► మీ భాషలో అనేక అర్థాలున్న ఒక పదం పేర్కొనండి. ఎవరైనా ఆ పదం వాడినప్పుడు, వారి ఉద్దేశ్యం ఏంటో మీకు ఎలా తెలుస్తుంది?
బైబిల్ భాష్యంలో అతి ముఖ్యమైన ఒక విషయం, మనం చదివే వాక్యభాగపు సందర్భం. ఈ పాఠంలో, మనం చారిత్రిక-సాంస్కృతిక నేపథ్యం గురించి అదే విధంగా ఒక వాక్యభాగం చుట్టూ ఉన్న బైబిల్ సందర్భం గురించి అధ్యయనం చేయడం నేర్చుకుంటాం.[1]
[1]ఈ అధ్యాయంలోని ఎక్కువ భాగం 6-7 అధ్యాయాల నుండి వచ్చాయి J. Scott Duvall and J. Daniel Hays, Grasping God’s Word (Grand Rapids: Zondervan, 2012).
చారిత్రక-సాంస్కృతిక సందర్భం
► 2 తిమోతికి 4:6-22 చదవండి.
“శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము” (2 తిమోతికి 4:21) అని పౌలు తిమోతికి రాశాడు. ఈ నేపథ్యం వెలుగులో పౌలు అభ్యర్ధన వినండి:
పౌలు రోమా చెరసాలలో ఉన్నాడు. తన విశ్వాసాన్ని బట్టి త్వరలో హతసాక్షి అవుతాడు.
తిమోతి, వందల కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎఫెసులో పరిచర్య చేస్తున్నాడు.
శరదృతువులో సముద్ర ప్రయాణం ప్రమాదకరంగా ఉండేది మరియు శీతాకాలంలో అసాధ్యం. తిమోతి శీతాకాలానికి ముందే చేరుకోవాలంటే, ఈ పత్రిక తనకు చేరిన వెంటనే త్వరగా బయలుదేరాలి.
పౌలు అభ్యర్థన వెనుకున్న భావోద్వేగాన్ని మనం అభినందించడానికి చారిత్రక సందర్భం మద్దతిస్తుంది. పౌలు “అనుకూలమైనప్పుడు దర్శించు” అని చెప్పలేదు. “నేను చనిపోయేలోపు నిన్ను చూడాలి. నీవు శీతాకాలం వరకు వేచియుంటే, ప్రయాణం అసాధ్యమౌతుంది. ఆలస్యమవ్వకముందే రమ్ము” అని పౌలు తన ఆత్మీయ కుమారుని వేడుకున్నాడు. మీకు చారిత్రక సందర్భం గురించి ఏమి తెలియకపోయినా, పత్రికలో అదే సందేశం ఉంది కాని, సందర్భం పౌలు అభ్యర్థనలోని తీవ్రతను చూపిస్తుంది.
ప్రపంచంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగల ఒకే భాషలో దేవుడు బైబిల్ ను అందించలేదు కాబట్టి చారిత్రిక-సాంస్కృతిక నేపథ్యం ప్రాముఖ్యమైంది. లేఖనం గురించి రెండు ప్రకటనలు ప్రాముఖ్యం:
1. లేఖన సూత్రాలు ప్రతి కాలంలో, ప్రతి ప్రదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి వర్తిస్తాయి.
2. లేఖన సూత్రాలు, నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట ప్రదేశంలో ఉన్న నిర్దిష్ట ప్రజలకు ఇవ్వడం జరిగింది.
ప్రాచీన ప్రపంచం నుండి మన ప్రపంచాన్ని వేరు చేసే చారిత్రక-సాంస్కృతిక వ్యత్యాసాలు
3
వంతెన
వాక్యభాగంలో బోధించిన సూత్రం
4
పటం
క్రొత్త నిబంధనతో సంబంధం (పాత నిబంధన వాక్యభాగాలతో)
5
మన పట్టణం
మన లోకంలో ఆ సూత్రం యొక్క అన్వయింపు
లేఖనంలోని చారిత్రిక-సాంస్కృతిక నేపథ్యాలు ఎంత చక్కగా అర్థం చేసుకుంటే, బైబిల్ సార్వత్రిక సూత్రాన్ని అంతే చక్కగా అర్థం చేసుకుంటాం.
మనం చారిత్రిక-సాంస్కృతిక సందర్భం అధ్యయనం చేస్తున్నప్పుడు, అసలు శ్రోతలకు ఇచ్చిన సందేశాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ ను “వారి పట్టణంలో” చదువుతాం. ఆ తర్వాత “నది” - మన ప్రపంచాన్ని ప్రాచీన ప్రపంచాన్ని వేరు చేసే సాంస్కృతిక వ్యత్యాసాలను చూద్దాం. మనం బైబిల్ ప్రపంచాన్ని యెంత చక్కగా అర్థం చేసుకుంటే, దేవుని వాక్యం నేటి మన లోకానికి ఏం చెబుతుందో అంతే చక్కగా చూడగలుగుతాం.
వాక్యభాగాన్ని దాని వాస్తవిక సందర్భంలో చదవటం ప్రాముఖ్యం ఎందుకంటే అది, బైబిల్ భాష్యపు ముఖ్య సూత్రానికి పునాది: నేడు బైబిల్ వాక్యభాగపు సరైన భాష్యం ఏదైనా అది తప్పనిసరిగా, ఆ వాక్యభాగపు అసలైన సందేశానికి అనుగుణంగా ఉండాలి. వాక్యభాగపు అసలైన సందేశంతో విభేదించే అర్థాన్ని నేను కనుగొనకూడదు.
చారిత్రక-సాంస్కృతిక సందర్భం అంటే ఏంటి? చారిత్రక-సాంస్కృతిక సందర్భం అంటే, వాక్యభాగాన్ని అర్థం చేసుకోవడంలో సహాయం చేయటానికి, వాక్యభాగం వెలుపల నుండి వచ్చే ప్రతిదీ. ఇది ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కలిగియుంటుంది:
అరణ్యంలో ఇశ్రాయేలీయుల జీవితం ఎలా ఉంది (నిర్గమకాండము—ద్వితీయోపదేశకాండము సందర్భం)?
మొదటి శతాబ్దపు పాలస్తీనా సంస్కృతి ఏంటి (సువార్తల సందర్భం)?
గలతీయులకు మరియు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలుకు నిరాశ కలిగించిన అబద్ధ బోధకులు ఎవరు?
చారిత్రక-సాంస్కృతిక సందర్భాన్ని అధ్యయనం చేసేటప్పుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలు:
(1) బైబిల్ రచయిత గురించి మనకు ఏం తెలుసు?
దేవుడు మానవ రచయితల ద్వారా మాట్లాడాడు గనుక, రచయితలను గురించినా అవగాహన దేవుని వాక్యం మరింత ఉత్తమంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
పౌలు పత్రికలు చదివేటప్పుడు, మారుమనస్సుకు ముందు తన జీవితం గుర్తుచేసుకోండి. అతడు ఆరంభంలో తన “శరీరమును ఆస్పదము చేసికొనుట,” (ఫిలిప్పీయులకు 3:4-6) గురించి వివరించినప్పుడు, పరిసయ్యులు ధర్మశాస్త్రానికి విధేయత చూపినందున ఉన్నతంగా గౌరవించబడ్డారని తెలుసుకోవాలి. వారి వేషధారణ, యేసును వారు తిరస్కరించిన విధానాన్ని మనం గుర్తుచేసుకున్నప్పుడు, దేవుని ధర్మశాస్త్రం వివరాల యెడల వారి ప్రేమను కూడా గుర్తుచేసుకోవాలి.
మరోవైపు, పౌలు పాపులలో “నేను ప్రధానుడను” (1 తిమోతికి 1:15) అని తన గురించి చెప్పుకున్నప్పుడు, పౌలు సంఘాన్ని హింసించి, క్రైస్తవులను మరణానికి అప్పగించాడని గుర్తుచేసుకోవాలి. ఇతడు, దమస్కు మార్గంలో క్రీస్తును ఎదుర్కోక మునుపు, తన జీవితం ఎలా ఉందో గుర్తుచేసుకుంటూ జీవించాడు.
నిర్గమకాండము చదివేటప్పుడు, ఫరో రాజభవనంలో మోషే ఆధిక్యతలు గురించి మనం నేర్చుకోవాలి. రాజభవన జీవితాన్ని గమనించినప్పుడు, హెబ్రీయులకు 11:25 మోషే గురించి ఏం సెలవిస్తుందో, అది మరింత అర్థవంతంగా ఉంటుంది; “…అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి.” యువకుడైన మోషే అనుభవించిన విద్యా, సాంస్కృతిక ఆధిక్యతలు చూసినప్పుడు, గొప్ప రాజ్యాన్ని నడిపించడానికి దేవుడు తన సేవకుని సిద్ధపరచటం మనం చూస్తాం.
(2) బైబిల్ శ్రోతలు గురించి మనకు ఏం తెలుసు?
బైబిల్ రచయిత గురించి నేర్చుకోవడంతో పాటుగా, వాస్తవిక శ్రోతలను గురించి కూడా సాధ్యమైనంతవరకు నేర్చుకోవాలి.
1 మరియు 2 దినవృత్తాంతములలోని విషయాలు, ఎక్కువగా సమూయేలు మరియు రాజులు గ్రంథాలు నుండి పునరావృతమౌతాయి. ఎందుకు? దినవృత్తాంతములు ఇశ్రాయేలు చెర నుండి తిరిగివచ్చిన తర్వాత రాశారు. దేవుడు ఇశ్రాయేలును తీర్పు అనుభవించడానికి ఎందుకు అనుమతించాడో రాజులు గ్రంథం చూపిస్తుంది; దేవుడు తన ప్రజలపట్ల ఇంకా శ్రద్ధ చూపుతున్నాడని దినవృత్తాంతముల గ్రంథం చూపిస్తుంది.
యెరూషలేము నాశనానికి ముందు దినాల్లో యిర్మీయా ప్రకటించాడు. మనం అతని తీర్పు సందేశం చదువుతున్నప్పుడు, వాగ్దానం చేసిన తీర్పు జరుగబోతుందని గుర్తుంచుకోవాలి. అయితే, యిర్మీయా గ్రంథంలో దేవుని ఈ వాగ్దానం కూడా మనం చదువుతాం, “నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు” (యిర్మీయా 29:11). ప్రజలను ఖైదీలుగా పరాయి దేశానికి తీసుకెళ్లబోతున్నప్పుడు ఈ వాగ్దానం వచ్చింది. తన ప్రజల కొరకైన దేవుని ప్రణాళికలో, వారిని మారుమనస్సుకు నడిపించే తీర్పులు భాగం.
1 యోహాను పత్రిక అబద్ధ బోధలు ఎదుర్కొంటున్న క్రైస్తవుల గురించి మాట్లాడుతుంది: కేవలం ఆత్మ మంచిది; శరీరం చెడ్డది. యేసు నిజమైన మానవుడు కాడు; మానవుడుగా కనిపించాడు అని అబద్ధ బోధకులు బోధించారు. యేసుకు భౌతిక శరీరం ఉందని యోహాను తన శ్రోతలకు గుర్తుచేశాడు.. “ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో” (1 యోహాను 1:1).
కొందరికి మాత్రమే బయలుపరచబడిన మర్మ జ్ఞానం ద్వార రక్షణ కలుగుతుందని అబద్ధ బోధకులు బోధించారు. దేవుని గురించి నిజంగా తెలుసుకోవాలంటే విధేయత చూపాలని యోహాను చెప్పాడు; “మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము” (1 యోహాను 2:3). నిత్యజీవం అనుగ్రహించే జ్ఞానంలో ప్రేమ ఉంది; “మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము” (1 యోహాను 3:14).
(3) గ్రంథం చారిత్రక సందర్భం గురించి మనకు ఏం తెలుసు?
ఇలా ప్రసంగించే ప్రసంగికుని గురించి ఆలోచించండి, “ఒక క్రైస్తవుడు భార్యను ఎలా పొందుకోవాలో నేడు నేను ప్రకటించబోతున్నాను. న్యాయాధిపతులు 21:20-21 సెలవిస్తుంది, మనం పొరుగు గ్రామానికి వెళ్లి, పొదల మాటున వేచియుండాలని. గ్రామంలో నుండి ఒక స్త్రీ వచ్చిన వెంటనే, ఆమెను పట్టుకుని, ఇంటికి పారిపోవాలి. భార్యను ఎన్నుకోవడానికి ఇది బైబిల్ అందించే నమూనా.” మీరు ఈ ప్రసంగికుడు ఇచ్చే లేఖన అన్వయాన్ని అనుమానించాలి!
బోధకుని అన్వయంలో ఉన్న తప్పు ఏంటి? బెన్యామీను గోత్రపు పురుషులు, ఒక సందర్భంలోనే ఈ విధంగా భార్యలను పొందారని న్యాయాధిపతులు సెలవిస్తుంది. ఒక మంచి కారణంతో చేశారని కూడా సెలవిస్తుంది- ఇశ్రాయేలు గోత్రాల్లో ఒకదానిని రక్షించడానికి ఇలా చేశారు. అయితే, ప్రసంగికుడు చారిత్రక సందర్భాన్ని పట్టించుకోలేదు. ఈ కథ న్యాయాధిపతులు గ్రంథం చివర్లో వస్తుంది, దేవుని ప్రణాళికలో నుండి ఇశ్రాయేలు ఎలా దిగజారిపోయిందో ఈ పుస్తకం చూపిస్తుంది. వివాహ విషయంలో దేవుని ప్రణాళిక చూపించడానికి బదులుగా, దేవుని ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఏం జరుగుతుందో ఈ కథ చూపిస్తుంది.
కొన్నిసార్లు మనకు రచయిత లేక శ్రోతలు గురించి పెద్దగా తెలీదు కాని చారిత్రక సందర్భం తెలుసు. రూతు గ్రంథం ఎవరు రాశారో మనకు తెలీదు, కాని న్యాయాధిపతులు పాలించిన కాలంలో జరిగిన సంఘటనలు మనకు తెలుసు (రూతు 1:1). ఇది, ఇశ్రాయేలు పరిస్థితి అస్తవ్యస్తంగానున్న కాలం (న్యాయాధిపతులు 21:25). ఇశ్రాయేలీయులు దేవుని యెడల చూపిన అవిశ్వాసానికి భిన్నంగా, రూతు గ్రంథం, మోయాబీయురాలును, విధవరాలైన రూతు విశ్వాసంపై దృష్టిపెడుతుంది.
చనిపోయిన నయోమి కుమారులకు న్యాయబద్ధమైన వారసుడిని ఇవ్వటానికి, బోయజు రూతును ఎలా నిస్వార్థంగా వివాహం చేసుకున్నాడో ఈ కథ చెబుతుంది. బంధువు-విమోచకుడుగా, నయోమికి కుమారుడిని ఇవ్వాలని బోయజు తన వ్యక్తిగత స్వాస్థ్యపు హక్కులు త్యాగం చేశాడు. అలా చేయడంవల్ల, బోయజు దావీదు వంశావళిలో స్థానం పొందాడు (మత్తయి 1:6, 16).
యోనా గ్రంథాన్ని భాష్యం చెప్పేటప్పుడు చారిత్రక నేపథ్యం ముఖ్యం:
యోనా నీనెవెలో ప్రకటిస్తున్న అదే సమయంలో, ఇశ్రాయేలుపై దేవుని తీర్పు అష్షూరీయుల ద్వార వస్తుందని ఆమోసు మరియు హోషేయ హెచ్చరించారు.
మానవ దృక్పథంలో, యోనా అష్షూరీయులకు ప్రకటించటానికి ఎందుకు ఇష్టపడలేదో అర్థమౌతుంది. యోనా గ్రంథం దేవుని దృక్పథం చూపిస్తుంది, ఏ మినహాయింపు లేకుండా ప్రజలందరినీ ప్రేమించే దేవుని దృక్పథం.
(4) గ్రంథం సాంస్కృతిక నేపథ్యం గురించి మనకు ఏం తెలుసు?
లేఖనపు చారిత్రక-సాంస్కృతిక సందర్భం కూడా బైబిల్ ప్రపంచంలోని సాంస్కృతిక ఆచారాలను చూస్తుంది. మొదటి శతాబ్దపు పాలస్తీనా ఆచారాల నేపథ్యంలో యేసు ఉపమానాలు చదివినప్పుడు, క్రొత్త అవగాహనలు పొందుతాం:
మంచి సమరయుడు ఉపమానం (లూకా 10:30-35) యూదా శ్రోతలకు ఆశ్చర్యకరం. గాయపడిన ప్రయాణికుడికి సహాయం చేయడంలో మతాధికారులు విఫలమైనప్పుడు యేసు శ్రోతలు ఆశ్చర్యపడలేదు. అయితే, ఆ రక్షించేవాడు రబ్బీ లేక పరిసయ్యుడని వారు అనుకున్నారు. డానికి బదులుగా, యేసు ప్రేమకు మాదిరిగా తృణీకరించిన సమరయుని సూచించాడు.
తప్పిపోయిన కుమారుని ఉపమానంలో (లూకా 15:11-32), యూదుల తండ్రులు గౌరవించబడ్డారని గుర్తుంచుకోవాలి. తండ్రి, కుమారుడిని తిరిగి చేర్చుకోవడానికి నిరాకరించాడు లేక బహుశా దాసుడుగా అంగీకరించాడని శ్రోతలు వినాలనుకున్నారు. దానికి బదులుగా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన ఆనందంలో తండ్రి తన గౌరవాన్ని ప్రక్కన పెట్టాడు. ఈ చర్య ఆశ్చర్యకరం కాబట్టి, కొన్ని తూర్పు సంస్కృతులు ఈ కథను “పరిగెడుతున్న తండ్రి ఉపమానం” అని పిలుస్తారు. అదే విధంగా, మనం క్షమాపణ సంపాదించుకోవాలని మన కోసం వేచియుండడు; బదులుగా, తిరుగుబాటు చేసే పాపుల కోసం వెదకుతాడు. ఇది అపారమైన ప్రేమను చూపించే తండ్రి చిత్రం.
పౌలు పత్రికలను మొదటి శతాబ్దపు సాంస్కృతిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ చదవాలి. ఎఫెసీయులకు 5:21–6:9 పౌలు శ్రోతలకు దిగ్భ్రాంతి కలిగించింది. భార్య భర్తకు లోబడాలనే పౌలు ఆజ్ఞ సాధారణమైంది. భర్తలు క్రీస్తు తనను తాను త్యాగం చేసుకున్న మాదిరిని అనుసరించాలనే ఆజ్ఞ, రోమా శ్రోతలకు నూతనమైంది. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపాలి, కాని వారు తమ పిల్లలకు కోపం రేపకూడదని రోమా ప్రపంచంలో తండ్రులకు ఎవరు చెప్పలేదు.
పౌలు ఫిలిప్పీయులకు, తమ పౌరత్వం పరలోకంలో ఉన్నట్లుగా జీవించమని చెప్పినప్పుడు (ఫిలిప్పీ. 3:20), రోమా సామ్రాజ్యంలో ప్రత్యేక పౌరసత్వ అధికారాలు కలిగియున్న పట్టణానికి అతడు రాస్తున్నాడు. ఆ పట్టణం, పదవి విరమణ చేసిన సైనికుల నివాసం కోసం స్థాపించారు కాబట్టి, ఫిలిప్పీ పట్టణస్తులు తమ పౌరత్వానికి ఎంతో విలువిచ్చారు. తమ నిజమైన పౌరస్థితి పరలోకంలో ఉందని, భూలోక పట్టణంలో కాదని పౌలు గుర్తుచేశాడు. ఈ చారిత్రక-సాంస్కృతిక నేపథ్యం తెలుసుకోవడం వల్ల, ఫిలిప్పీయులకు రాసిన పత్రికపై మంచి అవగాహన లభిస్తుంది.
చారిత్రక-సాంస్కృతిక సందర్భం కనుగొనడం
మనం చూసినట్లుగా, ఒక వాక్యభాగంపై చారిత్రక-సాంస్కృతిక సందర్భం గురించిన మన అధ్యయనం, ప్రశ్నలు అడగటంతో మొదలౌతుంది. మన ప్రశ్నలకు జవాబులు ఎలా కనుగొంటాం? జవాబులు అందించే కొన్ని బైబిల్ అధ్యయన వనరులు గురించి కోర్సు అనుబంధం (appendix) వివరిస్తుంది. Shepherds Global Classroom అందించు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన పరిచయ కోర్సులు కూడా మీరు ఉపయోగించవచ్చు. ఈ కోర్సులు బైబిల్ లోని ప్రతి పుస్తకానికి నేపథ్యం అందిస్తాయి.
[1]చిత్రం: “Interpreting the Bible” Anna Boggs చేతి చిత్రణ, https://www.flickr.com/photos/sgc-library/52377290578 నుండి అందుబాటులో ఉంది, CC BY 2.0 కింద లైసెన్స్ పొందింది. J. Scott Duvall మరియు J. Daniel Hays యొక్క ఆలోచన, Grasping God’s Word (Grand Rapids: Zondervan, 2012).
బైబిల్ సందర్భం
బైబిల్ భాష్యానికి మరొక పరిశీలన, చుట్టూ ఉన్న సందర్భం. “ఈ వచనం, వాక్యభాగం, అధ్యాయం, మరియు పుస్తకం మిగిలిన బైబిల్ అంతటిలో ఎలా సరిపోతుంది?” అని అడగటం ముఖ్యం.
లేఖలో, చిరిగిన ఒక కాగితపు ముక్క మీకు దొరికిందని అనుకోండి. ఆ కాగితంలో, “అవును, 7 చాలు” అని రాసి ఉంది. ఆ వాక్యం అర్థం ఏంటి?
బహుశా రచయిత ఎవరినో కలవాలి. సమావేశం రాత్రి 7:00 కు అయితే మంచిదని అతడు ధృవీకరిస్తున్నాడు.
బహుశా రచయిత భార్య “శుక్రవారం రాత్రి ఎంతమందిని భోజనానికి పిలవాలి?” అని అడిగింది. అప్పుడతడు, “ఏడు (ప్రజల సంఖ్య) చాలు” అని చెప్పాడు.
బహుశా రచయిత పుస్తకం $8.00కు అమ్మమని చెప్పాడు. “$7.00కి ఇస్తారా?” అని ఎవరో అడిగారు. అప్పుడా రచయిత, “అవును, $7 చాలు” అని చెప్పాడు.
సందర్భం తెలిసినప్పుడే, ఆ ఒక్క వచనాన్ని మనం అర్థం చేసుకోగలం. మనం వాక్యభాగమంతటి (paragraph) సందర్భంలో వాక్యం (sentence) చదువుతాం. పత్రిక అంతటి సందర్భంలో వాక్యభాగం చదువుతాం. విస్తృతంగా, ఇద్దరు వ్యక్తుల మధ్య వరుస పత్రికల సందర్భంలో మనం పత్రికను చదవవచ్చు.
లేఖనం ఒకే విధంగా పనిచేస్తుంది. నిర్దిష్ట వచనాలను (individual verses) దాని చుట్టూ ఉన్న వచనాలు, అధ్యాయం, మరియు పుస్తకమంతటి సందర్భంలో చదవాలి. సందర్భం, తక్షణ వాక్యభాగం నుండి మొత్తం బైబిల్ సందర్భంపై దృష్టి సారిస్తుంది.
వచనాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే, చుట్టూ ఉన్న సందర్భాన్ని చూడాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందించే వ్యక్తికి కీర్తన 1:3 అద్భుతమైన వాగ్దానం ఇస్తుంది. అతడు నీటికాలువల యోరను నాటబడి, ఫలమిచ్చు చెట్టువలె ఉంటాడు. “అతడు చేయునదంతయు సఫలమగును.” ఇది ప్రతి నమ్మకమైన విశ్వాసికి అనుగ్రహించబడే భౌతిక సంబంధమైన శ్రేయస్సు గురించిన వాగ్దానమని కొందరు చెబుతారు.
అయితే మీరు కీర్తన 1చదివినప్పుడు, అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలపై దృష్టి ఉంచదుగాని దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నడిచేవారి ఆత్మీయ అభివృద్ధిపై దృష్టిసారిస్తుంది. కీర్తన వాగ్దానంతో ముగుస్తుంది; “నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును” (కీర్తన 1:6). వ్యత్యాసం, దేవుని మార్గం (చూసి, దేవుడు ఆమోదించే) మరియు నాశన మార్గం మధ్య ఉంది.
మిగిలిన కీర్తనలను మరియు బైబిల్ అంతటిని అనుసరించి, ఈ సందేశం ధృవీకరించవచ్చు. విశ్వాసి శ్రేయస్సు, భౌతిక ఆస్తులలో కాదుగాని దేవుని ఆమోదంలో ఉంది. ఇది నిజమైన శ్రేయస్సు.
సందర్భానుసారంగా వాక్యభాగం చదవాలంటే, ఈ మూడు దశలు అనుసరించండి:
1. పుస్తకాన్ని భాగాలుగా ఎలా విభజించాలో నిర్ణయించుకోండి. మీరు చదువుతున్న వచనం యొక్క తక్షణ సందర్భం ఏంటి?
2. ఒకటి లేక రెండు వాక్యాల్లో వాక్యభాగంలోని ప్రధాన ఆలోచనను సంగ్రహించండి. ఆ భాగమంతటి సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
3. పుస్తకమంతటిని చదివి, “నేను చదువుతున్న వాక్యభాగం పుస్తక సందేశానికి ఎలా సరిపోతుంది?” అని అడగండి.
బైబిల్ మొత్తం > పుస్తకం మొత్తం > భాగం లేక అధ్యాయం > వచనం
బైబిల్ > పౌలు పత్రికలు > రోమా > రోమా 12-15 > రోమా 12:1-2
రోమా 12:1-2 దేవునికి పూర్తిగా సమర్పించుకోవాలని మనల్ని పిలుస్తుంది.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
ఈ సమర్పణ క్రైస్తవుని అనుదిన జీవితంలో ఎలా కనిపిస్తుందో చూపించే వాక్యభాగాన్ని ఇది ఆరంభిస్తుంది (రోమా 12-15). తక్షణ సందర్భం నుండి రోమా 12-15, దేవునితో సంబంధం విషయంలో మనం ఎలా సరిచేయబడ్డామో చూపించే సిద్ధాంతపరమైన 11 అధ్యాయాల తరువాత వస్తుంది.
రోమా సందర్భం కాకుండా, పౌలు రాసిన ప్రతి పత్రిక, క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలనే తన ఆసక్తిని చూపిస్తుంది. చివరిగా రోమా 12:1-2, దేవునికి విధేయత చూపాలి, ఆయనకు సమర్పించుకోవాలనే బైబిల్ సందేశమంతటికీ సరిపోతుంది. ఉదాహరణకు, రోమా 12:1-2 భాష, లేవీయకాండములో బల్యర్పణ భాషను ప్రతిబింబిస్తుంది. మనం బైబిల్ అంతటి సందర్భాన్ని మంచిగా అర్థం చేసుకుంటే, పౌలు మాటలు అంత శక్తివంతంగా ఉంటాయి.
మీ వంతు
► క్రింద ఇచ్చిన ప్రతి వచనం చదివి, వాటి తక్షణ సందర్భం చదవండి. వచనంపై మీ అవగాహనను సందర్భం ఎలా ప్రభావితం చేసిందో చర్చించండి.
1. మత్తయి 18:20 చదవండి. దాని అర్థం ఏంటి?
2. ఇప్పుడు మత్తయి 18:15-20 చదవండి. ఇది 18:20 అర్థాన్ని ప్రభావితం చేస్తుందా?
1. రోమా 8:28 చదవండి. ఇది ఏం వాగ్దానం చేస్తుంది?
2. ఇప్పుడు రోమా 8:28-30 చదవండి.? 8:28లో మంచి వాగ్దానం ఏంటి?
1. ప్రకటన 3:20 చదవండి. ఎవరు ఆహ్వానితులు?
2. ఇప్పుడు ప్రకటన 3:14-21 చదవండి. ఈ ఆహ్వానం ఎవరికి ఉద్దేశించినది?
సందర్భాన్ని అధ్యయనం చేయడంలో ఎదురయ్యే సాధారణ తప్పులు
ఈ పాఠం ముగించడానికి, లేఖన సందర్భం అధ్యయనం చేసేటప్పుడు భాష్యకర్తలు చేసే కొన్ని సాధారణ తప్పులు చూద్దాం.
సరిగా లేని సమాచారం ఉపయోగించడం
ఒక విద్యార్థి మత్తయి 19:23-26పై వివరణ ఇచ్చాడు. యేసు కాలంలో యెరూషలేముకు వెళ్ళే ఒక గుమ్మాన్ని “సూదిబెజ్జము” అని పిలిచేవారు. ఈ గుమ్మం చాలా క్రిందికి ఉండడం వలన, ఒంటె ఆ గుమ్మంలో పట్టడానికి దానిపై ఉన్న ఆ భారాన్ని దించేవారని చెప్పాడు.
విద్యార్థి వివరణలో రెండు సమస్యలు ఉన్నాయి:
1. యేసు కాలంలో ఈ గుమ్మానికి ఏ చారిత్రక ఆధారం లేదు. “సూదిబెజ్జము” అంటే, యేసు కాలంలో దాని అర్థం ఏంటో ఇప్పుడు కూడా అదే అర్థం, కుట్టు సూది బెజ్జం.
2. అతని నేపథ్య సమాచారం తప్పు కాబట్టి, విద్యార్థి లేఖన విషయంలో తప్పుడు నిర్ణయానికి వచ్చాడు. అతని ప్రదర్శన, మన జీవితంలో అదనపు వాటిని విడిచిపెట్టి, పరలోకరాజ్యంలో ప్రవేశించాలని సూచిస్తుంది.
అయితే, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ధనవంతులకు, బలవంతులకు చాలా కష్టమని యేసు బోధించలేదు; అది అసాధ్యమని బోధించాడు! శిష్యులు దీనికి బాగా ఆశ్చర్యపోయి, “ఎవడు రక్షణపొందగలడని?” ప్రశ్నించారు.
“అది కష్టమే, కాని మీరు కష్టపడి ప్రయత్నిస్తే ప్రవేశించగలరు” అని యేసు చెప్పలేదు. ఆయన సువార్త సుసమాచారంతో స్పందించాడు: “ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని.” సందర్భం అధ్యయనం చేసేటప్పుడు, తప్పుడు సమాచారం మిమ్మల్ని తప్పు దారిలో నడపించకుండ జాగ్రత్తపడండి.
సందేశం కంటే సందర్భం అధ్యయనానికి ప్రాధాన్యతనివ్వాలి
రెండవ అతి పెద్ద ప్రమాదం, వాక్యభాగ సందేశం కంటే సందర్భ అధ్యయనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం. తప్పుడు జ్ఞానం ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయునని పౌలు కొరింథీ క్రైస్తవులకు జ్ఞాపకం చేశాడు (1 కొరింథీయులకు 8:1).[1] మనం అధ్యయనం చేస్తున్న వాక్యభాగ సందేశం మర్చిపోయేంతగా, సందర్భం యొక్క వివరాల ఆకర్షణలో పడిపోవడం సాధ్యం.
ఒక వ్యక్తి సమరయ సంస్కృతి గురించి అంతా నేర్చుకుని, “నీవును వెళ్లి ఆలాగు చేయుమని” (లూకా 10:37) చెప్పిన మంచి సమరయుని ఉపమాన ఉద్దేశ్యం మర్చిపోవచ్చు. ఈ సందర్భంలో, మన జ్ఞానం వ్యర్థం. లేఖన సందేశం అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయండి; దానికోసమే అధ్యయనంలో మునిగిపోవద్దు. మీ గొప్ప జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగిపోకుండా, మరింత ప్రభావవంతంగా ప్రసంగించడానికి, బోధించటడానికి అధ్యయనం చేయండి!
[1]పౌలు జ్ఞానానికి వ్యతిరేకి కాదు; యువ సంఘాలకు మంచి బోధనను అందించటానికి అతడు తన పత్రికలు రాశాడు. అయితే, కొరింథీయుల అతిశయ “జ్ఞానము” క్షేమాభివృద్ధి కలిగించక, నాశనము కలిగించింది.
(1) సరైన భాష్యానికి, ఏదైన ఒక లేఖనభాగ సందర్భాన్ని అధ్యయనం చేయటం అవసరం.
(2) చారిత్రక-సాంస్కృతిక సందర్భం, బైబిల్ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఇలా అడుగుతుంది:
బైబిల్ రచయిత గురించి మనకు ఏం తెలుసు?
బైబిల్ శ్రోతలు గురించి మనకు ఏం తెలుసు?
గ్రంథం చారిత్రక సందర్భం గురించి మనకు ఏం తెలుసు?
గ్రంథం సాంస్కృతిక నేపథ్యం గురించి మనకు ఏం తెలుసు?
(3) ఒక వచనం మిగిలిన బైబిల్ అంతటికి ఎలా సరిపోతుందో, బైబిల్ సందర్భం పరిగణిస్తుంది.
పాఠం 5 అభ్యాసం
పాఠం 1లో, ఈ కోర్సు సమయంలో అధ్యయనం చేయడానికి ఒక వాక్యభాగం ఎన్నుకున్నారు. మీరు ఎంచుకున్న వాక్యభాగపు చారిత్రక-సాంస్కృతిక, బైబిల్ ఆధారిత సందర్భం అధ్యయనం చేయండి. సందర్భం గురించి ఈ పాఠంలోని చర్చకు అనుగుణంగా సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలకు జవాబిస్తూ ఒక పేజిని సిద్ధం చేయండి.
ఇలా అడగండి:
రచయిత ఎవరు?
అతడు ఎప్పుడు రాశాడు?
అతని నేపథ్యం ఏంటి?
అతని శ్రోతలు ఎవరు?
వారి సమస్యలు ఏంటి?
వాక్యభాగం చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి?
ఈ పుస్తక సమయంలో, జరిగిన చారిత్రక సంఘటనలు ఏంటి?
ఈ పుస్తక వివరణకు సహకరించే సాంస్కృతిక విషయాలు ఏంటి?
వాక్యభాగపు బైబిల్ సందర్భాన్ని నిర్ణయించడానికి అధ్యాయాన్ని చదవండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.