[1]►ఈ కోర్సు కోసం మీరు కలుసుకునే ప్రదేశానికి వచ్చేటప్పుడు మీ ప్రయాణం గురించి మీ గుంపులో ఒకరు లేక ఇద్దరు సభ్యులు వివరించండి. సాధ్యమైనన్ని వివరాలు ఇవ్వండి. మార్గంలో మీరు ఏదైనా రెస్టారెంట్లు, చర్చిలు, లేక వ్యాపారాలు చూశారా? ఆగమని చెప్పే సూచనలు లేక లైట్లు ఎన్ని చూశారు? ఎన్ని మలుపులు తీసుకున్నారు? సాధారణం మీ ప్రయాణంలో చూడని అసాధారణ విషయం ఏదైనా చూశారా? ప్రతి దాని గురించి వివరించిన తరువాత, మీరు ఎంత వరకు పరిశీలించారో, ఎంత వరకు గమనించలేదో చర్చించండి.
కిరణ్ బైబిల్ చదివినప్పుడు, ఒక మానసిక చిత్రంతో (మనసులో ఒక ఆలోచనతో) ముగించాడు. మార్కు 1:29-31 వచనాలను చదివి, సంగ్రహించుమని కిరణ్‌ని మీరడిగితే, అతను, “యేసు నలుగురు శిష్యులతో (సీమోను, అంద్రెయ, యాకోబు, మరియు యోహాను) గలిలయలోని సమాజమందిరాన్ని విడిచి, సీమోను అత్త జ్వరంతో ఉండగా సీమోను ఇంటికి వెళ్ళారు. యేసు ఆమె చేయి పట్టుకుని లేవనెత్తగా, వెంటనే ఆమెకున్న జ్వరం వదిలిపోయింది. ఆమె బాగై, వారికి భోజనం కూడా ఏర్పాటు చేయగలిగింది. విశ్రాంతి తీసుకుని, పూర్తిగా కోలుకునే సమయం కూడా ఆమెకు అక్కర్లేదు!” అని చెబుతాడు.
వికాస్ బైబిల్ చదివినప్పుడు, అతను వచనాలు చదివాడు కాని కొన్ని వివరణలు మాత్రమే చూశాడు. మార్కు 1:29-31 ను క్లుప్తంగా చెప్పమని వికాస్‌ని మీరడిగితే, అతను, “యేసు సీమోను ఇంటిని దర్శించి, అక్కడ ఎవరినో బాగు చేశాడు” అని చెబుతాడు.
వీరిలో ఎవరు బాగా పరిశీలించారు? ఎవరు ఎక్కువ కాలం కథను గుర్తుపెట్టుకుంటారు? ఈ కథ బాష్యాన్ని ఆధారం చేసుకోవడానికి ఏ పాఠకుని దగ్గర ఎక్కువ సమాచారం ఉంది? సమాధానం స్పష్టంగా ఉంది. మార్కు 1:29-31లో ఏం జరిగిందో కిరణ్ చూశాడు. వికాస్ అధ్యాయం చదివాడు కాని పరిశీలన చేయలేదు.
బైబిల్ అధ్యయనంలో మొదటి దశ, పరిశీలన. ఈ దశలో, “ఈ లేఖన భాగంలో నేనేం చూస్తున్నాను?” అని ప్రశ్నించుకోవాలి. ప్రభావవంతమైన బైబిల్ బాష్యానికి ముఖ్య విషయం, సాధ్యమైనంత పరిశీలన చేయడం. ఈ పాఠంలో, వచనంలోని ముఖ్య వివరాలు పరిశీలించడం నేర్చుకుంటాం. ఈ పని చేస్తుండగా ఓపికతో ఉండండి; ఎంత ఎక్కువ పరిశీలిస్తే, బాష్యానికి అంత సమాచారం అందుతుంది.
“నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.”
- కీర్తన 119:18
వచనంలో నుండి పరిశీలనలు
అపొస్తలుల కార్యములు 1:8:
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు
యెరూషలేములోను,
యూదయ సమరయ దేశములయందంతటను
భూదిగంతముల వరకును,
నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను
ఒక్క వచనంలో మనం ఏం పరిశీలించగలం?
మొదటి పదం ఏంటి?
“అయినను.” అయినను అనేది మునుపటి వచనాలతో కలిపే పదం. అపొస్తలుల కార్యములు 1:6లో, “ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?” ఇప్పుడు మృతుల్లో నుండి లేచావు గనుక నీ రాజ్యం స్థిరపరుస్తావా? అని అడిగారు. యేసు రెండు ప్రకటనలతో స్పందించాడు.
“కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు” (అపొస్తలుల కార్యములు 1:7). ఇది తండ్రి పని.
“మీరు శక్తినొందెదరు … నాకు సాక్షులైయుందురు.” ఇది మీ పని.
ఎవరు భాగస్తులు?
“మీరు.” యేసు ఎవరితో మాట్లాడుతున్నాడు? అపొస్తలులతో (అపొస్తలుల కార్యములు 1:2, 4). కొంత సమయం తీసుకుని, “ఈ అపొస్తలులు ఎవరు?” అని అడగండి. అపొస్తలుల గురించి మీ తెలిసిన విషయాలన్ని జాబితా చేయండి. ఈ వచనం ఎవరి గురించి మాట్లాడుతుందనేది, పెంతెకొస్తు దినాన జరిగిన అద్భుతమైన పరివర్తన చూపిస్తుంది.
వారు యూదులు; యేసు వారిని సమరయకు పంపుతున్నాడు!
దయ్యంపట్టిన కుమారుని స్వస్థపరచడానికి వారు శక్తిలేనివారు (మార్కు 9:14-29); వారు శక్తి పొందుకుంటారు.
యేసును పట్టుకున్నప్పుడు వారు భయంతో పారిపోయారు (మత్తయి 26:56); భూదిగంతాల వరకు వారు సాక్షులై ఉంటారు.
వాక్యంలోని క్రియా పదం ఏంటి?
“పొందెదరు.” ఏం జరుగుతుందో క్రియాపదం చెబుతుంది. ఈ సందర్భంలో, క్రియాపదం భవిష్యత్‌లో పొందబోయే దానిని చూపిస్తుంది.
వారు ఏం పొందుతారు?
“శక్తి.” అపొస్తలుల కార్యములు గ్రంథం, అపొస్తలుల పరిచర్యలో ఈ శక్తిని చూపిస్తుంది.
► ఇక్కడ మీరు మొదలుపెట్టొచ్చు. మిగిలిన వచనం చూసి, ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి:
వారు శక్తిని ఎప్పుడు పొందుకుంటారు?
ఎవరు వారికి శక్తినిస్తారు?
శక్తి పొందడం వలన ఏం జరుగుతుంది? (సాక్ష్యానికి ముందు శక్తి పొందుతారు. ఈ శక్తి పొందడం వలన ఇతరులతో సువార్త పంచుకోవాలనే ఆశ కలుగుతుంది)
వారు ఎవరికి సాక్షులైయుంటారు?
ఎక్కడ సాక్షులైయుంటారు? (ఈ నాలుగు ప్రాంతాలు గురించి మీకు ఏం తెలుసు? సమరయ ప్రత్యేకత ఏంటి? యూదులైన ఈ అపొస్తలులు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా?)
మీ పరిశీలన శక్తిని పెంచుకోవాలి
మనోజ్ మంద దృష్టిగలవాడు. పాఠశాలలో ఉన్నప్పుడు, టీచర్ ని సరిగా చూడలేకపోయాడు. ముందు బోర్డు పై ఉన్న అక్షరాలు సరిగా చదవలేకపోయాడు. ఒకరోజు, కళ్లద్దాలు పెట్టుకున్నాడు. వెంటనే ముందెన్నడూ చూడని వాటిని చూడగలిగాడు! టీచర్ ముఖం స్పష్టంగా చూడగలిగాడు. బోర్డుపై రాసినవి సులభంగా చదవగలిగాడు. అతడు ఉత్సాహంతో నిండిపోయాడు!
శ్రద్ధ పరిశీలన అంటే, మందదృష్టిని తొలగించుకోవడానికి కళ్లద్దాలు పెట్టుకోవడం వంటిది. లేఖనాన్ని ఎలా పరిశీలించాలో నేర్చుకోవడం వల్ల లేఖనం ఏం సెలవిస్తుందో అనే విషయంపై మన అవగాహన పెరుగుతుంది.
అపొస్తలుల కార్యములు 1:8వ అభ్యాసం, మీరు చదివిన దానిని ప్రస్తుతం ఎలా పరిశీలిస్తున్నారో చూపిస్తుంది. మీ పరిశీలనా శక్తి పెంచుకోవడానికి సహాయపడే కొన్ని చిట్కాలు అధ్యయనం చేద్దాం. లేఖనాన్ని మరింత స్పష్టం చేసే ప్రశ్నలు అడగటం మీరు నేర్చుకుంటారు. ఆ తర్వాత ఇతర వచనాలు చదవుతారు.
మీరు బైబిల్లో ఒక వచనం చదివేటప్పుడు, “ఈ వచనం నాకు తెలుసు!” అని చెప్పొద్దు. బదులుగా, ఒక నూతన విధానంలో కళ్ళు తెరువుమని దేవుణ్ణి అడగండి. ఈ అధ్యాయంలోని సాధనం, నూతన దృష్టితో చదవడానికి సహాయపడుతుంది.[1]
అవగాహన కోసం చదవండి
ప్రతి సంవత్సరం బైబిల్ చదువుతానని 10 ఏళ్ళ బాలుడు నిర్ణయించుకున్నాడు. అది మంచి నిర్ణయమే; దురదృష్టవశాత్తూ, ప్రభావవంతంగా బైబిల్ ఎలా చదవాలో అతనికి తెలీదు. ప్రతి రోజు ఎంత వరకు చదవాలో క్యాలెండర్లో ఉంది, కాని ఎప్పుడూ వెనకబడిపోయేవాడు. ఒక ఆదివారం మధ్యాహ్నం, అన్ని చదవటానికి ప్రయత్నించాడు. క్యాలెండర్లో చూసుకున్నప్పుడు 20 అధ్యాయాలు వెనకబడిపోయాడు (లేవీయకాండములో). కాబట్టి, ఒక్క మధ్యాహ్నంలో లేవీయకాండము అంతా చదివేశాడు. చదవగలిగినంత వేగంగా చదివి, ముగించటానికి ప్రయత్నించాడు. చదివిన 10 నిమిషాలకు, లేవీయకాండము సందేశాన్ని చెప్పలేడు. అతడు అర్థం చేసుకోకుండా చదివాడు.
అర్థం చేసుకోవడానికి చదవటం కష్టమైన పని. సత్యాన్ని కనుగొనడం గురించి బైబిల్ ఇలా వివరిస్తుంది: “వెండిని వెదకినట్లు దాని వెదకినయెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును” (సామెతలు 2:4-5). లేఖనం జాగ్రత్తగా చదవండి. ప్రశ్నలు అడగండి. నోట్సు రాసుకోండి. మనసుతో చదవండి.
మీ సొంత మాటల్లో లేఖనాన్ని వ్యాఖ్యానించడం ద్వారా కొన్నిసార్లు నూతన అవగాహన పొందొచ్చు. బహుశ మీ వ్యాఖ్యానం అంత పాండిత్యంగా ఉండనప్పటికీ, వాక్యభాగ అర్థం గురించి లోతుగా ఆలోచించేలా సహాయపడుతుంది.
చదువుతున్నప్పుడు ప్రశ్నలు అడగండి
మీ మనసుతో చదవడానికి ముఖ్యమైంది, ప్రశ్నలు అడగటం.
► ఈ భాగం కొనసాగించే ముందు లూకా 24:13-35 చదవండి. పాఠం చదవుతుండగా, లూకా 24 లోకెళ్లి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
(1) ఎవరు?
వాక్యభాగంలో ఉన్న వ్యక్తులెవరు? వారి గురించి మీకు ఏం తెలుసు?
లూకా 24:13-35లోని వ్యక్తులు ఎవరు? పునరుత్థాన దినమందు క్లెయొపా మరియు పేరులేని సహచరుడు[2] ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. వారు యేసు అద్భుతాలు, బోధలు తెలిసినవారు. ఈ ఆదివారం, క్రీస్తు శ్రమలు, పునరుత్థానం గురించి యేసే స్వయంగా వివరించగా మొదట విన్నవారు; పునరుత్థానానికి మొదట సాక్షులలో భాగమయ్యారు.
(2) ఏంటి?
వాక్యభాగంలో ఏం జరుగుతుంది? అది చారిత్రక వాక్యభాగమైతే, ఏ సంఘటనలు జరుగుతున్నాయి? అది పత్రికైతే, రచయిత ఏం బోధిస్తున్నాడు?
లూకా 24లో సంఘటన, యేసు ప్రత్యక్షత. యేసు పునరుత్థాన వాస్తవాన్ని చూడగలుగునట్లు ఈ ఇద్దరు మనష్యుల కళ్ళు తెరువబడ్డాయి (లూకా 24:31).
(3) ఎప్పుడు?
మునుపటి ప్రశ్నలా, సమయం మన పఠనానికి సందర్భాన్ని ఇస్తుంది. బైబిల్ అధ్యయనంలోని పరిశీలన దశలో, వాక్యభాగంలోనే సమయ వివరాలు గురించి చూస్తాం. ఖాళీ సమాధిని కనుగొన్న రోజునే ఎమ్మాయి ప్రయాణం జరిగిందని లూకా 24:13 ద్వారా నేర్చుకుంటాం.
ఖాళీ సమాధిని కనుగొన్న కొన్ని గంటలకే ఈ ఇద్దరు శిష్యులు యేసును కలిశారు. వారు మాట్లాడుకుంటూ, ఆలోచిస్తుండగా, వారి మనోభావాలెలా ఉన్నాయో ఇది చెబుతుంది (లూకా 24:15). గత మూడు దినాలుగా వీరి భావోద్వేగ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి.
గురువారం, యేసును పట్టుకోవడం చూసినప్పుడు, నిరాశకు గురైయ్యారు. శుక్రవారం, యేసు తుది శ్వాస విడిచినప్పుడు, మెస్సీయ రాజ్య నిరీక్షణను కోల్పోయారు. ఇప్పుడు ఇది ఆదివారం, సమాధి ఖాళీగా ఉంది. వారు ఎమ్మాయి గ్రామానికి వెళ్తుండగా, ఈ అర్థంకాని సంఘటనలు గురించి ఆలోచించటానికి ప్రయత్నించారు.
(4) ఎక్కడ?
“ఇది ఎక్కడ జరిగింది?” అని అడగటం ఎల్లప్పుడు సహయకరం. ఈ ప్రశ్నకు సమాధానాలు కనుగొనడంలో బైబిల్ అట్లాస్ మీకు సహాయపడుతుంది. కొన్ని బైబిళ్ళ వెనుక భాగంలో మ్యాప్/పటం ఉంటుంది.
లూకా 24లో, క్లెయొపా మరియు పేరులేని సహచరుడు, యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు, అది పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన ఉంది. వారు ఇంత దూరం నడిచే సమయానికి, సాయంత్రమైంది. అయితే వారి కళ్ళు తెరువబడిన తర్వాత, వీరు అనందంగా యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయారు. ఈ వార్త మరుసటి రోజు వరకు ఆగలేదు!
(5) ఎందుకు?
సమయానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చినప్పుడు, శిష్యులు ఎందుకు నిరాశపడ్డారో చూశాం. యేసు చనిపోయినప్పుడు, మెస్సీయపై పెట్టుకున్న వారి ఆశలన్నీ ముగిసిపోయాయి గనుక వారు నిరాశపడ్డారు.
(6) ఎలా?
ఈ ప్రత్యక్షత శిష్యుల జీవితాలను ఎలా మార్చివేసింది? యేసు మృతుల్లో నుండి లేచాడనే నమ్మకంతో వారు యెరూషలేముకు తిరిగి వెళ్లారు. అప్పటి నుండి లక్షలాదిమంది ప్రజలవలె, వారి జీవితాలు పునరుత్థానం ద్వారా మారాయి.
అదే వాక్యభాగాన్ని లేదా పుస్తకాన్ని అనేకసార్లు చదవండి
జి. క్యాంప్ బెల్ మోర్గాన్ 20వ శతాబ్దపు గొప్ప బోధకులలో ఒకడు. మోర్గాన్ ఎన్నడు బైబిల్ కాలేజికి వెళ్లలేదు, కాని ప్రభావవంతమైన బైబిల్ బోధకుడయ్యాడు. వాక్యభాగం బోధించే ముందు, తాను ఎంచుకున్న వాక్యభాగానికి సంబంధించి, బైబిల్ పుస్తకమంతటినీ 40సార్లు చదువుతాడు. ఈ ప్రకియ ద్వారా, ప్రతి వచనం గ్రంథమంతటికీ ఎలా సరిపోతుందో నేర్చుకున్నాడు. అతనికి పుస్తకంలో ముఖ్య విషయాలు తెలుసు; రచయిత సందేశం అర్థం చేసుకున్నాడు. ఒకసారి మోర్గాన్ ఇలా చెప్పాడు, “బైబిల్ ఎన్నడు సోమరితనానికి లొంగదు.” బైబిల్ అధ్యయనం కష్టమైన పని.
“నేను బైబిల్ పుస్తకాన్ని 40సార్లు ఎలా చదవగలను? బైబిల్ ను ఎప్పటికీ పూర్తి చేయలేను” అని మీరు అనొచ్చు. అది మీరు అనుకున్నంత కష్టం కాదు. చాలామంది పెద్దలు నిమిషానికి 100 పదాలు చదవగలరు; వారు ఒక గంటలో 6,000పదాలు చదవగలరు. బైబిల్లోని 33 పుస్తకాల్లో 6,000 పదాలు కంటే తక్కువ ఉన్నాయి. ఇందులో పౌలు పత్రికలు, సాధారణ పత్రికలు, చిన్న ప్రవక్తలు, పాత నిబంధన పుస్తకాలైన రూతు, ఎస్తేరు, ప్రసంగి, మరియు విలాపవాక్యములు ఉన్నాయి. రోజుకు ఒక గంటలో, 40 రోజుల్లో 40సార్లు ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు, 1 మరియు 2 థెస్సలొనీకయులకు చదవగలరు.
పుస్తకమంతా చదవటంవల్ల, అది ఎలా క్రమపరచబడిందో అర్థమౌతుంది. మునుపు, మనం అపొస్తలుల కార్యములు 1:8 చదివాం, అక్కడ యేసు శిష్యులను యెరూషలేము, యూదయ, సమరయ మరియు భూదిగంతాల వరకు సాక్షులుగా పంపాడు. మీరు అపొస్తలుల కార్యములు గ్రంథం పదే పదే చదివినప్పుడు, ఇది పుస్తకమంతటికీ ఒక నమూనాగా ఉండటం మీరు చూస్తారు. అపొస్తలుల కార్యములు మొదటి భాగంలో, హింసవలన అపొస్తలులు యెరూషలేం నుండి మిగిలిన యూదయ ప్రదేశాలకు వెళ్ళారు. అపొస్తలుల కార్యములు 8లో, ఫిలిప్పు సమరయకు సువార్త తీసుకెళ్ళాడు; అపొస్తలుల కార్యములు ముగిసే సమయానికి, పౌలు రోములో ప్రకటించాడు, అక్కడ నుండి సువార్త భూదిగంతాలవరకు వెళ్తుంది.
పదే పదే చదవడానికి కొన్ని సూచనలు
1. బైబిల్ ను గట్టిగా చదవండి లేక చదివేటప్పుడు వినండి. రాసిన పుస్తకాలపై ఆధారపడే సంస్కృతులకు చెందిన ప్రజలు, మొదటి క్రైస్తవులు బైబిల్ ను చదువుతున్నప్పుడు విన్నారనే సంగతి మర్చిపోతారు. ఎఫెసి సంఘానికి పౌలు పత్రికలు పంపినప్పుడు, ప్రతి సభ్యునికి ఫోటోకాపీ తీసి ఇవ్వలేదు! ఒక నాయకుడు ఇతరుల కోసం ఆ పత్రిక చదివేవాడు. చరిత్రలో చాలావరకు, చాలామంది దేవుని వాక్యాన్ని చదివి నేర్చుకోవడం కంటే విని నేర్చుకున్నారు. పౌలు పత్రికలు సంఘాల్లో చదివారు; ప్రవక్తలు వారి సందేశాలను వినిపించారు. పత్రికను గట్టిగా చదవడం ద్వారా లేక ఆడియో పుస్తకంగా వినడం ద్వారా, ఆదిమ సంఘం లేఖనాన్ని విన్నట్లుగా దేవుని వాక్యం మాట్లాడడం మీరు వింటారు.[3]
2. బైబిల్ ను వివిధ అనువాదాల్లో చదవండి (మీ భాషలో ఒక అనువాదం కంటే ఎక్కువ అందుబాటులో ఉంటే). కొన్ని అనువాదాలు తమ పద్ధతిలో మరింత సాంకేతికంగా ఉంటాయి; కొన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. ఒకటి కంటే ఎక్కువ అనువాదాలు చదవటంవల్ల, సందేశంలో నూతన అవగాహనలు పొందొచ్చు. మీకు ఒకటి కంటే ఎక్కువ భాషలు తెలిస్తే, మరో భాషలో కూడా లేఖనం చదవడం సహాయకరం.[4]
3. మీరు చదివే ప్రతిసారి విభిన్నమైన విషయాలపై దృష్టిపెట్టండి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రతిరోజు ఒక వారంపాటు ఆదికాండము 3 చదివి, ప్రతిసారి ఆ ఆధ్యాయాన్ని వేర్వేరు కోణంలో నుండి చూడొచ్చు:
సోమవారం: పరలోకపు తండ్రి కోణంలో ఆదికాండము 3 చదవచ్చు. తన పిల్లల పాపం చూసినప్పుడు తండ్రి ఎలా భావిస్తాడు?
మంగళవారం: అధ్యాయంలో అతి ముఖ్యమైన వచనం ఏంటి?
బుధవారం: సాతాను కోణంలో ఆదికాండము 3 చదవచ్చు. తన పిల్లలతో దేవునికున్న సంబంధాన్ని ఎలా నాశనం చేశాడు?
గురువారం: సిలువలో యేసు బలియాగం గుర్తుచేసుకుంటూ ఆదికాండము 3 చదవండి.
శుక్రవారం: ఆదాము మరియు హవ్వల కోణంలో చదవండి. దేవుని తీర్పు గురించి విన్నప్పుడు వారు ఎలా భావించారు?
శనివారం: మొట్టమొదటిసారిగా బైబిల్ ను చదువుతున్న వారి కోణంలో నుండి ఆదికాండము 3 చదవండి. బైబిల్ అంతటిని అర్థం చేసుకోవడానికి ఈ కథ ఎలా ప్రాముఖ్యం?
ఒక్క సంవత్సరంలో బైబిల్ చదవడానికి ఎంపిక చేసిన ప్రణాళికలు www.bible.comలో అందుబాటులో ఉన్నాయి. జి. క్యాంప్‌బెల్ మోర్గాన్ నమూనా ఆధారంగా మరొక ప్రణాళిక, నెలలో ఒక పుస్తకాన్ని అనేకసార్లు చదవడం. ఒక్క గంటలో లేక అంత కంటే తక్కువ సమయంలో కూడా, 33 బైబిల్ పుస్తకాలు చదవొచ్చు గనుక, నెలలో ప్రతిరోజు ఒక పుస్తకం 30సార్లు చదవగలరు. ఈ ప్రక్రియ నెమ్మదిగా ఉన్నప్పటికీ, పుస్తకం పదే పదే చదవడంవల్ల దేవుని వాక్యం లోతుగా అర్థం చేసుకుంటారు. ఈ పద్ధతిలో చదవండి, ఆరు సంవత్సరాల్లో బైబిల్ అంతటిని 16సార్లు చదవగలరు.[5]
వ్యాకరణాన్ని అధ్యయనం చేయండి
దేవుడు మనతో అనేక మార్గాల్లో మాట్లాడతాడు, మరిముఖ్యంగా రాయబడిన వాక్యం ద్వారా మాట్లాడతాడు. లేఖన అవగాహన కోసం మీరు భాషావేత్త కానక్కర్లేదు, రాసిన భాషను మీరు ఎంత మంచిగా అర్థం చేసుకుంటే, దేవుని వాక్య సత్యాన్ని అంతే మంచిగా గ్రహిస్తారు.
ఒక ఉదాహరణగా, పౌలు రాసిన ఒక సుప్రసిద్ధ వచనం తీసుకుని, వ్యాకరణం అధ్యయనం చేద్దాం. “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది” (రోమా 12:1). వచనం యొక్క వ్యాకరణాన్ని పరిశీలించినప్పుడు, మనం వీటిని చూస్తాం:
క్రియా పదాలు
క్రియాపదాలు, చర్య లేక ఉనికిని తెలియజేస్తాయి. రోమా 12:1లో రెండు క్రియా పదాలున్నాయి:
బతిమాలుకొనుట అంటే, “విజ్ఞప్తి” లేక “అడుక్కోవడం.” మీరు పౌలు అభ్యర్థలో ఆవశ్యకతను భావించగలరా? ఇది సామాన్య సలహా కాదు; దేవునికి పూర్తిగా అర్పించుకోవాలని తన పాఠకులను బతిమాలుకుంటున్నప్పుడు, లోతైన భావావేశం కనిపిస్తుంది.
సమర్పించుకొనుట అనేది సకర్మక్రియ. దీనికి నిబద్ధత అవసరం. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, దేవునికి పూర్తిగా అప్పగించుకొనుడని పౌలు తన పాఠకులను పిలుస్తున్నాడు.
నామవాచకాలు
రోమా 12:1లో, మన అధ్యయనానికి ముఖ్యమైన నామవాచకాలు ఇవి:
సహోదరులు. పౌలు విశ్వాసులకు రాస్తున్నాడు. పాపులను మారుమనసు కోసం పిలవడం లేదు; మరింత సమర్పణతో ఉండాలని విశ్వాసులను పిలుస్తున్నాడు.
శరీరములు. రోమా 12 మిగిలిన భాగం, శరీరములు అంటే జీవితమంతటినీ సూచిస్తుంది. దీనికి మనం “మీ జీవితమంతటిని సమర్పించుకోవాలి” అనే వివరణ ఇవ్వొచ్చు.
వాత్సల్యములు. దేవుని వాత్సల్యమును బట్టి పౌలు పిలుస్తున్నాడు. ఈ వచనానికి ముందున్న వాక్యభాగంలో, దేవుడు అందరి యెడల, యూదులు మరియు అన్యజనుల యెడల కరుణ చూపుతాడని పౌలు వివరించాడు (రోమా 11:32).
యాగము. మోషే ధర్మశాస్త్రంలో, అరాధికుడు బలిగా జంతువును తీసుకొచ్చేవాడు. క్రీస్తు రాజ్యంలో, మన జీవితం సజీవ యాగంగా అర్పించడానికి మనం పిలువబడ్డాం.
విశేషణాలు
విశేషణాలు మరియు క్రియావిశేషణాలు అంటే వివరణాత్మక పదాలు, విశేషణాలు, “అవి విశేషంగా చెప్పే పదాల అర్థాన్ని వివరిస్తాయి.”[6] రోమా 12:1లో, యాగము అనే పదం అనేక పదాల శ్రేణి ద్వార విశేషంగా చెప్పబడింది.
మన యాగం సజీవం. మనం ఇకమీదట మృతమైన జంతువును సమర్పించము; మన జీవితాలను అనుదినం సమర్పించుకుంటాం.
మన యాగం పరిశుద్ధం. పాత నిబంధన అరాధికుడు బలియాగం కోసం కుంటిదైన లేక అంగవైకల్య కలిగిన జంతువును తీసుకురాలేడు; క్రొత్త నిబంధన విశ్వాసి యాగముగా అపవిత్రమైన, అవిధేయత కలిగిన జీవితాన్ని అర్పించలేడు.
ఉపసర్గ పదాలంటే లో, పై, పైన, కి, కు మరియు ద్వారా. ఈ చిన్న పదాలు పెద్ద అర్థాన్ని కలిగియుంటాయి. రోమా 12:1లో, రెండు ఉపసర్గిక పదసమూహాలు ముఖ్యమైనవి:
“దేవుని వాత్సల్యమును బట్టి” అనే మాట పౌలు విజ్ఞప్తికి ఆధారం. ఇది ఒక సైనికుడు శత్రువుకి లొంగిపోవటం కాదు; కాని, ప్రేమగల తండ్రి చిత్తానికి కుమారుడు అనందంగా లొంగిపోవటం.
మన యాగాలు “దేవునికి” అనుకూలము గా ఉండాలి. క్రైస్తవునికి, దేవుని ఆమోదమే తుది బహుమానం.
సంయోజక (సంబంధం కలిగించు) పదాలు
మరియు లేక కాని అనే సంయోజక పదాలు శక్తివంతమైనవి. ఒక రచయిత సంయోజక పదాలను, ఇటుకరాళ్లను కలిపి ఉంచే సున్నంతో పోల్చాడు.[7] అపొస్తలుల కార్యములు 1:8లో, అయినను ఆనే పదం శిష్యుల అపార్థాన్ని సూచిస్తుందని మనం చూశాం.
రోమా 12:1లో, కాబట్టి అనే మాట మునుపటి వాక్యభాగాన్ని సూచిస్తుంది. మీరు రోమా పత్రిక అంతా చదివితే, మీరు రెండు పెద్ద భాగాలు చూస్తారు:
రోమా 1-11 సిద్ధాంతాన్ని బోధిస్తుంది: పాపానికి శిక్షావిధి, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం, విశ్వాసి పరిశుద్ధపరచబడడం, మహిమపరచబడడం అనేవి తన పిల్లల పట్ల దేవునికున్న అంతిమ ఉద్దేశ్యం, మరియు ఎన్నుకొనుట అనేది ఈ ఉద్దేశ్యాన్ని నెరవేర్చే దేవుని సాధనం.
రోమా 12-16 వాక్యభాగం ఈ సిద్ధాంతం యొక్క ఆచరణాత్మక అన్వయింపును చూపిస్తుంది. మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడ్డాం గనుక ఇలా జీవిస్తాం. మనం విశ్వసించే దాని బట్టి (రోమా 1-11), ఇలా చేస్తున్నాం (రోమా 12-16). రోమా 12:1వ వచనం సంయోజక వచనం.
పౌలు రాసిన చాలా పత్రికల్లో కాబట్టి అనే పదం ఒక ముఖ్య గుర్తు. కేవలం విశ్వాసం ద్వారా నీతిమంతుగా తీర్చబడతారనే గొప్ప సత్యాన్ని గలతీ విశ్వాసులకు జ్ఞాపకం చేసిన తర్వాత, అనుదిన జీవితంలో వారు తమ నీతిని ఆచరణలో పెట్టాలని పౌలు చెప్పాడు; “ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి” (గలతీయులకు 5:1). క్రీస్తు యేసులో వారు ఎన్నుకోబడ్డారన్న గొప్ప సిద్ధాంతాన్ని బోధించిన తర్వాత, ఆ పిలుపుకు తగినట్లుగా జీవించాలని పౌలు ఎఫెసీయులకు చెప్పాడు; “మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోకూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను” (ఎఫెసీయులకు 4:3). మీరు మృతిబొందారు, మీ జీవం క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడిందని పౌలు కొలొస్సయులకు చెప్పాడు. దాని ఫలితంగా వాళ్ళు ఎలా జీవించాలి? “కావున భూమిమీదనున్న మీ అవయవములను....చంపివేయుడి” (కొలొస్సయులకు 3:5).
వాక్యభాగంలో ముఖ్య ఆలోచనలు గుర్తించడానికి బైబిల్ రచయితలు ఉపయోగించే గుర్తించే చిట్కాలు, మీ అధ్యయనానికి క్రొత్త అవగాహన ఇస్తాయి. చూడాల్సిన వివరాలు:
పునరావృతమయ్యే పదాలు
ఒక రచయిత ఒక పదాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగిస్తే, అది ముఖ్య ఆలోచనను సూచిస్తుంది. [పరిశీలన దశలో, పునరావృత పదంలో, లోతైన అర్థాలన్నీ చూడరు, కాని ఆ పదాన్ని గుర్తించి, “ఈ పదం ఎందుకు పునరావృతమైంది?” అని అడగాలి.
► క్రింది వాక్యభాగాలు చదివి, పునరావృత పదాలు గుర్తించండి:
2 కొరింథీయులకు 1:3-7. ఈ వాక్యభాగంలో ఆదరణ అనే మాట ఎన్నిసార్లు పునరావృతమయ్యింది? ఈ వాక్యభాగంలో పునరావృత పదాలను గమనించినప్పుడు, మీరు అడగగల ప్రశ్నల ఉదాహరణలు:
ఆదరణ అనే మాట ప్రతిసారి ఒకే విధంగా ఉపయోగించబడిందా? (కొన్నిసార్లు అది నామవాచకం; మరికొన్నిసార్లు క్రియాపదం.)
ఏ విశేషకాలు ఉపయోగించారు? (సమస్తమైన ఆదరణ;మా ఆదరణ; మీ ఆదరణ.)
యోహాను 15:1-10. ఈ వాక్యభాగంలో నిలిచియుండుడి అనే మాట ఎన్నిసార్లు పునరావృతమయ్యింది? ఈ వాక్యభాగంలో పునరావృత పదాలను గమనించినప్పుడు, మీరు అడగగల ప్రశ్నలకు ఉదాహరణలు:
ఆయనయందు నిలిచియుండుటకు షరతులు ఏంటి?
ఈ వాక్యభాగంలోని హెచ్చరిక, ఆయనయందు నిలిచియుండకపోవడం సాధ్యమని సూచిస్తుందా?
ఆయనయందు నిలిచియుండకపోతే ఏమౌతుంది?
ఆయనయందు నిలిచియుంటే ఏ ఆశీర్వాదాలు ఉంటాయి?
వ్యత్యాసాలు
అనేకమంది బైబిల్ రచయితలు ప్రజలు లేక ఆలోచనలకు భిన్నంగా ఉంటారు. మీరు ఒక వచనంలో కాని అనే పదం చూసినప్పుడు, అది రెండు భిన్న ఆలోచనలను కలుపుతుంది. అనేక సామెతలు ఈ విధమైన విరుద్ధత ఉపయోగిస్తాయి.
విమర్శకునికి స్పందించడానికి రెండు మార్గాలు ఉన్నాయి: “మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును” (సామెతలు 15:1).
ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి: “నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము” (సామెతలు 11:14).
బీదల యెడల మన వైఖరి, దేవుని యెడల మన వైఖరిని తెలియజేస్తుంది: “దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు” (సామెతలు 14:31).
క్రొత్త నిబంధన రచయితలు కూడా వ్యత్యాసాలు ఉపయోగించారు. పౌలు మన పాత జీవితాలకు (చీకటి), మన క్రొత్త జీవితాలకు (వెలుగు) మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరించాడు; “మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు” (ఎఫెసీయులకు 5:8).
1 యోహాను 1:5-7లో, యోహాను చీకటి మరియు వెలుగును రెండు విధాలుగా వివరించాడు:
దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.
మనమును, చీకటిలో కాకుండా వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము.
“సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు” (సామెతలు 10:26).
“దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును” (సామెతలు 25:25).
► యాకోబు 3:3-6 చదవండి. నాలుకను మూడింటితో పోల్చారు. పోలికల ద్వారా మీరు ఏం నేర్చుకుంటారు?
► సామెతలు 26:7-11 లోని ప్రతి వచనంలో, సమానుడు అనే మాట ఉంది. ప్రతి వచనంలో, పోలిక అధ్యయనం చేయండి. మీరు సామెతలు 26:7 చూస్తున్నట్లయితే, మీకు మీరు ఇలా చెప్పుకుంటారు: “కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును ఎందుకంటే...” మూర్ఖుల నోటి సామెతకు మరియు కుంటివాని కాళ్ళకు మధ్య మీరు ఏ సారుప్యత చూస్తారు?
జాబితాలు
మీరు బైబిల్ చదువుతున్నప్పుడు, జాబితాలు గుర్తించి, ముఖ్యమైన లక్షణాల కోసం వాటిని అధ్యయనం చేయాలి.
► పాఠంలో ముందుకు వెళ్ళడానికి ముందు, క్రింద ఇచ్చిన జాబితా చదవడానికి సమయం కేటాయించండి:
1 కొరింథీయులకు 3:6లో, పౌలు కొరింథులో తన పరిచర్యలోని భాగాలను చూపించాడు.
1 యోహాను 2:16 తండ్రి నుండి కాక లోకం నుండి వచ్చు విషయాలను జాబితా చేస్తుంది.
గలతీయులకు 5:19-21 పాప స్వభావ కార్యాల జాబితా ఇస్తుంది.
గలతీయులకు 5:22-23 ఆత్మ ఫలం జాబితా ఇస్తుంది.
ఉద్దేశ్య ప్రకటనలు
అది, తద్వారా, లేక కి వంటి పదాలు క్రియకు లేక చర్యకు ప్రేరణను ఇస్తుంది లేక చర్యా ఫలితం గురించి వివరిస్తుంది. ఉద్దేశ్యం మరియు ఫలితం మధ్య సంబంధాన్ని పరిగణించడానికి సమయం కేటాయించండి; లేఖనం ఉపదేశం ఎందుకు ఇస్తుందో అడగండి.
“మీరు నన్ను ఏర్పరచుకొనలేదు…. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని” (ఎందుకు?) “మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును” (యోహాను 15:16).
“నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను” (ఎందుకు?) “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు” (కీర్తన 119:11).
“యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని” (ఆయన మనలను ఎందుకు నిర్ణయించుకున్నాడు?), “మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే” (ఎఫెసీయులకు 1:4).
ఇతర సమయాల్లో, ఉద్దేశ్యం ఎలా నెరవేర్చబడిందో ప్రకటన చూపిస్తుంది:
“యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్దిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?” (కీర్తన 119:9).
మన జీవితానికి నిశ్చయత ఏంటి? “గాని ఆత్మ చేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు” (రోమా 8:13).
షరతులతో కూడిన వాక్యాలు
అయితే (if) అను పదంతో మొదలయ్యే వాక్యాలు షరతును కలిగియుంటాయి. కొన్నిసార్లు పాఠకులు షరతు నెరవేర్చకుండా బైబిల్ వాగ్దానాలు నెరవేరతాయని అనుకుంటారు; అయితే, షరతులతో కూడిన వాగ్దానం ఒక ప్రత్యేక షరతు నెరవేర్పుపై ఆధారడి ఉంటుంది. దీనిని తరచు షరతులతో కూడిన వాక్యం ద్వారా చూడొచ్చు.
షరతు: “కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల”
ఫలితం: “వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను” (2 కొరింథీయులకు 5:17).
షరతు: “నా నామమున”
ఫలితం: “మీరు నన్నేమి అడిగినను నేను చేతును” (యోహాను 14:14).
చదువుతున్నప్పుడు ప్రార్థించండి
తుది సూచన స్పష్టంగా అనిపించవచ్చు, కాని ముఖ్యమైంది. క్రైస్తవునికి బైబిల్ అధ్యయనం, ప్రార్థనా జీవితం వేర్వేరుగా ఉండకూడదు. బైబిల్ పఠనాన్ని, ప్రార్థనను వేరు చేయడమంటే దేవునితో మన అనుదిన సంభాషణలో రెండు విషయాలను వేరు చేయడమే.
మనకు జ్ఞానం లేనప్పుడు దేవుని సహాయం కోరవచ్చని యాకోబు ధృవీకరించాడు; “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు” (యాకోబు 1:5). దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి దేవుని సహాయం అవసరమైనప్పుడు, ఇది అద్భుతమైన వాగ్దానం.
కీర్తన 119వ అధ్యాయం ప్రార్థనకు, లేఖనానికి మధ్య సంబంధాన్ని చూపిస్తుంది. కీర్తనాకారుడు దేవుని వాక్యం అధ్యయనం చేస్తున్నప్పుడు, మార్గనిర్దేశం కోసం దేవుణ్ణి పదే పదే వేడుకున్నాడు. అదే విధంగా, మనం అధ్యయనం చేస్తుండగా, దేవుని సహాయం కోరవచ్చు.
“నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు లను చూచునట్లు నా కన్నులు తెరువుము” (కీర్తన 119:18).
“నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను” (కీర్తన 119:27).
“యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము” (కీర్తన 119:33).
లేఖనంలోని మాటలను, ప్రార్థనగా మార్చే గొప్ప శక్తిని చాలామంది నేర్చుకున్నారు. ఈ వాక్యభాగాలను మీ వ్యక్తిగత ప్రార్థనలుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి:
కీర్తన 23 – దేవుని నడిపింపు మరియు భద్రత కోసం ప్రార్థన
యెషయా 40:28-31 – దేవుని బలం కోసం ప్రార్థన
ఫిలిప్పీయులకు 4:8-9 – దైవిక మనసు కోసం ప్రార్థన
[1]ఈ పాఠంలోని దశలు, Living by the Book, by Howard G. Hendricks మరియు William D. Hendricks (Chicago: Moody Publishers, 2007).Yలో 8-17 అధ్యాయాల నుండి వచ్చాయి. ఈ అధ్యాయాలు చదవడంవల్ల మీరు అదనపు అభ్యాసం మరియు వివరణ పొందొచ్చు.
[2]పేరులేని సహచరుడు లూకా అని ఒక సంప్రదాయం సూచిస్తుంది, ఇది కథలోని వివరాలన్నిటిని వివరిస్తుంది.
(1) ఒక వచనాన్ని అధ్యయనం చేయడం ద్వారా పరిశీలన ప్రక్రియ మొదలుపెట్టండి. వచనంలో సాధ్యమైనన్ని ప్రశ్నలు అడగండి.
(2) మీ పరిశీలనా శక్తిని పెంచే దశలు:
అవగాహన కోసం చదవండి.
చదువుతున్నప్పుడు ప్రశ్నలు అడగండి.
ఎవరు?
ఏంటి?
ఎప్పుడు?
ఎక్కడ?
ఎందుకు?
ఎలా?
అదే వాక్యభాగాన్ని లేదా పుస్తకాన్ని అనేకసార్లు చదవండి.
వ్యాకరణాన్ని అధ్యయనం చేయండి. వీటి కోసం చూడండి:
క్రియాపదాలు
నామవాచకాలు
విశేషకాలు
ఉపసర్గిక పదాలు
సంయోజక పదాలు
వాక్యభాగంలో ప్రత్యేక వివరాల కోసం చూడండి. ఈ క్రిందివాటి కోసం చూడండి:
పునరావృతమయ్యే పదాలు
వ్యత్యాసాలు
పోలికలు
జాబితాలు
ఉద్దేశ్య ప్రకటనలు
షరతులతో కూడిన వాక్యాలు
చదివేటప్పుడు ప్రార్థించండి.
పాఠం 2 అభ్యాసాలు
(1) యెహోషువ 1:8 పై పరిశీలనల జాబితా చేయండి. ఒక పేపరులో వచనం రాసి, ప్రశ్నలు అడగటం మొదలుపెట్టండి: “ఎవరు? ఏంటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? ఎలా?” ఈ పాఠం చివరి భాగంలో ఇచ్చిన ఉదాహరణ, సూచనలు ఉపయోగించి, మీరు చేయగల పరిశీలనలన్ని చేయండి. ఈ దశలో, మీరు వచనాన్ని బాష్యం చేయట్లేదు లేక ప్రసంగం తయారు చేయట్లేదు. వచనంలో వివరాలు కోసం చూస్తున్నారు.
(2) మరింత అభ్యాసం కోసం, మత్తయి 28:18-20 కి కూడా అదే ప్రకియ అనుకరించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.