మనం చదివే కొన్ని విషయాలకు ప్రాముఖ్యత ఉండదు; మనం ప్రయాణించేటప్పుడు సమయం గడవాలని నవలను చదువుతాం. మనం చదివే కొన్ని విషయాలకు తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది; లోకంతో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వార్తా పత్రిక చదువుతాం. మనం చదివే కొన్నింటికి నిత్యత్వపు ప్రాముఖ్యత ఉంటుంది; మనం దేవుని స్వరం వినటానికి బైబిల్ చదువుతాం. లేఖనం “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” (2 తిమోతికి 3:16-17) అని పౌలు రాశాడు. ఈ కారణంగా, బైబిల్ జాగ్రత్తగా చదువుతూ, దేవుడు మాటలు వింటాం.
2వ పాఠంలో, కొన్ని ప్రత్యేకమైన, నిర్దిష్టమైన వచనాలను గురించి పరిశీలనలు చేశాం. ఈ పాఠంలో, (ఎక్కువ వచనాలు ఉన్న) వాక్యభాగాలు అధ్యయనం చేద్దాం. వాక్యంలో ఒక భాగం, అధ్యాయాలు, లేక పుస్తకమంతా కావచ్చు. చారిత్రిక కథనంలో, పెద్ద వాక్యభాగం అంటే బహుశా కథ మొత్తం. సువార్తలలో, ఒక ఉపమానం, అద్భుతం, లేక ప్రసంగాన్ని అధ్యయనం చేయొచ్చు. పత్రికలో, ఒక పెద్ద వాక్యభాగం అంటే, ఒక విషయంపై దృష్టిపెట్టే ఒక భాగం కావచ్చు.
వాస్తవానికి బైబిల్ ను అధ్యాయాలు మరియు వచనాలుగా విభజించలేదు. 13వ శతాబ్దంలో, చదవడానికి సులభంగా ఉండాలని, స్టీఫెన్ లాంగ్టన్ బైబిల్ ను అధ్యాయాలుగా విభజించాడు. 16వ శతాబ్దంలో, రాబర్ట్ ఎస్టిన్నే బైబిల్ ను వచనాలుగా విభజించి ముద్రించాడు. అధ్యాయాలు, వచనాల విభజనలు బైబిల్ అధ్యయనానికి సహాయపడతాయి; అయితే, అవి ఎల్లప్పుడు వాక్యభాగపు సహజ విభజనకు అనుగుణంగా ఉండవు. మీ అధ్యయనాన్ని అధ్యాయ విభజనలు నియత్రించకూడదు; వాక్యభాగపు సహజ విభజనను తార్కికంగా అనుకరించండి.
ఈ పాఠంలో, నెహెమ్యా 1:4-11 వాక్యభాగం అధ్యయనం చేద్దాం. ఇది మీ భవిష్యత్ అధ్యయనానికి మాదిరి ఇస్తుంది. ఒక భాగాన్ని అధ్యయనం చేయడానికి అనేక మార్గాలు నేర్చుకుంటాం. ప్రతి విధమైన అధ్యయనం ప్రతి పుస్తకానికి సరిపోదని గ్రహించండి. ఈ పాఠం, మీరు ఉపయోగించగల సాధనాలను (tools) ఇస్తుంది. మీరు బైబిల్లో ఒక పుస్తకం అధ్యయనం చేస్తుండగా, “ఈ పుస్తకానికి ఏ సాధనం మంచిది?” అని మీరు నిర్ణయించుకోవాలి.
వాక్యభాగ సందర్భాన్ని కనుగొనడం
నెహెమ్యా 1:4-11:
ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.
ఎట్లనగా–ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము. నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి.
నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చినమాటను జ్ఞాపకము తెచ్చుకొనుము; అదేదనగా–మీరు అపరాధము చేసినయెడల జనులలోనికి మిమ్మును చెదర గొట్టుదును. అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మునుకూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా.
చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి, నీ బాహుబలముచేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని.
నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.
వాక్యభాగాన్ని చదివేటప్పుడు, ఆ వాక్యభాగమున్న సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. నెహెమ్యా 1:4, అధ్యాయ ఆరంభాన్ని సూచిస్తుంది.
ఈ మాటలు వినినప్పుడు....
“ఈ మాటలు” నెహెమ్యా ప్రతిచర్యకు కారణమైన ఏ పదాలు విన్నాడో తెలుసుకోవడానికి ముందున్న వచనాలను చూడాలి.
హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా.
ఈ వచనాన్ని అధ్యయనం చేసేటప్పుడు అడగాల్సిన ప్రశ్నలను 2వ పాఠం ఇచ్చింది.
ఎవరు? “నెహెమ్యా, హకల్యా కుమారుడు.” ఈ పుస్తకంలో తర్వాత ప్రస్తావించబడిన మరొక నెహెమ్యా ఉన్నాడు (నెహెమ్యా 3:16). ఇక్కడ ఏ నెహెమ్యా గురించి చెప్పారో కుటుంబ పేరు (“హకల్యా కుమారుడు”) చూపిస్తుంది.
ఎప్పుడు? “ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున.” హెబ్రీ నెల కిస్లేపు, నవంబరు నుండి డిసెంబరుతో సమానమని బైబిల్ నిఘంటువు ద్వారా మనం నేర్చుకుంటాం.[1] “ఇరువదియవ సంవత్సరములో” అనే మాట, రచయిత ఉద్దేశ్యం, నెహెమ్యా జీవితంలో ఇరువదియవ సంవత్సరమా, ఒక చారిత్రక సంఘటన యొక్క ఇరువదియవ సంవత్సరమా, లేక మరో సూచనా అనేది మనకు తెలీదు కాబట్టి ఇది అంత సమాచారం ఇవ్వదు. ఈ సమయంలో, ఈ మాట ప్రక్కన మనం ఒక ప్రశ్న గుర్తు పెట్టొచ్చు. దీనికి జవాబు, నెహెమ్యా 2లో, “అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరములో” అని నేర్చుకుంటాం. అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరముపు నవంబరు/డిసెంబరులో నెహెమ్యా మొదలుపెట్టాడు.
ఎక్కడ? నెహెమ్యా “షూషను కోటలో” ఉన్నాడు. పర్షియాలో రెండు రాజభవనాలు ఉన్నాయని మనం బైబిల్ నిఘంటువు లేక అట్లాస్ ద్వారా తెలుసుకుంటాం. వేసవికాలపు రాజభవనం ఎక్-బతానాలో ఉంది. శీతాకాలపు రాజభవనం, షూషనులో ఒక విలాసవంతమైన రాజభవనం. శీతాకాలపు రాజభవనమైన షూషను కోటలో నెహెమ్యా అర్తహషస్త రాజుతో ఉండగా ఈ పుస్తకం మొదలౌతుంది.
మీరు వాక్యభాగాన్ని కంప్యూటర్లో చదువుతున్నట్లైతే, ప్రతి పదానికి మధ్య సంబంధం చూడటానికి వాక్యభాగ ఆకారాన్ని మార్చడం సహాయకరంగా ఉంటుంది. అప్పుడు వాక్యభాగం (నెహెమ్యా 1:1) ఇలా కనిపిస్తుంది:
హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు.
ఇరువదియవ సంవత్సరములో
కిస్లేవు మాసమున
నేను షూషను కోటలో ఉండగా
1వ వచనం నెహెమ్యా గ్రంథ సందర్భాన్ని అందిస్తుంది. 2, 3 వచనాలు నెహెమ్యా ప్రార్థనా సందర్భం చూపిస్తాయి. నెహెమ్యా షూషను కోటలో ఉండగా, “నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి.” నెహెమ్యా రెండు విషయాలు గురించి అడిగాడు.
వాక్యభాగంలో మీరు చేసే పరిశీలనలు వాక్యభాగ శైలిపై ఆధారపడి ఉంటాయి. చారిత్రక కథనంలో, ఎవరు, ఏంటి, ఎప్పుడు మరియు ఎక్కడ అనే ప్రశ్నలుంటాయి. సిద్ధాంత సంబంధ వాక్యభాగంలో, బోధనకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.[1]
నెహెమ్యా 1:5-11 ఒక ప్రార్థన. అతని ప్రార్థన:
“భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా” స్తోత్రము.
“నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును” బట్టి ఒప్పుకోలు.
“అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మునుకూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా” అను దేవుని వాగ్దాన ఆధారంగా అభ్యర్ధన.
ఈ దశలో, వాక్యభాగంలో అసాధారణ వివరాలను గమనించడం ప్రాముఖ్యం. నెహెమ్యా ప్రార్థన తర్వాత జీవితానికి సంబంధించిన వివరణ ఉంది: “నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.” మొదటిగా, ఇది అంత ప్రాముఖ్యం కాదని అనిపిస్తుంది, కాని కథనంలో ముందుకెళ్లే కొద్దీ ఈ విషయం ప్రాముఖ్యం అవుతుంది.
గిన్నె అందించుట అనే పదాన్ని బైబిల్ నిఘంటువులో చదివితే,[2] గిన్నె అందించువాడు సామాన్య సేవకుని కంటే గొప్పవాడని నేర్చుకుంటాం; అతడు ఉన్నతాధికారి, రాజుకు నమ్మకస్తుడు.[3]
వాక్యభాగంలో ఏ వివరాలు పరిశీలించాలి? వీటి కోసం చూడండి:
సాధారణ నుండి నిర్దిష్ట సంబంధాలు
అనేక భాగాలు సాధారణ పరిశీలనతో మొదలై, ఆ తర్వాత నిర్దిష్ట వివరాలను ఇస్తాయి. ఈ వివరాలు తరువాతి వివరణతో సాధారణ ప్రకటనకు మద్దతిస్తాయి.
పౌలు పత్రికల్లో, సాధారణ నుండి నిర్దిష్ట సంబంధాలు సర్వసాధారణం. గలతీయులకు 5:16 శారీరిక జీవితానికి ఆత్మీయ జీవానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తుంది; “నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.” ఈ సాధారణ ప్రకటనను, క్రమంగా వచ్చే నిర్దిష్టతలు మద్దతు ఇస్తాయి. గలతీయులకు 5:19-21 వాక్యభాగం శరీర కార్యాలను గుర్తిస్తుంది; గలతీయులకు 5:22-23 ఆత్మఫలాన్ని గుర్తిస్తుంది.
కొన్ని కథనాలు సాధారణమైన పద్ధతి నుండి నిర్దిష్టమైన పద్ధతిని కలిగి ఉంటాయి. ఆదికాండము 1 మరియు 2 అధ్యాయాలు ఈ పద్ధతిని పాటిస్తాయి, ఒక సాధారణ ప్రకటనతో ఆరంభమై, నిర్దిష్ట వివరాలను ఇస్తాయి. ఇది మూడు దశల్లో వస్తుంది:
1. ఆదికాండము 1:1 సాధారణ ప్రకటన ఇస్తుంది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.”
2. ఆదికాండము 1:3-31 సృష్టి గురించి మరిన్ని వివరాలను అందిస్తుంది. మొదటి రోజు, దేవుడు వెలుగు సృష్టించాడు; రెండవరోజు, దేవుడు నీటిని ఆకాశాల నుండి వేరుచేశాడు; మొదలగునవి.
3. ఆదికాండము 2 మరింత నిర్దిష్టమైంది. కథను వివరించేవ్యక్తి సాధారణ సృష్టితో మొదలుపెట్టి నిర్దిష్టమైన మానవుని సృష్టి గురించి మాట్లాడాడు. కథ, లోకసృష్టి నుండి మొదలై, ఒక ప్రత్యేకమైన ప్రదేశమైన ఏదెను తోటకు చేరుతుంది. దేవుని పేరు కూడా మారింది. ఆదికాండము 1వ అధ్యాయం దేవుడు అని ఉపయోగిస్తుంది, అంటే శక్తిని సూచించడానికి వాడే సార్వత్రిక పదం. ఆదికాండము 2 దేవుడైన యెహోవా అనే పేరు ఉపయోగిస్తుంది, అంటే ఆదాము హవ్వతో ఆయన సన్నిహిత సంబంధాన్ని సూచించే వ్యక్తిగతమైన పేరు.[4]
ఈ పద్ధతి సాధారణం నుండి నిర్దిష్టమైన అంశాల వరకు వెళ్తుంది. 1 కొరింథీయులకు 13లో, 1-2 వచనాల్లో పౌలు ప్రేమ విశిష్టతలు చూపించాడు. ఈ అధ్యాయం పౌలు బోధను సంగ్రహించే సాధారణ ప్రకటనతో ముగుస్తుంది: “కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేప్ఠమైనది ప్రేమయే.”
ప్రశ్నోత్తరాల భాగాలు
వాక్యభాగం ప్రశ్నతో మొదలైనప్పుడు, ఆ ప్రశ్న మిగిలిన వాక్యభాగమంతటి ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఈ పద్ధతి రోమాలో సాధారణం. కృప, పాప జీవితాన్ని అనుమతిస్తుందని వాదించేవారిని, “ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?” (రోమా 6:1) అని పౌలు ప్రశ్నించాడు. ఆ తర్వాత, దేవుని కృప క్రైస్తవునికి పాపంపై జయమిస్తుందని చూపించాడు, “అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?” (రోమా 6:2).
మార్కు సువార్త తరచు ఈ విధానాన్ని, ఆకృతిని ఉపయోగిస్తుంది. మార్కు 2:1–3:6లో, ఐదు భాగాలు ప్రశ్నతో మొదలౌతాయి. నాలుగుసార్లు, ప్రత్యర్థులు ప్రశ్నలడిగారు. ప్రతిసారి, యేసు తన వాదనతో స్పందించాడు. చివరి సన్నివేశంలో, యేసు ప్రశ్న అడుగగా, పరిసయ్యులు సమాధానం చెప్పలేకపోయారు. ఇది పెద్ద వాక్యభాగానికి ఆకృతిని ఎలా ఏర్పాటు చేస్తుందో గమనించండి. ఇది లేకుండా, ఐదు భిన్నమైన కథలు చదువుతాం. పశ్నలు సమాధానాలతో రూపించబడిన ఆకృతిని మనం చూసినప్పుడు, ఐదు కథలు మెస్సీయగా మనుష్యుకుమారుని అధికారానికి ఒక సాక్ష్యమిస్తాయి.
1. పక్షవాయువుగలవాని స్వస్థపరచడం (మార్కు 2:1-12)
ప్రశ్న: “దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని”
జవాబు: పక్షవాయువుగలవాని స్వస్థపరచుట ద్వారా యేసు తన అధికారం చూపించాడు.
2. పాపులతో భోజనం చేయడం (మార్కు 2:13-17)
ప్రశ్న: “పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి–ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనముచేయుచున్నాడేమని ఆయన”
సువార్తలు తరచుగా, యేసు తన చుట్టూ ఉన్నవారితో సంభాషించటం గురించి మాట్లాడతాయి. ఇలాటి ప్రశ్నలు అడుగుతూ యేసు బోధను మరింత ఉత్తమంగా అర్థం చేసుకోగలం:
సంభాషణలో పాల్గొన్నది ఎవరు?
ఏ ప్రేక్షకులు సంభాషణ వింటున్నారు? వారెలా స్పందించారు?
సంభాషణకు దానితీసిన సంఘర్షణ లేక పరిస్థితి ఏంటి?
మత్తయి 21:23–22:46వ వచనభాగం యేసు, మరియు తన శత్రువులకు మధ్య జరిగిన వరుస సంభాషణలు చూపిస్తుంది. ప్రతి గుంపు, యేసును చిక్కుల్లో పెట్టడానికి రూపించిన ప్రశ్నలు అడిగారు.
మొదట, మతాధికారులు ఆయన అధికారాన్ని ప్రశ్నించారు (మత్తయి 21:23-46).
పరిసయ్యులు, హేరోదీయులు (సాధారణంగా వీరికి మధ్య శత్రుత్వం ఉంటుంది) కలిసిపోయి, ఆయనను మాటల్లో ఇబ్బంది పెట్టాలని పన్నులు గురించి ప్రశ్నించారు (మత్తయి 22:15-22).
సద్దూకయ్యులు (పునరుత్థానాన్ని నమ్మరు), పునరుత్థానం తర్వాత వివాహం గురించి ప్రశ్నించారు (మత్తయి 22:23-32).
పరిసయ్యులు మరోసారి ఆజ్ఞలు గురించి ప్రశ్నించారు (మత్తయి 22:34-40).
చివరిగా, యేసు ఒక ప్రశ్న అడిగి వారితో వాదనను ముగించాడు, వారు దానికి జవాబు చెప్పలేకపోయారు (మత్తయి 22:41-46).
ప్రతి గుంపు యేసును మాటల్లో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుండగా జనసమూహం చూస్తున్నారు, ప్రశ్నలడుగుతున్న ప్రతివాని నోరు యేసు మూయిస్తుండగా వారు చూస్తూ నిలబడ్డారు. “జనులది విని ఆయన బోధకాశ్చర్యపడిరి” (మత్తయి 22:33).
యోబు గ్రంథంలో సంభాషణ ప్రాముఖ్యం. ఈ పుస్తకంలో దేవునికి, సాతానుకి మధ్య సంభాషణ జరిగింది, యోబుకు, తన స్నేహితులకు మధ్య సంభాషణ జరిగింది, యోబుకి, దేవునికి మధ్య సంభాషణ జరిగింది.
హబక్కూకు గ్రంథమంతా, దేవునికి, ప్రవక్తకు మధ్య జరిగిన సంభాషణే. ఈ పుస్తక ఆకృతి ఇలా ఉంది:
హబక్కూకు ప్రశ్నలు: దేవుడు యూదా పాపాన్ని ఎందుకు సహిస్తున్నాడు? (1:1-4)?
దేవుని జవాబు: బబులోను యూదాను ఓడిస్తుంది (1:5-11).
హబక్కూకు ప్రశ్నలు: యూదాకు తీర్పుతీర్చుటకు దేవుడు దుష్టత్వంతో నిండిన బబులోనును ఎలా వాడుకుంటాడు (1:12-2:1)?
దేవుని జవాబు: హబక్కూకు దేవుని ఉద్దేశాలు నమ్ముతూ జీవించాలి (2:2-20).
భావోద్వేగ స్వరస్థాయి
భావోద్వేగ స్వరం, రచయిత వ్యక్తపరుస్తున్న భావాలను సూచిస్తుంది. లేఖనం సంక్షేప సమాచారానికి మించింది; ప్రేమగల దేవునికి, ఆయన సృజించిన ప్రజలకు మధ్య సంబంధం తెలియజేసే కథ. అలాంటి సన్నిహిత సంబంధంలో భావ్వోద్వేగం ఉంటుంది. శ్రద్ధగా చదివేవారు, రచయిత భావాలపై దృష్టిపెడతారు.
వాక్యభాగంలో భావోద్వేగ స్వరస్థాయి కనుగొనాలంటే, భావాన్ని (ఆనందం, అపహాస్యం, దుఖం) లేక సంబంధాన్ని (తండ్రి, కుమారుడు, కుమార్తె) తెలియజేసే పదాలు కోసం చూడాలి. రచయిత హృదయాన్ని, కథలోని పాత్రల ప్రేరణను జాగ్రత్తగా ఆలకించండి.
► ఫిలిప్పీ 1:1-8, ఆ తర్వాత గలతీ 1:1-9 చదవండి. రెండు వాక్యభాగాల్లో భావోద్వేగ స్వరం ఏంటి? ఈ పరిచయాల నుండి, ఫిలిప్పీ సంఘంతో అదే విధంగా గలతీ సంఘంతో పౌలుకు ఉన్న సంబంధం గురించి మీరేమి ఊహించగలరు?
[1][ఈ విభాగంలోని ఎక్కువ భాగం క్రింద పేర్కొన్న పుస్తకంలోని 4వ అధ్యాయం నుండి మార్చి ఉపయోగించబడింది:] J. Scott Duvall మరియు J. Daniel Hays, Grasping God’s Word (Grand Rapids: Zondervan, 2012).
[3]J. D. Douglas, New Bible Dictionary, (2nd edition), (Wheaton: Tyndale House, 1982)
[4]హీబ్రూ పేరైన ఎలోహీమ్ను ఇంగ్లీష్ బైబిళ్లలో "God"గా అనువదించారు; ఇది విశ్వవ్యాప్తంగా వినియోగించే మహాత్మక పేరు. హీబ్రూ పేరైన యహ్వేను ఇంగ్లీష్ బైబిళ్లలో "LORD"గా అనువదించారు; ఇది నిర్గమకాండము 3:14లో ప్రకటించబడిన వ్యక్తిగత పేరు.
పుస్తకమంతటినీ చదివేటప్పుడు ఏం చూడాలి?
పుస్తకమంతటినీ చదివేటప్పుడు, పుస్తక ఆకృతి, పుస్తకంలోని ముఖ్య విషయాలు కోసం చూడాలి. ఈ దశలో పరిశీలించాల్సిన విషయాలు:
నొక్కి చెప్పిన విషయాలు
పరిశీలన ద్వారా పుస్తకంలో ఏం నొక్కి చెప్పారో కనుగొనగలం:
కేటాయించిన స్థలం
ఒక పుస్తకం ఒక విషయానికి కేటాయించే స్థలం, రచయితకు ఏది ముఖ్యమో తెలియజేస్తుంది. ఆదికాండము లో, నలుగురు (అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు) గురించి 12-50 అధ్యాయాల్లో చదువుతాం. దీనిని, సృష్టి, పతనం, జలప్రళయం, బాబెలు గోపురం గురించి వివరించడానికి కేవలం 11 అధ్యాయాలు కేటాయించడంతో పోల్చారు. పరిశీలన దశలో దీనిని గమనించడం వలన, బాష్యం దశలో “ఎందుకు?” అనే ప్రశ్న వేయడానికి సిద్ధపడతాం.
నెహెమ్యా గ్రంథం చదువుతున్నప్పుడు, ప్రార్థన ఆ గ్రంథంలో కేంద్ర స్థానం తీసుకోవడం గమనిస్తాం. నెహెమ్యా జీవితంలోని ప్రతి ముఖ్య దశలో, అతడు ప్రార్థించాడు. దీనిని గమనించడం వలన, నెహెమ్యా ప్రవర్తన గురించి మరింత బాగా అర్థం చేసుకుంటాం.
ప్రకటిత ఉద్దేశ్యం
కొన్ని పుస్తకాల్లో, రచయిత తన ఉద్దేశ్యం గురించి చెబుతాడు. ఈ సామెతలు గ్రంథం రాయటానికి సొలొమోను ఉద్దేశ్యం గురించి, సుదీర్ఘమైన ప్రకటనతో సామెతల గ్రంథం మొదలౌతుంది (సామెతలు 1:2-6). యోహాను సువార్త, రచయిత ఉద్దేశం తెలియజేస్తుంది: “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును” (యోహాను 20:31).
మెటీరియల్ క్రమము
చారిత్రిక కథనాల్లో, మెటీరియల్ క్రమం రచయిత ఉద్దేశ్యాన్ని చూపిస్తుంది. 2 సమూయేలు 1-10 దావీదు విజయ పాలన గురించి చెబుతుంది. 2 సమూయేలు 11 దావీదు బత్షెబతో చేసిన పాపాన్ని నమోదు చేస్తుంది. ఆ సమయం నుండి, 2 సమూయేలు దావీదు రాజ్యంలో వచ్చిన కష్టాలు గురించి వివరిస్తుంది. ఈ కష్టాలు దావీదు పాపం ఫలితంగా వచ్చిన దేవుని తీర్పని 2 సమూయేలు గ్రంథ రచయిత చూపిస్తాడు.
నెహెమ్యా గ్రంథాన్ని మూడు పెద్ద భాగాలుగా విభజించవచ్చు. నెహెమ్యా 1-6లో, నెహెమ్యా పట్టణప్రాకారాలను పునఃనిర్మించాడు. నెహెమ్యా 7-12 అధ్యాయాలు చెరలోనుండి యెరూషలేముకు తిరిగి వచ్చిన వారి జాబితాను ఇస్తుంది, నిబంధన పునరుద్ధరణ వివరిస్తుంది. నెహెమ్యా 13 నెహెమ్యా యెరూషలేముకు రెండవసారి తిరిగి వచ్చిన తర్వాత ఎదురైన సమస్యలను గురించి మాట్లాడుతుంది. పట్టణప్రాకారాలను కట్టడం చాలదని ఈ క్రమం చూపిస్తుంది; యూదా చెరకు దారితీసిన అసలు సమస్యలు పరిష్కరించాలంటే ఆత్మీయ ఉజ్జీవం అవసరం.
పునరావృతమైన విషయాలు
బైబిల్ రచయిత నొక్కి చెప్పే మరో మార్గం, పునరావృతం
పునరావృతమైన పదాలు లేక పదబంధాలు
జ్ఞాపకము చేసికొనుము అనే పదం నెహెమ్యా గ్రంథమంతటిలో పదే పదే కనిపిస్తుంది. నెహెమ్యా దేవునిని ఇలా కోరాడు, “నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చినమాటను జ్ఞాపకము తెచ్చుకొనుము” (నెహెమ్యా 1:8). యెరూషలేము ప్రజలు బెదిరింపుకు గురైనప్పుడు, “మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొనుడి” (నెహెమ్యా 4:14). అని నెహెమ్యా వారికి చెప్పాడు. దేవుడు తనను, తన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకొనుమని నెహెమ్యా ముమ్మారు ప్రార్థించాడు. నెహెమ్యాకు జ్ఞాపకం చేసుకోవడం ముఖ్యం; దేవుడు గతంలో చేసిన కార్యాలు, భవిష్యత్తులో ఆయనయందు విశ్వాసాన్ని ఇస్తాయి.
► కీర్తన 119:1-32 చదవండి. ప్రతి వచనం, దేవుని వాక్యాన్ని సూచించే ఒక పదాన్ని వాడుతుంది. దీని నుండి, దేవుని వాక్య ప్రాముఖ్యత గురించి కీర్తనాకారుడు ఏం నమ్మాడో ఒక జాబితా చేయండి.
పునరావృతమైన పాత్రలు
అపొస్తలుల కార్యములు అంతటా ముఖ్యమైన ప్రదేశాలలో బర్నబా పదే పదే కనిపిస్తాడు. బర్నబా కనిపించిన ప్రతిసారి, తన మారుపేరుకు అనుగుణంగా జీవిస్తాడు “హెచ్చరిక పుత్రుడు” (అపొస్తలుల కార్యములు 4:36). బర్నబా సౌలును అపొస్తలుల యొద్దకు తీసుకొచ్చి, సౌలు మారుమానస్సు గురించి సాక్ష్యమిచ్చాడు (అపొస్తలుల కార్యములు 9:27). సౌలుతో పాటు, బర్నబా అంతియొకయలో సంఘం నిర్మించాడు (అపొస్తలుల కార్యములు 11:22-26). పౌలు సందేహించినప్పటికీ, బర్నబా అపరిపక్వతగల మార్కు అను మారుపేరుగల యోహానును ప్రోత్సహించాడు (అపొస్తలుల కార్యములు 12:25 మరియు అపొస్తలుల కార్యములు 15:36-39). అపొస్తలుల కార్యములు గ్రంథంలో, బర్నబా ఒకటి కంటే ఎక్కువసార్లు కనిపించడం, విశ్వాసులను శిష్యులుగా చేయాలనే యేసు ఆజ్ఞను ఆది సంఘం ఎలా నెరవేర్చిందో చూపిస్తుంది.
పునరావృతమైన సంఘటనలు లేక పరిస్థితులు
న్యాయాధిపతులు గ్రంథం, ఇశ్రాయేలు యెహోషువ నాయకత్వంలో గొప్ప విజయాలు సాధించి, సామాజిక దురవస్థలోకి ఎలా క్షీణించిందో చూపిస్తుంది. ఏడుసార్లు ఆ చక్రం పునరావృతమైంది, ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో చెడుతనం చేసి, తమ శత్రువుల చేతిలో ఓడిపోయారు. ప్రతిసారి దేవుడు న్యాయాధిపతిని లేవనెత్తి, వారిని విడిపించాడు. ఈ పునరావృతమయ్యే కథ, రాజ్యం స్థిరంగా క్షీణించిందని చూపిస్తుంది.
దిశలో మార్పులు
దిశలో మార్పు అంటే, రచయిత ఉద్ఘాటనలో మార్పు. ఉదాహరణకు, పౌలు పత్రికల దిశ, పత్రిక మధ్యలో మారుతుంది. దేవుడు తన ప్రజలకు ఏం చేశాడు అనే విషయంతో ఎఫెసీయులకు మొదలౌతుంది; ఎఫెసీయులకు రెండవ భాగం, దేవుని ప్రజలు ఆయనకు విధేయతగా ఏం చేయాలో ఉద్ఘాటిస్తుంది.
ఎఫెసీయులకు 1-3లో, వివరణాత్మక క్రియాపదాలు దేవుడు తన ప్రజల కోసం ఏం చేశాడో చూపిస్తాయి. దేవుడు:
మనకు ఆశీర్వాదము అనుగ్రహించెను (ఎఫెసీయులకు 1:3, 6)
మనలను ఏర్పరచుకొనెను (ఎఫెసీయులకు 1:6)
కుమారులుగా స్వీకరించుటకు ప్రణాళిక వేసాడు (ఎఫెసీయులకు 1:5)
ఎఫెసీయులకు 4:1తో ఆరంభింది, దేవుడు మన కోసం చేసిన విమోచనా కార్యానికి తగిన రీతిలో జీవించాల్సిన బాధ్యత గురించి పౌలు విశ్వాసులతో మాట్లాడాడు. ఎఫెసీయులకు 4–6లో, చాలా క్రియాపదాలు అజ్ఞార్థకం. పౌలు మనలను ఆజ్ఞాపించాడు:
సత్యమే మాట్లాడవలెను (ఎఫెసీయులకు 4:25)
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి (ఎఫెసీయులకు 4:30)
దేవుడు మన కోసం చేసిన కార్యాన్ని బట్టి ఆనందించడం నుండి ఆయన కృపకు తగినట్లుగా మనం ఎలా జీవించాలో అనే విషయంలోకి వెళ్ళే దిశలో మార్పు, క్రియాపదాల్లో కనిపిస్తుంది. అలాటి మార్పులను జాగ్రత్తగా పరిశీలించడం వలన, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు సందేశాన్ని సరిగా బాష్యం చేయటానికి సిద్ధపడతాం.
సాహిత్య రూపం
ఒక పుస్తకాన్ని క్రమపరచటానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, మూడు రకాల సాహిత్య నిర్మాణాలను సులభంగా గుర్తించవచ్చు.[1]
జీవిత చరిత్ర సంబంధ నిర్మాణం
చారిత్రిక పుస్తకాలు తరచు నిర్దిష్ట వ్యక్తుల గురించి చెబుతాయి. కథ, ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనపై ఆధారపడుతుంది. ఉదాహరణకు:
ఆదికాండము 12-50: నలుగురు గొప్ప వ్యక్తులు
అధ్యాయాలు
వ్యక్తి
ఆదికాండము 12-25
అబ్రాహాము
ఆదికాండము 25-26
ఇస్సాకు
ఆదికాండము 27-36
యాకోబు
ఆదికాండము 37-50
యోసేపు
1 మరియు 2 సమూయేలు గ్రంథాలు ఇశ్రాయేలు మొదటి ఇద్దరు రాజులైన సౌలు, దావీదు ఆరంభం మరియు పతనం గురించి మాట్లాడతాయి.
1 & 2 సమూయేలు: ఇశ్రాయేలు మొదటి రాజులు
అధ్యాయాలు
రాజుల ఆరంభం/పతనం
1 సమూయేలు 1-8
సమూయేలు ప్రవక్త
1 సమూయేలు 9-12
సౌలు ఆరంభం
1 సమూయేలు 13-31
సౌలు పతనం మరియు దావీదు ఆరంభం
2 సమూయేలు 1-10
దావీదు విజయం
2 సమూయేలు 11-24
దావీదు కష్టాలు
భౌగోళిక ఆకృతి
భౌగోళికశాస్త్రం కొన్ని పుస్తకాలకు ఆకృతి ఏర్పాటు చేస్తుంది. విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో సంఘటనలు జరుగుతున్నప్పుడు కథ ముందుకు సాగుతుంది. ఈ పుస్తకాల ఆకృతి వివరించడానికి బైబిల్ అట్లాస్ సహాయపడుతుంది.
నిర్గమకాండము: ఇశ్రాయేలు ప్రయాణాలు
వాక్యభాగం
ప్రదేశం
నిర్గమకాండము 1:1-3:16
ఐగుప్తులో ఇశ్రాయేలు
నిర్గమకాండము 13:17-18:27
అరణ్యంలో ఇశ్రాయేలు
నిర్గమకాండము 19-40
సీనాయి పర్వతం యొద్ద ఇశ్రాయేలు
“యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును” (అపొస్తలుల కార్యములు 1:8). నాకు సాక్షులై ఉండుడని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. అపొస్తలుల. కార్యాల. గ్రంథం, ఆది సంఘం ఈ ఆజ్ఞను నెరవేరవేర్చిందో చూపిస్తుంది.
అపొస్తలుల కార్యములు : సువార్త భుదిగంతాలవరకు చేరడం
అధ్యాయాలు
ప్రదేశం
అపొస్తలుల కార్యములు 1-7
యెరూషలేము
అపొస్తలుల కార్యములు 8-12
యూదయ మరియు సమరయ
అపొస్తలుల కార్యములు 13-28
భూదిగంతాల వరకు
చారిత్రక, కాలక్రమానుగత ఆకృతి
కొన్ని పుస్తకాలు ముఖ్య చారిత్రిక సంఘటనల ఆధారంగా, సాధారణంగా కాలక్రమానుగతంగా ఆకృతి చేయబడ్డాయి. ఈ సంఘటనలను గుర్తించడం వలన పుస్తకాన్ని గూర్చిన సంక్షిప్త అవగాహన పొందవచ్చు.
యెహోషువ గ్రంథం, కనానును జయించి, అందులో స్థిరపడటం గురించి మాట్లాడుతుంది. యెహోషువ గ్రంథం ఆకృతి, విజయంలో ప్రాథమిక సంఘటలు గురించి తెలియజేస్తుంది.
కనానులోకి వెళ్ళడం (యెహోషువ 1–5)
యెరికోను పట్టుకోవడం (యెహోషువ 6)
హాయిని ఓడించడం (యెహోషువ 7–8)
షెకెములో నిబంధన పునరుద్ధరణ (యెహోషువ 9)
దక్షిణ దండయాత్ర (యెహోషువ 10)
ఉత్తర దండయాత్ర (యెహోషువ 11–12)
భూవిభజన మరియు ఏర్పాటు (యెహోషువ 13–23)
షెకెములో నిబంధన పునరుద్ధరణ (యెహోషువ 24)
యోహాను తన సువార్తను రాసిన ఉద్దేశం, పుస్తకంలో పేర్కొన్నాడు. “మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను” (యోహాను 20:30-31). యోహాను సువార్త, రచయిత ఉద్దేశ్యం నెరవేర్చే ఏడు సూచక క్రియలు చుట్టూ నిర్మితమైంది. ఈ ఏడు సూచక క్రియలు సువార్త అంతటికి ఆకృతినిస్తాయి:
[1]ఈ మెటీరియల్ Howard G. Hendricks and William D. Hendricks, Living by the Book (Chicago: Moody Publishers, 2007) లో 15వ అధ్యాయం నుండి తీసుకొనబడింది.
పెద్ద చిత్రం చూడడం
ఇప్పటి వరకు, మనం కొన్ని ప్రత్యేక వచనాల వివరాలు, సుదీర్ఘ వాక్యభాగాల వివరాలు, మరియు పుస్తకమంతటి వివరాలు పరిశీలించాం.[1] పరిశీలన దశలో చివరి మెట్టు, ఉపయోగించడానికి సులభంగా ఉండే విధంగా పరిశీలనలను క్రమపరచాలి. దీని చేయడానికి, పరిశీలనలో తెలుసుకున్న విషయాలను సంగ్రహ పట్టికలో (summary chart) పెట్టడం ఒక ఉత్తమ మార్గం. ఇది లేఖనంలో అనేక భాగాలతో సంబందాన్ని చూపిస్తుంది. ఇది, బైబిల్ అధ్యయనంలో బాష్య దశకు సిద్ధమవ్వటానికి స్పష్టమైన సారాంశాన్ని కూడా ఇస్తుంది.
ఈ చార్ట్ ను క్రమపరచడానికి అనేక మర్గాలున్నాయి. చార్ట్ లో వర్గీకరణ, మీరు అధ్యయనం చేస్తున్న వాక్యభాగం శైలిపై ఆధారపడి ఉంటుంది. ఈ భాగంలో, బైబిల్ అధ్యయనంలో చార్ట్ ఎలా సహాయపడుతుందో చూపించడానికి అనేక రకాల పట్టికలు ఉపయోగిస్తాం.
సంబంధిత సంఘటనల శ్రేణిని పట్టిక చేయడం
అధ్యాయ విభజనలు ఎల్లప్పుడు పుస్తక ఆకృతికి అనుగుణంగా ఉండవని ఇంతకుముందు చూశాం. సంఘటనల సంబంధాన్ని చూపించే పట్టిక, బహుళ అధ్యాయాల్లో వరుస సంఘటనల ఐక్యతను చూపించగలదు. ఇది తరచు సంఘటనల మధ్య పోలికలు, వ్యత్యాసాలను చూపిస్తుంది.
మార్కు 4:35—మార్కు 5:42 వరుసగా నాలుగు అద్భుతాలను వెల్లడి చేస్తుంది. మీరు ఈ నాలుగు కథలు పోల్చి చూసినప్పుడు, తుఫాను మధ్యలో యేసు శిష్యులు చూపిన విశ్వాస లేమికి మరియు కొందరు అసాధారణ ప్రజల విశ్వాసానికి మధ్య వ్యత్యాసం చూపిస్తున్నట్లు గ్రహిస్తారు; దయ్యంపట్టిన వ్యక్తి, రక్తస్రావంగల స్త్రీ, సమాజమందిరపు అధికారి. ఈ గొప్ప విశ్వాస కథలకు శిష్యులు సాక్షులుగా ఉన్నారని మార్కు చూపిస్తుంది. ఈ నాలుగు కథలు ప్రక్క ప్రక్కన చూడండి:
నాలుగు అద్భుతాలు
అద్భుతం
కథలో వ్యక్తులు
విశ్వాసం యొక్క పాత్ర
తుఫానును గద్దించుట
యేసు
శిష్యులు
శిష్యులకు విశ్వాసం లేకపోవడం (మార్కు 4:40).
దయ్యంపట్టిన వ్యక్తిని స్వస్థపరచడం,
యేసు
దయ్యంపట్టిన వ్యక్తి
పట్టణ ప్రజలు
శిష్యులు (చూస్తున్నారు)
అతడు యేసుకు నమస్కరించి (మార్కు 5:6) యేసు గురించి సాక్ష్యమివ్వడం (మార్కు 5:18-20).
పట్టణప్రజలు యేసును తిరస్కరించడం (మార్కు 5:10).
రక్తస్రావంగల స్త్రీని స్వస్థపరచడం
యేసు
స్త్రీ
శిష్యులు (చూస్తున్నారు)
స్త్రీ విశ్వాసంతో యేసును పట్టుకోవడానికి చొరవ తీసుకుంది (మార్కు 5:28, 34).
యాయీరు కుమార్తెను లేపడం
యేసు
యాయీరు, తన కుమార్తె
ఏడ్చువారు
పేతురు, యాకోబు, యోహాను
యాయీరు విశ్వాసం
(మార్కు 5:23).
మీ వంతు
మత్తయి 13:1-23 ఆధారంగా పట్టికను సిద్ధపరచండి.
1. కథ మూడుసార్లు చదవండి.
2. మీరు చేయగలిగిన పరిశీలనలు చేయండి.
3. ఉపమానంలోని ప్రధాన విషయాలతో పట్టిక పూర్తిచేయండి.
పట్టికే మన లక్ష్యం కాదని గుర్తుంచుకోండి; వాక్యభాగాన్ని అధ్యయనం చేసి, దానిని మీ జీవితంలో అన్వయించుకోవడానికి పట్టిక మీకు సహాయం చేస్తుంది. మార్పు, రూపాంతరమే బైబిల్ అధ్యయన లక్ష్యం. ఈ ఉపమానం అధ్యయనం చేసేటప్పుడు, “నేను ఏ రకమైన నేల? నా జీవితంలో ఫలించడానికి నేను దేవుని వాక్యాన్ని అనుమతిస్తున్నానా లేదా?” అని ప్రశ్నించుకోండి.
మార్కు 5:21-43 చదవండి. ఇక్కడ ఒక కథలో రెండు అద్భుతాలు ఉన్నాయి. యాయీరు, తన కుమార్తె కథ మధ్యలో రక్తస్రావంగల స్త్రీ కథ మధ్యలో ప్రవేశిస్తుంది. ఈ రెండు కథల మధ్య పోలికలు, వ్యత్యాసాలు ఏంటి? ఆకృతి ఇలా ఉంది:
పుస్తకమంతటినీ సంగ్రహించడంలో పట్టిక సహాయపడుతుంది. ఇది పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశ్యాన్ని చూపిస్తుంది. పట్టిక తయారు చేసేటప్పుడు, పుస్తకమంతటినీ అనేకసార్లు చదవండి. పెద్ద వాక్యభాగాల కోసం కోసం చూడండి. మీరు చదువుతుండగా, పునరావృతమయ్యే పదాలు, ప్రశ్నలు జవాబులు, పుస్తక ఆకృతి చూపించే ఇతర సంబంధాలను గుర్తించండి.
1 పేతురులోని మూడు పెద్ద విభాగాలు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. మనం తండ్రి చిత్తానికి లోబడే వరకు (2:11–3:12) శ్రమను అర్థం చేసుకోలేం (3:13–5:11); ఆయన రక్షణ శక్తి మనకు అర్థమవ్వనంతవరకు (1:1–2:10) తండ్రి చిత్తానికి లోబడలేము.
మీ వంతు
ఎఫెసీయులకు రాసిన పత్రికపై పట్టిక సిద్ధపరచండి. ఈ పట్టిక, పౌలు పత్రికలో నాలుగు విషయాలు కనుగొనడానికి సహాయపడుతుంది.
ఒక ఉదాహరణ ఇవ్వబడింది. మీరది చేయడం పూర్తయ్యాక, ఇలా ప్రశ్నించండి:
ప్రతి విషయానికి మధ్యనున్న సంబంధం ఏంటి?
ఈ విషయాల్లో ఒకటైన ఇతర విషయాలకంటే ప్రధానమైందిగా ఉందా?
ప్రతి విషయం, పుస్తకమంతటి ఆకృతితో ఎలా సంబంధం కలిగియుంది?
[1]ఈ భాగంలోని మెటీరియల్, Howard G. Hendricks and William D. Hendricks, Living by the Book (Chicago: Moody Publishers, 2007) 24-25 అధ్యాయలపై ఆధారపడి ఉంది.
(1) మీరు వాక్యభాగాన్ని ఆ తర్వాత పుస్తకమంతటినీ అధ్యయనం చేస్తూ, పరిశీలన ప్రకియ కొనసాగించండి. వాస్తవానికి బైబిల్ ని అధ్యాయాలుగా, వచనాలుగా విభజించలేదు. మీ అధ్యయనంలో సహజ విభజనను ఉపయోగించేలా చూసుకోండి.
(2) ఒక భాగం చదివేటప్పుడు, వీటి కోసం చూడండి:
సాధారణ నుండి నిర్దిష్ట సంబంధాలు
ప్రశ్నోత్తరాల భాగాలు
సంభాషణ
భావోద్వేగ స్వరస్థాయి
(3) పుస్తకమంతటినీ చదివేటప్పుడు, వీటి కోసం చూడండి:
నొక్కి చెప్పిన విషయాలు. రచయిత విషయాలను వీటితో ఉద్ఘాటించవచ్చు:
కేటాయించిన స్థలం
ప్రకటిత ఉద్దేశ్యం
మెటీరియల్ క్రమం
పునరావృతమైన విషయాలు.
పునరావృతమైన పదాలు లేక పదబంధాలు
పునరావృతమైన పాత్రలు
పునరావృతమైన సంఘటనలు లేక పరిస్థితులు
దిశలో మార్పులు.
సాహిత్య రూపం.
జీవిత చరిత్ర సంబంధ నిర్మాణం
భౌగోళిక ఆకృతి
చారిత్రక, కాలక్రమానుగత ఆకృతి
(4) లేఖనంలో ఒక భాగాన్ని లేక పుస్తకమంతటినీ పట్టికే ద్వారా చూపడం, ఆకృతిని స్పష్టం చేస్తుంది.
పాఠం 3 అభ్యాసం
పాఠం 1లో, ఈ కోర్సు సమయంలో అధ్యయనం చేయడానికి ఒక వాక్యభాగం ఎన్నుకున్నారు. ఈ పాఠంలో ఇచ్చిన దశలను అనుకరించి, మీరు ఎన్నుకున్న వాక్యభాగంలో సాధ్యమైనంత ఎక్కువ పరిశీలనలు చేయండి. మీరు అప్పుడే వచనాన్ని వివరించడం లేదు లేక ప్రసంగం సిద్ధం చేయట్లేదని గుర్తుంచుకోండి. వాక్యభాగంలో వివరాలు కోసం చూస్తున్నారు అంతే. ఒకవేళ ఉపయోగకరమైతే, మీ పరిశీలనలను సంగ్రహించే పట్టిక సిద్ధం చేయండి. ఒక బృందంగా అధ్యయనం చేస్తున్నట్లయితే, మీ తదుపరి సమావేశంలో పరిశీలనలు పంచుకోండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.