1వ పాఠంలో మీకు జియన్హోంగ్ గుర్తున్నాడా? జియన్హోంగ్ ప్రతిరోజు బైబిల్ చదివాడు, కాని అతడు చదువుతున్న వాక్యం ద్వారా దేవుని స్వరం వినలేదు. ఏం పొరపాటు జరిగింది? జియన్హోంగ్ చదివిన దానిని వ్యాఖ్యానించడానికి ప్రక్రియ లేదు. అతడు చదివాడు, కాని గ్రహించలేదు.
[1]చదివి, గ్రహించని ఒక వ్యక్తి గురించిన కథను అపొస్తలుల కార్యములు 8 చెబుతుంది. ఫిలిప్పు, ఆదిమ సంఘంలో పరిచారకుడు. అతను యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గంలో పరిశుద్ధాత్మ అతన్ని నడిపించాడు. అక్కడ అతడు యెరూషలేము దేవాలయంలో ఆరాధన ముగించుకుని తిరిగి వస్తున్న ఐతియొపీయ అధికారిని కలిశాడు. ఆ అధికారి ప్రయాణంలో యెషయా గ్రంథం చదువుతున్నాడు.
“నీవు చదువునది గ్రహించుచున్నావా?” (అపొస్తలుల కార్యములు 8:30) అని ఫిలిప్పు అధికారిని అడిగాడు. అప్పుడా అధికారి, “ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని” (అపొస్తలుల కార్యములు 8:31) చెప్పాడు. ఫిలిప్పు దేవుని వాక్యం వివరిస్తుండగా, అతను యేసును దేవుని కుమారునిగా అంగీకరించి, నూతన విశ్వాసిగా బాప్తిస్మం పొందాడు.
మనం చదివిన దానిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వచ్చే కొన్ని పాఠాల్లో, లేఖనాన్ని అర్థం చేసుకొనే ప్రకియను అధ్యయనం చేస్తాం. బాష్యానికి ఆచరణాత్మక దశలు నేర్చుకుంటాం.
“నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకా రము నడుచుకొందును.”
- కీర్తన 119:34
బాష్యం ప్రాముఖ్యత
ముగ్గురు న్యాయమూర్తులు కోర్టులో తమ పని గురించి చర్చించుకుంటున్నారు. మొదటి న్యాయమూర్తి చెప్పాడు, “దోషులు ఉన్నారు, నిర్దోషులు ఉన్నారు. వారెవరో గుర్తిస్తాను.” సంపూర్ణ సత్యం ఉందని ఈ న్యాయమూర్తి నమ్మాడు. దోషులు ఉన్నారు, నిర్దోషులు ఉన్నారు, నిజం ఏంటనేది ప్రకటించడమే న్యాయమూర్తి పని.
రెండవ న్యాయమూర్తి చెప్పాడు, “దోషులు ఉన్నారు, నిర్దోషులు ఉన్నారు. ఒక వ్యక్తి దోషియా లేక నిర్దోషియా అనేది గ్రహించడానికి ప్రయత్నిస్తాను. సంపూర్ణ సత్యం ఉందని ఈ న్యాయమూర్తి నమ్మాడు, కాని ఒక వ్యక్తి విషయంలో తన అభిప్రాయం తప్పు కావచ్చని కూడా గ్రహించాడు.
మూడవ న్యాయమూర్తి చెప్పాడు, “నేను నా తీర్పు చెప్పే వరకు ఒక వ్యక్తి దోషి కాదు లేక నిర్దోషి కాదు.” ఈ న్యాయమూర్తి సంపూర్ణ సత్యం నమ్మడు. అతని తీర్పులో నిజముందని భావిస్తాడు.
బాధకలిగించే విషయమేమిటంటే, లేఖనానికి సంపూర్ణ అర్థం ఉందని చాలామంది విశ్వాసులు నమ్మరు. వారు ఇలా చెబుతారు, “మీ విషయంలో ఏది నిజమో నా విషయంలో అది నిజం కాకపోవచ్చు.” ఈ దృక్పథం ప్రకారం, ప్రతి పాఠకుడు తన సొంత “సత్యం” సృష్టించుకుంటాడు. బైబిల్ ప్రకటన అంటే వారు దానికి ఇచ్చే అర్థమేనని భావిస్తారు.
కథలోని రెండవ న్యాయమూర్తివలే, క్రైస్తవులు రెండు ముఖ్య సత్యాలను గ్రహించాలి:
1. లేఖన అర్థం సంపూర్ణం, మరియు వాక్యభాగంలో దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మన పని.
2. మన అవగాహన పరిమితిగలది. కాబట్టి, మన బాష్యం తప్పు కావచ్చు. మనం వినయంగా ఉండాలి.
పరిశీలన దశలో, “వాక్య భాగంలో నేను ఏం చూడాలి?” అని అడిగాం. బాష్య దశలో, “వాక్యభాగ అర్థం ఏంటి?” అని అడిగాం. తర్వాత, మన జీవితాల్లో లేఖన అన్వయం గురించి చూద్దాం.
“రచయిత ఏం చెప్పాలని ఆశించాడు?” అని అడుగుతూ బాష్యం ప్రక్రియ మొదలుపెడదాం. ఇది మనల్ని “ఈ లేఖనం నాకు ఎలా వర్తిస్తుంది?” అనే ప్రశ్నకు సిద్ధపరుస్తుంది.
సరైన బాష్యానికి సవాళ్లు
బైబిల్ వంటి ప్రాచీన వాక్యభాగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఆధునిక పాఠకులకు అనేక సవాళ్లు ఉన్నాయి. మొదటి రచయిత నుండి సమయం, దూరం మనలను వేరు చేస్తుంది కాబట్టి బాష్యం కష్టంగా ఉంటుంది. మనం వేరొక భాష మాట్లాడుతాం. మన సంస్కృతి, బైబిల్ రచయిత సంస్కృతికి భిన్నమైంది.
మన కాలానికి, బైబిల్ ను బాష్యం చేసేటప్పుడు ఎదుర్కొనే సవాళ్లను ఈ చిత్రం చూపిస్తుంది. బైబిల్ ను ప్రాచీన లోకం కోసం రాశారు (1), మొదటి పాఠకులు నేటి పాఠకుల కంటే భిన్న సంస్కృతిలో జీవించారు. (2) వారి ప్రపంచాన్ని నేటి ప్రపంచం నుండి వేరు చేసే నది, బైబిల్ అవగాహనను మనకు మరింత కష్టతరం చేస్తుంది. ఈ నది మన సంస్కృతి మరియు బైబిల్ ప్రపంచానికి మధ్య వ్యత్యాసాలతో రూపించబడింది. ఆధునిక పాఠకునికి, అసలు రచయితకు మధ్య వ్యత్యాసం ఏంటి?
భాష వ్యత్యాసాలు
బైబిల్ ను మూడు భాషల్లో రాశారు: హెబ్రీ, గ్రీకు మరియు అరమాయిక్. నేడు, చాలామంది బైబిల్ ను తమ సొంత భాషలో చదువుతున్నారు. ఇది మనకు, రచయితకు మధ్య దూరాన్ని కలిగిస్తుంది. రెండవ భాష మాట్లాడేవారు భాషలో కష్టాలు అర్థం చేసుకుంటారు.
సాంస్కృతిక వ్యత్యాసాలు
భాషలో కష్టాలు ఉన్నట్లే సాంస్కృతిక వ్యత్యాసం వలన కూడా కష్టాలు ఉన్నాయి. లేఖన రచయితల సంస్కృతికి మన ప్రపంచానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మనం లేఖనం అధ్యయనం చేసేటప్పుడు, “బైబిల్ సందేశాన్ని ఉత్తమంగా అర్థం చేసుకుని, బాష్యం చేయటానికి సహాయపడే ప్రాచీన లోక సంస్కృతి గురించి నేను ఏమి నేర్చుకోగలను?” అని అడగాలి.
తెలియని భౌగోళిక పరిస్థితులు
బైబిల్లో జరిగిన సంఘటనలు, నిజమైన ప్రదేశాల్లో నివసించే నిజమైన ప్రజలకు సంభవించినవి. మనం భూగోళశాస్త్రాన్ని ఎంత మంచిగా అర్థం చేసుకుంటే, మన ప్రపంచాన్ని వారి ప్రపంచాన్ని వేరు చేసే నదిని అంత మంచిగా దాటగలుగుతాం.
యెరూషలేము నుండి యెరికోకు వెళ్లే మార్గం ప్రమాదకరమైన కొండ ప్రాంతమని తెలుసుకోవడం వలన, యాజకుడు లేవీయుడు జాగ్రత్తపడ్డారని వివరిస్తుంది (లూకా 10:31-32). గాయపడిన వ్యక్తికి సహాయం చేయడానికి తన సొంత ప్రాణాన్ని పణంగా పెట్టిన సమరయుని కనికరాన్ని కూడా ఇది అభినందిస్తుంది. (లూకా 10:33-34).
“మార్కు 6లో, 5,000మందికి ఆహారం పెట్టిన తర్వాత మార్కు 8లో 4,000మందికి ఆహారం పెట్టే సామర్థ్యాన్ని శిష్యులు ఎందుకు అనుమానించారు?” అని పాఠకులు అడిగారు. పటం జవాబిస్తుంది. మార్కు 7లో, యేసు దెకపొలి వెళ్లాడు, ఇది అన్యజనుల ప్రాంతం. శిష్యులకు, “యేసు వీరికి ఆహారం పెట్టగలడా?” అనేది ప్రశ్న కాదు, కాని “ఆయన వారికి ఆహారం పెడతాడా?” అనేది ప్రశ్న. అన్యజనులు కూడా అదే అద్భుతానికి అర్హులని వారు నమ్మలేదు. యేసు ప్రజలందరి కోసం వచ్చాడని వారు ఇంకా గ్రహించలేదు.
మార్కు 6
మార్కు 7
మార్కు 8
ప్రదేశం
గలిలయ
ప్రయాణం
దెకపొలి
ప్రజలు
యూదులు
-
అన్యజనులు
యేసు గలిలయ సముద్రంలో తుఫానును ఎలా గద్దించాడో మార్కు 4 సెలవిస్తుంది. బైబిల్ అట్లాస్ లో, గలిలయ సముద్రం ఒక పెద్ద సరస్సు అని, సముద్ర మట్టానికి 210 మీటర్లు దిగువన ఉందని మనం నేర్చుకుంటాం. సరస్సు చుట్టూ ఉన్న ఎత్తైన ప్రదేశం ఒక గొట్టంలాగా పనిచేస్తుంది కాబట్టి, గాలులు కొన్ని నిమిషాల్లోనే పెద్ద తుఫానుగా మారిపోతాయి. ఈ సముద్రంలో జాలర్లుగా తమ జీవితాలు గడిపిన శిష్యులు పెద్ద పెద్ద తుఫానులకు అలవాటుపడ్డారు. వారు తమ ప్రాణాలు గురించి భయపడ్డారనేది వాస్తవం, అది సాధారణ తుఫాను కాదని తెలియజేస్తుంది. ఇది అసాధారణమైన శక్తివంతమైన తుఫాను, కాని దానిని నెమ్మదిపరచడానికి యేసు కొన్ని మాటలే పలికాడు. “ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని” (మార్కు 4:36-41) వారు ఆశ్చర్యపోయారు.
తెలియని సాహిత్య రూపాలు
ప్రతి విధమైన సాహిత్యాన్ని వేరుగా చదవాలి. మనం రోమా పత్రిక చదివేటప్పుడు, మనం దేవునితో ఎలా సరిచేయబడ్డామో పౌలు చూపిస్తుండగా, అతని వాదన జాగ్రత్తగా గమనించాలి. ఉపమానం చదివేటప్పుడు , ఒక అద్భుతమైన కథ ద్వారా కథకుడు బోధించడం వింటాం.
ముగింపు
చిత్రాన్ని మళ్ళీ చూడండి. భాష, సంస్కృతి, భూగోళం, సాహిత్యమనే నది మనలను వేరు చేస్తున్నప్పటికీ, బైబిల్ సందేశం సంస్కృతులన్నిటితో మాట్లాడుతుంది. ఇది (3) నదిపై వంతెన. ఈ వంతెన బైబిల్ బోధించే సూత్రాలతో రూపించబడింది. ఈ సూత్రాలు యుగాల్లోని సంస్కృతులన్నిటికి వర్తిస్తాయి.
(4) బైబిల్ కథలో మనం యెక్కడున్నామో గమనించాలని పటం అడుగుతుంది. క్రీస్తు రాకడ పాత నిబంధన నియమాలను, అనేక ప్రవచనాలను నెరవేర్చింది. దీన్ని జ్ఞాపకం ఉంచుకోవడం వలన, లేఖనాలను అర్థం చేసుకొని, అన్వయించే మన విధానం మారుతుంది.
చివరిగా, నేటి మన ప్రపంచానికి వచ్చేశాం. (5). ఈ దశలో, మనం కనుగొన్న సూత్రం (3) మన ప్రపంచానికి ఎలా అన్వయిస్తుందో అని అడుగుతాం.
రాబోవు పాఠాల్లో ఈ చిత్రాన్ని మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికి, మీరు దశలు గురించి తెలుసుకోవాలి.
[1]చిత్రం: “Interpreting the Bible” Anna Boggs చేతి చిత్రణ, https://www.flickr.com/photos/sgc-library/52377290578 నుండి అందుబాటులో ఉంది, CC BY 2.0 కింద లైసెన్స్ పొందింది. J. Scott Duvall మరియు J. Daniel Hays యొక్క ఆలోచన, Grasping God’s Word (Grand Rapids: Zondervan, 2012).
బైబిల్ కి భాష్యం చెప్పేవారు చేసే సాధారణ తప్పులు
బైబిల్ బాష్యకర్తలు అనేక సాధారణ తప్పులు చేస్తుంటారు.
వాక్యభాగాన్ని తప్పుగా చదవటం
“ధనం సమస్తమైన కీడులకు మూలము” అని పౌలు చెప్పినట్లుగా కొందరు ప్రసంగికులు ప్రసంగించారు. అయితే పౌలు అలా చెప్పలేదు! “ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము” (1 తిమోతికి 6:10) అని చెప్పాడు. ధనాన్ని ప్రేమించకుండా, దానిని కలిగియుండటం సాధ్యమే, మరియు ధనం లేనప్పటికీ దానిని ప్రేమించడం కూడా సాధ్యమే. పౌలు హెచ్చరిక ప్రధానంగా ధనానికి సంబంధించింది కాదు; ధనాపేక్షగల హృదయానికి సంబంధించింది.
కొందరు క్రైస్తవులు కీర్తన 37:4ను తప్పుగా చదివి ఇలా చెబుతారు, “దేవుడు నా హృదయ వాంఛలు తీర్చుతానని వాగ్దానం చేశాడు. నేను ఐశ్వర్యవంతుడిని కావాలి, కాబట్టి దేవుడు నన్ను ఐశ్వర్యవంతుడ్ని చేస్తాడు.” అయితే “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” అని కీర్తనాకారుడు చెప్పాడు. మనం యెహోవానుబట్టి సంతోషిస్తే, దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడని కీర్తన వాగ్దానం చేస్తుంది. తర్వాత, మనం నీతికొరకు ఆకలిదప్పులు గలవారుగా ఉంటే, నీతితో తృప్తిపరచబడతామని యేసు వాగ్దానం చేశాడు (మత్తయి 5:6). ఈ వాగ్దానం ఆర్ధిక శ్రేయస్సు గురించి కాదు; దానికంటే ఉత్తమైన - ఆత్మీయ శ్రేయస్సును గురించిన వాగ్దానం.
ఈ కోర్సులో మనం నేర్చుకున్న మొదటి దశ, పరిశీలన. మన పరిశీలనలు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే మనం వాక్యానికి బాష్యం చెప్పే విషయంలో పొరపాట్లు చేసే ప్రమాదం ఉంది. వాక్యభాగాన్ని తప్పుగా చదవకుండా జాగ్రత్తపడండి. ఇవి బైబిల్ అధ్యయనంలో మొదటి మూడు దశలు అని ఎవరో చెప్పారు:
1. వాక్యభాగం చదవటం.
2. వాక్యభాగం మళ్లీ చదవటం
3. 2వ దశ తర్వాత, వాక్యభాగం మళ్లీ చదవటం!
వాక్యభాగాన్ని వక్రీకరించడం
చరిత్ర అంతటా, అబద్ధ బోధకులు తమ తప్పులు సమర్థించుకోవడానికి లేఖనాలను వక్రీకరించారు. కొందరు, ఉద్దేశ్యపూర్వకంగా పాపంలో కొనసాగాలనే తమ కోరికను సమర్థించుకోవడానికి, విశ్వాస మూలంగానే నీతిమంతులుగా తీర్చబడతారను తన బోధను వక్రీకరిస్తారని పౌలు హెచ్చరించాడు (రోమా 6:1-2). బానిసత్వాన్ని సమర్ధించడానికి లేక ప్రభుత్వం ఒక జాతి ప్రజలను హత్య చేసే విధానాన్ని సమర్ధించడానికి లేఖనాలు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. నేడు, కొందరు సువార్తికులు దేవుని వాగ్దానాలను సంపద సువార్తగా వక్రీకరిస్తున్నారు, ఇది లేఖన సత్యానికి విరుద్ధం.
లేఖనాలను వక్రీకరించేవారు తమ నాశనం కొని తెచ్చుకుంటారని పేతురు హెచ్చరించాడు (2 పేతురు 3:16). అదే విధంగా, వాక్యాన్ని బోధించే బోధకులు ముఖ్యమైన బాధ్యతను కలిగి ఉన్నారని యాకోబు మాట్లాడాడు. (యాకోబు 3:1). బైబిల్ బోధించే మనం, అబద్ధ ఆలోచనలను సమర్ధించడానికి లేఖనాన్ని వక్రీకరించకుండా జాగ్రత్త వహించాలి.
ఊహాత్మక అర్థం ఇవ్వటం
ముగ్గురు న్యాయమూర్తుల కథ, బైబిల్ బాష్యకర్తలు చేసే మరో సాధారణ తప్పును ఉదహరిస్తుంది: లేఖనం యొక్క అర్థం పాఠకుని ఊహ నుండి వస్తుందనే ఆలోచన. కొందరు ఇలాగే అడుగుతారు, “లేఖనమంటే నేను ఏమి భావిస్తున్నాను?” భావోద్వేగం, భావం ముఖ్యమైనప్పటికీ, లేఖన తుది సత్యం రచయిత రాసిన దానిలో ఉంది కాని, అతను రాసిన దానిని నేను ఎలా అర్థం చేసుకుంటున్నాననే విషయంలో కాదు.
అతి నమ్మకంగా ఉండటం
తాను ఎన్నడూ తప్పు చేయనని అనుకునే బాష్యకర్త తన సొంత తర్కాన్ని నమ్ముతాడు. వాక్య అర్థం గురించి ఒక నిర్థారణకు రావటానికి మనం వాక్యాన్ని అధ్యయనం చేస్తాం; అయితే, మన నిర్ధారణలు తప్పుగా ఉన్నప్పుడు దానిని ఒప్పుకునే వినయం మనకు ఉండాలి. ఏ ఒక్కరి దగ్గరా అన్ని సమాధానాలు ఉండవు.
భాష్యానికి వినయం ప్రాముఖ్యం. మీరు బైబిల్ అధ్యయనం చేస్తున్నప్పుడు, దైవికమైన క్రైస్తవులు విభేదించే విషయాలు కనుగొంటారు. అంటే, ఒకవైపువారు ఉద్దేశ్యపూర్వకంగా లేఖనాలను వక్రీకరించారని కాదు దీని అర్థం; లేఖన సత్యానికి కట్టుబడియున్న రెండు బృందాల మధ్య యదార్థమైన అసమ్మతి కావచ్చు. మన సొంత భాష్యం విషయంలో వినయం కలిగి ఉంటూ, భిన్నాభిప్రాయాలు గలవారిని సహించగలగాలి.
మీ వంతు
లేఖనాలను ఉల్లేఖిస్తున్నామని భావిస్తూ, ప్రజలు చేసే కొన్ని తప్పుడు ప్రకటనలు క్రింద ఉన్నాయి. జాగ్రత్తగా చదివారనే అభినందలు పొందటానికి, ప్రతి ఉదాహరణలో వక్రీకరించిన వాక్యభాగాన్ని కనుగొని, అసలు బైబిల్ ఏం చెబుతుందో గమనించండి. మీ కోసం మొదటి ఉదాహరణ పూర్తి చేశాం.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.