లేఖన అధ్యయనం - రోమా పత్రిక 5వ భాగం, లేఖ భాగాలు 2-3
రోమా 10వ అధ్యాయం, రోమా పత్రికకు పతాకసన్నివేశం. విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ కలుగుతుందని మరియు లోకంలో ఉన్నవారందరికి ఇది అవసరమని అపొస్తలుడు వివరించాడు. విశ్వాసం ఆవశ్యకం కనుక, సువార్త సందేశం ప్రాముఖ్యం: ప్రజలు సందేశాన్ని నమ్మునట్లు దానిని వినాల్సిన అవసరం ఉంది. పత్రిక ఉద్దేశ్యానికి ఈ అధ్యాయం ప్రాముఖ్యం, ఎందుకంటే పత్రిక అంతా సౌవార్తిక పనికి ఆధారాన్ని ఇస్తుంది.
రోమా 11వ అధ్యాయం, ఇశ్రాయేలుకు, సంఘానికి మధ్యనున్న సంబంధంతో వ్యవహరిస్తుంది. చాలామంది యూదులు సువార్తను తిరస్కరించారు. దేవుడు సర్వలోకం కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడని, యూదులు కూడా రక్షణ పొందే అవకాశం ఉందని పౌలు వివరించాడు. ఒక దినాన ఇశ్రాయేలు సంపూర్ణ దేశంగా క్రీస్తును అంగీకరిస్తుంది.
విశ్వాసం ద్వారానే నీతిని కనుగొంటాం మరియు విశ్వాసపు ఆవశ్యకత, సువార్త సందేశాన్ని ఆత్యావశ్యకంగా చేస్తుంది.
10వ అధ్యాయం యొక్క సారాంశం
వ్యక్తిగత నీతి ద్వారా నీతిమంతులుగా తీర్చబడడాన్ని సాధించే ప్రయత్నం చేస్తానంటే పొరపాటు. దేవుడు మనిషి నుండి అంగీకరించే నీతిని, విశ్వాసానికి ప్రతిస్పందనగా ఆయన మొదట మనిషికి ఇస్తాడు. సువార్త సందేశం విశ్వాసానికి అవకాశం కల్పిస్తుంది.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 10వ అధ్యాయాన్ని చదవాలి.
వచనాల వారీ వివరణ
(10:1-5) యూదులు కూడా రక్షణ పొందాలి ఎందుకంటే వాళ్ళకు ఏ నీతి కావాలో వాళ్ళకింకా అర్థం కాలేదు. అది అసాధ్యమని గ్రహించక, వాళ్ళు పరిపూర్ణమైన వ్యక్తిగత నీతిని స్థాపించడం ద్వారా తమని తాము నీతిమంతులుగా చేసుకొనే ప్రయత్నం చేశారు. దేవుడు అంగీకరించే నీతి, విశ్వాసి విశ్వాసానికి స్పందనగా వ్యక్తిలో ఆయన చేసే కార్యం.
పాపాన్ని ఖండించి, రక్షకుని అవసరతను మనకు చూపించడం ద్వారా మనల్ని క్రీస్తు దగ్గరకు తీసుకొని రావడమే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశ్యం. ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు అంగీకరించడానికి ధర్మశాస్త్రం ఒక ప్రాతిపదికగా ఉండదు, కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఉపయోగించడానికి క్రీస్తు ముగింపు (10:4). మనం దేవునికి ఎలా విధేయత చూపాలో ధర్మశాస్త్రం చూపదని దాని భావం కాదు, కానీ మనల్ని దేవుడు అంగీకరించడమనేది పరిపూర్ణమైన, జీవితకాల విధేయతపై ఆధారపడదని దాని భావం.
క్రీస్తు రావడానికి ముందు జీవించినవాళ్ళు క్రియల చేత రక్షించబడతారనే సిద్ధాంతాన్ని ఈ లేఖన భాగం గట్టిగా ఖండిస్తుంది. క్రియల ద్వారా తమ వ్యక్తిగత నీతిని స్థాపించే ప్రయత్నం చేసేవాళ్ళు దారితప్పి, పతనమైపోతారని పౌలు స్పష్టంగా ప్రకటించాడు. 10:6-8 వచనాల్లో ద్వితీయోపదేశకాండం నుండి పౌలు ప్రస్తావించిన సువార్త సత్యాన్ని వాళ్ళు నమ్మాలి.[1]
(10:6-11) ఇది ద్వితీయోపదేశకాండము 30:11-14 యొక్క ఉల్లేఖనం. దేవుని ఆజ్ఞలను పాటించడమనేది పరలోకానికి ఎక్కిపోవడం లేదా సముద్రాన్ని దాటడం వంటి పరాక్రమం గల లేదా మానవాతీతమైన ప్రయాసపై ఆధారపడి ఉండదు. బదులుగా, ఇది వారి జీవితాల్లో వారి విశ్వాసం ద్వారా దేవుని చేతనే నెరవేరుతుందని మోషే ఇశ్రాయేలీయులకు చెప్పాడు.
పౌలు, పరలోకానికి వెళ్లడాన్ని లేదా భూమిలోనికి రావడాన్ని సూచించడానికి మరియు అవసరమైన సమస్తాన్ని క్రీస్తు నెరవేర్చాడని చూపించడానికి ఈ వ్యాఖ్యను తీసుకున్నాడు.
కృప ద్వారా రక్షణ అనేది మన హృదయాలలో మరియు మాటలోనూ ఉన్నంత సన్నిహితంగా ఉంది. మనం విశ్వాసం ద్వారా (మన హృదయాలలో) మరియు పశ్చాత్తాపం ద్వారా (మనం నోటితో) పొందుతామని దీని అర్థం.
(10:12-13) ఇదే రక్షణ మార్గం, ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉందనే మరొక ఉద్ఘాటన కూడా ఇక్కడ ఉంది. యేసు, అందరికీ ప్రభువు మరియు ఏ వ్యక్తియైన, ప్రపంచంలో ఎక్కడ నుండైనా ఆయనకు ప్రార్థన చేయవచ్చు.
[2](10:14-15, 17) ఇది మిషనరీ పని కొరకు పిలుపు. మిషనరీ సందేశం అత్యవసరం - ప్రజలు విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నారు గనుక, వాళ్ళు విశ్వాసముంచునట్లు ఆ సందేశాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ వచనాలు పత్రిక యొక్క ఉద్దేశ్యానికి కేంద్ర బిందువు.
పౌలు సువార్త పని పట్ల గొప్ప మక్కువను వ్యక్తపరిచాడు మరియు సువార్తను వినని వారి యొక్క విషాదాన్ని వివరించాడు. వాళ్ళు విశ్వాసముంచడం ద్వారా రక్షణపొందవచ్చు; కానీ వాళ్ళు వినకుండా ఎలా నమ్ముతారు మరియు ఒక మిషనరీ వెళ్ళకుండా వాళ్ళు ఎలా వింటారు?
► మిషనరీలను పంపడం యొక్క అవసరతను గురించి పౌలు మాట్లాడాడు, అంటే వారిని బలపరచడానికి, సహకరించడానికి సహాయం చేయడమని దాని అర్థం. మీకు దూరంగా ఉన్న ప్రజలకు సువార్తను అందించడానికి మీరు చేసే సహాయం ఏమిటి?
(10:16, 18-21) అందరూ సువార్త పిలుపుకు స్పందించరనే విషయం చేర్చబడింది. ప్రజలు, కేవలం సువార్త సమాచారాన్ని బట్టి మాత్రమే రక్షణ పొందలేరు. అన్యులు, సాధారణ ప్రత్యక్షతను బట్టి కొంత జ్ఞానాన్ని కలిగి ఉన్నారు (1:18-20లో చర్చించాం), కానీ వాళ్ళు దానిని తిరస్కరించారు గనుక వారు రక్షణ పొందరు (10:18వ వచనాన్ని కీర్తనలు 19:4 నుండి తీసుకున్నాడు). ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఎక్కువ ప్రత్యక్షతను కలిగి ఉన్నారు, అయితే వారు ప్రత్యక్షతను కలిగి ఉన్నంతమాత్రాన రక్షణ పొందలేరు. ఇశ్రాయేలు ప్రజలు మెస్సీయాను తిరస్కరించడాన్ని గురించి యెషయా ప్రవచించాడు (యెషయా 53:1, 3).
అపొస్తలుడు, అభ్యంతరాలకు స్పందించాడు. మొదటిగా, ఎవరైనా, అన్యులను గురించి మాట్లాడుతూ “కానీ వాళ్ళకు నిజంగా తెలీదా?” అని అడగవచ్చు. పౌలు 1:20లో, “అవును, దేవుని గూర్చిన జ్ఞానం ప్రతి చోట ఉంది” అని సమాధానమిచ్చాడు. తరువాత, అభ్యంతరం వ్యక్తపరిచే వ్యక్తి యూదులను గురించి అడుగుతాడు: “ఇశ్రాయేలుకు తెలీదా?” దేవుడు ఇశ్రాయేలును చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నించాడు, కానీ వాళ్ళు విధేయత చూపడానికి నిరాకరించారని ఆయన సమాధానమిస్తాడు. చాలామంది సువార్తను విన్నారు గాని, వాళ్ళు రక్షణ పొందలేదు గనుక అభ్యంతరం తెలిపే వ్యక్తి సువార్త యొక్క ప్రభావాన్ని అనుమానిస్తాడు.
చాలామంది ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసంతో స్పందించలేదని పౌలు వివరిస్తాడు.[3] ప్రజలు, సువార్తకు స్పందించనంత వరకూ అది వారిని రక్షించలేదు.
సువార్త ప్రకటన దానిని తిరస్కరించే వ్యక్తిని రక్షించదు - దేవుని కృప వ్యతిరేకించలేనిది కాదు. అయితే ఇది రక్షణ అవకాశాన్ని అందిస్తుంది. ప్రతి ఒక్కరికీ దేవుని గురించి ఎంతో కొంత తెలుసు కాబట్టి, సువార్త గొప్ప వెలుగుతోను పరిశుద్ధాత్ముని ఒప్పించే శక్తితోను వస్తుంది.
“పౌలు సౌవార్తీకరణలో రెండు గొప్ప ప్రేరణలు ఉన్నాయని ఆయన పత్రికలు సూచిస్తాయి: దేవుడు తన కోసం చేసిన దాని నుండి మరియు ఇతరుల కోసం చేయమని అతనిని నియమించిన దాని నుండి ఉద్భవించిన బాధ్యత యొక్క భావం మరియు సాధ్యమైనంత ఎక్కువ మంది వ్యక్తులు దేవునిని మహిమపరచాలనే కోరిక.” పౌలు చేసినట్లుగా సువార్తలో దేవుని కృపను విస్తరింపజేయుట ద్వార మనం ఆయనను అనుకరించాలి.
- Douglas J. Moo, Romans
[3]నాల్గవ పాఠంలో “పాత నిబంధనలో కృప” అనే శీర్షిక క్రింద ఉన్న నోట్స్ ను చూడండి.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 5వ భాగం, 3వ లేఖన భాగం
11వ అధ్యాయం యొక్క ప్రధానాంశం
దేవుని నిబంధనల ప్రకారం రక్షణను అంగీకరించకుండా ఎవరూ రక్షణ పొందలేరు.
11వ అధ్యాయం యొక్క సారాంశం
సాధారణంగా ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందలేరు, ఎందుకంటే వాళ్ళు దేవుని విధానంలో రక్షణ పొందడానికి తిరస్కరించారు. చాలామంది అన్యులు రక్షణ పొందారు, కానీ విశ్వాసం నుండి పడిపోయిన/తప్పిపోయిన వారు రక్షణను కోల్పోతారు. యూదులు, రక్షణ పొందాలని నిశ్చయించుకుంటే రక్షణ పొందుతారు మరియు ఇశ్రాయేలు మొత్తంగా ఒక దినాన సువార్తను అంగీకరిస్తుంది. దేవుడు, వారి పూర్వీకులతో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాడు.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 11:1-15 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(11:1) “దేవుడు యూదులను విసర్జించాడా?” అనేది ప్రశ్న. “విసర్జించలేదు, నేను కూడా యూదుడినే” అని పౌలు సమాధానమిచ్చాడు. కొంతమంది యూదులు రక్షణ పొందారు.
(11:2-5) దేవుడు ముందుగా ఎరిగిన వారు, తిరస్కరించబడరు. అయితే, దేవుడు సర్వజ్ఞాని అనే కోణంలో ఆయనకు అందరూ తెలుసు, కానీ ఈ వచనం ఆయన ప్రతిఒక్కరినీ ముందుగా చూశాడని చెప్పడం లేదు, ఎందుకంటే ఈ వచనం ఇశ్రాయేలులో నిర్ధిష్టమైన వ్యక్తులను గురించి మాట్లాడుతుంది. దేవునికి ముందుగా తెలిసిన వాళ్ళు, ఆయన కృపకు స్పందిస్తారని ఈ వచనం సూచిస్తుంది.[1] ఈ కోణంలో దేవుడు ముందుగా ఎరిగిన మరియు అంగీకరించిన వ్యక్తులను గూర్చి పౌలు ఒక ఉదాహరణను అందించాడు - 7000 మంది బయలుకు సాగిలపడలేదు.
దేవుడు, తాను ఎన్నుకొన్న శేషాన్ని (11:5) ఏకపక్షంగా లేదా యాదృచ్ఛికంగా ఎన్నుకోలేదు. వాళ్ళు తనయందు విశ్వాసముంచుతారని దేవునికి తెలుసు.
(11:6) క్రియలు మరియు కృప అనేవి క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడూ కలిసే ప్రయాణం చేస్తాయి, కానీ రక్షణ విషయంలో మాత్రం అవి ఒకదానితో మరొకటి మినహాయింపు కలిగి ఉంటాయి. కొన్ని తప్పుడు మతాలు బోధిస్తున్నట్లుగా, దేవుని అంగీకారానికి ఆధారంగాఅవి రెండు కలిసి పనిచేయవు.
(11:7-10) యెషయా 29:10 నుండి తీసుకున్న 11:8వ వచనం, ప్రజల కపట స్వభావం, వారిని ఆత్మీయ అంధులుగా చేసిందని చెబుతుంది. వాళ్ళు నిరంతరం సత్యాన్ని తిరస్కరించినందున వారి హృదయాలు కఠినమైపోయాయి. యెషయా 6:9-10 వచనాలు, కృప వార్తను ప్రజలు విని కూడా, దానిని తిరస్కరించినప్పుడు వాళ్ళు అంధులైపోతారు. రోమా పత్రికలోనున్న ఈ వచనాలకు, దేవుడు కొంతమంది ప్రజలకు కృపను అనుగ్రహించడానికి నిరాకరించాడని అర్థం కాదు. రోమా 11:9-10 వచనాలలో పౌలు ప్రస్తావించిన దావీదు శాపం (కీర్తనలు 69:22, 23), పశ్చాత్తాపపడినవారు తిరస్కరించబడతారని కాదు, కానీ దుష్టులైన ప్రజలు శిక్షపొందుతారని అర్థం.
(11:11) నిరీక్షణంతటిని మించి పడిపోవడానికి దేవుడు అనుమతించాడా? లేదు. ఇశ్రాయేలీయులు క్రీస్తును తిరస్కరించడం వలన ఆయన్ని సిలువ వేశారు, అది రక్షణకు దేవుని మార్గం. ఈ కోణంలో, వారు తృణీకరించడం వలన అన్యులు అంగీకరించబడ్డారు. అన్యులు రక్షణ పొందడం యూదులు చూసినప్పుడు, అదే విధానంలో వారు రక్షణ పొందగలరని యూదులు అర్థం చేసుకున్నారు.
(11:12-15) ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు తిరిగి వస్తే, అన్యులు మరింతగా ప్రయోజనం పొందుతారు. యూదులకు, అన్యులకు మధ్య ఎంపిక చేసుకోవడం దేవుని ఆవశ్యకం కాదు. ఆయన అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాడు.
► కొంతమందిని రక్షించకూడదని దేవుడు నిర్ణయించినందున, వారి నుండి తన కృపను తీసివేసి, వారు రక్షణ పొందడం అసాధ్యం చేశాడని కొంతమంది దైవజ్ఞానులు నమ్ముతారు. 11:12-15వ వచనం నుండి ఆ ఆలోచనకు మీరు ఎలా సమాధానం చెబుతారు?
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 11:16-24 వచనాలు చదవాలి.
(11:16-24) ఈ వచనాలు, ఒక చెట్టునుండి కొమ్మలను తీసి, మరొక చెట్టుకు అంటుకట్టే పద్ధతిని గూర్చిన ఉదాహరణను ఉపయోగించాయి. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని చెట్టు నుండి వేరైన కొమ్మలవలె ఉన్నారు మరియు అన్యులు చెట్టుకి అంటుకట్టిన వేరొక కొమ్మలుగా ఉన్నారు. యూదులు, తమ ఆవిశ్వాసాన్ని బట్టి చెట్టునుండి వెరైపోయారు. చెట్టుతో అంటుకట్టబడిన ఏ వ్యక్తియైన విశ్వాసంలో కొనసాగకపోతే వాళ్ళు కూడా వేరు చేయబడతారు. ఇప్పటికే వేరైపోయినవారు కూడా పునఃస్థాపించబడతారు.
చెట్టుపై ఎవరు ఉండాలో దేవుడు నిర్ణయించేసాడని, ఆయన నిర్ణయం మారదని పౌలు చెప్పడం లేదు. అవిశ్వాసులైన వారిని దేవుడు తొలగిస్తాడు, అయితే వాళ్ళు విశ్వాసముంచినట్లయితే మరలా జోడించబడతారు. విశ్వాసముంచిన అన్యులు జతచేయబడ్డారు, కానీ ఒకవేళ వాళ్ళు అవిశ్వాసంలో పడిపోయినట్లయితే, తొలగించబడతారు. దేవుడు, మనిషి ఎంపికలకు స్పందిస్తాడు.
► ఈ వచనాల నుండి, కొమ్మలు అంటుకట్టడం లేదా తొలగించడాన్ని గూర్చిన ఉదాహరణను మీరు ఎలా వివరిస్తారు?
విశ్వాసి భద్రతను గురించి బైబిల్ ఏం బోధిస్తుందో అర్థం చేసుకోవడము ప్రాముఖ్యం. విశ్వాసుల కొరకు చాలా తీవ్రమైన హెచ్చరికలను బైబిల్ కలిగి ఉంది.
యోహాను 15:2-10లో, ద్రాక్షవల్లి మరియు తీగలను గూర్చిన ప్రసిద్ధ అలంకారం ఉంది. ఇది కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.
మనం క్రీస్తులో ఎలా నిలిచి ఉంటాం? “మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచి యుందురు” (యోహాను 15:10). ఒక వ్యక్తి క్రీస్తులో నిలిచి ఉండడం మానేశాడంటే, అతను ప్రభువు మాటకు విధేయత చూపడం మానేసాడని భావం. అప్పుడు ఏం జరుగుతుంది?
“ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును” (15:6). ఒక వ్యక్తి విధేయత చూపడం మానేస్తే, క్రీస్తునందు నిలిచి ఉండడం కూడా మానేస్తాడు, దానివల్ల అతను తిరస్కరించబడతాడు. ద్రాక్షతీగెలు, ద్రాక్షవల్లి నుండి పడిపోవడం, అగ్నిలో పడవేయడానికి పొగుచేయడం అనేది అత్యంత సంపూర్ణమైన తిరస్కరణను సూచిస్తుంది.
“నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలిం పరు” (యోహాను 15:4). “నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును...” (15:2). ఫలించడం అంటే మారిన, ఆశీర్వాదం పొందిన, దేవుని కృప చేత నడిపించబడే జీవితాన్ని జీవించడం. మనం విధేయత ద్వారా క్రీస్తులో నిలిచి ఉండకపోతే, మనం ఫలించలేము. ఫలాలు ఫలించని వ్యక్తి తిరస్కరించబడతాడు.
మనం ఏం చేసినా కూడా రక్షణను పొందుతామని బైబిల్ ఎక్కడ చెప్పడం లేదు. మనం క్రీస్తుద్వారా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, క్రైస్తవ జీవితానికి నిరంతర కృప అందుబాటులో ఉంటుంది. క్రీస్తు ద్రాక్షావల్లివంటి వాడు, మనం అందులో నుండి జీవమును నిరంతరం పొందవచ్చు. ద్రాక్షవల్లి ఉపమానం, రక్షణ బహుమానాన్ని సంబంధం ద్వారానే పొందగలమని చూపిస్తుంది. ఆయన నుండి వేరవ్వడమంటే, రక్షణ నుండి వేరవ్వడమని అర్థం. మనం దేవునికి విధేయత చూపడం ద్వారానే రక్షణార్థమైన ఈ సంబంధాన్ని కొనసాగించగలం.
ఈ ఆధునిక కాలంలో దీనిని లైట్ మరియు ఎలక్ట్రిసిటీని గూర్చిన ఉదాహరణను ఉపయోగించి వివరించవచ్చు. బల్బ్ గుండా ఎలక్ట్రిసిటీ ప్రవహించినప్పుడు అది వెలుగుతుంది. అయితే బల్బ్ ని ఎలక్ట్రిసిటీ నుండి వేరు చేస్తే, అది వెలగదు. అదేవిధంగా, మనం క్రీస్తుతో కలిగి ఉండే సంబంధం ద్వారా నిత్యజీవాన్ని కలిగి ఉంటాం. ఆయన జీవం మనలో నుండి ప్రవహిస్తుంది. మనం ఆయన నుండి వేరైతే, ఆ జీవాన్ని నిలిపి ఉంచుకోలేము.
ఒక్కసారి రక్షణపొందిన వ్యక్తి, అంతిమంగా పాపం చేత ఓడించబడడం వలన తన రక్షణను కోల్పొతాడని లేఖనం హెచ్చరిస్తుంది. “జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టను” (ప్రకటన గ్రంధం 3:5). వీళ్ళు రక్షణ పొందిన వ్యక్తులు, అయితే వాళ్ళు పాపానికి తమని తాము అప్పగించుకొన్నట్లయితే, వారు తమ రక్షణను కోల్పోతారు.
ఒకానొక సమయంలో, తన ద్వారా రక్షణ పొందిన థెస్సలోనికయ విశ్వాసులు తమ విశ్వాసాన్ని కోల్పోతారేమోనని పౌలు ఆందోళన చెందాడు. అదే జరిగినట్లయితే, వారికి సువార్త ప్రకటించడంలో తాను పడ్డ ప్రయాసంతా వ్యర్థమవుతుందని ఆయన చెప్పాడు (1 థెస్సలొనీకయులకు 3:5). ఒక విశ్వాసి, తన మారుమనసు వ్యర్థమైపోయేంత సంపూర్ణంగా తన విశ్వాసం నుండి పడిపోవడానికి అవకాశముందని చూపిస్తుంది.
2 పేతురు 2:18-21లో, “వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన” కొంతమంది విశ్వాసులను మోసం చేసే అబద్ధ బోధకులు ఉన్నారని మనం కనుగొనగలం. ఒకప్పుడు విశ్వాసంలో కొనసాగిన వీరికి నీతిమార్గం తెలుసు, కానీ వాళ్ళు దానిని విడిచిపెట్టారు. రక్షణ మార్గాన్ని తెలుసుకొన్న తరువాత పాప జీవితానికి తిరిగి వెళ్ళడం కంటే అసలు ఆ మార్గాన్ని గురించి తెలుసుకోకపోవడమే మంచిదని ఈ లేఖన భాగం చెబుతుంది. ఒక వ్యక్తి పాపానికి తిరిగి వెళ్ళడం ద్వారా తన రక్షణను కోల్పోయే అవకాశం ఉందని ఇది చూపిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి తన రక్షణను కోల్పోయే పరిస్థితి లేకపోతే, అతను రక్షణ పొందడానికి ముందున్న దుస్థితికంటే మరింత చెడ్డ పరిస్థితిలో ఉండే అవకాశమే ఉండదు.
విశ్వాసులు, భద్రతను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ తమను తాము వాస్తవికమైన ఆధ్యాత్మిక ప్రమాదంలో పడవేసే తప్పుడు నిశ్చయతపై వారి భావాలను ఆధారం చేసుకోవడం ద్వారా కాదు. దేవుడు వాగ్దానం చేయని దానిని మనం విశ్వాసులకు వాగ్దానం చేయకూడదు. మనం ఏం చేసినా కూడా రక్షణను కోల్పోమనే వాగ్దానాన్ని ఆయన ఇవ్వలేదు.
మనం పాపంపై విజయం కలిగి జీవించునట్లు దేవుడు మనతో ఉంటానని, మనల్ని నడిపిస్తానని, మనల్ని బలపరుస్తానని వాగ్దానం చేశాడు. మనం మనం ఆత్మీయ జీవితాన్ని ఆయనతో మనకున్న సంబంధం ద్వారా పొందుతామని ఆయన వాగ్దానం చేశాడు. విశ్వాసి దేవునితో సంబంధంలో పొందే నిరంతర కృపకు సంబంధించిన దేవుని వాగ్దానానికి భయపడకుండా జీవించగలడు.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 5వ భాగం, 3వ లేఖన భాగం
వచనాల వారీ వివరణ కొనసాగింపు
(11:25-29) ఇశ్రాయేలు, ఒక దేశంగా (ఇశ్రాయేలు మొత్తం) రక్షణ పొందుతుంది. అలాగని ప్రతి యూదుడు రక్షణ పొందుతాడని దీని అర్థం కాదు, కానీ భవిష్యత్ లో ఏదో ఒక సమయంలో, దేశంలోని శేషం దేవుని దగ్గరకు తిరిగి వస్తారు. లూకా 21:24లో అన్యుల సంపూర్ణత్వాన్ని గూర్చిన ప్రస్తావన ఉంది. (ఒక రాజ్యంగా ఇశ్రాయేలు రక్షణను గురించి ఇతర సమాచారం, యెషయా 2:2-5, యెషయా 60:1-22; జెకర్యా 12:7-13:9 లో ఉంది.)
(11:30-31) 11:11వ వచన వివరణను చూడండి.
(11:32) దేవుడు వారినందరిని (వారిని సమూహంగా చేశాడు) అదే స్థితిలో ఆవిశ్వాసులుగా వర్గీకరించాడు. దేవుడు అందరికీ తీర్పు తీర్చి, వారిపై శిక్షను ప్రకటించాడు, కాబట్టి అందరూ దేవుని కృప కొరకు సమాన అభ్యర్థులుగా మారారు. ఈ వచనంలో “అందరినీ” అనే మాట రెండుసార్లు ప్రస్తావించబడింది. అందరూ పాపులు గనుక, అందరిపైనా దేవుడు తన కృపను చూపాలనుకున్నాడు. ఆయన అందరికీ తీర్పు తీర్చాడు గనుక, ఆయన అందరికీ కృపను అనుగ్రహించాడు.
ప్రజలందరిని ఒకే వర్గం క్రింద పెట్టినందువలన, వారందరూ ఒకే రక్షణను పొందగలరు (3:19-23 చూడండి). విషయమేమిటంటే, ఆయన అందరినీ శిక్షావిధి క్రిందకు తీసుకొచ్చాడు గనుక ఆయన అందరికీ ఒకే విధంగా దయను చూపగలడు.
(11:33-36) ఈ వచనాలు, దేవుని జ్ఞానాన్ని బట్టి చెల్లించే స్తుతి. ఈ గొప్ప రక్షణ ప్రణాళిక మన ఊహకు మించినది. ఆయన రక్షణను మనకు ఇవ్వాలని ఉద్దేశించిన విధానాన్ని మనం అంగీకరించాలి, ఎందుకంటే ఆయన మనకు ఋణపడిలేడు (11:35). కొంతమంది దేవుని రక్షణ ప్రణాళిక ఒక అడ్డుబండ అన్నట్లుగా దానిని బట్టి అభ్యంతరపడతారు; కానీ ఇది కృపకు పునాది రాయి వంటిది.
యుగసంబంధిత దేవశాస్త్రం వర్సెస్ నిబంధన దేవశాస్త్రం
దైవజ్ఞానులు, ఇశ్రాయేలుకు మరియు సంఘానికి మధ్యనున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.
ప్రశ్నలలో ఇవి ఉన్నాయి: పాత నిబంధనలోని వ్యక్తులు కొత్త నిబంధన ప్రజల నుండి భిన్నమైన విధానంలో రక్షించబడ్డారా? ఇశ్రాయేలుకు దేవుడు చేసిన వాగ్దానాలు సంఘానికి కూడా వర్తిస్తాయా? దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలు ఇంకా ప్రత్యేకమైనదిగా ఉందా?
ఇశ్రాయేలుకు, సంఘానికి మధ్యనున్న సంబంధాన్ని గూర్చిన ఒక వివరణను, “యుగసంబంధిత దేవశాస్త్రం” అని పిలుస్తారు. ఇతర దైవజ్ఞానులు, “యుగసంబంధిత దేవశాస్త్రం” సిద్ధాంతాన్ని అంగీకరించరు మరియు మరొక వివరణను అభివృద్ధి పరిచారు, కొన్నిసార్లు దానిని “నిబంధన దేవశాస్త్రం” అని పిలుస్తారు.
యుగసంబంధిత దేవశాస్త్రం
యుగసంబంధిత అనే పదం, దేవుడు మానవ చరిత్రలోని భిన్నమైన కాలాలలో, ప్రజలతో భిన్నంగా వ్యవహరిస్తాడని, భిన్నమైన మార్గాలలో వారికి రక్షణను అనుగ్రహిస్తాడని చెప్పే విషయం నుండి యుగసంబంధిత దేవశాస్త్రం అనే పదం వచ్చింది. ఒక సమయంలో దేవుడు ఒక నిర్దిష్టమైన రక్షణ ప్రణాళికను ఉపయోగించడం యుగసంబంధిత దేవశాస్త్రం.
కొంతమంది యుగసంబంధిత దేవశాస్త్రులు, మానవ చరిత్రను అనేక యుగాలుగా/కాలాలుగా విభజిస్తారు. బైబిల్ వివరణను అత్యంతగా ప్రభావితం చేసే రెండు కాలాలు, ఇశ్రాయేలు మరియు సంఘం మధ్య వ్యత్యాసంపై ఆధారపడేవి. పాతనిబంధన ఇశ్రాయేలు ప్రజలు, మోషే ధర్మశాస్త్రాన్ని, బలుల వ్యవస్థను అనుసరించడం ద్వారా రక్షణ పొందుతారని ఈ దేవశాస్త్రులు నమ్ముతారు; క్రొత్త నిబంధన విశ్వాసులు, విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడతారు. సంఘం, ఇశ్రాయేలు నుండి పూర్తిగా భిన్నమైంది మరియు దేవుడు వారితో భిన్నంగా వ్యవహరిస్తాడు.
యుగసంబంధిత దేవశాస్త్రంలో అనేక రకాల వ్యత్యాసాలు ఉన్నప్పటికిని, ఈ దేవశాస్త్రంలో విలక్షణమైన ఒక వర్షన్, దేవుడు భూమిని గురించి, రాజ్యాన్ని గురించి ఇశ్రాయేలు ప్రజలకు చేసిన వాగ్దానాలను అక్షరాల నెరవేరుస్తాడని బోధిస్తుంది.
గనుక సంఘం భూమిపై నుండి ఏడేండ్ల కాలానికి తీసివేయబడుతుందని వాళ్ళు నమ్ముతారు. ఆ సమయంలో, ఇశ్రాయేలు ప్రజలు యేసుని తమ మెస్సీయగా అంగీకరిస్తారు. ఆ సమయం తరువాత, యేసు యెరూషలేములో పరిపాలన చేసే 1000 సంవత్సరాల కాలం ఉంటుంది.
పాతనిబంధన, క్రైస్తవులకు పెద్దగా ఉపయోగపడదని యుగసంబంధిత దేవశాస్త్రులు భావిస్తారు, ఎందుకంటే ఇది భిన్నమైన కాలమందు ఇశ్రాయేలును ఉద్దేశించినదని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు సత్యాన్ని వివరించడానికి పాతనిబంధన వృత్తాంతాలను ఉపయోగిస్తారు, కానీ పాతనిబంధన నుండి సిద్ధాంతపరమైన ఋజువులను తరచుగా తిరస్కరించి, క్రొత్త నిబంధనను మాత్రమే అనుసరించే ప్రయత్నం చేస్తారు.
యుగసంబంధిత దేవశాస్త్రమనే పదం తెలియని చాలామంది ప్రజలు దాని ఆలోచనల చేత ప్రభావితమవుతున్నారు. క్రొత్త నిబంధన రచయితలు, పాతనిబంధనను తమ అధికారంగా పరిగణించినప్పటికిని, చాలా సందర్భాలలో, ప్రజలు పాతనిబంధన అధికారాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తారు.
నిబంధన దేవశాస్త్రం
నిబంధన దేవశాస్త్రం ప్రకారం, చరిత్రలో ఏ కాలంలో జీవించినా, దేవునిని ప్రేమించి, ఆయనకు సేవ చేసేవాళ్ళే దేవుని ప్రజలు. రక్షణ పొందిన ప్రజలు, వాళ్ళు పాతనిబంధన కాలంలో లేదా క్రొత్త నిబంధన కాలంలో జీవించినా, వాళ్ళు రక్షణ కొరకై పశ్చాత్తాపపడి, దేవునిని నమ్మిన ప్రజలు.
ఇప్పుడు సంఘం, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను పొందిన దేవుని ప్రజల సమూహం. ఈ వాగ్ధానాలలో పాతనిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు చేసిన వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత లేదు.
బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును (రోమా 2:28-29).
కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి–నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతోకూడ ఆశీర్వదింపబడుదురు (గలతీ 3:7-9).
ఆత్మనుగూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై... (గలతీ 3:14).
ఇందులో యూదుడని గ్రీసుదేశస్థు డని లేదు... మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు. (గలతీ 3:28-29).
నిబంధన దేవశాస్త్రం ప్రకారం, ఈ వాగ్దానాలు, ఇశ్రాయేలు నందు కాదు గాని సంఘానికి నెరవేరాయి:
క్రీస్తు సింహాసనం యెరూషలేములో స్థాపించబడుతుంది
సమాధానం
ఇశ్రాయేలు, ప్రపంచానికి నాయకునిగా ఉంటాడు
సమస్త దేశాలకు ఇశ్రాయేలు బోధిస్తుంది
వాగ్దాన భూమిని శాశ్వతంగా స్వాధీనం చేసుకోవడం మరియు అడవి జంతువులను సాధుపరిచి, మచ్చిక చేసుకోవడం.
వాగ్దానాలన్నింటిని అక్షరార్థంగా కాక, ఆత్మీయ అర్థంతో వివరించారు. ఈ వాగ్దానాలన్ని సంఘంలో నెరవేరాలంటే ఆధ్యాత్మిక ప్రయోజనాల ద్వారా నెరవేర్చబడాలి.
నిబంధన దేవశాస్త్రాన్ని నమ్మే చాలామంది, వేయేండ్ల కాలంలో భూమిపై క్రీస్తు భౌతికంగా పరిపాలన చేస్తాడనే విషయాన్ని నమ్మరు. ఇప్పుడు క్రీస్తు మరియు పరిశుద్ధులు సువార్త ప్రభావం ద్వారా ఆత్మీయంగా పరిపాలిస్తున్నారని నమ్ముతారు. తన సంతానం, కనానును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారని అబ్రాహాముకు చేసిన వాగ్దానం, రక్షణ పొందిన ప్రస్తుత విశ్వాసుల ద్వారా నెరవేరుతుందని నమ్ముతారు.
నిబంధన దేవశాస్త్రం ప్రకారం, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తును తృణీకరించారు గనుక వారికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత లేదు. యూదులు, ఇతర అన్యుల వలె వ్యక్తిగత రక్షణను అంగీకరించడం ద్వారా దేవుని ప్రజలలో భాగమవ్వొచ్చు.
ప్రత్యామ్నాయ దృక్పథం
నేటి దినాలలో చాలామంది దైవజ్ఞాన పండితులు, యుగసంబంధిత దేవశాస్త్రానికి మరియు నిబంధన దేవశాస్త్రానికి మధ్య లేఖన ఆధారిత సమన్వయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
యుగసంబంధిత దేవశాస్త్రంతో కొన్ని సమస్యలు ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు, లేఖనాలు (పాతనిబంధన) రక్షణను బోధిస్తున్నాయని (2 తిమోతికి 3:15) తిమోతికి చెప్పాడు. నీకొదేము, పాత నిబంధన బోధకుడు గనుక క్రొత్తగా జన్మించడం గురించి అతనికి తెలిసి ఉండాలని యేసు చెప్పాడు (యోహాను 3:10). ఒక విశ్వాసి ఇప్పుడు, నిజమైన ఇశ్రాయేలీయుడని, అబ్రాహాము కుమారుడని (రోమా 2:28-29; గలతీయులకు 3:28-29) క్రొత్త నిబంధన చెబుతుంది. పాత నిబంధన బలులు పాపాన్ని తీసివేయవని కూడా ఇది చెబుతుంది (హెబ్రీయులకు 10:4). చరిత్రలోని వివిధ కాలాల్లో దేవుడు వివిధ రకాల రక్షణ మార్గాలను అందించలేదని ఈ లేఖనాలు చూపిస్తున్నాయి.
నిబంధన దేవశాస్త్రంతో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. పాతనిబంధన వాగ్దానాలు ఆత్మీయంగా నెరవేరతాయని చెప్పడం, పరీక్షించలేని ఊహాత్మక వివరణలను అనుమతించడమే అవుతుంది. అదేవిధంగా, ఈ వివరణ, అసలు అర్థాన్ని కోల్పోతుంది. అబ్రాహాము లేదా ఇతరులు ఈ వాగ్ధానాలను అర్థం చేసుకున్నామని భావించినా, వాటిని అర్థం చేసుకోవడం అసాధ్యం. ఉదాహరణకు, ఒక భూమిని తన సంతానం ఎప్పటికీ స్వతంత్రించుకుంటారని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు; అది నిజంగా అన్యులు రక్షించబడతారనే అర్థం కావచ్చా?
దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలు ఇప్పటికీ ప్రాముఖ్యతను కలిగి ఉందనే విషయాన్ని నిబంధన దేవశాస్త్రం తృణీకరిస్తుంది, కానీ ఇశ్రాయేలు ఒక దేశంగా ఒక దినాన రక్షణ పొందుతుందని అపొస్తలుడైన పౌలు చెప్పాడు (రోమా 11:26).
ఇశ్రాయేలు మరియు సంఘం యొక్క సమతుల్య దృక్పథం పాత నిబంధనలోని వివిధ వాగ్దానాల గూర్చిన అవగాహనను కలిగి ఉంటుంది.
1. రక్షణ వాగ్దానములు. రక్షణ అనేది కృప ద్వారాను మరియు చరిత్రలోని ఏ సమయంలోనైనా, యూదులు మరియు అన్యులు పశ్చాత్తాపపడి, విశ్వాసముంచడం ద్వారా లభిస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించడానికి ఆధారం, ఎల్లప్పుడూ ఒక్కటే (రోమా 4:3, ఎఫెసీయులకు 2:8). రక్షణ ప్రణాళిక అనేది ఇశ్రాయేలు ప్రజలకు, సంఘానికి కూడా ఒక్కటే గనుక వాళ్ళు భూమిపై వేర్వేరు వంతులు కలిగియుండవలసిన అవసరం లేదు.
2. తన ప్రజల పట్ల దేవుని శ్రద్ధను గూర్చిన వాగ్దానాలు. అనేక వాగ్దానాలు విధేయత కలిగి తనతో సంబంధాన్ని కలిగి ఉన్న ప్రజలను దేవుడు శ్రద్ధగా సంరక్షించే విధానాన్ని వివరిస్తాయి. 23వ కీర్తన దీనికి ఒక ఉదాహరణ. ఈ వాగ్దానాలు, ఆయనతో సంబంధంలో ప్రత్యక్షపరచబడిన దేవుని స్వభావాన్ని చూపుతాయి. ఈ సూత్రాలు ఇశ్రాయేలు లేదా సంఘం విషయంలో ఏ సమయంలోనైనా మరియు ప్రదేశంలోనైనా వర్తిస్తాయి.
3. ఒక దేశంగా ఇశ్రాయేలుకిచ్చిన వాగ్దానాలు. యేసు, యూదుల మెస్సీయా. ఒకదినాన, ఇశ్రాయేలు ఒక దేశంగా క్రీస్తువైపుకు తిరుగుతుంది (రోమా 11:26). ఒక దేశంగా ఇశ్రాయేలుకు దేవుడు చేసిన వాగ్దానాలు, విశ్వాసముంచే యూదుల శేషం కోసం అక్షరాలా నెరవేరుతాయి.
► ప్రత్యామ్నాయ దృక్పథంలోని ఏ వ్యాఖ్యలు, యుగసంబంధిత దేవశాస్త్ర దృక్పథానికి పోలి ఉన్నాయి మరియు ఏ వ్యాఖ్యలు దీనికి భిన్నంగా ఉన్నాయి? ఏ వ్యాఖ్యలు నిబంధన దేవశాస్త్రానికి సరిపోలుతున్నాయి, ఏవి భిన్నంగా ఉన్నాయి?
పాఠం 10 - పునఃశ్చరణ ప్రశ్నలు
(1) రోమా 10 యొక్క ప్రధానాంశం ఏమిటి?
(2) యూదులు తమని తాము నీతిమంతులుగా తీర్చుకోవడానికి ఎలా ప్రయత్నించారు?
(3) క్రీస్తుకంటే ముందుగా జీవించిన ప్రజలు క్రియల ద్వారా రక్షణ పొందలేదని మనకెలా తెలుస్తుంది?
(4) రక్షణ మన హృదయాలలోను, మన మాటలోనూ ఉండడం అంటే అర్థం ఏమిటి?
(5) మిషనరీ సందేశం ఎందుకు అత్యవసరం?
(6) రోమా 11లోని చెట్టు కొమ్మల ఉదాహరణను వివరించండి.
(7) పాతనిబంధనలో మూడు రకాల వాగ్దానాలను పేర్కొనండి.
పాఠం 10 - అభ్యాసాలు
(1) నేటి క్రైస్తవులకు పాతనిబంధన ఎందుకు ప్రాముఖ్యమో ఒక పేజీలో వివరించండి. ప్రత్యేకంగా విలువైన పాతనిబంధన లేఖనాల ఉదాహరణలు ఇవ్వండి.
(2) ఇతర సంఘాలకు చెందిన కనీసం ఇద్దరు సభ్యులతో సంభాషించి, ఆ సంభాషణను నివేదించాలని జ్ఞాపకముంచుకోండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.