► మీ ప్రస్తుత బైబిల్ అధ్యయనంలో భాష్యం, అన్వయం మధ్య సంబంధం గురించి చర్చించండి. మీరు ప్రసంగించేటప్పుడు లేక బోధించేటప్పుడు, ఏది సులభం: వాక్యభాగాన్ని అర్థం చేసుకోవడమా లేక నేటి లోకానికి దాన్ని అన్వయించడమా? మీరు లేఖనం చదివేటప్పుడు లేక ప్రసంగం వినేటప్పుడు, మీ జీవితానికి అన్వయాన్ని కనుగొనగలుగుతున్నారా?
“పాస్టర్, మనం కలవచ్చా? బైబిల్ గురించి నాకు ఒక పెద్ద ప్రశ్న ఉంది” అని సునీల్ అన్నాడు. ఆ వారం తర్వాత, పాస్టర్ సునీల్ ను కలిసి, అతడు ఎదుర్కొంటున్న సమస్య గురించి అనేక వాక్యభాగాలు చూశాడు. కొన్ని నిమిషాలు తర్వాత, సునీల్ తన బైబిల్ మూసేసి, “నిజాయితీగా చెప్తున్నాను. బైబిల్ ఏం చెబుతుందో నాకు తెలుసు, కాని నేను ఇలా చేయను. ఇది చాలా కష్టం” అని చెప్పాడు.
[1]సునీల్ సమస్య భాష్యం కాదు; అన్వయం. లేఖనం ఏం చెబుతుందో పరిశీలించి, దాని అర్థాన్ని గ్రహిస్తే చాలదు; దాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి. చాలాసార్లు, బైబిల్ అధ్యయనం భాష్య దశతో ఆగిపోతుంది.
మనం, లేఖనం ఏం సెలవిస్తుందో పరిశీలిస్తూ మొదలుపెడతాం; దాని అర్థం ఏంటో గ్రహిస్తాం; ఆ వాక్యభాగాన్ని మన జీవితాలకు అన్వయిస్తూ ముగిస్తాం . ఈ ప్రక్రియను మూడు ప్రశ్నల్లో సంగ్రహించవచ్చు:
“ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా.”
- యాకోబు 1:23-24
అన్వయానికి ప్రత్యామ్నాయాలు
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు “నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును” (కీర్తన 1:2-3) అని కీర్తనాకారుడు చెప్పాడు. సాతానుడు మనల్ని బైబిల్ కి వ్యతిరేకంగా ఉంచాలని ప్రయత్నిస్తాడు. మనం అనుదినం దేవుని వాక్యాన్ని తీసుకోకపోతే, బలహీనులై ఆత్మీయంగా చనిపోతామని వాడికి తెలుసు.[1]
సాతానుడు మనల్ని దేవుని వాక్యానికి దూరంగా ఉంచలేకపోతే, సత్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోకుండా చేస్తాడు. మనం దేవుని వాక్య ప్రకారంగా జీవించనంత కాలం, ఫలభరితంగా ఉండలేం. బైబిల్ చదవకుండ సాతానుడు మనల్ని నిరోధించలేకపోతే, అన్వయాన్ని మరోదానితో భర్తీ చేసే శోధనలో మనల్ని పడేస్తాడు.
మనం అన్వయాన్ని భాష్యంతో భర్తీ చేస్తాం
లేఖన భాగాన్ని జాగ్రత్తగా ఆధ్యయనం చేసి, దాని అర్థాన్ని నిర్థారించి, దానిని పాటించకపోవడం సాధ్యమే. పేదవాడి గొర్రెపిల్లను తీసుకున్న ధనవంతుని ఉపమానం, నాతాను దావీదుకు చెప్పినప్పుడు, అతడు సరైన అర్థ వివరణతో ప్రతిస్పందించాడు. “యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. వాడు కని కరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ గొఱ్ఱెపిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెపిల్లల నియ్యవలెనని” (2 సమూయేలు 12:5-6).
దావీదు భాష్యం సరైనది. అతను యెహోవా జీవముతోడు అని ప్రతిస్పందించాడు; న్యాయాన్ని నొక్కి చెప్పాడు; ప్రతీకారం కోరాడు. దావీదు భాష్యాన్ని ఎవరు తప్పుపట్టలేరు, కాని దావీదు ఆ ఉపమానాన్ని తన జీవితానికి అన్వయించుకోలేదు. ప్రవక్త అన్వయం ఇచ్చాడు, “ఆ మనుష్యుడవు నీవే.” (2 సమూయేలు 12:7).
ప్రసంగికులకు, బోధకులకు ఇది ప్రమాదకరం. మనం వ్యక్తిగతంగా విధేయత చూపడాన్ని ప్రక్కన పెట్టి, లేఖనాల్ని ఇతరులకు బోధించగలం. విధేయత లేకుండా బైబిల్ ని అర్థం చేసుకోవడానికి, వివరించడానికి వ్యతిరేకంగా యాకోబు హెచ్చరించాడు. “కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును” (యాకోబు 4:17). మనం లేఖనాన్ని సరిగా భాష్యం చేసిన తర్వాత, దాన్ని ఆచరణలో పెట్టడంలో విఫలమవ్వకూడదు. మనం అన్వయాన్ని భాష్యంతో భర్తీ చేయకూడదు.
మనం సంపూర్ణ విధేయతను పాక్షిక విధేయతతో భర్తీచేస్తాం
ఒక లేఖన భాగాన్ని అధ్యయనం చేసి, దాని అర్థాన్ని నిర్థారించి, మనల్ని పూర్తిగా మారడానికి అనుమతించని కొన్ని అన్వయాలు కనుగొనడం సాధ్యమే. లేఖనాలకు విధేయత చూపే భాగాలు మనం కనుగొనవచ్చు కాని మన జీవితాల్లో లోతైన అవిధేయత చూపించు విషయాలను విస్మరించవచ్చు.
మనం ఎఫెసీయులకు 4:29 అధ్యయనం చేస్తూ ఉండొచ్చు, “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.” అన్వయం దశలో, మనం ప్రాముఖ్యమైన మన సంబంధాలను పరిశీలిస్తాం. మనం ఇలా అడుగుతాము:
“నా ప్రసంగాలు నా సంఘాన్ని నిర్మిస్తాయా?” “అవును; నేను నమ్మకమైన సేవకుడను.”
“నేను నా పిల్లల విషయంలో సహాయపడే పదాలు ఉపయోగిస్తానా?” “అవును; నేను ప్రేమగల తండ్రిని.”
“నా భాగస్వామిని నిర్మించుకుంటానా?” “కాదు; నా ప్రతిస్పందనల విషయంలో నేను ఎల్లప్పుడు ప్రతికూలంగా ఉంటాను.”
మీరు మీ భాగస్వామితో సంభాషించే విషయంలో మారాలని దేవుని ఆత్మ ఆశిస్తున్నాడు. మీ భాగస్వామితో మీకున్న సంబంధాన్ని రూపించు విధంగా ఈ వాక్యభాగాన్ని అన్వయించుకోనీయకుండ మరో విషయాలలో విధేయత చూపునట్లు సాతానుడు మిమ్మల్ని శోధిస్తాడు. పరిపూర్ణ విధేయతకు కట్టుబడి ఉండనీయకుండా పాక్షిక విధేయతతో జీవించే శోధనలో పడేస్తాడు.
మారుమనస్సును సాకులతో భర్తీ చేస్తాం
“బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని” (లూకా 10:25) అని ధర్మశాస్త్రోపదేశకుడొకడు యేసును అడిగాడు. ధర్మశాస్త్రోపదేశకుడికి సమాధానం తెలుసు: “నీ దేవుడైన ప్రభువు ను నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదని” (లూకా 10:27).
ధర్మశాస్త్రోపదేశకుడు లేఖనాన్ని గ్రహించాడు. “అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు–అవును గాని నా పొరుగువాడెవడని యేసునడిగెను” (లూకా 10:29). అతని సమస్య భాష్యం కాదు; అతని సమస్య అన్వయం. ధర్మశాస్త్రోపదేశకుడొకడు తన ప్రేమలేమిని సమర్థించుకున్నాడు.
బహుశ దేవుని ఆత్మ మీతో, “నీ మాటలు నీ భాగస్వామికి క్షేమాభివృద్ధి కలిగించవు; ఇది నాశనకరమైన సంభాషణ.” అని చెప్పవచ్చు. నీవు వాక్యం చదివావు; వాక్యం అర్థం చేసుకున్నావు; ఇది వాక్యాన్ని అన్వయించుకునే సమయం. బదులుగా, మీరు ఇలా అనుకోవచ్చు, “నా భాగస్వామి ఎల్లప్పుడు ప్రతికూలంగా ఉంటారు. నేను ప్రతికూలంగా ఉన్నాను అంటే దాని అర్థం నా భాగస్వామి ప్రతికూలం. అది నా తప్పు కాదు!” మీరు ఏమి చేశారు? దేవుని వాక్యానికి విధేయత చూపడంలో విఫలమైనప్పుడు పశ్చాత్తాపపడకుండా మీ ప్రవర్తనను మీరు సమర్థించుకున్నారు.
రూపాంతరాన్ని భావోద్వేగంతో భర్తీచేస్తాం
వాక్యం విని దాని ప్రకారం నడువని వ్యక్తి గురించి యాకోబు రాశాడు (యాకోబు 1:23-24). కొన్నిసార్లు ఒక వ్యక్తి వాక్యం విని నిజంగా కదలించబడతాడు, కాని నిజమైన మార్పుకు ప్రతిగా భావోద్వేగ ప్రతిస్పందనను అనుమతిస్తాడు. ప్రతి సేవకుడు ఒక విషయంపై ప్రసంగించడంలో నిరాశను అనుభవిస్తాడు, ప్రజలు “ఆ ప్రసంగం నాతో మాట్లాడింది” అని చెప్తారు గాని, వారిలో ఎటువంటి మార్పు కనుబరచరు.
బహుశా మీరు వివాహం గురించిన సదస్సులో ఎఫెసీయులకు 4:29 బోధన వినవచ్చు. సదస్సు చివర్లో జరిగే సమర్పణ సమయంలో, మీరు మీ భాగస్వామితో “నన్ను క్షమించు. నేను సానుకూల మాటలే మాట్లాడతాను. మంచిగా ఉంటాను!” అని చెబుతారు. అయితే, వెంటనే మునుపటివలే కఠినంగా, ప్రతికూలంగా, బాధించే విధంగా మాట్లాడతారు.
ఏమి జరిగింది? అది భావోద్వేగ ప్రతిస్పందనే గాని నిజమైన మార్పు కాదు. ఇది చాలా ప్రమాదకరం; పదే పదే విఫలమైనప్పుడు, మార్పు అసాధ్యమని భావిస్తాం. సత్యానికి భావోద్వేగ ప్రతిస్పందన తప్పనిసరిగా నిజమైన రూపాంతరం, విధేయతతో ఉండాలి. మనం పరిశుద్ధాత్ముని కార్యానికి లోబడినప్పుడు మాత్రమే ఇవి సాధ్యమౌతాయి.
[1]ఈ పాఠంలోని మెటీరియల్ Howard G. Hendricks and William D. Hendricks, Living by the Book (Chicago: Moody Publishers, 2007) నుండి తీసుకున్నారు.
లేఖనాన్ని అన్వయించే దశలు
తన సహజ ముఖాన్ని అద్దంలో చూసుకుని, అవతలికి పోయి తానేట్టివాడో మర్చిపోయిన వ్యక్తి గురించి చెప్పిన తరువాత, తన జీవితంలో లేఖనాన్ని సరిగా అన్వయించుకునే వ్యక్తి గురించి యాకోబు వివరించాడు: “అయితే స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును” (యాకోబు 1:25). వాక్యం వింటే సరిపోదు, వాక్యాన్ని అన్వయించుకోవాలి. లేఖనాన్ని సరిగా అన్వయించుకోవాలంటే ఏది అవసరం?
లేఖనాల్ని మన జీవితాలకు అన్వయించుకోవాలంటే, మీరు మూడు విషయాలు అనుసరించాలి:
దశ 1: లేఖన అర్థం తెలుసుకోవాలి
అందుకే పరిశీలన మరియు భాష్యం గురించిన పాఠాలు ప్రాముఖ్యం. మనకు లేఖనం తెలియకపోతే, మన అన్వయం సరిగా ఉండదు. “మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ సమాజానికి ఈ లేఖనం ఎలా అన్వయించుకున్నారు?” అనే ఈ ప్రశ్న అడుగుతూ అన్వయం దశను ఆరంభిస్తాం.
ఉదాహరణకు, “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” (ఫిలిప్పీయులకు 4:13) అని పౌలు రాశాడు. కొందరు బోధకులు ఈ వాగ్దానం తీసుకుని, “క్రీస్తు నన్ను బలపరచును” గనుక మనం కోరినది ఏదైనా దానిని సాధించగలమని చెబుతారు. “క్రీస్తునందు నేను సమస్తాన్ని చేయగలను’ గనుక నేడు ఆటలో నేనే గెలుస్తాను” అని జెట్టివారు చెబుతారు. “మీకు విశ్వాసం ఉన్నట్లయితే, ‘క్రీస్తునందు మీరు సమస్తం చేయగలరు” గనుక స్వస్థపడతారు” అని స్వస్థతలు చేసేవారు తమ సందేశాలు వినే వారికి భరోసా ఇస్తారు. “దేవుడు మిమ్మును సంపన్నులుగా చేస్తాడు. మీరు చేయవలసినదంతా దేవునితో సహకరించడమే. “క్రీస్తునందు మీరు సమస్తము చేయగలరు’” అని శ్రేయస్సు సువార్త ప్రకటించేవారు చెబుతారు.
“ఫిలిప్పీ క్రైస్తవులు ఈ వచనం ఎలా అన్వయించుకుంటారు?” అని మనం అడిగినప్పుడు, ఇది లోక సంబంధమైన విజయాన్ని గూర్చిన వాగ్దానం కాదుగాని ఆత్మీయ సహనం గురించిన వాగ్దానమని మనం గ్రహిస్తాం. పౌలు రోమా చెరసాలలో ఉన్నాడు; అతని శ్రోతలు హింసించబడుతున్నారు. అతడు లోక సంబంధమైన విజయం పొందానని చెప్పడం లేదు గాని విశ్వాసం మరియు విధేయత ద్వారా ప్రతి పరిస్థితిలో సహనంగా ఉన్నానని చెప్తున్నాడు. పౌలు, అన్ని విషయాల్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు ఎందుకంటే క్రీస్తు ద్వారా దేవుడు తన నుండి కోరినది అతడు చేయగలడు. దీనర్థం, సౌకర్యవంతమైన జీవితం కాదు; కష్టసమయాల్లో కూడా అతడు తన సంతృప్తికరమైన విధానాన్ని కోల్పోలేదని చెప్తున్నాడు.
దశ 2: లేఖనం జీవితానికి ఎలా వర్తిస్తుందో గ్రహించాలి
ఇతరులకు ప్రభావవంతంగా పరిచర్య చేయాలంటే మొదట తననుతాను తెలుసుకోవాలని పౌలు తిమోతిని హెచ్చరించాడు. “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు” (1 తిమోతికి 4:16). తిమోతి తన విషయంలో మరియు తాను ప్రకటించు సిద్ధాంతం విషయంలో ఆసక్తిగా ఉన్నప్పుడు, తన శ్రోతలకు ప్రభావవంతంగా పరిచర్య చేయగలడు.
నేను లేఖనం గురించి మరియు మొదటి శ్రోతలకు అది ఎలా అన్వయించబడిందో అనే విషయం గురించి తెలుసుకున్న తరువాత, నా గురించి నేను తెలుసుకోవాలి. అదే విధంగా ఆ వాక్యభాగం నా సమాజానికి ఎలా వర్తిస్తుందో తెలుసుకోవాలి. బహుశ నన్ను నేను చూసుకున్నప్పుడు, దేవుడు నాకు సహాయం చేసి, నన్ను ఆశీర్వదిస్తాడని సాధారణంగా నేను భావించను. ఫిలిప్పీ 4:13వ వచనం జీవిత సవాళ్లను నమ్మకంతో ఎదుర్కోవాలని నాకు సెలవిస్తుంది, ఎందుకంటే “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”
ఇప్పుడు, అన్వయం స్పష్టంగాను, నిర్దిష్టంగాను ఉంటుంది. ఈ వచనం ప్రక్కన, నేను ఇలా రాయవచ్చు: “క్రైస్తవ విలువలకు వ్యతిరేకంగా ఉన్న సమాజంలో నేను పనిచేస్తుండగా, విశ్వాస విషయంలో నన్ను బలపరచడానికి దేవుని కృపపై ఆధారపడతాను. క్రీస్తునందు నేను సమస్తాన్ని చేయగలను.” ఇది వచనాన్ని మొదటి శతాబ్దం నుండి ఇరవై ఒకటవ శతాబ్దంలోకి నడిపిస్తుంది.
లేఖనం యొక్క సరైనటువంటి అన్వయం నిజమైన లోకంలో పనిచేస్తుంది. దేవుని వాక్యం జీవితంలోని ప్రతి కోణానికి వర్తిస్తుంది. నేను లేఖనాన్ని అన్వయిస్తుండగా, “ఈ వాక్యభాగంలో మతపరమైన అన్వయం ఏంటి?” అని నేను అడగను కాని దానికి బదులుగా, “జీవితంలోని ప్రతి కోణంలో ఈ వాక్యం ఎలా వర్తిస్తుంది?” అని అడుగుతాను.
జాన్ వెస్లీ ఇలా రాశాడు: “క్రీస్తు సువార్తకు మతం కాదుగాని సమాజం తెలుసు. పరిశుద్ధత కాదు, సాంఘిక పరిశుద్ధత.”[1] మనం సువార్తను సమాజానికి వెలుపల ఉన్న సన్యాసుల వలే కాదుగాని ఇతరులతో సంబంధం కలిగిన విశ్వాసులవలే జీవిస్తాం. పరిశుద్ధత విషయంలో ఇతరులకు వేరుగా కాదుగాని, సంఘ సమాజ సందర్భంలో జీవిస్తాం.
మునుపు మనం ఎఫెసీయులకు 4:29 చూశాం. ఈ వచన అన్వయాన్ని పరిగణలోనికి తీసుకున్నప్పుడు, ఇతర క్రైస్తవులతో నాకు ఉన్న సంబంధాలకు దీనిని అన్వయించాలి: “నా మాటలు తోటి విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాయా లేక పతనం చేస్తున్నాయా?” ఈ వచనాన్ని కుటుంబానికి అన్వయించాలి: “నా సంభాషణ నా కుటుంబాన్ని కడుతుందా, లేక నా భాగస్వామి మరియు పిల్లల నమ్మకాన్ని బలహీనపరుస్తుందా?” నేను ఈ వచనాన్ని వృత్తికి అన్వయించాలి: “నేను సానుకూల మాటలు పలికే ఉద్యోగినా లేక ప్రతికూల ఆలోచనలు పంచే ఉద్యోగినా?” ఎఫెసీయులకు 4:29 జీవితంలోని ప్రతి కోణానికి వర్తిస్తుంది.
అందుకే, తమ యజమానులతో సరైన సంబంధం కలిగి జీవించే దాసులు అన్ని విషయాల్లో మన రక్షకుడైన దేవుని సిధ్ధాంతాన్ని గౌరవిస్తారని పౌలు రాశాడు (తీతుకు 2:10). లేఖనాన్ని జాగ్రత్తగా అన్వయించుకోవడం, మన చుట్టూ ఉన్న ప్రజలకు సువార్తను ఆకర్షణీయంగా చేస్తుంది.
దశ 3: లేఖనానికి విధేయత చూపాలి
బైబిల్ అధ్యయనం యొక్క తుది లక్ష్యం, అనుదిన అన్వయం. 2 తిమోతికి 2:3-6 లో పౌలు క్రైస్తవులను సైనికులు, జెట్టివాళ్లు, మరియు వ్యవసాయకులుగా వివరించాడు. ఈ చిత్రాలు, గురి కలిగి పట్టుదలతో ఉన్న వ్యక్తి గురించి వర్ణిస్తాయి. సైనికుడు యుద్ధ సమయంలో విశ్రమించడు; జెట్టివాడు పందెం మధ్యలో ఆగిపోడు; వ్యవసాయకుడు తన పని పూర్తయ్యే వరకు నాటడం ఆపడు. క్రైస్తవ జీవితానికి పట్టుదల అవసరం. “మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము” (హెబ్రీయులకు 12:1).
మీరు లేఖన అధ్యయనం చేస్తున్నప్పుడు, “నా జీవితంలో ఈ సత్యాన్ని ఆచరించవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా?” అని అడగాలి. మీ జీవితంలో సత్యాన్ని క్రమబద్ధంగా అన్వయించుకొనునట్లు దేవుని సహాయం కోరండి. మీరు ఇలా చేసినప్పుడు, దేవుడు మరింత సత్యాన్ని మీకు బయలుపరుస్తాడు. ఆత్మీయ ఆహారం కోసం మీరు మరింత ఎక్కువ ఆకలి కలిగియుంటారు.
మీ మాటల విషయంలో దేవుడు మీకు అవగాహన కలుగజేయడానికి ఎఫెసీ 4:29 ద్వారా మాట్లాడినట్లయితే, క్షేమాభివృద్ధి కలిగించే ప్రసంగాన్ని ఆచరించడానికి మీరు కట్టుబడి ఉండాలి. ఇది, ఒకరి జీవితంలోకి కృపను గూర్చి మాట్లాడడానికి రోజుకు ఒక అవకాశం ఇవ్వమని దేవునిని అడిగే అంత సులభం కావచ్చు. దీని అర్థం, మీ హానికమైన సంభాషణ విన్నప్పుడు, నిన్ను హెచ్చరించమని నమ్మకమైన స్నేహితుని అడగడం. ఈ విధంగా అనుదినం దేవుని వాక్యాన్ని మనం ఆచరించగలము.
కాలేజీలో, ఒక యువకుడు ఒక నిర్దిష్టమైన శోధనలో పోరాడుతున్నాడు. హరీష్ కి సంగీతం అంటే చాలా ఇష్టం, కాని అతను కొన్ని సాహిత్య శైలుల సంగీతాన్ని కూడా వినేవాడు, అవి అతని బలహీనత ఉన్న అంశంలో అతనిని శోధించేవి. హరీష్ శోధనపై జయం పొందాలనుకున్నాడు, కాని తన జీవితంలో లేఖనాన్ని సతతంగా అన్వయించలేదు.
సెప్టెంబర్లో, పాఠశాలలో పునరుజ్జీవ సభలు జరుగుతాయి. హరీష్ వేదిక యొద్దకు వెళ్తాడు. తన గదికి తిరిగి వచ్చి, అనుచితమైన సంగీతం వినడం మానేస్తాడు. కొన్ని వారాల పాటు, అతడు మంచి సాక్ష్యం కలిగి ఉంటాడు. ఈ శైలిలో కొన్ని క్రొత్త పాటల రికార్డులు కొంటాడు. వెంటనే నిరుత్సాహపడిపోతాడు; నవంబర్ నెల వచ్చేసరికి, “నేను వెనక్కి జారిపోయాను” అని చెబుతాడు.
ఫిబ్రవరిలో, పాఠశాలలో బైబిల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. హరీష్ వేదిక యొద్దకు వెళ్తాడు. తన పాటలన్నిటిని ప్రక్కన పడేసి, కొన్నివారాల పాటు మంచి సాక్ష్యం కలిగి జీవిస్తాడు. తరువాత ఏప్రిల్ నెలలో, మరికొన్ని రికార్డింగ్లు కొంటాడు, ప్రక్రియ మళ్ళీ మొదలౌతుంది.
హరీష్ కి ఏమి అవసరం? మంచి భాష్యమా? కాదు! అతనికి తన బలహీనత ఏంటో తెలుసు; మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తుందని అతనికి తెలుసు; తన ఆత్మీయ జీవితంపై కొన్ని సంగీతాలకు ఉన్నటువంటి ప్రభావం అతనికి తెలుసు. హరీష్ సమస్య భాష్యం కాదు; అతడు తనకు తెలిసిన వాటిని ఆచరించవలసిన అవసరత ఉంది.
మీరు ఏ విషయంలో అన్వయాన్ని ఆచరించవలసిన అవసరత ఉంది?
[1]ముందుమాట John మరియు Charles Wesley’s 1739 ముద్రణ Hymns and Sacred Poems.
అడుగవలసిన ప్రశ్నలు
జీవితానికి లేఖనాన్ని అన్వయించుకొనేటప్పుడు ఈ ఐదు ప్రశ్నలు అడగడం సహాయకరంగా ఉంటుంది.
(1) నివారించవలసిన పాపం ఉందా?
చాలామంది క్రైస్తవులు తమ జీవితంలో లేఖనానికి అనుగుణంగా లేని విషయాల్ని చూసినప్పుడు నిరుత్సాహానికి గురౌతారు. దేవుడు మన జీవితంలోని పాపం గురించి లేఖనం ద్వారా మాట్లాడినప్పుడు, మనం నిరుత్సాహపడకూడదు. బదులుగా, ఆయన వాక్యానికి ఇష్టపూర్వకంగా విధేయులవ్వాలి.
(2) స్వతంత్రించుకోవడానికి వాగ్దానం ఉందా?
కొన్నిసార్లు అన్వయం, కేవలం దేవుని వాగ్దానాలు ప్రకటించడమే. వాగ్దానాన్ని భాష్యం చేసే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు వాగ్దానాలు ప్రత్యేకంగా వ్యక్తులకు లేక ఇశ్రాయేలు దేశానికి చేయబడినవి. వాగ్దానాన్ని దాని సందర్భం నుండి వేరు చేయకుండా జాగ్రత్తపడాలి. అయితే, బైబిల్ సందర్భంలో వాగ్దానాన్ని జాగ్రత్తగా భాష్యం చేసినప్పుడు, ఈ వాగ్దానం విశ్వాసులందరికి వర్తిస్తుందని తెలుసుకున్నప్పుడు, మన జీవితాల్లో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు.
(3) తీసుకోవడానికి ఏదైనా చర్య ఉందా?
“ఈ లేఖన భాగం విషయంలో నేను ఏమి చేయాలి? ఈ వాక్య భాగం ఏ సత్యాన్ని బోధిస్తుంది? నా సిద్ధాంతంలోని తప్పు గురించి నన్ను హెచ్చరిస్తుందా? లేఖనానికి అనుగుణంగా నా ఆలోచన నేను మార్చుకోవాలా? ఈ లేఖనానుసారంగా నేను ఏ చర్య తీసుకోవాలి?” అని అడగాలి.
ప్రార్థన ఒక ఉదాహరణ. మనం దావీదు, పౌలు, నెహేమ్యా మరియు యేసు ప్రార్థనలు చదివినప్పుడు, మన ప్రార్థనా జీవితానికి మాదిరిని కనుగొంటాం. పౌలు లేదా యేసు ప్రార్థనలను అనుకరించడం కంటే ప్రార్థన నేర్చుకోవడానికి మంచి మార్గం లేదు! నేను చదువుతున్నప్పుడు, నా జీవితంలో ప్రార్థనలు స్వీకరించడం ద్వారా స్పందించగలను.
(4) విధేయత చూపవలసిన ఆజ్ఞ ఉందా?
పౌలు పత్రికల్లో సాధారణంగా రెండవ భాగంలో ఆజ్ఞలు ఉంటాయి. ఈ ఆజ్ఞలు సూటిగా, స్పష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు క్రైస్తవులు తమకు తెలిసిన సులభ అన్వయాన్ని విడిచిపెట్టి, లోతైన సత్యాల కోసం చూస్తారు.
స్పష్టంగా కనిపించు సత్యాన్ని విడిచి, లోతైన సత్యాల కోసం వెదకడంలోని ప్రమాదం గురించి ఎవరో రాశారు. అతడు క్రొత్త నిబంధన గ్రీకులో తన మొదటి అధ్యయనం గురించి చెప్పాడు. మత్తయి 16:24లో “నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను” అని యేసు చెప్పాడు. అసలు గ్రీకులో భిన్నమైన, ఆశ్చర్యకరమైన అర్థం లేదు. గ్రీకులో, ఈ వచన అర్థం, అదేమి చెబుతుందో అదే దాని అర్థం. అర్థాన్ని గ్రహించడం అంత కష్టం కాదు. బదులుగా, విధేయత చూపడం కష్టం.[1]
కొన్నిసార్లు అవసరమైనడల్లా, “అవును, ప్రభువా నేను లోబడతాను” అని చెప్పడమే.
(5) అనుసరించడానికి మాదిరి ఉందా?
లేఖనంలో చాలావరకు జీవిత చరిత్ర ఉంది. మనం జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు, “అనుసరించడానికి మాదిరి ఉందా?” అని మనం అడుగుతాం.
ఆదికాండము 18లో మనం అబ్రాహాము గురించి చదివినప్పుడు, మన లోకం కోసం విజ్ఞాపన చేస్తూ అబ్రాహాము మాదిరి అనుసరించవచ్చు. ఒక బోధకుడు నైజీరియాలో బోధిస్తున్నాడు. నైజీరియా ముస్లింలు మరియు క్రైస్తవుల మధ్య సంఘర్షణలతో నలిగిపోతుంది. ఒక విద్యార్థి తన క్లాస్ మేట్స్ ని ఇలా అడిగాడు: “మనం ముస్లింల కోసం ప్రార్థించే దానికంటే ఎక్కువగా ఎందుకు పోరాడతాం? దేవుడు వారిని రక్షణలోకి నడిపిస్తాడని మనం నమ్ముతున్నామా? నమ్మితే, మనం అబ్రాహాము మాదిరి అనుసరించి, వారి రక్షణ కోసం విజ్ఞాపన చేస్తాం!” అది అన్వయం.
మనం రోమా 12:1-2లో పరిశీలనలు చేశాం. ఈ వచనాల్లోని ముఖ్య పదాలు అధ్యయనం చేశాం. పౌలు సందేశాన్ని సరిగా భాష్యం చేయడానికి చారిత్రక, సాంస్కృతిక, బైబిల్ నేపథ్యం అధ్యయనం చేశాం.
ఇప్పుడు మనం అత్యంత ముఖ్య దశకు సిద్ధంగా ఉన్నాం. రోమా 12:1-2 ను మీ జీవితంలో ఎలా అన్వయిస్తారు?
► మునుపటి పాఠాల్లో రోమా 12:1-2 పై మీరు చేసిన నోట్సును మరలా చదవండి. మీ జీవితంలో ఈ వాక్యభాగాన్ని అన్వయించుకోవడానికి మూడు నిర్దిష్టమైన విషయాల జాబితా చేయండి.
► మీరు ఈ పాఠం సమూహంతో కలిసి అధ్యయనం చేస్తుంటే, సమూహంతో మీ అన్వయం పంచుకోండి. ఒకవేళ మీరు మళ్ళీ కలిస్తే, జవాబుదారీతనం ఏర్పాటు చేసుకోండి. కొన్ని నిబద్ధతలు తీసుకుని, మీ అన్వయం విషయంలో పురోగతిని తనిఖీ చేయమని సమూహాన్ని అడగండి.
ముగింపు
ఈ కోర్సు, ఇతరులకు బోధించునట్లుగా బైబిల్ ను అర్థం చేయడాన్ని గూర్చినది. దేవుని వాక్య పరిచారకులుగా ఇందుకే మనం పిలువబడ్డాం. అయితే, ఇందులో ప్రమాదం ఉంది. మనం జాగ్రత్త వహించకపోతే, కేవలం ప్రసంగం, బోధన కొరకే బైబిల్ ను అధ్యయనం చేస్తాం. మన సొంత జీవితాల్లో బైబిల్ సత్యాన్ని అన్వయించుకునే విషయంలో తప్పిపోతాం.
బైబిల్ అధ్యయనం కేవలం నేర్చుకోవడానికి, బోధించడానికే కాదు. దేవుని వాక్యాన్ని, మనల్ని భౌతికంగా పోషించే ఆహారంతో పోల్చవచ్చు. తినడం అనేది, రోజువారి మరియు దీర్ఘకాల ప్రభావాలు కలిగియుంది. ఒక్క ఆరోగ్యకరమైన భోజనంతో మీ క్రొవ్వును మీరు తగ్గించుకోలేరు, ఒక్కరోజు దేవుని వాక్యం చదవడం వలన ఆత్మీయ బలం రాదు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనుదినం ఆరోగ్యకరమైన ఆహారం అవసరం మరియు ఆత్మీయత బలంగా ఉండాలంటే వాక్యాన్ని అనుదినం భుజించుట అవసరం. అయితే, ఒక మంచి అల్పాహారం కష్ట దినానికి తోడ్పడినట్లుగానే ఒక దిన వాక్య ఆహారం ఆరోజు సవాళ్లు ఎదుర్కొవడానికి తోడ్పడుతుంది.
సేవకులు, సంఘ నాయకులు మరియు బోధకులుగా మన ఆత్మీయ జీవితాలు అనుదినం పోషించబడాలనే విషయాన్ని మరచిపోకూడదు. ఇతరులకు బోధించే మన ప్రయత్నంలో, దేవుని వాక్యమనే ఆహారంతో మన హృదయాలను పోషించుకోవడం మరచిపోకూడదు. మనం మనల్ని పోషించుకున్నప్పుడే, దేవుని ప్రజలకు పరిచారం చేసే ఆత్మ బలం పొందుకుంటాం.
ఈ ప్రమాదం గురించి పౌలుకు బాగా తెలుసు. ఇతరులకు బోధించి తాను అనర్హుడైపోయే భయంకరమైన అవకాశం గురించి రాశాడు (1 కొరింథీయులకు 9:27). మన హృదయాల్లో దేవుని కృపను తిరస్కరిస్తూ, ఇతరులకు బోధించడం ఎంత భయంకరమైన విషయం. ఇతరులకు బోధించడానికి అధ్యయనం చేయండి, కాని దేవుడు మీ హృదయాలతో మాట్లాడునట్లుగా కూడా అధ్యయనం చేయండి.
ఆచరణలో పెట్టండి
► లూకా 14:25–17:10 ఉపమానాల, హెచ్చరికల శ్రేణి. యేసు చివరిసారిగా యెరూషలేము వెళ్లినప్పుడు, ఆయన తన శిష్యులకు చివరి హెచ్చరికలు ఇచ్చాడు. మీరు యేసు బోధ చదివేటప్పుడు, ఈ వచనాల్లో నిర్దిష్ట అన్వయాలు కనుగొనండి. ఇలా అడగండి:
(1) దేవుని వాక్యాన్ని సరిగా భాష్యం చేస్తే చాలదు; దాన్ని మన అనుదిన జీవితాలకు అన్వయించుకోవాలి.
(2) అన్వయాన్ని వేరే వాటితో భర్తీ చేయడానికి సాతాను మనల్ని శోధిస్తాడు.
అన్వయాన్ని భాష్యంతో భర్తీచేయగలం.
సంపూర్ణ విధేయతను పాక్షిక విధేయతతో భర్తీచేయగలం.
మారుమనస్సును సాకులతో భర్తీ చేయగలం.
రూపాంతరాన్ని భావోద్వేగంతో భర్తీచేయగలం.
(3) లేఖనాల్ని మన జీవితాలకు అన్వయించుకోవాలంటే, మూడు విషయాలు అనుసరించాలి:
లేఖన అర్థం తెలుసుకోవాలి.
లేఖనం జీవితానికి ఎలా వర్తిస్తుందో గ్రహించాలి.
లేఖనానికి విధేయత చూపాలి.
(4) మీ జీవితంలో లేఖనం అన్వయించుకునే విషయంలో మార్గాలు కనుగొనడానికి అడుగవలసిన ప్రశ్నలు:
నివారించవలసిన పాపం ఉందా?
స్వతంత్రించుకోవాల్సిన వాగ్దానం ఉందా?
తీసుకోవడానికి ఏదైనా చర్య ఉందా?
విధేయత చూపవలసిన ఆజ్ఞ ఉందా?
అనుసరించడానికి మాదిరి ఉందా?
పాఠం 9 అభ్యాసం
1వ పాఠంలో, ఈ కోర్సు సమయంలో అధ్యయనం చేయడానికి ఒక వాక్యభాగం ఎన్నుకున్నారు. పరిశీలన, భాష్యం పై మీరు తయారు చేసిన నోట్సు ఆధారంగా, మీరు అధ్యయనం చేస్తున్న వాక్యభాగానికి ఆచరణాత్మక అన్వయాలను జాబితా చేయండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.