బైబిల్ లోతైన అర్థంతో కూడినది, కాని విచారకరంగా, కొందరు లేఖన సందేశాన్ని అర్థం చేసుకోకుండా లేఖనం చదువుతారు.[1] బైబిల్ లో, పుస్తకాలు, అధ్యాయాలు, భాగాలు, వచనాలు, మరియు పదాలు ఉన్నాయి. పదాల అర్థం గ్రహించినప్పుడు, మనం అధ్యయనం చేసే వాక్యభాగాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ పాఠం పదాలు ఎలా అధ్యయనం చేయాలనే విషయాన్ని గురించి మాట్లాడుతుంది. ఒక ప్రత్యేక బైబిల్ సందర్భంలో, దాని అర్థం ఏంటో గ్రహించడానికి ఒక పదాన్ని మనం అధ్యయనం చేస్తాం.
కొన్నిసార్లు ప్రజలు బైబిల్ అధ్యయన వనరులు ఉపయోగించి బైబిల్ గ్రీకు మరియు హెబ్రీ పదాలు అధ్యయనం చేస్తారు. ఆ విధమైన అధ్యయనానికి ఉపయోగించే వనరులు ఎక్కువగా అందుబాటులో లేవు, కాబట్టి వాటిని గురించి ఈ పాఠంలో చర్చించము. బదులుగా, మన స్థానిక భాషలో పదాలను ఎలా అధ్యయనం చేయాలో నేర్చుకుందాం.
పదాల అధ్యయనానికి మూడు-దశల ప్రక్రియ ఉపయోగిద్దాం:
1. అధ్యయనం చేయడానికి పదాలు ఎన్నుకోండి.
2. ఎన్నుకున్న ప్రతి పదానికి సాధ్యమయ్యే అర్థాల జాబితా చేయండి.
3. వాక్యభాగ సందర్భంలో ఎన్నుకున్న పదాల అర్థాన్ని గ్రహించండి.
[1]ఈ పాఠంలో మెటీరియల్ చాలావరకు J. Scott Duvall and J. Daniel Hays, Grasping God’s Word (Grand Rapids: Zondervan, 2012)లో 9వ అధ్యాయం నుండి తీసుకున్నారు.
పదాల అధ్యయనంలోని సాధారణ తప్పిదాలు
మనం పదాలు అధ్యయనం మొదలుపెడుతుండగా, మనం కొన్ని తప్పులు నివారించాలి. ఈ పొరపాట్లు తప్పుడు భాష్యానికి నడిపిస్తాయి.
పదం యొక్క మునుపటి అర్థాన్ని విస్మరించడం
కొన్నిసార్లు పదాన్ని ఉపయోగించే విధానం కాలక్రమేణా మారుతుంది. బైబిల్ అనువాదం జరిగి చాలా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, మన బైబిల్లోని కొన్ని పదాల అర్థాలు, నేడు అదే పదాల అర్థానికి భిన్నంగా ఉండొచ్చని మనం తెలుసుకోవాలి. గతంలో ఆ పదం ఎలా ఉపయోగించారో అర్థం చేసుకోకపోతే, మన అధ్యయనం చేసే వాక్యభాగాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. (మనం ఇటీవల వచ్చిన బైబిల్ అనువాదాలు చదువుతున్నట్లయితే, అది అంత పెద్ద సమస్య కాదు.)
► మీ భాషలో కాలక్రమేణా దాని అర్థం మారిన ఒక పదం గురించి మాట్లాడండి.
ప్రతి సందర్భంలోనూ ఒక పదానికి ఒకే అర్థం ఉందని భావించడం
బైబిల్ రచయితలు ఒకటి కంటే ఎక్కువ అర్థాలున్న పదాలు ఉపయోగించారు. ఒకే పదం ఒక సందర్భంలో ఒక విధంగా, మరో సందర్భంలో మరొక విధంగా ఉపయోగించవచ్చు. మనం అధ్యయనం చేస్తున్న వాక్యభాగంలో, ఏ అర్థం సరైనదో తెలుసుకోవడానికి ఆ పదం ఉపయోగించిన సందర్భం చూడాలి.
పదం యొక్క అధ్యయన ప్రక్రియ
మొదటి దశ: వాక్యభాగంలో అధ్యయనం చేయాలనుకున్న పదాలు ఎన్నుకోండి
బైబిల్లోని ప్రతి పదాన్ని లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరత లేదు. కొన్నిసార్లు బైబిల్ అర్థం స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, దావీదు ఐదు రాళ్లు యేరుకున్నాడని బైబిల్ సెలవిచ్చినప్పుడు (1 సమూయేలు 17:40), దాని అర్థం కోసం రాయి అనే పదాన్ని అధ్యయనం చేయనవసరం లేదు.
అధ్యయనానికి పదాలు ఎన్నుకోవాలంటే, వీటి కోసం చూడండి:
►రోమా 12:1-2 చదివి, అధ్యయనం కోసం ముఖ్య పదాలు గుర్తించండి. పదం ప్రక్కన, ఆ పదం ఎన్నుకోవడానికి కారణం ఏంటో రాయండి:
1 = ముఖ్య పదం
2 = పునరావృత పదం
3 = భాషా రూపం
4 = అస్పష్ట లేక కష్ట పదం.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
మీరు గుర్తించిన కొన్ని పదాలు ఏవనగా:
1 = ముఖ్య పదం: బ్రతిమాలుకొనుచున్నాను, సమర్పించుకొనుడి, అనుసరించుట, నూతనమగుట, రూపాంతరము
2 = పునరావృత పదాలు: వాక్యభాగంలో ఏమి లేవు
3 = భాషా రూపం: సజీవ యాగం
4 = అస్పష్టమైన లేక కష్టమైన పదాలు: ఆత్మీయ ఆరాధన
రెండవ దశ: పదానికి సాధ్యమయ్యే అర్థాలు
అనేక భాషలలో అనేక భిన్నమైన అర్థాలతో, అనేక విధాలుగా ఉపయోగించబడే పదాలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఉపదేశకుడు ఏ అర్థం ఉపయోగిస్తున్నాడో వినేవారికి సహజంగా అర్థమౌతుంది. అప్పుడప్పుడు, వినేవారి సందర్భాన్ని సరిగా పరిగణలోకి తీసుకోనప్పుడు మరియు ఉపదేశకుని ఉద్దేశ్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, హాస్యాస్పదమైన మరియు తీవ్రమైన అపార్థాలు జరుగుతూ ఉంటాయి.
► ఒకరు ఒక పదానికి అర్థం చెప్పినప్పుడు ఆ అర్థాన్ని మరొకరు అపార్థం చేసుకున్న సందర్భం గురించి మీరు ఆలోచించగలరా?
రెండవ దశలో, పదాన్ని ఉపయోగించగల సాధ్యమైన మార్గాలన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. మన బైబిల్ అనువాదం పురాతనమైనదైతే, గతంలో ఆ పదానికి అదనపు అర్థాలు ఉన్నాయో లేదో కూడా ఆలోచించాలి.[1] మన యొద్ద నిఘంటువు ఉన్నట్లయితే, సాధ్యమయ్యే అర్థాలన్నిటిని జాబితా చేయడానికి అది సహాయపడుతుంది. మనం ఇతరులతో కలిసి అధ్యయనం చేసినప్పుడు, మనం ఆలోచించని అర్థాలు గురించి కూడా ఆలోచించేలాగా వాళ్లు మనకు సహాయపడతారు.
వీలైతే, బైబిల్ యొక్క ఇతర అనువాదాలను పరిశీలించి, వారు కూడా అదే పదాన్ని ఉపయోగిస్తున్నారో లేదో చూడాలి.[2] అనువాదం భిన్నమైన పదాన్ని ఉపయోగిస్తే, రెండు పదాలను పోల్చి చూసి, వ్యత్యాసం ఎక్కడ ఉందో కనుగొనాలి. అవి ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయా? లేని యెడల, ఎలా భిన్నంగా ఉన్నాయి? వేరే పదం ఉపయోగించడం వలన వాక్యభాగ అర్థం మారిపోతుందా?
► రోమా 12:1-2లో అధ్యయనానికి మనం ఎన్నుకున్న పదాల్లో సమర్పించుకొనుడి ఒకటి. సమర్పించుకొనుడి అనే పదానికి సాధ్యమైయ్యే అర్థాలన్నిటిని జాబితా చేయడానికి కలిసి పనిచేయండి.
మూడవ దశ: వాక్య సందర్భంలో ఆ పదం అర్థం ఏంటో గ్రహించండి
ఒక పదానికి వివిధ ఉపయోగాలు చూసి, సాధ్యమయ్యే అర్థాల జాబితా చేసిన తర్వాత, మీరు అధ్యయనం చేస్తున్న వాక్యభాగంలో పదం అర్థం ఏంటో కనుగొనడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. సందర్భం మిమ్మల్ని నడిపిస్తుంది. గుర్తుంచుకోండి, కొందరికి మాత్రమే తెలిసిన ప్రత్యేక అర్థాన్ని ఉపయోగించాలని రచయిత ఉద్దేశించలేదు. రచయిత పాఠకుడు అర్థం చేసుకోవాలని ఉద్దేశించాడు.
5వ పాఠంలో మనం సందర్భం యొక్క ప్రాముఖ్యతను చూశాం, కాబట్టి ఈ విషయాన్ని వివరంగా సమీక్షించమం. సందర్భ పాత్రను సంక్షిప్తంగా చెప్పాలంటే: పదానికి ఉత్తమ నిర్వచనాన్ని కనుగొనడానికి, మనం ఆ పదం చుట్టుప్రక్కలున్న వచనం, అధ్యాయం, మరియు పుస్తకాన్ని పరిశీలిస్తాం.
సందర్భాన్ని చూసి, ఆ పదానికి అర్థాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుండగా పరిగణించవలసిన కొన్ని ప్రశ్నలు.
(1) పదాన్ని నిర్వచించడానికి సహాయపడే వ్యత్యాసం లేక పోలిక వాక్యభాగంలో ఉందా?
► చదవండి యోహాను 3:16: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” నశింపక అనే పదానికి సాధ్యమయ్యే పదాలు కలిసి జాబితా చేయండి (మీ యొద్ద నిఘంటువు ఉంటే దానిని ఉపయోగించవచ్చు.) ఇప్పుడు, వచనంలో ఇచ్చిన వ్యత్యాసాన్ని పరిగణలోనికి తీసుకోండి. నశించడం అనే పదం నిత్యజీవాన్ని కలిగియుండుట అనే పదానికి విరుద్ధం. మీ జాబితాలో, నశించుట అనే పదానికి ఏ అర్థం, ఇక్కడ యేసు ఉద్దేశించినదానికి అనుసంధానంగా ఉంది?
(2) రచయిత ఈ పదాన్ని ఇతర చోట్ల ఎలా ఉపయోగించాడు?
యోహాను 3:16లో లోకమును అనే పదం కూడా ఉపయోగించారు. లోకము అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి:
భౌతిక విశ్వం
ప్రజలందరు
సుపరిచయ నాగరిక దేశాలు
దేవుని తిరస్కరించు సాధారణ సమాజం
లేఖనంలో వివిధ ప్రదేశాలలో ఈ విషయాల్ని సూచించడానికి రచయిత లోకమును అనే పదం ఉపయోగించాడు. యోహాను 3:16లో, లోకమును అనే పదానికి ఏ అర్థం వస్తుందో గ్రహించాలంటే, యోహాను ఈ పదాన్ని ఉపయోగించిన ఇతర ఉదాహరణలు కూడా చూడాలి.
యోహాను 1:10, “ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.” ఈ వచనం యేసు గురించి మాట్లాడుతుంది. లోకమాయనను తెలిసికొనలేదు.
యోహాను 7:7, “లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.” ఈ వచనంలో యేసు మాట్లాడుతున్నాడు. లోకము ఆయనను ద్వేషిస్తుంది.
యోహాను 14:17, “లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.” ఆత్మ సత్యాన్ని లోకం పొందలేదు.
1 యోహాను 2:15-17, “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” లోక విలువలు మరియు అన్వేషణలు దేవునికి పూర్తిగా వ్యతిరేకం.
దేవుని తిరస్కరించే సామాన్య లోకాన్ని సూచించడానికి అపొస్తలుడైన యోహాను లోకమును అనే పదం ఉపయోగించాడు. ఇది యేసు వాగ్దాన పరిధిని చూపిస్తుంది: దేవుడు తనకు దూరంగా ఉన్నవారిని ఎంతగానో ప్రేమించాడు గనుక అందరు రక్షించబడునట్లు తన కుమారుని అనుగ్రహించాడు.
(3) పద అర్థం గురించి సందర్భం ఏమి తెలుపుతుంది?
► లూకా 1:68-79 చూడండి.
లూకా 1:71 లో, ఇశ్రాయేలు రక్షణ గురించి జెకర్యా ప్రార్థిస్తాడు. అతడు దేన్ని సూచిస్తున్నాడు? ఈ వచనంలో రక్షణ అంటే అర్థం ఏంటి?
లేఖనంలో రక్షణ అనే విషయానికి అనేక అర్థాలు ఉన్నాయి. అది ప్రత్యేకంగా వీటిని సూచించగలదు:
ప్రమాదం లేక శత్రువుల నుండి విమోచన
రోగం నుండి విడుదల
పాపం నుండి విడుదల
రక్షణ శత్రువుల నుండి విమోచనను సూచిస్తుందని తక్షణ సందర్భం (లూకా 1:68-74) చూపిస్తుంది. విమోచన (రక్షణ) దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను నెరవేర్చుతుంది (లూకా 1:73).
కొన్ని వచనాలు తర్వాత, లూకా రక్షణ అనే పదాన్ని మరింత లోతైన అర్థంతో ఉపయోగించాడు (లూకా 1:77). పరిశుద్ధాత్ముని నాయకత్వంలో, తన కుమారుడు సర్వోన్నతుని ప్రవక్త అనబడతాడని జెకర్యా చూశాడు. జెకర్యా కుమారుడు పాప క్షమాపణ ద్వారా రక్షణ గురించి ప్రభువు ప్రజలకు బోధిస్తాడు. ఇక్కడ, రక్షణ పాప క్షమాపణకు అనుసంధానంగా ఉంది.
ఈ ప్రార్థనలో, రక్షణకు సంబంధించిన వివిధ అర్థాలు ఉపయోగించారు. సందర్బం ద్వారా అర్థాన్ని మనం నిర్ణయిస్తాం.
[1]పాత బైబిల్ అనువాదాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, క్రొత్త బైబిల్ అనువాదము కూడా ఆ ప్రత్యేక సందర్భంలో, ఒక పదం అర్థాన్ని గురించిన అంతర్దృష్టిని మనకు అందిస్తుంది.
[2]వివిధ భాషలు మరియు వెర్షన్లలో బైబిల్ని చదవగల వెబ్సైట్ల కోసం అనుబంధాన్ని చూడండి.
కార్యాచరణలు అభ్యసించండి
తరగతి నాయకునికి గమనిక: ఈ ఆచరణాత్మక కార్యాచరణలు కోసం తగిన సమయం కేటాయించండి. మీ తరగతి సమయం, ఒక గంట మాత్రమే అయితే, వీటిని అభ్యాసం చేయడానికి సెషన్ మొత్తం కేటాయించండి. ప్రతి అభ్యాసానికి సూచించిన సమయం కేటాయించబడుతుంది. తరగతి సమయంలో కలిసి అభ్యసించడంవల్ల, విద్యార్థులు వాళ్లు నేర్చుకున్న వాటిని ఆచరణలో పెడతారు. ఇతరులతో కలిసి ప్రక్రియకు అనుగుణంగా పదాలు అధ్యయనం చేయడంవల్ల, ఏకాంతంగా పని చేసినప్పుడు చూడలేని దృక్పథాలు, వివరాలు తరచు ఉన్నాయని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
చిన్న సముహ కార్యాచరణల కోసం, ప్రతి గుంపులో ముగ్గురు విద్యార్ధులను ఉంచండి. చివరి ఐదు నిమిషాలలో ప్రతి గుంపు కూడా ఒక చోటకి వచ్చి, ఏమి నేర్చుకున్నారో చర్చించాలి.
► చిన్న గుంపు కార్యాచరణ (20 నిముషాలు). మీ గుంపులో, ఒకే పదాన్ని వివిధ అర్థాలతో ఉపయోగించిన అనేక వచనాలను కనుగొనండి. మీరు మొదలుపెట్టడానికి ఇక్కడ కొన్ని ఆలోచనలు ఉన్నాయి: ఇల్లు, దర్శనం, దినం, పండు. ఒకే పదం వివిధ అర్థాలు కలిగియున్న వచనాలను కనుగొన్న తర్వాత, ఆ పదం ఉపయోగించ గల మార్గాల జాబితా చేయండి. ప్రతి వచనాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి పదాల అధ్యయనం ఎలా సహాయపడింది?
► గుంపు అంతటి కార్యాచరణ (10 నిమిషాలు). ఇప్పుడు మళ్ళీ రోమా 12:1 తీసి, సమర్పించుకొనుడి అనే పదానికి మీరు రాసిన సాధ్యమయ్యే అర్థాలు చూడండి. ఆ వచనంలో ఏ అర్థం ఉద్దేశించబడిందో గ్రహించడానికి పైన ఇచ్చిన ప్రశ్నలను ఉపయోగించండి.
► చిన్న గుంపు కార్యాచరణ (30 నిమిషాలు). మీ గుంపులో, పదాల అధ్యయన ప్రక్రియ అభ్యాసం చేయండి. మీరు ఇప్పటికే రోమా 12:1-2 లో పదాలు గుర్తించారు, వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఆ ప్రతి పదానికి, సాధ్యమయ్యే అర్థాలు జాబితా చేసి, ఆ సందర్భంలో ఏ అర్థం సరిపోతుందో నిర్ణయించండి.
ప్రత్యేక సందర్భం: అలంకార రూపక భాష
6వ పాఠంలో, అలంకార రూపక భాష గురించి క్లుప్తంగా చూశాం. మనం పదాల అధ్యయనాన్ని ఎంత జాగ్రత్తగా చేసినప్పటికీ, మనం రచయిత యొక్క అలంకార రూపక భాషను తప్పుగా అర్థం చేసుకుంటే, మన భాష్యం తప్పే అవుతుంది. భాషా రూపాల్లో, ముఖ్య విషయం ఏంటంటే, పదాల అక్షరార్థం కాదుగాని, అవి సూచించే ఆలోచన.[1]
మనందరం అలంకార రూపక భాష ఉపయోగిస్తాం. ఒక అమెరికా స్నేహితురాలు తన తోటలో తీసిన ఫోటోలు మీకు చూపిస్తుందని అనుకోండి. మీరు ఆ తోట చూసి ఆశ్చర్యంతో, “అంత అందమైన మొక్కలు ఎలా పెంచావు?” అని మీరు మీ స్నేహితురాలిని అడిగారు. అప్పుడామే, “I have a green thumb” అని సమాధానమిచ్చింది. అంటే ఆమె చేతి బొటన వ్రేలు పచ్చగా ఉందని కాదు అర్థం. ఆమె అమెరికా అలంకార రూపక భాష ఉపయోగించింది, అంటే “నాకు మొక్కలు పెంచే అసాధారణ సామర్థ్యం ఉంది” అని అర్థం.
► మీ భాషలో, అక్షరార్థ అర్థానికి భిన్నంగా ఉన్న కొన్ని వాక్యాలు ఏంటి?
కొన్నిసార్లు ఒక పదాన్ని మరొకదానిని సూచించడానికి ఉపయోగిస్తారు. ఇది, అనేక అర్థాలు కలిగియున్న పదం ఒకటి కాదు. ఉదాహరణకు, బైబిల్ లో కొందరిని కుక్కలు అని పిలిచారు (ప్రకటన 22:15). ప్రజలు కలిగి ఉండకూడని కొన్ని కుక్కల లక్షణాలు కలిగియుండడం వలన ఈ పదాన్ని విమర్శగా ఉపయోగించారు. కుక్క అంటే మనం పిలిచే సాధు జంతువైన కుక్కే, కాని ఇక్కడ ప్రజలను సూచించడానికి అలంకార రూపకంగా ఉపయోగించారు. యేసు సీమోనును పేతురు అని పిలిచాడు అంటే బండ అని అర్థం, ఎందుకంటే పేతురు బండకు ఉన్నటువంటి లక్షణాలు కలిగియున్నాడు, అవి ప్రజలు కలిగియుండడం మంచిది (మత్తయి 16:18). యేసు బండ యొక్క సాధారణ అర్థం ఉపయోగించి, సీమోను ఒక విధంగా బండలాగా ఉన్నాడు అని చెబుతున్నాడు.
యేసు హేరోదును నక్క అని పిలిచాడు (లూకా 13:32). మనం నక్క అనే పదానికి వివిధ అక్షారార్థ అర్థాలు అధ్యయనం చేసి, యేసు ఏ విధమైన జంతువును ఉద్దేశిస్తున్నాడో తెలుసుకోవడానికి సందర్భాన్ని అర్థం చేసుకోనవసరం లేదు. ఇది సాదృశ్యాత్మక ప్రకటన, కాబట్టి హేరోదును నక్క అని పిలవడంలో యేసు ఉద్దేశ్యం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. యేసు ఉద్దేశ్యం ఏంటంటే, హేరోదు తెలివిగలవాడు, కాని తన చెడ్డ ప్రవర్తనను బట్టి నమ్మదగినవాడు కాదు.
► ఒక వ్యక్తిని విమర్శించడానికి మీ సంస్కృతిలో ఏ జంతువును సాదృశ్యాత్మకంగా ఉపయోగిస్తారు?
ప్రకటన అక్షరార్థమైందో లేదా సాదృశ్యాత్మకమైనదో ఎలా తెలుస్తుంది? ఇక్కడ పరిగణించవలసిన రెండు మార్గదర్శకాలు ఉన్నాయి:
1. వాక్యభాగం అలంకార రూపకంగా ఉపయోగించమని చెప్పినప్పుడు, ఆ విధంగా ఉపయోగించండి. ఆదికాండము 37 రెండు కలలను వివరిస్తుంది. బైబిల్ లో, కల ఎక్కువగా సాదృశ్యాత్మక సందేశాన్ని తెలియజేస్తుంది. దీని కారణంగా, యోసేపు కలలోని ధాన్యపు పన మరో పనకు అక్షరాలా సాష్టాంగపడుతుందని లేక సూర్యచంద్ర నక్షత్రాలు అక్షరాల యోసేపుకు సాష్టాంగపడుతున్నాయని భావించకూడదు. బదులుగా, ఈ కల అనే ప్రకటన, మనం అలంకార రూపక భాష ఆశించాలని చెబుతుంది. ఈ సందర్భంలో, ఆదికాండము 37:8, 10లో దీని భాష్యం ఇవ్వబడింది.
2. ఒక పదం యొక్క సాహిత్యపరమైన అర్థం అసాధ్యం లేదా అసంబద్ధంగా ఉన్నప్పుడు అలంకారిక అర్థాన్ని ఉపయోగించండి. ప్రకటన 1:16లో, ప్రభువు నోటినుండి రెండంచుల వాడియైన ఖడ్గము బయలువెడలుచుండగా కనిపించాడు. సాదృశ్యాలతో నిండిన పుస్తకంలో, ఇది యేసు యొక్క అక్షరార్థ చిత్రం కావడం చాలా అసాధ్యంగా అనిపిస్తుంది! ప్రకటనలో ముందుకు సాగినప్పుడు, రెండంచుల వాడియైన పెద్ద ఖడ్గంతో ఉన్న యేసు యొక్క చిత్రం దుష్ట శక్తులపై దేవుని తుది విజయం సందేశానికి సరిపోతుందని మనం చూస్తాము.
దేవుడు తన వాక్య సత్యాన్ని మర్మంగా ఉంచక, దానిని ప్రకటించడానికి ఇచ్చాడని గుర్తుంచుకోండి. బైబిల్లో సాదృశ్యాత్మక భాష చాలావరకు స్పష్టంగా ఉంటుంది. 6వ పాఠంలో సాదృశ్యాత్మక భాషను ఎక్కువగా చూశాం. అలంకార రూపక భాషను ఎలా ఉపయోగించాలో ఇది మీకు సహయం చేస్తుంది. మీరు భాషా రూపాన్ని గుర్తించిన తర్వాత, “దేవుడు ఈ చిత్రాన్నే ఎందుకు ప్రేరేపించాడు?” “ ఈ చిత్రం ద్వారా ఎటువంటి సత్యం బయలుపడుతుంది?” అని అడగండి.
కొన్నిసార్లు ఒక పదం అలంకార రూపకంగా ఉపయోగించబడుతుంది, శాశ్వత చిహ్నంగా మారిపోతుంది. “నా గొఱ్ఱెలు నా స్వరము వినును…” (యోహాను 10:27), అని యేసు చెప్పినప్పుడు, ఆయన్ని అనుసరించే ప్రజలను ఉద్దేశిస్తున్నాడని శ్రోతలకు తెలుసు, మరియు బైబిల్ ఈ పదాన్ని ఇతర చోట్ల కూడా ఉపయోగిస్తుంది (కీర్తన 23, ఉదాహరణకు). ప్రకటన 5 లో, దేవుని సింహాసం యెదుట యూదా గోత్రపు సింహము కనిపిస్తుంది. “యూదా గోత్రపు సింహము” మెస్సీయను సూచించే పేరు అని బైబిల్ నిఘంటువు వివరిస్తుంది. మీరు ఇది తెలుసుకున్న తర్వాత, “యోహాను ఈ పేరు ఎందుకు ఉపయోగిస్తున్నాడు?” “ఈ పేరు యేసు గురించి ఏం సెలవిస్తుంది?” అని మీరు అడుగుతారు. భాషా రూపాన్ని గుర్తించడం వలన, యేసు విమోచన శక్తి గురించి యోహాను ఇచ్చిన చిత్రాన్ని అర్థం చేసుకోగలుగుతాం.
బైబిల్ రచయితలు కొన్నిసార్లు అలంకార రూపక భాష ఉపయోగించారనే వాస్తవం, మనం ఎన్నడూ లేఖనాన్ని అక్షరార్థంగా వివరించకూడదని కాదు. బదులుగా, కొన్నిసార్లు అలంకార రూపక భాష ఉపయోగించారని తెలుసుకొని, రచయిత ఉద్దేశించిన విధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేఖనాన్ని రచయిత ఉద్దేశించని విధంగా మార్చడానికి మన ఊహలను అనుమతించకూడదు.
[1]ఈ భాగంలోని మెటీరియల్ ను Howard G. Hendricks and William D. Hendricks, Living by the Book (Chicago: Moody Publishers, 2007) 36వ అధ్యాయం నుండి తీసుకున్నారు.
ముగింపు
సామెతల గ్రంథ రచయిత, బుద్ధిని వెదకే వ్యక్తికి ఈ వాగ్దానం చేశాడు; “వెండిని వెదకినట్లు దాని వెదకినయెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును” (సామెతలు 2:4-5). జ్ఞానం సాధించడానికి దేవుని వాక్యానికి మించిన మూలం మరొకటి లేదు. మీ లేఖన అధ్యయనానికి శాశ్వత ఫలితాలు ఉన్నాయి.
(1) పదాల అధ్యయనం అంటే ఒక వాక్యభాగంలో ముఖ్య పదాలను పరిశోధించి, దాని సందర్భంలో వాటి అర్థాలు కనుగొనడం. పదాల అధ్యయనం, మనం అధ్యయనం చేస్తున్న వాక్యభాగాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.
(2) పదాల అధ్యయనం చేస్తున్నప్పుడు నివారించవలసిన రెండు సాధారణ తప్పులు:
పదం యొక్క మునుపటి అర్థం విస్మరించడం
ప్రతి సందర్భంలో ఒకే అర్థం కలిగిన పదం గురించి ఆలోచించడం
(3) పదాల అధ్యయన ప్రక్రియ:
అధ్యయనం చేయడానికి పదాలు ఎన్నుకోండి.
వాక్యభాగ అర్థానికి ప్రాముఖ్యమైన పదాలు
పునరావృత పదాలు
భాషా రూపాలు
అస్పష్టమైన లేక కష్టమైన పదాలు
ఎన్నుకున్న ప్రతి పదానికి సాధ్యమయ్యే అర్థాల జాబితా చేయండి.
వాక్యభాగం సందర్భంలో ఎన్నుకున్న పదాల అర్థాన్ని గ్రహించండి.
(4) సందర్భంలో పదం అర్థం ఏంటో గ్రహించడానికి సహాయం చేసే ప్రశ్నలు:
పదాన్ని నిర్వచించడానికి సహాయపడే వ్యత్యాసం లేక పోలిక వాక్యభాగంలో ఉందా?
రచయిత ఈ పదాన్ని ఇతర చోట్ల ఎలా ఉపయోగించాడు?
పద అర్థం గురించి సందర్భం ఏమి తెలుపుతుంది?
(5) అలంకార రూపక భాష అధ్యయనం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు:
సాదృశ్యపరచబడిన ఆలోచన ముఖ్యమైనది.
అలంకార రూపక చిత్రం, పదబంధం లేక పదం మరోదానిని సూచిస్తుంది.
అలంకారిక భాష, అది సూచించే దాని లక్షణాలపై దృష్టిపెడుతుంది.
రచయిత ఉద్దేశించిన విధంగా లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి- అర్థం అక్షరార్థమా లేక సాదృశ్యకమా.
(6) లేఖన ప్రకటనను ఎప్పుడు సాదృశ్యాత్మకంగా అర్థం చేసుకోవాలి:
వాక్యభాగం తెలియజేసినప్పుడు
అక్షరార్థ అర్థం అసాధ్యం లేక అసంబద్ధమైనప్పుడు
పాఠం 7 అభ్యాసాలు
(1) 1వ పాఠంలో, ఈ కోర్సు సమయంలో అధ్యయనం చేయడానికి ఒక వాక్యభాగం ఎన్నుకున్నారు. ఆ వాక్యభాగంలో నుండి, అధ్యయనం చేయడానికి ముఖ్యమైనవిగా మీరు భావించిన వాటిని జాబితా చేయండి. ముఖ్య పదాలు, పునరావృత పదాలు, భాషా రూపాలు, లేక అస్పష్టమైన లేక కష్టమైన పదాలు కోసం చూడండి. ఈ పాఠంలో వివరించిన ప్రక్రియ ఆధారంగా అధ్యయనం చేయండి. ప్రతి పదానికి, సాధ్యమయ్యే అర్థాలు జాబితా చేయండి. సందర్భాన్ని పరిగణలోనికి తీసుకోండి. మీరు అధ్యయనం చేస్తున్న వాక్యభాగం యొక్క సందర్భంలో ఏ అర్థం సరిపోతుంది గ్రహించండి.
(2) మీరు ఇప్పుడే అధ్యయనం చేసిన ప్రతి పదం చూడండి. ప్రతి అధ్యయన పదానికి మీరు తయారు చేసిన సాధ్యమయ్యే అర్థాల జాబితా చూడండి. మీరు అధ్యయనం చేసిన పదం యొక్క అర్థాన్ని అపార్థం చేసుకోవడం, వచనం యొక్క తప్పు భాష్యానికి ఎలా దారితీసే అవకాశం ఉందో? 2-4 వాక్యాల్లో పరిశీలన రాయండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.