌలు ఉద్దేశ్యం కాబట్టి, “ప్రతి ఒక్కరూ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలా?” అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అన్నింటికీ మించి, ప్రతి ఒక్కరికీ అవసరం లేని కొన్ని విషయాలు ఉన్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నవారికి మంచుగడ్డను, ఎడారిలో ఉన్న వారికి ఇసుకను ఎవరు తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు.
ప్రపంచంలో ఉన్న వారందరూ విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడవలసిన అవసరం లేదు; బహుశా కొంతమంది నీతియుక్తమైన జీవితాన్ని కలిగి, దేవునిచే అంగీకరించబడి ఉండవచ్చని కొంతమంది ఆలోచిస్తారు. ఈ పత్రికలోని రెండవభాగం (1:18-3:20), ప్రతి ఒక్కరూ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడాల్సిన అవసరం ఉందని, కాబట్టి వారికి ఈ సందేశం అవసరమని చూపడానికి రాయబడింది.
1:18-3:20 యొక్క ప్రధానాంశం
లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని నియమాలను (అడిగినవాటిని) ఉల్లంఘించి, శిక్షావిధి క్రిందకు వచ్చారు. ప్రతి వ్యక్తి దేవుని నియమాలను ఉల్లంఘించాడు గనుక ఏ వ్యక్తి కూడా దేవుని నియమాలను నెరవేర్చడం ద్వారా రక్షణ పొందలేడు.
1:18-3:20 యొక్క సారాంశం
మొదటిగా, పౌలు దేవుడు ప్రత్యక్ష పరచిన, వాక్యం లేని అన్యజనుల పరిస్థితిని వివరించాడు మరియు దేవుడు సృష్టిలో వెల్లడిపరిచిన జ్ఞానాన్ని వారు తిరస్కరించారని చూపించాడు. ఆ తరువాత, దేవుని రాతపూర్వక వాక్యాన్ని కలిగి, దానికి విధేయత చూపని ఇశ్రాయేలు ప్రజల స్థితిని వివరించాడు. తరువాత లోకం యొక్క సాధారణ పాపస్వభావాన్ని వివరించడంతో ముగించాడు. సర్వలోకం దేవుని ఎదుట అపరాధులనేది ముగింపు తీర్మానం. ఏ వ్యక్తి తన వ్యక్తిగత యోగ్యతలను బట్టి రక్షణ పొందలేడు కాబట్టి సువార్త అవసరం.
ఈ పాఠముల కొరకు కొరకు, 2వ భాగాన్ని (1:18-3:20) మూడు లేఖనాలుగా విభజించడం జరిగింది. ఈ పాఠములో మనం మొదటి లేఖనాన్ని అధ్యయనం చేస్తాం (1:18-32).
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 2వ భాగం, 1వ లేఖన భాగం
1:18వ వచనం, ముందు లేఖనానికి, ఈ లేఖనానికి మధ్య పరివర్తనీయ వచనం. ఒక వారధిలా ఉంటుంది.
1:18-32 యొక్క ప్రధానాంశం
అన్యులు, దేవుని గూర్చిన ప్రాథమిక జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, కానీ దానిని తిరస్కరించి, విగ్రహాలు వైపుకు తిరిగి, పూర్తిగా భ్రష్టులైపోయారు.
► బృందం కొరకు ఒక విద్యార్థి 1:18-32 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(1:18) దేవుడు, తనని గురించి ప్రాథమిక/మౌలిక జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు. వాళ్ళు సత్యాన్ని అడ్డగించారు (అణచివేశారు). ఆ తర్వాత వచనం వివరిస్తున్నట్లు, వాళ్ళు కొంత సత్యాన్ని కలిగి ఉన్నారని ఇది సూచిస్తుంది. వారి దగ్గరున్న సత్యాన్ని తిరస్కరించడమే వారు చేసిన తప్పిదం. భక్తిహీనత అనే మాట, మతపరమైన విషయాల్లో ఒక నేరాన్ని వివరిస్తుంది మరియు సృష్టికర్త కంటే ఎక్కువగా సృష్టిని పూజించే విగ్రహారాధనగా తనని తాను వ్యక్తపరచుకుంటుంది (1:19-23). దుర్నీతి అంటే నైతిక దుష్టత్వం అని అర్థం, ఇది అనైతికత మరియు దుర్మార్గత ద్వారా వ్యక్తపరచబడుతుంది (1:24-32).[1]
అడ్డగించిన సత్యాన్ని గురించి, 1:20లో ఉదహరించారు. దీనిలో వారిపై దేవుని అధికారాన్ని గూర్చిన జ్ఞానం కూడా ఉంటుంది. వారు దేవుని అధికారాన్ని ధిక్కరిస్తున్నారని వారి జీవనశైలి చూపిస్తుంది. దీనికి పూర్తి భిన్నంగా క్రైస్తవుని జీవిత శైలి, తాను చేసే పనిలోనూ, చేయని పనిలోనూ దేవుని అధికారానికి లోబడడం ద్వారా రుజువుపరచబడుతుంది.
[1]William Greathouse, “Romans”, in Beacon Bible Commentary, Vol VIII. (Kansas City: Beacon Hill Press, 1968) 50 నుండి తీసుకొనబడినది.
ప్రత్యక్షత రకాలు - ప్రత్యేక ప్రత్యక్షత మరియు సాధారణ ప్రత్యక్షత
► ప్రజలందరికీ దేవుని సత్యాన్ని ప్రత్యక్షపరిచే కొన్ని మార్గాలు ఏమిటి?
దేవుడు, సత్యాన్ని అనేక రీతులుగా వెల్లడిపరిచాడు గనుక, మనం రెండు రకాలను/వర్గాలను గురించి మాట్లాడుకుంటాం: సాధారణ ప్రత్యక్షత మరియు ప్రత్యేక ప్రత్యక్షత. పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఇవే పదాలు వాడకపోయినా, వీటిని గురించి ప్రస్తావించాడు.
సాధారణ ప్రత్యక్షత అంటే దేవుని సృష్టిని చూడడం ద్వారా ఆయనను గురించి మనం అర్థం చేసుకోగలగడం. విశ్వం యొక్క రూపకల్పనలో దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని, శక్తిని మనం చూడగలం.
మనిషి రూపించబడిన విధానంలో దేవునిని గూర్చిన ప్రాముఖ్యతను మనం చూస్తాం. మనం ఆలోచించడం, అందాన్ని అభినందించడం, మంచి చెడులకు మధ్య వ్యత్యాసాన్ని చెప్పడం (నిశ్చయంగా కాకపోయినా) లాంటి సామర్థ్యాలు, మన సృష్టికర్తకు కూడా అవే సామర్థ్యాలు మరింత ఉన్నత స్థాయిలో ఉన్నాయని మనకు తెలియజేస్తాయనేది వాస్తవం. మనం ఆ సామర్థ్యాలను కలిగి ఉన్నాం గనుక దేవుడు ఆలోచించగలడని, సంభాషించగలడని మనకి తెలుసు. (కీర్తనలు 19:1-4 మరియు 94:9 చూడండి).
దేవుడు మాట్లాడగలడని సాధారణ ప్రత్యక్షత మనకు చూపిస్తుంది కనుక, ప్రత్యేక ప్రత్యక్షత జరగవచ్చని మనం గ్రహించవచ్చు. దేవుడు వ్యక్తి[1] కనుక ఆయన జ్ఞానవిచక్షణ కలిగిన తన జీవులతో/ మనుష్యులతో మాట్లాడగలడు. ఈ సత్యం దేవుని నుండి సందేశాలు వచ్చాయని, చివరికి దేవుని నుండి ఒక గ్రంథం కూడా వచ్చిందని గ్రహించడానికి మనకు సహాయపడుతుంది.
లేఖనం లేకపోయినా సాధారణ ప్రత్యక్షత ద్వారా ప్రజలు దేవుడు ఉన్నాడని, ఆయనకు లోబడాలని, ఇప్పటికే తాము దేవునికి అవిధేయులమయ్యామని తెలుసుకుంటారు (రోమా 1:20). కానీ మనం దేవునితో సరైన సంబంధంలోనికి ఎలా రావాలో సాధారణ ప్రత్యక్షత మనకు చెప్పదు. సాధారణ ప్రత్యక్షత, ప్రత్యేక ప్రత్యక్షత యొక్క అవసరాన్ని చూపిస్తుంది, ఎందుకంటే ఇది ప్రజలు పాపులని, తమ సృష్టికర్త ఎదుట నిరుత్తరులై ఉన్నారని చెబుతుంది.
సాధారణ ప్రత్యక్షత, మానవజాతి పడిపోయిందని, దోషిగా ఉందని మనకు చూపిస్తుంది. అయితే మానవ జాతి ఆ స్థితిలో ఎందుకు ఉందో ప్రత్యేక ప్రత్యక్షత వివరిస్తుంది. ప్రత్యేక ప్రత్యక్షత అంటే, బైబిల్ ప్రేరణలోనూ, క్రీస్తు శరీరధారణలోనూ ప్రత్యక్షపరచబడిన సత్యం. ప్రత్యేక ప్రత్యక్షత దేవుని స్వభావాన్ని వర్ణిస్తుంది, పతనాన్ని, పాపాన్ని వివరిస్తుంది మరియు మనం దేవునితో ఎలా సమాధానపడాలో చూపిస్తుంది.
[1]దేవుడు మనిషి అని మనం చెప్పడం లేదు కానీ ఆయన వ్యక్తి - ఆలోచించగలడు, ఉద్దేశించగలడు మరియు మాట్లాడగలడు - ఆయన వ్యక్తిత్వం లేని ఒక శక్తి కాదు.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 2వ భాగం, 1వ లేఖన భాగం
వచనాల వారీ వివరణ కొనసాగింపు
► సాధారణ ప్రత్యక్షత నుండి మనం నేర్చుకున్న విషయాలకు మించి ప్రత్యేక ప్రత్యక్షత మనకు ఏం చెబుతుంది?
(1:19) మనం సృష్టిని గమనించడం ద్వారా దేవుని గూర్చిన సత్యాన్ని గ్రహిస్తాం. ఏదో ఒక దైవీకమైన మనసు విశ్వాన్ని నియంత్రిస్తుందని గ్రీకు తత్వవేత్తలు కూడా ఒప్పుకున్నారు. మనిషి స్వభావం, సృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన భాగం. మనం మంచి చెడులను గురించి మనిషికున్న స్పృహను గమనించడం ద్వారా దేవుని ఉనికిని, స్వభావాన్ని గూర్చిన సత్యాన్ని గ్రహిస్తాం (1:32 చూడండి).
► మనం మనిషిని చూసినప్పుడు, దేవుని గురించి ఏం అర్థం చేసుకోగలము?
(1:20) సృష్టి ప్రారంభం నుండి తాము సృష్టించబడినవారమని, దేవుడు వారిపై నిత్యశక్తిని, అధికారాన్ని కలిగి ఉన్నాడని ప్రజలకు తెలుసు. దేవునిని తిరస్కరించడం క్షమించరాని దోషంగా చేయడానికి ఈ జ్ఞానం సరిపోతుంది. వారు తమ పాపాలను బట్టి న్యాయంగా తీర్పు పొందుతారు. తమ తిరుగుబాటును బట్టి తాము దోషులమని వారికి తెలుసు.[1] దేవునిని గూర్చిన మరియు తమని గూర్చిన ఈ విషయాల వలన, వారు సాకులు చెప్పలేరు / తప్పించుకోలేరు.
పాపాన్ని శిక్షించడానికి ముందే, దానిని ఉద్దేశపూర్వక చర్యగా చూపించాలని దేవుని న్యాయం కోరుతుంది. వాళ్ళు ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకోవడానికి వారికున్న జ్ఞానం సరిపోతుందని గ్రహించడం కూడా అవససరం. వారు భిన్నమైన దానిని ఎంపిక చేసుకోవడం అసాధ్యమైనట్లయితే, అప్పుడు వారు సాకులు లేకుండా ఉండేవారు కాదు. ఇక్కడ దేవుడు తనను తాను వివరించుకుంటున్నాడు.[2]
దాదాపు ప్రపంచంలోని ప్రతి సంస్కృతి, లోకాన్ని సృష్టించిన ఒక అత్యున్నతుడైన దేవుడు ఉన్నాడనే భావనను కలిగి ఉంటుంది. తాము అత్యున్నతుడైన దేవుని నుండి వేరైపోయామని వారికి తెలుసు కాబట్టి సాధారణంగా వాళ్ళు దేవునిని ఆరాధించడానికి బదులు వేరొక అతీంద్రియ శక్తిని ఆరాధిస్తారు. పౌలు, దేవుని ఉనికిని నిరూపించే ప్రయత్నం చేయడం లేదు, కాని ప్రతి సంస్కృతికి దేవుని ఉనికి, అధికారం తెలుసని సూచిస్తున్నాడు. ఈ జ్ఞానం దోషనిర్దారణకు నడిపిస్తుంది.
సాధారణ ప్రత్యక్షతకు పరిమితులు ఉన్నాయి. క్రీస్తును మరియు సువార్తను గూర్చిన జ్ఞానం, ప్రత్యేక ప్రత్యక్షత ద్వారా తప్ప మరే విధంగాను వెల్లడి పరచబడదు. అలాగే, సృష్టించబడిన లోకం కూడా దేవునిని ఖచ్చితంగా/సరిగ్గా వర్ణించలేదు, ఎందుకంటే అది పాపశాపానికి లోనైంది మరియు దాని అసలు నమూనాను/రూపాన్ని సంపూర్ణంగా వ్యక్తపరచడం లేదు. సృష్టి, బురద పాదముద్రలు కలిగిన అందమైన పెయింటింగ్ లాంటిది. అది పాడైంది, కానీ దాని అసలు అందం కొంతవరకు నిలిచే ఉండి, దాని చిత్రకారుని గురించి కొంతవరకు తెలియజేస్తుంది.
(1:21-22) మనిషి ఆయన్ని దేవునిగా ఘనపరచడానికి (ఆరాధన) మరియు కృతజ్ఞతలు చెల్లించడానికి (స్తుతి) ఆయన అర్హుడు. కానీ మనుష్యులు దేవుని నుండి పొందిన వాటినిబట్టి కృతజ్ఞత కలిగి ఉండడానికి బదులు ఆయన అధికారాన్ని అసహ్యించుకొన్నారు. వారు కలిగి ఉన్నవాటన్నింటికీ రావాల్సిన ఘనతను తామే తీసుకొని, తమకు తాము దేవుళ్లుగా ఉండాలని కోరుకున్నారు. అలాంటి స్వతంత్ర దైవత్వాన్ని ప్రకటించుకోవడం పిచ్చితనం/అవివేకం.
వారి హృదయాలు అంధకారమయమయ్యాయి. హృదయం, ఒక వ్యక్తి చిత్తాన్ని, విశ్వసనీయతను సూచిస్తుంది. వెలుగు, సత్యాన్ని సూచిస్తుంది. వాళ్ళు సత్యాన్ని తిరస్కరించినందున, దాన్ని చూడగలిగే సామర్థ్యాన్ని వాళ్ళు కోల్పోయారు. వాళ్ళు ఆధ్యాత్మిక, నిత్యత్వపు సంగతులను గూర్చిన అవగాహనను కోల్పోయారు, కనుకనే లౌకికమైన విషయాలను కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోలేకపోతున్నారు.
[3](1:23, 25) తమపై, లౌకిక ప్రపంచంపై దృష్టిని కేంద్రీకరించడం మరియు సృష్టికర్తను తిరస్కరించడం, పతనమైన తమ స్వభావాలను మెచ్చుకోవడానికి/ప్రశంసించే దేవుళ్ళను తయారు చేసుకోవడానికి నడిపించాయి. వాళ్ళు దేవునికి చెందాల్సిన మహిమను సృజించబడిన వాటికి బదిలీ చేశారు. సృష్టికర్త పట్ల వారికున్న బాధ్యతను తప్పించుకోవడానికి, వాళ్ళు ఆయన ఉనికిని తిరస్కరించి, సృష్టిని ఘనపరిచారు. ఈ వైఖరే, ఆధునిక పరిణామానికి, మానవతావాదానికి పునాదిగా మారింది. ప్రజలు తమని తాము సృష్టించుకుంటే/ఉత్పత్తి చేసుకుంటే, అప్పుడు వాళ్ళు తమ వ్యక్తిగత ఉద్దేశ్యాలను, విలువలను, నైతికతను ఏర్పరచుకోవచ్చు.
దేవుడు సృజించిన దానికి సేవచేయడం, దానిని ఆరాధించడమే విగ్రహారాధన తత్వం/స్వభావం. ఏదైనా ఒక విషయాన్ని సేవించడం అంటే జీవితంలో దానికి ప్రథమ స్థానమిచ్చి, ఆ ప్రాధాన్యతకు అనుగుణంగా జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవడం అని అర్థం. దేవునిని కాక, మరి దేనినైనా ఆరాధించడం అంటే దేవునికి మాత్రమే చెందవలసిన నమ్మకాన్ని, భక్తిని దానికివ్వడమని చెప్పడం. విగ్రహారాధన, కేవలం సృష్టికర్త మాత్రమే ఇవ్వగలిగిన సంతృప్తిని సృష్టించబడిన వాటి నుండి ఆశిస్తుంది. ఆధునిక భౌతికవాదం/వస్తుతత్వం విగ్రహారాధనే. ఒక వ్యక్తి దేవుని పట్ల తన ఆరాధనను తగ్గించకుండా, భౌతికమైన వస్తువులను ఘనపరచలేడు.
► అన్యులు, దేవుని జ్ఞానానికి ఎలా స్పందిస్తారు?
(1:24) ఈ వచనం, 1:26-27లో విస్తరించిన అంశాన్ని పరిచయం చేస్తుంది. సృజించబడిన వాటి పట్ల విగ్రహారాధన సంబంధమైన ప్రేమ సహజంగానే లైంగిక పాపంతో సహ అనైతికతకు నడిపిస్తుంది. లైంగిక పాపం, శరీర కోరికలకు ప్రాధాన్యతనిచ్చి, శరీరాన్ని అగౌరవపరుస్తుంది, ఎందుకంటే శరీరం పరిశుద్ధమైంది, దేవుని సేవకు సమర్పించబడింది.
(1:26-27) అనైతికత అనేది స్వయాన్ని మహిమపరచుకోవడానికి మరియు స్వార్థపూరితమైన కోరికలు పరిపాలించడానికి అనుమతించడం ద్వారా కలిగే సహజ పరిణామం. కోరికలు పరిపాలించినప్పుడు, అవి వక్రీకరించబడతాయి. ఒక వ్యక్తి, దేవునిని అత్యున్నతంగా ప్రేమించేవరకూ మరియు ఆయనయందు ఆనందించేవరకూ ఎవరిని సరైన విధంగా ప్రేమించలేడు లేదా దేనిని సరైన రీతిలో అనుభవించలేడు. 1:24వ వచనం ఈ అంశాన్ని పరిచయం చేస్తుంది మరియు అనైతికతకు, దేవునిని తృణీకరించడానికి మధ్యనున్న సంబంధాన్ని చూపిస్తుంది.
దేవుడు సృష్టించిన మంచి విషయాలను వక్రీకరించడమే పాపం; లైంగిక వక్రత, కొన్ని పాపాలకంటే చాలా స్పష్టంగా ఉంటుంది. మనిషి దేవుని నుండి ఎంత ఎక్కువగా దూరమైతే, అంత ఎక్కువ క్రూరంగా, కఠినంగా మరియు వికృతంగా మారతాడు. నాగరికత ద్వారా చెడిపోని కొన్ని సాధారణ సంస్కృతులు ఉన్నాయని, అవి మెరుగైన జీవితాన్ని ఇస్తాయని కొంతమంది ప్రజలు భావిస్తారు. వాస్తవమేమిటంటే, అనాగరిక సంస్కృతులకు చెందిన చాలామంది ప్రజలు, మరణం పట్ల, అతీంద్రియ శక్తుల పట్ల భయంతో జీవిస్తూ, క్రూరమైన ఆచారాలను పాటిస్తారు మరియు వక్రీకరించబడిన, పాపపు జీవితశైలి వలన కలిగే ఫలితాలను అనుభవిస్తారు.
మనిషి, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా పనిచేయడానికి సృష్టించబడ్డాడు. ఒకవేళ అతను దేవుని నుండి వేరైతే, మనిషిగా తాను ఉండాల్సిన విధంగా ఉండడు. తన ఆదర్శాల స్థాయికి తగ్గట్లుగా కూడా జీవించలేడు. దేవుడు లేని వ్యక్తి, పురుషతత్వానికి, స్త్రీతత్వానికి ఉన్న ఆదర్శాలను/శ్రేష్టతను కూడా చేరుకోలేనంత దూరంలో ఉంటాడు. లైంగిక వక్రత, అత్యంత స్పష్టమైన విపరీతత్వం, కానీ ప్రతి వ్యక్తి ఇతర మార్గాలలో కూడా నిజమైన మానవత్వాన్ని కోల్పోవడం ద్వారా ప్రభావితమయ్యాడు. దేవునిని దేవునిగా తృణీకరించడమంటే, మనిషిని మనిషిగా తృణీకరించడమని అర్థం. దేవునిని ఆరాధించడాన్ని తిరస్కరించడమంటే, మీ మానవత్వాన్ని/మానవ స్వభావాన్ని తిరస్కరించడమే అవుతుంది.
హాస్యాస్పదమైన విషయమేమిటంటే, సృష్టించబడిన వాటిని ఆరాధించేవారు, చివరకు సహజమైనవాటికి భిన్నంగా, సృష్టమును/ప్రాణిని కూడా వక్రీకరిస్తారు. ఒకవేళ ప్రజలు, తమ సహజ కోరికల చేత పాలించబడుటకు తమని తాము అప్పగించుకున్నట్లయితే, ఆ కోరికలు తీవ్రమై, అసాధారణమైన రూపాలుగా మారతాయి.
ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి, శరీర కోరికలను దేవునికంటే ఎక్కువగా ఘనపరిస్తే, చివరికతను తన శరీరాన్ని అగౌరవపరుస్తాడనేది హాస్యాస్పదమైన విషయం. లైంగిక పాపంలో ప్రజలు ఆరాధించే శరీర భాగాలనే, అసభ్యకరమైన, అవమానకరమైన విషయాలను చెప్పాలని కోరుకున్నప్పుడు కూడా ప్రస్తావిస్తారు.
సాధారణంగా, పురుషులవలె స్త్రీలు తమని తాము లైంగిక అనైతికతకు, వక్రతను అప్పగించుకోరు. కుటుంబం యొక్క సంపూర్ణతను కాపాడాలని వారు సహజంగా కోరుకుంటారు. స్త్రీలు ఈ ఘోరమైన దుర్మార్గం చేయడం, వారి సమాజపు జారత్వం సంపూర్ణమైనట్లు చూపిస్తుంది.
► మీ సమాజంలో సర్వసాధారణమైన వక్రతకు కొన్ని రూపాలు ఏమిటి?
వారు ప్రవేశించిన పాపపు స్థితికి వారు న్యాయంగా అర్హులు. పాపపు స్థితి, పాపానికి తగిన శిక్ష. అది వృద్ధి చెందుతున్నప్పుడు శ్రమను, అవమానాన్ని, అసంతృప్తికరమైన కోరికలను కలిగించి, చివరికి జారత్వాన్ని ఫలితంగా ఇస్తుంది.
“మనిషి పాపం యొక్క మూలం, మతపరమైన దుష్టత్వమైతే, దాని ఫలం నైతిక భ్రష్టత్వం.”
- విలియం గ్రేట్ హౌస్,
రోమా పత్రికపై వ్యాఖ్యానం
స్వలింగ సంపర్క (హోమోసెక్సువల్) పాపానికి క్రైస్తవ స్పందన
“స్వలింగ సంపర్కుల (లేదా లెస్బియన్) సంబంధాలలో ప్రేమ, సమర్పణ ఉంటాయనడం” యొక్క ప్రామాణికతను బైబిలు అంగీకరిస్తుందనడానికి ఎటువంటి ఆధారం లేదు.[1] ఇదే వాస్తవమైతే, ప్రతి ఇతర మానవ సంబంధాలను (ఉదా: భార్యభర్తలు, తల్లిదండ్రులు పిల్లలు మరియు పౌరులు, ప్రభుత్వం) గూర్చిన బోధ లేఖనమంతటా కనుగొన్నట్లుగానే దీనిని గురించి కూడా కనుగొనాలి. దానికి బదులు, అలాంటి సంబంధం దేవుని దృష్టికి అంగీకారమని చెప్పే ఒక్క వచనం కూడా లేదు.
ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య శోధన, ప్రేమ భావన లేదా ఆకర్షణ, లేదా మన మనసులో పోరాటాన్ని లేఖనం నిషేధించదు. వాస్తవానికి, దేవుడు, బాధించబడేవారికి, గందరగోళంలో ఉన్నవారికి మరియు శోధించబడినవారికి తాను దగ్గరగా ఉంటానని చెప్పాడు. మోహపు ఆలోచనను ఆహ్వానించినప్పుడు (యాకోబు 1:15) లేదా దేవుని నమూనాకు భిన్నంగా ప్రవర్తిస్తున్నప్పుడు పాపం జరుగుతుంది.
స్వలింగ సంపర్కమనే అంశానికి, సంఘం తగిన విధంగా ప్రతిస్పందించడంలో దయతో కూడిన ప్రేమను, సున్నితమైన సత్యాన్ని మరియు ప్రామాణికమైన వినయం కలిగి ఉండాలి. ఇతరులను ప్రేమించడం అంటే, ప్రజలు పాపం నుండి తిరిగారా లేరా అనే దానితో సంబంధం లేకుండా ఇతరుల పట్ల శ్రద్ధను మరియు క్రీస్తు ప్రేమను చూపడం. ఇతరులను ప్రేమించడం అంటే మనం మన పాపంలో ఉన్నప్పుడు క్రీస్తు మనల్ని చూసినట్లు (మరియు ఇప్పటికీ చూస్తున్నట్లు), అదే దృష్టితో వారిని చూడడం. ఒక వ్యక్తితో మనకున్న సంబంధం, ప్రాథమికంగా ఆ వ్యక్తిని క్రీస్తునందు రక్షణార్థమైన సంబంధంలో ప్రవేశించడానికి నడిపిస్తుంది. ఆ తరువాత, ఇది పరిశుద్ధాత్మ దేవుని పని. ఆయన సాధారణంగా స్థానిక సంఘంలో పనిచేస్తూ, సంపూర్ణతను పునఃస్థాపిస్తాడు.
అయితే, ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే విరోధులమవుతామని తెలిసినా లేదా అలక్ష్యం చేస్తారని తెలిసినా సత్యాన్ని మాట్లాడడం. ఒక వ్యక్తితో దేవుని వాక్యాన్ని పంచుకోవడం ద్వారా అతన్ని అల్పమైన నిర్ణయాలు తీసుకోవడం నుండి, అయోమయం, పాపం మరియు శ్రమ నుండి జీవిత కాలం స్త్రీని లేదా పురుషుడిని రక్షించవచ్చు. బైబిల్ సూత్రాలను/ఆజ్ఞలను అంగీకరించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండరు. సత్యాన్ని గూర్చి మనం చేసే చర్చలను, ఓర్పు మరియు మృదుత్వం నడిపించాలి. మనం మనస్పూర్తిగా/హృదయపూర్వకంగా వినాలి మరియు ప్రేమతోనూ, వివేచనతోను లేఖనాన్ని వాడాలి. మనం వ్యక్తి పట్ల యథార్థమైన/నిజమైన శ్రద్ధను చూపించాలి, అప్పుడు మనం చెప్పే విషయాలకు విలువనిస్తారు.
క్రైస్తవ సందేశానికి, యథార్థమైన/నిజమైన తగ్గింపు అవసరం. తగ్గింపనేది దేవునితో సంభాషించడం, సమయం గడపడం, మన వ్యక్తిగత పాపాన్ని అంగీకరించడం, ఒప్పుకోవడం మరియు దాని నుండి వెనుతిరగడం, సిలువపై వెల్లడైన లోతైన దేవుని ప్రేమను హత్తుకోవడం నుండి వస్తుంది. భయం, కోపం మరియు ద్వేషానికి బదులు, ప్రేమ కనికరాలు, మనకు ప్రేరణగా ఉండాలి.
[1](1:28) వాళ్ళు తమ ఆలోచనలలోనూ, తమ జీవిత విధానంలోనూ దేవునిని తిరస్కరించారు గనుక వారి ప్రవర్తన వక్రీకరించబడినట్లుగానే వారి ఆలోచన విధానం, తత్వాలు కూడా వక్రీకరించబడ్డాయి. ఇక్కడ గ్రీకులో పదాలను నేర్పుగాను, చాతుర్యంతోను వాడారు. వాళ్ళు దేవునిని తిరస్కరించారు గనుక ఆయన తాను తిరస్కరించిన మనసుకి వారిని విడిచిపెట్టాడు - అంటే ప్రభావితం చేయడం మానేశాడు. దేవుడు మనిషికి స్వచిత్తాన్ని ఇచ్చి, పనిచేయుటకు దాన్ని అనుమతించాడు. ఒక స్థాయి తరువాత, దేవుడు తనని పూర్తిగా తిరస్కరించిన వారిని, తన ప్రభావం నుండి స్వతంత్రులుగా చేశాడు. అప్పుడు వారి మనసులు, దేవుడు అడ్డుపడని భ్రష్టత్వాన్ని అనుసరిస్తాయి.
దేవుడు వారిని అప్పగించాడు అనే ప్రకటన (1:24, 26 & 28), ఈ ప్రజలు వాస్తవంగా/దాదాపు నిస్సహాయ స్థితిలో ఉన్నారని, తాము మార్చలేని నిర్ణయాలు తీసుకున్నారని సూచిస్తుంది (2 థెస్సలొనీకయులకు 2:10-12తో పోల్చండి).
భ్రష్టత్వం చేత ప్రజల మనసులు, ఆలోచన ప్రతికూలంగా ప్రభావితమయ్యాయి. ప్రజలు నైతిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇది వారిని అడ్డుకుంటుంది. ఇది ప్రజలు తమ పాపపు కోరికలను, చర్యలను సమర్థించుకొనేలా చేస్తుంది.
► ప్రజలు తమ పాపాలకు నిర్హేతుకంగా చెప్పే సాకులకు కొన్ని ఉదాహరణలు ఏమిటి?
(1:29-31) ఈ వచనాల్లో మనం భయంకరమైన పాపాల చిట్టాను కనుగొంటాం. సంస్కృతి, ప్రభుత్వం ఈ ధోరణిని నిరోధించవచ్చు, కానీ అవి పాపియైన మనుష్యుని హృదయంలో నిలిచే ఉంటాయి. ఒకవేళ సాంస్కృతికమైన, ప్రభుత్వపరమైన నియంత్రణలను తొలగిస్తే, అనేకమంది ప్రజలు, చాలా త్వరగా క్రూరులుగాను, ఆటవీకులుగాను మారతారు.
ఇక్కడ పేర్కొన్న పాపాలు, పాపులను గూర్చిన వివరణలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి కాదు. ప్రతి ఒక్కటి సూచించే కొన్ని ప్రధాన ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి
దుర్నీతి - సాధారణ పదం, కానీ మిగిలినవాటన్నింటినీ కలిగి ఉంటుంది.
దుష్టత్వం – ఇది కూడా చెడు కార్యాలకు, చెడు స్వభావానికి సాధారణ పదం.
లోభము – గ్రీకు రచనల్లో తీవ్రమైన స్వార్థాన్ని సూచించడానికి వాడిన పదం. ఇది తన వ్యక్తిగత ప్రయోజనం కొరకు వెంటాడుతూ, ఇతరుల ప్రయోజనాలను అణగద్రొక్కే వ్యక్తిని వివరిస్తుంది. స్వప్రయోజనం కొరకు అధికారిక స్థానాన్ని తప్పుగా వాడుకోవడం కూడా దీనిలో భాగమే.
ఈర్ష్య – అంతరంగ దుష్టత్వం మరియు కీడు/చెడు చేసే ధోరణి.
మత్సరం – ఇష్టమైన వస్తువులను కలిగి ఉన్న వారి పట్ల ద్వేషం/అసహ్యంతో పాటు, ఇతరులు కలిగి ఉన్నవాటిని ఆశించే కోరిక.
హత్య – తీవ్రమైన ద్వేషం మరియు అసహ్యం వలన ఒక వ్యక్తిని చట్టవిరుద్ధంగాను, ఉద్దేశ్యపూర్వకంగాను చంపడం.
కలహం – బహుశా శతృత్వం/పోటీతత్వం నుండి కలిగిన జగడం/గొడవ.
కపటం – మోసం, చిక్కించుకోవడానికి ఎరవేయడాన్ని కూడా సూచిస్తుంది.
వైరం – ద్వేషం, అకారణంగా ఇతరులను బాధించడానికి సిద్ధంగా ఉండడం.
కొండెములు చెప్పడం – రహస్యంగా దూషించేవారు, అపనిందలు వేసేవారు.
అపవాదకులు – అపవాదకులు, ఇతరుల గురించి చెడు లేదా తప్పుడు మాటలు చెప్పడం ద్వారా వారికున్న ప్రతిష్టను నాశనం చేస్తారు.
దేవద్వేషులు – దేవుని నియమాలు వారిని ఖండిస్తున్నందున వారు ఆయన్ని శత్రువుగా చూస్తారు.
హింసకులు – ఈ వ్యక్తి గర్వంతోను, క్రూరత్వంతోను నిండి ఉంటాడు. ఈ లక్షణంతో ఉన్న బలహీనమైన వ్యక్తి, తాను గౌరవించవలసిన వారిని అవమానించాలని కోరుకుంటాడు. ఈ లక్షణం కలిగిన బలమైన వ్యక్తి, ఇతరుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తాడు మరియు తాను ఆశించిన గౌరవాన్ని ఇవ్వని వారిపై తీవ్రంగా పగ తీర్చుకుంటాడు.
అహంకారులు – గర్వం అంటే తనని తాను గొప్పగా చూసుకోవడం. ఇది తన సృష్టికర్తను ధిక్కరిస్తూ, తన జీవితాన్ని తానే పరిపాలించుకోవడానికి వ్యక్తిని ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది పాపాలన్నింటికీ మూలం.
బింకములాడువారు – తనని తాను గొప్ప చేసుకోవడం. వీళ్ళు స్వయం-కేంద్రితంగా ఉన్నవాళ్ళు. ఇక్కడ ఇతర లక్షణాలతో పాటు దీన్ని పరిగణలోనికి తీసుకొన్నట్లయితే, ఈ వ్యక్తులు ఇతరులకు నష్టం కలిగించి, మరియు వాళ్ళకు హాని కలిగించి, మోసపూరితంగా తమని తాము హెచ్చించుకుంటారు.
చెడ్డవాటిని కల్పించువారు – చెడును, హానికరమైన విషయాలను అభివృద్ధి చేయడంలో వారు సృజనాత్మకంగా ఉంటారు.
తలిదండ్రులకవిధేయులును – కుటుంబాలు నాశనమవ్వడమనేది పాప ఫలితం, ఇది సమాజాన్ని మరింతగా పాడుచేస్తుంది. తనకు తెలిసిన మొదటి అధికారానికి విరోధంగా తిరుగుబాటు చేసే పిల్లవాడిలో పాపపు ధోరణి ప్రారంభ వ్యక్తీకరణగా కనబడుతుంది.
అవివేకులు – నైతిక విలువలను గూర్చిన స్పృహ ఉండదు. నైతికతను ఆధారం చేసుకొని తర్కించడం ద్వారా ఈ వ్యక్తి అంగీకరించబడడు. ఇది జ్ఞానం/బుద్ధి లేకపోవడం వలన కాదు, కానీ దుష్ట హృదయం వలన నైతిక భావం దుర్బలమవ్వడం వలన జరుగుతుంది.
మాట తప్పువారు. నైతికతను, అధికారాన్ని విడిచిపెట్టి, తమ కోసం వక్రీకరించబడని సంపూర్ణ సత్యాన్ని ద్వేషించి, వారి స్వయాన్ని ప్రధానమైనదిగా చేసుకొని, వారి ప్రమాణాలను మీరే వారు.
అనురాగ రహితులు – సురక్షితమైన, ఆప్యాయత కలిగిన సహజ స్వభావాన్ని కలిగి ఉండడానికి వ్యతిరేకం. వాళ్ళు తమ కుటుంబాలను విడిచిపెట్టి, తమ వ్యక్తిగత కోరికలను అనుసరిస్తారు. ప్రేమ యొక్క అత్యంత మౌలికమైన స్వభావం వక్రీకరించబడుతుంది. తమ సంరక్షణపై ఆధారపడేవారిని దుర్వినియోగపరుస్తారు/వాడుకుంటారు.
నిర్దయులు – జాలి లేనివారు. వాళ్ళు కనికరం లేకుండా శ్రమను, కష్టాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తుంటే చూసి కూడా వాళ్ళు తమ చెడు మార్గం నుండి తొలగరు. తమ తప్పు వల్ల, పొరపాటు వలన కలిగిన శ్రమను చూసి కూడా పశ్చాత్తాపపడడానికి కదిలించబడరు.
(1:32) ఈ విషయాలన్నీ తప్పని వాళ్ళకు తెలుసు. అన్యజనులు, తమకు తెలిసిన సత్యాన్ని కూడా నమ్మకంగా వెంబడించరు. వాళ్ళు శిక్షావిధిక్రింద ఉన్నారని వారికి తెలుసు. అయినప్పటికిని వాళ్ళు పాపాన్ని అనుసరించడం మాత్రమే కాదు, కానీ ఇతరుల్లో ఉన్న పాపాన్ని కూడా ఆమోదిస్తారు. ఒక నూతన ప్రవర్తనా ప్రమాణం, అనైతికతను ఆమోదించేటంతగా సమాజంలో నైతికత దిగజారిపోయింది.
పాపాన్ని సంపూర్ణంగా అంగీకరించే వ్యక్తి, తనని తాను పాపిగా ఆమోదిస్తాడు మరియు ఇతరులను కూడా పాపులుగా ఆమోదిస్తాడు. అతను ఇతరుల పాపాన్ని బట్టి వినోదాన్ని పొందుతాడు. రోమా పట్టణ క్రీడా ప్రాంగణాల్లో మనుష్యులను చంపడాన్ని చూసి ప్రజలు అభినందించేవాళ్ళు. ఈ ఆధునిక కాలంలో జీవించే అనేకమంది ప్రజలు హింసను, అనైతికమైన లైంగిక చర్యలను చూస్తూ ఆనందిస్తున్నారు. తాము చేయగలిగిన, చేస్తున్న పాపంలో గొప్పగా రాణిస్తున్న ప్రజలను వాళ్ళు మెచ్చుకుంటారు.
“మానవ వ్యక్తిత్వానికి పాపం కలిగించిన పూర్తి నష్టాన్ని అంచనా వేయడం/గ్రహించడం కష్టం. లొంగిపోయిన బలహీనమైన చిత్తానికి మరియు ఉద్వేగభరితమైన భావోద్వేగాల ఘోషకు మించి మొద్దుగా మారిన, కోరికకు బానిసగా చేయబడిన మనసు ఉంది. కారణాలు చెప్పడానికి బదులు సాకులు చెప్పడం నేర్చుకుంది. ఇది మొదట నిర్ణయించుకొని, తరువాత ఆలోచిస్తుంది. ఇది తర్కించడానికి బదులుగా హేతుబద్ధం చేస్తుంది. ఇది కొన్నిసార్లు సత్యం చెబుతుంది కానీ స్థిరంగా కాదు. దానిపై ఆధారపడలేము... అది సత్యాన్ని అసత్యానికి, దేవుడిని విగ్రహారాధనకు, జ్ఞానాన్ని మూర్ఖత్వానికి అమ్మేసింది…”
[3]చాలా గ్రీకు మూల ప్రతులలో, ఈ జాబితాలో ఈ పదం లేదు.
మారుమనసు పొందని ప్రతిపాపి ఇలానే ఉన్నాడా?
ఈ పాపాలన్నింటిని ప్రతి వ్యక్తి క్రియాశీలకంగా చేయడు. అయితే, పతనమైన మానవజాతి ఈ పాపాలన్నింటిని చేసే ధోరణిని కలిగి ఉంటుంది మరియు ప్రతి వ్యక్తి భిన్నమైన పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ పాపాల్లో ఏదో ఒక దానిని చేసే అవకాశం ఉంది.
సెనేకా, పౌలు కాలంలో జీవించిన ఒక రోమా తత్వవేత్త మరియు ప్రభుత్వ అధికారి. అతను క్రైస్తవుడు కాడు, బైబిల్ తో పరిచయమున్న వ్యక్తి కూడా కాదు, కానీ పాపం చేసే సామర్థ్యం ప్రతి వ్యక్తిలో ఉందని గమనించాడు. ఆయన ఇలా చెప్పాడు, “ప్రతి మనిషిలో దుర్గుణాలన్నీ ప్రాముఖ్యంగా కనబడకపోయినా, మనుష్యులందరిలో ఈ దుర్గుణాలన్నీ ఉంటాయి.”[1] మారుమనసు పొందని పాపిని గురించి పౌలు ఇచ్చిన వివరణ, ప్రతి కాలంలోను, ప్రతి సంస్కృతిలోనూ ఉన్నవారికి వర్తిస్తుందని మనం గమనించవచ్చు.
ప్రభుత్వాలు, సమాజపు ప్రమాణాలు, వ్యక్తుల్లో ఉండే దుష్టత్వపు ధోరణిని చాలావరకు నిరోధిస్తాయి. చాలా మంది ప్రజలు, ఇతరుల అంగీకారం పొందాలని కోరుకుంటారు గనుక వారి పాపపు కోరికలను బహిరంగంగా కనబరచరు గాని వారి హృదయాల్లోనూ, మనసుల్లోనూ వాటిని తీర్చుకుంటారు. ప్రజలు ఇక్కడ పేర్కొన్న పాపాల పట్ల రహస్య ధోరణిని కలిగి ఉండి, తమ హృదయాల్లోని పాపాలను బట్టి అపరాధులవుతారు.
[1]F.F. Bruce, The Epistle to the Romans, in Tyndale Bible Commentaries (Grand Rapids: William B. Eerdmans Pub. Co., 1963), 87 ద్వారా ఉల్లేఖించబడింది.
లేఖన భాగపు అన్వయం
ఈ లేఖన భాగం, సమాజాలలో సువార్త వినని వారిని గూర్చిన ప్రాధమిక వివరణ. ఈ సృష్టిలోనూ, వారి మనస్సాక్షిలోనూ ప్రత్యక్షపరచబడిన దేవుని జ్ఞానాన్ని వారు తిరస్కరించారు. ఆ తరువాత, తమ పాప స్వభావపు కోరికలను నెరవేర్చుకోవడానికి అనుమతించే మరొక దానిని ఆరాధించడం ప్రారంభించారు మరియు వారి కోరికలు వక్రీకరించబడ్డాయి. అలాంటి ప్రజలకు సువార్త ఎందుకు అవసరమో ఈ లేఖనం వివరిస్తుంది.
ఈ లేఖనభాగం ప్రతి ఒక్కరికీ ప్రాముఖ్యం, ఎందుకంటే ఇది అనేక రకాల పాపాల జాబితాను అందిస్తుంది మరియు పాపమంతటిని దేవుడు ద్వేషిస్తాడని చూపిస్తుంది. పాపం, ఒక పాపిని మరింత దుష్టత్వంలోనికి తీసుకెళ్ళే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని హెచ్చరిస్తుంది. సువార్తను విని, దానిని తిరస్కరించే ప్రజలు, మంచి చెడులను గురించి వారి అవగాహనను కోల్పోయే అదే ప్రక్రియ గుండా వెళ్ళే ప్రమాదం ఉంది.
సమాజాలలో సువార్త ప్రకటించినప్పటికీ, మనం మన సమాజాలలో చూసే పరిస్థితులను ఈ లేఖనభాగం వివరిస్తుంది. సంస్కృతి, దేవుని ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేసి, కొన్ని పాపాలను అంగీకారయోగ్యంగా చేయడానికి ఒక మార్గాన్ని కనుగొంది.
సాక్ష్యం
ష్మాగి తూర్పు ఐరోపాలోని జార్జియా దేశంలో జన్మించారు. ష్మాగి తల్లిదండ్రులు నాస్తికులు, మరియు అతను తన బాల్యంలో చర్చికి వెళ్ళలేదు. అతని పేరుకు "త్వరగా కోపపడువాడని" అర్ధం మరియు పేరు అతని స్వభావానికి తగ్గట్లుగా ఉంటుంది. అతను యవ్వనస్తుడిగా తరచుగా ఇబ్బందుల్లో పడేవాడు. అనేక నేరాలకు పాల్పడిన తరువాత, అతన్ని రెండేళ్లపాటు రష్యాలో ఉన్న జైలుకు పంపారు. రష్యాకు వ్యతిరేకంగా జార్జియా తిరుగుబాటు సమయంలో అతను విడుదలై జార్జియాకు తిరిగి వచ్చాడు.
మద్యం వల్ల ష్మాగి కాలేయం బాగా దెబ్బతింది. అతను ఎక్కువ కాలం జీవించడని ఒక వైద్యుడు అతనికి చెప్పాడు. ష్మాగి తన జీవితం పట్ల అసంతృప్తి కలిగినవాడై దేవునిని తెలుసుకోవాలనే కోరికను అనుభవించడం ప్రారంభించాడు. తనను చర్చికి తీసుకెళ్లమని కొంతమంది క్రైస్తవ స్నేహితులను కోరాడు. మొదట, వారు చర్చి ఉన్నది అతని కోసం కాదని చెప్పారు. అతను వాదించనని ప్రమాణం చేస్తే చర్చికి రావచ్చని వారు అతనితో చెప్పారు. అతను చర్చికి వెళ్లి 22 సంవత్సరాల వయస్సులో రక్షణ పొందాడు. అతని జీవితం పూర్తిగా మారిపోయింది.
ష్మాగికి కాలేయ వ్యాధి నయమైంది. తనకున్న వ్యాధిని బట్టి అతను పెళ్లి చేసుకోవాలి ఆశించలేదు, కానీ దేవుడు అతనికి నూతన భవిష్యత్తును ఇచ్చాడు. ఇప్పుడు అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ష్మాగి పాస్టర్ గాను, పరిచర్య కొరకు అనేకులకు శిక్షణనిచ్చే వ్యక్తిగా ఉన్నారు.
పాఠం 2 - పునఃశ్చరణ ప్రశ్నలు
(1) ఏ మార్గాల ద్వారా ప్రజలు, సాధారణ ప్రత్యక్షతను పొందుతారు?
(2) లేఖనం లేకుండా ప్రజలు దేవుని గురించి ఏం తెలుసుకుంటారు?
(3) ప్రత్యేక ప్రత్యక్షత అంటే ఏమిటి?
(4) విగ్రహారాధన అంటే ఏమిటి?
(5) భ్రష్టత్వం, ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసిన రెండు మార్గాలను పేర్కొనండి.
పాఠం 2 - అభ్యాసాలు
సువార్తను వినకుండా, దేవునిని తిరస్కరించిన సమాజం యొక్క పరిస్థితిని గురించి ఒక పేజీలో రాయండి. దేవుని గురించి ఎలాంటి జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు? వారి ఆలోచనకు ఏమైంది? వారి దుష్టత్వాన్ని వివరించండి. ప్రతి ఒక్కరూ ఒకేవిధమైన దుష్టత్వాన్ని ఎందుకు కనబరచడం లేదో వివరించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.