శతాబ్దాలుగా సంఘంలో అనేకమైన వేదాంతపరమైన అంశాలు చర్చకు వచ్చాయి. వేదాంతపరమైన వివాదాస్పద అంశాల విషయంలో బైబిల్ లోని ఇతర పుస్తకాల గురించి చర్చించిన దానికంటే ఎక్కువగా రోమీయులకు రాసిన పత్రిక మాట్లాడుతుంది. ఈ పత్రికలో సమాధానమిచ్చిన ప్రశ్నలకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి.
రోమా పత్రికలో సమాధానాలు చెప్పబడిన వేదాంతపరమైన ప్రశ్నలు
తరగతి నాయకునికి గమనిక: ప్రతి ప్రశ్నను చదివి, సభ్యుల్లో కొంతమంది సమాధానం చెప్పునట్లు కొంతసేపు విరామమివ్వండి. బృందం, ఏ ప్రశ్నపైనా ఎక్కువ సమయం గడపకూడదు, తుది తీర్మానానికి వచ్చే ప్రయత్నం చేయకూడదు. ఈ ప్రశ్నలకు అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయని చూపడమే ఈ జాబితా ఉద్దేశ్యం.
1. ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా రక్షణ పొందునట్లు దేనిని నమ్మాలి?
2. ఒక క్రైస్తవుడు, తన రక్షణ కొరకు తాను ఏమి చేయడు అంటే అర్థం ఏమిటి?
3. దేవుడు కొంతమందిని రక్షించాలని, మరికొంతమందిని రక్షించకూడదని నిర్ణయించాడా?
4. ఎవరు రక్షింపబడాలో, ఎవరు రక్షించబడకూడదో దేవుడు ఎలా ఎంపిక చేస్తాడు?
5. సువార్త ఎప్పుడూ వినని వారికి ఏమి జరుగుతుంది?
6. కొంతమంది పాపులను క్షమించి మరికొందరిని శిక్షిస్తే దేవుడు న్యాయవంతుడు ఎలా అవుతాడు?
7. ఒక వ్యక్తి విశ్వాసముంచిన తరువాత కూడా పాపిగానే ఉంటాడా?
8. నిజ జీవితంలో ఎలాంటి ఆధ్యాత్మిక విజయం సాధ్యమవుతుంది?
9. విశ్వాసి తన రక్షణను కోల్పోవడం సాధ్యమేనా?
10. ఇశ్రాయేలు పట్ల దేవుడు ఇంకా ప్రణాళిక కలిగి ఉన్నాడా?
రోమీయులకు రాసిన పత్రిక ఉద్దేశ్యం
► ఒక విద్యార్థి, బృందం కొరకు రోమా 1:11-15 మరియు 15:24 వచనాలను చదివి వినిపించాలి. తాను రోమాకు వెళ్లాలని కోరుకోవడానికి పౌలు ఏ కారణాలు చెబుతున్నాడు?
పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు, తన పరిచయాన్ని, రక్షణ విషయంలో తన సిద్ధాంతపరమైన అవగాహనను తెలియజేయడమే ఈ పత్రిక ఉద్దేశ్యం కాబట్టి,
1. అతను రోమాలో ఉన్న విశ్వాసులను ప్రోత్సహించడానికి (1:11-12) మరియు అక్కడ సువార్త ప్రకటించడానికి (1:15) ఆ ప్రాంతాన్ని దర్శించాలి.
2. వారి సహకారంతో మరొక నూతన సువార్త పనిని ప్రారంభించగలడు (15:24).
క్రీ.శ. 47-57 కాలంలో ఏజీయన్ సముద్రం చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో పౌలు సువార్త ప్రకటించాడు. ఆయన క్రీ.శ. 57లో రోమీయులకు పత్రికను రాశాడు.[1] మొదట యెరూషలేముకు, ఆ తరువాత రోమాకు ప్రయాణం చేయాలనేది పౌలు ప్రణాళిక. పశ్చిమాన ఉన్న పురాతన రోమా కాలనీలోనికి, ప్రపంచంలోని ఆ భాగంలో రోమా నాగరికతకు కేంద్రంగా ఉన్న స్పెయిన్ లోనికి తన సువార్త పరిచర్యను తీసుకెళ్లడానికి రోమాలో ఉన్న సంఘాన్ని ఆధారంగా చేసుకోవాలని పౌలు కోరుకున్నాడు (15:24).
పౌలు, రోమా పట్టణానికి ఎప్పుడు వెళ్లలేదు గనుక, ఈ పత్రిక వ్యక్తిగత పరిచయంగాను తన సందర్శనానికి సిద్ధపాటుగాను ఉంటుంది. రోమా 16లో విస్తారమైన శుభాలు చెప్పడానికి ఇదే కారణం కావచ్చు.
రోమాకు పౌలు ప్రయాణం, తాను ప్రణాళిక చేసుకున్నట్లుగా జరగలేదు. అతన్ని యెరూషలేములో ఖైదు చేసారు. అతనికి అక్కడ న్యాయం జరగదని అనిపించినప్పుడు, కైసరుకు మనవి చేసుకున్నాడు. తన ప్రయాణంలో ఒక ప్రమాదం జరిగి, ఓడ బ్రద్దలైన తరువాత, దాదాపు క్రీ.శ. 60లో ఖైదీగా రోమాకు చేరుకున్నాడు. అతను నిర్భంధంలో ఉన్నప్పటికీ, తనని చూడడానికి వచ్చేవారిని కలవడానికి, వారికి పరిచర్య చేయడానికి, వారి ద్వారా పరిచర్యను చేయించుకోవడానికి స్వేచ్ఛను కలిగి ఉండేవాడు (అపొస్తలుల కార్యములు 28:30-31). ఈ సంఘటనలు, సువార్త మరింతగా వ్యాపించడానికే జరిగాయని పౌలు చెప్పాడు (ఫిలిప్పీయులకు 1:12). కైసరు ఇంటి వారిలో కూడా కొంతమంది మారుమనసు పొందిన వ్యక్తులు ఉన్నారు.
పౌలు రెండు సంవత్సరాల తరువాత విడుదలయ్యాడని కొంతమంది చరిత్రకారులు నమ్ముతారు. అతను స్పెయిన్ కి ప్రయాణం చేశాడా లేదా అనేది తెలీదు. ఆ తరువాత అతన్ని రోమాలో చంపారని మనకు తెలుసు, కానీ బహుశా అది ఈ పట్టణానికి పౌలు చేసిన రెండవ యాత్రలో జరిగింది.
తన సువార్త సేవకు రక్షణ వేదాంతాన్ని ఆధారంగా చూపడం ద్వారా, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో సువార్త సేవకు ఆధారాన్ని పౌలు చూపించాడు.
[2]తన మిషనరీ యాత్రను ప్రారంభించడంలో వారి సహాయం కొరకు పౌలు చేసిన మనవికి స్పందనగా అనేక ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చు. ఎవరో ఒకరు, “నువ్వే ఎందుకు వెళ్ళాలి?” అని అడగొచ్చు. కనుకనే పౌలు సౌవార్తీకరణ పని పట్ల తన సమర్పణను ప్రస్తావించడంతో ఈ పత్రికను ప్రారంభించాడు (1:1). అన్యులకు అపొస్తలునిగా తనకున్న ప్రత్యేకమైన పిలుపును, విజయాన్ని గురించి తరువాతి అధ్యాయాల్లో వివరించాడు (15:15-20).
మరొకరు, “ప్రతి ఒక్కరూ ఎందుకు సువార్తను వినాలి? బహుశా ఈ సందేశం ప్రతిచోటా అవసరం ఉండకపోవచ్చు” అని ప్రశ్నించవచ్చు. కానీ పౌలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవజాతి కొరకు సువార్త యొక్క సంభావ్యతను (1:14, 16, 10:12), మిషనరీ పరిచర్య ఆవశ్యకతను (10:14-15) వివరించాడు. ఈ సందేశం, ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి వర్తిస్తుందని, కాబట్టి దీనిని వినాల్సిన అత్యవసరతను ప్రతి వ్యక్తి కలిగి ఉన్నాడని అతను చూపించాడు.
[1]ఈ తేదీలు, బైబిల్ పండితుల అభిప్రాయాలు మాత్రమే. అవి ఖచ్చితమైనవో కాదో మనకు తెలీదు.
“ఈ పత్రికలో క్రీస్తు సువార్తను నేర్చుకోవడం క్లుప్తంగా అర్థం చేసుకోవడం మరియు పాతనిబంధనకు పరిచయాన్ని సిద్ధం చేయడమే పౌలు మనసులో ఉన్న విషయం.”
- విలియం టిండేల్,
“ రోమా పత్రికకు భూమిక”
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 1వ భాగం
ఇప్పుడు మొదటి లేఖనభాగాన్ని చూద్దాం - పౌలు చెప్పిన శుభాలు మరియు పరిచయం.
► ఎవరైనా ఒక విద్యార్థి, బృందం కొరకు 1:1-17 వచనాలను చదివి వినిపించాలి.
నిర్మాణం పై వివరణ
1:1-17 వచనాలు, సువార్తను వ్యాపింపజేయడానికి, పౌలు పిలుపుని, ప్రేరణను గురించి వివరిస్తాయి. దాని తరువాత, 1:18-3-20 వచనాలు, సువార్త ఎందుకు ప్రాముఖ్యమో వివరిస్తాయి, ఎందుకంటే పశ్చాత్తాపపడని పాపులు దేవుని ఉగ్రత క్రింద ఉన్నారు. అయినప్పటికీ, 1:15-19 వచన భాగం, ఈ రెండు భాగాలకు మధ్య పరివర్తనగా ఉంటుంది. సువార్తను క్లుప్తంగా వ్యక్తీకరించడం ద్వారా ఇది ఒక విషయాన్ని తెలియజేస్తుంది: పాపులకు చాలా ఉన్నతంగా తెలుసు గనుకనే వారు అపరాధులుగా ఉంటారు, కాబట్టి వాళ్ళు దేవుని ఉగ్రత క్రింద ఉన్నారు; కాని విశ్వాసి రక్షణ పొందుతాడు.
1:1-17 యొక్క ప్రధానాంశం
సువార్త, నమ్మువానికి రక్షణను కలిగించే సందేశం గనుక ఆ సువార్తను ప్రకటించడానికి పౌలు పిలవబడ్డాడు, ప్రేరేపించబడ్డాడు.
1:1-17 యొక్క సారాంశం
1:1-14లో ఉన్నదంతా, 1:15లోనున్న ప్రకటన యొద్దకు నడిపిస్తుంది. 1:16-18 వచనభాగం, సువార్త అంటే ఏమిటి, ఇది అందరికీ ఎందుకు అవసరం అనే విషయాన్ని సంగ్రహంగా వివరిస్తుంది. సువార్త, దేవుడు క్షమాపణను అందిస్తున్నాడని, ప్రజలు విశ్వాసం ద్వారా దానిని పొందుకుంటారని చెప్పే సందేశం. ప్రజలందరూ దేవుని ఉగ్రత క్రింద ఉన్నారు గనుకనే ఆ సందేశం మనుష్యులందరికీ అవసరం.
రోమీయులకు రాసిన పత్రికంతా, 1:16-18లోని వ్యాఖ్యలకు వివరణ
వచనాల వారీ వివరణ
(బ్రాకెట్లో ఉన్న సంఖ్యలు, చర్చించిన అధ్యాయాలు మరియు వచనాలను సూచిస్తున్నాయి)
(1:1) పౌలు, తనని గురించి మూడు ప్రకటనలు చేశాడు.
అతను యేసుక్రీస్తు దాసుడు.
దేవుని పిలుపు అతన్ని అపొస్తలులలో ఒకనిగా చేసింది.
అతను తనని పిలిచిన పని కొరకు ప్రత్యేకించబడ్డాడు.
పౌలు ఒకప్పుడు పరిసయ్యునిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు సువార్త పరిచర్యకు సమర్పించుకున్నాడు. పౌలు, రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు, కానీ దానిని తన గుర్తింపులో భాగంగా ప్రస్తావించలేదు. రోమా విశ్వాసుల్లో అనేకులు తనతో సహవాసం చేయడానికి ఇది సహాయం చేయదు. రోమాలో నివసించే చాలామంది ప్రజలు వేరే దేశానికి చెందినవారు లేదా బానిసలు గనుక వారికి రోమా పౌరసత్వం లేదు. ఒకవేళ పౌలు తన పౌరసత్వాన్ని ప్రస్తావించినట్లయితే, దానివల్ల రోమాలో ఉండే ఉన్నతశ్రేణి వారితో సహవాసాన్ని కలిగి ఉండగలడు; అతని ఆధ్యాత్మిక పాత్రను ప్రస్తావించడం చాలా ప్రాముఖ్యం.
(1:2) సువార్త పూర్తిగా నూతనమైంది కాదు, కానీ పాతనిబంధన ప్రవక్తల సందేశంలో ఇది భాగంగా ఉంది. అబ్రాహాము మరియు దావీదు కూడా సువార్తను అర్థం చేసుకున్నారని రోమా 4 సూచిస్తుంది.
(1:3-4) శారీరకంగా ఈలోకంలో జీవించినప్పుడు, దేవుని కుమారుడు దావీదు వంశస్థుడై, మెస్సీయ గురించి ముందుగానే చెప్పిన రాజవంశంలో జన్మించాడు.
క్రీస్తు అనేది మెస్సీయ అనే హీబ్రూ పదానికి గ్రీకు పదం.
ప్రభువు అనే పదం దైవత్వాన్ని సూచిస్తుంది. క్రొత్తనిబంధన పత్రికల్లో ప్రభువు అనే పదం యొక్క ప్రాముఖ్యతను ఫిలిప్పీయులకు 2:10-11ను యెషయా 45:23తో పోల్చడం ద్వారా చూడొచ్చు. ఈ మాట మిగిలిన అధికారాలన్నింటికంటే పైన ఉన్న అత్యున్నతుడని సూచిస్తుంది (అపొస్తలుల కార్యములు 2:36 చూడండి).
క్రొత్త నిబంధన సువార్తలలో ప్రజలు యేసును దేవుడని నిజంగా గుర్తించకుండానే, ఆయనను గౌరవించడానికి “ప్రభువు” అని పిలిచేవారు, కాబట్టి ఆ సందర్భంలో ప్రభువు అనే పదానికి అదే అర్థం ఉండకపోవచ్చు.
క్రొత్త నిబంధన పత్రికల్లో, “యేసుక్రీస్తు మన ప్రభువు” అనే పేరు, గుర్తింపు విషయమై మూడు ప్రకటనలు చేస్తుంది. యేసు చారిత్రక పురుషుడని, యూదుల మెస్సీయాయని, ఆయన దేవుడని చెబుతుంది.
పునరుత్థానం, క్రీస్తు దైవత్వాన్ని ఋజువుచేస్తుంది. యోహాను 10:18లో, తన ప్రాణాన్ని తిరిగి తీసుకుంటానని ఆయన ప్రకటించాడు. ఆయన ఆ తరానికి పునరుత్థానాన్ని ఒక సూచనగా ఇచ్చాడు. పునరుత్థానానికి సాక్ష్యమివ్వడం, తరాలన్నిటికీ ఒక సూచనను స్థిరపరిచింది. దేవుడు కాని వ్యక్తి, తననుతాను మృతుల్లో నుండి తిరిగి లేపుకోలేడు; లేదా దేవుడను అని తప్పుగా ప్రకటించుకొను వ్యక్తిని, వ్యక్తిని, ప్రాముఖ్యంగా తన పునరుత్థానం తన గుర్తింపుని రుజువు చేస్తుందని ప్రకటించే వ్యక్తిని దేవుడు లేపడు.
► మరణం నుండి తిరిగి లేచినవారు కొందరు ఉన్నారు కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు. పునరుత్థానం, యేసు గుర్తింపుని రుజువు చేస్తుందని మీరు ఎలా వివరిస్తారు?
(1:5) సమస్త దేశాల ప్రజలను, క్రీస్తుకు విధేయత చూపే వైపుకు నడిపించడానికి అపొస్తలత్వపు పిలుపు, ఆత్మీయ వరాలు ఇవ్వబడ్డాయి. ఆత్మీయ వరాలను దేవుని పని కొరకు వాడడమే సరైన విధానం. క్రీస్తు నామం మహిమపరచబడడమే పరిచర్య పట్ల కలిగి ఉండాల్సిన సరైన వైఖరి. వ్యక్తిగత లాభం లేదా వ్యక్తిగత ఘనత కలిగి ఉండాలనే వైఖరి, దేవుని సేవకునిని అనర్హునిగా చేస్తుంది.
అపొస్తలత్వపు పిలుపు యొక్క ప్రత్యేకత
► నేటి దినాలలో అపొస్తలులు జీవించి ఉన్నారా?
బైబిల్లో అపొస్తలుడు అనే పదాన్ని “పంపబడినవాడు” అనే దాని సాధారణ భావంలో ఉపయోగించారు. అపొస్తలుల కార్యములు 14:14లో బర్నబా 12 అపొస్తలులలో ఒకడు కాకపోయినప్పటినికి, పౌలు బర్నబాలు అపొస్తలులుగా పరిగణించబడ్డారు. గలతీయులకు 1:19లో, ఒకసారి దర్శించినప్పుడు, కేఫాను (పేతురు) మరియు ప్రభువు సోదరుడైన యాకోబును తప్ప మరే అపొస్తలులను చూడలేదని పౌలు చెప్పాడు. ఆ సందర్భంలో, యాకోబు 12 మందిలో ఒకడు కాకపోయినా అతన్ని అపొస్తలునిగా పరిగణించాడు.
అయితే, సాధారణంగా 12 మంది అపొస్తలులను ప్రత్యేకమైనవారిగా పరిగణిస్తారు, వారికి ఎవరిని కలపకూడదు. మత్తయి 10:2 వచనం, “ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా....” (లూకా 6:13 కూడా చూడండి) అని చెబుతుంది. 12 మంది అపొస్తలులు సింహాసనంపై కూర్చుని, ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారని యేసు వారికి చెప్పాడు (లూకా 22:30). ఈ వాగ్దానం కేవలం 12 మందికి మాత్రమే పరిమితమన్నట్లుగా కనబడుతుంది. 12 మంది అపొస్తలుల పేర్లు, దేవుని పట్టణపు 12 పునాదులపై ఉండడం, ఈ 12మంది వ్యక్తుల సమూహం ప్రత్యేకమైనదనే విషయాన్ని సూచిస్తుంది (ప్రకటన గ్రంధం 21:14).
యేసు సహోదరుడైన యూదా, తనని తాను అపొస్తలునిగా పిలుచుకోలేదు కానీ వారి అధికారాన్ని గురించి ప్రస్తావించాడు (యూదా 17ను 2 పేతురు 3:2తో పోల్చి చూడండి). అపొస్తలులు ఒక ప్రత్యేకమైన అధికారం కలిగి ఉండేవారు. వాళ్ళు సంఘాలకు ఏం రాసినా, దానిని ప్రత్యక్షతగా భావించేవాళ్ళు (2 పేతురు 3:15-16).
12 మంది అపొస్తలులు ఉండాలనే ఉద్దేశ్యంతో ఇస్కరియోతు యూదా స్థానంలో మత్తీయను సంఘం ఎంపిక చేసింది (అపొస్తలుల కార్యములు 1:26); కానీ అపొస్తలులు మరణించినప్పుడు వారి స్థానంలో వేరే వారిని సంఘం నియమించినట్లు సంఘ చరిత్రలో కనిపించదు.
అపొస్తలునిగా ఉండడానికి దేవుడు, పౌలుని పిలిచాడు (రోమా 1:1). తాను యేసుని చూడడం తన అపొస్తలత్వపు అర్హతల్లో ఒకటని పౌలు చెప్పాడు (1 కొరింథీయులకు 9:1). అది అపొస్తలత్వాన్ని సంఘపు మొదటి తరానికే పరిమితం చేస్తుంది.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 1వ భాగం
వచనాల వారీ వివరణ కొనసాగింపు
(1:6) “పిలవబడడం” అనేది ఆ తరువాతి వచనంలో చూసినట్లు రక్షణ పొందడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలవడాన్ని సూచిస్తుంది. (8:30 కూడా చూడండి). అపొస్తలులు దేశాలన్నింటి పట్ల పరిచర్య బాధ్యతను కలిగి ఉన్నారని పౌలు చెప్పాడు; రోమాలోని క్రైస్తవులు, అపొస్తలుల సువార్తను విశ్వసించినవారని ఇప్పుడు సూచిస్తున్నాడు. అందువల్ల వాళ్ళు తన అపొస్తలత్వపు అధికారాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన బాధ్యతను కలిగి ఉన్నారని చూపుతున్నాడు. వారి సంఘాన్ని స్థాపించింది అతను కాకపోయినప్పటికీ, అతని మాటలపై దృష్టిసారించి, ఆయనకు గౌరవమివ్వవలసిన కర్తవ్యాన్ని కలిగి ఉన్నారు.[1]
(1:7) రక్షణ పొందడానికి పిలవబడడం అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడడం. ఈ ప్రకటనను, 1వ వచనంలోనున్న ప్రకటనతో పోల్చాలి. ఆ వచనంలో తాను అపొస్తలునిగా ఉండుటకు పిలువబడినందున అపొస్తలునిగా ఉన్నానని పౌలు చెప్పాడు. అపొస్తలునిగా అవ్వాలని అతను ప్రయత్నించాడని లేదా ఆశించాడని భావం కాదు, కానీ తన పిలుపుని బట్టి అపొస్తలుడయ్యాడు. రోమా విశ్వాసులు పరిశుద్ధులుగా పిలవబడడం ద్వారా పరిశుద్ధులుగా చేయబడ్డారు. అపొస్తలునిగా దేవుడిచ్చిన పిలుపు, పరిచర్య కొరకు వరాలతోను, సామర్థ్యాలతోను వచ్చినట్లుగానే, పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడిచ్చిన పిలుపు కూడా మనల్ని పరిశుద్ధులుగా చేసే శక్తితోను, శుద్దీకరణతోను వస్తుంది. ఎల్లప్పుడూ దేవుని పిలుపు, దానిని నెరవేర్చడానికి అవసరమైన కృపను కలిగి ఉంటుంది.
మారుమనసు పొందినప్పుడు ప్రారంభమైన పరిశుద్ధత, ఏ విధంగాను సంపూర్ణమైనది కాదు. విశ్వాసి, దేవుని సత్యంపై ఆధారపడుతుండగా, అతని జీవితం ఆ సత్యానికి సరిపోలునట్లుగా క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. మారుమనసు పొందినప్పుడే పరిశుద్ధత సంపూర్ణమవ్వదు; కానీ మారుమనసు సమయంలో పాపి పశ్చాత్తాప పడి, దేవుని విధేయత చూపడానికి సమర్పించుకొన్నప్పుడు పరిశుద్ధత ప్రారంభమవుతుంది మరియు ఇది నూతన సృష్టిని చేస్తుంది (2 కొరింథీయులకు 5:17).
(1:8) సర్వలోకం అనే పదం సాధారణంగా భూమి మొత్తానికి కాకుండా నాగరికమైన, తెలిసిన ప్రపంచాన్ని సూచించడానికి ఉపయోగించబడింది. సువార్త ఇంకా భూమిపై ప్రతిచోటకు వెళ్ళలేదు.
(1:9) “క్రొత్తనిబంధనలోని లట్ర్యువో (latreuo – నేను సేవిస్తాను) అనే పదాన్ని , ఎప్పుడూ మతపరమైన సేవకే ఉపయోగించేవారు. ఈ సేవలో ఆరాధన ఉండొచ్చు లేదా మతపరంగా బాహ్యవిధులను నిర్వర్తించవచ్చు.”[2] పౌలు దేవునిని కేవలం మతపరమైన ఆచారంగా మాత్రమే కాదుగాను, తన ఆత్మతోను సేవించాడు.
(1:10-12) ఇక్కడ తాను రోమాను దర్శించాలనే ప్రణాళిక కలిగి ఉన్నట్లుగా చెప్పాడు. వారిని ఆత్మీయంగా బలపరచాలని అతను కోరుకుంటున్నాడు మరియు వారు ఒకరి విశ్వాసం వలన మరొకరు పరస్పరం ప్రోత్సహించబడతారని అతనికి తెలుసు.
విశ్వాసులు ఒకరితో మరొకరు కలిగి ఉండే సహవాసాన్ని బట్టి ఆత్మీయంగా ప్రయోజనం పొందుతారని పౌలు ప్రకటన మనకు చెబుతోంది. పరిశుద్ధాత్మ విశ్వాసుల్లో తన పనిని ఎక్కువగా ఇతర విశ్వాసుల ద్వారా జరిగిస్తాడు. ఇతర విశ్వాసులతో తన సంబంధాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తి, సహవాసం ద్వారా వచ్చే కృపను స్థాపించడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని కోల్పోతాడు. (పౌలు, 1 కొరింథీయులకు 12వ అధ్యాయంలో ప్రతి సభ్యునికి ఇతర సభ్యుల అవసరతను గురించి చాలా ఎక్కువగా మాట్లాడాడు).
(1:13) వారిని దర్శించడానికి చేసిన గత ప్రణాళిక విషయంలో, సమస్యలను బట్టి కాదు కానీ సువార్త ప్రకటింపబడని చోట ప్రకటించాలనే తన ప్రాధాన్యతను బట్టి ఆటంకపరచబడ్డాడు (15:20-22 చూడండి). రోమాలో సువార్త అప్పటికే ప్రకటించబడినందున, పౌలు ఇతర ప్రాంతాలకు మొదటిగా వెళ్ళాడు. అయితే, ఈ ప్రయాణం సువార్త అందని మరొక ప్రాంతాన్ని చేరుకోవడానికి ఒక అడుగు ముందుకు వేసినట్లు గనుక ఇప్పుడు అక్కడకు వెళ్ళడం తన ప్రాధాన్యతకు భిన్నమైనది కాదు (15:23-24).
(1:14) గ్రీకు ప్రజలు, గ్రీకు ప్రభావంచేత సంస్కృతి, నాగరికత కలిగినవారు. “అనాగరికులు” అనే మాటకు “పరాయిదేశస్థులు” అని అర్థం. ఇది గ్రీకు సంస్కృతి చేత తక్కువగా ప్రభావితం చెంది, పురాతన సంస్కృతికి చెందిన వ్యక్తిని సూచిస్తుంది. గ్రీకులు, గ్రీకులు కానివారిని అనాగరికులుగాను, మూర్ఖులుగాను పరిగణించేవారు.
జ్ఞానులు అనే పదం చదువుకున్న వ్యక్తులను, ముఖ్యంగా గ్రీకు తత్వాన్ని నేర్చుకున్న వారిని సూచిస్తుంది; మూఢులు పెద్దగా చదువుకోనివారు. తన పరిచర్య కొన్ని రకాల ప్రజలకే పరిమితం కాదని పౌలు చూపిస్తున్నాడు. ఇది వారికి తాను చేయబోయే పరిచర్యకు సిద్ధం చేస్తుంది, అదేవిధంగా మిషనరీగా తన బాధ్యతను చూపిస్తుంది.
సువార్త వినాల్సిన వారందరికీ తాను ఋణస్తుడనని పౌలు చెబుతున్నాడు. పాపులు సువార్తను వినడానికి అర్హులైనందున పౌలు ఋణపడి ఉండలేదు, కానీ ఆయన కృపను పొందాడు గనుక దానిని ఇతరులకు ఇవ్వాల్సిన బాధ్యతను కలిగి ఉన్నాడు.
వర్ణన: తోమాతో పంచుకొనుమని యోహానుకు ఎవరైనా ధనమిస్తే, తోమా ధనం సంపాదించడానికి ఏమీ చేయకపోయినప్పటికీ, యోహాను తోమాకు ఋణపడి ఉన్నాడు. ఇదే విధంగా, సువార్త వినని వారికి మనం కూడా ఋణస్థులమై ఉన్నాం, ఎందుకంటే వారితో దీనిని పంచుకునే బాధ్యతను దేవుడు మనకు ఇచ్చాడు.
► ప్రతి క్రైస్తవుడు సువార్తను పంచుకోవడానికి ఋణపడి ఉన్నాడా? ఎందుకు?
(1:15) పౌలు గ్రీకుదేశస్తులకును, గ్రీకు దేశస్థులు కానివారికి సువార్తను బోధించాడు, ఇప్పుడు రోమాలో ఉన్న ప్రజలకు కూడా సువార్త ప్రకటించడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు.
అతను తన ప్రధానాంశమైన, “రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను” అని చెప్పడం ద్వారా ప్రారంభించి, తరువాత సువార్త అంటే ఏమిటో, లోకానికి ఇది ఎందుకు అవసరమో క్లుప్తంగా వివరించాడు. ఈ క్లుప్త వివరణ, మిగిలిన పత్రిక అంతటా విస్తరించి ఉంటుంది.
1:14-15 వచనాలు, పౌలు వారి యొద్దకు రావడానికి ఎందుకు అర్హత కలిగినవాడో చూపిస్తాయి. లోకంలో ఉన్నవారందరికీ అవసరమైన సందేశం తన యొద్ద ఉంది.[3]
(1:16) సువార్త యూదులకు మరియు గ్రీకులకు ఉద్దేశించబడింది. ఈ ప్రకటన యూదులను, అన్యులను మరియు దేవుని ఎదుట వారి స్థితిని పరిచయం చేస్తుంది. ఈ అంశం, రోమీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం చివరి వరకు కొనసాగుతుంది. సువార్త దేవుని శక్తి గనుక, సామ్రాజ్యపు అధికార కేంద్రంలో కూడా సువార్తను పంచుకోవడానికి పౌలు సిగ్గుపడడు.
సువార్త సందేశంలో దేవుని శక్తి పనిచేస్తూ, రక్షించుటకు దానిని ప్రభావవంతమైనదిగా చేస్తుంది. దేవుని ఆజ్ఞలు, వాటిని నెరవేర్చడానికి అవసరమైన శక్తిని కలిగి ఉంటాయి. దేవుని మాటలు ప్రకటింపబడినప్పుడు, ఆయన శక్తి పనిచేస్తూ ఉంటుంది.[4] సువార్త సందేశకులు, సువార్త శక్తిపై ఆధారపడాలి, ఎందుకంటే వాళ్ళు సందేశాన్ని ప్రకటించినప్పుడు, విన్నవారు ఒప్పింపబడేలా, బలపరచబడేలా పరిశుద్ధాత్ముడు చేస్తాడు.
పౌలుకైతే, సువార్త కొరకు నిలబడడం అంటే దానిని విషయాత్మక సత్యంగా ప్రతివాదన చేయడం మాత్రం కాదు, కానీ రూపాంతర సత్యంగా దానిని బోధించడం అని అర్థం. తన సందేశాన్ని వినేవారిని ఇది మారుస్తుందనే నిశ్చయతతో ఆయన ప్రకటించాడు
► మనం సువార్తను ప్రకటించినప్పుడు ఎందుకు దృఢవిశ్వాసాన్ని కలిగి ఉండాలి?
(1:17) విశ్వాసం ద్వారా నీతిమంతునిగా చేయబడిన వ్యక్తి జీవిస్తాడు.[5] ఇది రోమీయులకు రాసిన పత్రికలోనే కీలకమైన, అత్యంత ప్రాముఖ్యమైన సత్యం.
మనిషి నీతిమంతునిగా ఎలా తీర్చబడతాడనే అంశాన్ని గురించే రోమీయులకు రాసిన పత్రిక మాట్లాడుతుంది; అంటే నీతిమంతులుగా చేయబడడం (దేవుని నీతిని కలిగి ఉండడం). సమస్య యొక్క ఆవశ్యకతను తరువాతి వచనం చూపిస్తుంది, ఎందుకంటే అనీతిమంతులుగా ఉన్నవారిపై దేవుని ఉగ్రత నిలిచి ఉంది.
[6][7]ఇక్కడ మాట్లాడిన దేవుని నీతి అంటే “ఆయన గుణలక్షణమైన నీతి కాదు కానీ ఆయన నుండి ప్రవహించే, ఆయనకు అంగీకారయోగ్యమైన నీతి,”[8] మనిషి జీవితంలో వారి విశ్వాసం ద్వారా పనిచేసే నీతి. ఇదే ఆలోచన ఫిలిప్పీయులకు 3:9లో కూడా ఉంది: “క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి.” ప్రజలు వారి క్షమాపణను బట్టి నీతిమంతులుగా పరిగణించబడడం మాత్రమే కాదు, దేవుడు వారిని మార్చినందున వాళ్ళు నిజంగా నీతిమంతులుగా ఉండడం ప్రారంభిస్తారు.
ఈ పత్రికలోని తరువాతి వచనాల్లో (రోమా 3:21-22), విశ్వసించిన వారికందరికీ యేసు నందు విశ్వాసం ద్వారా దేవుని నీతి అనుగ్రహించబడుతుందని పౌలు చెప్పాడు. రోమా 5:17-19 వచనాల్లో అనేకులను నీతిమంతులుగా చేసే నీతియుక్తమైన బహుమానం గురించి మనం [9]చదువుతాం.
“విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు” అనే మాట నీతిమంతులమవ్వడానికి విశ్వాసమే ఏకైక మార్గమని నొక్కి చెబుతుంది. రక్షణకు విశ్వాసమొక్కటే అవసరమని చెప్పే ప్రొటెస్టెంట్ భావనకు అనుగుణంగా ఉంటుంది.
రోమీయులకు రాసిన పత్రికలో, మరణం అనే మాట, దేవుని తీర్పును సూచిస్తుంది. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడిన వారు మాత్రమే జీవిస్తారు - అంటే తీర్పులో నుండి తప్పించబడతారు (1:18 చూడండి). విశ్వాసం ద్వారా తప్పించబడినవారు మినహాయిస్తే, మిగిలిన వారందరిపై దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది.
► ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా నీతిమంతునిగా చేయబడడం అంటే అర్థం ఏమిటి?
► ఈ లేఖన భాగంలో జీవించడం అంటే అర్థం ఏమిటి? మరణం అంటే ఏమిటి? విశ్వాసం ద్వారా జీవించడం అంటే అర్థం ఏమిటి?
”దేవుని యొక్క శాశ్వతమైన, మార్చలేని ఉద్దేశ్యాన్ని లేదా శాసనాన్ని ప్రచురించడమే ఈ పత్రిక యొక్క సాధారణ ఉద్దేశం.
విశ్వసించిన వ్యక్తి రక్షింపబడతాడు: విశ్వాసించని వ్యక్తి శిక్షను అనుభవిస్తాడు.”
- జాన్ వెస్లీ,
“Predestination Calmly Considered”
రోమీయులకు రాసిన పత్రిక ద్వారా మార్పుచెందిన ముగ్గురు దేవశాస్త్రులు
ఈ పత్రిక, మిషనరీ పనికి ఒక ఆధారాన్ని అందించడం అనే దాని అసలు ఉద్దేశ్యాన్ని ఇప్పటికీ అందిస్తోంది. ఇది మరింత ఎక్కువగా చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని ఎందుకు వినాలో పౌలు వివరిస్తూనే, ఆ సందేశమేంటో, ఈ మార్గం ద్వారానే ప్రజలు ఎందుకు రక్షించబడతారో అనే విషయాలను గురించి మరింత లోతుగా వివరించాడు. ఆయన కొన్ని సాధారణ అభ్యంతరాలకు స్పందించాడు. తాను ప్రకటించిన సందేశాన్ని గూర్చిన ఈ వివరణ మరియు ప్రతివాదన, పత్రికలోని ఎక్కువ భాగాన్ని తీసుకొని, దాని నిర్మాణాన్ని నియంత్రిస్తాయి.
రోమీయులకు రాసిన పత్రిక, రక్షణ సిద్ధాంతానికి ఒక వివరణ. పౌలు యొక్క రక్షణ సిద్ధాంతం, యూదా క్రైస్తవ నాయకులకు తక్షణ వాదనను అందిస్తుంది,[1] మరియు రక్షణ సిద్ధాంతాన్ని గురించి ఆధునిక తప్పులను సరిచేసేదిగా ఉంటుంది.[2]
చరిత్రలో విశ్వాసులు రక్షణను గూర్చిన అత్యంత ప్రాముఖ్యమైన సత్యాలను మర్చిపోయినప్పుడు, వాటిని పునఃస్థాపించడానికి దేవుడు రోమీయులకు రాసిన పత్రికను వాడుకున్నాడు.
యవ్వనస్తుడైన అగస్టీన్, సంతృప్తి కొరకు అనైతికమైన సంబంధాలవైపు, తాత్వికమైన, జ్ఞానసంబంధమైన అధ్యయనాలవైపు చూశాడు. అతను సత్యాన్ని వెదికి, చివరికి క్రైస్తవ్యంలో కనుగొన్నాడు. అయినప్పటికీ, పాపం అతన్ని చెరపట్టింది. రోమా 7లోనున్న వివరణలో తనని తాను చూసుకున్నాడు. తనకి సత్యం తెలుసు గాని, నీతిగా జీవించడం అతనికి సాధ్యం కాలేదు.
అగస్టీన్
క్రీ. శ. 386లో, ఆగస్టీన్ తన ముప్పైల్లో ఉన్నప్పుడు రోమా 13:13-14 వచనాలు చదివిన తరువాత, తన పాప జీవితాన్ని విడిచిపెట్టాలని తీర్మానించుకున్నాడు. దేవుడు అతన్ని పాపబానిసత్వం నుండి విడిపించి, క్రీస్తుయేసు నందు దైవికమైన జీవితాన్ని జీవించడానికి తనని బలపరిచాడు. [3]
తన జీవితంలోని మిగిలిన సంవత్సరాలలో ఆగస్టీన్ ని, దేవుడు గొప్పగా వాడుకున్నాడు. తన రచనలు, తప్పుడు తత్వానికి వ్యతిరేకంగా సరైన సిద్ధాంతాలను సంరక్షించాయి. ఆ కాలంలో సరైనది చేయగలిగే సామర్థ్యం ప్రజలకు ఉందని, కాబట్టి పాపం చేయకుండా వాళ్ళు ఉండగలరని నమ్మకం ఉండేది. రోమా 5వ అధ్యాయం ఆధారం చేసుకొని, ప్రజలు పాప స్వభావంతో జన్మించారని, అది వారు దేవునికి ఆవిధేయత చూపాలని కోరుకునేలా చేస్తుందని అగస్టీన్ బోధించాడు. ఈ పాప స్వభావం, కృపకు వేరుగా దేవునిని సంపూర్ణంగా సంతోషపెట్టడాన్ని అసాధ్యం చేస్తుంది. ఆగస్టీన్, దేవునితో సరైన సంబంధంలోనికి ప్రజలను తీసుకొచ్చే దేవుని కృపను గురించి బోధించి, దానికి సాక్ష్యమిచ్చాడు.
మార్టిన్ లూథర్
[4]1515లో, మార్టిన్ లూథర్ రక్షణ నిశ్చయత కొరకు అనేక సంవత్సరాల పాటు అన్వేషించిన తరువాత రోమా 1:17 వచనం యొక్క భావాన్ని గ్రహించాడు.[5] ఎంతో పట్టుదలతో క్రైస్తవ సన్యాసత్వం లాంటి ఆచారాలను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని కనుగొనే ప్రయత్నం చేశాడు. ఆయన ఉపవాసముండి, క్యాథలిక్ సంఘ ఆచారాలన్నింటిని పాటించాడు, చివరికి తనని తాను గాయపరచుకున్నాడు. రోమ్ లోని సెయింట్ పీటర్ క్యాథెడ్రల్ మెట్లను రక్తసిక్తమైన మోకాళ్ళతో ఎక్కుతూ ఉన్నప్పుడు విశ్వాసం ద్వారా కృపను గురించి అవగాహనను దేవుని నుండి పొందుకున్నాడు.
క్షమిస్తానన్న దేవుని వాగ్దానాన్ని విశ్వసించే వ్యక్తి మాత్రమే, దేవుని తీర్పు నుండి తప్పించుకుంటాడని అతను గ్రహించాడు. ఈ నిశ్చయతే, కేవలం విశ్వాసం ద్వారానే మనం రక్షింపబడతామనే తన సందేశానికి ఆధారమైంది.
జాన్ వెస్లీ
1738లో ఎన్నో సంవత్సరాల తన అన్వేషణ తరువాత జాన్ వెస్లీ తన వ్యక్తిగత రక్షణ నిశ్చయతను కనుగొన్నాడు.[6] వెస్లీ, పట్టుదల కలిగిన బైబిల్ పండితుడు, ఎంతో జాగ్రత్తతోను, మతనిష్టతోను జీవించిన వ్యక్తి. అతను అమెరికాలో స్థానిక ఇండియన్స్ తెగల మధ్య మిషనరీగా రెండు సంవత్సరాల పాటు పనిచేసినప్పటికీ, వ్యక్తిగతంగా సువార్తను స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయాడు. ఒక తుఫాను సమయంలో నౌకలో ఉండగా, మొరావియన్ జాతికి చెందిన కుటుంబాలు మరణాన్ని గూర్చిన భయం లేకుండా, ప్రశాంతంగా దేవుని యందు విశ్వాసముంచడం అతను చూశాడు. తనకు అలాంటి విశ్వాసం లేదని వెస్లీ గ్రహించాడు.
మార్పు అకస్మాత్తుగా జరుగుతుందని వెస్లీ లేఖనంలో చూశాడు. తమకు వ్యక్తిగత రక్షణ నిశ్చయత ఉందని సాక్ష్యమిచ్చిన మొరావియన్ సహోదరులను అతను కలిశాడు. తాను ఒక నిర్దిష్టమైన మార్పుని అనుభవించాల్సిన అవసరం ఉందని గ్రహించడం ఆరంభించాడు. తన మార్పు, ఒక గృహంలో దేవుని వాక్య అధ్యయనానికి, ప్రార్థన కొరకు జరిగిన ఒక సమావేశంలో ఉండగా జరిగింది. సమావేశంలో ఒకరు రోమా పత్రికకు మార్టిన్ లూథర్ రాసిన ముందుమాటను చదువుతూ ఉండగా, వెస్లీ హృదయం “వేడెక్కినట్లు” భావించాడు. “నా రక్షణ కొరకు క్రీస్తునందు, కేవలము క్రీస్తునందే విశ్వాసముంచినట్లు నేను అనుభూతి చెందాను: ఆయన నా పాపాలు, అవును నా సొంత పాపలను తీసివేసి, నన్ను పాపమరణముల నియమమునుండి రక్షించాడనే నిశ్చయత నాకు అనుగ్రహించబడింది” అని జాన్ వెస్లీ అన్నాడు.[7]
ఈ ముగ్గురు వ్యక్తులకు, సందేశమును అర్థం చేసుకొనుట రోషముగల సౌవార్తీకరణ ప్రేరేణకు కారణమైంది. రక్షణ శాస్త్రమును వివరించుట ద్వారా, గ్రంథము పరిచర్యలకు ఆధారమును అందిస్తూ దాని యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చుతూనే ఉంది.
► మీ జీవితంపైన, మీ పరిచర్యపైన రోమా పత్రిక ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉంటుందని మీరు ఊహిస్తారు?
[1]యూదీకరణవాదులు పెద్దలను గూర్చి కొంత సమాచారం తరువాత వివరించబడింది
[2]రోమా మరియు గలతీ పత్రికలను మనం కలిపి అధ్యయనం చేయాలి ఎందుకంటే గలతీ పత్రిక అదేవిధమైన సువార్త అంశాలను గురించి క్లుప్తంగా వివరిస్తుంది.
[3]చిత్రం: “Saint Augustin”, Jusepe de Ribera, Goya Museum వారిది, Aristoi అప్లోడ్ చేశారు, https://commons.wikimedia.org/w/index.php?curid=72972944, పబ్లిక్ డొమైన్ నుండి తీసుకున్నారు..
“రోమా పత్రిక క్రొత్త నిబంధనలో ముఖ్య భాగం మరియు స్వచ్ఛమైన సువార్త”
- మార్టిన్ లూథర్
[5]చిత్రం: “Martin Luther, 1529” by Lucas Cranach the Elder, https://commons.wikimedia.org/wiki/File:Martin_Luther,_1529.jpg, పబ్లిక్ డొమైన్ నుండి తీసుకున్నారు.
[7]John Wesley, The Works of John Wesley, Vol. I (Kansas City: Nazarene Publishing House), 103
పాఠం 1 - పునఃశ్చరణ ప్రశ్నలు
(1) పౌలు, రోమా విశ్వాసులకు పత్రికను ఎందుకు రాశాడు?
(2) రోమాకు వెళ్లాలని పౌలు ఎందుకు ప్రణాళిక చేసుకున్నాడు?
(3) క్రొత్త నిబంధన పత్రికల్లో యేసుక్రీస్తు మన ప్రభువు అనే మాటకు భావం ఏమిటి?
(4) పునరుత్థానం, యేసు దైవత్వాన్ని ఎలా నిరూపిస్తుంది?
(5) గ్రీసుదేశస్థులు కాని వారు అనే మాటను వివరించండి (రోమా 1:14).
(6) సువార్తికుడు, సువార్తను పంచుకోవాల్సిన రుణాన్ని ఎందుకు కలిగి ఉన్నాడు?
(7) రోమా పత్రికలో, కీలకమైన అత్యంత ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి?
(8) రోమా పత్రికలో మరణం అంటే అర్థం ఏమిటి?
(9) రోమా పత్రిక ప్రకారం, దేవుని తీర్పు నుండి ఎవరు తప్పించబడతారు?
పాఠం 1 - అభ్యాసాలు
(1) ఈ పాఠం నుండి లేఖన భాగాన్ని ఉపయోగించి, ఒక పేజీలో సువార్త పరిచర్యను గురించి రాయండి. పరిచర్య పిలుపుని, దానిని వినవలసిన అవసరత ఉన్నవారి పట్ల సువార్తికుడు కలిగి ఉన్న రుణాన్ని, ఆ సందేశానికి దేవుడు ఇచ్చిన శక్తిని గురించి వివరించండి.
(2) ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసే సమయంలో, రోమా పత్రికలోని లేఖనభాగాలను ఆధారం చేసుకొని మూడు ప్రసంగాలను లేదా పాఠములను సిద్ధపరచి, తరగతిలో వారికి కాకుండా ఇతర గ్రూపులకు వాటిని చెప్పండి. ప్రతి ప్రసంగాన్ని లేదా పాఠాన్ని చెప్పిన తరువాత, ఈ బోధను ఎలా మెరుగుపరచుకోవాలో విన్నవారిలో కొంతమందిని అడగండి. మీ ప్రసంగ నోట్స్ యొక్క ప్రతిని, మీ బృంద వివరణను, మీరు మాట్లాడినప్పటి సన్నివేశాన్ని, మీ ప్రసంగాన్ని మెరుగుపరచుకోవడానికి మీ ప్రణాళికలను మీ తరగతి నాయకునికి ఇవ్వాలి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.