తరగతి నాయకునికి గమనిక: మెటీరియల్ ను పూర్తి చేయాలి గనుక మీరు ఈ పాఠాన్ని రెండు సెషన్ లలో బోధించాలని సిఫార్సు చేస్తున్నాం. రెండవ సెషన్ తరువాత మాత్రమే విద్యార్ధులకు అభ్యాసాలు ఇవ్వాలి.
సాహిత్య రూపాల అవగాహన లేఖన భాష్యానికి సహాయకరం.
దావీదు గొర్రెల యెడల శ్రద్ధ చూపాడని బైబిల్ చెప్పినప్పుడు (1 సమూయేలు 16:11), అక్షరాలా గొర్రెలు గురించి మాట్లాడుతుందని మనకు తెలుసు ఎందుకంటే అతడు ఒక గొర్రెల కాపరి. యోహాను ఘటసర్పము (ప్రకటన 12:3) లేక సింహము లేక ఎలుగుబంటి వంటిది చూశాడని ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు, ఆ జంతువులు ఇతర విషయాల్ని సూచిస్తున్నాయని మనకు తెలుసు ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అనేక చిహ్నలు ఉన్నాయి.
దేవాలయ నిర్మాణం కోసం సొలొమోను దేవదారు మ్రానులు తీసుకువచ్చాడని 1 రాజులు 5:6 చెప్పినప్పుడు, ఆయన అక్షరాలా మ్రానులు తెచ్చాడని మనకు తెలుసు. నీతిమంతుడు నీటికాలువల యోరను నాటబడిన మొక్కవలే ఉన్నాడని కీర్తన 1:3 చెప్పినప్పుడు, అది పోలిక ద్వార ఒక విషయాన్ని సూచిస్తుందని మనకు తెలుసు. చెట్లన్నియు చప్పట్లు కొట్టునని యెషయా 55:12 చెప్పినప్పుడు, ప్రకృతి కూడా వేడుక జరుపుకునే అంతటి ఆనందం ఉందని అర్థం.
సాహిత్య రూపాల అవగాహన లేఖన భాష్యానికి సహాయకరం సాహిత్య రకాల యెడల అవగాహన లేఖన భాష్యానికి చాలా ముఖ్యం. కావ్య గ్రంథం (కీర్తనలు) పత్రిక (రోమా) కంటే భిన్నంగా మాట్లాడుతుంది. భిన్నత్వాల్ని అర్థం చేసుకోవడం, ప్రతి పుస్తకాన్ని రచయిత ఉద్దేశించినట్లుగా భాష్యం చేయగలగుటకు సహాయపడుతుంది. ఇక్కడ లేఖనంలోని ప్రధాన రకాల సాహిత్యాలకు పరిచయం ఉంది.
సాహిత్య రూపం: చరిత్ర
బైబిల్లో అధిక భాగం చరిత్రే: పంచగ్రంథాలు, చారిత్రక పుస్తకాలు, సువార్తలు, అపొస్తలుల కార్యములు మరియు ఇతర చిన్న భాగాలు, నిజమైన ప్రజలు మరియు సంఘటనలను గూర్చిన చారిత్రక కథనాలు.
(బైబిల్ లో ప్రవక్తలు చెప్పిన కల్పిత ఉదాహరణలు, యేసు చెప్పిన ఉపమానాలు కూడా ఉన్నాయి. ఇవి చారిత్రక కథనాలకు భిన్నమైనవి గనుక వీటి భాష్యాన్ని తదుపరి భాగంలో చర్చించుకుందాం.)
చరిత్ర పఠనంలో ఆడగాల్సిన ప్రశ్నలు
మీరు బైబిల్ చరిత్ర చదువుతున్నప్పుడు ఈ ప్రశ్నలు అడగాలి:
(1) కథ ఏంటి?
చరిత్ర చదువుతున్నప్పుడు, మనం కథ రూపకల్పన చూస్తాం. ఉదాహరణకు, లూకా సువార్త గలిలయలో యేసు పరిచర్యను సూచిస్తుంది; ఆ తర్వాత యేసు యెరూషలేము ప్రయాణంపై, శిష్యత్వాన్ని గురించి ఆయన బోధపై దృష్టిపెడుతుంది; యెరూషలేములో యేసు మరణం, పునరుత్థానంపై దృష్టి పెడుతూ లూకా తన సువార్త ముగిస్తాడు. అపొ. కార్యాల గ్రంథంలో, సంఘ పరిచర్య అభివృద్ధి గురించి చెప్పాడు. మరలా, భౌగోళిక ఆకృతిని అనుసరించాడు. సువార్త యెరూషలేములో ప్రకటించబడింది; ఆ తరువాత యూదయ, సమరయ; చివరకు, పౌలు రోములో చేసిన పరిచర్య ద్వారా సువార్త భూదిగంతాల వరకు వ్యాపించింది.
(2) కథలో ప్రజలు ఎవరు?
బైబిల్ లో చారిత్రక ప్రజలు గురించి మనం చదివినప్పుడు, మనం పెంపొందించుకోవలసిన బలాలు, విడిచిపెట్టవలసిన బలహీనతలు గురించి నేర్చుకుంటాం. మనం ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం, “నెహెమ్యా ప్రభావంతమైన నాయకుడవ్వడానికి కారణం ఏంటి?” సౌలు వైఫల్యానికి, దావీదు విజయానికి మధ్య వ్యత్యాసం ఏంటి?” పేతురు, పౌలు సువార్త విధానాల్ని పోల్చి చూస్తాం. బైబిల్ చరిత్రలో, ప్రజల చిత్రాన్ని పొందుతాం.
(3) చారిత్రక కథనం అనుసరించడానికి మాదిరి ఇస్తుందా?
కథ చదివేటప్పుడు, అక్కడున్న చర్యలు మనం అనుసరించడానికి మాదిరిగా ఉన్నాయా అని మనం ప్రశ్నించాలి. దేవుడు తన ప్రజల నుండి ఏమి ఆశిస్తున్నాడో చారిత్రక కథనం ఒక మాదిరి ఇస్తుంది. దీనికి భిన్నంగా, బహుశా ఇది అనుసరించడానికి మాదిరి ఇవ్వని ముఖ్య చరిత్రను అందిస్తుంది.
న్యాయాధిపతులు 21 వ అధ్యాయం ఉపయోగించి, భార్యను ఎలా పొందుకోవాలో ప్రసంగించిన ప్రసంగికుని ఉదాహరణ మీకు గుర్తుందా? ఆ ఉదాహరణలో, “న్యాయాధిపతులు గ్రంథం ఇలా చేయమని ఆజ్ఞాపిస్తుందా లేక ఈ చర్యను కేవలం వివరిస్తుందా?” అని ప్రసంగికుడు ప్రశ్నించలేదు. న్యాయాధిపతులు 21 ఇశ్రాయేలు చర్యల్ని వివరిస్తుంది; ఎలా ప్రవర్తించాలో ఆజ్ఞాపించదు.
చరిత్ర చదివేటప్పుడు, “ఇది అనుసరించే ఉదాహరణా?” లేక “ఇది కేవలం వివరణా?” అని మనం ప్రశ్నించాలి. అనేక సందర్భాల్లో, జవాబు చాలా సులభం; భార్యను అపహరించాలని న్యాయాధిపతులు 21 అజ్ఞాపిస్తుందని ఏ ఒక్కరు భావించరు. అయితే, అనేక సందర్భాలు అస్పష్టంగా ఉన్నాయి. అపొస్తలుల కార్యములు గ్రంథం మరి ముఖ్యంగా కష్టమైనది. దేవుడు ఆది సంఘ కాలంలో చేసిన అద్భుతకార్యాలు చేయాలని నేటి సంఘాలు ఆశిస్తున్నాయా? ఆత్మతో నింపబడిన ప్రతి విశ్వాసి అన్యభాషలు మాట్లాడాలా?
వాక్యభాగం మనం అనుకరించటానికి మాదిరి ఇస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఎలా నిర్ణయిస్తాం? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకపోతే, న్యాయాధిపతులు మరియు అపొస్తలుల కార్యాల గ్రంథం వంటి చారిత్రక పుస్తకాల్ని మనం అపార్థం చేసుకుంటాం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకపోతే, మన ఇష్టానుసారంగా బైబిల్ వివరాల్ని విస్మరిస్తాం లేక ఉద్ఘాటిస్తాం. ఈ సూత్రం గుర్తుంచుకోండి: చారిత్రక వాక్యభాగం అనుసరించడానికి మాదిరిని ఇచ్చినప్పుడు, ఇతర వాక్యభాగాల్లో స్పష్టమైన సూచనలు లేక పునరావృత ఉదాహరణలు మనం ఆశించవచ్చు.
ఉదాహరణకు, ఆది క్రైస్తవులు సౌవార్తీకరణ విషయంలో ఎంతో ఆసక్తిగా ఉన్నారని అపొస్తలుల కార్యాల గ్రంథం చూపిస్తుంది. శిష్యులను చేయమని మత్తయి 28:19-20 మనకు ఆజ్ఞాపిస్తుంది గనుక ఇది మనం అనుసరించవలసిన ఉదాహరణ అని మనకు తెలుసు. సంఘంలో పరిశుద్ధాత్మ కార్యాలను అపొస్తలుల కార్యాల గ్రంథం చూపిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆయన అనుచరుల పరిచర్యను బలపరుస్తాడని యేసు వాగ్దానం చేశాడు గనుక ఇది సంఘ జీవితంలో సర్వసాధారణం అని మనకు తెలుసు (అపొస్తలుల కార్యములు 1:8). మనం సౌవార్తీకరణ విషయంలో విఫలమైతే లేక మన పరిచర్యలో పరిశుద్ధాత్మ శక్తిని కనుపరచు విషయంలో విఫలమైతే, మనం అపొస్తలుల కార్యాల గ్రంథం మాదిరికి అనుగుణంగా జీవించడంలేదని అర్థం. ఈ కథలు సంఘానికి ఉదాహరణలు.
క్రైస్తవులు సమస్తాన్ని సమిష్టిగా కలిగియున్నారు మరియు వ్యక్తిగత గృహాలలో ఆరాధించారని కూడా అపొస్తలుల కార్యాల గ్రంథం సెలవిస్తుంది. ఈ ఆచరణలను లేఖనభాగం ఆజ్ఞాపిస్తుందా? లేదు. పేతురు అననీయకు చెప్పినట్లుగా, ఒకరి సంపదను పంచిపెట్టడం స్వచ్ఛందమే కాని కోరదగినవి కాదు (అపొస్తలుల కార్యములు 5:3-4). అలాగే, వ్యక్తిగత గృహాలలో ఆరాధించమని లేఖనం మనలను ఆజ్ఞాపించదు.[1]
ఆ ఆచారాలు లేఖనంలో ఆజ్ఞాపించలేదు గనుక, అవి సంఘ చరిత్రలో భాగమేగాని ఖచ్చితంగా అనుసరించవలసిన మాదిరి కాదని మనం చెప్పగలం. అపొస్తలుల కార్యాల గ్రంథం, చరిత్రలో ఒక నిర్దిష్ట సమయాన్ని వివరిస్తుంది; ఈ ఆచారాలను అన్ని సమయాలకు వర్తిస్తాయని ఆజ్ఞాపించలేదు.
(4) ఈ చారిత్రక కథనంలో ఏ సూత్రాలు బోధించారు?
పౌలు ప్రకారం, బైబిల్ చరిత్ర మన బోధన కొరకు ఇవ్వబడింది (1 కొరింథీయులకు 10:11). మానవ చరిత్రలో దేవుడు ఎలా పనిచేశాడు, అదే విధంగా దేవునికి ఇష్టమైనవి లేక ఇష్టం కానివి ఏవి అనే విషయాలను ఇది చూపిస్తుంది. పాఠకులుగా, మనం చారిత్రక కథనాల్లో సూత్రాలు కనుగొనాలి.
“ఇశ్రాయేలీయులు దేవునిపై సణిగి, శిక్షను పొందారు. మీరు ఫిర్యాదు చేయకూడదు” అని ఈ కథ చెప్పదు. అయితే ఇశ్రాయేలు దేవునిపై ఫిర్యాదు చేసింది; మనం వారి పాప పర్యవసానాలను చూసి, అది బోధించే సూత్రాన్ని అర్థం చేసుకోవాలని” చెబుతుంది. చరిత్ర నేరుగా ఆజ్ఞాపించకుండా, అనుసరించవలసిన సానుకూల ఉదాహరణలు, నివారించవలసిన ప్రతికూల ఉదాహరణలను ఇస్తుంది. యెహోషువ గ్రంథంలో, దేవునికి విధేయత చూపడం జయమిస్తుందని చూస్తాం; న్యాయాధిపతులు గ్రంథంలో, అవిధేయత గందరగోళం సృష్టిస్తుందని చూస్తాం.
అపొస్తలుల కార్యాల గ్రంథం
అపొస్తలుల కార్యాల గ్రంథం, యేసు భూమిపై జీవించిన తరువాత ఏమి జరిగిందో చారిత్రక నివేదికను ఇస్తుంది. క్రొత్త నిబంధన పాఠకులకు, అపొస్తలుల కార్యాల గ్రంథం, సంఘాలకు రాసిన పత్రికలకు నేపథ్యాన్ని ఇస్తుంది.
పరిశుద్ధాత్మ శక్తిని పొందిన సంఘం, సువార్త ప్రకటించే పనితోనే ఆగిపోలేదని అపొస్తలుల కార్యాల గ్రంథం, చూపిస్తుంది. సంఘం సిద్ధాంతపరమైన విషయాలు, అంతర్గత విభజనలు, అబద్ధ బోధకులు, పరిపాలనలో పోరాటాలు, వేషధారులు, అపవిత్రాత్మలను ప్రతిఘటించడం, సమాజం మరియు ప్రభుత్వం నుండి హింస, ప్రయాణంలో విపత్తులు కూడా ఎదుర్కొంది. అయినా, సంఘం ఆనందంగా, విజయవంతంగా ముందుకు సాగింది. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని బలపరచాడు గనుక వ్యక్తులు, సమాజాలు సువార్త ద్వారా మార్పుచెందాయి.
అపొస్తలుల కార్యాల గ్రంథం రాయడంలో లూకా ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రపంచమంతటా సువార్త ప్రకటించాలనే పనిని నెరవేర్చడానికి సంఘాన్ని ధైర్యపరచడం. ఈ ఉద్దేశ్యం, ఈ క్రింది విషయాలలో గ్రంథమంతా కనిపిస్తుంది. ఇలాంటి ఇతర విషయాలను కూడా చేర్చవచ్చు.
తన శిష్యులు భూదిగంతాల వరకు సువార్త ప్రకటిస్తారని యేసు చెప్పాడు (అపొస్తలుల కార్యములు 1:8).
పరిచర్య ఎలా చేయాలో, బాప్తిస్మం, సంఘ క్రమం ఎలా నిర్వహించాలో, పరిశుద్ధాత్మను ఎలా అనుభవించాలో అపొస్తలుల కార్యాల గ్రంథం చెబుతుందని కొన్నిసార్లు పాఠకులు భావిస్తారు. ఈ విషయాలను ఆది సంఘం ఎలా చేసిందో అపొస్తలుల కార్యాల గ్రంథం చూపిస్తుంది; అయితే, అపొస్తలుల కార్యాల గ్రంథాన్ని సంఘ పరిచర్యకు ఒక మార్గదర్శినిగా రచయిత ఉద్దేశించలేదు.
అపొస్తలుల కార్యాల గ్రంథంలో సంఘం చేసినట్లుగా మనం కూడా ప్రతిదీ అలాగే చేయాలని భావించకూడదు కాని, సంఘం సవాళ్లను ఎలా ఎదుర్కొందో చూసి, నేర్చుకోవచ్చు.
పరిశుద్ధాత్మ శక్తి, జ్ఞానం ద్వారా సమస్యలన్నిటిని ఎదుర్కొంటూ, ఆచరణాత్మ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన నిర్మాణాలను అభివృద్ధి చేస్తూ సంఘం సువార్త పనిలో ఎలా కొనసాగాలో అపొస్తలుల కార్యాల గ్రంథం మనకు చూపిస్తుంది.
[1]నేడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల క్రైస్తవులు బహిరంగ ఆరాధనకంటే గృహ ఆరాధనను సురక్షితంగా భావిస్తున్నారు. ఇది సార్వత్రిక ఆజ్ఞ కాదుగాని స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంది.
సాహిత్య రూపం: పాత నిబంధన ధర్మశాస్త్రం
పాత నిబంధన ధర్మశాస్త్రం విలువ
చారిత్రక విభాగాలు క్రైస్తవులకు సూత్రాలు వివరించటం తప్ప పాత నిబంధన నేడు విశ్వాసికి అంత అవసరం లేదని కొందరు క్రైస్తవులు భావిస్తారు. పాత నిబంధన నియమాలు నేడు విశ్వాసులకు వర్తించవని భావిస్తారు.
విశ్వాసి విషయంలో, పాత నిబంధన నియమాన్ని ఉపయోగించడంలో మార్పును గూర్చి అపొస్తలుడైన పౌలు రాశాడు. క్రీస్తు మరణం ధర్మశాస్త్ర శిక్షను తొలగించింది గనుక ధర్మశాస్త్ర ఆచారాలు అనుసరించని విశ్వాసులకు మనం తీర్పుతీర్చకూడదని చెప్పాడు (కొలొస్సయులకు 2:14-17). అపొస్తలులు యూదుల ఆచారాల నియంత్రణలో లేరని చెప్పాడు (గలతీయులకు 2:14-16). అన్యజనులకు సంఘ కాపరియైన వ్యక్తి సున్నతి పొందనక్కరలేదని చెప్పాడు (గలతీయులకు 2:3). యూదుల ఆహార నియమాలు, ప్రత్యేక దినాల విషయంలో ప్రతి వ్యక్తి తన మనస్సాక్షిని అనుసరించాలని, ఈ అవసరాల విషయంలో విశ్వాసులు ఒకరినొకరు తీర్పుతీర్చుకోకూడదని చెప్పాడు (రోమా 14). విశ్వాసి ధర్మశాస్త్ర విషయమై మృతినొందినవాడు, గనుక మనం ధర్మశాస్త్ర ఉద్దేశ్యం నెరవేర్చే విధానంలో దేవుని సేవిస్తున్నాం కాని ప్రత్యేక అవసరాలు కాదని చెప్పాడు (రోమా 7:4, 6). మరి ముఖ్యంగా, ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ ఒక్కరు తీర్పుతీర్చబడరని చెప్పాడు (రోమా 3:20).
పాత నిబంధన ధర్మశాస్త్రం విశ్వాసికి ముఖ్యమైనదని చూపించే ప్రకటనలు బైబిల్ లో ఉన్నాయి. పాత నిబంధన ధర్మశాస్త్రం దేవుని స్వభావ వ్యక్తీకరణ గనుక, దేవుని ప్రేమించినవాడు ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు ( కీర్తన 1:2, కీర్తన 119:7, 16, 70 చూడండి). ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ పరిశుద్ధమైనది, నీతిగలది అని పౌలు చెప్పాడు (రోమా 7:12). ఇలా కూడా చెప్పాడు, “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” (2 తిమోతికి 3:16). అతడు ఆ ప్రకటన చేసిన సమయంలో, లేఖనం అను పదం ప్రధానంగా పాత నిబంధన గ్రంథాన్ని సూచిస్తుంది. లేఖనాలు రక్షణ విషయంలో తనను జ్ఞానవంతునిగా చేస్తాయని పౌలు తిమోతికి చెప్పాడు (2 తిమోతికి 3:15). విశ్వాసులుగా పాత నిబంధనలోని ఏ భాగాన్ని కూడా మనం విస్మరించకూడదని ఈ ప్రకటనలు బోధిస్తాయి. దేవుని ధర్మశాస్త్రం పాటించడం ద్వారా మనం రక్షించబడనప్పటికీ, మన విషయంలో ఆయన చిత్తాన్ని గ్రహించి, తద్వారా ఆయనను మెప్పించాలి (2 కొరింథీయులకు 5:9-10).
పాత నిబంధన నియమాల వర్గీకరణ
నేడు విశ్వాసులు పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో గ్రహించడానికి, నియమాల వర్గీకరణను పరిశీలిద్దాం.
ఆచార నియమాలు, బలులు, ఆచారాలు, ఆహారం, ప్రత్యేక దినాలు గురించి మాట్లాడతాయి. ఈ నియమాలను క్రీస్తు నేరవేర్చాడని పౌలు చెప్పాడు (కొలొస్సయులకు 2:16-17). హెబ్రీయులకు రాసిన పత్రిక, పాత నిబంధన ఆచారాల అర్థానికి అధికమైన అన్వయాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, దేవాలయంలోని వస్తువులు రక్తం చేత శుద్ధిచేయబడతాయి, ఇది విశ్వాసులను శుద్ధి చేసే క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉంది (హెబ్రీయులకు 9:14, 21-24).
ఒక రాజ్యమైన ఇశ్రాయేలుకు పౌర నియమాలు ఇవ్వబడ్డాయి. పౌర నియమాలను నియమితులైన అధికారులు అమలు చేస్తారు కాని వ్యక్తులు కాదు. ఉదాహరణకు, శకునము చెప్పువారిని బ్రతుకనియ్యకూడదు (నిర్గమకాండము 22:18), కాని విచారణ, మరణశిక్షను ప్రజలు కాదు నియమించబడిన అధికారులు అమలు చేయాలి. ద్వితీయోపదేశకాండము 17:2-12 స్థానిక ప్రభుత్వం సాక్షులను విచారించి, న్యాయం తీర్చే విధానాన్ని వివరిస్తుంది; మరింత కఠిన కేసులకు ఉన్నత న్యాయస్థానం ఉంది.
పౌర నియమాలు నేడు భిన్నంగా ఉన్నాయి, ప్రాచీన ఇశ్రాయేలు పౌర చట్టాలను ఆచరించడానికి విశ్వాసులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవలసిన అవసరత లేదు. అయితే, ఆ నియమాలు దేవుని నీతి గురించి, ప్రజల నుండి ఆయన ఆశించు నీతి గురించి మనకు బోధిస్తాయి. ఉదాహరణకు, నిర్గమకాండము 22:18 లో ఇచ్చిన నియమం, ఒక వ్యక్తి శకునం చెప్పడం తప్పు అని బోధిస్తుంది. ఇతర నియమాలు, దేశంలోని బీదలను రక్షించి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడని సెలవిస్తాయి (ద్వితీయోపదేశకాండము 24:14-15, 17-22).
బైబిల్ భాష్యకర్త మొదట పాత నిబంధన పౌర నియమాల అర్థాన్ని గ్రహించి, ఆ తరువాత నేడు విశ్వాసి ఆ నియమాన్ని ఎలా అన్వయించాలో చూస్తాడు. మనం ఇలా అడగాలి, “దేవుని చింత ఏంటి? దేవుని ఉద్దేశ్యం ఏంటి? దేవుడు విలువిచ్చే వాటి గురించి ఈ నియమం ఏమి వెల్లడి చేస్తుంది?” ఆ తరువాత, ఏ ఆధునిక అన్వయం దేవుని సంతోషపరుస్తుందో పరిగణించాలి.
నైతిక నియమాలు సరైన జీవితానికి దేవుని శాశ్వతమైన అవసరాన్ని గురించి మాట్లాడుతుంది. నైతిక నియమాలు, నిజాయితీ, లైంగికత, విగ్రహారాధన మరియు ఇతర విషయాలను గురించి మాట్లాడుతుంది (నిర్గమకాండము 20:4-5, 13-16). అనేక నైతిక నియమాలు క్రొత్త నిబంధనలో కూడా పునరావృతమయ్యాయి. దేశ నియమాలు పూర్తిగా లేక స్థిరంగా దేవుని నియమాలను పాటించనప్పటికీ, నైతిక నియమాలు నేడు దేశంలో పౌర నియమాలకు ఆధారంగా ఉన్నాయి. ప్రజలకు దేవుడు ఇచ్చిన నియమాలు సాంఘిక నియమాలకంటే గొప్పవి.
మన నియమాల వర్గీకరణ పరిపూర్ణమైనది కాదు. పాత నిబంధన వాక్యభాగాలలో, కొన్నిసార్లు మూడు రకాల నియమాలు ఉంటాయి, వర్గీకరించలేని నియమాలు కూడా ఉంటాయి. అది పరిపూర్ణం కానప్పటికీ, పాత నిబంధన నియమాలు క్రొత్త నిబంధన విశ్వాసులకు ఎలా వర్తిస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ వర్గీకరణలు సహాయపడతాయి.
మీరు పాత నిబంధన ధర్మశాస్త్రం అధ్యయనం చేస్తున్నప్పుడు, అధ్యయనం చేసే నియమం యొక్క విస్తృత సందర్భాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చుట్టూ ఉన్న కథనాన్ని గమనించండి. నియమం తక్షణ సందర్భానికి ఎలా సరిపోతుంది?
తరువాత ఇలా అడగండి:
(1) మొదటి శ్రోతలకు ఈ వాక్యభాగం యొక్క అర్థం ఏంటి?
ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకుందో గ్రహించాలంటే, ఇలాంటి ప్రశ్నలు అడగాలి:
నియమానికి, దాని చుట్టూ ఉన్న వచనాలకు సంబంధం ఉందా?
నియమం, ఇశ్రాయేలు చరిత్రకు సంబంధించి నిర్దిష్ట పరిస్థితికి ప్రతిస్పందనగా ఉందా?
నియమం, పాత నిబంధన బలలుల వ్యవస్థకు సంబంధించినదిగా ఉందా?
(2) బైబిల్ శ్రోతలకు, మన ప్రపంచానికి మధ్య వ్యత్యాసాలు ఏంటి?
మన లోకానికి మరియు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న వ్యత్యాసం కంటే మన లోకానికి, పాత నిబంధనకు మధ్య ఎక్కువ వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు:
మనం ప్రధాన దేవాలయాన్ని దర్శించము; పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసిలో నివసిస్తున్నాడు.
బలుల ద్వారా దేవునిని దగ్గరికి రాము; క్రీస్తు ఒక్కసారే అందరి కోసం చనిపోయాడు (హెబ్రీ. 10:10).
దేవుని వాక్యం మన దేశ ధర్మశాస్త్రం/చట్టం కాదు. మనం లౌకిక ప్రభుత్వాల అధీనంలో జీవిస్తున్నాం.
(3) ఈ వాక్యభాగంలో బోధించిన సూత్రాలు ఏంటి?
పాత నిబంధన ధర్మశాస్త్రం ఆశించే నిర్దిష్టమైన చర్య బహుశ నేడు అవసరం లేదు. ధర్మశాస్త్రం బోధించే శాశ్వతమైన సూత్రం కోసం మనం చూడాలి. ఇది, లేఖనాన్ని దాని ప్రాచీన నేపథ్యం నుండి ఆధునిక లోకానికి నడిపించే ఒక వంతెన. ఈ సూత్రం, పాత నిబంధన శ్రోతలకు, సమకాలీన శ్రోతలకు వర్తిస్తుంది.
1-2 వాక్యాల్లో సూత్రాన్ని పేర్కొనండి. సూత్రం నిజంగా బైబిల్ ప్రకారమే అని ధృవీకరించడానికి, ఈ ప్రశ్నలు అడగండి:
ఈ సూత్రాన్ని ధర్మశాస్త్రం స్పష్టంగా చూపిస్తుందా?
ఈ సూత్రం అన్ని కాలాలలో, అన్నిచోట్ల ఉన్న ప్రజలకు వర్తిస్తుందా?
ఈ సూత్రం మిగిలిన వాక్యభాగమంతటికీ అనుగుణంగా ఉందా?
(4) క్రొత్త నిబంధన ఏ విధంగానైన ఈ సూత్రాన్ని అంగీకరిస్తుందా?
ముందు చెప్పిన మూడు ప్రశ్నలలో ప్రతి ఒక్కటి, ఏ వాక్యభాగ భాష్యానికైనా ఉపయోగపడుతుంది. మనం పాత నిబంధన వాక్యభాగాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, భాష్యం ప్రక్రియలో ఈ చివరి ప్రశ్నను జోడించాలి. మీరు పాత నిబంధన వాక్యభాగంలో సార్వత్రిక సూత్రం కనుగొంటే, అది నేడు అమలులో ఉంటుంది. అయితే, అన్వయం పాత నిబంధన కాలానికి భిన్నంగా ఉంటుందని క్రొత్త నిబంధన చూపిస్తుంది.
ఉదాహరణకు, నిర్గమకాండము 20:14, “వ్యభిచరింపకూడదు” అని ఆజ్ఞాపిస్తుంది. కొండమీద ప్రసంగంలో, కేవలం క్రియలకు మాత్రమే కాదుగాని ఆలోచనలకు కూడా అన్వయించునట్లు యేసు దీనిని వివరించాడు (మత్తయి 5:28). యేసు బోధన నిర్గమకాండము 20:14 సూత్రాన్ని రద్దు చేయదు; లోతైన అన్వయాన్ని ఇస్తుంది.
[1]ఈ భాగం J. Scott Duvall and J. Daniel Hays, Grasping God’s Word (Grand Rapids: Zondervan, 2012) నుండి తీసుకున్నారు.
సాహిత్య రూపం: కావ్యం
బైబిల్ లో చాలా కావ్యం ఉంది. యోబు, కీర్తనలు, సామెతలు, మరియు పరమగీతము దాదాపు పూర్తిగా కావ్య రూపంలో ఉన్నాయి, ప్రసంగి లో కూడా కొంత కావ్యం ఉంది. ప్రవక్తల గ్రంథాల్లో కూడా కావ్యం ఎక్కువ ఉంది. కావ్యం అంటే లోతైన భావోద్వేగాలను చూపించడానికి ఉపయోగించే రచనా శైలి. ఇది, చారిత్రక కథనాల వివరాలు తెలియపరచడానికి లేక తార్కిక వాదాలు సృష్టించడానికి రూపించబడలేదు. కావ్యంలో, కవి హృదయ భావన వింటాం; కవిత్వంలో వ్యక్తపరచిన భావాల విషయంలో సున్నితంగా ఉంటాం.
కావ్యం ఎల్లప్పుడు అలంకార రూపకాలను ఉపయోగిస్తుంది, దాని వివరాలను అక్షరార్థంగా తీసుకోనవసరం లేదు.
కీర్తనలు గ్రంథం నుండి ఒక కావ్య ప్రకటనకు ఒక ఉదాహరణ ఇక్కడుంది: “[దేవా] నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీద కొట్టుదువు” (కీర్తన 21:12). అక్షరాల బాణాలు విసిరే విల్లు దేవుడు కలిగిలేడని మనం గ్రహిస్తాం. తనకు శత్రువైన ప్రతి ఒక్కరిని దేవుడు ఓడించగల సమర్థుడని రచయిత సెలవిస్తున్నాడు. దేవుని విజయంలో నమ్మకముంచమని రచయిత విశ్వాసులకు చెబుతున్నాడు.
కావ్యం, బైబిల్ లో మరోచోట సూటిగా చెప్పిన సత్యాన్ని ఊహాత్మకంగా తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. సరళ వాక్యభాగంలో బోధించనప్పుడు, కావ్య వాక్యభాగంలో కూడా సిద్ధాంతం లేక ఆచారాన్ని అభివృద్ది చేయవద్దు.
హెబ్రీ కావ్యం కొన్నిసార్లు శబ్ద నమూనాలను ఉపయోగిస్తుంది కాని సాంప్రదాయక ఆంగ్ల కవిత్వం ప్రాస విధానాన్ని కలిగియుండదు. హెబ్రీ కావ్య లక్షణాలను అర్థం చేసుకోవటం వలన దాని అందాన్ని అభినందించగలం.
హెబ్రీ కావ్య లక్షణాలు
సమాంతరత
హెబ్రీ కావ్యం తరచు సమాంతరతపై ఆధారపడి ఉంటుంది. రెండు సమాంతర ప్రకటనలు కలిపి ఉపయోగిస్తారు; రెండవ ప్రకటన మొదటి ప్రకటనకు అర్థాన్ని ఇస్తుంది కాని అదనపు అర్థాన్ని ఎన్నడూ జోడించదు.
మూడు రకాల సమాంతరతలు ఉన్నాయి:
ఒక వచనం ఒకే విషయాన్నీ రెండు విధాలుగా సెలవిస్తుంది (కీర్తన 25:4, కీర్తన 103:10, సామెతలు 12:28).
రెండు విషయాలు ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉన్నాయో వచనం చూపిస్తుంది (కీర్తన 37:21, సామెతలు 10:1, 7).
వచనం ఒక ప్రకటన చేస్తుంది తరువాత ప్రకటనలో వివరాలు ఇస్తుంది (కీర్తన 14:2, కీర్తన 23:1, సామెతలు 4:23).
సమాంతరతలను అర్థం చేసుకుంటున్నప్పుడు, రెండవ మాట మొదటి మాటకు ఏమి జత చేస్తుందని అడగండి. అది మొదటి మాటను బలపరుస్తుందా, మొదటి మాటకు వ్యతిరేకంగా ఉందా, లేక క్రొత్త సమాచారం జోడిస్తుందా? అని చూడండి.
అలంకారాలు
బైబిల్ పుస్తకాలన్నిటిలో అలంకారాలు ఉన్నప్పటికీ, ఇవి కావ్యంలో ముఖ్యమైనవి. హెబ్రీ కావ్యంలో ఉండే అలంకారాలు ఏమనగా:
1. ఏదొ ఒక విషయంలో ఒకేలా ఉండే రెండు విషయాల పోలిక: “యెహోవా నా కాపరి” (కీర్తన 23:1).
2. ఒక విషయాన్ని ఉద్ఘాటించడానికి అతిశయోక్తిని ఉపయోగించడం. దావీదు తన దు:ఖాన్ని ఇలా వివరించాడు: “నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను” (కీర్తన 6:6).
3. ఏదైనా ఒక విషయం మనిషి అయినట్లుగా దానిని గురించి మాట్లాడాడు: “జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది” (సామెతలు 1:20).
4. మానవుల లక్షణాలు ఉపయోగించి దేవుని గురించి వివరించడం: “(దేవుడు) ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు” (కీర్తన 11:4).
కావ్య అలంకారాలను అర్థం చేసుకుంటున్నప్పుడు, సాధారణ మాట ద్వారా మనం అర్థం చేసుకోలేని ఏ విషయాన్ని ఈ చిత్రం చూపిస్తుందని అడగండి. ఉదాహరణకు, “దేవుడు నా యెడల శ్రద్ధ చూపువాడు” అనే మాటకంటే “యెహోవా నా కాపరి” అనే మాట గొప్పది. అది ఆయన శ్రద్ధ గురించి మాట్లాడుతుంది కాని ఆయన ప్రేమ, ఆయన నాయకత్వం, శత్రువుల నుండి ఆయన ఇచ్చే భద్రత, ఆయనకు దూరమైనప్పుడు ఆయన ఇచ్చే క్రమశిక్షణ గురించి కూడా మాట్లాడుతుంది.
కీర్తనల గ్రంథం
కీర్తనల రకాలు
అనేక రకాల కీర్తనలు ఉన్నాయి. స్తుతి కీర్తనలు, దేవుని గుణాలు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన జోక్యం చేసుకోవడాన్ని బట్టి ఆయన్ని ఘనపరుస్తాయి (కీర్తన 23, 29). దేవుని ధర్మశాస్త్రాన్ని గూర్చిన కీర్తనలు, దేవుని జ్ఞానం, ఆయన నీతిని ఘనపరుస్తాయి (కీర్తన 119). దుఃఖ కీర్తనలు, భావోద్వేగాలను దేవునికి తెలియజేస్తూ, ఆయన సహాయం కోరుతూ, ఆయన చిత్తానికి లోబడతాయి (కీర్తన 3, 13, 22). రాజరిక కీర్తనలు, దేవుని ఘనపరచు రాజు ద్వారా దేశానికి వచ్చే ఆశీర్వాదాలను గూర్చి వివరిస్తాయి, ఈ కీర్తనలు రాబోవు మెస్సీయ రాజ్యం గూర్చి కూడా వివరిస్తాయి (కీర్తన 21, 72). ఆగ్రహ/కోప కీర్తనలు, దుష్టులకు తీర్పు తీర్చి, తన సేవకుల పక్షాన వ్యాజ్యమాడమని దేవునికి మొరపెడతాయి (కీర్తన 69:21-28, కీర్తన 59). ఇతర రకాల కీర్తనలను జాబితా చేయవచ్చు.
కీర్తనల అన్వయం
కీర్తనలు గ్రంథాన్ని ఉపయోగించు కొన్ని మార్గాలను క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. కీర్తనలు మనం దేవునికి చేసే ఆరాధనను వ్యక్తపరుస్తాయి (ఎఫెసీయులకు 5:19). అవి సిద్ధాంతానికి, ప్రోత్సాహానికి కూడా ప్రయోజనకరం (కొలొస్సయులకు 3:16).
కీర్తనల గ్రంథంలో వ్యక్తపరచిన ప్రతి వైఖరి మనం కలిగి ఉండవలసిన వైఖరికి మాదిరి కాదు. అయితే, ప్రతి వైఖరి దేవునికి అప్పగించుకోవాలని కీర్తనలు నుండి మనం నేర్చుకుంటాం. ప్రార్థనలో, మీరు మీ భావాలను దేవునికి వ్యక్తపరచుకోవచ్చు. నిరుత్సాహం, భయం లేక కోపంతో బాధపడుతున్న విశ్వాసి నమ్మకాన్ని దేవుడు పునరుద్ధరిస్తాడని కీర్తనల గ్రంథం మనకు చూపిస్తుంది.
సాహిత్య రూపం: జ్ఞాన సాహిత్యం
యోబు, సామెతలు, ప్రసంగి, కీర్తనలు గ్రంథంలో కొన్ని భాగాలు, యాకోబు పత్రిక జ్ఞాన సాహిత్యంగా పిలువబడే సాహిత్య ప్రకియను సూచిస్తాయి. సామెతలు, ప్రసంగి గ్రంథాల్లో, జీవిత సూత్రాలను నేర్చుకునే యువ పాఠకులకు ఉపదేశాలు ఉన్నాయి.
యోబు గ్రంథం
యోబు గ్రంథంలోని సుదీర్ఘ వాక్యభాగాలు, యోబుతో పాటుగా వివిధ ఉపదేశకుల మాటలు కలిగియున్నాయి. ఉపదేశకులు వివిధ అభిప్రాయాలు తెలియజేస్తారు. బైబిల్ భాష్యకర్త ఆ ఉపదేశాల్లోని ప్రకటనలు తీసుకుని, వాటిని బైబిల్ సూత్రాలుగా బోధించకూడదు. యోబు గ్రంథం, ఆ ప్రకటనలను దేవుని మాటలతో, ఆయన దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషిస్తుంది. యోబు 38-42లో దేవుడు ఉపదేశాలకు స్పందించాడు, యోబు 1-2 కూడా దేవుని దృక్పథాన్ని చూపిస్తుంది.
సాహిత్య రూపం: సామెతలు
సామెతలు అంటే, జీవితం గురించి క్లుప్తంగా, స్పష్టంగా చెప్పిన పరిశీలనలు. ఇవి, సాధారణంగా జరిగే విషయాలను తెలియజేస్తాయి కాని, మినహాయింపులు ఉండవని కాదు.
పైపైన చూస్తే, సామెతను అర్థం చేసుకోవడం సులభంగానే అనిపిస్తుంది. అయితే, ఈ సాహిత్య రూపం ఒక ప్రత్యేక సవాలును విసురుతుంది. సామె,త జీవితం గురించి ఒక సాధారణ సూత్రాన్ని ఇస్తుంది, కాని అది ప్రతి పరిస్థితికి వర్తించదు. ఉదాహరణకు, సామెతలు 21:17 ఇలా చెబుతుంది,
సాధారణ సూత్రంగా, పని కంటే సుఖభోగాన్ని ప్రేమించువారికి పేదరికం కలుగుతుంది. ఈ సాధారణ సూత్రం వాస్తవమే, కాని అనేక మినహాయింపులు ఉన్నాయి. కొందరు ధనవంతులు పని చేయకుండా తమ ధనం సంపాదించుకున్నారు. వారు తినుచు, త్రాగుచూ గడిపారు కాని ధనవంతులయ్యారు. ఇతరులు కష్టపడి పనిచేసి కూడా పేదరికంలో ఉన్నారు. సామెత, సాధారణ సూత్రాన్ని బోధిస్తుందే, కాని సార్వత్రిక సూత్రాన్ని కాదు.
కేవలం సామెతలు గ్రంథంలోనే కాదుగాని బైబిల్ లో అనేక సామెతలు ఉన్నాయి. ఇక్కడ, యేసు మాట్లాడిన ఒక సామెత ఉంది: “కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు” (మత్తయి 26:52). హింసతో మరణించని హింసాత్మకంగా jeeవించిన వ్యక్తులు ఉన్నారు. మరలా, ఒక సాధారణ పరిశీలనగా సామెత వాస్తవమే, కాని మినహాయింపులు కూడా ఉన్నాయి.
మనం సామెతను భాష్యం చెప్పేటప్పుడు మూడు ప్రశ్నలు అడగాలి:
(1) ఈ లేఖనంలో బోధించిన సాధారణ సూత్రం ఏంటి?
సామెతలు 21:17లో కనిపించే సూత్రం, కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ విలువ. అనేక సామెతలు, ఒక పేరాలో వివరించగలిగిన సూత్రాన్ని క్లుప్తంగా వివరిస్తాయి.
(2) ఈ సూత్రానికి ఏ మినహాయింపులు ఉన్నాయి?
సామెతలు 21:17 విషయంలో, అనుదిన జీవితంలో మినహాయింపులు మనం చూస్తాం. ఇది సూత్రానికి విరుద్ధంగా లేదు; సాధారణ సూత్రాలకు మినహాయింపులు ఉన్నట్లు బుద్ధిగలవాడు గ్రహించాలని ఇది చూపిస్తుంది
(3) బైబిల్ లో ఎవరు ఈ సూత్రాన్ని అనుసరిస్తారు?
సామెతలను అర్థం చేసుకుంటున్నప్పుడు, సామెత సూత్రాన్ని అనుసరించే వ్యక్తిని బైబిల్ లో కనుగొనడం సహాయకరం. ఉదాహరణకు, సామెతలు ఇలా సెలవిస్తుంది, “అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారి యొద్ద జ్ఞానమున్నది” (సామెతలు 11:2). నిజ జీవితంలో ఈ సామెత ఎలా వర్తిస్తుందో, సౌలు అహంకారం మరియు దావీదు తన పాపాన్ని బట్టి వినయంతో ఒప్పుకోవడం అనేవి చూపిస్తాయి.
సామెతలు గ్రంథం
సామెతల గ్రంథంలో అధిక భాగం సొలొమోను రాశాడు. బుద్ధి కలిగించుట, జ్ఞానంగలవాడు మరింత జ్ఞానం వృద్ధి చేసుకోవడంఈ గ్రంథం యొక్క ఉద్దేశమనే విషయాన్ని సామెతల గ్రంథంలోనే చూస్తాం (సామెతలు 1:4-5).
సామెతల గ్రంథం మూడు రకాల ప్రజలను గురించి మాట్లాడుతుంది. సాధారణ వ్యక్తి పెద్దవాడయ్యాడు కాని జీవాన్ని గూర్చిన అనుభవం, అవగాహన పొందలేదు. సాధారణ వ్యక్తి జ్ఞానం పొంది, తనను నాశనం చేసే తప్పిదాలు నివారించవలసి ఉంది.
దేవుని సూత్రాల ప్రకారం ఎలా జీవించాలో గ్రహించినవాడు బుద్ధిగలవాడు. ప్రజలు జ్ఞానవంతులు కావాలంటే దేవునియందలి భయభక్తులు కలిగియుండాలి (సామెతలు 9:10). బుద్ధిగలవారు నేర్చుకోవడం కొనసాగిస్తారు.
బుద్ధిహీనుడు జ్ఞానాన్ని (దేవుని సూత్రాలు) తిరస్కరిస్తాడు, వినడానికి ఇష్టపడడు. చెడ్డ ప్రవర్తన కలిగినవాడై, తప్పుడు నిర్ణయాలవలన బాధననుభవిస్తాడు. బుద్ధిహీనుడు తెలివితేటలు లేనివాడు కాడుగాని జీవితాన్ని గ్రహించడు ఎందుకంటే అతడు దేవుని నడిపింపును తిరస్కరించాడు.
సామెతలు గ్రంథంలో తరచూ కనిపించే విషయాలు ఏవంటే (1) సోమరితనం వలన కలుగు ప్రమాదం, పని విలువ (2) లైంగిక పాపాల ఫలితంగా కలుగు ప్రమాదాలు, (3) వివిధ సంబంధాల్లో నైతిక ప్రవర్తనలు.
ప్రసంగి గ్రంథం
ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను రాశాడు (ప్రసంగి 1:1).
ప్రసంగి గ్రంథ సందేశం: కేవలం ఈ ఒక్క జీవితమే ఉంటే, జీవితంలోగాని లేక ఏ గొప్ప సాధనలోగాని న్యాయం లేక ఉద్దేశ్యం ఉండవు.
భూసంబంధమైన జీవితం ప్రజలకు సంతృప్తిని లేక ఉద్దేశ్యాన్ని ఎందుకు ఇవ్వలేదో ప్రసంగి గ్రంథం వివరిస్తుంది. ఈ జీవితంలో:
న్యాయం విస్మరించబడతారు.
అందరు చనిపోతారు, మర్చిపోబడతారు.
దుష్టులు వర్థిల్లతారు.
జ్ఞానం బలమైనది కాని త్రుణీకరించబడుతుంది.
బుద్ధి, జ్ఞానం దుఃఖాన్ని వృద్ధి చేస్తాయి.
నిత్యత్వ దృక్పథంతో జీవించు వ్యక్తి ఇలా ఉంటాడని ప్రసంగి చూపిస్తాడు:
అనందంగా ఉంటాడు కాని, జీవిత విషయాలను తీవ్రంగా పరిగణిస్తాడు.
మరణం సంభవిస్తుందని జ్ఞాపకం చేసుకుంటాడు.
మంచివాటిని ఆస్వాదించి, ఆనందిస్తాడు కాని దేవునికి లెక్క అప్పజెప్పుతాడు.
భూసంబంధమైన లక్ష్యాలకు ప్రాముఖ్యత ఇవ్వడు.
సొలొమోను ఈ ఫలితార్థానికి వచ్చాడు: తీర్పు ఉంది గనుక, యవ్వన ప్రాయం నుండే దేవునియందు భయభక్తులు కలిగి, ఆయన కట్టడల ననుసరించి నడుచుకోవాలి.
సాహిత్య రూపం: పాత నిబంధన ప్రవచనం
పాత నిబంధన ప్రవచన గ్రంథాలు, ప్రసంగించిన సందేశాల సంకలనాలు. 16మంది ప్రవక్తల సందేశాలు లేఖనాల్లో ఉన్నాయి. కేవలం యిర్మీయా కు రెండు పుస్తకాలు ఉన్నాయి. కొందరు ప్రవక్తలు రాసిన పుస్తకాలు లేఖనాల్లో లేవు (1 దినవృత్తాంతములు 29:29). మనకు చెప్పినంతవరకు, వందలాది ప్రవక్తలు అసలు ఏమి రాయలేదు.
క్రీ.పూ. 760-460 మధ్యకాలంలో 16మంది ప్రవక్తలు పరిచర్య చేశారు (ఇశ్రాయేలు 722లో పతనమైంది. యూదా 587లో పతనమైంది.) చరిత్రలోని ఈ కాలంలో, అనేక రాజ్యాల ఆరంభం, పతనాలు ఇశ్రాయేలును రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా ప్రభావితం చేశాయి. కొన్ని సందర్భాల్లో, ఇశ్రాయేలు యూదా రాజ్య ప్రజలు అనేకమంది, దేవుని నిబంధనను మీరి విగ్రహారాధన చేశారు.
ప్రవక్తలు దేవుని నిబంధన పక్షాన వాదించారు. వీరు దేవుడు కోరే వాటిని ప్రజలకు జ్ఞాపకం చేశారు. సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలు చూపే విధేయత లేక అవిధేయత ఆధారంగా ఆశీర్వాదాలు లేక శాపాలు వస్తాయని దేవుడు వాగ్దానం చేశాడు (లేవీయకాండము 26, ద్వితీయోపదేశకాండము 28-32). ఆ వాగ్దానాల నెరవేర్పు గురించి ప్రవక్తలు ప్రవచించారు. విధేయతకు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలలో జీవం, ఆరోగ్యం, అభివృద్ధి, వ్యవసాయ సమృద్ధి, స్వేచ్ఛ, భద్రత మొదలగునవి భాగంగా ఉంటాయి. అవిధేయతకు వాగ్దానం చేసిన శాపాలలో మరణం, రోగం, కరువు, ఇళ్ళు, పట్టణాల నాశనం, యుద్ధంలో అపజయం, చెర, స్వేచ్ఛను కోల్పోవడం, పేదరికం మరియు అవమానం మొదలగునవి భాగంగా ఉంటాయి.
ప్రవచనం అంటే, దేవుని నుండి వచ్చు సందేశ సమాచారం. ప్రవచనం అంటే, ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడి, ప్రసంగించి, వెంటనే స్పందించాలని పిలుపు ఇవ్వటం. ప్రవక్తల సందేశాల్లో తరచు జరుగబోవు వాటిని ముందుగా తెలియజేసేవారు. అయితే, ప్రవక్త ఒక ప్రసంగికుడు. అతని సందేశంలో జరుగబోవు వాటి గురించి చెప్పినా లేక చెప్పకపోయినా, అతని సందేశం ప్రవచనాత్మకమే.
అనేక సందర్భాల్లో, ప్రవచనంలోని మాటలు ఎప్పుడు ఎలా నెరవేరాయో కూడా మనకు తెలియదు. ఆ వాక్యభాగాలలో నుండి నేర్చుకుంటున్నప్పుడు అది మనకు తెలియవలసిన అవసరం లేదు. తరచు ఆ నెరవేర్పు, ప్రవక్త జీవితకాలంలో లేక తన శ్రోతల కాలంలో జరుగదు, అయినప్పటికీ అతని సందేశం తక్షణ అన్వయింపు, ప్రతిస్పందన కోసం ప్రకటించబడింది. ప్రజలు ప్రస్తుత కాలంలో పశ్చాత్తాపపడి, దేవునికి విధేయత చూపటానికి, ప్రవక్తలు భవిష్యత్ దేవుని రాజ్యాన్ని కారణంగా చూపించారు (హబక్కూకు 2:14).
ప్రవక్తల సంభాషణ మరియు దృష్టాంతాల పద్ధతులు తరచు అసాధారణంగా, నాటకీయంగా ఉంటాయి. వారి సందేశాల్లో అలంకార రూపకాలు ఉపయోగించేవారు, మరికొన్నిసార్లు భౌతికంగా చేసి చూపించేవారు. అయితే, ప్రజలు క్రొత్తగా, అసాధారణంగా ఏదో చేయాలని వారు ప్రసంగించలేదుగాని, దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపాలని ప్రసంగించారు.
ప్రజలను తిరిగి నిబంధనలోకి (దేవునితో వారి సంబంధం) ఆకర్షించిన ప్రవక్తల ప్రసంగాలు, దేవుని నిబంధనలోకి మనలను తిరిగి ఆకర్షించే విధంగా నేడు ప్రసంగించవచ్చు.
ముందుగా చెప్పుట/అంచనా (భవిష్యత్తులో జరుగబోవు సంఘటనలు) తక్షణ ప్రభావం కోసం ఉద్దేశించబడింది. ప్రజలు పశ్చాత్తాపపడి, దేవునికి విధేయత చూపుటకు పిలువబడ్డారు. ఈ ఉద్దేశ్యం నేడు ప్రసంగ ఉద్దేశ్యానికి దగ్గరగా ఉంది.
కొన్ని ప్రవచనాలు షరతులతో కూడి ఉంటాయి. శ్రోతలు మారుమనస్సు పొందడం ద్వారా, ప్రకటించిన తీర్పును తప్పించుకోగలరు (యిర్మీయా 18:7-11, యిర్మీయా 26:13-19). యోనా సందేశం కనికరాన్ని అందించనప్పటికీ, నీనెవెలోని యోనా శ్రోతలు నాశనాన్ని తప్పించుకున్నారు (యోనా 3:4-5, 9-10).
దేవుని తుది ఉద్దేశ్యాల నెరవేర్పు షరతులతో కూడినది కాదు; ఉదాహరణకు, యెషయా 43:5-6 లో, తన స్వశక్తి చేత ఇశ్రాయేలును చెరలో నుండి విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, కాని వాక్యభాగంలో ఇశ్రాయేలు నెరవేర్చవలసినవి ఇవ్వలేదు. ఇంకనూ, ఈ సంఘటనలలో ఒకరి సొంత ఎంపికలు ఒకరి స్థానాన్ని నిర్ణయిస్తాయి.
ప్రవచన గ్రంథాల్లో చారిత్రక కథనాలు ఉన్నాయి కాని ఉపదేశాలు కావ్య రూపాలు ఉన్నాయి. అక్షరార్థంగా అర్థం చేసుకోవలసిన చారిత్రక కథనాలకు మరియు చిహ్నాలు గల కావ్య వాక్యభాగాలకు మధ్య తేడా కనుగొనటం అంత కష్టమైన పని కాదు.
ప్రవక్తల గ్రంథాల్లో ముఖ్యమైన పదాలు, భావాలు
విగ్రహారాధన: నిబంధన యొక్క ప్రాథమిక ఉల్లంఘన
వ్యభిచారం: తరచు విగ్రహారాధనతో కూడిన పాపం, విగ్రహారాధనను సూచించడానికి అలంకార రూపకంగా ఉపయోగింబడుతుంది.
రాజ్యాలు: దేవుని నిబంధనలో లేని లోకాన్ని సూచిస్తుంది. రెండు ఉప-భావాలు:
1. రాజ్యాలు ఎల్లప్పుడు ఇశ్రాయేలుకు విరోధంగా ఉంటాయి.
2. ఇశ్రాయేలు రాజ్యం, ఇతర రాజ్యాల మధ్య తనను ఘనపరచాలని దేవుడు ఆశించాడు.
దేవాలయం: దేవుని సన్నిధికి కేంద్రం. రెండు ఉపభావాలు:
1. వేషధారణతో చేసే ఆరాధన దేవునిని అవమానిస్తుంది.
2. శత్రువులు దేవాలయాన్ని ఆక్రమించుకోవడం, ఇశ్రాయేలు పూర్తి ఓటమిని, దేవుని సన్నిధిని కోల్పోవడాన్ని చూపిస్తుంది.
భూమి/స్వాస్థ్యం: దేవుడు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించే ప్రత్యేక స్థలం.
చెర: దేవుడు అనుగ్రహించిన స్థలం నుండి ఇతర రాజ్యాలకు బానిసత్యం. చెర అంటే ఇశ్రాయేలు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయిందని అర్థం.
వర్షం (సంబంధిత పదాలు): దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన స్థలంలో ఆయన నిరంతర ఆశీర్వాదాలకు సూచన. వర్షం లేకపోవటం, దేవుని అసమ్మతిని సూచిస్తుంది.
పంట (సంబంధిత పదాలు): వర్షం, భూమికి సంబంధించిన దేవుని ఆశీర్వాదాలు.
యెహోవా దినం: భవిష్యత్తు, దుష్టులను నాశనం చేసే దేవుని ఆకస్మిక తీర్పు. తీర్పు ఇతర రాజ్యాలకే అని భావించిన ఇశ్రాయేలీయులు, వారికి కూడా తీర్పు ఉందని విని భయపడ్డారు.
గుర్రాలు: సైనిక దళాన్ని సూచిస్తాయి
ఐగుప్తు నుండి విడుదల: ఇశ్రాయేలును ఒక రాజ్యంగా చేసి, దేవునిని వారి రాజుగా చేసిన చారిత్రక సంఘటన. విగ్రహారాధన, విడుదల తరువాత ఏర్పడిన నిబంధనను అవమానించింది.
ప్రవచన సాహిత్యాన్ని అర్థం చేసుకొనుట
ప్రవచనాత్మక సాహిత్యం, అర్థం చేసుకోవడానికి అత్యంత కష్టమైన సాహిత్య రకాలలో ఒకటి. ప్రవచనాత్మక సాహిత్యాన్ని ప్రభావవంతంగా అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రశ్నలు అడగండి:
(1) ప్రవక్త తన సమాజానికి ఏమి చెప్పాడు?
సుప్రసిద్ధ అభిప్రాయానికి భిన్నంగా, ప్రవచనాత్మక సాహిత్యం కేవలం భవిష్యత్ ప్రవచనాలను గూర్చినదే కాదు. ప్రవక్త మొదట తన సమాజంతో మాట్లాడాడు.
ఉదాహరణకు, ఆమోసు దేవునికి అవిధేయులైన ఇశ్రాయేలుకు రాశాడు. ప్రజలు సంపన్నులై, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన యెడల ఎలాంటి పర్యవసానాలు ఉండవని భావించారు. ఆమోసు తీర్పు సందేశం ప్రకటించాడు: న్యాయాన్ని, నీతిని విడిచిపెట్టినందున ఇశ్రాయేలు తీర్పుకు గురౌతుంది (ఆమోసు 5:7).
(2) అతని సందేశానికి ప్రజలు యేమని స్పందించారు?
ఆమోసు సందేశానికి ఇశ్రాయేలు స్పందన, బేతేలులో ప్రధాన యాజకుడైన అమజ్యా సమాధానంలో కనిపిస్తుంది. యూదాకు తిరిగి వెళ్లి, ఇకమీదట ఉత్తర రాజ్యంలో ప్రకటించకూడదని అతడు ఆమోసు కు ఆజ్ఞాపించాడు. (ఆమోసు 7:10-13).
(3) ప్రవక్త సందేశంలో ఏ సూత్రం నేటి సమాజానికి వర్తిస్తుంది?
ప్రాచీన ఇశ్రాయేలులో నీతి న్యాయాలు దేవుని ప్రజలకు ప్రామాణికంగా ఉన్నట్లే, దేవుడు తన ప్రజల నుండి నేడు నీతి న్యాయాలు కోరుతున్నాడు. నీతిగా జీవించాలనే దేవుని పిలుపును విస్మరించి, దేవుని ఇంటిలో మనం ఆరాధించలేం. (ఆమోసు 5:22-24).
ఈ ప్రశ్నలు ప్రవక్త సమాజంలో నుండి ప్రవచన సత్యాన్ని తీసుకొచ్చి, నేటి సమాజానికి వర్తింపజేస్తాయి. ప్రవక్త సమాజాన్ని చూడడం ద్వారా, నేడు మనం చేసే భాష్యం వాస్తవిక సందేశంపై ఆధారితమైనదని నిశ్చయించుకుంటాం.
సాహిత్య రూపం: అంత్యకాల సంభవాల సాహిత్యం
అంత్యకాల సంభవాలను గురించిన లేఖనాల్లో దానియేలు, జెకర్యా, యోవేలు, ప్రకటన, మరియు బైబిల్ లో ఇతర పుస్తకాలలోని వాక్యభాగాలు ఉన్నాయి.
అంత్యకాల సంభవాలకు సంబంధించిన పుస్తకాల రచయితలు తమ సందేశాన్ని దర్శనం లేక కలలో పొందుకున్నారు. ఇది ఎక్కువ శాతం సాదృశ్యాత్మకమైనది. ఇది జంతువుల్ని లేక వింతైన, క్రూర మృగాల్ని చిహ్నాలుగా ఉపయోగిస్తుంది.
సంఘటనల్ని కాలక్రమానుసారంగా ఉపయోగించడానికి బదులుగా ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడేడప్పుడు వేర్వేరు వివరణలు ఇస్తూ ఒకే సంఘటన/సందర్భం గురించి పదే పదే మాట్లాడతాయి.
సాధారణంగా ఒక లేఖనభాగాన్ని అర్థం చేసుకోవాలంటే, రచయిత ఆ లేఖనభాగాన్ని అలంకార రూపకంగా ఉద్దేశిస్తే తప్ప, దానిని అక్షరార్థంగా తీసుకోవాలి. అంత్యకాల సంభవాల సాహిత్యంలో, రచయిత అనేక విషయాల్ని అలంకార రూపకాలుగా ఉండాలని ఉద్దేశించాడని భాష్యకర్త అర్థం చేసుకోవాలి. అలంకారిక వర్ణనలకు ఉదాహరణలు, దానియేలు దర్శనాల్లోని జంతువులు, క్రూర మృగాలు.
జంతు చిహ్నాలకు ఉదాహరణలు: దానియేలు 7:3-7, ప్రకటన 12:3, ప్రకటన 16:13, మరియు జెకర్యా 6:1-3.
అంత్యకాల సంభవాలను గురించిన రచనలు సాధారణంగా, ప్రస్తుత చెడు, అన్యాయపు లోకంలో విశ్వాసాన్ని కాపాడుకునే సవాళ్లతో వ్యవహరిస్తుంది. తీవ్రమైన సార్వత్రిక యుద్ధాన్ని వివరిస్తుంది.
బైబిల్ లో అంత్యకాల సంభవాలను గురించిన రచనలు, చెడును శిక్షించి మంచికి ఫలమిచ్చే దేవుని అంతిమ విజయాన్ని చూపిస్తాయి. తన ప్రజలకు సహాయం చేసే సార్వభౌమ దేవునిపై దృష్టిపెడతాయి.
అంత్యకాల సంభవాలను గురించిన రచనలో, చిహ్నాలన్నిటిని అర్థం చేసుకోలేకపోయినా, చెప్పిన సంఘటన కాలక్రమాన్ని భాష్యకర్త ఏర్పాటు చేయలేకపోయినా, ప్రధాన సందేశాన్ని అర్థం చేసుకోగలం.
గొప్ప, తుది యుద్ధాన్ని వివరించే వాక్యభాగాల ఉదాహరణకు: యోవేలు 2:9-11, ప్రకటన 19:11-21, మరియు ప్రకటన 20:7-9.
తుది విజయం, దేవుని నిత్య రాజ్యం గురించి బోధించే వాక్యభాగాల ఉదాహరణలు: దానియేలు 7:14, 27 మరియు జెకర్యా 14:9.
అంత్యకాల సంభవాలను గురించిన పుస్తకాలతో పాటుగా, ఇతర కొన్ని వాక్యభాగాల్ని కూడా అంత్యకాల సంభవాల రచనలుగా పరిగణించవచ్చు. ఎందుకంటే దేవుడు అకస్మాత్తుగా జోక్యం చేసుకుని దుష్టశక్తులకు తీర్పుతీర్చి నీతిమంతుల్ని విడిపిస్తాడని అవి చెబుతాయి. ఈ లేఖనభాగాల్లో దర్శనాలు, లేక జంతువులు వంటి అంత్యకాల సంభవాల రచనలోని ఇతర లక్షణాలు ఉండవు. (ఉదాహరణలు ఏవనగా, యెహెజ్కేలు 37-39, యెషయా 24-27, మత్తయి 24, మార్కు 13, లూకా 21, 2 థెస్సలొనీకయులకు 2, మరియు 2 పేతురు 3.)
అంత్యకాల సంభవాలను గురించిన లేఖనాల సాధారణ అన్వయం
ప్రపంచ సమస్యకు అంతిమ పరిష్కారం సంస్కృతి లేక సాంఘిక పురోగతి కాదు. రాజకీయ సంస్కరణ లేక విప్లవం కాదు. దేవుడు జోక్యం చేసుకోవడమే పరిష్కారం. ప్రస్తుతం ఆయన తన ప్రజలకు విశ్వాసం, బలం, దయ అనుగ్రహిస్తున్నాడు. భవిషత్తులో ఆయన అకస్మాత్తుగ వచ్చి, లోకమంతటినీ పూర్తిగా మార్చేస్తాడు.
విశ్వాసులు విశ్వాసంతో సహించాలి. సంపూర్ణ దేవుని ప్రణాళిక లేక లోక సంఘటనలు గురించి ప్రస్తుత అవగాహన అవసరం లేదు. విశ్వాసం కలిగి ఉండడం అంటే ప్రజలు తక్షణ ఫలితాల్ని అంచనా వేయగలరని కాదు. బదులుగా, నిజమైన విశ్వాసం గల ప్రజలు, ప్రతి పరిస్థితిలోనూ దేవునిపట్ల విధేయత చూపుతారు, ఎందుకంటే చివరకు విధేయత విలువైనదని వారికి తెలుసు.
సాహిత్య రూపం: ఉపమానం
ఉపమానం అనగా ఆత్మీయ సత్యాన్ని ప్రకృతి విషయాలతో లేక జీవన పరిస్థితులతో పోల్చే బోధనా సాధనం. ఆత్మీయ సత్యానికి, సహజ సత్యానికి మధ్య సారుప్యతను చూపిస్తారు తద్వారా మనం ఆత్మీయ సత్యాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం.
యేసుకు ఉపమానాలు బోధించడం అంటే ఎంతో ఇష్టం (మత్తయి 13:34). ఆయన 30 ఉపమానాలు చెప్పాడు, ఇతర అనేక అలంకార రూపక సమాంతరాలు ఉపయోగించాడు.
ఉపమానాల ద్వారా, యేసు ప్రార్థన గురించి (దేవాలయంలో పరిసయ్యుడు, సుంకరి, లూకా 18:9-14), మన పొరుగువాళ్లని ప్రేమించడం గురించి (మంచి సమరయుడు, లూకా 10:29-37), దేవుని రాజ్య స్వభావం గురించి (మత్తయి 13 ఉపమానాలు), పాపులకు దేవుని కనికరం గురించి (తప్పిపోయిన కుమారుడు, లూకా 15:11-32) బోధించాడు.
తన శ్రోతలను సూటిగా నిందించకుండా, గద్దించడానికి ఉపమానాలు యేసుకు సహాయపడ్డాయి. యేసు చెప్పిన ఉపమానాలు ఆసక్తికరంగా ఉండటం వలన, అవి యేసు శ్రోతలు ఆయన మాటలు వినేలా చేశాయి. అకస్మాత్తుగా వారు "ఆయన నా గురించి మాట్లాడుతున్నాడు" అని గ్రహించి ఆశ్చర్యపోయారు. దావీదు గురించి పేదవాని గొర్రె ఉపమానం చెప్పినప్పుడు ప్రవక్తయైన నాతాను కూడా ఇదే చేశాడు (2 సమూయేలు 12:1-10). “ఆ మనుష్యుడవు నీవే,” అని నాతాను చెప్పినప్పుడు, ఆ ఉపమానం తన గురించే అని దావీదు తెలుసుకున్నాడు.
ఉపమానాలను అర్థం చేసుకోవడం
భాష్యకర్త ఇవి గమనించాలి:
ఉపమానం ఎలా పరిచయం చేశారు?
ఉపమానం ముగింపు ఏంటి?
ఉపమానం ఎలాంటి సమాధానాన్ని లేక వైఖరిలో ఎలాంటి మార్పును కోరుతుంది?
మొదటి శ్రోతల ప్రతిస్పందన ఏమై ఉంటుంది?
(1) ఉపమానాన్ని ఎలా పరిచయం చేశారు?
యేసు తరచు ఒక ప్రశ్నకు లేక వైఖరికి సమాధానంగా ఉపమానాలు చెప్పాడు. ఉపమానం ఏ పరిస్థితిలో తెలుసుకోవడం, దాని సందేశం అర్థం చేసుకునే విషయంలో భాష్యకర్తకు సహాయపడుతుంది.
మన ఉపమాన భాష్యం, యేసు ఆ ఉపమానం చెప్పడానికి కారణమైన సంభాషణ లేక పరిస్థితికి వ్యక్తిరేకంగా ఉంటే, మనం దాని అర్థాన్ని సరిగా గ్రహించనట్లే.
ప్రశ్నకు సమాధానంగా ఉపమానాలు. సంభాషణ సమయంలో, “నా పొరుగువాడెవడని?” ధర్మశాస్త్రోపదేశకుడు యేసును అడిగాడు. “నువ్వేళ్ళే దారిలో అవసరతలో ఉన్న నీ పొరుగువాడు-నీ బాధ్యత” అని యేసు సూటిగా చెప్పొచ్చు. బదులుగా, మంచి సమరయుడు కథ ద్వారా, యేసు పరోక్షంగా జవాబు చెప్పాడు.
అగస్టీన్, ఉపమానం ఏ ప్రశ్నకైతే జవాబిచ్చాడో దానిని నిర్లక్ష్యం చేశాడు గనుక తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇది అగస్టీన్ ఇచ్చిన వివరణ: యేసు (సమరయుడు) ఆదాముని (మనుష్యుడు) సాతాను (దొంగలు) నుండి విడిపించి, అతన్ని భద్రత కోసం సంఘానికి (సత్రం) తీసుకెళ్లాడు. యేసు పాపాన్ని కట్టిపడేయడానికి (గాయాలు) పౌలుకు (సత్ర యజమాని) రెండు దేనారాలు (ఈ జీవం, రాబోవు జీవం గురించిన వాగ్దానాలు) ఇచ్చాడు. అగస్టీన్ భాష్యం, యేసు మరియు ధర్మశాస్త్రోపదేశకునికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించినది కాదు గనుక అది తప్పు.
వైఖరికి సమాధానంగా ఉపమానాలు. లూకా 15:1-3 ఇలా సెలవిస్తుంది, “ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులును శాస్త్రులును అది చూచి–ఇతడు పాపులను చేర్చుకొని వారితోకూడ భోజనముచేయుచున్నాడని చాల సణుగుకొనిరి. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను”:
ఒక కాపరి గొర్రె తప్పిపోయింది. గొర్రె దొరికినప్పుడు అతడు ఎంత ఆనందించాడో చూడండి.
ఒక స్త్రీ నాణెం పోయింది. నాణెం దొరికినప్పుడు ఆమె ఎంత ఆనందించిందో చూడండి.
ఒక తండ్రి, కుమారుడు తప్పిపోయాడు. కుమారుడు దొరికినప్పుడు అతడు ఎంత ఆనందించాడో చూడండి.
ఈ మూడు ఉపమానాల ద్వారా, యేసు చెప్పిన విషయం ఏంటంటే, “నేను పాపులతో తింటున్నానని మీరు ఆశ్చర్యపోవద్దు. ఒక్క పాపి మారుమనసు పొందినప్పుడు పరలోకంలో ఎంత ఆనందమో చూడండి.”
ఉపమానంలోని ప్రధాన పాఠం, దాన్ని ప్రేరేపించిన ప్రశ్న లేక పరిస్థితికి నేరుగా సంబంధించినదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
(2) ఉపమానం ముగింపు ఏంటి? ఉపమానం ఎలాంటి సమాధానాన్ని లేదా వైఖరిలో ఎలాంటి మార్పును కోరుతుంది?
వేర్వేరు అన్వయాలు సాధ్యమైనప్పటికీ, ఉపమానం సాధారణంగా ఒక ప్రధాన విషయాన్ని తెలియజేస్తుంది. ఉపమానంలో ఉన్న ప్రతి ప్రధాన పాత్ర ఒక పాఠాన్ని ఉదహరిస్తుంది.
తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ప్రధాన పాఠం ఇప్పటికే మనం చూశాం: మారుమనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోక మందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఈ ప్రధాన విషయం, యేసు ఉపమానాన్ని ప్రేరేపించిన పరిస్థితికి సమాధానం: పరిసయ్యులు పాపుల్ని క్షమించడానికి ఇష్టపడకపోవడం. మూడు పాత్రల్లో ప్రతి ఒక్కటి ప్రధాన విషయానికి సంబంధించి నేరుగా ఒక పాఠాన్ని బోధిస్తుంది.
పాత్ర
పాఠం
తప్పిపోయిన కుమారుడు
పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగిన పాపులకు క్షమాపణ దొరుకుతుంది.
ప్రేమగల తండ్రి
క్షమించడానికి ఇష్టపడకుండా ఉండక, మన పరలోకపు తండ్రి క్షమించడంలో సంతోషిస్తాడు.
అన్నయ్య
క్షమించని వ్యక్తికి తండ్రివంటి ప్రేమ ఉండదు.
యేసు క్షమించలేని అన్నయ్యకు క్షమించే తండ్రికి మధ్య వ్యత్యాసాన్ని వివరించాడు. క్షమించలేని పరిసయ్యులను గద్దించడం యేసు ఉద్దేశ్యం. వాళ్ల తప్పుడు వైఖరుల్ని బట్టి వాళ్లు మారుమనసు పొందాలని ఆయన ఆశించాడు.
ఈ ఉపమానం నుండి ప్రకటించే ఎవ్వరైనా, పాపిని పశ్చాత్తాపపడమని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తండ్రి ప్రేమ, క్షమాపణను నొక్కి చెప్పాలి. లేక విశ్వాసులు అవిశ్వాసుల పట్ల దేవుని క్షమాపణ వైఖరి చూపించాలని ప్రకటించాలి.
(3) వాస్తవిక శ్రోతల ప్రతిస్పందన ఏమై ఉంటుంది?
ఉపమానం మొదటి శ్రోతల్ని ఎలా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవాలంటే, వాళ్ల సంస్కృతిని అర్థం చేసుకోవాలి. యేసు ఉపమానాలు తరచూ ఆయన సంస్కృతి నియమాలకు విరుద్ధంగా ఉన్నాయి. దీని వల్ల వాళ్లు ఆశ్చర్యపోయారు.
ఉదాహరణకు, మళ్ళీ తప్పిపోయిన కుమారుని ఉపమానం చూడండి. కుమారుడు తన ఆస్తిని ముందుగానే అడగడం అవమానకరమైన కార్యంగా యేసు శ్రోతలు పరిగణించి ఉంటారు. ఆ తర్వాత కుమారుడు దాన్ని వృథా చేశాడు. కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, తండ్రి అతన్ని తిరస్కరిస్తాడని, చూడడానికి ఇష్టపడడని, అతన్ని కొట్టి పంపించేస్తాడని శ్రోతలు అనుకున్నారు. కుమారుడ్ని ఆహ్వానించడానికి తండ్రి పరిగెత్తుకుని వెళ్లినప్పుడు శ్రోతల ఆశ్చర్యం ఒక్కసారి ఊహించుకోండి.
మంచి సమరయుడు ఉపమానంలో, యాజకుడు లేవీయుడు గాయపడ్డ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం శ్రోతలకు ఆశ్చర్యంగా లేదు ఎందుకంటే వాళ్లు దేవాలయ అధికారుల్ని అవినీతిపరులుగా, వేషధారులుగా పరిగణించారు. వాళ్లు పరిసయ్యుల్ని గౌరవించారు, సహాయం చేసిన మూడవ వ్యక్తి పరిసయ్యుడు అనుకున్నారు. మూడవ వ్యక్తి జాతిని బట్టి, మతపరమైన హోదా లేకపోవడం వల్ల తృణీకరించబడిన సమరయుడు అని వినగానే వాళ్ల ఆశ్చర్యం ఒక్కసారి ఊహించండి.
ఉపమానం యొక్క సాంస్కృతిక నేపథ్యం పరిగణలోకి తీసుకున్నప్పుడు, సందేశాన్ని మరింత తేటగా చూడగలుగుతాం.
ఉపమానాలలో వివరాలు, సాదృశ్యాలు
ప్రతి ఉపమానంలోని ప్రతి వివరణ సాదృశ్యాత్మకంగా ఉందని కొందరు ప్రసంగికులు అపార్థం చేసుకుంటారు. ఉదాహరణకు, మంచి సమరయుడు ఉపమానం గురించి, ప్రయాణికుడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్లుతున్నప్పుడు, ఆ పట్టణం దేవుడు శపించింది కాబట్టి అది తప్పుడు నిర్ణయమని కొందరు భావిస్తారు. ఉపమాన ఉద్దేశ్యం, ఒక వ్యక్తి పొరుగువారిని ఎలా ప్రేమించగలడు అనే విషయాన్ని వివరించడం కాబట్టి ఇది మంచి భాష్యం కాదు. దీనిలో ఉన్న వివరాలు దేనికీ చిహ్నాలు కావు.
మార్కు 4:30-32లోని ఉపమానంలో, చెట్టులో పక్షులు దేనిని సూచిస్తున్నాయో ప్రసంగికులు భావించారు, కాని పక్షులను గురించిన ప్రస్తావన ఒక చిన్న విత్తనం పెరిగి పెద్దదై, పక్షులు కొమ్మల మీద కూర్చోడానికి వీలు కలిగిస్తుందని మాత్రమే సూచిస్తుంది.
తప్పిపోయిన కుమారుని ఉపమానంలో, సాదృశ్యపరమైన అర్థం కనుగొనడానికి ఎటువంటి ఆధారం లేదు. ఉదాహరణకు, పందులు సాదృశ్యాలు కాదు. కుమారుని దరిద్ర స్థితిని సూచించడానికి పందులను ప్రస్తావించారు: యూదుడైన బాలుడు సాధారణంగా పందులకు దగ్గరగా ఉండడు.
ఉపమాన విషయాలు సాదృశ్యాత్మకంగా ఉండడం అరుదు. ఉపమానంలో సాదృశ్యాత్మకమైన వివరణకు ఒక ఉదాహరణ, గురుగులు మరియు గోధుమల ఉపమానం (మత్తయి 13:38-39). ఈ ఉపమానంలోని వివరాలు సాదృశ్యాత్మకమని మనకు తెలుసు ఎందుకంటే యేసు ప్రత్యేకంగా వాటి గురించి చెప్పాడు.
ఉపమానాలను ప్రసంగించడం
ఒక ప్రసంగికుడు ఉపమానాన్ని తన సంస్కృతిలో సుపరిచితమైన పరిస్థితి కోసం తీసుకోవచ్చు. అయితే, ఆ ఉపమానం మొదటి శ్రోతలకు ఎలా వర్తిస్తుందో అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించాలి. లేని యెడల, అతడు అదే సందేశాన్ని తన శ్రోతలకు ఇవ్వలేడు.
ఒక భాష్యకర్త ఒక ఉపమానాన్ని ఇతర స్పష్టమైన లేఖనాల మద్దతులేని సిద్ధాంతానికి లేదా అన్వయానికి ఆధారంగా ఉపయోగించకూడదు.
క్రొత్త నిబంధన పుస్తకాల్లో ఎక్కువగా పౌలు, యాకోబు, పేతురు, యోహాను మరియు యూదా రాసిన పత్రికలు ఉన్నాయి. అయితే పత్రిక మధ్య వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, కొన్ని లక్షణాలు సాధారణమైనవి. క్రొత్త నిబంధన పత్రికలు ఏవంటే:
1.అధికారికమైనవి. క్రొత్త నిబంధన పత్రికలు రచయిత ఉనికికి ప్రత్యామ్నాయం. పత్రిక రచయిత అధికారాన్ని సూచిస్తుంది; ఈ అధికారాన్ని ఎల్లప్పుడు ఆరంభ వచనాల్లో పేర్కొంటారు.[2]
2.పరిస్థితికి సంబంధించినవి: క్రొత్త నిబంధన పత్రికలు ఎల్లప్పుడు నిర్దిష్ట పరిస్థితులు లేక సమస్యలు గురించి మాట్లాడతాయి. ఉదాహరణకు, రక్షణ యూదుల ఆచారాల్ని అనుసరించడం ద్వారా వస్తుందని ఆలోచిస్తున్న సంఘానికి గలతీ పత్రికను రాశారు. క్రీస్తులో మన స్వాతంత్య్రం గురించి పౌలు నొక్కి చెప్పాడు. దీనికి భిన్నంగా, కొరింథీ సంఘం ఆ స్వేచ్ఛను తీవ్రంగా తీసుకుని- లైంగిక అనైతికతను సహిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో, మనం విధేయులముగా ఉండాలని పౌలు నొక్కి చెప్పాడు.
3. విశ్వాసులకు ఉద్దేశించబడ్డాయి. పత్రికలు, ప్రాంతీయ సంఘాలకు (రోమా) లేక వ్యక్తిగత విశ్వాసులకు (ఫిలేమోనుకు) లేక సాధారణ విశ్వాసులకు (యూదా) రాశారు. పత్రికలు పొందిన వాళ్లందరూ దేవునితో రక్షణ సంబంధంలో ఉన్నవాళ్ళు కాదు. తమ క్రియలు మార్చుకుని మారుమనస్సు పొందాలని పౌలు కొరింథీ విశ్వాసులకు పిలుపునిచ్చాడు; సువార్త వైపు తిరిగి రండని గలతీయులకు చెప్పాడు; తీర్పు కోసం ఎదురుచూడమని అన్యాయస్తులైన ధనవంతులకు యాకోబు చెప్పాడు. అయితే, పత్రికలు క్రైస్తవ విశ్వాస కుటుంబ సందర్బములో రాశారు.
క్రొత్త నిబంధన పత్రికల నిర్మాణం
పరిచయం
రచయిత పేరు, స్థితి/హోదా
గ్రహీతలు/శ్రోతలు
అభివందనం
పరిచయ ప్రార్థన
ముఖ్య భాగం (పత్రిక ప్రధాన సందేశం)
ముగింపు (ఇందులో ఇలాటి విషయాలు ఉంటాయి)
యాత్ర ప్రణాళికలు (తీతుకు 3:12)
అభినందనలు, శుభాలు (రోమా 16)
తుది సూచనలు (కొలొస్సయులకు 4:16-17)
ఆశీర్వాదం (ఎఫెసీయులకు 6:23-24)
దైవస్తోత్రం (యూదా 24-25)
పత్రికల భాష్యం
మీరు ఒక స్నేహితుని నుండి పత్రికను పొందుకున్నప్పుడు, కూర్చొని పత్రిక అంతటినీ చదువుతారు. క్రొత్త నిబంధన పత్రికలు కూడా అలాగే చదవండి. రచయిత పూర్తి సందేశం పొందుకోవడానికి పత్రిక అంతా చదవండి. మీరు చదువుతుండగా, మీ పరిశీలనలు జాబితా చేయండి. మీరు ఎంత ఎక్కువ పరిశీలనలు చేస్తారో, అంత మంచిగా భాష్యం చేయగలుగుతారు.
బైబిల్ పత్రిక చదివేటప్పుడు అనేక ప్రశ్నలు అడుగవలసి ఉంది:
(1) పత్రిక గ్రహీత ఎవరు?
పత్రిక పొందిన సంఘం లేక వ్యక్తి గురించి ఎంత ఎక్కువ అవగాహన కలిగియుంటే, పత్రికను అంత ఉత్తమంగా అర్థం చేసుకుంటాం. మనం పౌలు పత్రిక అధ్యయనం చేసేటప్పుడు, గ్రహీత సంఘం గురించి అపొస్తలుల కార్యాలలోని సూచనలు చదవుతూ మొదలుపెట్టడం సహాయకరంగా ఉంటుంది. ఇలా చేస్తే పత్రికను బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకు:
ఫిలిప్పీ సంఘం హింసలో పుట్టింది (అపొస్తలుల కార్యములు 16:12-40). కష్ట పరిస్థితుల్లో కూడా వాళ్లు ఆనందించాలనే పౌలు సూచనను ఇది నొక్కి చెబుతుంది.
ఎఫెసీ (ఇతర పౌలు పత్రికలవలే) పత్రికను విశ్వాసులకు రాశాడు. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, (ఎఫెసీయులకు 3:15-18) అని ఎఫెసీ విశ్వాసుల కోసం పౌలు ప్రార్థించినప్పుడు, దేవుని పిల్లలు దేవుని పరిపూర్ణత పొందుతారని ప్రార్థిస్తున్నాడు. క్రైస్తవులు “తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై” (ఎఫెసీయులకు 1:4-6) ఉండాలని ప్రార్థిస్తున్నాడు.
(2) రచయిత ఎవరు? అతనికి గ్రహీతకు ఉన్న సంబంధం ఏంటి?
మీకు ఎవరైనా పత్రిక/లేఖను పంపినప్పుడు, ఇది “ఎవరు రాశారో?” తెలుసుకోవాలనుకుంటారు. రచయిత గురించి మీకు ఎంత బాగా తెలిస్తే, పత్రిక అంత ఆసక్తిగా ఉంటుంది. అదే విధంగా, బైబిల్ లోని పత్రిక రచయిత గురించి మనకు ఎంత బాగా తెలిస్తే, అతని సందేశం అంత మంచిగా అర్థమౌతుంది.
తన పత్రికల్లో, అపొస్తలుడైన యోహాను ప్రేమ గురించి నొక్కి చెప్పాడు. యోహాను మునుపు “ఉరిమెడు”వానిగా (మార్కు 3:17) ప్రసిద్ధిచెందాడు. అప్పట్లో, పరలోకం నుండి అగ్నిని రప్పించడానికి అతడు, అతని సహోదరుడు యేసు అనుమతి కోరారు (లూకా 9:54). తరువాత రాసిన యోహాను పత్రికలు, పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా అతడు మారాడని చూపిస్తాయి.
శ్రమలో ఉన్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి పేతురు తన పత్రికలు రాశాడు. వాళ్లు సాతాను దాడుల్లో ధైర్యంగా ఉండాలని చెప్పాడు (1 పేతురు 5:8-9). మునుపు పేతురు జీవితంలో, అతడు భయంతో యేసును ఎరుగనని ముమ్మారు అబద్ధం చెప్పాడు (మార్కు 14:66-72). తర్వాత తన జీవితంలో జరిగిన మార్పు గురించి పేతురు పత్రికలు చూపిస్తాయి.
పత్రిక చదివేటప్పుడు రచయిత మరియు గ్రహీతలు మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవడం సహాయకరం. ఫిలిప్పీ సంఘంతో పౌలుకు ఉన్న సంబంధం, సంతోషాన్ని గురించి రాసిన తన పత్రిక అంతటిలో కనిపిస్తుంది. మరోవైపు, కొరింథులో పౌలు మరియు తిరుగుబాటు చేసిన సభ్యులకు మధ్య సంఘర్షణ, 1 మరియు 2 కొరింథీ పత్రికల్లో బలమైన గద్దింపులకు దారితీసింది.
(3) ఏ పరిస్థితులు పత్రికను ప్రేరేపించాయి?
పౌలు పత్రికల్ని ప్రేరేపించిన పరిస్థితులు మనకు తెలుసు. 1 మరియు 2 కొరింథీ పత్రికలు, కొరింథులోని సమస్యలు, ప్రశ్నలకు ప్రతిస్పందనగా రాశాడు. పారిపోయిన దాసుడైన ఒనేసీము పక్షాన విజ్ఞప్తిగా ఫిలేమోను పత్రిక రాశాడు.
పత్రిక పరిస్థితుల్ని అర్థం చేసుకునే విలువ గురించి గలతీయులకు రాసిన పత్రిక చూపిస్తుంది. గలతీ పత్రికలో కొన్ని వచనాలు చదివిన తర్వాత, “గలతీ పట్టణంలో ఏం జరుగుతుంది?” అని మీరు అడగాలి. “క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది” (గలతీయులకు 1:6) అని పౌలు మొదలుపెట్టాడు. ఈ క్రొత్త విశ్వాసులు విశ్వాసం మూలంగా కృప ద్వారానే నీతిమంతులుగా చేయబడే సువార్తను విడిచిపెడుతున్నారనే విషయం త్వరలో స్పష్టమౌతుంది. బదులుగా వాళ్లు క్రియల ద్వారా నీతిమంతులుగా చేయబడు సందేశాన్ని నమ్ముతున్నారు. ఈ క్రొత్త విశ్వాసుల పట్ల పౌలు మాటలు ప్రేమను బట్టి ప్రేరేపించబడ్డాయి. విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా చేయబడు సందేశాన్ని ప్రకటించడానికి అతడు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. గలతీయులు ఆ సత్యాన్ని విడిచి, అబద్ధ బోధను అంగీకరిస్తున్నారని అతడు ఆశ్చర్యపోయాడు.
సాహిత్య రూపం: ఉపదేశం
ఉపదేశం అంటే క్రమమైన బోధన. ఇది అంశం 1 నుండి అంశం 2 వరకు క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఈ సాహిత్య రూపం క్రొత్త నిబంధన పత్రికల్లో మరిముఖ్యంగా పౌలు పత్రికల్లో సర్వసాధారణం. ఈ పత్రికల్లో, పౌలు ఒక ఉత్తమ బోధకుడిలా సత్యాన్ని స్పష్టంగా వివరిస్తాడు.
కాబట్టి, మరియు, లేక, అయితే వంటి అనుసంధాన పదాలను ఉపదేశం ఉపయోగిస్తుంది. ఇందులో ఎల్లప్పుడు ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. వివరణ, సత్యాన్ని స్పష్టంగా, తార్కికంగా వివరిస్తుంది.
కొలొస్సయులకు రాసిన పత్రికలో, పౌలు క్రీస్తు స్వభావం గురించి బోధించాడు. క్రీస్తు మానవుల తత్వజ్ఞానాలకు, సంప్రదాయాలన్నిటికి అతీతుడని పౌలు బోధించాడు. పౌలు ఈ తార్కిక పద్ధతి అనుసరించాడు:
1. పౌలు, క్రీస్తు ఆధిపత్యానికి రుజువు ఇచ్చాడు (కొలొస్సయులకు 1:15-23)
సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.
సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టియు సృజింపబడెను.
సంఘం అను శరీరానికి ఆయనే శిరస్సు
సమాధానం ఆయన ద్వార కలుగుతుంది.
2. పౌలు తన ఉద్దేశ్యాన్ని రాతపూర్వకంగా తన శ్రోతలకు గుర్తుచేశాడు. అన్యజనులను క్రీస్తు యొద్దకు తీసుకురావడానికి క్రీస్తు ఘనమైన సందేశం పౌలుకు అప్పగించబడింది (కొలొస్సయులకు 1:24–2:5)
3. క్రీస్తు ఆధిపత్యాన్ని తిరస్కరించే బోధనలకు వ్యతిరేకంగా పౌలు హెచ్చరించాడు (కొలొస్సయులకు 2:6-23).
ప్రజలు, దేవుని ధర్మశాస్త్రం పాటించడం ద్వారా రక్షణ పొందుతారనే బోధ
ఆత్మలతో సంభాషించే ప్రమాదకరమైన ఆచారం
ఆత్మీయ ఫలితాల కోసం భౌతిక క్రమశిక్షణ అవసరమని చెప్పే తప్పుడు ఉద్దేశ్యం
4. కాబట్టి, క్రీస్తు ఆధిపత్యం వలన, మీరు ఇలా జీవించాలి
(కొలొస్సయులకు 3-4):
క్రీస్తుకు లోబడడం, మన నైతిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది.
సమాధానం కలిగి, కృతజ్ఞత భావంతో జీవిస్తాం (కొలొస్సయులకు 3:12-17).
క్రీస్తుకు లోబడడం, ఇతరులతో మనకున్న సంబంధంపై ప్రభావం చూపుతుంది (కొలొస్సయులకు 3:18-4:6).
5. ముగింపు మాటలు, కొలస్సీ విశ్వాసుల పట్ల పౌలుకున్న వ్యక్తిగత శ్రద్ధను శ్రోతలకు గుర్తుచేస్తాయి (కొలొస్సయులకు 4:7-18).
పౌలు పత్రిక, క్రీస్తు ఆధిపత్య సిద్ధాంతం గురించిన వివరణ. అది క్రీస్తు స్వభావం గురించి, విశ్వాసులుగా మన జీవితాల్లో ఈ సత్యం యొక్క ప్రభావం గురించి బోధిస్తుంది.
[1]ఈ భాగంలోని విషయాలు J. Scott Duvall మరియు J. Daniel Hays, Grasping God’s Word (Grand Rapids: Zondervan, 2012) నుండి తీసుకున్నారు.
(1) సరైన వ్యాఖ్యానం, మనం అధ్యయనం చేస్తున్న వాక్యభాగపు సాహిత్య రూపాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తుంది.
(2) బైబిల్ లో కనిపించే కొన్నిముఖ్య సాహిత్య రూపాలు:
చరిత్ర: వాస్తవ ప్రజలు, సంఘటనల ఖచ్చితమైన చారిత్రక కథనాలు. చరిత్రను భాష్యం చెప్పేటప్పుడు, ఇలా అడగాలి:
కథ ఏంటి?
కథలో ప్రజలు ఎవరు?
చారిత్రక కథనం అనుసరించడానికి మాదిరి ఇస్తుందా?
ఈ చారిత్రక కథనంలో ఏ సూత్రాలు బోధించారు?
పాత నిబంధన ధర్మశాస్త్రం
క్రొత్త నిబంధన విశ్వాసులకు పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రాముఖ్యమైంది ఎందుకంటే:
అది దేవుని స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది.
రక్షణ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తుంది.
దేవుని చిత్తం తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. పాత నిబంధన ధర్మశాస్త్రంలో మూడు వర్గాలను గురించి ఆలోచన చేయడం సహాయకరం:
ఆచార నియమాలు
పౌర నియమాలు
నైతిక నియమాలు పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని భాష్యం చెప్పేటప్పుడు, ఇలా అడగాలి:
మొదటి శ్రోతలకు ఈ వాక్యభాగం యొక్క అర్థం ఏంటి?
బైబిల్ శ్రోతలకు, మన ప్రపంచానికి మధ్య వ్యత్యాసాలు ఏంటి?
ఈ వాక్యభాగంలో బోధించిన సూత్రాలు ఏంటి?
క్రొత్త నిబంధన ఏ విధంగానైన ఈ సూత్రాన్ని అంగీకరిస్తుందా?
కావ్యం
హెబ్రీ కావ్య లక్షణాలు:
సమాంతరత
అలంకారాలు
జ్ఞాన సాహిత్యం: జీవితం ఎలా పనిచేస్తుందో బోధిస్తుంది
సామెతలు: జీవితం గురించిన పరిశీలనలు క్లుప్తంగా, స్పష్టంగా పేర్కొనబడినవి
సామెతల్ని అర్థం చేసుకున్నప్పుడు, ఇలా అడగాలి:
ఈ లేఖనంలో బోధించిన సాధారణ సూత్రం ఏంటి?
ఈ సూత్రానికి ఏ మినహాయింపులు ఉన్నాయి?
బైబిల్ లో ఎవరు ఈ సూత్రాన్ని అనుసరిస్తారు?
పాత నిబంధన ప్రవచనం: దేవుని సందేశాలు చెప్పడం
పాత నిబంధన ప్రవచనాన్ని భాష్యం చెప్పేటప్పుడు, ఇలా అడగాలి:
ప్రవక్త తన సమాజానికి ఏమి చెప్పాడు?
అతని సందేశానికి ప్రజలు యేమని స్పందించారు?
ప్రవక్త సందేశంలో ఏ సూత్రం నేటి సమాజానికి వర్తిస్తుంది?
అంత్యకాల సంభవాల సాహిత్యం
అంత్యకాల సంభవాల సాహిత్యాన్ని భాష్యం చెప్పేటప్పుడు, ఈ విషయాలు గుర్తుంచుకోండి:
ఇది ఎక్కువ శాతం సాదృశ్యాత్మకమైనది.
ఇది సంఘటనల్ని ఖచ్చితంగా కాలక్రమానుసారంగా వివరించదు.
ఇది వేర్వేరు వివరాలు ఇస్తూ, ఒకే సంఘటను పదే పదే వివరించవచ్చు. అంత్యకాల సంభావనల సాహిత్యంలో అత్యంత ముఖ్య విషయాలు:
ప్రస్తుత దుష్ట లోకంలో విశ్వాసం కాపాడుకొనే సవాలు.
తన ప్రజలకు సహాయం చేసే సార్వభౌమ దేవుడు.
ఉపమానం: ఆత్మీయ సత్యాన్ని ప్రకృతి విషయాలతో లేక జీవ పరిస్థితులతో పోల్చే బోధన. ఉపమానాలనేవి తరచుగా ఒక ప్రశ్నకు లేక వైఖరికి సమాధానంగా చెప్పబడినవి. ఉపమానాలు భాష్యం చెప్పేటప్పుడు, ఇలా అడగాలి:
ఉపమానం ఎలా పరిచయం చేశారు?
ఉపమానం ముగింపు ఏంటి?
ఉపమానం ఎలాంటి సమాధానాన్ని లేక వైఖరిలో ఎలాంటి మార్పును కోరుతుంది?
మొదటి శ్రోతల ప్రతిస్పందన ఏమై ఉంటుంది?
పత్రిక క్రొత్త నిబంధన పత్రికలు ఏవనగా:
అధికారికమైనవి
పరిస్థితికి సంబంధించినవి
విశ్వాసులకు ఉద్దేశించబడ్డాయి పత్రికలు భాష్యం చెప్పేటప్పుడు, ఇలా అడగాలి:
పత్రిక గ్రహీత ఎవరు?
రచయిత ఎవరు? అతనికి గ్రహీతకు ఉన్న సంబంధం ఏంటి?
ఏ పరిస్థితులు పత్రికను ప్రేరేపించాయి?
వివరణ: క్రమమైన బోధన
పాఠం 6 అభ్యాసం
1వ పాఠంలో, ఈ కోర్సు సమయంలో అధ్యయనం చేయడానికి ఒక వాక్యభాగం ఎన్నుకున్నారు. మీ ఎన్నుకున్న వాక్యభాగ సాహిత్య రూపం ఏంటి? వాక్యభాగాన్ని ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి సహాయంగా ఈ పాఠంలో విషయాలను ఉపయోగించండి. నిర్దిష్ట సాహిత్య రూపానికి సంబంధించి భాష్య ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.