(1) ఒక క్రైస్తవునికి లోతైన బైబిల్ అధ్యయనం ఎందుకు అవసరమో తెలుసుకోవడం.
(2) బైబిల్ ను అధ్యయనం చేయడానికి అవసరమైన మూడు దశలను జాబితా చేయగలగడం.
(3) లేఖనంలో ఒక భాగాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసే ప్రక్రియను ప్రారంభించడం.
(4) బైబిల్ భాష్యం కొరకు పరిశుద్ధాత్ముని వెలిగింపు యొక్క ప్రాముఖ్యతను అభినందించడం.
పరిచయం
మీ వ్యక్తిగత అధ్యయనంలో మరియు లేఖనాన్ని అన్వయించుకోవడంలో మీ ఎదుగుదలకు సహాయపడడమే ఈ కోర్సు యొక్క ఉద్దేశ్యం. ప్రస్తుతం మీ బైబిల్ అధ్యయన పద్ధతులను యదార్థంగా మూల్యాంకనం చేయడమే మొదటి అడుగు.
► మీ ప్రస్తుత బైబిల్ పఠన అభ్యాసాలను గురించి చర్చించడానికి కొన్ని నిమిషాలు సమయం తీసుకోవాలి. ఇది ఒకరి నొకరు విమర్శించుకొనే సమయం కాదు; “నేను దేవుని వాక్యాన్ని ఎలా చదువుతున్నాను?” అనే ప్రశ్న గురించి ఆలోచించే సమయమిది. మీరు ఆలోచించాల్సిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:
నేను ఎంత తరచుగా బైబిల్ చదువుతున్నాను?
నేను బైబిల్ చదివినప్పుడు ఎంత సమయం చదువుతున్నాను?
నేను చదివే లేఖనభాగాలను ఎలా ఎంపిక చేసుకుంటాను?
నేను చదువుతున్న దానిని అర్థం చేసుకోగలుగుతున్నానా?
నేను చదివే దానిని గుర్తుంచుకోగలుగుతున్నానా?
నేను నా జీవితానికి అన్వయించుకోగలుగుతున్నానా?
నేను బైబిల్ ను ఇంకా ఎక్కువగా చదవకపోవడానికి 2-3 కారణాలు ఏమిటి?
తైవాన్ దేశానికి చెందిన జియన్హోంగ్, 15 సంవత్సరాలుగా క్రైస్తవునిగా ఉన్నాడు, కానీ ఆత్మీయ పరిపక్వతకు సంబంధించిన కొన్ని సూచనలు మాత్రమే చూపించాడు. అతనిలో ఆత్మీయ వృద్ధి లేకపోవడం వలన ఎంతో ఆందోళనకు, చిరాకుకు గురయ్యాడు. ఒక ఆదివారం ఉదయకాల ఆరాధన ముగిసిన తరువాత, అతని చిరాకు, ఆందోళన బయటికి వచ్చాయి. పాస్టర్, బైబిల్ చదవమని మీరు నాకు చెప్పారు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడని చెప్పారు. నేను ప్రయత్నించాను! నేను ప్రతి ఉదయం బైబిల్ చదువుతున్నాను, అది నాకేమి చెప్పడం లేదు. తప్పు ఎక్కడ జరుగుతుంది?” అని అడిగాడు.
“జియన్హోంగ్, నువ్వు బైబిల్ ఎలా చదువుతున్నావో చెప్పు” అని పాస్టర్ ఆడిగాడు. జియన్హోంగ్ స్పందన, అతను ఇబ్బంది పడే విషయాల్లో ప్రాముఖ్యమైన అంశాన్ని సూచించింది. “ప్రతి ఉదయం పనిని ప్రారంభించడానికి ముందు నా బైబిల్ తెరిచి ఒక వచనం చదువుతాను” అని సమాధానమిచ్చాడు. “నువ్వు బైబిల్ లో ఒక పుస్తకాన్ని లేదా ఒక అధ్యాయమంతటిని చదివావా?” అని పాస్టర్ అడిగాడు. “లేదు, నేను బైబిల్ తెరిచినప్పుడు నాకు కనబడే ఒక వచనాన్ని చదువుతాను, అది చాలా అరుదుగా సహాయం చేస్తుంది” అని జవాబిచ్చాడు.
బైబిల్ ను ఇలా చదవడంలో ఉన్న సమస్యను జియన్హోంగ్ అర్థం చేసుకోవడంలో సహాయం చేయడానికి, బైబిల్ ను తెరిచి, తనకు కనబడిన మొదటి వచనాన్ని చదవమని చెప్పాడు. జియన్హోంగ్, “దక్షిణ దిక్కున నివసించువారు ఏశావుయొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు ఫిలిష్తీయులదేశమును స్వతంత్రించుకొందురు; మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదుదేశమును స్వతంత్రించుకొందురు” (ఓబద్యా 1:19) అనే వచనాన్ని చదివాడు.
ఆ తరువాత పాష్టర్ జియన్హోంగ్ ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. “నెగెబు ఎక్కడ ఉంది? షేఫెలా ఎక్కడ ఉంది? ఎప్రాయీము దేశం ఎక్కడ ఉంది? సమరయ? బెన్యామీను? గిలాదు?” ప్రతి ప్రశ్నకు “నాకు తెలీదు” అని సమాధానం చెప్పాడు. తదుపరి వారం, “బైబిల్ ని ఎలా చదవాలి” అనే దానిని అధ్యయనం చేయడానికి బైబిల్ స్టడీని ప్రారంభించారు. ఆ తరువాతి కొన్ని వారాల పాటు, బైబిల్ భాష్యానికి మరికొన్ని సూత్రాలు నేర్చుకొన్నాడు. ఈరోజు లేఖనం మనతో ఎలా మాట్లాడుతుందో అర్థం చేసుకోవడం నేర్చుకున్నాడు.
బైబిల్ అధ్యయన పద్ధతుల యొక్క ప్రాధమిక సూత్రాలను నేర్చుకొని, అన్వయించుకోవడంలో సహాయం చేయడమే ఈ కోర్సు లక్ష్యం. ఈ పాఠాల ద్వారా, అభ్యాసాల ద్వారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని, దానిని మీ జీవితానికి అన్వయించుకొని, ఇతరులకు బోధించడంలో సహాయం చేసే పనిముట్లను, సాధనాలను పొందుతారు.
నేను బైబిల్ ఎందుకు చదవాలి?
కొంతమంది బైబిల్ ని అర్థం చేసుకోవడం కష్టం అని నమ్మడం వలన వాళ్ళు బైబిల్ ని చదవరు. బైబిల్ దేవుని వాక్యమని నమ్మే అనేకమందికి దానిని ఎలా అధ్యయనం చేయాలో, అన్వయించుకోవాలో తెలీదు. బైబిల్ ని అధ్యయనం చేయడం కష్టమైన పని. అధ్యయనం చేయడం విలువైనదేనా? మనం బైబిల్ ను ఎందుకు చదవాలి?
దేవుడు లేఖనం ద్వారా తనని తాను వెల్లడిపరచుకున్నారు.
దేవుడు ఎవరో లేఖనం మనకు చూపుతుంది. దేవుని వాక్యం, దేవుని స్వభావానికి ఒక వ్యక్తీకరణ (కీర్తన 119:15, 27). దేవుడు ఎలా ఆలోచిస్తాడు, ఆయనకు ఏది ప్రాముఖ్యమైనది, ఆయన ప్రజలతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటాడు మరియు మానవ చరిత్రలో ఆయన ఎలా పనిచేస్తాడు అనే విషయాలను లేఖనం చూపిస్తుంది. దేవుని ధర్మశాస్త్రం (ఆయన కోరుకునేది) ఆయన స్వభావాన్ని, ఆయన న్యాయాన్ని, ఆయన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది (కీర్తన 119:137). మనం బైబిల్ చదివినప్పుడల్లా, అది దేవుని గురించి ఏం వెల్లడి చేస్తుందనే దానిపై దృష్టిపెట్టాలి.
లేఖనాలు, ఆరాధించే వ్యక్తికి దేవునిని వెల్లడి చేస్తాయి. ఇది దేవుని పట్ల ఆరాధకుని స్పందనకు నడిపించి, మనం ఎలా జీవించాలో అది చూపిస్తుంది.
బైబిల్ ఒక దీపమయి
కీర్తనాకారుడు, దేవుని వాక్యాన్ని మన జీవితాన్ని నడిపించు మార్గాన్ని చూపించే దీపంతో పోల్చాడు (కీర్తన 119:105). బైబిల్ దేవుని సత్యమై, మనం ఎలా ఆలోచించాలో మరియు జీవించాలో మాకు బోధిస్తుంది.
► కీర్తన 19:7-11, కీర్తన 119:160, మరియు 2 తిమోతికి 3:16-17 చదవండి.
దేవుని వాక్యం సరైన సిధ్ధాంతానికి మూలం. రక్షణ, పరిశుద్ధతకు అవసరమైన జ్ఞానమంతా బైబిల్లో ఉంది. ఈ సూత్రం ఉద్దేశ్యం, ఇతర సహాయం ఏమి లేకుండా లేఖనమంతటినీ మనం అర్థం చేసుకోగలమని కాదు. దీని ఉద్దేశ్యం, సాంప్రదాయం ప్రాముఖ్యం కాదని కాదు. ఒక విశ్వాసికి దేవుని వాక్యం తుది అధికారం అని దీని ఉద్దేశ్యం.
దేవుని వాక్యం సత్యానికి మూలం గనుక, వాక్య జ్ఞానం మనలను పరిచర్య కోసం సిద్ధపరుస్తుంది. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ప్రకటించినప్పుడు, దేవుని అధికారంతో బోధిస్తాం. సత్యం ఆయనది, మనది కాదు.
బైబిల్ ఆత్మీయ పాలుగలది
క్రొత్తగా జన్మించిన శిశువులు పాలను అపేక్షించినట్లుగా, విశ్వాసులు బైబిల్ ను ఆపేక్షించాలని పేతురు చెప్పాడు (1 పేతురు 2:2). ఒక శిశువు భౌతికంగా ఎదగటానికి పాలు ఎంత అవసరమో, ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగటానికి లేఖనం అంతే అవసరం. అనుదినం దేవుని వాక్యం భుజించకుండా, ఆత్మీయ పరిపక్వత కలగదు.
బైబిల్ బాష్య నైపుణ్యాలు నేర్చుకుంటూ, దేవుని వాక్య సత్య వివేచన అభ్యసిస్తుండగా, మనం పరిపక్వత చెబుతాం (హెబ్రీయులకు 5:14). ఇతరులకు బోధించటానికి దేవుని వాక్యాన్ని వినియోగించే మన సామర్థ్యం పెరుగుతుంది.
బైబిల్ తేనె లాగా తియ్యగా ఉంటుంది
కీర్తనాకారుడు దేవుని వాక్యాన్ని తేనెతో పోల్చాడు (కీర్తన 19:10, కీర్తన 119:103). తేనె ఆరోగ్యకరం, మధురం. దేవుని వాక్య అధ్యయనం ఆనందంగా భావించాలి తప్ప అసహ్యంగా కాదు. యుద్ధంలో ఉన్న సైనికుడు ఇంటి నుండి వచ్చిన ఉత్తరం చదివి ఆనందించినట్లుగా, దేవుడు తన పిల్లలకు ఇచ్చిన ఉత్తరమైన దేవుని వాక్యాన్ని చదివి, ఆనందించాలి.
యూదుల పిల్లలు ధర్మశాస్త్రం చదవటానికి పాఠశాలకు మొదటిగా వెళ్లినప్పుడు, బోధకుడు వర్ణమాలలోని మొదటి అక్షరంపై తేనె వేస్తాడు, అప్పుడు ఆ పిల్లవాడు దాని మాధుర్యాన్ని రుచి చూడటానికి ఆ పేజి నాకుతాడు. బోధకుడు ఈ పద్ధతిలో పాఠం బోధించినప్పుడు, “పిల్లవాడు [ధర్మశాస్త్రాన్ని] ఆనందంగా, మంచి రుచితో అనుసంధానించటం నేర్చుకుంటాడు.”[1]
బైబిల్ ఆత్మఖడ్గం
దేవుని వాక్యం ఆత్మీయ యుద్ధాల్లో మన ఆయుధం (ఎఫెసీయులకు 6:17). యేసు అరణ్యంలో శోధనను ఎదుర్కొన్నప్పుడు, ఆయన ద్వితీయోపదేశకాండం నుండి వాక్యాన్ని ప్రస్తావిస్తూ సాతాను దాడులకు ప్రతిస్పందించాడు (మత్తయి 4:1-11).
ఆత్మీయ విజయం కోసం, ప్రభావవంతమైన పరిచర్య కోసం లేఖనం మనల్ని బలపరుస్తుంది. బైబిల్ అధ్యయనం ద్వారా, అబద్ధ సిధ్ధాంతానికి ప్రతిస్పందించటానికి, మన సంఘాన్ని సత్య సిద్ధాంతంలో స్థిరపరచటానికి, నేటి ప్రపంచంలో ప్రభావవంతమైన పరిచర్య చేయటానికి మనం సిద్ధంగా ఉన్నాం.
లేఖన అధ్యయనానికి అనుచిత కారణాలు
► హెబ్రీయులకు 4:12-13 చదవండి.
లేఖన అధ్యయనానికి చాలా మంచి కారణాలు ఉన్నాయి, కాని కొందరు తప్పుడు ఆలోచనలతో లేఖనం చదువుతారు లేక అధ్యయనం చేస్తారు.
కొంతమంది తమ అభిప్రాయాలను సమర్థించడానికి సాక్ష్యాలను సేకరించటానికి లేఖనాన్ని అధ్యయనం చేయవచ్చు. బహుశా, వారు తమ ఆధీనంలో ఉన్నవారిని నియంత్రించడానికి జ్ఞానాన్ని ఉపయోగించాలనుకోవచ్చు.
కొందరు అతిశయ కారణాలవల్ల లేఖన అధ్యయనం చేస్తారు. బహుశా, ఆత్మీయ హోదా సంపాదించుకుని, ఇతరులకంటే ఉన్నతంగా ఉండాలనుకుంటారు. బహుశా తమ విజయాలను బట్టి ప్రజలు వారి గురించి మంచిగా మాట్లాడాలని కోరుకుంటారు. లేక, లేఖన అధ్యయనం దేవుని అనుగ్రహం సంపాదించుకోవటానికి సహాయపడుతుందని భావిస్తారు.
ఇవన్నీ లేఖనం చదవడానికి లేదా అధ్యయనానికి తప్పు కారణాలు. లేఖనానికి సరైన వైఖరిని హెబ్రీయులకు 4:12-13 చూపిస్తుంది. స్వార్థపూరిత లక్ష్యాలను సాధించడానికి లేఖనాన్ని ఉపయోగించడం బదులుగా, ఇది మనది కాదు, దేవుని వాక్యమని జ్ఞాపకముంచుకోవాలి. దానిని దేవుని యెడల భక్తితో అధ్యయనం చేయాలి. బైబిల్ మన అధికారం, మనం దానికి సమర్పించుకోవాలి. దాన్ని ఇతరులకు బోధించినప్పుడు, వినయంతో చేయాలి.
ఈ విధంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి బోధించినప్పుడు, అది మన జీవితాలలో పాపం లేదా లోపాన్ని వెల్లడిస్తుంది మరియు దాని నుండి తిరిగి మారే మార్గాన్ని చూపిస్తుంది. అది మన జీవితాలను, అలాగే మనం సేవించే మరియు నడిపించే వారి జీవితాలను మార్చుతుంది.
► మీరు లేఖనంలో ఒక వాక్యభాగాన్ని అధ్యయనం చేసేటప్పుడు, ప్రస్తుతం ఏ ప్రక్రియ ఉపయోగిస్తున్నారు? వాక్యభాగంలో అర్థాన్ని వెలికి తీయటానికి ఉపయోగించే నిర్దిష్ట దశలు గురించి చర్చించండి.
బైబిల్ అధ్యయనం ముఖ్యమని జియన్హోంగ్ అంగీకరించాడు. అయితే, లేఖనం ఎలా అధ్యయనం చేయాలో అతనికి తెలియలేదు. అతనికి ఒక పద్ధతి లేదా విధానం అవసరం.
ఈ కోర్సు ఉద్దేశ్యం, ప్రభావవంతమైన బైబిల్ అధ్యయనానికి ఒక విధానం అందించడం. ప్రసంగం సిద్ధం చేసేటప్పుడు, పాస్టర్లు ఈ దశలు వాడుకోవచ్చు. బైబిల్ పాఠాలు సిద్ధం చేసేటప్పుడు, బైబిల్ బోధకులు ఈ దశలు వాడుకోవచ్చు. ప్రతి విశ్వాసి తమ వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధిలో ఈ పద్ధతి ఉపయోగిస్తూ మేలు పొందొచ్చు
ఈ కోర్సు అందించే పద్ధతిలో, మూడు దశలు ఉంటాయి.
పరిశీలన
ఈ దశలో, “నేను బైబిల్లో ఏం చూస్తున్నాను?” అని ప్రశ్నిస్తాం. ఈ దశలో, లేఖనం గురించి సాధ్యమైనంత ఎక్కువ వివరాలు పరిశీలిస్తాం. చాలామంది పాఠకులు పరిశీలన చేయకుండా, నేరుగా బాష్యంలోకి వెళ్తారు. లేఖనం ఏం చెబుతుందో జాగ్రత్తగా పరిశీలించకుండా, దానిని నిజంగా అర్థం చేసుకోలేం. పరిశీలన దశలో, వాక్యభాగంలోని వివరాలు చూస్తాం. లేఖన సందేశానికి ముఖ్యమైన వివరాలు గుర్తించడం నేర్చుకుంటాం. మరిముఖ్యంగా, పదాలు, ఆకృతి, సాహిత్య రూపం, పరిస్థితి గురించి అధ్యయనం చేస్తాం.
పదాలు
బైబిల్లో ఒక పుస్తకం అధ్యయనం చేసినప్పుడు, పుస్తకమంతటిలో ఎక్కువసార్లు ఉపయోగించిన పదాల కోసం చూస్తాం. 1 యోహాను పత్రికలో, ఎరుగుట అనే పదాలు 5 అధ్యాయాల్లో 30కంటే ఎక్కువసార్లు కనబడతాయి. యోహాను పత్రిక అధ్యయనం చేసినప్పుడు, పత్రిక అంతటిలో ఈ పదం కనుగొంటూ మొదలుపెట్టొచ్చు. యోహాను ఎక్కడైతే ఎరుగుట అనే పదాన్ని ఉపయోగించాడో, ఆ ప్రదేశాలు అతని సందేశాన్ని అనువదించటానికి సహాయపడతాయి. యోహాను సందేశం అర్థం చేసుకోవాలంటే, “మనం ఏం ఎరగాలని యోహాను చెప్పాడు?” “ఎరిగినవారి లక్షణాలు ఏంటి?” అని ప్రశ్నించుకోవాలి.
ఆకృతి
బైబిల్లోని పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరణలో జాగ్రత్తగా నిర్మించబడ్డాయి. మీరు యోహాను సువార్తవంటి పుస్తకం అధ్యయనం చేసినప్పుడు, యేసు ఎవరోయని చూపించే ఏడు సూచక క్రియలతో యోహాను తన సువార్తను చక్కగా అమర్చాడని తెలుసుకుంటారు. పుస్తక ఆకృతి పరిశీలించినప్పుడు, అది యోహాను ఉద్దేశ్యం గురించి ఒక మంచి అవగాహన కలిగిస్తుంది.
మనం ఒక వాక్యభాగం అధ్యయనం చేసినప్పుడు, ఆకృతి కథను అనుసరించటం చూడొచ్చు (లూకా 9:28-36లోవలే) బహుశా, ఇది తుది తీర్మానాలకు కారణాలు ఇస్తుంది (రోమా 6:1-13లోవలే). అది, సూచనల జాబితా ఇవ్వడానికి వివరాలు ఉపయోగిస్తుంది (ఎఫెసీయులకు 6:13-18లోవలే). ఇతర ఆకృతి విధానాలు కూడా ఉన్నాయి.
సాహిత్య రూపం
పౌలు రాసిన పత్రికలు చక్కగా అమర్చబడ్డాయి, ఒక న్యాయవాది తన వాదనను ముగింపుకు చేర్చడానికి సిద్ధపరచినట్లుగా, తన అభిప్రాయాన్ని వాదించాడు. రోమా లేక ఇతర పత్రికలు మంచిగా చదవాలంటే, పౌలు తర్కం జాగ్రత్తగా అనుసరించాలి.
దీనికి విరుద్ధంగా, యోనా గ్రంథం ఒక చిన్న చారిత్రాత్మక కథనం, ఇది ప్రజలందరి యెడల దేవుని ప్రేమను వివరిస్తుంది. దానిని మంచిగా చదవాలంటే, “ఇది ఎందుకు ఆశ్చర్యమైన, అసాధారణ కథ?” అని ప్రశ్నించాలి. అప్పుడు మీరు “ఈ కథ వివరాలు ఏంటి?” అని అడుగుతూ, వ్యాఖ్యానించడానికి సిద్ధంగా ఉంటారు.
పరిస్థితి
ఇక్కడ మనం ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం, “ఫిలిప్పీయులకు ఆనందించుడి అనే సందేశం రాసినప్పుడు పౌలు ఎక్కడున్నాడు?” అతడు రోమాలో, విచారణ మరియు బహుశ ఉరిశిక్ష కోసం సిద్ధంగా ఉన్నాడు. తాను సంతోషంగా ఉండటానికిగల కారణాలు ఈ పరిస్థితి మనకు చూపిస్తుంది, ఎందుకంటే అతని వ్యక్తిగత పరిస్థితి బాగోనప్పుడు కూడా ఈ ఆనందం అనుభవించాడు.
“ప్రకటన గ్రంథంలో, దేవుని శాశ్వత ప్రణాళిక బయలుపరచడానికి ఆకాశములు తెరువబడినప్పుడు యోహాను ఎక్కడున్నాడు?” పత్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. హింస కాలం, దేవుని విజయ సందేశాన్ని విశ్వాసానికి గొప్ప ప్రోత్సాహకరంగా చేసింది.
బాష్యం
ఈ దశలో, “బైబిల్ అర్థం ఏంటి?” అని అడుగుతాం. సాధ్యమైనంత ఎక్కువ పరిశీలనలు సేకరించిన తర్వాత, లేఖన సందేశం కోసం చూస్తాం. ఒక్కొక్క అధ్యాయం, వచనాల్లోని సందేశంతో పాటుగా పుస్తకమంతటినీ ఒక్కటిగా ఐక్యపరిచే పెద్ద పెద్ద విషయాలు కనుగొనటం నేర్చుకుంటాం. “ఈ పుస్తకం మొదటి శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?” అని అడుగుతాం. అన్ని సమయాల్లో, ప్రదేశాల్లో, సంస్కృతుల్లో వాస్తవమైన సూత్రాలు కోసం చూస్తాం.
అన్వయం
ఈ దశలో, “నేటి జీవితం, పరిచర్యకు బైబిల్ ని నేను ఎలా అన్వయిస్తాను? ” అని అడుగుతాం. మన జీవితాలకు అన్వయించుకోకుండా అర్థాన్ని గ్రహిస్తే చాలదు.
తన పాఠ్యపుస్తకంలో, హోవార్డ్ హెండ్రిక్స్ అన్వయానికి సంబంధించి రెండు ప్రశ్నలు సూచించాడు:[1]
1. అది నాకెలా వర్తిస్తుంది? ఇది నా జీవితంలో లేఖన అన్వయం పై దృష్టిపెడుతుంది.
2. అది ఇతరులకు ఎలా వర్తిస్తుంది? ఇది నేను పరిచర్య చేస్తున్న వారి జీవితంలో లేఖన అన్వయంపై దృష్టిపెడుతుంది.
ఇంగ్లాండ్ దేశంలో, సంఘ చరిత్రకు సంబంధించి అత్యంత గౌరవనీయమైన పండితుడైన, ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఉన్నాడు. విద్యాపరంగా, అతనికి బైబిల్ బాగా తెలుసు; వ్యక్తిగతంగా, ఏ దేవుని లేక దేవుని వాక్యాన్ని నమ్మడు. అతనికి పరిశీలన, బాష్యం గురించి బాగా తెలుసు. దురదృష్టవశాత్తూ, అతడు లేఖన సత్యాన్ని తన జీవితానికి ఎన్నడు అన్వయించుకోలేదు.
యాకోబు, అలాంటి వ్యక్తి గురించి ఇలా చెప్పాడు: “ఎవ డైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా” (యాకోబు 1:23-24). ఇంగ్లాండ్ లోని ప్రొఫెసర్ ఒక తీవ్రమైన సందర్భం: అయితే, లేఖనం తెలిసి కూడా అనుదినం దాని ప్రకారం జీవించలేని వారు చాలామంది ఉన్నారు. నిజమైన బైబిల్ అధ్యయనం ఆచరణాత్మక అన్వయింపుకు తప్పక నడిపిస్తుంది.
[1]Howard G. Hendricks and William D. Hendricks, Living by the Book (Chicago: Moody Publishers, 2007)
బాష్యంలో పరిశుద్ధాత్ముని పాత్ర
► అవిశ్వాసి లేఖన అర్థాన్ని గ్రహించగలడా?
ఈ ప్రశ్నకు సమాధానం, “గ్రహించగలడు, కాని పాక్షికంగా.” ఈ కోర్సులో, మన బాష్యాన్ని మార్గనిర్దేశం చేసే ప్రక్రియను అధ్యయనం చేస్తాం. దేవుని వాక్య సందేశం అర్థం చేసుకోవడానికి ఈ దశలు సహాయపడతాయి. బైబిల్ ను, ఇతర పుస్తకాలవలే చదివినప్పుడు, ఏ పాఠకునికైనా సత్యాన్ని బయలుపరుస్తుంది.
అయితే, పరిశుద్ధాత్ముని వెలిగింపు లేకుండా, ఒకని అవగాహన ఎల్లప్పుడు పరిమితమే. కేవలం మేథస్సు ను ఉపయోగించి అధ్యయనం చేయడం ఆత్మీయ సత్యాన్ని ఎన్నడు బయలుపరచదు. పౌలు ఇలా రాశాడు:
ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు (1 కొరింథీయులకు 2:11-14).
ఒక అవిశ్వాసి లేఖన సందేశం కొంత వరకు అర్థం చేసుకుంటాడు, కాని బైబిల్లోని లోతైన సత్యాలు పరిశుద్ధాత్ముని వెలిగింపు ద్వారానే బయలుపరచబడతాయి. లేఖన అధ్యయనం సమాచార సేకరణకు మించినది; అందుకు విశ్వాసం, విధేయత అవసరం. మనం దేవుని వాక్య అధికారానికి లోబడే వరకు, దేవుడు మన జీవితాల్లో రూపాంతర కార్యం చేయడు. దీని కారణంగా:
1. మన లేఖన అధ్యయనానికి ముందు ప్రార్థన చేయాలి. మన అధ్యయనంలో సహాయం చేయమని పరిశుద్ధాత్ముని అడగాలి. యాకోబు ఇలా రాశాడు, “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు” (యాకోబు 1:5).
2. మన లేఖన అధ్యయనం తర్వాత వ్యక్తిగత ప్రతిస్పందన ఉండాలి. బైబిల్ అధ్యయన లక్ష్యం మేధోపరమైన సమాచారం కంటే మించింది, దాని ఉద్దేశ్యం వ్యక్తిగత పరివర్తనం. మన అధ్యయనం ద్వారా మనం మారకపోతే, అధ్యయన ఉద్దేశ్యం కోల్పోయినట్లే. ఈ మార్పు కేవలం పరిశుద్ధాత్ముని ద్వారా వస్తుంది.
యేసు చెప్పిన, విత్తనం మరియు విత్తువాని ఉపమానంలో, కొన్ని విత్తనాలు త్రోవప్రక్కన పడగా పక్షులు వాటిని మింగివేశాయి. కొన్ని విత్తనాలకు వేరు లేనందున, మాడి ఎండిపోయాయి. కొన్ని విత్తనాలను ముండ్లపొదలు అణచివేశాయి. ఇంకొన్ని మంచి నేలను పడి, ఫలించాయి. మంచినేలను విత్తబడినవాడు, వాక్యము విని గ్రహించువాడని యేసు వివరించాడు (మత్తయి 13:3-23). వాక్యాన్ని విని గ్రహించకుండ ఉండటం సాధ్యమని ఈ ఉపమానం చూపిస్తుంది. పూర్ణ హృదయంతో జాగ్రత్తగా పరిశుద్ధాత్మ స్వరం విన్నప్పుడే దేవుని వాక్యం పూర్తిగా గ్రహిస్తాం.
దేవుడు లేఖనం ద్వారా తనని తాను వెల్లడిపరచుకున్నారు.
బైబిల్ ఒక దీపమయి
బైబిల్ ఆత్మీయ పాలుగలది
బైబిల్ తేనె లాగా తియ్యగా ఉంటుంది
బైబిల్ ఆత్మఖడ్గం
(2) బైబిల్ అధ్యయన ప్రక్రియలో మూడు దశలున్నాయి.
పరిశీలన: నేను బైబిల్లో ఏం చూస్తున్నాను?అధ్యయనం:
పదాలు
ఆకృతి
సాహిత్య రూపం
పరిస్థితి
భాష్యం: బైబిల్ అర్థం ఏంటి?
అన్వయం: నేటి జీవితం, పరిచర్యకు బైబిల్ ని నేను ఎలా అన్వయిస్తాను? అడగండి:
అది నాకెలా వర్తిస్తుంది?
అది ఇతరులకు ఎలా వర్తిస్తుంది?
(3) మనం బైబిల్ అధ్యయనం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముని వెలిగింపు తప్పక ఉండాలి. దీని కారణంగా
మన లేఖన అధ్యయనానికి ముందు ప్రార్థన చేయాలి.
మన లేఖన అధ్యయనం తర్వాత వ్యక్తిగత ప్రతిస్పందన ఉండాలి.
పాఠం 1 అభ్యాసం
బాష్య ప్రకియ ఆరంభించాలంటే, క్రిందివాటిలో ఒక వాక్యభాగం ఎంచుకోండి.
ద్వితీయోపదేశకాండము 6:1-9
యెహోషువ 1:1-9
మత్తయి 6:25-34
ఎఫెసీయులకు 3:14-21
కొలొస్సయులకు 3:1-16
కోర్సు అంతటిలో మీరు ఈ లేఖనం అధ్యయనం చేస్తారు. ఈ మొదటి పాఠం కోసం, లేఖనాన్ని జాగ్రత్తగా చదవండి. మూడు విషయాల్లో నోట్సు తీసుకోండి:
1. పరిశీలన: మీరు ఎన్నుకున్న వాక్యభాగంలో సాధ్యమైనంత వివరణ జాబితా చేయండి. లేఖన ఆధారంగా, మీ వివరణలు భిన్నంగా ఉంటాయి. మీకు సహాయం చేయు కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:
లేఖనంలో నమోదు చేసిన సంఘటనలు ఎక్కడ జరిగాయి?
ఈ లేఖనంలో పాత్రలు ఎవరు?
ఈ లేఖనం ఏం అజ్ఞాపిస్తుంది?
ఈ లేఖనంలో ఏ పదాలు పునరావృతం అయ్యాయి?
2. భాష్యం: 2-3 వాక్యాల్లో, వాక్యభాగంలోని ప్రధాన సందేశం సంగ్రహించండి.
3. అన్వయం: మీ జీవితం, పరిచర్యలో లేఖనాన్ని అన్వయించుకునే 2-3 మార్గాలు జాబితా చేయండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.